ఈవారం కథ: కొమ్ముల బర్రె | Kommula Barre Telugu Short Story By Kondi Malla Reddy | Sakshi
Sakshi News home page

ఈవారం కథ: కొమ్ముల బర్రె

Published Sun, Aug 8 2021 3:13 PM | Last Updated on Sun, Aug 8 2021 3:13 PM

Kommula Barre Telugu Short Story By Kondi Malla Reddy - Sakshi

‘నీ సోపతులల్ల మన్నువొయ్య. నడీడుకచ్చిండు.. నెత్తెంటికెలు తెల్లవడ్డయి. తనెత్తు పిల్లలైరి. గింత సోయి లేకపోతె ఎట్ల? ఎవడు పిలిస్తె వానెంబడివడి పోవుడేనాయె. కుత్కెలదాక తాగుడు, అద్మరాత్రిదాక తిరుగుడు. ఎల్లెంకల సాపుక పండుడు. ఇల్లు ఇరువాటం యాన్నన్నవోని.. నీసట్టంకు అగ్గిదల్గ.. నాగండాన దాపురమైండ్రు’ వాకిట్లో అంట్లు  తోముతున్న రాధవ్వ గిన్నెల్ని కోపంతో విసిరి కొట్టింది.

‘అయ్యలు కూడవెట్టిన ఆస్తుల్లేకపాయె. తాతలు సంపాయించిన జాగలు లేకపాయె. గిట్లపట్టి లేకుంట జేత్తె  ఎట్ల ముంగట వడ్తది సంసారం? వొక్కదాన్ని ఎంతకని ఏడ్వాలె ఈ లేకి కొంపల! పాలిచ్చెబర్రె.. ఆయింత మూతి మీద తన్నిపాయె. చెంబెడో.. గిలాసెడో ఇత్తె శెక్కరి శాపత్త మందమన్న ఎల్లేది. ఇగ రేపట్నుంచి బిచ్చమెత్తుకుందురు తియ్యి..’ స్వరం పెంచింది రాధవ్వ.. చాప మీద  అటూ ఇటూ దొర్లుతున్న గోవర్ధన్‌ను చూస్తూ.

‘వోబోడ్సోత్‌దానా  ఏమొర్రుతున్నవే పోరడు పొయ్యి పొయ్యొస్తే? ఎమో.. రపరప వెట్టినవు. వానికి తిక్కవుట్టిందంటె ఈపు శింతపండు జేత్తడు ఏమనుకుంటన్నవో? అన్నది అత్త రామవ్వ.. కోడల్ని దబాయిస్తూ.
‘అవ్వో! బాగనే పొడుసుకరావట్టెనో..!  ఉద్దార్కంజేసిండని కొడుకును మాట అననియ్యది’ అన్నది రాధవ్వ వెటకారంగా అత్త వైపు చూస్తూ.
‘నీయక్క.. నోర్ముయ్యకపోతె దౌడపండ్లు రాలగొడ్త ఏమొర్రుతన్నవే? పీకితెపీకని తియ్యి. నీ అయ్య అర్ణం కొట్టిచ్చినాడే బర్రెను? తెల్లారెటల్లకు అసొంటియి పదిబర్లను కొన్కత్త. మూస్కొని పనిచూస్కొ’ అంటూ అటు తిరిగి పడుకున్నాడు గోవర్ధన్‌.
‘నెత్తిల పుండుకు సమరు లేదుగని ఎడ్ల కొట్టంల దీపం పెట్టొస్త అన్నడట ఎన్కటికెవడో నీ అసోంటోడు. గీ పొంకాలకేం తక్కువ లేదు’ అంటూ విసురుగా వంటింట్లోకి నడిచింది రాధవ్వ.
తల్లి కోసం ఎదురు చూసి, చూసి అరుస్తున్న దుడ్డె గొంతు బొంగురు పోతోంది. ఒకవైపు దుడ్డె అరుపులు.. ఇంకో వైపు  రాధవ్వ తిట్లతో గోవర్ధన్‌ తల గిర్రున తిరిగింది.

‘నితీషూ.. వోరి నితీషూ..
కొద్దిగాగినంక జెర బాయి మొకాన వొయ్యి బర్రెను ఇడ్శి పెట్టుబిడ్డా! మల్ల పగటాల్ల వరకు  ఎనుకకు మర్రుత గని..’ అంటూ  అంగీ గుండీలు పెట్టుకుంటూ  చెప్పులు తొడుక్కున్నడు గోవర్ధన్‌. 
‘నీయవ్వ నాకు అన్‌లైన్‌  క్లాసులున్నయి బాపూ.. నేను బర్రె కాడికి పోనే పోను. సార్‌ తిడుతడు క్లాసులు వినాలె’ అన్నడు నితీష్‌.
‘నా తోడు బిడ్డా జెల్ది వురికస్త. నర్సయ్య మామది చిన్న పంచాది వున్నది. జక్కపురం దాక పొయ్యస్త. పోకపోతె ఏమనుకుంటడురా.. దేనిౖకైనా పోను గొడతె వురికస్తడు. అన్నిటికి ఇంట్ల మనిషిలెక్క ఆసరయెటోడు. అట్ల పొయ్యి ఇట్లొస్త. టైంకు అమ్మ గూడ లేకపాయె! ఫోను తీస్కొనిపో! బర్రెను గుడ్డంలిడ్శిపెట్టు. అదే మేస్తది. నువ్వు క్లాసులు ఇనొచ్చు ’ అన్నాడు గోవర్ధన్‌ బయటకు నడుస్తూ.

అయిష్టంగానే వొప్పుకున్నాడు నితీష్‌. బర్రెను విడిచిపెట్టి గుడ్డంల చింత చెట్టు కింద నీడకు చేరి క్లాసు విందామని ఫోన్‌lఅందుకున్నాడు. అందులో లీనమై బయట ప్రపంచాన్నే మరచి పోయాడు. ఓ గంటన్నరకు క్లాసులు అయిపోయాక పరిసరాల మీదకు దృష్టి మరల్చాడు. బర్రె కనిపించలేదు. ఎప్పుడు పోయిందో ఏమో! నితీష్‌కు భయం పట్టుకుంది. చుట్టు పక్కలంతా వెతికాడు. అక్కడున్న అందరినీ అడిగాడు. ఎవరూ జాడ చెప్పలేదు. చీకటిపడే వరకూ వెతికి ఇంటికి చేరి జాడ తప్పిన బర్రె విషయం తల్లికి చెప్పాడు. 
కూలికి పొయ్యొచ్చిన రాధవ్వ భర్త చేసిన పనికి కోపంతో తిట్ల దండకం మొదలుపెట్టింది.
నడిజాము రాత్రి దాటినాక గోవర్ధన్‌కు మెలకువచ్చింది. జరిగిన సంఘటనలన్నీ వొక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. 

‘బర్రె మ్యాత ముట్టక తిక్కతిక్క జేస్తున్నప్పుడే జెర చూస్కుంటే అయిపోయేది. పెద్ద నాయిన గూడా చెప్పిండు. పని వొత్తిల్లల్ల పడి మర్శిపొయిండు. బర్రె ఎద కచ్చినప్పుడల్ల గిట్లనే చేస్తది. దావఖానకు కొట్టుకపొయ్యి సూది ఏపిచ్చినా అయిపోవు. లేకుంటె.. జంగిట్ల తోలితె అండ్ల ఇత్తునంపోతులుండె. రెండ్రోజులైతే అదే సైరకచ్చు. ఎంత పనాయె ఎటని తిర్గాలె!’ అనుకుంటూ చింతాక్రాంతడయ్యాడు గోవర్ధన్‌. 

కొమ్ముల బర్రె చిన్నప్పుడు పాలు మరవక ముందే దాని తల్లి ఏదో బీమారి సోకి చచ్చిపోయింది. ఇది పాలు లేక తెల్లందాక పొద్దుందాంక వొకటే వొర్రుడు. నువ్వులు దంచి మ్యాకపాలల్ల కలిపి,  బల్మీటికి నోరు తెరిపిచ్చి గొట్టం పట్టి పోసేది. కొద్ది రోజులైనంక చేన్లల్ల తిరిగి ఎన్నాద్రిగడ్డలు తెచ్చిపెట్టేది. తర్వాత ల్యాతగడ్డి, పజ్జొన్నకర్రాకులు, మెల్లెగ గర్కపోసలు అలవాటు చేసి.. పసిపిల్లలెక్క కంటికి రెప్పలా చూసుకునేది. మ్యాతపట్టినంక కుదురుకుని పెయ్యి చేసింది. నల్లరంగు, దొప్పలోలె చెవులు, దుప్పిలెక్క పెద్ద పెద్ద కొమ్ములు, ముప్పావు గజం వెడల్పు వీపు.. పెయ్యినున్నగ మెరుస్తుండె. తోకనైతె భూమికి రాసుకుంట పొయ్యేంత పొడవు. ఆఖర్న  జడకు అందేంత వొత్తుగా నల్లగ నిగనిగలాడే వెంట్రుకలు ..అటూ ఇటూ తోక వూపుతూ నడుస్తుంటే సూడ ముచ్చటయ్యేది.. తోక వెంట్రుకల్లో పల్లేరుగాయలు, కూశెంగాల ముళ్లు అంటుకుంటే అన్నీ ఏరేసి శుభ్రంగా వుంచేది.

ఒక్క గోమారి కూడా పట్టకుంట పీకేసేది. రోజూ సాయంత్రం ఇంటి కొచ్చే ముందు బోరు పైపుతోని నీళ్ళు వట్టి శుభ్రంగ పెయ్యంత కడిగేది. గున్నేనుగు లెక్క  తిరుగుతుంటే.. అందరి కండ్లు దాని మీదనే. దిష్టి తగులుతుందని రాధవ్వ కుర్మదారానికి జీడి గింజలు, గవ్వలు కుచ్చి మెడల కట్టింది. పెద్ద ఈడు కూడా కాదు. రెండు ఈతలది. పొద్దుమాపు అయిదు లీటర్ల పాలిచ్చేది. ఇంటి ఖర్చంతా ఎల్లదీసేది. ఇంతకు ముందు రెండుసార్లు తప్పిచ్చుకొని పొయినా తెల్లారెవరకు అదే తిరిగొచ్చింది. ఇప్పుడు గూడా రాకపోతదా’ అనుకున్నాడు గోవర్ధన్‌. 

ఏదోకమూల సన్నని ఆశ మిణుకు మిణుకు మంటూండగా ఆ ఆలోచనల్లోంచి అతను బయటకు వచ్చేసరికి తెలవారసాగింది. తువ్వాలు భుజం మీద వేసుకొని తలుపు దగ్గరేసి.. చేతికర్ర తీసుకొని బర్రెను వెతకడానికి బయలుదేరాడు. 
పొలం దగ్గరకు వెళ్లేసరికి తెట్టన తెల్లారింది. ఎదురైన వాళ్లంతా  బర్రె గురించి అడుగుతున్నారు. 
‘బట్టల బైరనిగడ్డ మీద  సిద్ధిపేటరాజిరెడ్డిగాడు పజ్జొన్న చేను అలికిండు. పచ్చగా నవనవలాడుతుంది. నాలుగు బుక్కలు మేసినా.. నామచ్చి సత్తది. ఇల్లు మునుగుతదిరా గోవర్దనూ! ముందుగాల అటు చూసి రాకపొయినవురా.. ’ అంటూ రంగయ్య నాయిన చెప్పేసరికి గోవర్ధన్‌కు చెమటలు పట్టాయి. ఎవరో తరిమినట్టు పరుగుపరుగున అటు వైపు నడిచాడు. పచ్చ జోన్న చేనంతా తిరిగాడు. ‘ఎక్కడా మేశినట్టులేదు. చేన్ల అడుగులు గూడ  కనవడ్త లెవ్వు అంటె ఇటు దిక్కు రాలేదన్న మాట’ అని అనుకోగానే  కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టయింది గోవర్ధన్‌కు. పక్కనున్న వాళ్లను ఆరా తీశాడు.

‘నిన్న పొద్దుగుంజాముల బలపాల బోరు దిక్కు అయితే వొర్రుడు ఇనవడ్డది’ అని చెప్పారు కొంతమంది. చూసుకుంటూ చూసుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. బండరాళ్ల మధ్య మోతుకు చెట్లను కొమ్ములతో కుమ్మినట్టు ఆకులన్నీ చినిగి కొన్ని కింద రాలి పడ్డాయి. గిట్టలతో మట్టిని గీరినట్టు అచ్చులు కనబడ్డాయి. మూత్రం పోసినట్టు మడుగు కట్టిన ఆనవాలుంది. పెద్ద పెండకడీ కనిపించింది గోవర్ధన్‌కు. ప్రాణం లేచొచ్చినట్టయింది. 
‘కొమ్ముల బర్రె పంచాది పెట్టుకున్నట్టు.. ఎప్పుడూ ఏదో ఒకచెట్టును కొమ్ములతో ఇరగ్గొట్టేది. తాగినా గోళెం నిండ కుడితి తాగేది. మడుగు కట్టేదాక మూత్రం పోసేది. మోపెడు గడ్డిమేసి.. తట్టెడు పెండవెట్టేది.. గివన్నీ జూస్తే  కచ్చితంగా బర్రె ఇటుదిక్కే ఎల్లిందన్నట్టు’ సీతను వెతుకుతూ వెళ్లిన రాముడికి చిన్న ఆనవాలు దొరికినట్టు గోవర్ధన్‌కు ఆశ చిగురించింది. 

దూరంగా పశువులు కనబడుతుంటే అటువైపు నడిచాడు గోవర్ధన్‌. పశువుల కాపరిని అడిగాడు.. ‘నిన్న సాయంత్రం బాపుదొర కంచెలకెళ్ళి బర్రె తిరిగినటు’గా చూచాయగా చెప్పిండు. 
చెట్టూపుట్టా చుట్టూ గాలిస్తూ.. వెళ్తున్న గోవర్ధన్‌కు వొర్రెలో దిగబడిన గిట్టల గుర్తులు కనిపించాయి. 
‘ఇవి ఖచ్చితంగా కొమ్ముల బర్రెవే! వెడల్పుగా, కాగితం మీద ముద్ర గొట్టినట్టు  స్పష్టంగా అగు పిస్తున్నయి. అంటే ఇటువైపే ఎల్లుంటది’ అనుకున్నాడు. 

అలా కొంత దూరం అడుగులు చూస్తూ వెళ్ళినప్పటికీ  అవి మట్టితడిగా వున్నంత వరకే కనిపించాయి. వొర్రె దాటాక గోవర్ధన్‌ ఆశలు ఆవిరైపోయాయి. పొద్దు నెత్తి మీది కొచ్చింది. సూర్య కిరణాలు సూదుల్లాగ పొడుస్తున్నాయి. కళ్లకు చీకట్లొస్తున్నాయి. నడిచే వోపిక లేదు. మొఖం కూడా కడగ కుండా పక్కబట్టలోంచి లేచినవాడు లేచినట్టే బయలుదేరాడు. తెలియకుండానే పూట గడిచి పోయింది. కడుపులో ఏమన్నా పడితే తప్ప కాలు కదలని పరిస్థితి. ఆయాసపడుతూ బండ్ల బాటకొచ్చాడు. ఊర్లోకి వెళ్తున్న ఓ రైతును ఆపి బండి ఎక్కి ఇంటి మొహం పట్టాడు గోవర్ధన్‌. 
రాత్రి తిట్టనైతే తిట్టింది కానీ రాధవ్వ మనసు మనసులో లేదు. ఒక మబ్బున నోట్లో మంచి నీళ్లు కూడా పోయకుండా వెళ్లినవాడు.. మిట్ట మధ్యాహ్నం అయినా రాకపోయే సరికి  ఆందోళన అలుముకుంది. ‘ఆకలికి అసలే వోర్సుకోడు. పాపపు నోటితోని తిట్టరాని తిట్లు తిడితి. నా నోరు పాడుగాను’ అనుకున్నది.

‘వాడెమన్న శిన్నపిలగాడాయే ? వాడే వత్తడు తియ్యి . నువ్వైతె బుక్కెడంత తినుపో.. ఎంత సేపుంటవు’ అంటూ రామవ్వ .. కోడలికి సర్దిచెబుతుందో లేదో.. ఇంట్లోకి అడుగుపెట్టాడు గోవర్ధన్‌. వచ్చీరాంగానే కాళ్లు, చేతులు కడుక్కొని కూర్చున్నాడు.. అలసట తీర్చుకుంటున్నట్టుగా. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాధవ్వ పళ్లెంలో అన్నం పెట్టుకొచ్చి గోవర్ధన్‌ ముందు పెట్టింది.
ఆకలి మీదున్న గోవర్ధన్‌ పెద్ద పెద్ద ముద్దలతో గబగబా తినసాగాడు. పది నిముషాల వరకు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది.
 ‘ఏమన్న మతులావు దొరికిందా’ మెల్లగా కదిలిచ్చింది రాధవ్వ.
 ‘ఎవ్వన్నడిగినా ఇక్కడ చూసినం..  అక్కడ కనవడ్డది అంటండ్రుగని కండ్లనిండ చూసినోడు ఎవడు లేడు. విఠలపురం పొలిమెర దాక పొయ్యచ్చిన. అదెప్పుడో దాటిపొయినట్టున్నది ’ చెప్పాడు గోవర్ధన్‌ నిరాశగా.
‘నువ్వేం పికరు వడకు.. బెండ్లబాలక్క దగ్గర వల్లు పట్టిచ్చుకచ్చిన. అది తూర్పు మొకాన్నే తిరుగుతందట. తప్పక దొరుకుతదని చెప్పింది.  మైసవ్వతల్లికి ముక్కుపుల్ల తీసి ముడుపు గట్టిన. మన సొమ్ము యాడికిపోదు. నువ్వు రందిల వడకు’ గోవర్ధన్‌కు ధైర్యం చెప్పింది రాధవ్వ. 
 ‘సరే తియ్యి మనకు బాకి ఉంటె దొర్కుతది లేకపోతె లేదు. ఏంజేత్తం’ అంటూ భోజనం ముగించాడు గోవర్ధన్‌.

రాధవ్వ చెప్పినట్టు తూర్పు దిక్కున మాచాపురం పొలిమెర దాక వెళ్లాడు గోవర్ధన్‌. మొక్కజొన్న చేనుల్లో కలుపు తీస్తున్న వాళ్ల దగ్గర వాకబు చేశాడు. ‘నిన్ననైతే ఎవల్దో బర్రె లింగారెడ్డి పటేలు తుకంల పండి పొర్రిందట.. నాలుగు సంచుల వడ్లమొలక కరాబైందట. దొర్కవట్టి బంజారు దొడ్లె కట్టేశిండ్రట. ఆగ్రమైన కోపం మీదున్నడు. పాయెమాలు కట్టెదాక ఇడ్శిపెట్టడు. అంతేగాదు, బర్రె ఎవన్దోగని వాడైతె దొర్కాలె.. వాని సంగతి చెప్తా అని ఎదురు చూస్తండు.. మైలపోలు తీస్తడుపో’ అని చెప్పింది ఒక రైతు కూలి. గోవర్ధన్‌కు వెన్నులో వణుకు పుట్టింది. ఇంతకు ముందు కూడా లింగారెడ్డి గురించి విన్నాడు. ‘మొండోడు..వొట్టి కసిరెగాడు..ఎంతకైనా తెగిస్తడు. అయితేంది, పడితె రెండు దెబ్బలు పడితెవాయె..జర్మానా ఎంతైనా కడితెవాయె.. కాళ్ళో.. కడుపో పట్టుకొని బతిమిలాడ్తెవాయే.. నా బర్రె దొరికితె చాలు’  అనుకొని ఊరి వైపు నడిచాడు. 

కచ్చీరు దగ్గర జనం గుమిగూడారు. దారి తీసుకుంటూ  ముందుకు వెళ్ళిన గోవర్ధన్‌ కుర్చీలో కూర్చున్న పెద్దమనిషికి తను వచ్చిన పని చెప్పాడు. 
గోవర్ధన్‌ను ఎగాదిగా చూసిన అతను ‘ఏమయ్యా.. గంత సోయిలేకుంట ఎట్లుంటరయ్యా.. కడుపుకు అన్నం తింటలేరయ్యా? నోర్లేని పసులను  మంచిగ కట్టేసుకోవాలె. ఓకంట కనిపెట్టుకోవాలె. వాటికి ఏమెర్క..యాడ పచ్చగ కనవడ్తె అటే పోతయి. మనం మనుసులం గదా జ్ఞానం ఉండాలె. ముందుగాల్నైతె చూసుకపో నీ బర్రె వున్నదేమో!’ అంటూ మస్కూరిని పురమాయించాడు బంజారు దొడ్డి గేట్‌ తెరవమంటూ. అతని మాటలతో గోవర్ధన్‌కు అరికాలి మంట నెత్తికెక్కింది. తమాయించుకున్నాడు.. ‘ఏంజేత్తం! ఊరుగాని ఊరు వానికి స్థానబలముంటది. ఇది తాను పంచాది పెట్టుకునే సమయం కాదు.. వోపిక కూడా లేదు’ అనుకుంటూ. 

లింగారెడ్డి ఆ పక్కనే కూర్చున్నాడు. రెండు కళ్లల్లో ఎర్రటి నిప్పులు రగులుతున్నట్టు కనపడుతున్నాయి. దొరికితే గొంతు కొరుకుదామన్నంత కసిగా చూస్తున్నాడు గోవర్ధన్‌ వైపు. భయపడుతూనే బంజరు దొడ్డి వైపు నడిచాడు మస్కూరి వెనకాలే గోవర్ధన్‌.  లోపల అతని కళ్లు కొమ్ముల బర్రె కోసం వెతక సాగాయి ఆత్రంగా. అప్పటికే అందులో చాలా బర్లున్నాయి. దారి తీసుకుంటూ వెళ్ళి మూలమూలనా గాలించిండు. పదినిముషాల తర్వాత నిరాశగా బయటకు వచ్చాడు. ప్రశ్నార్థకంగా చూస్తున్న పెద్దమనిషికి అడ్డంగా తలూపుతూ సమాధానం చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాడు గోవర్ధన్‌. వెదుక్కుంటూ వెదుక్కుంటూ సలేంద్రిదాక చేరుకున్నాడు.  

ఊరు బయట.. ఒక పండు ముసలాయన జీవాలను కాస్తున్నాడు. అతని దగ్గరకు వెళ్లి ‘పెద్దయ్యా.. ఇటెక్కడన్న ఎనుపది కనవడ్డాదే’ అడిగాడు గోవర్ధన్‌. ‘ఎట్లుంటది బిడ్డా..’ తిరిగి అడిగాడు ఆ ముసలాయన ఎండపొడ నుంచి తప్పించుకునేందుకు ఎడమ చేతిని నొసటికి అడ్డం పెట్టుకుంటూ.  కొమ్ముల బర్రె ఆనవాళ్లన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు గోవర్ధన్‌. ‘ఏమో..నిన్న ఎగిలివారంగనైతే ఒకSబర్రె ఊరవతల ట్రాన్స్‌ఫార్మర్ల కొమ్ములు ఇరికి షాక్‌ కొట్టి సచ్చిపొయిందట.. సూడుపో.. బిడ్డా! ఇంకా కరెంటోల్లు రాలేదట. అట్లనే వుంచిండ్రట’ చెప్పాడు ముసలాయన.

గోవర్ధన్‌ ప్రాణం జల్లుమన్నది. కాళ్లుచేతులు చల్లబడ్డాయి. ‘నా బర్రె అయితె కాదుగదా! దీని కొమ్ములైతే పొడుగే వుండె. కొమ్ములతోని చిమ్ముడు అలవాటుండె. తన బర్రె అయితే కావొద్దని’ మనసులో కోటి దేవుళ్లకు మొక్కుకుంటూ ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గరకి చేరుకున్నాడు. అక్కడి దృశ్యం చూసి చలించిపోయిండు గోవర్ధన్‌.  నాలుగు కాళ్ళు బార్లాచాపి పడుంది బర్రె. నిన్ననగా చనిపోవడం వల్లనేమో కడుపు వుబ్బి రెండుకాళ్ళు పైకిలేచి వున్నాయి. నాలుక బయటకు వచ్చి రెండు దవడల మధ్య ఇరుక్కొని పోయింది. ఆ భయానక దృశ్యాన్ని చూడలేక పోయాడు. చచ్చిపోయే ముందు ఎంత నరకం అనుభవించిందో.. ఊహించుకుంటేనే ఒళ్లు జలదరించింది అతనికి. ‘పాపం ఎవరిదో బర్రె.. నాలాగే ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో యజమాని’ అని బాధపడుతూ ‘నా కొమ్ముల బర్రెకైతే ఇట్లాంటì æపరిస్థితి రాకూడదు’అనుకుంటూ వెనుదిరిగాడు గోవర్ధన్‌.

అలాగే రెండో రోజుకూడా వెతుకులాట మొదలు పెట్టాడు. తిండిలేదు. నిద్రలేదు. పిచ్చి పట్టినట్టు ఒకటే తిరుగుడు. పోట్రవుతులు తాకి కాలివేళ్ళకు నెత్తురు కారుతోంది. ముండ్ల కంపలు చీరుకపొయ్యి కాళ్లుచేతులకు గీతలు పడ్డాయి. నిరాశ, నిస్పృహలు  ఆవరిస్తున్నా కొమ్ముల బర్రె రూపం కండ్ల ముందు కదలాడుతుంటే వదులు కోవాలనిపించలేదు. ఇంటి వద్ద పాలకోసం అలమటిస్తున్న దుడ్డె మెదిలేసరికి చిన్నప్పటి కొమ్ములSబర్రె గుర్తొచ్చి గుండె బరువెక్కి గోవర్ధన్‌ కాలు ముందుకే కదిలింది. సలెంద్రి, కమ్మర్లపల్లె, అల్లిపురం ఇలా ఊర్లకూర్లు దాటి పోయాడు. మూడోరోజు సాయంత్రం అయినా ఆచూకీ లేదు.  వెదకటం ఆపేద్దామని మొదటిసారి అనిపించింది గోవర్ధన్‌కు. మూడు రోజులుగా అలుపెరుగని ప్రాణం మెత్తబడ్డది. ‘పొద్దు గూట్లెవడ్డది. ఇప్పుడు వెనుకకకు మర్లినా  ఇంటికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిదైతది’ అనుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. యెల్లాయపల్లె, కొచ్చెగుట్టపల్లె, రంగాయపల్లె.. ఊరూరూ ఆరా తీసుకుంటూ సొంతూరు చేరుకునే సరికి రాత్రి పది గంటలయింది. ఎప్పటిలానే ఇంటి ముందు నలుగురైదుగురు ముచ్చట పెడుతూ ఎదురుచూస్తున్నారు. తను వాకిట్లోకి రాగానేlరాధవ్వ  ఇంట్లోకి నడిచింది. 

తెల్లవారు జాము  నాలుగవుతుంది.  ఇంటి వెనుక దిడ్డి దర్వాజ దగ్గర ఏదో అలికిడి అవుతున్నట్టనిపించి ఒక్కసారిగా మెలకువ వచ్చింది గోవర్ధన్‌కు.  కళ్ళు నులుముకుంటూ లేచి బయటి లైట్‌ వేశాడు. గొళ్ళెం తీసి తలుపు తెరిచిన అతను నిశ్చేష్టుడయ్యాడు. ‘నిజమా.. భ్రమా..’ అనుకుని చేయి ముందుకు చాచాడు. వెచ్చగా తగిలింది ఊపిరి. కొమ్ముల బర్రె చెవులూపుతూ తదేకంగా తనవైపే చూస్తోంది. సంతోషం పట్టలేక కొమ్ముల బర్రె మూతిని రెండు చేతుల్లోకి తీసుకుని ఆర్తిగా తడిమాడు. సన్నగా అరిచింది బర్రె. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు ఇంట్లోకి పరుగెత్తుకెళ్లాడు. గోళెంలోని కుడితిని బకెట్లో నింపుకొని తెచ్చి బర్రె ముందు పెట్టాడు.  

పూర్తిగా పీల్చే వరకు కుడితిలో ముంచిన మూతిని పైకెత్తలేదు బర్రె. అలా రెండు, మూడు బకెట్లు తాగింది.  మూతికంటిన తవుడును నాలుకతో అద్దుకుంది. ప్రతిరోజూ సాయంత్రం అది కుడితి తాగింతర్వాతనే గుంజ దగ్గరికి నడుస్తుంది. బయటకొచ్చిన రాధవ్వ ఆ దృశ్యం చూసి ఆనందం పట్టలేక పరుగుపరుగున  దేవుడి పటాల ముందుకెళ్లి కళ్లు మూసుకొని చేతులు జోడించి నిలబడింది. అప్పటికే తల్లి వాసన పసిగట్టిన దుడ్డె అరుస్తూ మొగురం చుట్టూ తిరుగసాగింది. గోవర్ధన్‌ వచ్చి  తలుగు తప్ప దియ్యంగనే తల్లి దగ్గరకు ఉరికిపోయింది దుడ్డె. ‘నీ కడుపుగాల పోరన్ని ఎంత తిప్పలవెడితివే? పెసరిత్తు పట్టకుంట తిన్నది ఎవని శేను ముంచెనో? మల్ల ఏమెర్కలేని సొన్నారోలె సూత్తంది’ అంటూ చేతి కర్రతోని గడ్డిగుంజ దగ్గరికి జరిపింది రామవ్వ. ఆ మాటలన్నీ లీలగా వినపడుతుంటే కలా.. నిజమా.. అనుకుంటూ మెల్లగా  దుప్పటి పక్కకు జరిపి వాకిట్లోకి చూశాడు నితీష్‌. 
-కొండి మల్లారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement