వేగోద్దీపన ఔషధం | Short Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

వేగోద్దీపన ఔషధం

Published Sun, Sep 8 2019 10:24 AM | Last Updated on Sun, Sep 8 2019 10:25 AM

Short Story In Sakshi Funday

చిన్న గుండుసూది కోసం వెతుకుతుంటే ఒక బంగారునాణెం దొరికినట్లు– నాకు మిత్రుడైపోయాడు ప్రొఫెసర్‌ గిబ్బర్న్‌. ఫోక్‌స్టోన్‌ పట్నంలో నా పొరుగున నివాసం ఉన్నాడతను. 
గిబ్బర్న్‌కు– మనిషి నాడీవ్యవస్థ మీద పరిశోధనలు చేసి మంచి ఫలితాలు రాబట్టిన శాస్త్రజ్ఞుడిగా– మంచి గుర్తింపు ఉంది. మత్తు కలిగించే స్పర్శ నాశకాలకు సంబంధించిన ఔషధాలు తయారుచేసే విషయంలో అతనికతనే సాటి. అతనొక సమర్థుడైన రసాయన శాస్త్రవేత్త. నరాల కణాలు ఒకచోట చేరటం వల్ల ఏర్పడే వాపు సమస్యలు– తదితర ప్రయోగాల గురించి అతను వివరణ ఇచ్చేదాకా ఎవరికీ అర్థమయ్యేవి కావు. ప్రస్తుతం అతను నూతనంగా ఆవిష్కరించనున్న ‘సహస్రగుణీకృత వేగోద్దీపన రసాయనం’ తయారు చేసేముందు కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు చేసి విజయం సాధించి ఉన్నాడు.     

అనేక వందలరెట్లు మానసిక శక్తినిచ్చే మందులు సృష్టించిన గిబ్బర్న్‌కు శాస్త్ర విజ్ఞానలోకం, మెడికల్‌ ప్రాక్టీషనర్ల సమూహం సదా కృతజ్ఞతగా ఉంటుంది. వివిధ కారణాలవల్ల విపరీతంగా అలసిపోయిన జనానికి అతడు కనిపెట్టిన గిబ్బర్న్స్‌ బీ సిరప్‌– సముద్రతీరాలలో, సిధ్ధంగా వుంచబడిన లైఫ్‌బోట్స్‌లా ఎంతోమంది ప్రాణాల్ని కాపాడింది.  
‘కానీ అటువంటి చిన్న చిన్న ఆవిష్కరణలు నా మనసును తృప్తి పరచలేదు.’  అది– సంవత్సరం క్రితం  అతని మనసులోంచి వెలువడిన   అసంతృప్త భావనా వీచిక.   
 అతను మళ్ళీ చెప్పసాగాడు.

‘అవి నరాల వ్యవస్థను ప్రభావితం చేయకుండా, శరీరంలోని కేంద్రక శక్తిని ఉద్దీపించలేకపోయాయి. లేదా నాడీవ్యవస్థ మీద పడే ఒత్తిడిని తగ్గిస్తూ, లభ్యనీయ కేంద్రకశక్తిని ప్రజ్వలింప చేయలేకపోయాయి. అవి ఒక నిర్దిష్టమైన అంతర్గత అవయవం మీద మాత్రమే   ఉపయోగించవలసి వచ్చేది. ఉదాహరణకు ఒకడి గుండెతో పాటు శరీరంలోపలి ఇతర అవయవాలను కూడా చైతన్య పరచగలిగితే, అతని మెదడు ఉద్దీపనమౌతుంది. అతని శరీరం మొత్తం– ఇతరులకంటే కూడా అనేక రెట్లు ఉత్తేజపరచే విధంగా ఒక ద్రావణాన్ని అభివృధ్ధి చేశాను.’
‘అది వ్యక్తిని నీరసపరుస్తుందేమో?’ అన్నాన్నేను.

‘అలాంటి అనుమానాలొద్దు. నేను చెప్పిన దాంట్లోని మర్మాన్ని అర్థం చేసుకో.’ అంటూ ఒక ఆకు పచ్చని గాజు సీసాని పైకెత్తిపట్టుకొని చూపెడుతూ ఒక నిర్ణీత కాలపరిమితి కన్నా రెండింతల వేగంతో ఆలోచించే మెదడు సామర్థ్యం, ద్విగుణీకృత వేగంతో చలించే శక్తి, రెట్టింపు వేగంతో పనిచేసే ప్రజ్ఞాపాటవాలను చేకూర్చి పెట్టే అద్భుత లక్షణముంది ఈ సీసాలోని ద్రావణానికి.’
‘కానీ అది సాధ్యమేనా?’

‘అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలా జరగకపోతే ఒక సంవత్సరం పాటు నేను చేసిన కఠోర శ్రమంతా వృథా అయినట్లే కదా? నేను సాధించిన  ఫలితాలు– నా పరిశోధనలు అబద్ధం కాదని రుజువు చేస్తున్నాయి. అయితే, రెట్టింపు ప్రభావం చూపకపోయినా, కనీసం ఒకటిన్నర రెట్లు వేగాన్ని చూపుతాయని కచ్చితంగా చెప్పగలను. ఉదాహరణకు, నీవొక రాజకీయనాయకుడివని ఊహించుకో. అనివార్యంగా ఒక ముఖ్యమైన పని ముగించవలసిన విషమ పరిస్థితి  నీ ముందుంది. కానీ సమయం చాలా పరిమితంగా వుంది. చాలా  అర్జంటుగా పనిముగించాలి. అప్పుడు నువ్వేంచేస్తావ్‌?’
‘నా పర్సనల్‌ సెక్రెటరీకి ఆ పని అప్పగిస్తాను.’

‘పోనీ, ఒక రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడ్డానికి సమయం చాలని ఒక డాక్టరుకు రెట్టింపు వ్యవధి దొరికిందనుకో.. లేకపోతే, ఊపిరి సలపని పనిఒత్తిడితో సతమతమవుతున్న అడ్వొకేట్‌ కు గానీ, పరీక్షలకు ముందుగా తయారవ్వక దిక్కులు చూస్తున్న  ఒక విధ్యార్థికి గానీ రెట్టింపు సమయం దొరికితే?... అప్పుడు ఈ సీసాలోని ఒకే ఒక్క చుక్క ద్రావణం, ఒక బంగారు నాణెంతో సమానమైన విలువ చేస్తుంది. కొన్ని చుక్కల ద్రావణాన్ని పుచ్చుకొంటే మెదడు రెండింతలు చురుగ్గా పనిచేసి ఉద్దీపనమౌతుంది. ద్వంద్వ యుద్ధంలో పిస్టల్‌ ట్రిగ్గర్‌ నొక్కే వేగం మీద విజయం ఆధార పడి ఉంటుంది.’ చెప్పుకొచ్చాడు గిబ్బర్న్‌.         
‘సాముగరిడి విషయంలో?...’ అడిగాను.

‘అన్ని విషయాలలో కూడా. అది ఏమాత్రం ప్రమాదకరం కాదు. కాకపోతే... బహుశా అది నిన్ను వృద్ధాప్యానికి దగ్గరగా చేరుస్తుందేమో?... అంటే ఇతరులు ఒక సంవత్సరం జీవిస్తే నువ్వు రెండు సంవత్సరాలు జీవించిన అనుభూతి పొందినట్లుంటుంది.’
‘అది నిజంగా సాధ్యపడుతుందా?’
‘సాధ్యమే మైడియర్‌ ఫ్రెండ్‌!... నా పరిశోధన గురించి నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే–  నేను కనుగొన్న సిరప్‌ – రెండురెట్లు కాదు. అంత కన్నా అధిక వేగంతో పని చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.


తరువాత చాలాసార్లు ఆ రసాయనం గురించే చర్చించుకున్నాం. ఫలితంగా అతను రసాయనాన్ని– ఇంతకు ముందు పేర్కొన్న లోపాల్ని సంస్కరించి– అభివృధ్ధి చేయగలిగాడు.
‘‘అమృతతుల్యమైన ఒక అపూర్వ దివ్యౌషధాన్ని ఈ లోకానికి సమర్పిస్తున్నానని నా విశ్వాసం. నా ఆశయాలకూ, అంచనాలకు అనుగుణంగా ప్రజలు దీటుగా స్పందించి, న్యాయబధ్ధమైన ధరలకే అందుబాటులో వుండబోతున్న మందును కొనుగోలు చేస్తారని  నమ్ముతున్నాను.’’...
‘‘విజ్ఞాన శాస్త్రమెప్పుడూ గౌరవింపబడుతూనే వుంటుంది. ఏదేమైనా నా మందుమీద కనీసం పదేళ్ళపాటు నేనే గుత్తాధిపత్యం కలిగి వుండాలని అభిలషిస్తున్నాను. ఎందుకంటే– చూస్తూ చూస్తూ– బొత్తిగా అనుభవం, ప్రావీణ్యం లేని, అత్యాశాపరులైన వ్యాపారస్తుల చేతుల్లో వుంచడానికి నా మనస్సంగీకరించడం లేదు.’’ అలా చెప్పుకుపోయాడు గిబ్బర్న్‌.         

కాలప్రవాహంలో– గిబ్బర్న్‌ తయారుచేయబోయే ఔషధం గురించిన ఆసక్తి నా మనసులో నుంచి కొట్టుకుపోలేదు. అతను కొత్తగా ఈ లోకానికి అందించబోవు ఔషధం– కచ్చితంగా మానవజీవితాన్ని– అవసరానికి తగ్గట్టు వేగవంతం చేస్తుందనే నేను నమ్ముతున్నాను. కానీ– సదరు ఔషధరాజాన్ని పదేపదే సేవించిన ఆ మానవుడు, నిత్య జీవచైతన్యంతో కళకళలాడినా– పదకొండేళ్ళకే వయోజనుడైపోతాడు. ఇరవైఐదేళ్ళకే మధ్యవయస్కుడై, ముప్పై ఏళ్ళకు వృధ్ధాప్యంలోనికి అడుగుపెట్టి, అంతరించిపోతాడు.  

యూదులు, తూర్పు ఆసియా సంతతి వారు–సహజంగా యవ్వనంలో వయోజనులై, యాభైయ్యవపడిలో వృధ్ధులుగా మారి, ఆలోచనలలో  మనకంటే అమిత వేగాన్ని ప్రదర్శించేవారు. ఈ కాలపుమనిషి, ఈ ఉద్దీపనాకారక ఔషధాన్ని సేవిస్తే, వారి మాదిరిగానే తయారవుతారు. మనసుమీద ఆ ఔషధ ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అది మనిషిని పిచ్చివాణ్ణిగా చేయగలదు. అత్యంత బలశాలిగా మార్చగలదు. చేతనాచేతనావస్థలలోకి కొనిపోగలదు. గిబ్బర్న్‌ నూతనావిష్కరణ వైద్యుల ఆయుధాగారంలో మరొక అద్భుతమైన ఆయుధంగా చేరి, అలరించగలదని నా కనిపించింది.

కొన్ని రోజుల తర్వాత ప్రొఫెసర్‌ నన్ను కలిశాడు. అతని ముఖం ఆనందాతిరేకంతో ఉప్పొంగిపోతూ వుంది. 
‘‘నేను సాధించాను. నా కల ఫలించింది. నా మనసులోని ఆలోచనలు ఒక నిర్దిష్టరూపాన్ని సంతరించుకొని నా ఎదుట నిలిచాయి. ఈ ప్రపంచం కోసం– ఎటువంటి దుష్పరిణామాలకు ఆస్కారం లేని– అత్యంత శక్తిమంతమైన ఒక కొంగ్రొత్త ఉద్దీపన రసాయనం తయారు చేయగలిగాను.’’
అతను గట్టిగా కేకలు వేసినంత పనిచేశాడు. నా చెయ్యిపట్టుకొని విపరీతంగా ఊపేశాడు. 
‘నిజంగానా?’ నేనడిగాను. 

‘‘నిజంగానే! నాకే నమ్మ శక్యంగా లేదా? మా ఇంటికిరా పోదాం. నువ్వే చూద్దువు గానీ.‘ అన్నాడు ఉద్వేగంతో ఊగిపోతూ.
‘‘రెండింతల శక్తిమంతంగా పనిచేస్తుందా?’’
‘‘రెండింతలు కాదు. వెయ్యింతలు! అంతకంటే ఎక్కువ!’’
తన ఆనందాతిరేకాన్ని దాచుకోలేకపోతున్నాడు. భావోద్వేగాన్ని అణచుకోలేకపోతున్నాడు.
‘‘అది మనిషి నాడీవ్యవస్థ మీద విపరీతమైన బలంతో పనిచేస్తుంది. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఆ ఔషధ ప్రభావాన్ని పరీక్షించడం..’’‘
‘‘పరీక్షించడమా ?’’ అడిగాను– అతని ఉద్దేశాన్ని పసిగట్టి.

‘‘ఔను! ఆ ఆకుపచ్చని గాజుసీసాలో ఉంది చూడు దివ్యౌషధం. నువ్వు భయపడకూడదు.’’ 
నేను స్వతహాగా జాగ్రత్తపరుణ్ణి. సాహసకృత్యాలు చేయాలనే ఉత్సాహం నాలో పరవళ్లు తొక్కుతోంది. మనసులో అనుకోవడమే గానీ, ఏనాడూ అవకాశం రాలేదు. అదిప్పుడొచ్చింది. మొదటిసారి కాబట్టి, లోలోన ఒక పక్క నేను భయపడుతున్నా, మరోపక్క గర్వించాను– ఒక లోకోపకార ఔషధ తయారీలో నేనూ భాగస్వామినవుతున్నందుకు. 
‘సరే‘ అన్నాను సంశయిస్తూనే.

 ‘‘ప్రొఫెసర్‌!  నువ్వు ఈ మందును తాగి ముందస్తు పరీక్ష చేశావా?’’ అని అడిగాను. 
‘‘ఔను! నాకేమీ ప్రమాదకరంగా అనిపించలేదు.’’
‘‘సరే! ఆ కషాయం నా నోట్లో పొయ్యి. అన్నట్టు  ఎలా తీసుకోవాలి?’’ అని అడిగాను.
‘‘నీళ్లలో కలుపుకొని.’’
అతడు డెస్క్‌ వెనుక నుంచి పైకి లేచి, నన్ను ఈజీ చెయిర్‌లో కూర్చోబెట్టాడు.  

‘‘ఇది రమ్ములాగా వుంటుంది. ఈ కషాయం నీ గొంతులోకి దిగిన వెంటనే కళ్లు మూసుకోవాలి. ఒక నిమిషం తరువాత నెమ్మదిగా తెరవాలి. చూపులో స్వల్ప ప్రకంపనాలుండొచ్చు. కానీ ఆ స్థితి ఎక్కువసేపు ఉండకపోవచ్చు. వెంటనే కళ్లు తెరిస్తే, కనుపాప దెబ్బ తినొచ్చు. అందుకే కళ్లు తెరవకుండా గట్టిగా మూసుకోవాలి’’ జాగ్రత్తలు చెప్పాడు. అతను చెప్పినట్టుగానే కళ్లు మూసుకున్నాను. 

ఇంకో విషయం. నువ్వు కదలకుండా కూర్చోవాలి. అలా కదిలితే నీకే ప్రమాదం. జ్ఞాపకముంచుకో. నువ్వు ఇదివరకటి కంటే వెయ్యిరెట్లు వేగంగా కదులుతావు. నీ గుండె, ఊపిరితిత్తులు, కండరాలు, మెదడు– అన్నీ అదే వేగంతో పనిచేస్తాయి. ఆ విషయం నీవు తెలుసుకోలేవు. కానీ దానికి విరుధ్ధంగా,  ప్రపంచం మొత్తం, ఇదివరకటి కంటే వెయ్యింతలు నెమ్మదిగా కదులుతుంది.. అంటే కళ్ల ముందు కదులుతూ కనిపించేవన్నీ దాదాపు చలనం లేకుండా ఉండిపోతాయి.’’అంటూ, కషాయం నింపి ఉన్న సీసా తెరిచాడు.

అందులోని కషాయాన్ని గ్లాసుల్లోకి వొంపాడు– బార్‌లో వెయిటరు విస్కీని కొలతవేసి వొంపినట్లుగా.       
‘‘రెండు నిముషాలపాటు కళ్లు గట్టిగా మూసుకొని కదలకుండా కూర్చో. తరువాత నా మాటలు నీకు వినిపిస్తాయి’’ అన్నాడు.  
ప్రొఫెసర్‌ రెండు గ్లాసుల్లోకి కొన్ని నీళ్లు కలిపాడు. 
‘‘నీ గ్లాసును కిందపెట్టొద్దు. చేత్తోఅలాగే పట్టుకొని, చేతిని నీ మోకాలు మీదుంచు. అవును అలానే’’  అంటూ అతని చేతిలోని గ్లాసును పైకెత్తి పట్టుకొన్నాడు. అందులోని ద్రవాన్ని తాగాం ఇద్దరమూ. అదే క్షణంలోనే నేను కళ్లు మూసుకున్నాను.

నేనేదో శూన్యంలోకి పడిపోయినట్లయింది. కొద్దిసేపటికి గిబ్బర్న్‌ నన్ను ‘ఇక లే’ అన్నట్టనిపించి కళ్లు తెరిచాను. నా ఎదురుగా గిబ్బర్న్‌ చేతిలో గ్లాసుతో నిలబడివున్నాడు. ఆ గ్లాసు ఖాళీగా వుంది. 
‘ఇప్పుడెలా వుంది? ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా?’ అడిగాడు. 
‘లేదు. మనసు ఉల్లాసంగా గాలిలో తేలిపోయినట్లయింది...’ .
‘ఏవైనా శబ్దాలు వినిపించాయా?’

‘ఆహా! అద్భుతంగా! కర్ణపేయంగా వినిపించాయి. మెల్లగా చప్పుడు చేస్తూ, వేటి వేటి మీదనో చిరుజల్లు పడుతున్నట్టుగా శబ్దాలు వినిపించాయి.! ఏమిటవి?’
‘అవి విశ్లేషణ ధ్వనులు..’ అని చెప్పాడో? మరేం చెప్పాడో? నేను సరిగ్గా వినలేదు.       
అతను కిటికీ వైపు చూపులు సారిస్తూ, ‘ఆ కిటికీతెర ఆ విధంగా కిటికీకి అతుక్కుపోయినట్టున్న దృశ్యం నువ్వెప్పుడైనా చూశావా?’
‘లేదు. చూడలేదు. ఆ దృశ్యం చాలా వింతగా, కొత్తగా వుంది.’ అన్నాను. 

‘అలానా? అయితే ఇటుచూడు మరి.’
అటు చూశాను. గిబ్బర్న్‌ చేత్తో పట్టుకొన్న గ్లాసును వదిలేశాడు. అలా వదలగానే అది కిందపడి భళ్లున పగిలి ముక్కలు కావాల్సిన ఆ గ్లాసు గాలిలో తేలియాడుతూ నిశ్చలంగా నిలిచివుంది. అది చూసి నేను  ఆశ్చర్యపోయాను. ప్రొఫెసర్‌ చెప్పుకుపోయాడు.

‘సాధారణంగా ఈ ఎత్తులో నుంచి, ఏ వస్తువైనా సరే, ఒక క్షణానికి పదహారు అడుగుల వేగంతో కింద పడిపోతుంది. చూడు ఈ గ్లాసు క్షణంలో నూరోవంతు వేగంతో కూడా కిందకు పడిపోకుండా గాల్లో తేలియాడుతూ వుంది. దీనివల్ల నీకు నేను కనిపెట్టిన మందు ప్రభావం గురించి కొంచెం కొంచెం అర్థమైవుంటుంది. తరువాత అతను ఆ గ్లాసు చుట్టూ, పైనా, కిందా తన చేతిని వలయాకారంగా తిప్పాడు. అది అతి నెమ్మదిగా అధోముఖంగా  దిగసాగింది. దాని అడుగుభాగాన్ని అరచేత్తో జాగ్రత్తగా పట్టుకొని టేబుల్‌ మీదుంచి, నాకేసి చూసి నవ్వాడు. 

నేను జాగ్రత్తగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాను. నా మనసు గాల్లో తేలిపోతున్నట్లుంది. నాలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతూ వుంది. అమోఘమైన ఆత్మవిశ్వాసం నిండివుంది. నా మనసు చాలా వేగంగా ఆలోచిస్తూ వుంది. ఉదాహరణకు– నా గుండె ఒక్క క్షణంలో వెయ్యిసార్లు కొట్టుకొంది. కానీ నా కేమీ ఇబ్బందిగా అనిపించలేదు. కిటికీలోంచి బయటికి చూశాను. నిశ్చల చిత్రంలా– ఒక సైక్లిస్టు కనబడ్డాడు. అతను తల ముందుకు వంచి సైకిల్‌ తొక్కే భంగిమలో నిలబడి వున్నాడు. వెనుకచక్రం వెదజల్లే దుమ్ము బంకమట్టితెరలా స్తంభించి వుంది. వేగంగా వెళుతున్న ఒక మోటారు కారు ఎక్కడున్నది అక్కడేఆగి వుంది. నిజంగా నమ్మలేని ఆ దృశ్యాన్ని నేను నోరెళ్లబెట్టి చూశాను. 

‘ప్రొఫెసర్‌ గిబ్బర్న్‌! దీని ప్రభావం ఎంతసేపుంటుంది?’ గొంతు పెంచి, అసహనంగా అరిచాను. 
దానికతడు ‘ఏమో! ఆ దేవుడికే తెలియాలి.’ అని చాలా తాపీగా బదులిచ్చాడు.
‘‘నిన్న రాత్రి ఈ మందు తాగాను. పరుపుమీద అసహనంగా దొర్లాను.కింద పడ్డాను. నాకు భయమేసింది. ఆ స్థితి కొన్ని నిముషాలపాటే వున్నా, కొన్ని గంటలు గడిచినట్టుగా అనిపించింది. అయితే, అకస్మాత్తుగా తగ్గిపోయినట్లయిందని అనుకుంటున్నా’’నంటూ బదులిచ్చాడు.       

నేను భయపడనందుకు నా ఛాతీ ఒకింత పొంగింది. 
‘అలా బయటికెళ్దామా?’  అడిగాను.
‘తప్పకుండా’...
ఆ స్వల్ప వ్యవధిలోనే గిబ్బర్న్‌ చేత సృష్టించబడిన ఔషధప్రభావం కారణంగా నేను పొందిన దివ్య చిత్రవిచిత్రానుభూతి, నా జీవితంలో ఎన్నడూ కనీవినీ ఎరుగనటువంటిది, మరచిపోలేనిది, అనూహ్యమైనదని కచ్చితంగా చెప్పగలను.      

గేటు గుండా బయటికొచ్చాము. రోడ్‌ మీద ట్రాఫిక్‌ ను ఒక నిముషం పాటు గమనించాము. గిర్రున తిరుగుతున్న గుర్రబ్బండి చక్రాల ఉపరిభాగం, గుర్రాల కాళ్లు వేగంగా కదలుతున్నాయి. చోదకుడు బధ్ధకంగా ఆవులిస్తూ, దవడ ఎముకను కదిలిస్తూ కొరడా ఝళిపిస్తున్నాడు. అక్కడ చుట్టుపట్ల వున్న మిగతా వాహనాలు మాత్రం నెమ్మదిగా కదలుతున్నాయి.  
ఎవరో మనిషి ఆర్తనాదంలాంటి చిన్న కేకతప్ప ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా వుంది.

పదుకొండుమంది ఆసీనులైవున్న వాహనంలో–  గుర్రబ్బగ్గీ చోదకుడు, బగ్గీ నిర్వాహకుడుతో సహా అందరూ నిశ్చలంగా ప్రతిమల్లాగా ఉండిపోయారు.    
వాళ్లు మాలాంటివాళ్లే కానీ, మాలాగా వాళ్లు లేరు. బిగుసుకొని పోయి గాల్లో వేల్లాడుతున్నారు. ఒక ఆడదీ, ఒక మగవాడూ ఒకరివంక ఒకరు చూసుకొంటూ నవ్వుకొంటున్నవారు నవ్వుకొంటూనే రాతిబొమ్మల్లా అచలంగా వుండిపోయారు.   

మీసాలను సవరించుకొంటున్న మగవాడు, జారిపోతున్న టోపీని– పూర్తి  శక్తి ఉడిగిన వాడిలా– చేత్తో  పట్టుకోడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలుడవుతున్నాడు.    
ఉన్నట్టుండి గిబ్బర్న్‌ గట్టిగా అరిచాడు. ఒక దృశ్యాన్ని  చూపించాడు. నత్తనడిచే వేగం కన్న తక్కువ వేగంతో గాలిలో బలహీనంగా కిందకు దిగుతూ వుంది– ఒక తేనెటీగ.
ఆ గడ్డిపెరిగిన నేలను వదలి బయటికొచ్చాము. ఇంతకు ముందుకన్నా ఎక్కువ పిచ్చెక్కించే సన్నివేశాలు కనబడ్డాయి. ఒక బ్యాండ్‌ సెట్‌ వాళ్లు ఎత్తయిన ప్రదేశంలో ఆసీనులై, సంగీతస్వరాలు వినిపిస్తున్నారు. ఆ స్వరాలు అత్యంత తగ్గుస్థాయిలో గుర్‌ గుర్‌మని పిల్లికూతల్లా వినబడుతున్నాయి.

మనుషులు బొమ్మల్లా భయంకరమైన మౌనంతో గడ్డినేల మీద అతి నెమ్మదిగా అడుగులు కదిలిస్తున్నారు. పూడుల్‌ జాతికుక్క పైకెగిరి గాలిలోనే వేలాడుతూ, నెమ్మదిగా భూమి మీదకు దిగుతోంది. ఖరీదైన దుస్తులూ,తెల్లని షూస్, పనామా టోపీ ధరించి, గొప్పగా కనిపించే ఒకతను, వెనక్కి తిరిగి దారివెంబడి వెళ్లే ఆడవాళ్ల వంక అతివేగంగా అదేపనిగా కన్నుకొట్ట సాగాడు.

‘ఈ వేడి వాతావరణం– నరకాన్ని తలపిస్తోంది. నెమ్మదిగా నడుద్దాం’ అన్నాన్నేను.
అక్కడ్నుంచి ముందుకు కదిలాం. దారి వెంబడి కొందరు దివ్యాంగులు చక్రాల కుర్చీలలో కూర్చొని వున్నారు. వారు కూర్చొన్న భంగిమలు సహజంగానే కనబడుతున్నాయి. ఆ బ్యాండ్‌ మేళం వాళ్ల ముఖాలు మాత్రం అశాంతితో నిండివున్నాయి.      

ఒక పొట్టి పెద్దమనిషి– విసురుగా వీస్తున్న గాలి ధాటికి రెపరెపలాడుతున్న వార్తాపత్రికను మడతపెట్టలేక విపరీతమైన హైరానా పడుతున్నాడు. అక్కడున్న వారందరూ చాలా మందకొడిగా మసలుతూ ఏదో పెనుగాలికి ఊగులాడుతున్నట్టు అగుపిస్తున్నారు. కానీ మాకేమో ఏ గాలీ వీస్తున్న అనుభూతే లేదు. ఆ గుంపు నుండి దూరంగా వచ్చేశాము.  
ఉద్దీపన ఔషధం నా నరాలలోనికి చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెప్పిన సంఘటనలు కన్నుమూసి తెరిచేలోపల జరిగిపోయాయి.  
ఇంతలో గిబ్బర్న్‌ నా ఆలోచనలకు అంతరాయం కలిగించాడు. 

‘ఆ దరిద్రపు ముసల్ది వుందే...’ అన్నాడు.
‘ఏ ముసల్ది?’
‘అదే. నా ఇంటి పక్కనుంది చూడు.దాని దగ్గరున్న ఒక పెంపుడు కుక్క బలే మొరుగుతుందనుకో..’
ఒక్కొక్కసారి,  గిబ్బర్న్‌ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తుంటాడు. నేను వారించే లోపల, పాపం! ఆ అమాయక ప్రాణిని మెడ ఒడిసిపట్టుకొని కొండ చరియదాకా పరుగులు తీశాడు. అది కనీసం మొరగలేదు.మెలికలు తిరగలేదు. నిద్రావస్థలో వున్నట్టుండి పోయింది. అలా వెళుతున్న గిబ్బర్న్‌నుద్దేశించి గట్టిగా అరిచాను.

‘గిబ్బర్న్‌! దాన్ని కిందపడేయ్‌! కిందపడేయ్‌! నువ్వలా పరుగెత్తావంటే నీ బట్టలు వేడికి అంటుకొని  కాలిపోతాయ్‌’ అని అరుస్తూ, నేను కూడా కొండ కేసి పరుగెత్తాను. గిబ్బర్న్‌ తొడకొట్టుతూ కొండ రాయిమీద నిల్చున్నాడు. నేను ఆందోళనతో మరొక్కసారి బిగ్గరగా అరిచాను. ‘గిబ్బర్న్‌! దాన్ని కిందకు పడేయ్‌! ఈ వేడి చాలా తీవ్రంగా వుంది. మనం ఒక్క క్షణానికి రెండుమూడు మైళ్లు పరుగెత్తుతున్నాము. గాలిలో ఘర్షణ  విపరీతంగా వుంది...’

‘ఏమిటీ?’ అని కుక్కపిల్లకేసి చూస్తూ అడిగాడు. 
‘గాలిలో ఘర్షణ... ఉల్కాపాతంలాంటి చండప్రచండ వేగంతో వాయుఘర్షణ వల్ల మంటలు చెలరేగుతున్నట్లున్నాయి. ఉష్ణకిరణాలు నా శరీరానికి బాకుల్లా గుచ్చుకుంటున్నాయి. జనంలో కూడా కొద్దిగా చలనం వచ్చింది. మందు ప్రభావం పూర్తిగా క్షీణించినట్లుంది. వెంటనే ఆ కుక్కపిల్లను కిందకు వదిలేయ్‌!’
‘ఆ!? ’ అన్నాడు. 

‘మందు పనిచేయడం మానేసింది. చాలా వేడిగా వుంది. నా  ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి.’
వెంటనే గిబ్బర్న్‌ చేయి విదిలించి కుక్కపిల్లను దూరంగా విసిరేశాడు. అది గిరగిరా తిరుగుతూ పైకెళ్ళి కదలకుండా గాల్లో నిలిచిపోయింది. అక్కడ గుమిగూడిన జనం, నీడ కోసం గొడుగులు ఏర్పరచుకొని, వాటి కింద పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ గొడుగులకు కొంచెం ఎత్తులో– మేకుకు తగిలించినట్టు వేలాడుతూ ఉండి పోయింది కుక్కపిల్ల. అప్పుడు గిబ్బర్న్‌ మాట్లాడాడు.
‘‘ఔనౌను. విపరీతమైన వేడిగా వుంది.ఇక్కడి నుంచి మనం తక్షణం బయటపడాలి.’’

కానీ అనుకున్నంత వేగంగా మేము పరుగెత్తలేకపోయామనుకుంటాను. అదే మాకు కలిసొచ్చిన అదృష్టమేమో! ఒకవేళ మేము అలా పరుగెత్తివుంటే, మంటల్లో మాడి మసైపోయేవాళ్లమేమో ఈపాటికి! అవును! నిజంగానే మంటల్లో భస్మీపటలమై వుండేవాళ్లం.మేము పరుగెత్తాలని నిర్ణయించుకోవడానికి– క్షణంలో వెయ్యోవంతు ముందుగా ఆ మందు ప్రభావం అంతరించడం కాకతాళీయంగా జరిగిపోయింది. చేత్తో మంత్రదండం తిప్పినట్లు దాని ప్రభావం పూర్తిగా ఆగిపోయింది. అంతలో గిబ్బర్న్‌ ‘కింద కూర్చో! కింద కూర్చో!’ అని హెచ్చరించాడు. నేను పచ్చగడ్డితో కూడిన మట్టిపెల్ల అంచు మీద కూర్చున్నాను. నేను ఏ పచ్చగడ్డి గడ్డ మీద కూర్చున్నానో, దానికి ఒకవైపు నుంచి మంటలు రాజుకుంటూ వస్తున్నాయి.    

చిత్తరువులా నిశ్చలస్థితిలో వున్న జగత్సర్వస్వం జాగృతమైంది. నిర్జీవములైన దృశ్యాలు ప్రాణం పోసుకున్నాయి. మూగవోయిన బ్యాండ్‌ వాయిద్యాలు ఒక్కసారిగా మ్రోగసాగాయి. పాదచారులు తమ అడుగులు భూమ్మీద మోపి వడివడిగా నడవసాగారు. కాగితాలూ, జెండాలు రెపెరెపలాడసాగాయి. చిరునవ్వులు మాటలుగా మారాయి. కన్నుకొట్టే శ్రీమంతుడు అది మానేసి తనదారిన తాను వెళ్ళిపోయాడు, సంతృప్తిగా. మౌనంగా కూర్చున్న వారందరిలోనూ చలనమొచ్చి, గలగలా మాట్లాడుకోసాగారు.   

మేము ఏ వేగంతో నడుస్తున్నామో, ప్రపంచం కూడా అదే వేగంతో నడుస్తూవుంది– ఎంతో వేగంతో పరుగులెత్తే రైలుబండి, స్టేషన్లోకి రాగానే స్పీడు తగ్గించుకొని నెమ్మదిగావచ్చినట్లు. గిబ్బర్న్‌ చేతిపట్టు విడిపోగానే, కుక్కపిల్ల ఒకే ఒక్క క్షణంపాటు గాలిలో వేలాడి, తరువాత అమిత వేగాన, కిందకు జారుతూ, గొడుగు నీడలో సేదతీరుతున్న ఒక మహిళ గొడుగుమీద ‘దబ్‌’ అని పడిపోయింది. ఆ ధాటికి గొడుగు గుడ్డను చీల్చుకొని– ఆ కుక్కపిల్ల ఆ మహిళ మీద పడింది.
కొత్త మందుతో నేను పొందిన మొట్టమొదటి అనుభవమది.

బ్యాండ్‌ సెట్‌ సంగీతాన్ని అర్ధగంటసేపు విన్నాను. కొత్తమందు ప్రభావాన్ని పరీక్షించాలనుకున్న మాకు, ప్రపంచమే సహకరిస్తున్నట్లు స్తంభించి వుంది. అతి తొందరపాటుతో బహిరంగ ప్రదేశంలో మేము నెరిపిన ప్రయోగం– అనుకున్నంత సంతృప్తికరంగా మాత్రంలేదు.

అయినా గిబ్బర్న్‌ నేర్చుకోవాల్సింది ఇంకా చాలా వుంది. ఈ మందుప్రభావం నియంత్రణకు తెచ్చే ప్రక్రియలో– అణుమాత్రం దుష్పరిణామం సంభవించని రీతిగా–  నేను చాలామార్లు అతని పర్యవేక్షణ కింద, తగిన మోతాదుల్లో మందు సేవించాను. ఈ మందు పుచ్చుకొన్న స్థితిలో, నేను ఈ ఉదంతాన్ని కేవలం ఒకే ఒక దఫా కూర్చొని ఎలాంటి అంతరాయం లేకుండా రాశాను.(మధ్యమధ్య చాక్లెట్‌ కొరుక్కు తినడం తప్ప). నేను ఈ వృత్తాంతాన్ని రాయడం 6.25 నిముషాలకు మొదలుపెట్టి, 6.56 నిముషాలకు ముగించాను. ఈ రచనను పూర్తిచేయడానికి సాధారణ పరిస్థితుల్లోనైతే కనీసం మూడుగంటలపైనే పట్టేది. కానీ ఇప్పుడు కేవలం ముప్పైఆరు నిముషాలలో రాసి పూర్తిచేశానన్నమాట!   
 

రోజువారీ కార్యక్రమాల ఒత్తిడి అధికమైనప్పుడు, చేయాల్సిన పెద్ద పెద్ద పనులు, నిరంతరాయంగా, అతి కొద్ది వ్యవధిలో పూర్తి కావలసినప్పుడు ఈ మందు ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు గిబ్బర్న్‌ వివిధ మోతాదుల్లో, విభిన్న దేహదారుఢ్యాలు గల వ్యక్తుల మీద ప్రభావం చూపే మందును భారీస్థాయిలో తయారుచేసే పనిలో నిమగ్నమై వున్నాడు.           
ఈ అనుభవం తరువాత, మందు మోతాదు ఎక్కువైనప్పుడు, జరగబోయే చెడు ప్రభావాన్ని నివారించే నిమిత్తం గిబ్బర్న్, ‘మందగామిని’ కనిపెట్టాలనుకున్నాడు

ఇది ‘వేగోద్దీపన’కు పూర్తిగా విరుధ్ధమైనది. ఈ మందు ఒక డోసు తాగిన రోగికి, కొన్నిగంటలపాటు, మనసుకు పూర్తి విశ్రాంతి, నిశ్చింతభావం చేకూరుతుంది.  చికాకుపరచే చుట్టుపక్కల నెలకొన్న రణగొణధ్వనుల మధ్యకూడా– నాలుగైదు గంటల పాటు మనోల్లాసాన్ని కలిగిస్తుంది. ప్రస్తుత నవనాగరిక సమాజంలో ప్రశాంత జీవనం గడపడానికి, ఈ మందగామిని  ఉపకరిస్తుంది. భరింపరాని వేదన– మనసును కలచివేస్తున్నప్పుడు, జీవితంలో విరక్తిభావం శ్రుతిమించినప్పుడు అంతులేని ప్రశాంతతను అందిస్తుంది. 

అయితే– వేగోద్దీపనం– అవసరమైన ఏ సందర్భంలోనైనా– అనంతశక్తినీ, ఉత్తేజాన్నీప్రసాదిస్తుందని గట్టిగా చెప్పగలను. 
ప్రస్తుతం ‘మందగామిని’ తయారీ ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే వుంది. కాబట్టి అదెంతవరకు సత్ఫలితాలనిస్తుందో చెప్పలేను. అయితే వేగోద్దీపనం విషయంలో మాత్రం ఏవిధమైన సందేహం పెట్టుకోనవసరం లేదు. ప్రజలకు సౌకర్యవంతంగా, దుష్పరిణామాలు సంభవించని రీతిలో,  సంక్లిష్టరహితంగా, ప్రజావిపణిలోనికి కొద్దినెలల్లోపల రానున్నది ఈ రసాయనం. అంత శక్తిమంతమైన ఔషధం చిన్నచిన్న సీసాలలో, సహేతుకమైన ధరల్లో, 200, 900, 2000 పొటెన్సీలలో ప్రతి మందుల షాపులలోనూ, లభ్యం కాగలదు.         

దీని ఉపయోగం ఎన్నో అసాధారణ లక్ష్యాల సాధనకు బాటలు పరుస్తుందనటంలో ఈషణ్మాత్రం సందేహం లేదు. బహుశా ఇది– నేరపరిశోధనల్లో కూడా– అతి స్వల్ప వ్యవధిలో, నేరమూలాల్లోకి ఆలోచనలు చొచ్చుకొనిపోయి, నిజమైన నేరస్తుల శిక్షణకు, నిరపరాధులరక్షణకు దోహదపడుతుందని నా నమ్మకం. కాకపోతే ఇలాంటి ఇతర అపార గుణసంపత్తి గల ఔషధాల్లాగే, ఇది కూడా విమర్శలకతీతం కాదు. ఈ విషయం పూర్తిగా వైద్యన్యాయ శాస్త్రపరిధిలోకి వచ్చే అంశం. ఈ మందును ఉత్పత్తిచేసి, అమ్మిన తరువాత చూద్దాం– దీని పర్యవసనాలెలా వుంటాయో!

ఇంగ్లిష్‌ మూలం : హెచ్‌.జి.వెల్స్‌
అనువాదం: శొంఠి జయప్రకాష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement