వి‘చిత్ర’ దొంగతనం | Victor Whitechurch English Story In Telugu Sakshi Funday | Sakshi
Sakshi News home page

వి‘చిత్ర’ దొంగతనం

Published Sun, Dec 5 2021 8:34 PM | Last Updated on Sun, Dec 5 2021 8:34 PM

Victor Whitechurch English Story In Telugu Sakshi Funday

‘ది గ్రేట్‌ వెస్టెర్న్‌ రైల్వే కంపెనీ పరిధిలో డిడ్‌ కాట్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి, వించెస్టర్‌ ద్వారా ప్రయాణించి న్యూ బరీ చేరుకొన్న గూడ్స్‌ ట్రెయిన్‌కు తగిలించిన మొత్తం పదకొండు వ్యాగన్‌లలో ఒక వ్యాగన్‌ తప్పిపోయిందట!’
ఇన్వెస్టిగేటింగ్‌ కెమెరా మ్యాన్‌ అయిన హ్యేజెల్‌కు అతని మిత్రుడు అందించిన సమాచారమది. హ్యేజెల్‌  మెడలో ఎప్పుడూ కెమెరా వేలాడుతూ ఉంటుంది.  
‘బహుశా ఆ తప్పిపోయిన వ్యాగన్‌ను బ్రేక్‌ వ్యాన్‌ చివర తగిలించి ఉంటారు. కప్లింగ్స్‌ పగిలిపోవడం వల్ల వేరై ఉంటుంది. అలా జరిగున్న పక్షంలో తరువాత వచ్చే రైలు దాన్ని తీసుకురావచ్చు’ అన్నాడు హ్యేజెల్‌. 
‘లేదు. ఆ వ్యాగన్‌ను ఆ గూడ్స్‌ ట్రెయిన్‌ మధ్యలోనే తగిలించారు’ చెప్పాడు హ్యేజెల్‌ మిత్రుడు. 
‘ఆ! అలాగా? విచిత్రంగా ఉందే.. బహుశా ఏ స్టేషన్లోనైనా ఆగిపోయి ఉండొచ్చు’
‘నో! నో! మై ఫ్రెండ్‌! ఆ లైనులో ఉన్న స్టేషన్లకన్నిటికీ టెలిగ్రాములిచ్చారట. ఏ స్టేషన్‌లోనూ లేదని ద్రువీకరించారు’ అన్నాడతను. 
‘ఓహో! అసలు ఆ గూడ్స్‌ ట్రైన్‌ డిడ్‌ కాట్‌ నుండి బయలుదేరి ఉండకపోవచ్చు’ ఊహించాడు హ్యేజెల్‌. 
‘అందులో అనుమానమే లేదు. డిడ్‌ కాట్‌ స్టేషన్‌ వదలి బయలుదేరిందని స్టేషన్‌ మాస్టర్‌  చెప్పాడు’ 
‘ఈ కేసు చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ వ్యాగన్‌లో ఏదో విలువైన సామగ్రి ఉండి ఉంటుంది. మనం అక్కడికి పోదాం పద’ అన్నాడు హ్యేజెల్‌. 

ఇద్దరు మిత్రులు బయలుదేరి, స్టేషన్‌ మాస్టరును కలిశారు.
‘మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ డిటెక్షన్‌ గురించి చాలా విన్నాను. జరిగిన  సంఘటన నాకు విచిత్రంగా తోస్తూ ఉంది. ఏమీ అర్థంకావడం లేదు’ అన్నాడు స్టేషన్‌ మాస్టర్‌.  
‘తప్పిపోయిన వ్యాగనులో ఏముందో తెలుసా మీకు?’ అడిగాడు హ్యేజెల్‌.
‘అక్కడే వచ్చింది సార్‌ చిక్కు. ఏదేమైనా అందులో అత్యంత విలువైన సామగ్రి ఉందనుకుంటున్నాను. వచ్చేవారం వించెస్టర్‌ మ్యూజియంలో అత్యంత అపురూప పురాతన వర్ణచిత్రాల ప్రదర్శించబోతున్నారు. అందు నిమిత్తం అటువంటివి కొన్ని చిత్తరువులను ఈ వ్యాగన్‌ ద్వారానే లీమింగ్టన్‌కు  తరలిస్తున్నారు. అందులో ప్రఖ్యాత చిత్రకారుడైన సర్‌ గిల్బర్ట్‌ ముర్రెల్‌ అద్భుతంగా చిత్రించిన మూడు విలువైన అపురూప చిత్రాలు  భారీ పరిమాణంలో ఉండడం వల్ల వాటిని ఒక్కొక్కటిగా∙ప్రత్యేకంగా పెట్టెల్లో భద్రంగా పెట్టి బంగీలుగా కట్టారు’  చెప్పాడు స్టేషన్‌ మాస్టర్‌. 
‘మ్మ్‌! ఇదేదో చాలా తమాషాగా తోస్తోంది. అన్నట్టు ఆ వ్యాగన్‌ను ట్రైనుకు తగిలించారో? లేదో?’ అనుమానం వ్యక్తం చేశాడు హ్యేజెల్‌. 
‘సందేహమే లేదు. కావాలిస్తే, బ్రేక్‌ మ్యాన్‌ సింసన్‌ను మీరే అడగండి. అతన్ని పంపిస్తాను. అతని మాటల్లోనే వినండి’ అన్నాడు స్టేషన్‌ మాస్టర్‌.

గూడ్స్‌ గార్డు వచ్చాడు. హ్యేజెల్‌ అతన్ని నిశితంగా గమనించాడు. అతని ముఖంలో  నిజాయితీ తప్ప ఎలాంటి అనుమానాస్పదమైన ఛాయలు కనబడలేదు. ‘డిడ్‌ కాట్‌లో మేము స్టేషన్‌ వదలిన సమయంలో, రైలుకు వ్యాగన్‌ తగిలించి ఉందని నాకు బాగా తెలుసు. తరువాతి స్టేషన్‌ అప్టన్‌ వద్ద ఆగాం. అక్కడ కొన్ని వ్యాగన్లను స్టేషన్‌లో విడగొట్టాం. అప్పుడు ఆ వ్యాగన్‌– బ్రేక్‌ వ్యాన్‌ నుండి అయిదోస్థానంలోనో, ఆరోస్థానంలోనో ఉంది. ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను. ఆ తరువాత ‘కాంప్‌టన్‌’లో ఆగి పశువుల ట్రక్కును రైలుకు తగిలించాం. నేనక్కడ దిగలేదు. అక్కడి నుండి  ఎక్కడా ఏ స్టేషన్లలోనూ ఆగకుండా న్యూ బరీ స్టేషను వరకూ ప్రయాణం సాగించాం. అక్కడ తనిఖీ  చేశాను. ఆ వ్యాగను కనిపించలేదు. నేను పొరపాటు పడ్డానేమోనని రెండవసారి జాగ్రత్తగా పరిశీలించాను. ఆ వ్యాగను లేదు. ఒకవేళ అది అప్టన్‌లోనో, కాంప్‌టన్‌లోనో పొరపాటున నిలిచిపోయి ఉంటుందని ఊహించాను. కానీ ఆ ఊహ తప్పని తేలింది. ఎందుకంటే అది ఆ రెండు స్టేషన్లలోనూ లేదని నిర్ధారణ అయింది. నాకు తెలిసిందదే సార్‌! అంతా తికమకగా, గందరగోళంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు ఆ గార్డు.  
‘అవును. చాలా విచిత్రంగా ఉంది. కానీ నువ్వు పొరపాటు పడలేదు కదా?’  
‘లేదు సార్‌! నేను పొరపాటు పడలేదని నిశ్చయంగా చెప్పగలను’
‘పోనీ డ్రైవరు ఏమైనా గమనించాడేమో?’
‘లేదు సార్‌!’

‘ఒక వ్యాగన్‌ అలా రైలు పెట్టెల మధ్య నుండి విడిపోవడం జరగదు. ఏ మాంత్రికుడో వచ్చి మాయం చేసుంటే తప్ప. మీరు ఏ సమయంలో డిడ్‌ కాట్‌ వదిలారు?’ హ్యేజెల్‌ అడిగాడు.  
‘రాత్రి ఎనిమిది గంటలకు సార్‌!’
‘చాలా చీకటిగా ఉంటుందప్పుడు. కాబట్టి లైను పక్కన ఏం జరిగేదీ మీకు తెలియకపోవచ్చు’
‘అవును సార్‌! ఏమీ కనబడదు’
‘మీరు ఎప్పుడూ బ్రేక్‌ వ్యాన్‌ లోపల్నే ఉంటారా?’
‘రైలు కదులుతున్నంతసేపూ రైల్లోనే ఉంటాను సార్‌!’
ఆ సమయంలో పోర్టర్‌ అక్కడికి వచ్చి..‘ఇప్పుడే ఒక ప్యాసెంజర్‌ ట్రైన్‌ డిడ్‌ కాట్‌ నుంచొచ్చింది. ‘చర్న్‌’  దగ్గర సైడింగులో ఒక భర్తీ వ్యాగన్‌ బంగీలతో నిలిచి ఉందని డ్రైవరు ఫిర్యాదు చేశాడు’ అని చెప్పాడు. 
అది విని గార్డ్‌ ఆశ్చర్యపోయాడు.
‘మేమెప్పుడూ ‘చర్న్‌’ దగ్గర బండి ఆపం. ఏదో క్యాంపుల్లో తప్ప. ఎక్కడా ఆగకుండా చర్న్‌ మీదుగానే వచ్చాం’ 
‘చర్న్‌ ఎక్కడుంది?’ అడిగాడు హ్యేజెల్‌.
‘అది అప్టన్‌కూ కాంప్‌టన్‌కూ మధ్యలో ఉంది. అక్కడ కేవలం ప్లాట్‌ఫార్మ్‌ ఉంటుంది. దాంతో పాటు సైడింగ్‌ కూడా ఉంది. వేసవిలో మాత్రం అక్కడ సైనికులు విడిది చేస్తారు. అయినా అది చాలా అరుదుగా జరుగుతుంది’ అన్నాడు గార్డ్‌.     
‘నేను వెంటనే చూడాలా ప్రదేశాన్ని’ 

ఒక గంటలోపలే ఆ వైపు వెళ్ళే రైల్లో, ఇన్‌స్పెక్టర్‌  హిల్‌తో పాటు ‘చర్న్‌’ అనే ప్రదేశానికి  చేరుకున్నారు. అది  ఏకాంతప్రదేశంలో ఉంది. విశాలమైన, సమతలప్రదేశానికి కొంచెం దిగువన వుంది. అక్కడ ఒకే ఒక చెట్టు ఉంది. అది నివాసప్రాంతం కాదు. అరమైలు దూరంలో గొర్రెల కాపరి గుడిసె మాత్రం ఉంది. ఆ స్టేషన్‌ మొత్తం ఒకే ఒక ప్లాట్‌ఫార్మ్‌గా ఉండి,సైడింగ్‌ లైన్‌ ఉంది. అక్కడితో పట్టాలు అంతమౌతాయి.ౖ రెల్వే పరిభాషలో అది డెడ్‌ ఎండ్‌. ఒకే ఒక్క ట్రాక్‌తో డిడ్‌ కాట్‌ స్టేషన్‌ మెయిన్‌ ట్రాక్‌కు అనుసంధానించి ఉంది. డెడ్‌ ఎండ్‌ వద్ద ఆ సైడింగ్‌ పట్టాల మీద తప్పిపోయిన వ్యాగన్‌ కనబడింది. వ్యాగన్‌ పెద్ద పెద్ద పార్సల్స్‌తో నిండి వుంది. వాటి మీద ‘లీమింగ్‌ టన్‌ నుండి వించెస్టర్‌ వయా న్యూ బరీ’ అని లేబుల్స్‌ అతికించున్నాయి. ఆగకుండా ప్రయాణించిన రైలు నుండి మిగతా వ్యాగన్ల మధ్య తగిలించిన వ్యాగన్‌ అక్కడికెలా వచ్చింది? అదొక మిçస్టరీగా ఉంది. ఎంత చురుకైన మెదడుక్కూడా అందని ఆ మిస్టరీ అందరి మెదళ్ళను తొలిచేస్తోంది.వ్యాగన్‌ వంక తదేకంగా చూసి ‘మనం ట్రాక్‌ మీది పాయింట్స్‌ ఒకసారి పరిశీలిద్దాం రండి’ అని ఇన్‌స్పెక్టర్‌ అనడంతో అందరూ అటు వెళ్ళారు. 

ఆ పాతకాలపు స్టేషన్లో కనీసం సిగ్నల్‌ బాక్స్‌ కూడా లేదు. రెండు లీవర్లతో పనిచేసేట్టుగా , నేలమీది చట్రం మీద లైనుకానుకొని పాయింట్‌ బిగించి ఉంది. అందులో ఒక లీవరు పనిచేస్తూ ఒకే పాయింట్స్‌లో ఉన్న లైన్‌ను మారుస్తోంది. లీవరును ఇంకోవైపుకి మార్చడం ద్వారా ట్రాక్‌ను య«థాస్థితికి తెస్తోంది. ఇంకా వివరంగా  చెప్పాలంటే నేలమీద చెక్కదిమ్మెలకు బిగించిన లీవరును అటు నుండి ఇటు, ఇటు నుండి అటు కదిలించడం వల్ల ట్రైన్‌లు ఒక ట్రాక్‌ నుండి మరో ట్రాక్‌కు మారేలా చేస్తాయి. అదో సాంకేతిక అమరిక.     
‘ఈ పాయింట్స్‌ సంగతేమిటీ? వీటిని చాలా అరుదుగా ఉపయోగిస్తున్నందు వల్ల, మిగతా సమయమంతా పనిచేయకుండా ఉంచుతున్నారా?’ అడిగాడు హ్యేజెల్‌. 
‘అవును. రెండు పట్టాల కింద నేలమీద చెక్క దిమ్మెలకు బోల్టులతో, మేకులతో  బిగిస్తారు. ఓహ్‌! ఇటు చూడండి.. ఈ లీవర్లు ఇప్పటికీ ఉపయోగించినట్లు లేదు. లీవర్స్‌కు తాళం వేసుంది. ఇదుగో తాళం చెవి రంధ్రం. ఇటువంటి వింతను నేనెప్పుడూ చూసుండలేదు, మిస్టర్‌ హ్యేజెల్‌!’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.
హ్యేజెల్‌ అలాగే పాయింట్స్‌ వంకా, లీవర్ల వంక చూస్తూండి పోయాడు. పాయింట్లను, లీవర్లను పనిచేయిస్తే, రైల్‌ ట్రాక్‌ మారి సైడింగ్‌ ట్రాక్‌ పైకి ట్రైన్లను మళ్ళించవచ్చని అతనికి తెలుసు. కానీ, ఇక్కడ ఆ మళ్ళింపు ఎలా జరిగింది? అన్న ప్రశ్న అతన్ని వేధిస్తోంది. 
అకస్మాత్తుగా అతని ముఖం వెలిగిపోయింది. చెక్కదిమ్మెకు అమర్చిన బోల్ట్‌ను వదులుచేయడానికి తాజాగా నూనె ఉపయోగించినట్లు స్పష్టంగా కనబడింది. తరువాత అతని చూపులు లీవర్‌ హ్యాండిల్‌ మీద నిలిచిపోయాయి. మందహాసరేఖ  అతని పెదవుల మీద మెరిసి మాయమయ్యింది. 

‘అటు చూడండి! ఆ లీవరును బయటికి లాగడం చాలా కష్టం’ అంటూ ఇన్‌స్పెక్టర్‌ ఒక లీవరును చేత్తో ముట్టుకోబోయాడు. వెంటనే హ్యేజెల్‌ అతని కాలరు పట్టుకొని వెనక్కి లాగాడు. 
 ‘క్షమించండి! ఆ లీవర్లను నేను ఫోటో తీసుకుంటాను’ అంటూ వాటిని తన కెమెరాలో బంధించాడు హ్యేజెల్‌. 
‘వాటిని ఉపయోగించినట్లు లేదు కదా సార్‌!’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. హ్యేజెల్‌ మౌనంగా ఉండిపోయాడు– అతనంతటతనే తెలుసుకోనీలే అనుకుంటూ.             
‘ఇన్స్‌స్పెక్టర్‌! ఆ పాయింట్స్‌ ఉపయోగించడం వల్ల వ్యాగన్‌ ఇలా దారి మళ్ళిందని చెప్పగలను. కానీ అదెలా జరిగిందనేదే అర్థంకాని సమస్య. అయితే ఒకటి మాత్రం నిజం. ఇంతటి కార్యానికి పాల్పడినవాడు పాతనేరస్తుడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడని నిశ్చయంగా చెప్పగలను. పట్టుకొని తీరుతాం’ అన్నాడు హ్యేజెల్‌.
‘కానీ ఎలా?’ ఇన్స్‌స్పెక్టర్‌ అడిగాడు అశ్చర్యపోతూ.
‘అది ప్రస్తుతానికి చెప్పలేను. అన్నట్టు ఇన్స్‌స్పెక్టర్‌! వ్యాగను లోపలి వర్ణ చిత్రాలు యథాతథంగా ఉన్నాయి కదా?’ 
‘మనం ఈ ట్రక్కును మనతో పాటు తీసుకుపోతున్నాం కాబట్టి, మనం త్వరలోనే తెలుసుకుంటాం’ ఇన్‌స్పెక్టర్‌ బోల్టులను స్పానర్‌తో వెనక్కి తిప్పి, లీవర్లను వదులు చేశాడు. ‘ఇవి నిరాటంకంగా పనిచేస్తున్నాయి’ అన్నాడు  ఒక లీవర్ని గుంజుతూ. 
‘అహా! ఎందుకు పనిచేయవు? వాటికి ఇటీవలనే చిక్కటి నూనెతో ఆయిలింగ్‌ చేశారు’ అన్నాడు హ్యేజెల్‌.
తరువాతి ట్రైను ఆ లైనులో రావడానికింకా ఒక గంటకు పైగా ఉంది సమయం.

న్యూబరీకి తిరిగిరాగానే హ్యేజెల్‌ చెసిన మొట్టమొదటి పని ఏమంటే, తాను తీసిన ఫొటోలను డెవలప్‌ చేసి ప్రింట్లను తీయడం. బాగా స్పష్టంగా వచ్చిన ఫొటోలను స్కాట్‌లాండ్‌ యార్డ్‌లో తనకు తెలిసిన అధికారికి పంపించాడు. తరువాతి సాయంకాలం అతనికి స్టేషన్‌ మాస్టర్‌ నుండి ఒక ఉత్తరమొచ్చింది. 

వ్యాగన్‌లోని చిత్తరువులన్నీ భద్రంగా ఉన్నాయని, వాటిలో ఏ ఒక్కటీ అపహరణకు గురికాలేదని ‘లోన్‌ ఎగ్జిబిషన్‌ కమిటీ’ సభ్యులు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారణ చేసి, తమ సంపూర్ణ సంతృప్తిని వెలిబుచ్చారని, ఒక వ్యాగన్‌ సైడింగ్‌ ట్రాక్‌లోకి వెళ్ళిన సంఘటన కలిగించిన విభ్రాంతి నుండి తామింకా తేరుకోలేదని, ప్యాడింగ్‌టన్‌ నుండి ఉన్నతాధికారి ఒకరు విచారణకు వచ్చాడని, సరుకు భద్రంగా ఉంది కాబట్టి, సంఘటన జరిగినట్లు బయటకు పొక్కనీయకూడదంటూ వాళ్ళను అభ్యర్థించాడని, దీన్ని గోప్యంగా ఉంచవలసిందిగా హ్యేజెల్‌ని కూడా కోరుతున్నామని ఆ జాబు  సారాంశం. 

‘చాలా ఆశ్చర్యంగా ఉంది’ హ్యేజెల్‌ మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు స్కాట్‌లాండ్‌ యార్డ్‌ అధికారిని కలుసుకున్నాడు.
‘మేము మా రికార్డులన్నీ వెదికాం. దొంగను గుర్తించాం. అతని అసలు పేరు ఎడ్గర్‌ జెఫ్రీస్‌. అతనికి అనేక మారుపేర్లున్నాయి. ఇంతకు ముందు నాలుగు దోపిడీలూ, ఇళ్ళకు కన్నం వేసిన నేరాలకు శిక్ష అనుభవించాడు. అతడు చేసిన దోపిడీలో రైల్వే దొంగతనం కూడా ఒకటుంది. అతని గురించి ఏమైనా వివరాలు దొరికితే మీకు తెలియబరుస్తాం. ప్రస్తుతం అతను అలెన్‌ అనే పేరుతో నివసిస్తున్నాడు’  అంటూ అలెన్‌ చిరునామా కూడా ఇచ్చారు. హ్యేజెల్‌ దాన్నొక కాగితం మీద రాసుకున్నాడు. 
మర్నాటి న్యూస్‌ పేపర్‌లో..‘‘ప్రఖ్యాత చిత్రకారుడు సర్‌ మురెల్‌ గిల్బర్ట్, వించెస్టర్‌లో ఒక వారంలో జరగబోవు ఎగ్జిబిషన్‌ కమిటీ సభ్యుల మీద చేసిన తీవ్ర ఆరోపణ’’ అనే శీర్షిక హ్యేజెల్‌ దృష్టిని ఆకర్షించింది.

ఆ అభియోగమేమంటే– ఆ పెయింటింగ్స్‌ అతను చిత్రించినవి కానేకావట. ఒరిజినల్‌ చిత్రాలను దాచిపెట్టి అలాంటివే నకళ్ళు తయారు చేయించి ఎగ్జిబిషన్‌ గోడలకు వేలాడదీసి మోసానికి పాల్పడ్డారట ఎగ్జిబిషన్‌ నిర్వాహక కమిటీ సభ్యులు. చాలా తెలివిగా ఫోర్జరీ చేయించారని అతని ఆరోపణ. తన ఒరిజినల్‌  పెయింటింగ్స్‌ అత్యంత విలువచేస్తాయని, తన పిక్చర్లు మార్చినందుకు నిర్వాహక కమిటీ దీనికి బాధ్యత వహించవలసి ఉంటుందని నొక్కి వక్కాణించాడు. కానీ ఆ అభియోగాన్ని తిప్పి కొట్టింది నిర్వాహక కమిటీ. రైల్వే కంపెనీ నుండి నేరుగా ఎట్లున్న పెయింటింగ్స్‌ అట్లే వచ్చాయని సమర్థించుకుంది.

‘చర్న్‌’ సంఘటన పత్రికల వాళ్ళ దృష్టికి ఇంకా పోలేదని అర్థమైంది హ్యేజెల్‌కు. రైల్వే కంపెనీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అసలు నిజాన్ని దాచారు.  హ్యేజెల్‌ ఇక ఆలస్యం చేయదలచుకోలేదు. వీలైనంత త్వరగా  విషయం రచ్చకెక్కకముందే మిస్టరీని ఛేదించాలని నిశ్చయించుకొన్నాడు. వెంటనే చిత్రకళ గురించి  క్షుణ్ణంగా తెలిసిన తన స్నేహితుణ్ణి కలుసుకొన్నాడు.

‘నీక్కావాల్సిన సమాచారం చెబుతాను. నేను కూడా ఈ సాయంకాలం పత్రికకు ఒక ఆర్టికల్‌ రాయాల్సి ఉంది. ఇంతకముందు వెలాస్క్వెజ్‌ అనే చిత్రకారుని బొమ్మ విషయం.. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాస్పదంగా మారింది. ఇటీవల సెయింట్‌ మోర్టిజ్‌ అనే పెద్దమనిషి దగ్గరున్న ‘మడోనా’ చిత్రం, వియన్నా గ్యాలరీలో ఉందని, అదే అసలైన చిత్రమని వారు యాజమాన్య హక్కుల దావా వేశారు. ఏదేమైనా, ప్రస్తుతం సర్‌ గిల్బర్ట్‌ ముర్రెల్‌ చిత్రించిన ‘ హోలీ ఫ్యామిలీ ’ అనే పెయింటింగ్‌ మాత్రం అతనిదే అని కొన్ని సంవత్సరాల క్రితం అతని పక్షంగా కోర్ట్‌ తీర్పునిచ్చింది. కాబట్టి గిల్బర్ట్‌ వద్ద ఉన్న చిత్రమే అసలైందని చెప్పడంలో సందేహం లేదు. దాని నకిలీ చిత్రమేమయిందో ఇరవై సంవత్సరాల నుంచి దాని ఆనవాళ్ళు ఇంతవరకూ బయటపడలేదు. నాకు తెలిసిందింతే. నాకు పనుంది. వస్తా’ అన్నాడు హ్యేజెల్‌ స్నేహితుడు.  

‘ఒక్క నిమిషం. ఆ నకిలీ చిత్రం చివరిసారి ఎవరి దగ్గరుండింది?’అడిగాడు హ్యేజెల్‌.
‘చివరిసారి రింగ్‌ మియర్‌ అనే ఇంగ్లాండ్‌ ప్రాంతీయాధికారి దగ్గరుండేది. ఎప్పుడైతే అది నకిలీదని తెలిసిందో అతనికి దాని పైన ఆసక్తి పోయింది. ఎవరికో కారు చౌకగా అమ్మేశాడని ఎవరో చెప్పగా విన్నాను. అయినా కాటికి కాళ్ళు చాపుకున్న ఆ ప్రాంతీయాధికారికి పెయింటింగ్స్‌ మీద పిచ్చి వ్యామోహమెందుకో?’ అన్నాడా మిత్రుడు.
‘అతని వయసు?’
‘ఎనభై ఏళ్ళు, అతడు పెయింటింగ్స్‌ అంటే పడిచస్తాడు’ చెప్పాడు మిత్రుడు.

‘అమ్మేశాడని ఎవరో చెప్పారంటే, కచ్చితంగా అమ్మేశాడని కాదుకదా దాని అర్థం? ఒక్కొక్కసారి ఈ ఔత్సాహికులంతా వింతగా ప్రవర్తిస్తారు. వాళ్ళల్లో నిజాయితీ ఉండదు. నాకు తెలిసిన ఒక పెద్దమనిషి అతని మిత్రుని ఇంట్లోనుండి కష్టపడి సేకరించిన స్టాంప్స్‌ దొంగిలించాడు. ఏం మనుషులు? ఏదేమైనా రైల్వే వ్యాగన్‌ ఎలా సైడింగ్‌ ట్రాక్‌లోకి మళ్ళిందో వెంటనే కనుక్కొని తీరాలి’ అని నిశ్చయించుకొన్నాడు హ్యేజెల్‌. స్కాట్‌లాండ్‌ వారిచ్చిన చిరునామాకు బయలుదేరాడు. అతని బ్యాగులో ఉన్న ఒక ఖాళీ కార్డ్‌ తీసుకొని దానిపై ‘సర్‌ రింగ్‌ మియర్‌ నుండి’ అని రాసుకొని దాన్ని ఒక కవరులో పెట్టాడు. అలెన్‌తో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని అక్కడున్న సేవకురాలికిచ్చి కవరు అలెన్‌కు ఇమ్మన్నాడు. వెంటనే లోపలి నుండి అనుమతి లభించింది. 
‘ఏం కావాలి నీకు?’ అడిగాడు అలెన్‌.  

‘నేను సర్‌ రింగ్‌ మియర్‌ తరఫున వచ్చాను. చర్న్‌ సంఘటన గురించి మాట్లాడ్డానికి’ ధైర్యంగా చెప్పాడు హ్యేజెల్‌. ఊహించని రీతిలో ఆ గది తలుపు మూసి తాళం చెవిని జేబులో వేసుకొన్నాడు. ఆ వెంటనే పిస్టల్‌ తీసి అలెన్‌కి గురిపెట్టాడు.. ‘చర్న్‌ అనే ప్రదేశంలో నీవు ఆ రాత్రి ఒరిజినల్‌ వర్ణచిత్రాన్ని మార్చేశావు’ అంటూ.
‘నేనే మార్చానని ఎలా తెలుసు?’ అడిగాడు అలెన్‌. 
‘నీవు పాయింట్లను పని చేయించే లీవర్‌ మీద, డబ్బాతో ఆయిల్‌ ఒంపుతున్నప్పుడు, నీ బొటనవేలికి కొంచెం నూనె అంటుకుంది. అదే చేతితో లీవర్‌ హ్యాండిల్‌ను పట్టుకొని ట్రాక్‌ మార్చావు. అప్పుడు లీవర్‌ హ్యేండిల్‌ మీద నీ వేలిముద్రలు పడ్డాయి. ఆ విధంగా నీవు చాలా తెలివి తక్కువ పని చేశావు. నేను వాటిని ఫొటో తీశాను. స్కాట్‌లాండ్‌ వారు అవి నీ వేలిముద్రలే అని నిర్ధారించారు. పాత నేరస్తుడువి కదా?’ చెప్పాడు హ్యేజెల్‌.  

లోలోపలే తనను తాను తిట్టుకుంటూ ‘ఆయన నన్ను చిత్తరువు తీసుకురావడం వరకే నియమించాడు. ఆయన పేరు బయటకు రావడం అతనికి ఇష్టం లేదు’ చెప్పాడు అలెన్‌. 
‘ఆ చిత్రాన్నెలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. ఎవ్వరిపేరూ బహిర్గతమవకుండా, అసలు విషయం చడీచప్పుడు కాకుండా సమసిపోవాలంటే అదెక్కడుందో తెచ్చివ్వాలి. రింగ్‌ మియర్‌ దగ్గరుందా?’ అడిగాడు హ్యేజెల్‌.
‘ఇంకా అతని చేతికి చేరలేదు. అదెక్కడుందో అతనికీ నాకూ మాత్రమే తెలుసు’ ఒప్పుకున్నాడు అలెన్‌.
‘అలా అయితే కాగితం మీద స్టేట్‌మెంట్‌ రాసివ్వు. ఆ పెయింటింగ్‌ సర్‌ గిల్‌బర్ట్‌కు వాపసు చేస్తే సరి. అవసరమైతేనే నీ స్టేట్‌మెంట్‌ని ఉపయోగిస్తానని మాట ఇస్తున్నాను’ అన్నాడు హ్యేజెల్‌.
కొంచెం సంభాషణ జరిగిన తరువాత అలెన్‌.. 

‘ఇంగ్లాండ్‌లోని ఆ ప్రాంతీయాధికారి ఇదంతా చేశాడు. అతను నన్నెలా కలుసుకున్నాడనే విషయం అప్రస్తుతం. ఆ పిక్చరుకు సంబంధించి నకలును అధిక ధరకు కొని ఎవరికీ తెలియకుండా పాతసామానుల గదిలో దాచాడు. తాను కొన్న నకిలీ పెయింటింగ్‌ ఎవరికో అమ్మేశాడని ప్రజలు అనుకునేలా భ్రమ కలిగించాడు. దాని అసలు చిత్రం ఎప్పటికైనా దొరుకుతుందనీ, తన దగ్గరున్న నకిలీ పిక్చర్‌ని తొలగించి, అసలైన చిత్రాన్ని తన స్వంతం చేసుకోవాలనీ ఎంతో ఆశపడ్డాడు. అతనికి పెయింటింగ్సంటే విపరీతమైన పిచ్చి. అసలైన చిత్రాన్ని చోరీ చేసి అతనికివ్వడానికి నేను ఒప్పుకున్నాను. ఈ పనిలో ముగ్గురం ఉన్నాం. అసలు చిత్రం ఏ ట్రైనులో రవాణా కానుందో సులభంగా తెలుసుకున్నాం. ట్రైన్‌ ట్రాక్‌ గ్రౌండ్‌ ఫ్రేముని మారు తాళం చెవిని ఉపయోగించి తెరిచాం. ఇక బోల్టులు తీయడం పెద్ద కష్టమేమీ కాదు. నేననుకున్నట్టుగా పని జరగడానికి వీలుగా పాయింట్స్‌కు బాగా ఆయిల్‌ పట్టించాను. ఒకడు సైడింగ్‌ వద్ద.. వ్యాగన్‌ ట్రాక్‌ మీద పరుగులిడుతున్నప్పుడు సంకేతాలివ్వడం కోసం పక్కన పొదలమాటున సిధ్ధంగా ఉన్నాడు. నేను పాయింట్స్‌ను అనుగుణంగా కదిలించడానికి తయారుగా ఉన్నాను.

మరొకడు ఒక వ్యాగన్‌ లోపల రెండు గట్టి పొడవైన మోకు తాళ్ళతో టార్పాలిన్‌ కింద నక్కి ఉన్నాడు. రెండు తాళ్ళ చివరల ఇనుప కొక్కేలున్నాయి. ట్రైన్‌–అప్టన్‌ స్టేషన్‌ వదలగానే అతను పని మొదలు పెట్టాడు. గూడ్స్‌ ట్రైన్లు చాలా నిదానంగా ప్రయాణిస్తాయి. అందువలన కావాల్సినంత సమయముంటుంది. ట్రైన్‌ వెనుకనున్న బ్రేక్‌ వ్యాన్‌ నుండి లెక్కవేసుకొంటే మేము తప్పించబోయే వ్యాగన్‌ నంబరు 5. మొట్ట మొదట అతడు 4వ వ్యాగన్‌ నుండి 6వ వ్యాగన్‌ వరకు తాడు చివర్లకున్న కొక్కేలను వ్యాగన్ల రెండు పక్కల చివర్లకు బిగించాడు. ఇప్పుడు అతని చేతిలో మిగిలిన తాడు చుట్ట ఉంది. తరువాత అతను వ్యాగన్‌ నంబర్‌ 5 మీద కూర్చొని  4వ నంబరు వ్యాగన్‌ నుండి లింకును విడగొట్టాడు. అప్పటికే అతను రైల్వే కప్లింగ్‌ సిబ్బంది సహాయం తీసుకొని ఉన్నాడు. కాబట్టి పని సులభమైంది. అప్పుడు చేతిలో మిగిలున్న తాడును వదిలాడు అది బిగువుగా అయ్యేదాకా. తరువాత రెండవతాడు చివరనున్న కొక్కేన్ని 5వ వ్యాగన్‌ మొదలు నుండి 6వ వ్యాగన్‌ చివర్న తగిలించి, రెండింటిమధ్యనున్న లింకు తొలగించి, 5వ దానిని 6వ వ్యాగన్‌ నుండి విడగొట్టాడు. మిగిలిన తాడు చుట్టను–బిర్రుగా బిగుసుకునే దాకా విడిచిపెట్టాడు.

ఇప్పుడు చూడండి జరిగిన తమాషా. ట్రైను చివరి వ్యాగన్లు– 4 నుండి 6 దాకా పొడవైన తాడుసహాయంతో లాగబడుతుంటే.. వాటి నడుమ ఖాళీ జాగా వదులుతూ ఆ జాగాలో 5వ నంబరు వ్యాగన్‌– 6వ వ్యాగన్‌ నుండి చిన్న తాడు సహాయంతో లాగబడుతున్నది. అప్పుడతడు చేతిలో పదునైన కత్తిపట్టుకొని 6వ వ్యాగన్‌ మీద సిద్ధంగా ఉన్నాడు. మిగతా పని చాలా సులభం. నేను ట్రాక్‌కు దగ్గరగా నిలబడి లీవరును పట్టుకొని సిద్ధంగా ఉన్నాను. ఇంజను ముందుకెళ్ళిపోయిన తక్షణం నేనింకా ముందుకొచ్చాను. 6వ నంబరు తరువాత జాగా ఏర్పడగానే, దాన్ని (లీవరును) వెనక్కి లాగాను. 5వ వ్యాగన్‌ సైడింగ్‌ ట్రాక్‌ మీదుగా పక్కకు  మళ్ళింది. అదే సమయంలో నా అనుచరుడు తాడును అతివేగంగా తెగ్గోశాడు.

ట్రైన్‌ అక్కడ చాలా నెమ్మదిగా వెళుతోంది. అలా వెళ్తుండగా నేను వెంటనే లీవరును వెనక్కెత్తి మళ్ళీ య«థాస్థితికి తెచ్చాను. ట్రైను ప్రధాన పట్టాలపై మామూలుగానే వెళ్ళిపోయింది. కాంప్టన్‌ స్టేషన్‌లోకి ప్రవేశించేముందు కొంచెం ట్రాక్‌ తగ్గులో ఉండడం వల్ల వెనకున్న నాలుగు వ్యాగన్లూ ప్రధాన ట్రైను దగ్గరగా రాసాగాయి. అప్పుడు నా అనుచరుడు,  చేతిలోని తాడును బలంగా లాగి 4వ వ్యాగనుకు 6 వ వ్యాగన్ను అనుసంధానించాడు. కాంప్టన్‌ స్టేషన్లోకి వెళ్ళేటప్పుడు ట్రైను చాలా మందగమనంతో పోతున్నందువల్ల నా అనుచరుడు ట్రైను మీద నుండి కిందకు దూకేశాడు. అదీ జరిగింది’ అని చెప్పడంతో హ్యేజెల్‌ కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి.                                         
‘ఇంతవరకూ ఇటువంటి సంఘటన రైల్వే చరిత్రలో జరగలేదు. చాలా తెలివైన ప్రణాళిక. నిర్వహణ అద్భుతంగా ఉంది. మరి అసలైన వర్ణచిత్రాన్నెక్కడ దాచావ్‌?’ అడిగాడు హ్యేజెల్‌.
‘జరిగిన విషయాన్ని ఎప్పుడూ ఎవరికీ వెల్లడిచేయనని భరోసా ఇస్తే చెబుతాను’ అన్నాడు అలెన్‌.
అందుకు హ్యేజెల్‌ ఒప్పుకున్నాడు. అతడు అన్ని వివరాలూ చెప్పాడు. 
అసలు వర్ణ చిత్రాన్ని సర్‌ గిల్బర్ట్‌ మురెల్‌కు అప్పగించారు. ప్రతిష్ఠపోతుందనే ఉద్దేశంతో రైల్వే వాళ్ళు ఆ సంఘటన బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు..‘ఎందుకైనా మంచిది. నకిలీ చిత్రాన్నే ఎగ్జిబిషన్‌లో ఉండనివ్వండి’ సలహా ఇచ్చి.
‘ఏదేమైనా ఇటువంటి తెలివైన నేరస్థుడు శిక్షించబడి ఉండాల్సింది’  అని తనలో తనే అనుకున్నాడు– హ్యేజెల్‌.
ఆనందోత్సాహ సంద్రంలో మునిగిన సర్‌ గిల్బర్ట్‌ మురెల్‌..  హ్యేజెల్‌ను విందుకు ఆహ్వానించాడు.
‘చాలా సంతోషం. అయితే ఒక విన్నపం. భోజనానికి ఉపక్రమించే ముందు ఇక్కడ కొంచెం సేపు నేను వ్యాయామం చేసుకోవడానికి అనుమతించండి. తిన్నది అరిగించుకోవాలంటే అందుకు తగ్గ వ్యాయామం అవసరం అనే అంశాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి’ అన్నాడు హ్యేజెల్‌.

ఆంగ్ల మూలం : విక్టర్‌ వైట్‌ చర్చ్‌ 
అనువాదం: శొంఠి జయప్రకాష్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement