ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి, పరస్పరం కమ్యూనికేట్ చేసుకునేందుకు అనువాదం అనేది ఒక ముఖ్యమైన సాధనం. అనువాదకుల కీలక పాత్రను గుర్తిస్తూ, సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున అనువాదకుల, భాషావేత్తల కృషి, అంకితభావాన్ని గుర్తిస్తూ, పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
బైబిల్‌ను లాటిన్‌లోకి అనువదించిన సెయింట్ జెరోమ్ జ్ఞాపకార్థం ప్రతీ ఏటా సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. సెయింట్ జెరోమ్‌ను అనువాదకుల పోషకునిగా పరిగణిస్తారు. ఈయన బైబిల్‌ను లాటిన్‌లోకి అనువదించగా, దానిని వల్గేట్ అని పిలుస్తారు. ఈ అనువాద రచన ఆయన పాండిత్యానికి, భాషా జ్ఞానానికి నిదర్శనమని చెబుతారు. సెయింట్ జెరోమ్‌ను గుర్తుచేసుకుంటూ అనువాద దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య (ఎప్‌ఐటీ) ప్రారంభించింది.
ఈ సంస్థ 1953లో స్థాపితమయ్యింది. 1991 నుంచి వారు ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. దీనిని 2017లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా గుర్తించింది. అనువాదకులు ప్రపంచ శాంతి, సహకారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఆలోచనలు, భావజాలాలు, సంస్కృతుల మార్పిడికి అనువాదం వారధిగా పనిచేస్తుంది. సాహిత్యం, సైన్స్, వ్యాపారం, రాజకీయ రంగాలలో అనువాదం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ప్రపంచ వాణిజ్యం, దౌత్యం, శాస్త్రీయ పరిశోధనలు సజావుగా సాగాలంటే అనువాదకులు సహాయం అవసరమవుతుంది. వివిధ భాషలలో రాసిన సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు, కమ్యూనికేట్ చేయడానికి అనువాదకులు ఉపయోగపడతారు. అనువాదం అనేది లేకుంటే ప్రముఖ రచయితలు షేక్స్‌పియర్, టాల్‌స్టాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్‌చంద్ తదితరుల రచనలు ప్రపంచానికి తెలిసేవి కావనడంతో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment