Short Story
-
బౌద్ధవాణి: మణి–దీపం!
వేసవి ఎండ తీవ్రంగానే ఉంది. కానీ ఆ మామిడి తోటలో చల్లగానే ఉంది. ఆ మామిడితోట వేణువనానికి ఒక మూలన ఉంది. ఆ తోట మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద విశాలమైన అరుగు. ఆ అరుగు దగ్గరకు నెమ్మదిగా, మందహాసంతో నడిచి వచ్చాడు బుద్ధుడు. ఆయన రాకను గమనించాయి తోటలో ఉడతలు. మనిషి అలికిడి తగిలితే ΄ారి΄ోయే ఉడతలు, బుద్ధుణ్ణి చూస్తే దగ్గరకు వచ్చేస్తాయి.అది ఎప్పటినుండో వాటికి అలవాటు. భిక్షా΄ాత్రలోంచి కొన్ని పళ్ళు తీసి అరుగు పైన ఒక పక్కన చల్లాడు. అవి కుచ్చుతోకలు విప్పుకుని, పైకెత్తుకుని వచ్చి, పండ్లు ఏరుకుని తినసాగాయి. కొంత సమయం గడిచింది.సకుల ఉదాయి అనే పరివ్రాజకుడు వచ్చాడు. బుద్ధునికి నమస్కరించి కూర్చున్నాడు. అతను రాగానే కొన్ని ఉడతలు చెట్లెక్కాయి. వాటిని చూసి– ‘‘భగవాన్! మీ కరుణ అమోఘం. ఉడతలు కూడా మిమ్మల్ని మిత్రునిగా భావిస్తాయి. ఇది విచిత్రం. మీ జీవ కారుణ్యానికి మచ్చుతునక. మీకు మరోమారు ప్రణమిల్లుతాను’’ అని వంగి నమస్కరించాడు. ‘‘సకుల ఉదాయీ! వచ్చిన విషయం?’’ అని అడిగాడు బుద్ధుడు. ‘‘మా గురువుగారు నిగంఠ నాధుల వారు నిన్న ‘పరమ సత్యం, పరమ వర్ణం’’ అంటూ ‘‘పరమం’’ గురించి చె΄్పారు. మీ దృష్టిలో పరమ వర్ణం ఏది? అని అడిగాడు. ‘‘ఉదాయీ! పరమం అంటే?’’‘‘మీకు తెలియంది కాదు. దేని కంటే ఉన్నతమైంది మరొకటి ఉండదో... అదే పరమం’’ ‘‘నీకు ఈ లోకం ఎంత తెలుసు. అందులో ఇదే పరమం అని ఎలా నిర్ణయిస్తావు? నూతిలోని కప్పకి నుయ్యే ప్రపంచం. చెరువులోని చేపకి చెరువే ప్రపంచం. ఈ అనంతమైన విశ్వానికి హద్దులు ఎలా గీస్తావు?’’ అని అడిగాడు భగవానుడు. సకుల ఉదాయి మౌనం వహించాడు.‘‘ఉదాయీ! ఒక చీకటి గదిలో ఒక పసుపురంగు కంబళిలో ఒక సానబెట్టిన మణి ఉంది. అది ఆ చీకటిలో ప్రకాశిస్తుంది. అంతలో ఆ గదిలోకి ఒక మిణుగురు పురుగు వచ్చింది. అప్పుడు ఆ మణి వెలుగు ఎక్కువ ప్రకాశంగా ఉంటుందా? మిణుగురు వెలుగా?’’ అని అడిగాడు. ‘‘భగవాన్! మిణుగురు వెలుగే మిగుల ప్రకాశం’’ అన్నాడు ఉదాయి.‘‘ఇందులో ఒక వ్యక్తి నూనె దీపం తెచ్చాడు. అప్పుడు ఏ వెలుగు ప్రకాశం?’’‘‘దీపం వెలుగే భగవాన్!’’ ‘అలా ఉదాయీ! దీపం వెలుగు కంటే నెగడు వెలుగు ప్రకాశం. దాని కంటే వేగుచుక్క వెలుగు, దానికంటే చంద్రుని వెలుగు, దానికంటే సూర్యుని వెలుగు ప్రకాశం.... ఉదాయీ! సూర్యుని కంటే ప్రకాశవంతమైన వెలుగులు కూడా ఉంటాయి.’’ అన్నాడు. ఉదాయి మనస్సు తేటబడింది. ఆ తేటదనం అతని ముఖంలోంచి తొంగి చూస్తోంది! ఉడతలు కిచకిచ మంటూ బుద్ధుని దగ్గరకు వచ్చాయి. ఆయన ΄ాత్రలో నుంచి మరికొన్ని పళ్ళను వాటిముందు ΄ోశాడు. అవి వాటి పనిలో మునిగి ΄ోయాయి. ‘‘ఉదాయీ! మిణుగురు పురుగు కంటే తక్కువ ప్రకాశించే మణి వెలుగునే ‘పరమం’ అనుకుంటున్నావు? అన్నాడు.‘విజ్ఞానం, విశ్వం, అన్నీ అనంతాలే’ అని గ్రహించాడు. సకుల ఉదాయీ! బుద్ధునికి ప్రణమిల్లాడు! అతని ముఖంలో అనుమాన ఛాయలు తొలిగాయి. సంతోష కాంతులు వెలిగాయి! దోసిలి చాచాడు. బుద్ధుడు కొన్ని పండ్లను అతని దోసిట్లో ΄ోశాడు. ఉదాయి, కొద్దిగా ముందుకు వంగి ఉడతలకు దోసిలి చూ΄ాడు. అవి అతని ముఖం కేసి చూశాయి. ధైర్యంగా దోసిలి లోని పండ్లు అందుకున్నాయి. – డా. బొర్రా గోవర్ధన్ -
Children's Story: ఉత్తమ శిష్యుడు! 'మేము సర్వసంగ పరిత్యాగులం'..
కౌశంబీ ఆశ్రమంలో విద్య అభ్యసించిన తరువాత విద్యార్థులు కౌకర్ణిక ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే ఉత్తమ శిష్యుల ఎంపిక జరుగుతుంది. తంత్ర విద్యలు, శక్తి విద్యలు అక్కడే సుకేతు మహర్షి నుంచి నేర్చుకోవాలి. కౌశంబీ నుంచి కేవలం ఆరుగురు మాత్రమే ఈ దఫా ఎన్నికయ్యారు. వారందరినీ కౌకర్ణికకు పయనవమని చెప్పాడు మహర్షి సంకేత. ఆరుగురు విద్యార్థులను పంపుతున్నానని వాళ్ళల్లో ఉత్తమ శిష్యుడిని ఎంపిక చేయమని కబురు పెట్టాడు సంకేత.ఆరుగురు కౌకర్ణిక ఆశ్రమానికి బయలుదేరారు. సుకేతు మహర్షి దివ్యదృష్టితో చూసి తన శక్తితో ఓ ఉద్ధృతమైన వాగును, ఆ వాగు దగ్గర అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. శిష్యులు వాగు దగ్గరకు వచ్చారు. ఆ యువతిని చూడగానే ఆరుగురు శిష్యుల్లో ఐదుగురికి మతి చలించింది. అయినా దూరం నుంచే ‘అమ్మాయీ.. దారి తప్పుకో.. మేము వాగు దాటి వెళ్ళాలి’ అన్నాడు ఒకడు. దానికి ఆ యువతి ‘చీకటి పడుతోంది.. నేనూ వెళ్ళాలి. నన్ను వాగు దాటించండి’ అని అడిగింది. ‘మేము సర్వసంగ పరిత్యాగులం.పర స్త్రీని తాకము’ అంటూ ముందుకు కదిలారు ఆ ఐదుగురు. ‘బాబ్బాబులూ.. దయచేసి నన్ను వాగు దాటించండి’ అంటూ ఆ యువతి వేడుకుంది. ‘వాగు చాలా వేగంగా ప్రవహిస్తోంది. నువ్వు ఇంకెవరి సాయమైనా అడుగు’ అని చెప్పనైతే చెప్పారు కానీ.. ఆ యువతిని క్రీగంట గమనించడం మానలేదు వాళ్లు. ఆరవ శిష్యుడు విక్రముడు మాత్రం ‘నేను వాగు దాటిస్తాను రండమ్మా..’ అంటూ ముందుకు వచ్చాడు. మిగిలిన ఐదుగురు ‘ఆ పాపం మాకొద్దు’ అంటూ వాగులోకి దిగారు. విక్రముడు ఆ యువతి చేయి పట్టుకుని వాగులోకి దిగాడు. ‘అమ్మా.. వాగు ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. మీరు నా భుజాల మీదకు ఎక్కండి’ అన్నాడు.మారు మాటాడకుండా ఆ యువతి విక్రముడి భుజాల మీదకు ఎక్కింది. అది చూసిన ఐదుగురు శిష్యులు తమకు దక్కని అదృష్టం వాడికి దక్కిందని అసూయపడ్డారు. వాగు దాటిన తరువాత ఆ యువతి విక్రముడికి కృతజ్ఞతలు చెప్పి.. తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ ఐదుగురు మాత్రం కౌకర్ణిక దారెంట విక్రముడిని కుళ్లబొడవసాగారు. ‘స్త్రీని తాకావు.. భుజాల మీద కూర్చోబెట్టుకున్నావు’ అంటూ! విక్రముడు ఆ మాటలను పట్టించుకోకుండా మౌనంగా నడవసాగాడు. సుకేతు తన దివ్య దృష్టితో ఇదంతా చూడసాగాడు. ఎట్టకేలకు ఆరుగురు శిష్యులు కౌకర్ణిక ఆశ్రమానికి చేరుకున్నారు. సుకేతు మహర్షికి పాదాభివందనం చేశారు.ఆ ఆరుగురినీ చూసి మహర్షి మందహాసం చేశాడు. విక్రముడిని తన పక్కకు వచ్చి నిల్చోమన్నాడు. మహర్షి చేప్పినట్టే చేశాడు విక్రముడు. అప్పుడు మహర్షి మిగిలిన ఐదుగురిని ఉద్దేశిస్తూ ‘ఆపదలో ఉన్న స్త్రీని విక్రముడు ఓ తల్లిగా, సోదరిగా భావించి వాగు దాటించాడు. కానీ మీరు ఆ స్త్రీని మోహించారు. పైకి సర్వసంగ పరిత్యాగుల్లా నటించారు. వాగు దాటిన తక్షణమే ఆ యువతిని, ఆమెకు చేసిన సాయాన్నీ మరచిపోయాడు విక్రముడు. కానీ మీరు మనసులో ఆ స్త్రీనే మోస్తూ విక్రముడిని కుళ్లబొడుస్తూ మీ మాలిన్యాన్ని ప్రదర్శించారు. మీ నిగ్రహాన్ని పరీక్షించడానికి ఆ యువతిని నేనే సృష్టించాను. ఆ పరీక్షలో విక్రముడు నెగ్గాడు. అతనే ఉత్తమ శిష్యుడు’ అని చెప్పాడు మహర్షి. ఆ విషయాన్ని కౌశంబీకీ కబురుపెట్టాడు. – కనుమ ఎల్లారెడ్డిఇవి చదవండి: వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో.. -
Short Story: ఉదయాన్నే ఒక గంట శబ్ధం వినపండింది.. అదేంటో కనుక్కోండి..!
ఒకనాటి ఉదయాన్నే అడవిలోంచి ఒక గంట శబ్దం మృగరాజైన సింహం చెవుల్లో సోకి ఎంతగానో ఆకట్టుకుంది. దాని ఉనికి తెలుసుకోవాలన్న కుతూహలంతో వెంటనే అన్ని జంతువులనూ సమావేశపరచింది. ‘ఈరోజు ఉదయాన్నే ఒక గంట శబ్దం నా చెవిన పడి నన్ను ముగ్ధుడిని చేసింది. తక్షణమే దాని గురించి కనుక్కుని చెప్పండి’ అని తన గుహలోకి పోయింది. అది విన్న జంతువులన్నీ తమలో తాము గుసగుసలాడుకున్నాయి.‘ఔను! నేనూ ఈరోజు ఆ గంట శబ్దం విన్నాను భలేగా ఉంది.. గణగణలాడుతూ..’ అన్నది కుందేలు. ‘ఆ చప్పుడుకి తెల్లవారుతూనే నాకు తెలివొచ్చేసింది. ఏదో కొమ్మ మీంచి కొమ్మకు గెంతుతుంటే అదోవిధమైన ధ్వని నా మనసును హత్తుకుంది’ తోడేలు చెప్పింది. ‘మీకెందుకలాగ అనిపించిందో నాకైతే బోధపడటం లేదు. పదేపదే ఆ గంట మారుమోగుతుంటే చెడ్డ చిరాకేసింది. అది ఎవరు చేస్తున్నదీ తెలిస్తే చంపకుండా వదలను’ అని కోపం ప్రదర్శించింది ఎలుగుబంటి.‘మృగరాజు చెప్పిన పనిని మనం చేయడం ధర్మం. సరేనా!’ అన్నది ఒంటె. మళ్ళీ గంట శబ్దం అదేపనిగా వినబడసాగింది. చీకటిపడే సమయానికి కూడా దాని ఉనికి కనుక్కోలేక తమ గూటికి చేరాయన్నీ. మర్నాడు ఉదయం ఒక కోతి గెంతుకుంటూ వచ్చి ‘ఒక పిల్లి తన గంట మెడలో కట్టుకుంది. అది కదిలినప్పుడల్లా మారుమోగి అడవి అంతా వ్యాపిస్తోంది. ఇదే విషయం మనం సింహానికి చెప్పేద్దామా?’ అని సాటి జంతువులతో అన్నది. ‘చెబితే మనల్ని ఆ గంట తెమ్మని అడగవచ్చు. దానికి సిద్ధపడితేనే మనం చెప్పాలి. లేకపోతే అంతా ఆలోచించాక చెవిన వేద్దాం’ అన్నది ఏనుగు.అదే సమయంలో గుహలోంచి సింహం గర్జిస్తూ బయటకొచ్చి ‘మీరంతా గంట సంగతి ఏం చేశారో చెప్పారు కాదు. ఈ ఉదయం కూడా అది నాకు వినబడి మరింత ఆకట్టుకుంది. చెప్పండి..’ అని హుంకరించింది. ‘మరి.. మరి.. అది.. ఒక పిల్లి మెడలో ఉండటం ఈ కోతి కళ్ళబడింది’ అని చెప్పేసింది కుందేలు.‘ఆ! ఒక పిల్లి మెడలో గంటా? అది దాని మెడలోకి ఎలావచ్చింది? ఎవరు కట్టారు? ఒక పిల్లి అంత ధైర్యంగా గంట కట్టుకుని అడవంతా తిరగటమేమిటి? ఈ రోజు ఎలాగైనా ఆ గంటను తెచ్చి నా మెడకు కట్టండి. లేకుంటే ఏంచేస్తానో నాకే తెలీదు’ అని గర్జించింది సింహం. వెంటనే జంతువులన్నీ అడవిలో గాలించడం మొదలెట్టాయి. అదే సమయంలో ఒక లేడి చెంగుచెంగున గెంతుకుంటూ వచ్చి ‘పిల్లి మెడలో గంట కట్టింది ఎలుకలని తెలిసింది. అవి ఎందుకలా కట్టాయో వాటికి కబురుపెట్టి అడగండి..’ అని చెప్పింది.ఎలుకలకు కబురు వెళ్ళింది. ఎలుకల నాయకుడు జంతువుల ముందు హాజరై ‘మా ఎలుకలకు ప్రాణహాని కలిగిస్తున్న ఒక పిల్లి నుండి రక్షించుకోడానికి మెడలో గంటకడితే ఆ చప్పుడుకి దాని ఉనికి తెలుస్తుందని అప్పుడు మేమంతా జారుకోవచ్చని ఉపాయం ఆలోచించాం’ అన్నది. ‘మరి మీరు చేసిన పనికి మేమంతా ఇప్పుడు ఇరుక్కున్నాం. ఆ శబ్దం మృగరాజుకు తెగ నచ్చేసింది. అందువలన మీరు ఆ గంటను దాని మెడలోంచి తీసి మాకివ్వాలి. మేము దాన్ని సింహం మెడలో కట్టాలి. ఆ పని మీరు త్వరగా చేయాలి’ అని ఎలుగుబంటి హుకుం జారీ చేసింది. ‘అయ్యో రామ! మా రక్షణ నిమిత్తం చచ్చేంత భయంతో ధైర్యం చేసి కట్టాం. మళ్ళీ దాన్ని తీసి తేవాలంటే గండకత్తెరే! మా కంటే మీరంతా శక్తిమంతులు. ధీశాలులు. దయచేసి మీలో ఎవరో ఒకరు పిల్లి మెడలో గంటను తొలగించండి. మళ్ళీ మాకు పిల్లి నుండి ప్రాణగండం తప్పదు. అయినా భరిస్తాం’ నిస్సహాయంగా చెప్పింది ఎలుకల నాయకుడు. ‘ఐతే సరే! వెళ్ళు. దానిపని ఎలా పట్టాలో మాకు తెలుసు. మృగరాజు కోరిక తీర్చడం మాకు ముఖ్యం’ అని ఎలుకను పంపేసింది ఏనుగు.కుందేలు ఎగిరి గంతేస్తూ ‘పిల్లి మెడలో గంట శబ్దం మన మృగరాజుకి నచ్చడం మన అదృష్టం. సింహానికి ఎప్పుడు ఆకలి వేసినా ఎవరని కూడా చూడకుండా వేటకు సిద్ధపడుతుంది. అలాంటప్పుడు మెడలో గంట ఉంటే ఆ చప్పుడు మనందరికీ వినిపించి తప్పించుకోడానికి అవకాశం వస్తుంది. అందువలన ఆ పిల్లి మెడలో గంటను తీసుకొచ్చి సింహానికి కట్టేయాలి’ అని అందరి వైపు చూసింది.‘పిల్లి మెడలో గంట తస్కరించడం ఏ మాత్రం? మీరు ఊ అంటే చాలు.. సాయంత్రంకల్లా తెచ్చేస్తా’ అన్నది కోతి హుషారుగా. జంతువులు ‘ఊ’ కొట్టాక కోతి అడవిలోకి పోయి గంట చప్పుడైన దిశగా పయనించింది. కోతి రాకను గమనించిన పిల్లి చెట్లన్నిటి పైనా తిరిగి తప్పించుకో చూసింది. అప్పుడు కోతి ‘మిత్రమా! నీరాక తెలుసుకొని నీ నుండి తప్పించుకోడానికి ఎలుకలు పన్నిన కుట్రలో భాగమే నీ మెడలో ఈ గంట. దాన్ని తీసిస్తే నీకే మంచిది. నువ్వు సడి చప్పుడు లేకుండా వెళ్ళి ఎలుకల పనిపట్టి నీ ఆకలి తీర్చుకోవచ్చును’ అన్న మాటలకి సంతోషపడి ఒప్పుకుంది. దాని మెడలోని గంటను విప్పి పట్టుకెళ్లి జంతువులందరి ముందు ఎలుగుబంటి చేతిలో పెట్టింది కోతి. ‘ఇక చూడండి.. మన మృగరాజు తన గోతిలో తానే పడే సమయం వచ్చింది’ అని తోడేలు అంటున్నంతలోనే.. గుహ లోపలున్న సింహం దగ్గరకి వెళ్ళి గంట దొరికిందని చెప్పింది కుందేలు.‘ఆహా! ఎంత అదృష్టం! నేను కోరుకున్న గంటను ఇక నామెడలో అలంకరించండి. ఆ శబ్దంతో అడవంతా మారుమోగి పోవాలి’ అన్నది బయటకొచ్చిన సింహం. ఎలుగుబంటి తన దగ్గర ఉన్న గంటను ఏనుగుకు ఇవ్వగా అది మృగరాజు మెడలో వేసింది. గంటను పదేపదే చూసుకుని మెడను తిప్పుతూ గంట శబ్దానికి తెగ ముచ్చట పడిపోతూ అడవిలోకి పరుగు తీసింది మృగరాజు. దాని వైఖరికి జంతువులన్నీ ‘గంట చప్పుడుకి మురిసిపోతోంది కాని అది తనకే గండమన్న సంగతి తెలుసుకోలేకపోయింది పాపం!’ అంటూ నవ్వుకున్నాయి. ‘సింహం కోరిక తమ పాలిట వరం’ అనుకుంటూ తమ దారిన తాము వెళ్లిపోయాయి. – కె.కె.రఘునందనఇవి చదవండి: ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడేది.. ఒకరోజు.. -
'ఋతధ్వజుడు మదాలసల గాథ'
ఋతధ్వజుడి తండ్రి శత్రుజిత్తు మహారాజు. ఒకనాడు శత్రుజిత్తు కొలువుదీరి ఉండగా, గాలవుడు అనే బ్రాహ్మణుడు ఒక అశ్వాన్ని తీసుకుని వచ్చాడు. ‘‘మహారాజా! ఒక రాక్షసుడు నా ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నాడు. మాయావి అయిన ఆ రాక్షసుడు ఏనుగు, సింహం వంటి జంతువుల రూపాలు ధరించి, అడవినంతా అల్లకల్లోలం చేస్తున్నాడు. వాడిని శపించడానికి నా శక్తి చాలదు. ఒకవేళ శపించినా, నా తపస్సంతా వ్యర్థమైపోతుంది. వాడిని ఏమీ చేయలేకపోతున్నానే అనే నిస్సహాయతతో ఆకాశంవైపు చూసి నిట్టూర్చాను. అప్పుడు ఆకాశం నుంచి ఈ దివ్యాశ్వం భూమి మీదకు వచ్చింది. అదే సమయంలో అశరీరవాణి ఇలా పలికింది: ‘ఈ దివ్యాశ్వం భూమి మీదనే కాదు, ఆకాశ మార్గంలోను, పాతాళంలోనూ సంచరించగలడు. గిరులను, సాగరాలను అధిగమించగలదు. సమస్త భూమండలాన్నీ శరవేగంగా చుట్టేయగలదు. అందువల్ల దీనిపేరు కువలయం. శత్రుజిత్తు మహారాజు కొడుకు ఋతధ్వజుడు దీనిని అధిరోహించి, నీ తపస్సుకు ఆటంకం కలిగిస్తున్న అసురాధముణ్ణి సంహరించగలదు’ అని చెప్పింది’ అని పలికాడు. గాలవుడి మాటలు విన్న శత్రుజిత్తు తన కుమారుడు ఋతధ్వజుణ్ణి పిలిచి, ఆ అశ్వాన్ని అప్పగించి, గాలవుడి ఆశ్రమానికి రక్షణగా పంపాడు. ఋతధ్వజుడు గాలవుడి ఆశ్రమానికి వెళ్లి, ఆశ్రమవాసులందరికీ రక్షణగా ఉండసాగాడు. ఋతధ్వజుడు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలియని రాక్షసుడు యథాప్రకారం అడవిపంది రూపం ధరించి వచ్చి, నానా బీభత్సం మొదలుపెట్టాడు. ఆశ్రమంలోని గాలవుడి శిష్యులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీయసాగారు. ఋతధ్వజుడు వారి ఆర్తనాదాలు విని, కువలయాశ్వాన్ని అధిరోహించి, ఆగడం సాగిస్తున్న అడవిపంది వెంట పడ్డాడు. దాని మీదకు పదునైన బాణాలను సంధించి వదిలాడు. బాణాల దెబ్బలు తాళలేక అడవిపంది రూపంలో వచ్చిన రాక్షసుడు అడవిలోకి పరుగు తీశాడు. రాక్షసుడి అంతు చూద్దామనే పట్టుదలతో ఋతధ్వజుడు వెంటాడసాగాడు. అడవి నలువైపులా పరుగులు తీసి అలసిపోయిన రాక్షసుడు ఒక పెద్ద గోతిలోకి దూకి మాయమయ్యాడు. ఋతధ్వజుడు కూడా తన కువలయాశ్వంతో పాటు ఆ గోతిలోకి దూకాడు. ఆ గోతిలోంచి అతడు పాతాళలోకానికి చేరుకున్నాడు. పాతాళలోకం దేదీప్యమానంగా వెలిగి పోతోంది. ఎటు చూసినా బంగారు ప్రాకారాల ధగధగలు కనిపించాయి. ఇంద్రలోకంలాంటి పట్టణం కనిపించింది. ఋతధ్వజుడు ఆ పట్టణంలోకి వెళ్లాడు. వీథుల్లో ఎవరూ కనిపించలేదు. కాసేపటికి ఒక యువతి హడావుడిగా వెళుతూ కనిపించింది. ‘ఎవరు నువ్వు? ఎక్కడకు పోతున్నావు?’ అని ప్రశ్నించాడు. ఆమె బదులివ్వకుండా దగ్గర్లోనే ఉన్న ఒక మేడ మీదకు వెళ్లింది. ఋతధ్వజుడు ఆమెనే అనుసరిస్తూ మేడ మీదకు వెళ్లాడు. మేడపైన గదిలో ఒక సౌందర్యరాశి కనిపించింది. అపరిచితుడైన రాకుమారుడు అకస్మాత్తుగా తన గదిలోకి వచ్చేసరికి ఆమె చకితురాలైంది. వెంటనే మూర్ఛపోయింది. ఋతధ్వజుడు వెంటనే ఆమె దగ్గరకు చేరుకుని, భయపడవద్దంటూ సముదాయించాడు. ఇంతలోనే ఆమె చెలికత్తె వచ్చి ఆ సౌందర్యరాశికి పరిచర్యలు చేయసాగింది. ‘ఆమె ఎందుకిలా మూర్ఛపోయింది’ అని చెలికత్తెను ప్రశ్నించాడు ఋతధ్వజుడు. ‘ఈమె గంధర్వరాజు విశ్వావసుడి కుమార్తె మదాలస. నేను ఈమె చెలికత్తెను. నా పేరు కుండల. మదాలస వనంలో ఆటలాడుకుంటుండగా, పాతాళకేతువు అనే రాక్షసుడు ఆమెను అపహరించుకు వచ్చాడు. వచ్చే త్రయోదశినాడు ఈమెను వివాహం చేసుకోబోతున్నాడు. అధముడైన రాక్షసుణ్ణి పెళ్లిచేసుకోవడం ఇష్టంలేక ఈమె నిన్ననే ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడు ఒక గోమాత వచ్చి, భూలోకం నుంచి ఒక రాకుమారుడు వస్తాడని, రాక్షసుడిని చంపి మదాలసను వివాహమాడతాడని చెప్పింది. మిమ్మల్ని చూసిన మోహావేశంలో మా రాకుమారి మూర్ఛపోయింది. మీరు దైవాంశ సంభూతుల్లా ఉన్నారు. మామూలు మానవులు ఇక్కడ అడుగుపెట్టలేరు. మీ వృత్తాంతం చెప్పండి’ అంది కుండల. ఋతధ్వజుడు తనను తాను పరిచయం చేసుకుని, ఏ పరిస్థితుల్లో అక్కడకు వచ్చాడో వివరించాడు. ఇంతలో మూర్ఛనుంచి తేరుకున్న మదాలస తన ఎదుట ఉన్న రాకుమారుణ్ణి చూసి సిగ్గుపడింది. ‘రాకుమారా! ఈమె మీ మీద మనసుపడింది. గోమాత చెప్పిన రాకుమారుడు మీరే! గోవు అసత్యం చెప్పదు. అందువల్ల మీరు ఈమెను వివాహం చేసుకోండి’ అని కోరింది కుండల. ‘ఈమెను వివాహమాడటం నాకూ ఇష్టమే గాని, తండ్రి అనుమతి లేకుండా ఇప్పటికిప్పుడు ఎలా వివాహం చేసుకోగలను?’ అన్నాడు ఋతధ్వజుడు. ‘రాకుమారా! ఈమె దేవకన్య. ఇది ముందే జరిగిన దైవనిర్ణయం. మీరు అభ్యంతరం చెప్పకుండా ఈమెను వివాహం చేసుకోండి’ అంది కుండల. ‘సరే’నన్నాడు ఋతధ్వజుడు. కుండల వెంటనే తమ కులగురువైన తుంబురుణ్ణి స్మరించింది. తుంబురుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్కడికక్కడే అగ్నిహోత్రాన్ని వెలిగించి, మదాలసతో ఋతధ్వజుడికి శాస్త్రోక్తంగా వివాహం జరిపించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుండల కూడా సెలవు తీసుకుని, గంధర్వలోకానికి వెళ్లిపోయింది. ఋతధ్వజుడు మదాలసను తీసుకుని, అక్కడి నుంచి బయలుదేరడానికి కువలయాశ్వాన్ని అధిరోహించాడు. మదాలసతో అతడు అశ్వంపై వెళుతుండగా గమనించిన రాక్షసులు అతడి మీద దాడి చేశారు. వరుసగా ఆయుధాలను రువ్వారు. ఋతధ్వజుడు వారందరినీ ఎదుర్కొన్నాడు. తన బాణాలతో వారి ఆయుధాలను తుత్తునియలు చేశాడు. రాక్షసుల ద్వారా సంగతి తెలుసుకున్న పాతాళకేతువు స్వయంగా రంగప్రవేశం చేశాడు. ఋతధ్వజుడిపై అస్త్రాలను సంధించాడు. ఋతధ్వజుడు అతడి అస్త్రాలన్నింటినీ తన దివ్యాస్త్రాలతో నిర్వీర్యం చేశాడు. చివరగా త్వాష్ట్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం పాతాళకేతువు సహా రాక్షసులందరినీ మట్టుబెట్టింది. ఋతధ్వజుడు మదాలసతో కలసి క్షేమంగా తన రాజ్యానికి చేరుకున్నాడు. తండ్రికి జరిగినదంతా చెప్పాడు. శత్రుజిత్తు కుమారుణ్ణి ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. కోడలిని చూసి అభినందించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: వద్దమ్మా.. తప్పూ! -
ఫండే: కథ - 'ఓ.. అదా సంగతి! అందుకా ఈ మార్పు..!'
ఇంటి దగ్గరకు వచ్చే కొద్ది చీకటి చిక్కపడుతూ వచ్చింది. మనసు బాధతో ఒక్కసారి మూలిగింది. రాత్రి కూడా ఆఫీసులోనే గడిపితే – ఇల్లే కదా స్వర్గసీమ అనేది ఉత్త మాటేనా? బాధగానే తలుపు తట్టాను. అనుభవానికి భిన్నంగా తలుపులు వెంటనే తెరుచుకున్నాయి. చిమ్మచీకట్లో పూర్ణ చంద్రోదయం అయినట్లు, చిరునవ్వుతో ఎదురుగా నిలబడి వుంది మా ఆవిడ! ఆశ్చర్యంతో పెదవి పెగలలేదు నాకు. అడుగు ముందుకు పడలేదు. క్రికెట్లో పదకొండవ నెంబర్ ఆటగాడైన బౌలర్ రెండు వందలు కొట్టినట్లు వింటే కలిగేటంత ఆశ్చర్యం.. బహుమతి వచ్చిన లాటరీ టికెట్‌ను ఎవరో మతిలేనివాడు నాకు అందిస్తే కలిగేటంత ఆశ్చర్యం.. యాబై యేళ్ళ జీవితంలో ఒక్కసారైనా చూడని, పేరు వినని వాడు విశాఖలో అచ్చంగా నాకు వెయ్యిగజాలు ఉచితంగా రాసిచ్చాడని వింటే కలిగేటంత ఆశ్చర్యం అనిపించింది! ‘ఏమిటలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి పోయారు.. లోపలకు రండి’ గోముగా పలికింది మా ఆవిడ. ఆ పలికిన తీరు నా ఆశ్చర్యానికి మల్లెలు తురిమాయి ఏమైంది ఈ రోజు..? ఏమిటీ మార్పు? ఇంటి లోపలకు అడుగు పెడుతూనే చుట్టూ చూశాను. అత్తగారు కానీ మామగారు కానీ వచ్చారా.. లేకపోతే మా ఆవిడ అక్క కానీ..! ఏదో బలమైన కారణం ఉండాలి. లేకపోతే మా ఆవిడ ఇలా నవ్వుతూ పలకరించటమే! తుఫాను ముందు వీచే చల్ల గాలిలా, బహుశా ఏదైనా కొనమని అడుగుతుందేమో..! పండుగకి ఇంకో రెండు వారాలే! అయినా పండుగకి కొనవలసిన వాటికి టెండర్ పెట్టడమూ, ఒప్పుకోవటమూ అయిపోయిందిగా! మళ్ళీ, ఇప్పుడు ఇలా..! నాకు పాలుపోలేదు. కుర్చీలో కూర్చుని షూ లేస్ విప్పుకున్నాను. వేడి వేడి కాఫీతో వచ్చి నా పక్కనే కూర్చుంది.. ఆవిడ. అది మరో షోకు! ఆఫీసు నుంచి రాగానే అలా కాఫీ ఇవ్వటం, కాసేపు సరదాగా మాట్లాడుకోవటం మొదలైనవి గత చరిత్ర. ఏదైనా అవసరముంటే చెప్పటం, పొడి పొడిగా మాట్లాడుకోవటం, లేకపోతే ఎవరి పనిలో వాళ్లం ఉండటం నేటి చరిత్ర. ‘ఏవండీ.. అలా మాట్లాడకుండా కూర్చున్నారు?’ ఎదురుగా కూర్చున్నది మా అవిడేనా అనే సందేహం కలిగింది నాకు. పరిశీలనగా సూక్ష్మంగా చూశాను.. అవిడే! ‘దేవుడా.. ఈ రోజు ఏ సునామీ రాకుండా కాపాడు తండ్రీ’ అని ప్రార్థిస్తూనే అన్నాను..‘చెప్పు?’ ‘ఏముంటాయండీ.. మాకు చెప్పడానికి? రోజంతా ఇంట్లో మగ్గేవాళ్ళం. మీరే చెప్పండి..’ ఒక్క సిప్పు కాఫీ తాగాను.. కాఫీ.. రోజుకన్నా బాగుంది. అయినా ఆ మాట పైకి అనలేదు. కాసేపు పోయాక మా ఆవిడే చెప్పటం మొదలు పెట్టింది.. ‘మరేమోనండీ.. నాలుగు రోజుల క్రితం మా అక్క.. అదేనండీ.. మా పెద్దమ్మ కూతురు ఫోన్ చేసింది..’ రోజుల కొద్ది బయటకు చెప్పకుండా మనసులో దాచి ఉంచిన, చుట్టాల సంగతులు.. వాళ్ళ గొడవలు వగైరాలు నా ముందు వరదగా ప్రవహించాయి ఆనకట్ట పగిలినట్లు. సంవత్సరాల క్రితం గమనించిన ఆమెలోని చలాకీతనం మాట తీరు పునర్జన్మ ఎత్తినందుకు కొంత సంతోషించాను. ఆ మాటలు వినటం పోనూ పోనూ ఇబ్బంది అయినప్పటికీ! ‘అసలు సంగతి మర్చి పోయానండీ. సాయంత్రం బజ్జీలు వేశానండీ’ హఠాత్తుగా లేచింది. ‘ఆఫీసు నుంచి ఆకలితో వస్తారనీ..’ ‘ఇదొకటా..’ మనసులో అనుకున్నాను. వైశాఖంలో వాన చినుకులా..’ మా ఆవిడ సాయంత్రం టిఫిన్ చేయటం కూడానా! ఇంటికి వచ్చి ఆకలిగా ఉంది అని చెబితే ‘బయట తినలేక పోయారా?’ అని అంటుంది. ‘టైమ్ చూశావా? తొమ్మిది దాటుతోంది. ఇప్పుడు బజ్జీలేమిటీ.. అన్నంలో తినేస్తాను’ అంటూ లేచాను. ఫ్రిజ్ నుంచి తీసిన చలి విరగని కూరలు తినే బదులు సాయంత్రం చేసిన బజ్జీలు బెటర్ అనుకున్నాను. కానీ మరో షాకు ఇచ్చింది మా ఆవిడ. వెచ్చ వెచ్చగా చారూ కూర వడ్డించి! ‘ఇదేమిటే ఈ రోజు ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నావు.. వేడి వేడి వంటలు..’ ‘ఏదో, నేను ఎప్పుడూ మీకు వేడి వేడిగా వంటి పెట్టనట్లు!’ ఆవిడ ముఖం ఎర్రబడింది. ‘పోనీలే.. అయినా ఈ రోజు ఈ మార్పు ఏమిటి? ఏదో ఉంది. కారణం చెప్పు. ఏం టెండర్ పెడుతున్నావు?’ ‘మరీ బాగుంది మీ మాట.. ఏదైనా కొనాలని అడిగే ముందే మీకు నేను సేవ చేస్తున్నట్లు! లేకపోతే చేయట్లేనా?’ ‘అలా అనలేదే నేను. ఇంతకు నా బడ్జెట్లో వచ్చే వస్తువే అడగాలి సుమా’ హెచ్చరించాను. పదివేలు పెట్టి పండుగకి పట్టుచీర కొన్నాను. అందువల్ల చీర టెండర్ పెట్టదు. మరింకేం అడుగుతుంది? నేను ఆలోచనలో పడ్డాను.. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. పండుగకి బోనస్ వస్తే ఒక్క వజ్రపు ముక్కు పుడక కొనమని అడుగుతోంది. ‘ఇంకా బోనస్ సంగతి తెలియదే’ అన్నాను. ‘అది కాదండీ..’ ఒక్క నిమిషం మాట్లాడలేదు మా ఆవిడ. ‘ఏమండీ..’ మళ్ళీ గోముగా పిలిచింది. ‘చెప్పు..’ ‘నా సెల్‌ఫోను పోయిందండీ..’ ఓ.. అదా సంగతి! అందుకా ఈ మార్పు. సెల్ ఉంటే సెల్ చెవికి అంటించుకుని రోజంతా మాట్లాడుతూ గడిపే మా ఆవిడకి సెల్ పోయేసరికి భర్తతో మాట్లాడాలని వంట చేయాలని గుర్తుకొచ్చిందన్న మాట! ‘ఎక్కడ పోతుందే.. నువ్వే ఎక్కడైనా పెట్టి మరిచిపోయుంటావు. బాగా వెతుకు.’ ‘అంతా వెతికానండీ..’ మా ఆవిడ దీనంగా నా వైపు చూస్తూ అంది. ‘కనబడలేదండీ..’ ‘అయితే ఇప్పుడు కొత్త సెల్ కొనాలన్న మాట. అంతేగా!’ ఒక్క పూట తిండి లేకపోయినా గడపవచ్చు కాని సెల్ ఫోను లేకపోతే నిమిషమైనా గడపలేం కదా ! ఏం చేస్తుంది.. పాపం! సంపాదన లేని ఇల్లాలు! ‘అలాగేలే. కొత్తది కొంటానులే’ అన్నాను. ఆవిడ ముఖం మీద చంద్రోదయం అయింది. నేను మనసులో నవ్వుకుంటూ అనుకున్నాను.. ‘ఒక్క నాలుగురోజులు పోయాక ఆఫీసులో దాచిన మా ఆవిడ సెల్ ఫోన్ ఇంటికి తీసుకు రావాలని, ఒక్క నాలుగు రోజులు ఆవిడ మాటలూ సాన్నిహిత్యాన్ని ఆస్వాదించాలని! — ఎల్. ఆర్. స్వామి -
వి‘చిత్ర’ దొంగతనం
‘ది గ్రేట్ వెస్టెర్న్ రైల్వే కంపెనీ పరిధిలో డిడ్ కాట్ స్టేషన్ నుంచి బయలుదేరి, వించెస్టర్ ద్వారా ప్రయాణించి న్యూ బరీ చేరుకొన్న గూడ్స్ ట్రెయిన్‌కు తగిలించిన మొత్తం పదకొండు వ్యాగన్లలో ఒక వ్యాగన్ తప్పిపోయిందట!’ ఇన్వెస్టిగేటింగ్ కెమెరా మ్యాన్ అయిన హ్యేజెల్కు అతని మిత్రుడు అందించిన సమాచారమది. హ్యేజెల్ మెడలో ఎప్పుడూ కెమెరా వేలాడుతూ ఉంటుంది. ‘బహుశా ఆ తప్పిపోయిన వ్యాగన్‌ను బ్రేక్ వ్యాన్ చివర తగిలించి ఉంటారు. కప్లింగ్స్ పగిలిపోవడం వల్ల వేరై ఉంటుంది. అలా జరిగున్న పక్షంలో తరువాత వచ్చే రైలు దాన్ని తీసుకురావచ్చు’ అన్నాడు హ్యేజెల్. ‘లేదు. ఆ వ్యాగన్‌ను ఆ గూడ్స్ ట్రెయిన్ మధ్యలోనే తగిలించారు’ చెప్పాడు హ్యేజెల్ మిత్రుడు. ‘ఆ! అలాగా? విచిత్రంగా ఉందే.. బహుశా ఏ స్టేషన్లోనైనా ఆగిపోయి ఉండొచ్చు’ ‘నో! నో! మై ఫ్రెండ్! ఆ లైనులో ఉన్న స్టేషన్లకన్నిటికీ టెలిగ్రాములిచ్చారట. ఏ స్టేషన్లోనూ లేదని ద్రువీకరించారు’ అన్నాడతను. ‘ఓహో! అసలు ఆ గూడ్స్ ట్రైన్ డిడ్ కాట్ నుండి బయలుదేరి ఉండకపోవచ్చు’ ఊహించాడు హ్యేజెల్. ‘అందులో అనుమానమే లేదు. డిడ్ కాట్ స్టేషన్ వదలి బయలుదేరిందని స్టేషన్ మాస్టర్ చెప్పాడు’ ‘ఈ కేసు చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ వ్యాగన్లో ఏదో విలువైన సామగ్రి ఉండి ఉంటుంది. మనం అక్కడికి పోదాం పద’ అన్నాడు హ్యేజెల్. ఇద్దరు మిత్రులు బయలుదేరి, స్టేషన్ మాస్టరును కలిశారు. ‘మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ డిటెక్షన్ గురించి చాలా విన్నాను. జరిగిన సంఘటన నాకు విచిత్రంగా తోస్తూ ఉంది. ఏమీ అర్థంకావడం లేదు’ అన్నాడు స్టేషన్ మాస్టర్. ‘తప్పిపోయిన వ్యాగనులో ఏముందో తెలుసా మీకు?’ అడిగాడు హ్యేజెల్. ‘అక్కడే వచ్చింది సార్ చిక్కు. ఏదేమైనా అందులో అత్యంత విలువైన సామగ్రి ఉందనుకుంటున్నాను. వచ్చేవారం వించెస్టర్ మ్యూజియంలో అత్యంత అపురూప పురాతన వర్ణచిత్రాల ప్రదర్శించబోతున్నారు. అందు నిమిత్తం అటువంటివి కొన్ని చిత్తరువులను ఈ వ్యాగన్ ద్వారానే లీమింగ్టన్కు తరలిస్తున్నారు. అందులో ప్రఖ్యాత చిత్రకారుడైన సర్ గిల్బర్ట్ ముర్రెల్ అద్భుతంగా చిత్రించిన మూడు విలువైన అపురూప చిత్రాలు భారీ పరిమాణంలో ఉండడం వల్ల వాటిని ఒక్కొక్కటిగా∙ప్రత్యేకంగా పెట్టెల్లో భద్రంగా పెట్టి బంగీలుగా కట్టారు’ చెప్పాడు స్టేషన్ మాస్టర్. ‘మ్మ్! ఇదేదో చాలా తమాషాగా తోస్తోంది. అన్నట్టు ఆ వ్యాగన్‌ను ట్రైనుకు తగిలించారో? లేదో?’ అనుమానం వ్యక్తం చేశాడు హ్యేజెల్. ‘సందేహమే లేదు. కావాలిస్తే, బ్రేక్ మ్యాన్ సింసన్ను మీరే అడగండి. అతన్ని పంపిస్తాను. అతని మాటల్లోనే వినండి’ అన్నాడు స్టేషన్ మాస్టర్. గూడ్స్ గార్డు వచ్చాడు. హ్యేజెల్ అతన్ని నిశితంగా గమనించాడు. అతని ముఖంలో నిజాయితీ తప్ప ఎలాంటి అనుమానాస్పదమైన ఛాయలు కనబడలేదు. ‘డిడ్ కాట్లో మేము స్టేషన్ వదలిన సమయంలో, రైలుకు వ్యాగన్ తగిలించి ఉందని నాకు బాగా తెలుసు. తరువాతి స్టేషన్ అప్టన్ వద్ద ఆగాం. అక్కడ కొన్ని వ్యాగన్లను స్టేషన్లో విడగొట్టాం. అప్పుడు ఆ వ్యాగన్– బ్రేక్ వ్యాన్ నుండి అయిదోస్థానంలోనో, ఆరోస్థానంలోనో ఉంది. ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను. ఆ తరువాత ‘కాంప్టన్’లో ఆగి పశువుల ట్రక్కును రైలుకు తగిలించాం. నేనక్కడ దిగలేదు. అక్కడి నుండి ఎక్కడా ఏ స్టేషన్లలోనూ ఆగకుండా న్యూ బరీ స్టేషను వరకూ ప్రయాణం సాగించాం. అక్కడ తనిఖీ చేశాను. ఆ వ్యాగను కనిపించలేదు. నేను పొరపాటు పడ్డానేమోనని రెండవసారి జాగ్రత్తగా పరిశీలించాను. ఆ వ్యాగను లేదు. ఒకవేళ అది అప్టన్లోనో, కాంప్టన్లోనో పొరపాటున నిలిచిపోయి ఉంటుందని ఊహించాను. కానీ ఆ ఊహ తప్పని తేలింది. ఎందుకంటే అది ఆ రెండు స్టేషన్లలోనూ లేదని నిర్ధారణ అయింది. నాకు తెలిసిందదే సార్! అంతా తికమకగా, గందరగోళంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు ఆ గార్డు. ‘అవును. చాలా విచిత్రంగా ఉంది. కానీ నువ్వు పొరపాటు పడలేదు కదా?’ ‘లేదు సార్! నేను పొరపాటు పడలేదని నిశ్చయంగా చెప్పగలను’ ‘పోనీ డ్రైవరు ఏమైనా గమనించాడేమో?’ ‘లేదు సార్!’ ‘ఒక వ్యాగన్ అలా రైలు పెట్టెల మధ్య నుండి విడిపోవడం జరగదు. ఏ మాంత్రికుడో వచ్చి మాయం చేసుంటే తప్ప. మీరు ఏ సమయంలో డిడ్ కాట్ వదిలారు?’ హ్యేజెల్ అడిగాడు. ‘రాత్రి ఎనిమిది గంటలకు సార్!’ ‘చాలా చీకటిగా ఉంటుందప్పుడు. కాబట్టి లైను పక్కన ఏం జరిగేదీ మీకు తెలియకపోవచ్చు’ ‘అవును సార్! ఏమీ కనబడదు’ ‘మీరు ఎప్పుడూ బ్రేక్ వ్యాన్ లోపల్నే ఉంటారా?’ ‘రైలు కదులుతున్నంతసేపూ రైల్లోనే ఉంటాను సార్!’ ఆ సమయంలో పోర్టర్ అక్కడికి వచ్చి..‘ఇప్పుడే ఒక ప్యాసెంజర్ ట్రైన్ డిడ్ కాట్ నుంచొచ్చింది. ‘చర్న్’ దగ్గర సైడింగులో ఒక భర్తీ వ్యాగన్ బంగీలతో నిలిచి ఉందని డ్రైవరు ఫిర్యాదు చేశాడు’ అని చెప్పాడు. అది విని గార్డ్ ఆశ్చర్యపోయాడు. ‘మేమెప్పుడూ ‘చర్న్’ దగ్గర బండి ఆపం. ఏదో క్యాంపుల్లో తప్ప. ఎక్కడా ఆగకుండా చర్న్ మీదుగానే వచ్చాం’ ‘చర్న్ ఎక్కడుంది?’ అడిగాడు హ్యేజెల్. ‘అది అప్టన్కూ కాంప్టన్కూ మధ్యలో ఉంది. అక్కడ కేవలం ప్లాట్ఫార్మ్ ఉంటుంది. దాంతో పాటు సైడింగ్ కూడా ఉంది. వేసవిలో మాత్రం అక్కడ సైనికులు విడిది చేస్తారు. అయినా అది చాలా అరుదుగా జరుగుతుంది’ అన్నాడు గార్డ్. ‘నేను వెంటనే చూడాలా ప్రదేశాన్ని’ ఒక గంటలోపలే ఆ వైపు వెళ్ళే రైల్లో, ఇన్స్పెక్టర్ హిల్తో పాటు ‘చర్న్’ అనే ప్రదేశానికి చేరుకున్నారు. అది ఏకాంతప్రదేశంలో ఉంది. విశాలమైన, సమతలప్రదేశానికి కొంచెం దిగువన వుంది. అక్కడ ఒకే ఒక చెట్టు ఉంది. అది నివాసప్రాంతం కాదు. అరమైలు దూరంలో గొర్రెల కాపరి గుడిసె మాత్రం ఉంది. ఆ స్టేషన్ మొత్తం ఒకే ఒక ప్లాట్ఫార్మ్గా ఉండి,సైడింగ్ లైన్ ఉంది. అక్కడితో పట్టాలు అంతమౌతాయి.ౖ రెల్వే పరిభాషలో అది డెడ్ ఎండ్. ఒకే ఒక్క ట్రాక్‌తో డిడ్ కాట్ స్టేషన్ మెయిన్ ట్రాక్‌కు అనుసంధానించి ఉంది. డెడ్ ఎండ్ వద్ద ఆ సైడింగ్ పట్టాల మీద తప్పిపోయిన వ్యాగన్ కనబడింది. వ్యాగన్ పెద్ద పెద్ద పార్సల్స్తో నిండి వుంది. వాటి మీద ‘లీమింగ్ టన్ నుండి వించెస్టర్ వయా న్యూ బరీ’ అని లేబుల్స్ అతికించున్నాయి. ఆగకుండా ప్రయాణించిన రైలు నుండి మిగతా వ్యాగన్ల మధ్య తగిలించిన వ్యాగన్ అక్కడికెలా వచ్చింది? అదొక మిçస్టరీగా ఉంది. ఎంత చురుకైన మెదడుక్కూడా అందని ఆ మిస్టరీ అందరి మెదళ్ళను తొలిచేస్తోంది.వ్యాగన్ వంక తదేకంగా చూసి ‘మనం ట్రాక్ మీది పాయింట్స్ ఒకసారి పరిశీలిద్దాం రండి’ అని ఇన్స్పెక్టర్ అనడంతో అందరూ అటు వెళ్ళారు. ఆ పాతకాలపు స్టేషన్లో కనీసం సిగ్నల్ బాక్స్ కూడా లేదు. రెండు లీవర్లతో పనిచేసేట్టుగా , నేలమీది చట్రం మీద లైనుకానుకొని పాయింట్ బిగించి ఉంది. అందులో ఒక లీవరు పనిచేస్తూ ఒకే పాయింట్స్‌లో ఉన్న లైన్‌ను మారుస్తోంది. లీవరును ఇంకోవైపుకి మార్చడం ద్వారా ట్రాక్‌ను య«థాస్థితికి తెస్తోంది. ఇంకా వివరంగా చెప్పాలంటే నేలమీద చెక్కదిమ్మెలకు బిగించిన లీవరును అటు నుండి ఇటు, ఇటు నుండి అటు కదిలించడం వల్ల ట్రైన్లు ఒక ట్రాక్ నుండి మరో ట్రాక్‌కు మారేలా చేస్తాయి. అదో సాంకేతిక అమరిక. ‘ఈ పాయింట్స్ సంగతేమిటీ? వీటిని చాలా అరుదుగా ఉపయోగిస్తున్నందు వల్ల, మిగతా సమయమంతా పనిచేయకుండా ఉంచుతున్నారా?’ అడిగాడు హ్యేజెల్. ‘అవును. రెండు పట్టాల కింద నేలమీద చెక్క దిమ్మెలకు బోల్టులతో, మేకులతో బిగిస్తారు. ఓహ్! ఇటు చూడండి.. ఈ లీవర్లు ఇప్పటికీ ఉపయోగించినట్లు లేదు. లీవర్స్‌కు తాళం వేసుంది. ఇదుగో తాళం చెవి రంధ్రం. ఇటువంటి వింతను నేనెప్పుడూ చూసుండలేదు, మిస్టర్ హ్యేజెల్!’ అన్నాడు ఇన్స్పెక్టర్. హ్యేజెల్ అలాగే పాయింట్స్ వంకా, లీవర్ల వంక చూస్తూండి పోయాడు. పాయింట్లను, లీవర్లను పనిచేయిస్తే, రైల్ ట్రాక్ మారి సైడింగ్ ట్రాక్ పైకి ట్రైన్లను మళ్ళించవచ్చని అతనికి తెలుసు. కానీ, ఇక్కడ ఆ మళ్ళింపు ఎలా జరిగింది? అన్న ప్రశ్న అతన్ని వేధిస్తోంది. అకస్మాత్తుగా అతని ముఖం వెలిగిపోయింది. చెక్కదిమ్మెకు అమర్చిన బోల్ట్‌ను వదులుచేయడానికి తాజాగా నూనె ఉపయోగించినట్లు స్పష్టంగా కనబడింది. తరువాత అతని చూపులు లీవర్ హ్యాండిల్ మీద నిలిచిపోయాయి. మందహాసరేఖ అతని పెదవుల మీద మెరిసి మాయమయ్యింది. ‘అటు చూడండి! ఆ లీవరును బయటికి లాగడం చాలా కష్టం’ అంటూ ఇన్స్పెక్టర్ ఒక లీవరును చేత్తో ముట్టుకోబోయాడు. వెంటనే హ్యేజెల్ అతని కాలరు పట్టుకొని వెనక్కి లాగాడు. ‘క్షమించండి! ఆ లీవర్లను నేను ఫోటో తీసుకుంటాను’ అంటూ వాటిని తన కెమెరాలో బంధించాడు హ్యేజెల్. ‘వాటిని ఉపయోగించినట్లు లేదు కదా సార్!’ అన్నాడు ఇన్స్పెక్టర్. హ్యేజెల్ మౌనంగా ఉండిపోయాడు– అతనంతటతనే తెలుసుకోనీలే అనుకుంటూ. ‘ఇన్స్‌స్పెక్టర్! ఆ పాయింట్స్ ఉపయోగించడం వల్ల వ్యాగన్ ఇలా దారి మళ్ళిందని చెప్పగలను. కానీ అదెలా జరిగిందనేదే అర్థంకాని సమస్య. అయితే ఒకటి మాత్రం నిజం. ఇంతటి కార్యానికి పాల్పడినవాడు పాతనేరస్తుడైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడని నిశ్చయంగా చెప్పగలను. పట్టుకొని తీరుతాం’ అన్నాడు హ్యేజెల్. ‘కానీ ఎలా?’ ఇన్స్‌స్పెక్టర్ అడిగాడు అశ్చర్యపోతూ. ‘అది ప్రస్తుతానికి చెప్పలేను. అన్నట్టు ఇన్స్‌స్పెక్టర్! వ్యాగను లోపలి వర్ణ చిత్రాలు యథాతథంగా ఉన్నాయి కదా?’ ‘మనం ఈ ట్రక్కును మనతో పాటు తీసుకుపోతున్నాం కాబట్టి, మనం త్వరలోనే తెలుసుకుంటాం’ ఇన్స్పెక్టర్ బోల్టులను స్పానర్‌తో వెనక్కి తిప్పి, లీవర్లను వదులు చేశాడు. ‘ఇవి నిరాటంకంగా పనిచేస్తున్నాయి’ అన్నాడు ఒక లీవర్ని గుంజుతూ. ‘అహా! ఎందుకు పనిచేయవు? వాటికి ఇటీవలనే చిక్కటి నూనెతో ఆయిలింగ్ చేశారు’ అన్నాడు హ్యేజెల్. తరువాతి ట్రైను ఆ లైనులో రావడానికింకా ఒక గంటకు పైగా ఉంది సమయం. న్యూబరీకి తిరిగిరాగానే హ్యేజెల్ చెసిన మొట్టమొదటి పని ఏమంటే, తాను తీసిన ఫొటోలను డెవలప్ చేసి ప్రింట్లను తీయడం. బాగా స్పష్టంగా వచ్చిన ఫొటోలను స్కాట్లాండ్ యార్డ్‌లో తనకు తెలిసిన అధికారికి పంపించాడు. తరువాతి సాయంకాలం అతనికి స్టేషన్ మాస్టర్ నుండి ఒక ఉత్తరమొచ్చింది. వ్యాగన్‌లోని చిత్తరువులన్నీ భద్రంగా ఉన్నాయని, వాటిలో ఏ ఒక్కటీ అపహరణకు గురికాలేదని ‘లోన్ ఎగ్జిబిషన్ కమిటీ’ సభ్యులు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారణ చేసి, తమ సంపూర్ణ సంతృప్తిని వెలిబుచ్చారని, ఒక వ్యాగన్ సైడింగ్ ట్రాక్‌లోకి వెళ్ళిన సంఘటన కలిగించిన విభ్రాంతి నుండి తామింకా తేరుకోలేదని, ప్యాడింగ్టన్ నుండి ఉన్నతాధికారి ఒకరు విచారణకు వచ్చాడని, సరుకు భద్రంగా ఉంది కాబట్టి, సంఘటన జరిగినట్లు బయటకు పొక్కనీయకూడదంటూ వాళ్ళను అభ్యర్థించాడని, దీన్ని గోప్యంగా ఉంచవలసిందిగా హ్యేజెల్ని కూడా కోరుతున్నామని ఆ జాబు సారాంశం. ‘చాలా ఆశ్చర్యంగా ఉంది’ హ్యేజెల్ మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు స్కాట్లాండ్ యార్డ్ అధికారిని కలుసుకున్నాడు. ‘మేము మా రికార్డులన్నీ వెదికాం. దొంగను గుర్తించాం. అతని అసలు పేరు ఎడ్గర్ జెఫ్రీస్. అతనికి అనేక మారుపేర్లున్నాయి. ఇంతకు ముందు నాలుగు దోపిడీలూ, ఇళ్ళకు కన్నం వేసిన నేరాలకు శిక్ష అనుభవించాడు. అతడు చేసిన దోపిడీలో రైల్వే దొంగతనం కూడా ఒకటుంది. అతని గురించి ఏమైనా వివరాలు దొరికితే మీకు తెలియబరుస్తాం. ప్రస్తుతం అతను అలెన్ అనే పేరుతో నివసిస్తున్నాడు’ అంటూ అలెన్ చిరునామా కూడా ఇచ్చారు. హ్యేజెల్ దాన్నొక కాగితం మీద రాసుకున్నాడు. మర్నాటి న్యూస్ పేపర్లో..‘‘ప్రఖ్యాత చిత్రకారుడు సర్ మురెల్ గిల్బర్ట్, వించెస్టర్‌లో ఒక వారంలో జరగబోవు ఎగ్జిబిషన్ కమిటీ సభ్యుల మీద చేసిన తీవ్ర ఆరోపణ’’ అనే శీర్షిక హ్యేజెల్ దృష్టిని ఆకర్షించింది. ఆ అభియోగమేమంటే– ఆ పెయింటింగ్స్ అతను చిత్రించినవి కానేకావట. ఒరిజినల్ చిత్రాలను దాచిపెట్టి అలాంటివే నకళ్ళు తయారు చేయించి ఎగ్జిబిషన్ గోడలకు వేలాడదీసి మోసానికి పాల్పడ్డారట ఎగ్జిబిషన్ నిర్వాహక కమిటీ సభ్యులు. చాలా తెలివిగా ఫోర్జరీ చేయించారని అతని ఆరోపణ. తన ఒరిజినల్ పెయింటింగ్స్ అత్యంత విలువచేస్తాయని, తన పిక్చర్లు మార్చినందుకు నిర్వాహక కమిటీ దీనికి బాధ్యత వహించవలసి ఉంటుందని నొక్కి వక్కాణించాడు. కానీ ఆ అభియోగాన్ని తిప్పి కొట్టింది నిర్వాహక కమిటీ. రైల్వే కంపెనీ నుండి నేరుగా ఎట్లున్న పెయింటింగ్స్ అట్లే వచ్చాయని సమర్థించుకుంది. ‘చర్న్’ సంఘటన పత్రికల వాళ్ళ దృష్టికి ఇంకా పోలేదని అర్థమైంది హ్యేజెల్కు. రైల్వే కంపెనీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అసలు నిజాన్ని దాచారు. హ్యేజెల్ ఇక ఆలస్యం చేయదలచుకోలేదు. వీలైనంత త్వరగా విషయం రచ్చకెక్కకముందే మిస్టరీని ఛేదించాలని నిశ్చయించుకొన్నాడు. వెంటనే చిత్రకళ గురించి క్షుణ్ణంగా తెలిసిన తన స్నేహితుణ్ణి కలుసుకొన్నాడు. ‘నీక్కావాల్సిన సమాచారం చెబుతాను. నేను కూడా ఈ సాయంకాలం పత్రికకు ఒక ఆర్టికల్ రాయాల్సి ఉంది. ఇంతకముందు వెలాస్క్వెజ్ అనే చిత్రకారుని బొమ్మ విషయం.. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాస్పదంగా మారింది. ఇటీవల సెయింట్ మోర్టిజ్ అనే పెద్దమనిషి దగ్గరున్న ‘మడోనా’ చిత్రం, వియన్నా గ్యాలరీలో ఉందని, అదే అసలైన చిత్రమని వారు యాజమాన్య హక్కుల దావా వేశారు. ఏదేమైనా, ప్రస్తుతం సర్ గిల్బర్ట్ ముర్రెల్ చిత్రించిన ‘ హోలీ ఫ్యామిలీ ’ అనే పెయింటింగ్ మాత్రం అతనిదే అని కొన్ని సంవత్సరాల క్రితం అతని పక్షంగా కోర్ట్ తీర్పునిచ్చింది. కాబట్టి గిల్బర్ట్ వద్ద ఉన్న చిత్రమే అసలైందని చెప్పడంలో సందేహం లేదు. దాని నకిలీ చిత్రమేమయిందో ఇరవై సంవత్సరాల నుంచి దాని ఆనవాళ్ళు ఇంతవరకూ బయటపడలేదు. నాకు తెలిసిందింతే. నాకు పనుంది. వస్తా’ అన్నాడు హ్యేజెల్ స్నేహితుడు. ‘ఒక్క నిమిషం. ఆ నకిలీ చిత్రం చివరిసారి ఎవరి దగ్గరుండింది?’అడిగాడు హ్యేజెల్. ‘చివరిసారి రింగ్ మియర్ అనే ఇంగ్లాండ్ ప్రాంతీయాధికారి దగ్గరుండేది. ఎప్పుడైతే అది నకిలీదని తెలిసిందో అతనికి దాని పైన ఆసక్తి పోయింది. ఎవరికో కారు చౌకగా అమ్మేశాడని ఎవరో చెప్పగా విన్నాను. అయినా కాటికి కాళ్ళు చాపుకున్న ఆ ప్రాంతీయాధికారికి పెయింటింగ్స్ మీద పిచ్చి వ్యామోహమెందుకో?’ అన్నాడా మిత్రుడు. ‘అతని వయసు?’ ‘ఎనభై ఏళ్ళు, అతడు పెయింటింగ్స్ అంటే పడిచస్తాడు’ చెప్పాడు మిత్రుడు. ‘అమ్మేశాడని ఎవరో చెప్పారంటే, కచ్చితంగా అమ్మేశాడని కాదుకదా దాని అర్థం? ఒక్కొక్కసారి ఈ ఔత్సాహికులంతా వింతగా ప్రవర్తిస్తారు. వాళ్ళల్లో నిజాయితీ ఉండదు. నాకు తెలిసిన ఒక పెద్దమనిషి అతని మిత్రుని ఇంట్లోనుండి కష్టపడి సేకరించిన స్టాంప్స్ దొంగిలించాడు. ఏం మనుషులు? ఏదేమైనా రైల్వే వ్యాగన్ ఎలా సైడింగ్ ట్రాక్‌లోకి మళ్ళిందో వెంటనే కనుక్కొని తీరాలి’ అని నిశ్చయించుకొన్నాడు హ్యేజెల్. స్కాట్లాండ్ వారిచ్చిన చిరునామాకు బయలుదేరాడు. అతని బ్యాగులో ఉన్న ఒక ఖాళీ కార్డ్ తీసుకొని దానిపై ‘సర్ రింగ్ మియర్ నుండి’ అని రాసుకొని దాన్ని ఒక కవరులో పెట్టాడు. అలెన్‌తో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని అక్కడున్న సేవకురాలికిచ్చి కవరు అలెన్‌కు ఇమ్మన్నాడు. వెంటనే లోపలి నుండి అనుమతి లభించింది. ‘ఏం కావాలి నీకు?’ అడిగాడు అలెన్. ‘నేను సర్ రింగ్ మియర్ తరఫున వచ్చాను. చర్న్ సంఘటన గురించి మాట్లాడ్డానికి’ ధైర్యంగా చెప్పాడు హ్యేజెల్. ఊహించని రీతిలో ఆ గది తలుపు మూసి తాళం చెవిని జేబులో వేసుకొన్నాడు. ఆ వెంటనే పిస్టల్ తీసి అలెన్‌కి గురిపెట్టాడు.. ‘చర్న్ అనే ప్రదేశంలో నీవు ఆ రాత్రి ఒరిజినల్ వర్ణచిత్రాన్ని మార్చేశావు’ అంటూ. ‘నేనే మార్చానని ఎలా తెలుసు?’ అడిగాడు అలెన్. ‘నీవు పాయింట్లను పని చేయించే లీవర్ మీద, డబ్బాతో ఆయిల్ ఒంపుతున్నప్పుడు, నీ బొటనవేలికి కొంచెం నూనె అంటుకుంది. అదే చేతితో లీవర్ హ్యాండిల్‌ను పట్టుకొని ట్రాక్ మార్చావు. అప్పుడు లీవర్ హ్యేండిల్ మీద నీ వేలిముద్రలు పడ్డాయి. ఆ విధంగా నీవు చాలా తెలివి తక్కువ పని చేశావు. నేను వాటిని ఫొటో తీశాను. స్కాట్లాండ్ వారు అవి నీ వేలిముద్రలే అని నిర్ధారించారు. పాత నేరస్తుడువి కదా?’ చెప్పాడు హ్యేజెల్. లోలోపలే తనను తాను తిట్టుకుంటూ ‘ఆయన నన్ను చిత్తరువు తీసుకురావడం వరకే నియమించాడు. ఆయన పేరు బయటకు రావడం అతనికి ఇష్టం లేదు’ చెప్పాడు అలెన్. ‘ఆ చిత్రాన్నెలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. ఎవ్వరిపేరూ బహిర్గతమవకుండా, అసలు విషయం చడీచప్పుడు కాకుండా సమసిపోవాలంటే అదెక్కడుందో తెచ్చివ్వాలి. రింగ్ మియర్ దగ్గరుందా?’ అడిగాడు హ్యేజెల్. ‘ఇంకా అతని చేతికి చేరలేదు. అదెక్కడుందో అతనికీ నాకూ మాత్రమే తెలుసు’ ఒప్పుకున్నాడు అలెన్. ‘అలా అయితే కాగితం మీద స్టేట్మెంట్ రాసివ్వు. ఆ పెయింటింగ్ సర్ గిల్బర్ట్కు వాపసు చేస్తే సరి. అవసరమైతేనే నీ స్టేట్మెంట్ని ఉపయోగిస్తానని మాట ఇస్తున్నాను’ అన్నాడు హ్యేజెల్. కొంచెం సంభాషణ జరిగిన తరువాత అలెన్.. ‘ఇంగ్లాండ్‌లోని ఆ ప్రాంతీయాధికారి ఇదంతా చేశాడు. అతను నన్నెలా కలుసుకున్నాడనే విషయం అప్రస్తుతం. ఆ పిక్చరుకు సంబంధించి నకలును అధిక ధరకు కొని ఎవరికీ తెలియకుండా పాతసామానుల గదిలో దాచాడు. తాను కొన్న నకిలీ పెయింటింగ్ ఎవరికో అమ్మేశాడని ప్రజలు అనుకునేలా భ్రమ కలిగించాడు. దాని అసలు చిత్రం ఎప్పటికైనా దొరుకుతుందనీ, తన దగ్గరున్న నకిలీ పిక్చర్‌ని తొలగించి, అసలైన చిత్రాన్ని తన స్వంతం చేసుకోవాలనీ ఎంతో ఆశపడ్డాడు. అతనికి పెయింటింగ్సంటే విపరీతమైన పిచ్చి. అసలైన చిత్రాన్ని చోరీ చేసి అతనికివ్వడానికి నేను ఒప్పుకున్నాను. ఈ పనిలో ముగ్గురం ఉన్నాం. అసలు చిత్రం ఏ ట్రైనులో రవాణా కానుందో సులభంగా తెలుసుకున్నాం. ట్రైన్ ట్రాక్ గ్రౌండ్ ఫ్రేముని మారు తాళం చెవిని ఉపయోగించి తెరిచాం. ఇక బోల్టులు తీయడం పెద్ద కష్టమేమీ కాదు. నేననుకున్నట్టుగా పని జరగడానికి వీలుగా పాయింట్స్‌కు బాగా ఆయిల్ పట్టించాను. ఒకడు సైడింగ్ వద్ద.. వ్యాగన్ ట్రాక్ మీద పరుగులిడుతున్నప్పుడు సంకేతాలివ్వడం కోసం పక్కన పొదలమాటున సిధ్ధంగా ఉన్నాడు. నేను పాయింట్స్‌ను అనుగుణంగా కదిలించడానికి తయారుగా ఉన్నాను. మరొకడు ఒక వ్యాగన్ లోపల రెండు గట్టి పొడవైన మోకు తాళ్ళతో టార్పాలిన్ కింద నక్కి ఉన్నాడు. రెండు తాళ్ళ చివరల ఇనుప కొక్కేలున్నాయి. ట్రైన్–అప్టన్ స్టేషన్ వదలగానే అతను పని మొదలు పెట్టాడు. గూడ్స్ ట్రైన్లు చాలా నిదానంగా ప్రయాణిస్తాయి. అందువలన కావాల్సినంత సమయముంటుంది. ట్రైన్ వెనుకనున్న బ్రేక్ వ్యాన్ నుండి లెక్కవేసుకొంటే మేము తప్పించబోయే వ్యాగన్ నంబరు 5. మొట్ట మొదట అతడు 4వ వ్యాగన్ నుండి 6వ వ్యాగన్ వరకు తాడు చివర్లకున్న కొక్కేలను వ్యాగన్ల రెండు పక్కల చివర్లకు బిగించాడు. ఇప్పుడు అతని చేతిలో మిగిలిన తాడు చుట్ట ఉంది. తరువాత అతను వ్యాగన్ నంబర్ 5 మీద కూర్చొని 4వ నంబరు వ్యాగన్ నుండి లింకును విడగొట్టాడు. అప్పటికే అతను రైల్వే కప్లింగ్ సిబ్బంది సహాయం తీసుకొని ఉన్నాడు. కాబట్టి పని సులభమైంది. అప్పుడు చేతిలో మిగిలున్న తాడును వదిలాడు అది బిగువుగా అయ్యేదాకా. తరువాత రెండవతాడు చివరనున్న కొక్కేన్ని 5వ వ్యాగన్ మొదలు నుండి 6వ వ్యాగన్ చివర్న తగిలించి, రెండింటిమధ్యనున్న లింకు తొలగించి, 5వ దానిని 6వ వ్యాగన్ నుండి విడగొట్టాడు. మిగిలిన తాడు చుట్టను–బిర్రుగా బిగుసుకునే దాకా విడిచిపెట్టాడు. ఇప్పుడు చూడండి జరిగిన తమాషా. ట్రైను చివరి వ్యాగన్లు– 4 నుండి 6 దాకా పొడవైన తాడుసహాయంతో లాగబడుతుంటే.. వాటి నడుమ ఖాళీ జాగా వదులుతూ ఆ జాగాలో 5వ నంబరు వ్యాగన్– 6వ వ్యాగన్ నుండి చిన్న తాడు సహాయంతో లాగబడుతున్నది. అప్పుడతడు చేతిలో పదునైన కత్తిపట్టుకొని 6వ వ్యాగన్ మీద సిద్ధంగా ఉన్నాడు. మిగతా పని చాలా సులభం. నేను ట్రాక్‌కు దగ్గరగా నిలబడి లీవరును పట్టుకొని సిద్ధంగా ఉన్నాను. ఇంజను ముందుకెళ్ళిపోయిన తక్షణం నేనింకా ముందుకొచ్చాను. 6వ నంబరు తరువాత జాగా ఏర్పడగానే, దాన్ని (లీవరును) వెనక్కి లాగాను. 5వ వ్యాగన్ సైడింగ్ ట్రాక్ మీదుగా పక్కకు మళ్ళింది. అదే సమయంలో నా అనుచరుడు తాడును అతివేగంగా తెగ్గోశాడు. ట్రైన్ అక్కడ చాలా నెమ్మదిగా వెళుతోంది. అలా వెళ్తుండగా నేను వెంటనే లీవరును వెనక్కెత్తి మళ్ళీ య«థాస్థితికి తెచ్చాను. ట్రైను ప్రధాన పట్టాలపై మామూలుగానే వెళ్ళిపోయింది. కాంప్టన్ స్టేషన్లోకి ప్రవేశించేముందు కొంచెం ట్రాక్ తగ్గులో ఉండడం వల్ల వెనకున్న నాలుగు వ్యాగన్లూ ప్రధాన ట్రైను దగ్గరగా రాసాగాయి. అప్పుడు నా అనుచరుడు, చేతిలోని తాడును బలంగా లాగి 4వ వ్యాగనుకు 6 వ వ్యాగన్‌ను అనుసంధానించాడు. కాంప్టన్ స్టేషన్లోకి వెళ్ళేటప్పుడు ట్రైను చాలా మందగమనంతో పోతున్నందువల్ల నా అనుచరుడు ట్రైను మీద నుండి కిందకు దూకేశాడు. అదీ జరిగింది’ అని చెప్పడంతో హ్యేజెల్ కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. ‘ఇంతవరకూ ఇటువంటి సంఘటన రైల్వే చరిత్రలో జరగలేదు. చాలా తెలివైన ప్రణాళిక. నిర్వహణ అద్భుతంగా ఉంది. మరి అసలైన వర్ణచిత్రాన్నెక్కడ దాచావ్?’ అడిగాడు హ్యేజెల్. ‘జరిగిన విషయాన్ని ఎప్పుడూ ఎవరికీ వెల్లడిచేయనని భరోసా ఇస్తే చెబుతాను’ అన్నాడు అలెన్. అందుకు హ్యేజెల్ ఒప్పుకున్నాడు. అతడు అన్ని వివరాలూ చెప్పాడు. అసలు వర్ణ చిత్రాన్ని సర్ గిల్బర్ట్ మురెల్కు అప్పగించారు. ప్రతిష్ఠపోతుందనే ఉద్దేశంతో రైల్వే వాళ్ళు ఆ సంఘటన బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు..‘ఎందుకైనా మంచిది. నకిలీ చిత్రాన్నే ఎగ్జిబిషన్లో ఉండనివ్వండి’ సలహా ఇచ్చి. ‘ఏదేమైనా ఇటువంటి తెలివైన నేరస్థుడు శిక్షించబడి ఉండాల్సింది’ అని తనలో తనే అనుకున్నాడు– హ్యేజెల్. ఆనందోత్సాహ సంద్రంలో మునిగిన సర్ గిల్బర్ట్ మురెల్.. హ్యేజెల్ను విందుకు ఆహ్వానించాడు. ‘చాలా సంతోషం. అయితే ఒక విన్నపం. భోజనానికి ఉపక్రమించే ముందు ఇక్కడ కొంచెం సేపు నేను వ్యాయామం చేసుకోవడానికి అనుమతించండి. తిన్నది అరిగించుకోవాలంటే అందుకు తగ్గ వ్యాయామం అవసరం అనే అంశాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి’ అన్నాడు హ్యేజెల్. ఆంగ్ల మూలం : విక్టర్ వైట్ చర్చ్ అనువాదం: శొంఠి జయప్రకాష్ -
పంచతంత్రం: కథన బలం.. కదన నీతి!!
కథ అంటే నీతి.. కథ ఒక రీతి.. కథ అంటే నిజాయితీ! బాల్యంలో కథలే పిల్లలను వేలు పట్టి నడిపిస్తాయి. పంచతంత్రాలను బోధిస్తూ, ప్రపంచంలో ఎవరితో ఎలా నడచుకోవాలో బోధిస్తాయి. చిన్నప్పుడు విన్న కథన బలమే... ఆ కాల్పనిక శక్తే పెద్దయ్యేంతవరకూ...ఆ మాటకొస్తే పెద్దయ్యాక కూడా తెలివితేటలను పెంపొందిస్తాయి. ఊహలతోనే వ్యూహాలను నెరుపుతాయి. ఈ కథల ద్వారానే కదా ఆ నాడు విష్ణుశర్మ.. మూర్ఖులు, ఎందుకూ పనికిరాని వారిగా పేరు పొందిన రాజకుమారులను ప్రయోజకులను చేసింది. వారికి ఆయన బోధించిన మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం, అపరిక్షిత కారకం... అంటే ఏమీ పరీక్ష చేయకుండానే పనిలోకి దిగడం, ఇతరుల చెడు కోరడం. ఈ కథలు వింటూనే పిల్లలు ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కథలోని పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. కథతోబాటు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు? ఇలా ఎందుకు? అని అడుగుతారు. దీంతో వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది. ప్రశ్నించే తత్త్వంతోబాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అలవడుతుంది. అన్నిటికీ మించి వివిధ పదాలను పరిచయం చేస్తూ భాషా సంపత్తిని పెంచడానికి కథలు దోహదం చేస్తాయి. మిత్రలాభం, మిత్రభేదానికి చెందిన ఒక కథ చెప్పుకుందాం ఇప్పుడు.. కలసి ఉంటే కలదు సుఖం మగధ దేశంలో మందారవతి అనే వనం. ఆ వనంలో ఒక లేడిపిల్ల, ఒక కాకి ఎంతో స్నేహంగా కాలం గడుపుతున్నాయి. ఒకసారి ఆ వనంలోకి నక్క ఒకటి వస్తుంది. ఆ వనంలో అటూ, ఇటూ పరుగులు తీస్తున్న నక్కకు లేడిపిల్ల కనిపించింది. బాగా కండపట్టి బలంగా ఉన్న ఆ లేడిపిల్లను చూడగానే ఎలాగైనా సరే దాని మాంసం తినాలనుకుంది నక్క. వెంటనే లేడి దగ్గరకు వెళ్ళి దానితో మాటలు కలిపింది. తనకు ఎవరూ తోడులేరని, తాను ఒంటరినని దొంగేడుపులు ఏడ్చింది నక్క. నిన్ను చూడగానే తనకు తనవారంతా గుర్తుకు వచ్చారని, చాలా సంతోషంగా ఉందని లేడిపిల్లతో నమ్మబలికింది నక్క. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల, దానితో స్నేహం చేసేందుకు ఇష్టపడి, తన నివాస స్థలానికి తీసుకెళ్లింది. వనంలోని మందారం చెట్టుపైన కూర్చున్న లేడిపిల్ల స్నేహితురాలైన కాకి ఇది గమనించింది. నక్కను గురించి వివరాలడిగింది. లేడిపిల్ల ఈ నక్క దిక్కులేనిదని, తనతో స్నేహంకోరి వచ్చిందని కాకితో చెప్పింది. అంతా విన్న కాకి, మంచీ చెడూ విచక్షణ లేకుండా, ఎవరుబడితే వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తూ... తనకు తెలిసిన గద్ద, పిల్లి కథను చెబుతుంది. కాకి అలా చెబుతుండటంతో పక్కనే ఉన్న నక్కకు పట్టరాని కోపం వచ్చింది. అయినా సరే, తమాయించుకుంటూ... అదేంటి మిత్రమా, అలాగంటావు? నువ్వు మాత్రం లేడిపిల్లను కలుసుకునేటప్పటికి కొత్తదానివే కదా, మరి ఆ తరువాత మంచి స్నేహితులు కాలేదా...? అంటూ కోపాన్ని నిగ్రహించుకుని నిష్ఠూరమాడింది నక్క. కాకి, నక్క అలా వాదులాడుకుంటుండగా... లేడిపిల్ల కలుగజేసుకుని మనలో మనకు తగాదాలెందుకు, వ్యక్తిగత ప్రవర్తనను బట్టే, మిత్రుడైనా, శత్రువైనా ఏర్పడుతుంటారని సర్దిజెప్పింది. ఇక అప్పటి నుంచి లేడి, కాకి, నక్క ఎంతో స్నేహంగా కాలం గడుపసాగాయి. కానీ నక్కకు మాత్రం లేడిపిల్ల మాంసం తినాలన్న కోరిక మాత్రం చావలేదు. దీనికి తగిన సమయం కోసం వేచి చూడసాగింది. ఇలా కొంతకాలం గడిచాక నక్క ఒకసారి లేడి దగ్గరకు వచ్చి తాను ఒకచోట పైరు దట్టంగా పెరిగి ఉన్న పొలాన్ని చూసివచ్చానని, తనతో వస్తే దాన్ని చూపిస్తానని చెప్పింది. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల దానితోపాటు వెళ్లి బాగా ఏపుగా పెరిగిన పైరును చూసి ఎంతో సంతోషించింది. రోజూ ఆ ప్రాంతానికి వెళ్లి పైరును కడుపునిండా మేసి వచ్చేది. అయితే అది ఎంతో కాలం సాగలేదు. ఆ పైరు యజమాని లేడిపిల్ల ఇలా రోజూ వచ్చి పైరును తినేసి వెళ్లటం గమనించాడు. దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని చాటుగా వలపన్నాడు. విషయం తెలియని లేడిపిల్ల మామూలుగానే పొలం మేసేందుకు వచ్చి, వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా, అది వల నుంచి బయటపడలేక పోయింది. కాసేపటికి అక్కడికి వచ్చిన నక్కను చూసి, తనను ఎలాగైనా తప్పించమని నక్కను వేడుకుంటుంది లేడిపిల్ల. అయితే, ఆ వల మొత్తం నరాలతో అల్లి ఉందని, తాను నరాలను నోటితో కొరకలేనని చెప్పి, పక్కనే ఉన్న పొదచాటుకు వెళ్లి నక్కి కూర్చుంటుంది. నక్క ఇలా మోసం చేసినందుకు లేడిపిల్ల చాలా బాధపడుతుంది. మేతకు వెళ్లిన తన మిత్రుడు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కాకి వెతుక్కుంటూ రాగా, వలలో చిక్కుకుపోయిన లేడిపిల్ల కనిపిస్తుంది. ఇదంతా ఎలా జరిగిందని కాకి ప్రశ్నించగా, నక్క మాటలను నమ్మినందుకు తనకు ఈ రకంగా కీడు జరిగిందని కన్నీళ్ళు పెట్టుకుంటుంది లేడిపిల్ల. ఇవి రెండూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే పొలం యజమాని చేతిలో దుడ్డుకర్రతో అటుగా రావడం గమనించాయి. జరగబోయే అపాయాన్ని గ్రహించిన కాకి, లేడితో వలలో చచ్చినట్లు నటిస్తూ పడుకోమని, తాను చచ్చిన నీ కళ్లను పొడుస్తున్నట్లుగా నటిస్తానని, తాను సమయం చూసి అరవగానే లేచి పరుగుతీయమని, అప్పటికి అంతకుమించిన ఉపాయం మరోటి లేదని లేడికి అభయం ఇచ్చింది కాకి. పొలం యజమాని లేడి చచ్చిపోయిందనుకొని మెల్లగా వలను విడదీశాడు. దీన్ని గమనించిన కాకి పెద్దగా కేక పెట్టడంతో, ఒక్క ఉదటున లేచి పరుగెత్తింది లేడిపిల్ల. లేడి తనను మోసం చేసి పారిపోవడం భరించలేని పొలం యజమాని తన చేతిలోని బడితను లేడి మీదకు విసిరాడు. అయితే, అది గురితప్పి పక్కనే పొదలో దాగివున్న నక్కకు తగిలి చచ్చింది. లేడిపిల్లను కాపాడుకుని దాన్నే అనుసరిస్తూ... వనంలోకి వెళ్లిపోయింది కాకి. ఈ కథ సారాంశం ఏమిటంటే... కొత్తగా వచ్చినవారిని త్వరపడి నమ్మితే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో చెబుతుంది. అలాగే, ఎవరికైనా అపకారం చేయాలనుకుంటే, అలా అనుకున్న వారికే అపకారం ఎదురౌతుందనే విషయాన్ని కూడా చెప్పకనే చెబుతుంది. పునఃకథనం: డి.వి.ఆర్. చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!! -
కథ: కాయ్ రాజా కాయ్
(కాలం : 1963–65 : తీర ప్రాంతం – ఊళ్ళపాలెం.. విజయవాడ – మద్రాసు జాతీయ రహదారిపై సింగరాయకొండ నుంచి తూర్పున 4 మైళ్ళలో ఉండే ఊరు. నాలుగైదు గ్రామాలకు జంక్షన్. ప్రధాన వ్యాపారం : ఉప్పు తయారీ, అమ్మకం. అప్పడు నా వయస్సు : 11–13 సంవత్సరాలు) ‘రాజా! మీ నాన్న పిలుస్తున్నాడు’ (చిన్నా –కాంపౌండర్ సందేశం) ‘........................’ ‘రాజా! నిన్నే.. నాన్న పిలుస్తున్నాడు’ ‘ఎహెఫో.. వస్తాన్లే ఫో..’ ∙∙ ‘రాజా! మీ నాన్న రమ్మంటున్నాడు’ (సుబ్బయ్య–జూనియర్ కాంపౌండర్ సమన్లు) ‘వస్తున్నానని చెప్పు.. నువ్వు పో... నే.. వస్తున్నా నీ వెనకాలే...’ ∙∙ ‘అన్నయ్యా! నాన్నే వచ్చాడు. అక్కడున్నాడు. నిన్ను తీసుకురమ్మన్నాడు’ ‘నాన్ననా! నాన్నెందుకు వచ్చాడు.. ఎక్కడికి వచ్చాడు.. ఇప్పుడెక్కడున్నాడు.. నన్ను పిలిచింది నాన్ననా.. నాకట్టా ఎందుకు చెప్పలేదు.. ఏమంటున్నాడు.. కోపంగా ఉన్నాడా.. అసలెందుకు రమ్మన్నాడు.. ఇక్కడున్నట్లు మీకెట్టా తెలుసు?’ ‘నువ్విక్కడ ఉన్నట్లు నాన్నకు తెలిసింది’ ‘నాన్నకు తెలిసిందా..ఎట్లా?’ ‘ఏమో.. చాలా కోపంగా ఉన్నాడు’ ‘అమ్మో! పా.. వస్తున్నా.. బాగా కోపంగా ఉన్నాడా.. నిజం చెప్పు.. బాగా కోపంగా ఉన్నాడా.. నాన్నకెవరు చెప్పారు నేనిక్కడున్నానని?’ ‘.. .......................’ ∙∙ ‘ఇదుగో రాజా! ఇప్పుడే వస్తా.. వచ్చేదాకా చూస్తుండు..జాగర్త’ ‘పో.. నువ్వు పోయిరా.. నేను చూసుకుంటాలే.. తొందరగా వచ్చేయ్’ ఆ.. రండి బాబూ.. రండి.. కాయ్ రాజా కాయ్.. అణాకు అణా.. బేడాకు బేడా.. రాజా రాణీ ఆటీన్ ఇస్పేట్.. కళావర్ డైమన్.. రండి రండి.. ఒక్క ఏనుగుకు.. పావలాకు పావలా.. మూడేనుగలు.. పావలాకు ముక్కాల్ రూపా.. అణాకు అణా.. మూడు గుర్రాలు పడితే ముప్పావలా’ డమకు డమ టమకు టమా.. రండి బాబూ రండి.. ∙∙ స్కూలునించి వచ్చి స్నానం చేసి.. ఉతికి ఆరేసి రెడీగా ఉంచిన బట్టలు మార్చుకుంటున్నా. అమ్మ అన్నం ప్లేటుతో వచ్చింది. ‘మల్లయ్య నీకోసం చూస్తున్నాడు. తొందరగా తెములు.. అక్కడ నీళ్ళు నువ్వే పట్టు. చాలా దూరం పోవాలిగా’ అంటూ అమ్మ తొందర పెడుతున్నది. గబగబా తినేశా. మల్లయ్య కావిడెత్తుకుని ముందుపోతుంటే నేను పక్కన నడిచి వెడుతున్నా. ∙∙ మా ఊరంతా చవిటినేల. నీళ్ళ ఎద్దడున్న ప్రాంతం. తాగడానికి, వంటకు నీళ్లు కావాలంటే ఊరికి రెండు మైళ్ళ దూరంలో ఒక మంచినీళ్ళ బావి ఉంది. ఊరంతా అక్కడి నుంచే మోసుకొచ్చుకుంటారు. మోయలేని వాళ్లకోసం కావిళ్ళతో నీళ్లు మోసుకొచ్చే వాళ్ళుంటారు. బిందెకు పావలా. అలా మాకు మల్లయ్య రెగ్యులర్‌గా వచ్చేవాడు. మడి ఆచారం పాటించే రెండు మూడు కుటుంబాల వాళ్ళు అక్కడ ఉన్నారు. అందులో మాదొకటి. ఆచారం– అవసరం– వ్యవహారం .. ఈ మూడూ కలిపి ఆచరణలో చూడాలంటే.. రెండు ఇత్తడి బిందెలను బూడిదా, చింతపండేసి బాగా తోమి కడిగి అమ్మ కావిట్లో పెట్టి మూతలు పెట్టేది. పక్కన నేను తడి తువ్వాలు, చాంతాడు బొక్కెన్లో వేసుకుని మల్లయ్య పక్కన పోతా. బావి దగ్గరకు పోయిన తరువాత నేను చాంతాడు గిలక్కి వేసి బొక్కెన్ను బావిలోకి వదిలేసే వాణ్ణి. చాంతాడు రెండో కొస మల్లయ్య పట్టుకుని నీళ్ళ బొక్కెనను పైకి లాగితే.. దాన్ని నేను అందుకుని బిందెల్లో పోసేవాణ్ణి. అవి నిండిన తరువాత మూతలు పెడతా. బిందెలు ముట్టుకోకుండా మల్లయ్య కాడిని భుజానికెత్తుకుంటే.. నేను చాంతాడు చుట్టి బొక్కెన్లో పెట్టుకుని ఇంటి ముఖం పట్టేవాళ్ళం. ఒకవేళ నేను మైలపడితే.. నీళ్లు నింపడానికి తడి తువ్వాలు కట్టుకోవాల్సి వచ్చేది. పోను రెండు మైళ్ళు, రాను రెండు మైళ్లు.. నేను స్కూలు సంగతులు, మా ఫ్రెండ్స్ విషయాలు చెబుతుంటే.. మల్లయ్య చాలా కబుర్లు చెప్పేవాడు.అవి ఆ వయసుకి నాకు థ్రిల్లింగా ఉండేవి. వాళ్ల వాడలోవి, వాళ్ళ ఫ్యామిలీవి, వాళ్ళ జీవితాలు, వ్యాపకాలు.. బోల్డు టైంపాస్. చెప్పడానికి మల్లయ్య జంకేవాడు కానీ నాకు మాత్రం తెగ ఆసక్తిగా ఉండేది. మరిన్నింటి కోసం గుచ్చిగుచ్చి అడిగేవాణ్ణి. ఆ సమయంలో నాకు పరిచయం అయిన మల్లయ్య ప్రధాన జీవన వ్యాపకం – డైమన్ డబ్బా కమ్ లాటరీ చక్రం. ∙∙ సింగరాయకొండ (ప్రస్తుతం ప్రకాశం జిల్లా.. కథాకాలానికి అది నెల్లూరు జిల్లాలో ఉండేది) నుంచి రోడ్డు ఊళ్ళపాలెం ఊరి మధ్యలో గుండా బకింగ్‌హాం కాల్వ దాకా వెడుతుంది. అది దాటితే కొద్ది దూరంలోనే సముద్రం. దాటడానికి వంతెన కూడా ఉండేది కాదు. అక్కడక్కడా ఒడ్డుకు ఒక వైపున గుంజపాతి దానికి ఒక పడవను కట్టి ఉంచేవారు. దానిలో చివరగా కూర్చునే వాడు దాన్ని గట్టిగా నెట్టి కూర్చుంటే అవతలి ఒడ్డుకు చేరుకునేది. అటు ఎక్కిన వాళ్ళు తాడు పట్టుకుని లాక్కుంటే ఇవతలి ఒడ్డుకు చేరుకునే వారు. ఊరిలో ప్రధాన వ్యాపారం ఉప్పు. ఉప్పు కొటార్లు ఉండేవి. లారీల్లో రవాణా సాగేది. జనం తిరగాలంటే నడకే ఎక్కువ. లేదంటే సైకిళ్ళు, జట్కా బళ్ళే. తారు రోడ్డు కూడా లేదు, కంకర రోడ్డే. కరెంటు కూడా లేదు. రాత్రయితే కిరసనాయిల్తో వెలిగే పెట్రోమాక్స్ లైట్లు, లాంతర్లు, బుడ్లే. ఊరి మధ్య గుండా పోయే ఆ రహదారిలోనే పెద్ద మలుపు దగ్గర ఒక జంక్షన్ ఉంది. అదే ఊరికి పెద్ద మార్కెట్. అంగళ్ళన్నీ అక్కడే. కూరగాయలు, చేపలు, టైలర్లు, హోటళ్ళు, ఫుట్‌పాత్ వ్యాపారాలు.. సాయంత్రం నుంచి రాత్రి దాకా బాగా రద్దీగా ఉంటుంది. ఉప్పు, దాని అనుబంధ వ్యాపారాలు జోరుగా సాగేవి కాబట్టి వ్యాపారులు, ముఖ్యంగా వారి పిల్లల జేబులు కూడా ఓవర్ ఫ్లో అవుతుండేవి. ఆ జంక్షన్‌లోనే ఒక ఓరగా మా మల్లయ్య నడిపే డైమన్ డబ్బా లాటరీ. ఒక పట్టా పరచి ఉంటుంది. దానిమీద పేక ముక్కల్లోని ఆటీన్, కళావర్, డైమన్(డైమండ్), ఇస్పేట్( స్పేడ్)ల చిహ్నాలు పెద్దవిగా ముద్రితమై ఉంటాయి. ఆ పట్టా పక్కనే మరో పట్టా. దానిమీద ఒంటె, గుర్రం, ఏనుగుల బొమ్మలు రెండు అడ్డ వరుసల్లోముద్రితమై ఉంటాయి. నిర్వాహకుడి ముందు పట్టాపై ఒక చక్రం ఉంటుంది. దానికి ఒక సూచీ. ఆ చక్రం మీద కూడా వీటి బొమ్మలు ముద్రితమై ఉంటాయి. ఏ బొమ్మ మీద అయినా డబ్బు పందెం కాయవచ్చు. అన్ని బొమ్మల మీద డబ్బులు బాగా పడే దాకా జూదగాళ్ళను ఆకర్షించడం, ఆ తరువాత చక్రాన్ని నిర్వాహకుడు గట్టిగా తిప్పితే అది తిరిగి తిరిగి పూర్తిగా ఆగే సమయానికి దాని సూచీ ఏ బొమ్మ మీద ఆగితే ఆ బొమ్మ మీద పందెం కాసిన వారికి డబ్బులు. చక్రంలో మూడు బొమ్మలుంటే మూడింతలు, రెండుంటే రెండింతలు, ఒకటే ఉంటే దానికి సమానమైన డబ్బు నిర్వాహకుడు చెల్లిస్తాడు. డైమను డబ్బాకయితే ఒక డబ్బాలో చతురస్రాకారపు పాచికలు (క్యూబులు), వాటి మీద డైమన్, ఆటీన్, ఇస్పేట్, కళావర్ చిహ్నాలు ఉంటాయి. వాటిని ఒక డబ్బాలో వేసి బాగా గిలకొట్టి కింద వేయంగానే పాచికల్లో పైన కనిపించిన చిహ్నాలను బట్టి పందెంరాయుళ్ళకు చెల్లిస్తారు. పాచికల మీద కనిపించని బొమ్మల మీద కాసిన డబ్బంతా నిర్వాహకుడిదే. ∙∙ మా నాన్న డాక్టరు. ఆర్.ఎం.పి డాక్టరయినా, హోమియో, ఆయుర్వేదం, అల్లోపతి.. మూడింట్లో వైద్యం చేసేవారు. మెయిన్ రోడ్డుకు కొద్దిమీటర్ల లోపలికి ఓ సందులో మా ఇల్లు ఉండేది. దాని అద్దె పది రూపాయలు. అది ఇల్లులా కనిపించదు.. బయటినుంచి చూస్తే. ఇప్పటి భాషలో చెప్పాలంటే నర్సింగ్ హోం. పెద్ద ఇల్లు. ముందు పెద్ద వసారా గ్రిల్స్‌తో. దాని ముందు విశాలమైన ఒక వేదికలాంటి ఎత్తయిన అరుగు. ఇంటి వెనుక దొడ్డి (పెరడు) కూడా పెద్దది. అదే వెయ్యి గజాలదాకా ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్. అరుగు మీద ఔట్ పేషంట్లు కిక్కిరిసి ఉండేవారు. వసారాలో బెడ్స్ (మంచాలు), ఇద్దరు కాంపౌండర్లు బిజీబిజీగా.. చుట్టుపక్కల గ్రామాల నుంచి రోగులు బండ్లు కట్టుకుని వచ్చేవారు. ఒకటీ అరా బండ్లు ఎప్పుడూ ఇంటి బయట వీథిలో ఉండేవి. మా నాన్నకు కొరుకుడుపడని కేసులు, ఎమర్జన్సీ కేసులు, సర్జరీ అవసరమయినవి సింగరాయకొండకు పంపేవారు. డా. హనుమంత రావుగారని రాష్ట్రస్థాయిలో పేరున్నాయన అని చెప్పుకునే వారు. ఆయనది కందుకూరు. మా ఇంట్లో రోగుల మంచాలున్న చోట ఆస్పత్రి భాగంలో రెండు పెట్రోమాక్స్ లైట్లుండేవి. వెనక ఇల్లు. మాకు లాంతర్లు, బుడ్లే. మా ఇంట్లోకి వెళ్లాలంటే వసారాలోని రోగులను, లోపల మంచాలను, రోగికి సహాయంగా వచ్చి అక్కడున్న వారిని దాటుకుంటూ లోపలికి వెళ్లాలి.. కొద్దిగా ప్రయాసతో కూడుకున్న పనే. వానాకాలం అయితే వీరి తాకిడి ఇంకా ఎక్కువ. ఆస్పత్రికి రాలేని రోగులను చూడడానికి మా నాన్నకు జట్కా పంపేవారు. అలా మా నాన్న ఓ రోగిని చూడడానికి మార్కెట్లో గుండా జట్కాలో వెడుతుంటే.. ‘ఆ.. రండి బాబూ.. రండి.. కాయ్ రాజా కాయ్.. అణాకు అణా.. బేడాకు బేడా..రాజా రాణీ ఆటీన్ ఇస్పేట్.. కళావర్ .. రండి రండి.. ఒక్క ఏనుగుకు .. పావలాకు పావలా.. మూడేనుగలు.. పావలాకు ముక్కాల్ రూపా.. అణాకు అణా.. మూడు గుర్రాలు పడితే ముప్పావలా.. డమకు డమ టమకు టమా.. రండి బాబూ రండి..’ అని వినిపించింది. ‘ఇది మా రాజా గొంతులాగా ఉందే. అయినా వాడికిక్కడేం పని?’ అనుకుంటూ కొద్దిగా ముందుకుపోయిన తరువాత జట్కా ఆపించి బండతన్ని చూసి రమ్మనమని పంపాడు. వాడు నన్ను గుర్తుపట్టి నిజాయితీగా వెళ్ళి ఉన్నమాట చెప్పేశాడు. అసలు మా నాన్న కోపానికి.. అక్కడే జంక్షన్ జామ్ అయ్యుండేది. కానీ మెడికల్ ఎమర్జన్సీవల్ల.. అప్పటికి.. నాకు, మల్లయ్యకు, మార్కెట్టుకు కొంత ఉపశమనం దొరికినట్టయింది. ∙∙ ‘నువ్వక్కడ ఉన్నట్లు నాన్నకు తెలిసింది’ ‘అమ్మో పా వస్తున్నా.. బాగా కోపంగా ఉన్నాడా? నిన్నే..బాగా కోపంగా ఉన్నాడా?’ ‘ఊ..’ చీకటి.. అంతా చీకటి.. బయటా లోపలా.. ముందు చెల్లెలు చేతిలో టార్చితో.. వెనక.. బాగా వెనకగా.. రోడ్డువారగా చిమ్మ చీకట్లో.. నక్కినక్కి పోతూ నేను.. మా ఇంటికి వెళ్లే సందు మలుపును ఓ ముప్పై మీటర్ల దూరం నుంచే చూశా. మసక చీకట్లో కూడా ఆ ఆకారం చిక్కగా కనిపించింది. నాన్న అక్కడే నిలబడి ఉన్నాడు. కానీ నాన్నలా కనబడలేదు. ఒక కాగడా మండుతున్నట్లు కనిపిస్తున్నది. అడుగులు ముందుకు పడడం లేదు.. తడబడుతున్నాయి. అరచేతులు అప్రయత్నంగా ముడుచుకుపోతున్నాయి. నా వేళ్ళను నేనే గట్టిగా పిసికేసుకుంటున్నా.. నాకు తెలియకుండానే. కచ్చితంగా ఆ క్షణంలో ఊహించని ఘటన.. నవగ్రహాలు కూడబలుక్కుని కత్తిని శనీశ్వరుడి చేతికిచ్చి నాముందు ఠపీమని దించాయి. ∙∙ హారన్ కొట్టుకుంటూ ఓ పోలీసు వ్యాను సింగరాయకొండ నుంచి మమ్మల్ని దాటుతూ దూసుకెళ్ళింది.. చూస్తుండగానే జంక్షన్లో దాడి చేయడం, మా మల్లయ్య డబ్బాతో సహా అన్ని జూదపు దుకాణాలను పీకేసి వాళ్ళను వ్యాన్ ఎక్కించుకుని అంతే స్పీడుగా మా ముందు నుంచి .. కాదు, కాదు.. మా నాన్న ముందు నుంచి విసురుగా.. కాగడా మీద కిరసనాయిలు చల్లి.. నో..నో.. కుమ్మరించి పోయింది. ∙∙∙ సముద్రంతో నాకు గాఢానుబంధం. పుట్టి పెరిగిందంతా.. పదో తరగతి దాకా.. అంతా సముద్రపు ఒడ్డునే. ఊహ వచ్చిన తర్వాత.. ఊళ్ళపాలెంలో ఎక్కువగా ఆడుకున్నది సముద్రంతోనే. కాని మొదటిసారి చూస్తున్నా.. సముద్రం ఎప్పుడూ కూడా అంత ప్రశాంతంగా కనిపించలేదు, ఒక మోస్తరు అలలు ఎప్పుడూ ఉండేవే.. దాటిపోతున్నా.. చిన్న శబ్దం.. వెనక్కి తిరిగిచూశా.. తలుపు లోపల గడియ పడింది. తలతిప్పేలోపే ‘జాస్’ సినిమలో లాగా ‘షార్క్’ చివ్వున లేచింది. పోతురాజుల చేతిలో కొరడా కూడా ఎప్పుడూ స్లో మోషన్లోనే ఆడుతుంటుంది. చివరన టప్పుమన్న శబ్దం మాత్రమే మన ఒళ్లు మనకు దగ్గరగా చేరుస్తుంది. మా నాన్న చేతిలో బెల్టు మాత్రం చాలా ఉత్సాహంగా ఊరేగుతున్నది, ఊగిపోతున్నది. లేత ఆకులంటే ఇష్టమేమో.. మధ్యలో ఏ కొమ్మకూ తగులుకోకుండా నేరుగా వచ్చి నన్ను చుట్టేసుకుంటున్నది. అంతగా పూనకంలో ఉన్న మా నాన్నను పట్టగలిగే ధైర్యం ఆ దేవుడికి కూడా ఆ క్షణంలో లేకపోయింది. ఇక మా అమ్మ ఎంత! గుండె నోట్లోంచి జారి కిందపడకుండా కొంగు అడ్డంగా కుక్కేసుకుంది. అయినా అది మాత్రం.. సందు చూసుకుని ముక్కుల నుంచి కరిగి కాల్వలు కడుతున్నది. పర్వతాలు పేలుతున్న శబ్దం.. చెవి కాదు, నా శరీరం వింటూనే ఉంది. కానీ నోరు తెరవలేని, కనురెప్ప ఎత్తి అమ్మ ముఖాన్ని చూడలేని దైన్యం. కారకుడు మా నాన్న కాదు, నేనే కనుక. నాలో ఆ పేలుళ్ల ప్రకంపనలు..లేత చర్మం పొరలు పొరలుగా పొంగుతున్నందుకు కాదు, ఒక్కగానొక్క కొడుకు (అప్పటికి తమ్ముడు పుట్టలేదు) మీద పెట్టుకున్న ఆమె ఆశలను ఒక్కసారిగా కుప్ప కూల్చివేసినందుకు.. నమ్మకాన్ని నిట్టనిలువుగా చీల్చివేసినందుకు.. మా నాన్న కంటే వయసులో కొద్ది తక్కువే అయినా బలిష్ఠులయిన ఇద్దరు కాంపౌండర్లకు కాళ్ళుచేతులు చచ్చుబడ్డాయి. శక్తంతా కూడదీసుకుని ఒకడు ముందుకొచ్చి బెల్టుకు, నాకు అడ్డంగా నిలబడేలోపే ఖాళీగా ఉన్న మా నాన్న రెండోచేతి విసురుకు వెళ్లి ఒక గోడకు కొట్టుకున్నాడు. రోషం వచ్చిన రెండో కాంపౌండరు (పిల్లల్ని పిచ్చిగా ప్రేమించేవాడు) లేచి అడ్డంగా వెళ్ళినా.. బెల్టుకు నా వీపుకు రెండు నిమిషాలకు మించి ఎక్కువ విరామం ఇవ్వలేకపోయాడు. తప్పు ఏ స్థాయిలో చేశానో నాకు తెలిసి వస్తున్నది కనుక.. నా లోపలి నుంచి ప్రతిఘటన లేదు, మానసికంగా కూడా. శిక్ష పడాల్సిందే.. అన్న మైండ్‌సెట్‌తోనే ఉన్నా. అయితే అంతటి శిక్షని ఆ కొద్దిపాటి జీవితంలో రుచి చూడడం అదే మొదటిసారి గనుక శరీరం కొంత ఇబ్బందిపడుతున్నది. అంత గంభీరమైన సన్నివేశంలో ఎక్కడో పాతాళంలోంచి పైకి చేదుకొచ్చిన స్వరంతో నేను మా నాన్నను అర్థించిందొక్కటే.. ‘మీ ఫ్లానల్ చొక్కా ఇవ్వండి, వేసుకుంటా’ అని (చలి ప్రదేశాల్లో మా నాన్న మిలిటరీ సర్వీసు నాటి యూనిఫాం అది. బాగా మందంగా ఉండేది. మా నాన్న లేనప్పడు ఆయనకు తెలియకుండా వేసుకుంటుండే వాణ్ణి) ∙∙ వాన వెలిసింది. మా అమ్మ కడుపులో దాచుకునే ప్రయత్నం చేసింది. తడిసి ముద్దయిన చీర నాకు చల్లగా తగులుతున్నా, నాగటి చాళ్ళలా వీపుమీద తేలిన చారికలు సలుపుతూ మంటలను రేపుతున్నాయి. వదిలించుకుని దూరంగా ఓ మూలన చుట్టచుట్టుకుని పడుకున్నా. తినను, తినలేను, తినబోను అని తెలిసి కూడా అమ్మ విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది మౌనంగా. తనూ తినదని తెలిసినా, అసలు ఆకలి, అన్నం మీద ధ్యాస పోకముందే. అంత పెద్దతప్పు అని తెలియకుండా చేసిన ఒక మహాపరాధం తాలూకు కుంగుబాటులో ఏ అపరాత్రో మా అమ్మే నిద్రాదేవతగా వచ్చి నన్ను ఒళ్లోకి తీసుకుంది. అంతటి నిశిరాత్తిరిలో.. లోయల్లో పడిపోతున్నా. పట్టుకోసం చూడకుండా పల్టీలు కొట్టుకుంటూ పోతున్న ఆ మైకంలాంటి నిద్రలో. నెగడులా మండుతున్న నా వీపుమీద ఓ మంచు స్పర్శ. మంచు కాదు, భ్రాంతి.. భ్రమ.. కాదు.. నిజంగా మంచునే. అంతా అడుగంటి పోయినా ఎక్కడో మిగిలిన కొద్దిపాటి ఓపికను కూడదీసుకుని ఒక కనురెప్ప ఓరగా తెరచి చూశా. సన్నటి వెలుతురు కిరణం ఒకటి.. ఇంకిన నా కంటితడిలో కరిగి ఇంద్రధనుస్సులా మెరిసి ఆరిపోతుంటే.. లీలగా ఓ చిత్రం.. లాంతరు పట్టుకుని అమ్మ.. ఏదో లేపనం తమలపాకుమీద వేసి అద్దుతూ మా నాన్న! ఇరవై అయిదు వేల పైచిలుకు పగళ్ళు, ఇరవై అయిదు వేల పైచిలుకు రాత్రుళ్ళలో అదే తొలి జూదం, అదే ఆఖరుది కూడా! - ములుగు రాజేశ్వర రావు చదవండి: Wemmer Pan Killer: అతనో నరరూప రాక్షసుడు.. ఏ శిక్ష వేసినా తక్కువే..! -
కథ: చూడలేని కళ్లు
సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్లే ‘గౌతమి’ ఎక్స్‌ప్రెస్ కదలడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఆయాసపడుతూ హడావిడిగా మా‘బే’ లోపల కొచ్చింది. కూడా వచ్చిన సిబ్బంది బెర్త్ నెంబర్ల కేసి ఎగాదిగా చూసి ‘అమ్మ గారూ, మీ బెర్త్ యిదే’ అంటూ నా పై నున్న మిడిల్ బెర్త్ కేసి చూపించారు. సూట్ కేస్ లోయర్ బెర్త్ కింద సర్ది బ్రీఫ్‌కేస్ ఆవిడ చేతికందించి వెళ్లొస్తాం అమ్మగారూ, జాగ్రత్తండి’ అంటూ వినయంగా నమస్కరించి రైలు కదులుతుండగా బయటకు పరుగెత్తారు. ఖాళీగా ఉన్న నా యెదుటి సీట్లో కూర్చున్న ఆమె ముందుగా హేండ్ బ్యాగ్‌నూ, ఆ తరువాత బ్రీప్కేస్నూ తెరిచి దేని కోసమో వెతుకుతూ గాబరాపడ్డం నేను గమనించాను. ‘మేడమ్ మీరేమైనా మర్చిపోయారా?’ అంటూ మర్యాద కొద్దీ పలకరించాను. ‘ఫర్వాలేదు లెండి బయల్దేరే తొందరలో షుగర్ టాబ్లెట్స్ మర్చిపోయాను’ అందామె కంగారు నణుచుకొంటూ. ‘ఇవి చూడండి. మీకు పనికొస్తాయేమో’ అంటూ నా దగ్గరున్న స్ట్రిప్ తీసి యిచ్చాను. ‘థాంక్స్, రక్షించారు. నేను వాడుతున్న టాబ్లెట్స్ యివే’ అంటూ నేను ఫర్వాలేదు వుంచమంటున్నా వినకుండా ఒక్క టాబ్లెట్ మాత్రం తీసుకొని మిగిలినవి యిచ్చేశారు. ‘మీరెంతవరకు?’ మార్యదపూర్వకంగా అడిగారు. ‘రాజమండ్రిలో దిగి అమలాపురం వెళ్లాలి’ ‘అమలాపురమా? మీరు లెక్చర ర్ వనమాలి గారు కానీనా?’ ‘అవునండీ. మీకెలా తెలుసు?’ అన్నాను కించిత్ ఆశ్చర్యపడుతూ. ‘నమస్కారమండీ. మిమ్మల్నెక్కడో చూసినట్టుందని యిందాకటి నుంచీ అనుకుంటున్నాను. నేను ‘లు’ గారి మిసెస్.. గీతని’ నేను తుళ్లిపడ్డాను. అంతటి ఉన్నత స్థితిలో వున్నావిడ రైల్లో ప్రయాణించడం నమ్మశక్యం కాలేదు. ‘అలాగాండీ, మిమ్మల్నిలా కలవడం చాలా సంతోషం’ నా మాటలు పూర్తి కాకుండానే టికెట్స్ ‘చెక్’ చెయ్యడానికి టి.టి.ఇ. వచ్చాడు. ఆమె మొహమాటపడుతూ తను కూర్చున్న లోయర్ బెర్త్ ఖాళీయేనా అని అడిగింది. ‘సారీ, అది వరంగల్ కోటాది’ అని చెప్పి అతను వెళ్లిపోయాడు. ‘నా లోయర్ బెర్త్ మీరు తీసుకోండి’ ‘థాంక్స్. మీ కిబ్బంది లేకపోతే అలాగే’ ‘అదేం లేదు. ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మి’ ‘రక్షించారు. చూస్తున్నారుగా నాది స్థూలకాయం. అందుకని మీకు కొంచెం అసౌకర్యమయినా మీ ఆఫర్‌ని కాదనలేకపోతున్నాను’ ఆమె నిష్కాపట్యం, నిరాడంబరత నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆమెతో మాట్లాడ్డానికి నేను సంశయిస్తున్నా ఆమె కలుపుగోలుగా నన్ను మాటల్లోకి దించింది. సహజంగా మా సంబాషణ ‘లు’ గారి చుట్టూనే నడిచింది. ‘లు’ గార్కి నా పట్ల ఉండే అభిమానం గురించి చెపుతూ మధ్యలో చిట్టిబాబు ప్రస్తావన తీసుకొచ్చింది. ఇటీవల చిట్టిబాబు తరచుగా వాళ్లింటికి వస్తున్నాడనీ, కులం ముడితో ‘లు’ గారి దగ్గర చనువు పెంచుకున్నాడనీ చెపుతూ నేను అదిరిపడే ఓ ప్రశ్న వేసింది. ‘ఈ మధ్య మీరూ చిట్టిబాబు ఏమైనా గొడవ పడ్డారా?’అని! ‘అలాంటిదేమీ లేదే. చిట్టిబాబు నాకంత సన్నిహితుడు కూడా కాదు. అసలు మీకా అనుమానమెందు కొచ్చింది?’ అన్నాను విస్తుపోతూ. నిజానికి ఆమె ప్రశ్న నేను తికమకపడుతున్న ఓ ‘పజిల్ని’ కదిపింది. ‘అవునా? మరి మీకంత క్లోజ్ కానప్పుడు ‘లు’ గారి దగ్గర తరచుగా మీ గురించి యెందుకు మాట్లాడుతుంటాడు?’అందామె ఆసక్తిగా. ‘ఈ విషయం కూడా నాకు తెలియదు. మీరు చెపుతుంటే మొదటిసారి వింటున్నాను..’ ఆమె చెప్పిన సమాచారం నాకు ఆందోళనను కలిగించిన మాట నిజం. నేను ‘లు’ మధ్యలో చిట్టిబాబు – మాదొక కాకతాళీయమైన సమీకరణం. దానికింత పొడిగింపు.. నా జ్ఞాపకాలు చిట్టిబాబు పరిచయాన్ని తవ్వడం ప్రారంభించాయి... ∙∙ రెండు మూడేళ్ల క్రితం వరకు నాకు చిట్టిబాబు యెవరో తెలియదు. అతను నాకు మార్నింగ్ వాక్‌లో తారసపడిన వ్యక్తుల్లో ఒకడు. జ్యూయలరీ షాపు యజమానిగా తనంత తాను పరిచయం చేసుకొన్నాడు. ఆ తర్వాత రోడ్ మీద కలిసినప్పుడల్లా పత్రికల్లో వచ్చిన నా రచనల గురించో నా వార్తల గురించో చెప్పి నన్ను అతిశయోక్తులతో మెచ్చుకొనేవాడు. అలాంటి స్వల్ప పరిచయంతో ఓ రోజు పొద్దుటే నన్ను వెదుక్కొంటూ వచ్చి మా యింటి తలుపు తట్టాడు. మడత నలగని తెల్లని బట్టలు, వాటికి మాచ్ అయ్యే తెల్లటి చెప్పులూ, మెడలో నులకతాడు లాంటి బంగారు గొలుసు, చేతి వేళ్ల నిండా వుంగరాలు... రోడ్ మీద చూసినప్పటి కంటే భిన్నమైన ‘గెటప్’లో వున్న ఆ మనిషిని వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అయినా మొహమాటపడుతూ లోపలకు పిల్చి కూర్చోమన్నాను. ‘లు’ గారు మీ ఇంటి కొచ్చినట్లు నిన్నటి పేపర్లలో ఫొటోలతో సహా వేశారు. తమరు చూశారా?’ అంటూ ఓ పేపర్ కటింగ్ నా కందించాడు చిట్టిబాబు. అప్పటికి గుర్తుపట్టాను – అతనెవరో!. వనమాలి యింట ‘డి.వి.లు’,‘హల్ చల్’ అంటూ జిల్లా ఎడిషన్‌లో వచ్చిన ఆ వార్త నేను చూసిందే! ‘డి.వి.లు’ పత్రికల్లో తరుచుగా పేరు కనిపించే ‘సెలబ్రిటీ’. ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘కైట్స్’ చైర్మన్. ఆయనను ఇటీవలే ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది కూడా. మొన్న కోనసీమలోని దేవాలయాల్ని దర్శించుకొని వెళ్తూ వెళ్తూ చెప్పాపెట్టకుండా మా యింటి కొచ్చారు. ఆయన వెంటబడిన పత్రికా విలేకరులు దానికి ప్రాముఖ్యమిచ్చి ఆర్భాటంగా రాశారు. ఆ న్యూస్ చూసి అయిదారుగురు పరిచయస్థులు తమ సంబంధీకులకు ‘కైట్స్’లో వుద్యోగాలిప్పించమని నన్ను సతాయించారు. డబ్బు ఆశ కూడా చూపించారు. ‘లు’ గారు మా యింటికి రావడం కాకతాళీయం తప్ప ఆయన దగ్గర నాకంత పలుకుబడి లేదని చెప్పి తప్పించుకొనే సరికి నా తలప్రాణం తోక కొచ్చింది. మా యింటికెప్పుడూ రాని చిట్టిబాబు కూడా అలాంటి బాపతేనని అనుమానించి అతను అడక్కుండానే పని చెప్పే సరికి సిగ్గుపడ్డం నావంతయింది. మా వూళ్లో భారీ స్థాయిలో చిట్టిబాబు ప్రారంభిస్తున్న మెగా జ్యూయలరీ షాపును ఓపెన్ చేయ్యడానికి ‘లు’ గార్ని ఒప్పించమని అతని కోరికట! అతని కోరిక నన్ను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా యిలాంటి ప్రారంభోత్సవాలకు సినీ రాజకీయ రంగాలకు చెందిన గ్లామరున్న వాళ్లను పిలుస్తుంటారు. అలాంటిది యెంత కార్పొరేట్ దిగ్గజమైనా ‘డి.వి.లు’ను కోరుకోవడంలోని ఆంతర్యం నాకర్థం కాలేదు. పిల్చేవాడి మాటెలా వున్నా ‘లు’కి ఈ పని మీద వచ్చే కోరిక, తీరిక వుంటాయా? అదే మాట చిట్టిబాబుకు చెప్పాను. ‘క్షమించాలి గురువుగారూ. మీరాయనను వుద్యోగాలూ వుపకారాలు అడగడం లేదు. ఆయన రాక వల్ల మన ప్రాంతంలో మీ విలువ, నా విలువ పెరుగుతాయి. ఆయన పేరు మారు మోగిపోతుంది. దయచేసి మీరు కాదనకండి.’ చేతులు పట్టుకొని బ్రతిమాలుతున్న చిట్టిబాబును కాదనలేక, ఆ కాదనే మాటేదో ‘లు’ గారే అంటారని ఆయనకు ఫోన్ చేశాను. అదృష్టవశాత్తు ఫోన్ చెయ్యగానే దొరికాడు. నే నన్నట్టుగానే తనలాంటి వాణ్ణి యెందుకు పిలుస్తున్నారంటూనే ముక్తాయింపుగా ‘మీ మాట కాదనలేకపోతున్నాను. ఆయనను రమ్మనండి చుద్దాం’ అని చిన్న ఆశను కల్పించాడు. అది కంటితుడుపు అని నేననుకున్నా చిట్టిబాబు మాత్రం గంపెడాశతో సంబరపడిపోతూ నాకు మళ్లీ థాంక్స్ చెప్పి హైదరరాబాద్ వెళ్లాడు. వారం తిరక్కుండా ‘లు’ గారు ప్రారంభోత్సవానికి అంగీకరించారనే శుభవార్తతో పాటు ఓ పళ్లబుట్టను కూడా మా యింటికి మోసుకొచ్చాడు. ఫంక్షన్‌కి నాతో పాటు నా శ్రీమతి కూడా రావాలని యిద్దర్నీ ఆహ్వానించి, వస్తామని వాగ్దానం చేయించుకొని మరీ వెళ్లాడు... ‘ఇతనేదో అమాయకుడనుకున్నాం గాని కార్యసాధకుడే. కానీ వాలకం చూస్తే నమ్మదగిన మనిషిలా లేదు. ఎక్కడి మద్దెల అక్కడ వేసి పబ్బం గడుపుకొనే బాపతులా వున్నాడు. ఇలాంటి వాణ్ని ‘లు’ గారంతటి పెద్దాయన దగ్గరకు చేరనిస్తే రేపు మీకు ‘మేక’వుతాడేమో చూడండి’ అని హెచ్చరించింది చిట్టిబాబును అంచనా వేస్తూ నా శ్రీమతి. ‘నీ కన్నీ అనుమానాలే. అవసరం కొద్దీ చిట్టిబాబు మన దగ్గర కొచ్చాడు గాని ఆ తర్వాత అతనెవరో మన మెవరమో! ఇక ‘లు’ గారిది, నాది కృష్ణ కుచేలుర లాంటి అనుబంధం. ఆయనకు యెంత అభిమానం లేకపోతే మొన్న మనింటి కొచ్చాడు?’ ‘అవును– ఆయన చక్కగా తెలుగు మాట్లాడుతున్నాడు కదా..మరి పేరు అలావుందే?’ ‘ఓహ్! అదా నీ సందేహం? అతనిదీ నాదీ ఒకే వూరని యిది వరకెప్పుడో చెప్పాను కదా. అతని అసలు పేరు వెంకటేశ్వర్లు. ఇంటి పేరు దున్నపోతు. కార్పొరేట్ రంగంలో తెలుగు తెలిసిన వాళ్లు హేళన చెయ్యకుండా, తెలుగు రానివాళ్లు తన పేరును ఖూనీ చెయ్యకుండా తన పేరును తెలివిగా ‘డి.వి.లు’గా మార్చుకొన్నాడు. ఈ రహస్యం ఆయన యెవరికీ చెప్పరు. ఎవరికో కాని తెలియదు. ఇతను ఎలిమెంటరీ స్కూల్లో మా నాన్న గారి దగ్గర చదువుకొన్నాడట. పేద కుటుంబంలో పుట్టి యెన్నో కష్టాలనుభవించి పట్టుదలతో చదువుకొని ఈ స్థాయికెదిగాడట. నువ్వు పొరపాటున కూడా ‘లు’ గారి వ్యక్తిగత విషయాల గురించి యెక్కడా నోరుజారకు సుమా..’ ‘నాకలాంటి సందర్భమే రాదు. సరేనా?’ అంటూ తను హామీ యిచ్చింది. మేమూహించిన దాని కంటే గొప్పగా చిట్టిబాబు ‘మెగా జ్యూయలరీ షోరూమ్’ ప్రారంభోత్సవం జరిగింది. ఊరంతా ప్లెక్స్‌లు ఏర్పాటు చేసి వూరేగింపుగా పూర్ణ కుంభ స్వాగతంతో ‘లు’ను షోరూమ్ దగ్గరకు తీసుకెళ్లడంతో ఆయన కూడా చాలా ఉల్లాసంగా కనిపించారు. రిబ్బన్ కత్తిరించిన తర్వాత ‘లు’ ప్రసంగిస్తూ మా మైత్రీబంధాన్ని ప్రస్తావించి అదే తననీ కార్యక్రమానికి రప్పించిందని చెప్పడంతో అభిమానుల చప్పట్లు మారు మ్రోగాయి. చిట్టిబాబు కృతజ్ఞతాపూర్వకంగా ‘లు’గారి నక్షత్రానికి అనువైన రాయితో చేయించిన వుంగరాన్ని ఆయనకు బహుకరించడమే కాకుండా వద్దంటున్నా వినకుండా నా శ్రీమతికి ఓ వెండి పూలసజ్జను వాళ్లావిడ చేత యిప్పించాడు. అలా చిట్టిబాబుతో యేర్పడ్డ అనుబంధం క్రమక్రమంగా పెరిగి మా యింటి పనులేమైనా వుంటే అతను పూరమాయించి చేయించి పెట్టే వరకు వచ్చింది. ప్రథమ వార్షికోత్సవం నాటికి చిట్టిబాబు వ్యాపారం మూడు వడ్డాణాలు, ఆరు అరవంకెలుగా సాగుతోందని తెలిసి ఆనందించాను. అయితే బిజినెస్ ఒత్తిడి వల్లనేమో యిది వరకటిలా అతను కనిపించడం లేదు. మా ఆవిడ ఫోన్ చేస్తే చాలు ‘మేడమ్ గారూ’ అంటూ వచ్చి వాలిపోయే అతని మనుషులు ఆవిణ్ని యిప్పుడంతగా పట్టించుకోవడంలేదు. ఆమె చిట్టిబాబు అవకాశవాదాన్ని తిట్టిపోస్తోంది. నాకు చిట్టిబాబు గురించిన దిగులు లేదు కాని యిటీవల ‘లు’ మౌనం నన్ను కలవరపెడుతోంది. ఎంత బిజీగా వున్నా నెలకు ఒకటి రెండు సార్లుయినా ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కొనే మనిషి నేను ఫోన్ చేసినా పలకడం లేదు. అతను ఏ విదేశీ పర్యటనలోనో వుండి నా కాల్స్ చూడలేదని మొదట్లో సరిపెట్టుకున్నా దేశంలో అతనికి సంబంధించిన వార్తలు నన్ను వెక్కిరిస్తున్నాయి. ‘లు’ ఆలోచనలతో ‘వర్రీ’ అవుతున్న నన్ను మా శ్రీమతి పిలుపు ఈ లోకంలోకి తెచ్చింది. ‘మన శశకి ‘కైట్స్’లో ఇంటర్వ్యూ వున్నట్లు మీతో చెప్పాడా? ఈ రాత్రికి బయల్దేరుతున్నాడు’ ‘వెళ్లమను. డబ్బు కావలిస్తే నా పర్సులో ఉంది తీసుకోమను’ ‘డబ్బు గురించి కాదు. కైట్స్ చైర్మన్ ‘లు’ గారు మీ ఫ్రెండ్ కదా. ఆయనకు ఫోన్ చేసి అబ్బాయి ఇంటర్వ్యూ కొస్తున్నట్లు మీరో మాట చెప్పొచ్చు కదా!’ అంది నా శ్రీమతి నా నిర్లిప్తతకు విస్తుపోతూ. ‘ఆయన యిది వరకటిలా లేడు. నేను ఫోను చేసినా ఉలుకుపలుకూ లేదు. ఎంత యెత్తులో వుంటే మాత్రం అంత పట్టించుకోని వాణ్ని నన్ను ప్రాధేయపడమంటావా?’ ‘బావుంది. సొంత కొడుకు కోసం ఓ మెట్టు దిగితే అవమానమా?’ ‘అవమానమని కాదు, అంత అవసరం లేదు. మన వాడికి మెరిట్ వుంది. ఇక్కడ కాకపోతే యెక్కడైనా వాడికి ఉద్యోగ యొస్తుంది’ ‘ఎక్కడైనా వేరు. ఇది పేరున్న సంస్థ కదా. కనీసం ‘లు’ గార్కి ఓ లెటరైనా రాసివ్వండి’ అర్ధాంగి అభ్యర్థనను తోసి పుచ్చి యింట్లో అశాంతిని కోరి తెచ్చుకోవడం యిష్టం లేక మధ్యే మార్గంగా శశిని పిల్చి నా విజిటింగ్ కార్ట్ యిచ్చి ఇంటర్వ్యూకి ముందు ‘లు’ గార్ని కలవమన్నాను. శశికి తప్పకుండా ‘కైట్స్’లో ఉద్యోగ మొస్తుందనే నమ్మకంతో వున్న నేను వాడు తిరిగొచ్చి చెప్పిన సమాధానం విని దిగ్భ్రంతుణ్ణయాను. శశిని ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటాడనుకున్న వేంకటేశ్వర్లు ‘అలాగా, చూస్తాను’ అంటూ నేనెవరో తెలియనివాడిలా ముక్తసరిగా మాట్లాడి పంపించేశాడట! ఆ తర్వాత ఇంటర్వ్యూలో శశి పెర్ ఫార్మెన్స్ చూసి కమిటీ మెచ్చుకున్నా చివరకు నిరాశే మిగిలిందంట!. వారం తరువాత శశిని ఇంటర్వ్యూ చేసిన కంపెనీ ‘హెచ్. ఆర్’ ఆశ్చర్యంగా మా యింటికొచ్చాడు. అతను మా వాడికి వాళ్ల అమ్మాయి నిచ్చే ప్రపోజల్‌తో నేరుగా మాతో మాట్లాడ్డానికి వచ్చాడట. వాళ్లమ్మాయి బయోడేటా, ఫొటో మాకు న చ్చాయి. అవి అబ్బాయి చూసిన తర్వాత, ఆమెరికాలో వున్న మా అమ్మాయి కూడా ఓ.కె. చేస్తే ఏ విషయమూ ఆయనకు తెలియజేస్తామని చెప్పాం. వెళ్తూ వెళ్తూ ఆ హెచ్. ఆర్ శ్రీపతి చెప్పిన విషయం విని నేను ‘షాక్’కు గురయ్యాను. ‘మీ సంబంధం కోసం మేమంతకాలమైనా వెయిట్ చేస్తాం. ‘కైట్స్’లో మీ వాణ్ని ఇంటర్వ్యూ చేసిన కమిటీకి చైర్మన్‌ను నేనే. మీ అబ్బాయి రియల్ టైమ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్.. సింప్లీ సూపర్బ్. అలాంటివాడు కంపెనికీ ‘ఎసెట్’ అవుతాడని మా కమిటీ అతన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసి లిస్ట్‌లో ‘టాప్’న పెట్టాం. కానీ మా అంచనాలకు విరుద్ధంగా ఆశ్చర్యకరంగా మా చైర్మన్ ‘లు’ గారు మీ వాణ్ని పక్కన పెట్టారు. ఆయన చెప్పిన కారణం మాకంత సమంజసంగా అనిపించలేదు. ఏదైనా వ్యక్తిగతమైన ‘ప్రెజుడీస్’ కావచ్చు అనుకున్నాం. పోన్లెండి. అతణ్ని యెవరైనా కళ్లకద్దుకొని యింతకంటే మంచి జాబ్ యిస్తారు..’’ నా మొహం వివర్ణం కావడం గమనించి శ్రీపతి సెలవు తీసుకొని కారెక్కాడు. శశి సెలక్ట్ కాకపోవడానికి కారణం ‘లు’ గారే అనే చేదునిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను...! ∙∙ శశి విషయంలో ‘లు’ ఉపకారం చెయ్యకపోతే పోయింది, అపకారం చేశారని తెలిసిన తర్వాత ఆయనకు నా పట్ల ద్వేషానికి కారణం తెలియక మథన పడుతున్న నాకు గీత ప్రశ్న ద్వారా ఒక క్లూ దొరికింది. – అది చిట్టిబాబు రాజేసిన నిప్పు అని! అయితే నా వల్ల యెంతో కొంత వుపకారం పొందిన చిట్టిబాబుకు నా మీద పగ యెందుకుంటుంది? ఇది మరో పజిల్! ‘చిట్టిబాబు మీ వారి దగ్గర తెచ్చే ప్రస్తావనలో నా గురించి ‘నెగెటివ్’గా మాట్లాడేవాడా?’ ‘సారీ, నిజం చెప్పి మిమ్మల్ని బాధపెట్టినట్లున్నాను’ అంటూ గీత నొచ్చుకుంది. ‘కాదు. నిజం చెప్పి నా మనసు తేలికపడేలా చేశారు. ఇన్నాళ్లూ ‘లు’ గార్కి నా మీద కలిగిన అపార్థానికి కారణాలు తెలియక మానసికంగా చిత్రహింసను అనుభవిస్తున్నాను. మేడమ్, చిట్టిబాబు నా మీద చెప్పడానికి నేరాలేమున్నాయి?’ ‘మా వారికో బలహీనత ఉంది. ఆయన యెంత కింది స్థాయి నుంచి వచ్చిందీ యెవరికీ తెలియకూడదని. అలాగే ఆయన పేరు గురించి కూడా. ఆయన పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలిసిన మీరే ఆ గుట్టు బహిరంగం చేస్తున్నారని చిట్టిబాబు మా వారికి నూరిపోశాడు’ అందామె యెవరైనా వింటున్నారేమోనని అటూయిటూ చూస్తూ. ‘అందువల్ల చిట్టిబాబు కొచ్చే ప్రయోజనం? అతనికీ నాకూ యెలాంటి శత్రుత్వమూ లేదే!’ ‘మాష్టారూ, మీరు రచయిత కూడా మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. కాని అపకారం చెయ్యడానికి శత్రుత్వమే అవసరం లేదు – ఈర్ష్య చాలు! ఈర్ష్య, మనిషి కవల పిల్లలు. పక్కవాళ్ల యెదుగుదలను చూడలేకపోవడమనేది అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ల మధ్య, ఇరుగుపొరుగు మధ్య, సహోద్యోగుల మధ్య... ఇలా అన్ని చోట్లా వుంటుంది. అలాగే చిట్టిబాబుకి మా వారితో మీ స్నేహం చూసి కన్ను కుట్టింది. ఆ ‘శాడిజం’తో మీ మీద చాడీలు చెప్పాడు. దేవుడు అందాన్ని చూడమని మనిషికి కళ్లిస్తే మనిషి ఆ కళ్లను చూడలేక పోవడానికి వినయోగించడం దౌర్భగ్యం!!’ గీత వాక్ప్రవాహం గీతోపదేశంలా సాగుతోంది. ఇంతలో స్టేషన్ వచ్చినట్టుంది.. బండి ఆగింది. ప్రయాణీకులు కోలాహలంగా మా ‘బే’లో చొరబడ్డంతో మా సంభాషణ అక్కడితో ఆగిపోయింది! - డా. పైడిపాల చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ.. -
మరోకథ: నరావతారం
అప్పటివరకూ కళ్ళు కూడా మాటలాడతాయని నాకు తెలీదు. అందరి ముఖాలు మాస్కులతో కప్పేస్తే.. కేవలం కళ్ళ ద్వారా మాటలు, కళ్ళతోనే పరిచయాలు, కళ్ళతోనే పలకరింపులు, కళ్ళతోనే ప్రశ్నలు, జవాబులు. కానీ మా పూర్ణమ్మ మాత్రం తన చీర కొంగునే మూతికి చుట్టుకొని రోజూ కూరగాయలు అమ్మేస్తుంది. అన్ని పది, ఇరవయ్ బేరాలే కాబట్టి ఒకవేలు చూపిస్తే 10, రెండు వేళ్లు చూపితే 20.. నాకు మాత్రం స్పెషల్ 10 రూపాయలకు 6 తోటకూర కట్టలు ..5 కట్టలు వ్యాపారం కోసం ఒక కట్ట మాత్రం సహకారం. ఈ సహకారం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే ఒక రెండు నెలలు ముందుకు వెళ్ళాలి. అప్పుడే లాక్డౌన్ పెట్టిన రెండవ వారం అనుకుంటా.. ఎప్పటిలాగే మా ఆఫీస్ ఎదురుగా ఉన్న మా రాముడు గుడికి వెళ్ళాను. ‘అదేంటి గుడి కుడా లాక్డౌన్ కదా’ అని మీ డౌట్. చెప్పాగా ఆ గుడి ఎదురుగానే మా బ్యాంకు .. ఆ గుడిలో పని చేసే స్టాఫ్ అంతా ఆ దేవుడికి సేవ చేసి జీతం మాత్రం మా బ్యాంకులో తీసుకుంటారు. కాబట్టి అది మా కోవెలే. ‘మేనేజర్ గారు, మాస్క్ వేసుకొని ఈ పక్కనుంచి రండి .. అటు సీసీ కేమరా ఉంది. బయటి వారిని రానీయకూడదు’ అంటూ గౌరవంతో కూడిన ఒక చిట్కా చెప్పాడు గురవయ్య. గుడిలో అతను సన్నాయి మేళం ఉద్యోగి. ∙∙ నెమ్మదిగా కెమెరా కళ్ళకు దొరకకుండా రామచంద్రుని దర్శించుకున్నాను. ఆ రోజు అంతటికి నేనే భక్తుణ్ణి కదా ఆ దేవదేవుని కళ్ళు కూడా చాల ఆశ్చర్యంగా, ఆర్తితో చూసినట్లు అనిపించింది. గర్భగుడి నుంచి ఒక పక్కగా తిరిగి కెమెరా కన్నుగప్పి రావడం దాదాపు అసాధ్యం. కాబట్టి గుడి వెనుక భాగం నుంచి వద్దామని అటుగా వెళ్ళాను. గుడి చాలా ప్రశాంతంగా వుంది.. నేను, దేముడు అంతే! ఇంతలో టక్.. టక్ అనే శబ్దం.. ఏమిటో అని చూశాను. అక్కడ ఏమి కనిపించ లేదు. మళ్లీ టక్.. టక్ అనే శబ్దం. అటుగా వెళ్ళాను. గర్భాలయానికి వెనుకగా ఒక చిన్న తోట. అందులో 10 తాబేళ్లు.. నీరసంగా నడవడానికి శక్తి లేక ఎదురు చూస్తున్నాయి. అయ్యో అదేమిటి అని దగ్గరగా నడిచాను. ఒక కాకి అరుస్తోంది.. మరొక కాకి ఒక చని పోయిన తాబేలు పైన కూర్చొని దాన్ని ఎలా తినాలో తెలియక దాని డిప్పను కొడుతోంది. అదే ఆ శబ్దం. నాకు చాల బాధ వేసింది. ఆ తాబేళ్లు రోజూ వచ్చే భక్తులు వేసే ప్రసాదాలు, ఆ గుడిలో అర్చకులు వేసే ఆకు కూరలతో బతికేవి. ఇప్పుడు కనీసం ఒక భక్తుడు కూడా లేడు.. ప్రసాదం లేదు.. ఆ కాకిని తోలి, గురవయ్యకు ఆ చనిపోయిన తాబేళ్లును తీసి శుభ్రం చేయమని చెప్పాను. నేను తిరిగి ఆఫీసుకు వచ్చాను కానీ నా మనసంతా ఆ తాబేళ్లు మీదే వుంది. పాపం.. ఆ దేవుని గుడిలో కాదు.. కాదు.. దేవుని ఒడిలో ఆకలికి చనిపోయిన తాబేలుని తలచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ∙∙ మా అటెండరు ఆదిబాబుని పంపి ఊరిలో ఏమైనా తాబేళ్లు తినడానికి దొరుకుతాయేమో అని చూశాను. ‘కనీసం టీ దుకాణం కూడా లేదు సర్’ అంటూ తిరిగి వచ్చాడు. ‘సరే.. నా క్యారేజి అంతా ఒక పేపర్లో వేసి వాటికి పెట్టు’ అన్నాను. వాటితో పాటుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెట్టి మరీ వచ్చాడు మా ఆదిబాబు. ఎదో నా మనశ్శాంతికి గానీ అవి అన్నం, కూర, పెరుగు తింటాయో లేదో నాకు తెలీదు. నేను తినకుండా వాటికి పెట్టాను. అంతే అప్పటికి నా మనసు శాంతించింది. ఇంటికెళ్ళానే గానీ ఒకటే ప్రశ్న.. గుడిలో రామావతారం.. గుడి వెనుక కూర్మావతారం.. రామావతారం ఒక జీవన విధానం.. అట్లాంటి రాముని పూజించే నేను నరావతారం.. కాబట్టి ఆ కూర్మావతారాలను కాపాడాలి. బతుకు.. బతికించు.. అని చిన్నప్పుడు చదివిన ఒక ఇంగ్లిష్ కొటేషన్ గుర్తుకు తెచ్చుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. నిద్రలో ఒక పెద్ద తాబేలు ఈ భూమిని మోస్తున్నట్లు నేను దానికి ఎదురుగా కూర్చొని దాని బరువుకు సరిపడా తోటకూర నా బ్యాంకు లాకర్లో నుంచి తీసి ఇచ్చినట్లు.. ఆ తాబేలు చాలా ఆనందంగా సంతకం పెట్టి బయటకు వచ్చినట్లు కల... ∙∙ అప్పటికే భళ్ళున తెల్లారింది. లేస్తూనే దేవుని మొహం చూసే అలవాటు ప్రకారం సెల్ ఆన్ చేశాను. సెల్లో శ్రీ రామచంద్రుని ఫోటో, రాముని పాదం దగ్గర తాబేలు కన్పించాయి. దెబ్బతో నిద్ర మత్తు వదలి ఆఫీస్‌కు రెడీ అయి బయలుదేరాను. దారిలో ఉదయం 6 నుంచి 9 వరకూ కూరగాయలకు, పాలకు, నిత్యావసర వస్తువుల కోసం లాక్ డౌన్లో రిలీఫ్ అంట. జనాలు భయంతో, భక్తితో, ప్రాణాల మీద ఆశతో పద్ధతిగా ఒక లైన్లో నిలబడి, బేరాలు ఏమీ ఆడకుండా, మొహం నిండా మాస్క్ కప్పుకొని మరీ కూరగాయలు కొంటున్నారు. నేను ఆదిబాబు ఒక సంచి నిండా ఆకుకూరలు అదే రాత్రి కలలో చెప్పిన సందేశం ప్రకారం తోటకూర కొన్నాము. వేగంగా ఆఫీస్‌కు వెళ్లి ఆదిబాబుకు తాళాలు ఇచ్చి నేను కోవెల వెనుక భాగానికి వెళ్ళాను. మళ్లీ గురవయ్య కనిపించి ‘సర్ కరెంటు లేదు. ముందు వైపు నుంచి రండి. కెమెరా ఇప్పుడు పని చేయదుగా’ అన్నాడు నేను రాముని దర్శనానికి వస్తున్నా అనుకొని. ‘లేదు గురవయ్యా..’ అంటూ నేను వచ్చిన పని చెప్పాను. తను వెంటనే నా చేతిలో సంచి అందుకొని తోటకూర అంతా ప్రతి తాబేలుకు అందే విధంగా సర్దాడు. నిన్న నా క్యారేజ్ భోజనం తిన్నాయేమో కొద్దిగా నడుస్తున్నాయి. ఆకు పచ్చని ఆకులు చూడగానే వాటికీ ప్రాణం లేచి వచ్చినట్లుంది. నెమ్మది.. నెమ్మదిగా.. అవి తాబేళ్లు కదా గబగబా నడవవుగా! ఈ పరిస్థితిలో అసలు నడవలేవు. వచ్చి తోటకూర తినడం ప్రారంభించాయి. నాకు నిజంగా మనసుకు శాంతిగా ఉంది. ఈ హడావుడిలో ఉదయం నేను టిఫిన్ చేయక పోయినా నా కడుపు నిండి పోయింది. ∙∙ మరి దేవుణ్ణి దర్శించకుండా నేరుగా ఆఫీస్‌కు వచ్చేశా. ఇక నుంచి ప్రతి రోజూ 10 రూపాయల తోటకూర 10 తాబేళ్ల పలకరింపు నా దినచర్యగా మారిపోయింది. నేను సెలవు పెట్టిన రోజు ఈ పని ఆదిబాబు, ఆదిబాబు సెలవు పెడితే నేను.. ఒక్క వారం గడిచింది. అవి మామూలుగా అంటే నెమ్మది నెమ్మదిగానే కానీ ఆరోగ్యంగా నడవడం చూసి నాకు మరిన్ని కొత్త ఆలోచనలు వచ్చాయి. రోజూ తోటకూర అంటే వాటికీ బోర్ కదా అని వెరైటీగా ఒకరోజు గోంగూర, మరొకరోజు బచ్చలికూర, చుక్కకూర ఇలా పెట్టటం మొదలు పెట్టా. అంతే అవి ఇంకా ఉత్సాహంగా నన్ను మా ఆది బాబుని చూసి గుర్తు పట్టి ముందుకు రావడం, వాటికీ ఆకులు వేసి నీరు పెట్టగానే అవి మా వైపు చూసే ఒక లాంటి ఆత్మీయమైన చూపు ఇప్పటి వరకు ఏ సినిమా డైరెక్టర్ చూపించని ఫ్రేమ్. అదుగో అలా మేము రోజూ కొనే ఆకుకూరల కొట్టు ఓనరే పూర్ణమ్మ. మొదట్లో ‘బాబూ.. రోజూ ఆకు కూరలేనా.. ఈ బెండకాయ, ఆనపకాయ కుడా కొనండి బాబూ’ అనేది. మేము నవ్వే వాళ్ళం. ఒకరోజు ఆవిడ ఆకు కూరలుపెట్టలేదు. అయ్యో అనుకొని మేము మరొక దగ్గరికి పోతుంటే పూర్ణమ్మ ఆపి..‘బాబూ మీరు రోజూ కొంటారు. ఈ రోజు అక్కడికి పోతే రేపు నా కాడికి రారు. ఆగండి నేనే తెస్తాను’ అంటూ మళ్ళి తన దగ్గరున్న మిగిలిన కూరగాయలు కొనమంది. మా ఆదిబాబు ఇక ఆగలేక మొత్తం కథ చెప్పాడు. అంతే ఆవిడ చాల నొచ్చుకొని ‘ఎంత మాట బాబూ.. ఆగండి నేనే తెస్తాను’ అని 10 రూపాయలు తీసుకొని 6 కట్టలు తెచ్చిచ్చింది. ‘అదేంటి 5 కట్టలే కదా?’ అని అడిగితే ‘అది నా వాటా బాబూ’ అంది. సాయానికి ఎవరైతే ఏమిటి.. రాముడికి ఉడత చేయలేదా..! ∙∙ అంతే.. ఇక ప్రతిరోజూ నేను, మా ఆది బాబు.. పూర్ణమ్మ కొట్టు దగ్గర ఆగడం.. ఆవిడ ఒక సంచి నిండా ఆకు కూరలు నింపడం .. కానీ 10 రూపాయలు మాత్రమే తీసుకోవడం నాకు భలే అనిపించింది. మా అపార్ట్మెంట్లో ‘పాపం రోడ్డున వస్తున్న వలస కూలీలకు ఒక రోజు భోజనం చేసి పెడదాం’ అని చెబితే సగం మంది డబ్బులు ఇవ్వలేదు. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. వారివి త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు. కానీ మనసులు మాత్రం ఇరుకు. ‘ఇంకెన్నాళ్లో ఈ లాక్డౌన్..’ అని అందరూ అనుకుంటున్నారు. అందరికి ఇళ్ళల్లో కూర్చొని తినడానికి బోర్ కొట్టింది. కానీ నాకు మాత్రం ఎన్ని రోజులైనా పర్లేదు.. మా కూర్మావతారాలకు నేను ఉన్నాను, నాకు హనుమంతుడిలా మా ఆదిబాబు, ఉడతలా పూర్ణమ్మ ఉన్నారు. ఇంతలో ఒకరోజు రాత్రి ఫోన్.. మా అత్తా, మామలకు ఒంట్లో బాగోలేదు అర్జెంట్‌గా రమ్మనమని. ఆఫీస్‌కు లీవ్‌లెటర్ రాసి పెట్టి, తాళాలు ఇస్తూ ఆదిబాబుకు అంతా చెప్పాను. మా కూర్మావతారాల గురించి కూడా. ఆ రాత్రే ఏలూరు బయలుదేరాం. బస్సులు, రైళ్ళు లేవుగా! నా కారు మీదే. తీరా వెళ్ళాక తెలిసింది అక్కడ అందరూ ఏదో అంతుపట్టని ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారని. హాస్పిటల్ అంతా ఒక తెలియని వింత వాతావరణం. ఎప్పుడు ఎవరికి ఏమి అవుతుందో తెలియదు.. వ్యాధి పేరు తెలిస్తే ప్రపంచంలో ఎక్కడ మందు ఉన్నా తెప్పిద్దాం అనే ఆలోచనలో వుంది ప్రభుత్వం. నాకు మా ఆవిడను చూస్తే చాలా భయం వేసింది. అప్పటికే ఆవిడ ఇంకా షాక్‌లోనే వుంది. చివరకు మా అత్తమామలు ఉన్న వార్డుకు చేరుకున్నాం. అక్కడ బెడ్స్ పైన రోగులు ఉండుండీ పడిపోయి కొట్టుకుంటున్నారు. అలాగని ఫిట్స్ కాదు! ∙∙ ప్రభుత్వ అధికారులు అన్ని విధాలా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పేషెంట్స్ నుంచి అన్ని వివరాలూ సేకరిస్తున్నారు. పరీక్షలకు పంపుతున్నారు. కానీ ఫలితం శూన్యం. మరో కొత్త వైరసేమో అని ఇంకా భయంగా ఉంది. ఈలోపు పుణె నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం అది వైరస్ కాదు అని తెలిసింది. మరి ఏమిటి అని మరింతగా పరిశీలన చేస్తున్నారు. రోగుల ఇళ్లు, పరిసరాలు, వారు వాడే నీరు, పిల్చే గాలి, తినే ఆహారం.. ఇలా అన్నీ.. అన్నీ పరీక్షిస్తున్నారు. ప్రతిపక్షాలు, మీడియా రోజుకో కథనం ప్రసారం చేస్తున్నాయి. నాకు అక్కడ ఉండాలంటేనే భయం వేసింది. నీళ్ళు తాగాలన్నా భయమే.. బయటి హోటల్లో తినాలన్నా భయమే.. ఆరోగ్యశాఖ మంత్రి ప్రభుత్వపరంగా మరో రెండు రోజుల్లో ఈ వింత వ్యాధికి కారణం చెబుతాం అని ఇప్పుడే టీవీలో చెబుతున్నారు. మా మామగారి పరిస్థితి విషమించింది. కారణం తెలీదు. మా మామగారిని మరింత మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్‌కి మార్చారు. ఒక రోజు గడిచింది. ఒక భయంకరమైన వార్త నా చెవిన పడింది. ఆ ఊరి వాళ్ళు వాడే కూరగాయలు, ఆకుకూరల మీద వాడే పురుగు మందుల వలన ఈ వింత వ్యాధి వచ్చిందని కలెక్టర్‌గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెబుతున్నారు. ఎదురుగా 96 ఏళ్ల మా మామగారు మృత్యువుతో పోట్లాడుతున్నారు. అంతే చప్పున నాకు మా కూర్మావతారాలు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఫోన్ అందుకొని మా ఆదిబాబుకి ఫోన్ చేశా. ‘సర్.. ఇప్పుడే కొత్తిమీర కొని వేసి వస్తున్నాను. అవి బాగానే వున్నాయి’ అని అతను చెప్పేలోపే ‘వద్దు .. వద్దు తీసేయ్.. తీసేయ్’ అంటూ గట్టిగా చెప్పాను లేదు అరిచాను. ఈ భూమి మీద అత్యంత ఎక్కువ కాలం సహజంగా బతకగలిగే జీవిని చంపడం నాకు ఇష్టం లేదు. నాకు అర్థం కాలేదు.. నేను నిజంగా నరావతారమా? లేక రాక్షస అవతారమా? ఛా.. అసలు ఎం జరుగుతోంది? అని ఆలోచించేలోపు ఆఫీస్ నుంచి ఫోన్ .. ‘ఆడిట్ ఉంది. రేపు తప్పకుండా ఆఫీసుకు రావాల’ని. ∙∙ ఆఫీస్‌కు వెళ్తూ ఒట్టి చేతులతో వెళ్ళడానికి నాకు మనసు అంగీకరించలేదు. పూర్ణమ్మ కొట్టు దగ్గర ఆగాను. నన్ను చూసిన వెంటనే పూర్ణమ్మ ఆత్రంగా ఆకుకూరలు సంచిలో సర్దడానికి రెడీ అవుతోంది. ‘అమ్మా ఈ కూరగాయలు మంచివేనా?’ అని అడిగాను. ఆమెను అనుమానించాలని నా ఉద్దేశం కాదు. కానీ ఎందుకో అలా అనుకోకుండా ఆ ప్రశ్న నా నోటివెంట రాగానే వెంటనే పూర్ణమ్మ ‘బాబూ ... మా తాత, మా నాన్న నుంచి మాకు ఇదే యాపారం. నలుగురికి కడుపునింపే అదృష్టం అందరికి రాదు బాబూ.. ఇక మంచి చెడు అంటావా .. మా తాత, మా నాన్న పురుగు మందులు, యూరియా ఏస్తే పురుగులే కాదు మడుసులు సస్తారని నాటు మందులు ఏసి పండించిన పంట బాబు ఇది. ‘‘రైతు అంటే అందరికి అన్నం పెట్టాలిరా.. అంతే గానీ ఎవడి ఇంటి ఇల్లాలి కంట కన్నీరు పెట్టించ కూడదురా’’ అనే వాడు మా తాత. అంత వరకూ ఎందుకు బాబూ.. ప్రతివారం ఇగో ఈ సంఘం వోల్లు వచ్చి మా తోట, పంటా చూసుకొని అన్ని కూరగాయలు, ఆకు కూరలు వొట్టుకెలతారు’ అంటూ ఒక కార్డు ఇచ్చింది. అప్పుడు నాకు అర్థమయింది.. పూర్ణమ్మకు సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలీదేమో గానీ ధర్మంగా అన్న పెట్టడం మాత్రం తెలుసు. ఆమెకు మనసులోనే క్షమాపణలు చెప్పుకొని ఆకుకూరల కోసం మనః శాంతిగా సంచి ఇచ్చాను. నా ఈ లాక్డౌన్ రామాయణంలో పూర్ణమ్మ ఉడుత కాదు.. కాశీ అన్నపూర్ణమ్మ.. - ఇప్పిలి మధు -
అనువాదం కథ: వేపచెట్టు
‘ఆ ఇల్లు నేను ఎవరికీ ఇవ్వను!’ ‘నాయనా! ఆ ఇంటికోసం నువ్వెందుకు ఇంత పట్టుపట్టి కూర్చున్నావో నాకు అర్థం కావటం లేదు? నువ్వు పట్టణంలో ఉంటున్నావు. ఆ ఇల్లు నీకు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు. నువ్వు ఆ ఇంట్లో ఉండటానికి వెళ్ళటం లేదు. వెళ్ళినా నీ చిన్నాన్న నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడు. ఒకకవేళ నీ తల్లితండ్రులు బతికివుంటే ఆ మాట వేరు. మట్టితో కట్టిన ఆ ఇల్లు కొద్దిరోజుల్లోనే శిథిలమైపోతుంది. అలా కాకుండా కనీసం మీ చిన్నాన్నకైనా ఇస్తే మంచిది కదా! కొంత సొమ్ము అయినా దొరుకుతుంది. దాంతోపాటు ఈ కలహాలు, క్లేశాలు సమసిపోతాయి’ మా మామయ్య నాకు నచ్చజెపుతూ అన్నాడు. ‘ మామయ్యా! నేను నా తండ్రి ఇంటిని ఇతరులకు ఎందుకు ఇవ్వాలి?’ కోపంగా అన్నాను. ‘సరేనయ్యా, నీ ఇష్టం. చెప్పటం నా బాధ్యత. అయినా నీకు ఎన్నో సమస్యలున్నాయి. పాపం, నీ భార్య ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటుంది. ఈ మధ్య నీ ఆరోగ్యమూ బాగుండటం లేదు. ఈ జంజాటంలో నువ్వు పడకపోవటమే మంచిది’ నా భుజాలపై చేతులు వేస్తూ అన్నాడు మామయ్య. నేను మాట్లాడకుండా బయలుదేరాను. ఓ ఇంటికోసం నేను ఎందుకింత పట్టుపడుతున్నాను? ఆ ఇంటిలో ఏ ప్రపంచం ఉందని తాను మొండిపట్టు పడుతున్నాడు?’ ఈ ప్రశ్నలన్నింటికీ జవాబుగా నా కళ్ళముందు దట్టంగా పెరిగిన వేపచెట్టు కదిలింది. చాలా సంవత్సరాల తరువాత గ్రామానికి పోతున్నాను. నాన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళాను. అటు తరువాత ఎందుకో అక్కడికి వెళ్ళటానికి మనస్కరించలేదు. నా భార్య చాలాసార్లు, ‘పదండి , షికారుగా వెళ్ళొద్దాం’ అనేది. అయితే ఏదో నెపం చూపి తోసిపుచ్చేవాణ్ణి. నిజానికి నా మనస్సు అక్కడే ఉండేది, కానీ అడుగు ముందుకు పడేదికాదు. గతమంతా గుర్తొచ్చి ఎక్కడ బాధపడవలసి వస్తుందోనని భయపడేవాణ్ణి. అక్కడ ముఖ్యమైంది ఏమీ లేదు. గ్రామం ఎలాగూ గ్రామమే. ఎండిపోయిన ప్రాంతం. నదీ, సరోవరం, పచ్చదనమూ ఏదీ లేదు. దుమ్ముధూళి ఎగురుతూ ఉంటుంది. ధూళికి కూడా ఒక మాయ ఉంటుంది. మా గ్రామం పట్టణం నుంచి దూరంలో ఉంది. మా పొరుగు గ్రామం వరకూ బస్సుసౌకర్యం ఉంది. అక్కడి నుంచి మూడు కోసులు నడవాలి. గ్రామంలో ప్రవేశించగానే మామయ్య ఇల్లు కనిపిస్తుంది. గ్రామం మధ్యలో మా ఇల్లుంది. నాన్న కట్టించిన ఇల్లు. మట్టి ఇల్లు. రెండు గదులు, ఒక వంటిల్లు. పొడవైన వసారా. విశాలమైన ముంగిలిలో తులసికోట. అంతేకాకుండా అంగణం మధ్యలో పచ్చగా దట్టంగా పెరిగిన వేపచెట్టు. ఇంట్లో ఎవరూ లేకపోయినా ఆ ఇంటిని ఎలా వదిలిపెట్టగలను? నా తండ్రికి వైద్యం తెలుసు. ఆయన చిన్నప్పుడు గ్రామానికి ఎవరో సాధువు–సన్యాసులు వచ్చేవారని విన్నాను. అంతేకాకుండా మా ఇంట్లోనే వాళ్ళు బసచేసేవారట. నాన్న వాళ్ళకు సేవలు చేసేవారట. వాళ్ళతో వుంటూ ఒక రోజు ఎవరికీ చెప్పకుండా వాళ్ళతోపాటు ఇల్లు వదలిపోయారట. సుమారు ఆయన ఏడేళ్ళపాటు వాళ్ళతోటే ఉన్నారు. గురువుగారు మరణించిన తరువాత తిరిగొచ్చారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ దగ్గర మూలికలు నూరుతూ మూలికా వైద్యం నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న వైద్యమే ఆయనకు జీవితాంతం ఆసరా అయింది. ఇల్లు కట్టుకున్నారు. కుటుంబానికి సంబంధించిన చిన్నచిన్న బాధ్యతలు నెరవేర్చారు. అదే ఇంట్లో నేను పుట్టాను. నేను ఒక్కడినే సంతానం కావటం వల్ల అల్లారు ముద్దుగా, గారాబంగా పెంచారు. బాల్యంలో నేను చాలా తుంటరివాడిని. రోజూ నా మీద ఫిర్యాదులు వచ్చేవి. నాన్నగారు కోప్పడేవారు. బెత్తం పట్టుకుని నా వెంటపడేవారు. నేను వెంటనే వేపచెట్టు ఎక్కేవాడిని. పొద్దుపోయి, చీకటిపడినా నేను ఆయన పట్ల ఉన్న భయంతో కిందికి దిగేవాడిని కాను. వేపచెట్టు మీద ఉంటే నాకు భయం వేసేదికాదు. ‘కొట్టనులే, కిందికి దిగు’ అని నాన్న అంటే, అప్పుడు నేను కిందికి దిగేవాడిని. ఆ వేపచెట్టంటే నాకు ప్రాణం. నా ఊపిరి. ఎన్నెన్నో తీయటి జ్ఞాపకాలు ఆ చెట్టుతో ముడిపడివున్నాయి. ఆ రోజులు మరచిపోవాలన్నా మరచిపోలేం. ఇంటి ముంగిట్లోనే అమ్మ పొయ్యి మీద రొట్టెలు చేసేది. నాన్న వేపచెట్టు కింద మంచం వేసుకుని కూర్చునేవారు. నేను నా గోళ్ళతో ఆయన వీపు గోకుతూ ఉండేవాడిని. ఆయన నా రోజువారీ వివరాలు అడిగేవారు. నేను అన్నీ చెప్పేవాడిని. బడిలో ఎవరిని కొట్టాను, మాస్టరుగారి చేతుల్లో ఎవరికి దెబ్బలు పడ్డాయి? రమ్లీని ఎలా వేధించాను వగైరా వగైరా. నాన్నగారు మౌనంగా అన్నీ వినేవారు. తిట్టేవారు కాదు. ‘ఇలా చేయకూడదు నాన్నా’ అని మాత్రం అనేవారు. అయితే రమ్లీని వేధించాననే విషయం విని కోపగించుకునేవారు. రమ్లీ ఆయన స్నేహితుడి కూతురు. నా స్నేహితురాలు. ఆమె అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆమె పట్ల ఆయన చాలా శ్రద్ధ వహించేవారు. ఆమె నా పట్ల సదా శ్రద్ధ వహించేది. నేను తనను ఎంతగా వేధించినా నా మీద ఫిర్యాదు చేసేది కాదు. తన ఇంటి నుంచి ఎప్పుడూ ఏదో ఒకటి దాచుకుని తెచ్చి నాకు ఇచ్చేది. నా చేత తినిపించేది. నేను తింటూవుంటే తను నా వంకే చూస్తూ ఏదో ఆలోచనలో మునిగేది. వేపచెట్టు కింద మేము ఆడుకునేవాళ్ళం. వేప పుల్లలతో, ఆకులతో, వాటి కాయలతో ఇళ్ళు కట్టుకునేవాళ్ళం. వాటితో బల్లలు, మంచాలు, కుర్చీలు చేసేవాళ్ళం. ఆమె ఉట్టుట్టినే వంట చేసేది. నాకు వడ్డించేది. నేను తిన్నట్టు నటించేవాడిని. ఆమె బట్టలు ఉతికేది. ఆరవేసేది. ఇంటి కసువు చిమ్మేది. కోపాన్ని నటించేది. ఒక రోజు ఆమె నా కోసం తినడానికి ఏదో తెచ్చింది. నేను అప్పుడు వేపచెట్టు మీద కూర్చుని చదువుకుంటున్నాను. ఆమె చెట్టెక్కి నా దగ్గరికి వచ్చి ‘తీసుకో, తిను’ అంది. నాకు కోపం వచ్చింది. కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్ళీ, ‘తిను, ఎందుకలా చేస్తావు?’ అంది. నాకు కోపం వచ్చింది. ‘నాకొద్దు పో.. ఇక్కడి నుంచి’ అని నా చేతిని పట్టుకున్న ఆమె చేతిని విదిల్చాను. అయితే పట్టుతప్పి ఆమె వేపచెట్టు మీది నుంచి కిందకు జారింది. పడుతూ పడుతూ కెవ్వున కేకపెట్టి స్పృహ తప్పి పడిపోయింది. నేను దిగ్భ్రాంతి చెందాను. ఆమె వేసిన కేకకు ఇంట్లోని వారందరూ కంగారుగా పరుగెత్తుకొచ్చారు. కోలాహలం చెలరేగింది. నాన్నగారు రమ్లీని ఎత్తుకుని ముంగిట్లోకి తీసుకునిపోయారు. మంచం మీద పడుకోబెట్టారు. అమ్మ వణుకుతున్న చేతుతో రమ్లీ ముఖం మీద నీళ్ళు చిలకరించింది. విసనకర్రతో గాలి వచ్చేలా విసరసాగింది. నాన్నగారు ఏదో మూలికను నూరి ఆమె చేత తాగించారు. తరువాత నేరుగా కర్ర పట్టుకుని చెట్టుకిందకు వచ్చి కిందకు దిగమన్నారు. అయితే నేనెందుకు దిగుతాను? నేను మరింత పైకి ఎక్కి కూర్చున్నాను. నాన్న వేపచెట్టు కింద మంచం వేసుకుని కూర్చున్నాడు.. ‘దొంగ వెధవా, కిందకు రారా నువ్వు, నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను’ అంటూ. నేను మనస్సులోనే రమ్లీని తిట్టుకోసాగాను. ఆమె కారణంగా నాకు దెబ్బలు పడబోతున్నాయి. దాంతోపాటు నా మనస్సులో రమ్లీకి ఏమైనా అవుతుందేమోననే భయమూ కదలసాగింది. కొద్దిసేపటి తరువాత రమ్లీకి స్పృహ వచ్చింది. అది చూసి అమ్మ ఆమెను దగ్గరికి లాక్కుని గట్టిగా హృదయానికి హత్తుకుని చాలా సేపు ఏడ్చింది. రమ్లీని పదేపదే ముద్దు పెట్టుకుంది. అదే సమయంలో నన్ను చాలాసార్లు తిట్టింది. తరువాత అమ్మవారి ముందు దీపం వెలిగించడానికి ఇంట్లోకి వెళ్ళింది. రమ్లీ నాన్నను దుర్వాసుడి పోజులో వేపచెట్టు కింద కూర్చునివుండటం చూసింది. మళ్ళీ నా వైపు చూసింది. ఆమె మెల్లగా లేచి నాన్నగారి దగ్గరికి వచ్చింది. ‘తనను కొట్టకండి, తనేమైనా నన్ను కిందికి తోశాడా? పొరబాటున నేనే జారిపడ్డాను..’ అంది. నాన్నగారు ఆమెను ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఇంతలో అమ్మ లోపలి నుంచి వచ్చింది. ‘చూశారా, రమ్లీ ఎంత తెలివైందో? తనను నేను నా దగ్గరే పెట్టుకుంటాను’ అంది. అమ్మ మాటలు విని నాన్నగారు నవ్వసాగారు. అమ్మ రమ్లీని వంటింట్లోకి తీసుకెళ్ళింది. నాన్నగారు నాకు నచ్చజెప్పి నేను కింద దిగేలా చేశారు. నేను చెట్టు దిగగానే భోంచేయడానికి లోపలికి పంపారు. అమ్మ నాకు, రమ్లీకి అన్నాలు పెట్టింది. నాన్న కూడా వచ్చి మా పక్కనే కుర్చున్నారు. మమ్మల్ని చూసి అమ్మానాన్న ఊరకూరకే నవ్వసాగారు. భోజనాలయ్యాక నాన్న రమ్లీని వాళ్ళింట్లో వదిలి వచ్చారు. అంతే. ఆ రోజు నుంచి నేను ఎప్పుడూ తనను వేధించలేదు. ఆమె పట్ల నాకు ఇష్టం పెరగసాగింది. మేము కలిసే భోజనాలు చేసే వాళ్ళం. చదువుకునేవాళ్ళం. ఆడుకునేవాళ్ళం. అల్లరి చేసేవాళ్ళం. సరదాగా ఉండేవాళ్ళం. చాలావరకూ వేపచెట్టు కిందే కాలం గడిపేవాళ్ళం. ఋతువులు వస్తున్నాయి, పోతున్నాయి. చెట్టు ఆకులు రాలుతుండేవి. కొత్త చివుళ్ళు వేస్తూవుండేవి. పూత పట్టేవి. చెట్టు పెరుగుతూ ఉంది. మేమూ పెద్దగయ్యాం. మాలో యవ్వనం ప్రవేశించింది. యవ్వనంలోని మొదటి స్పర్శను అనుభవించాం. అప్పుడు కూడా వేపచెట్టు సాక్ష్యంగా ఉంది. నమ్మండి చెట్టు తన ఆకును మాపై రాల్చిరాల్చి తన ప్రసన్నతను వ్యక్తం చేసింది. రమ్లీ ఇప్పుడు రమీలా అయిపోయింది. ఒక రోజు ఆమె పూజకోసం పూలు ఇవ్వటానికి నాన్న దగ్గరికి వచ్చింది. ఆ రోజు వేపచెట్టు వెనుక దాక్కుని ఆమె మొదటి ముద్దును తీసుకుంది. వేపచెట్టు కూడా తాను ఏమీ చూడలేదన్నట్టు మౌనంగా నుంచుంది. అటు తరువాత రమ్లీ మెట్రిక్ పూర్తి చేశాక చదువు మానేసింది. ఆమె తండ్రి పాతకాలపు ఆలోచనలున్న మనిషి. నా తండ్రి చదువు మానిపించవద్దని ఎంత నచ్చజెప్పినా అతను వినిపించుకోలేదు. నేను పట్టణం వెళ్ళి చదువుకోసాగాను. హాస్టల్లో ఉండేవాడిని. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడిని. రమ్లీ కోసం ఎన్నో పుస్తకాలు తెచ్చేవాడిని. ఆమెకు పుస్తకాలు దొరికితేచాలు, దేవుడినే చూసినంతగా ఆనందించేది. హాస్టల్ చిరునామాకు ఆమె ఉత్తరాలు రాస్తుండేది. ఆమె అక్షరాలు చూడగానే నాకు పూతపట్టిన వేపచెట్టు జ్ఞాపకానికి వచ్చేది. హాస్టల్లో ఉండాలని అనిపించేది కాదు. ఒక రోజు తీవ్రంగా వర్షం కురుస్తోంది. ఎందుకో ఇల్లు గుర్తొచ్చింది. వేపచెట్టు చేదుచేదు వాసనతో మనసులో చిందులు వేసింది. హాస్టల్లో ఉండలేక వెంటనే గ్రామానికి బయలుదేరాను. పొరుగు గ్రామం వరకు వెళుతున్న బస్సెక్కి బయలుదేరాను. అక్కడ బస్సు దిగి నడుస్తూ, వర్షంలో తడుస్తూ, బురదను తొక్కుకుంటూ ఇల్లు చేరాను. గుమ్మంలోంచి చూడగానే అంగణంలోని వేపచెట్టు కింద రమ్లీ వర్షంలో తడుస్తూ నుంచుని ఉండటం కనిపించింది. ఆ దృశ్యం ఈ రోజుకీ నా కళ్ళల్లో స్థిరంగా నిలిచిపోయింది. బహుశా ఆమె నా కోసం ఎదురుచూస్తున్నట్టుంది. ఆమె తడిసిన, తెల్లటి శరీరం నన్ను చూడగానే ఆనందంతో పులకరించటం, ఆమె సిగ్గుతో ముడుచుకుపోవడం నేను ఎప్పటికీ మరచిపోను. ఆమె ఇంట్లోకి పరుగుతీసింది. నేను వసారాలోకి వచ్చేసరికి ఆమె తువ్వాలు, పొడిబట్టతో తిరిగి వచ్చింది. తువ్వాలు, పొడిబట్టలు తీసుకుని నేను లోపలికి వెళ్ళి ఒళ్ళు తుడుచుకున్నాను. దుస్తులు మార్చుకున్నాను. అంతలో రమ్లీ చాయ్ చేసుకుని తీసుకొచ్చింది. నేను మంచం మీద కూర్చుని చాయ్ తాగాను. ఆమె కప్పుసాసర్ లోపలికి తీసుకుని వెళ్ళింది. ఈ మధ్యలో ఆమె నేను చాయ్ తాగుతున్నంత సేపు మౌనంగా, తదేకంగా, కళ్ళార్పకుండా నన్నే చూస్తూ ఉంది. చీకటి పడుతూ ఉంది. ఆమె దీపం వెలిగించింది. ఆమె తడిసిన ముఖం మీద లేత వెలుతురు పరచుకుంది. ఆమె కళ్ళల్లో వెలుగుతూ, కదులుతున్న దీపపు ఒత్తి ప్రతిబింబం కనిపిస్తోంది. ‘అమ్మా, నాన్న ఎక్కడికి పోయారు?’ అడిగాను. ‘ఇంత ఆలస్యంగా వాళ్లు గుర్తొచ్చారా?’ ఆమె అల్లరిగా నవ్వుతూ అడిగింది. నేను సంకోచంతో తల వంచాను. ‘అత్తయ్యకు జబ్బు చేసింది. ఆమెను చూడటానికి వెళ్ళారు. రేపు సాయంత్రానికి వస్తారు’ అంది రమ్లీ. ‘నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు?’ ‘ఊరికే.. ఇలాగే వచ్చి వేపచెట్టు కింద నుంచున్నాను. నన్ను ఇంటిని చూసుకోమని చెప్పి వెళ్ళారు’ అంది. ‘నా కోసం ఎదురుచూస్తున్నావా?’ నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. ‘లేదు, నేనెందుకు ఎదురుచూస్తాను? నాకు చాలా పనులున్నాయి’ అంటూ ఆమె నవ్వింది. నేను మౌనం వహించాను. దాంతో.. రమ్లీ ‘నీ కోసమే ఎదురుచూస్తున్నాను. ఈ రోజు వర్షంలో వేపచెట్టు కూడా సంతోషంతో ఉంది. గాలి అలలు వీస్తున్నాయి. నువ్వు గుర్తుకు వచ్చావు. ఈ సమయంలో నువ్వు వస్తే ఎంత బాగుంటుందని ఆలోచిస్తూ ఉండిపోయాను. వేపచెట్టు కింద అలాగే నిలబడి నిలబడి నీ కోసం ఎదురుచూస్తూండిపోయాను’ అంటూ నా దగ్గరికి వచ్చేసింది. నేను ఆమెను దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకున్నాను. ఆమె సిగ్గుపడుతూ ‘నేను వెళుతున్నాను. భోజనానికి ఇంటికి వచ్చేయ్’ అంటూ బయలుదేరబోయింది. నేను ఆమెను పట్టుకుని ఆపాను. వేపచెట్టు వెనక్కు ఆమెను లాక్కునిపోయాను. మరుక్షణం సిగ్గే స్వయంగా నా బాహువుల్లో ఇమిడిపోయినట్టనిపించింది. అలా ఎంతసేపు ఉండిపోయామో. ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపించింది. చాలాసేపటి తరువాత సమయం గుర్తుకొచ్చినట్టు ఆమె నన్ను విడిపించుకుని పరుగుతీసింది. నేను అక్కడే, వేపచెట్టు కింద ఏదో మైకం కమ్మినట్టు కూర్చుండిపోయాను. చెట్టు ఆకుల నుంచి రాలుతున్న నీళ్ళు నా మీద పడుతున్నాయి.. నన్ను అభిషేకిస్తున్నట్టుగా.. చాలాసేపటి వరకు.. అటు తరువాత హాస్టల్లో ఉంటూ నేను పూర్తిగా మనస్సుపెట్టి, కష్టపడి చదువు పూర్తిచేయాలని ప్రమాణం చేసుకున్నాను. తరువాత మంచి ఉద్యోగం సంపాదించి, రమ్లీని నా జీవితభాగస్వామిగా చేసుకోవాలని కలలుకన్నాను. అదే కోరికతో కష్టపడి చదవసాగాను. ఒకరోజు నాకు ఆమె నుంచి ఉత్తరం వచ్చింది. అందులో, ‘ప్రియమైన.. నేను రెండుమూడు రోజుల్లో పరాయిదాన్ని అవుతున్నాను. తడి భూమిలో మౌనంగా విత్తనం నాటినా, అది మొలకెత్తడంతో జగానికంతా తెలిసిపోయింది. మీ తల్లితండ్రులు వచ్చి నా తల్లితండ్రులను ఎంతగా బతిమిలాడినా, ఆర్థించినా..’ నేను ఉత్తరం పూర్తిగా చదవలేకపోయాను. వెంటనే గ్రామానికి బయలుదేరాను. గ్రామ పొలిమేరలోనే పెండ్లి కొడుకు ఊరేగింపు ఎడ్లబండ్లు వస్తూ కనిపించాయి. ఎద్దుబండిలో కూర్చుని, తన సిగ్గును కొద్ది క్షణాలపాటు మరచిపోయిన రమ్లీ నా వైపు కళ్ళెత్తి చూసింది. ఆమె ఏడ్చిఏడ్చి వాచి ఉబ్బిన కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాలుతున్నాయి. రోడ్డుకు ఒకవైపున నిలబడి, ఆమె కనిపిస్తున్నంతసేపు చూస్తూ ఉండిపోయాను. మెల్లమెల్లగా, ఒక్కొక్కటిగా ఎడ్లబండ్లు కనుమరుగయ్యాయి. నేను ఒక భూతంలా ఆలోచిస్తూ నిలుచుండిపోయాను. దీన్ని ఎలా అంగీకరించను? నా దగ్గరికి ఎందుకు పరుగెత్తుకుంటూ రాలేదు? మనస్సులో జవాబులేని ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి. ఓడిపోయిన జూదరిలా ఇంటికి వచ్చాను. తెరచిన తలుపులు గాలి రభసకు కొట్టుకుని చప్పుడు చేస్తున్నాయి. నాన్న వేపచెట్టు కింద నులకమంచం మీద కూర్చునివున్నారు. నన్ను చూశారు. అయితే ఏమీ చెప్పలేదు. తలవంచుకుని అలాగే కూర్చుండిపోయారు. అమ్మ వచ్చింది. నేను ఆమెను గట్టిగా పట్టుకుని బిగ్గరగా రోదించసాగాను. అమ్మ నన్ను ఓదార్చుతూ లోపలికి తీసుకునిపోయింది. నీళ్ళు తాగించింది. నన్ను ఓదార్చుతూ నిద్రపుచ్చింది. అందరూ నిశ్శబ్దంగా నిద్రపోయారు. ఎవరూ భోంచేయలేదు. నేను అర్ధరాత్రి లేచి వేపచెట్టు కాండాన్ని ఆసరా చేసుకుని దానికి ఆనుకుని కూర్చున్నాను. దాని శరీరంలో పోగుపడిన పరిచితమైన సర్శానుభవాన్ని పొందుతూ ఉండిపోయాను. అలాగే తెల్లవారింది. ఇప్పుడు కూడా మనస్సు వ్యాహారిక క్లేశాలతో అలసి, ఓడిపోయినట్టు అనిపిస్తే, అదే వేపచెట్టు సహాయం తీసుకుంటాను. దాని నీడను తలచుకుంటే మనసుకు ఒక విధమైన హాయి, శాంతి దొరుకుతాయి. ‘ఇదే ఇంట్లో ఆశాతో నా పెళ్ళి జరిగింది. పెళ్ళి మంటపం కూడా వేపచెట్టు కిందనే నిర్మించారు. వాస్తవానికి నేను ఆశాను మనస్ఫూర్తిగా ఎప్పుడూ స్వీకరించలేదు. చేతుల్లో ఆమె ముఖాన్ని తీసుకోగానే నాకు రమ్లీ గుర్తుకొచ్చేది. తళుక్కున మెరిసే ఆమె కళ్ళు ఎక్కడ..! ముందునుంచే ఆశా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేది. ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. బాగా వడలిపోయింది. అమ్మా, నాన్న చనిపోయాక నేను పూర్తిగా ఒంటరి అయిపోయాను. నా మనసులోని దుఃఖాన్ని, బాధను చెప్పుకోవడానికి ఆత్మీయులు ఎవరూ లేరు. కేవలం వేపచెట్టు మాత్రం ఉండేది. దాని జ్ఞాపకాలే నాకు శాంతిని కలిగించేవి. దాని నీడలో గడచిన క్షణాలే నాకు జీవించటానికి ప్రేరణ ఇచ్చేవి. దాంతో నేను నా బాధలు, దుఃఖాలు మరచిపోయేవాడిని. మనసు కూడా వేపచెట్టునే ధ్యానించేది. ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరేటప్పుడు ఉదయపు ఎండలో ఇంటిమీద పడే దానినీడ గుర్తుకు వచ్చేది. మధ్యాహ్నం, సాయంత్రాలు కూడా దాని మధురమైన జ్ఞాపకాలే వెంటాడేవి. ఆ వేపచెట్టు ఉన్న ఇంటిని మామయ్య చిన్నాన్నకు ఇచ్చివేయమని చెబుతుండేవాడు. డబ్బులు వస్తాయని! అయితే నాకు డబ్బు వద్దు.. దార్లో పిన్ని కనిపించింది. నన్ను నేరుగా ఆమె ఇంటికి తీసుకెళ్లింది. నిజానికి నేరుగా మా ఇంటికి వెళ్ళానుకున్నాను. కానీ ఆమె ఒప్పుకోలేదు. చిన్నాన్న ఇంటిదగ్గర లేడు. పిన్ని చాయ్ చేసింది. చాయ్ తాగి నేను, ‘కాస్త ఇంటి దగ్గరికి వెళ్ళొస్తాను’ అన్నాను. ‘ఇంటికి పోయి ఏం చేస్తావు? చాలా కాలంగా ఆ ఇంటిని శుభ్రం కూడా చేయలేదు’ అంది పిన్ని. ‘వేపచెట్టు కింద కూర్చుంటాను’ ‘అయితే వేపచెట్టును మీ చిన్నాన్న నరికించాడు. డబ్బు అవసరం ఉండింది. అందుకే..’ ‘నరికించాడా?’ నమ్మండి, ఆ మాట వినగానే నా చెవుల్లో ఎవరో కరిగించిన సీసం పోసినట్టు అనిపించింది. నా శరీరం ముడుచుకుపోయింది. గజగజావణుకుతూ,ఫెళఫెళమంటూ చప్పుడు చేస్తూ పడిపోతున్న వేపచెట్టు ఆర్తనాదం వినిపించింది. కూలిపోతున్న దాని శరీరం కింద నేను అణిగిపోయినట్టు అనిపించింది. కళ్ళల్లో చీకటి కమ్ముకుంది. కాళ్ళకింది భూమి గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. నా రోమరోమాలు నిప్పు అంటుకున్నట్టు భగభగమని మండసాగాయి.. ఈ మనుషులు నా గతాన్ని ఒక్క దెబ్బతో లేకుండా చేశారు. నా మూలాలను మట్టిలోంచి పెళ్లగించారు. ఆ వేపచెట్టుతో పెనవేసుకున్న నా ఒక్కొక్క జ్ఞాపకం గాయపడింది. రక్తసిక్తమైంది. ఒక భరించరాని చేదు అనుభవం నా అస్తిత్వంలో చేరుకుంది. దుఃఖంతో నా గొంతు పూడుకుపోయింది. ‘మామయ్యా..’ ‘ఆ..’ ‘నాకు ఇల్లు అవసరం లేదని చినాన్నతో చెప్పు మామయ్య. అలాగే నాకు డబ్బు కూడా వద్దని చెప్పు.. అంతా ఆయనకే వదిలివేస్తున్నాను..’ చాలా కష్టంగా ఆ మాటలు నా నోటి నుంచి వెలువడ్డాయి. తడబడుతున్న అడుగులతో నేను అక్కడి నుంచి కదిలాను. మామయ్య, పిన్ని నన్ను ఆపటానికి ప్రయత్నించసాగారు. ఏదో చెప్పాలని, ఏదో అడగాలని ప్రయత్నించసాగారు. అయితే నేను ఆగలేదు. మాట్లాడలేదు. మరమనిషిలా అడుగులు వేస్తున్నాను. మామయ్య నా వెనుకనే అడుగులు వేస్తున్నాడు. నా మనస్సులో ప్రళయం.. వేపచెట్టు.. వేపచెట్టు.. వేపచెట్టు.. చెవులకు గాలిలోనూ ఏమీ వినిపించటం లేదు. గాలి కూడా బహుశా శోకగీతం ఆలపిస్తూవుంది. గుజరాతీ మూలం: దీపక్ రావల్ అనువాదం: రంగనాథ రామచంద్రరావు చదవండి: ఈ వారం కథ: తిరగబడ్డ చేప -
ఈ వారం కథ: తిరగబడ్డ చేప
‘ఒరేయ్ కొండిగా నీదేరా ఫస్ట్ హ్యాండ్ ఆడతావా డ్రాపా?’ కింద హ్యాండ్ వాడు అడిగాడు ఓపెన్కార్డు కేసి ఆశగా చూస్తూ. కొండలరావు నిమిషానికి నూటముప్పైసార్లు కొట్టుకుంటున్న గుండెతో పదమూడు ముక్కలూ సర్దాడు. నాలుగు రాణులు, నాలుగు జాకీలు, ఇస్పేటు ఆసు రెండు మూడు నాలుగుతో, చేతిలో కార్డుషో. ఏ రాజొచ్చినా, ఏ పదొచ్చినా, పిల్లొచ్చినా ఆటే. ఓక్కి రూపాయి స్టేకు. ‘వారం రోజుల నుంచి డబ్బులు పోతానే ఉన్నాయి. ఈ ఆటతో మొత్తం రికవరీ అయిపోవాల’ అనుకుంటూ పేకలోకెళ్ళి తీసిన ముక్కని ముద్దెట్టి నెమ్మదిగా చూశాడు. కళావరు ఏడు. కొట్టేశాడు. ‘పోన్లే.. డీలయితే మళ్ళీ హాఫ్ కౌంట్ అంటారు. ఓ టర్న్ ఆగితే మంచిదే. ఫుల్ లాగొచ్చు’ సమాధాన పరచుకున్నాడు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు పడేశారు. ‘ఛ, తప్పించుకున్నారు. ముగ్గురు ఆడారు. పోన్లే, మూడుకౌంట్లు, రెండు డ్రాపులు, అరీబు పోనూ రెండూ ఏభై. ఈ కట్టు కొడితే నాన్నకి చెప్పుల జత కొని పట్టుకెళ్ళాలి. పాపం పోయినసారి ఈత ముల్లు గుచ్చుకుని నెల్లాళ్ళు బాధపడ్డాడు’ అనుకుంటూ ముక్కలు ముడిచి పట్టుకుని అందరికేసీ గుటకలు మింగుతూ చూస్తున్నాడు కొండలరావు జింక కోసం మాటేసిన పులిలా. చదవండి: ఈవారం కథ: సార్థకత పాతికేళ్ల కొండలరావు ఊర్లో ఇంటర్ వరకూ చదివి, కొన్నాళ్ళు నాన్నకి వ్యవసాయంలో సాయంచేసి, ఇద్దరికి సరిపడా పనిలేక పోవడంతో పక్కనే ఉన్న పట్నమొచ్చి సెక్యూరిటీ ఏజెన్సీ తరపున ఓ అపార్ట్మెంట్లో గార్డ్‌గా చేరాడు. వరుసగా ఆరు పోర్షన్ల ఆస్బెస్టాస్ ఇంట్లో ఓ పోర్షన్లో ఇంకో ఇద్దరు పెళ్లికాని గార్డ్స్‌తో కలసి ఉంటున్నాడు. షిఫ్ట్ డ్యూటీలను బట్టి ఆ కంపెనీలో గార్డ్స్ అందరూ వారానికోసారి కొండలరావు ఇంట్లో పేకాడతారు. అది తప్పో, రైటో వాళ్లకి తెలీదు. తెలిసిందల్లా సెలవులు, ఇంక్రిమెంట్లు, డి.ఏ.లు, ప్రశంసా పత్రాలు .. ఇదిగో ఈ మాత్రం ఆటవిడుపు. మరో రౌండ్ తిరిగింది కానీ కొండలరావుకి ముక్కరాలేదు. ఇంతలో మిగతా ముగ్గురూ కింద నుంచి తలా ముక్కా తీసుకున్నారు. ‘సుడిగాళ్ళకి లైఫులు అయిపోయినట్టున్నాయి. పోన్లే, పెనాల్టీ అయినా ఇస్తారు’ అనుకుని ధీమాగా ఉన్నాడు కొండలరావు. మరో రౌండ్లో పైనున్నోడు ఓ ‘రాజు’ తీసి కొట్టబోయాడు. ఆడకుండా అందరికీ టీలు అందించేవాడు ఇద్దరిపేక చూసి, కొండలరావు చూడకుండా వాడి కాలు తొక్కాడు. అంతే వాడు ‘రాజు’ మళ్ళీ లోపల పెట్టేసి రెండు కొట్టాడు. మరో రౌండ్ తిరిగాక కొండలరావు చేతి కిందున్నోడు ఆట చూపించేశాడు. కొండలరావు ముక్కలు విసిరేసి జేబులో ఉన్న ఏభైనోటిచ్చి ‘మిగతా ముప్పై తర్వాత ఇస్తానురా’ అన్నాడు. ‘అబ్బే దీపాలెట్టే ఏల అరువు కుదర్దని తెలుసుకదరా రానీ బాలన్స్ రానీ’ అంటూ అందరూ ఇచ్చిన డబ్బులు ముద్దెట్టుకుని నోట్ల దొంతుని పరచిన దుప్పటి కిందకి దోపాడు ఆట కొట్టినోడు. కొండలరావు ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. ఆఖరికి డిపాజిట్ ఎనభైలో ముప్పై విరగ్గోసుకుని మిగతా ఏభై తీసుకుని ఉసూరుమంటూ డ్యూటీకి బయల్దేరాడు కొండలరావు. అపార్ట్మెంట్ సెల్లార్‌లోని కుర్చీలో కూర్చున్నాడే కానీ కొండలరావు స్థిమితంగా లేడు. ఏభై ఫ్లాట్లు, నూటఏభై మంది జనం. ఏ ఒక్కరు వచ్చినా, పోయినా, లేచి సెల్యూట్ చెయ్యాలి. మోటార్ ఆన్ చెయ్యటం, మేంటెనెన్సు కలెక్ట్ చెయ్యటం, విజిటర్స్ చేత రిజిస్టర్లో సంతకం పెట్టించటం, కొందరు అరిస్తే నవ్వుతూ ‘ఇక్కడ రూల్స్ సర్, సారీ సర్’ అనటం, వాళ్ళు పెట్టకపోతే, సెక్రటరీ చేత తిట్లు తినటం, సెకండ్ షోకి వెళ్లొచ్చిన వాళ్లకి గేటు తియ్యడం కాస్త ఆలస్యం అయితే, తనని తీసెయ్యడం కోసం ఇరవైమంది మీటింగెట్టుకోవటం, తను వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, ఏ దయగల అమ్మగారో పండగ పూట బూరో, బొబ్బట్టో పెడతానంటే వెళితే, ‘గేటు దగ్గర లేకుండా ఎక్కడ పెత్తనాలకెళ్లా’వని ఓ అయ్యగారు ఆరోపించడం.. అన్నీ భరిస్తే, పన్నెండు గంటల చొప్పున ముప్పైఒక్క రోజుల డ్యూటీకి ముట్టేది ఎనిమిదివేలు. మహా అయితే ఇంకో మూడేళ్ళకి తొమ్మిదివేలవుతుందేమో. పోనీ ఊర్లో వ్యవసాయం చేసుకుందామంటే, ‘అదీ జూదమే. మీ నాన్నాడుతున్నాడు కదరా! మళ్ళా నువ్వెందుకు?’ అంటుంది అమ్మ. ఇంతలో ఓ కుక్క అపార్ట్మెంట్లోకి దూరటంతో పైనించి వచ్చిన కేకలకు ఉలిక్కిపడి ఆలోచనలను నెట్టేసి, కుక్కని తరమడానికి లేచాడు కొండలరావు. ∙∙ ఏపుగా పెరిగిన చేనుకేసి తృప్తిగా చూసుకున్నాడు పెద్దాపురం. తనకున్న రెండెకరాల్లో వరేశాడు. ఈ ఏడు కాల్వ పారుతుండడంతో నీటికి ఇబ్బందిలేదు. పెట్టుబడికోసం పొలం, పెళ్ళాం మెళ్ళో తులం తాకట్టు పెట్టాడు. చాన్నాళ్ల తర్వాత ఈ ఏడు కొంతైనా మిగిలేలా ఉంది. ‘వచ్చే బుధవారం కోతలు పెట్టుకోవాల’ అనుకుంటూ, కూలోళ్ళకి చెప్పి, కోతల ముందు బండి మాంకాళమ్మకి వెయ్యడానికి దార్లో ఓ కోడిపిల్లని కుడా కొన్నాడు. చేలోకోసి పట్టుకొచ్చిన మువ్వని చూరుకి వేలాడదీశాడు. కాళ్ళు కడుక్కుని అన్నానికి కూర్చున్నాడు. ‘ఎవసాయం ఒద్దన్నావు. చూడూ.. ఈయేడు గింజ దిగుబడి’ అంటూ వెన్నుకేసి చూపించాడు. ‘ఏమోనయ్యా. చేతికాడాకొచ్చేవరకూ ఏటీ చెప్పలేం. ఇదీ జూదమే అని మా అయ్య చెప్తా ఉండేవాడు. మన పైన మెరక పొలమంతా పెసిడెంటుగారిదేగా. మనది కూడా కలుపుకున్దారని ఆ మద్దె అడిగారన్నావు కదా, అమ్మేయ్యొచ్చుగా ఎందుకీ యాతన’ అంది అతని భార్య నిట్టూరుస్తూ. ‘నోర్ముయెస్, అన్నంకాడ ఎదవ అపశకునం. రెంటికీ అదృట్టమే ఉండాలి కాబట్టి జూదమూ, ఎవసయమూ ఒకటని కాదే. యాపకానికీ, ఊపిరికీ ఉన్నంత తేడా ఉంది. సూత్తా ఉండు. రేపు కోతలు, ఆపైవారం కుప్ప, ఓ మూడ్రోజులాగి నూర్పు, బళ్ళు మిల్లుకు తోలేత్తే, మనకి నాలుగ్గింజలు, పశువులకింత గడ్డి, బ్యాంకుకి బాకీ జమ, నీ మెళ్ళో నీ గొలుసు, నీ ముద్దుల కొడుకు ఏలుకో ఎంకటేస్సరసామి ఉంగరం, ఎప్పుడూ ఆ ఉప్పుదేరిన యూనిఫారమే తప్ప మంచి గుడ్డ కట్టుకున్నదేలేదాడు. ఓ రెండు జతల బట్టలు తియ్యాల. ఆపైన ఆడి పెళ్లి, పై ఏటికి నువ్వు అవ్వ, నేను తాత’ అంటూంటే పొలమారింది పెద్దాపురానికి. ∙∙ భోంచేసి వాకిట్లో నులక మంచం వేసుకున్నాడు పెద్దాపురం. తెల్లవారితే కోతలు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావటంలేదు. ఎంత ధీమాగా ఉందామన్నా ఏదో బెరుకు. ఏ తెల్లవారుజామో నిద్ర పడుతూండగా ఎవరో లేపిన అలికిడి. విషయం తెలుసుకుని పరుగున పొలానికి బయల్దేరాడు. ప్రెసిడెంటు తన పొలమంతా చేపల చెరువుకోసం తవ్వేసి, అవి నింపటం కోసం వదిలేసిన ఆరు బోర్లూ పొంగిపోయి పెద్దాపురం నాలుగు మళ్ళూ నీటితో నిండిపోయాయి. పగలు పసిపాపలా తలలూపి పలకరించిన వరిచేను అప్పుడే జీవుడెళ్లిపోయిన పీనుగులా వేలాడింది. ఒబ్బిడి చెయ్యడానికి మరో పదివేలు పెట్టినా, ముతక ధాన్యం కొంటారో కొనరో తెలీదు. ఎవరో పనిమాలా చేసినా, పొరపాటున చేసినా చేసేదేంలేని పెద్దాపురం ఊసురోమంటూ గట్టుమీద కూలబడ్డాడు. ఆ క్షణం భూమ్మీదున్న మూడొంతుల నీరూ అక్కడే ఉన్నట్టుంది. ఒకొంతు మళ్ళోనూ, రెండొంతులు అతని కళ్ళల్లోనూ! ∙∙ పెద్దపండగ వచ్చింది. అతికష్టం మీద, జీతం నష్టం మీద, ఒక్కరోజు సెలవుపెట్టి ఇంటికొచ్చాడు కొండలరావు. అప్పులో అప్పుచేసి పండగ సందడి తెచ్చాడు పెద్దాపురం. సగానికి చిక్కిపోయిన కొడుకుని చూసి బెంగెట్టుకున్న తల్లి ‘పొదుగునించి అప్పుడే గిన్నెలోకి వెచ్చగా జారే పాలనురుగులా ఉండేవోడు. ముమ్మారు మరిగించిన కాఫీలా అయిపోయాడు నా కొడుకు’ అని బాధపడి,‘నా బంగారం కదూ, పొలంలో పండే ధాన్యం, పాకమీద కాసే ఆనపకాయ, పెరట్లో పాడితో గడవకపోదు, ఇక్కడే ఉండిపోరా’ అంది. కొడుకు ఉద్యోగ వివరాలు అడిగాడు పెద్దాపురం. ‘నాన్నా, ఆ ఉద్యోగం చెయ్యటం నావల్ల కాదు. ఎన్నేళ్లు చేసినా అంతే. పొలం అమ్మేద్దారి. ఏదైనా యాపారం చేద్దారి’ అన్నాడు కొండలరావు ఆశగా తండ్రికేసి చూస్తూ. ‘అవునయ్యా.. అదేం పొలం. రోడ్డుకి రెండు మైళ్ళలోన అక్కడో ముక్క, ఇక్కడో చెక్క.. పొలంలో పంజెయ్యటం మాట అటుంచి ఆ గట్లంపట పొలానికి ఓ పాలి ఎల్లోత్తే చాలు ఆరుసుట్లు అన్నం తినాల’ అంది అతని భార్య విసుగ్గా. ‘ఆపేహే నీ ఎదవ గోల. గట్లమ్మట ఎల్లడ మేటే, అది రివాజు మార్గం. రోడ్డార ఉండానికి అదేమన్నా బజ్జీ కొట్టంటే? భూంతల్లి. ఆమె ఏడుంటే ఆడకే ఎల్లాల. ఓ నేత పుడితే వొందమందిని పాలింతాడు. ఓ నియంత పుడితే వొందమందిని సాసింతాడు. అదే ఓ రైతు పుడితే వొందమందిని పోషింతాడని మా తాత చెప్పేవాడు. ఓ రెండు పంటలు పోయేటప్పటికి మీకు ఎవసాయమూ, నేనూ లోకువైపోయాం. ఏం ఇన్నాళ్ళూ మనకి తిండెట్టింది ఈ ఎవసాయమే కదా’ అన్నాడు పెద్దాపురం చుట్ట చివర చిదిపి నోట్లోపెట్టుకుంటూ. ‘పోన్లే నాన్నా అమ్మొద్దులే. ఇక్కండతా చేపలేసి చేంతాడంత లావు గొలుసులు మెళ్ళో ఏసుకుని తిరుగుతా ఉంటే, నువ్వింకా మీ తాతలనాటి వరేసి వడ్డీ యాపార్లెంట తిరుగుతున్నావు. మనం కూడా చేపల చెరువు తవ్వుదాం. పైగా మన చుట్టూ ఇప్పటికే తవ్వేశారు. భూమంతా చౌడుదేలి పోయుంటాది. పై ఏడు నువ్వు వరేసినా పండదు. నా మాటిను. లోను, గట్రా నేను చూసుకుంటాను. ‘జీరో కౌంటు’ చేప్పిల్ల ఇరవై రూపాయలకి దొరుకుతాదంట. తెచ్చి ఏద్దారి. నాలుగు ఫేన్లు ఎడదారి. ఇదేశాల నించి మంచి మేత ఒత్తంది. అది గనుక ఎడితే నాలుగు నెలల్లో చేప హీనంలో కేజీన్నర తూగుతాదంట. రెండెకరాలూ తవ్వితే రెండు వేల పిల్లలు పడతాయి. పట్టుబడి కొచ్చేసరికి మూడు టన్నులొత్తాయి. టన్ను తొంబై ఏలు పలుకుతోంది. కర్చులు పోనూ లచ్చ నికరంగా మిగులుతాది. ఇటుపై ఎవసాయం నాకొదిలెయ్ నాన్నా. నువ్వు కులాసాగా చుట్ట కాల్చుకుంటూ అరుగుమీద కూర్చో’ అన్నాడు కొండలరావు తండ్రికేసి ఆశగా చూస్తూ. మొగుడితో విసిగిపోయిన ఆ ఇల్లాలు, సొంత రక్తం మీద నమ్మకంతో వత్తాసు పలికింది. ‘నువ్వు చెప్పేది బాలేదు అంటానికి నాకాడ రుజువుల్లేవురా. నీ ఇట్టం. పోతే, నీ ఉద్యోగం.. నువ్వు చెప్పేదాన్ని బట్టి వయసులో ఉన్నావు కాబట్టి ఓసోట కూకోడం నీకు నప్పలేదురా. ఆ కులాసాగా కూకునేదేదో నేనే అక్కడ కూకుంటా. ఆ ఉద్యోగం నాకిత్తారేమో కనుక్కో. నేసేసిన అప్పు నేనే తీర్చుకుంటా. నీ మీదెందుకు రుద్దటం’ అన్నాడు పెద్దాపురం మెత్తబడుతూ. ‘ఓస్ అదెంత పని నాన్నా. మా దాంట్లో రోజుకొకరు మానేత్తా ఉంటారు. నువ్వూ దిట్టంగానే ఉన్నావు, పైగా ఏడు వరకూ చదివావు కదా. అది చాలు. మా సూపర్ వైజర్‌తో మాట్లాడి నా బదులు నిన్నెడతా’ అన్నాడు కొండలరావు హుషారుగా. మారబోతున్న వారి జాబులకీ, జాతకాలకీ శుభం పలుకుతూ కనుమ ముస్తాబైన పశువులు తలలూపాయి. ∙∙ కొత్తగా వేసుకున్న యూనిఫామ్, దగ్గరగా చేయించుకున్న క్రాఫు, చెప్పులు కూడా ఎరగని కాళ్ళకి బూట్లు, దర్జాగా కూర్చోడానికో కుర్చీ, అపార్ట్మెంట్ ఎంట్రెన్స్‌లో కుర్చీ వేసుకుని కూర్చుంటే ‘ఈ కోటకి నేనే రాజుని’ అన్నంత గర్వంగా అనిపించింది పెద్దాపురానికి. ఎవరైనా వస్తే లేచి తలపాగా సంకలో పెట్టుకుని దణ్ణంపెట్టడం ఎలాగూ అలవాటే. ఇక్కడ తలపాగా బదులు టోపీ, దండం బదులు సెల్యూట్. నాలుగు నెలలవడంతో పనులన్నీ అలవాటౌతున్నాయి. ఇంతలో ఆటోలో ఓ పెద్దావిడ దిగింది. చేతిలో లగేజ్. మోకాళ్ళ నొప్పుల వల్ల ఒంగుని నడవలేక నడుస్తోంది. ఎదుటివాడి కష్టం పంచుకోవటమే తప్ప తల తిప్పుకోవటం ఇంకా అలవాటు కాని పెద్దాపురం గబుక్కున ఆవిడ చేతిలో సంచీ అందుకుని లిఫ్ట్ ఆన్‌చేసి ఇంటి వరకు వెళ్లి దింపొచ్చాడు. ఆవిడ అటూఇటూ కంగారుగా చూసి, అతనివైపు కృతజ్ఞతగా చూసి, ఓ పదిరూపాయలు ఇవ్వబోయింది. మర్యాదగా తిరస్కరించి కిందకి వచ్చేశాడు. ఇదంతా వాళ్ళింట్లో గొడవాడి మానేసి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారింట్లో పన్లోకి జేరిన పనిమనిషి చాటుగా చూసి సదరు ప్రెసిడెంట్ గారి భార్యకి చెప్పింది. ఆవిడ ఆ ముసలావిడ కోడలు ఎన్నిసార్లు అడిగినా తన కిట్టీపార్టీలో జాయిన్ అవని కారణంగా, ఆ నియమాతిక్రమణ పరిష్కారం నిమిత్తం ఆ రోజు రాత్రి ఏడింటికి ఎమెర్జెన్సీ మీటింగ్ పెట్టించింది. ముసలావిడ మొయ్యలేని బ్యాగ్ అందుకోవడం ఇక్కడ నేరమని తెలియని పెద్దాపురం బెదిరిపోయి, అందరికీ విడివిడిగా క్షమాపణలు చెప్పాడు. మరోసారి జరగదని హామీ ఇచ్చాక, తిట్టి వదిలిపెట్టారు. రిలీవర్ వచ్చాక డ్యూటీ అప్పజెప్పి దిగులుగా రూముకి బయలుదేరాడు. ∙∙ పిల్లి, రెండు సీక్వెన్స్‌లు, ట్రిప్లేట్తో పన్నెండు ముక్కలైపోయాయి. ఎక్స్టెన్షన్ వస్తే ఆట. ముక్కలు ముడిచి, చుట్ట వెలిగించాడు పెద్దాపురం. ఈ కట్టు కొడితే కొండగాడికో చొక్కా కుట్టించొచ్చు. రెండు రౌండ్లు తిరిగాయి. వచ్చిన ముక్క వచ్చినట్టు కొడుతున్నాడు. తన పైనున్నోడు ముదురు. డిస్కార్డ్ బాగా ఆడుతున్నాడు. పేకలోకెళ్ళాడు. సీక్వెన్స్‌కి ఎక్స్టెన్షన్ వచ్చింది. అంతే వేస్ట్ కార్డు గట్టిగా కొట్టి మూసి ఆట చూపించాడు. ఆ కొట్టడంలో ఎగుడు దిగుడుగా ఉన్న దుప్పటీ మడతకి తగిలి మూత కార్డ్ కూడా తిరిగబడి పోయింది. అంతే అందరూ ఒక్కసారిగా ‘‘రాంగ్ షో’’ అని అరిచారు. ఏమీ మాట్లాడలేక, కౌంట్ డబ్బులు అక్కడ పెట్టేసి చెప్పులేసుకుని బైటకి నడిచాడు పెద్దాపురం. మాటిమాటికీ చేతిలో ఫోన్ చూసుకుంటూ ఈ ఉద్యోగానికి రేపట్నించి రానని సూపర్వైజర్కి చెప్పడానికి బయల్దేరాడు. పట్నంలో ఉండటం ఇబ్బందిగా ఉంది. ఊర్లో ఉదయాన్నే దబ్బాకువేసి పులవపెట్టిన తరవాణి అన్నంలో వాము, గానుగనూనె వేసుకుని తింటే కడుపులో చల్లగా ఉండి, మళ్ళీ రాత్రి ఇంటికొచ్చే వరకూ ఆకలి తెలిసేది కాదు. ఇక్కడ పొద్దున్నే ఇంటిపక్క బడ్డీలో తినే నాలుగు నాజూకు ఇడ్లీలూ పదకొండో గంటకి అరిగిపోతున్నాయి. హోటల్ తిండి పడటం లేదు. కొత్తలో డ్యూటీ బానే ఉన్నా ముందురోజు జరిగిన మీటింగ్‌తో బెదిరిపోయాడు. చేపలు బానే కండ పట్టాయని కొడుకు మొన్నే ఫోన్ చేశాడు. బహుశా ఈరోజు దింపుతాడు. నాలుగు టన్నుల వరకూ రావొచ్చని చెప్పాడు. ‘ఏదో టయానికి కొండగాడి ఫోన్ రావాలి. దేవుడి దయవల్ల చేపల యాపారం బాగా సాగితే ఈ ఏడు ఆడి పెళ్లి చేసేసి హాయిగా మనవలతో ఆడుకోవచ్చు’ అనుకుంటూండగా కొండలరావు ఫోనోచ్చింది. ‘ఆ చెప్పరా కొండా, దింపుడు ఎంతొచ్చింది? ఎన్ని టన్నులయ్యాయి? టన్ను ఎంత పలికింది?’ ఆత్రంగా అడుగుతున్నాడు పెద్దాపురం . ‘నాన్నోయ్. మన చెరువులో ఎవరో ఎండ్రిన్ కలిపేశారు. చేప తిరగబడింది’ కొండలరావు. నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. సూపర్ వైజర్ దగ్గరకి వెళ్ళే వాడల్లా వెనక్కి తిరిగి రూమ్‌కి వచ్చేశాడు పెద్దాపురం. వేసుకున్న బట్టలు విప్పేసి, తలుపుకి తగిలించిన యునిఫారం తీసి వేసుకున్నాడు. జారిపోతున్న ప్యాంటుని బెల్టుతో బిగించాడు. వరికొయ్యల మళ్ళో నడిచిన పాదాల పగుళ్ళ కన్నా అలవాటు లేని షూ కరిచిన వేళ్ళు ఎక్కువ నొప్పెడుతున్నా, సాగిపోయిన సాక్సులతో వాటిని కప్పేసి, షూ లేసులు బిగించి, కొండంత దిగులు తోడురాగా డ్యూటీకి బయల్దేరాడు పెద్దాపురం.. పొలం అమ్ముకోవడం కన్నా తలమ్ముకోవడం సులువనిపించి. - ఉమా మహేష్ ఆచాళ్ళ చదవండి: మరోకథ: పులి -
మరోకథ: ఎండ గుర్తు
నగరానికి వచ్చిన ఇన్నేళ్ళ తరవాత, ఇన్నిన్ని రోడ్లు తిరిగి, ఇన్ని ఉద్యోగాలు చేసి, ఇంత మందితో కలిసితిరిగి చివరికి అందరినీ మరచిపోయి, ముసలితనానికి దగ్గరపడుతున్న ఈ వయసులో ముప్పైఏళ్ళ క్రితం ఓ మధ్యాహ్నం హోటలులో కలసి భోంచేసిన లాయరు ఎందుకో గుర్తుకొస్తుంటాడు. చాలా యేళ్ళ క్రితం, హైదరాబాద్‌కి వచ్చిన కొత్తలో, ఏదో ఒక జాబులో సెటిలవుదామను కుంటున్న రోజుల్లో టెంపరరీగానే అనుకుంటూనే యేడేళ్ళు ఒక లాయరు దగ్గర స్టెనోగా పనిచేశాను. అదంతా ఒక వృథా కాలయాపన. రాజుగారికి ఏడుగురు కొడుకులన్నట్లు ఆ లాయరుగారికి ఏడుగురు జూనియర్లుండేవారు. అందరూ పాతికేళ్ళ వయసుకు అటూ ఇటూగా ఉండేవారు. మా లాయరుగారు వాళ్ళకి జీతం కూడా ఏడువందలే ఇచ్చేవాడు. ఏడువందలంటే ఏడువేలనుకునే పూర్వపురోజలు కూడా కావవి. ‘మా సీనియరు నాకు ఆ మాత్రం కూడా ఇచ్చేవాడు కాదు’ అనేవాడు ఆ సీనియరు లాయరు జీతం ఇచ్చేరోజు ఒక్కొక్క నోటు జాగ్రత్తగా లెక్కపెట్టి ఇస్తూ. జూనియర్లు కట్టుబానిసల్లా పనిచేస్తేనే చేతికి పనొస్తుందని ‘పని నేర్చుకోండయా.. ముందు పని నేర్చుకోండి..’ అని నిత్యం వల్లించేవాడు. వాళ్ళకు తోడు మరొక ప్లీడరు గుమాస్తా. గుమాస్తాకి తోడు స్టెనోగా పనిచేసే నాకు ఏడొందలే ఎందుకో అర్థం కాలా. సరేలే అది మన ఖర్మ అనుకున్నా, జీవితం గడిచిపోతుందికదా అనుకుంటూ. ఇప్పటికీ అదే జబ్బు. ఆ లాయరుగారి దగ్గర పనిచేసినంతకాలం నా కడుపులో ఆకలి నకనకలాడుతుండేది, టకటకమని టైపు మిషను కొట్టడం మూలాన కాబోలు. లాయరుగారికి పైన అంతస్తులో ఆఫీసు, కింద కాపురం. ఆయన కూర్చునే టేబులు విశాలంగా ఉండేది. సరిగ్గా ఆయన కూర్చునే సీటుకి ఎదురుగా టేబులు మీద చిన్నపాటి అద్దం, అద్దం కింద ఎవరో స్వామీజీ ఫోటో ఉండేది. నేనెప్పుడూ ఆ స్వామీజీ ఫొటో సరిగ్గా చూసిందిలేదు. ఇతరులతో మాట్లాడేటప్పుడో, పనిలో ఉన్నప్పుడో ప్రతి ఐదారు నిమిషాలకి ఒకసారి లాయరు చేత్తో ఆ ఫొటోని తాకి కళ్ళకద్దుకునేవాడు. ఒకసారి ఆ స్వామీజీ ఎవరా అని చూస్తుంటే మధ్యలో గుమాస్తా లోపలికి వచ్చి ‘ఆయన ఐఏయస్ చదువుకున్న స్వామీజీ’ అని ఇంకో వివరం ఇచ్చాడు. ఎవరో కుర్ర బాబా, నేనెప్పడూ బయట పేపర్లలో చూసిన ఫొటోకాదు. నేనెప్పడూ డిక్టేషను తీసుకోడానికి అనువుగా సీనియరు లాయరుగారికి దగ్గరగా కుడివైపునో ఎడమవైపునో కూర్చునేవాడిని. ఎదురుగా పార్టీలో, డిపార్టుమెంటువారో కూర్చునేవారు. ఆరోజుల్లో ఆయన అదేదో గవర్నమెంటు డిపార్టుమెంటు తరపున హైకోర్టులో వాదించేవాడు. ఇదిలా ఉండగా ఆఫీసులో జూనియర్లతోపాటు పనిచేయడానికి కొత్తగా మరొకరు వచ్చారు. చూడటానికి ఆయన జూనియరుకి ఎక్కువగాను సీనియరుకు తక్కువగానూ కనిపించేవాడు. మనిషి మాట్లాడటంకంటే తలూపటం ఎక్కువగా ఉండేది. వచ్చినరోజే ఆయన తనతోపాటు తెచ్చుకున్న మాసిన నల్లకోటును గోడకు తగిలించాడు, పొద్దున్న పూట ఇటునుంచి ఇటే కోర్టుకి వెళ్ళడానికి. ఆ కోటుకి భుజంమీద, వీపుమీదా ఒకటిరెండు చోట్ల చిరుగులుండేవి. ఆయన చూట్టానికి పొట్టిగా వెడల్పుగా ఉండేవాడేగాని లావుగా ఉండేవాడు కాదు. మీసాలులేని గుండ్రటి పేడిమూతి మొహం. గుండు చేయించుకున్నాక నెలరోజుల్లో ఎంత జుట్టు పెరుగుతుందో ఆయన జుట్టు ఎప్పుడూ అంతే ఉండేది. కాస్తంత పెరిగేదీ కాదు, తరిగేదీ కాదు. సగం తెలుపు, సగం నలుపు. మీసాలు లేని ఆ పలచటి జుట్టున్న వెడల్పు మొహానికి కుండలాలు పెడితే అచ్చమైన పండితుడు ఇలానే ఉంటాడేమో అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాల తరవాత, ఆయన గుర్తుకొచ్చినప్పుడు. ఆయనపేరు రామకృష్ణ్ణ. ఎప్పుడూ గోడవైపు కిటికీ కర్టెనుకానుకుని కూర్చుని ఫైల్సు చూస్తూ ఎవరైనా పలకరిస్తే వెడల్పాటి మొహంతో మోర పైకెత్తి మాట్లాడేవాడు. ‘ఎవరో కొత్తసారు జాయినట్లున్నాడు’ అనంటే మా గుమాస్తా ‘కోర్టులో కొంతమంది ప్రాక్టీసులేని ప్లీడర్లు ఇలా జూనియర్లుగా చేరతారు’ అనేశాడు ఆయన ముందే. ‘అంతమాటనేశాడేంటి’ అని కిందామీదా కంగారుపడి ఆయన వంక చూస్తే అదేమీ పట్టించుకోకుండా నిశ్చింతగా ఏదో ఫైలు చూసుకుంటూ కనిపించాడు. గుమాస్తా అన్నదానికి తగ్గట్టే ఆ కొత్తలాయరు చూడటానికి బతకటం చేతగానివాడుగానో, ప్రాక్టీసులేని పూర్ లాయరుగానో కనిపించాడు. మా సీనియర్ లాయరు ఆయన పలకరించినప్పుడల్లా చిరాకు పడేవాడు. ఇంగ్లీషు గ్రామరు తప్పుగా ఉందనో, కోర్టువారి ప్రొసీజరనో ఏదో ఒక వంకపెట్టి ‘ఆ మాత్రం తెలీదా’ అని చివాట్లు పెట్టేవాడు. బహుశా ఆయన్ని ఆఫీసులో చేర్చుకోవడం సీనియారుగారికి ఇష్టంలేదనుకుంటాను. జూనియర్లకంటే కాస్తంత ముసలోడిగా కనిపించే ఆయనకి కూడా ‘ఏడొందలే’ ఇవ్వాల్సొస్తుందన్న సాకు కావచ్చు. దాదాపు ఆయన గదమాయింపులకే చేరిన ఆరునెలలకే ఆఫీసు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మాకు శని, ఆదివారాలు ఉదయం నుంచి సాయంత్రందాకా ఆఫీసుండేది, ఆ రెండురోజులు కోర్టుకు సెలవులు కనుక. ఉదయం పదికో ఎప్పుడో మొదలైతే సాయంత్రం ఆరుదాకా నడిచేది. వాళ్ళందరికీ ఆటవిడుపుగా ఆనిపించే ఆరెండురోజులు నాకు మాత్రం రెండురోజులు ఉపవాసదీక్ష చేస్తున్నట్టు నరకం కనపడేది. మధ్యాహ్నం భోజనానికి లేదా లంచ్‌కి కాసేపు బయటగడిపి వచ్చేవాడిని. ఎప్పుడన్నా డబ్బులుంటే ఇరానీ హోటల్లో టై బిస్కట్లు టీలో నంచుకుని తినడం లేదంటే పస్తులుండటమే. పైన ఒకపక్క ఆకలి దహించుకుపోతుంటే కిందనుంచి ఆదివారపు మసాలా వాసనలు వస్తుండేవి. సాయంత్రం ఏ నాలుక్కో బిస్కట్లు, టీకప్పులతో ట్రే వచ్చేది. అలాంటి ఆదివారాలతో మూడునాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. అలాంటి ఆదివారాల్లో ఒకరోజు మిట్టమధ్యాహ్నం దాటిన మధ్యాహ్నం నేను టైపురైటరు టకటకలాడిస్తుండగా ‘భోంచేశారా?’ అని చెక్క బీరువాల మధ్య నుంచి పలకరింపు వినపడింది. అప్పటికే సీనియరుగారు కింద భోజనం కానిచ్చి నిద్రకి ఉపక్రమించి ఉంటారు. ఒకరిద్దరు జూనియర్లు, నేనూ, జూనియరూ, సీనియరు కాని ఈ లాయరూ మిగిలాం భోజనానికి బయటికెళ్ళడానికి. ఆరోజుల్లో మధ్యాహ్న భోజనాలు టీతోపాటు టైబిస్కట్లతో కానిచ్చేసేవాడినే కానీ కాస్త జేబులో ఎక్కువ చిల్లరుంది అని నమ్మకం కలిగితే ఫైన్ బిస్కట్‌తో పండగ చేస్తుండేవాడిని. ఎంత దరిద్రం ఉన్నా టీ తాగాక సిగరెట్టు మాత్రం కంపల్సరీ. ‘ఒకపక్క జేబులో చూస్తే అంతంతమాత్రమే ఉన్నాయి. ఈయన భోజనానికి రమ్మంటున్నాడు’ అని ఆలోచించేలోపే ‘పర్లేదు రండి నాదీ హోటలు భోజనమే. ఇద్దరం కలిసి వెళ్దాం’ అని మళ్ళీ పిలిచాడు. ‘సరే.. భోజనానికంటూ ముందు బైటికెళ్ళాలిగా..’ అనుకుని పేపర్లు సర్దేసి ఆయనతోపాటు కిందికి దిగుతూ ‘ఏంసార్, ఈరోజు మీ ఇంట్లోవాళ్ళు లేరా?’ అన్నాను. ఆ నడివయసు పెద్దమనిషి సిగ్గుపడుతున్నట్లు మొహంపెట్టి ‘అయావ్‌ు అన్ మారీడ్’ అన్నాడు. ‘ఇంత వయసొచ్చినా ఈయనకింకా పెళ్ళెందుకు కాలేదు’ అని అప్పుడు ఆలోచించలేదు. ఆపూట భోజనానికెళ్తున్నాం అనే ఆనందంలో. మళ్ళీ ఆయనే ‘నేను పెళ్ళి చేసుకోలేదండి. తల్లిదండ్రులను చూసుకుంటూ జీవితం గడిపేశాను. మానాన్న గారికి పక్షవాతం ఉండేది. నేనే చేయాల్సొచ్చేది. ఈమధ్యే మా అమ్మగారు కూడా పోయారు’ అన్నాడు బరువుగా మెట్లు దిగుతూ. మా ఇద్దరిమధ్య కనీసం పాతికేళ్ళన్నా వయసు తేడా ఉంటుంది. ఆయన నన్ను ‘అండి’ అని సంభోదించినందుకు ఆశ్చర్యపడుతూనే లోలోపల గర్వంతో సంతోషపడుతూ ఆయన చెప్పిన సమాధానం విని పెద్దరికపు మొహంపెట్టి మౌనంగా ఉండిపోయాను. ఖరీదైన కాలనీలో రోడ్డుకిరువైపులా పొడవాటి పాతకాలం నల్లటి చెట్లు, వాటి నీడలకింద నడుస్తూ రెండు వీధులు దాటి మెయిన్‌రోడ్డు బజారుకు వచ్చాము. మేమిద్దరం నడిచినంతమేరా ఆయన నా తల్లిదండ్రుల గురించి, నా స్వగ్రామం, అక్కడకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నా రూము, వంట గురించి వాకబు చేశాడు. ఆ మండే ఎండల రోజుల్లో నన్నెవరూ అలా అడిగింది లేదు. హోటలులో బల్లముందు కూర్చున్నాక ‘నేను ఫుల్‌మీల్స్ తింటాను. మీకు ఏంకావాలో చెప్పండి’ అన్నాడు. ‘ఫుల్మీల్స్కీ ప్లేట్మీల్స్కీ ఫుడ్డులో తేడా ఎంతుంటుందో, ఇంతకీ డబ్బులు ఆయన కడతాడా లేక లోపల నేను పప్పు రుబ్బాల్సోస్తుందా’ అని జేబులు తడుముకుంటున్నంతలో అటు వెయిటర్ రావడమూ, ఇటు ఈయన రెండు ఫుల్‌మీల్స్ ఆర్డరు ఇవ్వడమూ జరిగిపోయింది. ఆయన నిదానంగా తింటూ, మధ్యమధ్యలో మాట్లాడుతూ చివరలో రెండుసార్లు సాంబారు వేయించుకున్నాడు. నేను నాముందు పెట్టిన కూరలన్నీ రుచి చూశాను. పాపడ అయిపోతే ఆయన మళ్ళీ ఒకటి వేయించాడు. భోజనంబల్ల ముందు కుంగిన భుజాలతో గొడుగులా కూర్చున్న ఆయన్ని చూస్తే ఎందుకో నవ్వొచ్చింది. ‘మరి మీకు రాత్రిపూట భోజనం ఎలా?’ అనడిగాను. ‘పగలు కోర్టు క్యాంటీన్లో, రాత్రిపూట రొట్టె చేసుకుంటా’ అన్నాడు పెరుగు గిన్నె అన్నంలో ఒంపుకుంటూ. బిల్లుకట్టే కౌంటరు దగ్గర నేను జేబు తడుముకోబోతే తనే డబ్బులు తీస్తూ, ‘శ్యావ్‌ు గారూ, ఈవేళ నా దగ్గర డబ్బులున్నాయి. మనిద్దరం కలిసి భోంచేశాం’ అన్నాడు. ఆయన అలా ఎందుకన్నాడో ఆరోజు నాకు బోధపడలేదు. నేను మాత్రం ‘అమ్మయ్య.. బతికానురా దేవుడా’ అనుకున్నాను. కడుపు ఇంకాస్త నిండింది. హోటలు నుంచి బయటికి వచ్చాక ‘సిగరెట్టు కాలుస్తారా?’ అనడిగాడు. నేను ఉలిక్కిపడి ‘అబ్బే లేదండీ’ అన్నాను కంగారుగా ఈయనకెలా తెలుసనుకుంటూ. ‘మీరు కాలుస్తారని గుమాస్తా చెప్పాడు. పర్లేదు కాల్చండి. నేనూ కంపెనీ ఇస్తాను. నాకు అలవాటు లేదు. ఎప్పుడన్నా మీలాంటి వాళ్ళు కాల్చినప్పుడు..’ ‘ఈ ముసిలోడు ఒక పాకెట్ అయినా కొనుంటే బాగుండేది’ అనుకున్నాను సిగరెట్ ముట్టించి పొగవదులుతూ. ఆయన తాగేతీరు చూస్తే ఎప్పుడూ కాల్చేమనిషిలానే కనపడ్డాడు. ఆఫీసులో బిక్కుబిక్కుమంటూ కూర్చునే మనిషి బయట బేఫికర్‌గా ఉన్నాడు. ఆయనంత దర్జాగా, ధీమాగా ఉండటం నాకు నచ్చలేదు. వినయసంపన్నుడిలా ఆయన ముందు నుంచున్నాను. ‘ఇంటరు తప్పి టైపూ షార్టుహాండూ నేర్చుకుని ఇంటి నుంచి పారిపోయి వచ్చేననీ, బస్తీలో ఉంటున్నానీ, ఒక్కడ్నే వంటనీ’ నేను చెప్తే ‘షార్టుహాండుకి చాలా విలువుందనీ, గవర్నమెంటు సెక్టారులోనూ, ప్రైవేటు కంపెనీల్లో దానికి చాలా డిమాండుందనీ, బయట అవకాశాలవైపు చూడమనీ ముందు ముందు ఇంకా చాలా జీవితం ఉందనీ’ చాలా చెప్పుకొచ్చాడు. ఆరోజు తరవాత ఆయనతో ఎక్కువ కలిసింది లేదు. ఆఫీసులో పెద్దగా మాట్లాడింది కూడా లేదు. నా సీటుకి వెనకాల బల్లముందు మూగే జూనియర్లు ఆయన మీద జోకు వేసినప్పుడు వాళ్ళతో కలిసి నవ్వేవాడిని. ఆయన చూస్తుండగానే. ఆయన మానేసిన తరవాత ఎప్పుడన్నా జూనియర్లు ఆయన గురించి చెప్పుకునేవారు. ఆరోజు ఆయన బార్ కౌన్సిల్ అసోసియేషన్‌లో హాల్లో కూర్చుని ఏదో చదువుకుంటున్నాడనో, కోర్టులో పాతబడ్డ నల్లటి చెట్లకింద ఎండుటాకుల మీద ఏమీ తోచక నడుస్తున్నాడనో, క్యాంటీన్లో టేబుల్మీద ఇడ్లీసాంబారు పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నాడనో. ఏమయితే నాకెందుకని ఆరోజుల్లో ఎప్పుడూ ఆయన గురించి పట్టించుకోలేదు నేను. తొందరలోనే మరిచిపోయాను. ఆయన వెళ్ళిపోయిన బహుశా రెండేళ్ళకనుకుంటా నేనక్కడ మానేశాను. ఆ తరవాత చాలా ఆఫీసులు, కంపెనీలు మారాను. ఎంతో మంది మనుషులు కలిసి స్నేహితులై కొంతకాలానికి వాళ్ళూ కనుమరుగైపోయారు. సంవత్సరాలు గడిచిపోయాయి. సీనియరు లాయరుగారు ఆ తరవాత హైకోర్టుజడ్జిగా చేసి రిటైరు గూడా అయిపోయారు. ఆయన చలవతో ప్లీడరు గుమాస్తా హైకోర్టులోనే గుమాస్తాగాచేరి అతను కూడా ఇప్పుడు రిటైరయ్యే దశలో ఉన్నాడని విన్నాను. ఆ సీనియరు లాయరుగారి జూనియర్లెవరూ లాయరు ప్రాక్టీసులో కుదరక కొందరు ప్రైవేటుద్యోగాలు చూసుకుంటే కొందరు ఎటూగాక కిరాణా చిల్లరకొట్లు పెట్టుకున్నారు. వాళ్ళలో పేర్లతో సహా నాకు ఒక్కరు కూడా గుర్తులేరు. మా అమ్మ పాతకాలం రగ్గుని ఒదిలేసినట్లు, క్షణకాలంపాటు కనిపించి పక్కకు నడుచుకుంటూ వెళ్ళిపోయిన మనిషిని మళ్ళీ తలుచుకోనట్లు ఆయన్ని కూడా ఆరోజుల్లోనే మరిచిపోయాను. ముప్పైఏళ్ళపాటు ఆ మనిషి నాకేమాత్రం గుర్తుకురాలేదు. ఆ తరవాత ఈ ముప్పైఏళ్ళ కాలంలో చాలా ఆఫీసులు మారాను. ముప్పైరెండేళ్ళ వయసులో పెళ్ళి చేసుకున్నాను. పదేళ్ళ కాపురం తరవాత ఆవిడా చనిపోయింది. నా కొడుకు అమ్మమ్మ దగ్గరుండిపోయాడు. నేను మళ్ళీ ఒంటరిగా మిగిలాను. ఒకసారి గుండెనొప్పి వచ్చి బ్యాంకులో దాచిన కొద్దిమొత్తం కాస్తా హాస్పిటల్లో కట్టేశాను. మిగిలిందేమీ లేదు. నా స్నేహితులు కొందరు మరణించారు. కొందరు స్నేహితుల పిల్లలు పెళ్ళీడుకుకూడా వచ్చారు. ఇన్నేళ్ళ తరవాత, ఇంత జీవితం చూసి, ఇన్ని వీథులు తిరిగి, ఇన్ని ఉద్యోగాలు చేసి, ఇంత మందితో కలిసితిరిగి మరిచిపోయిన ఈ మాహానగరంలో, ముసలితనానికి దగ్గరపడుతున్న ఈ వయసులో ఎప్పుడన్నా ఆ పూట కలిసి భోంచేసిన చిరుగుకోటు లాయరు గుర్తుకొస్తుంటాడు వెడల్పాటి మొహంతో.. ఎందుకనో. ఆరోజు అక్కడ వీథి మలుపు తిరుగుతూ, పొడవాటి చల్లని చెట్లకింద నడుచుకుంటూ ‘తల్లిదండ్రులతోనే జీవితం గడిచిపోయిందని’ చెప్పిన మాటలు ఎందుకనో ఇప్పుడూ వింతగా వినిపిస్తుంటాయి చెవుల్లో. అంతకంటే చెప్పేదేంలేదు. అతని గురించి నాకు ఇంకేమీ గుర్తులేదు. కానీ ఏ క్షణానో, ఏ చీకట్లోనో తటాలున గుర్తుకొచ్చి మాయమవుతుంటాడు. ఎందుకో తెలీదు మరి. -బి.అజయ్ ప్రసాద్ -
ఈవారం కథ: ఎదురు చూపులు
తెల్లారితే ‘బుల్లి బుజ్జి’గాడి పెళ్లి. అంతా సందడిగా ఉంది. ఆ ఇంటి మనుషుల్లో మాత్రం సంతోషం లేదు. పెళ్లి పందిరికి కొంచెం ఆవల.. బోదె గట్టునున్న డొక్కల గూడుకి జారబడి ఆకాశం వైపు చూస్తా ‘పెద్ద బుజ్జి’గాడి కోసం ఆలోచిస్తున్నాడు శ్రీరామ్మూర్తి. ఆడు ఇల్లొదిలి పెట్టేసి వెళ్లి ఐదేళ్లు దాటేసింది. ‘బుల్లి బుజ్జి’గాడి పెళ్లికి ముçహూర్తం పెట్టిన రోజు నుండీ అస్తమానూ ‘పెద్దబుజ్జి’గాడే గుర్తొస్తున్నాడు. అలా ఆడు గుర్తొచ్చినప్పుడల్లా పెద్దాడికి కాకుండా చిన్నోడికి పెళ్లంటే గుండె గుబ గుబలాడిపోతోంది. పోనీ ఆడికే పెళ్లి చేద్దామంటే ఆ మనిషి ఊసే తెలియకుండా పోయింది. ఆనోటా ఈ నోటా తమ్ముడి పెళ్లి సంగతి తెలిసైనా ఇంటి మొహం చూస్తాడన్న ఆశ, ఒడిగట్టిన దీపంలా మిణుకు మిణుకు మంటూనే ఉంది. ఆరు బయట నిలబడి తల కాస్త బయటికి వంచి కళ్లు చిట్లించి రోడ్డు మలుపులోకి ఆశగా చూస్తున్నాడు శ్రీరామ్మూర్తి. రోడ్డు మీద వీధి దీపాల పలచటి వెలుగు. రోడ్డుకి అవతలున్న వరిచేలలో నుండి కీచురాళ్ళ శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది. పెళ్లి పందిరిలో పసుపు నీళ్లు చల్లడం కోసం ఇంట్లో నుండి బయటకొచ్చింది వరలక్ష్మి. శ్రీరామ్మూర్తిని చూసి ‘ఏంటయ్యా చుక్కలు లెక్కెట్టేతున్నావ్. కొంపదీసి కొనేత్తావా ఏంటీ?’ బుగ్గలు నొక్కుకుంటూ వెటకారంగా అంది. ‘అబ్బా.. ఊరుకోవేసే! యెప్పుడూ ఎటకారమే నీకు? మన పెద్దోడి కోసం ఆలోసిత్తన్నానే.. ఎక్కడున్నాడో ఏంటో? మనసంతా ఆడే ఉన్నాడే’ ఆ మాటలంటున్నప్పుడు శ్రీరామ్మూర్తి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. వరలక్ష్మి కళ్లల్లో వెటకారం ఆవిరైపోయింది. ఆమె మొహం మబ్బులు కమ్మేసిన ఆకాశమైపోయింది. ‘ఊరుకో లేవయ్యా! ఆడు ఎక్కడున్నా నిజంగా మనల్నే కనిపెట్టుకుని ఉండుంటే, తెల్లారే సరికి మూర్తం టైమ్కైనాతప్పకుండా వొత్తాడు. ఆడిప్పుడు రాలేదంటే ఇంక ఎప్పటికీ రానట్టే. ఆడు రాకపోతే ఏమయ్యా? ఎక్కడోచోట చల్లగా ఉంటే అదే చాలు! ఎక్కువ ఆలోచన ఎట్టుకోకుండా నువ్వెళ్ళి ఏదో ఓ మూల నడుం వాల్చు. తెల్లారగట్ల పెళ్లి పనులు సక్కబెట్టుకోవాలి కదా!’ అనేసి బరువెక్కిన గుండెతో ఇంట్లోకెళ్ళిపోయింది వరలక్ష్మి. శ్రీరామ్మూర్తికి ఏం చేయాలో పాలుబోవడం లేదు. ఒకట్రెండు సార్లు రాత్రుల్లో మల్లిబాబుగాడికి లాకు సెంటర్లో కనిపించినట్టు చెప్పేడు. నిజమో! అబద్ధమో?! ఏదో శంక అడ్డొచ్చి ఇంటికి రావడానికి తన్నుకులాడుతున్నాడేమో! ఇంటి ముందున్న పంటబోదెకి, అడ్డంగా ఏసిన తాటి పట్టెల మీదగా నడిచి రోడ్డు మీదకొచ్చాడు శ్రీరామ్మూర్తి. ఆ రోడ్డు పక్కనున్న దిబ్బల మీద వేసిన గడ్డి మేటుల్లో నుండి రోడ్డు మీదకొస్తున్న ఎలుకలు అడుగుల చప్పుడుకి బెదిరిపోయి మళ్ళీ గడ్డి వాముల్లోకి దూరిపోతున్నాయి. నడుస్తూనే ‘ఆ రోజు’ జరిగిందంతా అవలోకనం చేసుకుంటున్నాడు. ∙∙ అది సంక్రాంతి నెల. ఒళ్ళంతా బురద పూసుకుని ఓ వారం తరవాత ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టాడు ‘పెద్దబుజ్జి’. యవ్వనంతో పంట బోదె పక్కన నిబ్బరంగా పెరిగిన ‘టేకు మాను’లా పిటపిటలాడుతున్నాడు. ఒంటికి అంటిన బురదతో నల్ల రాతి విగ్రహానికి మట్టి పూత పూసినట్టున్నాడు. ఆడి ఒత్తయిన నల్లటి జుట్టులో నుండి చెమట చెంపల మీదగా జారి మెడ వంపులోకి తిరిగి జారుతోంది. ముక్కు మీద కొన్ని చెమట చుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయి. పెదాలపైన నవ్వు.. మబ్బుల చాటు నుండి తొంగిచూసే చందమామలా వెలుగుతోంది. కొడుకు వాలకం చూసి గబగబా పొయ్యి మీద నీళ్లు పెట్టింది వరలక్ష్మి. ఉడుకుడుకు నీళ్లు నెత్తి మీద నుండి పోసుకున్నాడు పెద్దబుజ్జి. ఒంటి మీద బురద, పాయలు పాయలుగా నేలకి జారిపోయింది. ఆడి మెడలో వేళ్ళాడుతున్న బొటన వేలంత వీరాంజనేయుడి ‘వెండి బొమ్మ’ మంచు గడ్డలా తెల్లగా మెరిసి పోతోంది. మనిషి.. గుళ్లో రాముడిలా నల్లగా నిగనిగలాడిపోతున్నాడు. వరలక్ష్మి కొడుకుని కళ్లారా చూసుకుని ‘నా అందమే వొచ్చింది చిట్టి నా తండ్రికి!’ అని మురిసిపోతూ మెటికలు విరిచింది. వాకిలి బయటున్న కొబ్బరి చెట్టుకి నిలబడి ఆ తంతు అంతా చూస్తూనే ఉన్నాడు శ్రీరామ్మూర్తి. కొడుకుని ఏదో అడగాలనుకుని సమయం కోసం ఆగి చూస్తున్నాడు. అప్పుడే వార్పు తీసిన వేడి వేడి అన్నంలో పెద్దబుజ్జికి ఇష్టమైన చేమదుంపల పులుసు వేసి కొడుకు ముందు పెట్టింది. ఆవురావురుమని తింటున్న కొడుకుని చూస్తుంటే వరలక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘ఇంకెన్నాళ్లురా ఈ చాకిరీ.. బుల్రాజుగారి పొలంలో గొడ్డులా కట్టపడుతున్నావు. బాకీ తీరడానికి ఇంకెన్నాళ్లు పడతాదంటాన్నార్రా?’ కొడుకుని ఆరా తీసింది. ‘మొన్నే లెక్కలు చూసేరమ్మ రాజుగారు.. వొచ్చే ఏసం కాలానికి తీరిపోద్దంటమ్మ. అదయ్యాకా నేను ఎంచక్కా ఏదో యాపారం చేసుంటానే’ పెద్ద బుజ్జి కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి. ‘మాయదారి ఇల్లు కట్టకపోయినా కొంపలేం ములగక పోదును. చేసిన అప్పుకి బంగారం లాంటి పిల్లోడ్ని ఆ కఠినాత్ముల దగ్గర పనికి పెట్టాల్సొచ్చింది. మాయదారి సంతని.. మాయదారి సంత’ వాకిట్లో నిలబడున్న మొగుడి వంక ఛీత్కారంగా చూసిందామె. శ్రీరామ్మూర్తి తల తిప్పేసుకున్నాడు. ‘పుణ్యవతిగారు ఎలాగున్నార్రా బుజ్జి! పాపం పట్టుమని మూడు పదులైనా నిండలేదు ఆవిడకి. భర్తపోయి పుట్టింటి పంచకి చేరాల్సొచ్చింది. అన్నగారు చేసిన పాపాలు చెల్లి తలకి చుట్టుకున్నట్టున్నాయి. పాపం.. ఓ పసిగుడ్డునైనా కళ్ల చూడలేదు మా రాజు తల్లీ!’ బుగ్గలు నొక్కుకుంది వరలక్ష్మి. ‘పుణ్యవతి’ పేరు వినగానే పెద్దబుజ్జిగాడి ఒళ్ళు ఉప్పొంగింది. ‘అమ్మా.. ఆవిడ చాలా మంచోరే. బోయినానికని ఇంటికిపోయి పంచలో కూకుంటే నీలాగే కడుపు చూసి అన్నం పెడతారే. వొద్దన్నా కొసరు ఏత్తారు. ఆదివారం రోజైతే నాలుగు మాంసం ముక్కలు ఎక్కువే ఎత్తారే. అమ్మా ఆవిడ ఎందుకో గానీ నేనంటే ఎక్కువ మక్కువ చూపిత్తారే. మిగిలిన పనోళ్లంతా నన్ను చూసి కుళ్ళు కుంటారే!’ పత్తి పువ్వులా నవ్వేడు బుజ్జి. వరలక్ష్మి ఉలిక్కి పడింది.. ‘ఓరేయ్ పెద్దోడా! పెద్దోళ్ళతో సేగితాలు అంత మంచియివి కావురా. అయినా వన్నం ఆవిడేందుకు పెడతాది. వంట పనోళ్ళు లేరా ఆ ఇంట్లో !’ బుగ్గలు నొక్కుకుంటూ అడిగిందామె. ‘ఎప్పుడైనా కుదిరితే ఆవిడ నాకు మాత్రమే పెడతారే. నువ్వసలు మాయ తెలీనోడివిరా బుజ్జి! అని అంటారే. మా అన్న నీ చేత గొడ్డుచాకిరీ చేయుంచుకుంటున్నాడ్రా! అని బాధ పడిపోతారే. రాజుగారు ఇంట్లో లేనప్పుడే నాతో మాట్లాడతారు. ఆయనుంటే కాలు కూడా గుమ్మం బయటికి పెట్టరావిడ’ చిన్నపిల్లాడిలా సంబరంగా చెప్పుకుంటూ పోతున్నాడు పెద్దబుజ్జి. వరలక్ష్మి ఎందుకో కీడు శంకించింది.. ‘ఒరేయ్ పెద్దబుజ్జి! ఎందుకు చెబుతున్నానో యినుకోరా. పెద్దోళ్ళతో మనలాంటోళ్ళం కొంచెం దూరంగా మసలాలి. ఆళ్ళు చనువిచ్చినా మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాల్రా. అందుకేనేమో మీ నాన్న నిన్నటి నుండి కిందా మీదా పడతన్నాడు. ఎవరో ఏదో చెప్పారంట నీ గురుంచి! నలుగురు నోళ్ళల్లో నానితే కొండంత నల్లరాడైనా నలుసై పోద్దిరా! కూసింత జాగ్రత్తరా నాన్నా’ కొడుకు గెడ్డం పట్టుకుని అతడి కళ్ళల్లోకి దీనంగా చూసింది వరలక్ష్మి. బుద్ధిగా తలాడించాడు పెద్దబుజ్జి. రాత్రి భోజనాలు అయ్యాక విషయాన్ని మెల్లగా కదలేశాడు శ్రీరామ్మూర్తి. ‘ఏరా.. ఆ పుణ్యవతమ్మగారితో చనువుగా ఉంటన్నావంట. యెందాక వొచ్చిందేంటి యవ్వారం!’ అని కొడుకుని నిలదీశాడు. నులక మంచంలో పడుకున్న పెద్దబుజ్జి త్రాచుపాములా సర్రున పైకి లేచాడు. పిడికిలి బిగించాడు. పళ్ళు పటపటమని కొరికాడు. ‘ఏ ఎదవ నా కొడుకు చెప్పేడేంటీ నీతో. ఆడ్ని ఇటు రమ్మను. నరికి పోగులు పెట్టేత్తారాడయ్యా!’ అంటా బుసలు కొట్టాడు. అతడి కళ్ళల్లో గిరుక్కున నీళ్లు తిరిగాయ్. గొంతు గాద్గదికమైపోయింది. ‘ఎవడు చెప్తే నీకెందుకురా! నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ముందు?’ కొడుకుని మరింత నిలదీశాడు శ్రీరామ్మూర్తి. ‘పెద్ద బుజ్జి’ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. వరలక్ష్మి ఒక్క ఉదుటన వొచ్చి కొడుకుని అక్కున చేర్చుకుంది. శ్రీరామ్మూర్తి మింగిలా మిన్నకుండిపోయాడు. గుండె బరువు దిగే వరకూ ఎక్కెక్కి ఏడ్చాడు పెద్దబుజ్జి. మోచేత్తో కళ్ళు తుడుచుకున్నాడు. ముక్కు చీది వాళ్ళ నాన్న మొహంలోకి తీక్షణంగా చూశేడు. ‘ఇదిగో నీకైనా ఇంకెవడికైనా ఒకటే మాట చెబుతున్నా.. నన్నేమైనా అనండీ. కానీ పుణ్యవతమ్మ గార్ని ఏమైనా అన్నారంటే చెమడాలు ఎక్కదీసేత్తా ఏమనుకున్నారో!’ బట్టలున్న చేతి సంచిని తీసుకుని దిగ్గున అరుగు దిగి వెళ్లిపోయాడు పెద్దబుజ్జి. ‘అంత మొనగాడివైపోయావేరా.. ఏదీ నా చెమడాలు ఎక్కదీయి చూద్దాం’ వాకిట్లోకి ఉరికాడు శ్రీరామ్మూర్తి. పెద్దబుజ్జి సివంగిలా బోదె దాటేశాడు. దాటినోడు దాటినట్టే చీకట్లో కలిసిపోయాడు. వెనుక నుండి వరలక్ష్మి అరుస్తూనే ఉంది. పెద్దబుజ్జి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. శ్రీరామూర్తిని శాపనార్థాలు పెట్టింది వరలక్ష్మి. ‘ఓ రెండ్రోజులు ఉందామని ఇంటికొచ్చిన కొడుకుని పట్టుమని ఒక్క పూటైనా లేకుండా తరిమేశావ్ కదయ్యా! నీ నోట్లో మన్నడిపోనూ.. నిన్ను తగలెయ్యా!’ అంటూ. శ్రీరామ్మూర్తి ఏం మాట్లాడకుండా గమ్మున ఉండిపోయాడు. వాడెళ్ళిపోయాక ఓ రెండ్రోజులాగి కొడుక్కోసం వాకబు చేశాడు శ్రీరామ్మూర్తి. బుల్రాజుగారి కొండగట్టు పొలాల్లో దమ్ము చేస్తున్నాడని చెప్పారెవరో. పని మొదలెట్టాడంటే రాత్రి పగలు తేడా ఉండదు ఆడికి. బుల్రాజుగారి కొండగట్టు పొలం ఊరికి ఓ ఐదు కిలోమీటర్ల ఆవల ఉంటుంది. రాత్రి, పగలు ఆడికి అక్కడే మకాం. వారం గడిచిపోయింది. వారానికి ఇంటికి రావాల్సిన పెద్ద కొడుకు రాక పోయేసరికి కొంచెం కంగారు పడింది వరలక్ష్మి. రాజుగారి పొలంలో పనిచేసే మిగతా పనోళ్ళని వాకబు చేసింది. రాజుగారి పాలేరు వీరంశెట్టి, రాజుగారి ఇంటి నుండి కేరేజీ పట్టికెళ్తే పొలంలోనే తినేసి అక్కడే పాకలో పడుకుంటున్నాడని చెప్పేరు. చూస్తుండగానే రెండో వారం వొచ్చేసింది. బుజ్జిగాడు రాజుగారి పొలాల్లో కనిపించడం లేదని చెప్పేరెవరో. రాజుగారింటికి ఎళ్ళేడు శ్రీరామ్మూర్తి. ‘ఏరా శీరామ్మూర్తి.. ఆడు రాలేదా మీ ఇంటికి? చేలోనే ట్రాక్టరు వొదిలేసి ఎటో ఎల్లిపోయాడంట తొత్తు కొడుకు. బొత్తిగా భయం బత్తి లేకుండా పెంచేరు సన్నాసిని. ఆడింటికొస్తే నేను రమ్మన్నానని చెప్పు’ రెండే రెండు ముక్కలు మాట్లాడేసి దబ్బున కూర్చీలో నుండి పైకి లేచి భుజం మీద కండువాని ఒక్క దులుపు దులిపి విసురుగా ఇంట్లోకెళ్ళిపోయారు రాజుగారు. చూస్తుండగానే వారాలు కదిలి నెలలైనాయి. ఎన్ని దిక్కులు తిరిగినా పెద్దబుజ్జిగాడి ఆచూకీ తెలీలేదు. కొడుకు కోసం బెంగటిల్లి పోయాడు శ్రీరామ్మూర్తి. వరలక్ష్మి ఐతే మంచం పట్టేసింది. ఆడి కోసం వెతకని చోటు లేదు. చేయని వాకబు లేదు. ఎక్కడో టౌన్లో ఎవరో పిల్లతో కనిపించాడని ఒకరిద్దరు చెప్పేరు. అన్నవరం కొండమీద కనిపించాడని అన్నారు ఇంకొందరు. ఎన్ని శకునాలకి ఎళ్లినా ఏదో దిక్కున ఉన్నాడనే చెబుతున్నారు. కళ్ళు కాయలు కాసేలా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఐదేళ్లుగా గుండెల్లోనే కుంపటి పెట్టుకుని భారంగానే బతుకుని వెళ్లదీస్తున్నారు ఆ ఇద్దరూ. బుల్లిబుజ్జిగాడి పెళ్లికైనా పెద్ద కొడుక్కి విషయం తెలిసి ఇంటికొస్తాడనే ఆశ వాళ్ళిద్దరిలో మిణుకు మిణుకు మంటూనే ఉంది. ∙∙ శ్రీరామ్మూర్తి అడుగులు లాకు సెంటరు వైపు భారంగా పడుతున్నాయి. ‘ముత్తాలమ్మ దయ వల్ల ఆడక్కడే ఉంటే ఎంత బావుంటాది! వొచ్చే తీర్థానికి యేట పోతుని బలిత్తాను తల్లో!’అని ఊరి దేవతకి మనసులోనే మొక్కుకుంటా లంక పొగాకు చుట్టని ఎలిగించాడు. పంచాయతీ ఆఫీసు దాటి, ఆ పక్కనే ఉన్న ముత్యాలమ్మ గుడి పక్కనుండి ఎడమ వైపుకి తిరిగి మెల్లగా కాలవ గట్టు ఎక్కేడు. ఓ పక్క నిబ్బరంగా అంతెత్తు పెరిగి, బోర్డర్లో కాపుకాసే జవానుల్లా ఉన్నాయి తాడిచెట్లు. ఇంకో పక్క గుంపులు గుంపులుగా పెరిగి కాల్వలోకి జారిన ముళ్ల పొదలు. నిశాచరాలు అలికిడి చేస్తున్నాయి. మెల్లగా లాకుల మీదకి వొచ్చి నిలబడ్డాడు శ్రీరామ్మూర్తి. రెండు కాల్వల మధ్యలో లాకుల దిగువున ఉన్న మొండిలో చింత చెట్ల గుబురుల్లో చిక్కటి చీకటి తలదాచుకుంది. చలికి ముడుచుకు కూర్చున్న ముసలమ్మల్లా నాలుగైదు పెంకుటిళ్లు. ఓ పెంకుటింట్లో లైటు వెలుగుతూనే ఉంది. అది లాకు సూపెర్నెంటు ఆఫీసు. లాకు స్టాఫ్ కోసం కట్టిన మిగిలిన ఇళ్లు పాడుపడిపోవడం వల్ల వాటిల్లో ఎవరూ కాపురాలు ఉండట్లేదు. ఆ సూపెర్నెంటు ఆఫీస్ గది వెనుకనున్న కిటికిలో నుండి జారుతున్న లైటు వెలుతురు బయట ఉన్న చీకటిని చీల్చడానికి విఫలయత్నం చేస్తూ చింత చెట్ల మొదళ్లో పలచగా పరుచుకుంది. శ్రీరామ్మూర్తి చుట్టని మునివేళ్లతో తిప్పుతూ గట్టిగా ఓ దమ్ము లాగి వదిలాడు. చుట్టూ చూశాడు. ఎవరి జాడ కనిపించలేదు. కళ్ళల్లో నీళ్లు గిరుక్కున తిరిగాయి. భారంగా వెనక్కి తిరిగి వొచ్చేస్తుంటే చింతతోపులో చిన్నగా ఏదో అలికిడి అయినట్టనిపించింది. అటువైపు కళ్ళు చిట్లించి చూశాడు శ్రీరామ్మూర్తి. చింత చెట్టు మొదట్లో, మసక మసగ్గా పరుచుకున్న వెలుతుర్లో ఏదో ఆకారం అస్పష్టంగా కదలాడినట్టన్పించింది. గట్టు మీద నుండి కొంచెం కిందకి దిగి పరకాయించి చూశాడు. ఒక్కటి కాదు రెండు ఆకారాలు. శ్రీరామ్మూర్తి కళ్ళు మెరిశాయి. ‘పెద్దబుజ్జిగాడే! ఆడి పక్కన ఉన్నది ఎవరో చెప్పిన పిల్ల గామోసు! ఆ పిల్లని ఊళ్ళోకి తీసుకు రావడానికి తన్నుకులాడుతున్నాడేమో’ గబగబా మొండిలోకి దిగిపోయాడు శ్రీరామ్మూర్తి. ఆ అలికిడికి ఆ రెండు ఆకారాలు ఉలిక్కిపడ్డాయి. దిగ్గున లేచి కూచున్నాయి. మగ ఆకారం వెంటనే తేరుకుని మసక వెలుతురులో నుండి చటుక్కున చిమ్మ చీకట్లోకి జారుకుంది. ఆడ మనిషి మాత్రం నెత్తి మీద చెంగు కప్పుకుని తలొంచుకుని అలాగే నిలబడి పోయింది. ఆ మగాడి వెనకాల పడ్డాడు శ్రీరామ్మూర్తి. ‘ఓరేయ్ పెద్దబుజ్జీ! నిన్నేం చేయను ఆగరా.. మీ అమ్మ నీ కోసం బెంగెట్టుకుందిరా’ అరుస్తూనే ఆ నల్లటి మనిషి వెనకాల పరుగెత్తాడు. ఆ మనిషి చీకట్లో చీకటిలా కలిసిపోతూ చేతికి చిక్కడం లేదు. శ్రీరామ్మూర్తి పరుగెడతానే ఉన్నాడు. పరుగెడుతూ పరుగెడుతూ ఇద్దరూ యించు మించుగా కాలవ వారకి వొచ్చేశారు. శ్రీరామ్మూర్తి ఆ నల్లటి మనిషి మీదకి ఉరికి లాఘవంగా చేతిని అతడి మెడ చుట్టూ మెలేశాడు. ఊపిరి ఆగిపోయినట్టు ఉక్కిరి బిక్కిరైపోయాడు ఆ మనిషి. శ్రీరామ్మూర్తిని ఒక్క తోపు తోశాడు ఆ నల్లటి మనిషి. శ్రీరామూర్తి పట్టు తప్పి వెల్లకిలా పడబోయి తమాయించుకున్నాడు. ఆ ఊపులో ఆ నల్ల మనిషి మెడలోని తాడు శ్రీరామ్మూర్తి చేతిలోకొచ్చేసింది. ఆ నల్లటి మనిషి మాత్రం ఒక్క అంగలో కాల్వలోకి దూకి రెండు బారల్లో ఆవలి ఒడ్డుకి వెళ్ళిపోయాడు. ఉసూరోమనిపోతూ సూపర్నెంటు ఆఫీసు కిటికీ దగ్గరకొచ్చి నిస్సత్తువుగా గోడకి జారగిలపడిపోయాడు శ్రీరామ్మూర్తి. చేతిలో నల్ల తాడుని పైకెత్తి నిరాసక్తంగా చూశేడు దాని వైపు. కొసన చంద్రుడిలా వేళ్ళాడుతూ తళుక్కున మెరిసింది వీర హనుమంతుడి వెండి బొమ్మ! దిగ్గున లేచి నిలబడ్డాడు శ్రీరామ్మూర్తి. ‘ఆడు బుజ్జిగాడే!’ నల్లతాడున్న ఆంజనేయుడి బొమ్మని పిడికిలిలో బిగించి పట్టుకున్నాడు. చీర చెంగుని నెత్తి మీద కప్పుకుని, వడి వడిగా గట్టు మీదకెళ్ళిపోబోతున్న ఆడామె భుజం మీద చెయ్యేసి సర్రున వెనక్కి లాగాడు. చీరచెంగు ఆమె నెత్తి మీద నుండి జారింది. కిటికిలోని లైటు వెలుగు ఆమె మొహం మీద పడింది. ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్మూర్తి. ‘తూము కాడ బేబమ్మ!’ నోరెళ్లబెట్టాడు. తల దించుకుంది బేబమ్మ. ‘ఏంటే బేబమ్మా! మా వోడు నీకోసం యిక్కడికొత్తున్నాడని ఒక్క మాటైనా సెప్పలేదే! ఆడి కోసం ఎంత మనేద పడతన్నామో నీకు తెల్వదా? నీకు మేమేం పాపం చేశామే బేబమ్మా!’ బోరుమంటూ మొహాన్ని రెండు చేతుల్లో దాచుకున్నాడు. చివ్వున తలెత్తింది బేబమ్మ ‘ఊరుకోవయ్యా పేద్ద ఏడ్చేవూ! వల్లో ఏసుకోడానికి పెద్దబుజ్జిగాడు మీ అందరిలాగా దగుల్బాజీ ఎదవనుకున్నావా! నిఖార్సైన మొగోడు. పెతీ ఆడబిడ్డలోనూ అమ్మని చూసేంత మంచోడు. ఆడ్ని ఏమైనా అంటే అన్నోళ్ల కళ్ళు పెటీల్మని పేలిపోతాయి. పురుగులు పడి సచ్చిపోతారు’ బేబమ్మ శాపనార్థాలు పెట్టింది. అది శ్రీరామ్మూర్తి క్కూడా తెలుసు. కాకపోతే ఆ రోజేదో సెప్పుడు మాటలు విని అలా ఊగిపోయాడు. కానీ మరిప్పుడు కళ్ళతో చూశాడు కదా! ‘అయితే ఆడిప్పుడు ఏ తప్పూ చేయలేదంటావా?’ ‘ఆ.. ఇక్కడ జరిగింది తప్పే, కానీ ఆ తప్పు చేసింది పెద్దబుజ్జిగాడు కాదు. మల్లిబాబుగాడు’ బేబమ్మ ఆవేశంలో నిజం కక్కేసింది. శ్రీరామ్మూర్తి స్థాణువై పోయాడు. ఆ వెంటనే తేరుకున్నాడు. ‘పారిపోయినోడు మల్లిబాబుగాడు అయితే ‘మరి ఇది?’ వెండి బొమ్మున్న అరచేతిని పైకెత్తి బేబమ్మ ముందుకి చాపాడు. బేబమ్మ నీళ్లు నమిలింది.. ‘చెప్తావా.. పీక పిసికేసి కాల్వలో పడీ మంటావా!’ సింహంలా ముందుకురికాడు శ్రీరామ్మూర్తి. బేబమ్మ భయపడుతూనే చెప్పడం మొదలెట్టింది. ∙∙ ఆయాల నీళ్ల బోదె దూకేసి చీకట్లో కలిసిపోయిన పెద్దబుజ్జి సరాసరి రాజుగారింటికి వెళ్లిపోయాడు. ఆయాలప్పుడు వొచ్చిన బుజ్జిగాడిని ఒకింత అనుమానంగా చూశేరు రాజుగారు. అసలు గొడవ చెప్పక నాన్న తాగి తందనాలు ఆడుతుంటే ఇంట్లో ఉండలేక వొచ్చేశానన్నాడు పెద్దబుజ్జిగాడు. రాజుగారికెందుకో నమ్మకం కలగలేదు. అప్పటికే పనోళ్లు ఒకరిద్దరు చెవులు కొరుక్కుంటున్నప్పుడు వినకూడని మాటలు ఒకట్రెండు ఆయన చెవిలో పడ్డాయి. అయినా కూడా చింకి చాప ఒకటి ఇప్పించి ఆడ్ని పంచలో పడుకోమన్నారు. బయటంతా చల్లగా ఉంది. ఆ చలిలోనే మోకాళ్ళు డొక్కలోకి ముడుచుకుని వొణుకుతా పడుకున్నాడు పెద్దబుజ్జి. అప్పటికే పుణ్యవతిగారు నిద్ర పోయేరు. తెల్లారగట్ల ఇంకా మసక చీకటి ఉండగానే కాలు మడుచుకుందారని బయటకొచ్చింది ఆవిడ. పంచలో బుజ్జిగాడి మూలుగు విన్పించిందావిడకి. జ్వరంతో ఆడి వొళ్ళు పెనంలా కాలిపోతుంటే దుప్పటి తెచ్చి కప్పేరు. తడిగుడ్డతో మొహం తుడిసి, నుదుటికి అమృతాంజనం రాస్తుంటే రాజుగారి కళ్ళల్లో పడిపోయారు. చప్పున తల దించేసుకున్నాడాయన. అంతకుమించి ఇంకేం అనలేదు చిత్రంగా. తెల్లగా తెల్లారక ఆరెంపీని పిలిపించి ఆడికి వైద్యం చేయించారు. ఆడికి ఇష్టమైన కూరలవి వొండి పెట్టమన్నారు రాజుగారు. కొంచెం తెరిపిన పడ్డాక రెండ్రోజులాగి కొండగట్టు పొలంలో దమ్ము చేయడానికని పంపించేరు. దమ్ము చేసినన్నాళ్లు అక్కడే మకాం. రోజూ రాజుగారి పాలేరు వీరంశెట్టి కేరేజీ పట్టుకెళ్ళి యిచ్చొచ్చేవోడు. చెప్పడం ఆపేసింది బేబమ్మ. ‘ఆ తర్వాత ఏమైంది?’ హుంకరించాడు శ్రీరామ్మూర్తి. ‘ఆ తర్వాత ఆడి గురుంచి నాకేం తెలీదు’ తలొంచుకుని నిలబడింది బేబమ్మ. ఒక్క అంగలో ఉరికి బేబమ్మ జుట్టు పట్టుకుని గుంజి పళ్ళు పటపటా కొరికాడు శ్రీరామ్మూర్తి. బేబమ్మ నేలకి ఒంగిపోయింది. శ్రీరామ్మూర్తి కాళ్ళు పట్టుకోబోయింది. ‘నాకు అంత వరకే తెలుసు శీరామూర్తే.. అది కూడా ఆ వంట మనిషి నాగరత్నం చెబితే తెలిసింది. ముత్తేల్లమ్మ సాచ్చిగా ఇంకేం తెలీదు నాకు’ చేతులెత్తి దణ్ణమెట్టింది బేబమ్మ. ‘మరి ఆ మల్లిబాబుగాడి మెళ్ళోకి ఈ బొమ్మేలా వొచ్చింది?’ కోపంతో శ్రీరామ్మూర్తి ముక్కు పుటాలు అదురుతున్నాయి. ‘ఆ ఎండి బొమ్మ గురుంచి ఆ మల్లిబాబుగాడు ఎవరికీ చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడు శ్రీరామ్మూర్తే! అయినా నీవు అడిగేవు గాబట్టి చెబుతున్నాను. అదైతే ఆడికి రాజుగారి కొండగట్టు పొలాల్లో దొరికిందంట’ అంటూ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది బేబమ్మ. ‘మొన్న పోయిన వేసవిలో చేపల చెరువు కోసమని కొండగట్టు పొలాల్లో ఓ పదెకరాల్లో మట్టి తవ్వించారంట రాజుగారు. పక్క టౌన్ నుండి తవ్వోడలు, పక్క ఊరు నుండి మట్టి పని చేసేవోల్లు వొచ్చేరు. మన ఊళ్ళో నుండి మల్లిబాబు, పాలేరు వీరంశెట్టి మాత్రమే ఆ జనాలతో కలిశారు. రెండో రోజు తవ్వకాల్లో తవ్వోడా పళ్ల చక్రాలకి ఓ ఎముకుల గూడు తగులుకుని పైకి లేచిందంట. పక్కూరు నుండొచ్చిన మట్టి పనోళ్ళు జడుసుకున్నారంట. ఆ పక్కనే మట్టిలో మల్లిబాబుకి ఈ వెండి బొమ్మ దొరికిందంట. అది ఎవరికీ తెలీకుండా ఈడు బొమ్మని జోబీలో పెట్టేసుకున్నాడంట. ఎముకల గూడు గురించి బయటికి పొక్కితే ప్రాణాలు తీసేత్తానని బెదిరించారంట రాజుగారు. ఆ మర్నాడే మల్లిబాబుకి జొరమొచ్చేసి ఓ రెండ్రోజుల వరకూ లేవలేదు. మళ్ళీ ఆడు ఆ పనికెళ్ళలేదు. ఓ రెండు మూడుసార్లు మల్లిబాబుగాడు రాజుగారి పాలేరుని దాని గురించి ఆరా తీసేడంటా. ఆడు ఇషయం చెప్పలేదంట. మల్లిబాబుగాడైతే ఆ ఎముకల గూడు ‘పెద్దబుజ్జి’ గాడిదేమో అంటున్నాడు. ఒకట్రెండు సార్లు ఈ బొమ్మ ఆడి మెళ్ళో ఈడు సూసేనంటున్నాడు. అది గనుక నీకంట్లో పడితే ఆరా తీత్తావని, ఇషయం బయటికి పొక్కితే రాజుగారు ఈడ్ని కూడా కొండగట్టు పొలానికి బలిత్తాడని బయపడి ఇన్నాళ్లు ఎవరి కంట్లో పడకుండా చొక్కాలో దాసేసుకున్నాడు ఆ బొమ్మని. నా మీద దయుంచి ఈ సంగతి ఇంకెక్కడా చెప్పకు శ్రీరామ్మూర్తే’ చేతులెత్తి దణ్ణమెట్టింది బేబమ్మ. శ్రీరామ్మూర్తి నిట్టనిలువునా నేల మీద కూలబడిపోయాడు. నెత్తిని నేలకేసి బాదుకున్నాడు. ‘పెద్దబుజ్జే..! ఎంత ఘోరం జరిగిపోయింద్రా.. పెద్దోళ్ళతో సేగితం చెయ్యొద్దని మీ అమ్మ చెప్పినా యిన్నావు కాదురా కొడుకో. పెద్దోళ్ళకి మన పేణాల కంటే ఆళ్ల పరువే పేణమని తెలుసుకోలేక పోయావేంట్రా. ఒరేయ్ పెద్ద బుజ్జే.. ఆళ్ళు నీకెట్టిన కేరేజీల్లో ఏ విషమెట్టి సంపేశారో నా తండ్రో’ అంటా నెత్తీ నోరూ బాదుకుంటూ నేల మీద దొర్లిదొర్లి దిక్కులు పిక్కటిల్లేలా బోరుమన్నాడు. గుండెల్లో బరువు దిగే వరకూ చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నాడు. ∙∙ తెల్లారిపోయింది.. ‘బుల్లిబుజ్జి’ గాడి పెళ్లైపోయింది. ‘మన పెద్దోడు రాలేదయ్యా!’ దిగులుగా శ్రీరామ్మూర్తి భుజం మీద తలవాల్చింది వరలక్ష్మి. ‘ఏదో ఓ రోజు వొత్తాడు లేవే.. ఆడికి మనమంటే పేణం. పేణాల్ని వదిలేసి ఈ భూమ్మీద ఎవడు మాత్రం ఎంతకాలం ఉండగలడే’ శ్రీరామ్మూర్తి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. పెద్దబుజ్జి భూమ్మీద లేడని తెలిస్తే వరలక్ష్మి బతికి బట్టకట్టలేదని శ్రీరామ్మూర్తికి తెలుసు. అందుకే విషయం ఎక్కడ బయటికి పొక్కనీయొద్దని ఆరాత్రే బేబమ్మ చేత ఒట్టేయించుకున్నాడు. పెద్దబుజ్జిగాడ్ని చంపేశారన్న విషయం ఇప్పుడు ఆ ఊళ్ళో ఆ ముగ్గురికి మాత్రమే తెలుసు. ‘పరువు’ కోసం పెద్దబుజ్జిగాడ్ని చంపించేసిన బుల్రాజుగారికి, ఆయన చెప్పినట్టే అన్నం కేరేజిలో విషం కలిపి చంపేసిన వీరంశెట్టికి ఆ విషయం ఆళ్ళకి తెలిసిపోయిందని ఏమాత్రం తెలీదు. ‘పెద్దబుజ్జిని’ తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన వరలక్ష్మి, ఆడు రాజుగారి పొలంలో పని చేసినన్నాళ్లు కొడుకులా కనిపెట్టుకుని ఉన్న పుణ్యవతిగారు.. ఆడి కోసం ఆశగా ఎదురు చూస్తానే ఉన్నారు. -శ్రీనివాస్ కుడిపూడి -
ఈవారం కథ: ఇంత సౌఖ్యమని నే జెప్పజాల.. మనసా
‘ప్రయాణీకులకు విజ్ఞప్తి.. రైలు నంబరు 12728, హైదరాబాద్ నుండి ఖాజీపెట్, విజయవాడ మీదుగా విశాఖపట్టణం వెళ్ళవలసిన గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఒకటవ నంబరు ప్లాట్ ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది’ మీరు విన్నా వినకపోయినా చెప్పడం నా బాధ్యత అన్నట్టు వరుసగా మూడు భాషల్లోనూ చెప్పింది ఆటోమేటెడ్ రైల్వే అనౌన్సర్. ‘త్వరగా నడువ్ మొద్దూ.. రైలు కదిలిపోతుంది’ ఆమెని లాక్కెళుతున్నట్టు పెద్దపెద్ద అంగలతో వేగంగా నడుస్తున్నాడు భర్త. ‘కొంచెం మెల్లగా నడవండీ..’ కాళ్లకి అడ్డుపడుతున్న చీరని పైకి లాక్కుంటూ అతని వెనక పరిగెడుతున్నట్టు నడుస్తోంది ఆమె. ‘ప్రయాణాల్లో కూడా ఈ వెధవ చీరలెందుకు? ఏ పంజాబీ డ్రెస్సో వేసుకుని చావక’ విసుక్కున్నాడు. ‘అత్తయ్యగారికి నచ్చదు కదండీ’ అంది పుస్తకాల కొట్టువైపు చూస్తూ.. కొనమంటే మళ్ళీ ఎక్కడ తిడతాడో అనుకుని. ‘ఆ కాడికి మేమంటే ఏదో పెద్ద భయమున్నట్టు! బస్సులో వెళ్లి ఏడవమంటే వాంతులు అదీ ఇదీ అని వంకలు’ వచ్చే పోయే జనాల్ని తప్పించుకుంటూ కాస్త ఖాళీగా ఉన్న బోగీ కోసం వెతుకుతున్నాడు. ‘జనరల్ ఇటు పక్క అనుకుంటా అండీ..’ వెనకకు చూపించింది.. జారిపోతున్న బ్యాగ్‌ని భుజం మీదకి లాక్కుంటూ. ‘నాకు తెలీదా? చూశావా ఎంత జనమో? నువ్వెళ్ళి జనరల్‌లో కూచుంటే ఏ దొంగ వెధవో అర్ధరాత్రి వేళ ఆ మెళ్ళో ఉన్న సూత్రాలతాడు కాస్తా లాక్కెళ్లిపోతాడు. నీకసలే పడుకుంటే ఒళ్ళు తెలీదు.’ ‘ఈ బోగీ కొంచెం ఖాళీగా ఉన్నట్టుందండీ’ ‘అందులో బొత్తిగా ఆడవాళ్లు లేరు. ఇదిగో ఇందులో ఎక్కు. త్వరగా’ ట్రైను తలుపు దగ్గర కంబీని పట్టుకుని, రిజర్వేషన్ బోగీలో ఆమెని ఎక్కించేశాడు. రైలు మెల్లగా కదిలింది. ‘ఏవండీ పిల్లలు జాగ్రత్త. చిన్నది నిద్రలో పక్క తడిపితే విసుక్కోకండి’ చేతిని పట్టుకుంది. ‘ఎన్నిసార్లు చెప్తావ్? వెధవ నస. టీసీ వస్తే అత్యవరసరం ఉండి బయల్దేరాను, సీటు దొరకలేదని చెప్పు. ఫైన్ కట్టమంటే వచ్చే స్టేషన్లో దిగిపోతా అని చెప్పు. సీటు దొరికితే నిద్రపోకు. బండి ఎక్కడా ఎక్కువ సేపు ఆగదు’ కంబీని వదిలేస్తూ ఆమె చేతిని కూడా విడిపించుకున్నాడు. ‘ ఏవండీ.. టిక్కెట్టు మీ జేబులో ఉండిపోయింది ’ గట్టిగా అరిచింది. అప్పటికే రైలు ప్లాట్ఫారం దాటేసింది. నాంపల్లిలో ఓ మాదిరి జనాలతో బయల్దేరిన రైలు సికింద్రాబాద్ వచ్చేసరికి ప్రయాణికుల యాత్రా బస్సులా నిండిపోయింది. ‘ఈ సీట్లో ఎవరైనా ఉన్నారాండీ?’ ఖాళీ సీటుకోసం వెతుక్కుంటూ వచ్చి అడిగింది ఆమె. బెర్త్‌పైకి వేలు చూపించాడు అతను. మొహం మీద తడి తువ్వాలు కప్పుకుని గురక పెట్టి పడుకున్నాడో మనిషి. ‘ఓహ్’ నిరుత్సాహంగా కిక్కిరిసిన కంపార్ట్మెంట్ అంతా వెతికింది చోటు కోసం. ‘ఆయన ఇప్పట్లో లేచేలా లేడు. మీరు కూర్చోండి’ మరోసారి పైకి చూసి నిర్ధారించుకున్నట్టు చెప్పాడు. ‘థాంక్స్’బ్యాగ్‌ని సీటు కింద పెట్టి కూర్చుంది. గ్రీష్మ తాపం ఇంకా చల్లారలేదు. కిటికీలోంచి బైటికి చూస్తోంది. అలసట వల్లో, ఆలోచనల బరువు వల్లో గానీ ముఖం వాడినట్టు తెలుస్తోంది. సంధ్య సూరీడు వెళ్ళడానికి మొరాయిస్తూ ఆమె ముఖంపై చురుక్కుమని చల్లని నిప్పులు కురిపిస్తున్నాడు. ఆమె కళ్ళలో సన్నని కన్నీటి పొర. చాలా సేపటి నుంచి గమనిస్తున్న అతను.. తను చదువుతున్న పుస్తకాన్ని మూసి యథాలాపంగా ఎండకి అడ్డుపెట్టాడు. ఆమె గమనించే స్థితిలో లేదు. ‘వాటర్ బాటిల్.. అక్కా.. వాటర్ బాటిల్ కావాలా?’ మొహం మీద బాటిల్ పెట్టి అడిగాడు కుర్రాడు. ఈ లోకంలోకి వచ్చిన ఆమె వద్దని చేత్తో సైగ చేసింది. ఏదో గుర్తొచ్చినట్టు ఫోన్ తీసి చూసుకుంది. ఏడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కంగారుగా కాల్ చేసింది. ‘హలో.. ఫోన్ సైలెంట్లో ఉంది చూస్కోలేదండీ’ ‘...’ అవతల మనిషి అరుస్తున్నాడో తిడుతున్నాడో గానీ గొంతు గట్టిగానే వినిపిస్తోంది. ‘మీరే కదండీ టికెట్ నా దగ్గరుంటే పడేస్తానని, రైలెక్కే ముందు గుర్తు చెయ్యమన్నారు?’ నెమ్మదిగా అంది ఫోన్ వాల్యూమ్ తక్కువగానే ఉందో లేదో అని మరోసారి చూసుకుంటూ. ఏదో అరిచి ఫోన్ పెట్టేసింది అవతలి గొంతు. నిట్టూర్చి ఫోన్‌ను బ్యాగ్‌లో పడేసింది స్విచ్ ఆఫ్ చేస్తూ. ఒంటరి ప్రయాణాలు కొన్నిసార్లు భారంగా ఉంటాయి. ఈసారి ఆ భారానికి భయం తోడైంది. బోగీ అంతా గోలగా ఉంది. ‘ఈ పుస్తకం మీరు చదివేస్తే ఇస్తారా?’ అడిగింది అతని చేతిలోని మ్యాగజైన్‌ని చూస్తూ. ఇచ్చాడు. ‘థాంక్యూ’ గబగబా పేజీలు తిప్పి ఆఖరి పేజీ దగ్గర ఆగింది ‘పెన్ను ఇస్తారా?’ సైగ చేసింది అతని జేబుని చూపిస్తూ. ఇచ్చాడు ఫోన్లో పాటలు వింటున్న అతను. ‘టీసీ వచ్చి టిక్కెట్టు చూపించమంటే ఏం చెప్తారు?’ కిటికీలోంచి బైటికి చూస్తూ అడిగాడు. ‘మీకెలా తెలుసు’ అన్నట్టు చురుక్కుమని చూసింది. ‘సారీ.. మీరు ట్రైన్ ఎక్కగానే ఎవరినో అడుగుతున్నారు కదా? నేను ఇటు వైపు తలుపు దగ్గర ఉన్నాను’ ‘మ్.. మా ఆయన.. టికెట్ ఇవ్వడం మర్చిపోయాడు’ ‘మరిప్పుడెలా? ఫైన్ కట్టేస్తారా?’ ‘సీటు ఇస్తా అంటే ఆలోచిస్తాను. అయినా ఏమైతే అదవుతుంది. చూద్దాం’ పజిల్ సగం సగం గడులు నింపేసి పెన్నుని అతనికి ఇచ్చేసింది. ‘మీకు ధైర్యం ఎక్కువే’ అన్నాడు పెన్ను జేబులో పెట్టుకుంటూ. ‘ధెర్యానికి డబ్బులు అక్కర్లేదు కదండీ’ మొదటిసారి నవ్వింది. రైలు ఖాజీపేట దాటింది. ‘కుదరదయ్యా. వచ్చే స్టేషన్లో దిగి జనరల్లోకి వెళ్లిపో. మళ్ళీ నిన్ను ఇక్కడ చూస్తే ఫైన్ రాసేస్తాను’ రుసరుసలాడి పోతున్నాడు టీసీ. అతని వెనక నలుగురైదుగురు కుర్రాళ్లు.. సీటు కోసం వెంటపడుతుంటే విసుక్కుంటూ టిక్కెట్లు చెక్ చేస్తున్నాడు. ‘సైడ్ లోయర్ అండీ’ .. టికెట్ చూపించాడు అతను. ‘అమ్మా మీది?’ అంటూ ఆమెను టికెట్ అడిగి ‘ బాబూ లేవండి టికెట్ చూపించండి’ అంటూ పైన పడుకున్న మనిషిని తట్టి లేపాడు. తనని కాదన్నట్టు బయటకు చూస్తున్న ఆమె ఏం చేస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు అతను. ‘అమ్మా’ గట్టిగా పిలిచాడు టీసీ. ఆమెలో చలనంలేదు. ‘ ఆవిడ’ ఏదో చెప్పబోయాడు అతను. ‘సార్.. మీ వైఫా? కళ్ళు తెరచి నిద్రపోతున్నట్టున్నారు. ఆరేసీయా? సీట్లు లేవు. మీరిద్దరూ సద్దుకుంటానంటే నాకేం అభ్యతరం లేదు’ చెప్పేసి వెళ్లిపోయాడు టీసీ. కాసేపు నిశ్శబ్దం. కొంగు నోటికి అడ్డుపెట్టుకుని వస్తున్న నవ్వుని ఆపుకుటోంది ఆమె. ‘అలా ఎలా కూర్చున్నారు? మీకు భయం వెయ్యలేదా?’ టీసీ వెళ్ళాడో లేదో అని చూసుకుంటూ అడిగాడు. ‘వెయ్యలేదా? రైలు చప్పుడు కన్నా గట్టిగా కొట్టుకుంది నా గుండె’ ‘ఇందాక ధైర్యం, డబ్బులు అని ఏదో అన్నారు?’ ‘వాటన్నిటికన్నా చెడ్డది ఒకటి ఉంది. పరువు అనీ.. ఆ బరువునెందుకు మోస్తామో తెలీదు’ ‘పోన్లెండి..గండం గట్టెక్కింది’ ‘సారీ.. మరో దారి లేక’ ‘పరవాలేదు’ ‘మీ భోజనం?’ అడిగింది తను తెచ్చిన చపాతీల పొట్లం తెరుస్తూ. ‘విజయవాడలో చూస్తాను’ ‘నేను ఎక్కువ తెచ్చాను’ అంటూ అతనిచ్చిన పుస్తకం మధ్యపేజీ చించి రెండు చపాతీలు వేసింది. కొద్దిగా మాడి అట్టల్లా ఉన్నాయి అవి. కూర డబ్బా తెరవగానే గుప్పుమంది వాసన. ‘థాంక్యూ’ అందుకోబోయాడు. ‘అయ్యో.. వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేసాను. కూర పాడైపోయింది. ఈ పూట నాక్కూడా పస్తే’ జాలిగా అతని వంక చూసింది. కళ్ళు పెద్దవి చేస్తూ భుజాలెగరేశాడు. తెచ్చిన భోజనం చెత్తకుప్పలో పడేసింది. ఫోన్ స్విచ్ ఆన్ చేసి రెండు నిముషాలు ఆలోచించి డయల్ చేసింది. ‘ఏవండీ.. పిల్లలేం చేస్తున్నారు? తిన్నారా?’ అని అడిగింది. ఏదో వెటకారంగా మాట్లాడుతున్నట్టు కొద్దిగా వినిపిస్తోంది అవతలి గొంతు. ‘అత్తయ్య ఏమైనా ఫోన్ చేశారా? కాలు ఎలా ఉందిట? నేను చేస్తే తియ్యలేదు ఫోను’. పొడిపొడిగా వినిపిస్తున్నాయి అవతలి మాటలు. అర్ధరాత్రి దాటింది. హ్యాండ్ బాగ్ మీద తల వాల్చుకుని భుజాల మీదుగా పవిట కప్పుకుని పడుకోడానికి ప్రయత్నిస్తోంది ఆమె. అటూ ఇటూ కదలినప్పుడు చప్పుడు చేస్తున్న పట్టీలు.. కిటికీ లోంచి వస్తున్న వెలుగుకి మెరుస్తున్నాయి. మసక మసకగా ఉన్న వెన్నెల వెలుతురులో ఆమెని గమనించాడు అతను. పొందిగ్గా కట్టుకున్న సాదా నేత చీర, ముఖం మీద పడుతున్న జుత్తు, మూసినా కూడా పూర్తిగా రెప్ప సరిపోనంత పెద్ద కళ్ళు.. తనను చూస్తుందేమోనని భయపడ్డాడు. పక్కనుంచి వేగంగా వెళ్లిన రైలు చప్పుడుకి ఉలిక్కిపడి లేచింది ఆమె. ఎదురుగా అతను కనిపించలేదు.మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించింది. పక్క బెర్త్‌లో పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. సాయంత్రం నుంచి పడుకునే ఉన్న మనిషి ఆపకుండా గురక పెడుతున్నాడు.ఎదురుగా పైన ఎవరో కుర్ర జంట. ఊసులు చెప్పుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు.లేచి అతని కోసం వెతికింది. తలుపు దగ్గర కూర్చుని ఏదో రాయడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘వెళ్లే రైల్లో రాయడం అంటే ఇసుకలో పిచ్చి గీతలు గీసినట్టే. నా రాతలా వంకరటింకరగా ఉంటాయి’ ఎదురుగా కూర్చోబోయింది కొంచెం దూరంగా. ‘అయ్యో ఇక్కడ కూర్చున్నారేంటి?’ ఖాళీ జామపళ్ళ బుట్టలో ఉన్న పాత దిన పత్రికని అడిగి తీసుకుని ఆమెకిచ్చాడు. ‘నాకు తలుపు దగ్గర కూర్చోవడం ఇష్టం అండీ. కానీ మా ఆయనకి ఇష్టం ఉండదు. మీకు పెళ్లైందా?’ దినపత్రికని పరచి దానిపై కూర్చుంటూ అడిగింది. ‘హా..చేశారు’ అర్థం కానట్టు చూసింది. ‘నా మరదలే’ బైటికి చూస్తూ చెప్పాడు. ‘అదృష్టవంతులు. పెద్ద వాళ్ళు చేసిన పెళ్లిళ్లే ఉత్తమం.అందునా వరసైన వాళ్ళైతే గొడవే లేదు’ ‘ఆ గొడవలే ఇక చాలని, తెంచేసుకుని తిరిగి వెళుతున్నా’ పుస్తకం మూశాడు అప్పటి వరకూ తను రాసుకుంటున్న పేజీ చివరను మడత పెడుతూ. ‘మ్..’ ‘చిన్న చిన్న గొడవలండీ.. మేనల్లుడినని మా అత్తామామకి లోకువ. తనకేమో వాళ్ళ గారాబం. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. ప్రత్యేకంగా ప్రేమ ఎలా చూపిస్తాను? రోజూ నరకం. ఒకళ్ళకొకళ్లం ఇష్టంలేని బంధమన్నట్టుంది’ ‘మీ తప్పేం లేదా?’ ఆమె ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేదు. ఊళ్ళని, చెట్లని పలకరిస్తూ దాటుకుంటూ పోతోంది రైలు. తలుపు దగ్గర నుంచి ప్రపంచాన్ని చూస్తుంటే జీవితంలా అనిపిస్తోంది. చందమామను చూసి ఫక్కున నవ్వింది.. ఉదయం రాబోయే సూర్యుడు గుర్తొచ్చి. ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. ఏమీ లేదన్నట్టు నవ్వింది. ‘మీ వారు గుర్తొచ్చారా?’ అడిగాడు. ‘అలాంటిదే’ జుత్తుని చెవుల వెనక్కి తోసింది. ‘మీది ప్రేమ వివాహమా?’ అడిగాడు. ఏమీ మాట్లాడలేదు ఆమె. అనవసరంగా అడిగా అనుకున్నాడు అతను. ‘పదిహేడేళ్ళకి ప్రేమే అనిపించింది. ఇంట్లోంచి పారిపోయే ధైర్యం ఇస్తే గొప్పనిపించింది’ ‘మరిప్పుడు?’ ‘నలుగురు మనుషులుండే మూడు గదుల ఇంట్లో.. వారం పది రోజులకి ఒకసారి ఏ అర్ధరాత్రి పూటో హఠాత్తుగా ప్రేమ గుర్తొస్తుంది మా ఆయనకి. తొలికోడి కూసేలోపు నశించిపోతుంది’ ‘సారీ.. మనం దీని గురించి మాట్లాడుకోకుండా ఉండాల్సింది’ ‘అన్నీ బావున్నప్పుడు సరే గానీ, లేనప్పుడే ఎటు తిరిగి ఎటు వచ్చినా గతంలో చేసిన తప్పు దగ్గరికే వెళ్లి నిల్చుంటాం. గతంలోని మనం వర్తమానంలోని జీవితానికి ఎప్పటికీ సమాధానంలేని ప్రశ్నలమే’ ‘ప్రేమ వివాహం అంటే ముందు నుంచీ అన్నీ తెలిసే చేసుకుంటారు కదా? ఏదైనా సమస్య ఉంటే మీరు, మీ వారు కూర్చుని మాట్లాడుకుంటే...’ ‘ మీ కాపురం గురించి ఏమైనా సలహా ఇచ్చానా? ఒక్కసారి మీ అత్తా మామలతో కాకుండా ఆమె మనసులో ఏం ఉందో కనుక్కోమని చెప్పానా? ఏదో సందర్భం వచ్చింది అని ఆపుకోలేక బయటకి చెప్పేశాను. ప్రతీవాడికీ తనకన్నా పక్కవాడి బతుకే బావుందనిపిస్తుంది. రైలు సాఫీగా నడవాలంటే పట్టాలకు ఆసరాగా ఉన్న రాళ్లెంత ముఖ్యమో సంసారానికి చిన్న చిన్న సమస్యలు కూడా అంతే ముఖ్యం.ఆ రాళ్ల విలువ రైలు ప్రయాణం చేయాలనుకునే వాడికి తెలుస్తుంది. తెంచుకుని వచ్చేసిన మీకేం తెలుస్తుంది?’ చురుక్కున చూశాడు ఆమె వంక. చాలాసేపటివరకూ ఆ సీటు ఖాళీగా ఉండేసరికి ఎవరో ఆడమనిషి తన పిల్లని పెట్టుకుని పడుకుంది. లేపాలనిపించలేదు ఆమెకు. తన పిల్లలు గుర్తొచ్చారు. ఫోన్‌తీసి టైం చూసుకుంది. ఇంకా మూడుగంటల ప్రయాణం. మళ్ళీ తలుపు దగ్గరికి వచ్చింది. అతను అలా శూన్యంలోకి చూస్తున్నాడు. వచ్చి కూర్చుంది. కాళ్ళని మడిచి పెట్టుకుని మెట్టెలని వేలిచుట్టూ తిప్పుతూ కిందకి చూస్తోంది. ఆ అలికిడి ఆమె వైపు తిరిగాడు. ‘సారీ..’ ఒకేసారి చెప్పుకున్నారు ఇద్దరూ. నవ్వుకున్నారు. ‘మరోలా అనుకోవద్దు. మీరు నవ్వితే పడే సొట్టలు బావున్నాయి. మగవారికి అరుదుగా ఉంటాయి. సొట్టలు పడితే అదృష్టం అంటారు’ ‘మ్’ ‘ఇంతకీ మీరు ఏ ఉద్యోగం చేస్తారు?’ ‘చిన్న వ్యాపారం. అప్పుడప్పుడు పత్రికలకి కథలు రాస్తుంటాను. మీరేం చేస్తుంటారు?’ ‘ఇద్దరు పిల్లల తల్లిని. దిగువ మధ్యతరగతి భార్యని. బహుశా నా ఉనికిని వెతుక్కుంటున్నానుకుంటా. ఉద్యోగం చెయ్యడం మా వారికి ఇష్టం లేదు..’ ‘నా మరదలికి ఉద్యోగం చెయ్యాలని ఆశ. నాకన్నా కూడా చాలా తెలివైంది తను. కానీ ఇప్పుడు..’ ‘ఆశలు పడటమే మనిషి చేయగలిగేది’ ‘మీ గొంతు, మీ మాటలు బాగున్నాయి. నేను కాదు మీరు రాయాలి కథలు..’ ‘కొద్దిగా సంగీత జ్ఞానం ఉంది లెండి. ప్రేమించుకునే రోజుల్లో నాతో సినిమాల్లో పాటలు పాడిస్తా అనేవాడు మా ఆయన. ఇప్పుడు జోల పాడినా విసుక్కుంటాడు’ అంది చీర కొంగుని దగ్గరగా చుట్టుకుంటూ. ‘ఈ విసుగుకీ ప్రేమకీ చాలా దగ్గర సమ్మంధం ఉందండోయ్. మెత్తగా ఉంటే చులకనైపోతా అని విసుగు నటిస్తా నేను’ అన్నాడు. ‘విసుగు మొహం చూస్తేనే దగ్గరకి వెళ్లాలనిపించదు నాకు. అందుకే కాస్త విసుక్కోగానే ఏడుపు వచ్చేస్తుంది’ ‘అసలు నాకు తెలియక అడుగుతాను.. ఏం చెప్పినా నీ కోసం, మన కోసం అని ఎందుకు ఆలోచించరు?’ ‘ప్రేమగా చెప్తే ఎందుకు వినను? బుజ్జగించాల్సిన అవసరం లేదు. కానీ నా అభిప్రాయాలకూ విలువిస్తున్నారని నాకు నమ్మకం కలగాలి కదా?’ ‘అందరిలా ప్రేమని పైకి చూపించలేను. అర్థం చేసుకునే మనసుంటే నా ప్రతిచేష్టలో నీకు ప్రేమ కనిపిస్తుంది. అయినా అన్నాళ్ళు కాపురం చేశాక కూడా నేనిలాంటి వాడిని అని తెలుసుకోలేకపోతే ఇంక మన బంధానికి అర్థం ఏం ఉంది?’ ‘పెళ్ళికి ముందు నువ్వు, పెళ్లయ్యాక మీరుగా మారిపోయావు. ఇద్దరు పిల్లలతో ఇంట్లో కూర్చోపెట్టావు’ ‘మన మధ్యన ఉన్న దగ్గరితనం బయటి వాళ్ళ ముందు చూపించాల్సిన అవసరం ఏం ఉంది? బయట పని చెయ్యడం అంటే ఎన్నో ఒత్తిళ్ళని తట్టుకోవాలి. ఆ కష్టం నీకెందుకు అని! అయినా నా కన్నా నువ్వు తెలివైన దానివని సిగ్గు లేకుండా ఎన్నో సార్లు ఒప్పుకున్నాను’ ‘సరె.. ఇక నుంచి నువ్వు ఆ విసుగనే ముసుగు వేసుకోకుండా ఉండయితే నా కోసం’ ‘నువ్వు అన్నిటికీ ఆ ఏడుపు ముసుగు వేసుకోకు అయితే. ఇది నా కోసం..’ ఈ సారి ఆమె చూపులు అతని చూపులని కలిశాయి. ‘సార్.. ఇక్కడ కూర్చోకూడదు. వెళ్లి లోపల కూర్చోండి. పదండమ్మా’ వెనక నుంచి రైల్వే పోలీసు లాఠీతో తలుపు మీద తట్టి వెళ్తూ చెప్పాడు. అందమైన కలల కొలనులో రాయి పడి చెదిరినట్టనిపించింది. కాసేపు ఏమీ మాట్లాడుకోలేదిద్దరూ. రైలు బ్రిడ్జి మీద నుంచి వెళ్తోంది.. ‘గోదావరా?’ అప్పటిదాకా ఎదురుగా కుదురుగా ఉన్న ఆమె వచ్చి పక్కన కూర్చుంది. అతను ఊహించలేదు. గాలి వారి ఇద్దరి మధ్యనుంచి కొంచెం కష్టపడి తప్పించుకు వెళ్తోంది. ‘జాగ్రత్త.. పడతారు’ తన చేతిని ఆమె కాళ్ళకి అడ్డుపెడుతూ కంబీని పట్టుకున్నాడు. ‘చిల్లరుంటే ఇస్తారూ? నా బ్యాగ్ అక్కడ వదిలేశాను’ ‘మ్..’ ‘గోదారమ్మని చూస్తే భయం ఎందుకండీ.. నా తల్లి..’ దణ్ణం పెట్టుకుని చిల్లర వేసింది. చల్లని గాలి మనసుని,ఆలోచనల్ని కూడా శుద్ధి చేస్తున్నట్లుంది. ‘ఇదిగో.. టీసీ అడిగితే ఈ టిక్కెట్టు చూపించండి. విజయవాడలో దిగినప్పుడు తీసుకున్నాను. మీరు మంచి నిద్రలో ఉన్నారు ఇద్దామంటే’ ‘మొద్దు నిద్ర నాది. థాంక్యూ.. మీకు నేను నూట ముప్పై ఆరు రూపాయలు బాకీ. ఇందాకిచ్చిన చిల్లరతో కలిపి’ టిక్కెట్టు తీసుకుంటూ గమనించింది అతని చేతి మీద హృదయాకారంలో చిన్న పచ్చబొట్టు. అతని భార్య పేరు కావొచ్చు. రాజమండ్రి దాటింది. మాటల్లో మునిగిపోయారు. చలం సాహిత్యం నుంచి రఫీ పాటల మీదుగా, కోఠీలో చవగ్గా దొరికే చిన్నా చితకా వస్తువులని దాటుకుని, హుస్సేన్ సాగర్ లో బుద్ధుడిని పలకరించి భీమిలి బీచ్‌లో రాళ్లతో ఆడుకుంటూ సంభాషణ చాలాసేపు సాగింది. అలాగే కూర్చున్నారు ఇద్దరూ. అప్పుడప్పుడు ఆమె జుత్తు అతని ముఖం మీద పడుతోంది. ఇద్దరికీ మనసు చాలా తేలిగ్గా ఉంది. ఆ రోజు వరకు ఉన్న చిన్న చిన్న చింతలన్నీ తీరిపోయినంత ఆనందం. రేపటికి ఏదో భరోసా దొరికిన భావన. మన తప్పొప్పుల్ని వివరించి చేప్పే ఒక ఆత్మీయ నేస్తం తారసపడినట్లుంది ఇద్దరికీ! ముఖం కడుక్కుంటూ అద్దంలో తనని తాను చూసుకున్నాడు. ఏదో కొత్తగా మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తోంది. అద్దంలో దూరంగా అతని వెనక ఆమె. వెళ్లాల్సిన చోటు దగ్గరవడంతో బ్యాగ్ సర్దుకుంటోంది. ఉన్నట్టుండి గుర్తొచ్చింది.. ఆమె పేరైనా అడగలేదు. బండి ఆగింది. దిగి నడుస్తోంది. వెనక్కి తిరిగి చూడలేదు ఆమె. వర్షపు నీటిగుంటలో ఆమె ప్రతిరూపం చూసుకుంది. ‘ ఇంత సౌఖ్యమని నే జెప్పజాల.. ఎంతో యేమో యెవరికి దెలుసునో?’ అన్నవరం స్టేషన్లో టీ కొట్లోంచి త్యాగరాజ కీర్తన వినిపిస్తోంది. వింటున్న ఆమెలో తృప్తి్తతో కూడిన చిన్న చిరునవ్వు. అతను తన మరదలికి ఫోన్ చేశాడు. లేచినట్టు లేదు ఇంకా. పుస్తకం తెరిచాడు.. రెండు వంద నోట్లు. బాకీ తీర్చేసింది కాబోలు. ఆమె సగం పూర్తి చేసిన పజిల్ పూర్తి చెయ్యడం ప్రారంభించాడు అతను. రైలు కదిలేసరికి ఆఖరు గడి పూర్తయింది.. ‘సీత’ అన్న అక్షరాలతో. బహుశా అతని తర్వాత కథ కావచ్చు. మెల్లగా ఆమె కనుమరుగైంది!!!! -రవి మంత్రిప్రగడ -
ఈవారం కథ: వాసన
టీ ఇచ్చింది. నీలిరంగు పూలున్న కప్పులో గాఢంగా నిండి, తీరం చేరని అలలాగా పలుచటి మీగడ కట్టిన టీ. ‘ఊ.. పీల్చండి.. ఆలస్యం ఎందుకు?’ అంది. తలెత్తి చూశాడు. ఆమె వెళ్లాక ఎలాగూ చేస్తాడు. ముందే చేయమంటోంది. వాసన చూశాడు. టీ వాసన. ‘వచ్చిందా?’ ‘ఊ’ ‘అంతా బాగైపోయాము. వొడ్డున పడ్డాము. పద్నాలుగు రోజులైపోయి ఇవాళ్టికి మూడు వారాలు గడిచాయి. పదో రోజుకే మనకు వాసన తిరిగి రాలేదూ. నీకొచ్చిందా అంటే నీకొచ్చిందా అని అనుకోలేదూ. మీ కళ్లకు తుండు గట్టి పసుప్పొడి వాసన చూపిస్తే మీరు ముక్కుకు దగ్గరగా పట్టి పసుప్పొడి అని చెప్పలేదూ. ఇంకా ఏమిటండీ ఈ ఆరాటం మీకూ నాకూ. అదున్నప్పుడు బానే ఉన్నారు. దాన్ని తరిమిగొట్టారు. తీరా నెగెటివ్ అని రిపోర్టు ఇద్దరం చూసుకుని చీమ కుట్టినంత కష్టమైనా లేకుండా కనికరించావు దేవుడా అనుకుని తెరిపిన పడుతుంటే ఏం జబ్బు చేసింది మీకు? వాసన పోయినట్టుగా వాసన లేనట్టుగా వాసనే రానట్టుగా ఉలికులికిపడుతున్నారు. ప్రతిదాన్ని వాసన చూస్తున్నారు. ఉందా... ఉన్నట్టే ఉందా అని నన్ను పీక్కు తింటున్నారు. అయ్యో... ఎక్కడికైనా పారిపోదామంటే ఏ ఇంటికీ వెళ్లలేని ఈ పాపిష్టి రోజులు’... ఇక అక్కడితో విసురుగా వెళ్లాలి లెక్కప్రకారం. కాని టీ తాగేదాకా ఆగి కప్పు తీసుకెళ్లిపోయింది. పదిహేను రోజులు అఫీషియల్ సెలవులిస్తారు ఆఫీసులో పాజిటివ్ రిపోర్ట్ పంపితే. ఇంకో పదిహేను రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఆ పదిహేను రోజులూ అయిపోయాయి. ఫటీగ్గా ఉంది ఇంకో పదిరోజులు ఇవ్వండి అని కోరాడు. అవీ ముగిసి రేపో మర్నాడో వెళ్లాలి. లేదంటే నీకూ మాకూ చెల్లు అన్నా అంటారు. చిన్న బెడ్రూమ్ నుంచి పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ క్లాసులు అయిపోయాయన్న మాట. యూట్యూబ్‌లోకి దిగి ఉంటారు. పోయిన సంవత్సరం న్యూస్ మొదలై హటాత్తుగా లాక్డౌన్ వచ్చినప్పుడే తీసుకోదగ్గ జాగ్రత్తలన్నీ తీసుకుందాం అని ఇద్దరూ అనుకున్నారు. లాక్డౌన్లు ముగిసి జనం మాస్క్‌లు కట్టుకుని, షాపులకు పాలిథిన్ షీట్లు వేళ్లాడేసి, తాళ్లు అడ్డం కట్టి బేరాలు మొదలెట్టాక... మాస్క్, మాస్క్ మీద షీల్డ్ పెట్టుకొని ఐకియాకు వెళ్లి రెండు చిల్డ్రన్స్ బెడ్స్ కొన్నారు. చిన్న బెడ్రూమ్లో ఇదివరకు ఫోర్ బై సిక్స్ బెడ్ ఉండేది. పెద్దదానికి నాలుగు బిస్కెట్లు ఇచ్చి నీకు రెండు తమ్ముడికి రెండు అనంటే గీత పెట్టి కొట్టినట్టుగా సమానంగా పంచుతుందిగాని ఒకే మంచం మీద ఇద్దర్నీ పడుకోమంటే మెల్లమెల్లగా కాలితో నెడుతూ వాణ్ణి తోసేస్తుంది. నలుగురూ మాస్టర్స్ బెడ్రూమ్లో పడుకునే రోజులు పోయాయి. ఏ క్షణాన ఏ అవసరం వస్తుందోనని ఆ ఫోర్ బై సిక్స్‌ను... అతని వాళ్లకా ఆమె వాళ్లకా అనే చర్చ లేకుండా... ఆమె వాళ్లకే చెప్తే వచ్చి పట్టుకెళ్లారు. కొన్న రెండు బెడ్లు అక్కడ వేశారు. కామన్ బాత్రూమ్ ఆ చిన్న బెడ్రూమ్కు దగ్గరగా ఉంటుంది. అందులో నాలుగువేలు పెట్టి మినీ గీజర్ బిగించారు. ఒక అరలో ఉడ్వర్క్లో మిగిలిన కర్ర ముక్కలు, ప్లైవుడ్ తునకలు దాచి ఉంటే పారేసి పిల్లలవే కొన్ని బట్టలు, టవల్స్, రెండు స్టీల్ జగ్స్ పెట్టారు. అతనికీ ఆమెకీ ఒకరోజు తేడాలో టెంపరేచర్ మొదలైనప్పుడు ఈ సిద్ధం చేసిందంతా పనికొచ్చింది. పిల్లల్ని ఆ రూమ్‌లోకి పంపించేశారు. ఇక క్లాసులొద్దు ఏం వొద్దు మీ ఇష్టమొచ్చినవి కంప్యూటర్లో ఫోన్లో చూసుకోండి అని చెప్తే, వాళ్లూ తెలివైనవాళ్లకు మల్లే అస్సలు బెంగలేనట్టుగా ముఖాలు పెట్టి సరేనన్నారు. పెద్దది ఎనిమిదో క్లాసుకు, వాడు ఆరుకు వచ్చే సమయానికి ఇదంతా మొదలవడం తమ అదృష్టం అనే అనుకున్నారు. ఇంకా చిన్నపిల్లలై ఉంటే తమ సంగతి తమకు మాత్రమే తెలిసేది. ఏమంటే కొన్ని బాధలు ఎంత చెప్పినా ఎదుటివారికి ఏ తలకాయీ అర్థం కాదని అనుకున్నారు. క్షణాల్లో కోర్సు మొదలెట్టడం వల్లో, ఇద్దరివీ సముద్రం వొడ్డున ఉండే ఊళ్లు కనుక అన్యం లేనట్టుగా చేపలు తింటూ పెరగడం వల్లో, మరీ యాష్ట పడేంతగా శరీరాలను ముందు నుంచి చేటు చేయక చూసుకోవడం వల్లో వచ్చిన చుట్టం ప్రతాపం చూపకుండా ఆరో రోజుకు ముడుచుకు పడుకున్నాడు. వంట యధావిధిగా సాగేది. పిల్లల వాటా తలుపు దగ్గర పెట్టి తప్పుకునేవాళ్లు. రెండుసార్లు పెద్దది ఏడ్చింది. వాడు వీడియో కాల్లో ముఖం ఎర్రగా పెట్టి నాన్న మర్యాద కాపాడ్డానికి బింకం పోయాడు. పన్నెండు రోజులకే డాక్టర్ ‘పోండి... పోయి పిల్లల దగ్గర పడుకోండి’ అన్నా పద్నాలుగో రోజున తల స్నానాలు చేసి, ఇద్దరు పేదవాళ్లకి, అంటే ఆమె దృష్టిలో అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డులకు, వెజిటెబుల్ బిర్యాని– ఎగ్ కర్రీ పెట్టి, అప్పుడు పిల్లలను దగ్గరకు తీసుకుని పెద్దపెద్దగా ఏడ్చారు. అయితే అమేజాన్‌లో పెద్దది తెలివిగా ‘ది వార్ విత్ గ్రాండ్‌పా’ సినిమా పెట్టి అందర్నీ నవ్వించింది బాగా. ఇక అంతా అయిపోయినట్టే అనుకుంటూ ఉంటే ఈ ముక్కు బాధ మొదలైంది. వాసన ఉన్నట్టా.. వాసన లేనట్టా... వాసన ఉండీ లేనట్టా.... స్నానం చేస్తూ సబ్బు వాసన చూట్టం... నూనె రాసిన జుట్టును దువ్వుకున్నాక దువ్వెన వాసన చూడటం, హ్యాంగర్‌కు వేళాడుతున్న మురికిబట్టల వాసన చూడటం, కప్‌బోర్డుల్లో పడేసి ఉంచిన నేఫ్తలిన్ ఉండలు తీసి వాసన చూడటం... కొత్తల్లో ఆమె గమనించి ఏమిటోలే అనుకునేది. తర్వాత్తర్వాత భయపడుతోంది. టెంపర్ మనిషి. పిల్లల్ని తీసుకొని ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్లినా వెళ్లగలదు. దీనిని ముగించాలి అనుకున్నాడు. ఆఫీస్ పని అయ్యేసరికి మధ్యాహ్నం నాలుగైంది. ఐదింటికి టీ తాగి, మాస్క్ పెట్టుకుని, ఫోన్ తీసుకొని ‘అలా వెళ్లొస్తా’ అని బయటపడ్డాడు. ఆరు నుంచి కర్ఫ్యూ. ఇంకా గంట టైముంది. రోడ్డు మీదకు వచ్చాక ఎం.ఆద్రికి ఫోన్ చేశాడు. ఆద్రి డాక్టరు. హైస్కూల్లో అతడికి రెండేళ్లు సీనియర్. అసలు పేరు మాల్యాద్రి అయితే మార్చుకున్నాట్ట. ఆ ఆద్రిని అతడు వాడు అంటాడు. యు.కె వెళ్లి సైకియాట్రీ చదివి అక్కడే ప్రాక్టీసు చేసి ఆ అనుభవంతో ఇక్కడ ప్రాక్టీసు చేస్తున్నానని అతడితో ఆ వాడు చెప్పాడు కాని అతడికి వాడి మీద వాడి వైద్యం మీద ఏ మాత్రం నమ్మకం లేదు. పైగా కాల్ చేస్తే ‘తమ్ముడూ’ అంటాడు. ఈ వరసలు కలిపే వాళ్లంటే అతడికి మంట. కాని వేరే గతి లేదు. ‘ఆ.. తమ్ముడూ’ అన్నాడు వాడు. సంగతి చెప్పాడు. ‘ఆ... ఇంకేం సంగతులు... బోండాం శీను ఎలా ఉన్నాడు’ మళ్లీ సంగతి చెప్పాడు. ‘మొన్న ఊరి నుంచి మైసూర్‌పాక్ వస్తే తమ్ముడూ... నిన్నే తలుచుకున్నా’ ‘నాకు మోక్షం లేదా అన్నయ్యా’.. ‘ఎయ్... వదిలెయ్‌రా డౌట్‌ని. ముక్కేంటి మూతేంటి. సరిగ్గా నిద్ర పోతున్నావా? నిద్ర బిళ్ల వాట్సప్ చేస్తా ఒక వారం వేస్కో’ ‘ప్రతిదానికీ పడుకోబెట్టడమేనారా మీ సైకియాట్రిస్ట్‌ల పని’ ‘పడుకుంటే సగం దరిద్రం వదులుతుంది తమ్ముడూ’ ఆ వాడు ఏ మాత్ర రాశాడో అతడు ఏది మింగాడో ఇక నిద్రే నిద్ర. ఆఫీస్‌లో జాయినయ్యి రెండో రోజు మీటింగ్‌లో ఉన్నాననే అనుకున్నాడు. సెక్షన్ అంతా ఇళ్లకెళ్లాక బాయ్ వచ్చి లేపాడు లైట్లు లేకుండా చీకటిగా ఉన్న కాన్ఫరెన్స్ రూమ్‌లో. సీనియర్ ఉద్యోగి అని మర్యాద ఇచ్చినట్టున్నారు. మరుసటిరోజున బాస్ నుంచి ఇంకో వారం దాకా ఇంట్లోనే ఉండి పని చేయ్ అనే మెసేజ్ కూడా వచ్చింది. నిద్రపోయేవాడు వాసన చూడలేడు. అతడూ చూడలేదు. వారం తర్వాత తేన్పులొస్తున్నాయని మజ్జిగ తెచ్చి ఇస్తే గ్లాసు పట్టుకుని అరగంట సేపు వాసన చూస్తూనే కూచున్నాడు. చూసింది... చూసింది... వచ్చి గ్లాసు పెరుక్కొని ఎత్తి నేలకు కొట్టింది. మజ్జిగ ఎగిరి టీవీ మీదా, టీపాయ్ మీదున్న న్యూస్పేపర్ల మీద, అతని ముఖాన పడింది. ఆమె ఏడ్చింది. సాయంత్రం మాస్క్ తగిలించుకుని, ఫోన్ తీసుకొని ‘అలా వెళ్లొస్తా’ అని రోడ్డు మీదకొచ్చి వాడికి కాల్ చేశాడు. ‘ఏమిట్రా ఇదీ తమ్ముడూ’ అన్నాడు వాడు. ‘అరె... నీ ముక్కు ఆల్రైట్గా ఉంది. నువ్వు ఆల్రైట్గా ఉన్నావు. ఎందుకురా నా పని చెడదొబ్బుతావు’ అన్నాడు మళ్లీ. ఏమీ మాట్లాడలేకపోయాడు. ‘అరె.. మనసు కష్టపెట్టుకుంటున్నావు కదా నువ్వు. ఏం మనూరోడివిరా నువ్వు. స్కూల్లో షేర్ నువ్వు... షేర్. ఈ మాత్రం దానికి’... అన్నాడు వాడు. గొంతు పెగల్లేదు. వాడూ ఒక నిమిషం ఊరికే ఉండి– ‘అరె.. ఒకటి చెప్పు. నీ మైండ్ సరిగా ఉండాలంటే దానికి ఎక్సర్సైజ్ ఉండాలి కదా. నీ కాళ్లు చేతులు సరిగా పన్జెయ్యాలంటే వాటికి ఎక్సర్సైజ్ ఉండాలి కదా. నీ పొట్ట సరిగా పని చేయాలంటే నువ్వు మూడుపూట్లా తిని, అరాయించుకుని, తెల్లారి దానికి వెళ్లాలి కదా. నీ ముక్కుకు ఏం ఎక్సర్సైజ్ ఉందో చెప్పూ. ఏం ఇస్తున్నావు దానికి. ఎలా బతికిస్తున్నావు. చచ్చి పడున్నట్టుందిరా అది. ఏ వాసనలూ లేక ఎప్పుడో చచ్చినట్టుందది. నీకు ఇప్పుడు తెలిసింది. అరెయ్.. ముక్కున్నది నీ చచ్చుపుచ్చు బతుక్కి గాలి పీల్చి వదలడానికి కాదు. దయ తలువు దాన్ని. షో సమ్ మెర్సీ. ఏదో వర్డ్ ఉంది... ఆ... ఆఘ్రాణించు... ఆఘ్రాణించు ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్. బతుకుతుంది. మళ్లీ ఇందుగ్గాను కాల్ చేయకు. మందేద్దాం అనుకుంటే మాత్రం రా’... పెట్టేశాడు. ఆరవుతున్నట్టుంది. మనుషుల్ని రోడ్ల మీద నుంచి వెళ్లగొట్టే చీకటి దాపురిస్తూ ఉంది. పోలీస్ వెహికల్ ఒకటి సైరన్ మోగిస్తూ కర్ఫ్యూ అవర్స్ మొదలవుతున్నాయని గుర్తు చేస్తూ తిరుగుతూ ఉంది. షార్ట్స్, టీ షర్ట్, స్లిప్పర్స్‌లో చేత ఫోన్ పట్టుకుని కొత్తగా వేసిన పేవ్మెంట్ పక్కన నిలబడి ఉన్నాడు. అలా నిలబడి ఉండటం, రోడ్డును అలా తిరిగి చూడగలగడం, ఆకాశం కింద అలా ప్రాణాలతో మిగలగలగడం కొన్నాళ్ల క్రితం అతడు ఊహించలేదు. ఇప్పుడు ప్రాణాలు ఉన్నాయి. జీవమే. ఎవరో ముసలాయన, ముస్లిం టోపీ పెట్టుకుని– పోలీసుల భయంతో తోపుడు బండిని గబగబా తోసుకొని వెళుతున్నాడు దూరంగా. చూస్తున్నాడు ఆ బండివైపు. ఏం పండ్లున్నాయో దాని మీద. బత్తాయిలా... కమలాపండ్లా... సురేశ్ గాడు గుర్తొచ్చాడు. స్కూల్లో ‘మావా... మాటరా’ అని పక్కకు తీసుకెళ్లి, వెనుక మడుచుకుని ఉన్న చేతుల్లో నుంచి టకాలున నారింజ తొక్క తీసి కళ్లల్లోకి పిండేవాడు. అబ్బా రే... ఆ తర్వాత ఆ నారింజ తొక్కను లాక్కుని వాడి కంట్లో పిండేవాడు. ఆ పూటంతా చేతుల్లో నారింజ వాసన. కమ్మటి సువాసన. నవ్వొచ్చింది. ముక్కుకు నారింజ వాసన తగిలింది– అప్పటిది. గట్టిగా గుండెలోకి పీల్చాడు. అప్పటి రసం ఇప్పుడూ పడిందేమో కళ్లు నీళ్లు చిమ్మాయి. ఆ సురేశ్ గాడే వాళ్ల నాన్నది లూనా తెచ్చేవాడు టెన్త్ క్లాస్‌లో. ట్యాంక్ విప్పి ‘చూడ్రా... వాసన భలే ఉంటుంది’ అనేవాడు. లీటరులో సగం డబ్బులు నీవి అని– ఆ సగం ఏనాడూ ఇవ్వకపోయినా లూనా నేర్పించాడు. డబ్బు చేత్తో పట్టుకున్న సురేశ్ గాడి పక్కన పెట్రోల్ బంకులో నిల్చున్నట్టే ఉంది. తెరలు తెరలుగా వాసన తాకుతున్నట్టే ఉంది. ముక్కు ఎగపీల్చాడు. ఫోన్ మోగింది. ‘ఏమయ్యారు’ ‘వచ్చేస్తున్నా.’ ‘ఏమిటి హుషారుగా ఉన్నారు’ ‘ఏం లేదు. ముక్కు. బాగుందిలే’... ఇంటికెళదామా అనిపించింది. ఇల్లు. బాత్రూమ్లో ఫినాయిల్... డెట్టాల్... ఫ్లోర్ తుడిచేప్పుడు లైజాల్... రాత్రి కచ్వా... ఎప్పుడైనా ఆమె వెలిగిస్తే అగరుబత్తి వాసన. ఆ వాసన అతడికి పడదు. ఊళ్లో చిన్నప్పుడు మమత మాంసాహార హోటల్‌కు పెరుగు పార్శిల్‌కు వెళితే కౌంటర్ మీదున్న స్టీల్ స్టాండ్ నుంచి వచ్చే గంధం బత్తి వాసన యిష్టం. ఆ వాసన కోసం ఎన్నిసార్లు ఎన్నిరకాల గంధం బత్తీలు కొని వెతికాడో. ఆ వాసనే వాసన. ప్రయత్నించాడు. దగ్గరగానే ఉంది. గాలిలో తేలి ఆడుతూ మెల్ల మెల్లగా సమీపిస్తూ ఉంది. నాటి బాలుణ్ణి చేస్తూ నీ ముక్కుకు ఏమీ కాలేదులేవోయ్ అంటూ ఉందా అది? కూరకు వెళితే ‘ఇదిగో... ఈ అబ్బాయి మన ఫలానా ఆయన కొడుకు. కాస్త ఎక్కువ కట్టు’ అని హోటలు ఓనరు అంటే, ఇచ్చిన ప్యాకెట్ అందుకుని ఇంటికి వొచ్చాక ఏ అలంకారమూ లేని ఆ అతి మామూలు అరటికాయ కూరలో కూడా ఎంత ఆకలి రేపే సువాసనో! ‘ఏవిటి.. కనీసం కూర వాసన కూడా రాదు ఇంట్లో’ అంటాడు ఎప్పుడైనా. ‘రండి.. ఇలా రండి’ అని పిలుస్తుంది వెంటనే. ‘చూడండి.. ఇది కొత్తిమీరట. వాసన ఉందా? హవ్వ. పుదినాలో కూడా వాసన లేకపోతే నేనేం చేయను. ఇవి ఆలుగడ్డలట. అవి టమేటాలు అట. వాటిదీ ఆకారమే. మనదీ ఆకారమే. తిరగమోతలో వాసన వచ్చి ఎంత కాలమనీ. మినుములు వేయిస్తే గుమ్మెత్తిపోయేది. పాలు పొంగినప్పుడు వచ్చే వాసన నాకిష్టం. ఎక్కడ చూస్తున్నాను నా మొహం. ఒక్క నేతిచుక్క వేసుకుని వేడన్నంలో కలుపుకుని తింటే ఆ అన్నమంతా నెయ్యి వాసన, కడుకున్నాక చేతికి వాసన. ఆ రోజులా ఇవీ. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, దనియాలు వేయించి పక్కింట్లో రోట్లో దంచుతుంటే వాసన మా ఇంటి దాకా వచ్చేది. చారు కాస్తే నాలుగు పెళ్ళల అన్నం మింగేదాన్ని. ఇప్పుడు ఆశించగలమా ఇదంతా. మరువం, దవనాలే వాసనల్లేక వొట్టి పోతే మీరేమిటండీ వాసనలంటారూ’ అంటుంది. కాని ఆ యోగం అతనికి తెలియనిదా? పెదమ్మ ఆంటీ ఇంటికెళితే తెల్లసున్నం వేసిన వీధిగోడల మీద పగిలిపోయిన కుండలను బోర్లేసి మట్టి నింపి పెంచిన మరువం, దవనం దుబ్బుగా ఉండేవి. వాటి దగ్గర నిలబడి చాలాసేపు వాటి సువాసన పొందేది. అది చాలక ప్రతిసారీ పెదమ్మ ఆంటీ ‘ఆ తలేందిరా’ అని నూనె రాసేది. గానుగ నుంచి తెచ్చిన కొబ్బరి నూనెలో రీటా వేసి, బావంచాలు పోసి, సుగంధవేర్లు జారవిడిచి అవన్నీ గాజు సీసాలో లేత ఎరుపులో కనిపిస్తూ ఒక దానికి ఒకటి సువాసన ఇచ్చుకుంటే ఆ నూనె తలకు రాసి, రాశాక ‘చూడు’.. అని రెండు అరిచేతులను ముఖానికి దగ్గరగా తెచ్చేది. అప్పుడు ముక్కు సొట్టలు పడేలా అతడు వాసన పీల్చేది. పెదమ్మ ఆంటీ చేతులు... ఇప్పుడూ దగ్గరగా అనిపిస్తూ ఉన్నాయి. ఆ సెంటు నూనె వాసన ముక్కు దిగువన ఇప్పుడూ తారాడుతూ ఉంది. ‘చినమ్మ ఆంటీ ఇంటికెళ్తా.. పొయ్యిలో కాల్చి పనసగింజలు పెడుతుంది’ అనేవాడు. ‘ఆ పెడుతుందిలే సంబడం. నేనూ పెడతానుండు’ అని ఆరిపోయిన పొయ్యి ఎగదోసి చిలగడదుంపలు రెండు పడేసేది. చిలగడదుంపలు కాలే వాసన వాటిని తినడానికంటే రుచిగా ఉండేది. అవి తిన్నాక కదిలే పని ఉండదు. కడపు నిండి పెరడు బావి దగ్గర ఆడుకోవడమే. బైక్ వచ్చి ఆగింది. ముందు ఒక పోలీసు, వెనుక ఒక పోలీసు ఉన్నారు. ‘వెళ్లాలి సార్’ చూశాడు. ‘వెళ్తా. ఇక్కడే మా ఇల్లు’ వెళ్లిపోయారు. కాలేజీలో ఉండగా యూనియన్ వాళ్లు పెంచిన కాలేజీ ఫీజులు తగ్గించాలి, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి అని స్ట్రయిక్‌కి పిలుపు ఇస్తే కుర్రాళ్లు పది మంది స్కూళ్లు మూయించడానికి బయలు దేరితే తనూ వెళ్లాడు. ఒక్కో స్కూలు మూయిస్తూ వస్తుంటే ఒక హెడ్మాస్టరు మాత్రం హటం చేశాడు. ఎంత చెప్పినా వినడు. అన్ని క్లాసుల్లోని పిల్లలు గోలగోలగా కిటికీల్లోంచి చూస్తుంటే వెళ్లినవాళ్లు ఎదురు తిరిగి స్లోగన్స్ ఇస్తూ లాంగ్ బెల్ కొట్టేస్తూ ఉంటే పోలీసులు. కంపలకు అడ్డం పడి పరిగెత్తి పడ్డాడు. గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళితే, కొత్తనర్సు నేరుగా టింక్చర్ పెట్టబోతే, పెద్దనర్సు తిట్టి స్పిరిట్‌తో కడిగి ఆ తర్వాత టింక్చర్ పెట్టాలి అని స్వయంగా ఆ పని చేస్తూ ‘ఏం స్టూడెంట్సయ్యా మీరంతా’ అని అక్కరగా మందలిస్తూ ఉంటే అప్పుడు వచ్చినదీ ఇప్పుడు వస్తున్నదీ టింక్చర్ వాసనా... ఆమె రాసుకున్న క్యుటికుర వాసనా... ఇంటి వైపు అడుగులు వేశాడు. మాస్క్ కట్టకుండా ఎవరూ లేకపోయినా ఫ్లాట్స్‌లోని అందరూ ప్రతి ఒక్కరినీ గుర్తు పట్టే అనుభవం ఈ సంవత్సర కాలంలో వచ్చేసింది. లిఫ్ట్ దగ్గర థర్డ్‌ఫ్లోర్ భాస్కర్ నాయుడు ఉన్నారు. డెబ్బై ఉంటాయి. కాని ఏ కర్ఫ్యూ ఆయన్ను ఈవెనింగ్ వాక్కు వెళ్లనీకుండా ఆపదు. ఇద్దరూ లిఫ్ట్ ఎక్కారు. క్షేమమే కదా అని ఆయన చేత్తో సైగ చేశారు. క్షేమమే అని అతడు సైగ చేశాడు. థర్డ్ ఫ్లోర్లో ఆయన దిగిపోయారు. ఒకసారి ఇలాగే లిఫ్ట్ బయట కలిస్తే, బటన్ నొక్కి వెయిట్ చేస్తూ, మాటల్లో పడ్డారు. చాలా మంచి వాసన వస్తోంది. పోల్చుకోవడం ఎంతసేపూ. అది మట్టి వాసన. ‘ఏమిటి సార్. ఇంత ఎండగా ఉంది. ఎక్కడ వాన పడుతోంది... మట్టి వాసన’ అన్నాడు. ఆయన నవ్వి ‘వాన లేదయ్యా. నా దగ్గరే’ అన్నాడు. ‘మీ దగ్గరా?’ ‘అవును. పుట్టింది పల్లెటూళ్లో. టీచరుగా జీవితాంతం పని చేసి రిటైరైంది పల్లెటూళ్లో. బరెగొడ్లు, పేడ కళ్లాపిలు, గడ్డి మోపులు, నార్లు పైర్లు... వీటి మధ్య బతికా. ఒక్కగానొక్క కొడుకు అని పదేళ్లుగా వీడి దగ్గర ఉన్నా. అబ్బా కష్టమయ్యా ఇక్కడ ఉండటం. మందు వాసన మందుల వాసన తప్ప ఇంకో వాసన రాదు. ఇక తట్టుకోలేక ఈ అత్తరు కొనుక్కున్న. కన్నోజ్ అని ఉత్తరప్రదేశ్‌లో ఊరు. అత్తర్లకు ఫేమస్. వానలు పడే కాలాన ఆ ఊరి నది వొడ్డున సుతారంగా ఏరిన మట్టితో ఈ అత్తరు తయారు చేస్తారు. పాతబస్తీలో దొరుకుతుంది. కాస్ట్లీ. అప్పుడప్పుడు పూసుకుంటా’... ఆకాశం కనికరిస్తే, జల్లు దయగా దిగి నేలను నిమిరితే అణాకాణీ ఖర్చు లేకుండా అందరూ పొదువుకోవాల్సిన మృత్తికా సౌరభం. ఇప్పుడు అతి ఖరీదుగా ఒక లిప్త పాటు జాగృతమై లిఫ్ట్‌లో అతణ్ణి కంపించేలా చేసింది. ఇంట్లోకి వచ్చాడు. ఆమె పరిశీలనగా చూసి సంతృప్తి పడింది. పిల్లలకు కారం లేని ఒక కూర ముందే చేసేసి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికీ వండుతుంది. ‘ఏం వొండను’ అడిగింది. ‘ఏదో ఒకటి. కాస్త ఎండు చేపలు వేయించరాదూ. రేగిపోవాలి’ నొచ్చుకున్నట్టు చూసింది. ‘మానేశాము కదండీ పిల్లలకు వాసన పడట్లేదని. పైగా అపార్ట్మెంట్లో ఆ కంపు రేపుతోంది మనమే. ఎందుకా అప్రదిష్ట. దాచిన కొన్ని ముక్కలుంటే పనమ్మాయికి ఇచ్చేశాను. ఊరికెళ్లినప్పుడు ఇక మీ అమ్మ దగ్గరే ఆ ముచ్చట’ శ్వాస– ఒక నిమిషం దిగ్బంధనం అయినట్టు అనిపించింది. అమ్మ గొంతు దాపున దూరాన వినిపించినట్టయ్యింది. అమ్మ గొంతు. దానిది కదా అసలైన వాసన. ‘ఒరేయ్ మేధావి’ అని పిలిచేది అమ్మ బుక్స్ చదువుకుంటూ ఉంటాడని. తిక్కపనులు చేస్తే ‘ఒరే మేతావి’ అని నవ్వేది. చిన్నప్పుడూ ఇప్పుడూ పలుచగా ఉంటుంది అమ్మ. చిన్నప్పుడూ ఇప్పుడూ మెత్తగా మాట్లాడుతుంది అమ్మ. ‘నాన్న జేబులో చిల్లరుంటుంది. తీసుకొని కొనుక్కోరా’ అనేది. ‘నాన్న జేబులో చేయి పెట్టను. రాలిన సిగరెట్ పొడి చేతికంటుకుంటుంది. వాసన’ అనేవాడు. ఆమే వచ్చి తీసి ఇచ్చేది. అమ్మ దగ్గరే ఉండేవాడు ఎప్పుడూ. ఆమె రవిక చంకల దగ్గర చెమట పట్టి– ఉండ్రా స్నానం చేయలేదు అన్నా పర్లేదులే అని పక్కన నులక మంచం మీద ఎగిరి కూచునేవాడు. ఆదివారాలు అన్నాలు తిన్నాక ఆడుకోవడానికి ఎవరూ రాని మధ్యాహ్న వేళలో ఆమె పక్కన పడుకుని కొంగు ముఖాన వేసుకుని ఏవో ఊహలు గొణుక్కునేవాడు. ‘పెద్దయ్యాక నీకేం కావాలన్నా కొనిస్తాను చూడు’ ‘నాకేం వద్దులేరా మేధావీ. నువ్వు పక్కనుండు చాలు’ ‘ఊహూ. కొనివ్వాల్సిందే’ అమ్మ ఎప్పుడూ నాన్నను ఏదీ అడిగేది కాదు. నాన్నే ఒకసారి ఆమెకని ప్రత్యేకం సింథాల్ సబ్బు తెచ్చి పెట్టాడు. నాలుగు భుజాల దీర్ఘ చతురస్రాకార ఎర్రఅట్ట సబ్బు. అమ్మ ఆ రోజు చాలాసేపు స్నానం చేసింది. చలువ చీర కట్టుకుని ‘రా’ అని నవ్వుతూ దగ్గర తీసుకుంది. చుబుకం కింద తల వొచ్చేలా పట్టుకోవడం ఆమెకు ఇష్టం. ఇప్పుడూ పట్టుకున్నట్టయ్యి ఆ స్పర్శది కదా అసలైన వాసన అనిపించింది. ‘ఏమిటండీ అలా అయిపోయారు’ అంది. ‘ఏం లేదు.. ఏం లేదులే’ అని గదిలోకి వచ్చాడు. డోర్ వేసుకున్నాడు. పచార్లు చేశాడు. హటాత్తుగా ఏదో అర్థమైంది. హటాత్తుగా ఏం అర్థమైందో. ఫోన్ తీసి వాడికి వాట్సప్ చేశాడు. ‘ఊరెళుతున్నా అమ్మను చూడ్డానికి. వచ్చాక మందేద్దాం’.. రెండు నిమిషాలకు బ్లూటిక్ పడి రెస్పాండ్ అయ్యాడు. ‘ఓ.. అదీ సంగతి. ఈ సంవత్సరంగా లాక్డౌన్ల రభసతో ఆమెను మిస్సయ్యి నా ప్రాణాలు తీశావు.’ ‘లేదురా. నా పెళ్లయ్యినప్పటి నుంచి ఆమె ఊళ్లోనే ఉంది’ ‘ఓ... సిటీలో ఉండలేదని అక్కడ పెట్టుంటావ్’ ‘లేదురా. ఆమెకు నా దగ్గర ఉండటమే ఇష్టం’... బ్లూటిక్ పడింది. రెస్పాండ్ కాలేదు. నిమిషం తర్వాత– ‘నీ భార్య మంచి కత్తి కేండేటా’... టైమ్ తీసుకున్నాడు. ‘ఇద్దరూ చేసే తప్పుల్రా ఇవి. ఒక్కరు గట్టిగా నిలబడినా చెడు జరగదేమోగాని మంచి జరుగుతుంది’ బ్లూ టిక్ పడింది. వెయిట్ చేశాడు. వాడు ఇక మాట్లాడేలా లేడు. బయటకు వచ్చాడు. పిల్లలు టీవీ చూస్తున్నారు. ఆమె వంట గదిలో కూర ఎక్కిస్తూ ఉంది. వెళ్లాడు. ‘ఉదయాన్నే అమ్మ దగ్గరకు వెళుతున్నా. కారులో. వచ్చేస్తా రెండు రోజుల్లో’ తిరిగి చూసింది. ఏమనుకుందో. ‘సరే’ ‘ఇంకో రెండ్రోజులు ఎక్కువున్నా విసిగించకు. తీసుకొస్తానేమో తెలియదు. ఇంకేం ఆలోచిస్తానో. మనం నిజంగా హ్యాపీగా ఉండటం మనకు అవసరమా కాదా’... అతని కళ్లల్లోకి ఆమె చూస్తోంది. అతనివి అలాంటి కళ్లు ఆమె ఎప్పుడూ చూళ్లేదు. ‘స్వామీ... ఇక వదిలిపెట్టండి’ ‘సరే’ రూమ్‌లోకి వచ్చాడు. బ్యాగ్ సర్దుకున్నాడు. త్వరగా భోం చేశాడు. ఐదు గంటలకు అలారం పెట్టుకున్నాడు. దారిలో డజను సింథాల్ సబ్బులు – నాలుగు పలకల ఎర్ర అట్టవి– తప్పక కొనాలని నిశ్చయించుకున్నాడు. మంచం మీద తల వాల్చాడు. నిద్ర పడుతుంటే సబ్బు వాసన అతణ్ణి తాకుతున్నట్టు అనిపించింది. అమ్మ వాసన కూడా. బహుశా అతడి ముక్కు అతణ్ణి క్షమించేసింది. -మహమ్మద్ ఖదీర్‌బాబు -
ఈవారం కథ: కొమ్ముల బర్రె
‘నీ సోపతులల్ల మన్నువొయ్య. నడీడుకచ్చిండు.. నెత్తెంటికెలు తెల్లవడ్డయి. తనెత్తు పిల్లలైరి. గింత సోయి లేకపోతె ఎట్ల? ఎవడు పిలిస్తె వానెంబడివడి పోవుడేనాయె. కుత్కెలదాక తాగుడు, అద్మరాత్రిదాక తిరుగుడు. ఎల్లెంకల సాపుక పండుడు. ఇల్లు ఇరువాటం యాన్నన్నవోని.. నీసట్టంకు అగ్గిదల్గ.. నాగండాన దాపురమైండ్రు’ వాకిట్లో అంట్లు తోముతున్న రాధవ్వ గిన్నెల్ని కోపంతో విసిరి కొట్టింది. ‘అయ్యలు కూడవెట్టిన ఆస్తుల్లేకపాయె. తాతలు సంపాయించిన జాగలు లేకపాయె. గిట్లపట్టి లేకుంట జేత్తె ఎట్ల ముంగట వడ్తది సంసారం? వొక్కదాన్ని ఎంతకని ఏడ్వాలె ఈ లేకి కొంపల! పాలిచ్చెబర్రె.. ఆయింత మూతి మీద తన్నిపాయె. చెంబెడో.. గిలాసెడో ఇత్తె శెక్కరి శాపత్త మందమన్న ఎల్లేది. ఇగ రేపట్నుంచి బిచ్చమెత్తుకుందురు తియ్యి..’ స్వరం పెంచింది రాధవ్వ.. చాప మీద అటూ ఇటూ దొర్లుతున్న గోవర్ధన్‌ను చూస్తూ. ‘వోబోడ్సోత్దానా ఏమొర్రుతున్నవే పోరడు పొయ్యి పొయ్యొస్తే? ఎమో.. రపరప వెట్టినవు. వానికి తిక్కవుట్టిందంటె ఈపు శింతపండు జేత్తడు ఏమనుకుంటన్నవో? అన్నది అత్త రామవ్వ.. కోడల్ని దబాయిస్తూ. ‘అవ్వో! బాగనే పొడుసుకరావట్టెనో..! ఉద్దార్కంజేసిండని కొడుకును మాట అననియ్యది’ అన్నది రాధవ్వ వెటకారంగా అత్త వైపు చూస్తూ. ‘నీయక్క.. నోర్ముయ్యకపోతె దౌడపండ్లు రాలగొడ్త ఏమొర్రుతన్నవే? పీకితెపీకని తియ్యి. నీ అయ్య అర్ణం కొట్టిచ్చినాడే బర్రెను? తెల్లారెటల్లకు అసొంటియి పదిబర్లను కొన్కత్త. మూస్కొని పనిచూస్కొ’ అంటూ అటు తిరిగి పడుకున్నాడు గోవర్ధన్. ‘నెత్తిల పుండుకు సమరు లేదుగని ఎడ్ల కొట్టంల దీపం పెట్టొస్త అన్నడట ఎన్కటికెవడో నీ అసోంటోడు. గీ పొంకాలకేం తక్కువ లేదు’ అంటూ విసురుగా వంటింట్లోకి నడిచింది రాధవ్వ. తల్లి కోసం ఎదురు చూసి, చూసి అరుస్తున్న దుడ్డె గొంతు బొంగురు పోతోంది. ఒకవైపు దుడ్డె అరుపులు.. ఇంకో వైపు రాధవ్వ తిట్లతో గోవర్ధన్ తల గిర్రున తిరిగింది. ‘నితీషూ.. వోరి నితీషూ.. కొద్దిగాగినంక జెర బాయి మొకాన వొయ్యి బర్రెను ఇడ్శి పెట్టుబిడ్డా! మల్ల పగటాల్ల వరకు ఎనుకకు మర్రుత గని..’ అంటూ అంగీ గుండీలు పెట్టుకుంటూ చెప్పులు తొడుక్కున్నడు గోవర్ధన్. ‘నీయవ్వ నాకు అన్లైన్ క్లాసులున్నయి బాపూ.. నేను బర్రె కాడికి పోనే పోను. సార్ తిడుతడు క్లాసులు వినాలె’ అన్నడు నితీష్. ‘నా తోడు బిడ్డా జెల్ది వురికస్త. నర్సయ్య మామది చిన్న పంచాది వున్నది. జక్కపురం దాక పొయ్యస్త. పోకపోతె ఏమనుకుంటడురా.. దేనిౖకైనా పోను గొడతె వురికస్తడు. అన్నిటికి ఇంట్ల మనిషిలెక్క ఆసరయెటోడు. అట్ల పొయ్యి ఇట్లొస్త. టైంకు అమ్మ గూడ లేకపాయె! ఫోను తీస్కొనిపో! బర్రెను గుడ్డంలిడ్శిపెట్టు. అదే మేస్తది. నువ్వు క్లాసులు ఇనొచ్చు ’ అన్నాడు గోవర్ధన్ బయటకు నడుస్తూ. అయిష్టంగానే వొప్పుకున్నాడు నితీష్. బర్రెను విడిచిపెట్టి గుడ్డంల చింత చెట్టు కింద నీడకు చేరి క్లాసు విందామని ఫోన్lఅందుకున్నాడు. అందులో లీనమై బయట ప్రపంచాన్నే మరచి పోయాడు. ఓ గంటన్నరకు క్లాసులు అయిపోయాక పరిసరాల మీదకు దృష్టి మరల్చాడు. బర్రె కనిపించలేదు. ఎప్పుడు పోయిందో ఏమో! నితీష్‌కు భయం పట్టుకుంది. చుట్టు పక్కలంతా వెతికాడు. అక్కడున్న అందరినీ అడిగాడు. ఎవరూ జాడ చెప్పలేదు. చీకటిపడే వరకూ వెతికి ఇంటికి చేరి జాడ తప్పిన బర్రె విషయం తల్లికి చెప్పాడు. కూలికి పొయ్యొచ్చిన రాధవ్వ భర్త చేసిన పనికి కోపంతో తిట్ల దండకం మొదలుపెట్టింది. నడిజాము రాత్రి దాటినాక గోవర్ధన్‌కు మెలకువచ్చింది. జరిగిన సంఘటనలన్నీ వొక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. ‘బర్రె మ్యాత ముట్టక తిక్కతిక్క జేస్తున్నప్పుడే జెర చూస్కుంటే అయిపోయేది. పెద్ద నాయిన గూడా చెప్పిండు. పని వొత్తిల్లల్ల పడి మర్శిపొయిండు. బర్రె ఎద కచ్చినప్పుడల్ల గిట్లనే చేస్తది. దావఖానకు కొట్టుకపొయ్యి సూది ఏపిచ్చినా అయిపోవు. లేకుంటె.. జంగిట్ల తోలితె అండ్ల ఇత్తునంపోతులుండె. రెండ్రోజులైతే అదే సైరకచ్చు. ఎంత పనాయె ఎటని తిర్గాలె!’ అనుకుంటూ చింతాక్రాంతడయ్యాడు గోవర్ధన్. కొమ్ముల బర్రె చిన్నప్పుడు పాలు మరవక ముందే దాని తల్లి ఏదో బీమారి సోకి చచ్చిపోయింది. ఇది పాలు లేక తెల్లందాక పొద్దుందాంక వొకటే వొర్రుడు. నువ్వులు దంచి మ్యాకపాలల్ల కలిపి, బల్మీటికి నోరు తెరిపిచ్చి గొట్టం పట్టి పోసేది. కొద్ది రోజులైనంక చేన్లల్ల తిరిగి ఎన్నాద్రిగడ్డలు తెచ్చిపెట్టేది. తర్వాత ల్యాతగడ్డి, పజ్జొన్నకర్రాకులు, మెల్లెగ గర్కపోసలు అలవాటు చేసి.. పసిపిల్లలెక్క కంటికి రెప్పలా చూసుకునేది. మ్యాతపట్టినంక కుదురుకుని పెయ్యి చేసింది. నల్లరంగు, దొప్పలోలె చెవులు, దుప్పిలెక్క పెద్ద పెద్ద కొమ్ములు, ముప్పావు గజం వెడల్పు వీపు.. పెయ్యినున్నగ మెరుస్తుండె. తోకనైతె భూమికి రాసుకుంట పొయ్యేంత పొడవు. ఆఖర్న జడకు అందేంత వొత్తుగా నల్లగ నిగనిగలాడే వెంట్రుకలు ..అటూ ఇటూ తోక వూపుతూ నడుస్తుంటే సూడ ముచ్చటయ్యేది.. తోక వెంట్రుకల్లో పల్లేరుగాయలు, కూశెంగాల ముళ్లు అంటుకుంటే అన్నీ ఏరేసి శుభ్రంగా వుంచేది. ఒక్క గోమారి కూడా పట్టకుంట పీకేసేది. రోజూ సాయంత్రం ఇంటి కొచ్చే ముందు బోరు పైపుతోని నీళ్ళు వట్టి శుభ్రంగ పెయ్యంత కడిగేది. గున్నేనుగు లెక్క తిరుగుతుంటే.. అందరి కండ్లు దాని మీదనే. దిష్టి తగులుతుందని రాధవ్వ కుర్మదారానికి జీడి గింజలు, గవ్వలు కుచ్చి మెడల కట్టింది. పెద్ద ఈడు కూడా కాదు. రెండు ఈతలది. పొద్దుమాపు అయిదు లీటర్ల పాలిచ్చేది. ఇంటి ఖర్చంతా ఎల్లదీసేది. ఇంతకు ముందు రెండుసార్లు తప్పిచ్చుకొని పొయినా తెల్లారెవరకు అదే తిరిగొచ్చింది. ఇప్పుడు గూడా రాకపోతదా’ అనుకున్నాడు గోవర్ధన్. ఏదోకమూల సన్నని ఆశ మిణుకు మిణుకు మంటూండగా ఆ ఆలోచనల్లోంచి అతను బయటకు వచ్చేసరికి తెలవారసాగింది. తువ్వాలు భుజం మీద వేసుకొని తలుపు దగ్గరేసి.. చేతికర్ర తీసుకొని బర్రెను వెతకడానికి బయలుదేరాడు. పొలం దగ్గరకు వెళ్లేసరికి తెట్టన తెల్లారింది. ఎదురైన వాళ్లంతా బర్రె గురించి అడుగుతున్నారు. ‘బట్టల బైరనిగడ్డ మీద సిద్ధిపేటరాజిరెడ్డిగాడు పజ్జొన్న చేను అలికిండు. పచ్చగా నవనవలాడుతుంది. నాలుగు బుక్కలు మేసినా.. నామచ్చి సత్తది. ఇల్లు మునుగుతదిరా గోవర్దనూ! ముందుగాల అటు చూసి రాకపొయినవురా.. ’ అంటూ రంగయ్య నాయిన చెప్పేసరికి గోవర్ధన్‌కు చెమటలు పట్టాయి. ఎవరో తరిమినట్టు పరుగుపరుగున అటు వైపు నడిచాడు. పచ్చ జోన్న చేనంతా తిరిగాడు. ‘ఎక్కడా మేశినట్టులేదు. చేన్ల అడుగులు గూడ కనవడ్త లెవ్వు అంటె ఇటు దిక్కు రాలేదన్న మాట’ అని అనుకోగానే కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టయింది గోవర్ధన్‌కు. పక్కనున్న వాళ్లను ఆరా తీశాడు. ‘నిన్న పొద్దుగుంజాముల బలపాల బోరు దిక్కు అయితే వొర్రుడు ఇనవడ్డది’ అని చెప్పారు కొంతమంది. చూసుకుంటూ చూసుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. బండరాళ్ల మధ్య మోతుకు చెట్లను కొమ్ములతో కుమ్మినట్టు ఆకులన్నీ చినిగి కొన్ని కింద రాలి పడ్డాయి. గిట్టలతో మట్టిని గీరినట్టు అచ్చులు కనబడ్డాయి. మూత్రం పోసినట్టు మడుగు కట్టిన ఆనవాలుంది. పెద్ద పెండకడీ కనిపించింది గోవర్ధన్‌కు. ప్రాణం లేచొచ్చినట్టయింది. ‘కొమ్ముల బర్రె పంచాది పెట్టుకున్నట్టు.. ఎప్పుడూ ఏదో ఒకచెట్టును కొమ్ములతో ఇరగ్గొట్టేది. తాగినా గోళెం నిండ కుడితి తాగేది. మడుగు కట్టేదాక మూత్రం పోసేది. మోపెడు గడ్డిమేసి.. తట్టెడు పెండవెట్టేది.. గివన్నీ జూస్తే కచ్చితంగా బర్రె ఇటుదిక్కే ఎల్లిందన్నట్టు’ సీతను వెతుకుతూ వెళ్లిన రాముడికి చిన్న ఆనవాలు దొరికినట్టు గోవర్ధన్‌కు ఆశ చిగురించింది. దూరంగా పశువులు కనబడుతుంటే అటువైపు నడిచాడు గోవర్ధన్. పశువుల కాపరిని అడిగాడు.. ‘నిన్న సాయంత్రం బాపుదొర కంచెలకెళ్ళి బర్రె తిరిగినటు’గా చూచాయగా చెప్పిండు. చెట్టూపుట్టా చుట్టూ గాలిస్తూ.. వెళ్తున్న గోవర్ధన్‌కు వొర్రెలో దిగబడిన గిట్టల గుర్తులు కనిపించాయి. ‘ఇవి ఖచ్చితంగా కొమ్ముల బర్రెవే! వెడల్పుగా, కాగితం మీద ముద్ర గొట్టినట్టు స్పష్టంగా అగు పిస్తున్నయి. అంటే ఇటువైపే ఎల్లుంటది’ అనుకున్నాడు. అలా కొంత దూరం అడుగులు చూస్తూ వెళ్ళినప్పటికీ అవి మట్టితడిగా వున్నంత వరకే కనిపించాయి. వొర్రె దాటాక గోవర్ధన్ ఆశలు ఆవిరైపోయాయి. పొద్దు నెత్తి మీది కొచ్చింది. సూర్య కిరణాలు సూదుల్లాగ పొడుస్తున్నాయి. కళ్లకు చీకట్లొస్తున్నాయి. నడిచే వోపిక లేదు. మొఖం కూడా కడగ కుండా పక్కబట్టలోంచి లేచినవాడు లేచినట్టే బయలుదేరాడు. తెలియకుండానే పూట గడిచి పోయింది. కడుపులో ఏమన్నా పడితే తప్ప కాలు కదలని పరిస్థితి. ఆయాసపడుతూ బండ్ల బాటకొచ్చాడు. ఊర్లోకి వెళ్తున్న ఓ రైతును ఆపి బండి ఎక్కి ఇంటి మొహం పట్టాడు గోవర్ధన్. రాత్రి తిట్టనైతే తిట్టింది కానీ రాధవ్వ మనసు మనసులో లేదు. ఒక మబ్బున నోట్లో మంచి నీళ్లు కూడా పోయకుండా వెళ్లినవాడు.. మిట్ట మధ్యాహ్నం అయినా రాకపోయే సరికి ఆందోళన అలుముకుంది. ‘ఆకలికి అసలే వోర్సుకోడు. పాపపు నోటితోని తిట్టరాని తిట్లు తిడితి. నా నోరు పాడుగాను’ అనుకున్నది. ‘వాడెమన్న శిన్నపిలగాడాయే ? వాడే వత్తడు తియ్యి . నువ్వైతె బుక్కెడంత తినుపో.. ఎంత సేపుంటవు’ అంటూ రామవ్వ .. కోడలికి సర్దిచెబుతుందో లేదో.. ఇంట్లోకి అడుగుపెట్టాడు గోవర్ధన్. వచ్చీరాంగానే కాళ్లు, చేతులు కడుక్కొని కూర్చున్నాడు.. అలసట తీర్చుకుంటున్నట్టుగా. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాధవ్వ పళ్లెంలో అన్నం పెట్టుకొచ్చి గోవర్ధన్ ముందు పెట్టింది. ఆకలి మీదున్న గోవర్ధన్ పెద్ద పెద్ద ముద్దలతో గబగబా తినసాగాడు. పది నిముషాల వరకు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ‘ఏమన్న మతులావు దొరికిందా’ మెల్లగా కదిలిచ్చింది రాధవ్వ. ‘ఎవ్వన్నడిగినా ఇక్కడ చూసినం.. అక్కడ కనవడ్డది అంటండ్రుగని కండ్లనిండ చూసినోడు ఎవడు లేడు. విఠలపురం పొలిమెర దాక పొయ్యచ్చిన. అదెప్పుడో దాటిపొయినట్టున్నది ’ చెప్పాడు గోవర్ధన్ నిరాశగా. ‘నువ్వేం పికరు వడకు.. బెండ్లబాలక్క దగ్గర వల్లు పట్టిచ్చుకచ్చిన. అది తూర్పు మొకాన్నే తిరుగుతందట. తప్పక దొరుకుతదని చెప్పింది. మైసవ్వతల్లికి ముక్కుపుల్ల తీసి ముడుపు గట్టిన. మన సొమ్ము యాడికిపోదు. నువ్వు రందిల వడకు’ గోవర్ధన్‌కు ధైర్యం చెప్పింది రాధవ్వ. ‘సరే తియ్యి మనకు బాకి ఉంటె దొర్కుతది లేకపోతె లేదు. ఏంజేత్తం’ అంటూ భోజనం ముగించాడు గోవర్ధన్. రాధవ్వ చెప్పినట్టు తూర్పు దిక్కున మాచాపురం పొలిమెర దాక వెళ్లాడు గోవర్ధన్. మొక్కజొన్న చేనుల్లో కలుపు తీస్తున్న వాళ్ల దగ్గర వాకబు చేశాడు. ‘నిన్ననైతే ఎవల్దో బర్రె లింగారెడ్డి పటేలు తుకంల పండి పొర్రిందట.. నాలుగు సంచుల వడ్లమొలక కరాబైందట. దొర్కవట్టి బంజారు దొడ్లె కట్టేశిండ్రట. ఆగ్రమైన కోపం మీదున్నడు. పాయెమాలు కట్టెదాక ఇడ్శిపెట్టడు. అంతేగాదు, బర్రె ఎవన్దోగని వాడైతె దొర్కాలె.. వాని సంగతి చెప్తా అని ఎదురు చూస్తండు.. మైలపోలు తీస్తడుపో’ అని చెప్పింది ఒక రైతు కూలి. గోవర్ధన్‌కు వెన్నులో వణుకు పుట్టింది. ఇంతకు ముందు కూడా లింగారెడ్డి గురించి విన్నాడు. ‘మొండోడు..వొట్టి కసిరెగాడు..ఎంతకైనా తెగిస్తడు. అయితేంది, పడితె రెండు దెబ్బలు పడితెవాయె..జర్మానా ఎంతైనా కడితెవాయె.. కాళ్ళో.. కడుపో పట్టుకొని బతిమిలాడ్తెవాయే.. నా బర్రె దొరికితె చాలు’ అనుకొని ఊరి వైపు నడిచాడు. కచ్చీరు దగ్గర జనం గుమిగూడారు. దారి తీసుకుంటూ ముందుకు వెళ్ళిన గోవర్ధన్ కుర్చీలో కూర్చున్న పెద్దమనిషికి తను వచ్చిన పని చెప్పాడు. గోవర్ధన్‌ను ఎగాదిగా చూసిన అతను ‘ఏమయ్యా.. గంత సోయిలేకుంట ఎట్లుంటరయ్యా.. కడుపుకు అన్నం తింటలేరయ్యా? నోర్లేని పసులను మంచిగ కట్టేసుకోవాలె. ఓకంట కనిపెట్టుకోవాలె. వాటికి ఏమెర్క..యాడ పచ్చగ కనవడ్తె అటే పోతయి. మనం మనుసులం గదా జ్ఞానం ఉండాలె. ముందుగాల్నైతె చూసుకపో నీ బర్రె వున్నదేమో!’ అంటూ మస్కూరిని పురమాయించాడు బంజారు దొడ్డి గేట్ తెరవమంటూ. అతని మాటలతో గోవర్ధన్‌కు అరికాలి మంట నెత్తికెక్కింది. తమాయించుకున్నాడు.. ‘ఏంజేత్తం! ఊరుగాని ఊరు వానికి స్థానబలముంటది. ఇది తాను పంచాది పెట్టుకునే సమయం కాదు.. వోపిక కూడా లేదు’ అనుకుంటూ. లింగారెడ్డి ఆ పక్కనే కూర్చున్నాడు. రెండు కళ్లల్లో ఎర్రటి నిప్పులు రగులుతున్నట్టు కనపడుతున్నాయి. దొరికితే గొంతు కొరుకుదామన్నంత కసిగా చూస్తున్నాడు గోవర్ధన్ వైపు. భయపడుతూనే బంజరు దొడ్డి వైపు నడిచాడు మస్కూరి వెనకాలే గోవర్ధన్. లోపల అతని కళ్లు కొమ్ముల బర్రె కోసం వెతక సాగాయి ఆత్రంగా. అప్పటికే అందులో చాలా బర్లున్నాయి. దారి తీసుకుంటూ వెళ్ళి మూలమూలనా గాలించిండు. పదినిముషాల తర్వాత నిరాశగా బయటకు వచ్చాడు. ప్రశ్నార్థకంగా చూస్తున్న పెద్దమనిషికి అడ్డంగా తలూపుతూ సమాధానం చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాడు గోవర్ధన్. వెదుక్కుంటూ వెదుక్కుంటూ సలేంద్రిదాక చేరుకున్నాడు. ఊరు బయట.. ఒక పండు ముసలాయన జీవాలను కాస్తున్నాడు. అతని దగ్గరకు వెళ్లి ‘పెద్దయ్యా.. ఇటెక్కడన్న ఎనుపది కనవడ్డాదే’ అడిగాడు గోవర్ధన్. ‘ఎట్లుంటది బిడ్డా..’ తిరిగి అడిగాడు ఆ ముసలాయన ఎండపొడ నుంచి తప్పించుకునేందుకు ఎడమ చేతిని నొసటికి అడ్డం పెట్టుకుంటూ. కొమ్ముల బర్రె ఆనవాళ్లన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు గోవర్ధన్. ‘ఏమో..నిన్న ఎగిలివారంగనైతే ఒకSబర్రె ఊరవతల ట్రాన్స్ఫార్మర్ల కొమ్ములు ఇరికి షాక్ కొట్టి సచ్చిపొయిందట.. సూడుపో.. బిడ్డా! ఇంకా కరెంటోల్లు రాలేదట. అట్లనే వుంచిండ్రట’ చెప్పాడు ముసలాయన. గోవర్ధన్ ప్రాణం జల్లుమన్నది. కాళ్లుచేతులు చల్లబడ్డాయి. ‘నా బర్రె అయితె కాదుగదా! దీని కొమ్ములైతే పొడుగే వుండె. కొమ్ములతోని చిమ్ముడు అలవాటుండె. తన బర్రె అయితే కావొద్దని’ మనసులో కోటి దేవుళ్లకు మొక్కుకుంటూ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకి చేరుకున్నాడు. అక్కడి దృశ్యం చూసి చలించిపోయిండు గోవర్ధన్. నాలుగు కాళ్ళు బార్లాచాపి పడుంది బర్రె. నిన్ననగా చనిపోవడం వల్లనేమో కడుపు వుబ్బి రెండుకాళ్ళు పైకిలేచి వున్నాయి. నాలుక బయటకు వచ్చి రెండు దవడల మధ్య ఇరుక్కొని పోయింది. ఆ భయానక దృశ్యాన్ని చూడలేక పోయాడు. చచ్చిపోయే ముందు ఎంత నరకం అనుభవించిందో.. ఊహించుకుంటేనే ఒళ్లు జలదరించింది అతనికి. ‘పాపం ఎవరిదో బర్రె.. నాలాగే ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో యజమాని’ అని బాధపడుతూ ‘నా కొమ్ముల బర్రెకైతే ఇట్లాంటì æపరిస్థితి రాకూడదు’అనుకుంటూ వెనుదిరిగాడు గోవర్ధన్. అలాగే రెండో రోజుకూడా వెతుకులాట మొదలు పెట్టాడు. తిండిలేదు. నిద్రలేదు. పిచ్చి పట్టినట్టు ఒకటే తిరుగుడు. పోట్రవుతులు తాకి కాలివేళ్ళకు నెత్తురు కారుతోంది. ముండ్ల కంపలు చీరుకపొయ్యి కాళ్లుచేతులకు గీతలు పడ్డాయి. నిరాశ, నిస్పృహలు ఆవరిస్తున్నా కొమ్ముల బర్రె రూపం కండ్ల ముందు కదలాడుతుంటే వదులు కోవాలనిపించలేదు. ఇంటి వద్ద పాలకోసం అలమటిస్తున్న దుడ్డె మెదిలేసరికి చిన్నప్పటి కొమ్ములSబర్రె గుర్తొచ్చి గుండె బరువెక్కి గోవర్ధన్ కాలు ముందుకే కదిలింది. సలెంద్రి, కమ్మర్లపల్లె, అల్లిపురం ఇలా ఊర్లకూర్లు దాటి పోయాడు. మూడోరోజు సాయంత్రం అయినా ఆచూకీ లేదు. వెదకటం ఆపేద్దామని మొదటిసారి అనిపించింది గోవర్ధన్‌కు. మూడు రోజులుగా అలుపెరుగని ప్రాణం మెత్తబడ్డది. ‘పొద్దు గూట్లెవడ్డది. ఇప్పుడు వెనుకకకు మర్లినా ఇంటికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిదైతది’ అనుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. యెల్లాయపల్లె, కొచ్చెగుట్టపల్లె, రంగాయపల్లె.. ఊరూరూ ఆరా తీసుకుంటూ సొంతూరు చేరుకునే సరికి రాత్రి పది గంటలయింది. ఎప్పటిలానే ఇంటి ముందు నలుగురైదుగురు ముచ్చట పెడుతూ ఎదురుచూస్తున్నారు. తను వాకిట్లోకి రాగానేlరాధవ్వ ఇంట్లోకి నడిచింది. తెల్లవారు జాము నాలుగవుతుంది. ఇంటి వెనుక దిడ్డి దర్వాజ దగ్గర ఏదో అలికిడి అవుతున్నట్టనిపించి ఒక్కసారిగా మెలకువ వచ్చింది గోవర్ధన్‌కు. కళ్ళు నులుముకుంటూ లేచి బయటి లైట్ వేశాడు. గొళ్ళెం తీసి తలుపు తెరిచిన అతను నిశ్చేష్టుడయ్యాడు. ‘నిజమా.. భ్రమా..’ అనుకుని చేయి ముందుకు చాచాడు. వెచ్చగా తగిలింది ఊపిరి. కొమ్ముల బర్రె చెవులూపుతూ తదేకంగా తనవైపే చూస్తోంది. సంతోషం పట్టలేక కొమ్ముల బర్రె మూతిని రెండు చేతుల్లోకి తీసుకుని ఆర్తిగా తడిమాడు. సన్నగా అరిచింది బర్రె. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు ఇంట్లోకి పరుగెత్తుకెళ్లాడు. గోళెంలోని కుడితిని బకెట్లో నింపుకొని తెచ్చి బర్రె ముందు పెట్టాడు. పూర్తిగా పీల్చే వరకు కుడితిలో ముంచిన మూతిని పైకెత్తలేదు బర్రె. అలా రెండు, మూడు బకెట్లు తాగింది. మూతికంటిన తవుడును నాలుకతో అద్దుకుంది. ప్రతిరోజూ సాయంత్రం అది కుడితి తాగింతర్వాతనే గుంజ దగ్గరికి నడుస్తుంది. బయటకొచ్చిన రాధవ్వ ఆ దృశ్యం చూసి ఆనందం పట్టలేక పరుగుపరుగున దేవుడి పటాల ముందుకెళ్లి కళ్లు మూసుకొని చేతులు జోడించి నిలబడింది. అప్పటికే తల్లి వాసన పసిగట్టిన దుడ్డె అరుస్తూ మొగురం చుట్టూ తిరుగసాగింది. గోవర్ధన్ వచ్చి తలుగు తప్ప దియ్యంగనే తల్లి దగ్గరకు ఉరికిపోయింది దుడ్డె. ‘నీ కడుపుగాల పోరన్ని ఎంత తిప్పలవెడితివే? పెసరిత్తు పట్టకుంట తిన్నది ఎవని శేను ముంచెనో? మల్ల ఏమెర్కలేని సొన్నారోలె సూత్తంది’ అంటూ చేతి కర్రతోని గడ్డిగుంజ దగ్గరికి జరిపింది రామవ్వ. ఆ మాటలన్నీ లీలగా వినపడుతుంటే కలా.. నిజమా.. అనుకుంటూ మెల్లగా దుప్పటి పక్కకు జరిపి వాకిట్లోకి చూశాడు నితీష్. -కొండి మల్లారెడ్డి -
ఈవారం కథ: కేటరింగ్ బోయ్
చింకిచాప, అతుకులబొంత మీద పడుకున్న ఈశ్వర్ బద్ధకంగా దొర్లుతున్నాడు. జీర్ణావస్థలో ఉన్న దిండులో దూది, చిరిగిన గలేబు మృత్యుశయ్య మీద మరణానికి ఎదురుచూస్తున్న ముసలిరోగుల్లా ఉన్నాయి. వాటిని వదల్లేని ఈశ్వర్ పేదరికం కొన ఊపిరిని కాపాడాలనుకునే వెంటిలేటర్లా వెంటపడుతోంది. ‘నిన్న రాత్రి యామిని ఇచ్చిన కాగితంలో ఏమి రాసిందిరా?’ చక్రపాణి అడగడంతో జేబు తడుముకున్నాడు ఈశ్వర్. ‘చూసి చెపుతానులే’ ప్రాధాన్యంలేని విషయమన్నట్లు సమాధానం దాటేశాడు. ‘అమ్మాయి ఉత్తరం ఇస్తే ఇంతసేపు చూడకుండా ఎలాగున్నావురా?’ ‘ఇచ్చింది ప్రేమలేఖ కాదు. కాగితం ముక్క’ ‘నిన్ను మార్చడం నా వల్ల కాదురా’ తల కొట్టుకున్న చక్రపాణి, మరోమాట చెప్పకుండా ఆఫీసుకెళ్లాడు. ఈశ్వర్‌కి మూడేళ్ళ క్రితం దూరమైన యామిని గుర్తొచ్చింది. చదువుకునేరోజుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. స్థాయీ అంతరం అంతరంగాల ప్రేమకి అడ్డం పడింది. కల కరిగిపోయి యామిని పెళ్లి జరిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు గుండెకైన గాయం రేగింది. తేనెపట్టులోంచి రాయిదెబ్బకు ఎగిరిన తేనెటీగలా ముందురోజు జరిగిన సంఘటన మెదడులో మెదిలింది. ‘ఈశ్వర్, నువ్వు లక్కీచాన్స్ కొట్టేశావ్. నాలుగ్గంటలు పనిచేస్తే ఐదువందలు ఇస్తారు. భోజనం బోనస్’ చక్రపాణి చెప్పాడు. ‘నాలుగ్గంటలకు ఐదువందలా?’ నోరు వెళ్లబెట్టాడతను. ‘తర్వాత ఆశ్చర్యపోదువుగానీ పార్టీటైమ్ అయిపోతోంది. మా హోటల్ కేటరింగ్ సర్వీసుకి రెగ్యులర్ కుర్రాళ్లురాలేదు. మేనేజర్ నాకు తెలుసున్న కుర్రాళ్లని తీసుకురమ్మనాడు’ ‘వద్దులేరా. నాకు వడ్డించడంలో ఓనమాలు తెలియవు. అన్నం లేకపోతే నీళ్లు తాగి, కాళ్ళు కడుపులో పెట్టుకునిç ³డుకుంటాను. తేడా జరిగితే తిట్లు తినాలి’ ‘ఆ సంగతి నాకు వదిలేయ్ నేన ుచూసుకుంటాగా’ చక్రపాణి ధైర్యం చెప్పడంతో యూనిఫాం వేసుకుని కేటరింగ్ బోయ్‌గా బండి ఎక్కాడు ఈశ్వర్. పెద్ద వాళ్ళింట్లో పార్టీ. గుబులుగానే గుంపుతో అడుగులేశాడు. వణుకుతున్న చేతులతో చెంచా పట్టుకుని వడ్డనకు సిద్ధపడ్డాడు. ధైర్యం కుదుటపడుతున్న సమయంలో తనకళ్ళని తానే నమ్మలేక పోయాడు ఈశ్వర్. యామిని.. మూడేళ్ళ తర్వాత .. కనిపిస్తోంది. భర్తతో పార్టీకొచ్చింది. ఆమె నడచి వస్తున్న నగల దుకాణంలా ఉంది. ఆమె వేసుకున్న నగల విలువ అంచనాకి అందని టెండర్లా ఉంది. వజ్రాలహారం మీద పడ్డ దీపాలకాంతి మొహం మీద పడుతూ దేవకన్యలా వెలిగిపోతున్న ఆమెను మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోంది. తెలియని బెరుకు వెనక్కి లాగేస్తోంది. అక్కడున్న జనం మహారాణి ముందు భటుల్లా వంగివంగి దండాలు పెడుతున్నారు. ‘మీకేం కావాలో చెప్పండి మేడం.. తెప్పిస్తా’ పళ్ళెంతో వెళ్తున్న యామినిని ఆపే ప్రయత్నం చేశాడో పెద్దమనిషి. యామిని ఆగలేదు. ఎవరినీ పట్టించుకోకుండా ఈశ్వర్ వైపే వెళ్తోంది. ఐదువందలకు ఆశపడ్డ ఈశ్వర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా వుంది. ఆమె కంటపడకుండా చేసిన ప్రయత్నం ఫలించేలా లేదు. యామిని దగ్గరకు వచ్చేస్తోంది. అతనిలో ఉద్విగ్నత పున్నమిరాత్రిలో సముద్రపోటులా పెరుగుతోంది. అతని పట్ల యామిని చూపుల్లో చులకన భావం కనిపించింది. ఆమె ఆలోచనల్లో మార్పొచ్చినట్లు ఆమె చూపులను బట్టి అర్థమవుతోంది. వెళ్లిపోతున్న యామిని.. కాగితమొకటి ఈశ్వర్ వైపుగా విసిరేసి వెనక్కి చూడకుండా వెళ్లిపోయింది. ఈశ్వర్æఆ కాగితాన్ని అసంకల్పితంగా జేబులో పెట్టాడు. గమనించిన చక్రి ‘యామిని ఏం విసిరిందిరా?’ అని అడిగాడు. సమాధానం చెప్పకుండా యూనిఫాం మార్చేసుకున్నాడు ఈశ్వర్. తర్వాత వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఇంటికి బయల్దేరారు. వాళ్ళతోపాటుగా మౌనం, చీకటీ అడుగులేస్తున్నాయి. రోడ్డు మీద గుంతల్లో నిలిచిపోయిన వర్షం నీళ్ళలో చిక్కటి చీకటి నల్లగా ఆక్రమించింది. దూరంగా కీచురాళ్ళ మోత వినిపిస్తోంది. వీధిలో అలికిడికి కుక్కలు మొరుగుతున్నాయి. ఈశ్వర్ గుండె బరువు.. యామిని వేసుకున్న నగల బరువు కన్న ఎక్కువగానే ఉంది. నియంత్రణ లేని నిశ్శబ్దం.. ఓపలేని నిశ్శబ్దం.. గుండె చప్పుడు వినిపించేంత నిశ్శబ్దం. మనిషి మోయలేనంత బరువుగా నిశ్శబ్దం. ఆ భయంకర నిశ్శబ్దంలోంచి అతనిలో ఊపిరి ఆగిఆగి తెరలుగాౖ బెటకొస్తోంది. ‘తప్పు చేశానురా చక్రీ.. ఈ అవమానం పడే కన్నా ఆకలిని భరించడమే హాయిగా ఉండేదేమో?’ ‘తప్పంతా నాదేరా! నేనే బలవంతంగా తీసుకొచ్చాను. ఒక్కసారి ఆ కాగితం..’ ‘ఇప్పుడు వద్దురా. చూస్తే తట్టుకునే శక్తి..’ ఈశ్వర్ ఏదో చెప్పబోయాడు. మాట పెగలటం లేదు. గొంతుకి బాధ అడ్డం పడుతోంది. మాట్లాడుకోకుండానే రూమ్కెళ్లారు. బద్ధకాన్ని వదుల్చుకున్న ఈశ్వర్‌కు.. పార్టీలో గుచ్చుకున్న యామిని చూపులు గుర్తుకొచ్చాయి. జేబులో కాగితం కసిగా నలిపేసి విసిరేశాడు. కాగితంలో ఏం రాసుంటుందనే ఆలోచన మనసుని స్థిమితంగా ఉంచలేదు. విసిరేసిన కాగితాన్ని తెచ్చుకుని విప్పిచూశాడు. ‘రెండురోజుల తర్వాత ఇంటికిరా’ కింద మొబైల్ నంబర్, అడ్రస్ రాసుంది. ‘ఏం రాసిందిరా మాజీప్రియురాలు?’ ఆఫీస్ నుంచి వస్తూనే అడిగాడు చక్రి. ‘అసలు ఎందుకు రమ్మందంటావు?’ చక్రపాణి చేతికి కాగితమిస్తూ అనుమానం బైట పెట్టాడు ఈశ్వర్. ‘హీనస్థితి గుర్తుచేసి అవమానించాలని పిలిచిందా!’ మనసులో సందేహం బైట పెట్టాడు. ‘అవమానించడానికి పిలవక్కర్లేదు. పార్టీ విషయమైతే తప్పు నా వల్ల జరిగిందని చెప్పు’ ‘వెళితే తెలుస్తుందిగా. అప్పుడు చూద్దాంలే. ఇప్పుడైతే వేడిగా టీతాగుదాం..’ సంభాషణ పొడిగించడం ఇష్టంలేక బైటికి తీసుకెళ్లాడు ఈశ్వర్. ∙∙ ఈశ్వర్ పెద ్దభవంతి ముందు నిలబడ్డాడు. నల్లటి గ్రానైట్ రాయి మీద బంగారు రంగు అక్షరాలతో ‘యామిని నిలయం’ అని అందంగా చెక్కి ఉంది. ఇంటి ముందు ఒకే నెంబరున్న కార్లు బారులు తీరి క్రమశిక్షణగా ఉన్నాయి. ఇల్లులా అనిపించలేదు. రక్షణవలయం మధ్య దుర్భేద్యమైన కోటలా కనిపించింది. లోపలికి వెళ్తున్న ఈశ్వర్ వేషం, భాష చూసిన సెక్యూరిటీ ఆపేశాడు. ‘యామిని మేడమ్‌కి ఈశ్వర్ వచ్చాడని చెప్పండి’ అనడంతో సెక్యూరిటీ ఫోన్లో మాట్లాడి, ‘మేడం మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు సార్’ అన్నాడు వినయంగా. లోపలికి నడిచాడు. పాలరాతి మెట్లు పాదముద్రలకు మాసిపోతాయని భయంతో పదిలంగా అడుగులేస్తున్నాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే సినిమా సెట్టింగ్లాంటి విశాలమైన హాల్. సీలింగుకి ఖరీదైన షాండిలియర్ వేలాడుతోంది. సూర్యుడు మకాం వేసినట్లు ఇంట్లో దీపాల వెలుగుకి కళ్ళు జిగేల్మంటున్నాయి. ఇల్లు్లవజ్రాలు పొదిగిన హారంలా ధగధగ లాడిపోతోంది. ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఇల్లంతా కలయ చూస్తున్నాడు. ఘల్లుఘల్లుమంటూ మెట్ల మీద నుంచి వస్తున్న మువ్వల చప్పుడుకి అటుగా చూశాడు. పూత పూసిన దర్పం నిలువెత్తు యామినై నడిచి వస్తున్నట్లుంది. ఆమెను చూసిన ఈశ్వర్ స్థాణువులా నిలబడి పోయాడు. ‘నిలబడ్డావేం? కూర్చో’ సోఫా చూపించింది. ఖరీదైన సోఫాలో కూర్చోడం ఈశ్వర్‌కి ఇబ్బందిగా అనిపించింది. ‘ఏం తీసుకుంటావ్.. కాఫీ,టీ, బోర్న్‌విటా , ఫ్రూట్ జ్యూస్?’ ‘ఒక గ్లాస్ మంచి నీళ్లు’ అంటూ ఈశ్వర్ చెప్పిన తీరుకి యామిని నవ్వింది. నవ్వినప్పుడు తళుక్కుమని మెరిసిన పన్ను పైన పన్ను చూస్తూ అలాగే ఉండిపోయాడు. లిఫ్ట్‌లోంచి పనమ్మాయి రెండు నీళ్ల గ్లాసులున్న ట్రేతో వచ్చింది. ఇంట్లో లిఫ్ట్ ్టఉండడం ఈశ్వర్ ఊహకందని విషయం. ‘ఇల్లు చాలా బాగుంది’ మంచినీళ్ళు గుటకలేస్తూ అన్నాడు. ‘కాఫీ తీసుకురా’ పనమ్మాయికి ఆర్డర్ వేసింది యామిని. ‘మూడు అంతస్తుల్లో పద్దెనిమిది గదులు ఉన్నాయి. మావారు నా పుట్టిన రోజు కానుకగా ‘యామిని నిలయం’ కట్టించారు’ మనసులోని అహంకారం మాటల్లో ధ్వనించింది. ‘ఇంట్లో ఎంతమంది..’ ఈశ్వర్ మాట పూర్తికాకుండానే చెప్పింది ‘మేమిద్దరమే’ అంటూ. ‘ఏమిటి పద్దెనిమిది గదుల్లో ఇద్దరే ఉంటారా?’ఆశ్చర్యపోయాడు. ‘ప్రస్తుతం ఒక్కదాన్నే ఉన్నాను. ఆయన బిజినెస్ పని మీద లండన్ వెళ్లారు’ ట్రేలోని కెటిల్స్, కప్పులతో వచ్చిన పనమ్మాయిని వాటిని టీపాయి మీదపెట్టి వెళ్లిపొమ్మని సైగ చేసింది యామిని. శిరసా వహించింది పనమ్మాయి. అక్కడ ఉన్న ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం అధికారం చెలాయిస్తోంది. ఒక కెటిల్లోంచి కాఫీ డికాక్షన్, మరో కెటిల్లోంచి పాలు కప్పులో పోసింది. దాంట్లోషుగర్ క్యూబ్స్ వేసి చెంచాతో కలిపి కప్పుని సాసర్లో పెట్టి అందించింది. కప్పుల చప్పుడుకి నిశ్శబ్దం చెదిరి పోయింది. కప్పు అందుకుంటుంటే ఈశ్వర్ చేతులు వణికాయి. ‘చేతులెందుకు వణుకుతున్నాయి?’ ‘ఏంలేదు’ మాటలు కూడా తడబడ్డాయి. ‘నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు’ హఠాత్తుగా అనేసింది. ‘ఏ పని?’ అర్థంకానట్లు అడిగాడు. ‘ఆరోజు పార్టీలో..’ మొహంలో చికాకు స్పష్టంగా కనబడింది. ‘అవసరం చేయించింది’ ‘నీ అవసరం డబ్బేనా?’ పర్సులోంచి నోట్ల కట్టలు తీసి టీపాయి మీద విసిరింది. ‘ఇంకా కావాలా? అవసరమైతే అడుగు’ మాటల్లో డబ్బు పొగరు కనిపించింది. ఆ క్షణంలో ఈశ్వర్‌కు వచ్చిన కోపం విద్యుత్తీగలో కనబడకుండా కదిలిన కరెంటులా ఉంది. తనని తాను సంభాళించుకున్నాడు. మౌనంగా డబ్బు తీసి పక్కన పెట్టాడు. ముట్టుకుంటేనే నిప్పు కాలుతుంది. ఆకలి బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. పైకిరాని మాటలు మనసులోనే కొట్టుకుంటున్నాయి. ఆత్మాభిమానానికున్న శక్తి గుండెల్ని బలంగా తట్టి లేపింది. ‘నీ పెళ్ళికి బహుమతి ఇవ్వలేదని బాధపడేవాడ్ని. ఇల్లు చూశాక ఇవ్వకపోవడమే మంచిదనిపించింది. ఈ ఇంటిలో నీకంటికి చిన్నదిగానే కనబడేది’ అతనన్న మాటకు ఆమె నవ్వింది. ఆ నవ్వులో అహంకారం కనిపించింది. ‘ నువ్వు మరచిపోలేని విలువైన బహుమతి ఇద్దామని ఉంది. చిన్నకోరిక తీరుస్తావా?’ లేచి నిలబడ్డాడు. ఊహించని ప్రశ్నకు యామిని కంగారు పడింది. ‘కంగారుపడకు. పెళ్ళైన స్త్రీని కోరుకునేంత బలహీనుడ్ని కాదు’ చెపుతోంటే స్వచ్ఛమైన సరస్సులో నిర్మలమైన పున్నమిచంద్రుడి ప్రతిబింబంలా ఉన్నాడు ఈశ్వర్. ‘ఏమిటో చెప్పు’ కంగారుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో అడిగింది. ‘మనమిద్దరం కలసి భోజనం చేయాలి’ ‘ఓస్! ఇంతేనా? నీకేం కావాలో చెప్పు. గంటలో ఏర్పాటు చేస్తా’ అంటూ పక్కనున్న బెల్ కొట్ట బోయింది. ‘ఇక్కడ కాదు. బైటకెళ్లాలి’ ఆశ్చర్యంగా చూసింది. ఆమెకు ఈశ్వర్ కొత్తగా కనిపించాడు. ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు అతను. ఆలోచిస్తోంది యామిని. అంగీకరించదనిపించి సోఫాలోంచి లేచి గుమ్మం వైపు కదిలాడు ఈశ్వర్. ‘అగు!’ అన్న ఆమె పిలుపుతో ఆగిపోయాడు ఈశ్వర్. ‘సరే! నీకోసం ఒప్పుకుంటున్నా. ఏ హోటల్‌కు వెళ్దాం?’ ‘నేను తీసుకెళ్ళేది స్టార్ హోటల్ కాదు. నా స్థాయి హోటల్. మనం వెళ్ళేది ఆటోలో’ ‘ఆటొలోనా? నా ఇంటి ముందున్న కార్లను చూసే చెప్తున్నావా? నేను గుమ్మం దాటితే ఏ కారు ఎక్కుతానో ఆఖరి క్షణం వరకు నాకే తెలియదు. అలాంటిది నాగుమ్మం ముందే ఆటో ఎక్కితే..’ ‘నాలాంటి పేదవాడికి ఆటోలో వెళ్లడమంటే విమానంలో ఎగిరినట్టే. ఖరీదైన కార్లు ఎక్కే అర్హత లేనివాడ్ని. ఆటోలో వస్తే పనివాళ్ళ ముందు చులకన కదా! నీకు ఇబ్బందనిపిస్తే వద్దులే’ ఆమెలో అహాన్ని మాటలతో రాజేశాడు. ‘ఆఫ్ట్రాల్, నా దగ్గర పనిచేసే వాళ్ళ మాటల్ని నేను పట్టించుకోవడం ఏంటి? నాన్సె¯Œ ్స’ అంటూ బయలుదేరింది యామిని. ఇద్దరూ బయటకు నడిచారు. కారు లేకుండా తొలిసారిగా కాలి నడకన బయటకు వస్తున్న యామినిని చూసినవాళ్లు ఆశ్చర్య పోయారు. ఈశ్వర్ ఆటోని పిలిచేముందు జేబు తడుముకున్నాడు. కరెన్సీ నోటు స్పర్శ తగిలి ధీమాగా ఆటోఎక్కాడు. అతని దృష్టంతా తిరుగుతున్న ఆటో మీటర్ మీదే ఉంది. పైకి మాత్రం మొహమాటంగా నవ్వుతున్నాడు. ఆటో సిటీకి దూరంగా ఉన్న హోటల్ ముందు ఆగింది. ఇద్దరూ ఆటో దిగారు. తిరిగి ఇచ్చిన చిల్లర లెక్కపెట్టుకున్నాడు. హోటల్లోకి వెళ్ళాడు. జనంతో హోటల్ కిక్కిరిసి ఉంది. ‘టిఫిన్ తేవడానికి ఇంకా ఎంతసేపు?’ అంటూ హోటల్లోపల నుంచి అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ‘యామినీ.. లోపల ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మరో చోటకెళదామా?’ బైటకొచ్చి చెప్పాడు. ‘ముందే సీట్లు రిజర్వ్ చేయవలసింది ’ ఆమెలో విసుగు మొహం మీద కనిపించింది. ‘ఈ హోటల్లో బుకింగ్స్ ఉండవు. అందరికీ సదా స్వాగతమే’ నవ్వుతూ చెప్పాడు. ఇద్దరూ మరో హోటల్ వైపు నడిచారు. అక్కడ జనం కన్నా టేబుల్ మీద బొద్దింకలు, ఈగలే ఎక్కువగా ఉన్నాయి. చికాకుగా మొహంపెట్టి ‘ఇక్కడొద్దులే ఈశ్వర్. మరో చోటకు వెళదాం’ అంది. వేసవి ఎండ మండి పోతోంది. వడగాల్పులకు వదిలే శ్వాస వేడిగా వస్తోంది. నడవలేక యామిని ఆపసోపాలు పడుతోంది. నుదుటి మీద చెమటను రూమాలుతో తుడుచు కుంటోంది. దాహంతో గొంతు పిడచకట్టుకు పోతోంది. యామిని మొహంలో అలసట, కళ్ళలో నీరసం కనిపిస్తున్నాయి. ‘ఇక నావల్ల కావటంలేదు. ఆకలి చంపేస్తోంది. అర్జెంటుగా ఏదోకటి తినాలి’ అంటూ రోడ్డు పక్కన చెట్టు నీడలో నిలబడిపోయింది. ‘నా పరిస్థితీ అదే. మరో కిలోమీటర్ దూరం దాకా హోటల్స్ ఏం లేవు కానీ దొసెల బండి ఉంది. అక్కడ దోసెలు బాగుంటాయి తిందామా?’ అన్నాడు. ‘చెప్పానుగా ఎక్కడోక్కడ.. ఏదోకటి..! ఆకలితో కాలే కడుపుకి మండే బూడిద అంతే’ ‘బండి దగ్గర నిలబడి నువ్వు తినలేవులే. ఇక్కడే కూర్చో. నేనేతెస్తా’ అంటూ దోసెల బండి దగ్గరకు వెళ్లి దోసెలు తెచ్చాడు. అవురావురంటూ నాలుగు దోసెలు తినేసింది. ఎక్కిళ్ళు వస్తుంటే ఈశ్వర్ ఇచ్చిన కుండలో నీళ్లను గడగడా తాగేసింది. అప్పుడు యామినికి మినరల్ వాటర్ గుర్తుకు రాలేదు. ఆకలి తీరాక ఆయాసం తీర్చుకుంటోంది. వచ్చి నెమ్మదిగా పక్కనే కూర్చున్నాడు ఈశ్వర్. ‘ప్రపంచంలో విలువైనది, మనిషి బతకడానికి కావలసిందేమిటి?’ అని అడిగాడు. ఒక క్షణం ఆలోచించి ‘డబ్బు’ అంది. బిగ్గరగా నవ్వాడు ఈశ్వర్. ఆసహనంగా చూసింది యామిని. ‘డబ్బులో పుట్టిపెరిగిన నీకు అదే తెలుసు’ ‘దరిద్రం నుంచి వచ్చిన వాడివిగా నీకు తెలిసిందేమిటో చెప్పు’ కోపంతో ఆమె మాట అదుపు తప్పింది. ‘నిజమే.. నేను పేదరికంలో పుట్టాను. దరిద్రంలోనే బతుకుతున్నాను. నా బతుకు దరిద్రానికి కేరాఫ్ ఎడ్రస్. దరిద్రుడు అనేది నాలాంటి వాళ్ళకుండే బిరుదు’ ఈశ్వర్ శాంతంగా సమాధానం చెపుతోంటే యామిని తప్పు తెలుసుకుంది. ‘సారీ ఈశ్వర్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను’ ‘ఫర్వాలేదు. చదివించిన తల్లితండ్రులకి చేదోడుగా ఉండి ఋణం తీర్చుకోలేని దౌర్భాగ్యుడిని. నన్ను ఆ మాటనడం సబబే. నన్ను మీ ఇంట్లో ఓ ప్రశ్న అడిగావు.. గుర్తుందా?’ ఏమిటన్నట్లుచూసింది. ‘పార్టీలో కేటరింగ్ సర్వీస్ ఎందుకు చేశావని’ గుర్తు చేశాడు. అవునన్నట్లు తలూపుంది యామిని ‘నన్ను అభిమానించే వ్యక్తిగా నీకు నా బతుకు పట్ల బాధ సహజం. కానీ మీ జీవితాల్లాగా మాలాంటోళ్ల బతుకు వడ్డించిన విస్తరి కాదు. మెతుక్కోసం వెతుక్కునే బతుకులు మావి. నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళడం కోసం ఏ పనైనా చేస్తాం. నేను అదే చేశాను. కడుపులో ఆకలి మంటని ఆర్పడం కోసం కేటరింగ్ బోయ్ పని చేశాను’ అని చెపుతోంటే ఈశ్వర్ గొంతు గాద్గదికమైంది. అక్కడున్న గ్లాస్‌లోని నీళ్లను గుటకేసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ‘ఎన్నో స్టార్ హోటల్స్ చూసిన నువ్వు రోడ్డు పక్క బండిలో దోసెలు తిన్నావు. మినరల్ వాటర్ తాగే నువ్వు ఎప్పటి నీళ్ళో తెలియకుండానే కుండలో నీళ్ళు తాగావు. అదే ఆకలికున్న శక్తి. ఆకలేస్తే తినేది అన్నం. కరెన్సీ నోట్లు కావు. కోట్ల విలువైన భూములు కొన్నివేల ఎకరాలుండచ్చు. ఎవరికైనా కావలసింది ఆరు అడుగులే. అలాగే జానెడు పొట్టకు కావలసింది పిడికెడు మెతుకులే. ఎవరైనా ఆకలికి బానిసే. ఎంతటి వారైనా ఆకలికి దాసులే. ఆకలి ప్రపంచాన్ని శాసిస్తుంది. అందుకే సకల చరాచార సృష్టిలో విలువైనది ఆకలి. ఈ విషయం నీకు ఇంటి దగ్గరే చెప్పచ్చు. ఆకలి విలువ అనుభవపూర్వకంగా నీకు తెలవాలని ఈ పని చేశాను. మన్నించు’ మనసులో కొట్టుకుంటున్న మాటలు చెప్పి బరువు దించుకున్నాడు. ‘నేను ఇచ్చిన డబ్బులు తీసుకుని ఆకలిని తీర్చుకోవచ్చు కదా!’ ‘కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదో కాదు. అప్పుడే దాని విలువ తెలుస్తుంది. ముష్టితో బతికే బతుకు బతుకు కాదు. దొంగతనం చేసి సంపాదించవచ్చు. ఆ పని ఆత్మహత్యతో సమానం. మన సంపాదనలో నైతికత ఉండాలి. మనం చేసే పనివల్ల పరువు పోకూడదు. మన వల్ల పనికి గుర్తింపు రావాలి. పనిలో ఎక్కువ తక్కువలు చూడకూడదు. నిజాయితీతో ఆకలి తీరాలి. కుదిరితే నలుగురికి ఆకలి తీర్చాలి’ అంటూ పక్కనున్న గ్లాసులో మిగిలిన గుక్కెడు నీళ్లనూ గొంతులో పోసుకున్నాడు. యామినికి లిప్తపాటుకాలం ఆకలిని తట్టుకోలేక పోయిన నిజం గుర్తొకొచ్చింది. నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈశ్వర్ మాటల్లో నిప్పులాంటి నిజం ఆమెలో అహాన్ని కాల్చేసిన వాసన అక్కడ మెల్లగా వ్యాపిస్తోంది. అనుభవ పాఠాల్లో ఆరితేరిన అతన్ని చూస్తోంది.. అటుగా వస్తోన్న ఆటోని ఆపడానికి లేచాడు. అతనిని అనుసరించింది ఆమె. - పెమ్మరాజువిజయరామచంద్ర -
ఈవారం కథ.. తరంగం
పన్నెండు దాటింది. నిద్ర రావడం లేదు. ఆలోచనల్లో మునిగిపోయున్నాను. పదిరోజుల్లో నా జీవితం ఇంతలా మార్పు చెందుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. ∙∙ సోమవారం ఉదయాన్నే అలారం మోగింది. కళ్లు తెరిచాను. ఇంకా పడుకోవాలనిపించింది. కానీ బాస్ ఇచ్చిన పని గుర్తొచ్చింది. బద్ధకంగా ఉన్నా లేవాల్సి వచ్చింది. ఫార్మల్స్ వేసుకొని తయారయ్యాను. చాలా రోజుల తర్వాత కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది. వంట గదిలోంచి అమ్మ.. ‘అజ్జూ.. టిఫిన్ తిందువురా’ అంటూ పిలిచింది. ‘వస్తున్నా.. ’ అంటూ డైనింగ్ హాల్లోకి వచ్చాను. టేబుల్ మీద వేడి వేడి ఉప్మా ఆకలిని పెంచింది. కూర్చి వెనక్కి లాక్కొని కూర్చున్నాను. స్పూన్‌తో తీసుకున్న ఉప్మా వేడిని నోటి ద్వారా ఊదుతూ చల్లారబెట్టుకుంటూండగా అమ్మ వచ్చి నా పక్కన కూర్చుంది. ‘వెళ్లాల్సిందేనా నాన్నా.. ’ అని అడిగింది వెళ్లకుండా నేను తప్పించుకుంటే బాగుండు అన్న భావంతో. ‘తప్పదమ్మా.. చిన్న పనే కానీ చాలా ముఖ్యమైంది. వీలైనంత తొందరగా ముగించేసుకొని వచ్చేస్తా’ అని చెప్పా. ‘జాగ్రత్త.. త్వరగా వచ్చేసెయ్’ అంటూ లంచ్ బాక్స్ తెచ్చి నా బ్యాగ్‌లో సర్దింది. బ్యాగ్ తీసుకొని వెళ్లబోతూ ‘అవునూ.. కార్తీక్ ఎక్కడ?’ అని అడిగా. ‘వాడికి అంత తొందరగా తెల్లారుతుందా?’ నవ్వుతూ దీర్ఘం తీసింది అమ్మ. ‘ఔనౌను.. కుంభకర్ణుడి వారసుడు’ అంటూ నవ్వుతూ బండి స్టార్ట్‌చేశా.. గేట్ తోసుకొని వెళుతూ ‘ఓకే అమ్మా.. వెళ్లొస్తా... బై’ అని చెప్పేసి యాక్సిలేటర్ రైజ్ చేశా. ఒక్కసారిగా ఆఫీస్‌లో చాలామందిని చూసేసరికి మొహమ్మీది మాస్క్‌ను సరి చేసుకున్నా. ‘హలో అర్జున్.. ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది చూసి?’ అన్నాడు రవి. ‘హాయ్రా.. బానే ఉన్నా.. నువ్వెలా ఉన్నావ్?’ అడిగా. ‘నాకేంట్రా.. బానే ఉన్నా’ చెప్పాడు. ఈ ఆఫీస్‌లో చేరినప్పుడు మొదట పరిచయమైన వ్యక్తి రవే. ఫ్రెండ్లీ నేచర్ అతనిది. అందరితో సులువుగా కలిసిపోతాడు. ఎప్పుడూ సంతోషంగా.. అందరినీ నవ్విస్తూ ఉంటాడు. నాకు చాలా క్లోజ్ అతను. అలా ఇద్దరం మాట్లాడుకుంటూనే డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. ‘అర్జున్ .. ఇవ్వాళ మన సంతోష్ పుట్టినరోజు .. వాడు చిన్న పార్టీ ఇస్తున్నాడు’ అన్నాడు రవి. ‘పార్టీనా?’ ‘అవును. వాడు ఫోన్ మార్చాడట.. అందుకే నీ ఫోన్ నెంబర్ మిస్ అయినట్టుంది. నిన్ను పార్టీకి తీసుకురమ్మని నాకు చెప్పాడులే. ఈ రోజు ఈవెనింగ్..! మన ఫ్రెండ్స్ అందరూ వస్తారు.. నువ్వూ రావాలి.. వస్తావుగా!’ నేను మౌనంగా ఉండడం చూసి.. నవ్వుతూ నా భుజం మీద చెయ్వేసి ‘అన్ని జాగ్రత్తలు తీసుకుంటారులే.. భయపడకు’ అన్నాడు. చాలా రోజుల తర్వాత బయటకు రావడం.. వెళితే అందరినీ కలిసినట్టు ఉంటుందని వెళ్దామనే నిర్ణయించుకున్నా.. అయితే పార్టీలో మాస్క్ తీయకుండా.. ఫిజికల్ డిస్టెన్స్ మెయిన్టైన్ చేయాలనీ డిసైడ్ అయ్యి ‘సరే.. వస్తాన్రా’ అని మాటిచ్చా రవికి. పిచ్చాపాటీ అయిపోయాక సీరియస్‌గా పనిలో నిమగ్నమయ్యా. లంచ్ టైమ్‌లో అందరం దూరం దూరంగానే కూర్చొని లంచ్ కానిచ్చాం. తర్వాత వెంటనే మాస్క్ వేసుకొని నా డెస్క్‌కి వచ్చేశా. ఆఫీస్‌లో వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్లేసరికి సాయంకాలం నాలుగున్నరైంది. లంచ్ బాక్స్ నేనే కడిగి.. నా బ్యాగ్‌ను శానిటైజ్ చేసుకొని సరాసరి స్నానానికి వెళ్లా. ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి అమ్మ, కార్తీక్ కూర్చొని ఉన్నారు. ‘అమ్మా.. ఈ రోజు నా కొలీగ్, ఫ్రెండ్ సంతోష్ లేడూ.. వాడి బర్త్‌డే.. నైట్ చిన్న పార్టీ ఇస్తున్నాడు. వెళ్లనా?’ అడిగా. ‘చాలా మంది వస్తారేమో.. సేఫ్ కాదేమోరా! సెకండ్ వేవ్ అంటున్నారు.. ఈ టైమ్‌లో రిస్క్ అవసరమా?’ అంది అమ్మ. ‘జాగ్రత్తగానే ప్లాన్ చేస్తున్నారమ్మా..! అందరూ మాస్క్‌లు పెట్టుకొనే ఉంటారు. నేనూ తీయను. అయినా నువ్వు టీవీలో కరోనా వార్తలు చూడ్డం మానెయ్. వాళ్లు అలాగే భయపెడ్తారు. ఈరోజు ఆఫీస్‌కి వెళ్లినప్పుడు చూశాగా.. బయట అంతా నార్మల్‌గానే ఉంది. అందరూ మామూలుగానే తిరుగుతున్నారు. ఇన్నాళ్లూ ఇంట్లోంచి వర్క్ చేసీచేసీ బోర్ కొట్టిపోయింది. ఈ ఒక్కరోజు పార్టీకి వెళ్లొస్తా.. ప్లీజ్ అమ్మా.. ’ అన్నాను బతిమాలుతున్నట్టుగా. ఒప్పుకుంది అమ్మ. నేనూహించిన దానికంటే ఎక్కువమందే వచ్చారు పార్టీకి. చాన్నాళ్ల తర్వాత కలుసుకున్నామేమో అందరం.. కబుర్లు, జ్ఞాపకాలు, సరదాలతో ఇట్టే గడిచిపోయింది టైమ్. కేక్ కట్ చేయడానికి ముందు అందరం గుంపుగా నిలబడి బర్త్ డే సాంగ్ పాడాము. మా బృందంలోంచి ఒకరు ‘అయ్యో.. క్లాప్స్ కొట్టొద్దా? అరేయ్ సంతూ.. నీకెన్నేళ్లురా ఇప్పుడు?’ అని అడిగాడు. ‘ఒక డెబ్బై ఉంటాయేమో..!’ అన్నాడు రవి సరదాగా. దాంతో అందరూ నవ్వారు. ‘అవున్రా.. ఉంటాయ్. మరి అన్ని చప్పట్లు కొడతావా?’ అన్నాడు సంతోష్. ‘వామ్మో.. కొట్టలేనురా బాబోయ్..’ అన్నాడు రవి నవ్వుతూ. గ్రూప్ ఫొటో తీసే టైమ్ వచ్చింది.. అందరూ మాస్క్ తీసేశారు. తీయని వారినీ తీయమని ఫోర్స్ చేశారు. సెకండ్స్లో పనే కదా... అని నేనూ తీసేశాను. కరెక్ట్‌గా అందరం నిలబడి ఫొటోకి పోజ్ ఇచ్చే సమయానికి కెమెరాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. మరో రెండు నిమిషాలు అలాగే నిలబడాల్సి వచ్చింది మాస్క్ లేకుండా. ఫొటో సెషన్, డిన్నర్ ముగించుకుని ఇంటికెళ్లే సరికి రాత్రి తొమ్మిదిన్నర అయింది. అమ్మా, కార్తీక్ నాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కాళ్లు, చేతులు కడుక్కొని వచ్చి వాళ్ల పక్కన చేరాను. ‘పార్టీ ఎలా అయింది?’ అడిగాడు కార్తీక్. ‘బాగానే అయిందిరా’ ‘నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా?’ ‘హా.. అందరూ వచ్చారు’ ‘అయితే బాగానే ఎంజాయ్ చేసినట్టున్నావ్ కదూ..’ ‘అవునురా.. చాలా బాగనిపించింది’ కాసేపు వార్తలు చూసి.. నిద్రకుపక్రమించాం. కార్తీక్ నా గదిలోనే పడుకున్నాడు. కానీ మధ్యలోనే అమ్మ దగ్గరకి వెళ్లిపోయాడు నేను బాగా గురక పెడుతున్నానని. బుధవారం మధ్యాహ్నం... సంతోష్‌కు కోవిడ్ లక్షణాలు కనపడ్డాయని.. టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందనీ ... పార్టీకి వెళ్లినవాళ్లలో దాదాపు అందరికీ కోవిడ్ సోకిందని తెలిసింది. చాలా భయపడ్డాను. నాకు ఎటువంటి లక్షణాలు లేవు కానీ అమ్మకు కొంచెం ఒళ్లునొప్పులు మొదలయ్యాయని చెప్పింది. ‘నాకు రాకుండా తనకెలా వస్తుంది?’ అనుకున్నాను. ‘పనిమనిషి రావడంలేదు కాబట్టి కొంచెం పనిఎక్కువై అలసటతో వస్తున్నాయేమోలే’ అంది అమ్మ. రెండు రోజుల గడిచాయి.. శుక్రవారం అమ్మకు, కార్తీక్‌కు హై ఫీవర్ వచ్చింది. నాకు కొంచెం తలనొప్పి ఉండింది.. కానీ ఆఫీస్ వర్క్ ప్రెజరేమో అనుకున్నా. అయినా సరే ముగ్గురం కోవిడ్ పరీక్ష చేయించుకున్నాం. ఒక రోజు తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. నాది తప్ప. నా రిపోర్ట్ రావడానికి ఇంకో రోజు పడుతుందన్నారు ఎందుకో! అమ్మ, కార్తీక్.. ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. అమ్మ చాలా భయపడింది. వాళ్లిద్దరూ ఇంట్లోనే ఐసోలేట్ అయ్యారు. నేను వాళ్లకు దూరంగానే ఉన్నాను. ఆ రోజు రాత్రి.. కార్తీక్ టీవీ చూస్తున్నాడు. వాడి పక్కనే అమ్మ నిలబడి ఏదో పని చేస్తోంది. హఠాత్తుగా ‘అమ్మా’ అంటూ గట్టిగా అరిచాడు కార్తీక్. బెడ్రూమ్లో పనిచేసుకుంటున్న నేను వాడి కేకకు కంగారుగా హాల్లోకి çపరుగెత్తుకొచ్చి ‘ఏమైందిరా’ అని అడిగా. నేల మీద పడిపోయి.. ఆయాసపడుతున్న అమ్మను చూశా. ‘ఒరేయ్.. హాస్పిటల్ తీసుకెళ్దాంరా..’ అంటూ కార్తీక్ సహాయంతో అమ్మను కార్లో కూర్చోబెట్టా. ఆ రాత్రి నాకు ఇంకా గుర్తు.. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి తిరిగి.. ఎంతో మందిని బతిమాలినా ఎక్కడా ఒక్క బెడ్ దొరకలేదు. ఇంట్లో కార్తీక్ ఒక్కడే. బయట కుండపోతగా వాన. జ్వరం, ఆయాసంతో మూలుగుతున్న అమ్మ. ఏం చేయాలో.. అర్థం కాలేదు. అంతా గందరగోళం.. అయోమయం. దుఃఖం తన్నుకురాసాగింది. మనసంతా దిగులు.. భయం.. ఆందోళన. ఆఖరికి రవికి కాల్ చేస్తే ఒక హాస్పిటల్ పేరు చెప్పాడు. అక్కడ బెడ్ దొరికింది. అమ్మకు ఆక్సిజన్ పెట్టారు డాక్టర్లు. కాసేపటికి అమ్మ కాస్త తేరుకుంది. ఆ రోజు రవి చేసిన సహాయం నేనెప్పటికీ మరిచిపోలేను. పీపీఈ కిట్ వేసుకొని అమ్మను కలవొచ్చు అని చెప్పారు డాక్టర్లు. వాళ్లు చెప్పినట్టే పీపీఈ కిట్ వేసుకొని అమ్మ దగ్గరకు వెళ్లా. ఏడుపు ఆగలేదు. నన్ను చూసి అమ్మ ‘నాకేం కాలేదురా.. చిన్నపిల్లాడిలా ఆ ఏడుపేంటిరా? నేను బాగానే ఉన్నా. ఇంటికొచ్చేస్తాలే. ఇల్లంటే గుర్తొచ్చింది.. కార్తీక్ ఒక్కడే ఉన్నాడు ఇంట్లో.. వెళ్లు.. వెళ్లి వాడిని చూసుకో. ఇక్కడ డాక్టర్లున్నారు కదా.. నన్ను వాళ్లు చూసుకుంటారులే! వెళ్లు.. ఇంటికెళ్లు’ అంది ఆయాసపడుతూనే. కళ్లు తుడుచుకుంటూ వెళ్లడానికి సిద్ధ పడ్డా.. ‘నానీ.. నువ్వు జాగ్రత్తరా.. కార్తీక్‌ను బాగా చూస్కో’ అంది అమ్మ. ‘సరే’ అన్నట్టుగా తలూపి ఇంటికి బయలుదేరాను. ఆ రాత్రంతా కలత నిద్రే. పొద్దున్నే వంట చేసి కార్తీక్‌కి పెట్టి.. హాస్పిటల్‌కు వెళ్లాను అమ్మ దగ్గరకు. ఆ రోజు ఆదివారం కావడం వల్లో.. కోవిyŠ పేషంట్స్‌ను ట్రీట్ చేస్తుండడం వల్లో ఏమో కానీ.. రిసెప్షన్ అంతా ఖాళీగా కనిపించింది. నేను అమ్మ ఉన్న గది వైపు వెళ్తుంటే రిసెప్షనిస్ట్ ఆపింది.. ‘మీరు కళావతి తాలూకా అండీ’ అని. ‘అవునండీ.. ఎందుకు? ఏమైందీ?’ అన్నాను గాభారాగా. ‘మిమ్మల్ని ఒకసారి డాక్టర్ గారు కలవమన్నారు. మీకే ఫోన్ చేద్దామని ట్రై చేయబోతున్నా.. అంతలోకి మీరే కనిపించారు’ అంటూ డాక్టర్ కన్సల్టెంట్ రూమ్ నంబర్ చెప్పింది రిసెప్షనిస్ట్. గుండెదడతోనే డాక్టర్ని కలవడానికి వెళ్లాను. ‘సర్... ’ అన్నాను లోపలికి రావచ్చా అన్నట్టుగా తలుపు చిన్నగా తీసి. ‘అర్జున్?’ అడిగాడు డాక్టర్. అవునన్నట్టుగా తలూపాను. ఏ భావం లేకుండా చూశాడు నా వైపు. నా మనసు కీడు శంకిస్తూనే ఉంది. ఆ చూపుతో అది బలపడింది. ‘ఐయామ్ వెరీ సారీ.. ఇందాకే మీ అమ్మగారు గుండెపోటుతో పోయారు’ అన్నాడు చిన్నగా. అంతే.. నా గుండె ఆగినంత పనైంది. అప్రయత్నంగానే కళ్లల్లో నీళ్లు. ‘అ.. అదే..ంటి.. నిన్న రా..రాత్రి బానే ఉంది కదా.. ’ మాటల కోసం కూడబలుక్కున్నాను. ‘అవును బాగానే ఉన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. చాలా ట్రై చేశాం.. బతికించలేకపోయాం.. రియల్లీ వెరీ సారీ’ అని డాక్టర్ చెబుతూనే ఉన్నాడు. కుమిలి కుమిలి ఏడ్చాను.. అమ్మలేని జీవితం ఊహించలేకపోయా.. నిలబడ్డవాడిని నిలబడ్డట్టే కుప్ప కూలిపోయా. కళ్లు తెరిచి చూస్తే.. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. నా పక్కన పీపీఈ కిట్‌లో డాక్టర్. ‘ మా అమ్మను చూడాలి’ అంటూ లేవబోయా. నీరసంతో కళ్లు తిరిగినట్టయి.. మళ్లీ అలాగే బెడ్ మీద పడిపోయా. ‘ప్లీజ్.. కదలొద్దు. మీ కండిషన్ అస్సలు బాగోలేదు. బెడ్ మీద నుంచి అంగుళం కూడా కదలడానికి లేదు.. ఎక్కడికీ వెళ్లడానికి లేదు’ అన్నాడు డాక్టర్. ‘నాకేమైంది? నేను బానే ఉన్నా.. నాకేం కాలేదు’ అంటున్నా... కానీ ఆయాసం వల్ల మాట్లాడ్డం కష్టమైంది. ‘చూశారా.. ఎలా ఆయాసం వస్తోందో? మీకూ పాజిటివ్ వచ్చింది’ చెప్పాడు డాక్టర్. ‘లేదండీ.. నాకేం లేదు. నేను బాగానే ఉన్నాను.. మా అమ్మ దగ్గరకు వెళ్లాలి’ అంటున్నాను. ‘ఎక్కడికీ కదలకూడదని చెప్పాం కదా.. మీవల్ల ఇతరులకూ కోవిడ్ సోకుతుంది. మిమ్మల్ని మీరు చాలా శ్రమపెట్టుకున్నారు.. అందుకే ఇప్పుడు మీ కండిషన్ క్రిటికల్‌గా మారింది’ హెచ్చరిస్తున్నట్టే చెప్పాడు డాక్టర్. నిశ్శబ్దంగా ఉండిపోయా.. శక్తిలేక.. ఆయాసంతో మాట రాక! ‘మీరు గానీ.. మీ తమ్ముడు గానీ ఇప్పుడు మీ అమ్మగారికి అంతిమసంస్కారాలు చేసే పరిస్థితిలో లేరు. అందుకే ఆ కార్యక్రమం మా సిబ్బందే చేస్తారు’ అన్నాడు డాక్టర్. అది విని నా మనసు మరింత బరువెక్కింది. చెప్పలేని ఆవేదన. ఇద్దరు పిల్లలు ఉండీ.. మా అమ్మ అనాథలా.. తెలియని వారితో అంతిమసంస్కారాలు చేయించుకుంటోంది. తను నాతో మాట్లాడిన ఆఖరి మాటలు గుర్తొచ్చాయి.. దిండు మీద తలవాల్చి .. కళ్లు మూసుకున్నాను. మా అమ్మనాన్నది ప్రేమ వివాహం. పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ల పెద్దలు ఇప్పటికీ మాట్లాడరు. అందుకే మాకు పెద్దగా బంధువుల్లేరు. నాన్న చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోయారు. అమ్మే మా ఇద్దరినీ పెంచి పెద్ద చేసింది. కంటికి రెప్పలా కాచుకుంది. నాన్న చనిపోయిన రోజు నాకింకా గుర్తు. ఇంట్లో నేను, కార్తీక్, అమ్మ ముగ్గురమే. అమ్మ ఒక మూలన కూర్చొని చాలా ఏడ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెకు మేమే సర్వస్వం. మా స్కూల్, కాలేజీ ఫీజులు కట్టడానికి తాను పడిన కష్టం అంతా ఇంతా కాదు. ‘లేవండి’ అంటూ ఎవరో పిలిచారు. కళ్లు తెరిచి చూశాను. నర్స్... భోజనం ఇచ్చి వెళ్లింది. మనసేమీ బాగాలేదు. తినాలనిపించలేదు. ఏదో తిన్నాననిపించుకుని కార్తీక్‌కు కాల్ చేశా. బానే ఉన్నానని చెప్పాడు. వాడికి అమ్మ గురించి చెప్పే ధైర్యం లేదు నాకు. అయినా లేని ధైర్యాన్ని కూడగట్టుకొని చెప్పాను. విషయం విన్నవెంటనే హతాశుడయ్యాడు. పెద్దగా ఏడ్చాడు. నాకూ దుఃఖం ఆగలేదు. ఎలాగోలా తమాయించుకొని వాడిని ఓదార్చాను. ఫోన్ పెట్టేశాక ఎన్నడూ లేని, రాని నీరసం, నిస్సత్తువ ఆవహించాయి నన్ను. అలా పడుకుండిపోయానంతే. మరుసటి రోజు ఐసీయూలో నా పక్కన ఉండే పేషంట్ చనిపోయాడు. వాళ్లవాళ్లు బయట నిలబడి ఏడుస్తున్నారు. నాకూ ఎంతో బాధయ్యింది. బయట పెరుగుతున్న కేసులు, లోపలి మరణాలు చూసి బాధతో కలిగిన భయానికి లోనయ్యాను. ‘అసలు ఎందుకిలా జరుగుతోంది? ఇదంతా ఎప్పటికి నార్మల్ అవుతుంది?’ అనిపించింది. బయట నార్మల్ అయినా మా ఇద్దరి జీవితాల్లో అమ్మలేని లోటు శాశ్వతం. ఏడ్చినప్పుడల్లా ఆయాసం వస్తోంది. బాగా గాలి పీల్చాలనిపిస్తోంది. రవికి కాల్ చేశాను. వాడు ఫోన్ ఎత్తలేదు. ‘ఏమైందో?’ అని భయపడ్డాను. బాధ, దుఃఖంతోనే ఆ పూట గడిచింది. రాత్రి నిద్ర పట్టలేదు. ఎటువైపు తిరిగినా నిద్ర రాలేదు. ఇటు అటు డొల్లుతూనే ఉన్నా. ఒంటిగంట దాటింది. కాసేపు లేచి అటు ఇటూ తిరిగాను. ఆయాసం వచ్చేసింది. మళ్లీ మంచం మీద వాలాను. మగతగా ఉంది. నిద్రలోకి జారుకున్నాను. మరుసటి రోజు.. మంగళవారం. అమ్మ.. ప్రతి మంగళవారం ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికెళ్లి దర్శనం చేసుకునేది. ప్రసాదాన్ని ఇంటికి తెచ్చేది.. ముగ్గురం కలిసి తినేవాళ్లం. అలా అమ్మను గుర్తు చేసుకుంటూండగా కార్తిక్ మాటలు వినిపించినట్టయి బయటకు వెళ్లాను. కనబడలేదు.. ఆ కారిడార్‌లో అటూ ఇటూ తిరిగాను. ఉహూ.. లేడు. అక్కడే ఉన్న నర్స్‌ను అడిగా ‘మా తమ్ముడు వచ్చాడా?’ అని. బదులేమీ చెప్పలేదు. అసలు నా వైపు చూడను కూడా చూడలేదు. నా నుంచి కోవిడ్ సోకుతుందని భయపడిందో ఏమో మరి! సడెన్‌గా ఎవరో ఏడుస్తున్నట్టని పించింది. ఆ ఏడ్చే శబ్దం ఎటు నుంచి వస్తుందో అటు వెళ్లాను. కార్తీక్ కనిపించాడు.. లాబీలో ఒక మూల ఒంటరిగా కూర్చొని. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ‘వీడిక్కడేం చేస్తున్నాడు?’ అనుకుంటూ పరుగెత్తుకెళ్లాను వాడి దగ్గరకు. అమ్మ గుర్తొచ్చి ఏడుస్తున్నాడేమో అనుకుని వాడి భుజం మీద చేయి వేశా. వాడు తలతిప్పి కూడా చూడలేదు. కనీసం చిన్న కదలిక కూడా లేదు వాడిలో. అలాగే ఏడుస్తూ కూర్చున్నాడు. ‘ఏడవకురా..! ఏదీ మన చేతుల్లో లేదు. మనం ఎంత ఏడ్చినా అమ్మ ఇంక తిరిగి రాదు. ఊర్కోరా’ అంటూ సముదాయించా. వాడు వినిపించుకోలేదు. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. నేనేమన్నా వాడు స్పందిచట్లేదు సరికదా కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. వాడికేమైనా అయిందా ఏంటీ? అని భయపడ్డాను. ‘కార్తీక్.. కార్తీక్ ’ అంటూ వాడి భుజాలు పట్టుకొని కదిపా. ఒక్కసారిగా లేచాడు. కళ్లు తుడుచుకుంటూ.. నిర్మానుష్యంగా ఉన్న ఆ లాబీలో అలా నడుచుకుంటూ మార్చురీ వైపు వెళ్లాడు. -దేవరాజు మహాలక్ష్మి -
ఈ వారం కథ: రాముడు- భీముడు
చేతికర్రను దడికి ఆనించి లోపలికొచ్చాడు రాముడు. పక్కనే ఉన్న తొట్టిలో చెంబుతో నీళ్ళు ముంచుకుని చేతులు కడుక్కున్నాడు. ఆ నీళ్ళు కాళ్ళ పైనే పడడంతో నిట్టూర్చుతూ ఇంటి దర్వాజ వైపు చూశాడు. తలుపు దగ్గరికి వేసి ఉంది. పక్కకి చూశాడు. బండపై బట్టలుతుకుతూ రెండో కోడలు కనిపించింది. ‘ఇట్రామ్మా... ఓ ముద్ద పడేయ్...’ సంశయిస్తూ పిలిచి, వసారాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ‘డెబ్బై యేళ్లొచ్చినా మూడు పూటలు తినకుండా ఉండలేవే! మాకేమో అరిగి చావదు. నువ్వు మాత్రం ముద్ద తక్కువైతే అల్లల్లాడిపోతావ్. ఏం పని వెలగబెడతావో... బట్టలు మురికి చేసి పెడతావ్. నీకేమన్నా పాలేర్లు ఉన్నారనుకున్నావా?’ అక్కసును కక్కుతూ పళ్ళెంలో అన్నం వేసుకొచ్చింది. ‘ఏంటోనమ్మా! ఏదో అంటన్నావ్. నాకేమో ఇనపడి చావదు. పిల్లోడు లేడా?’ ముద్ద కలుపుతూ అడిగాడు. ‘నీ చెవుడు మా చావుకొచ్చిందిలే. అరవలేక ఛస్తున్నాం. ఇగో... మంచినీళ్ళు! తిండం అయిపోతే పిలువ్. నేనెళ్లి బట్టలు ఉతుక్కోవాలి. మాకేం పాలేర్లు లేరిక్కడ!’ లోటాలో మంచినీళ్ళు పెట్టేసి విసవిసా వెళ్ళింది. అతను భోజనం చేశాక, స్నేహితుడు భీముడు చెంతకు వెళ్ళాడు. అతనెళ్ళగానే ఇల్లంతా మళ్ళీ కడుక్కుందామె. ∙∙ ఉగాది పండుగను పురస్కరించుకుని చైత్ర శుక్ల పాడ్యమి నాడు వేపపువ్వుతో తనువంతా అలంకరించుకున్న భీముడిని చూడగానే రెండో కోడలు తనపై కక్కిన అక్కసు ఆవిరైపోయింది. ఆప్యాయంగా భీముడిని నిమిరాడు రాముడు. తనువంతా కదిలించి ఆనందాన్ని తెలియజేశాడు భీముడు. అక్కడే చతికిలపడుతూ భీముడిని ఆర్తిగా చూశాడు రాముడు. ‘రెండో కోడలు ఎన్నెన్ని మాటలందిరా భీముడూ! నీ దగ్గర కూకుంటే కాత్తంత మట్టి అంటుతుంది. అది కూడా ఉతకలేరా? ఆల్లతో వాదించలేకే ఇట్టా చెవుటోడిగా ఉండిపోతున్నారా. ముద్ద పెట్టడానికీ ఏడుపే, బట్టలుతకడానికీ ఏడుపే!’ పెద్దవేరును తలగడగా మార్చుకుని పడుకున్నాడు రాముడు. అతనికి ఐదుగురు అన్నదమ్ములు. తండ్రినుంచి వచ్చిన ఇరవై సెంట్ల వాటా గ్రామ రహదారికి ఆనుకుని ఉన్న ఇళ్ళ స్థలంగా మారిపోయింది. రోడ్డుపక్కనుంచి చిన్న కాలువ వేయడంతో రెండు సెంట్లు కరిగిపోయి పద్దెనిమిది సెంట్లు మాత్రమే మిగిలింది. ఆ కాలువ ద్వారా వెళ్ళే నీళ్ళకు మట్టి కొట్టుకుపోకుండా అతని వాటాలో వేపమొక్క నాటాడు. నాటిన ఐదేళ్లకు బలమైన శాఖలతో విస్తరించిందది. పుష్టిగా ఎదగడంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు రాముడు. భుజ బలంలోనూ, గదా యుద్ధంలోనూ కౌరవ పాండవులలో సాటిలేని వీరుడిగా పేరొందిన భీమసేనుడు పేరు మీదుగా దానికి ‘భీముడు’ అని పెట్టుకున్నాడు. చెట్టు మొదట్లో ఎత్తుగా మట్టి పోసి కూర్చోవడానికి వీలుగా సరిచేసుకున్నాడు. దాంతో నలుగురు అక్కడకు రాసాగారు. జనం అలా ఒకచోటే చేరడంతో కల్లుగీత కార్మికుడైన మల్లన్న అక్కడే మకాం ఏర్పాటు చేసుకుని కల్లు కాంపౌండుగా వాడుకోసాగాడు. రాముడికి నలుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్ళు! ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతనికిచ్చిన ఐదు సెంట్లలో పెద్ద ఇల్లు కట్టి పదిమంది సంతానాన్ని నెట్టుకొచ్చాడు. కొన్నాళ్ళకు అతని భార్య కాలం చేసింది. రోజూ మల్లన్న వెళ్ళగానే ఆ చెట్టు మొదట్లో పడుకుని భార్య జ్ఞాపకాల్ని నెమరువేసుకోడం, ఆరోజు జరిగినవన్నీ చెప్పడం అతని దినచర్య. రాముడు బాధపడుతున్నప్పుడు భీముడు హోరుగా వీస్తూ ఆకులు రాల్చేవాడు. అతను ఆనందపడినప్పుడు మంద్రమైన రాగాన్ని ఆలపిస్తున్నట్లు ఆకుల్ని కదిపేవాడు. అతను చెప్పే ప్రతి మాటకు భీముడు స్పందించడంతో సాంత్వన పొందేవాడు. రెండో కోడలింట్లో జరిగిన సంగతి చెప్తూ బాధ పడ్డాడు రాముడు. అతని బాధను చూడలేక మెల్లగా గాలి వీస్తూ రాముణ్ణి నిద్ర పుచ్చాడు భీముడు. అతని ఓదార్పుకు కరిగిపోతూ అతని ఒడిలో కునుకు తీశాడు రాముడు. ఎవరో భీముడి రెమ్మల్ని విరుస్తున్న శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచాడు. వేపపువ్వు కోసం ముగ్గురు పిల్లలు ఇబ్బంది పడుతూ కనిపించారు. వారికి వేపపువ్వు కోసిచ్చాడు. అవి పట్టుకుని ఆనందంతో ఎగురుకుంటూ వెళ్ళారు పిల్లలు. వాళ్ళ మోములో విరిసిన సంతోషాల్ని చూశాక అతని మనస్సు తేలిక పడింది. ‘పిల్లలకేనా... మాకూ ఇచ్చేదుందా...’ అప్పుడే అక్కడకొచ్చిన సూరయ్య అడిగాడు. ‘మా భీముడు ఎవర్నీ కాదనడు’ అంటూ అతని చేతిలో కూడా వేపపువ్వు పెట్టాడు. అది తీసుకుంటూ చుట్టూ చూశాడు సూరయ్య. అతనెందుకలా చూస్తున్నాడో అర్థంకాక ‘ఏంటి సూరయ్య, దేనికోసం ఎతుకుతున్నావ్?’ అడిగాడు రాముడు. ‘మల్లన్న ఎల్లిపోయాడా, లేదా అని...’ ‘ఎల్లిపోయాడులే. చెప్పు...’ ‘ఆ మల్లన్నను ఇక్కడెందుకు కల్లు అమ్ముకోనిస్తున్నావ్? కుర్రోల్లంతా తాగుడికి బానిసలైపోతున్నారంటే వినవేం...’ ‘ఆ మల్లన్న మీద నీకెందుకంత దుత్త! మనం ఏ పనైనా చేసుకుని బతగ్గలం! కానీ, ఆ మల్లన్న అదొక్క పనే చేయగలడు. అదెంత కట్టమో తెల్సా... తాటిచెట్టు ఎక్కేటప్పుడో, దిగేటప్పుడో ఆడి నడుంకున్న తాడు తెగిందంటే ఆల్లావిడ మెడలో తాడు తెగినట్లే! అప్పుడా ఇల్లు రోడ్డున పడ్డట్టే! సిగరెట్లు, మందు తాగొద్దని ఎవరెన్ని చెప్తున్నా జనం ఇండం లేదు! ఆళ్ళకి లేని బాధ మనకెందుకు...’ ‘సరే! నీ ఇష్టం!’ నిర్వేదంగా అక్కడ్నుంచి నిష్క్రమించాడు సూరయ్య. మనుషుల తీరు ఒక పట్టాన అర్థం కాదు రాముడికి. ఎందుకిలా ఉంటారోనని ఆలోచనల్లో పడ్డ అతనికి ఎదురుగా తన నలుగురు కొడుకులు కనిపించారు. ఆస్తి పంపకాల్లో తనకి న్యాయం జరగలేదని చిన్నకొడుకు గొడవకు దిగాడు. అతను చేస్తున్న హంగామాకు చుట్టుపక్కల వాళ్ళు చేరి చోద్యం చూస్తున్నారు. ఎవరూ మధ్యలో కలగజేసుకునే బాధ్యతను తీసుకోలేదు. ‘నాకు న్యాయం జరగలేదు. పంపకాలు మళ్ళీ చేయాల్సిందే’ ఫిర్యాదు చేశాడు చిన్నకొడుకు. ‘పెద్దల్లో పెట్టే, అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం కదరా! ఇప్పుడేంటి ఈ తిరకాసు?’ అడిగాడు మూడోకొడుకు. ‘నీకిద్దరు కొడుకులు పుట్టేసరికి ఆస్తి మీద కన్ను కుట్టిందా?’ అన్నాడు రెండోకొడుకు. ‘కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టిందని ఇవన్నీ నీకెవరు నూరుపోశార్రా?’ అడిగాడు పెద్దకొడుకు. రాముడుకు తన తండ్రినుంచి సక్రమించిన పద్దెనిమిది సెంట్ల భూమిలో ముగ్గురు కొడుకులకు తలో ఆరు సెంట్లు పంచిచ్చాడు. ప్రభుత్వమిచ్చిన స్థలంలో కట్టిన ఇల్లును చిన్నోడికిచ్చాడు. కట్టినిల్లు చిన్నోడికి ఇచ్చాడని మిగతా ముగ్గురూ తండ్రిపై కోపంగా ఉన్నారు. మిగతా ముగ్గురికీ ఆరు సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి తనకు మాత్రం ఐదు సెంట్లలో ఇల్లు ఇచ్చాడని చిన్నోడు కోపంగా ఉన్నాడు. మొదటి ముగ్గురూ కాయకష్టం ఎరిగినోళ్ళు కాబట్టి స్వయంగా ఇల్లు కట్టుకోగలరని, చిన్నోడు చదువుకున్నోడు కాబట్టి పని చేసుకోలేడని ముందుచూపుతో కట్టినిల్లు రాసిచ్చాడు రాముడు. అతని ముందుచూపు వాళ్లకు ముల్లులా గుచ్చుకుంది. కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందాని లోలోన బాధపడ్డాడు. ‘చచ్చినోళ్ళను చితి కాలిస్తే బతికున్నోళ్ళను చింత కాలుస్తుందన్న సంగతి కూడా వాళ్లకి తెల్వట్లేదురా భీముడు!’ ‘ఇనపడదంటావ్. చురకలంటిస్తూనే ఉంటావ్. మాటలకేం కొదవ లేదు’ కోప్పడ్డాడు చిన్నకొడుకు. ‘వాళ్ళేం అంటున్నారో విన్నావంట్రా భీముడూ... పదిమంది సంతానాన్ని ఓ దారికి తెచ్చి, కూతుళ్ళ పెళ్ళిళ్ళు, కొడుకుల పెళ్ళిళ్ళు, వాళ్ళ పురుళ్ళు, పిల్లల ఆలనా పాలనా... ఎన్నని చెప్పన్రా నా బాధ! ముద్ద పెట్టడానికే ఏడుస్తున్నారంటే రేపు నన్ను తగలెయ్యడానికి కూడా ఏడ్చేలా ఉన్నార్రా. వాన రాకడ, ప్రాణం పోకడ తెలుస్తుందా? నాకెందుకురా ఆస్తులు! ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది. ఒకే కడుపున పుట్టిన వాళ్ళు ఒకరెక్కువ, ఒకరు తక్కువెలా అవుతార్రా?’ రాముడి బాధనర్థం చేసుకున్న భీముడు బలంగా వీస్తూ ఆకులు రాల్చాడు. అకస్మాత్తుగా చెలరేగిన దుమ్ము కళ్ళల్లోకి వెళ్ళకుండా అక్కడున్నవారు కండువాలు అడ్డం పెట్టుకున్నారు. భీముడు తనకు సంఘీభావం తెల్పడంతో అతనివంక ప్రేమగా చూశాడు రాముడు. తండ్రి గతం మొత్తం తవ్వుతుంటే బిత్తరచూపులు చూశారు అన్నదమ్ములు. అక్కడున్న వాళ్ళెవరూ వాళ్లకు మద్దతు తెలుపలేదు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో వాళ్ళక్కడ్నుంచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ‘నా బాధ నీకొక్కడికే అర్థమవుతుందిరా భీముడూ... ఆస్తి పంపకాల్లో భాగంగా నిన్ను కూడా అమ్మేసి డబ్బులు పంచమంటున్నారు. మనూరి గ్రామపెద్దకు పురమాయించారు కూడా! ఆయనకి నీమీద బాగా గురి! అందుకే ఎంత రేటైనా కొంటానని అడుగుతున్నాడ్రా. నిన్నెలా దూరం చేసుకుంటారా?’ భీముడు పొదిగిట్లో ఒదిగిపోయాడు రాముడు. భీముడు అందించిన ఆత్మీయ స్పర్శకు తల వంచాడతను. ఒక్కో ఆకు మెల్లగా రాల్చసాగాడు భీముడు. ఊహించినట్లే ఎవరూ కనిపెట్టని విధంగా వాతావరణంలో మార్పులు జరిగాయి. మూడు పూటలూ భోజనం చేయడానికి వాటాల ప్రకారం పద్దెనిమిదేళ్ళుగా నలుగురు కొడుకుల ఇంటికి తిరుగుతున్నా, రాత్రి పడుకోవడానికి మాత్రం చిన్నోడింటికి వచ్చేస్తాడు రాముడు. తన జీవిత భాగస్వామి ఆ ఇంట్లోనే కాలం చేసిందని, ఆమె జ్ఞాపకార్థం తాను కూడా ఆ ఇంట్లోనే కాలం చేయాలన్నది అతని కోరిక. పొద్దు పోయినా రాముడు ఇంటికి రాకపోయేసరికి గుమ్మంవైపు చూస్తూ కూర్చున్నాడు చిన్నకొడుకు. ఆపసోపాలు పడుతూ మల్లన్న అక్కడకు రావడంతో కంగారుపడ్డాడు. ‘ఏంటి మల్లన్నా... ఇలా వచ్చావ్?’ ‘అయ్యగార్ని ఎంత లేపుతున్నా లేవడం లేదు బాబు. నాకేదో భయంగా ఉంది. మీరోసారి రండి’ మల్లన్న చెప్పడంతో భీముడు దగ్గరికెళ్ళి పొదిగిట్లో నిద్రపోతున్న తండ్రిని తట్టి లేపాడు. అదతని శాశ్వతనిద్ర అని తెలియడానికెంతో సమయం పట్టలేదు. అతని కోరిక తీరకుండానే, అతని సమస్యను ఓ కొలిక్కి తేకుండానే కాటికి దగ్గరయ్యిన తండ్రిని చూసి కుమిలిపోయాడు. ఇంటిముందు శవాన్ని పడుకోబెట్టి బంధువులకు సమాచారమిచ్చాడు. ఆ రాత్రి గడిచింది. దహన సంస్కారాల నిమిత్తం చేసే ఏర్పాట్లలో కదలిక లేదు. కారణాలు తెలీక బంధువులతోపాటు గ్రామస్తుల్లో కూడా అనుమానాలు చెలరేగాయి. సంప్రదాయం ప్రకారం పెద్ద కొడుకే తలకొరివి పెట్టాలి కాబట్టి ఏర్పాట్లన్నీ చేసి తదుపరి కార్యక్రమాన్ని ముగించమని పెద్దలు సూచించారు. ‘సంప్రదాయమని నా మీదకు తోసేయ్యడం ఏం బాలేదు. మూడోవాడు ముసలోడి నుంచి రెండు గేదల్ని తీసుకుని, వాటినమ్ముకుని ఇల్లు కట్టుకోలేదా? రెండోవాడు పెళ్లవ్వగానే అసలేం పట్టించుకోకుండా వెళ్లిపోలేదా? అప్పులు చేసి చిన్నోడిని ఇంత చదువు చదివిస్తే హాయిగా ఉద్యోగం చేసుకోవడం లేదా? వీళ్ళందర్ని వదిలేసి నేనొక్కడినే చేయాలా?’ మొండివాడు రాజు కన్నా బలవంతుడన్నట్లు మూర్ఖంగా అందరివంకా చూస్తూ అన్నాడు పెద్ద కొడుకు. ‘ముసలోడి ఫించన్ డబ్బులన్నీ ఏమవుతున్నాయ్? వేప చెట్లమ్మిన డబ్బులు ఏం చేశాడు? రెండు సెంట్ల భూమి కొట్టుకుపోయినప్పుడు గోవర్నమెంట్ వోళ్లు డబ్బులిచ్చారుగా, ఏమయ్యాయి?’ మేమేం తక్కువ కాదంటూ కోడళ్ళు. గ్రామస్తులంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఆ వాదోపవాదాలకు గుండెల్లో గూడుకట్టుకున్న బాధలా ఆకాశంలో మబ్బులన్నీ ఒకేచోట చేరి వీక్షించసాగాయి. వాటి ఆవేదనను తెలియజేస్తున్నట్లు మెరుపులు మెరిశాయి. గాలులు వీచాయి. అనంతవాయువుల్లో కలిసిన రాముడి ఆత్మ అక్కడే తిరగసాగింది. వంతులేసుకోకుండా చితికి నిప్పంటించి తనకు మోక్షం కలగజేయమని ఘోషిస్తోంది. అతని కూతుళ్ళు తలోమాట అందుకున్నారు. ‘మీకసలు బుద్ధుందారా? తండ్రి శవం ముందు పెట్టుకుని సిగ్గు లేకుండా ఏంటా వాదులాటలు? అందరూ నవ్విపోతారు... నలుగురు కొడుకులుండీ కర్మకాండలు చేయలేందంటే ముసలోడి ఉసిరి తగులుతుంది... తలో చెయ్యి వేయండి...’ అంటూ మందలించారు. ‘ముసలోళ్ళు ఉండగా బోల్డంత తిన్నారుగా! అవేం గుర్తురావడం లేదా? మీరే వాటాలేసుకోండి. మీ ఆరుగురు అక్కాచెల్లెళ్లు తలో చెయ్యి వేస్తే తద్దినం కూడా ఘనంగా చేయొచ్చు. బావోళ్ళు కూడా ఇక్కడే ఉన్నారుగా...’ వాళ్ళన్న మాటకు కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకున్నట్లయ్యింది సోదరీమణుల పరిస్థితి. నచ్చజెప్దామనుకున్న గ్రామస్తులు వారి ప్రవర్తను చూసి ఆగిపోయారు. ఇంతలో భీముడు చనిపోయాడనే సంచలన వార్త అందింది. ఎంత పెద్ద తుఫానొచ్చినా, భీభత్సమైన గాలులు వీచినా తొణకని భీముడు ఇప్పుడు చిన్న ఈదురుగాలులకు నేలకొరగడం అందరికీ వింతగా తోచింది. నిజమో, కాదోనని నిర్థారించడానికి కొంతమంది వెళ్ళారు. విషయం తెలుసుకున్న రాముడి ఆత్మ భీముడి దగ్గరికి చేరుకుంది. నేలకొరిగిన భీముణ్ణి చూసి సంతోషిస్తూ, ‘నేనంటే నీకెంత ప్రేమరా భీముడు! నేను లేనని తెలిసి నువ్వే వచ్చేస్తున్నావా? నిజమేలే... నేను లేకపోతే నీకెవరు కబుర్లు చెప్తారు. నిన్నెవరు పట్టించుకుంటారు. వాళ్ళెలా వంతులేసుకుంటున్నారో చూడరా... కాటికి పోయిన పీనుగు, కట్టెల పాల్గాక ఇంటికొస్తుందా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడు...’ ప్రేమగా తడుముతూ అంది రాముడి ఆత్మ. అవునన్నట్లు తలూపింది భీముడి ఆత్మ. ‘రాముడి గురించి అందరికీ తెలుసు. కొడుకులుండగా నేను ఖర్చులు పెట్టుకోవడం సంప్రదాయం కాదు కాబట్టి ఈ వేపచేట్టును నేను కొంటాను. ఐదువేలు ఖరీదు చేసే చెట్టుకు పదివేలిస్తాను. కాదనకండి! కనీసం ఈ డబ్బులతోనైనా కార్యం జరిపించండి’ అని గ్రామ పెద్ద ప్రతిపాదించడంతో, కొడుకులేం అంటారోనని వారివంక చూశాయి కలిసిన ఆత్మలు. తమకొచ్చిన నష్టమేమీ లేదని భావించిన కొడుకులు వారి సమ్మతిని తెలియజేశారు. పుత్రుల స్వార్జితంతో జరగాల్సిన తండ్రి కర్మకాండలు బయటవాళ్ళ దయాదాక్షిణ్యాలతో జరుగుతున్నాయని రాముడి కూతుళ్ళు బాధపడసాగారు. అంతలో మల్లన్న జనంనుంచి ముందుకొచ్చి ‘అయ్యగారి దయవల్ల, భీముడి దయవల్ల నోట్లోకి నాలుగు మెతుకులు వెళ్తున్నాయ్. ఆల్లిద్దరి అనుబంధం గొప్పది కాబట్టే ఇద్దరూ ఒకేరోజు ఇలా... దయచేసి ఆల్లిదర్నీ ఏరు చేయొద్దు. భీముణ్ణి అమ్మేసి ఆరి బంధానికి ఖరీదు కట్టొద్దు. అయ్యగారు నా తాన ఒక్క రూపాయి ముట్టలేదు. ఈ కార్యానికయ్యే ఆ డబ్బేదో నేనే ఇత్తా. ఇట్టైనా నా ఋణం తీర్చుకోనివ్వండి ’ అంటూ రెండు చేతులెత్తి వేడుకున్నాడు. మా చేతికేం అంటుకోకుండా ఎలా జరిగినా మాకిష్టమేనన్నట్లు ‘మాకేం అభ్యంతరం’ లేద’న్నారు కొడుకులు. కందకు లేని దురద కత్తికెందుకన్నట్లు మౌనం వహించారు కూతుళ్ళు. తన కోరుకున్నట్లు భీముడు తనకు దక్కనందుకు గ్రామపెద్ద మల్లన్నవైపు కోపంగా చూశాడు. ‘నాదో సిన్న కోరిక బాబు... భీముడి పుల్లలతోనే రాముడి చితికి నిప్పంటించండి. అప్పుడు ఆల్ల ఆత్మలు సాంతిస్తాయి...’ అన్న మల్లన్న కోరికను స్వాగతించారు గ్రామస్తులు. ‘భీముడూ... చూస్తున్నావా? మల్లన్న మనిద్దర్నీ కలుపుతున్నాడురా. మన ఋణం తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందిరా... బతికుండగా ఓదార్పునిచ్చావ్, చచ్చిపోయాక నాతో నువ్వొస్తూ ధైర్యాన్నిస్తున్నావ్. నాకది చాలురా... మీ కుటుంబం చల్లగా ఉండాలి మల్లన్నా...’ అంటూ దీవించింది రాముడి ఆత్మ. మద్దతు తెలిపింది భీముడి ఆత్మ. ఊరిచివరనున్న శ్మశానంలో రాముడి దహన సంస్కారాలకు ఏర్పాట్లు జరిగాయి. పెద్ద కొడుకు చితికి నిప్పంటించాడు. ఎగసిపడే అగ్నిపర్వతంలా చితి జ్వాలలు చెలరేగుతుండగా భీముడి రెమ్మల్ని దానిపై వేశారు. అవి పచ్చిగా ఉన్న కారణంగా రాముడుకి కపాల మోక్షం ఆలస్యంగా లభించింది. భీముడు ఆత్మకు మోక్షం లభించగానే చుట్టుపక్కల వాతావరణమంతా దాని వాసన పరుచుకుంది. రెండు ఆత్మలు ఏకమై అనంత సృష్టిలో ప్రయాణం చేయసాగాయి. చదవండి: World No Tobacco Day: పొగాకు నమలడంతో వచ్చే సమస్యలివి.. -
ఈవారం కథ: క్షణం తర్వాత..
కొత్తరాజు అసలు పేరు వేరు. బతుకు తెరువు వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చినపుడు ఫలానా ఆయన అని చెప్పడానికి ఉపయోగించిన పేరు స్థిరపడిపోయింది. కొంత చేను కౌలుకు తీసుకున్నాడు. తర్వాత కాలంలో పొదుపుగా సంసారం నడుపుకుంటూ రెండెకరాలు కొనుక్కున్నాడు. ఆ ఊరిలో ఒక వీధి సందు చివర బంగాళాపెంకుల ఇల్లు కట్టుకున్నాడు. సడీ చప్పుడూ లేని ప్రాంతం. ఇంటి ముందు కొబ్బరాకుల దడి. పక్కన నిమ్మచెట్టు... మందారమొక్క...కొంచెం దూరంలో కొబ్బరిచెట్టు. అకస్మాత్తుగా కొత్తరాజుకు ఒక ఆలోచన వచ్చింది. అటూ ఇటూ చూశాడు. దడి దాక వెళ్లాడు. ఎవరూ వస్తున్న జాడ లేదు. ఎండ పొడి పొడిగా రాలుతోంది. నీడలు తూర్పు వైపు సాగుతున్నాయి. చెట్ల మీంచి పిట్టలు నిలయ విద్వాంసుల వాద్యగోష్టిలా సవ్వడి చేస్తున్నాయి. వాకిట్లో మనవరాలు చిన్ని బోర్లా పడుకుని కూనిరాగాలు తీస్తోంది. చిన్నిని తనకు అప్పగించి వంట గదిలో మురిపీలు చేయడంలో శాంతమ్మ, రమ తంటాలు పడుతున్నారు. మురిపీల్ని గోరుమిటీలు అని కూడా అంటారు. బొటనవేలు కనుపు మీదుగా ఒత్తుతూ అందమైన నగిషీలుగా పంచదార పాకంతో రుచికరమైన తినుబండారంగా తయారు చేస్తారు. వాళ్లిద్దరూ కనీసం గంట వరకూ బయటకు రారు. ఇదే అదను. తల్లీకూతుర్లిద్దరూ వంట గదిలో పనిలో ఉండగానే తన ఆలోచన అమలులో పెట్టాలి. కొత్తరాజు పంచెను మోకాలు పైకి బిగించి కట్టుకున్నాడు. ఇంటి వెనుక కొట్టుగది దగ్గరకెళ్లాడు. తలుపు తీసుకుని గునపం తీసుకున్నాడు. పార కోసం వెదికాడు. కనపడలేదు. గునపంతో మందారమొక్కకు మూడడుగుల దూరంలో తవ్వడం మొదలెట్టాడు. మట్టి గుల్లగానే ఉంది. పోటేసి చేతివేళ్లతో మట్టి తొలచి గోయి తవ్వాడు. రెండడుగుల లోతు...అడుగు వెడల్పు. చెమట పట్టింది. భుజం మీది తువ్వాలుతో ముఖం తుడుచుకున్నాడు. పక్కకు ఒరిగి ముక్కు చీదాడు. దగ్గొచ్చింది. తువ్వాలు అడ్డు పెట్టుకుని నెమ్మదిగా దగ్గాడు. ఇంతలో సుబ్బడొచ్చాడు. ‘ఖాళీగా ఉండవు కదా...ఏదో ఒకటి పుణుక్కుంటూనే ఉంటావు. ఏం చేస్తున్నావు? ’ సుబ్బడు అడిగాడు. కొత్తరాజులో కంగారు. బేలగా చూశాడు. వెంటనే గంభీరంగా మారిపోయాడు. ‘ఏం లేదు... ఏం లేదు...ఈవేళప్పుడు వచ్చావేంటి? మీ అమ్మాయిని తీసుకొచ్చేసావా? ’ మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. కొత్తరాజులో దాచుకున్నా దాయలేని తత్తరపాటు కనిపించింది. ఏదో దాస్తున్నాడని సుబ్బడు పసిగట్టాడు. పరిశీనగా చూశాడు. అర్థం కాలేదు. కొత్తరాజు ఎప్పుడూ అంతే. తోచింది చేస్తాడు. అనుకున్న పని నుంచి వెనక్కి తగ్గడు. అలుపు లెక్క చేయడు. నిరంతరం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాడని నలుగురూ అనుకోవాలి. తన దేహశక్తి మీద అపార నమ్మకం. చిన్నపుడు చేసిన ఘన కార్యాలు కథలుగా చెబుతుంటాడు. కొన్ని సంఘటనలు నమ్మశక్యం కాకుండా ఉంటాయి. అయినా చెప్పుకుంటూ పోతాడు. కొత్తరాజుకి చిట్కా ప్రయోగాలు ఇష్టం. అతని వ్యక్తిత్వంలోనే ఒక వింత దాగి ఉంది. ప్రతీదీ రహస్యమే. మామూలు విషయాన్ని కూడా అదేదో ముఖ్యమైనదన్నట్టు చెవిలో చెబుతాడు. భుజం మీద చేయి వేసి దూరంగా తీసుకెళ్లి రహస్యమన్నట్టు గుసగుసలతో గొంతు తగ్గించి మాట్లాడతాడు. తీరా చూస్తే ఏమీ ఉండదు. నలుగురిలో చెప్పే మాటే అయినా అలాగే చేస్తాడు. చుట్టూ జనం నవ్వుకుంటున్నా పట్టించుకోడు. అయినదానికీ కానిదానికీ గోప్యత పాటిస్తాడు. విచిత్రం ఏమిటంటే కాసేపటికే రహస్యం బట్టబయలవుతుంది. నూతి దగ్గరకెళ్లి చేతులు కడుక్కున్నాడు. సుబ్బడి చెంతకు వచ్చాడు.. ‘ సుబ్బా...కొంచెం పనుంది..రేవు కలుద్దాం’ మనవరాలిని ఎత్తుకుని ఇంటి లోపలికి వెళుతున్నట్టుగా అడుగులేసాడు. సుబ్బడు ఆశ్చర్యపోయాడు. సుబ్బడు సరదా కబుర్ల కాలక్షేపానికి వస్తాడు. గంటో రెండు గంటలో అవీ ఇవీ మాట్లాడుకుంటారు. ఊళ్లో సంగతుల్ని కలబోసుకుంటారు. ‘ఒక్క క్షణం... ఏవో నా బాధలు చెప్పుకోడానికి వస్తే...నన్ను వదిలించుకోడానికి చూస్తావ్... ఈవేళ ఉదయం నా కోడలితో జరిగిన గొడవకు చద్దామనుకున్నాను... అది చెప్పుకుందామని...’ నిష్టూరంగా అన్నాడు సుబ్బడు. కొత్తరాజు ఆగాడు. తీక్షణంగా చూశాడు. ‘ఏం మాట్లాడుతున్నావ్.. బుద్ధీజ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా? చచ్చి ఎవర్ని ఉద్ధరిస్తావ్... చస్తాడట... చస్తే ఏముంది? ఈవేళ ఒకటి రేపు రెండు....రోజులెళ్లిపోతాయి... సమస్య వస్తే బతికి సాధించు...అంతే గానీ చస్తాడట...వెళ్లు ...గోదాట్లో దూకు...ముందు ఇక్కడ్నుంచి బయటకు తగలడు...క్షణంలో సగం ఆలోచిస్తే ఎవడైనా బలవంతంగా చస్తాడా? ’ విసురుగా కోపంగా అన్నాడు కొత్తరాజు. అక్కడితో ఆగలేదు. అయిదు నిమిషాల పాటు తిడుతూనే ఉన్నాడు. సుబ్బడు నిర్ఘాంతపోయాడు. ముఖం మాడ్చుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కొత్తరాజు విరుచుకుపడటానికి కారణముంది. రెండేళ్ల క్రితం కొడుకు చిన్న మాట పట్టింపుతో కోడలితో దెబ్బలాడి పురుగుమందు తాగి చనిపోయాడు. అప్పట్నుంచీ అర్థంతర చావుల ప్రసక్తి వస్తే చాలు తనను తాను నియంత్రించుకోలేడు. కొడుకు శవం ఇంటికి రాగానే కనీసం ఏడవలేదు. కఠిన శిలలా ఉండిపోయాడు. ఎవరైనా ఓదార్చడానికి వచ్చినపుడు అతని ధోరణి వింతగా ఉండేది. ‘జీవితం నుంచి పారిపోయేవాడు నా కొడుకే కాడు. తండ్రిగా నన్ను చంపినోడు కొడుకేంటి? పుట్టలేదనుకుంటాను ’ అనేవాడు. మనవరాలిని ఖాళీగా ఉన్న పురి కట్టుకునే చప్టా మీద పడుకోబెట్టాడు. భుజం మీది తువ్వాలు గట్టిగా గాలిలో విదిలించాడు. తల చుట్టూ తలపాగాలా చుట్టుకున్నాడు. అచ్చమైన రైతులా ఉన్నాడు. మరోసారి వీధి వైపు చూశాడు. వెనక్కి వచ్చి ఇంట్లోకి తొంగి చూశాడు. ఎవరూ కనిపించలేదు. అంటే వంట ఇంట్లో పని ఇంకా పూర్తి కాలేదన్నమాట. అది అంత తొందరగా అయ్యేది కాదు. గోతి దగ్గరకు వెళ్లాడు. వంగొని దాని లోతును కొబ్బరాకు ఈనెపుల్లతో కొలిచాడు. ఎందుకైనా మంచిదని అదే పుల్లతో చిన్ని దగ్గరకెళ్లి సరి చూసుకున్నాడు. సరిపోతుందనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో రామమ్మ వచ్చింది. ‘ అదెందుకు... బాబుగారో...సాయానికి రానా?’ అని అడుగు ముందుకేసింది పైట సర్దుకుంటూ. రామమ్మ కేసి చూశాడు. పుష్టిగా ఉంటుంది. నల్లని కళగల ముఖం. పెద్దబొట్టు. మెడలో చెమటకు నానిన పసుపుతాడు. అస్తమానం పైటను చేతితో సవరించుకుంటుంది. ‘అబ్బే...అవసరం లేదు. ఎందుకొచ్చావ్? ఏం కావాలి?’ విసుగ్గా అడిగాడు. ‘నాకేమీ వద్దండి. అమ్మగారు ఊరగాయ పచ్చడి ఇత్తారని వచ్చాను ’ అని లోపలికి తొంగి చూసింది రామమ్మ.. చిన్నీ దగ్గరకెళ్లి చేతులూపి డాన్సు చేస్తున్నట్టు నటించి నవ్వించింది. బుగ్గ మీద చిటికె వేసింది. తల తిప్పి కొత్తరాజు కేసి చూసింది. ‘ఇంట్లో ఆడాళ్లు చాలా హడావుడిగా ఉన్నారు. రేపు రా...నువ్వొచ్చావని చెబుతాలే. ఇపుడు వాళ్లు నీకు దొరకరు. మాట్లాడేంత తీరిక లేదు’ అన్నాడు. ‘పలారం గానీ సేత్తనారేంటీ? అయితే అపుడే వత్తాన’ పైటను గట్టిగా పట్టుకుని అంది రామమ్మ. కొత్తరాజు నవ్వుకున్నాడు. వెనక్కి చూసుకుంటూ వెళ్లిపోయింది. ‘జిడ్డులా వదలదేమో అనుకున్నాను. అసలు నేనెందుకు భయపడుతున్నాను? ఇది రహస్యంగా చేయాల్సిన పనా?’ తొలిసారి అనుకున్నాడు. చిన్ని తనకేసే చూస్తోంది. ఎత్తుకున్నాడు. మూడేళ్లు దాటినా బుడి బుడి అడుగులేసే సమయం ఇంకా రానట్టే ఉంది. మాటలు కూడా సరిగ్గా పలకదు. కాళ్లు బాగానే ఉన్నాయి. తేడా ఏమీ ఉన్నట్టు అనిపించదు. ఎందుకో నడక ఆలస్యం అయింది. రమ బెంగ పెట్టేసుకుంది. తన బిడ్డ అవిటిది అవుతుందేమోనని భయపడుతోంది. ఎందరు ధైర్యం చెబుతున్నా వినడం లేదు. చిట్కా వైద్యం అమలు చేయాలనే తాపత్రయం తనది. చెబితే భరించలేరు. ఒప్పుకోరు. విడమరచి చెప్పినా అర్థం చేసుకోరు. అందుకే ఈ రహస్యపు ఏర్పాటు.... కొత్తరాజు ఆకాశం కేసి చూశాడు. పడమటి వైపున ఉన్న సూర్యుడికి నమస్కారాలు చేశాడు. చాక్లెట్టు చిన్ని నోట్లో పెట్టాడు. చప్పరిస్తోంది తాత కళ్లలోకి చూస్తూ. చిన్నిని జాగ్రత్తగా గోతిలో నిలుచోబెట్టాడు. మరో చాక్లెట్టును చేతిలో ఉంచాడు. మట్టిలో నడుము దాకా కప్పెట్టాడు. ఆడాళ్లు గంటసేపు ఇటు పక్కకు రాకపోతే చాలు. వస్తే రణరంగమే. వాళ్లకు సర్ది చెప్పడం కష్టం. ఒకరోజు ఇలా దొంగచాటుగా చేసింతర్వాత మరో రెండు రోజులు ఒప్పించి చేయొచ్చనుకున్నాడు. నడక కొంతమంది పిల్లల్లో ఆలస్యం అవుతుంది. తొందరగా నడక రానివాళ్లను గోతిలో నడుం దాక నేలలో పాతుతారు. అలా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి నడక వస్తుందని తాత చెప్పేవాడు. పూర్వం రోజుల్లో ఈ పద్ధతి అవలంబించేవారు. ఈ తరం వాళ్లకు మోటుగా అనిపిస్తుంది. ఎగతాళిగా ఉంటుంది. మట్టిని కాళ్లతో ఒత్తాడు. తర్వాత ‘కీ’ ఇస్తే గెంతులేసే బొమ్మను చిన్ని ముఖం దగ్గరగా ఉంచాడు. ఆ బొమ్మ ఆడుతుంటే చిన్ని సంతోషంగా నవ్వింది. సరిగ్గా అపుడే మరో ఆలోచన వచ్చింది. చిన్నికి తొందరగా నడక రావాలని దేవుడ్ని ప్రార్థించి కొబ్బరికాయ కొట్టాలనిపించింది. మానవ ప్రయత్నం ఒక్కటే సరిపోదనుకున్నాడు. కొబ్బరికాయ లేదు. కొత్తరాజుది మనసులో అనుకుంటే చాలు అది మొక్కుగా భావించే మనస్తత్వం. ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లలేడు. కొబ్బరికాయ సంపాదించడం ఎలా? చుట్టూ చూశాడు. ఎత్తు తక్కువ ఉన్న కొబ్బరిచెట్టు దగ్గరకెళ్లాడు. తల పైకెత్తి చెట్టును గమనించాడు. ఇరవై అడుగుల ఎత్తుంటుంది. కాయలు గుత్తులుగా ఉన్నాయి. కొత్తరాజు చూరున ఉన్న పలుపుతాడును అందుకున్నాడు. దానికి సాయంగా తాటినారతో నేసిన తాడుకూడా తీసుకున్నాడు. ఇలాంటి చెట్లను అవలీలగా ఎక్కగలిగే అనుభవం ఉంది. కొడవలిని తలపాగాలోకి అమరేలా జొనిపాడు. కొబ్బరిచెట్టు కాండం చుట్టూ వదులుగా పైకి జరుపుకునేలా పలుపుతాడు కట్టాడు. అలాగే తాటినారతో నేసిన తాడును చంక కిందుగా ఉండేలా బిగించుకున్నాడు. నెమ్మదిగా పలుపుతాడు మీద నిలబడి చేతులతో పైకి కదుపుతూ అంచెలంచెలుగా ఎక్కుతున్నాడు. సగం చెట్టు ఎక్కి కింద ఉన్న చిన్నిని చూశాడు. కళ్లు మిటకరించి అటూ ఇటూ తిప్పుతూ చూస్తోంది. ఒక కోడిపుంజు– పెట్టను తరుముతూ వచ్చి చిన్నిని చూసి ఆగిపోయింది. నవ్వుకుంటూ ఇంకా పైకి వెళ్లడానికి దృష్టి సారించాడు. మరో మూడడుగులు పాకాడు. ఆయాసంగా ఉంది. కాళ్ల సత్తువ చాలదనిపించింది. ఒక దశలో కిందికి దిగిపోదామనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా ప్రారంభించి తలపెట్టిన పని మధ్యలో వదిలేసి రావడం సుతరామూ ఇచ్చగించని మనిషాయె. ధీరుడు...సాహసికుడు ఎలా వెనుదిరుగుతాడు? ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకే వెళతాడు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కళ్లు తిరుగుతున్నట్టు అనిపించింది. ఇష్ట దైవాన్ని తలచుకున్నాడు. ఓపిక తెచ్చుకుని మరి కొంత దూరం పాకాడు. కడుపు భాగంలో గీసుకోవడంతో మంటగా ఉంది. ఎర్రగా కమిలింది. చురుక్కుమంటోంది. చలిచీమలు గుట్టలుగా పేరుకుని చెట్టు మీద బారులు తీరి తిరుగాడుతున్నాయి. ఇంకా కొంచెం శ్రమపడితే కాయలు చేతికందుతాయి. కంటిలో ఏదో పడింది. మండుతోంది. నలక లాంటి పురుగేదో పడింది. వేలితో కంటి లోంచి దాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు. కాసేపటికి బయటకు వచ్చేసింది.అమ్మయ్య...అనుకున్నాడు. కొబ్బరికాయ కోశాడు. చేతితో పట్టుకుని చప్పుడు రాకుండా ఉండటానికి గడ్డిమోపు మీదకు విసిరాడు. మిగిలిన గెలలోని కాయలు కోద్దామనుకున్నాడు. ఆ చప్పుడుకు ఇంట్లో వాళ్లు వచ్చేస్తారని భయపడి మానేసాడు. ఒక్క కాయ కోసం ఇంత సాహసం చేసాడంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. కిందికి చూశాడు. చుట్టుపక్కల తిరిగే ఊరకుక్క నేలను వాసన చూస్తూ చిన్ని దగ్గరకు వచ్చింది. చుట్టూ తిరిగింది. చిన్ని ఏడవడం మొదలెట్టింది. కుక్క ధైర్యంగా మరింత దగ్గరకు వెళ్లింది. అక్కడున్న బొమ్మను నాలుకతో నాకి కాళ్లతో తొక్కి చూసింది. కొత్తరాజు గమ్మున చెట్టు దిగాలనుకున్నాడు. కాళ్లు స్వాధీనంలోకి రాలేదు. గుండె బరువెక్కినట్లనిపించింది. ఊపిరి బిగపెట్టింది. శ్వాస తీయడానికి ఇబ్బందిగా ఉంది. చెమటలు పడుతున్నాయి. దేహంలో ఏదో తెలియని గందరగోళం. సన్నగా గుండెలో నొప్పి. నేలను చూడ్డానికి తల వంచాడు. కళ్లు మసక కమ్మాయి. రక్త ప్రసార చలనం ఆగినట్టుగా...ముసుగు కప్పిన పొరలు ...చీకటి తెరలుగా కమ్ముకుంటున్నాయి. చిన్ని ఏడుపు పెరిగింది. ఏడుపు చెవులకు సోకిందో ఏదైనా అవసరం పడిందో రమ ఇవతలకు వచ్చింది. చిన్నిని చూసింది. మతిపోయింది. ‘ నాన్నా ’ అంటూ అరచింది. తండ్రి కనిపించలేదు. ఎక్కడకు వెళ్లాడు? ఏం చేస్తున్నాడు? ఇంతలో ఏమైందంటూ ఆరా తీస్తూ శాంతమ్మ వచ్చింది. రమ ఏడుస్తూనే అక్కడే ఉన్న గునపంతో నెమ్మదిగా మట్టి తీస్తోంది. చిన్నిని గుండెకు హత్తుకుంది. తల్లి చంక ఎక్కగానే భుజం మీదకు వాలిపోయింది. ‘తాతయ్య ఎక్కడున్నాడూ...చిన్నీ ...తాత...తాత...’ అని అడిగింది. ఈలోపులో శాంతమ్మ గడ్డి మోపు మీద ఉన్న కొబ్బరికాయను చూసింది. తల పైకెత్తి చెట్టు పైకి చూడగానే భర్త కనిపించాడు. ‘ఏమండీ...అక్కడే ఉండిపోయారేంటి? దిగండి...’ అంది కొబ్బరిచెట్టు పైకి చూస్తూ. కదలిక లేదు. ఉలుకు లేదు. పలుకు లేదు. కొయ్యబారి ఉన్నాడు. అస్తవ్యస్తంగా ఒరిగి ఉన్నాడు. కొత్తరాజు ఇక లేడన్న సంగతి వాళ్లిద్దరికీ అర్థమవ్వడానికి ఎంతోసేపు పట్టలేదు. ఇద్దరూ ఏడుస్తూ చెట్టు మొదలనే కూలబడిపోయారు. ఊహించని సంఘటన. శాంతమ్మ స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత తతంగం జరగడానికి చాలా సమయం పట్టింది. ‘కొంతమంది అంతే. వయసు గమనించరు. ఇంకా బాల్యం లోనే ఉన్నట్టుగా అనుకుంటారు. లేకపోతే ఏమిటండీ? కొత్తరాజు ఇంకా కుర్రాడనుకుంటున్నాడా? ఆయన మాటలు చేతలు తెలిసినవాళ్లమే కదా. అలాగే అనుకుంటాడు. అన్ని వేళలా దుందుడుకుతనం పనిచేయదండీ... క్షణమన్నా ఆలోచించాలి కదా. క్షణం తర్వాత ఏముంది? అంతా శూన్యం ’ ఓ పెద్దాయన అంటున్నాడు. ‘బెట్టు చేయకుండా పెద్దరికాన్ని అంగీకరించాలి. అయ్యా... పెద్దోళ్లారా... కాస్తంత నిశ్శబ్దంగా ఉండండి. ఉన్న చోటున ప్రశాంతంగా గడపండి. ఇంకా బాల్యంలోనే ఉన్నామనే భ్రమ నుంచి బయటకు రండి. దయచేసి ఇదొక పాఠం అనుకోండి, నాయనలారా ’ ఓ కుర్రాడు చేతు జోడించి అక్కడున్న పెద్దలకు నమస్కరిస్తూ నాటకీయంగా అంటున్నాడు. చదవండి: ఈవారం కథ: భార్య -
ఈవారం కథ: భార్య
మిసెస్ ఒమూరా వంట గదిలో వున్నగడియారం వైపు చూసింది. సరిగ్గా సాయంత్రం అయిదు గంటలైంది. కానీ అప్పుడే శరత్ కాలపు చీకట్లు టోక్యో నగరాన్ని ఆక్రమించు కొంటున్నాయి. ఇక పిల్లలు ఏ క్షణంలోనైనా ఇల్లు చేరుకుంటారు. కుమార్తె సేట్సూకు పన్నెండేళ్ళు. ఆమె ఈరోజుల ఆడపిల్లల మాదిరిగానే కలల్లో తేలియాడుతూ ఉంటుంది. పిల్లలు ఇప్పుడు పాశ్చ్యాత్య అలవాట్లకు లోనవుతున్నారు. మార్పుని ఆపడం సాధ్యమయ్యే పనికాదు. అంతలోనే తోటగేటు శబ్దం అయింది. కుమారుడి పిలుపూ వినపడింది. ‘అమ్మా! నేనొచ్చేసాను.’ ‘వస్తున్నా తోరూ!’ ఆమె వెళ్లి తలుపు తీసింది. పిల్లవాడు తన షూని ద్వారంవద్దనే పడేసి లోనికి దుమికాడు. ఈ ఇల్లు ఇంకా జపనీయుల సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నది. ఆమె పిల్లల్ని షూతో లోనికి రానివ్వదు. ‘అదంతా సుద్దేనమ్మా! నాన్న వున్నాడా?’ ప్రతిరోజూ వాడీప్రశ్న వేస్తూనే ఉంటాడు. అది ములుకులా ఆమె గుండెల్లో గుచ్చుతూనే ఉంటుంది. పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు. వాడికి తండ్రి సమక్షం కావాలి. ‘ఆ పుస్తకాల్ని అలా పడేసిరా. మీఅక్క సేట్సూ రాగానే మనం భోంచేద్దాం.’ అంతలోనే ‘అమ్మా..’ అంటూ సేట్సూ వచ్చింది. షూని తీసి బయటపడేసి నిశ్శబ్దంగా వంటగదిలోకి ప్రవేశించింది. ఆమె తన వయస్సు కన్నా బాగా పొడగరి. ‘సేట్సూ! ఈరోజు నువ్వు ఆలస్యంగా వచ్చావు.’ ‘ట్రాఫిక్ చాలాఎక్కువగా ఉందమ్మా. మా బస్సు అడుగడుక్కీ ఆగిపోయింది.’ జపానీ యువతులు అమెరికన్లని అనుకరిస్తున్నారు. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సేట్సూ మారాంచేస్తే ఒకరోజు రాక్ అండ్ రోల్ డ్యాన్సుకి ఆమెతోపాటు తల్లి కూడా వెళ్ళింది. అక్కడి దశ్యాలు ఆమెకు వెగటు కలిగించాయి. ఆతరువాత కుమార్తె నూ వెళ్లనివ్వలేదు. కానీ ఈ కొత్త టోక్యో నగరంలో ఏ స్త్రీ అయినా తన భర్త లేక తన పిల్లల నడవడికలోని మంచిచెడ్డల్ని నిర్ధారించుకోలేకపోతోంది. భర్త తన పట్ల విశ్వాసంగాలేడేమో అన్న అంశాన్ని కూడా పక్కన పెట్టక తప్పడంలేదు. ‘ఏస్త్రీ అయినా తన భర్తపట్ల ఊహలో కూడా విశ్వాస రాహిత్యం కలిగివుండకూడదు’ అని తన తల్లి పదేపదే చెబుతుండేది. సేట్సూ కాళ్ళూ చేతులూ కడుక్కొని వచ్చింది. డైనింగ్ టేబిలు మీద ప్లేట్లనూ ఛాప్ స్టిక్ లనూ పేర్చసాగింది. ‘అమ్మా! నాన్నకోసం కూడా ఒక ప్లేట్ పెట్టనా?’ అన్నది. ‘మీ నాన్న ఇప్పట్లో రాడని నీకు తెలుసు.’ తల్లీ కుమార్తెల మధ్య నిశ్శబ్దం చోటు చేసుకొంది. కానీ సేట్సూ ఆ నిశ్శబ్దాన్ని భంగం చేసింది. ‘ప్రతిరోజూ నాన్న బార్ వెళ్ళడానికి నువ్వెందుకు ఒప్పుకుంటున్నావో నాకైతే అర్ధం కావడం లేదమ్మా.’ మిసెస్ ఒమూరా కొంతసేపు మాట్లాడలేకపోయింది. ‘‘అతడ్ని నువ్వు ఎందుకు వెళ్ళనిస్తున్నావు?’ ‘గెయిషాల ఇళ్ళు లేవు కాబట్టి మగవాళ్ళు బార్లకు వెళ్తారు. మరి ఎక్కడికి వెళ్ళగలరు?’ ‘ఇంటి వద్దనే ఉండొచ్చు కదా?’ అన్నది సేట్సూ. ‘వ్యాపార వ్యవహారాలు కూడా ఉంటాయట.’ సేట్సూ వెటకారంగా అన్నది ‘వ్యాపారమా? బార్లలోనా? అదేం వ్యాపారం?’ అంటూ సేట్సూ తన మనసులోని మాటల్ని చిరాగ్గానే బయటకు అన్నది. ‘నాన్న వేకువన రెండు గంటలకు వస్తాడు. అతనికోసం నువ్వు చిరుననవ్వుతో ఎదురుచూస్తుంటావు. ఇంకా జాలిపడ్డం ఒకటి! అయ్యో! నువ్వు బాగా అలసిపోయావు. రోజంతా కుటుంబంకోసం శ్రమిస్తున్నావు. ఇదిగో వెచ్చని టీ తీసుకో. నీస్నానానికి వేడినీరు సిద్ధంగా వుంచాను. పిల్లలు బడికి వెళ్లినంతవరకూ నిద్రపో అంటుంటావు’ సేట్సూ తన తల్లిగొంతునీ హావభావాల్నీ అనుకరించింది. మిసెస్ ఒమూరా నివ్వెరపోయింది . అంటే రోజూ ఇదంతా సేట్సూ మేలుకొని వింటున్నదన్న మాట. ‘సేట్సూ ! నువ్వు చాలా పెంకి పిల్లవైపోతున్నావు’ అన్నది తల్లి. ‘సేట్సూ గది విడిచి వెళ్ళింది. మిసెస్ ఒమురా ఈ హఠాత్పరిణామానికి కొంతసేపు అవాక్కయింది. తరువాత కుమార్తెని పిలిచింది.. ‘సేట్సూ ఇలారా.’ అయిష్టంగానే ఆ అమ్మాయి వెనక్కు వచ్చింది. మిసెస్ ఒమురాకు తన కుమార్తె ఎంతో పెద్దదానిలాగా అపరిచయస్తురాలిలాగా కనపడింది. ‘నాస్థితిలో నువ్వుంటే ఏంచేస్తావు?’ ‘నేనూ అతనితో బార్‌కు వెళ్తాను.’ సేట్సూ ఆలోచించకుండానే సమాధానం చెప్పింది. సేట్సూ మళ్ళీ అన్నది ‘మేం పెద్దవాళ్లమైతే నీలాగా మా భర్తల్ని బార్లకు వెళ్లనివ్వం.’ మిసెస్ ఒమూరా గుండ్రని ముచ్చటైన తన కుమార్తె ముఖంలో, ఆనల్లని కళ్ళలో ఒక నిశ్చితత్వాన్ని కనుగొన్నది. ‘నువ్వు దుస్తులు మార్చుకొని తోరూని పిలువు. మనం భోంచేద్దాం. తరువాత మీరు హోంవర్క్ చేద్దురు గాని’ అన్నది. ఆసాయంత్రం సాధారణంగానే గడిచింది. ముగ్గురూ నిశ్శబ్దంగా భోజనం ముగించారు. ఏనాటినుండో ఆమె గుండెల్లో నిద్రాణంగా వున్న వ్రణానికి ఆచిన్నారి మాటలుములుకుల్లా గుచ్చుకొని మరింత లోతుగా కెలికాయి. పిల్లలిద్దరూ నిద్రపోయిన తరువాత సేట్సూ మాటల్ని గూర్చి ఆలోచిస్తూ ఆమె తన దుస్తులున్న బీరువా వైపు నడిచింది. ఒకనాడు అమెరికన్లని సంతృప్తిపరచడానికి, తన భర్త తనకోసం కొన్న పాశ్చాత్య దుస్తుల్ని తీసింది. జుట్టు దువ్వుకొని వెనుక ముడి పెట్టుకున్నది. మెడలో ముత్యాల హారం వేసుకున్నది. మరీ ముచ్చటగా కనపడ్డంలేదు గానీ అందవికారంగా కూడా లేదు. పిల్లలు నిద్రపోతున్నారు కనుక బయటినుండి ఇంటికి తాళం వేసింది. భర్త వెళ్తున్న బార్ పేరు ఆమెకు తెలుసు. గేటు తెరుచుకొని రోడ్డు మీదకు వచ్చి టాక్సీని ఆపింది. ‘గోల్డెన్ మూన్ బార్’ అన్నది. గతంలో ఆమె ఎప్పుడూ ఒంటరిగా టాక్సీ ఎక్కలేదు. బార్ చేరుకున్నది. ఎర్రని దుస్తులు ధరించిన ముగ్గురమ్మాయిలు క్యాబ్ వద్దకు వచ్చారు. దిగుతున్న మహిళను చూసి ఆగారు. టాక్సీవాలాకు డబ్బు చెల్లించి ఆ అమ్మాయిలవైపు చూసింది. ‘నేను నాభర్తని కలుసుకోవాలి.’ అన్నది. వారిలో పొడవైన అమ్మాయి అడిగింది ‘ఎవరాయన?’ ‘మిస్టర్ ఒమూరా, సకూరా కంపెనీ వైస్ ప్రెసిడెంట్.’ అమ్మాయిలు వెనక్కి అడుగు వేశారు. ‘ఓహ్! మిస్టర్ ఒమూరా! మాకాయన బాగా తెలుసు. చాలామంచివాడు.’ భర్త పేరు చెప్పగానే వారామెని మరింత గౌరవంగా చూసారు. ప్రవేశ గది వరకూ తోడుకొని వెళ్లారు. ‘మేడం! మిసెస్ ఒమూరా వచ్చారు’ అని అక్కడి లేడీ మేనేజర్‌తో చెప్పారు. ఆమె అచ్చంగా పాశ్చ్యాత్య రీతిలో వున్నది. మర్యాదపూర్వకంగా చేతులు చాచింది. ‘మిస్టర్ ఒమూరా బార్ లో వున్నారు. మీరు వస్తున్నారని ఆయనకు తెలుసా?’ నిజమే చెప్పింది. ‘నేనొస్తున్నానని ఆయనకు తెలీదు. ఊరికే చూసిపోదామని వచ్చాను.’ అక్కడి మేడమ్‌కు అర్థమయింది. ఆమె ఇటువంటి వారిని ఎందర్నో చూసింది. మేడమ్ ఒక చిన్న గదిని చూపింది. అక్కడ ఓకే టేబిలూ రెండు కుర్చీలూ వున్నవి. ‘ఇక్కడ కూర్చొండి. ఒకామె వచ్చి మీకు కొంత కాలక్షేపాన్ని ఇస్తుంది.’ కొద్ది నిముషాల్లోనే ఒక మహిళ లోపలికి వచ్చింది. స్త్రీయైన ఒమూరాకే కళ్ళు చెదిరాయి. ఆమె ఒక అద్భుత సౌందర్యరాశి! సుమారుగా ఇరవై ఎనిమిదేళ్లు ఉండొచ్చు. యవ్వనపు ఛాయలు ఇంకా పోలేదు. ‘మేడమ్ నన్ను మీతో కూర్చో మన్నది.’ ‘థేంక్యూ’ అన్నది మిసెస్ ఒమూరా. మిసెస్ ఒమూరాకు ఆక్షణంలో బిగ్గరగా ఏడవాలనిపించింది. ఆసౌందర్యరాశి ముఖకవళికల్లో స్నేహార్ద్రత ఉట్టిపడుతున్నది. తన గోడంతా ఆమెతో చెప్పుకోవాలనిపించింది. ‘మీరు ఊహించ లేరు’ అన్నది మిసెస్ ఒమూరా అస్పష్టంగా. ‘సంవత్సరాల తరబడి ఇంట్లో ఒంటరిగా కూర్చొని అతడు రాత్రి రెండు గంటలకు వచ్చేవరకూ కళ్ళు కాయలు కాచినట్టు వేచివుండటం చాలా కష్టంగా వుంది. అప్పుడు కూడా ఏమీ ప్రశ్నించకుండా బలవంతపు చిరునవ్వు అతికించుకొని అతడ్ని స్వాగతించడం ఇంకా కష్టంగావుంది. ఏమన్నా అడిగితే కోపగించుకొని అసలే ఇంటికి రాడని మరో భయం. ఇవన్నీ మీకు తెలీవు. అసలు ఊహించలేరేమో!’ సౌందర్యరాశి తల ఊపింది. ‘నాకు తెలుసు. మీవంటివారు చెప్పారు. ఇప్పుడు నేనేం చేయ్యాలి?’ అంటుండగానే మిసెస్ ఒమురాలో అనాదిగా అలవాటైన బాధా, గాయపడిన అనురాగబంధం, పురాతన సంప్రదాయంగా అణగారిన లోతయిన విషాదం, ఒక్కసారిగా పెల్లుబికాయి. సంవత్సరాలతరబడి ఘనీభవించిన తీవ్రమైన మనోవేదన కన్నీటిరూపంలో వెలికివచ్చింది. ఆమె నిట్టూరుస్తూ మాట్లాడింది. మాట్లాడుతూ నిట్టూర్చింది. వాక్యాలు కూడా ముక్కలు చెక్కల య్యాయి. ‘మీవంటి స్త్రీలు మాకోసం ఆలోచించాలి. మేం సాధారణ గృహిణులం. పిల్లల్ని కంటాం..వారిని సాకుతాం.. వంటచేస్తాం.. బండెడు చాకిరీ చేస్తాం..ఇంటిని నడుపుతాం.. శ్రమనీ వేదననీ దిగమింగుకుంటాం. మేం పనిమనుషులుగా పిలిపించుకోని పరిచారికలం. భర్తకోసం ఆరాటపడుతుంటాం. ఇంటివద్దనే వుండి వేయికళ్లతో అతని కోసం ఎదురు చూస్తుంటాం. మీరు అతడ్ని మానుండి దూరం చేస్తున్నారు. అతడి శోభాయమానమైన యవ్వనం, ఉజ్జ్వలమైన కాలం, అతడి ఆహ్లాదకరమైన ఆలోచనలూ, మనసుకి నచ్చిన మాటలూ, చిరునవ్వులూ, చిలిపితనాలూ అన్నీ మీరే గుంజుకొంటున్నారు. అతని జీవితాన్నే హరించి వేస్తున్నారు. అతడు శూన్యంగా..మౌనంగా ఖాళీ మనస్సుతో.. అలసిన శరీరంతో.. నిస్సత్తువతో అర్థరాత్రి దాటిన తరువాత ఇల్లుచేరుకొంటున్నాడు. అతడు ఇంటికి రాగానే నేను మరింత ఒంటరినైపోతున్నాను. ఏకాకినైపోతున్నాను’ ఇక ఆమెకు మాటలు పెగల్లేదు. ఎదురుగావున్న అందమైన ముఖం వివర్ణమైపోయింది. ఆశ్చర్యం నుండి కోలుకొని ఆత్మరక్షణలో పడిపోయింది. ‘ఇవన్నీ నేను ఆలోచించలేదు.. మిసెస్ ఒమూరా ! నా ఊహకే అందలేదు. నిజం చెప్పనా? అతడంటే నాకు అసహ్యం.’ మిసెస్ ఒమూరా మనస్సు చివుక్కుమంది. కాస్త చిరుకోపంతోనే అడిగింది.. ‘మీరెందుకని అతడ్ని ఏవగించుకుంటారు? అతడు మంచివాడు.’ ‘నా దృష్టిలో అతడొక మగవాడు. అంతే’’ ఆసౌందర్య రాశి అన్నది. ‘ఆమాటకొస్తే నేను మొత్తం పురుష ప్రపంచాన్నే ద్వేషిస్తాను.‘ మిసెస్ ఒమూరా.. ఆమె నల్లని కళ్ళలోకి నిశితంగా చూసింది. ‘ఎందుకని?’ సౌందర్యరాశి తల ఊపింది. ‘మగవాళ్ళంతా ఒక్కటే!’ అని ఆగి మళ్ళీ అన్నది.. ‘అందరూ మూర్ఖులు, అహంకారులు. డబ్బు చెల్లించిన ప్రతీ మగవాడిపట్లా మేం ఒకేలా ప్రవర్తిస్తామని గ్రహించగలిగే కనీస వివేకం కూడా వారికి ఉండదు. నేనిక్కడికి నాపదహారేళ్ళ వయస్సులో వచ్చాను. ఆనాటినుండి నేటివరకూ ఒక పుష్కరకాలపు ముఖస్తుతులూ..లాలింపులూ.. బుజ్జగింపులూ..ఇవికాక కుళ్లిపోయిన హాస్యోక్తులకు పగలబడినవ్వాడాలూ.. పనికిమాలిన చచ్చు సరసోక్తులకు ఉబ్బితబ్బిబ్బయినట్లు నటించడాలూ..ఎందుకూ కొరగానివాడిని ఇంద్రుడవనీ చంద్రుడవనీ మెచ్చుకోవడాలూ..మనసు చంపుకొని మారాంచెయ్యడాలూ..ఛీ! జీవితం మీదనే విరక్తి పుడుతుంది. అందరూఒక్కటే . స్వార్ధపరులు. వ్యర్థులు.’ మిసెస్ ఒమూరా అడ్డుకున్నది ‘మీకు పిల్లల్లేరనుకుంటాను.’ ‘అదొక్కటే మా అదృష్టం. నేనూ మీలాగా స్వేచ్ఛగా ఉన్నట్లయితే ఒక చిన్న దుస్తుల దుకాణాన్ని పెట్టుకునే దాన్ని. మళ్ళీ మగవాడి ముఖం చూడను. ఎప్పటికీ చూడను.ఇది నిశ్చయం.’ ‘అయితే ఆపని చెయ్యండి. నాభర్తని విడిచిపెట్టండి. అతడు నాకూ పిల్లలకూ కావాలి.... వాస్తవానికి...’ ఆమె సిగ్గు పడింది. ‘అతడు మాక్కావాలి. ’ సౌందర్యరాశి నిట్టూర్చింది. ‘నేను బద్ధకిష్టినైపోయాను.. మిసెస్ ఒమూరా! ఈ ఉపాధి నాకు సుళువు అయిపొయింది . ఈ జీవనవిధానం మార్చుకోవడానికి బలమైన ప్రోద్బలం కావాలి. ఎవరైనా ఆసరా ఇస్తేగానీ గార్మెంట్‌షాపు ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదు.’ బార్ని విడిచి బయటకు వచ్చింది మిసెస్ ఒమూరా. సౌందర్యరాశి చిరునవ్వుతో వీడ్కోలు చెప్పింది. ఒమూరా టాక్సీని పిలిచి వెనుకసీట్లో కూర్చున్నది. ఆమె మనస్సులో రెండుమాటలు స్పష్టంగా ధ్వనిస్తున్నాయి. ఒకటీ ఆ సౌందర్యరాశి పురుష ప్రపంచాన్నే ద్వేషిస్తున్నది. రెండూ తనకో స్వంత జీవితాన్ని ఏర్పరచుకోవాలి. ఇంటికొచ్చిన తరువాత ఈమాట ఆమాట అయ్యాక భర్తతో అన్నది ఆమె ‘నేను కూడా కొంత సంపాదిస్తే మీరింత శ్రమ పడాల్సిన అవసరం గానీ, రాత్రుళ్లు కూడా బార్లలో వ్యాపారలావాదేవీలు చెయ్యాల్సిన పని గానీ ఉండదు.’ ఆసక్తి లేకుండానే అడిగాడతడు ‘నువ్వేంచేయ్యగలవు?’ ‘ఒక గార్మెంట్‌షాపు పెట్టాలనుకొంటున్నాను.’ ‘నీకు పెట్టుబడి ఎక్కడిది? అయినా ఇలాంటివి ముసలైపోయిన బార్ గర్ల్స్ పెట్టుకుంటారు. నీ వద్ద పొదుపు మొత్తం కూడా ఏమీ లేదు.’ ‘నిజమే నేను బార్ గర్ల్ అంత అదృష్టవంతురాల్ని కాను.’ కానీ ఆమెకు తనజీవితం తనకు ఉండాలనే తపన ఆగడం లేదు. మిస్టర్ ఒమూరా బార్‌కు వెళ్తున్నప్పుడు, పిల్లలు నిద్ర పోతున్నప్పుడూ ఆమె ఒంటరితనం భరిస్తూనే వుంది. బాధను దిగమిగుకుంటూనే వున్నది. రెండు నెలల తరువాత ఆమె మరోసారి బార్ కు వెళ్ళింది. ఆ సౌందర్యరాశిని కలుసుకున్నది. ఆమె కూడా మనస్ఫూర్తిగా స్వాగతించింది. ‘ఈరోజు మీరాక నాకెంతో సంతోషంగా వున్నది. నేను నాపొదుపు మొత్తాన్ని తీసి ఒక గార్మెంట్‌షాపు తీసుకున్నాను. చాలాచిన్నదే . కానీ మంచి రద్దీప్రాంతం. ఒంటరిగా ప్రారంభించడానికి ధైర్యం చాలడంలేదు. సహాయంకోసం ఎదురుచూస్తున్నాను.’ ఒక్క క్షణం ఆలోచించిన మిసెస్ ఒమూరా ‘సరే నేనే మీకు సహాయంచేస్తాను’ అన్నది. ఆ విధంగా అతి సాధారణంగానూ అతి త్వరగానూ మీసెస్ ఒమూరా జీవన శైలి మారిపోయింది. ఆమె పిల్లలు నిద్రపోయిన తరువాత గార్మెంట్షాపుకి వెళ్ళసాగింది. ఇలా కొద్ది వారాలు గడిచాయి. ఈలోగా ఆసౌందర్యరాశీ, మిసెస్ ఒమూరా అక్కచెల్లెళ్ళ వలె సన్నిహితులైపోయారు. ఒకరోజు సాయంత్రం మిస్టర్ ఒమూరా బార్ కు వెళ్ళలేదు. కానీ ఆరోజు ఆమెకు త్వరగా షాపు వైపు వెళ్లాలని వున్నది. అమెరికానుండి కొత్త డిజైన్ దుస్తులొచ్చాయి. మిస్టర్ ఒమూరా తీరిగ్గా పేపరు చదువుకొంటూ కూర్చున్నాడు. కాసేపు చూసి తెగించి అడిగింది . ‘మీరు ఈరోజు బార్‌కు వెళ్లడం లేదా?’ ‘వెళ్ళను’ ‘ఏమైంది?’ ‘సాయంత్రం నాయింట్లో నేను గడపకూడదా?’ అన్నాడు పేపరు పక్కనపెట్టి. ఇక ఆమె ధైర్యం తెచ్చుకున్నది. ‘మీరు ఇంటివద్దనే వున్నారుకదా! నేను బయటికి వెళ్లవచ్చునా?’ అతడు ఆమె కళ్లల్లోకి చూస్తూ ‘ఎక్కడికి?’ అన్నాడు. ‘ఒక స్నేహితురాల్ని చూడటానికి’ ‘నేను ఇంట్లో వున్న మొదటి సాయంత్రమిది. నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు’ ‘ ........’ ‘సరే . వెళ్ళు’ అతడు తన సానుభూతి కోరుకొంటున్నాడని ఆమెకు అర్థమైంది. కానీ ఆసరికే ఆమె హృదయం కరడుగట్టిపోయింది. సంవత్సరాల తరబడి ఘనీభవించిన వేదనాభరితమైన వజ్ర కాఠిన్యం ఆమెది. ఎన్నో సాయంత్రాలు ఒంటరిగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ వేచివుంది. ఎన్నోరాత్రులు దిగులుని దిగమింగుకొంటూ గడిపింది. అతనికి ‘థాంక్యూ’ చెప్పేసి బయటకు నడిచింది. షాప్‌లో ఈమొత్తం సంభాషణని సౌందర్యరాశితో చెప్పింది. ఆమె కూడా శ్రద్ధగా విన్నది. ‘వద్దు . మనం మగవాళ్ళగురించి మాట్లాడుతూ కాలం వృదా చెయ్యొద్దు’ అన్నది. ఇద్దరూ పనిలో పడిపోయారు. గార్మెంట్ డిజైనింగ్‌కు కళాత్మక నైపుణ్యం కావాలి. అందుకు ఏకాగ్రత అవసరం. ఆరోజు మిసెస్ ఒమూరా రెండు గంటలకన్నా ముందే ఇల్లు చేరుకున్నది. మిస్టర్ ఒమూరా కాస్త అసహనంగానే ఎదురు చూస్తున్నాడు. ‘నువ్వు ఒంటరిగా ఇంత రాత్రివేళ ప్రయాణించడం నాకు ఆందోళన కలిగించింది. ఇంకా యవ్వనంలోనూ అందంగానూ వున్న స్త్రీకి ఇది సురక్షితం కాదు.’ ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో అతడెప్పుడూ ఆమెని మెచ్చుకోలేదు. ఒక్క ప్రియమైన మాటకూడా ఆడలేదు. ఇప్పుడు అతడికి కృతజ్ఞతచెప్పాలని ఆమెకనిపించింది. ఇకషాపు సంగతి నిజం చెప్పెయ్యాలనే ఆమె నిశ్చయించుకొంది. ‘ఒకనాడు మనం డ్రెస్ షాపు గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా?’ ‘వుంది. పెట్టుబడి లేదనికదా ఆగిపోయావు.’ ‘షాపు ఏర్పాటైంది’ అన్నదామె. అతడు చటుక్కున ఆమె వైపు తిరిగాడు. ‘అర్థరాత్రి రెండు గంటలవరకూ షాపులో నువ్వెలావుండగలవు?’ ‘నేను డ్రస్సులు డిజైన్ చేస్తున్నాను.. నాభాగస్వామితో.. ’ ‘భాగస్వామా?’అతడిలో పురుషాగ్రహం మేల్కొంది. చివాలున లేచాడు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ‘ఎవడువాడు?’ అని ఆగి, ‘నేను ముందే తెలుసుకోవాల్సింది. ఆడదాన్ని నమ్మడానికి వీల్లేదు . నువ్వు నాభార్యవి . రాత్రి రెండు గంటలకు ఇల్లు చేరుకున్నావు.’ ఆమె అతడి పట్టుని విదిలించుకుంది. ఒక జీవిత కాలపు క్రోధమూ ప్రతీకారమూ ఆమె జ్ఞాపకాల పొరల్లోంచి కట్టలు తెంచుకొని అగ్నిపర్వతంలాగా బద్దలవడానికి పక్వమైన సమయం ఆసన్నమయింది. ‘నువ్వు .. నువ్వు .. నామానాన నన్ను వదిలేసి వేకువన రెండుగంటల తరువాత ఇల్లుచేరిన నువ్వు .. పెళ్లయిన కొత్తలో కూడా గెయిషాల ఇళ్లకు పరుగులు తీసిన నువ్వు... ఆతరువాత బార్లకు ఎగబాకిన నువ్వు... ఇల్లూ పిల్లలూ వారి బాగోగులు పట్టించుకోని నువ్వు ... నీ ఆలోచనలూ,నీసంతోషమూ కుటుంబానికి చెందకుండా చేసిన నువ్వు .. నీ కాలమూ,నీ యవ్వనమూ పరాయి స్త్రీలకు ధారాదత్తం చేసిననువ్వు..’ ఇలాంటి మాటలు పుంఖానుపుంఖంగా వస్తున్నాయి. కానీ ఆమె పెదవిప్పలేదు. ఆమె ఈ సభ్య ప్రపంచంలో ‘భార్య’కు నిర్వచనం. అంతలోనే వివేకపూరితమైన అంతర్దృష్టి మేల్కొంది. ‘ఈ అభాగ్యుడితో నిజమైన ప్రేమని పంచుకొనేది తాను కాక మరెవరు?ఎన్నో సంవత్సరాలపాటు ఎన్నోవందల రాత్రిళ్ళు గెయిషాల కొంపల్లో, బార్లలో అసలు ఎవరి ఇష్టాన్నీ నోచుకోని చోట, నిజానికి లోలోపలవారంతా ద్వేషించిన చోట, జీవితాన్ని వృధా చేసిన వాడికి భార్యగా ఇంకా తనుకాక దిక్కెవరు?’ ఆమె మృదువుగా, జాలిగా అన్నది ‘నా వ్యాపారభాగస్వామి ఒక స్త్రీ. పెట్టుబడి ఆమే సమకూర్చింది.’ ‘ఒక ఆడదానికి పెట్టుబడి ఎలావస్తుంది?’ మిస్టర్ ఒమూరా తీవ్రమైనగొంతుతో అడిగాడు. ‘ఆమె బార్‌గర్ల్‌గా పనిచేసింది.’ ఒక్కసారిగా మిస్టర్ ఒమూరా కళ్ల పొరలు తొలగి పోయాయి. బల్ల మీద కూలబడి, రెండు చేతుల్తో తల పట్టుకున్నాడు. ‘ఆమె మిమ్మల్ని ఇష్టపడలేదనే విషయం నేను నమ్మలేక పోయాను. సంవత్సరాల తరబడి మీకు చేరువగావుంటూ మిమ్మల్ని ప్రేమించలేక పోవడం అంటే నా ఊహకే అందని విషయం’ అంటూ అలవాటుగా మోకరిల్లింది. స్త్రీ ఆభంగిమలోనే భర్తముందు వుండాలని ఆమె తల్లి పదే పదే చెప్పేది. ‘నువ్వు అలా భావిస్తున్నావా?’ అన్నాడు. అతని ముఖం అమాయకంగా దీనంగా, ఓడిపోయి గాయాలతో ఇంటికి చేరిన సైనికుడి వదనంలా ఆమెకు కనపడింది. ‘ఈ అర్భకుడు... తనకు జీవితాన్నిచ్చిన భర్త ... తనబిడ్డలకు తండ్రి ... ఇతడికి తను తప్ప ఇంకెవరున్నారు? ఈపురుషుడు వేరే స్త్రీలెవరికీ ఎటూ అవసరం లేదు.’ ఆమె జపనీయులు సంస్కృతిలో భాగమైన అనాది ‘భార్య’. గతం మరిచి క్షణాల్లో కరిగిపోయింది. ఆమె హృదయం అతడిపట్ల లోతైన జాలితో నిండిపోయింది. అతడు మాట్లాడకపోయేసరికి ఆమె తల పైకెత్తి చూసింది. చూపులు కలిసాయి. ఇద్దరూ మౌనంగా చిన్నగా నవ్వుకున్నారు. ఇద్దరి కన్నుల్లోనూ చెమ్మ తొంగిచూసింది. మనసులు తేలిక పడ్డాయి. ఆకాశంలో మబ్బులూ తొలగిపోయాయి. ‘ఇకముందు నాసమక్షంలో నువ్వు మోకరిల్లనవసరంలేదు. నవశకంలో అదింకా నాగరికత కాదు’ అంటూ ఆమె భుజాల్ని పట్టుకొని పైకెత్తాడు. ఆమె తన కాళ్ళమీద నిలబడేటట్టు తోడ్పడ్డాడు. -మూలం : పెర్ల్ ఎస్ . బక్ అనువాదం : టి. షణ్ముఖ రావు చదవండి: Mother's Day: అమ్మ కూడా మనిషే -
Telugu Story: ఈ వారం కథ: భద్రప్ప బడి!
ఎక్కడి నుంచో ‘బుడక్.. బుడక్.. బుడ బుడ బుడక్ ’ అంటూ కర్ణకఠోరంగా వినిపిస్తోంది. కుక్కలన్నీ కట్టగట్టి మొరుగుతున్నాయ్. గంపల కింద, చెట్ల కొమ్మల మీద ఉన్న కోళ్లు ఏదో విపత్తు వచ్చినట్లు ‘కొక్కొక్కో.. కొక్కొక్కో’ అంటూ భయంభయంగా గుసగుసలు పోతున్నాయి. ‘‘ఈయప్పకు ఇంగ టైమే దొరకలేదంటనా?’’ అంటూ ఎవరో చాలా గట్టిగా, కోపంగా అంటున్నారు. అది.. అది నాన్న గొంతు! ఠక్కున మెలకువ వచ్చింది. ‘అంటే ఇందాకటి నుంచి వినిపిస్తున్నవన్నీ నిజమేనన్నమాట. కల కాదు!’ అనుకుంటూ మంచంమీద దిగ్గున లేచి కూర్చున్నాను. పన్నెండున్నర శ్రుతిలో నాన్న గొంతుతోపాటు ఇందాకటి శబ్దాలన్నీ వీధిలోంచే వస్తున్నాయ్. టైమ్ ఎంత అయి ఉంటుందో అనుకుంటూ ఎదురుగా ఉన్న గోడ వైపు చూశాను. ఎప్పుడో పాతికేళ్ల కిందట ప్రొద్దుటూరులో పెదనాన్న తెచ్చిన పాత చెక్క గడియారంలో సమయం 3:25 గా చూపిస్తోంది. ‘అంటే ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. మరి ఏంటి ఈ గోల? కొంపదీసి ఎవరైనా గొడవ పడుతున్నారా?’ ఆ ఆలోచన రాగానే నిద్రమత్తు పూర్తిగా ఎగిరిపోయింది. చటాలున మంచం దిగి, గబగబా వీధిలోకి పరిగెత్తాను. ‘‘ఆ.. మయేస గూడా లేసినాడే’’ అంది అమ్మణ్ణి వదిన ఇంట్లో నుంచి బయటకు వస్తున్న నన్ను చూసి. ‘‘ఇంత గోల అయితాంటే కుంభకర్ణుడైనా నిద్ర లెయ్యాల్సిందే’’ అన్నాడు కొండయ్యన్న ‘వీడొకలెక్కా’ అన్నట్లు నావైపు చూస్తూ. వాళ్లిద్దరితోపాటు అమ్మానాన్న ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నారు. పగిలిన గాజుముక్కలా, పాత సినిమాల్లో హీరోల నుదిటిపై ఉండే బొట్టులా సన్నగా ఉండి, కనిపించీ కనిపించకుండా ఉన్నాడు ఆకాశంలో చంద్రుడు. వెన్నెల అంతంతగానే ఉండడంతో అమ్మ కిరసనాయిలు బుడ్డి వెలిగించి తెచ్చి అరుగు మీద ఓ వారగా పెట్టింది. ఊరంతటికీ కరెంటు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి నెలపైనే అయ్యింది. అందువల్ల ఊర్లో ఎక్కడా బల్బనేదే వెలగడం లేదు. బాగు చేయించడానికి అధికారులు ఎవరూ రాకపోవడమూ, ఊర్లో వాళ్లు డబ్బు ఖర్చవుతుందని ఎవరికి వారే పట్టించుకోకపోవడంతో నెల నుంచి కిరసనాయిలు బుడ్లు, లాంతర్లే గతి అయ్యాయి. డబ్బున్న ఒకరిద్దరి ఇళ్లలో మాత్రం జనరేటర్‌తో వెలుగుతున్న బల్బులు దర్పం చూపుతున్నాయి. పగలు పొలాల్లో పనులతో అందరూ తీరిక లేకుండా ఉండడంతో పెద్ద సమస్య లేదు కానీ, రాత్రిళ్లు ఫ్యాన్లు తిరగక, దోమల బాధతో నిద్ర కరువైంది చాలా మందికి. మా ఇల్లు పూర్తిగా బోద కొట్టం అయినప్పటికీ రెండు భాగాలుగా ఉంటుంది. రెండింటి మధ్యలో కాస్త జాగా ఉంది. అందులో నాలుగైదు మంచాలు వేసుకొని పడుకోవచ్చు. పైన కప్పు లేకపోవడంతో ఆరుబయట పడుకున్నట్లే ఉంటుంది. అందువల్ల కరెంటు లేకపోయినప్పటికీ వెన్నెల ఉండే రోజుల్లో మాకు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ‘‘బొడ్డెమ్మ కాడికి వచ్చినట్లుండాడు’’ అంటోంది అమ్మ ఎదురుగా రామన్న గారి ఇంటి దగ్గర అందరూ గుమికూడి ఉండడాన్ని చూస్తూ. ఆ మాటలకు ఔననంటున్నట్లు తలూపుతూ ‘‘అట్నే ఉందిత్తా సూచ్చాంటే’’ అని అంది అమ్మణ్ణి వదిన. ఆ మాటలతో నాన్న గొంతు మరోసారి ఖంగుమంది. ‘‘ఈడు ఆన్నుంచి ఊరంతా తిరిగ్యాలకు తెల్లారతాది. ఆమైన అంతసేపూ మనమంతా నిద్దర్లేక సావాల్నా’’ అన్నాడు కోపంగా. నాన్న మాటలు అటు నడి వీధిలోని దేవళం దాటి ఆవతల రెండిళ్ల వరకు ఇటు మా వీధి చివరింటి దాకా వినిపించాయి. అందరూ ఒక్కసారిగా మా ఇంటివైపే చూశారు. ఈ గోలలోనే మా వీధిలో ఉండే చిన్నాపెద్దా అందరూ నిద్రలేచారు. ఎవరెవరి ఇంటి బయట వాళ్లు నిలబడి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. అందరి మొహాల్లోనూ ఒక రకమైన ఆతృత కనిపిస్తోంది. చూస్తుండగానే బుడక శబ్దం దగ్గరవుతోంది. రామన్న గారి ఇంటి దగ్గరి మలుపులోకి రాగానే చేతిలో బుడకతో కనిపించిందో భారీ కాయం. ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు. ఎవరికి వారే కళ్లు మిటకేసుకొని చూస్తున్నారు. గుసగుసలూ ఆగిపోయాయి. ఇంకాస్త దగ్గరయ్యాడు ఆ భారీకాయుడు. పైనుంచి కింద వరకు నల్లటి చొక్కా వేసుకొని ఉన్నాడు. దానిమీద ఎరుపు, కాషాయం, గులాబీ రంగులోని మూడు ఉత్తరీయాలు మెడను చుట్టుకొని కిందకు వేలాడుతున్నాయి. ఎర్రటి పంచెను గోచీ కట్టాడు. భుజమ్మీద నల్లటి పొడుగాటి కట్టె ఉంది. దానికి అక్కడక్కడ ఇనుప తొడుగులున్నాయి. ఆ కర్రకు సరిగ్గా మధ్యలో పిడిలాగా ఉంది. ఒక చేత్తో ఆ కర్రను పట్టుకొని ఉన్నాడు. రెండో చేతికి తాయెత్తు, పెద్ద కడియం కనిపిస్తోంది. అదే చేతిలోనే డమరుకం లాంటి బుడక ఉంది. మెడ నిండా పూసలతో చేసిన రకరకాల దండలు, తాయెత్తులు గుత్తులుగా ఉన్నాయి. మీసాల్ని పెనవేసుకొని నల్లటి గడ్డం కనిపిస్తోంది. కళ్ల చుట్టూ, ముక్కు మీదుగా పసుపు, కుంకుమ మిశ్రమం పట్టించి ఉంది. నుదుటిన తెల్లటి బూడిద శివుడి మూడో కన్నులా కనిపిస్తోంది. తలకు కిరీటం లాంటిది బంగారు వర్ణంలో మెరుస్తోంది. కళ్లు ఎర్రని నిప్పులా కణకణ మండుతున్నాయి. అర్థం తెలియని మంత్రాలేవో గంభీరంగా చదువుతూ మరింత దగ్గరికి వచ్చాడు. ఒక్కో ఇంటి దగ్గర నిమిషంపాటు ఆగుతూ, ఆ ఇంటిని చూస్తూ బుడకను వాయిస్తూ మంత్రాలు చదువుతున్నాడు. కొందరు ఆయనకు చేతులు జోడించి మొక్కుతున్నారు. మరికొందరు దూరంగా జరుగుతున్నారు. పిల్లలు భయంభయంగా పెద్దల చాటున దాక్కుంటున్నారు. చిత్రంగా ఆయన వెంటే కుక్కలు మొరుగుతూ వస్తున్నాయి కానీ అతని దరిదాపులకు మాత్రం రావడం లేదు. ‘‘ఎవరుమ్మా ఆయప్ప? అట్లా ఉన్నాడు?’’ అని మెల్లగా అమ్మను అడిగా. ‘‘కాటిపాపడు లేరా’’ చిన్నగా చెప్పింది అమ్మ. చూస్తుండగానే మా ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంటిని తేరిపార చూస్తూ ఏదో గొణిగాడు. అమ్మ వెనక నిలబడి ఉన్న నా వైపు చూస్తూ ‘‘చిన్నోడా?’’ అంటూ నాన్నను అడిగాడు. ఒక్కసారిగా ఆయన నోటి వెంట నా ప్రస్తావన వచ్చేసరికి ఒళ్లు ఝళ్లుమంది. అప్పటివరకూ నిద్ర చెడగొట్టినందుకు కోపంతో ఉన్న నాన్న సైతం ఆ మాటలకు చప్పున చల్లబడ్డాడు. ‘‘అవును’’ అన్నాడు ఆశ్చర్యాన్ని గొంతులో కనిపించకుండా. వీధిలో చివరి ఇల్లు సైతం పూర్తయ్యాక,æమంత్రాలు చదవడం, బుడక వాయించడం ఆపేసి కింది వీధి గుండా చకచకా నడుచుకుంటూ వెళ్లాడు ఆ కాటిపాపడు. అప్పటిదాకా గుమికూడిన వాళ్లందరూ ఎవరి పనులకు వాళ్లు మళ్లారు. ఆడవాళ్లలో కొందరు గేదెలకు పాలు పితికేందుకు వెళ్లగా, మరికొందరు ముగ్గు వేయడానికి ఇళ్ల ముందు నీళ్లు చల్లుతున్నారు. పిల్లోళ్లు మళ్లీ దుప్పట్లలోకి దూరారు. పెద్దోళ్లు యథావిధిగా బీడీలు, సిగరెట్లు తాగుతూ కాఫీ, టీ కోసం ఎదురుచూస్తున్నారు. నాకు మాత్రం ఆ కాటిపాపడు వేళగాని వేళ ఎందుకొచ్చాడో, భిక్ష కూడా తీసుకోకుండా ఊరికే మంత్రాలు చదువుకుంటూ ఎందుకెళ్లాడో అసలేమీ అర్థం కాలేదు. తెల్లవారుజామున నాలుగున్నర అయ్యింది. పాల గంగాధర స్కూటర్ హారన్ మోగించుకుంటూ నడివీధి దేవళం దగ్గరికి వచ్చాడు. రోజూ తాను వచ్చేసరికి గుడి దగ్గర పాలగిన్నెలతో ఎదురుచూసే ఆడోళ్లు ఆ రోజు ఒక్కరూ కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయాడు. గొణుక్కుంటూ చుట్టుపక్కల చూశాడు. పెద్ద గిన్నె నిండా పాలు తీసుకొని వస్తూ కనిపించింది సిద్ధమ్మత్త. ‘‘క్కా.. యాడికి బోయినారంతా.. ఇంగా ఒక్కరూ కనపల్యా’’ అన్నాడు. ‘‘ఎవరో కాటిపాపోడు వచ్చిన్యాడు బ్బిగా. ఎనుములు బెదురుకోని పాలీవని ఆయప్ప పోయిందాక ఈదుల్లోనే ఉన్యారంతా. వచ్చారులే’’ అంటూ పాలుపోసి వెళిపోయింది ఆ అత్త. కాసేపటికే పాలగిన్నెలతో గంగాధర దగ్గర ఆడోళ్లంతా ముసిరారు. ‘‘బ్బీ.. గంగాధర దగ్గరికి పోయి పది రూపాయల పాలు పోయిచ్చుకుని రాపో’’ అని లోపల్నుంచే ఆర్డరేసింది అమ్మ. రోజూ అమ్మే తెస్తుంది. ఈరోజు నేను ముందే నిద్ర లేవడం, ఇంట్లో పనులన్నీ ఎక్కడివక్కడే మిగిలిపోవడంతో పాలు తెచ్చే బాధ్యత నాపై పడింది. గబగబా ఇంట్లోకి వెళ్లి పెద్ద గ్లాసు ఒకటి తీసుకొని దేవళం దగ్గరికి బయల్దేరాను. ఆపాటికే అక్కడ చేరిన ఆడోళ్లంతా ముచ్చట్లలో పడిపోయినారు. వాళ్ల మాటలన్నీ కాటిపాపడి గురించే. ‘‘వలకల కాడుండే అంగన్బడిలో ఉండాడంట. నిన్న సాయంత్రమే దిగినాడని తోట కాడికి పోతాంటే మాదిగోళ్లు సెప్పినారు. ఆయప్ప పేరు భద్రప్పంట. ఆయప్ప పెళ్లాం గూడా వచ్చిందన్యారు’’ అంటోంది ఒకామె. ‘‘వలకల కాడనా?!!’’ వింటుండే ఆడోళ్లలో చాలామంది ఆశ్చర్యంగా నోరు తెరిచినారు. నేను కూడా వచ్చిన పని మరిచిపోయి వాళ్ల మాటలు వినసాగాను. ‘‘పొద్దనీడి తోట కాడికి ఆ వలకల మధ్యలోంచి పోవాలంటేనే బయం బయంగా ఉంటాది. ఆయప్ప ఆడుండే పిండిబడిలో ఎట్టుండాడో!’’ మరొకామె అంది. ‘‘ఆయప్పకేం బయం. మంత్రిచ్చినాడంటే దయ్యాలన్నీ పరిగెత్తవూ’’ అంది ఇందాక భ్రదప్ప గురించి చెప్పినామె తాను దగ్గరుండి చూసినట్లు. అందరూ తనవైపే చూస్తుండడంతో మరింత ఉత్సాహంగా చెప్పసాగింది. ‘‘పూలకుంటలో ఇళ్లన్నీ తగలబెట్టింది ఈయప్పనే అంట’’ అంది. ‘‘ఎట్టెట్టక్కా! పూలకుంటలో ఈయప్పేనా ఇళ్లు కాల్చింది. ఎందుగ్గాల్చినాడంట? ’’ అనడిగిందొకామె. ‘‘ఆ వూళ్లో బిచ్చకు బోయింటే ఎవ్వరూ బెయ్యలేదంట. ఇంగా కొందరేమో ఆయప్పను తిట్టి, మెడబట్టుకొని తోసినారంట. ఆయప్ప ఊరుకుంటాడా? ఒక నిమ్మకాయ తీసుకొని యిసిరేచ్చే ఆ నిమ్మకాయ యాడదానా పోయిందో ఆడిదాంకా ఇళ్లన్నీ కాలిపోయినాయంట. ఆ దెబ్బకు ఆయప్పను కొట్టినోళ్లు మళ్లా కాళ్లమిందబడి చెమించని అడిగినారంట. ఊరంతా కలసి ఆయప్పకు సాంగెం మాదిరి బియ్యం, కొర్రలు, జొన్నలు, కజ్జికాయలు, అప్పచ్చులు పెట్టి, తలా రోంత డబ్చిచ్చి పంపిచ్చినారంట’’ అంటూ ముగించింది. వింటున్న ఆడోళ్లలో ఈసారి ఎవరికీ గొంతు పెగల్లేదు. భద్రప్పకు ఎవరెవరు ఎంతెంత డబ్బు, ధాన్యం ఇచ్చుకోవాల్సి వస్తుందో అని లోపల్లోపలే లెక్కలు వేసుకుంటున్నట్లున్నారు. ‘‘ఈరోజే ఇయ్యాలంటనా? ’’ ఎవరో అడిగారు గుంపులోంచి. ‘‘లేదు.. ఆయప్ప మనూర్లో నెలపైనే ఉంటాడంట. అప్పటిదాంకా రోజూ ఒకరింట్లో విందు బెట్టాలంట. చెనిక్యాయలు, కందిబ్యాళ్లు, అల్చందలు, పెసుళ్లు, బియ్యం అన్నీ ఇయ్యాలంట. అయ్యన్నీ ఆయప్ప ఊరిడిసేటప్పుడు ఎత్తకపోతాడంట. ఏ ఇంటికొచ్చేదీ ఆయప్పే రోజూ సాయంత్రం చెప్తాడంట’’ అందామె. అంతే.. ఆ మాటతో చాలామంది మొఖాల్లో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అసలే రెండేళ్ల నుంచి కరువు. పంటలు అంతంత మాత్రంగానే పండుతున్నాయి.. అదీ నీటి సౌకర్యం ఉండేవాళ్లకు మాత్రమే. మిగిలిన వాళ్లను వానదేవుడు కరుణించడం లేదు. పాలు పోయడానికి వచ్చిన వాళ్లలోనూ చాలామందికి నీటి సౌకర్యం ఉండే పొలాలు లేవు. అందుకే వాళ్లలో ఆ కలవరం. వీళ్ల మాటలు వింటూనే తన పని తాను చేసుకుపోతున్నాడు గంగాధరన్న. అందరి దగ్గరా పాలు పోయించుకుని, ఆఖర్లో నాతోపాటు మరో ఇద్దరి చెంబుల్లోనూ కొన్ని పాలు పోసి డబ్బు తీసుకొని, బిందెల మూతి బిగించి స్కూటర్‌కు అటొకటి ఇటొకటి తగిలించాడు. పాలు తీసుకొని వచ్చి, ఇంట్లో ఇచ్చానన్నమాటే కానీ నా ఆలోచనల్నీ దేవళం దగ్గర విన్న మాటల చుట్టూనే తిరుగుతున్నాయి. అసలే ఇంటర్ సెకండియర్ ఫైనల్ పరీక్షలు దగ్గరికొచ్చాయి. రోజూ తెల్లారుజామునే లేచి, కాసేపు చదివితే కానీ పాఠాలు బుర్రకెక్కవు. అలాంటిది ఇప్పుడాయన నెలపాటు రోజూ ఇలాగే వస్తాడంటే పొద్దున్నే చదువుకోవడం కష్టమైనట్లే. నిద్ర కూడా తక్కువవుతాది. ఇప్పుడెలా అని దిగులు పట్టుకుంది. ఊరికి, హరిజనవాడకు సరిగ్గా మధ్యలో రోడ్డు పక్కనే ఉంటుంది శ్మశానం. ఊర్లో పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాన్ని ఆ శ్మశానం పక్కనే, రోడ్డుకు ఆనుకొని నాలుగేళ్ల కింద కట్టారు. అందులోనే భార్యతోపాటు మకాం వేశాడు భద్రప్ప. ఎలా చేరాడో తెలియదు కానీ హరిజనవాడలో ఉండే వెంకటయ్య.. భద్రప్పకు అసిస్టెంట్‌గా చేరాడు. అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లల కోసం ఉంచిన తిండి, సామగ్రి మాత్రం వాళ్లు ముట్టుకోవడం లేదు. పిల్లోళ్లను అక్కడి వరకు తీసుకుపోకుండా ఊర్లోనే ఉండే బడి దగ్గరికే పేలాల పిండి, ఉంటలు తెచ్చి ఇస్తోంది ఆయా వీరమ్మ. భద్రప్ప రోజూ తెల్లారుజామునే రావడం మొదలుపెట్టాడు. అతని చేతి నుంచి అదే ‘బుడక్ బుడక్’ మోత. చిత్రంగా మొదటి రోజు వెంటపడిన కుక్కలు ఆ తరువాత మానుకున్నాయి. మొరగడం కూడా మానేశాయి. అదీ భద్రప్ప ఘనతగానే ఊళ్లో ప్రచారమైంది. కుక్కలు అరవకుండా నోటికి బంధనం వేశాడని చెప్పుకున్నారు. ఇలా భద్రప్ప లీలల్లో రోజుకొకటి ఊర్లో షికారు చేస్తోంది. శ్మశానంలో ఉండే దయ్యాలు అంగన్వాడీ కేంద్రంలోకి రాకుండా చుట్టూ అష్టదిగ్బంధనం చేశాడని, తెల్లారుజామున తాను ఊర్లోకి వచ్చినప్పుడు ఒంటరిగా ఉండే భార్యను అవి ఏమీ చేయకుండా ఉండేందుకు రక్షణగా తాయెత్తు కట్టాడని, వెంకటయ్యకూ ఓ తాయెత్తు కట్టి, కొన్ని మంత్రాలు కూడా నేర్పించాడని.. ఇలా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. మొదట ఊళ్లోకి భద్రప్ప ఒక్కడే వచ్చేవాడు. తర్వాత వెంకటయ్య తోడుగా రావడం ప్రారంభించాడు. రోజూ ఒకరింట్లో భార్యా సమేతంగా విందు భోజనం ఆరగిస్తున్నాడు భద్రప్ప. సాయంత్రం వెళుతూ వెళుతూ దండిగా బియ్యం, వేరుశెనగ కాయలు, కందులు, జొన్నలు తీసుకుపోతున్నాడు. చిత్రంగా ఊర్లో బాగా డబ్బు, తోటలు ఉండే వాళ్లను మాత్రమే భద్రప్ప ఎంచుకుంటున్నాడు. అది అర్థమయ్యాక మా ఇంటికి ఎట్టిపరిస్థితుల్లోనూ రాడని రూఢీ అయ్యింది. భద్రప్ప నిద్ర చెడగొడుతుండడంతో ఆ కొరత తీర్చుకునేందుకు రోజూ సాయంత్రం ఏడు గంటలకే భోజనం ముగించి నిద్రకు ఉపక్రమిస్తున్నాడు నాన్న. నా పరిస్థితే అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది. తెల్లవారుజామునే లేచి చదువుదామంటే భద్రప్ప గోలకు ఏమీ ఎక్కడం లేదు. పోనీ రాత్రిళ్లు చదువుదామంటే పుస్తకం పట్టుకోగానే నిద్రపట్టేది. ఏంచేయాలో తెలియక భద్రప్పను లోలోపలే కసిగా తిట్టుకుంటున్నా. ఈ సమస్య త్వరగా మాయం కావాలని దేవున్ని కోరుకున్నా. నా మొర చాలా త్వరగానే ఆలకించాడు దేవుడు. అప్పటికే భద్రప్ప ఊర్లో మకాం వేసి ఇరవై రోజులకు పైనే అయ్యింది. ఓ రోజు రాత్రి తొమ్మిది గంటలకు దేవళం దగ్గర ఎవరో గట్టిగా అరుస్తుండడం వినిపించింది. వెంటనే హడావిడిగా బయటకి వెళ్లా. మా పక్క ఇల్లు దాటగానే దేవళం ఉంది. ఊర్లోని నాలుగు వీధులూ కలిసేది అక్కడే. గుడి ఎదురుగా పెద్ద వేపచెట్టు, దాని చుట్టూ అరుగు ఉన్నాయి. గుడికి కుడి పక్క నాటకాలు, డ్రామాలు ఆడేందుకు వీలుగా ఓ స్టేజీ ఉంది. అక్కడ కూర్చొని గట్టిగా గట్టిగా అరుస్తున్నాడు లక్ష్మయ్య. ‘‘ఎవడోడు.. యాన్నుంచి ఒచ్చినాడు.. నల్లసొక్కా ఏస్కోని, నాలుగు నల్లపూసల దండలు మెళ్లో బేసుకుంటే మంత్రాలొచ్చాయా?.. మొగోడైతే నా మీద మంత్రం జెయ్యమను.. వాని మంత్రాలకు సింతకాయలు గూడా రాలవు.. వాడో నేనో తేలిపోవాలి ఈరోజు’’ అంటున్నాడు. దాంతోపాటే అలవోకగా బూతులు వస్తున్నాయి. లక్ష్మయ్య గురించి ఊరందరికీ తెలిసి ఉండడంతో ఎవరూ ఆపడానికి కూడా ప్రయత్నించడం లేదు. ఆ గోల చూసి ఐదారు ఇళ్ల ఆడోళ్లు ఒకచోట చేరారు. విషయం భద్రప్పకు తెలిస్తే ఏమవుతుందో అని వాళ్లలో వాళ్లే గుసగుసలు పోతున్నారు. ఇదిలా జరుగుతుండగానే నేరుగా దేవళం దగ్గరికి వచ్చాడు నాన్న. లక్ష్మయ్య ఊర్లో ఎవరి మాటైనా విన్నాడంటే అది నాన్న మాటే. అందుకే నాన్న వచ్చి గట్టి అరవగానే గొనుక్కుంటూ ఇంటిబాట పట్టాడు లక్ష్మయ్య. ఆశ్చర్యంగా ఆ మరుసటి రోజు తెల్లవారుజామున భద్రప్ప రాలేదు. నాకు బాగా నిద్ర పట్టటడంతో పూర్తిగా తెల్లారేంతవరకు మెలకువ రాలేదు. నిద్ర లేచాక గుర్తొచ్చింది భద్రప్ప సంగతి. ఏం జరిగిందో? తిట్టినందుకు లక్ష్మయ్యను ఏమైనా చేశాడో? అని ఆందోళన కూడా కలిగింది. వీధిలోకి వెళ్లా. చౌడయ్య మామ ఇంటి దగ్గర గుమిగూడి ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు వీధిలో వాళ్లంతా. వాళ్ల మధ్యలోకి దూరాను. ‘‘పిండిబడిలో లేరంట. మాదిగోళ్ల వెంకటయ్య పొద్దన్నే పోయి చూచ్చే భద్రప్ప, ఆయప్ప పెళ్లాంతోపాటు రూమ్‌లో సామాన్లు గూడా ఏమీ లేవంట’’ అంటున్నాడు కొండయ్యన్న. ‘‘రాత్రి లక్ష్మయ్య తిట్టడం వల్లనే పోయినాడంటావా?’’ అన్నాడు చౌడయ్య మామ. ‘‘ఎట్టయితేనేం. పీడ పోయింది. ల్యాకపోతే తెల్లారుజామున వచ్చాంటే నిద్ర ల్యాక సచ్చామింటిమి. చేలల్లో పనులూ సరిగా చేసుకోలేకపోతాంటిమి’’ అంటోంది అమ్మణ్ణి వదిన. వాళ్ల మాటలు విని నాకు మాత్రం చాలా సంతోషం వేసింది. భద్రప్ప గోల తప్పిందని సంబరపడ్డా. కానీ.. ఎంత ఆలోచించినా హఠాత్తుగా ఊరిని ఎందుకు వదిలిపెట్టి వెళ్లాడో తెలియడం లేదు. నన్నే కాదు ఊర్లో అందరినీ ఇదే ప్రశ్న తొలచివేస్తోంది. వారం గడిచే కొద్దీ భద్రప్ప సంగతిని ఊళ్లో వాళ్లు దాదాపు మర్చిపోయారు. నాకు మాత్రం ఎలాగైనా కనుక్కోవాలనే కోరిక ఉండేది. సరిగ్గా పది రోజుల తర్వాత అనుకోకుండా నా ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆ రోజు.. తోట దగ్గరికి వెళుతుంటే ఊరి బయట గేదెలు తోలుకెళుతూ కనిపించాడు లక్ష్మయ్య. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేనూ మాటలు కలిపి, సమయం చూసి భద్రప్ప విషయం గురించి అడిగాను. ఆ రోజు మత్తులో తిట్టావా? లేక నిజంగానే తిట్టావా? అని కూడా అడిగాను. నా ప్రశ్నలు విని ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు. తర్వాత ‘ఈ ఊళ్లో మా కుటుంబం ఇంకా బతికే ఉందంటే అది మీ నాయిన వల్లే. అందుకే ఇప్పటి దాంకా నాకు, మీ నాయినకు మాత్రమే తెలిసిన ఆ రహస్యాన్ని నీకు చెప్తాండా. కానీ నువ్వు మాత్రమ ఎవరికీ చెప్పకు రా బ్బిగా’అంటూ నాతో ఒట్టు వేయించుకున్నాడు. ‘సరే’నని చేతిలో చేయి వేశా. అటూ ఇటూ చూసి మెల్లగా నోరు విప్పాడు. ‘‘వాడు అసలు కాటిపాపడే కాదు’’ అన్నాడు. ఆ మాటతో ఉలిక్కిపడ్డాను. వెంటనే ‘‘నీకెలా తెలుసు?’’ ఠకీమని వచ్చిందా ప్రశ్న నా నోటి నుంచి. మళ్లీ అటూ ఇటూ చూసి గొనుగుతున్నట్లు అన్నాడు ‘‘వాడు నా తమ్ముడు’’ ఈసారి కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. కాసేపటి వరకు తేరుకోలేకపోయాను. తిరిగి ఏదో అడగబోయే లోపు తనే మొదలెట్టాడు. ‘‘ఇరవయ్యేండ్ల కిందటి దాంకా మాగ్గూడా గెయి కాడ ఐదెకరాల తోట ఉన్యాది. మా పక్క తోట కాపోళ్లు దావకు, గెయిలోని నీళ్లకు మాతో రోజూ కొట్లాడతాన్యారు. వాళ్లేమో పదిండ్లోళ్లు. మా నాయిన ఒక్కడే. ఊరికూరకనే మా నాయిన్ను కొట్టడానికి వచ్చాన్యారు. మా నాయినా మొండోడే.. మీ నాయిన అండగా ఉండడంతో వాళ్లతో అట్నే తగులాడ్తాండ్య. కానీ.. ఆ కాపోళ్లు మాత్రం పిల్లోళ్లమని గూడా సూడకుండా మమ్మల్నీ నానా తిట్లూ తిడతాన్యారు. ఓ రోజు పందులు తోట్లో పడకుండా కాపలా కాసేందుకు నేను, చిన్నోడు తోటకాడికి పోయినాం. తెల్లారితే గంగమ్మ తిన్నాళ. పొట్టేల్ని కోచ్చామని మొక్కుబడి ఉండడంతో ఆ రోజు కాపలాకు నాయన రాల్యా. ఇంటికాడ్నే ఉన్యాడు. తోట కాడికి నేను, చిన్నోడే పోతిమి. అర్ధరేత్రి కాస్త కునుకు పట్టడంతో చిన్నోన్ని సూచ్చాండమని చెప్పి పడుకున్యా. రోంత సేపటికి మెలకువ వచ్చి చూచ్చే చిన్నోడు లేడు. గబగబా మంచె దిగి కేకేచ్చి. గెయి కానుంచి పరిగెత్తుకుంటా వచ్చినాడు. మనిషి బాగా పదుర్తనాడు. ‘యాడికి పోయిన్యావు రా’ అంటే సెప్పల్యా. తెల్లారుజామున నాలుగ్గంటకు తిరిగి ఇంటికి బయల్దేర్నాం. దావలోనే కాపోళ్ల నడిపోడు ఎదురైనాడు. తోటకు నీళ్లుగట్టను పోతాన్నెట్టుండాడు. మమ్మల్ని జూసి తిట్లందుకున్యాడు. మేమేమో తలొంచుకొని ఇంటికొచ్చినాం. అప్పటికే తిన్నాళ బోయెందుకు ఇంటి కాడ నాయిన, అమ్మా ఎడ్లబండితో సిద్ధం ఉన్యారు. మేమూ రెడీ అయ్యి దావ పట్టినాము. తిరిగొచ్చేటపుడు తిన్నాళలో చిన్నోడు తప్పిపోయినాడు. ఎంత ఎదికినా కనపల్య. అమ్మా, నాయినా, నేను ఏడ్సుకుంటా ఇంటికొచ్చేసరికి ఊళ్లో కాపోళ్ల నడిపోడు సచ్చిపోయినాడని తెలిసింది. గెయికాడ తోటకు నీళ్లు కట్టనుబోయి కరెంటు తగిలి సచ్చిపోయినాడని ఊరంతా అనుకుంటనారు. నాకు రోంత అనుమానం వచ్చింది. రాత్రి చిన్నోడే కరెంటు తీగను తెంచి పెట్టినాడేమో అనుకున్యా. నాయినకు, అమ్మకు చెప్పినా. వాళ్లు ఆ మాట ఇంగేడా అనొద్దని ఒట్టేయించుకున్యారు. మీ నాయిన్ను పిలిచి, విషయం చెప్పినారు. అయితే, నడిపోడు చనిపోయిందాని మీద వాళ్లింటోళ్లకు ఎలాంటి అనుమానం రాకపోవడంతో విషయం బయటపడలే. ఆ తర్వాత కొన్ని రోజులకు మా భూమిని దగ్గరుండి వాళ్లకే అమ్మించి, సమస్య తెగ్గొట్టినాడు మీ నాయిన. మేము కుంటబాయి కాడ భూమి తీసుకుని బతుక్కుంటనాం. అందుకే మీ నాయినంటే నాకు అభిమానం’’ అన్నాడు నా వైపు చూస్తూ. ‘‘అది సరేన్నా.. భద్రప్పే మీ తమ్ముడని ఎలా కనుక్కున్నావ్?’’ అడిగాను నేను. ‘‘ చిన్నప్పుడు ఒగసారి వాన్ని రాయితో కొట్టిన్యా. ఆ దెబ్బకు వాని ఎడం సెవ్వుకు పెద్ద మచ్చ ఏర్పడిన్యాది. అట్నే వాని ఎడంసేతి సిటికెనేలు కాడ పెద్ద పుట్టుమచ్చ ఉన్యాది. వాడెప్పుడైనా కనబడ్తాడేమో అని ఈ గుర్తులు మర్సిపోవద్దురా అని మాయమ్మ సెప్తాండ్యా. భద్రప్ప సేతికి, సెవికి ఈ రెండు మచ్చలూ కనిపిచ్చినాయి. అందుకే నిన్న పొద్దన ఎవరూ లేనప్పుడు పోయి వాన్ని కలిసినా. వాడు నా తమ్ముడేనని ఒప్పుకున్యాడు. ఆ రోజు స్టార్టర్కు కరెంటు వచ్చేలా తగిలిచ్చినానని, అందుకే తిన్నాళ్లలో పారిపోయాననీ సెప్పినాడు. జరిగిందేదో జరిగింది మళ్లా ఇంటికిరా అన్యా. వాడు ఇన్లా. ఆ బాధలోనే రాత్రి తాగి వానిమింద తిట్లందుకున్యా. కానీ, తెల్లారే ఎళ్లిపోతాడని నాకూ తెలియదు’’ అని ముగించినాడు ఆకాశం వైపు చూస్తూ. ఏం చెప్పాలో తెలియక నేను అలాగే ఉండిపోయినా. ఆ తర్వాత నేను ఇంటికొచ్చా. కాలక్రమంలో మరో ఇరవయ్యేళ్లు గడిచాయి. నా చదువు పూర్తయ్యి హైదరాబాద్‌లో పెద్ద కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. ఎప్పుడైనా సెలవుల్లో ఇంటికెళితే ఇప్పటికీ శ్మశానం పక్కన అంగన్వాడీ కేంద్రాన్ని చూసినప్పుడల్లా నాకు భద్రప్పే గుర్తుకొస్తాడు. ఊర్లో వాళ్లందరూ దాన్ని ఇప్పటికీ అంగన్‌బడి, పిండిబడి అని పిలుస్తున్నా నాకు మాత్రం అది భద్రప్ప బడిగానే ముద్ర పడిపోయింది. - గౌకనపల్లె మహేశ్వరరెడ్డి -
ఈవారం కథ: ఆయన స్టైల్‌ను ఎవరూ తట్టుకోలేరు
కూనిరాగం తీస్తున్న సుబ్బారావు కొయ్యబారిపోయాడు... కారణం ఏమీ లేదు.. జస్ట్.. బ్రహ్మానందాన్ని చూశాడు.. అంతే. సుబ్బారావు బ్రహ్మానందాన్ని యథాలాపంగా చూసి ఎప్పటిలాగానే వెకిలిగా నవ్వబోయి చిన్నగా పిచ్చికేక వేశాడు. నోటమాట నోట్లోనే ఆగిపోయింది. ‘ఏందిది? ఈయన మన బ్రమ్మం పంతులేనా? ఇంత ఉషారుగా ఉన్నాడే.. ఎప్పుడూ ఈసురోమని ఏడుపు ముఖంతో తిరిగే బ్రమ్మం.. ఇయ్యాల.. అబ్బో.. కిర్రెక్కిపోతన్నాడే..’ అది గాయత్రీనగర్‌లో ఐదోవార్డు. బ్రమ్మం అనే కూచిపూడి వీరవెంకట లక్ష్మీ బ్రహ్మానందం అదే ప్రాంతంలో బతుకుతున్న ఓ ప్రాణి. ఐదోవార్డు మునిసిపాలిటీ పిల్లల బళ్ళో పంతులు. మానవుడే కాని పెద్దగా గుర్తింపుకు నోచుకోని ప్రాణి. డ్రైనేజీ మీద తిరిగే పురుగు. రోడ్డుపక్కన గజ్జి కుక్కపిల్ల. గాలికి దొర్లే ఎండుటాకు. ఇది ఊర్లో బ్రహ్మానందానికి ఉన్న హోదా.. నలభై ఏళ్ల బ్రహ్మం ఇంకో పదేళ్ళు మీదేసుకున్న శరీరుడు. అంత పొడుగూకాదు, పొట్టీ కాదు... అర్భకుడూ కాదూ దృఢకాయుడూ కాదు... అందగాడు కాదు, మరీ తీసిపారేసే రకమా..ఏమో! నవ్వకపోయినా పళ్లు బయటే ఉంటాయి. వాటి ఎత్తుపల్లాలు పళ్లమధ్య దూరాలు అందరికీ దర్శనభాగ్యం కలిగిస్తాయి. అప్పుడపుడు తల దువ్వుతాడు. ఎప్పుడన్నా పౌడర్రాస్తాడు. అప్పుడప్పుడు చొక్కాగుండీలు ఎగుడుదిగుడుగా పెట్టుకుంటాడు. ఎప్పుడన్నా ప్యాంట్ జిప్పు మర్చిపోతుంటాడు. ప్రశ్నవేస్తే కంగారు పడతాడు. జవాబు చెప్పలేడు. అప్పుడే ఏవిటో నత్తి వస్తుంది. నోట్లోంచి చొంగ కారిపోతుంది. అడిగినవాడు ఎందుకు అడిగాన్రా అని బాధపడతాడు. కూరగాయలవాడు బ్రహ్మంతో కామెడీ ఆడతాడు. రిక్షావాడు ఆయనతో బేరాలాట ఆడతాడు. కారణం? ఆ పర్సనాలిటీ, అ యాటిట్యూడ్ అలాంటిది! అలాంటి బ్రహ్మం ఇవ్వాళ అపరసూర్యుడిలా వెలిగిపోతున్నాడు. నిండుచందమామలా కాంతులీనుతున్నాడు. రజనీకాంత్‌లా ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నాడు. చిరంజీవిలా షర్ట్ గుండీలు తీసి అడుగేస్తున్నాడు. కమల్ హాసన్‌లా మృదువుగా నవ్వులు రువ్వుతున్నాడు. ‘‘ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు’’ అన్నట్లు మూర్తీభవించిన తెలుగు తేజంలా తేజరిల్లుతున్నాడు. ఆ ఊపూ.. చూపు.. తట్టుకోలేనట్లుగా ఉంది. సుబ్బారావే కాదు, బడ్డీకొట్టు సుందర్రావ్, ఎస్టీడీ బూత్ రంగనాయకులు, టిఫిన్ సెంటర్ వెంకటరావు, మిల్క్ సెంటర్ ప్రభావతి.. ఇలా అందరూ ఆయన స్టైల్‌ను తట్టుకోలేక షాకింగ్‌గా చూస్తూ ఉండిపోయారు. ఇది ఊర్లో సన్నివేశమైతే, ఇంట్లో సన్నివేశం మరింత షాకింగ్‌గా ఉంది. బ్రహ్మం భార్య రాజ్యం.. పొద్దున్నే ట్రిమ్ముగా తయారైన భర్త కొత్త అవతారం చూసి పక్షవాతం వచ్చినట్లు గిలగిల కొట్టుకుంది. ఎన్టీఆర్‌లా పంచకట్టి కొంగు జేబులో దోపాడు. పౌడరే కాదు, సెంటు కూడా కొట్టాడు. తల దువ్వాడు. దువ్వుతూ కూనిరాగాలు తీశాడు. మురికి హవాయ్ చెప్పులు వొదిలేసి, షూ తీసి పాలిష్ చేసి తొడిగాడు. వెళుతూ వెళుతూ రాజ్యం బుగ్గమీద చిటికె వేశాడు. రొమాంటిక్‌గా నవ్వాడు. ఆవిడ తేరుకోడానికి మినిమం అరగంట పట్టింది. కాలేజీ నుంచి వచ్చిన కొడుకు ఫణి తల్లిని చూడగానే బిత్తరపోయాడు. ‘‘ఏంటమ్మా.. వొంట్లో బాలేదా.. విరోచనాలా..ఎన్ని?’’ అన్నాడు ఆమెనుచూసి. చెప్పేలోపే ఇంట్లోకొచ్చిన బ్రహ్మం ఆమె బుగ్గపై చిటికె వేసి లోపలికెళ్ళాడు. తల్లి చెప్పకుండానే తండ్రి చేసిన పనిచూసి బిర్ర బిగుసుకు పోయాడు ఫణి. ‘‘అమ్మా.. నాన్నేనా.. నేను చూస్తోంది నిజమేనా?’’.. ఆమె జవాబివ్వలేనట్లు వెర్రిచూపులు చూసింది. నిజానికి పెళ్లిచూపుల సమయానికి బ్రహ్మం నిజమైన బ్రహ్మానందంలా నిత్యం నవ్వులు చిందిస్తూ రొమాంటిక్‌గా కనపడ్డాడు రాజ్యానికి. ‘‘అబ్బాయి నచ్చాడామ్మా?’’ అని తండ్రి అడిగినప్పుడు నిజంగానే సిగ్గుపడిపోయింది. బుగ్గలు ఎరుపెక్కి పెదాలు వొణికాయి. ‘‘ఊ..సరే..ఆ..ఊ’’ అంది తియ్యతియ్యగా. పెళ్లినాటి ఆ హీరోయిజం బ్రహ్మంలో మధ్యాహ్న సూర్యకాంతిలా చాలాకాలం ప్రకాశించింది. రాజ్యాన్ని సంసారమనే ఆనంద లోకాలలో వోలలాడించింది. అప్పుడే ఫణి పుట్టాడు. తొలి కాన్పు కొడుకు పుట్టడం ఇద్దరికీ స్వర్గం చేతి కందినట్లయ్యింది. బ్రహ్మం ఉద్యోగం సజ్యోగం, డబ్బులు గిబ్బులు బయట గొడవలు రాజ్యానికి తెలియవు. పట్టవు. కాని బ్రహ్మం ఆమెకు ఏమీ చెప్పకపోయినా అన్నీ సమకూర్చేవాడు. ఏ లోటూ లేకుండా చూసుకునేవాడు. అలాంటివాడు రానురానూ తనలోతాను ముభావంగా.. అంతర్ముఖుడుగా.. మాటలు తగ్గి సణుగుడు ఎక్కువై.. దిక్కులు చూడటం.. తిండి ఏంటో..బట్టలేంటో.. పట్టించుకోనంతగా నత్త గుల్లలోకి ముడుచుకు పోయినట్లు ముడుచుకుపోయాడు. ఆమె సాధారణ ఇల్లాలు. దాంపత్యంలో వొకరు మెతక అయితే మరొకరు డామినేట్ చేస్తారు. అదే జరిగింది. ఆమె తనకు తెలియకుండానే కొంగు బిగించాల్సి వచ్చింది. కుటుంబ పగ్గాలు చేతికి తీసుకోవాల్సి వచ్చింది. ఏదో మొగుడనే వాడు ఉన్నాడు. రెండోతారీఖు జేబులో జీతం డబ్బులు ఉంటున్నాయి. అది చాలు.. ప్చ్.. అలా బ్రహ్మం రానురానూ ఇంటా బయటా బాగా చులకనైపోయాడు.. ఈ నేపథ్యంలో పుట్టిపెరిగిన ఫణి కూడా డిటోనే. ఫణికి ఊహ తెలిసేటప్పటికే మునగదీసుకుని సైలెంటుగా ఉండేవాడు బ్రహ్మం. అందుకని ఫణికి కూడా తండ్రిపై సదభిప్రాయం లేదు. ఇద్దరూ బ్రహ్మాన్ని చులకనగా సూటిపోటి మాటలతో ఆటపట్టించడం.. ఆడుకోవడం.. అలాంటిది ఇప్పుడు ఇలా బ్రహ్మంలో ఈ మార్పు వాళ్లకు ఊహాతీతం. హఠాత్తుగా తండ్రి పిలుపు విని అలా నిలబడిపోయాడు. ‘‘వొరేయ్.. ఫణి..’’ రెండు నిమిషాలు నిశ్శబ్దం.. మళ్లీ పిలిచాడు. ఈసారి గట్టిగా.. మరింత దృఢంగా.. ‘‘నిన్నేరా ఫణీ..’’ ఏవనాలో ఆలోచించేలోపే చెంప పేలిపోయింది. జరిగింది అర్థంకాలేదు వాడికి. తనను.. తండ్రి కొట్టాడు.. ఫణే కాదు రాజ్యనికి కూడా మతిపోయింది. ‘‘నాన్నా.. నే.. నేనే.. ఇక్కడే ఉన్నా.. చెప్పు నాన్నా’’ అన్నాడు వణుకుతూ.. ‘‘ముందు పిలవగానే పలకాలి.. నా ముందు నిలబడాలి.. ఓ కే..? ’’ భర్తలో రజనీకాంత్ కనిపించాడు రాజ్యానికి. సౌండు స్పష్టంగా ఉంది. ఇంతకు ముందు ఫణికి ఏ పనీ చెప్పలేక పోయేవాడు బ్రహ్మం. చెబితే వాడు కామెడీ విన్నట్లు విని ఊరుకునేవాడు. ఒక తల్లిగా ఆమెకు ఫణి ప్రవర్తన తప్పేనని తోచినా, బ్రహ్మం తీరు నచ్చక కొడుకును ఏమీ అనలేక పోయేది. ఇప్పుడు బ్రహ్మం అసలు సిసలు తండ్రిలా కొడుకుపై తన అధికారాన్ని ప్రదర్శించడం ఆమెకు లోలోన నచ్చేసింది. ‘ఇలా ఉంటే పిల్లాడు ఇక చెడిపోడు’ అనిపించి భర్తపై హఠాత్తుగా గౌరవం, అభిమానంలాంటి భావాలతోపాటు భర్త అనే తీయని భావన ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి మొలకెత్తింది. భర్తకు గ్లాసుతో మంచినీళ్లు స్వయంగా ఇచ్చింది. వచ్చేముందు చీర కుచ్చిళ్లు సవరించుకుంది. ఇచ్చేముందు తల, పైట సర్దుకుంది. ఇచ్చినవి నీళ్లే అయినా భర్తకు ఆమె ఇలా ఇచ్చింది ఎన్నో ఏళ్ల తర్వాత. భార్యలో కలిగిన ఈ మార్పును బ్రహ్మం చిరునవ్వుతో స్వీకరించి, థాంక్స్ చెప్పి ఆమె ముఖంలో నవ్వుల్నీ, బుగ్గల్లో లైట్‌గా ఎర్రెర్రని రొమాంటిక్ మందారాల్ని పూయించాడు. ఇక స్కూల్లో సన్నివేశం చూద్దాం.. ఐదోవార్డులోనే పుట్టిన బ్రహ్మం అదేస్కూల్లో చదివాడు. ఇప్పుడు అదే స్కూల్లో టీచరుగా ఉద్యోగం సంపాదించాడు. తర్వాత పెళ్లి.. ఆ తర్వాత కొడుకు పుట్టడం... ఇక్కడి వరకు బ్రహ్మానికి అన్నీ జాతకంలో ఉన్నట్లు చకచకా జరిగాయి. ఆదర్శ టీచర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి సడన్‌గా ఆతనిలో పెద్ద మార్పు.. ఐదో తరగతి సోషల్ పాఠం రెండో తరగతిలో చెప్పాడు. ఇది స్కూల్ అంతా గంట మోగినట్లు మోగిపోయింది. మరో రెండు రోజుల తర్వాత తెలుగు క్లాసులో లెక్కలు చెప్పాడట. తర్వాత ఐదో తరగతి పిల్లలతో అ ఆ లు దిద్దించాడట. కొత్తబట్టలతో వచ్చి హ్యాపీ బర్త్‌డే చెప్పిన పిల్లాడిని యూనీఫాం వేసుకు రాలేదని చితక్కొట్టాడట. పిల్లాడి బంధువులు ఆయుధాలతో వచ్చేసరికి బ్రహ్మం ఇంటికెళ్ళిపోవడం.. బంధువులు హెడ్మాస్టర్ని వాళ్ళ శక్తి కొద్దీ పేపర్లో వార్త వచ్చే స్థాయిలో ఆడుకోవడం జరిగింది. ఇలాంటి మధుర స్మృతులు ఎన్నో! అలా బ్రహ్మం ఇంటా బయటా సెంటర్ పాయింట్ అయిపోయాడు. అలాంటి బ్రహ్మం తిరిగి బ్రహ్మానందంలా అఖండ తేజస్సుతో వెలిగిపోతూ అందరికీ షాకిస్తున్నాడు. ఆ ఉదయం స్కూలు చదువుల తల్లిని ప్రార్థించబోయే వేళ.. స్కూలు ఆవరణలోకి అడుగుపెట్టిన బ్రహ్మాన్ని చూసి స్కూలు స్కూలంతా స్తంభించిపోయింది. రోజూ బ్రహ్మం లోపలికొస్తే ఏదో ఆవో గేదో కుక్కపిల్లో దారితప్పి లోపలి కొచ్చినట్లు ప్రార్థన ఆపేవారు కాదు. ఇవ్వాళ మాత్రం ట్రిమ్ముగా తయారై అచ్చ తెలుగు పంతులులా ఎంటర్ అయిన బ్రహ్మానందం మాష్టారు ధీమాగా విలాసంగా ప్రార్థన జరిగే చోటుకు వచ్చాడు. అంతా.. హెడ్ మాస్టార్తో సహా నోరుతెరిచి చూస్తుండిపోయారు. బ్రహ్మం గొంతు సవరించుకుని, మైక్ ముందుకొచ్చాడు. ‘మా తెలుగు తల్లికీ.. మల్లెపూదండ..’ అంటూ శ్రావ్యంగా, గంభీరంగా గొంతెత్తి హాయిగా అందరూ థ్రిల్లయ్యేలా పాడాడు. అంతా పిచ్చెక్కినట్లు చప్పట్లే చప్పట్లు.. ఎవ్వరివంకా చూడకుండా స్టైల్‌గా క్లాసు వైపు నడిచాడు. ఆరోజు స్కూల్లో అంతా బ్రహ్మం గురించే చర్చ. ఇలా ఎలా సడన్‌గా చేంజ్ అయ్యాడో అర్థం కావడం లేదు. బ్రహ్మం.. ఇప్పుడు ఆ పేటలో హాట్ టాపిక్.. అతనిలో వచ్చిన సడన్ మార్పు చూసి ఇరుగు పొరుగు పాతమిత్రులు, స్కూలు సహచరులు, బంధువులు అందరిలోనూ గగుర్పాటు, సంభ్రమం... మంచిబాలుడు అనిపించుకున్న బ్రహ్మం మెంటల్ బ్రహ్మంగా ఎందుకు తయారయ్యాడో, మళ్ళీ అసలు సిసలు బ్రహ్మానందంగా ఎలా మారాడో అందరికీ మిష్టరీగా మారింది. అందరి సంగతి వేరు. భార్య, కొడుకు సంగతి వేరు. వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మంలో వచ్చిన ఈ మార్పులకు కారణం ఏమిటో అర్థంకాక ఆలోచించి ఆలోచించి గందరగోళపడి చివరికి శవాన్ని మోస్తున్న విక్రమాదిత్యుడి లాంటి బ్రహ్మాన్నే అడిగారు. ‘‘అసలు అలా ఎందుకు తయారయ్యావు నాన్నా.. మళ్ళీ ఎలా ఇలా మారిపోయావు.. చెప్పాలి’’ అన్నాడు కొడుకు ఫణి. ‘‘చెప్పి తీరాలి’’ అంది భార్య రాజ్యం. ఆహ్లాదంగా నవ్వాడు బ్రహ్మం. ‘‘చెప్పాల్సిందేనా?’’ అన్నాడు రిలాక్స్డ్గా. చూస్తున్న టీవీని రిమోట్‌తో ఆపాడు. అర్ధ నిమీలితంగా చూస్తూ మెల్లగా మొదలెట్టాడు. ‘‘రామదాసు తెలుసుగా.. వాడే నాకు ద్రోహం చేశాడు..’’ ఉపోద్ఘాతంగా అన్నాడు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ‘‘తెలీక పోవడం ఏంటి.. రామదాసు అన్నయ్యగారు మీ క్లోజు ఫ్రెండేగా’’ అంది రాజ్యం. ‘‘ఈమధ్య అంకుల్కేదో..’’ అంటున్న ఫణిని ఆపమన్నట్లు చెయ్యెత్తాడు.. ‘‘ఆమధ్య టౌన్ హాల్లో జరిగిన మీటింగ్ లో రామదాసుగాడ్ని రాయితో తల మీద కొట్టాను’’.. రావణాసురుడ్ని చంపిన రాముడిలా, దుర్యోధనుడ్ని చంపిన భీముడిలా, జలియన్ వాలాబాగ్ లో జనాన్ని చంపిన డయ్యర్‌లా, కోర్టులో స్టేట్‌మెంట్‌లా చెప్పాడు. అర్థంకాలేదు ఇద్దరికీ. ‘‘వాడు నాకు ద్రోహం చేశాడు. చేశాడంటే వొక్కసారి చేశాడని కాదు. చేస్తూనే ఉన్నాడు.. నా చిన్న బతుకును చిదిమేశాడు. నాప్రాణాల్ని తనజేబులో పెట్టుకుని, వాడికి ఎప్పుడు సరదా అనిపిస్తే అప్పుడు నా పీకనొక్కుతూ ఆనందిస్తుండేవాడు. అందుకే ఆరోజు మీటింగ్‌లో రాయట్టుకుని పుచ్చె పగిలేలా కొట్టాను’’ ఆనందంగా కోరిక తీరినట్లు తృప్తిగా మెరిసేకళ్లతో చెప్పాడు. ఇద్దరికీ డౌట్స్ పెరిగాయేగాని, తగ్గలేదు. ‘వాడు ద్రోహంచేశాడు సరే, చాలాకాలంగా ఈయన బాధపడుతున్నాడు సరే.. అయితే చిన్న రాయితో కొట్టి అదేదో ఘనకార్యం చేసినట్లు ఈ బిల్డప్ ఏంటి?’ ‘‘వాడ్ని అసలు చంపేసెయ్యలని ఉంది. కాని నేను వాడ్ని ఏమీచెయ్యలేనని, మనకు అన్యాయం చేసే ప్రభుత్వాలను, మోసంచేసే మినిష్టర్లను, వొక్క కలంపోటుతో మన బతుకుల్ని ఛిద్రంచేసే ఆఫీసర్లని మనం ఏమీ చెయ్యలేక పోతున్నాం. అలాగే నేనూ వాడిని ఏమీ చెయ్యలేనని అర్థమై నాలోనేను ముడుచుకు పోయాను. కాని రాక రాక చిన్న అవకాశం వచ్చింది. నా కసి తీర్చుకున్నా’’ కసిగా చెప్పాడు బ్రహ్మం. ‘‘రామదాసుగాడూ నేనూ ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. బాల్య స్నేహితులం. చెడ్డీలులేని రోజుల నుంచే వాడు నాకు ద్రోహం చెయ్యడం ప్రారంభించాడు. మేమిద్దరం ఓ కుక్కపిల్లను పెంచాం. అదంటే నాకెంతో పిచ్చి. కాని వాడు దానికేం పెట్టేవాడుకాడు. నేనే తిండి మానేసి దానికి పెట్టేవాడ్ని. వొకసారి కుక్కపిల్ల కాలు వాడి సైకిల్ చక్రంలో పడి విరిగింది. అది కుయ్యో కుయ్యోమని ఏడవటం ఇప్పటికీ నాచెవుల్లో అలా ఉండిపోయింది. వాడు దాన్ని కాపాడతానని అందరికీ చెప్పి దొడ్లో ఓ మూల వొదిలేశాడు. నాకు నిద్రపట్టక దాన్ని చూద్దామని వాళ్లింటికి వెళ్లాను. అది వర్షంలో వణుకుతూ ఏడుస్తోంది. నేను విలవిల్లాడిపోయా. వాడ్నిలేపి ఇదేంట్రా అని అడిగా. వాడు నిద్రలేపిన కోపంతో ఆ కుక్కపిల్లను అప్పటికప్పుడు పెద్ద రాయితో కొట్టి కొట్టి చంపాడు. నా కళ్ళముందే అది గిలగిలకొట్టుకుని చచ్చిపోయింది. ఇదే వాడి నైజం. అప్పటికీ ఇప్పటికీ ఇదే వాడి ప్రవర్తన. అదెప్పుడో నా పదేళ్ల వయస్సులో జరిగింది. ఇప్పటికీ నా గుండెల్లో చెరగకుండా ఉండిపోయింది. రామదాసు విషప్పురుగు. పుట్టినప్పటి నుంచి నామీద ఎప్పుడూ వాడి విషపు పడగనీడ.. వాడు ఏనాడూ చదివి పాసవ్వలేదు. అన్నీ నా దాంట్లో చూసి రాసి పాసయ్యేవాడు. స్కూల్లో ఎలా మేనేజ్ చేసేవాడో.. ఎప్పుడూ నా వెనకే నెంబర్ వచ్చేది.. ఏడో తరగతిలో నన్ను డిబార్ చేశారు. వాడు చూసి రాసినందుకు కాదు, నేను చూపించినందుకట. హెడ్ మాస్టర్ మళ్లీ ఇలా జరిగితే టీసీ ఇచ్చి పంపేస్తానన్నాడు. అదిమొదలు నాకు చూపించకపోతే టీసీ ఇప్పించేస్తా అని బ్లాక్ మెయిల్ చేసేవాడు. అలా టెన్త్ అయ్యాక మళ్లీ ఇంటర్‌లోనూ ఒకే కాలేజీ. మళ్లీ పరీక్షల్లో నా పక్కనే వాడి నెంబరు. ఫస్ట్ ఇయర్లో మళ్లీ నేనే డిబార్. నా ఆన్సర్ పేపర్ వాడి ఆన్సర్ పేపర్లతో కలసి కుట్టి ఉంది. రామదాసు అంటే మా నాన్నకు మహా గురి. ఎలాంటి సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేస్తాడని ఆయన నమ్మకం. ఆయన రిక్వెస్టుపై నా డిబార్ కాన్సిల్ చేయించి, మళ్లీ బ్లాక్ మెయిల్. అలా ఇంటర్ అయ్యింది. డిగ్రీ బందరులో చదవడం వల్ల క్లాసులో లేడు. వారం వారం ఇంటికొచ్చినప్పుడు వదిలేవాడు కాదు. ‘ఒరే బ్రమ్మీ.. నన్ను మర్చిపోయావ్బే..’ అంటూ వచ్చేవాడు. చుట్టూ పెద్ద బేచ్.. ‘నా చిన్ననాటి క్లోజ్ ఫ్రెండ్’ అని పరిచయం చేశాడు. నోరు తెరిస్తే బూతులు. వినకూడదనుకున్నా వినేటట్లు చెప్పేవాడు. అన్నీ గొడవలే.. ‘అదిగో పంపుదగ్గర నీళ్లు పట్టుకుంటోందే ఆ చిట్టిబాబుపెళ్లాం.. పెద్ద కేసు.. వంద ఇస్తే పక్కలోకి వచ్చేస్తుంది. మీ పక్కింటి సుందర్రావు.. వడ్డీకిచ్చి ఆడోళ్లని పక్కలోకి రమ్మంటాడు’.. వీళ్లందరితోనూ రామదాసుకి సంబంధాలు.. వాడి ఫ్రెండ్స్ అందరూ ఏవేవో అల్లర్లలో ఉంటారు.. అన్నీ సెటిల్మెంట్లు.. ఇరువైపులా డబ్బువసూళ్లు.. వొకరోజు నా గుండెల్లో బాంబు పేల్చాడు. ‘ఎంట్రోయ్ బ్రెమ్మీ.. చూస్తే డొక్కు పర్సనాలిటీగాని అమ్మాయిలు నీకే పడిపోతున్నార్రోయ్’ అన్నాడు. నేను అయోమయంగా చూశా. ‘గీత.. రామాచారి కూతురు.. నువ్వంటే ఫిదా.. తెల్సా’ అన్నాడు. మావూరి రామాలయం పూజారి కూతురు. చిన్నప్పటినుంచి ఇద్దరికీ తెల్సు. నేను ఉక్కిరిబిక్కిరయ్యా. గీత నన్ను ప్రేమిస్తోందా? గీత గీతలా నాజుగ్గా ఉంటుంది. ధ్వజస్తంభంలా పవిత్రంగా ఉంటుంది. ‘ఏంట్రా నీడౌటు.. తనే నాతో చెబితేనూ’.. నేను బాగా దెబ్బతినేశా. ‘నీతో చెప్పలేక నాతో అంది. నువ్వు మూలి వెధవ్వి.. చెప్పలేవ్.. లెటర్ రాసి నాకివ్వు.. నేజూసుకుంటా’... నాకూ గీతకుమధ్య వాడే పోస్టుమేన్. ఏదేదో కవిత్వం రాసేసేవాడిని తనూ ఏదేదో రాసేది. వందసార్లు అక్షరం అక్షరం చదువుకునేవాడిని. వోరోజు పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. గీత కడుపు తీయించుకోవడానికి ఏదో తాగి చచ్చిపోయింది. నా లెటర్స్ దొరకడంవల్ల నేనే కారణం. అసలు కారణం రామదాసు. వాడు తప్పుకుని నన్ను సాక్ష్యాధారాలతో పట్టించాడు. ఆమె తల్లిదండ్రులు గుళ్లో ఉరివేసుకుని చనిపోయారు. నా నవనాడులూ కుంగిపోయాయి. ఇంత ద్రోహమా! మొదటిసారి పిచ్చివాడినయ్యా. మా నాన్న పొలం అమ్మి వాడి చేతిలో పెట్టి కన్నీటితో కాళ్లు కడిగాడు. వాడు కేసులోంచి బయట పడేశాడు. అర్థమయ్యిందా.. మళ్లీ బ్లాక్ మెయిల్.. ‘నోరెత్తావో ఉరికంబమే’.. నాన్న మిగిలిన పొలం అమ్మేశాక వాడు నాకు ఉద్యోగం వేయించాడు. అటు వాడు పెద్ద లీడర్‌గా ఎదిగిపోతున్నాడు.. తగువులు..సెటిల్మెంట్లు.. చిట్టిబాబు తన పెళ్లాన్ని చంపేశాడు. సుందర్రావ్ను జనం రోడ్డుమీద ఈడ్చిఈడ్చి కొట్టారు. కొన్నివడ్డీలు మాఫీచేసి రామదాసుగాడు కేసులు సెటిల్ చేశాడు. పోలీసొకడు.. వొక జర్నలిస్టు. వీడి బాచ్‌లో ప్రముఖ వ్యక్తులు. హమ్మయ్య.. నన్ను వొదిలేసి ఊరుమీద పడ్డాడు అనుకుని ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంటే మళ్లీ పడగ విప్పాడు. ‘పదో తరగతి పాస్ చేయిస్తానని బ్రహ్మం మాష్టారు పాతికమంది దగ్గర డబ్బువసూలు’.. ఓరోజు పేపర్లో న్యూస్. నా మీద ఎంక్వైరీ. సస్పెన్షన్. వాడిబృందం అందరూ చేశారు. నామీద పెట్టారు. నాన్న ఇల్లు అమ్మాడు. నాకు మళ్లీ పోస్టింగ్. ఈసారి ఐదో వార్డు స్కూల్లోనే. ‘మన దగ్గరుంటే మరీ మంచిది. నువ్వేం భయపడకు బాబాయ్. నేనున్నాగా..’ నాన్నకు వాడిచ్చిన భరోసాతో ఆయన తృప్తిగా చనిపోయాడు. ఇదీ నా బతుకు. నాకేం దారిలేదు.. వాడి పడగనీడ నుంచి తప్పుకోలేను.. రోజురోజుకూ మరీ విషపు కోరలు దగ్గరగా నాతలపై తాండవమాడుతున్నట్లు ఫీలింగ్స్.. నాకు మరోదారి లేదు.. అలాఅలా నిస్పృహలో కూరుకుపోయాను. అలాంటి స్థితిలో నాకో సువర్ణావకాశం వచ్చింది. ఆరోజు ఎక్సై్సజ్ మంత్రి గిరిధర్గారికి టౌన్హాల్లో సన్మానం. ఆయన మరో మంత్రి శివశంకరాన్ని తప్పించి ఆ మినిస్ట్రీ సంపాదించాడు. దోచుకోడానికే మినిస్ట్రీ మారాడని పేపర్లు టీవీలు ఘోషించాయి. మరో పక్క అపోజిషన్ పార్టీ వాళ్లు ఇదే సమయమని ఎటాక్ బాగా పెంచేశారు. రోజూ పేపర్లో చూస్తున్నారుగా ఊర్లో అల్లర్లు.. రెండు పార్టీలు.. నాలుగు గ్రూపులు.. తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. చంపుకునే స్థాయికి వెళ్లినట్లు ఊరంతా చెప్పుకుంటున్నారు. అనుకోకుండా హాల్లోకి వెళ్లా.. మీటింగు మొదలవ్వకముందే గొడవ.. అసలు అంతా కొట్టుకోవడానికే వచ్చారా అన్నట్లుంది ఆ వాతావరణం. నాయకులు ఒక్కొక్కరూ స్టేజిమీదకు వస్తున్నారు. చూస్తున్న నా కళ్లు బైర్లుకమ్మాయి. మనపాపి రామదాసుగాడు కూడా స్టేజి ఎక్కాడు. ఇదేంటి.. ఈడు ఆ పార్టీలో ఉన్నాడుగా.. ఈ పార్టీ మీటింగులో.. అంటే మళ్లీ పార్టీ మారుతున్నాడా.. వోరి ద్రోహీ.. ఆ పార్టీ వల్ల కౌన్సిలర్వయ్యావ్గా.. ఈ పార్టీలో దూరి చైర్మన్ అయిపోదామనుకుంటున్నావా.. ద్రోహి.. ఎంత మోసం.. నాలో కోపం ఉద్వేగం పెరిగిపోతున్నాయ్. క్షణ క్షణానికీ కోపంతో కసితో వొళ్ళంతా వణుకుతోంది.. ఎన్నో రోజులనుంచి వాణ్ణి చంపాలనుకున్న నా భావాలు.. ఏమీ చెయ్యలేని నా నిస్సహాయత.. నా చేతకానితనం.. పిచ్చివాడిగా మిగిలిన నా బతుకు.. చిన్ననాటి నుంచి వాడుచేసిన ద్రోహాలు.. కుక్కపిల్ల.. అమాయకంగా నమ్మి ఆత్మహత్య చేసుకున్న గీత.. ఉరి వేసుకున్న గుళ్లో పంతులు కుటుంబం.. సుందర్రావ్.. చిట్టిబాబు..ఇలా అందరూ నా కళ్లముందు.. నాలో క్రోధం.. బాధ.. వాడున్న ఆ హాల్లో వంద పాముల మధ్య నిలబడినట్లు.. వందగద్దలు నన్ను పొడుచుకు తింటున్నట్లు.. కుమిలిపోతున్నా.. ఏం చెయ్యాలి..లోలోన అల్లకల్లోలమైపోతున్నా.. అప్పుడు జరిగింది.. ఎలా జరిగిందో.. ఎక్కడ మొదలైందో.. ఓ కుర్చీ ఎగిరి స్టేజ్ వైపు వెళ్లి మినిస్టర్ ముందుపడింది.. ఎవరో అరిచారు.. మరొకరు బూతులు.. స్లోగన్లు.. ఇంకొకరు పక్కవాడ్ని ఈడ్చి తన్నాడు.. గాల్లో కుర్చీలు కర్రలు.. హాకీ స్టిక్కులు.. క్షణాల్లో యుద్ధభూమిగా మారిపోయింది.. రక్తం.. హాహాకారాలు.. స్టేజ్‌పై గెస్టులు ఎవ్వరూ లేరు.. ఏమయ్యారు.. ఈ పాపిగాడెక్కడ.. అంత గోలలోనూ నా చూపు వాడి కోసమే.. అంతా స్టేజి వెనక్కిపోయి దాక్కున్నారు.. వొంగొని వెనక్కి చూశాను.. ఓ కుర్చీ చాటుగా పెట్టుకుని చావు భయంతో నిక్కి నిక్కి చూస్తున్నాడు రామదాసుగాడు. నాబుర్రలో మెరుపు.. వేగంగా బయటకు పరిగెత్తి ఓ రాయిని.. చేతిలో అమిరే రాయిని తీసుకుని గిరుక్కున తిరిగొచ్చా.. నా గురి తెలుసుగా.. అటూఇటూ చూశా.. ఎవ్వరూ నన్ను చూడటంలేదు..స్టేజ్ వెనక్కువెళ్లా.. వాడు అక్కడే ఓ కుర్చీ వెనగ్గా.. క్షణంలో వెయ్యోవంతు.. నా చేతిలోని రాయి.. వాడి తలకు గురిపెట్టి విసిరా. ఫర్ఫెక్ట్గా తగిలింది. మరుక్షణం.. ఎర్రెర్రగా ఎగసిన రక్తం.. వాడి తలలోంచి.. నా లోలోపల మండుతున్న నిప్పు మీదకి చిమ్మినట్లు.. ఆ చిమ్మిన రక్తం.. నాలోని నిప్పును ఆర్పేసినట్లు.. నేను పారిపోలేదు రాజ్యం! అక్కడే నిలబడి ధైర్యంగా.. ఆనందంగా.. తృప్తిగా చూస్తున్నా.. వాడు.. ఆ పాపి రామదాసుగాడు నన్ను చూశాడు. నన్ను.. నా విజయగర్వాన్ని.. నా ముఖంలో తృప్తిని చూసాడ్రా ఫణి! వాడి ముఖంలో దిగ్భ్రమ.. ‘నువ్వా..బ్రహ్మీ..నువ్వు? నన్ను?’.. అంతే.. కుప్పకూలిపోయాడు.. చాలు.. నా వొళ్ళంతా జలదరించింది.. నన్నెవ్వరూ గుర్తుపట్టలేదు. అంతా గోల గోల.. ఎగురుతున్న కుర్చీలు.. పడిపోతున్న శరీరాలు.. ఎవరు చస్తున్నారో ఎవరు చంపుతున్నారో నాకు అనవసరం.. ఆ యుద్ధభూమిలో నా శత్రువును నేను కొట్టగలిగిన దెబ్బ.. నా కసి తీరేటట్లుకొట్టా.. చాలు.’’ నవ్వుతున్నాడు బ్రహ్మానందం.. లేచి నిలబడి జేబులో చేతులుపెట్టుకుని.. ఆనందంగా.. తృప్తిగా.. పగలబడి నవ్వుతున్నాడు.. రెండు క్షణాలు ఆయనవంక ఆశ్చర్యంగా.. సంభ్రమంగా చూశారు భార్య, కొడుకు. ‘‘ఐదోవార్డు కౌన్సిలర్ రామదాసు టౌన్హాల్లో జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా దెబ్బతిని కోమాలో ఉన్నారు’’ అని టీవీలు ఊదరగొట్టిన సంగతి ఇద్దరికీ సుపరిచితమే.. వాళ్లిద్దరికీ పూర్తిగా అర్థమయ్యాక నవ్వొచ్చింది. ఆయనతో కలసి ముగ్గురూ నవ్వారు.. ఆ రాత్రంతా... గుండెలు నిండిన విశ్వాసంతో నవ్వుతూనే ఉన్నారు.,, జీవితమంతా... - మత్తి భానుమూర్తి -
ఈవారం కథ: అనుపమ ఆకాశ్
అను..ప..మా.. మునుపటిలా నిన్ను ‘అనూ’ అని చనువుగా పిలవటానికి ఎందుకో కొంచెం సంకోచంగా అనిపించింది! ఈ ఉత్తరం చదివాక, అలా పిలవగలిగే స్వతంత్రాన్ని నువ్వే ఇవ్వగలవని నాకు నమ్మకంగా అనిపిస్తోంది! ఇంతకు మునుపు మనిద్దరం చూసిన సినిమాల గురించి, టీవీ ప్రోగ్రాములనూ విశ్లేషిస్తూ చర్చించటం, ఆ చర్చలను సరదాగానే ముగించటం జరిగేది కదా..! కానీ.. నాలుగు రోజుల క్రితం.. ఒక సినిమా ముగింపు నాకు నచ్చలేదని చెప్పగానే.. నీకంత ఆవేశం ఎందుకు వచ్చిందో..! ఆ మాత్రానికే.. న్యాయం వైపు కాకుండా, పురుష పక్షపాతిలా మాట్లాడానని తీర్మానించేశావ్! పెళ్లికి ముందు మనం కలసి చూసిన ఒక సినిమా గురించి.. ‘హీరోయిన్ భర్త వలన రకరకాలుగా హింసకు గురవుతూ కూడా అలా అతని దగ్గరే ఉండటమెందుకూ, విడిచి వెళ్లాలిగానీ’ అని నేననటం నిజమే..! ఆ మాటల్ని ఉదహరిస్తూ.. మన పెళ్లి అవగానే, అసలు నైజాన్ని బయటపెడుతూ మగవాళ్లని సమర్థిస్తున్నానని ఆరోపించావ్! నీ మాటలకు నవ్వాలో, ఏమనుకోవాలో తెలియలేదు! రెండు సందర్భాల్లోనూ భార్యాభర్తల సమస్యేగానీ స్వరూపం మాత్రం పూర్తిగా వేరే వేరే కదా! అందుకే కదా, నేను ఆ సినిమా ముగింపు ఇంకో విధంగా ఉంటే బావుండేదని అన్నాను! సమస్యని బట్టే పరిష్కార మార్గం ఉండాలి గానీ, అన్ని రోగాలకీ ఒకటే మందులా అనలేం..! నిజమేగా..? మీ ఇంటికి వెళ్లాలని అంతకుముందే సర్ది ఉంచుకున్న సూట్‌కేసును తీసుకొని కోపంగా వెళ్లిపోతూ.. నా వివరణ బట్టే నీ స్పందనా ఉంటుందని చెప్పావ్! తమాషాకి అలా అన్నావని మొదట అనుకున్నాగానీ, ఈ నాలుగు రోజులుగా, నా పలకరింపులకు బదులివ్వకుండా ఫోన్ ఆపేయటాన్ని బట్టి, నువ్వు సీరియస్‌గానే భావిస్తున్నావని అర్థమైంది! అందుకే, ఇక ఆలస్యం చేయకుండా.. నీతో వివరంగా మాట్లాడదామని, కంప్యూటర్ ముందు కూర్చుని, నీకిలా ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. మన మనసులలో.. ఒక మూల ఒదిగి ఉండిపోయిన కొన్ని సంఘటనల జ్ఞాపకాలు, మనకు విలువైన పాఠాలనే నేర్పిస్తాయి! ప్రేమ, క్షమ.. ఒకే నాణేనికి ఉండే బొమ్మ, బొరుసులాంటివని అనుకుంటాను. ఈ అభిప్రాయానికి బలం చేకూర్చిన సంఘటనలు వివరిస్తాను. మరి మొదలుపెట్టనా..? హైస్కూలు చదువులో ఉండగా జరిగిందిది. స్కూలు వదిలాక ఇంటికి వచ్చిన నేను ముందుగదిలో జరిగినది చూసి నిశ్చేష్టుడనై గుమ్మం దగ్గరే రెండు క్షణాలు నిలబడిపోయా. ‘ఎన్నిసార్లు పదే పదే అదే మాట చెబుతావ్.. నా మాటంటే లక్ష్యం లేదా..?’ అంటూ నాన్న ఆవేశంగా అమ్మ చెంపమీద ఒక్కటిచ్చాడు! అమ్మ కూడా కొయ్యబారినట్లయిపోయి.. వెంటనే తేరుకొని, గదిలోకి వెళ్లిన నాన్నని అనుసరించి తనూ వెళ్లింది. నేను కూడా నెమ్మదిగా అమ్మ వెనకాలే వెళ్లి గుమ్మం దగ్గరే ఆగిపోయాను. నాన్న అలా అమ్మ మీద చేయి చేసుకోవటం నేనెప్పుడూ చూడలేదు. అమ్మ.. నాన్న షర్టు పట్టుకొని ఎందుకలా చేశారని నిలదీస్తుందనుకున్నాను. కానీ.. అక్కడ జరుగుతున్నది వేరేగా ఉంది! దెబ్బ తిన్న అమ్మే నాన్న తల నిమురుతూ ‘ఏమైంది.. ఆఫీసులో ఏమైనా జరిగిందా..? ఎందుకంత ఆవేశం వచ్చిందీ..?’ అని అనునయిస్తోంది! నాకైతే చాలా చిత్రంగా అనిపించింది. వెనక్కి వచ్చేశా. ఊరు నుండి ఏదో శుభకార్యానికని వచ్చిన నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, మా మేనత్త అంతా ఆ ముందుగదిలోనే కూర్చుని ఉన్నారు. నేనూ ఒక వార బల్లమీద కూర్చుండిపోయాను. రెండు నిమిషాలకే అమ్మ గదిలో నుండి వచ్చి, వంటగదిలోకి వెళ్లి అందరికీ ‘టీ’ చేసి తీసుకువచ్చింది. ఏమీ జరగనట్లు మామూలుగానే ఉంది. అత్త నాన్నని టీ తాగటానికి రమ్మని కూర్చున్న చోట నుండే కేక పెట్టింది. నాన్న వచ్చి అమ్మ పక్కనే కూర్చుని, అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుని తన చెంపకు రెండుసార్లు తాటించి ‘ఆవేశంలో తప్పు చేశాను. ఇది చాలా..? కోపం పోలేదంటే కాళ్లూ పట్టుకుంటాను..’ అన్నాడు క్షమాపణ కోరుతున్నట్లుగా. అమ్మ మొహంలో కనిపించిన చిన్నపాటి అలకా తొలగిపోయింది. ‘చాల్లెండి..’ అంటూ సరదాగా నవ్వేస్తూ టీ కప్పు అందించింది. అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నట్లయి.. మామూలుగానే కబుర్లలో పడ్డారు. అందరి మధ్యా చెంపదెబ్బ తిన్నానని అవమానంతో అమ్మ రెచ్చిపోలేదు. శాంతం వహించింది! నాన్న కూడా ఏమాత్రం అహం, భేషజం లేకుండా, గదిలో కాకుండా అందరి మధ్యా క్షమాపణ అడిగాడు! వాళ్లిద్దరూ సమస్యను పెద్దది చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోగలిగారలా! అందరూ వెళ్లిపోయాక, అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు పక్కన కూర్చుని ఆ విషయం గురించి అడిగాను. ‘అందరి ముందూ కొట్టినందుకు, ఎదురుతిరగటమో, నిలదీయటమో కాకుండా నువ్వే తప్పు చేసినట్లుగా నాన్నని లాలిస్తున్నావేంటో, నే చూశాలే..’ అన్నా. అమ్మ చిన్నగా నవ్వింది. ‘అలవాటుగా తప్పు చేసేవాళ్లని సమర్థించలేం గానీ, క్షణికావేశాన్ని అర్థం చేసుకోవాలి... అవునా? కొందరు తమ వాదనకు బలం చేకూర్చుకోవట మన్నట్లుగా ఆడవాళ్లపై చెయ్యి చేసుకుంటారు. మీ నాన్నకు అలాంటి అలవాటు లేదు! మరి అలాంటప్పుడు ఎందుకలా జరిగిందనే ఆదుర్దాయే గానీ నేనేం నామర్దాగా అనుకోలేదు! ఏ సంఘటనని అయినా బేరీజు వేసి చూసుకోవాలనుకున్నప్పుడు నా దగ్గర ఒక తక్కెడ ఉంది. ఒక చిన్న తప్పుకు తూకంగా నన్ను మెప్పించిన ఎన్నెన్నో అనుభూతులను వేసి చూసుకుంటే, అప్పుడు తెలుస్తుంది.. ఆ తప్పు క్షమార్హమా కాదా అన్నది! అర్థమైందిగా..?’ అనడిగింది. మళ్లీ నవ్వు మొహంతో చూసి ‘అందరి ముందూ అవమానంగా కొట్టారనే దానికంటే, బెట్టు లేకుండా మెట్టు దిగి వచ్చి, ‘కాళ్లు పట్టుకుంటా’ అని అడగడం గొప్ప విషయంగా నాకనిపించింది!’ అంది. అప్పుడే నాకో విషయం అర్థమైంది. ప్రేమ బలంగా ఉన్నచోట.. తప్పు తేలికవుతుంది! అవును.. ప్రేమ వెంటే క్షమా ఉంటుంది! నేరం తీవ్రతను బట్టే శిక్షా ఉండాలి గానీ.. అన్ని సమస్యలకీ ఒకే పరిష్కారమార్గం కాకూడదు! అందుకేనేమో... గుర్రాన్ని, గాడిదను ఒకే గాటను కట్టటమా అనే సామెత పుట్టింది! అవునా..? ఇక ఇంకో సంఘటన గురించి చెబుతాను. నా చదువు పూర్తయ్యిం దని పించి ఉద్యోగాన్వేషణలో ఉండగా, మా నాన్న స్నేహితుడొకరు ఒక సలహా ఇచ్చారు. మాకు కొంచెం దూరంలోనే ఉన్న బస్తీలో ఇంటర్య్వూలకు హాజరయ్యే అభ్యర్థులకు అన్ని విషయాల్లోనూ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ పెట్టారనీ, అందులో చేరటం ప్రయోజనకరంగా ఉంటుందనీ! ఆ వూళ్లోనే మా నాన్నకు చిన్నాన్న కొడుకు, నాకు వరుసకు బాబాయ్ అయ్యే ఆయన ఒకరున్నారు. మా నాన్న చిన్నాన్న చిన్న వయసులోనే చనిపోతే, మా తాతయ్యే తన తమ్ముడి పిల్లలనూ సొంత పిల్లలుగా చూసుకున్నారట! వాళ్లు ఉద్యోగాలలో స్థిరపడ్డాక అంతగా రాకపోకలు లేవు. దూరాభారం అవటం వలనే కావచ్చు. నన్ను ఇన్స్టిట్యూట్లో చేర్చే ముందు ఆ ఊళ్లోనే ఉంటున్న మా బాబాయ్‌నీ పలకరిద్దామని నాన్న వాళ్లింటికి తీసుకువెళ్లారు. విషయం తెలిసి బాబాయ్ కొంచెంగా నొచ్చుకుని ‘అన్నయ్యా.. వీడిని మా ఇంట్లో ఉంచకుండా, ఎక్కడో రూమ్‌లో ఉండమంటున్నావ్. ఇది నాకేం బావుండలేదు. ఒకే చోట సొంత అన్నదమ్ములుగా పెరిగిన వాళ్లమేగా.. ఇప్పుడెందుకు తేడా చూపిస్తున్నావ్..? నేనూ లెక్చరర్నే కాబట్టి, వీడికి కొంత ట్రైనింగ్ ఇచ్చే విషయంలో సాయపడతాను కూడా’ అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అప్పుడు పిన్ని ఇంట్లో లేదు. ఎక్కడికో వెళ్లింది. ‘అమ్మాయినీ ఒక మాట అడగాలి కదా’ అని నాన్నంటే, బాబాయ్ ‘అవసరం లేదు. తన సంగతి నీకు తెలుసుగా’ అంటూ నాన్న అభ్యంతరాల్ని కొట్టిపారేశాడు. దాంతో నాన్న ఏమనలేక, ‘నీకు ఇబ్బందిగా అనిపించినప్పుడే, ఏ ఫ్రెండ్‌తోనో రూమ్ షేర్ చేసుకోవచ్చులే’ అంటూ నాకు నచ్చచెప్పటం జరిగింది. నేను వాళ్లింట్లో ఓ ఆరు నెలల పాటు ఉంటాననే విషయానికి పిన్ని అభ్యంతరం చెప్పలేదు. అలాగని మనస్ఫూర్తిగా అంగీకరించినట్లుగానూ అనిపించలేదు. ముభావంగా ఉండిపోయిందంతే. నాకు బాధ్యతగా అన్నీ అమర్చిపెట్టేదంతే. నేనూ అవసరం కొద్దీ ఉంటున్నట్లే ఉండేవాడిని. బాబాయ్ మాత్రం అప్పుడప్పుడూ దగ్గర కూర్చోబెట్టుకొని నా గురించి అన్ని విషయాలూ ఆరాగా తెలుసుకోవటమే కాకుండా జనరల్ నాలెడ్జి పెంచుకోవటం గురించి వివరిస్తూ ఉండేవాడు. ఒకరోజు... నేను కొంచెం దూరంగా కూర్చుని చదువుకుంటున్నప్పుడు, బాబాయ్, పిన్ని ఏవో కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో సందర్భం ఏమిటో తెలియదు గానీ పిన్ని ‘అవును.. నేనేదో తీరుబడిగా ఉండిపోతున్నాననేగా, చెప్పాపెట్టకుండా నెత్తిమీద ఇంకో మూట బరువూ పెట్టేశారూ..’ అంటూ సాగదీయటం స్పష్టంగా వినిపించింది. నేనామాటలు విన్నానేమోననే కంగారులో బాబాయ్ నా వేపు చూడటాన్ని ఓరకంట గమనించినా తల మాత్రం ఎత్తలేదు. రెండు రోజులు మామూలుగానే ఉండి... తర్వాత ఒక ఫ్రెండ్ తనతోపాటూ రూమ్‌లో ఉండమని పదే పదే రిక్వెస్టు చేస్తున్నాడు కాబట్టి, అక్కడికి మారతానని బాబాయ్‌కి చెప్పాను. బాబాయ్‌కి విషయం అర్థమైనట్లుంది. ఏదో అభ్యంతరం చెప్పబోయేసరికి, నేను అదేమీ వినిపించుకోకుండా, అలా ఫ్రెండ్‌తో కలసి ఉండటమే నాకు బాగుంటుందని చెప్పేశాను. సరేనని అంగీకరిస్తున్నట్లుగానే తన అభిప్రాయాన్ని వివరంగా చెప్పుకొచ్చాడు. ‘ మీ తాతయ్య మాకు చేసింది వదిలేసినాగానీ, తర్వాత మీ నాన్న మాకు చేసిన సహాయాల్ని మర్చిపోలేం! మాకు పెద్దదిక్కుగా ఉండి, ఇలా మంచి ఉద్యోగాలలో సెటిల్ అవటానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాడు. అలాంటి అన్నయ్యకు.. ఇన్నేళ్లకు వాళ్లబ్బాయిని నా దగ్గర కొన్నాళ్లు ఉంచుకోగలిగిన అవకాశం రావటం నాకు చాలా ఆనందం కలిగించిందిరా! నిజమే, మీ పిన్ని అలా మాట్లాడటం తప్పేనని ఒప్పుకుంటాను. ఎవరేం అనుకుంటే నాకేమిటి అన్నట్లుగా ఏది తోస్తే అది ఆలోచన లేకుండా అనేస్తుండటం ఆమె నైజం! అంతవరకే గానీ, ఎవరినైనా ఆదరించటంలో తేడా చూపించదు. ఈ విషయం నీకూ కొంతవరకు అర్థమయ్యే ఉంటుంది. మీ పిన్ని తొందరపాటు మాటలకు చిన్నవాడివైనా నిన్ను నేను క్షమాపణ అడుగుతున్నా. నువ్వు కుదరదని నీ మాట మీదే నిలబడి రూమ్‌కు వెళ్లిపోయావనుకో, మనుసులో మథనపడుతూ శిక్ష అనుభవించాల్సింది నేనేగా..! అందుకేరా.. మీ పిన్ని అయితేనేం, నేనైతేనేంలే అని.. ఇద్దరం ఒకటేగా అని నిన్ను అడుగుతున్నా.. చెప్పు శిక్షా, క్షమా...? ఏది..? బాబాయ్ మాటలకు నివ్వెరపోయాను! మరుక్షణమే తేరుకుని మనఃస్ఫూర్తిగా బాబాయ్‌కి చెప్పాను. ‘ఇదేంటి బాబాయ్.. మీరిలా మాట్లాడటం..! ‘నా మాట కాదని నువ్వు ఇక్కడ నుండి వెళ్లటానికి వీల్లేదురా..’ అని మీరు గట్టిగా ఒక్కమాట చెప్పినా సరిపోతుందిగా! నేనెక్కడికీ వెళ్లను బాబాయ్!’ అని చెప్పేశా. ఆ తర్వాత కొంచెం నిదానంగా ఆలోచిస్తే.. పిన్నిదే పూర్తిగా తప్పనిపించలేదు. నాదీ ఉంది. బాబాయ్‌కి మా మీద ఉన్న ప్రేమాభిమానాల వల్ల వాళ్లింట్లో ఉండగలగటమన్నది నిజమే అయినా, అది ఒక హక్కుగా భావిస్తూ, బాధ్యతలను పంచుకోవటంలో మాత్రం నిర్లక్ష్యం చూపించాననిపించింది! పిన్ని తెల్లవారుజామునే లేచి, అప్పుడు వచ్చే మంచినీళ్లను పంపు నుండి పట్టి ఇంట్లోకి చేరవేస్తుంది. ఉదయం పూట చాలా హడావిడి పడుతూ ఇద్దరు పిల్లలకూ, బాబాయ్‌కీ క్యారేజీలు సిద్ధం చేస్తుంది. టిఫిను రెడీ చేసి వడ్డించటమూ ఉంటుంది. అదనంగా నేనొక్కడిని. కొంతలో కొంతయినా పని పెరిగినట్లే కదా! ఇలా ఆలోచించి తెలుసుకున్న నేను నా ప్రవర్తనను మార్చుకున్నా. నేనూ బాబాయ్ పిల్లలతో పాటుగా కాకుండా, పిన్ని లేచే టైముకే లేచి, నీళ్లు పట్టటం లాంటి పనులు నా మీద వేసుకున్నా. పిన్ని వెంటే ఉంటూ అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉండటం మొదలుపెట్టా. ‘చదువుకున్నోడివి. రేపో మాపో ఉద్యోగంలోనూ చేరతావు. నీకెందుకిలాంటి ఇంటి పనులన్నీ..?’ అంటూ పిన్ని అభ్యంతరం చెప్పబోయింది గానీ, ‘అన్ని పనుల్లోనూ అందరికీ అలవాటు ఉండాలి. ఆడ, మగ, పెద్దా చిన్నా అని తేడాలేం ఉండకూడదు. ఎవరికి తోచినది, చేతనైనది చేయటంలో తప్పేం ఉందీ?’ అంటూ నేను పట్టించుకోలేదు. ‘ఎంత బుద్ధిమంతుడివి బాబూ’ అన్నట్లుగా పిన్ని నా వేపు ఇష్టంగా చూసింది. అంతేకాదు, అప్పటి నుండీ పిన్నిలోనూ మార్పు కనిపించింది. మునుపు కేవలం మొక్కుబడిగా మాత్రమే నా పనుల్ని చేసే పిన్ని ఇష్టంగా పలుకరించటం, ఆప్యాయంగా నా విషయాలను కనుక్కోవటం చూసేసరికి నాకే ఆశ్చర్యంగా అనిపించింది! ఈ సంఘటన ద్వారా నాకు అర్థమైన విషయమేమిటో చెప్పనా..? బాబాయ్, నేను చిన్నవాడినని సంకోచించకుండా క్షమాపణ అడిగి నా అభిమానాన్ని గెలుచుకున్నాడు. నేనూ అంతే. బాధ్యత లేకుండా ప్రవర్తించినందుకు పిన్నిని క్షమాపణ కోరినట్లుగా నా నడవడిని మార్చుకుని పిన్ని ఆదరాభిమానాల్ని గెలుచుకున్నాను. సమస్యల్ని జయించటానికి క్షమాపణ అనే శక్తిమంతమైన ఆయుధం ఉండగా.. అది ఉపయోగించుకొని సామరస్యంగా బయటపడగలగాలి గానీ, ఘర్షణతో విప్పుకోలేని చిక్కుముడిగా సంసారాన్ని పాడు చేసుకోవటం సబబేనా..? భార్యాభర్తలు విచక్షణతో ఆలోచించి నిర్ణయించుకోవాలి! అవునా.. అన్నింటికీ విడాకులే పరిష్కార మార్గమనుకోకూడదనేదే నా అభిప్రాయం. అర్థమైందా అమ్మాయిగారూ..! ఇది మాత్రమే నేను చెప్పాలనుకున్నది. అందుకే ఆ సినిమాకు ముగింపు మరోలా ఉంటే ఇంకా బావుండేది అన్నాను. దానికే నువ్వు పురుషాహంకారం చూపించానని ఆరోపించావు. అహంకారం అనేది అంధకారం లాంటిదట! ఆడ, మగ తేడా లేకుండా ఎవరికీ ఉండకూడనిది! అందచందాలు, చదువు సంధ్యలు, ఆస్తిపాస్తులు, స్థితిగతులు.. ఇలాంటివి చూసుకుని అహంకరించే ఆడవాళ్లూ ఉంటారు. అవునా..? ఏ కారణంతోనైనా అహంకారం అనేది ఎవరికీ కూడా శ్రేయస్కరం కాదని భావించినప్పుడు కేవలం మగపుట్టుకే కారణంగా అహంకారం చూపించటం.. మూర్ఖత్వం కాదా..? నేనటువంటి మూర్ఖుడిలా కనిపిస్తున్నానా.. చెప్పు..? నీ ఆరోపణకు నా సంజాయిషీ సమంజసంగానే ఉందని అంగీకరించినట్లైతే, నువ్వు నీ సూట్‌కేసును సర్దేసుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మరి నేను రేపే బయలుదేరి అక్కడకు వస్తున్నాను. అలా కాకుండా నువ్వు మీ ఇంట్లోనే ఉండిపోవటానికి మొగ్గు చూపిస్తే మాత్రం, నా నిర్ణయమూ విను. నువ్వు అక్కడికి... అంటే మీ ఇంటికి చేరిన రోజే మా మావగారు ఫోను చేసి ‘నువ్వూ అమ్మాయితోపాటూ వచ్చేసి కొన్నాళ్లు ఉంటే బావుండును కదా’ అని ఆహ్వానించారు. నాకు తెలుసు.. మా అత్తామామలిద్దరూ కూడా చాలా మంచివాళ్లు. తమ అమ్మాయితోపాటుగా నాకూ చోటిచ్చి ఆదరించగలరనే నమ్మకం నాకుంది. కొన్నాళ్లే కాదు, ఎన్నాళ్లైనా ఉండగలను! అందుకే అడుగుతున్నా.. ఇప్పుడు చెప్పు.. నాతో మనింటికి వెంటనే వచ్చేస్తావా, లేక ఈ ఉద్యోగం వదిలేసి నీతోపాటూ నన్నూ అక్కడే ఉండిపోమంటావా..? నిర్ణయం నీదే మరి! నీవాడినేనని నమ్ముతున్న -గోగినేని మణి -
ఊరికి జరమొచ్చింది..
భాస్కర్ దగ్గర నుండి ఫోన్. బద్ధకం వదిలించుకుని ‘‘ ఏరోయ్! డీఎస్పీ! ఎప్పుడు ఫోను చేసినా బిజీ అంటుంటావ్! ఇంత తెల్లవారుఝామున ఈ ఫోనేంటి?’’ అని కంగారుగా అడిగాడు ఉమాపతి. ‘‘మీ ఊర్లో దిగాను. స్టేషన్లో ఉన్నాను. అడ్రస్ చెప్పు’’ ‘‘ఓర్నీ! రాత్రే చెప్పచ్చుగా! స్టేషన్‌కి వచ్చేవాణ్ణి’’... అడ్రస్ చెప్పాడు. చిన్ననాటి మిత్రుణ్ణి చూడగానే ఆనందంగా కౌగిలించుకున్నాడు. ‘‘చెల్లెమ్మ ఏదిరా?’’ ఇల్లంతా వెదుకుతూ అడిగాడు. ‘‘తెలుసున్నవాళ్ళింటికి పెళ్ళికి వెళ్ళింది. రేపొస్తుంది’’ ‘‘అయ్యో! భలే టైం చూసొచ్చానే?’’ ‘‘ఏం పర్లేదు! నీ ఆతి«థ్యానికి ఏ లోటూ రానివ్వను. కంగారు పడకు. వంటమనిషి ఉన్నాడు.. సర్లే! ఏంటి ఈ ఆకస్మిక రాక?’’ ‘‘అర్జెంటుగా హెడ్ ఆఫీసు పని పడింది’’ అన్నాడు భాస్కర్. ‘‘అదీ అలా చెప్పు. లేకపోతే నువ్వొస్తావా అంత తీరిగ్గా!’’ అని నవ్వేడు ఉమాపతి. ఆఫీసు పని అయ్యాక ఇద్దరు మిత్రులూ ఆ రాత్రి టెర్రస్ మీద మందుబాటిల్ ఓపెన్ చేశారు. ‘‘నీ కెరీర్ లో అతి జటిలమైన కేసుగా ఉండి, అతి చాకచక్యంగా ఛేదించినది ఏదైనా ఉందొరేయ్? ఉంటే చెప్పు. సరదాగా వినాలని ఉంది’’ అడిగాడు ఉమాపతి. ‘‘లేకేం? చాలా ఏళ్ళ క్రితం జరిగింది చెప్తాను’’ ఉమాపతి ఇంట్రెస్టుగా వినడం మొదలెట్టాడు. నేను సబ్ ఇన్స్పెక్టర్గా చెరుకువాడ అనే ఊళ్ళో జాయిన్ అయిన రోజులు. పిల్లల చదువుల కోసం సిటీలో ఫ్యామిలీ పెట్టి స్టేషన్ పక్కన చిన్న గదిలో అద్దెకు ఉండేవాణ్ణి. ఊరిలో అడుగుపెట్టిన నాకు కనబడిన విచిత్రం ఏంటంటే.. భయం దుప్పట్లో దూరిన ఆ ఊరు జ్వరంతో గజగజ వణుకుతోంది. ఎక్కడ విన్నా అదే వార్త! ఎవ్వరూ రాత్రి ఏడు దాటితే బయటకు రావడం లేదు. ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత బర్రెమ్మ ఆకలెక్కువై రాత్రిళ్ళు గ్రామం అంతా తిరుగుతోందని, ఏది కనబడితే అది తినేస్తోందని, మనుషులు ఎవరైనా బయట కనబడితే రక్తం కక్కుకొని చచ్చిపోతారని ఒకటే భయంకరమైన పుకారు ఊరంతా గుప్పుమంటోంది. ముసలోళ్ళు మునగదీసి పడుకుంటే, పడుచోళ్ళు చడీచప్పుడూ లేకుండా పడున్నారు. చంటాళ్ళకి బువ్వపెట్టడం సులువైంది తల్లులకి. చదువుకునే కుర్రాళ్ళు భయపడకపోయినా, నమ్మకపోయినా పెద్దాళ్ళ మాటకు విలువ ఇచ్చి ఇంట్లో ఉండిపోయారు. మొత్తం మీద ఆ ఊరి జనం భయం భయంగానే కాలం గడుపుతున్నారు. కొంతమందికి బయట గజ్జెల చప్పుడు వినబడిందని చెప్పుకున్నారు. మరొకరికి ఏదో నిలువెత్తు ఆకారం చీకట్లోంచి నడిచి వెడుతున్నట్టనిపించిందని, బయలుకి వచ్చిన కొంతమంది ముసలాళ్ళు గుండె ఆగి చనిపోయారు అని, రకరకాల పుకార్లు ఊరంతా ప్రచారం. ‘‘ఏంటయ్యా! ఇంత చిన్న ఊరిలో జనం అంతా చీకటి పడకుండానే తలుపులు బిడాయించుకుంటున్నారు?’’ కానిస్టేబుల్ నరసింహాన్ని అడిగాను. ‘‘బర్రెమ్మ అమ్మోరు ఊర్లో తిరిగి జనాన్ని పీక్కతింటందని సెప్పుకుంటున్నారండి’’ అతనూ అదే సమాధానం. ‘‘హ్హ ! హ్హ! జనం ఎంత పిచ్చాళ్ళయ్యా! ఈ రోజుల్లో అమ్మవారు తిరగడం, జనం నమ్మడమూనా! అంతా ట్రాష్’’ అని గట్టిగా నవ్వాను. ‘‘ఆ తల్లిని అనుమానించకండి సర్! మీకు తెల్దు. మా చిన్నప్పుడు అమ్మ ముందు ఒకడు అవాకులు చవాకులు పేలితే మర్నాడు పొద్దున్నకి ఊరవతల మర్రిచెట్టు కింద రత్తం కక్కుకుని చచ్చిపడున్నాడు. చాలా పవర్ ఫుల్ అమ్మోరండి’’ అని వణికిపోతూ చెప్పాడు. ‘‘సర్లే నీకు, నాకు సరిపడదుగానీ ఓ టీ చెప్పు!’’ అని పనిలో పడిపోయాను. ఎవరో తలుపు దబ దబ బాదుతున్నారు. వాచీ చూసుకున్నాను. ఉదయం ఐదుగంటలైంది. ఇంత పొద్దున్నే ఎవడాని తలుపు తీశాను. చెమటతో ఒళ్ళంతా తడిసిపోయి, నరసింహులు గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు. ‘‘ఏమైందయ్యా?’’ ‘‘సాంబయ్యను బర్రెమ్మ చంపేసిందండి’’ అని ఆయాస పడుతూ చెప్పాడు. గబగబ యూనిఫాం వేసుకుని, గవర్నమెంటు హాస్పిటల్ డాక్టర్ రామారావుకి కవురంపాను. సిద్ధంగా ఉండమని. ఇద్దరం వెళ్ళే చూసే సరికి సాంబయ్య శవం పరమ భయంకరంగా ఉంది. గుడ్లు బయటకి వచ్చేసి, నోట్లోంచి కారిన రక్తం చారికలు చొక్కామీద ఎండిపోయి ఉన్నాయి. సాంబయ్య వయస్సు ఇరవై ఉంటుంది. చుట్టూ ఉన్న జనాన్ని మా కానిస్టేబుల్స్ అదుపులో పెడుతున్నారు. సాంబయ్య తల్లి బోరుబోరు మని ఏడుస్తోంది. జాలి వేసింది. ఊరి సర్పంచ్ పల్లయ్య నాయుడు, పంచాయతీ స్టాఫ్ అక్కడ నిలబడి ఉన్నారు. అందరి మొహాల్లోనూ భయం. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి, శవాన్ని పోస్టుమార్టంకి పంపాను. నెమ్మదిగా శవం పడి ఉన్న చుట్టుపక్కల పరిశీలించాను. అంతా బురద బురదగా ఉంది. అక్కడక్కడ అడుగుల ముద్రలు కనబడ్డాయి. పక్కనున్న చెరువులో తూటు మొక్కలు ఆ బురద మీద బయటపడేసి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా కలుపు, ముళ్ళతో ఉన్న పిచ్చి మొక్కలతో నిండి ఉంది. పెనుగులాటకు గురి అయ్యినట్టు, మట్టి పైకి లేచినట్టు అక్కడక్కడ కనబడింది. ఎంత తరచి తరచి చూసినా ఏమీ క్లూ దొరకలేదు. నరసింహం మటుకు ‘‘బర్రెమ్మ తల్లి మా ఊరి మీద ఎంత కోపంగా ఉందో’’ అని గొణుక్కుంటున్నాడు. కాస్త దూరంగా ఉన్న పెద్ద పెద్ద ఊడల మఱి< చెట్టు ఒకటే సాక్షిగా కనిపించింది. కాస్త దూరంగా బర్రెమ్మ గుడి, దాని ముందు నిలబడిన త్రిశూలం కనబడ్డాయి. నడుచుకుంటూ అక్కడకు వెళ్ళాను. కూడా నరసింహం అమ్మకి దణ్ణాలు పెట్టుకుంటూ వస్తున్నాడు. అక్కడి వరకు చెప్పి గ్లాసులో ఐస్ ముక్కలేసుకుని కాస్త విస్కీ పోసుకున్నాడు మరో రౌండుకి. ఉమాపతి ఊపిరి బిగబెట్టి వింటున్నాడు. గ్లాసులో విస్కీ ఖాళీ అవుతున్నా, మత్తు ఎక్కడం లేదు. ‘‘తర్వాత ఏం జరిగింది...?’’ ఆతృతగా అడిగాడు ఉమాపతి. ‘గర్భగుడి తలుపులు తెరిచి ఉన్నాయి. అమ్మ స్వరూపం మహోగ్రరూపంలో ఉంది. అందరినీ కాపాడే తల్లివి నువ్వు. ఇలా మనుషుల్ని చంపుతావా ! నేను నమ్మను’ అని మనసులో అనుకున్నాను. పూజారి పేరు వీరభద్రం అని చెప్పాడు నరసింహం. ఆరడుగుల ఎత్తున్న అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తున్నాడు. లోపలికి చూసిన నాకు ముందు గదిలో పువ్వులు, కుంకుమ, పసుపు పళ్ళాల్లో పెట్టి కనిపించాయి. మమ్మల్ని చూసిన వీరభద్రం కంగారు పడుతూ లేచాడు. అతను నల్లగా మినుములు పోతపోసిన గుట్టలా ఉన్నాడు. నుదుటికి అడ్డంగా విభూది, నిలువుగా కుంకుమ బొట్టు, జుట్టుని కొప్పుగా కట్టిన తలకట్టుతో, కళ్ళకి కాటుక రాసుకొని, ఆ కళ్ళల్లో ఎర్రజీరతో కనిపించాడు. నడుముకి ఉన్న ఎర్రపంచెను తోలు బెల్టుతో కట్టాడు. పెద్ద బానపొట్ట, కాళ్ళకు పారాణి పెట్టుకున్నాడు. మమ్మల్ని చూసి ‘‘ఏం కావాలి సారు?!’’ అని అడిగాడు వినయంగా, ‘‘రాత్రి నువ్వెక్కడ ఉన్నావు?’’ ‘‘ఇంట్లోనే సర్!’’ ‘‘మీ ఇల్లెక్కడ ?’’ ‘‘ఈ గుడి వెనకాల సర్!’’ ‘‘రాత్రి నీకు కేకలు ఏమైనా వినబడ్డాయా?’’ ‘‘లేదండీ!’’ ‘‘సాంబయ్య చచ్చిపోయాడని తెలుసా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను. ‘‘బర్రెమ్మ తల్లి పట్ల అపచారం జరిగిందన్నమాట. ఆ తల్లి ఆకలితో ఉందండి. జాతర జరపాలండి! అమ్మని క్షమించమని అడగాలండి. అప్పుడైనా అమ్మ శాంతిస్తుందేమోనండి!’’ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మాట్లాడాడు. ‘‘సర్లే ! సర్లే! అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. స్టేషన్‌కి వచ్చి కనబడాలి’’ ‘‘అలాగే సారు!’’ అని లోపలికి వెళ్ళాడు. పోస్టుమార్టం రిపోర్టులో కొత్త విషయాలేమీ బయటపడలేదు. గొంతు నొక్కుకుపోయినట్టు, ఊపిరి ఆడక గిలగిల కొట్టుకుని మరణించి ఉండవచ్చని రాశాడు డాక్టర్. ఊరిలో అడుగుపెట్టిన నెలరోజులకే ఈ కేసు నాకు తలనొప్పి తెప్పించింది. ఎక్కడా తాడూబొంగరం లేదు. సాంబయ్య తల్లి మీరమ్మని ‘ఎవరి మీద అయినా అనుమానం ఉందా?’ అని అడిగాను. చెప్పలేకపోయింది. చాలా సేపు ప్రశ్నించాను. అయినా చెప్పలేకపోయింది. ‘‘ఆ రోజు నీ కొడుకు ఎందుకు బయటకి వచ్చాడు?’’ అడిగాను. ‘‘పొలం కళ్ళెంలో కోసిన పంట ఉంది బాబు. కాపలా పడుకోడానికి వెళ్ళాడు. మరి పొలంలో పడుకోక, బయటకి ఎందుకు వచ్చాడో తెలియడంలేదు’’ అంది. ఏం చేయాలో తెలియక కేసు విషయాలు పై వాళ్ళకి తెలియజేసి ఊరుకున్నాను. ‘తర్వాత ఏం జరిగింది ?’’ ప్లేట్లో ఉన్న జీడిపప్పు నోట్లో పెట్టుకుంటూ అడిగాడు ఉమాపతి. ‘‘ఆరు నెలలు అయ్యింది. పైనుంచి చీవాట్లు. ఫైల్ మూసేశాము. కానీ కళ్ల ముందు కొడుకు కోసం ఏడుస్తున్న మీరమ్మ కనబడి నిద్రపట్టేది కాదు’’ ‘‘ రాత్రిళ్లు ఊరి పరిస్థితి ఏంటి?’’ ఉమాపతి అడిగాడు . ‘‘అదే సందేహం నాకూ వచ్చింది. రాత్రిళ్లు నేను కాపలా కాసినన్నాళ్లూ ఆశ్చర్యంగా ఏ విధమైన గజ్జెల చప్పుడూ వినబడలేదు. కానీ చివరకు క్లూ దొరికింది’’ తాపీగా సిగరెట్టు నోట్లో పెట్టుకుని లైటర్‌తో వెలిగిస్తూ చెప్పాడు భాస్కర్. తాగుతున్న గ్లాసు పక్కన పెట్టి ‘‘క్లూ దొరికిందా! ఎలా ? చెప్పు చెప్పు’’ అని ముందుకు వంగాడు ఉమాపతి. ‘‘ఆరోజు సర్పంచి పల్లయ్య నాయుడు కూతురి పెళ్ళికి వెళ్ళాను. ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించాడు నాయుడు. భోజనాలు అయ్యాక ‘సారు! వచ్చే ఆదివారం అమ్మవారి జాతర. ఊరి జనం భయపడుతున్నారు. అమ్మవారికి జాతర జరిపిస్తే ఊరికి పట్టిన అరిష్టం పోతుందని గుడి పూజారి వీరభద్రం చెప్పాడు. ఊరేగింపు కూడా పెట్టాం. తమరు పర్మిషన్ ఇవ్వాల’ అని రిక్వెస్ట్ చేశాడు. ‘సరే! గొడవలు లేకుండా జరిపించండ’ని పర్మిషన్ ఇచ్చాను’’ జాతర బ్రహ్మాండంగా జరుగుతోంది. వీరభద్రం దగ్గరుండి అన్నీ జరిపిస్తున్నాడు. నాయుడు దర్జాగా ఇంటి అరుగు మీద కూర్చుని, మధ్య మధ్యలో ఊరంతా తిరుగుతూ, బాణసంచా కాల్పిస్తున్నాడు. పులి వేషగాళ్ళు, గరగ డాన్సు వాళ్ళు డప్పు శబ్దాలకు లయబద్ధంగా నాట్యం చేస్తున్నారు. నేను పదిమంది కానిస్టేబుల్స్‌ను తీసుకొని, ఊరంతా బందోబస్తు కట్టుదిట్టం చేశాను. అర్ధరాత్రయ్యింది. వీరభద్రం ప్రతి ఏడాది అమ్మవారిలా చేసే నృత్యం చేస్తున్నాడు. అమ్మవారిలా చీర కట్టుకున్నాడు. అమ్మోరు పూనినట్టు వీరంగం వేస్తున్నాడు. వెనకాల డప్పులు కొడుతున్న వాళ్ళ చేతి నరాలు పొంగుతున్నాయి. దానికి లయబద్ధంగా ఇతను చేస్తున్న నృత్యం చూసి నేను కూడా ఆశ్చర్యపోయి అప్రయత్నంగా దణ్ణం పెట్టాను. నా దృష్టి అతని కాళ్ళ మీదే ఉంది. వెంటనే నా మస్తిష్కానికి వచ్చిన ఒక సందేహం, నన్ను జాగరూకుడిని చేసింది. ‘అమ్మ గజ్జెల చప్పుడు వినిపిస్తోంది రాత్రిళ్లు’ అనే మాట స్ఫురణకి వచ్చింది. వీరభద్రం కాళ్ళ వైపు చూశాను. అతని ఆట అయ్యి, అలసిపోయి ఒక చోట కూర్చున్నాడు. కాగడాల కాంతిలో అతని కాళ్ళకి కట్టుకున్న గజ్జెల దండలో రెండు మువ్వలు లేకుండా ఖాళీగా కనబడింది. వెంటనే, నరసింహాన్ని తీసుకొని, సాంబయ్య చనిపోయిన స్థలానికి వెళ్ళి బ్యాటరీ లైట్ల కాంతిలో వెతకడం మొదలుపెట్టాము. ‘‘నరసింహం! ఎక్కడైనా మువ్వలు దొరికితే చెప్పు’’ గట్టిగా అరిచాను. తెల్లవారింది. లోకసాక్షి ఉదయించాడు. ఆ వెలుగు అక్కడ ఉన్న మొక్కల మీద పడుతోంది. నా కళ్ళు సూర్య కాంతిని మించి పరిశీలిస్తున్నాయి. దొరికింది ఒక మువ్వ.. తుప్పల మీద నిలవ ఉన్న నీటిలో స్వచ్ఛమైన నిజంలా మెరుస్తూ. మరొకటి నరసింహం మొక్కల మధ్యలో దొరకబుచ్చుకున్నాడు. ‘‘వెంటనే వీరభద్రాన్ని నాలుగు పీకి నిజం రాబట్టాను’’ తాగుతున్న గ్లాసు పక్కన పెట్టాడు భాస్కర్. ‘‘వీరభద్రం అంత పని ఎందుకు చేశాడు? సాంబయ్యకు అతనికి ఏమిటి గొడవ? మీరమ్మని దిక్కులేని దాన్ని చేశారు కదా పాపం’’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు ఉమాపతి. ‘‘వీరభద్రం చంపలేదు... సాయం చేశాడు’’ ‘‘మరి ఎవరు చంపారు?’’ ‘‘చంపినవాడు పల్లయ్య నాయుడు’’ అని తాపీగా బాటిల్లో విస్కీ గ్లాసులో పోసుకున్నాడు భాస్కర్. ‘‘ఆ.. ! మళ్ళీ ఇదేం ట్విస్టు?’’ ‘‘నాయుడి కూతురు, కాలేజీలో చదువుతున్న సాంబయ్య ప్రేమించుకున్నారు. అది తెలిసిన నాయుడు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ‘ఆడి కులమేటి! నా కులమేటి! ఆడి అంతస్తేమిటి! ఆడికి నా కూతురు కావలిసి వచ్చిందా?’ అని శివాలెత్తిపోయి, అతనికి నమ్మిన బంటు అయిన వీరభద్రానికి విషయం చెప్పాడు. డైరెక్టుగా గొడవ చేస్తే అసలే మొండిదైన కూతురు ఏ అఘాయిత్యం చేస్తుందో అని భయపడి, ఇలా ఒక నెల ముందు నుంచి, వీరభద్రం అమ్మవారిలా అర్ధరాత్రిళ్లు గజ్జెలతో నడిచి, ఊరి మధ్యలో పుకారు వ్యాపింప చేశారు. నెమ్మదిగా ఒక రోజు ప్లాన్ చేసి, సాంబయ్యని మట్టుపెట్టారు. నాయుడు.. సాంబయ్య పీక నొక్కి, గుండెల మీద కాలు వేసి తొక్కి చంపాడు. అతనికి సాయం చేసే హడావుడిలో వీరభద్రం కాళ్ళకి ఉన్న గజ్జెల్లో రెండు తెగి పడ్డాయి. అది చూసుకోలేదు. మనకు అదే ఆధారం అయ్యింది. ఇద్దరూ నేరం ఒప్పుకున్నారు’’ అన్నాడు భాస్కర్. ‘‘ఊరికి భయం అనే జ్వరం తగ్గింది’’ అని నవ్వాడు ఉమాపతి. - చాగంటి ప్రసాద్ -
వేశ్యా వృత్తిని కరోనానే రద్దు చేసింది
అతనేం ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లలేదు.. ఇవ్వమని తనూ అడగలేదు.. నిన్న ఆ కాసేపు సంభాషణ తప్ప తమ ఇద్దరి మధ్యా ఏ స్నేహమూ లేదు. కనీస పరిచయమూ లేదు. మరచివెళ్ళాడో, వదిలి వెళ్ళాడో, సెల్‌ఫోన్ తీస్తుండగా జేబు నుండి జారి పడింది ఈ విజిటింగ్ కార్డ్... కలరు, డిజైను బావున్నాయ్. అతని అభిరుచి ఎంత కళాత్మకమో తెలియజేస్తున్నాయ్.. కార్డ్ మీద ఒకే ఒక్క ఫోన్ నంబరూ ఫ్యాన్సీగా ఉంది... కానీ ఇంతకూ విజిటింగ్ కార్డు, ఈ ఫోన్ నంబరు అతనివే అయ్యుంటాయా? ఈ ప్రశ్న ఉదయం నుండి సాయంత్రం వరకు చాలాసార్లు అనుకుంది రేష్మా... ఇదివరకైతే ఇక్కడికి రోజుకు నలుగురైదుగురైనా వచ్చిపోతుండేవాళ్లు. కొన్ని నెలలుగా ఒక్క మగ పురుగూ రావటం లేదు. కనుక ఈ కార్డ్ అతనిదే అని తనకు తాను నిర్ధారించుకొని స్థిమిత పడింది.. రాత్రి ఏడవుతుండగా ఆ నంబర్‌కు కాల్ చేసి, ఒక రింగ్ కాగానే ఎందుకో భయమనిపించి కట్ చేసింది.. అంతకు ముందే చాలాసార్లు ఆ నంబర్ ఒకో అంకెను తన సెల్లో ప్రెస్ చేస్తూ కాల్ చేసే ధైర్యం రాక వదిలేసింది. ‘రింగ్ అయ్యిందా? హమ్మో ఎవరైనా కాల్ చేసి కోప్పడతారా? ఒకవేళ అతనే అయితే మళ్ళీ అంత మధురంగా మాట్లాడతాడా? తేనె తన పెదాల్లో ఉంటుందా? అతని పదాల్లోనా? మాట్లాడినంత సేపూ తియ్యగా ఉంటుంది’ అనుకుంది. ఒకవేళ అతనే కోపగించుకోబోతుంటే తన గొంతులో మాడ్యులేషన్ పసిగట్టి ముందు తనే... ‘ఎన్నో వివరాలు తీసుకున్నావు, ఏమో రాసుకెళ్ళావు పత్రికలో ఇంకా రాలేదేం?’ అని గట్టిగా అడగాలన్నట్టు రిహార్సల్స్ వేస్తోంది.. ఇన్నిసార్లు చేసినా ఒక్కసారీ కాల్ బ్యాక్ చేయడేం? తను బిజీ పర్సనే. ఆరోజు తను ఇక్కడున్న ఆ కాసేపట్లో ఆ విషయాన్ని గమనించింది. ఒకరింగ్తో రెండు రింగ్స్‌తో కట్ చేస్తూ ఈ అయిదు రోజుల్లో కనీసం ఓ పదిసార్లు చేసుంటుంది తను. ఇన్ని మిస్డ్ కాల్స్ ఎవరివో అనే స్పృహ ఉండదా ఇతనికి అనుకుంది. బహుశా అన్నోన్ నంబర్స్ పట్టించుకోడేమో అని సమాధానం చెప్పుకుంది.. ‘నీకేంటి.. నువు చేసిన తప్పేంటి.. ముల్లునొదిలి అరిటాకుకు శిక్షేంటి..’ గానగంధర్వుడు ఎస్పీ బాలు గొంతును అనుకరిస్తూ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్కెస్ట్రాలో వినవస్తోందో పాట. సినీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సంగీతాభిమానులు పిలుపునివ్వటంతో ఆరోజు సభలో తామూ స్వర ఆకాంక్ష వ్యక్తం చేయాలని నిర్ణయించింది ఆ పత్రిక యాజమాన్యం. ఇందులో భాగంగా బాలు పాడిన అన్నేసి భాషల్లోని కొన్నేసి పాటలను పాడుతున్నారు గాయనీగాయకులు.. ‘సమస్యను వెలుగులోకి తేవటంతోనే జర్నలిస్ట్ బాధ్యత తీరిపోదు...’ పాటల అనంతరం చైర్మన్ గొంతు మైక్‌లో ధ్వనించే సరికి అక్కడున్న అందరూ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎడిటర్‌తో పాటు ఆ సభలో సెంట్రల్ డెస్క్ జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు, సిటీ డెస్క్, బ్యూరో, ఇంకొందరు సిబ్బంది కలసి ఓ యాభైమంది లోపుంటారు.. చెన్నై టీనగర్ కార్యాలయం బయట ఎప్పటి నుంచి కురుస్తోందో వర్షం అప్పుడే వినిపిస్తోంది. ఒక ఉదాత్తమైన వ్యక్తిని తన ఉన్నత ప్రసంగానికి ఆహ్వానిస్తూ కరతాళ ధ్వనులా అన్నట్టుంది చినుకుల సింఫనీ.. ‘సమస్య తీరే పరిష్కారాన్నీ చూపాలి. అందుకు ఎవరిని కదిలించాలో ఆ కదలిక తేవాలి. జర్నలిస్ట్‌గా మీరు ఎన్ని సమస్యలు పరిష్కరించగలిగారో ఆత్మ విమర్శ చేసుకోండి. సమస్యను రాయటం అంటే సమస్యను భుజానికెత్తుకోవటం అని గుర్తించండి. మన వల్ల ఒక్కరి సమస్యా పరిష్కారం కాలేదంటే ఇక పెన్ను మూసుకోవటం ఉత్తమం’ అంటూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేస్తున్నాడు చైర్మన్ రామస్వామి. తమిళంలో అత్యాదరణ గల పత్రిక చైర్మన్ అతను. తన పత్రికలో అత్యుత్తమ కథనాలను ఏటా సెలెక్ట్ కమిటీ ద్వారా ఎంపిక చేసి జర్నలిస్టులను తన పుట్టినరోజు సందర్భంగా అవార్డుతో సత్కరించటం ఆనవాయితీ. చైర్మన్ అవార్డును ఆయన చేతుల మీదుగా తీసుకోవటం ప్రెస్టీజియస్‌గా భావిస్తారు ఆ పత్రిక జర్నలిస్టులు, విప్లవ్ అదే అనుభూతికి గురవుతున్నాడు... అవార్డు అందుకుంటుంటే సహ జర్నలిస్టులు, ఉద్యోగుల చప్పట్లు మార్మోగుతున్నాయ్ కాని, అతనికి మాత్రం చైర్మన్‌గారి ప్రసంగం చెవుల్లో ధ్వనిస్తోంది. డిన్నర్ టైంలో కలసిన తోటి జర్నలిస్ట్ వేలు పిళ్ళై ‘ఇదుగో బాస్ నీ సిమ్’ అని అందిస్తూ.. ‘ఏవో మిస్డ్కాల్స్ ఉన్నాయ్. చెక్ చేస్కో’ అన్నాడు.. ఒక జర్నలిస్ట్ సెలవుపై ఊరెళుతుంటే అతని ఆఫీస్ సిమ్‌కార్డ్‌ను ఇన్చార్జ్కు అప్పగించి వెళ్లటం ఆ పత్రిక రూల్. లాక్డౌన్ వల్ల, ఆఫీస్ పని ఒత్తిడి వల్ల, కరోనా భయం కారణాన గత మార్చి నుంచి సొంతూరికి వెళ్ళటం కుదరలేదు విప్లవ్కు... కోయంబత్తూరు దగ్గర చిన్న పల్లెటూరు అతనిది. తల్లిదండ్రులు ‘పెళ్లి సంబంధం చూశాం రమ్మ’ని డేట్ ఫిక్స్ చేయటంతో వారం క్రితం వెళ్ళి రాత్రే వచ్చాడు.. ఊరెళుతున్నప్పుడు తన సిమ్‌ను అప్పగించాడతను. అవార్డు తీసుకుంటూనే తను తిరిగి డ్యూటీలో జాయినవ్వటంతో అతని సిమ్‌ను అతనికప్పగించాడు ఇన్చార్జ్ వేలు పిళ్ళై. ఇంటికెళ్లి తను పొందిన అవార్డును మళ్లీ మళ్లీ చూసుకొని మురుస్తూ సెల్ఫోన్లో సిమ్ వేసుకున్నాక, కాల్ రిజిస్టర్ చెక్ చేస్తుంటే ఒక నంబర్ నుంచి ఎక్కువ మిస్డ్కాల్స్ ఉండటం గమనించాడు. అదేదో అన్ నోన్ నంబర్.. కానీ ఎవరో? ఎందుకు చేశారో? అనుకొని వెంటనే ఆ నంబర్‌కు ఫోన్ చేశాడు. అప్పటికే టైం పది దాటింది. అయినా ఆ విషయం పట్టించుకోలేదు విప్లవ్.. అవతలి సెల్ఫోన్లో వినపడుతోన్న కాలర్ ట్యూన్ అతన్ని ఆశ్చర్యపరిచింది. ఆ పాట ఎక్కడో విన్నట్టనిపించింది. ఎక్కడ విన్నాడో ఠక్కున గుర్తొచ్చింది. ఆ పాట రుడాలి సినిమాలో భుపేన్ హజారికా పాడింది. కానీ తాను ఈ మధ్య విన్నది మాత్రం రెద్ లైట్ ఏరియాలోని ఆమె గదికి వెళ్ళినపుడు.. ఆరోజు తను వెయిట్ చేస్తున్న గదిలోకి జాజిపూల పరిమళమై ఆమె లోగొంతుతో పాడుకుంటూ వస్తున్నప్పుడు.. ఇంటర్వ్యూ మధ్యలో ఆమె సెల్‌ఫోన్ రింగ్‌టోనై మోగినపుడు... తనకేదో ఫోనొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె అటు తిరిగి అదే పాట హమ్ చేస్తున్నప్పుడు.. ఇంటర్వ్యూ చేసొచ్చి మరిచేపోయాను.. ఆ ఇంటర్వ్యూ తాలూకు కథనం వల్లే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చైర్మన్ అవార్డ్ దక్కింది తనకు. తన ఆర్టికల్ చూసుకుందో? లేదో? పబ్లిష్ అయ్యాక చెబుదామనుకొని ఏదో పనుల్లో మరచిపోయాను. ఇపుడు ‘ఈ అవార్డు మీ వల్లనే’ అని థాంక్స్ చెప్పాలి.. లోకల్ అయితే ఏ స్వీట్ ప్యాకెట్టో పట్టుకొని వెళ్లి కృతజ్ఞత చెబుదును. తనుండేది ముంబైలో, నేనేమో చెన్నైలో ఎలా కుదురుతుంది? అనుకున్నాడు... ఫోన్లో పాట అయిపోయి అప్పటికి రెండోసారి.. ‘ఎందుకో ఫోన్ తీయటం లేదు’ అనుకుంటూ మరోసారి రీ డయల్ చేశాడు. ‘అవునూ ఇంతకు ఈ నంబర్ తనదేనా.. లేకపోతే ఈ టైంలో చేసినందుకు ఎవరితోనైనా తిట్లు తినాల్సి వస్తుందా .. అయినా నా నంబర్ ఆమెకు ఇవ్వలేదు కదా ఎలా తెలుస్తుంది? తను నాకెందుకు చేస్తుంది?’ అనుకుంటూ కాల్ కట్ చేశాడు పాట పూర్తిగా వినకుండానే.. పది నిమిషాల తరువాత ఫోన్ వస్తున్నట్టు రింగ్‌టోన్ మోగింది.. చూస్తే తను ఇప్పటివరకూ డయల్ చేసిన నంబర్ అది.. కాల్ చేస్తోంది తనే అనుకుంటూ, ఒకవేళ ఆమె కాదేమో అనే భయంతో లిఫ్ట్ చేయగానే.. ‘హాయ్...హల్లో’ అంటూ కోకిలగొంతు.. ఆ గొంతు ఆమెదే.. కానీ ఎందుకో ఆ గొంతులో అలసట ధ్వనిస్తోంది.. ‘హలో’ అని అతననగానే ‘హే.. ఏమైపోయారు? హబ్బ ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అంత బిజీనా?’ కొంచెం ఆయాసపడుతూ ఆమె అంటుండగా... ‘ఆ.. బిజీ ఎవరో తెలుస్తోందిగా, ఇప్పుడు నేనూ మూడుసార్లు చేశాను’ అని అతనన్నాడు.. ‘ఓహ్..సారీ క..క..కస్టమర్ ఉన్నాడు మీద.. అప్పటికీ ఫోన్ రింగవుతుంటే చూశా. మీ నంబర్.. బట్ అతనేమో మంచి మూడ్‌లో ఉన్నాడు. అప్పుడే క్లైమాక్స్ కొచ్చేస్తున్నాడు. అతని మూడ్ డిస్టర్బ్ చేయటం నాకిష్టముండదు. ఒక రిలాక్సేషన్ కోసం హ్యాపీనెస్ కోసం, ఇంట్లో దొరకనిదేదో పొందటంకోసం మా దగ్గరికొస్తారు.. వాళ్ళను శాటిస్ఫై చేయటమే నాకిష్టం. నేను కోపరేట్ చేస్తుంటే మురిసిపోతారు. ప్రేమగా మాట్లాడుతారు. లవ్యూ చెపుతారు. ఆ పదం వినగానే మరింత అర్పించేస్తుంటాన్నేను’ అంటూ తను చెపుతుంటే ఎందుకో చలం మైదానం నవలలో రాజేశ్వరి గుర్తొస్తోందతనికి. రాజేశ్వరి వేశ్య కాకపోవచ్చు. కానీ ప్రేమ పిపాసి.. ప్రేమిస్తున్నానగానే కరగిపోతుంది.. ఇదుగో ఈమె కూడా అని అనుకున్నాడు... ‘ఏంటి బిజినెస్ మళ్ళీ స్టార్టయ్యిందా?’ అన్నాడు.. ‘అదేం లేదు. మీరెళ్ళిన రోజు నుండి ఇదుగో ఈరోజే ఒక్క బేరమొచ్చింది.. ఆకలి కథ అలాగే కంటిన్యూ అవుతోంది... కరోనా భయంపోతేనే మా వేశ్యాజీవితాలకు కళ’ అని ఆమె చెపుతోంది.. వేశ్యావాటికకు ఏర్పడిన గడ్డుకాలం గురించి... అలా రాత్రి పన్నెండు దాటేవరకు ముంబై నుండి చెన్నై దాకా వాళ్ళ మాటలు ప్రవహిస్తూనే ఉన్నాయ్.. చివరగా ‘సరే నేనొచ్చేస్తున్నా ముంబై. ఒక వారం రోజులైనా ఉండేందుకు’ అనే మాటతో తన కాల్ కట్ చేశాడు... మరుసటి రోజు మొదటి ఫ్లైట్‌కు ముంబైలో వాలిపోయాడతను. తన ఆలోచన విని, తన పత్రిక చైర్మన్ సంతోషించటమే కాక అన్ని ఖర్చులూ తనే భరిస్తానని ప్రోత్సహించటం విప్లవ్కు మరింత శక్తినిచ్చింది.. వెళ్లీ వెళ్ళటంతోనే ఆమెను కలసి తన ఆలోచన చెప్పాడు విప్లవ్. అది విని ఆమె సంతోషిస్తూ చప్పట్లు చరిచింది. సాధ్యాసాధ్యాలపై ఆమె సంశయ పడుతుందో, పూర్తిగా వ్యతిరేకిస్తుందో అనుకున్నాడు విప్లవ్. కానీ ఆమె అందుకు భిన్నంగా స్పందించేసరికి ఆశ్చర్యపోయాడు. తన పని సులువు అవుతుందనుకున్నాడు.. ఆమె సహకారంతో వేశ్యా వాడలోని కమ్యూనిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో ముప్పయ్ ఏళ్ళ వయసున్న ఒకామె మాట్లాడుతూ.. ‘ఖర్మకొద్దీ ఈ బురదలో కూరుకున్నాం. ఇప్పటికైనా కలువల్లా వికసించాలనుకుంటున్నాం’ అంటూ తన మద్దతు తెల్పగా, ఇంకో ఆమె మైక్ అందుకొని ‘పుట్టిన ప్రతి బాలిక మహిళే అవుతుంది.. ఏ స్త్రీ కూడా వేశ్య ముద్ర కోరుకోదు. దురదృష్టం మమ్మల్ని అలా వెంటాడింది.. నిజంగా ఇది మరకలు చెరుపుకునే సమయం’ అంటూ మాట్లాడుతుంటే చప్పట్లు మార్మోగాయి... ‘వేశ్యా వృత్తి సాగటం లేదని, ఉపాధి కరువయ్యిందని ఇన్ని నెలలూ కరోనాను తిట్టుకున్నాం. కానీ ఆ కరోనా ఈ కొత్త ఆలోచనకు కారణమయ్యింది. బురద బతుకు నుంచి బయటపడేందుకు మనకిదే మంచి అవకాశం’ అంటూ మరో యువతి తన అభిప్రాయం స్పష్టం చేసింది.. ‘గత కొన్ని నెలలుగా ఎన్ని పస్తులున్నామో, ఎన్ని కన్నీళ్లు మింగుతున్నామో, అప్పు పుట్టక, ఆదరణ లేక, అనారోగ్యాలకూ చేతిలో చిల్లిగవ్వలేక.. పౌర సమాజం మనపట్ల జాలి చూపలేదు. ఏ ఒక్కరూ ఏ సాయం చేయలేదు. ఈ బతుకు మనకొద్దు్ద మనం జనజీవన స్రవంతిలో కలుద్దాం’ అంటూ మరో మహిళ తన ఆవేదన తెలిపింది. ‘కరువు కోరల్లో చిక్కిన వేశ్యల దయనీయ స్థితిపై మొన్న పేపర్లో వచ్చాక మన బతుకులెంత దుర్భరంగా ఉన్నాయో లోకానికి తెలిసింది. అయినా జాలి చూపులు తప్ప మనకే సాయమూ దక్కలేదు.. ఎవరి సాయం కోసమో ఎదురు చూడటం అనవసరం. మనం ప్రత్యామ్నాయం వైపు మళ్లటమే ఉత్తమం.. కరోనా శత్రువు కాదు. మనవరకు స్నేహితుడే...’ అంటూ ఇంకో యువతి మార్పును స్వాగతించింది. ‘ఎవరో అమ్మివేయడం వల్ల మనం ఇక్కడికొచ్చాం. ఎవరో మనల్ని కొనుగోలు చేయటాన ఈ బానిసత్వానికి గురయ్యాం.. కరోనా మన బానిసత్వాన్ని విడిపించే బాహుబలి. మార్చి నెల నుంచి వేశ్యా వృత్తిని కరోనానే రద్దు చేసింది. ఇది ఇన్నేళ్లూ ఎవరికీ సాధ్యపడనిది..’ అంటూ మరో మహిళ స్పష్టం చేశాక చివరగా రేష్మా మాట్లాడుతూ, ‘ఈ విప్లవ్ నా ఫేస్బుక్ ఫ్రెండ్. లాక్డౌన్ మొదలైనప్పటి నుండీ ఎదురవుతున్న కష్టాలను వివరిస్తూ నేను పోస్ట్ చేసిన పోయెం చదివి స్పందించి, వాళ్ల పత్రిక పర్మిషన్ తీసుకొని ఇక్కడికొచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశాడు. మన వీధుల్లో తిరిగాడు, ఇక్కడి పరిస్థితులు అంచనా వేశాడు. నా ద్వారా మన కష్టాలు పూర్తిగా తెలుసుకొని తన శైలిలో ఆర్టికల్ రాశాడు. కరోనా తొలగటం కాదు, మన జీవితాల్లో మార్పు రావాలని, వేశ్య అనే పదంలేని మహిళా లోకం ఏర్పడాలని కోరుతూ ఆర్టికల్ రాశాడు. అంతటితో తన పని పూరై్తందనుకోకుండా, ఇలా మనకు ఉపాధి అవకాశాలను కల్పించే చర్యలకు పూనుకున్నాడు. వేశ్యా జీవితాల నుంచి వైదొలిగేందుకు మన ఉమ్మడి అభిప్రాయాలు తీసుకోవటం కోసమే ఈ మీటింగ్’ అంటూ ముగించింది రేష్మా. తను రాబోయే ముందే తన ఆలోచన స్థానిక జర్నలిస్టులకు తెలియజేశాడు విప్లవ్. మరుసటి రోజు వాళ్ళను కలుసుకొని, వాళ్ళ సహకారంతో కార్యాచరణ ప్రారంభించాడు. లోకల్ ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను, మున్సిపల్ కార్పొరేషన్‌ను, స్త్రీ శిశు సంక్షేమ శాఖను, విమెన్ ఎంపవర్మెంట్ విభాగం, బ్యాంకు అధికారులను కలసి వేశ్యావృత్తి మహిళలకు ఉపాధి అవకాశాలను బ్యాంకు రుణ సదుపాయాలపై చర్చించాడు. అలా ఆపరేషన్ వేశ్యా వాటిక మొదలయ్యింది. స్థానిక మహిళలకు ఫ్లవర్ బొకేలు, మాస్కులు, శానిటైజర్ల తయారీలో శిక్షణ ఇప్పించటం, బ్యాంకు రుణాల ద్వారా కిరాణా దుకాణాలు, మిల్క్ బూత్ లు, ఇతర యూనిట్ల ఏర్పాటు ద్వారా వారి ఉత్పత్తులను మహిళాభివృద్ధిశాఖ ద్వారా కొనుగోలు చేయించటం.. ప్రభుత్వం ద్వారా సొంత మార్కెటింగ్ అవకాశాలు కల్పించటం, కుట్లు, అల్లికలు, వంటలు, కళల్లో శిక్షణతోపాటు యూట్యూబ్ సాయంతో సొంత చానెల్ ఏర్పాటు చేయించటం ఒకొకటిగా యుద్ధ ప్రాతిపదికన జరిగాయ్. ఇంకా కొనసాగుతున్నాయ్. ఇప్పుడక్కడ ఇన్నేళ్ళ చీకట్లు తొలగి వెలుగు సంతరించుకుంటోంది. - కె శ్రీనివాస్ సూఫీ -
ఆమె నా భార్య కాదు!
‘‘సార్! ఆమె నా భార్య కాదు!’’ అన్న ఆ వ్యక్తి వంక ఆశ్చర్యంతో చూశాడు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరామ్. ఆ వ్యక్తికి ముప్పయ్యేళ్ళుంటాయి. అతను చెప్పిన వివరాలు ఇవి... అతని పేరు దిలీప్. ఏడాది కిందట ముంబయ్‌కి చెందిన అంజలితో వివాహమయింది. తల్లిదండ్రులు ఓ ప్లేన్ క్రాష్‌లో చనిపోవడంతో కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలయిందామె. నాలుగురోజుల కిందట బిజినెస్ టూర్లో చెన్నై వెళ్ళారు దంపతులు. హోటల్ లీలామహల్ ప్యాలెస్‌లో బస చేశారు. నుంగంబాకంలో వున్న తన స్నేహితురాలితో రెండురోజులు గడిపివస్తాననీ చెప్పి వెళ్ళిపోయింది అంజలి. తిరిగిరాలేదు. ఆమె మొబైల్ ఫోన్ అందుబాటులో లేదు. పోలీసు కంప్లెయింట్ ఇచ్చి, ఓ బిజినెస్ డీల్ ఉండడంతో కిందటి రోజే హైదరాబాద్ వచ్చాడు. ‘‘సార్! బేగంపేటలోని హోటల్ వివాంతాలో బస చేశాను. ఈరోజు ఉదయం బైటకు వెళ్ళిన నేను తిరిగి హోటల్‌కు వచ్చేసరికి రాత్రి అయింది. రూమ్ లాక్ తీసి లోపలికి వెళ్లిన నాకు షాక్.. ఓ అపరిచిత యువతి నా బెడ్ రూమ్‌లో పడుకునివుంది! తానే నా భార్యనంటోంది!’’ చెప్పాడు దిలీప్. ఆ కేసు చిత్రంగా అనిపించింది శివరామ్‌కి– ‘ఓ స్త్రీ ..ముక్కూ మొగమూ ఎరుగని పరపురుషుడికి భార్యనని చెప్పుకోవడం సంభవమేనా!?’ అనుకుంటూ ‘‘పదండి, హోటల్‌కి వెళదాం’’ అంటూ కుర్చీలోంచి లేచాడు శివరామ్. ‘‘భగీరథ గారూ! ఆమె నా భార్య కాదు. మీరే నన్ను సేవ్ చేయాలి’’ అన్నాడు దిలీప్. ‘‘మీ భార్య అదృశ్యం గురించి చెన్నయ్ పోలీసులు పరిశోధిస్తున్నారని చెప్పారుగా?’’ అన్నాడు డిటెక్టివ్ భగీరథ. ‘‘ఔను. మీరు చేయవలసిందల్లా ఆ నకిలీ స్త్రీని ఎక్స్పోజ్ చేయడమే’’ చెప్పాడు దిలీప్. వివరాలు అడిగి తెలుసుకుని.. నోట్ చేసుకున్నాడు భగీరథ. ఓ అంశం ఆలోచనలో పడేసిందతణ్ణి. ఇన్స్పెక్టర్ శివరామ్‌ని కలిసిన డిటెక్టివ్ భగీరథకు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ‘ఇంపోస్టర్గా చెప్పబడుతున్న ఆ స్త్రీ వద్ద అంజలి సెల్ ఫోన్ ఉంది. ఆమె సూట్ కేస్ తాళంచెవి కూడా ఉంది. సూట్ కేసులోని దుస్తులు ఆమెకు సరిగ్గా సరిపోతున్నాయి. ఆమె సెల్ఫోన్లో ఉన్న దంపతుల ఫొటో వారిద్దరిదే! చివరకు ఆమె వాట్సాప్ గ్రూప్‌లో పెట్టుకున్న జాయింట్ ఫొటోలో కూడా ఆమె, దిలీప్ ఉన్నారు! అంతేకాదు, అంజలి స్నేహితురాళ్ళకు వీడియో కాల్ చేస్తే, ఆ స్త్రీ అంజలే అని నిర్ధారించారు అందరూ!’ ‘‘ఆ దిలీప్గాడు ఓ నట్లా ఉన్నాడు. స్వంత పెళ్ళాన్ని పట్టుకుని ఇంపోస్టర్ అంటున్నాడు. అతణ్ణి సైకియాట్రిస్ట్‌కి అప్పగించాల్సిందే’’ అన్నాడు శివరామ్. ‘‘ఇందులో ఏదో పెద్ద కాన్స్పిరసీయే ఉందేమోననిపిస్తోంది నాకు’’ అన్నాడు భగీరథ సాలోచనగా. హోటల్ వివాంతాకి వెళ్ళి ఆ స్త్రీని కలిశాడు భగీరథ. తన ఫేస్బుక్ అకౌంట్ తెరిచి, అందులో ఉన్న తమ జాయింట్ ఫొటోగ్రాఫ్‌ని చూపించిందామె. సెల్‌ఫోన్ నుంచి ఎవరికో వీడియో కాల్ చేసింది. అవతల ఒక యువతి పిక్చర్లోకి రాగానే.. ‘‘హాయ్, సరితా!’’ అంది. వెంటనే ఆ యువతి, ‘‘హాయ్, అంజలీ! ఏం చేస్తున్నావే?’’ అనడిగింది నవ్వుతూ. ‘‘ముందు నాకీ విషయం చెప్పవే. మొన్న చెన్నయ్‌లో ఉన్న నాలుగు రోజులూ నేను ఎక్కడ ఉన్నానే?’’ అనడిగింది. ‘‘ మా ఇంట్లోనేగా? ఏం?’’ అంది సరిత. ‘‘దిలీప్‌కి నిజంగానే మతిభ్రమించిందా!?’ అనుకుని విస్తుపోయాడు డిటెక్టివ్. అసిస్టెంట్ భావనను ముంబయ్ పంపించి, తాను చెన్నయ్ వెళ్ళాడు భగీరథ. డీజీపీని కలసి అంజలి ‘అదృశ్యం’ కేసులో పురోగతి లేదని తెలుసుకున్నాడు. అనంతరం హోటల్ లీలామహల్ ప్యాలెస్‌కి వెళ్ళాడు. నిర్ణీత తేదీన దిలీప్ దంపతులు తమ హోటల్లో చెకిన్ అయ్యారనీ, మర్నాటి ఉదయం ఔటింగ్‌కి వెళ్ళారనీ, రెండోరోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక్కడే తిరిగివచ్చాడనీ ‘మేడమ్ స్నేహితుల ఇంట్లో వుంద’ని’ బెల్ బాయ్‌తో చెప్పాడనీ వివరించాడు మేనేజర్. వారికోసం అద్దెకారును హోటలే ఏర్పాటు చేసింది. అది వైట్ కలర్ టయోటా కారు. దాని రిజిస్ట్రేషన్ నంబర్: TN–06–CA–5995. సెల్ఫ్–డ్రైవ్. ఆ కారు లాగ్బుక్ని తెప్పించి పరిశీలించాడు భగీరథ. మొదటి రెండురోజుల్లో సుమారు 1100 కిలోమీటర్ల దూరం తిరిగింది. కొడైకెనాల్ గురించి అంజలి తనను కాజ్యువల్‌గా అడిగినట్టు చెప్పింది రిసెప్షనిస్ట్. ‘అంజలి’గా చెప్పుకుంటున్న యువతి ఫొటోను ఆమెకు తెలియకుండా తన సెల్లో తీశాడు భగీరథ. ‘‘దిలీప్‌తో వచ్చిన యువతి ఈమెనే?’ తన సెల్‌లోని ఫోటో చూపించి అడిగాడు హోటల్ సిబ్బందిని. ‘కాదు’ అన్నారు. ముంబై నుంచి భావన పంపించిన అంజలి ఫొటోని చూపిస్తే .. గుర్తుపట్టారు! అద్దెకారులో కొడైకెనాల్కి బైలుదేరాడు భగీరథ. చెన్నయ్–కొడైకెనాల్ నడుమ ఉన్న ఒక్కో టోల్‌ప్లాజా దగ్గరా ఆగి, దిలీప్ దంపతులు కొడైకెనాల్కి వెళ్ళారనుకుంటూన్న తేదీ ఎంట్రీలను పరిశీలించాడు. వైట్‌కలర్ టయోటా కారు వాటిగుండా వెళ్ళినట్టూ, డ్రైవర్ పక్కన ఓ యువతి ఉన్నట్టూ.. మరుసటి రోజున తిరుగు ప్రయాణమైనట్టూ... అప్పుడు కారులో డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేనట్టూ... సీసీ కెమేరాలలో నమోదయింది. భగీరథ కొడైకెనాల్ చేరుకునేసరికి రాత్రి అయింది. దాంతో మర్నాడు... దిలీప్ దంపతులు నిర్ణీత తేదీన సెయింట్ మేరీస్ రోడ్లో ఉన్న తామరై కోడై హోటల్లో బస చేసినట్టు తెలుసుకున్నాడు. ఆ దంపతులు నిర్ణీత తేదీన రాత్రి ఏడు గంటల సమయంలో వచ్చారనీ, మర్నాటి ఉదయం ఏడు గంటలకే దిలీప్ ఒక్కడూ వచ్చి చెకవుట్ చేశాడనీ తేలింది. హైద్రాబాద్‌కు తిరిగివచ్చిన డిటెక్టివ్ తిన్నగా ‘అంజలి’గా చెప్పుకుంటున్న ఆ స్త్రీ వద్దకు వెళ్లాడు. తాను సేకరించిన సాక్ష్యాధారాలతో ఆమెను కన్ఫ్రంట్ చేశాడు. ఆరోజు రాత్రి దిలీప్‌తో పాటు డిన్నర్‌కి వెళ్ళలేదు ‘ఆమె’. దిలీప్‌కి ఆమెను చూస్తూంటే పీక పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. తన మాటలను ఎవరూ నమ్మడంలేదు. కానీ నిజం తనకు తెలుసు. తనకే తెలుసు! దిలీప్ బార్కి వెళ్ళి బాగా తాగాడు. డిన్నర్ ముగించి సూట్‌కి వచ్చాడు. బెడ్ మీద పడుకుని టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తోందామే. ఆవేశం ముంచుకొచ్చిందతనికి. ‘‘చెప్పు, ఎవరు నువ్వు? చెప్పకపోతే చంపేస్తాను!’’ అన్నాడు. ‘‘నీ భార్య అంజలిని!’’ కూల్‌గా అందామె. ‘‘’’నో!’’ గట్టిగా అరచాడతను. ‘నువ్వు అంజలివి కాదు. ఎందుకంటే అంజలి లేదు!’’ ‘‘నా మీద నకిలీ ముద్ర వేసి నా ఆస్తంతా కాజేయాలనుకుంటున్నావు కదూ?’’ కోపంగా అంది. ‘‘నాన్సెన్స్! ఆస్తిని కాజేయాలనుకుంటున్నది నువ్వే. అంజలి చచ్చిపోయింది!’’ రెచ్చిపోయాడు. ‘‘అంత ఖచ్ఛితంగా ఎలా చెప్పగలవ్?’’ ‘‘ఎలా అంటే తనను నేనేం స్వయంగా చంపేశాను కనుక!’’ స్వీటంతా దద్దరిల్లేలా అరిచాడు. ‘‘నువ్వే చంపేశావా?’’ ‘‘ఎస్. కొడైకెనాల్లో సూయిసైడ్ పాయింట్ దగ్గర లోయలోకి తోసేశా’’ ‘‘దట్స్ ఇట్!’’ అంటూ చటుక్కున పైకి లేచిందామె. అదే సమయంలో యాంటీ–రూమ్ నుంచి బైటకు వచ్చారు డిటెక్టివ్ భగీరథ, ఇన్స్పెక్టర్ శివరామ్‌లు. క్రైమ్ బ్రాంచ్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో ఆ కేసు పూర్వా పరాలను వివరించాడు డిటెక్టివ్ భగీరథ. ‘రెండేళ్ళ కిందట.. అంజలికి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు దిలీప్. ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేసి పెళ్ళిచేసుకున్నాడు. ఆస్తిలో సగం తనకు రాసివ్వమని ఒత్తిడిచేయడం మొదలుపెట్టాడు. తన తదనంతరం అతనే వారసుడంటూ దాటవేస్తూ వచ్చిందామె. అంజలిని తొలగిస్తే తప్ప ఆస్తి తనకు సంక్రమించదనుకున్న దిలీప్.. ఆమెను చంపడానికి నిశ్చయించుకున్నాడు. బిజినెస్ టూర్ మీద చెన్నై వెళ్ళారు దంపతులు. కొడైకెనాల్ తీసుకువెళ్ళి, మార్నింగ్ వాక్ సమయంలో సూయిసైడ్ పాయింట్ దగ్గర ఏమరుపాటుగా వున్న అంజలిని క్లిఫ్ మీదనుంచి కిందకు తోసేశాడు దిలీప్. ఆమె చనిపోయిందనుకుని వెంటనే చెన్నయ్‌కి తిరిగివచ్చేశాడు. అదృష్టవశాత్తూ క్లిఫ్ అంచున పెరిగిన ఓ చెట్టుకొమ్మను పట్టుకుని నిలువరించుకుంది అంజలి. ఆమె అరుపులు విన్నవారు ఫైర్ సర్వీస్‌కి ఫోన్ చేయడమూ, వాళ్ళు వచ్చి ఆమెను కాపాడ్డమూ జరిగాయి. ట్రామాకి గురైన అంజలి పైకి రాగానే çస్పృహతప్పి పడిపోయింది. ఆమెను ఓ లోకల్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించారు. మర్నాడు తెలివిలోకి వచ్చిన అంజలికి భర్త హోటల్ గది ఖాళీచేసి వెళ్ళిపోయినట్టు తెలిసింది. దాంతో అతని కుట్ర బోధపడిందామెకు. భుజానికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ జారిపోకుండా వుండడం విశేషం. ఆమె మొబైల్ ఫోన్ అందులోనే ఉంది. చెన్నయ్‌లోని తన స్నేహితురాలికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆమె వెంటనే కొడైకెనాల్కి వచ్చి అంజలిని తనతో తీసుకువెళ్ళింది. చెన్నయ్‌కి తిరిగివచ్చిన దిలీప్ తన భార్య అదృశ్యమయిందంటూ ఫార్మల్గా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి, హైద్రాబాద్ కి చెక్కేశాడు. ముఖాముఖీ కన్ఫ్రంట్ చేస్తే అతను నేరం ఒప్పుకోడు. రుజువు చేయడం కూడా కష్టమే. అందుకే అతని పద్ధతిలోనే నాటకమాడి ఎక్స్పోజ్ చేయాలని నిశ్చయించుకున్నారు. అంజలి స్నేహితురాళ్లూ అందులో భాగమే. ఒకామె అంజలిగా హైద్రాబాద్‌లో దిలీప్ బసచేసిన హోటల్లో ప్రవేశించడం. ఫేస్బుక్లో, వాట్సాపలో, మొబైల్లో ఫొటోలను మార్ఫింగ్ చేసీ, ఇతరత్రానూ ఆమే అంజలి అంటూ అతనికి పిచ్చెక్కేలా చేశారు. దిలీప్.. డిటెక్టివ్ భగీరథ సాయం కోరింది.. అదృశ్యమైన భార్యను కనిపెట్టడానికి కాదు ఇంపోస్టర్ని ఎక్స్పోజ్ చేయడానికి! అదే డిటెక్టివ్‌లో ఆలోచనలను రేపింది. డిటెక్టివ్ సాయం కోరడం ద్వారా తాను చేసిన నేరం నుంచి తప్పించు కోవచ్చను కున్నాడు. డిటెక్టివ్‌కి తాను తీగనందించాడనీ, అతను డొంకంతా కదల్చగలడనీ ఊహించలేకపోయాడు. పరిశోధన మొదలుపెట్టిన భగీరథ చెన్నయ్, కొడైకెనాల్, నోయిడాలను దర్శించి దిలీప్ నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడు. అంజలిగా వచ్చిన యువతి ఇంపోస్టర్ అని గ్రహించాడు. తాను సేకరించిన సమాచారంతో ఆమెను కన్ఫ్రంట్ చేశాడు. దాంతో నిజం చెప్పేసిందామె. దిలీప్ని ఎక్స్పోజ్ చేసేందుకు స్నేహితురాళ్ళు ఆడుతున్న నాటకంగా వివరించింది. డిటెక్టివ్ సలహా ప్రకారం ఆ రోజు రాత్రి డిన్నర్‌కి వెళ్ళలేదామె. దిలీప్ కిందకు వెళ్ళగానే డిటెక్టివ్, ఇన్స్పెక్టర్లు సూట్లో ప్రవేశించి సీక్రెట్ కెమేరాను అమర్చి, బగ్ చేసి, యాంటీ–రూమ్‌లో దాక్కున్నారు. దిలీప్ తిరిగిరాగానే అతన్ని రెచ్చగొట్టవలసిందిగా ఆమెతో చెప్పారు. రెస్ట్ ఈజ్ హిస్టరీ. పోలీసులు అంజలినీ, ఇంపోస్టర్గా వచ్చిన ఆమె స్నేహితురాలినీ ప్రవేశపెట్టడంతో వారిని చూసి తల వంచుకున్నాడు దిలీప్. - తిరుమలశ్రీ -
నేను దొంగని కాదు
‘‘ఒలే శంకరూ... బడి సూడులే, ఎంత పెద్దగుందో..!’’ గట్టిగా అర్సినాడు గణేశు. స్కూల్ ప్రేయర్లో ప్లెడ్జు చెప్పేటప్పుడు తప్ప ఇంగెప్పుడూ వాడట్ల అర్సిండేది చూడలా నేను. నిజంగానే బడి చానా పెద్దగుంది. ‘‘ఔరా..! టీవీలో చూపిస్తారు చూడు, అట్లే ఉంది గదరా..!’’ అంటూ అరిచాను నేను కూడా. ‘‘మాడీలు, మాడీలు ఉంది చూడురా, మన బడి మాదిరి లేదు...’’ అని బడినే చూస్కుంట నిలబడినాడు వాడు. మా బడి మాదిరి లేదు ఆ బడి. ఇది రంగులు రంగులుంది. బలే ఉంది. మా బడికైతే సున్నం కొట్టింటారు, అది గుడక వానకి తడ్సి తడ్సి నల్లగ చారలు పడింటాయి గోడల మీద. మళ్లీ వాడే ‘‘రంగులు రంగులు బలే ఉంది కదురా ఈ బడి. మనం గుడక ఈడే సదివేదైతే బాగుంటాండ్య...’’ అని చెప్తాంటే వాచ్‌మన్ మా దగ్గరికొచ్చి ‘‘ఏయ్ బాబూ... పక్కకెళ్ళండి మీరు’’ అంటూ అరిచాడు. ఇంతలో మా సారోళ్ళు యెనకాల నుండి వచ్చి ‘‘మేము సైన్సు ఎగ్జిబిషను కోసం వచ్చాం. వీళ్ళు మా స్కూల్ పిల్లలే’’ అనడంతో ‘‘అవునా, సారీ సార్! స్కూల్ డ్రస్ ల్యాకపోతే ఎవురో అనుకుని పొమ్మంటాండా’’ అని చెప్పి లోపలికి పంపాడు. సారోళ్ళతో నేను, గణేశు ఇంగా మిగితా పిల్లోళ్ళు అందరం లోపలికి పోయినాం. అట్ల పొయ్యేటప్పుడు గేటు పక్కనే పూలకుండీ పక్కన బూట్ల జత ఒకటి పడి ఉన్నింది. గణేశు వాటి వైపే చూస్కుంట లోపలికి వచ్చినాడు. అది నేను గమనించినా. బయటి నుండి చూసి ‘‘ఏముందిరా... బడి’’ అనుకున్యాం. లోపలికి పోయినాక నేను, గణేశు ఒకరి మొగం ఇంకొకరం చూస్కుంటాన్నాం... అంత బాగుంది లోపల. ఇద్దరం అట్లే చూస్కుంట నడుస్తా ఉండంగ మా ఇద్దర్నీ సారోళ్ళు పిలిచి ‘‘అందరూ యూనిఫారమ్స్‌లో వచ్చారు. మీ ఇద్దరికీ ఏం రోగంరా, కలర్ డ్రస్‌లో వచ్చారు..?’’ అనడిగారు. ఏం చెప్దామా అని ఆలోచిస్తా ఉండంగ గణేశు ‘‘నాకున్నేది ఒక జతే సార్. మాయమ్మకు తెల్దు ఈ పొద్దు మనం కర్నూలు వస్తాన్నామని. అందుకే ఉతుకుదామని నానేసింది. పొద్దునకి యాడా ఆరలేదు సార్. అందుకే కలర్ డ్రస్’’ అని చెప్పి నా వైపు చూశాడు. ‘‘మాయమ్మ ఉతికి షర్టుకి నీలం పెట్టింది సార్. అది ఎక్కువైపోయింది. అందుకే నేను గుడక కలర్ డ్రస్ ఏస్కోని వచ్చిన’’ అని అప్పటికి తట్టిన అబధ్ధం చెప్పా నేను. ‘‘సరే లెండి, రేపైనా యూనిఫారమ్స్‌లో రండి. ఇందాక చూశారుగా, వాచ్‌మన్ ఎలా పొమ్మన్నాడో... మనం వేసుకునే బట్టల్ని బట్టి కూడా మనుషులు మనతో నడుచుకునే విధానం మారుతుంది. మీలాగ చదువుకునే పిల్లలు మంచిగా ఉండాలి. ఎవరితోనూ మాటలు పడకూడదు...’’ అని చెప్పేసి ముందుకు కదిల్నారు సారోళ్లు. అప్పుడు గణేశు నా దగ్గరికొచ్చి ‘‘అవులే, నీ దగ్గిర రెండు జతలు కదలే ఉన్నేది. రెండూ ఈరోజే ఉతికేసిందా అమ్మ?’’ అని అడగ్గానే ‘‘అందురూ స్కూల్ డ్రస్‌లోనే వస్తారని నాకు తెలుసు. నేను గుడక అదే తొడుక్కుందామనుకునుంటిని. అంతలో నువ్ మా ఇంటి కాడికి వస్తివి కదా, కలర్ డ్రస్సులో. ఇంగ నేను గుడక స్కూల్ డ్రస్ తొడుక్కుంటే నువ్వొగనివే అయిపోతావ్. సారోళ్ళు తిడ్తారేమో అని నేను గుడక కలర్ డ్రస్సులోనే వచ్చిన’’ అని నిజం చెప్పినా వానికి. వాడదంతా విని నవ్వి, ఏదో గుర్తుకు తెచ్చుకున్నట్టు మొకం పెట్టి ‘‘ఆడా... నేను బూట్లు చూసినా లే’’ అన్నాడు. ‘‘యాడా..?’’ తెలీనట్లు అడిగినా నేను. ‘‘గేటు ముందర...’’ ‘‘ఎవురివీ..?’’ ‘‘ఏమోబ్బా.. ఆడే ఉన్యాయి.’’ ‘‘సరే లెలే... సారోళ్లు ముందర్కి ఎళ్లిపోయినారు. నడ్సు తొందర్గా...’’ అని చెప్పినా. మా క్లాసోళ్ల దగ్గరికిపోయి నిలబడుకున్యాం. సైన్సు ఎక్స్పరిమెంట్లు ఒకదాని పక్కన ఇంగొకటి పెట్టుకోని ఉండారు. టేబుల్ల మీద పెట్టి, యెనకాల గోడల మీద చార్టులు తగిలిచ్చి చెప్తా ఉన్నారు. మేమంతా ఒక్కోటి చూస్కుంటా పోతాన్నాం. కొన్నైతే టెక్స్›్ట బుక్కులో చూసిన బొమ్మలు గుడక వస్తువుల రూపంలో ఉండాయి ఆడ. ఆ స్కూలు పిల్లోళ్లంతా స్కూల్ డ్రస్సు, బూట్లు తొడుక్కోని, షర్టులు ప్యాంట్లలోకి టక్కులు చేస్కోని ఉండారు. వాళ్లందరినీ అట్ల చూసి మా తుట్టు మేం చూస్కుంటాంటే ఎట్లనో అనిపిస్తాంది. ‘‘వీళ్ల మాదిరి మనక్కూడా బూట్లు ఏస్కున్నేది, టక్కు చేస్కున్నేది ఉండింటే బాగుండు కదురా...’’ ఆ స్కూలు పిల్లోళ్ల పక్క చూస్కుంట నాతో అన్నాడు గణేశు. ‘‘యాడైతాది లేప్పా! ఈడ ఊరికే ఇయ్యరు అవి. లెక్క కట్టల్ల. లక్షల్లో ఉంటాది ఫీజు. మన మాదిరి కాదు.’’ అన్నా నేను. ‘‘ఏమోలే... చూడనన్న చూస్తాన్నాం ఈరోజు. ఇట్లాటి బడి ఎప్పుడో గాని చూడలా...’’ ‘‘ఎంతసేపు చూసినా అన్నీ కొత్తగానే ఉండాయి...’’ చూస్తా చూస్తా క్లాసు రూముల వైపు పోయినాం. ‘ఒలే... ఈడ చూడు వీళ్లకి బెంచీలు గుడక ఉన్నాయి. కింద కుచ్చోరేమో వీళ్లు’’ మళ్లీ అర్సినాడు గణేశు. ‘‘ఔ గదరా... మంచి చాన్సు, వీళ్లకే మేలు.’’ ఇట్ల అన్ని చూస్కుంట ఆశ్చర్యపడటంలోనే సాయంకాలమయింది. ‘‘మన స్కూలోళ్లందరు వచ్చి లైన్లో నిలబడండి’’ అనుకుంట పిల్లోళ్లంతా ఉన్నారో లేదో చూస్కుంటాన్నారు సారోళ్లు.. గేటు గుండా బయటికి నడుస్తాన్నాం. సరిగ్గా గేటు దాటంగానే నేను గణేశు వైపు చూశా. వాడు ఆ పూల కుండీ పక్కనున్న బూట్ల వైపు చూస్తాన్నాడు. అవి ఇంగా ఆడనే ఉన్నాయి. అప్పుడు నేను ‘‘బూట్లు బాగున్నాయిలే... ఎవురో ఆడ పెట్టినారు’’ అన్నా వాడితో. ‘‘నేను గుడక అదే అనుకుంటాన్నా...’’ అని చెప్పాడు. అందరం బస్సెక్కి ఎవరి ఇళ్లకి వాళ్లు వచ్చేసినాం. ∙∙ తర్వాత రోజు మేమే అందరికంటే ముందే బస్సు దిగి పోయి గేటు బయట నిలబడినాం. ముందురోజు స్కూలు చూస్కుంట నిలబడిన మేము తర్వాతి రోజు బూట్లు చూస్కుంట నిలబడినాము. అవి ఆరోజు గుడక ఆడనే ఉన్నాయి. ఇద్దరం ఒకరి మొగం ఇంగొకరం చూస్కొని నవ్వుకుంటాన్నాం. అవి మావి కాకపోయినా మాకెందుకో అంత ఆనందం. ఇంతలో సారోళ్లు వచ్చి లోపలికి తీస్కపోయినారు మమ్మల్ని. ‘‘ఈరోజు కూడా నిన్నటిలాగే అల్లరి చేయకుండా మంచిగ ఉండండి’’ అని చెప్పారు సారోళ్లు. ‘‘ఒలే.. నాకో ఐడియా...!’’ నా దగ్గరికొచ్చి అన్నాడు గణేశు. ‘‘ఏందిలే...’’ ‘‘పాసుకని చెప్పి పోదాం... బూట్ల కాడ్కి’’ ‘‘కానీ బాత్రూములు లోపలే ఉండాయి కదా..?’’ ‘‘మనం యా పక్క పోతాన్నేది సారోళ్లు చూడరులే యాడా...’’ ‘‘సరే... నేను పోయి అడుగుతా, ఇద్దరం పోదాం...’’ సార్ దగ్గరికి పోయి అడగ్గానే సరే వెళ్లమన్నాడు సారు. గణేశు దగ్గరికిపొయి నేను ‘‘పొమ్మన్యాడు సారు..’’ అని చెప్పా. గేటు వైపు నడుస్తాన్నాం ఇద్దరం. మేం బయటికి పోతాన్నేది సారోళ్లు చూస్తారేమో అని మధ్య మధ్యలో యెనక్కి తిరిగి చూస్తాన్నా. ఇంతలో గణేశు ‘‘ఒలే... ఊరికే ఒగసారి కాళ్లకేస్కుని చూస్తా అంతే. మళ్లా ఆడే పెట్టేసి వద్దాం...’’ అన్నాడు. ‘‘సరేలేరబ్బా... నేనేం దొంగతనం చేద్దాం అని కాదు వస్తాండేది, ఏస్కోని చూసేకేలే...’’ అంటూ నడుస్తున్నాను. మా అదృష్టం గేటు దగ్గిర వాచ్‌మన్ లేడు. పూలకుండీ పక్కన చూసినాం. బూట్లు ఆడే ఉండాయి! తీస్కొని కాళ్ళకి ఏస్కున్నాడు గణేశు. ‘‘లేసు కట్టుకోలే...’’ అన్నా నేను. ‘‘సరేరా!’’ అని చెప్పి కట్టుకుని, తన కాళ్లనీ వాటికున్న బూట్లనీ అట్లనే చూస్కుంట సంబరపడ్తాన్నాడు గణేశు. మొగం ఆనందంతో వెలిగిపోతాంది. అడుగులేసి ఒకసారి, నిలబడుకోని ఒకసారి, ‘సెల్యూట్’ అని కుడికాలు గట్టిగా నేల మీద కొట్టి ఒకసారి, ఇట్ల చానా రకాలుగా చేసి సంబరపడ్తాన్నాడు. అదే ఫస్టు టైమ్ వాడు బూట్లేసుకోవడం. వాడు తీసేస్తానే నేను గుడక ఒకసారి ఏస్కుని చూద్దామని చూస్తాన్నా. నేను గుడక ఎప్పుడు బూట్లేసుకోలా. ‘‘ఇంగ తీసేస్తాలే, నువ్ గుడక ఏస్కుందువు’’ అంటూ బూట్లు తీస్తూ ఉండగా వాచ్‌మన్ వచ్చాడు. గణేశు వైపు కోపంగా చూస్తాన్నాడు. ‘‘న్నా... నేను ఊరికే ఏస్కోని చూస్తాన్నా...’’ అని చెప్తూ ఉండగా గణేశు చెంప మీద గట్టిగా కొట్టాడు వాచ్‌మన్. చెప్పేదైనా వినిపిచ్చుకోకుండా కొట్టినాడు. అప్పుడు గణేశుని చూస్తే నాకే ఏడుపొచ్చింది. ‘‘దొంగతనం చేస్తార్రా... దొంగ నాయాల్లారా, అందుకే మీ అట్లాటోళ్ళని ఇట్లాటి బడుల వైపే రానీయకూడదు’’ అంటూ అరిచాడు. అక్కడ ‘మీ అట్లాటోళ్ళని’ అని అనడంలో ఏమర్థముందో నాకు తెలియలా. తర్వాత కొంచెం పెద్దగైనాక అర్థమయింది. నన్ను కూడ కొడదామని చెయ్యెత్తినాడు. నేను పక్కకి జరిగిన. దెబ్బ తగల్లేదు. ఇంగ బడిలోకి కూడా పోలేదు మేము. అట్లే బస్టాండుకుపోయి మా ఊరి బస్సెక్కినాం. బస్సులో గంటసేపున్నాం. ఒక్కమాట కూడా మాట్లాడలేదు వాడు. ఆ తర్వాతిరోజు బడికి రాలేదు. మాట్లాడదామని వాళ్లింటి కాడికిపోతే కూడ సరిగ్గ మాట్లాడలేదు. వాడే మాట్లాడాతాడులే అని యెనక్కి వచ్చేసినా. ఒక్కడే కొడుకవ్వడంతో గణేశునెప్పుడూ వాళ్లమ్మ కొట్టలేదు. క్లాసులో అందరి కంటే బాగా చదివేవాడు కాబట్టి సారోళ్ల చేతిలో కూడ ఎప్పుడు దెబ్బలు తినలేదు. జీవితంలో మొదటిసారి చెంప దెబ్బ తిన్నాడు. అది కూడా చేయని తప్పుకి. తనకి పుట్టిన చిన్న కోరిక వల్ల దొంగ అనే మాట పడాల్సి వచ్చింది. వాచ్‌మన్ మీద వచ్చిన కోపం బూట్ల మీదకి మళ్లింది వాడికి. అంతే! ఆ రోజు తర్వాత మళ్లెప్పుడూ వాడు బూట్లు ఇష్టపడటం కానీ, వేసుకోవటం కానీ చేయలేదు. సంవత్సరాలు గడిచినా... ఆ చేదు ఙ్ఞాపకం అలానే ఉండిపోయింది. అది జరిగిన కొన్ని రోజులకి వాడి నోట్సులో చూశాను. ‘నేను దొంగని కాదు’ అని రాసి ఉన్నింది. - మొహమ్మద్ గౌస్ -
నీలిమకి ఎవరో అజ్ఞాత ప్రేమికుడు
అరగంట క్రితమే తెల్లవారింది. ఇన్స్పెక్టర్ విజయ్ బృందావన్ పార్కులో చేరుకునేసరికి అప్పటికే అక్కడున్న పోలీస్‌లు, ఫోరెన్సిక్ నిపుణులు తమ పనుల్లో నిగమగ్నమై ఉన్నారు. పార్కు చివర గుబురు చెట్ల మధ్య నేలపై ఓ యువకుడి మృతదేహం బోర్లా పడివుంది. పదునైన కత్తితో గొంతు కోయడం వల్ల యువకుడు మరణించాడని చూడగానే తెలుస్తోంది. అతడి వయసు 30 ఏళ్లు ఉండొచ్చు. శవాన్ని ముందుగా చూసి పోలీసులకు సమాచారం అందించిన తోటమాలిని ప్రశ్నించాడు విజయ్. ‘‘సార్, నేను ఎప్పటిలాగే తెల్లవారినప్పుడు పార్కంతా తిరుగుతూ ఇక్కడికొచ్చి చూస్తే ఈ దృశ్యం కనిపించింది. మొదట ఇతడు తప్పతాగి ఇక్కడ పడుకున్నాడునుకున్నాను. కాని గడ్డకట్టిన రక్తం చూడగానే విషయం అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను’’ అన్నాడు తోటమాలి.తర్వాత శవం జేబులో ఉన్న ఐడీ కార్డ్ ఆధారంగా పోలీసులు ఆ యువకుడి వివరాలు సేకరించారు. అతడి పేరు మహేష్. నగరంలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మరో నెల రోజుల్లో నీలిమ అనే యువతితో అతడి పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ విజయ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. హంతకుడు మహేష్ జేబులోని డబ్బు, సెల్‌ఫోన్ ముట్టుకోలేదు కాబట్టి ఈ హత్య దోపిడీ కోసం జరగలేదని అతడు నిర్ధారణకొచ్చాడు. మహేష్ కుటుంబ సభ్యుల్ని విచారిస్తే మహేష్‌కి ఎవరితోనూ వైరం లేదని తెలిసింది. మహేష్ తన కాల్సెంటర్లో పనిచేసే నీలిమను ప్రేమించాడని, నెలరోజుల్లో పెళ్లివుందనగా ఈ హత్య జరిగిందని వారు తెలిపారు. దాంతో ఈ హత్యకు మహేష్ పెళ్లితో సంబంధం ఉందని విజయ్‌కి అనుమానం కలిగింది. వెంటనే నీలిమ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో నీలిమతో పాటు ఆమె ఇద్దరు చెల్లెళ్లు, తండ్రి చలపతిరావు ఉన్నారు. చలపతిరావు గతంలో మిలటరీలో పనిచేశాడు. తీవ్రవాద దాడిలో ఓ చేతిని కోల్పోయాడు. నీలిమ డిగ్రీ వరకు చదువుకొని కాల్సెంటర్లో పనిచేస్తోంది. ఆమె చెల్లెళ్లు ఒకరు ఇంటర్, మరొకరు పదో తరగతి చదువుతున్నారు. చలపతిరావు తన గురించి చెప్పుకున్నాడు. ‘‘టెర్రరిస్ట్ ఎటాక్‌లో నా ఎడమ చెయ్యి పోయింది. నాకు పరిహారంగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో పిల్లల్ని చదివించాను. అవసరార్థం పలుచోట్ల నైట్ వాచ్‌మెన్‌గా పనిచేశాను. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో నా భార్య మరణించింది. డిగ్రీ పూర్తిచేశాక నీలిమకు గత ఏడాది కాల్సెంటర్లో ఉద్యోగం వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఆమె పెళ్లి నిశ్చితార్థం జరిగింది. అంతలోనే ఈ ఘోరం జరిగింది’’ అన్నాడు బాధగా. విజయ్ నీలిమను పక్కకి పిల్చుకెళ్లి ప్రశ్నించాడు. ‘‘నిన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా? నీ పెళ్లి మహేష్‌తో జరగటం ఇష్టం లేక అతన్ని హత్య చేశారని అనుమానంగా ఉంది’’ అన్నాడు.‘‘నన్ను ఎవరూ ప్రేమించడం లేదు. ఒక వేళ ప్రేమించినా దాని కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని నేననుకోను. ఈ హత్య వెనక వేరే కారణం వుందనిపిస్తోంది’’ అంది. ఆమె ఏదో విషయం దాస్తున్నట్లు విజయ్‌కి అనుమానం కలిగింది. అయినా ఆమెను మళ్లీ ప్రశ్నించకుండా ఆ ఇంట్లో నుంచి బయటికొచ్చాడు. బయటకొచ్చాక చుట్టుపక్కల ఇళ్లలో నీలిమ గురించి కూపీ లాగాడు. అప్పుడొక కొత్త సంగతి బయటపడింది. అదేమంటే ఏడాది క్రితమే ఓ దూరపు బంధువుతో నీలిమకు పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయి పేరు మోహన్. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందే మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణమేంటో ఎవరకీ తెలియదు. ఈ విషయం గురించి నీలిమగానీ, ఆమె తండ్రిగానీ విజయ్‌కి చెప్పలేదు. రెండు సార్లు పెళ్లికి ముందే పెళ్లికొడుకు చనిపోయాడని ప్రచారమైతే నీలిమకు ఇక సంబంధాలు రావని భయపడ్డారు కాబోలు. అయితే మోహన్ ఆత్మహత్యకు, మహేష్ హత్యకు ఏదో లింక్ ఉందని విజయ్‌కి అనుమానం కలిగింది. నీలిమకి ఎవరో అజ్ఞాత ప్రేమికుడు ఉండొచ్చు. మోహన్, మహేష్‌ల చావులకు అతనే కారణం కావొచ్చు. ఈ ఆలోచన రాగానే విజయ్ ఏడాది క్రితం మోహన్ ఆత్మహత్య కేసు నమోదు అయిన పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఆ కేసు వివరాలు సేకరించాడు. నగరానికి దూరంగా ఓ పల్లెలో ఉంటున్న మోహన్ కుటుంబ సభ్యుల్ని కలిసి మాట్లాడాడు. అప్పుడు తెల్సిందేమంటే మోహన్ నగరంలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేసేవాడు. నగరం పొలిమేరల్లో ఓ గది అద్దెకు తీసుకొని వుండేవాడు. తనకు దూరపు బంధువైన నీలిమను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నీలిమ పెళ్లికి రాజీ కావడంతో నిశ్చితార్థం జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా మోహన్ ఓ రోజు రాత్రి తన గదిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో గదికి లోపల నుంచి గడియవేసి ఉండటంతో పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావించారు. కాని మోహన్ అకారణంగా ఎందుకు ఆత్మహ్యత చేసుకున్నాడో ఇంతవరకు బయటపడలేదు. అయితే డిగ్రీ వరకు చదువుకున్న మోహన్ సూసైడ్‌నోట్ కూడా రాయకుండా ఆత్మహత్య చేసుకోవడం విజయ్‌కి అసహజంగా తోచింది. పైగా మోహన్ చావుకి కారణమైన విషం పొటాషియం సైనేడ్ అతడికి ఎవరిచ్చారో అంతుపట్టలేదు. మొత్తం మీద ఇది ఆత్మహత్య కేసు కాదనపించింది. ఎవరో మోహన్‌ను తెలివిగా హత్యచేసి దాన్ని ఆత్మహత్యగా మార్చారనిపించింది. ఈ పని నీలిమని మూగగా ప్రేమించే ఏ అజ్ఞాత ప్రేమికుడో చేసినట్టున్నాడు. అతడు ఇప్పటి వరకు నీలిమను పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దర్ని చంపాడు. ఇప్పుడు మూడో వ్యక్తి పెళ్లికి సిద్ధమైతే అతడిని కూడా చంపవచ్చు. ఈ ఆలోచన రాగానే విజయ్‌కి ఓ ఐడియా తట్టింది. తన ఆలోచనని అమలు చేయడానికి విజయ్ కొత్తగా ఉద్యోగంలో చేరినో ఎస్సైని ఎన్నుకున్నాడు. అతడిపేరు వినోద్. ఇంకా పెళ్లి కాలేదు. విజయ్ వినోద్‌కి తన పథకం గురించి వివరించగానే అతడు ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. పథకం ప్రకారం వినోద్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా నీలిమకి పరిచయమయ్యాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కొద్ది రోజుల్లో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఓ రోజు వినోద్ నీలిమ ముందు పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. నీలిమ నివ్వెరబోయింది. తన తండ్రిని అడిగి అభిప్రాయం చెబుతానని చెప్పింది. ఓ వారం తర్వాత రాత్రి పదిగంటలకు వినోద్ తన ఇంట్లో ఉన్నప్పుడు అతడి సెల్‌ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ‘మన పెళ్లి గురించి అర్జెంట్‌గా నీతో మాట్లాడాలి. గాంధీ నగర్లో పాడుబడ్డ మఠం దగ్గరికి వెంటనే వచ్చేయ్. నా ఫోన్ స్విచాఫ్ అయింది. అందుకే అందుకే ఫ్రెండ్ ఫోన్ నుంచి మెసేజ్ పంపుతున్నాను’ అని వుందా మెసేజ్‌లో. పంపిన వారి పేరు లేకపోయినా అది నీలిమ పంపిన మెసేజ్ అని ఇట్టే గ్రహించాడు వినోద్. ఎందుకైనా మంచిదని నీలిమ నంబర్‌కి రింగ్ చేశాడు. ఫోన్ స్విచ్ఆఫ్ అని వచ్చింది. వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్‌కి ఫోన్ చేసి తనకొచ్చిన మెసేజ్ గురించి చెప్పాడు. అప్పుడు విజయ్ ‘నువ్వు ఆ మఠం దగ్గరికెళ్లు. ఏం జరుగుతుందో చూద్దాం. బీ కేర్ ఫుల్’’ అన్నాడు. వినోద్ వెంటనే తన బైకుపై మఠం దగ్గరికి చేరుకున్నాడు. కానీ అక్కడ నీలిమ కనపడలేదు. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. వినోద్ ఓ పక్కన నిల్చొని ఎదురుచూడ సాగాడు. ఆలోగా అక్కడికి చేరుకున్న విజయ్ వినోద్ దగ్గరికెళ్లకుండా ఓ చెట్టుచాటున నిల్చొని ఏం జరుగుతుందా? అని ఆసక్తిగా చూడసాగాడు. కొద్ది నిమిషాలయ్యాక ఒంటి నిండా శాలువా కప్పుకున్న ఓ వ్యక్తి వినోద్ దగ్గరికి రావడం కనిపించింది. అతడు కాసేపు వినోద్‌తో మాట్లాడాడు. అంతలోనే హఠాత్తుగా ఓ పొడవాటి కత్తి బయటకు తీసి వినోద్‌ను పొడవబోయాడు. కానీ వినోద్ అప్రమత్తంగా ఉండటం వల్ల కత్తి వేటు తగలకుండా పక్కకి జరిగాడు. వినోద్ అతడి చేతిలో కత్తిని లాక్కున్నాడు. శాలువా తొలగి పోవడంతో ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా అతనెవరో కాదు, నీలిమ తండ్రి చలపతిరావు! తర్వాత ఇంటరాగేషన్‌లో చలపతిరావు తన నేరాన్ని అంగీకరించాడు. ‘‘టెర్రరిస్టు దాడిలో నేను చెయ్యి పోగొట్టుకున్న తర్వాత సైన్యం నుంచి నాకు రిటైర్మెంట్ ఇచ్చారు. నష్టపరిహారంగా అందిన సొమ్ము కొన్నాళ్లకు ఖర్చయిపోయింది. దాంతో చాలా చోట్ల వాచ్‌మెన్‌గా పని చేశాను. ఒక చెయ్యి లేకపోవడం వల్ల తొందరగా పని దొరికేది కాదు. దొరికినా తక్కువ జీతం ఇచ్చేవారు. నాలుగేళ్ల క్రితం సరైన చికిత్స లేక నా భార్య అనారోగ్యంతో మరణించింది. నా వద్ద డబ్బు ఉంటే ఆమెను కాపాడుకునే వాణ్ణి. ఎలాగోలా పెద్దమ్మాయిని నీలిమను మాత్రం డిగ్రీ వరకు చదివించాను. గత ఏడాది ఆమెకు ఉద్యోగం రావడంతో మా జీవితం గాడిన పడింది. కానీ నీలిమ అందగత్తె కావడమే నాకు శాపమైంది. ఆమెను పెళ్లాడటానికి కుర్రాళ్లు ఎగబడ్డారు. ఆమె పెళ్లిచేసుకొని వెళ్లిపోతే ఇద్దరు పిల్లల చదువులు ఆగిపోతాయని నాకు భయమేసింది. అందుకే ఆమెకొచ్చే పెళ్లి సంబంధాలను ఏదో ఒక సాకుతో తిరస్కరించేవాణ్ణి. కానీ మా దూరపు బంధువుల అబ్బాయి మోహన్ సంబంధాన్ని తిరస్కరించలేకపోయాను. పైగా తన పెళ్లి కాగానే ఇద్దరు చెల్లెళ్లను చదువులు మాన్పించి ఓ బట్టల షాపులో పనికి పంపిస్తానని నీలిమ చెప్పడంతో నాకు పుండుమీద కారం చల్లినట్టు అయింది. మోహన్ని హత్య చేసైనా సరే, ఈ పెళ్లి జరక్కుండా ఆపాలనుకున్నాను. అందుకే గతంలో నేను పని చేసిన ఓ ల్యాబ్‌లో నుంచి రహస్యంగా పోటాషియం సైనైడ్ దొంగిలించి రాత్రి పూట మోహన్ గదికి వెళ్లాను. ముందుగా అతడికి నా పరిస్థితి వివరించి రెండు మూడేళ్లు పెళ్లి వాయిదా వేద్దామని కోరాను. దానికతను ఒప్పుకోలేదు. అయినా నేను కోప్పడలేదు. అవకాశం కోసం ఎదురు చూశాను. అంతలో అతడు బాత్రూంలోకి దూరాడు. నేను వెంటనే అతడి వాటర్ బాటిల్లోకి సైనేడ్ వేసిసి బయటికెళ్లిపోయాను. తర్వాత అంతా నేను ఊహించినట్టే జరిగింది. నాపైన ఎవరికీ అనుమానం రాకపోవడంతో నాకెంతో ధైర్యం వచ్చింది. అదే ధైర్యంతో మహేష్‌ని కూడా హతమార్చాను. మహేష్ నీలిమని తరచుగా బృందావన్ పార్కులో చీకటి పడ్డాక కల్సుకొనేవాడు. వాళ్లిద్దరు చాలసేపు కబుర్లు చెప్పుకొని ఒకరి తర్వాత ఒకరు ఇళ్లకు వెళ్లిపోయేవారు. ఓ రోజు నీలిమ వెళ్లిపోయే వరకు నేను చెట్టు చాటున ఉండి ఆనక మహేష్‌ను పలకరించాను. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అతడిని పార్కు చివర నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాను. అక్కడ నా శాలువలో దాచి తెచ్చుకున్న కత్తిని బయటికి తీసి హఠాత్తుగా అతడి గొంతు కోసేశాను. అతడి నోట్లోంచి ఆర్తనాదం కూడా బయటకి రాలేదు. అదృష్టవశాత్తు రెండో సారి కూడా నన్ను ఎవరూ చూడలేదు. రెండు సార్లు ఇలా జరగడంతో నీలిమ ఇక కొన్నాళ్లు పెళ్లి గురించి మర్చిపోతుందనుకున్నాను. కాని ఇంతలోనే ఆమె వినోద్ గురించి చెప్పగానే పెళ్లి కుదరక ముందే అతడిని కూడా చంపెయ్యాలనుకున్నాను. నీలిమ రోజూ రాత్రి పదిగంటలకు ఫోన్ స్విచాఫ్ చేస్తుంది. వారం క్రితం పార్కులో నాకొక పాత ఫోన్ దొరికింది. ఆ ఫోన్‌తో వినోద్‌కు మెసేజ్ పంపి నిర్జన ప్రదేశానికి రప్పించాను. అతడిని కూడా చంపేస్తే ఈ హత్యలన్నీ నీలిమను ప్రేమించిన ఎవరో అజ్ఞాత హంతకుడు చేస్తున్నాడని పోలీసులు నమ్ముతారనుకున్నాను. కాని వినోద్‌ను మీరే నియమించారని ఊహించలేకపోయాను. ఓ ఆడపిల్లల తండ్రిగా అభద్రతా భావానికి గురై నేనే హత్యలు చేశాను తప్ప నాకు ఎవరి మీద కక్ష లేదు’’ కుమిలిపోతూ అన్నాడు చలపతిరావు. ఇన్స్పెక్టర్ విజయ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘నిన్ను చూసి తిట్టుకోవాలో, జాలిపడాలో నాకు అర్థం కావడం లేదు. నీ కూతురికి ప్రేమగా నచ్చజెప్పి ఉంటే ఆమె నీ బాధను అర్థం చేసుకునేది. నీ పిల్లల భవిష్యత్తు కోసం తప్పుడు మార్గంలో వెళ్లి వారికి భవిష్యత్తే లేకుండా చేశావ్’’ కోపంగా అన్నాడు విజయ్. -మహబూబ్ బాషా -
మిత్రురాలి స్థానం
రేడియో కొన్న తర్వాత రాఘవరావుకూ రాజేశ్వరికీ వారి పిల్లలకూ దానితోడిదే లోకమైపోయింది. ఏ రోజుకారోజు నవనవమైన కార్యక్రమాలు వినడమూ వానిని గుఱించి మళ్లీ వాదించుకోడమూ. సాయంత్రం నాలుగు గంటలైంది. విజయవాడ రేడియో పేరంటం కార్యక్రమం వినడానికి త్వరత్వరగా కాఫీలు ఫలహారాలు ముగించుకొని వచ్చి కుర్చీలో కూర్చున్నది రాజేశ్వరి. ‘‘ఆహా! తయారైనావూ, మీ స్త్రీల కార్యక్రమం వినడమంటే నీకెంత సరదా. ఎంత పనైనా మానుకొని వస్తావు’’ అన్నాడు రాఘవరావు నవ్వుతూ. ‘‘రేడియో పెట్టండి. స్వతంత్ర భారతవర్షంలో స్త్రీల స్థానము గుఱించి ఒక విదుషీమణి ప్రసంగం ఉన్న’’దన్నది రాజేశ్వరి. ప్రారంభ గీతమైన తర్వాత ప్రసంగం ప్రారంభమైంది. సతీపతులిద్దరు శ్రద్ధగా విన్నారు– భారత రాజ్యాంగ చట్టంలో స్త్రీలకు పురుషులతో సమానంగా లభించిన హక్కులు బాధ్యతలు ఉపన్యాసకురాలు చక్కగా వివరించింది. ఆ యీ కాగితాలమీద వ్రాయబడిన హక్కులకేమిలే అన్నట్టు రాజేశ్వరి అసంతృప్తిగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. వెంటనే రాఘవరావు ఆమె వంక మందహాసంతో చూస్తూ ‘‘ఇకనేమీ మీ రొట్టె నేతిలో పడ్డదన్నమాటే. మీరు పురుషులతో బాటు సమానమగు ఏ హక్కులు కావలెనని పదింపదిగా తీర్మానిస్తున్నారో అవన్నీ వచ్చేసినాయి’’ అన్నాడు. ‘‘రొట్టె నేతిలో పడంగానే ఏం సంబరము, చేతిలో పడొద్దూ?’’ అన్నది రాజేశ్వరి. ‘‘నేతిలో పడ్డది చేతిలోకి రాకేం చేస్తుంది. స్త్రీ అన్న కారణంగా ఎందునూ నిషేధించరాదు– చదువులు, ఉద్యోగాలు, ఆస్తి హక్కులు, వోటు హక్కులు, ప్రాతినిధ్యపు హక్కులు ఒకటేమిటి అన్నీ వచ్చాయిగా?’’ ‘‘ఈ రావడాని కేమిలెండి?’’ ‘‘రాబట్టే గవర్నరులు, రాయబారిణులు, శాసనసభల్లో సభ్యతలు, స్పీకర్లు చేస్తున్నారు.’’ ‘‘పదహారు కోట్ల నలభై లక్షల స్త్రీలల్లోను వీరెన్ని వేలవంతూ?’’ ‘‘మగవాళ్లు మాత్రం అందరూ మహోన్నత పదవుల్లోనే ఉన్నారూ.’’ ‘‘అదే నేను చెప్పేదీని. స్త్రీలైనా పురుషులైనా ఏ పదిమందో గొప్ప ఉద్యోగాలు చేస్తే ఏమి జరిగింది. అయినా మీ మగవారితో మాకు సాటేమిటండీ. మావన్నీ కాగితాల మీది హక్కులు.’’ ‘‘ఎవరికైనా కాగితముల మీద వ్రాసిన తర్వాతనేగా అమలులోకి వచ్చేది? ఇప్పుడు ఏ స్త్రీౖయెనా ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే స్త్రీలకు యివ్వబడదని త్రోసివేయడానికి వీలవుతుందా?’’ ‘‘చూడండీ. లంచాలు పుచ్చుకొనే ఉద్యోగస్థులను, బ్లాకుమార్కెట్టు సాగించే వ్యాపారస్థులను శిక్షించడానికీ ఎన్నో చట్టాలున్నాయి శిక్షాస్మృతిలో. అయితేనేమీ చట్టానికి కానరాని వెలుతులేవో వారి ఆశలను పూరిస్తూనే ఉన్నాయి. దొంగకు తోడుపొయ్యే పిచ్చిదేశం మనది.’’ ‘‘అయితే ఏమంటావు?’’ ‘‘చట్టాలు ప్యాసైతే చాలందటాను.’’ ‘‘ముందు శాసనాలైతే గాదూ తర్వాత ఉద్యోగాలు వచ్చేది?’’ ‘‘ఉద్యోగా లెవరికి కావాలండీ?’’ ‘‘అయితే ఏమి కావాలె?’’ ‘‘గౌరవ స్థానం.’’ ‘‘పదవితో బాటు అదీ వస్తుంది.’’ ‘‘పదవిలో ఉన్న ఏ పదిమందో ఆ పదవి ఉన్న నాల్గు రోజులు గౌరవింపబడితే స్త్రీ సంఘమంతా గౌరవింపబడినట్లేనా? స్త్రీకే గౌరవం రావాలె.’’ ‘‘ఎప్పటికీ తరుగూ ఒరుగూ లేని శాశ్వతమైన గౌరవస్థానం రావలెనంటావు. ఆడపిల్ల అనేది మాతృగర్భంలోంచి బయటికి వచ్చి కాలగర్భంలో కలిసి పోయేవరకూ ఒక్క విధమైన గౌరవం రావాలెనంటావు. భేష్–’’ ‘‘మీ రిట్లా ఆక్షేపిస్తే చెప్పలేను.’’ ‘‘ఇదే నీతో వచ్చిన చిక్కు. మీరు ఎన్నాళ్ల నుంచో సమాన హక్కులు కావాలెనంటున్నారు గనుక అవి వచ్చేశాయన్నాను.’’ ‘‘ఏమి వచ్చాయి? మన దేశంలో స్త్రీల కష్టాలు లాకు బద్ధం కానివీ, శాసనాలకు లొంగనివీని. వానిని రాజశాసనాలు పరిష్కారం చెయ్యలేవు. నిజం చెప్పవలసివస్తే మన దేశంలో పురుషులకు స్త్రీలను గౌరవంగా చూడటము తెలియదు. స్త్రీని మన్నించడం న్యూనతగా గూడా భావిస్తారు.’’ ‘‘మన పురాణాల్లో త్రిమూర్తుల భార్యలకున్న గౌరవం ఎవరికున్నది? మనదేశంలో మాతృస్థానంలో స్త్రీకివున్న పూజ్యత ఎక్కడున్నది?’’ ‘‘త్రిమూర్తుల భార్యల కథలు ధర్మశాస్త్రాల్లోని శ్లోకాలు బాగానే ఉండవచ్చును కాని ప్రస్తుతం ఆచరణలో ఉన్న విషయం చూడండి.’’ ‘‘ఆచరణలో మాత్రం?’’ ‘‘మీకేమి తెలుస్తుంది, మీరు అపోజిషన్ పార్టీవారు. చట్టాల ఆడంబరం చూచి మీరట్లా అభిప్రాయపడుతున్నారు.’’ ‘‘తార్కాణం?’’ ‘‘వేలు లక్షలు.’’ ‘‘ఉదాహరణకొక్కటి.’’ ‘‘ఆధునికులు వ్రాసే కథలు చదవండి, పత్రికలు చదవండి, సినిమాలు చూడండి, నాటకాలు చూడండి, హరికథలు వినండి. స్త్రీ యెంత చులకనగా చూడబడుతున్నదో తెలుస్తుంది. ప్రతిక్రియా విరహితమైన స్త్రీలంటే మగవారికెంత తేలిక. ఇంట్లోనైనా భార్యను మన్ననగా చూచే భర్త ఒక్కడైనా మచ్చునకైనా కనిపిస్తాడేమో.’’ ‘‘నే నుండగానే ఎంత అన్యాయానికి ఒడి గట్టావు!’’ ‘‘(నవ్వుతూ) మీరు మహా మన్నిస్తున్నారు.’’ ‘‘మన్నింపక చేసేదేమున్నది? పడతుకల యొద్ద మగవారు బానిసీలు.’’ ‘‘ఆ యీ వ్రాతలకేమి, మీవంటి భావకవులుంటే యిట్లాంటి వెన్నైనా వ్రాస్తారు.’’ ‘‘ఇది నేను వ్రాసింది కాదు.’’ ‘‘మీవంటివారు వేరొకరు. నూతన రాజ్యాంగ చట్టం ప్రకారం స్త్రీకి చదువుకోవడానికీ, ఉద్యోగాలు చేయడానికీ ఆస్తిపాస్తులు అనుభవించడానికీ, శాసనసభల్లో ప్రవేశించడానికీ అధికారాలు వచ్చాయి యిక మీకేమి తక్కువని మీరంటున్నారు– కాని స్త్రీ పురుషుల మధ్యనున్న యజమాని బానిస భావం అట్లాగే వున్నది. అతని నిరంకుశత్వం ఆమెపై బహుముఖాలుగా చెలాయింపబడుతూనే వున్నది. ఆమెను జోగిని చేయతలుచుకుంటే జోగినీ, భోగిని చేయతలుచుకుంటే భోగినీ చేయడం యింకా అతని చేతులలోనే ఉన్నది. స్త్రీగూడా మనిషేననీ, ఆమెకు యుక్తాయుక్త పరిజ్ఞాన మున్నదనీ, ఆమెను తనతో సమానంగా చూడటం తన ధర్మమనీ పురుషునకు తోచడమే లేదు. ఈ తలంపు పురుషుని హృదయంలో కలగనప్పుడు స్త్రీకి గౌరవమెట్లా వస్తుంది? ఏ చట్టాలు వీరిని రక్షిస్తాయి. అందువల్లనే మహాత్ముడు ప్రతి సంస్కరణకూ మనఃపరివర్తన ముఖ్యమంటూ ఉండేవాడు. దీనికీ అంతే.’’ ‘‘ఆహాహా! ఏమి మహోపన్యాసము. నీ ప్రసంగం గూడా రేడియోకెక్కిస్తే బాగా ఉండును. మీ స్త్రీలంతా విని ఆనందిస్తారు.’’ ‘‘మీరు మాత్రం సంతోషించరన్నమాట.’’ ‘‘నేను అపోజిషను పార్టి వాడవని అన్నావుగా. నేను సంతోషిస్తానంటే నమ్ముతావూ.’’ ‘‘ఇంతకూ ఈ స్త్రీ హైన్యతకంతకూ కీలకం ఒకటే ఉన్నది.’’ ‘‘ఏమిటో అదిగూడ వినిపిస్తే.’’ ‘‘స్త్రీకి ఆర్థికోపపత్తి లేదు. అందువల్లనే స్వయం వ్యక్తిత్వం గూడా లేదు– ఎప్పుడైతే స్త్రీ ఒకరి పెట్టు పోతలు మీద ఆధారపడి ఉన్నదో అప్పుడే ఆమె బ్రతుకు తేలికైపోయింది–’’ ‘‘బరువెక్కడానికి నీవే ఏదో ఉపాయం సూచించూ.’’ ‘‘తన్ను దాను పోషించుకోడం నేర్చుకోవాలె.’’ ‘‘సరిసరి యిదా నీ సూచన. పాటకపు స్త్రీ లందరూ తమ్ము దాము పోషించుకొనేవాళ్లే– వాళ్లేం సుఖంగా ఉంటున్నారు?’’ ‘‘వాళ్లే నయం. సంపన్న కుటుంబినులు, మధ్య కుటుంబినులు– పురుషుల పోషణ తప్పితే అధోగతిపాలై పోతున్నారు. వాళ్లకు స్వయం పోషణశక్తి ఉండాలి. ఇంతకూ స్త్రీని మిత్రురాలి వలె పురుషుడు చూడాలె. కుటుంబాల్లో శాంతి భద్రతలు చేకూరితే దేశానికి శాంతి భద్రతలు చేకూరినట్లే.’’ ‘‘అయితే యీ క్లిష్ట సమస్య భద్రతా సంఘానికి నివేదించవలసిందే.’’ ‘‘ఎందుకూ? కాశ్మీర సమస్యకు తోడుగా ఉంటుందనా?’’ ‘‘కాదుకాదు వాళ్లు బాగా చర్చించి యీ విధంగా మెలగండని మా పురుషులకు సూచిస్తే ఆ విధంగా మెలగుదామని.’’ ‘‘అదికాదులెండి. అక్కడా మనవాళ్లేనని మీ యెత్తు.’’ రాఘవరావు పకాలున నవ్వాడు. కనుపర్తి వరలక్ష్మమ్మ కథ ‘గౌరవ స్థానం’కు సంక్షిప్త రూపం ఇది. ‘నా జీవము ధర్మము, నా మతము నీతి, నా లక్ష్యము సతీ శ్రేయము. ఈ మూడింటిని సమర్థించుటకే నేను కలము బూనితిని’ అని చెప్పుకున్న రచయిత్రి వరలక్ష్మమ్మ (6 అక్టోబర్ 1896– 13 ఆగస్ట్ 1978). ఆమె తొలి రచన 1919లో అచ్చయింది. తర్వాత ఆరేళ్లపాటు లీలావతి కలంపేరుతో ‘మా చెట్టు నీడ ముచ్చట్లు’ కాలమ్ ఆంధ్రపత్రికలో రాశారు. అనంతరం ‘శారద లేఖలు’ 1929 నుండి 1934 వరకు గృహలక్ష్మి మాసపత్రికలో రాశారు. కల్పలత అనే స్నేహితురాలికి శారద రాసినట్టుగా ఉండే ఈ లేఖలు అనేక స్త్రీల సమస్యలను చర్చిస్తాయి. ఎన్నో కథలతోపాటు, లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా నవోదయం, పునఃప్రతిష్ట వంటి నాటికలు; వసుమతి, విశ్వామిత్ర మహర్షి నవలలు; ద్రౌపది వస్త్ర సంరక్షణ, సత్యా ద్రౌపది సంవాదం వంటి పద్య రచనలు చేశారు. ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాల్లో ప్రసంగించేవారు. గృహలక్ష్మి స్వర్ణకంకణం పొందిన తొలి మహిళ (1934). గాంధీజీ అంటే అభిమానం. జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆమె జన్మించిన బాపట్లలో స్త్రీహితైషిణి మండలిని స్థాపించారు. ఆమె చాలా కథల్లో రాజేశ్వరీ, రాఘవరావు దంపతులు పునరావృతం అవుతారు. మంచి కథ లక్షణాలను చర్చిస్తూ ఆమె రాసిన ‘కథ ఎట్లా ఉండాలె’ మరో చదవాల్సిన కథ. - కనుపర్తి వరలక్ష్మమ్మ -
ఎవరైనా నన్ను మోసం చేస్తారేమో?
మా ఇంట్లో జరిగిన ఆ సంఘటన అంత ప్రత్యేకమైనది కాదు. బెంగళూరులో అనేక సంవత్సరాలుగా నివాసమున్న అందరికీ ఇలాంటి అనుభవం వేరువేరు రూపంలో కలిగివుంటుంది. అయితే ఆ సంఘటన నా మీద ప్రత్యేక ప్రభావం కలిగించటమే కాకుండా దాన్ని గురించి ఆలోచించేలా చేసింది. వేరు వేరు సందర్భాలలో, కాలాలలో అది విభిన్నమైన సత్యాన్ని నా ముందు తెరిచిపెట్టింది. నన్ను అర్థం చేసుకోవడానికి, ఇతరుల గురించి విభిన్నంగా ఆలోచించడానికి ప్రేరణ ఇచ్చింది. అందువల్ల దాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతాను. అది తొంబైయవ దశకంలోని ద్వితీయార్ధం. నా తల్లితండ్రులిద్దరూ పల్లెలోని ఇంటిని వదిలి నాతోపాటు బెంగళూరులో నివాసముంటున్నారు. బీటియం కాలనీలో అద్దె ఇంట్లో ఉన్నాం. అప్పుడే నేను సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి మూడునాలుగు సంవత్సరాలు గడిచాయి. నెమ్మదిగా జీతమూ పెరుగుతున్నప్పటికీ, అంత పెద్ద మొత్తమేమీ వస్తుండలేదు. ఇలాంటి సమయంలో ఇల్లు కట్టుకోవటానికి ఒక స్థలం తీసుకోవాలనే నాకు కోరిక కలిగింది. అయితే అమ్మకు అది అంతగా నచ్చలేదు. ‘‘ఊళ్ళో దెయ్యంలాంటి ఇల్లుంది. ఇక్కడ మరో ఇల్లు కట్టుకుని ఏం చేస్తావు? చివరికీ నువ్వు మన ఊరికి తిరిగొచ్చి సెటిల్ అయ్యేవాడివి. ఈ ఊరు మనదికాదు’’ అని అమ్మ బళ్ళారి జిల్లాలోని మా ఇంటిని తలుచుకుని చెప్పేది. ‘‘అక్కడున్నది మన ఇల్లు. ఇక్కడ ఉండటం ఊరికే’’ అని ఆమె బలమైన నమ్మకం. అయితే అలాంటి అమ్మకు పక్కింటామె ‘సైట్’ పైత్యాన్ని నెత్తికెక్కించి పంపించింది. ‘‘కొడుకును ఒక సైట్ తీసుకోమని చెప్పండి. ఇల్లు కట్టాలనే లేదు. ఓ అయిదేళ్ళు వదిలేస్తే పదిరేట్లు డబ్బు వస్తాయి. బ్యాంక్‌లో ఫిక్సెడ్ పెట్టడం కన్నా ఇదే ఉత్తమం’’ అని బుద్ధిమాటలు చెప్పి పంపింది. లాభం అనే మాట మనస్సును తాకిన తరువాత అమ్మ కాస్త మెత్తబడింది. ‘‘ఆలోచించి చూడు’’ అని నాకు అనుమతి ఇచ్చింది. నాన్న మాత్రం ఇలాంటి వ్యవహారంలో ఎక్కువ తలదూర్చేవాడు కాదు. మౌనంగా నా నిర్ణయాలన్నీ అంగీకరించేవాడు. తనకన్నా ఎక్కువగా చదువుకున్న, ఎక్కువ జీతాన్ని సంపాదిస్తు్తన్న కొడుకు అభిప్రాయానికి వ్యతిరేకంగా చెప్పే ధైర్యాన్ని అతను పోగొట్టుకున్నాడు. గతంలో కొన్న పదార్థాన్ని మరొకసారి కొనే క్రియ అంత ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగించదు. అయితే అది పెద్ద మొత్తపు విషయమైనపుడు విచిత్రమైన భయం కలుగుతుంది. దాని సరైన వెల ఏమిటి? ఎవరైనా నన్ను మోసం చేస్తారేమో? ఇంత పెద్దమొత్తంతో ఖరీదు చేసే ఈ వస్తువు నిజంగా నాకు అవసరమైనదా? తీసుకుంటున్న స్థలానికి ఏవైనా అడ్డంకులు ఉంటే నా గతి ఏమిటి? ఇలాంటి అనేక లేనిపోని ఆలోచనలు మనస్సును కమ్ముకుంటాయి. ఒంట్లో చీమను వదిలినట్లు గిలగిలా తన్నుకుంటాను. నేను ప్రస్తుతం ఉన్న కాలనీ మా కళ్ళకు నివసించడానికి యోగ్యమైన స్థలంగా అనిపించడం మొదలౌతుంది. పరిచితమైన ప్రపంచాన్ని వదిలి కొత్త లోకానికి తెరుచుకోవటానికి వెనుకాడే మనిషి స్వభావానికి ఇది చక్కటి ఉదాహరణ. నా ఆలోచనలు మరోలా ఉండటానికి ఎలా సాధ్యం? అదే బీటిఎం. కాలనీలో సైట్ వెతకటం మొదలుపెట్టాను. అప్పట్లో బీటిఎం కాలనీ అనాథలా ఉండేది. రాత్రి ఎనిమిది గంటకంతా రోడ్లు బిక్కుబిక్కుమంటుంటే, అలాంటి సమయంలో బయటికి వెళ్ళడానికి భయం వేసేది. ‘‘ఎవరైనా తల పగులగొడితే, ఉదయం వరకు శవం ఎవరి కంటా పడదు’’ అని మా అమ్మ తన అచ్చమైన బళ్లారి భాషలో వివరించేది. బెంగళూరులోనే పుట్టిపెరిగిన నా స్నేహితులెందరో జయనగర, మల్లేశ్వరం, బసవనగుడి...మొదలైన ఊరి మధ్యని స్థలాల్లో నివసిస్తున్నారు. ‘‘బీటిఎం అంటే చాలా దూరం...ఇక్కడే ఎక్కడైనా సైట్ తీసుకుంటే మంచిది’’ అని బుద్ధిమాటలు చెప్పేవారు. అయితే అక్కడ ఖాళీ సైట్లు దొరికేవికావు. పైగా ఒకటి రెండు సైట్లు విపరీతమైన దుబారాగా ఉండేవి. ఒక్కొక్కసారి స్థలహక్కుల వివాదాల వల్ల కటకటాల్లో నిలబడాల్సి వచ్చేది. నేను చాలామంది మధ్యవర్తులను సంప్రదించాను. ‘‘వాస్తు చూస్తారా సార్?’’ అని వాళ్ళు మొదటి ప్రశ్న వేశారు. నాకు దాని గురించి ఏమీ తెలియదు. మా ఊరిలో ఈ విషయంగా ఎవరూ మాట్లాడినట్టు గుర్తుకు రాలేదు. నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను. అమ్మకు వాస్తు విషయం వినికిడిగా తెలుసు. ‘‘మనం బళ్ళారిలోని సందుగొందుల్లో ఇల్లు కట్టుకుని బతికిన వాళ్ళం. పెద్దల నుంచి భాగంగా వచ్చిన ముక్క స్థలంలో, రైల్వేబోగిలాంటి ఇల్లు కట్టుకుని జీవితం గడిపినవాళ్ళం. మా ఇళ్ళకి సరిగ్గా గాలి, వెలుతురు కూడా ఉండేది కాదు. అయినా సంతోషంగానే జీవించాం. మాకంతా ఈ వాస్తు–గీస్తూ ఏమీ లేదు. అదంతా ఏమన్నా శ్రీమంతుల సోకు’’ అని పుల్ల విరిచినట్టు చెప్పి పంపేసింది. నేను ఉద్యోగంలో చేరి సంపాదిస్తున్నప్పటికీ అమ్మానాన్నలు తమను తాము పేదవాళ్ళగానే భావించుకునేవాళ్ళు. మధ్యవర్తిని కలిసి మాకు వాస్తు ముఖ్యంకాదని చెప్పేశాను. సంతోషంతో అతడి ముఖం వికసించింది. ‘‘వంద సైట్లు చూపిస్తాను రండి’’ అని ఉత్సాహం చూపారు. ప్రతిరోజు సాయంత్రం, వారాంతంలోనూ అనేక ఖాళీ సైట్లను చూపించేవారు. ‘‘ఎలా ఉంది సార్?’’ అని అడిగేవారు. నాకు ఎలా స్పందించాలో అర్థమయ్యేదికాదు. సైట్ బాగుండాంటే ఏమేమి కొలమానాలు ఉండాలో ఇంకా తెలియదు. మొత్తానికి చివరికి ఒక మూలస్థలం నాకు నచ్చింది. రోడ్డు రద్దీ, కోలాహం లేనటువంటి, సుమారు అరవై, నలభై అడుగుల పొడవు వెడల్పుగల సమతలమైన స్థలమది. దాని యజమాని దగ్గరికి పిల్చుకునిపోయి వ్యవహారాన్ని కుదిర్చాడు. అతడికి డబ్బు అవసరం ఉంది. ఎనిమిది లక్షలకు వ్యాపారం కుదిరింది. అమ్మా, నాన్నలను పిల్చుకునిపోయి చూపించాను. వారికి నచ్చింది. అందువల్ల్ల బయానా సోమ్మును యజమానికి ఇచ్చి స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నాను. అయితే నాకు మాత్రమే తెలిసిన ఒక విషయముంది. నా దగ్గర అప్పుడు నాలుగు లక్షలకు మించి సేవింగ్స్ లేదు. నా జీతం అంత ఎక్కువ కాదు. అయితే మిగిలిన డబ్బుకు ఒక బ్యాంక్ లోన్ ఇస్తుందని ఒక మిత్రుడు చెప్పాడు. అప్పట్లో చాలావరకూ అన్నీ బ్యాంకులవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అప్పు ఇచ్చేవాళ్ళు. సైట్ కొనడానికి ఇచ్చేవికావు. ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించినపుడు, నా నెలసరి జీతం చూసి, కచ్చితంగా ఇస్తామని మాట ఇచ్చారు. అన్ని విధాలుగా స్థలం కొనటానికి నేను సిద్ధం చేసుకున్నాను. అయితే లోన్ తీసుకునే విషయం ఇంట్లో చెప్పలేదు. ఇక ఒక వారంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక రోజు మధ్యాహ్నం భోజనానికి కూర్చున్న సమయంలో నేను బ్యాంక్ నుంచి అప్పు తీసుకునే విషయాన్ని సహజంగానే చెప్పాను. ఆ మాటను వినగానే అమ్మ కలవరపడింది. ‘‘అప్పు చేస్తావా?’’ అని నమ్మలేనిదానిలా అడిగింది. నేను అవునన్నట్టు తలూపాను. భోజనానికి కూర్చున్న కంచం ముందే కన్నీరు పెడుతూ, ‘‘నా కొడుకు అప్పులపాలు కావటం నేను బతికి వున్నంత వరకూ వదలను’’ అని ఆవేశంతో చెప్పేసింది. నేను ఏమేమో వివరించటానికి పోయినా ఆమె దాన్ని స్వీకరించే స్థితిలో ఉండలేదు. నాన్నకు ఈ విషయంలో ఏమీ తెలియకపోవటం వల్ల అతడికి ఎవరి పరంగా వహించాలో తెలియలేదు. ప్రస్తుత పరిస్థితిని అదుపులో తీసుకుంటే, ముందరి రోజుల్లో ఆమెకు అర్థమయ్యేలా చెప్పవచ్చనుకున్నాను. అయితే ఏ మాత్రం మారలేదు. మగవాడు అప్పులపాలు కావటం ఆమెకు ఊహించడానికి సాధ్యం కాలేదు. అమ్మది మొదటి నుంచీ మొండిస్వభావం. అన్నం, నీళ్ళు మాని తనకు సరి అనిపించింది సాధించే వ్యక్తి. అందువల్ల ఆమె మనస్సును మార్చాలనే నిర్ణయాన్ని నేను వదిలేశాను. ఇప్పటికే కొంత బయానా సోమ్ము ఇచ్చి ఉండటంవల్ల దాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినా అది అంతగా బాధించలేదు. అయితే ఆ యజమాని సూటిగా ‘‘తీసుకునే శక్తి లేకపోతే ఊరకే ఎందుకు ముందుకుసాగారు?’’ అని వ్యంగ్యంగా అన్నప్పుడు చాలా బాధ కలిగింది. తమకు రావలసిన కమిషన్ ఆగిపోవటం వల్ల మధ్యవర్తులకు చాలా కోపం వచ్చింది. ‘‘పాతకాలం పల్లెటూరి జనం మాటలు వింటూ ఈ పెద్ద ఊళ్ళో ఎలా నిభాయిస్తారు సార్?’’ అని తిట్టిపోయారు. నేను మౌనం వహించాను. పూర్తిగా ఎనిమిది లక్షల రూపాయలను నేను సేవింగ్ చేసేటంత వరకు సైట్ కొనకూడని నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఏ మధ్యవర్తిని కలిసే పొరబాటు చేయలేదు. నేను ఎనిమిది లక్షలు సేవ్ చేసేటంతలో బీటిఎం కాలనీలోని సైటులు పద్దెనిమిది లక్షలకు దాటాయి. అమ్మ తెలివితక్కువతనం, నా మూర్ఖత్వమూ రెండూ నాకు ఇప్పుడు అవగాహనకు వచ్చాయి. లోలోప కోపం గూడుకట్టుకోంటోంది. ఆమె మీద ఎన్నడు లేనట్టు ఎగిరేవాడిని. ఆమె ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో తలదూర్చుతుంటే ‘‘నువ్వుఊరుకో’’ అని మొరటుగా చెప్పేవాడిని. ఆకస్మాత్తుగా మేము కొనలేకపోయిన ఆ సైటు ముందు ముగ్గురమూ వెళ్ళవసిన సందర్భం వస్తే, అక్కడ ఇప్పటికే కట్టివున్న పెద్ద బంగ్లాను చూపించి, ‘‘చూడు, ఆ ఇల్లు ఈ రోజు మనదై ఉండేది. నువ్వు అడ్డొచ్చావు’’ అని వ్యంగ్యంగా అనేవాడిని. ఆమె భరించేంత వరకు నా వ్యంగ్యాన్ని భరించి, ఒక రోజు ‘‘తప్పయింది మహానుభావా... నాకు ఆ రోజు అర్థంకాలేదు’’ అని రెండు చేతులెత్తి నమస్కరించింది. అప్పుడు నా దుష్టతనపు తీవ్రత అర్థమై, మళ్ళీ ఎన్నడూ ఆ విషయాన్ని ఆమె ముందు ఎత్తలేదు. వాళ్లు బతికి ఉన్నంతవరకు ఎందుకో సైట్ తీసుకోవడానికి అవకాశమే నాకు దొరకలేదు. అమ్మా, నాన్నలిద్దరూ ఒకే సంవత్సరం అంతరంలో చనిపోయారు. తరువాత నేను ఇంకేదో అపార్ట్మెంట్లో ఒక ఇల్లు కొనుక్కుని, అక్కడ నివాసం ఉండసాగాను. ఇప్పుడైతే ఈ నేల, భూమి, ఇల్లు–డబ్బు సంపాదించే భౌతిక విషయాల పట్ల నాకు ఆసక్తి లేదు. సైటు ముందు అప్పుడప్పుడు తిరిగేటప్పుడు అనేక జ్ఞాపకాలు తోసుకుంటూ వస్తాయే తప్ప, ఎలాంటి దుఃఖం లేదా బాధ భావన కలగదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు, ఈ సంఘటన అనేక ఆలోచనలను నాలో ఏర్పరిచింది. అమ్మ గురించి అప్పుడు అనవసరంగా కోప్పడేవాణ్ణికదా అని దుఃఖం కలుగుతుంది. ఆమె తనదే అయిన అనుభవంతో వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంది. ‘‘అప్పు తీసుకోవటం అవమానకరం’’ అని ఆమె జీవితంలో నేర్చుకున్నది. అందువల్ల తన కొడుకు అప్పుచేయడం ఆమెకు తప్పుగా కనిపించి వ్యతిరేకించింది. దాన్ని అర్థం చేసుకునే శక్తి నాకు అప్పుడు లేదు. అప్పు తీసుకోకుండా అభివృద్ధి కావటం అసాధ్యమనే కాలంలో జీవిస్తున్న నాకు ఆమె అర్థం కావటం కష్టమైంది. బాల్యంలోని ఒక సంఘటన నాకు గుర్తుకొస్తోంది. అమ్మకు ఒక్కడే తమ్ముడు. అతడు మంచి స్థితిలో ఉండేవాడు. అప్పుడప్పుడు అతడి దగ్గర చేబదులుగా తీసుకుని తరువాత తిరిగివ్వడం అమ్మానాన్నకు అలవాటైంది. అతడికి అమ్మ మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది. మా ఇంటికి ఎంతో సహాయం చేసేవాడు. అయితే ఒక సమయంలో అతన్ని శని పీడించసాగాడు. డబ్బు అవసరం తీవ్రమై మా నాన్నను కాస్త అప్పు ఇవ్వమని అడిగాడు. వీళ్ళ దగ్గర డబ్బు ఉంటేకదా? నెల చివరి వారంలో రెండు పూటలు భోజనం సమకూర్చటమే పెద్ద సాహసంగా ఉండేది. అయితే మా కుటుంబానికి ఎంతో సహాయం చేసిన మేనమామకు ఇప్పుడు లేదని చెప్పే దిట్టతనం ఇద్దరికీ ఉండలేదు. చివరికొక ఉపాయం చేశారు. అమ్మ తన ఒంటి మీదున్న కాస్త బంగారాన్ని బ్యాంకులో పెట్టి అతనికి డబ్బు పంపమని చెప్పింది. ‘‘అయినంత తొందరగా డబ్బును వెనుతిరిగివ్వాలి’’ అని చిన్న ఉత్తరాన్నీ రాశారు. అతడు ధన్యవాదాలు అర్పించాడు. ఆ బంగారం ఇంటికి తిరిగొచ్చే వరకు అమ్మానాన్నలు నరకాన్ని అనుభవించారు. వడ్డి సొమ్ము ప్రతినెలా ఎనభై రూపాయలు బ్యాంక్‌కు కట్టాల్సి వచ్చేది. అమ్మానాన్నలకు ఇది పెద్ద భారమైంది. అందువల్ల నెలచివరి రోజులు ఇబ్బందికరంగా మారాయి. ఉగాది పండుగ వచ్చినా మాకు బట్టలు ఇప్పించలేదు. ఇంట్లో ఆ రోజుల్లో తీపి పదార్థాలను చేయలేదు. దేవుడి దీపం దినమంతా వెలుగుతుండలేదు. రాత్రి పూట నిద్రలేకుండా దొర్లుతుండేవారు. ఇప్పుడు దీన్ని గుర్తు చేసుకుంటే నాకు ఆశ్చర్యంగానూ, తమాషాగానూ కనిపిస్తుంది. అయితే ఆనాటి వారి అవస్థ మాత్రం పిల్లలమైన మా కళ్ళల్లోనూ విచారాన్ని కలిగించింది. ఆ రోజుల్లో రాజ్‌కుమార్ సినిమా ఊరికి వచ్చినా, డబ్బు ఇవ్వమని పిల్లలమైన మేము పీడించలేదు. ఆశను కోరికను దిగమింగుకోవటం మాకు మేమే నేర్చుకున్నాం. పెద్దపదవిలో ఉన్న మేనమామ ఈ డబ్బును తిరిగివ్వడానికి ఎక్కువ రోజులు తీసుకోలేదు. మూడు నెలల్లో సంపూర్ణంగా పంపించేశాడు. అదే రోజు నాన్న బ్యాంకుకు వెళ్ళి ఆ చిన్నాచితకా బంగారాన్ని విడిపించుకుని వచ్చాడు. దాన్ని అమ్మకు చూపించేటప్పుడు ఇద్దరూ ఏడ్చారు. దగ్గర్లోనే ఉన్న మేము పిల్లలమూ కంటతడి పెట్టాం. ఆ బంగారాన్ని దేవుడి ముందు పెట్టి, నేతి దీపం వెలిగించి, మేమంతా భగవంతునికి నమస్కరించాం. నాన్న తన చేతులారా అమ్మకు ఆ గాజులు తొడగించి, గొలుసును వేశాడు. అటు తరువాత మరెన్నడూ వాళ్ళు జీవితంలో అప్పు చేయలేదు. ఇలాంటి నేపథ్యం కలిగిన అమ్మ ఇంకే విధంగా ప్రవర్తించడం సాధ్యం? నేను సైటును తీసుకోవటం తప్పించటం ఆమెకు నా మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమవల్లనే తప్ప నాకు నష్టం కావాలని కాదుకదా? ఈ సూక్ష్మమైన విషయం అర్థమయ్యే అవగాహన కూడా అప్పుడు నాకుండలేదు. సానుభూతి అనే సుగుణమూ ఆరోగ్యం చిమ్మే యవ్వనంలో దక్కదు. అప్పు వద్దు అని చెప్పిన అమ్మ, వాస్తు విషయంలో ఎంత తెలివిగా ప్రవర్తించింది కదా అని ఒక్కొక్కసారి ఆశ్చర్యమేస్తుంది. స్పష్టంగా వాస్తుశాస్త్రం ‘శ్రీమంతుల షోకు’ అనే మాటలు చెప్పడానికి ధైర్యం కావాలికదా? ఎలాంటిదో చెడ్డ వాస్తువల్ల కొడుకుకు ఏదో చెడు జరగవచ్చనే మూర్ఖత్వమే ఉండలేదు. అమ్మ సైట్ తీసుకోవటానికి అడ్డమొచ్చిందనే ఆలోచన నన్ను గెలికి కష్టపెట్టినంతగా ఆమెకు వాస్తు పిచ్చి ఉండలేదన్నది గర్వపడే విషయమనిపించి రొమ్ము విరుచుకోలేదెందుకు? ‘జీవితపు మౌల్యాలు’ అనే బరువైన మాటను అప్పుడప్పుడు మనం వింటుంటాం. చప్పున ఎవరైనా ‘అలా అంటే ఏమిటి?’ అని అడిగితే జవాబు చెప్పడానికి నివ్వెరపోతాం. నేను అప్పుడప్పుడు నా జీవితపు ఈ సంఘటనను జీవితపు మౌల్యాల వ్యాఖ్యానానికి వాడుకుంటుంటాను. తన అవివేకం వల్ల అమ్మ నాకు నష్టం కలిగించిందన్నది ఒక మౌల్యం. నా మీది ప్రేమ వల్ల అప్పు చేయడం తప్పించిందని భావించటం ఇంకొక మౌల్యం. నా నుదుట స్థలం యజమాని కావటం రాసివుండలేదను సంతృప్తి చెందటం మరొక మౌల్యం. మనం ఏ నిర్ణయానికి వస్తామన్నది మన మన వ్యక్తిత్వానికి చెందింది. అయితే ఒకటి మాత్రం నిజం. జరిగిన సంఘటనలో ప్రేమ అంశాన్ని చూడక శుష్క తర్కానికి పూనుకుంటే మన మౌల్యాలు కచ్చితంగా కుప్పకూలుతాయి. మన అందరి ఆలోచనల్లోనూ సానుభూతి యొక్క అవసరం ఉంది. సానుభూతి అంటే మరొకరి పరిస్థితిని అర్థం చేసుకుని, వారిలాగే ఆలోచించే క్రమం. అది సులభసాధ్యం కాదు. కష్టపడి సాధించుకోవాలి. సానుభూతి గుణం దక్కిన తరువాత మనం మరొకరి సుఖదుఃఖాలు, నిర్ణయాలు, కారణాలను చక్కగా అర్థం చేసుకోగం. మరొకరి సుఖదుఃఖాలను కళ్ళలోనే అర్థం చేసుకున్న మనిషి ఎన్నడూ క్రౌర్యానికి దిగడు. హత్యగావింపబడుతున్న, అత్యాచారానికి గురవుతున్న వ్యక్తి బాధను మనమే అనుభవించే శక్తి పొందితే క్రౌర్యానికి ఎవరూ చేయివేయలేరు. మొత్తం ప్రపంచ శాంతికి కావలసింది మరేమీ కాదు. సానుభూతి. అయితే సానుభూతిని మరొకరు నేర్పించడం కష్టం. దాన్ని స్వయంగా నేర్చుకోవలసిందే. ఒక్కసారి మీ స్వభావంలో సానుభూతి కలిసిపోతే, మొత్తం జగత్తు సుందరంగా కనిపించటం మొదలవుతుంది. ఈ మధ్యన కీర్తిశేషులు త.రా.సు గారి సుప్రసిద్ద నవల ‘హంసగీతె’ను మరొకసారి చదివాను. ఆయన సానుభూతి అంటే ఏమిటన్నదానికి ఇచ్చిన ఉదాహరణ నాకు చాలా నచ్చింది. దాన్ని మీతో పంచుకుంటున్నాను. అంతగా గాలి ఆర్భాటం లేని ఒక గదిలో రెండు శృతి చేసిన తంబూరను పెట్టి, ఒకదాన్ని మీటితే చాలు, ఆ నాద కంపనానికి మరొక తంబూర కూడా తనంతట తానే స్పందించి మోగుతుందట. ఈ జగత్తులో మనమందరం తంబూరలే కదా? ఒకరు వాయించడం మొదలుపెడితే, ఆ కంపనానికి మరొకరు స్పందించడం మానవ ధర్మం. అయితే ఈ కోలాహలపు జగత్తులో అది అంత సులభమా? ఊహూ. అందువల్లనే మనలోనే ద్వేషం, కోపం, గర్వం–అన్నీ! - కన్నడ మూలం: వసుధేంద్ర - అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
కోడలు పిల్లకు పెండ్లి జెయ్యరా?
ఈ మధ్య గుసగుసలు ఎక్కువైనట్టు విన్నాను. ఇంటికొచ్చినప్పుడల్లా కొత్త కొత్త కథలు వినబడుతున్నాయి. ఊర్లె వేరే సమస్యలు లేనట్టుగా చర్చించుకుంటున్నారట. నా గురించి మా ఇరుగు పొరుగు అమ్మలక్కలు చెప్పేకంటే ముందే నేనే చెప్పేస్తే వాళ్లకు శ్రమ లేకుండా పోతుందని నా కథ నేనే చెపుతాను. ఆడ పిల్లలకు చదువేమి అవసరం? అనే ఆరోజుల్లో నన్ను చదివించాలనుకొన్నాడు మా నాయన. ఆటపాటల్లో చదువులో అన్నింటిలో నేనే ముందుండే దాన్ని. సంక్రాంతి పండుగ ముగ్గుల పోటిలో ప్రతి సంవత్సరం నాకే మొదటి బహుమతి వచ్చేది. మొగపిల్లలతో సమానంగా ఆటలు ఆడేదాన్ని. మేము ఇప్పుడుంటున్న ఇల్లు ఎప్పుడో తాతలనాటి పెంకుటిల్లు. ఆ రోజుల్లో మా ఊర్లె అదే పెద్ద ఇల్లు. మా తాత కట్టర్ కమ్యునిస్ట్. నిత్యం మహామహా ఉద్దండులు వచ్చిపోయేవారు. చర్చలు సమావేశాలు సర్వసాధారణంగా జరిగేవి. ఆ వాతావరణంలో పుట్టి పెరిగిన మా నాయన కమ్యునిస్టు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. తెల్లని కుర్త కమీజు, భుజం మీద కండువతో ఆరడుగుల విగ్రహం. మా తాలుకాలో తనను ఎరుగని వారు వుండేవారు కాదు. చుట్టూ పక్కల నాలుగూల్లల్లో ఏ పంచాయతి జరిగిన న్యాయం వైపు నిలబడేవాడు. అలా నిలబడడంతో ఎంతో మందికి శత్రువయ్యాడు. ప్రభుత్వ వుద్యోగం వచ్చిన కాదనుకొని పేదలకు జరుగుతున్నా దోపిడిని ప్రశ్నిస్తూ ఊర్లోనే ఉండిపోయాడు. ఎన్నో సార్లు తనపై దాడులు జరిగిన ఎవరికీ జంకేవాడు కాదు. ఒకసారి రాజిగాడు దొర ముందు చెప్పులేసుకొని నడ్చిండని గడికి పిలిపించిండు. రెండు చేతులు వెనకకు విర్చి కట్టేసి, కుక్కను కొట్టినట్టు కొట్టిండు. చెప్పులు కుట్టేవాడికె చెప్పులేసుకొనే హక్కు లేకపోవడం అన్యాయం అని గొత్తెత్తిండు మా నాయన. రాజిగాని కులపోల్లలందర్కి చెప్పులేయించి గడిలోకి తీసుకెళ్లి బలవంతగా రాజిగాన్ని విడిపించుకొచ్చిండు. అది అవమానంగా భావించి కక్ష పెంచుకొన్నాడు దొర. గడిపై దాడి చేయించాడని కేసు పెట్టి జైలుకు పంపించాడు. కొద్దిరోజుల్లోనే నిర్దోషిగా విడుదలయ్యాడు నాయన. మా తాత నుండి వారసత్వంగా సంక్రమించిన భూమి తప్ప తను సంపాదించిందేమి లేదు. మా అమ్మే దగ్గరుండి వ్యవసాయం చేయించేది. ఏనాడూ ఇంటి పట్టున వుండేవాడు కాదు. మా అమ్మకు ఇంటి పని, పొలం పనితోని పాటు మా నాయన కోసం వచ్చిపోయేవాళ్ళకు చాయలు(టీ లు) పోయడం, భోజనాలు పెట్టడం రోజుండే పని. రోజు ఎవరో ఒకరిద్దరైనా వచ్చి పోతుండేవారు. మా నాయనా వేసుకొనే కుర్త కమీజు మల్లెపూవుల్లాగా తెల్లగా ఉతికి పెట్టడం, ఇస్త్రి చేయించి పెట్టడం తప్పేదికాదు. ఎక్కడికి వెళ్ళేవాడో, ఎప్పుడు వస్తాడో ఇంటికి వచ్చేంతవరకు తెలిసేది కాదు. కొన్నాళ్ళు ఎదిరిచూసి చూసి అలవాటయ్యింది. మా ఊర్లో ఏడవ తరగతి చదవడం అయిపోయింది. కామన్ బోర్డు పరీక్షల్లో మా తాలుకలోనే మొదటి స్థానం వచ్చింది నాకు. హై స్కూల్ చదువుల కోసం తాలుక కేంద్రానికి వెళ్ళాను. అప్పటికే నా తోటి కొందరు ఆడపిల్లలకు పెండ్లిలయ్యాయి. ఇంకా కొందరు సిద్ధంగున్నారు. దసర సెలవులకో, సంక్రాంతి పండుగ సెలవులకో ఇంటికి వచ్చేదాన్ని. నన్ను చూసి చుట్టూ పక్కలున్న ఆడవాళ్ళూ మా అమ్మతో ‘‘అవు అదినే! కోడలు పిల్లకు పెండ్లి జెయ్యరా? మొగపోరని తీరు సదివి పియ్యవడ్తిరి. ఇంత సదివి ఏమిసేస్తది! మల్ల ఓ అయ్యకిచ్చి పంపుడే గదా! ఓ మంచి సంబంధం చూసి ఈ ఎండాకాలం మూడు ముళ్ళు ఏపియ్యరాదు’’ అనే వాళ్ళు. మా అమ్మ ఒక నవ్వు నవ్వి ‘‘ఆ...తప్పుతుందా? ఏనాటికైనా ఓ ఇంటికి పంపుడేనాయె. కాని అదంతా ఆల్లయ్య ఇష్టం’’ అనేది. రాత్రి ఇంటికొచ్చి స్నానం చేసి భోజనానికి కూర్చున్నప్పుడు మెల్లగా మొదలు పెట్టేది. ‘‘అందరు మనమ్మాయి పెండ్లి గురించి అడ్గుతుండ్రు. పిల్ల గూడా ఎదిగింది!’’ అని మా నాయన సమాధానం కోసం ఎదురుచూసేది. ‘‘వాల్లన్నర లేక నీకే అనిపించిందా?’’ అని తల ఎత్తకుండ తింటూనే ప్రశ్నించేవాడు. ‘‘ఏదో ఒకటి...నువ్వేమంటవో చెప్పరాదు’’ అనేది అమ్మ. ‘‘మనకు ఒకతే అమ్మాయి. మంచిగా చదువుతుంది. చాల తెలివైంది. చదివినంత వరకు చదివిద్దాం. పెళ్ళయితే చదవడం కుదరదు. భర్తా,పిల్లలు, అత్తమామలు వారి సేవలతోనే సరిపోతుంది. చూద్దాంలే ఇప్పుడెందుకు తొందర’’ అని చేతులు కడుక్కొని వాకిట్లకెళ్ళేవాడు. వాకిట్ల వేపచెట్టు కింద చెప్టా మీద కూర్చోని కొద్దిసేపు రేడియో విని ఇంట్లకు వచ్చేవాడు. ∙∙ ఫస్ట్ క్లాస్ మార్కులతో పదవ తరగతి పాసయ్యాను. ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్‌లో చేర్చారు. అక్కడ తొంబది శాతం మార్కులతో కాలేజి ఫస్ట్ వచ్చాను. తర్వాత బిటెక్ చదివాను. యూనివర్సిటీ మొదటి ర్యాంక్ సాధించాను. పేపర్లల్లన్ని నా గురించి ప్రశంశిస్తూ కథనాలు రాసాయి. అమ్మ నాయనకు పట్టరాని సంతోషం కల్గింది. మా నాయన చాల గర్వపడ్డాడు. అమ్మ మళ్లోనాడు అడిగింది ‘‘చదువు అయినట్టేనా? ఇంకా వుందా? పెళ్లి గురించి ఇప్పుడైనా ఆలోచించేదున్నదా లేదా?’’ ‘‘ఎం.టెక్ అయినంక ఆలోచిద్దాము లేవే’’ అన్నాడు. అలాగే ఎం.టెక్ గూడా అయిపోయింది. హైదరాబాద్‌లో మంచి పేరున్న కంపెనీలో వుద్యోగం వచ్చింది. చదివిందానికి సరిపడే జీతంతో హాయిగా సాగిపోతుంది జీవితం. కొద్ది నెలలు గడ్చిపోయాయి. ∙∙ ఒక రోజు ఆఫీస్‌కు వెళ్లేసరికి నా టేబుల్ మీద ఇన్లాండ్ ఉత్తరం వుంది. ఇంటి నుండి వచ్చింది. కుర్చీలో కూర్చోని విప్పి చదవడం మొదలు పెట్టాను. ‘వచ్చే శుక్రవారం పెళ్లి చూపులు. రెండు రోజుల ముందుగానే రావాలని సారాంశం. వెళ్ళాను. మొదటి రోజు నేను ఎలాగుండలో, ఏ రంగు చీర కట్టుకోవాలో, ఎలా కూర్చోవాలో...అన్నిమెలకువలతో చక్కగా శిక్షణ ఇచ్చారు. మొదటి పెళ్లి చూపుల కార్యక్రమం కావడం వల్ల కొంత ఆందోళన పడ్డాను. ఇంట్లో గూడా ఏదో హడావిడి కనిపించింది. అబ్బాయి తాలూకు పెద్దవాళ్ళు వచ్చారు. అందరికి జరిగినట్టే నాకు జర్గింది. అందంగా అలంకరించుకొని, వీపు కనబడకుండా కొంగు కప్పుకొని, తల వంచుకొని అందరికి టీ అందించిన తర్వాత, అందరి ముందు చాప మీద జాగ్రత్తగా కూర్చున్నాను. నా చదువు, ఉద్యోగం మొదలగువాటికి సంబంధించిన ప్రశ్నలడిగారు వచ్చిన ఆడవాళ్ళు. అందరు నన్ను తీక్షణంగా చూస్తున్నారు. ఏవో గుస గుసలు పెట్టుకుంటున్నారు. ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడుకున్న తర్వాత ...‘‘మేము మాట్లాడుకొని ఏ విషయము తెలియజేస్తాం’’ అని అందర్లోకెల్ల పెద్దమనిషి అన్నాడు. అందరు లేచి నిల్చున్నారు. వెళ్తున్నారని అర్థమై నేనూ లేచి నిల్చున్నాను. ‘‘మంచిది వెళ్లి రండి’’ అంటూ మా వాళ్ళు రెండు చేతులు జోడించి నమస్కారం చేసారు. వారి వెనుకల ఇంటి గేటు బయటివరకు వెళ్లి సాగనంపి వచ్చారు. నేను వాకిట్లో నిల్చొని చూపు ఆనినంత దూరం ఆ హీరోనే చూస్తుండి పోయాను. ∙∙ నా డ్యూటీలో పడిపోయాను. కొన్నాళ్ళకు మళ్ళీ వుత్తరం వస్తే వెళ్లి వచ్చాను. ఫలితం దైవాదీనం. అలా ఎన్ని సార్లు వెళ్ళానో గుర్తులేదు. ఇక ఆ విషయం ఆలోచించడం మెల్ల మెల్లగా మర్చిపోయి నా పనిలో మునిగిపోయాను. దినాలు, నెలలు, సంవత్సరాలు గడ్చిపోయాయి. నా మనసులో తొలుస్తున్న ప్రశ్నలు– ‘‘నేనెవరికి నచ్చలేదా? ఎందుకు నచ్చడం లేదు?’’ ఎవరిని అడగలేదు. ఎవరూ...నాకు చెప్పడమూ లేదు. కాలం తన పని తాను చేసుకు పోతుంది. నా పని నేను చేసుకుపోతున్నాను. చేతిలో డబ్బు చేరుతుంది. వయస్సు చేజారిపోతుంది. తల్లిదండ్రులకు బెంగ మొదలయ్యింది. వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. నాకు తెల్సి కొన్ని నాకు తెలియకుండా కొన్ని సంబంధాలు చూసారు. ఉత్తరాలు రాయడం కొనసాగుతూనే వుంది. ఏ గ్రహణం అడ్డోచ్చిందో అంతు చిక్కడం లేదు. పెళ్లి, పిల్లలు, నా కుటుంబం అనే ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తునే వున్నాయి. ఆడ పిల్లను గదా ఎవ్వరికి చెప్పుకోలేను. ఆలోచించకుండా ఉండలేక పోతున్నాను. పని ఒత్తిడిలో పడి చాలావరకు మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. ఇంటికి రాగానే ఈ ఒంటరితనం ఎక్కువైనట్టని పించేది. రోజులు దినాలు నెలలు సంవత్సరాలు ఎన్నో వేగంగా దొర్లిపోతున్నాయి. ఇంటిలో ఇన్ని రోజులున్న వాతావరణం లేదు. మా నా నాయన మొఖంలో ఏదో చెప్పుకోలేని బాధ. ఊరందరికీ న్యాయం కోసం జీవితాంతం పోరాడిన నాయన ఇంట్లో తన బాధ్యత నెరవేర్చడం లేదనే మనోవ్యధ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందున్న సంతోషం, ఉత్సాహం బదులు ఆందోళన మొదలయ్యింది. ఆ విషయం బయట పడకుండా ఉండేందుకు చాల ప్రయత్నమే చేస్తున్నారు. నేను కూడా సంతోషంగానే వున్నట్టు నటిస్తున్నాను. ఎప్పుడు నాలో ఒక్కటే ప్రశ్నా ‘ఎవరికీ నచ్చనంత లోపం ఏముందని. చదువుంది...ఉద్యోగముంది...డబ్బుంది. మరింకేమి కావాలి?’ కుప్పలు తెప్పలుగా జవాబు దొరుకని ప్రశ్నలు నాలో సుడిగుండాలై తిరుగుతూనే వున్నాయి. వయస్సు మీద పడడం కంటే నా మీది బెంగతోనే మా నాయన ఈ ప్రపంచాన్ని, ఈ బాధలను, మమ్మల్ని వదిలిపెట్టి హాయిగా వెళ్ళిపోయాడు. బయటి ప్రపంచం తెలియని అమ్మ బ్రతుకు సముద్రంలో కొట్టుకుపోతున్న నావ అయ్యింది. కాలమే గాయాలను మాన్పుతుంది. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మర్చిపోతున్నాం. నాయన కాలం చేసి అప్పుడే సంవత్సరం కావొస్తుంది. సంవత్సరికం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ఎప్పుడో తాతలనాటి పెంకుటిల్లు. గోడకు వ్రేలాడుతున్నా తాత నాయనమ్మఫోటోలు, చిన్నప్పటి నా ఫోటోలను తీసి జాగ్రత్తగా ఒక పక్కన పెట్టాను. ఇల్లు శుభ్రం చేసి సున్నం వేయించాలని ఇల్లంతా సర్దుతున్నాం. ఇంట్లో ఓ మూలకు సైకిల్ పుల్లకు గుత్తిలా వ్రేలాడదీసిన ఉత్తరాలకట్ట నా కంటబడింది. మా ఇంటికి వచ్చే ఉత్తరాలు అలా పుల్లకు గుచ్చి పెట్టడం అలవాటు. ఆ రోజుల్లో అందరు అలానే చేసేవారు. ఎన్నేండ్ల నుంచి అలా వ్రేలాడుతున్నాయో దుమ్ముతో రంగు వెలిసిపోయివున్నాయి. వాటిని కిందికి దించాను. ఎన్నో జ్ఞాపకాల సమాహారం ఆ ఉత్తరాల గుత్తి. మా నాయన చదివిన తర్వాత అలా పుల్లకు చెక్కడం మా అమ్మ పని. అందులో ఇన్లాండ్ లెటర్లు, టెలిగ్రాంలు, పోస్ట్‌కార్డులు దండలో దారానికి గుచ్చిన పూవ్వుల్లాగున్నాయి. టెలిగ్రాంలను తీసి పక్కకు పెట్టి ఒక్కొక్క వుత్తరం చదవడం మొదలు పెట్టాను. అన్నింటి కన్న పైనున్న ఉత్తరాన్ని జాగ్రత్తగా తీశాను. అది మా నాయన చనిపోయేకంటే కొద్ది రోజుల ముందు వచ్చింది. ఆ వుత్తరం నా పెళ్లి చూపులకు వచ్చిన ఆఖరి వాళ్లు రాసింది. అక్టోబర్ నాల్గవ తేది పంతొమ్మిది వందల తొంబది ఏడవ సంవత్సరం. ‘పూజ్యశ్రీ! రమణయ్య గారికి నమస్కరించి వ్రాయునది, మీరు మరోల అనుకోకండి. మీ అమ్మాయిని చూశాం. అమ్మాయి బాగానే వుంది కాని....వయస్సు ఎక్కువైంది. ఇన్ని రోజులుగా అమ్మాయికి పెళ్లి కాకుండ ఇంటిమీద ఉండడానికి కారణమేమై వుంటుందో? ఒకోక్కరు ఒక్కోలాగ వూహించుకుంటున్నారు. కావున మీరు వేరే సంబంధం చూసుకోగలరు’ రెండు లైన్లు రాసి ముగించారు. అంత కంటే ఏమి రాయగలరు గనుక! చుట్టరికం కలుస్తే ఇంకేమైనా రాసే వాళ్ళేమో. అవును అమ్మాయిలకు వయస్సు అడ్డంకి. అబ్బాయిలకు ఎంత వయసున్న పర్లేదు. ముసలి తనంలో కూడా పిల్లనిస్తారు. పూర్వపు రోజుల్లోనే కాదు ఇప్పుడు కూడా ముసలోల్లకు పిల్లనివ్వడానికి సిద్ధంగా వున్నా తల్లిదండ్రులున్నారు. మొగోడు అయితే చాలు అనిపించింది. ఇంకో వుత్తరం తీశాను. తేది ఇరవై ఎనిమిది మార్చ్ పంతొమ్మిది వందల తొంబది ఆరో సంవత్సరం. ‘అమ్మాయి నచ్చింది. కాని మీది కమ్యునిస్ట్ భావాలుగల కుటుంబం. మీ పెంపకంలోని అమ్మాయికి ఖచ్చితంగా మీ ఆలోచన విధానమే వస్తుంది. ఆడ పిల్లలకు ఆ ధోరణి సంసారానికి సరిపోదనిపిస్తోంది. హక్కులు, బాధ్యతలు, సమానత్వం ఇలాంటి వాటిని మీరు నరనరాన జీర్ణించుకొని వుంటారు. మాదేమో సనాతన సాంప్రదాయ కుటుంబం. మాకు మీకు సరిపోదనిపించింది. వేరే సంబంధం చూసుకోవడం ఇరువురికి మంచిది’ మా నాయన ఆధునిక భావాలూ, ఆదర్శాలు వాళ్ళకు నచ్చలేదు. దాని కింది వుత్తరం జనవరి మూడవ తారీకు పంతోమ్మిది వందల తొంబై ఆరవ సంవత్సరం వచ్చింది. ‘కామ్రేడ్! మీ సేవలను పార్టీ గుర్తించింది. ఈ వయసులో కూడా మీరు విలువలకు ఆదర్శాలకు కట్టుబడి వున్నారు. మీ నిస్వార్థ సేవను గుర్తించి మన రాష్ట్రం తరపున మిమ్మల్ని కేంద్ర కమిటీకి సిఫారసు చేస్తున్నాం’’ రాష్ట్ర కమిటీ హెడ్ ఆఫీస్ వాళ్ళు రాసింది. నాల్గవ వుత్తరం తీశాను ‘అమ్మాయి చక్కగా వుంది. మా వాళ్ళందరికి నచ్చింది. కాని...మాకు ఈ మధ్యనే తెల్సింది....మీరు ఒకప్పుడు అన్నలతో సంబంధాలు కల్గి ఉండేవారని. కొద్ది రోజులు అన్నలతో కూడా తిరిగారని తెల్సింది. సంబంధం కలుపుకొనేది సమస్యలు తెచ్చుకోవడానికి కాదు. మేము మీకు సరిపోమని తెలియజేయుచున్నాం’ అది అలా ముగిసింది. మరోవుత్తరం అందుకున్నాను. ‘అమ్మాయికి వంక పెట్టలేము. మా అబ్బాయికి నచ్చింది. కాని...తీరా ఆరా తీస్తే తెల్సింది మీరు ఆ రోజుల్లోనే కులాంతర వివాహం చేసుకున్నారని. మా కుటుంబంలో కులపట్టింపు జాస్తి. మీ అమ్మాయిది ఇప్పుడు ఏ కులమో తేల్చుకోలేకున్నాం. కులం,గోత్రం లేని పిల్లను ఎవరైనా చేసుకునే వాళ్ళుంటే వాళ్లకు ఇవ్వండి. మాకోసం ఎదురు చూడకండి. కావున మీరు ఏమి అనుకోకండి’ కుల పిచ్చి, మత పిచ్చితో కుళ్ళిపోయిన మనుష్యులను ఎవడు బాగుచేయలేడు. అది తప్పిపోవడమే మంచిదైందని పించింది. ఇంకో వుత్తరం తీశాను. ‘అమ్మాయిని ఉన్నత చదువులు చదివించారు. కాని మీరు ఒకటి ఆలోచించలేదు. మన కులంలో అబ్బాయి మీకు దొరుకడు. ఎందుకంటే మీ అమ్మాయిని చేసుకునే అబ్బాయి ఆమె కంటే ఎక్కువగా చదువుకొని వుండాలి. అంత పెద్ద పెద్ద చదువులు చదివిన అమ్మాయి అత్తామామల మాట వినదు. మా అబ్బాయి కూడా తక్కువే చదువుకున్నాడు. అమ్మాయిలో ఏదో లోపముందని మేము అనడం లేదు. అమ్మాయి ముక్కు మూతి మొకం సక్కగానే వుంది. భార్య అన్ని విషయాలలో భర్త కంటే తక్కువగ ఉంటేనే ఆ కాపురం సల్లగ ఉంటుందని మా నమ్మకం. మీ అమ్మాయి అన్నింటిలో మా అబ్బాయి కంటే చాల ఎక్కువే...మా అభిప్రాయం తెలియజేసాం. అన్యదా భావించకండి’ ఆడవాళ్ళను అణగద్రోక్కడానికి ఇదొక ఆయుధం. చదువు విలువ తెలియని సంస్కారహీనులతో సంబంధం కలువనందుకు సంతోషమే నాకు. ఇన్నాళ్ళ నా ప్రశ్నలకు సమాధానం ఈ రూపంలో దొరుకుతుందన్నమాట. దాదాపుగా ఉత్తరాలన్నీ మూడు నాల్గు సంవత్సరాల తేడాతో రాసినవే. ఇంకా ఎన్ని వున్నాయో! నాలో ఆసక్తి పెరుగుతుంది. ఒక్కొక్కటి చదివి పక్కకు పెడ్తున్నాను. సాయమానులో కట్టెల పోయిమీద పప్పు ఎసరు పెట్టి, చీపురు తీసుకొని ఇంట్లోకి వచ్చింది మా అమ్మ. నా వైపు చూసింది. నా ముందర ఉత్తరాల కుప్ప. నా చేతిలో ఒక ఉత్తరం. చదివి పక్కకు పెట్టినవి కొన్ని. ఇంకో పక్క బూజు దులుపే కర్ర. తన చేతిలోని చీపురును పక్కకు విసిరేసింది. చీర కొంగు నడుము చెక్కుకుంది. ఇంకో వుత్తరం తీసుకొని చదువుతున్నాను. అది మా మా నాయనకు చెల్లెలు వరుస లక్ష్మత్త రాసింది. పంతొమ్మిది వందల తొంబది తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ రెండవ తారీకు. ‘ప్రియమైన అన్న, వదినలకు నమస్కరించి రాయునది, మీతో చాల సార్లు చెపుదామనుకున్నాను, మీరేమనుకుంటారోనని చెప్పలేక పోయాను. ఇలా ఉత్తరాలు రాయడం కంటే కూర్చొని మాట్లాడాలని అనుకున్నాం. కాని పనుల ఒత్తిడి వల్ల వీలు కాలేదు. మీరు తప్పుగా భావించరని అనుకుంటున్నాను. మీకంటే చిన్నదాన్ని, అడగ వచ్చో లేదో తెలియదు. ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోకండి. మా పెద్ద బావ రెండవ కొడుకు రవి నీకు గుర్తున్నడనుకుంటున్నాను. మంచివాడు. నెమ్మదస్తుడు. ప్రభుత్వ వుద్యోగం వుంది. వారి ఆస్తి పాస్తుల గురించి నీకు తెలుసు. సంవత్సరంన్నర క్రితం వాడి భార్య మొదటి కాన్పులో బాలింత రోగంతో చనిపోయింది. నెల రోజులు నిండక ముందే పసిగుడ్డు చనిపోయింది. రవికి ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు. చూస్తు చూస్తుండగానే మన అమ్మాయికి నలభై సంవత్సారాలు దాటినాయి. మీరు ఇంకా ఆలోచించుకుంటుంటే వయస్సు మీద పడుతుంది. మీకు సమ్మతమైతే రెండవ పెళ్ళికి వాళ్ళు సిద్ధమని చెప్పమంటున్నారు. మీ బావ నేను అన్ని ఆలోచించే ఈ విషయం మీ దృష్టికి తెస్తున్నాము. ఈ సంబంధం అందరికీ అన్ని విధాల మంచిది. మన అమ్మాయి సుఖపడుతుందని మా అభిప్రాయం. వదినతో చర్చించి, అమ్మాయిని కూడా అడిగి ఏ విషయం తొందరగా తెలుగపగలరు. మీ ఉత్తరం కొరకు ఎదురు చూస్తుంటాం’ చదవడం అయిపొయింది. గబగబ వచ్చి నా చేతిలోని ఉత్తరాన్ని లాగేసింది. నా చుట్టూ కింద పడివున్న వాటిని రెండు చేతులతో నలిపి ముద్దలాగా మడ్చింది. ఉత్తరాల గుత్తిని పట్టుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళింది. మండుతున్న ఒక కొర్రాయిని బయటికి తీసి ఉత్తరాలకట్టను, ఉత్తరాల ముద్దను కట్టెల పొయ్యిలో విసిరేసింది. కొర్రాయితో లోపలికి తోసింది. బర్రున కాలి బుదిడైనాయి ఉత్తరాలు. ఆ వేడికి పోయిమీది పప్పు బుసబుస పొంగింది. ముంగాల్ల మీద కూర్చొని రెండు చేతులు గదవ కింద పెట్టుకొని దీనంగా చూస్తోంది. ఎన్నో ఏండ్ల నుండి భద్రంగా దాచి పెట్టిన జ్ఞాపకాలు అన్ని పొయ్యిలో కాలిపోతున్నాయి. పక్కనున్న బూజు కర్ర తీసుకొని ఇంటికి పట్టిన బూజులను దులుపడం మొదలు పెట్టినాను. ఇంటికి సున్నాలు వేయించిన తర్వాత ఇంట్లో వస్తువులన్నీ సర్దుకోవడం పూర్తయ్యేసరికి చీకటి పడింది. బుక్కెడు తిని నడుం వాల్చాను. అలసిపోయిన కండ్లు మూతలు పడ్డాయి. ∙∙ ‘‘చూడమ్మా బుజ్జి! నా మాట విను. రోజు రోజుకు నీకు వయస్సు పెరిగి పోతుంది. ఇంకా ఆలస్యమైతే ఇలాంటి సంబందం కూడా దొరకడం కష్టమవుతుంది. మంచోచెడో నువ్వు ఒప్పుకుంటావనుకుంటున్న. మా ఆరోగ్యాలు కూడా ఏమి బాగుండడం లేదు. బలవంతం చేస్తున్నానని అనుకోవద్దు. అన్ని రోజులు ఒక్కలాగానే వుండవు. నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నా. మేము పోయిన తర్వాత నీవు ఒంటరిగా వుండడం చాల కష్టం. ఇప్పటికే చాల ఆలశ్యమయ్యింది. జీవితంలో కొన్నింటికి రాజీ పడక తప్పదు. మనం అనుకున్నట్టు అన్ని జరగవు. మరో సారి ఆలోచించుకో ...’’ మా నాయన నా మంచం మీద కూర్చొని నా తలనిమురుతూ అంటున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. చుట్టూ చిమ్మని చీకటి. ఇంక తెల్లవారలేదు. కల మాయమయ్యింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెళ్లి నీళ్ళు తాగి వచ్చి పడుకున్నాను. ఎంత ప్రయత్నించిన నిద్ర పట్టడడం లేదు. అటిటు దొర్లుతుంటే ఎక్కడో కోడిపుంజు కోక్కరోకో అని కూసింది. -మన్నె ఏలియా -
కరోనా ఏమోనని అనుమానం సర్
‘సర్... నేను గిరి...’ అని ఏదో చెప్పబోతుంటే దగ్గు అడ్డొచ్చింది. శ్వాస కూడా భారంగా వినిపిస్తోంది అవతల ఫోన్లో ఉన్న వాళ్లకు. ‘గిరిజా.. ఏమైంది? ఈ ఫోన్ నెంబర్ ఎవరిది? నీ ఫోన్‌కు ఏమైంది? వారం రోజుల్నించి ట్రై చేస్తున్నాం’ ఆదుర్దాగా అడిగాడు శ్రీనివాస్. ‘సర్.. నా ఫోన్ కావాలనే వాడట్లేదు. నా పరిస్థితి తెలిస్తే నా కొడుకు తట్టుకోలేడు. నిండా పన్నెండేళ్లు లేవు వాడికి.. నాకేమన్నా అయితే.. ఏమైపోతాడో.. వాళ్ల నాన్న సంగతి తెలుసు కదా మీకు’ అంటూ ఏడ్చేస్తోంది గిరిజ. కంగారుపడ్డాడు శ్రీనివాస్.. విషయం అర్థకాక.. అడిగాడు ఫోన్లో ..‘ఎందుకేడుస్తున్నావ్? నీ మాట కూడా భారంగా వస్తోంది.. ఏమైంది? పరిస్థితి అంటున్నావ్.. విషయం ఏంటో చెప్పు’ ఆందోళనగా. ‘సర్..’ అంటూ మళ్లీ దగ్గసాగింది గిరిజ.. దగ్గుతూనే చెప్పింది.. ‘కరోనా ఏమోనని అనుమానం సర్’ అని. పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు శ్రీనివాస్. వెంటనే తేరుకొని ‘ఇప్పుడెక్కడున్నావ్? ఆసుపత్రికి వెళ్లలేదా?’ అడిగాడు. ఏడ్వసాగింది గిరిజ. ఏమీ అర్థంకాలేదు శ్రీనివాస్‌కు. ‘ఎక్కడున్నావ్?’ మళ్లీ రెట్టించాడు. ‘రూ.. రూమ్‌లో ’ చెప్పింది ఏడుస్తూనే. ‘రూమ్‌లో అంటే మీ హర్బాబ్ ఇంట్లో లేవా?’ కంగారుగానే అడిగాడు. ‘ఉహూ... కరోనా భయంతో పంపించేశారు. ఫ్రెండ్ రూమ్‌లో ఉంటున్నా..’ చెప్పింది ముక్కు తుడుచుకుంటూ. ‘అరే... మరి వాళ్లు ఉండనిస్తున్నారా?’ అడిగాడు.దానికి సమాధానం దాటవేసి.. ‘సర్.. ఈ విషయాలేవీ ఇంట్లో వాళ్లకు చెప్పకండి.. నా పిల్లాడికైతే అస్సలు తెలవద్దు. నేను మీకు ఫోన్ చేశానని.. బాగున్నానని.. ఇండియాకు వచ్చేస్తున్నానీ చెప్పండి ప్లీజ్’ వేడుకుంది. ‘అద్సరే గానీ.. ముందు నువ్వు కువైట్ వాళ్ల కరోనా హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి నీ పరిస్థితి చెప్పు.. వాళ్లు ఆసుపత్రిలో చేర్చుకుంటారు. డబ్బు గురించి బెంగపడకు.. ట్రీట్మెంట్ ఫ్రీనే’ అంటూ ఇంకేదో జాగ్రత్తలు చెప్పబోతుండగానే ‘అలాగేనండీ.. నా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోండి.. ఇక్కడి విషయాలేం వాడికి చెప్పొద్దు ప్లీజ్ ’ అంటూ ఫోన్ కట్ చేసింది. ఇవతల శ్రీనివాస్‌కు చాలాసేపటి వరకు మెదడు పనిచేయలేదు. గిరిజ గురించిన ఆలోచనలే. పాపం.. కువైట్ వెళ్లడానికి అస్సలు ఇష్టపడలేదు. ఆ గిన్నెలు, బట్టలేవో ఏ విశాఖపట్నమో.. హైదరాబాదో వెళ్లి తోముతా.. ఉతుకుతా. కనీసం నేను, నా పిల్లాడైనా ఒక్క చోటుండొచ్చు అని భర్త కాళ్లావేళ్లా పడింది. వినలేదు మూర్ఖుడు. రెండు గోదావరి జిల్లాల్లో అప్పులు చేసిపెట్టాడు. పొలమూ పుట్రా, నగానట్రా అన్నీ హారతి కర్పూరం చేశాడు. పైగా అమ్మాయిల పిచ్చి. దానికి తోడు తాగుడు. అప్పులు తీర్చుతూ తన జల్సాలకు కొదువ లేకుండా చూసుకోవడానికే గిరిజను బలవంతంగా కువైట్ పంపాడు. పిల్లాడికి ఏడేళ్లున్నప్పుడు వెళ్లింది. ఇప్పటి వరకు రాలేదు. రమ్మని భర్తా ఆడగలేదు. రోజూ కొడుకుతో ఫోన్లో మాట్లాడుతుండేది. పది రోజులుగా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.. అని వాడు ఒకటే టెన్షన్ పడిపోతున్నాడు. కువైట్ వెళ్లడం తప్పనిసరి అయ్యేటప్పటికి భర్త అప్పులు తీర్చడం కన్నా తన కొడుకును బాగా చదివించుకోవాలనే లక్ష్యంతో మాత్రమే వెళ్లింది గిరిజ. వెళ్లిన రెండేళ్ల వరకు తనకు పైసా పంపకపొయ్యేసరకి కొడుకును ఇబ్బందిపెట్టడం మొదలుపెట్టాడు. పిల్లాడి స్కూల్‌కి వెళ్లి అక్కడ గోల చేయడం, గిరిజ వాళ్ల అమ్మవాళ్లింటికి వెళ్లి గొడవలు పెట్టడం.. వాళ్లు గిరిజకు కంప్లయింట్ చేయడం వంటివి ఎదురయ్యే సరికి.. భర్త అప్పునూ తన ఖాతాలో వేసుకుంది. సంసారాన్ని ఓ గాడిలోకి తెచ్చే ప్రయత్నం చేసుకుంటోంది అని ఆమె ఆత్మీయులు, బంధువులు సంతోషపడ్తున్న టైమ్‌లో ఈ కరోనా పిడుగేంటో... అనుకుంటూ నిట్టూర్చాడు శ్రీనివాస్. తనే ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు.. ఈ చేతులతోనే వీసా ప్రాసెసింగ్ చేయించాడు.. భగవంతుడా ఆ అమ్మాయి ఆరోగ్యవంతురాలై తన కొడుకుతో సంతోషంగా ఉండేలా చూడు’ అంటూ మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ కువైట్‌లో తనకు తెలిసిన యాక్టివిస్ట్‌కు ఫోన్ కలిపాడు. ∙∙ ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నానని అబద్దం చెప్పింది. ఏమని చెప్తుంది మరి? కరోనా భయంతో హర్బాబ్ వాళ్లు రాత్రికి రాత్రే పాస్‌పోర్ట్ తన మొహాన విసిరి.. రావాల్సిన జీతం కూడా ఇవ్వకుండా.. ఏ లెక్కా తేల్చకుండా ఇంట్లోంచి బయటకు గెంటేస్తే.. ఎటు వెళ్తుంది? తనలాంటి పరిస్థితే ఉన్న ఆ ఇంటి డ్రైవర్ ఆశ్రయం కోరింది తోటి భారతీయుడే అన్న భరోసాతో. దేవుడా.. ఎంత తప్పు చేసింది తను? కష్టంలో ఒకరికి ఒకరం.. నేను తినేదే నువ్వు తిందువుగాని.. అంటూ తన రూమ్‌కి తీసుకెళ్లాడు. ఉన్న దాంట్లోనే ఇద్దరు తింటూ గది దాటి బయటకు వెళ్లకుండా వారం రోజులు బాగానే గడిపారు. ఇంతలోకే అతనికి జలుబు చేసింది. మాత్రలు తెచ్చుకుంటాను అని వెళ్లిన మనిషి అడ్రస్ లేకుండా పోయాడు. ఫోన్ కూడా ఇంట్లోనే వదిలి. రెండు మూడు రోజులు చూసింది.. నాలుగో రోజూ తెల్లారింది. అయినా మనిషి లేడు. సంబంధించిన సమాచారమూ లేదు. ధైర్యం చేసి అతని ఫోన్లోని ఒకటిరెండు కాంటాక్ట్స్‌కి ఫోన్ చేసింది.. ‘ఈ ఫోన్ అతను ఎవరో.. ఫోన్ మరిచి పోయాడు ఎక్కడున్నాడో చెప్తారా’ అని. విని ఫోన్ కట్ చేసేశారు. తర్వాత రెండు గంటలకు ఆ నంబర్ నుంచే మళ్లీ ఫోన్. ‘ఈ ఫోన్ అతని పేరు దినేశ్. కరోనా పాజిటివ్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఈ ఫోన్ ఎక్కడ మరిచిపోయాడు. మీకెక్కడ దొరికింది’ అంటూ. ఆ ప్రశ్నల పరంపర అలా కొనసాగుతూనే ఉంది.. చల్లబడి పోయింది గిరిజ. వారం రోజులు.. చిన్న గదిలో ఒక్కదగ్గరే ఉంటూ.. ఒకేచోట పడుకుంటూ.. ఒకే బాత్రూమ్ వాడుకుంటూ.. మెదడు మొద్దు బారిపోయింది ఆమెకు. కదలికల్లేవు. చేతిలో చిల్లిగవ్వలేదు. వాలంటీర్ల నంబర్లు లేవు. ఇంకెవరికి చెప్పుకోవాలో.. ఇంకెవరిని సహాయమడగాలో తెలియదు. ఆ షాక్‌లోంచి తేరుకున్నాక తన కొడుక్కి ఫోన్ చేసి మనసారా మాట్లాడుకుంది. తర్వాత రెండు రోజులకు ఆమెకూ జలుబు చేసింది.. దగ్గు... జ్వరం వచ్చాయి. ఇక మరణం తప్పదని ఊహించుకుంది. శ్రీనివాస్‌కు ఫోన్ చేసి తన కొడుకు గురించి జాగ్రత్తలు చెప్పింది. తనెలా పోయిందో కనీసం ఒక్కరికైనా తెలియాలి అని. ఆ అంతర్మ«థనంతో అలా గోడకు చేరగిల పడిందో లేదో బయట తలుపు బాదిన చప్పుడు ... భయంతో గట్టిగా కళ్లు మూసుకొని అలాగే కూర్చుండిపోయింది. ఈసారి ఇంకొంచెం గట్టిగా కొట్టారు తలుపుని. కొట్టి ఊరుకోలేదు.. గ్యాప్ ఇవ్వకుండా కొడుతూనే ఉన్నారు. తప్పదన్నట్టుగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా హెల్త్ వాలంటీర్లు.. అంబులెన్స్‌తో సహా. ∙∙ ‘థాంక్యూ ప్రసాద్.. గిరిజను ఆసుపత్రిలో చేర్పించినం దుకు’ కువైట్‌లో ఉన్న స్నేహితుడికి ఫోన్లో కృతజ్ఞతలు చెప్తున్నాడు శ్రీనివాస్. -సరస్వతి రమ -
మూడు నెలలు ద్వీపాంతరవాస జైలుశిక్ష
మ్యాడిసన్ సర్కిల్లో ఒక బెంచీ మీద కూర్చున్న సోపి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. చలి కాలం దగ్గరపడుతోంది. అయితే ఈ ఎముకలు కొరికే చలి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. మూడునెలలు ద్వీపాంతరవాస జైల్లో ఉండే అవకాశం దొరకాలని అతను ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఏళ్ళుగా చలికాలంలో ఆ ద్వీపమే అతనికి ఆశ్రయమిచ్చింది. చలికాలం వచ్చిందంటే న్యూయార్క్‌లోని ధనవంతులు పామ్ బీచ్‌కో, రివేరాకో టికెట్ కొనుక్కుంటారు. అదే విధంగా సోపి చలికాలం రాగానే ఆ ద్వీపానికి వెళ్ళడానికి తనదైన ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సమయం వచ్చింది. గతరాత్రి ఆ పురాతన సర్కిల్లోని ఫౌంటెన్ పక్కన తన మామూలు బెంచీ మీద అతను పడుకున్నాడు. కింద రెండు వార్తపత్రికలు పరుచుకున్నాడు. పైన రెండు పత్రికలు కప్పుకున్నాడు. అయినా చలికి తట్టుకోలేకపోయాడు. ఆ కారణంగా ఇప్పుడు సోపి మనస్సంతా ఆ ద్వీపమే బృహదాకారంలో ఆక్రమించుకుంది. నగరంలో ఆశ్రయం పొందేవారి కోసం మతధర్మాల పేరిట చేసే ఏర్పాట్ల పట్ల అతనికి వ్యతిరేకత ఉంది. సోపి అభిప్రాయం ప్రకారం ఈ లోకోపకార కార్యాలకన్నా చట్టమే అధిక కరుణామయి. ఆ ఊళ్ళో ఉన్న కార్పొరేషన్ వాళ్ళు, ధర్మసంస్థల వాళ్ళు నిర్మించిన ధర్మసత్రాలు ఉన్నాయి. అక్కడికి అతను వెళితే చాలు. ఉండటానికి చోటు దొరుకుతుంది. తినటానికి భోజనం దొరుకుతుంది. అక్కడ అతను జీవితాన్ని సాఫీగా గడపవచ్చు. అయితే ఇలా దానం కోసం చేయి చాపటానికి సోపి మనస్సు అంగీకరించేది కాదు. నిజానికి దాతలు సమకూర్చే సౌలభ్యాలకు అతను రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. అయినా దాన్ని స్వీకరించే సమయంలో మనస్సులో ఏర్పడే దైన్యం? ఆ విషయాన్ని అతను ఊహించలేకపోయేవాడు. ఊహించి భరించలేకపోయాడు. దానికన్నా చట్టానికి అతిథి కావటమే ఉత్తమమని సోపి అనుకున్నాడు. అక్కడ అన్నీ వ్యవహారాలు నియమాలకు అనుగుణంగా నడుస్తున్నప్పటికీ, గత జీవితంలో అకారణంగా ఎవరూ తలదూర్చరు. ద్వీపానికి వెళ్ళాలని సోపి నిర్ణయం తీసుకుంటుండగానే దాన్ని సాధించటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో అత్యంత సంతోషాన్ని కలిగించే మార్గం ఖరీదైన హోటలుకు వెళ్ళి పొట్టపగుల తినటం, తరువాత చేతులు పైకెత్తి డబ్బులు లేవని ఒప్పుకోవటం. వెంటనే వాళ్ళు ఎలాంటి గొడవ చేయకుండా పోలీసులకు అప్పగిస్తారు. తన పని అనుకూలం చేయడానికి సిద్ధంగా ఉండే న్యాయాధికారి తను ఆశించిన పనిని పూర్తి చేస్తారు. సోపి తన బెంచీ మీది నుంచి పైకి లేచి సర్కిల్ దాటి ముందుకు సాగాడు. బ్రాడ్ వే, అయిదవ రోడ్డు కలిసే స్థలంలో కిక్కిరిసిన వాహనాల సందడి. అతను బ్రాడ్ వే వైపు తిరిగి ధగధగమని మెరుస్తున్న ఓ హోటల్ ముందు నుంచున్నాడు. సోపి చక్కటి వేస్ట్ కోట్ వేసుకున్నాడు. దాని కింది బొత్తం నుంచి పైవరకూ ఉన్న దుస్తుల పట్ల ఆత్మవిశ్వాసం ఉంది. గడ్డం నున్నగా గీసుకున్నాడు. ఎవరికీ అనుమానం కలగకుండా హోటల్లోకి ప్రవేశించి ఒక టేబుల్ పట్టుకుంటే చాలు. అతను గెలిచినట్టే. టేబుల్ పై భాగంలో కనిపించే అతన్ని చూస్తే వెయిటరుకు అనుమానం కలగటానికి అవకాశమే లేదు. బాగా కాల్చిన మల్లార్డ్ బాతును, ఒక బాటిల్ చబ్లీసును ఆర్డర్ చేయాలి. అటు తరువాత కేంబర్టుకు చెప్పి ఒక సిగార్ ఆర్డర్ చేయాలి. సిగార్ ఒక డాలర్ ఖరీదు చేయవచ్చు. మొత్తం బిల్లు దుబారా కాకపోవటం వల్ల హోటల్ వాళ్ళు ప్రతీకార మనోభావాన్ని ప్రదర్శించరు. ఎలాగూ బాతు మాంసం తిని కడుపు నిండిపోతుంది. సంతోషంతో చలికాలపు ఆశ్రయం కోసం ప్రయాణం సాగించవచ్చు. అయితే సోపి హోటల్ గుమ్మంలో కాలుపెడుతుండగా సూపర్వైజర్ కళ్ళు అతడి వదులు ట్రౌజర్, అధ్వాన్న స్థితిలో ఉన్న బూట్లమీద పడ్టాయి. వెంటనే బలిష్ఠమైన చేతులు అతడిని సద్దులేకుండా అవలీలగా వీధిలోకి విసిరేశాయి. ఇలా మల్లార్డ్ బాతు మాంసం తినే అవకాశం తప్పిపోయింది. సోపి బ్రాడ్ వే వదిలి ముందుకు పోయాడు. అతనికి ద్వీపానికి వెళ్ళే మార్గం అంత సులభంగా కనిపించలేదు. దాన్ని ప్రవేశించడానికి మరో ఉపాయం వెతకాలని అనుకున్నాడు. ఆరవ రోడ్డు మలుపులో ఒక దుకాణం కనిపించింది. విద్యుద్దీపాల అలంకరణతో ధగధగ మెరిసిపోతోంది. కిటికీ అద్దాల వెనుక నానా రకా సామాన్లు చక్కగా, అత్యంత ఆకర్షణీయంగా అమర్చి పెట్టారు. సోపి బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. వెంటనే ఒక రాయి తీసుకుని ఆ కిటికీ వైపు విసిరాడు. మరుక్షణం భళ్ళుమంటూ కిటికీ అద్దం పగిలింది. ఆ శబ్దానికి చుట్టుపక్కల జనం వచ్చి గుమిగూడారు. జనంతో పాటు ఒక పోలీస్ కూడా వచ్చాడు. సోపి తన జేబులో చేయి పెట్టుకుని చిన్నగా నవ్వుతూ మౌనంగా నుంచున్నాడు. ‘‘రాయి విసిరినవాడు ఎటువైపు వెళ్ళాడు?’’ అని పోలీస్ అడిగాడు. ‘‘ఎందుకు, నేనే అలా చేసివుండొచ్చని మీకు అనిపింలేదా?’’ అన్నాడు సోపి. అతని స్వరంలో వ్యంగ్యం లేదు. కేవలం అదృష్టదేవతను ఆహ్వానించే స్నేహపూర్వకమైన ధ్వని ఉంది. ఆ సంఘటన గురించి ఏదైనా క్లూ ఇవ్వగలిగే వ్యక్తి సోపి అని అంగీకరించడానికి కూడా పోలీస్ సిద్ధంగా లేడు. కిటికీని బ్రద్దలు కొట్టినవాడు పోలీసులతో హాస్యంగా మాట్లాడటానికి ప్రయత్నించడు. వేగంగా అక్కడి నుంచి పారిపోతాడు. అదే సమయంలో కొద్ది దూరంలో వెళుతున్న బస్సు ఎక్కబోతున్న ఓ వ్యక్తి పోలీస్ కంటపడ్డాడు. అతనే కిటికీ అద్దం పగులగొట్టినవాడు కావచ్చని వెంటనే లాఠీని ముందు చాపి పోలీస్ అటువైపు పరుగెత్తాడు. రెండవసారి తన ప్రయత్నంలో విఫలమైన సోపి హృదయం జుగుప్సతో నిండిపోయింది. అక్కడ ఉండలేక అడుగు ముందుకు వేశాడు. రోడ్డుకు అటుపక్కన ఒక సాధారణ హోటల్ కంటపడింది. ఆకలిగొన్న సాధారణ వ్యక్తులకు అక్కడ తక్కువ ఖరీదులో ఆహారం దొరికేది. అక్కడి పింగాణి పాత్రలు, బల్ల మీద పరిచిన తెల్లటి క్లాత్ సోపిని పిలిచినట్టు ఆనిపించింది. సోపి లోపలికి దూరాడు. అతని చిరిగిన బూట్లు, లూజు ట్రౌజర్ ఎవరి దృష్టికి రాలేదు. ఒక బల్ల దగ్గర కూర్చున్న సోపి బీఫ్ స్టీక్స్, ఫ్లాప్ జాక్స్, డోనట్ తిని పై తాగాడు. వెయిటర్ బిల్లు ఇచ్చాడు. తన దగ్గర చిల్లిగవ్వ లేదని చేతులు పైకెత్తాడు. ‘‘తొందరగా పోలీసును పిలువు. నాలాంటి సభ్యుడైన నాగరికుడిని ఎక్కువసేపు ఇక్కడ ఉంచకూడదు’’ అన్నాడు సోపి. ‘‘నీలాంటివాడికి పోలీసు ఎందుకు?’’ అంటూ ఇద్దరు వెయిటర్లు అతడ్ని ఎడాపెడా వాయించి, ఒళ్ళు హూనం చేసి వీధిలోకి తోశారు. నేల మీద పడిన సోపి, వదులైన కీళ్ళను సరిచేసుకుంటూ మెల్లగా లేచి, బట్టలకు అంటుకున్న దుమ్మును దులుపుకున్నాడు. తాను కోరుకుంటున్నట్టు అరెస్ట్ కావటం కేవలం పగటికల అనిపించింది. ద్వీపానికి వెళ్ళే ప్లాన్ చాలా దూరంలో ఉన్నట్టు అనిపించింది. రెండు అంగళ్ళ తరువాత ఒక మెడికల్ షాపు ముందు నిబడ్డ పోలీస్ ఎందుకో అతడిని చూసి నవ్వి ముందుకు పోయాడు. సోపి కుంటుతూ కొద్దిదూరం నడిచాడు. అరెస్ట్ కావడానికి మళ్ళీ ధైర్యం రాసాగింది. ఈసారి తనంతట తానే ఒక అవకాశం ఒదిగి వచ్చింది. ఒక గొప్పింటి స్త్రీలా కనిపిస్తున్న అందగత్తె ఒక షాపులో ప్రదర్శన కోసం పెట్టిన వస్తువులను చూస్తూ నుంచుని ఉంది. ఆ ప్రదేశానికి కొద్ది దూరంలో ఒక పోలీస్ గోడకు ఒరిగి నుంచుని ఉన్నాడు. ఆమెతో రోడ్ సైడ్ రోమియోలా ప్రవర్తించాలని ఆలోచించాడు సోపి. సభ్యతగా కనిపిస్తున్న ఆ యువతిని, నిజాయితీపరుడిలా కనిపిస్తున్న ఆ పోలీసును చూసినపుడు, తొందరగానే తాను సంకెళ్ళలో చిక్కుకుంటాడని భావించిన సోపి, అప్పుడే తనకు చలికాలపు ఆశ్రయం దొరికిపోయినట్టు సంతోషపడ్డాడు. సోపి తన టై సరిచేసుకొని, మడతలుపడ్డ తన కోటుచేతులను లాక్కుంటూ, హ్యాటును కాస్త ఓరగా చేసుకుని ఆ యువతివైపు నెమ్మదిగా అడుగు వేశాడు. ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, చిన్నగా దగ్గి, చిరునవ్వు నవ్వాడు. తరువాత ఆమె వైపు చూస్తూ రోడ్ సైడ్ రోమియోలా అల్లరిగా సైగలు చేశాడు. తరువాత ఓరకంట పోలీసు వైపు చూశాడు. పోలీస్ తననే చురచుర చూస్తున్నాడని నిర్ధారించుకున్నాడు. ఆమె రెండు అడుగులు ముందుకు వేసి, మళ్ళీ ప్రదర్శనకు పెట్టిన వస్తువులను కిటికీలోంచి తదేకచిత్తంతో చూడసాగింది. సోపి ఆమె దగ్గరికి పోయి ధైర్యంగా పక్కన నుంచుని, తన హ్యాటును పైకెత్తి– ‘‘హలో బేబీ, నాతోపాటు డ్యాన్స్ చేయడానికి వస్తావా?’’ అన్నాడు. పోలీసు ఇంకా చూస్తూనే ఉన్నాడు. తన సైగకు నొచ్చుకున్న యువతి వచ్చి వేలుచూపించి ఒక్క మాట చెబితే చాలు. సోపి స్వర్గానికి సమానమైన ఆ ద్వీపానికి దారి పట్టేవాడు. అప్పటికే అతనికి పోలీస్ స్టేషన్ వెచ్చటి వాతావరణాన్ని అనుభవిస్తున్నట్టు అనిపించింది. ఆ యువతి అతని వైపు తిరిగి చేయిచాపి కోటు చేతిని పట్టుకుంది. తరువాత సంతోషంగా– ‘‘ఓహ్! కచ్చితంగా. నేను అప్పుడే పలకరిద్దామనుకున్నాను. అయితే ఆ పోలీసు మనల్నే చూస్తున్నాడు’’ అంది. ఆమె మామిడి చెట్టుకు అల్లుకున్న తీగలా అతన్ని కరుచుకుంది. సోపి పిచ్చివాడిలా ఆమెతోపాటు అడుగు వేస్తూ పోలీసును దాటి ముందుకు నడిచాడు. బహుశా జైల్లో వెచ్చగా కాకుండా స్వేచ్ఛగా బయటి ప్రపంచంలో ఉండటమే తన నుదుటి రాతలో ఉందని అనుకున్నాడు. ముందరి మలుపులో తన వెంట వచ్చిన ఆ యువతి చేతిని విదిల్చుకుని సోపి అక్కడి నుంచి పరుగుతీశాడు. కొద్దిసేపటి తరువాత అతను విలాసవంతమైన ఒక కాలనీలో నిలబడ్డాడు. అక్కడ ఫర్కోట్ ధరించిన ఆడవాళ్ళు, నిలువు కోటు ధరించి పురుషులు చలికాలపు చల్లటి గాలిలో ఉల్లాసంగా తిరుగుతున్నారు. ఏదో భయంకరమైన మాంత్రిక శక్తి వల్ల అరెస్ట్ కావడం లేదని సోపికి హఠాత్తుగా దిగులువేసింది. ఈ ఆలోచనతో అతను భయపడ్డాడు. అదే సమయంలో సినిమాహాలు దగ్గర తిరుగుతున్న ఓ పోలీస్ కనిపించగానే మునుగుతున్నవాడికి గడ్డిపరక దొరికినట్టయ్యింది. వెంటనే అసభ్యంగా ప్రవర్తించి అతని దృష్టిని ఆకర్షించాలని అనుకున్నాడు. రోడ్డుపక్కనున్న కాలుదారిలో సోపి తాగినవాడిలా తూలుతూ మొరటు కంఠంతో అసందర్భంగా బిగ్గరగా అరవసాగాడు. అతను గంతువేస్తూ, ఎగిరి దూకుతూ ఊళ పెట్టాడు. పిచ్చిపిచ్చిగా ఏడ్చాడు. చుట్టుపక్కంతా గొడవ చేశాడు. పోలీస్ తన లాఠీని తిప్పుతూ సోపి వైపు చూడకుండా అటు తిరిగి దగ్గర్లో ఉన్న ఒక పౌరుడితో అన్నాడు– ‘‘ఎవడో పనికిమాలిన వెధవ. వొట్టి వాగుడుకాయ. అయితే ఏమీ ఇబ్బంది పెట్టడు. ఇలాంటివాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోకూడదని మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది’’. ఖిన్నుడైన సోపి తన కోతిచేష్టలను ఆపాడు. ఏ పోలీసు తనను అరెస్ట్ చేయడం లేదుకదా? ద్వీపానికి వెళ్ళటం సాధ్యం కాని లక్ష్యంలా అతనికి కనిపించింది. కొరికే చలిలో రక్షణ పొందడానికి అతను తన పల్చని కోటు బొత్తాలను పెట్టుకున్నాడు. అక్కడొక సిగార్ అంగడి కనిపించింది. మంచి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వెలుగుతున్న దీపంతో సిగార్ వెలిగించుకుంటున్నాడు. తన సిల్క్ గొడుగును అంగడి తలుపు పక్కన ఆనించి పెట్టాడు. సోపి పోయి గొడుగును తీసుకుని నిమ్మళంగా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. సిగార్ వెలిగించుకుంటున్న మనిషి హడావుడిగా సోపి వెనుకే వచ్చి– ‘‘ఏయ్, అది నా గొడుగు’’ అని గడుసుగా అన్నాడు. ‘‘ఓహో, అవునా?’’ అంటూ సోపి కోపంతో బుసకొట్టాడు. దొంగతనంతో పాటు అవహేళనను చేరుస్తూ ‘‘అలాగైతే ఎందుకు పోలీసును పిలవడం? నేను దాన్ని తీసుకున్నాను. నీ గొడుగు కదా? పోలీసును ఎందుకు పిలవటం లేదు? అదిగో అక్కడ మూలలో ఒక పోలీస్ నిలబడ్డాడు చూడు’’ గొడుగు యజమాని తన నడక వేగాన్ని తగ్గించాడు. అదృష్టం ఎక్కడ ముఖం చాటేస్తుందోననే ఆలోచనతో సోపి కూడా అలాగే చేశాడు. పోలీసు ఇద్దరివైపు కుతూహంగా చూశాడు. ‘‘ఓహ్! అదీ...మీకు తెలుసుకదా, ఇలాంటి తప్పులు ఎలా జరుగుతాయో...అది మీ గొడుగైవుంటే దయచేసి నన్ను క్షమించండి. ఈరోజు ఉదయం నేను ఆ గొడుగును ఒక హోటల్లో కనిపిస్తే తీసుకొచ్చాను. అది మీదని మీరు గుర్తుపడితే...బహుశా మీరు...’’ అన్నాడు ఆ మనిషి. ‘‘అవును, ఇది నాదే’’ అన్నాడు సోపి దుష్టతనంతో. ఆ మనిషి వెనక్కు జరిగాడు. పోలీస్ ఓ పొడువైన అందగత్తెకు సహాయపడటానికి రోడ్డుదాటి అటువైపు వెళ్ళాడు. సోపి రోడ్డు మీద తూర్పుకు అభిముఖంగా నడవసాగాడు. తన ప్రయత్నాలు విఫలమైనందుకు అతనికి బాధగా ఉంది. రోడ్డు పక్కనున్న ఒక గుంతలో గొడుగును కోపంతో విసిరాడు. శిరస్త్రాణం ధరించి చేతిలో కర్ర పట్టుకుని నడిచే జనం పట్ల కోపంతో గొణుక్కున్నాడు. వారి చేతికి తాను చిక్కుకోవాలని ప్రయత్నిస్తే, తాను ఏ తప్పు చేయని గొప్ప వ్యక్తి అన్నట్టు వాళ్ళు గౌరవంతో చూస్తున్నట్టు అనిపించింది. చివరికి సోపి తూర్పువైపున ఉన్న రోడ్డు మీదికి వచ్చాడు. ధగధగమని వెలిగే దీపాలుకానీ, కోలాహలం కానీ లేదు. అక్కడినుంచి మ్యాడిసన్ సర్కిల్ వైపు నడవసాగాడు. తోటలోని బెంచే తన ఇల్లయినప్పటికీ, ఇంటికి వెనుతిరిగి వెళ్ళాలనే భావన అతనిలో జాగృతమైంది. అయితే మరీ ప్రశాంతంగా ఉన్న ఒక మలుపులో సోపి గబుక్కున నిలబడ్డాడు. అక్కడొక పురాతన చర్చి ఉంది. అక్కడ ఒక వ్యక్తి నైపుణ్యంతో ప్రార్థన గీతాన్ని తన వాయిద్యంలో వాయిస్తున్నాడు. ఆ మధురమైన సంగీతం తోసుకుని వచ్చి సోపి చెవుల్లో దూరి అతన్ని అక్కడే పట్టి నిలిపివేసింది. చర్చి చుట్టూ వేసిన కంచె దగ్గర అతను నుంచున్నాడు. పైన చంద్రుడు ప్రకాశంగా, ప్రశాంతంగా వెలుగులు చిందిస్తున్నాడు. జనసంచారం తగ్గింది. వాహనాల సంచారం అంతగా లేదు. గువ్వపిట్టలు నిద్రకళ్ళతో కువకువలాడుతున్నాయి. కొద్దిసేపు ఆ దృశ్యం పల్లెటూరి చర్చీ ప్రాంగణంలా అనిపించింది. ఆ వ్యక్తి వాయిస్తున్న ప్రార్థనాగీతం సోపి మనస్సును ఆవరించింది. ఆ గీతం అతడిని ఇనుప కంచెను ఆనుకుని నిలుచునేలా చేసింది. తల్లి, గులాబీ, ఆకాంక్షలు, స్నేహితులు, ప్రామాణికమైన భావనలు...మొదలైనవన్నీ అతని జీవితాన్ని నింపుకున్నటువంటి కాలంలో అతనికి ఆ ప్రార్థనా గీతం బాగా తెలుసు. సోపి స్వీకార మనోధర్మం, పురాతన చర్చీ కలిగించిన ప్రభావం కలగలిసి ఉన్నట్టుండి అతని ఆత్మలో ఒక అద్భుతమైన పరివర్తన కలిగింది. తాను ఎలాంటి అధఃపాతాళంలో పడిపోయాడుకదా అని అతను దిగులు చెందాడు. తనను తాను పరిశీలించుకున్నాడు. అధఃపతనంలో గడిపిన ఆ రోజులు, యోగ్యం కానటువంటి ఆకాంక్షలూ, విఫలమైన కోరికలు, వ్యర్థమైన సామర్థ్యాలు, హీనమైన అభిప్రాయాలు ఇవే అతని అస్తిత్వంలో నిండివుండేవి. ఈ కొత్త మార్పుకు అతని హృదయం చప్పున సంతోషంతో ప్రతిస్పందించింది. ఆ క్షణంలో ఒక ప్రబలమైన వేగం, తన నిరాశాపూరితమైన అదృష్టంతో పోరాడటానికి అతన్ని ముందుకు తోసింది. ఆ ఊబి నుంచి అతను లేచి పైకి రావాల్సిందే. మరొకసారి అతను మనిషి కావాలి. అతడిని వశపరుచుకున్న సైతాన్ను గెలవాలి. ఇంకా కాలం మించిపోలేదు. ఇంకా అతను వయస్సులో చిన్నవాడు. అతనిలోని పాత ఆశలు, కోరికలను పునర్జీవింపజేయాలి. ఆ పవిత్రమైన, మధురమైన వాదనపు నాదం అతనిలో ఒక క్రాంతినే తెచ్చింది. రేపు రభసగా వ్యాపారం సాగే ముందరి పట్టణానికి వెళ్ళి ఏదైనా ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. గొర్రె, మేక జుత్తును దిగుమతి చేసుకునే ఒక వ్యాపారి గతంలో ఒకసారి అతడికి వ్యాన్ డ్రైవర్ పని ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. రేపు ఆ వ్యాపారిని కలుసుకుని ఉద్యోగం అడగాలి. ప్రపంచంలో తాను ఒక గొప్ప వ్యక్తి కావాలి. తాను ఒక... సోపి భుజం మీద బరువైన చేయొకటి పడింది. అతను చప్పున వెనుతిరిగి చూశాడు. పోలీసు వెడల్పు ముఖం అతని కంటపడింది. ‘‘ఇక్కడ ఏం చేస్తున్నావు?’’ అడిగాడు పోలీస్. ‘‘ఏమీ లేదు’’ అన్నాడు సోపి. ‘‘అయితే నా వెంట రా’’ అన్నాడు పోలీస్. మరుసటి రోజు ఉదయంచీ– కోర్టులో జడ్జి, ‘‘నీకు మూడు నెలలు ద్వీపాంతరవాస జైలుశిక్ష విధిస్తున్నాను’’ అన్నాడు. -ఆంగ్ల మూలం: ఓ.హెన్రీ అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
మనుషుల్లా మారిపోతున్నారు..
మనిషి రూపం రోజురోజుకు వింతగా మారిపోసాగింది. అన్యాయానికి నోరు చాలా పెద్దదిగా పెరిగి పోసాగింది. తలలనిండా కొమ్ములు మొలుచు కొస్తున్నాయి. జిత్తులమారి నక్కల రూపం వచ్చేసింది. కాళ్లు చేతులు పొడవుగా భయానకంగా వికృతంగా పెరిగిపోతున్నాయి. గోళ్ళు పొడవుగా...చీల్చడానికి వీలుగా...పదునెక్కుతున్నాయి. భయంకర...రాక్షసాకార రూపంతో విచ్చలవిడిగా లోకం మీద పడిపోతున్నాడు. మనిషే దోపిడీగా రూపాంతరం చెందాడు. కళ్ళు ఎర్రటి అగ్నిగోళాల్లా మండసాగాయి. నిలువెల్లా విషం ఆవరించసాగింది. కోరలు పొడవుగా పెరిగాయి. జుట్టు విరబోసుకుని, చేతులు బార్లా చాపి, రోడ్డు మీద బోర విరుచుకుని నడవసాగాడు. రోజు రోజుకు మనిషి రూపం మారిపోయి నరకాసురుడులా మారిపోతున్నాడు. బుర్రమీసాలు వచ్చేశాయి. డేగ కళ్ళు తెరిచాడు. రాక్షసరూపు వచ్చేసింది. ఒళ్ళంతా పొలుసులు పొలుసులుగా రూపాంతరం చెందాడు. పొడవాటి నోటిలో రంపపుపళ్ల మొసలి లక్షణాలు పొడచూపుతున్నాయి. పులి, సింహం, తోడేలు అన్నింటి క్రూరత్వాన్ని ఒడిసి పట్టుకున్నాడు. కనబడ్డ వాళ్ల రక్తం కళ్ళజూడసాగాడు. తన పరభేదాలు మరచిపోయాడు. అరాచకాలు లేకుండా నిద్ర పట్టడం లేదు. జనంపై చెలరేగిపోయాడు. పిచ్చి, చాదస్తం ఆభరణాలు అయ్యాయి. ఉన్మాదం తలకెక్కింది. డబ్బు, భూమి, స్థలాలు, పొలాలు, బంగారం, వెండి, నగలు, ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు...వీటిని అన్యాయంగా సంపాదించడం అలవాటుగా చేసుకున్నాడు. అవసరమైతే పక్కవాడిది లాక్కోవడం హక్కుగా మార్చుకున్నాడు. రాబందు, పులి, సింహం,తోడేలు, మొసలి, పాముల తలలు పొడుచుకు వచ్చేశాయి. నాలుగు రోడ్ల కూడలిలో గుంపులు గుంపులుగా చేరి కొట్లాటలకు కాలు దువ్వసాగారు. తెల్లారి లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఆంబోతుల్లా విచ్చలవిడిగా వీరవిహారం చెయ్యసాగారు. దూరం తెలియదు. గమ్యం లేదు. వెనకా ముందు చూసేదే లేదు. అందినంత మేరా ఆబగా అల్లుకు పోసాగాడు. ఈ గుంపుల కాళ్ళ కింద పడి ఎన్నో మూగజీవాలు నలిగిపోతూ ఉన్నాయి. ఎందరో ఆడవాళ్ళు, పిల్లలు అసువులు బాస్తున్నారు. అమాయకులు ఎందరో బలైపోతున్నారు. అయినా గుంపులు పట్టించుకోవడం లేదు. డబ్బు... సంచులు... సంచులు.... గోతాలు... గోతాలు.. లారీలు... లారీలు చేతులు మారిపోతున్నాయి. డబ్బు పోగు పడుతుంది. హింస మితిమీరిపోతుంది. తలలు మొండాల నుండి వేరై పోతున్నాయి. కాళ్లు చేతులు విరిగి పడిపోతున్నాయి. రోజు రోజుకు మృగా రూపాలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. కోరలు సాచి విషం కక్కుతున్నాయి. పంజా విసురుతున్నాయి. డేగ కళ్లతో వేట జోరుగా సాగుతోంది. కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్లు, విల్లంబులు, బరిసెలు, ఈటెలు సరికొత్త రూపాలలో తయారవుతున్నాయి. అవసరమనుకుంటే ఏ ఆయుధానికైనా పని చెప్పడానికి వెనుకాడడం లేదు. వాళ్ళకు ఏడుపులు వినబడవు. పెడబొబ్బలు పెట్టినా వదలరు. పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, అవిటి వాళ్ళు ఎవరైనా సరే అడ్డు వచ్చారంటే అడ్డు తొలగించుకోవడమే. గుంపులు, గుంపులుగా కొండలు ఎక్కేస్తున్నాయి. గుంపులు, గుంపులుగా గుట్టలెక్కేస్తున్నాయి. అడవులకు అగ్గి ముట్టించి వేస్తున్నాయి. భూమిని పాతాళ లోకంలోకి తొవ్వేస్తున్నాయి. దేనినైనా సరే తనకు కావాలనుకుంటే సర్వ నాశనం చేసేస్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా ప్రకృతి అస్తవ్యస్తం చేసేస్తున్నాయి. రోజురోజుకు గుంపుల నోళ్లు గుహల్లా విస్తరించసాగాయి. దేనినైనా మింగేసే స్థాయికి వచ్చేస్తున్నాయి. మితిమీరిన దాహంతో ఊరేగుతున్నాయి. అడవులు హరించుకు పోతున్నాయి. భూములు హారతి కర్పూరం అయిపోతున్నాయి. కొండలు పిండి అయి పోతున్నాయి. ఊళ్లకు ఊళ్లు సర్వనాశనం అయిపోతున్నాయి. అయినా సరే గుంపుల పరుగు ఆగడం లేదు. పడగలు విప్పుతూనే ఉన్నాయి. కొత్త కొత్త ఆయుధాలు కొత్త కొత్త ఎత్తుగడలతో ఉరకలు వేస్తూనే ఉన్నాయి. పరుగులు తీస్తూనే ఉన్నాయి. పడుతూ లేస్తూ సాగిపోతూనే ఉన్నాయి. చిన్నచిన్న గుంపులు పెద్ద పెద్ద గుంపుల వేటకు తట్టుకోలేక చావుల రేవుల్లోకి చేరుతున్నారు. అయినా గుంపులు లెక్క చేయకుండా పెరుగుతూనే ఉన్నాయి. ముందుకు సాగుతూనే ఉన్నాయి. గుంపులు గుంపులుగా చెలరేగి పోతూనే ఉన్నాయి. పాదాల పరిమాణం పెరిగి పెరిగి ఏనుగుల పాదాలుగా మారిపోయాయి. వాటి కాళ్ల కింద పడి నలిగి పోయేవాళ్ల సంఖ్యకు లెక్కేలేదు. కళ్ళ ముందు ఏముందో చూసే దశను దాటి పోయాయి. ఏడుపులు వినిపించడం లేదు. మనుషులను కంటితో చూడడం లేదు. తల్లులు, పిల్లలు ఎవరూ కంటికి కనిపించడం లేదు. బంధువులు, స్నేహితులు అనే మాటకు తావే లేదు. వెళ్లడమే ముందుకు వెళ్ళడమే. పోవడమే దూసుకుపోవడమే. పచ్చని పల్లెటూళ్ళు ఎర్రటి రక్త కాసారాలు అవుతున్నాయి. రాతి కట్టడాల అరణ్యాలు పెరిగిపోతున్నాయి. ఆకాశాన్ని అందుకునే గోడలు లేస్తున్నాయి. అలా...అలా...తిరిగాయి....తిరిగాయి...గుంపులు చాలా....చాలా ....దూరం తిరిగాయి. చాలాకాలం తిరిగాయి. అప్పుడు వెనక్కి చూశాయి. గుంపులకు ఎక్కడున్నామో అర్థం కాలేదు. అలుపు వచ్చేసింది. నవనాడులు కుంగిపోతున్నాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. తలలు విదిలించుకున్నాయి. శక్తి సన్నగిల్లుతుంది. ఎక్కడికక్కడ పడిపోతున్నారు. మళ్ళీ లేచి నిలబడుతున్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకొంటున్నారు. ధైర్యం కూడగట్టుకుంటున్నారు. ‘‘ఆ....చాలా...చాలా దూరం వచ్చేశాం. ఇంకా ముందుకు పోవాలి. ఇంకా పైకెదగాలి’’ అనుకుంటూ సామాన్యులపై రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. సామాన్య మానవులు కకావికలైపోతున్నారు. పరుగులు పెడుతూ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతున్నారు. ఆడవాళ్ళనైతే లెక్కేలేదు. చిన్నా పెద్దా తేడా లేదు. చిదిమేస్తున్నారు. ఎక్కడ కనిపించినా, ఎవరు కనిపించినా చీలికలు పీలికలు చేసేస్తున్నారు. వెంటబడి వెంటబడి వేటాడుతున్నారు. పేగులు మెడలో వేలాడదీసుకు తిరుగుతున్నారు. రక్తాన్ని జుర్రుకుంటున్నారు. చాలా చాలా దూరం వచ్చేశాయి గుంపులు. ఇంకా... ఇంకా.. పైకి... పైపైకి... తప్ప కింద చూపే ఆనడం లేదు. ఎంత దూరం వెళ్ళినా ఇంకా ముందుకే అడుగులు పడుతున్నాయి. వెళ్లాయి ...వెళ్లాయి ...వెళ్తూనే ఉన్నాయి ... ఇంకా...ఇంకా...ముందుకు...ముందుకు... పైకి...పైకి...అలా...అలా అందనంత దూరం వెళ్ళాయి. అక్కడ మొదలైంది...ఏమిటిది? ఎందుకిలా? ఎవరికి ఎవరు? ఎంత దూరం? ఎంతకాలం? ఏమిటి గమ్యం? గుంపుల్లో ఆలోచన మొదలైంది. ఒక్కసారిగా అయోమయం వ్యాపించింది. ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? అని ఆలోచించడం మొదలు పెట్టాయి. వెనక్కి తిరిగి చూశాయి. అంతా శూన్యంగా కనిపించసాగింది. కనుచూపుమేరలో ఏమీ కనిపించడం లేదు. ఎటు...చూసినా...ఎడారే. దాహం వెయ్యసాగింది. నోరు పిడచ కట్టుకుపోతుంది. చుక్క నీళ్లు ఇచ్చేవాళ్లే కరువయ్యారు. ఆకలి వేస్తుంది. నోటికింపైన తిండి పెట్టే వాళ్ళే లేరు. కనుచూపుమేరా మనుషుల జాడే లేదు. అక్కడక్కడా చావులు కూడా సంభవిస్తున్నాయి. పోయిన వాళ్లకు కర్మకాండలు చేసే దిక్కు కూడా కనిపించడం లేదు. అయినా గుంపుల్లో మార్పు కనిపించడం లేదు. పైపైకి అనుకునేవాళ్ళే పెరిగిపోతున్నారు. చాలా దూరం...మనుషులకు అందనంత దూరం.... పైకి పోయే గుంపులు...తమకు తాము చూసుకుంటున్నారు. ఒంటినిండా అసహ్యకరమైన అవాంఛితమైన రోమాలు పెరిగిపోయి ఉన్నాయి. పొడవాటి కొమ్ములు పొడుచుకు వస్తున్నాయి. కోరపళ్ళు పొడవుగా నాలుకలు సాచి బుసలు కొడుతున్నాయి. జడలు కట్టిన వింత వింత ఆకారాలు కనిపిస్తున్నాయి. కళ్ళల్లో మంటలు మండుతున్నాయి. తమ రూపం తమకే వికృతంగా అనిపించసాగింది. అందరూ ఏకమయ్యారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అన్నీ జంతువుల తలలే. మృగాల లక్షణాలే కనిపిస్తున్నాయి. ఎవరికి ఎవరు ఏమవుతారో ఎంత గుర్తుకు తెచ్చుకోవాలన్నా గుర్తే రావడంలేదు. గతమంతా మరుగున పడిపోయింది. మాటలే మర్చిపోయారు. నోళ్లు పెగలడం లేదు. సంతోషం అంటే ఏమిటో తెలియడం లేదు. రంగు రుచి వాసన అర్థమే కావడం లేదు. స్పర్శ మాయమైంది. నవ్వడం అంటే ఎలా ఉంటుందని అందరినీ అడగసాగారు. ఏడుపు ఎలా ఏడవాలో తెలియడం లేదు. పిల్లల కోసం వెతికారు. బంధువుల కోసం చూశారు. పెద్దల కోసం చూశారు. మనం ఎవరిమి అనుకుంటూ ఒకరికొకరు మొహాలు చూసుకుంటున్నారు. ఎవరికీ ఏమీ తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉంది. జంతువుల దగ్గరగా వెళ్ళి చూశారు. వాటికీ తమకూ దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపించింది. అలా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న గుంపులు వెతుకులాటలో పడిపోయాయి. వెతగ్గా వెతగ్గా దూరంగా ఎక్కడో మసక మసగ్గా మనుషులు కనిపించసాగారు. వాళ్ల దగ్గరకు పోతుంటే భయపడి దూర దూరంగా జరుగుతున్నారు. ‘‘అయ్యో మిమ్మల్ని ఏమీ చెయ్యము. మేము ఎవరిమో మర్చిపోయాం. గుర్తు చేయరా’’ అంటూ బతిమాలసాగారు. అయినా మనుషులకు నమ్మశక్యంగా లేదు. వీళ్ళందరూ ఇంతకుముందు ఎప్పుడో ఓసారి ఈ గుంపుల కాళ్ళ కింద పడి నలిగిపోయిన వాళ్ళే. తమ పిల్లల్నీ ఇళ్ళనీ, పుస్తెలనీ వీళ్ళకి అర్పించిన వాళ్ళే. వీళ్ళ చేతిలో చావు దెబ్బలు తిన్న వాళ్లే. అందుకే ఎంత బతిమాలుతున్నా తప్పించుకుపోతున్నారు. ఏ ఎత్తుగడలో ఇవి అని దూరదూరంగా తొలగి పోతున్నారు. గుంపులకు పిచ్చి లేస్తుంది. వాళ్ళని ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు. తమ వైపు తాము చూసుకున్నారు. తమ వింత ఆకారాన్ని చూసి తామే నమ్మలేక పోయారు. చేతుల నిండా ఆయుధాలు ఉన్నాయి. వాటన్నిటినీ కుప్పగా పోసి నిప్పంటించారు. తమ శరీరాలపై అసహ్యంగా పెరిగిన జంతు లక్షణాలన్నింటినీ ఒక్కొక్కటి తొలగించుకోసాగారు. మర్చిపోయిన విషయాలు కొద్దికొద్దిగా గుర్తుకు రాసాగాయి. భక్తి భావన తోటి గుళ్ళూ గోపురాల మెట్లెక్క సాగారు. అక్కడ వీళ్ళ మొఖాలు చూసిన వాళ్లు... పాత జంతువుల ఆనవాళ్లను గుర్తుపట్టి.. దూరదూరంగా తొలగిపోసాగారు. వీళ్ళలో వస్తున్న మార్పులను చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తున్నారు. దూరం జరుగుతున్న వాళ్లు కాస్తా అసహ్యించుకోవడం తగ్గించారు. కన్న బిడ్డలు తమ తల్లిదండ్రుల్ని పోల్చుకోసాగారు. బంధువులు ఆహ్వాన పత్రికలు పంపసాగారు. తోడబుట్టిన వాళ్ళు ఆశగా చూడసాగారు. అందరూ కూడబలుక్కొని ప్రత్యేకమైన మాటల కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకమైన శిక్షకులను రప్పించుకున్నారు. మనుషుల భాష మళ్లీ నేర్చుకోసాగారు. పోగొట్టుకున్న బంధాలేవో మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని మననం చేసుకోసాగారు. ఊళ్ళెలా ఉంటాయో, ఊళ్లలో మనుషులు ఎలా ఉంటారో బొమ్మలు గీయించుకుని మురిసిపోసాగారు. తమ ఇళ్ళు ఆనవాళ్లు చూయించుకొని ఆనందపడసాగారు. వాటికి సంబంధించిన పాఠాలు చెప్పించుకోసాగారు. పక్షులు, లేళ్ళు, సెలయేళ్ళు, ఊళ్లు, ఊళ్లలో ఇళ్ళు, బావులు, ఎగిరే పక్షులు, పురివిప్పిన నెమళ్లు, నీటిలో ఈదే చేపలు, రంగు రంగుల సీతాకోక చిలుకలు, పచ్చటి తివాచీలా పరుచుకున్న పచ్చికలు చూసి...ఆహా అనుకుంటూ మైమరిచిపోసాగేరు. మళ్ళీ మళ్ళీ వచ్చి పలకరించే పండుగలు. పండుగల్లో అందరూ కలిసి కలబోసుకునే ఆనందాలు, సుందరమయంగా కనిపించే సుందరీమణుల్ని చూసి మురిసి పోసాగారు. సందడి చేసే కళాకారుల్ని చూసి తన్మయత్వం చెందసాగేరు. అసలు జీవితం అంటే ఏమిటో, సంతోషంగా ఎలా బతకాలో తెలిసి వస్తుంది. గుళ్ళూ గోపురాలు, దేవుళ్ళు దేవతలు కొలుపులు జాతర్లూ చేసుకుంటూ, ఊళ్లలో నడిబొడ్డున బొడ్రాయి ప్రతిష్టలు చేసుకుంటూ వాటి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చెయ్యసాగారు. తాము చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలకు వెళ్లి అక్కడ పిల్లలతో మాట్లాడి ఆనందపడసాగారు. గత స్మృతులను నెమరు వేసుకోసాగారు. తన తల్లిదండ్రులు పెరిగిన తావులేవో తెలుసుకుని నవ్వుకోసాగారు. తమ కుటుంబాల వాళ్ళను...కులాల వాళ్లను...గోత్రాల వాళ్లను... కలుపుకొని సమావేశాలు నిర్వహించ సాగారు. కన్న తల్లిదండ్రులు గురించి ఆరా తియ్యసాగారు. బంధువుల గురించి చెప్పించుకోసాగారు. పోయిందేదో పోగొట్టుకున్నదేదో గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మర్చిపోయిన వాటిని నేర్చుకుంటూ ఒకరినొకరు ఓదార్చు కుంటున్నారు. మానవ లక్షణాలు అలవర్చుకుంటున్నారు. దూరదూరంగా జరిగిన వాళ్ళందరూ అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా జరగసాగారు. ‘ఇది కదా జీవితం! ఇలా కదా బతకాల్సింది!’ అనుకుంటూ నెమ్మది నెమ్మదిగా లోకాన్ని పరిచయం చేసుకో సాగారు. జీవించే విధానాలకు సంబంధించిన పుస్తకాలు ముద్రించుకొని చదువుకుంటూ తాము పొందిన దేమిటో, పోగొట్టుకున్నదేమిటో గుర్తుకు తెచ్చుకోసాగారు. మానవత్వం అంటే ఏమిటో అర్థమవుతూ ఉండడంతో నెమ్మది నెమ్మదిగా మనుషులుగా మారసాగారు. గుంపులన్నీ విడిపోయి కుటుంబాలను గుర్తించ సాగారు. సంస్కృతీ సంపదను పెంచుకోసాగారు. మానవ సంబంధాలు ప్రేమాభిమానాలు తెలుసుకోసాగారు. ఆహారంలోనూ, విహారంలోనూ మార్పులు చేసుకోసాగారు. గానుగు నూనెలు వాడసాగారు. మందులు మాకులు వేయని పంటలు పండించుకోసాగారు. ఆకులు అలములుతో కషాయాలు తయారుచేసుకుని తాగసాగారు. తరచూ పల్లెటూళ్ళను సందర్శించి స్వచ్ఛమైన గాలిని పీల్చసాగారు. ఒంటరితనాన్ని వీడి ఎక్కువ కాలం మనుషుల మధ్య జీవించడానికి ఇష్టపడుతున్నారు. దానధర్మాలు చేస్తున్నారు. పేద వాళ్ళను చూసి ‘అయ్యో పాపం’ అంటున్నారు. చేతనైనంత సహాయం చేయసాగారు. ముఖాలలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. మనుషుల తోటిదే కదా అందమైన ప్రపంచం, ఇది కదా నిజమైన జీవితం అని గుర్తించసాగారు. ఇంతకాలం దీన్ని కాలదన్నుకున్నామే ఇప్పటికైనా తెలుసుకున్నాము...అంతే చాలు అనుకుంటూ ఆనంద లోకాల వైపుకు పయనించసాగారు. -శాంతివనం మంచికంటి -
చెరువుకాడి చింతచెట్టు
‘‘దేవుడా! ఈ నెంబరు వాడిదే కావాలి’’ మనసులో అనుకుంటూ మొబైల్లో నెంబర్ని డయల్ చేశాడు విశ్వజిత్. ‘‘చెప్పండి. ఎవరు మీరు?’’ అవతలి గొంతు. ‘‘నేను...కాదు...మీది రామాపురమేనా?’’ అడిగాడు నెమ్మదిగా. ‘‘అవును’’ ‘‘అవునా? మీ పేరు సుందరం కదా!’’ ‘‘అవును. నేను ఇక్కడే టీచర్‌గా పనిచేస్తున్నాను. ఇంతకూ మీరు ఎవరు?’’ కాస్త విసుగ్గా అవతల గొంతు. ‘‘నేను.. నేను...విశ్వజిత్. కాదు... కాదు...వెంకట్రామున్ని’’ అన్నాడు తడబడుతూ విశ్వజిత్. ‘‘వెంకట్రామా?’’ ‘‘వెంకట్రామున్ని. నీ చిన్ననాటి నేస్తాన్ని’’ ‘‘వెంకట్రామ్....అంటే వీరయ్య కొడుకువా? ఒరేయ్ ఎంత కాలం అయింది రా! నమ్మలేకపోతున్నాను. అయ్యో సారీ’’ ‘‘సారీ ఎందుకు రా! ఇరవై అయిదేళ్ళు ఏళ్లు ఎలా గడిచాయో తెలియడం లేదు. నా అదృష్టం కొద్దీ ఎలాగోలా నీ నంబరు దొరికింది’’ ‘‘అవున్రా! అయినా ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు?’’ ‘‘అవన్నీ వివరంగా తరువాత చెబుతాను. ముందు నీతో మాట్లాడుతూ ఉంటే మన ఊరు నాతో మాట్లాడుతున్నట్టు ఉంది రా! ఆ పొలాలు, వాగులు, వంకలు, చెట్లు, చేమలు, చెరువులు అన్ని అన్ని కళ్ల ముందు కదలాడుతున్నట్లుంది. అవున్రా మన ఊరి చెరువు, గట్టు మీద చింత చెట్టు ఎలా ఉన్నాయి రా? చూడాలని ఉంది...’’ ‘‘వెంకట్! ఇంకెక్కడి చెరువు రా? ఎప్పుడో మాయమైంది’’ ‘‘ఎలా?’’ ‘‘అందరూ ఆక్రమించుకున్నారు. ఇళ్లు కట్టుకున్నారు.’’ ‘‘మరి చింతచెట్టు?’’ అడుగుతుంటే గొంతు జీరవోయింది. ‘‘అదొక్కటే మిగిలింది. దానికి దగ్గరలోనే కదా మా ఇల్లు. కానీ నీకో ముఖ్య విషయం చెప్పాలి రా! త్వరలో ఆ చింతచెట్టు కూడా మాయం కాబోతోంది! రేపు మన గ్రామ పంచాయతీ వాళ్లు ఆ చెట్టును, అది ఉన్న స్థలాన్ని వేలం వేయబోతున్నారు. అక్కడ బార్ కట్టించబోతున్నారు’’ ‘‘ఆ చెట్టు నాకెంతో ఇష్టం కదరా! మన చిన్నతనం అంతా అక్కడే గడిచింది! అది నాకు జీవితాన్ని ఇచ్చింది!....’’ ఇక మాటలు పెగల్లేదు. ‘‘వెంకట్! అంతే కాదు రా, అది మీ నాన్న శీలానికి ఏర్పడిన మచ్చను చెరిపేసింది!’’ ‘‘ఒరేయ్ సుందరం, నేను మన ఊరికి వస్తాను రా! ఎలాగైనా దాన్ని చూడాలి! ఇప్పుడే బయలుదేరుతాను. రేపటి ఉదయానికంతా ఎలాగోలా చేరుకుంటాను’’ అంటూ ఫోన్ పెట్టేశాడు విశ్వజిత్. సమయం చూశాడు, మధ్యాహ్నం మూడుగంటలవుతోంది. అంతే మరో ఆలోచన లేకుండా వెంటనే బయలుదేరాడు. ∙∙ ఇరవైఅయిదేళ్ళ తర్వాత తను పుట్టి, పెరిగిన ఊరిని చూడబోతున్నాడు. ప్రస్తుతం తను ముంబైలో ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్. దేశంలోని పెద్ద నగరాల్లో తన కంపెనీలు ఉన్నాయి. కోటీశ్వరుడైన విశ్వజిత్ పేరు చిన్ననాటి పేరు వెంకట్రాముడు. ఎనిమిదేళ్ల తర్వాత విశ్వజిత్. తన జీవితాన్ని రెండు భాగాలుగా ఆ వయస్సు విభజించింది. రామవరం ప్రకృతి ఇచ్చిన కానుక పచ్చటి పొలాలు. రెండు వందల దాకా ఇళ్ళు. ఊరికి ఆనుకుని చిన్న చెరువు. గట్టున చింత చెట్టు. ఎన్నో ఏళ్ల నాటిది. తన అమ్మా,నాన్నలు వీరయ్య, లక్ష్మమ్మలు. తను ఒక్కడే సంతానం. చెరువు కింద రెండెకరాల పొలం. దాన్లోనే అమ్మా,నాన్నలు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. మరీ తన చిన్నతనంలోని విషయాలు గుర్తుకు లేవు కానీ ఒకటో తరగతి చేరే సమయం నుంచి అన్నీ గుర్తున్నాయి. నాన్న స్వతహాగా ఎవరి జోలికి పోరు. ఏ చెడు అలవాటు లేదు. ఊళ్లో అతనికి మంచి రైతుగా పేరుంది. వానకారు పంటలుగా చెరువు కింద వరి పండిస్తూ, ఎండ కారుగా నీళ్లు తక్కువ ఉంటాయి కాబట్టి కూరగాయలు పండించే వాడు. అలా సంవత్సరమంతా పొలం పని ఉండేది. తన బాల్యమంతా ఎంత ఆనందంగా గడిచిపోయిందో! తనకున్న మిత్రుల్లో అందరికంటే సుందరం మంచి మిత్రుడు. తమ పొలానికి ప్రక్కనే ఉన్న ఆ ఊరి పెద్ద గంగాధరంగారికి మాగాణి ఉంది. ఎంతో తనకు సరిగా తెలియదు కానీ వందెకరాలు అని అంటుంటారు. ఆయన కన్ను తమ పొలం పై పడింది. ‘‘మీకున్న ఆ రెండు ఎకరాలు నాకు ఇచ్చేస్తే మరో చోట నాలుగు ఎకరాలు ఇస్తాను’’ అని చెప్పాడు. కానీ అది మెట్టభూమి. పైగా రాళ్ల నేల. పంటలు పండటం కష్టం. దాంతో నాన్న అంగీకరించలేదు. అదే శాపమయింది. పగపట్టాడు. ఎలాగైనా తమ పొలం లాక్కోవాలని ఎదురుచూశాడు. ఆరోజు తాను బడిలో ఉన్నాడు. అమ్మ జ్వరంగా వుందని ఇంటిపట్టునే ఉన్నది. నాన్న ఒక్కడే పొలానికి వెళ్ళాడు. మధ్యాహ్నం మూడవుతోంది. తను బళ్ళో ఉంటే ఎవరో వచ్చి చెప్పారు– ‘‘ఒరేయ్ వెంకట్రామ్ మీ నాన్నను పొలం దగ్గర చంపేశార్రా!’’ అని. పరుగుతీశాడు. రక్తపుమడుగులో నాన్న. తల పగిలి ఉంది. నోట మాట రాక భయంతో వణుకుతూ నిలబడి పోయాడు. నాన్న ప్రక్కనే అమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. చుట్టూ అంతా ఏదో గుసగుసలాడు కుంటున్నారు. ‘‘తగిన శాస్తి జరిగింది!’’ అన్నారెవరో. తను అటు చూశాడు. ‘‘అవును మరి ఒళ్లు బాగా కొవ్వెక్కి ఆడపిల్లను పాడుచేయ బోయాడు. ఛీ...ఛీ...పోయే కాలం కాకపోతే మంచికి విలువ లేదు’’ ఇంకెవరోఅన్నారు. ‘‘మంచివాడు అనుకున్నాం! ఇలా మేకవన్నె పులి అనుకోలేదు. సమయానికి గంగాధరంగారు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఓ ఆడపిల్ల జీవితం అన్యాయమైపోయేది కదా!’’ అన్నారు మరొకరెవరో. ఇలా తలా ఒక మాట అంటూ ఉంటే తాను అటు ఇటు చుట్టూ చూశాడు. ఓ పక్కగా తమ పొలం పక్కన పొలం గల రంగయ్య కూతురు భాగ్య ఏడుస్తూ కూర్చొని వుంది. తను ‘‘అక్కా అక్కా’’ అని పిలిచేవాడు. ఏం జరిగిందో చూచాయగా తెలుస్తోంది. నాన్న అక్కను ఏదో చేయబోయాడట. గంగాధరం వచ్చి అడ్డుకున్నారట. ఆ కొట్లాటలో నాన్న మరణించారట. ఇదంతా నిజమేనా? నాన్న అలాంటి వాడా? తన మదినిండా ప్రశ్నలు..... ‘‘సిగ్గులేని జన్మ. నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచేసే రకం. పదండి ఇంకా ఇక్కడే వుండి ఏం చేసేది? ఈ శవాన్ని పాతేద్దాం. ఇంకా ఏం మొహం పెట్టుకుని ఏడుస్తున్నావే? ఇలాంటి మొగుడు ఉంటేనేం? లేకుంటేనేం?’’ ఇలా ఎన్నో మాటలు చుట్టూ ఉన్న జనం లోంచి తూటాల్లా వస్తుంటే అంతటి ఆవేదనలోను ఆశ్చర్యం, అసహ్యం...ఏ రోజూ ఎవరిని ఏమీ అని ఎరుగని, ఏ మాట పడని నాన్నను ఇలా అన్ని మాటలు అంటున్నారు ఎందుకు? ‘‘చూడమ్మా లక్ష్మమ్మా! రంగయ్య పని ఉందని ఊళ్లోకి వెళ్లాడు. పొలం దగ్గర నీ మొగుడు వీరయ్య ఉన్నాడు. ప్రక్క పొలంలోనే భాగ్య కలుపు తీస్తోంది. ఏం బుద్ధి పుట్టిందో ఏమోగానీ కూతురులాంటి భాగ్యను చెరచబోయాడు. అదే సమయంలో నేను పొలానికి వస్తూ ఇది చూశాను. పరిగెత్తి వెళ్లి తోసేసాను. ఇద్దరి మధ్య తోపులాట మొదలైంది. ఆ తోపులాటలో అనుకోకుండా వీరయ్య తల బండరాయికి తాకి పడిపోయాడు. కళ్ళ ముందు ఆడపిల్ల మానం కాపాడటానికి పోతే ఇలా జరిగింది’’ చేతులు కట్టుకుని అన్నాడు గంగాధరం. ‘‘మీరేంటయ్యా! అలా తప్పు చేసిన వాళ్ళలా తలవంచుకొని మాట్లాడుతున్నారు. ఇలాంటి మానవ మృగాన్ని భగవంతుడే శిక్షించాడు. వీడిలాంటి వాడికి పెళ్ళాం అని చెప్పుకోవడం కంటే చావడం మేలు కదా’’ ఇంకెవరో ఎత్తిపొడిచారు. ఏమనుకుందో ఏమో అమ్మ లేచింది. బిగ్గరగా ఏడుస్తూ ఊళ్లోకి పరుగుదీసింది. ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు. ‘’అమ్మా! అమ్మా!’’ అంటూ తను పరువు తీశాడు కానీ అప్పటికే అమ్మ దూరంగా అందనంత వేగంతో వెళుతోంది. అందుకోవాలని తను వేగంగానే పరిగెత్తాడు. కానీ తన కళ్ళ ముందే అమ్మ కట్ట మీద నుండి నిండుగా ఉన్న చెరువులోకి దూకింది. దాన్ని చూడగానే తను కళ్ళు తిరిగి కుప్పకూలిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి స్మశానంలో ఉన్నాడు. రెండు గోతుల్లో ఒకదాంట్లో అమ్మ, మరోదాంట్లో నాన్నని పడేసి ఉన్నారు. లేచి కూర్చున్నాడు. తన చేత మట్టి వేయించారు. అందరూ వెళ్లిపోయారు. తన సంగతి ఎవరికి పట్టలేదు. చీకటి పడే వేళ ఇంటికి వెళ్లాడు. ఇంకా భయమేసింది. ఇంటి ముందున్న రెండు ఎద్దులు లేవు. ఆవు కూడా లేదు. ఇల్లంతా చిందరవందరగా, సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గంగాధరం ఇంట్లో పనిచేసే పాలేరు తమ ఇంట్లో ఉన్నాడు. ‘‘ఒరేయ్! పోరాపో...వస్తే నీవుకూడా నీ అమ్మానాన్నల వద్దకు వెళతావు’’ తాగి వున్నాడు కాబోలు గర్జించాడు. తను భయంతో పరుగులు తీశాడు. చింతచెట్టు దగ్గరకు చేరాడు. పొర్లి పొర్లి యేడ్చాడు. రాత్రంతా అక్కడే పడుకున్నాడు. మర్నాడు ఉదయం లేచాక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆకలి భరించలేకపోయాడు. చెరువు నీళ్ళు తాగి బడికి వెళ్లాడు. ఎవరూ మాట్లాడలేదు ఒక్క సుందరం తప్ప. గట్టిగా హత్తుకొని ఏడ్చాడు. వాడు రహస్యంగా ఇంట్లో నుండి తెచ్చియిచ్చిన రొట్టెను తిన్నాడు. మళ్లీ సాయంత్రం చెట్టు క్రిందకే చేరాడు. ఆరోజు గడిచింది. మర్నాడు సుందరం బడికి రాలేదు. నిన్న రొట్టెలు ఇచ్చాడని ఇంట్లో వాన్ని తన్నారట. తనకి ఏం చేయాలో తెలియడం లేదు. అలాగే ఆకలితోనే మళ్ళీ చెట్టు కిందికి చేరాడు. అలా మరో రెండు రోజులు గడిచాయి. ఆ చెరువు నీరే ఆహారంగా, ఆ చెట్టు నీడే ఆవాసంగా గడిచింది. ఆ రోజు రాత్రి తను పడుకుని ఉన్నాడు. దబ్బుమని శబ్దం వినిపించింది. భయంతో లేచాడు. రోడ్డు మీదుగా వెళ్తున్న కారు ఒకటి వచ్చి చెట్టును ఢీకొంది. కారు హెడ్ లైట్లు వెలుగుతున్నాయి. పరుగున వెళ్ళి చూశాడు. లోపల ఎవరో పెద్దమనిషి ఆయాసపడుతూ ఉన్నాడు. ‘‘నీళ్లు నీళ్లు’’ అని సైగ చేశాడు. తను చెరువు నీళ్లను పరిగెత్తుకొని వెళ్లి తెచ్చి ఇచ్చాడు. ఆయన నీళ్లు తాగి ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నాడు. పదినిమిషాల తర్వాత మామూలు మనిషి అయ్యాడు. బలవంతంగా డోర్ తెరుచుకుని బయటకు వచ్చాడు. ఇద్దరు కలిసి కారును వెనక్కి తోశారు. ఆయన జేబులో చేయి పెట్టి కొంత డబ్బు బయటకు తీసి ఇవ్వబోయాడు. తను వద్దన్నాడు. ‘‘మీ అమ్మానాన్నలకి ఇవ్వు’’ అన్నాడాయన. ‘‘వారు లేరు’’ చెప్పాడు. ‘‘అనా«థవా?’’ జాలిగా అడిగాడు. తను తల వంచుకున్నాడు. ‘‘పద కారెక్కు!’’ అన్నాడాయన స్థిరంగా. తను మరింకేం ఆలోచించలేదు. కార్లోకెక్కి కూర్చున్నాడు. తనెక్కడికి వెళుతున్నాడో తెలియదు. అలసిపోయిన కారణాన బాగా నిద్ర పట్టింది. ఉదయం లేచి చూస్తే ఇంకా కారులోనే ఉన్నారు. బాగా ఆకలిగా ఉందని చెప్పాడతడు. ఇద్దరూ పెద్ద హోటల్లో టిఫిన్ చేశారు. ఆరోజు రాత్రికి ముంబై చేరుకున్నారు. అంత పెద్ద నగరాన్ని అప్పుడే చూడటం. ఒక పెద్ద భవంతిని చేరుకున్నారు. ఆ పెద్దాయన తనను పెద్ద స్కూల్లో చేర్పించారు. నెమ్మదిగా తెలిసింది ఆ పెద్దాయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయని, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని. కానీ వారసులు లేరు. ఉన్న కుమారుడు యాక్సిడెంట్లో పోయాడట. తనని వారసునిగా ప్రకటించారు. తన పేరును విశ్వజిత్‌గా మార్చాడు. కాలం సాగిపోయింది. తను ఎంబీఏ పూర్తిచేశాడు. అన్ని కంపెనీల బాధ్యతలను తనకు అప్పగించి ఆయన కాలం చేశారు. కొత్త బాధ్యతలు ....కొత్త జీవితం.... తన ఊరు, ఇల్లు, పొలం గుర్తుకొచ్చేవి. కాని ఆ చిన్ననాటి సంఘటనలు తలుచుకోగానే ఊరు తనను వెలివేసింది అన్న భావన వచ్చేది. అందుకే ఆ చేదు జ్ఞాపకాలన్నింటిని అణచివేశాడు. తనకు నూతన జీవితం ఇచ్చిన ఆ పెద్దయిన పేరు నిలిచేలా వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. అనుకోకుండా ఓ రోజు ఫేస్బుక్లో చూస్తుంటే సుందరం అని కనిపించి ఉత్సాహంతో వివరాలు చూస్తే రామాపురం అని తెలిసి ఇక ఆగలేక ఫోన్ చేశాడు. తన అమ్మానాన్నలను దూరం చేసిన ఊరిని, తనకు నిలువ నీడ లేకుండా చేసిన ఊరిని ఎప్పటికీ తలచుకోకూడదు అనుకున్నాడు. కానీ ఆ చెట్టు, ఆ చింతచెట్టు తనకు నాలుగు రోజులు ఎవరూ తోడు లేకపోయినా ఆశ్రయం ఇచ్చింది. అందుకే తన జ్ఞాపకాల వరుసలో అది మొదటిగా నిలిచింది. కానీ ఇప్పుడు అది అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది. ఆలోచనలతో పాటు ప్రయాణం కూడా సాగుతూ ఉంది. ∙∙ చింతచెట్టు కింద గ్రామపంచాయతీ వాళ్లు రెండు టేబుల్స్ వేసి మీటింగ్ పెట్టారు. గ్రామస్తులు చాలా మంది వచ్చి కూర్చున్నారు. చివరి వరుసలో సుందరం, విశ్వజిత్ ఉన్నారు. విశ్వజిత్ ఆ చెట్టుని తదేకంగా చూస్తున్నాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతన్ని ఊళ్లో వాళ్ళు పెద్దగా ఎవరు గమనించలేదు. సుందరం బంధువు ఏమో అనుకున్నారు. పంచాయతీ కార్యదర్శి గొంతు సవరించుకున్నాడు. ‘‘ఇంతకు పూర్వం ప్రకటించిన ప్రకారం మన గ్రామంలో ఉన్న ఈ చింతచెట్టు, అది ఉన్న పదిసెంట్ల స్థలం పంచాయతీకి చెందినది. దీన్ని వేలం వేయడం ద్వారా పంచాయితీకి ఆదాయం సమకూర్చుకోవాలి అనుకున్నాం. ఈ స్థలాన్ని లీజుకు తీసుకోవలసిన వారు ఎవరైనా సరే ఈ బహిరంగ వేలంలో పాల్గొని పాడవచ్చు. ముందుగా ప్రభుత్వం వారి పాట పది లక్షల రూపాయలు’’ అన్నాడు. ‘‘పదకొండు లక్షలు’’ ఎవరో ఒకాయన అన్నాడు. ‘‘పన్నెండు లక్షలు’’ ఇంకొకరి పాట. ‘‘పదిహేనులక్షలు’’... ఇక మరెవ్వరూ పాడలేదు. మౌనం రాజ్యమేలుతోంది. పంచాయతీ కార్యదర్శి ‘‘పదిహేనులక్షలు ఒకటోసారి...పదిహేను లక్షలు రెండవసారి’’అన్నాడు. ‘‘కోటిపాయలు’’ విశ్వజిత్ లేచి అన్నాడు. ‘‘కోటి’’ ఆ మాట వినపడగానే అంతా వెనక్కి తిరిగి చూశారు. ‘‘ఈ స్థలానికా అంత సొమ్ము ఇచ్చేది? మూర్ఖత్వం, అంతటి అమాయకత్వం’’ అన్నట్లు పంచాయతీ కార్యదర్శి ముఖం పెట్టాడు. ‘‘అవును. కోటి రూపాయలు’’ మరోసారి అన్నాడు విశ్వజిత్. ‘‘ఎవరు నువ్వు? ఒకేసారి ఎంత అమౌంట్ పాడుతున్నావు?’’ అడిగాడు వీఆర్ఓ. ‘‘అవును నేను స్పష్టంగా చెబుతున్నాను, అక్షరాలా కోటి రూపాయలు. నా పేరు విశ్వజిత్’’ ‘‘విశ్వజిత్ పాట కోటి రూపాయలు. ఒకటవ సారి....కోటి రూపాయలు... రెండవసారి...కోటి రూపాయలు... మూడవసారి.’’ ఇంకా ఎవ్వరూ మాట్లాడలేదు. ‘‘ఈ చెట్టుతో సహా ఈ స్థలం లీజు ఇవ్వబడింది. ఒప్పంద పత్రంపై సంతకం చేయండి. డబ్బును వారంలోగా సమకూర్చండి’’ అన్నాడు పంచాయతీ కార్యదర్శి. ‘‘మీకందరికీ ఆశ్చర్యంగా ఉండవచ్చు. నేనెవరిని? దాన్ని ఎందుకు వేలం పాడానని! నా పేరు విశ్వజిత్. ఇలా అంటే మీకు ఎవరికీ తెలియదు. నేను వెంకట్రామున్ని. అయినా మీకు తెలియదనుకుంటున్నా. ఇరవై అయిదేళ్ళ క్రితం చనిపోయిన వీరయ్య, లక్ష్మమ్మల కొడుకును’’ అన్నాడు. అక్కడ ఉన్న యువకులకు అంతగా అర్థం కాలేదు కాని యాభై అరవై ఏళ్ళ వయసున్న వారికి మాత్రం విశ్వజిత్ మాటలు వినగానే ఉలిక్కిపడినట్లయ్యింది. ‘‘ఓర్నీ! నువ్వు మన వీరయ్య కొడుకువా? ఆరోజు ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. అసలు ఎక్కడికి వెళ్లావు? ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు?’’అడిగారు. ‘‘నేను చెబుతాను. ఈ వెంకట్రాముడి తండ్రి వీరయ్య. చాలా మంచివాడు. అతడి పొలం తనకు అమ్మలేదని కక్ష గట్టాడు ఆనాటి ఊరిపెద్ద గంగాధరం. ఒకరోజు ఆ గంగాధరం ఓ ఆడపిల్లను పాడుచేయబోతే వీరయ్య అడ్డుపడి ఆ పిల్లను కాపాడాడు. అయితే ఆ కొట్లాటను తన కక్ష తీర్చుకోడానికి అనువుగా మార్చుకొనే ఆలోచనతో వీరయ్యను చంపేశాడు. వీరయ్యే పాడు చేయబోతే తాను అడ్డుకొన్నానని ఆ కొట్లాటలో అనుకోకుండా బండరాయి తగిలి చనిపోయాడని కట్టుకథ అల్లాడు. ఆ పిల్లను, వాళ్ళ నాన్నను బెదిరించాడు. తన అంగబలంతో అనరాని మాటలనిపించాడు. అవి భరించలేక వీళ్శమ్మ చెరువులో దూకి చనిపోయింది. వీడు అనాథగా మారాడు. గంగాధరం దుర్మార్గానికి భయపడి అంతా ఏమనలేకపోయారు. యాక్సిడెంట్లో గంగాధరం కుటుంబమంతా దూరమయ్యింది. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్ళీ ఇంకోరోజు ఇదే చెట్టు క్రింద పాడుచేయబోయాడు. అప్పుడు వానపడుతోంది. పిడుగువచ్చి వాడి ప్రాణం తీసింది. ఆ పిల్ల అప్పుడే అందరికీ జరిగింది చెప్పింది. ఊరంతా వీళ్ళకు జరిగిన అన్యాయానికి బాధపడింది.’’ వివరంగా చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు ఒక పెద్దాయన. ‘‘ఈ విషయాలు నాకు నిన్ననే తెలిశాయి. ఏ అవమానభారంతో ఊరు విడిచానో అది తొలగించింది ఈ చెట్టు. ఈ స్థలాన్ని, ఈ చెట్టును ఇతడు ఏం చేసుకుంటాడు అని కదా అనుమానం? ఏమీ చేసుకోను. ఈ చెట్టు నాకు ప్రాణం. అందుకే ఇది కలకాలం ఇలాగే కళకళలాడుతూ ఉండాలి. ఈ చెట్టు కిందే నా బాల్యం గడిచింది. ఈ ఊరి పిల్లల బాల్యమంతా ఈ చెట్టు కిందే గడపాలి. వారికి నేను ఇచ్చే కానుక ఇది. దీన్ని కాపాడుకోవటానికి కోటి కాదు పది కోట్లయినా ఇస్తాను. ఈ చెట్టు నాకు జీవితం ఇచ్చింది. ఈ చెట్టును కొట్టేసి ఇక్కడ వారు పెట్టాలని భావించారట. చాలా బాధేసింది. ఇది ఎందరో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలకు సజీవసాక్ష్యం. దీని బ్రతకనిద్దాం. మన పెద్దలకు గుర్తుగా, ఆచారాలకు సంప్రదాయాలకు సాక్షిగా నిలుపుకుందాం’’ కరతాళధ్వనుల మధ్య అందరికీ నమస్కరించాడు విశ్వజిత్. - డా.టి.సురేశ్ బాబు -
దాసర అంజప్ప కోడి కథ
మా ఊరి పాతకాలపు వయోవృద్ధుల్లో చాలా వృద్ధుడు అంజప్ప. ఏ విషయమైనా చర్చకు వచ్చినప్పుడు నేను వయస్సులో ఉన్నప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది అనేవాడు. ఆ సంఘటనలు చూచినవాళ్లు ఎవరూ ఇప్పుడు బ్రతికి లేరు. ఆ కాలములో అంజప్ప సిపాయిలాగా ఎంతో చురుగ్గా ఉండేవాడట. ఇప్పుడు అతని వయస్సు అడిగితే నూరేండ్లు ఉండవచ్చు అంటాడు. పోయిన పది సంవత్సరముల నుండి అతని వయస్సు నూరేండ్లే. ముఖ్యంగా ఈ కారణంచేత ఏ సందర్భములో నైనా, ఎంతవారికైనా బుద్ధి చెప్పే అధికారం చెలాయిస్తాడు. ఈ విషయములో ఇతరులకు సందేహమేమైనా ఉండవచ్చునేమోగాని తనకు లేశ మాత్రం సందేహం కూడా లేదు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని అంజప్ప చెప్పినపుడు వినకపోతే– ‘‘ఏమయ్యా! మీ తండ్రి పిల్లాడిగా ఉన్నప్పుడే నా గడ్డం నెరిసింది. నా మాటలకు లెక్క లేదా నీకు!’’ అనేవాడు. బహుశా సుదీర్ఘ అనుభవము వల్లనేమో అతను చెప్పిన మంచి/బుద్ధి మాటలు సరైనవిగానే ఉండేవి. వయస్సులో జాంబవంతుడైనట్లే, అంజప్ప బుద్ధిలో హనుమంతుడంతటి వాడు.మూడురోజులకు మునుపు అంజప్ప, రంగప్ప ఇంటికి వచ్చినాడు. మా ఊరి కరణం అయిన రంగప్పను మా తాలూకా బెంచిమేజిస్ట్రేట్గా నియమించినట్లు కొన్ని రోజులు క్రితం ఆజ్ఞలు వచ్చినవి. మా ఊరి కరణంకు న్యాయం చెప్పే అధికారం కలిగినదని, ఊరి ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. చాలా శక్తివంతమైన పదవి, హోదా అని ప్రజల భావన. ఎంత కాదన్నా ఇది సుబేదారు హోదా కలిగిన పదవి కింద లెక్క. పూర్వము ఈ న్యాయాధి కారము సుబేదారు, ఆ పై అధికారులకు మాత్రమే ఉండేది. ఈ ప్రభుత్వం, సుబేదారు నుంచి న్యాయాధికారాలు తీసేసారు అనే భావన. అందుచేత ఒక విధంగా ఈ పదవి సుబేదారు కంటే గురి గింజంత ఎక్కువ పదవి. గ్రామ వయో వృద్ధుడైన అంజప్పకు ఈ విషయం తెలిసి రంగప్పను అభినందించి కొన్ని బుద్ధిమాటలు చెప్పాలని రంగప్ప ఇంటికి వెళ్ళాడు. అంజప్పను చూసి రంగప్ప ‘‘రా అంజప్ప, వచ్చి కూర్చో’’ అని చెప్పాడు. అంజప్ప: నీకు తాలూకా న్యాయాధికారి పదవి వచ్చిందట కదా! చాలా సంతోషం! రంగప్ప: సంతోషమేగాని దాని నుండి నయ్యా పైసా ఆదాయం కానీ జీతం కానీ లేదు. అంజప్ప: జీతం లేదా! ఎందుకు లేదు? రంగప్ప: ఇది గౌరవానికి ఇచ్చే పదవి మాత్రమే. ప్రభుత్వం జీతము ఇవ్వదు. అంజప్ప: జీతము లేకపోతేనేమి? జీతం తీసుకోనివాళ్లు జీతం కంటే ఎక్కువ సంపాదించుకోవడం లేదా! జీతం ఒకటైతే, సంపాదన పదిరెట్లు. రంగప్ప: అదంతా ఆ కాలము. ఇప్పుడు లంచం గించం జరగదు. అంజప్ప: జరిగే వాళ్లకు జరుగుతుంది. జరగదు అంటే లేదు, అంతే. పోనీ ఇప్పుడు నీవు తలుచుకుంటే సుబేదారునే నిలబెట్టి జరిమానా వెయ్యవచ్చా లేదా? రంగప్ప: బెంచి మేజిస్ట్రేట్ అయితే అలానే చేయచ్చు. నేను కరణంకు, సుబేదార్కు జరిమానా విధిస్తే పన్నులు వసూలు కాలేదని పని నుండి పీకేస్తారు. నిజమే కదా అనుకొన్నాడు అంజప్ప. ఓస్! అవును కదా అంటూ తన సంచిలోని తమలపాకులు, వక్కలు తీసుకొంటున్నాడు. తమలపాకులు, వక్కలు అతనిలాగానే మూడు నాలుగు రోజులు వాడిన పాతవి. అప్పుడప్పుడు తమలపాకులు కొనుక్కొంటున్నప్పటికీ, అయ్యో ఇది వృథా అయిపోతుందే అని ఆ వాడిన తమలపాకులే వేసుకొనేవాడు. వాటిని పారవేయడానికి ఇష్టపడేవాడు కాదు. వాడిన తమలపాకులు ఖాళీ అయ్యేసరికి కొత్తగా కొన్నవి కూడా వాడిపోయేవి. ఆ సంచిలో నాలుగు, ఐదు పచ్చ ఆకులు ఉన్నప్పటికినీ వాడిపోయినవే వేసుకొనేవాడు. ఆ సంచిలోని వక్కలు కూడా ప్రత్యేకమే. వక్కలు తమలపాకులతో నమిలి మ్రింగే పదార్థమని అందరి భావన. వక్కలు ముఖ్యోద్దేశం నోటిలో నీరూరేటట్టు చేయటమేగాని తాను నీరవ్వదు. చాలా సమయాల్లో నోట్లో ఉంచుకొని నీరూరిన పిదప, నానిన తర్వాతా ఆకుతో చూర్ణమవుతుంది. నోట్లో వేసుకోగానే మెత్తగా అయిపోతే ఎన్ని వక్కలయితే సరిపోతాయి? అంజప్ప తన సంచిలో నుండి వాడిన ఆకు తీసుకొని, కొంచెం రాసుకొని నోట్లో వేసుకొంటూ ‘‘అదట్లా ఉండనీ! నేను, నీకొక మాట చెప్పాలని వచ్చాను’’ అన్నాడు. రంగప్ప: ఏ విషయం అంజప్ప? నీవు అనుభవజ్ఞుడవు. నావంటి వాళ్లకు తెలియనివి, నీకు తెలిసినవి నూరుంటాయి చెప్పు. అంజప్ప: దానికోసమే నేనొచ్చినది. నీవు బెంచి మేజిస్ట్రేట్ అయినావు కదా! ఎదురున్న మనిషి సత్యవంతుడా కాదా! అని తెలుసుకొని శిక్ష వేయాలి. ఈ పోలీసులు, లాయర్లు చెప్పిన మాటలు విని శిక్ష వేయకూడదు. ఆ విషయం నీకు చెప్పాలనే వచ్చాను. రంగన్న: అది సరే. అయినా సత్యవంతుడా! కాదా! అనేది వాళ్లు, వీళ్లు చెప్పిన మాటలనుండే తెలియాలి. న్యాయాధికారి ఇంకేం చెయ్యగలడు? అంజప్ప: న్యాయాధికారి అన్నాక సత్యం ఎట్లుండవచ్చు? అని యోచన చేయాలి. ఎదురున్న వ్యక్తిని ఏమిటని విచారించాలి. రంగప్ప: అంజప్ప! నీవు కోపగించుకోనంటే ఒకమాట అడగనా? అంజప్ప: ఏమిటో అడుగు, కోపమెందుకు! రంగప్ప: నీ పైన ఎప్పుడైనా న్యాయాధికారికి ఫిర్యాదు జరిగిందా? అంజప్ప: అవును. నేను భాదించబడ్డాను. ఆ విషయాన్నే నీకు చెప్పడానికే వచ్చింది. ఒక కోడి దొంగలించబడినది అని ఫిర్యాదు చేశారు. ఆ దొంగిలించిన వ్యక్తి నేనేనని. దొంగిలించలేదని నేను, కాదు నువ్వే దొంగిలించావని వాళ్ళ వాదన. చివరికి నన్ను నేరస్తుడిని చేశారు. ఇరవై రూపాయాలు జరిమానా కడితే వదులుతామన్నారు! లేకపోతే జైలు అని తీర్పు. జరిమానా కట్టి మానం కాపాడుకొని వచ్చినాను. రంగప్ప: నీవు కోడిని దొంగిలించావని వాళ్లెలా అన్నారు. కోడి నీ దగ్గర ఉన్నదా ఏమి? అంజప్ప: ఉండినది. నా గాచారం. ఆ ముండ కోడి నా దగ్గర ఉన్నందుకే కదా నేను ఇరుక్కున్నది. రంగప్ప: ఇంకా నీవు దొంగతనము చేయలేదంటావా! అంజప్ప: అదే నేను చెపుతున్నది. కోడి నా దగ్గర ఉంది. కానీ దానిని నేను దొంగలించలేదు. రంగప్ప : అలా అయితే విషయము వివరంగా చెప్పవచ్చు కదా... అంజప్ప అప్పుడు చెప్పిన కథ ఇలా ఉంది... ఈ సంఘటన సుమారు నలభై సంవత్సరాల మునుపు జరిగి ఉంటుంది. అప్పుడు అంజప్ప నడి వయస్సు మనిషి. ఆ రోజుల్లో తన కులవృత్తి కోసం ఊరూరూ తిరుగుతూ ఉండేవాడు. అతనిది దాసర జోగి వృత్తి. అంటే అందంగా వేషము వేసుకొని, ఎడమ భుజానికి జోలీ,కుడి భుజానికి ‘తంబుర’ వేసుకొని ముత్తాతల కాలంనాటి నుండి ఉన్న పాటలను పాడుకొంటూ ఊరంతా భిక్ష చేయడం. దాసర జోగి వృత్తి వాళ్లు ముత్తాతల కాలంలో భిక్ష చేసేవారే తప్ప వ్యవసాయం చేసేవారు కాదు. కాలం చెడి ఈ రోజుల్లో దాసర వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. భిక్ష చేయడమనేది నీచవృత్తి అని మనం అనుకోవచ్చు. కానీ ఈ మాటను అంజప్ప ఒప్పుకోడు. ‘‘జోగి అంటే ఏమనుకొన్నావ్? ఊరికే అవుతారా? ఇరవై సంవత్సరాలు తండ్రి జతలోనో, మామ జతలోనో ‘తంబుర’ ఎత్తుకొని తిరిగి, పాడుతూ, పాటల జతకు ఆడుతూ వృత్తి నేర్చుకోవడం అంటే సామాన్యమైన పనా? వ్యవసాయం చేసేటప్పుడు మడక వెనుక నిలబడి జాటి కోలతో ‘చో చో’ అంటే చాలు. పాటలు నేర్చుకోవాలంటే నాలుక అవసరం లేదా? తెలివి ఉండనక్కర లేదా? జ్ఞాపకశక్తి ఉండనక్కర లేదా! ‘ఊ ఊ’ అంటే వచ్చేస్తాయా! లక్ష్మీ అనాలంటే అందరికి నోరు తిరుగుతుందా! దానిని పలకమంటే ‘లక్స్ మీ లక్స్ మీ’ అని వదరుతారు. ద్రౌపది దేవి అనాలంటే నోరు తిరగడం అంత సులభమా! ‘వృత్తి నేర్చుకున్నావు. ఇంక ఫర్వాలేదు. నీ ఒక్కడివే పోయి రావచ్చు’ అని నాన్న చెప్పడానికి నాకు 25 ఏళ్ళు వచ్చినాయి తెలుసా!’’ అంటాడు అంజప్ప. జోగి కావడానికి డిగ్రీ తీసుకోవాలంటే ఎంత కష్టమో అంత కష్టము అని అంజప్ప భావన. అంజప్ప, చుట్టూ ఉన్న అరవై, డెబ్భై గ్రామాలు తిరిగేవాడని తెలుస్తున్నది. జోగి అయినవాడు ఇంటి నుండి బయటకు రావాలంటే అందరి భిక్షువుల్లాగా రావడానికి కుదరదు. నాటకంలో రాజు పాత్ర చేసే వ్యక్తి ఏ విధంగానైతే ముఖానికి రంగు, చెంపకు మీసాలు, నడుముకు రంగులు వేసుకొని వస్తాడో ఆ విధంగా పాడటానికి వెళ్లే జోగి కూడా సంప్రదాయం ప్రకారం అలంకారము చేసుకోవాలి. జోగి వంశస్థులు శైవులు కాదు, వైష్ణవులు కాదు. క్షుద్ర దేవతలను పూజించేవారూ కాదు. వీటిలో దేన్నీ వదిలే వారు కాదు. దానివల్ల అతని ముఖం మీద విభూతి, కుంకుమ, పసుపు మూడూ రాసుకొంటారు. దానితో పాటు జోగి కన్నులు చాలా క్రూరంగా ఉంటాయి. అంతేకాకుండా కన్నులు తీక్షణంగా కనపడాలని కాటుక కూడా పెట్టుకునేవారు. భీముడు, హనుమంతుడి పాత్రలలో మాటలు, పద్యాలు చెప్పేటప్పుడు కన్నులకు కాటుక లేని యెడల, ఆ తీక్షణ దృష్టిగాని జనాలకు తగిలితే అక్కడే మూర్ఛపోతారు. ముఖం అలంకరించుకొన్నట్టే, మూడు రంగులకు తక్కువ లేకుండా చుక్కలు కలిగిన తల రుమాలు పెట్టుకోవాలి. అంజప్ప వయస్సులో చూడటానికి చాలా అందంగా ఉండేవాడు. ఈ వేషం వేసుకొని పల్లె పదాలు చెపుతూ ఉంటే ఆడవాళ్లు తన చుట్టూ మూగేవారు. రెడ్డి ఇంటి ముందు కూర్చొని పద్యాలూ చెప్పేవాడు. నలభై సంవత్త్సరముల మునుపు ఇతని జోగి వృత్తి చాలా ఉచ్చస్థితిలో ఉండేది. అంజప్ప ప్రజలకు చాలా అవసరమైన మనిషి. ఇతను వెళ్లే ఊళ్లల్లో కాళాపుర ఒకటి. కాళాపురము దానికి తగినట్లుగానే అతి పెద్ద ఊరే. అందువల్ల అంజప్ప అక్కడికి వెళ్ళినప్పుడు, రెండు మూడు రోజులు ఉండి వచ్చేవాడు. అంజప్ప బాగా సొగసుగా ఉండేవాడని చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. మధ్య వయస్సులో ఉన్న స్త్రీలతో మాటలాడానికి అంజప్ప వెనుకేసేవాడు కాదు. వీళ్లతో మాట్లాడినందుకు అంజప్పను కోప్పడేవారు ఎవరూ ఉండేవారు కాదు. కానీ చిన్న వయస్సులో ఉన్న స్త్రీలతో మాట్లాడడానికి అంజప్ప కొంచెం వెనుకేసేవాడు. ఇంటి యజమాని చూస్తే– ‘‘ఏమయ్యా జోగి! భిక్షం తీసుకొని పోకుండా ఇంటి ఆడవాళ్ళతో సరసాలాడుతున్నావా! పద బయటకు’’ అనేవారు. తెలిసినవాళ్లు చూస్తే ‘‘ఏమి జోగప్ప పర్వాలేదే!’’ అని నవ్వేవారు. భిక్షతో జీవించే మనిషికి ఈ రెండు మూడు మాటలు కూడా బాధించేవే. కాళాపురము ఒకసారి వెళ్ళినప్పుడు, ఆ ఊరి రెడ్డి భార్య అంజప్పను కూర్చోబెట్టుకొని పద్యాలు చెప్పమని అడిగిందట. రెడ్డిగారికి ఆమె మూడవ భార్య. పద్యాలు చెప్పిన తర్వాత అంజప్పకు ఆకు,వక్కలు ఇచ్చినదట. ఆకు,వక్క వేసుకోవాడానికని కొంచెం సమయం అక్కడనే కూర్చొన్నాడట. మధ్యలో రెడ్డి వచ్చి అంజప్పపై చాలా కోప్పడ్డాట. అంజప్ప తిరిగి బదులు చెప్పేరకం కాదు. రెడ్డి కొన్ని తప్పుడు మాటలు వాడినందువల్ల అంజప్పకు కోపం వచ్చింది. ‘‘నీవు మాన,మర్యాద ఉన్న మనిషి అయితే నీ భార్యకు మంచీచెడ్డ చెప్పుకో, అంతేగాని నన్నెందుకు తిడుతారు!’’ అన్నాడట. ‘‘జాగ్రత్తగా ఉండు జోగి. ఏదో ఒకరోజు బలైపోతావ్’’ అన్నాడట రెడ్డి. అంజప్ప కూడా తిరిగి రెండు మాటలు అనేసి, అక్కడి నుండి లేచి బయలుదేరి వెళ్లిపోయాడట. ఇది జరిగిన తర్వాత కూడా ఒకటి రెండుసార్లు కాళాపురం వెళ్ళాడు. కానీ విశేషమేమియు జరగలేదు. మూడోసారి వెళ్ళినప్పుడు ఆ ఊరి రచ్చబండ దగ్గర కూర్చొని ఏవో చాటు పద్యాలు చెబుతుండగా ప్రక్కనున్న ఇంట్లోని ఒక యువతి ఇంటి ముంగిట్లో నిలబడుకొని పద్యాలు వింటూ ఉన్నది. పద్యాలు చెప్పడం ముగిసి బయలుదేరే స్థితిలో ఉండగా అప్పుడు అంజప్పని పిలిచి కొంచెం భిక్షమేసింది. మరురోజు అంజప్ప ఆ ఇంటి దగ్గరికి వెళ్లి పద్యాలు చెప్పడం ప్రారంభించాడు. ఆ యువతి అంజప్పను పిలిచి తన ఇంటిదగ్గర కూర్చోబెట్టుకొని పద్యాలు చెప్పించుకొని భిక్ష ఇచ్చింది. అది ఆ ఊరిలో కలిగి ఉన్న పెద్దఇల్లు. ఆ యిల్లు ఎవరది? ఆ యువతి ఎవరు? ఎవరి బిడ్డ? అని విచారించాడు. ఎవరిదో ఇల్లు! ఆ ఇంటిపేరు గుర్తులేదు. వాళ్ళు పుణ్యవంతులు. ఆ యువతి భర్త పనీ పాటా లేకుండా ఊర్లు తిరిగే రకం అట. ఆ యువతి అంత మంచిదేమీ కాదట. అది అంజప్పకు అప్పుడు తెలియదు. ఆ ఇంటిలో ఆ యువతి, ఆమె భర్త, అత్తా ముగ్గురే ముగ్గురు. వాళ్ళు కోళ్లు పెంచుకొంటూ ఉండేవారు. కోళ్ల వ్యాపారం చేసేవారట. ఆ తర్వాత అంజప్ప కాళాపురానికి వెళ్ళినప్పుడు మరలా ఆ యువతి ఇంటికే వెళ్ళాడు. ఆమె చాలా అందమైనది. అంజప్పకి ఏ చెడు ఉద్దేశ్యమూ లేదు. కాని తన పద్యాలను బాగా మెచ్చుకొనటం చేత, తనకు మరలా పద్యాలు చెప్పి, తను సంతోషపడితే చూడాలనేది ఇతని కోరిక. చుట్టూ చేరిన ప్రజలందరికి పద్యాలు, పాటలు చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ వెళ్లిన తరువాత అంజప్ప ఆ యువతి ఇంటి దగ్గర ఆకు వక్క వేసుకొంటూ కూర్చొన్నాడు. కొంతసేపటికి ఆ యువతి ద్వారం వైపు వచ్చి– ‘‘జోగప్ప, నీవు ఈ ఊరి నుంచి వెళ్ళేటప్పుడు ఇట్లా వచ్చిపో’’ అనింది. ‘‘ఎందుకమ్మా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను’’ అన్నాడు అంజప్ప. ‘‘నీ పద్యాలు విని చాలా సంతోషమయినది. నీకేమైనా ఇవ్వాలని చాలాసార్లు అనుకొన్నాను. అయితే తీసుకొన్న వెంటనే వెళ్లిపోవాలి. మా అత్తకు తెలిస్తే జగడం చేస్తుంది’’ అనింది. అంజప్పకి తీసుకొనేదానికి భయం.వద్దు అనే దానికి ఇష్టంలేదు. కానీ ఇతను ఏదోఒకటి చెప్పే లోపలే ఆ యువతి ఇంట్లోకి వెళ్లి ‘‘జోగప్ప! ఇక్కడకు రా!’’ అన్నది. అంజప్ప లోపలికెళ్ళాడు. ఆ యువతి ఒక కోడిని తన జోలె లోపల వేసి ‘‘వెళ్ళు! వెళ్ళు!’’ అన్నది. ఎందుకు? ఏమి? అని ఏమీ ఆలోచన చేయకుండా బయటకు వచ్చాడు. ఇప్పుడెవరైనా పట్టుకొంటే తన గతి ఏమి? అని అంజప్పకు గుండె దడదడ కొట్టుకొన్నది. ఆ యువతి లోపలినుంచి ‘‘భద్రం! జోగప్ప! నేను ఇచ్చినట్లు ఎవ్వరికి చెప్పకు సుమా’’ అని చెప్పినది. అంజప్ప ఊరు దాటుకొని మైలు దూరంలో ఉన్న ఒక బావి వరకు జోరుగా నడచి వచ్చి అక్కడి చెట్టు నీడలో కూర్చొని జరిగిన సంఘటనని గుర్తు చేసుకొంటూ ఆకు వక్క వేసుకొంటున్నాడు. దానిమ్మపండు లాంటి భార్యను ఇంట్లో పెట్టుకొని, ఆ యువతి భర్త పనీ పాటా లేకుండా సోమరిపోతులాగా ఊళ్లు తిరుగుతున్నాడు అని అతనికి ఆలోచన వచ్చింది. అంజప్ప ఈ విషయమంతా మనస్సులోనే తలచుకొంటూ అక్కడ ఉండటం క్షేమం కాదనే విషయాన్నే మరిచాడు. కొంచెం సమయం అయిన తర్వాత ఎవరో ఒకతను ఊరి ప్రక్కనుండి వచ్చి ఇతని దగ్గర∙నిలబడి ‘‘ఏమి జోగిప్పా కూర్చున్నావు?’’ అన్నాడు. అంజప్ప ‘‘ఆ! కూర్చున్నాను స్వామీ’’ అన్నాడు. ఊరతను ‘‘జోలీ నిండినదా’’ అని అడిగాడు. అంజప్ప ‘‘సాధారణమే’’ అన్నాడు. ఊరతను ‘‘ఇవి రాగులా ఏమి?’’ అని జోలె తెరిచి చూచాడు. దానిలో కోడి ఉంది. ఊరతను– ‘‘ఇదేమిటి కోడి ఉందే!’’ అన్నాడు. జోగికి గుండె ఝల్లుమంది. ‘‘అవునయ్యా! ఏదో ఒక ఇంటిలో ఇచ్చారు’’ అన్నాడు. ఇంకా మాట్లాడుతూ కూర్చొంటే ఏమేమి చర్చకు వస్తాయోమోనని లేచి జోలిని భుజానికి తగిలించుకొని బయలుదేరడానికి సిద్ధం అయ్యాడు. ఈలోగా ఊరి ప్రక్క నుండి ఒక వయస్సైన స్త్రీ జతగా ఎవరినో ఒకరిని తీసుకొని జోరుజోరుగా ఇతనికి దగ్గరగా రావడం గమనించాడు. వారికి కొంచెం దూరంలో ఇతనికి కోడిని ఇచ్చిన యువతి కూడా వస్తున్నది. అంజప్పకు కాళ్ళు కట్టిపడేసినట్లై ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. దేనికోసం వస్తుందో తనకు అర్థమైనది. నిలబడి ఆ యువతి వస్తున్న వైపే చూస్తూ ఉండగా ‘కోడి ఇచ్చిన సంగతి చెప్పవద్దు’ అని దూరం నుండే చేత్తో సైగ చేసింది. ఆ ముదుసలి దగ్గరకు వచ్చి ‘‘ఇతనేనా ఆ జోగి?’’ అని అడిగింది. ఆమె జతలో వస్తున్న మనిషి, ఆ ఊరి తలారి అవునని చెప్పాడు. ఆ ముదుసలి ఇతనిని ‘‘మా కోడిని ఏమైనా చూసావా?’’ అని అడిగింది. అంజప్ప ‘‘అదేదో పాడుకోడి నాకు తెలియకుండానే నా జోలీలోకి వచ్చియున్నది. ఇప్పుడే ఈ మనిషి చెప్పాడు’’ అన్నాడు. మొదట వచ్చిన వ్యక్తి ‘‘ఎవరో ఇచ్చారన్నారంటివే?’’ అన్నాడు. ‘‘అయ్యో రామా! నా జోలీలో పిడికెడు బియ్యం వేసేదే గొప్ప, అటువంటిది కోడినిస్తారా!’’ అన్నాడు అంజప్ప. వచ్చిన తలారి జోలెను తీసిచూసాడు. లోపల కోడి మూర్ఛపడి ఉన్నది. ముసల్ది ‘‘పర్వాలేదే! ఏదో పద్యాలు చెపుతున్నాడులే అని ఇంటి ముందు ఉండనిస్తే కోళ్లను ఎత్తుకుపోయే పని కూడా మొదలపెట్టావా!’’ అన్నది. ‘‘పద ఊళ్లోకి, రెడ్డికి చెపుతా. భలే ఉంది జోగివృత్తి’’ అంటూ అంజప్ప బాగా తిట్టి పోసింది. ‘‘నేను కోడిని దొంగిలించ లేదు. మీ కోడి అయితే నీవు తీసుకొనిపో! నాతో రచ్చకు రావద్దు’’ అన్నాడు అంజప్ప. ‘‘ఏమయ్యా! కోటేశ్వరుడిలా మాట్లాడుతున్నావు. దొంగిలించకుంటే కోడి నీ దగ్గరకు ఎలా వచ్చింది?’’ అని అడిగింది ముసల్ది. ఆమె యువతి వైపుకి తిరిగి ‘‘ఇది మన కోడి కదా’’ అనింది. యువతి మనది కాదనీ కానీ, అవుననీ కానీ చెప్పకుండా జోగప్ప ఎక్కడైనా కొనుక్కొని ఉండవచ్చు అన్నది. తలారి ‘‘ఈ మాటలన్నీ ఎందుకులే! ఊరి రెడ్డి దగ్గరకు పోదాము. విషయం అంతా చెపుదాము. అతను న్యాయం తేలుస్తాడు’’ అన్నాడు. రెడ్డికి తన మీద కోపం ఉంది! అనే విషయం అంజప్పకు తెలుసు కదా ‘ఇదేమి కర్మరా!’ అనుకొంటూ వారితో వెళ్ళాడు. అక్కడ జరిగినదంతా చెప్పి ప్రయోజనము లేదు. ఎందుకంటే ఊరిలో ముందు కోళ్లు పోగొట్టుకొన్న వాళ్ళు, పోగొట్టుకోని వాళ్ళు అందరూ జోగప్ప పోయిన సారి వచ్చినప్పుడు ‘‘మాది కూడా ఒక కోడి కనపడకుండా పోయింది’’ అని చెప్పుకొంటున్నారు. రెడ్డి గారు వచ్చారు. ‘‘ఏమి! జోగి, ఇన్నిరోజులు చెప్పింది కాదు పద్యాలు. ఇప్పుడు జైలుకు పంపుతాను. అక్కడ చెప్పుకో పద్యాలు’’ అన్నాడు. పోలీస్‌స్టేషన్ చాలా దూరమేమీ లేదు. ‘దొంగతనం చేశాడు’ అని పత్రం రాసి కోడితో సహా పంపాడు. అక్కడ ప్రశ్న, సమాధానాలన్నీ జరిగాయి. అంజప్ప విచారణరోజు కోర్టుకు హాజరవుతానని చెప్పి జామీను మీద ఊరికి వచ్చేశాడు. విచారణ జరిగింది. విచారణ చేయడానికి ఏముంది? ముసలమ్మ ఇంట్లో కోడి పోయిందనేది వాస్తవం. ఆ కోడిని తను కనుక్కొన్నది. అది జోగప్ప దగ్గర దొరకడం నిజం. దానికి ముగ్గురు మనుషులు సాక్షులుగానూ ఉన్నారు. మేజిస్ట్రేట్ ‘‘నీవు చెప్పేదేమైనా ఉంటే చెప్పవచ్చు ’’ అన్నారు. అంజప్ప: ఎక్కడో పద్యాలు చెప్పుకొంటుండగా వెచ్చగా ఉంటుందని కోడి జోలీ లోపలకు వచ్చి ఉండవచ్చు. ఆ విషయం నాకు తెలియదు. తెలియకుండా తెచ్చాను. మేజిస్ట్రేట్: ఏమి కథలు చెపుతున్నావా! కోడి వచ్చి తనకు తానే నీ జోలె సంచిలో కూర్చోగలుగుతుందా! నిజం చెప్పు? అంజప్ప: స్వామీ! నేను సత్యమునే చెపుతున్నాను. మీరు చెప్పిన ఏ దేవుని మీదైనా ప్రమాణం చేస్తాను. నేను కోడిని దొంగిలించలేదు. మేజిస్ట్రేట్: నీవు కోడిని దొంగిలించలేదంటున్నావు. కోడి దానికదే జోలీలోనికి రావడానికి వీలు కాదు. ఎవరైనా ఇచ్చారా? ‘‘ఆ యువతి ఇచ్చింది’’ అని చెప్పాలని నోటి దాకా వచ్చింది. కానీ ఆమె ‘ఎవ్వరికీ చెప్పొద్దూ’ అని చెప్పి ఉన్నది. ఆ తరవాత నాకు సైగనూ చేసి ఉంది. అంతా జ్ఞప్తికి వచ్చిందో! ఏమో పాపం. ఏదో మోహములో ఒక కోడిని ఇచ్చింది. ఆమెను ఎందుకు పట్టు పట్టించాలనే యోచన వచ్చి ఆ మాట చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ‘‘ఏదైనా చెప్పుకోవలసినది ఉందా?’’ అని మేజిస్ట్రేట్ అడిగాడు. అంజప్ప: ఏమి చెప్పలేదు. బుద్ధి కర్మానుసారిణి. నిజమేమిటో మీకు ఆ దేవుడే తెలియజేయాలి. నేను దొంగిలించలేదు. మేజిస్ట్రేట్: నీకు సాక్షులెవరైనా ఉన్నారా? అంజప్ప: అయ్యో స్వామీ! నా కెవ్వరు సాక్షి! దేవుడే సాక్షి. మేజిస్ట్రేట్ ‘‘దొంగిలించినప్పటికి ఎంత అమాయకంగా మాటలాడుతున్నావో’’ అని చెప్పి ఇరవై రూపాయలు జరిమానా లేదంటే పదిహేను రోజులు జైలు శిక్ష అని తీర్పు చెప్పాడు. అంజప్ప జరిమానా కట్టి చింతా వదనంతో ఊరికి వచ్చాడు. ఇది జరిగి నేను చెప్పినట్లే నలభై సంవత్సరముల పైనే అయింది. అంజప్ప ఇది చెప్పి ‘‘మెజిస్ట్రేట్ పదవి అంటే ఏమనుకొంటున్నావ్? నేరస్తులను శిక్షించటం, సత్యవంతులను కాపాడటం దేవుని పని. ఆ పని, మనిషి చేతికి వచ్చినప్పుడు మనిషి దేవుడి లాగా నడుచుకోవాలి. పెద్దా చిన్నా అంటే ఎంతో భయంగా ఉండాలి. ఆ మేజిస్ట్రేట్ నాకు బేడీలు వేయమనడం మాత్రం అన్యాయం’’ అని అన్నాడు. ∙∙ రంగప్ప: నీవు చెప్పివుంటే సరే! ఏమి జరిగినదని నీవు చెప్పకుండా పోతే! మేజిస్ట్రేటుకు ఎట్లా తెలుస్తుంది? అంజప్ప: చెప్పిన దాని బట్టే న్యాయం చెప్పడానికైతే, మీ అంత బుద్ధిమంతులు ఎందుకు? సత్యం ఏదీ అని తెలుసుకోవటం మేజిస్ట్రేట్ పని. రంగప్ప: ఆ యువతి మర్యాద కాపాడాలనే ఉద్దేశ్యంలో జరిమానా కట్టాల్సివచ్చినది. సర్లే, ఏదో జరిగింది వదిలేయ్. అంజప్ప: అయ్యో! అదెందుకు అడుగుతావ్? తాను ఎవరనితోనో స్నేహంగా ఉండేదట. మునుపు రెండు మూడుసార్లు అతనికి కోడి ఇచ్చిందట. దాని అత్తా, కోడి ఏమైంది, కోడి ఏమైంది! అని అడుగుతూ ఉండేదట.ఎవరో దొంగలించింయుడవచ్చు అని ఆ ముసలిదానికి చెపుతోందట. ఆ అత్తా నమ్మిందట. బహుశా ఫలానా మనిషి దగ్గర ఉండవచ్చని చెపితే తన తప్పు బయట పడకపోవడమే కాకుండా తన మీద అత్తకు నమ్మకం కుదురుతుంది కదా అని, ఇదంతా ఆ యువతే చేసిందని తర్వాత నాకు తెలిసింది. రంగప్ప: ఏమీ! ఆ యువతి నీకు కోడినిచ్చి, తానే అత్తకు చెప్పిందా! అంజప్ప: ఓస్! అలానే జరిగినది. అత్త వచ్చి, కోడి ఎక్కడ అనింది. కోడలు నాకు తెలియదు అన్నది. అట్లాఅయితే ఏమైయుండవచ్చు. ఇక్కడకు ఎవరైనా వచ్చినారా! అని అడిగిందట. కోడలు నాకు తెలియదన్నది. ఆ తర్వాత ఎవరో జోగప్ప వచ్చి పోయినాడు అనింది. ప్రక్కింటి వాళ్ళు ‘అవును జోగి ఇప్పుడే చాలా జోరుగా పోతూ ఉన్నాడు’ అన్నారట. కాలమహిమ నేను దొరికి పోయాను. రంగప్ప: ఈ విధంగా చేయవచ్చా అని ఆ యువతిని అడగలేదా! అంజప్ప: అప్పుడు మీరంతా చిన్నపిల్లలు. నేను వయస్సులో ఉన్నవాడిని. ఆ ప్రాయంలో జరిగినవి ఇప్పుడు ఎందుకు లే! పోవడం, అడగడం అన్నీ జరిగినవి... రంగప్ప: సరే వదిలేయ్. నా దగ్గరేమైనా తప్పున్నట్లు అనిపిస్తే చెప్పు. నిజమేమిటో సరిగా తెలుసుకొంటాను. అంజప్ప: ఇప్పుడు నా న్యాయాధిపతి, నా తండ్రి తిరుపతి వెంకటరమణస్వామి. తిరుపతి పోవాలి. తన ముందు నిలబడి ఏదో తప్పు జరిగిందని కాళ్ళావ్రేళ్ళా పడాలి. ఆ దేవుడే నన్ను కాపాడుతాడు! అంజప్ప ఇంకొంత సేపు కూర్చొని ‘‘ఏమయ్యా! నీవు మేజిస్ట్రేట్ అయినదానికీ ఒక ఆకు వక్క అయినా ఇవ్వచ్చుగా?’’ అన్నాడు. రంగప్ప పిల్లలతో తెప్పించి అతనికి కొంచెం ఆకులు, వక్కలు ఇప్పించాడు. అంజప్ప దానిని తీసుకొని ‘‘ఆ! నేను చెప్పినదంతా గుర్తు పెట్టుకో! ఇంక బయలుదేరుతాను’’ అని చెప్పి వెళ్ళాడు. కన్నడ కథ: మాస్తి వెంకటేష్ అయ్యంగార్ అనువాదం: పి.వెంకటరెడ్డి -
బాపూ తెచ్చిన గిఫ్ట్ అది
‘బాపూ.. ఈసారి అచ్చేటప్పుడు టేప్‌రికార్డ్ (టేప్‌రికార్డర్) తేవే. ఊకే లక్ష్మయ్యబాపోళ్లింటికొచ్చి మాట్లాడుడు మంచిగనిపిస్తలేదు’ ‘అగో.. మేమేం అన్నమావోయ్.. గట్ల జెప్తున్నవ్ మీ బాపుతోని?’ ‘యే... గా పోరడు మాటలు వట్టించుకుంటావానోయ్? టేప్‌రికార్డ్ మీద షోకుతోని ఆల్ల బాపుకి గట్ల జెప్తుండు. నువ్వేందిరా పొల్లగా..సోల్ది వెడ్తున్నవ్ మెల్లగా?’ అంటూ వీపు మీద ఒక్కటి చరిచిన శబ్దం. ‘ఏ.. అమ్మ నువ్వూకో.. అన్నా.. నువ్వు పక్కకు జరుగు’ ‘ఆ.. దా... మాట్లాడు.. ’ ఎక్కసెక్కం. ఇంతలోకే పక్కకు తోసేసి ముందుకు వచ్చి గొంతు సవరించుకున్న శబ్దం.. ‘బాపూ.. మంచిగున్నవానే! టైమ్‌కి తింటున్నవా? ఎండలెక్కువైనయంట కదా.. పేపర్ల చదివిన. బాపూ ఒకవేళ సద్ది ఖరాబైతే తినకే. పడేయ్. ఇంటున్నవా? పైలమే. ఇగో.. అన్న ఏమేమో జెప్తడు ఈసారి టేప్‌రికార్డ్ తీస్కరా.. వాచీ తీస్కరా అన్కుంట. గవ్వేం బట్టిచ్చుకోకు. నేను మంచిగనే సదువుకుంటున్న. మల్లా జెప్తున్నా.. ఖరాబైన సద్ది తినకే.. పడేయ్’ ‘సాల్తియ్ చెప్పినకాడికి. పక్కకు జరుగు. ఇగో.. మీ షిన్నమ్మోల్ల అత్త షెప్పంపింది.. ఈ దీపావళికి మీ బామ్మర్దికి ఉంగురం వెట్టాల్నట. నువ్వు పంపిస్తెనే పెట్టుడు.. లేకపోతే నువ్వే ఆల్లకు సముదాయించుకో. మీ పెద్దమ్మి పెనిమిటికి ఏం బెట్టలేదు. గిప్పుడు షిన్నమ్మికి మొగడికి వెడితే పెద్దమ్మి ఊకుంటదా? నువ్వే ఇచారం జేస్కో ?’ అని ఇంకేదో చెప్పబోతుండగా.. ‘అమ్మా.. గా జోలి ఎందుకిప్పుడు? బాపుకి లేనిపోని అల్లర వెడ్తవా ఏందీ?’ ‘అగో..పెద్దోల్లనడుమ నువ్వెందే దీపా? షిన్నదాన్వి షిన్నదాన్లెక్కుండు’ ‘ గాల్లింటి ముచ్చట నీకెందుకు మరి? బీడీల షాట పక్కకు వెట్టి అన్నం బెట్టుపో.. లెవ్.. ’ ‘బాపూ. బా.......పు... ఎ....ప్పు.....డు... ’ అంటూ క్యాసెట్లో రీలు అరిగిపోయిన సంకేతం. కాసేపటికి అదీ ఆగిపోయింది. ఆ సంభాషణంతా ఆత్రంగా వింటున్న పదిహేనేళ్ల సంహితకు ఆ డిస్టర్బెన్స్ చిరాకు పుట్టించింది. ఏం చేయాలో తెలీక స్టాప్ బటన్ నొక్కి దాని హ్యాండిల్ పట్టుకొని ‘అమ్మా.. ’అని గట్టిగా పిలుస్తూ హాల్లో ఉన్న తల్లి దగ్గరకు వెళ్లింది. ‘ఏంది నీ లొల్లి?’ అడిగింది అమ్మ. ‘టేప్రికార్డర్లో క్యాసెట్ స్ట్రక్ అయినట్టుంది?’ ఏడుపు మొహంతో సంహిత. ‘ఓయ్.. ఏంచేశావ్ దీన్ని? నాకోసం మస్కట్ నుంచి మా బాపు తెచ్చిన గిఫ్ట్ తెలుసు కదా?’ బెదిరించినట్టుగా అంటూ కూతురు చేతుల్లోంచి టేప్‌రికార్డర్‌ను తీసుకుంటూ తన గదిలోకి నడిచింది ఆమె. తెలుసు అన్నట్టుగా తలూపుతూ తల్లి వెనకాలే వెళ్లింది. మంచమ్మీద కూర్చుంటూ టేప్రికార్డర్లోని ఎజెక్ట్ బటన్ నొక్కింది ఆమె. రీల్ అంతా చుట్టుకుపోయి క్యాసెట్ బయటకు రాలేదు. కింద మోకాళ్ల మీద కూర్చోని తను చేస్తున్న పనినే కుతూహలంగా చూస్తున్న కూతురునుద్దేశించి ‘ఇది మంచిగైంతర్వాత వినొచ్చుగని.. అప్పటిదాకా చదువుకో.. పో’ అన్నది ఆమె.. ఆజ్ఞాపిస్తున్నట్టుగా . ‘ఊ...’ అంటూ విసురుగా లేచి అలిగినట్టుగా పాదాలను నేలకేసి కొడ్తూ తన గదిలోకి వెళ్లిపోయింది సంహిత. నిట్టూరుస్తూ చేస్తున్న పనిమీదకు దృష్టి మరల్చింది మళ్లీ. రీల్ తెగిపోకుండా మెల్లగా బయటకు తీసి.. పక్కనే రీడింగ్ టేబుల్ మీదున్న పెన్ ఫోల్డర్లోంచి ఓ పెన్ను తీసి క్యాసెట్ చక్రాల్లో పెట్టి తిప్పింది. రీల్ అంతా క్రమంగా చుట్టుకోవడం ప్రారంభించింది. ఆమె జ్ఞపకాలు కూడా. ఆ ఇంట్లోంచే కాదు వాళ్లూరు నుంచే గల్ఫ్‌కు వెళ్లిన ఫస్ట్ పర్సన్ తన తాత . ఊర్నుంచి బస్‌లో బొంబైకి .. అక్కడ్నించి ఓడలో దుబాయ్‌కి పోయిండని. ‘ఎప్పుడో మూణ్ణెలకు ఒక్కపారి లెటర్ రాపిచ్చేటోడు బిడ్డా..’ అని నానమ్మ చెప్పిన మాట గుర్తుగురాగానే టేప్‌రికార్డర్ మంచం మీద పెట్టి.. మంచం కింద ఉన్న సందుగ బయటకు లాగి..ఆ పెట్టెను తెరిచింది. అందులోంచి రంగు మారిన రెండు మూడు ఉత్తరాలు, ఒక క్యాసెట్‌ను తీసుకుంది. అలాగే మంచం మీద కూర్చుని క్యాసెట్‌ను ఒళ్లో పెట్టుకొని.. ఒక ఉత్తరం మడత విప్పింది. ఆ మడతలోంచి మరో కాగితం మడత ఆమె ఒళ్లో పడింది. ముందు ఆ కాగితం తీసింది. అది తన బాపమ్మ .. తాతకు రాయించి.. ఎవరిచేతనో దుబాయ్‌కు పంపించాలని పెట్టిన ఉత్తరం. వెళ్లేవాళ్లు లేక అది అలాగే ఉండిపోయింది. చిన్నత్తమ్మ పెద్దమనిషి అయినప్పుడు ఆ సంగతి తాతకు చెప్పేతందుకు రాపిచ్చింది. అప్పటికే పెద్దత్త పెద్దమనిషై మూడేండ్లయిందట.. ఆ పిల్లనే పెండ్లికాక ఇంటిమీదున్నది.. ఇక షిన్నపిల్ల కూడా అయిందని ఊర్లె తెలిస్తే ఇకారం అని ఆ సంగతి ఎవ్వరికీ తెల్వనియ్యద్దని.. ఇంట్లదింట్లనే ఫలహారాలు చేస్కుంటమని తాతకు జెప్తూ రాయించిన ఉత్తరం. అది చదువుకొని నవ్వుకుంది ఆమె. ఆ ఉత్తరం రాసిన మనిషి అప్పటి సర్పంచ్. ఇంటికి వొయ్యి ఆ సంగతి ఆయన తన భార్యకు చెప్తే. ఆమె ఊరంతా చెప్పిందట.. లాస్ట్కొస్తే చిన్నత్తమ్మ ఫంక్షన్‌కి రెండు యాటలు తెగినయట. ఇది చెప్పుకుంట బాపు మస్తు నవ్వెటోడు. ‘బాపు’ అనుకోగానే తన ఒళ్లో ఉన్న క్యాసెట్ గుర్తొచ్చింది. గబగబా దాన్ని టేప్రికార్డ్లో పెట్టి ‘ప్లే’ నొక్కింది. గుర్ మంటూ సన్నగా శబ్దం చేస్తూ తిరగడం మొదలుపెట్టింది అది. ‘అయిదు అంతస్తుల మీద కెంచి వడ్డ. గట్లెట్లవడ్డనో అర్థమయితలేదు బిడ్డా... ఎప్పట్లెక్కనే మస్కున్నే వోయిన పనికాడికి. హుషార్గనే ఉన్నా.. పదకొండు గొట్టింటుంది బిడ్డా టైమ్.. ఎండ పాడైపోను.. మస్తుగెల్లింది’ నీరసంగా ఉంది ఆ గొంతు. ‘ఆ ఎండకో.. మరేంటికో తెల్వదు బిడ్డా.. ఒక్కపారిగా చెక్కరచ్చినట్టయింది.. గంతే ఏమైందో తెల్వదు.. తెల్వికొచ్చేపరికల్లా.. దవాఖాన్లున్న. నడుము బొక్క ఇర్గిందంట్రు బిడ్డా...నడ్సుడు బందేనట నేను. సచ్చేదాక గిట్ల మంచంలనే అంటున్రు..’ మూలుగుతూ సాగుతోంది ఆ స్వరం. ‘మల్ల మిమ్లను జూస్తనన్న ఆశైతే లేదు. నువ్వు మంచిగ సదువుకో బిడ్డా.. టీచర్ గావాలే. మీ తాత తర్వాత మనూర్లెకించి మళ్లా అవుటాఫ్కచ్చింది నేనే. గట్ల నువ్వు కూడా ఫస్టుండాలే బిడ్డా. మనూరి ఆడివిల్లల్లందరి కంటే బగ్గ సదుకోవాలే నువ్వు. టీచర్‌వి కావాల్రా బిడ్డా.. అమ్మను, అన్నను సూత నువ్వే జూసుకోవాల...’ ఇక వినలేక స్టాప్ బటన్ నొక్కేసింది. దుఃఖం ఆగట్లేదు. ఆ టేప్రికార్డ్ను హత్తుకొని ఏడుస్తోంది. ఆ గది గుమ్మం దగ్గరుండి అంతా విన్న సంహిత.. తల్లి దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఆమెను వాటేసుకుంది. ‘తాత భయపడ్డట్టుగానే అమ్మవాళ్లను అతను చూడలేదు మళ్లీ. మస్కట్లోనే ప్రాణాలు వదిలాడు. తాత ఫైనల్ రిచ్యువల్స్ కూడా ఇండియాలో జరగలేదు. కాని అమ్మ.. గ్రేట్. తాత విష్ను ఫుల్‌ఫిల్ చేసింది. టీచర్ కాదు.. ప్రొఫెసర్ అయింది. వాళ్ల ఊరి నుంచి లండన్ వచ్చిన ఫస్ట్ పర్సన్... అమ్మ. మా అమ్మ’ అనుకుంటూ తల్లిని మరింతగా కరుచుకుపోయింది ఆ పిల్ల. -
ఆ రాత్రే కాదు.. అయిదు నెలలుగా లేడు
ఒళ్లో బిడ్డను ఎవరో తీసుకుంటున్నట్టనిపిస్తే అదిరిపడి కళ్లు తెరిచింది పద్మ. పక్కసీట్లోని ఆవిడ చేతుల్లో ఉంది బిడ్డ. గుక్కపట్టి ఏడుస్తోంది. చీరచెంగుతో మొహం తుడుచుకొని నిద్రమత్తు వదిలించుకుంటూ బిడ్డను తీసుకుంది పద్మ. ‘నాయమ్మ కదా.. ’ అంటూ భుజాల మీదుగా పమిటను లాక్కుని కిటికీ వైపు కాస్త ఓరగా తిరిగి బిడ్డకు పాలు పట్టడం మొదలుపెట్టింది. పాప పాలు తాగుతూంటే పిల్ల తల నిమురుతూ కిటికీలోంచి మేఘాలను పరికిస్తోంది పద్మ. ఏదో ఆలోచిస్తూన్నట్టున్న పద్మనే చూస్తోంది పక్కసీటావిడ. పద్మ కాస్త ఇటు తిరుగుతే ఆమెతో మాట కలపాలని. నిజం చెప్పొద్దూ.. పద్మ ఒళ్లో బొద్దుగా మెరిసిపోతున్న ఆ బిడ్డ భలే నచ్చింది ఆవిడకు, పక్కనే ఉన్న ఆమె భర్తకు కూడా.. కాసేపు ఎత్తుకొని ఆడించాలని.. ముద్దు చేయాలనీ ఉంది ఆ జంటకు. అందుకే పద్మతో మాట కలపాలని ఆరాటపడుతోంది ఆమె. పాప పొట్ట నిండినట్టుంది.. కబుర్లు మొదలుపెట్టింది .. ఊ.. ఉక్కు.. అంటూ! పమిట చెంగుతో బిడ్డ మూతి తుడిచి లేపి తన ఒళ్లో నిలబెట్టుకుంది పద్మ. పక్క సీటులో ఉన్న ఆవిడను చూసి చేతులేస్తోంది పాప. ఆవిడ భర్త చిన్నగా విజిల్ వేస్తే పాపను మచ్చిక చేసుకోచూస్తున్నాడు. ‘ఎన్ని నెలలు?’ అడిగింది ఆవిడ.. పాప చెయ్యి పట్టుకొని ముద్దాడుతూ. ‘అయిదు’ పాప జుట్టు సవరిస్తూ పద్మ. అంతే ఆ సమాధానానికే చనువు తెచ్చుకొని పాపను తీసుకుంది ఆవిడ. ఆమె,ఆవిడ భర్త పాపతో ఆటల్లో పడిపోయారు. విమానం హైదరాబాద్ దిశగా పోతోంది.. పద్మ మనసు వెనక్కి కువైట్‌కి మళ్లింది. యాక్సిడెంట్లో భర్త పోయాక ఉపాధి కోసం బెంగుళూరుకు పోయింది. ఇళ్లల్లో పని వెదుక్కుంది. అక్కడున్నప్పుడే కువైట్‌లో పనిచేసే వనిత పరిచయమైంది. ‘ఇక్కడెంత చేసినా అంతంత మాత్రమే సంపాదన. ఇదే పని కువైట్‌లో చేస్తే నీ పిల్లల బతుకన్నా బాగుపడ్తది. ఖఫీల్ ఇళ్లల్లో పనుంది నువ్వు చేస్తానంటే’ అన్నది. కువైట్‌కు తీసుకెళ్లింది. తన గదిలోనే పెట్టుకుంది. వనిత చెప్పినట్టు సంపాదన పర్వాలేదు. ఇంటికి దండిగానే పంపింది. అంతా బాగుంది.. అప్పుడే కనపడ్డాడు మహీంద్ర గుణసింఘే. తాము ఉండే కాంప్లెక్స్‌లోనే.. తమకెదురుగా ఉన్న గదిలో. ముందు చూపులతో వెంటాడాడు స్నేహంగా. తర్వాత మాటలు కలిపాడు ఆప్యాయంగా! దగ్గరయ్యాడు ప్రేమగా! పాప కెవ్వుమనే సరికి ఉలిక్కిపడి చూసింది. పక్కసీట్లోని ఆవిడ దగ్గర నుంచి తల్లి దగ్గరకు రావడానికి .. తల్లి దృష్టిని ఆకర్షించడానికి అరుస్తోంది చంటిది. అయినా పసిదాన్ని సముదాయిస్తూ తన ఒళ్లోనే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆవిడ. పిల్ల ఉండట్లేదు. కాళ్లతో తన్ని పైపైకి లేస్తోంది. ‘బుజ్జి.. చిట్టి... ’ అంటూ పాపను దృష్టి మరల్చచూస్తోంది ఆవిడ. ఆమె ప్రయత్నాలను చూస్తూంటే పాపమనిపించింది పద్మకు. పాపను తన ఒళ్లోకి తీసుకుంటూ ‘మీ పిల్లలు పెద్దవాళ్లా?’ అడిగింది ఆమెను. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉందామె. ‘మీతో వచ్చినారా?’ మళ్లీ అడిగింది పిల్లకు పాలిస్తూ పద్మ. ‘నాకు పిల్లల్లేరు’అంటూ సీట్ పౌచ్‌లో ఉన్న మ్యాగజైన్ తీసి తెరిచింది. ఇంకే వివరం చెప్పడానికి సుముఖంగాలేనట్టు. నొచ్చుకుంది పద్మ. తన పైటను గట్టిగా పట్టుకొని పాలు తాగుతున్న బిడ్డకేసి చూసుకుంది. బుగ్గలు కదిలినప్పుడల్లా కుడి బుగ్గ మీద సొట్ట.. అచ్చం అతని లాగే. భగభగమండింది మనసు. ‘ఎందుకు భయపడుతున్నావ్? నేనున్నాను కదా’ అంటూ చేయి పట్టుకున్నాడు అతను. ‘మహీ..నాకు ఇద్దరు పిల్లలు అక్కడ. ఇప్పుడు ఈ బిడ్డనూ కని ఎట్లా సాకేది? ఊళ్లో వాళ్లకు ఏమి చెప్పేది?’భయంగా అడిగింది. ‘నీ దేశంలో చెప్పాల్సిన అవసరం లేదు.. నా దేశంలో చెప్పాల్సిన అవసరమూ లేదు.. మన బిడ్డ మన దేశంలో మన దగ్గర హాయిగా ఉంటది’ అన్నాడు ఆమె చుబుకం పట్టి దగ్గరకు తీసుకుంటూ. ఏడుస్తూ అతణ్ణి అతుక్కు పోయింది. ‘పిచ్చిపద్మా.. బిడ్డను ఒదులుకుంటానని ఎట్లా అనుకున్నావ్? మన వాళ్లకి కావల్సింది డబ్బులు. పంపిస్తూనే ఉన్నాం. తర్వాత కూడా పంపిస్తాం. ఎప్పుడో ఒకసారి కలిసొస్తాం. నేను వెళ్లినప్పుడు బిడ్డ నీతో ఉంటుంది. నువ్వు వెళ్లినప్పుడు నాతో ఉంటుంది. ఇక్కడే చదివిద్దాం. అవన్నిటికీ ఇంకా చాలా టైమ్ ఉందిలే.. అప్పుడు చూద్దాం.. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉండు’ అని ఆమెను హత్తుకున్నాడు భరోసాగా. ఆరునెలల గర్భవతిగా.. ఉన్నప్పుడే పనిమాన్పించాడు రెస్ట్ తీసుకో అని. అంతా తనే చూసుకున్నాడు. వనిత స్నేహితురాలు ఒకామె నర్స్. ఆమెనే డెలివరీ చేసింది తాముంటున్న గదిలోనే. ఆ టైమ్‌లో హోటల్లో డ్యూటీలో ఉన్నాడు అతను. ‘మహీంద్రా.. కూతురు పుట్టింది’ అతనికి ఫోన్ చేసి చెప్పింది వనిత. ఆ రాత్రి ఆత్రంగా ఎదురు చూసింది పద్మ అతని కోసం. ఆ రాత్రే కాదు అయిదు నెలలుగా లేడు. అతని జాడ కోసం తాను చేయగలిగిన అన్ని ప్రయత్నాల తర్వాత అర్థమైన సత్యం.. మోసపోయానని. ఈ విషాదంలో కనిపించిన ఆశ.. ఆమ్నెస్టీ. నిజానికి ఇండియాకు రావాలని లేదు. కాని కువైట్‌లో ఈ బిడ్డ ఏ జాతీ లేని అనాథ అవుతుంది. ఇండియాలో అనాథాశ్రమంలో వదిలినా ఆ దేశం పిల్లగానైనా పెరుగుతుంది. దుఃఖం ముంచుకొచ్చింది పద్మకు. ఏడుపును దిగమింగుకోడానికి బిడ్డ చిట్టిపిడికిలి పట్టుకొని నోటికి అదుముకుంటోంది. పక్కాసీటావిడ కంటపడింది. ‘ఆ.. పద్మా.. అంతాబాగేనా?’ ఫోన్లో వనిత. ‘ఊ...’ ముక్తసరిగా పద్మ. ‘పాప.. ’ వనిత. అప్పుడు కట్టలు తెచ్చుకుంది పద్మ దుఃఖం. ‘పాపను ఇచ్చేశాను’ చెప్పింది. ‘ఇచ్చేశావా? ఎవరికి?’ విస్తుపోతూ వనిత. ‘విమానంలో పరిచయమయ్యారు భార్యభర్తలు. హైదరాబాద్‌లో ఉంటారట. పిల్లల్లేరు. వాళ్ల ఒళ్లో పెట్టేశాను’ ఏడుస్తూనే పద్మ. ‘వాళ్ల గురించి ఏమైనా తెలుసుకున్నావా లేదా? వాళ్లు ఏం చేస్తుంటారు పిల్లా..’ వంటి ప్రశ్నలు అడుగుతూనే ఉంది వనిత. ఇవతల ఏడుస్తూనే ఉంది పద్మ. - సరస్వతి రమ -
మస్కట్ల పనిజేసేందుకు..
మధ్యాహ్నం.. బస్సు దిగాడు.. బస్టాండ్‌గా వాడకంలో ఉన్న ఓ చెట్టు కింద. అటూఇటూ చూశాడు. తన వాళ్లు.. తనకు తెలిసినవాళ్లెవరూ కనిపించలేదు. కుడి చేతిలో ఉన్న బ్యాగ్‌ను, ఎడమ చేతిలో ఉన్న టేప్‌రికార్డర్‌ను కిందపెట్టి.. ఒళ్లు విరుచుకున్నాడు. తర్వాత బ్యాగ్‌ను కుడి జబ్బకు వేసుకొని.. టేప్‌రికార్డర్‌ను ఎడమ చేత్తో పట్టుకొని నడక సాగించాడు. అతను ఆ ఊరు వదిలిపెట్టి వెళ్లి అయిదారేళ్లవుతోంది. ‘ఏం మారలేదు.. ఊరికి బస్సు అచ్చుడు తప్పితే’ అనుకున్నాడు చుట్టూ పరికించి చూస్తూ! ఆ మట్టిబాటకు రెండు వైపులా పచ్చగా ఉన్న పొలాలు.. పారుతున్న పంటకాల్వలను చూసి ఆశ్చర్యపోయాడు. ‘ఏ.. ఊరు మారింది’ ఒక్క క్షణం కిందటి అభిప్రాయాన్ని మార్చుకుంటూ ‘ప్రాజెక్ట్ కెనాలొచ్చి మంచిగైంది. అంతకుముందెట్లుండే... బొక్కలల్ల మూలుగ అరిగేదాంక కష్టవడ్డా.. వీసెడు పంటచ్చేది కాదు.. అవుగని.. నా సోపతిగాండ్లు ఎట్లున్నరో..’ తలపోసుకున్నాడు అతను. ‘అగో... నువ్వూ...’ అంటూ కళ్లకు, నుదిటికి మధ్య అరచెయ్యి అడ్డంపెట్టుకొని అతణ్ణి గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ అంది ఒక అవ్వ. తనకెదురుగా వచ్చిన ఆమెను చూసి.. ఆగిపోయాడు అతను. ‘నువ్వు.. దుబ్బడివి గదా..?’ గుర్తొచ్చినట్టు అడిగింది ఆ అవ్వ. ‘ఔ సాయవ్వ.. గుర్తువట్టినవా?’ ఎక్కడలేని ఆనందం అతని గొంతులో. ‘అగో.. గిన్నేండ్లకు కనవడ్తివి? యేడికేంచి అస్తున్నవ్? నువ్వు బొంబైకి పరారైనవంట గదా కొడ్కా?’ తనకు తెలిసిన సమాచారమంతా అడిగేసింది సాయవ్వ. టేప్‌రికార్డర్‌ను రెండు మోకాళ్ల కాళ్లమధ్య పెట్టుకుంటూ షర్ట్ జేబులో ఉన్న ఒక సిగరెట్, లైటర్‌ను తీశాడు. సిగరెట్‌ను నోట్లో పెట్టుకొని లైటర్‌తో వెలిగించి మళ్లీ లైటర్‌ను షర్ట్ జేబులో వేసేసి... మోకాళ్ల మధ్య నుంచి టేప్‌రికార్డర్‌ను తీసి ఎడమచేత పట్టుకొని.. కుడిచేత్తో సిగరెట్ దమ్ము లాగి.. వదులుతూ.. ‘అవ్ బొంబైకి పరారై.. మస్కట్ల తేలిన’ అని సమాధానమిచ్చి మళ్లీ నడక సాగించాడు. మొదలైంది.. ఊరి జనం అతణ్ణి గమనించడం.. గళ్ల గళ్ల చొక్కా.. ఖాకీ కలర్ ప్యాంట్.. మల్టీ కలర్ సిల్క్ రుమాలు.. రేబాన్ కళ్లద్దాలు.. అన్నిటికన్నా.. అన్నిటికన్నా.. మెడలో లావుపాటి బంగారపు గొలుసు.. చేతికి గడియారం.. ఆ ఊరి జనాన్ని ఆకర్షించిన మరో ముఖ్యమైన వస్తువు.. అతని చేతిలో ఠీవిగా కనపడుతున్న టేప్‌రికార్డర్.. ‘గప్పుడు మనూళ్లెకు అన్నలచ్చిండ్రు గదా..’ అతను చెప్తున్నాడు. ‘అవ్.. దుబ్బయ్యా.. గా సంగతి ఎర్కే.. గదిగాదు.. నువ్వు బొంబైకెంచి మస్కట్కెట్లా వోయినవో షెప్పు’ అడిగాడు అతని ఫ్రెండ్. గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న హోటల్లో టీ తాగుతూ ఈ ముచ్చట సాగుతోంది. ‘గా దినాలల్ల పోలీసులు నిన్నెంత లెంకిండ్రో ఎర్కేనా దుబ్బయ్యా?’ అన్నాడు ఇంకో వ్యక్తి. ‘మీ ఇంటోళ్లు అరిగోస వడ్డరు’ మరో స్నేహితుడి జాలి. అతను ఆ ఊళ్లోకి వచ్చి వారం రోజులవుతోంది. ఈ వారం రోజుల్లో అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసిన.. చేస్తున్న విషయం.. తన దగ్గరివాళ్లు.. తనను దూరం పెట్టినవాళ్లు..అందరూ తనను ‘దుబ్బయ్యా’ అని పిలవడం. ‘అరేయ్ దుబ్బిగా.. పటేల్ సాబ్ రమ్మంటుండు..’ ‘ఎన్ని కాడలు(ఆబ్సెంట్) వెడ్తవ్రా దుబ్బిగా?’ ‘మల్లేం రోగమచ్చేరా దుబ్బడికి? ’ ‘నక్రాలా బే దుబ్బీ..?’ అంటూ పిలవబడ్డ గతం అతని చెవుల్లో గింగుర్లు కొడ్తోంది.. ఆ రోజుల రీలు మస్తిష్కంలో తిరుగుతోంది. ‘అస్సలు సంగతి చెప్పకుండా ఎటో చూడవడ్తివి?’ అని తన ముందున్న వ్యక్తి భుజం తడ్తేగాని వర్తమానం గుర్తుకురాలేదు అతనికి. ‘ఇండ్ల మీకు తెల్వందేముంది సాయిలూ.. అన్నలు చెప్పిన మాటలు నివద్దనిపించి.. పటేల్ తాన చేస్తున్న పాలేరుగిరి కూడా ఇడ్శివెట్టి.. భూమి కావాల్నని కొట్లాడిన గదా.. నా అసుంటి పాలేర్లందరినీ పోలీసులు వట్టుకునుడు షురు జేసినంక.. అందరు ఎక్కడోళ్లక్కడ పరారైన బాపతిల నేను బొంబై బస్సెక్కిన. ఆడ ఏదో కూలీనాలీ జేస్కుంటుండంగా.. ఒక మరాఠాయనతో దోస్తానాయింది. గాయన్నే.. మస్కట్ల పనిజేయతందుకు పోతవా అని సోల్దివెట్టిండు. ఇంటికి ఉత్తరం రాశ్న గిట్ల సంగతి అని.. పొమ్మన్నరు.. గాయన అడ్రస్‌లనే నేనుంటున్నట్టు పాస్‌పార్ట్ తీపిచ్చి.. వీసా సూత ఇప్పిచ్చి మస్కట్ తోలిచ్చిండు. బిల్డింగ్లు కట్టేకాడ పని. బొంబైలనే కార్ డ్రైవింగ్ సూత నేర్సుకున్న. గిప్పుడు గా పనే దొరికేటట్టుంది.. లైసెన్స్గిట్ల అన్నీ గా మరాఠాయన్నే ఇప్పిస్తనన్నడు’ అని చెప్పాడు అతను. ‘దుబ్బయ్యా.. అయితే ఈ అయిదేండ్లలో మస్తే సంపాదించి ఉంటవ్ లే..’ ఆత్రంగా ఒకరు అడిగారు.. ఆదుర్దాగా అందరూ చెవులు రిక్కించారు. ‘ఊ..’గాజు గ్లాస్‌లోని టీని జుర్రుతూ క్లుప్తంగా అతను. ‘దుబ్బయ్యా.. ’ అని పిలిచిన నర్సిరెడ్డి మాటకు ఉలిక్కిపడ్డాడు అతను. మస్కట్ మాయా అనుకున్నాడు మనసులో. ‘బిడ్డ పెండ్లి చేయాలే. రెండెకరాలు అమ్ముదామనుకుంటున్నా.. కొనుక్కోరాదు?’ అని ఎంతకు అమ్మదల్చుకున్నాడో రొక్కం కూడా చెప్పాడు నర్సిరెడ్డి పటేల్ తన పాత పాలేరైన అతనికి. ‘ఏ.. నా దగ్గర గన్ని పైసలు యేడున్నయ్ పటేల్సాబ్?’ ఉలిక్కిపడ్డాడు అతను. ‘గట్లనకు.. బిడ్డ పెండ్లి ఉంది..’ బతిమాలుతున్న ధోరణిలో ఉంది నర్సిరెడ్డి మాట. ఆలోచనలో పడ్డాడు అతను. ‘ఏం ఆలోచన జెయ్యకు.. నాకోసం దెచ్చిన బంగారం అమ్మేసి పొలం కొందాం..’ చెప్పింది అతని భార్య. ‘పెండ్లయినప్పటి సంది నీకేం జేయ్యలే... షోకిలవడి తెచ్చిన బంగారం.. వద్దంటవేందే?’ నొచ్చుకున్నాడు అతను. ‘నా మెడల బంగారం ఎవ్వలు సూడవోయిండ్రు? పొలం ఉందా.. ఇల్లుందా అని అడ్గవోతరుగని? బిగడు పొలం లేకుండా బగ్గ బంగారం దిగేసుకున్నా వేష్టే..’నిష్ఠూరమాడింది అతని భార్య. ఆ మాటతో అతని ఆలోచనలను కట్టేసింది ఆమె. ‘ఇంకేంది.. దుబ్బయ్య పటేల్.. ఈసారి అచ్చినప్పుడు ఏం కొంటవ్?’ మస్కట్‌కి ప్రయాణమైన అతణ్ణి ముంబై బస్ ఎక్కించడానికి వచ్చిన స్నేహితుడు అడిగాడు అలైబలై చేసుకుంటూ! మళ్లీ నవ్వుకున్నాడు మనసులోనే అతను.. ‘దుబ్బిగా .. దుబ్బయ్య.. దుబ్బయ్య పటేల్’ అని అనుకుంటూ! - సరస్వతి రమ -
నిమ్మకాయలు పడేసిన వీధిలో టైర్లు పంక్చర్
ఆ వీధిలో...శుక్రవారం రాత్రి ఆ దారంట రావాలంటేనే భయమేసి, గుండె వేగంగా కొట్టుకుంటుంది నాకు. నిద్రట్లో కూడా ఆ దారిని తలచుకుంటే చాలు వెన్నులో వణుకుపుడుతుంది చిన్నప్పటినుండి. కానీ నాకు ఆ దారిలో రావడం మినహా వేరే దారే లేదు. టైమ్ చూస్తే రాత్రి పది అయింది. మా ఇంటి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగం నాది. ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళిపోతే మరలా రాత్రి పది గంటలకు ఇంటికి చేరుకుంటాను. వారమంతా రాత్రుళ్లు రావడానికి అసలు భయపడను. కానీ ఇదిగో, ఈ శుక్రవారం రాత్రి అంటేనే గుండె దడ. ఆ దారి మా వూరి పెద్ద బజార్ వీధి. ఉదయం పూట అంతా చుట్టపక్కల పల్లెల నుండి వచ్చి, పోయే జనాలతో బలే సందడిగా ఉంటుంది. బట్టల షాపులు, మందుల షాపులు, ఎరువుల షాపులు, చిన్నా పెద్ద కిరాణా కొట్లు, కిల్లి కొట్లు, అప్పారావు లస్సీషాప్ రోడ్డుకు అటు ఇటు వరుసుగా ఉంటాయి. సుమారు ఒక కిలోమీటరు ఉంటుంది మా పెద్ద బజార్ రోడ్డు. ఆ రోడ్డు చివర నుంచి ఇదిగో వీధి ప్రారంభంలో ఉన్న పెద్ద అప్పన్న కొట్టు వరకు వచ్చి, కుడివైపు తిరిగితే మా వీధి వస్తుంది. నిజానికి బజార్ వీధి అన్ని వీధులకు జంక్షన్ లాంటిది. అటు ఇటు చూసుకుంటూ మోటార్ సైకిల్ని నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ జాగ్రత్తగా వస్తున్నాను. ‘‘దేవుడా..ఏ ఇబ్బంది లేకుండా నన్ను ఇంటికి చేర్చు తండ్రి’’ మనసులోనే దేవుడిని వేడుకున్నాను. ‘‘హమ్మయ్య ..పెద్ద అప్పన్న షాపు దగ్గరకు వచ్చేస్తున్నాను’’ అని సంబర పడే లోపలనే, నే భయపడినంత పనీ అయ్యింది. ‘తపక్...తపక్’ మంటూ చిన్న సౌండ్. మోటారు సైకిల్ వెనుక నుండి. ‘చచ్చా’ననుకుంటూ దిగి స్టాండ్ వేసి చూసా. అనుకునంతా అయ్యింది. మరలా అదే దృశ్యం పునరావృతమయింది. నెలలో కనీసం రెండు సార్లు అలవాటు అయిన ఇబ్బంది. బలమైన ఇనుప తీగ మోటార్ సైకిల్ వెనుక టైరుకు లోపలకంతా గుచ్చుకొని, చక్రం తిరిగినప్పుడు మడ్ గార్డ్‌కు తగిలి ‘తపక్ తపక్’ మనే సౌండు వస్తుంది. సెంటర్ స్టాండ్ వేసి, ఆ ఇనుప తీగను బయటకు లాగాను. తీగతో పాటు మూడు నిమ్మకాయలు, మూడు మిరపకాయలు వచ్చాయి. ‘‘ఛీ’’ అనుకుంటూ ఆ నిమ్మకాయలు, మిరపకాయలు గుచ్చిన తీగను అటు ఇటు చూసి దగ్గరలో ఉన్న చెత్తకుండిలో పారేసాను. ప్రతి శుక్రవారం రాత్రి ప్రతి షాపు వాళ్ళు కూడా ఇనుప తీగకు ముందు ఒక తాజా నిమ్మకాయ, దానిపై ఒక మిరప కాయ, మరల నిమ్మకాయ, మిరప కాయ..ఇలా మూడు నిమ్మకాయలు, మూడు మిరపకాయలు గుచ్చి షాపు ముందు వేలాడగట్టి అంతకు ముందు వారం షాపు ముందు దిష్టికి కట్టిన పాత నిమ్మకాయల దండను రోడ్డు పైకి విసిరేస్తారు. అలా రోడ్డుపైకి వచ్చి వాలిన ఇనుప తీగే నా టైరును పెనవేసుకుంది. మోటారు సైకిల్ వెనుక చక్రం ట్యూబ్‌కి గుచ్చుకొని గాలి మొత్తం పోయింది. ఇక చేసేదేముంది ఈసురోమంటూ బండిని తోసుకుంటూ ఇంటికి చేరడమే. ఉదయం గబా గబా రెడీ అయ్యి, జంక్షన్లో ఉన్న రాము పంక్చర్ షాప్‌కి బయర్దేరాను మోటార్ సైకిల్ తోసుకుంటూ. ఎప్పుడూ ఉదయం ఎనిమిది వరకు షాప్ తియ్యని రాము శనివారం పూట మాత్రం తెల్లవారి ఆరు గంటలకే షాప్ తీస్తాడు. నేను వెళ్ళేసరికి ఒక ముగ్గురు ఉన్నారు నాలాగే మోటారు సైకిల్ పంక్సర్లతో. అందరం ఒకే ఏరియా వాళ్ళమే, ఇంచుమించు నెలలో రెండు సార్లయిన ఇదే రకంగా రాము షాపులో కలుసుకోవడం వలన ముఖ పరిచయాలు బాగానే ఉన్నాయి మాకు. ‘‘ఆహా..మీ గురించే అనుకుంటున్నాము ఇంతలోనే వచ్చారు’’ అన్నాడు బ్యాంక్ క్లర్క్ ఆనంద్ చిరునవ్వుతో. ‘‘గురూ, కుటుంబంతో సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తూ ఇలా దొరికిపోయాను. ఆటో వారెవరూ మా ఏరియాకి ఆ టైమ్‌లో రామన్నారు రిటర్న్ ఖాళీగా రావాలని.’’ ఏడుపు ముఖంతో అన్నాడు నా క్లాస్‌మెట్ కృష్ణ. వాళ్ళది మా ఏరియా చివర కొత్తగా వేసిన లేఅవుట్లో కట్టిన అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ‘‘మరి ఎలా వెళ్లారురా?’’ అన్న నా ప్రశ్నకు ఒక వెర్రినవ్వు నవ్వి ‘‘రాత్రి బండి అదిగో ఆ షాపు సందులో పెట్టాను. ఏది అయితే అది అవుతుందని. చచ్చినట్లు అందరం నడుచుకుంటూ ఇల్లు చేరాము. పిల్లలయితే ఒకటే ఏడుపు కాళ్ళు నోప్పెడుతున్నాయని. రాత్రంతా ఒకటే బెంగ. బండి ఉంటుందా, పోతుందా అని. అందుకే తెల్లవారగానే వచ్చేశానురా.’’ అన్నాడు కృష్ణ. ఇలా మా బాధలు చెప్పుకుంటున్నాము. పంక్చర్ల రాము మాత్రం తన పని చేసుకుంటూ, ముసిముసి నవ్వులతో మాటలు వింటున్నాడు. ‘‘మన బాధలకు పరిష్కారం లేదా ?’’ ఆశగా అడిగాడు కృష్ణ. ‘‘ఏముంది, ట్యూబులెస్ టైర్లు ఉన్న బళ్ళు కొనుకోవడమే.’’ ఆనంద్ జవాబిచ్చాడు. ‘‘అంతేనా, ఇంకే మార్గం లేదా ?’’ దిగులుగా కృష్ణ ముఖం పెట్టాడు. ‘‘నడుసుకెళ్లిపోడమే’’ పళ్ళికిలిస్తూ అన్నాడు రాము. ‘‘నీకు అలాగే వేళాకోళంగా ఉంటుంది. ఉదయం అంతా పని చేసి అలసిపోయి, హమ్మయ్య ఇల్లు చేరిపోతున్నాం అనే టైమ్‌లో బండి పంక్చరు అయితే, బండి తోసుకుంటూ, అలసి విసిగి కదలనని మొరాయిస్తున్న శరీరాన్ని తోసుకుంటూ ‘రా’ అప్పుడు తెలుస్తుంది. మా బాధ ఏమిటో?’’ ఆవేశంగా అన్నానేను. నా గొంతులో ప్రతిధ్వనించిన ఆవేశానికి అంతా నిశ్శబ్ధం అయిపోయారు. ‘‘బాబు, నానేదో ఏలాకోలానికి అనేసాను. బుస్సున కొప్పడిపోనారు’’ అన్నాడు రాము. ‘‘రాము, నాకెందుకో అనుమానంగా ఉందిరా. చార్లీ చాప్లిన్ ‘కిడ్’ సినిమాలా నువ్వుకూడా కొంపదీసి అలాగే నీ పంక్చర్ల బిజెనెస్ కోసం ఇలా చేస్తున్నవేమోనని’’ అర్ధం కానట్లు తెల్లముఖం పెట్టాడు రాము. ‘‘అదేరా...నీ వ్యాపారం కోసం నువ్వే ఆ తీగలు పడేసి, మా బళ్ళుని పంక్చర్లు చేస్తున్నవేమోనని...’’ ‘‘అదేటి బాబో అలగంటారేటి? నాకే పాపం పున్నెం తెలీదు. నమ్మండి..అమ్మోరి మీద వొట్టు.’’ అన్నాడు ముఖం అంతా దిగులుగా. నవ్వేసాము వాడి ముఖ కవళికలు చూసి. ‘‘లేదు లేదు, ఏదొకటి చెయ్యాలి. ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులతో చచ్చిపోతున్నాము.’’ అన్న ఆనంద్ మాటకు కృష్ణ కూడా తోడయ్యాడు. ‘‘అవును చెయ్యాలి’’ స్థిరంగా పలికింది నా హృదయం. ‘‘ఒక పని చేద్దాము. రేపు ఆదివారం ఉదయం పది గంటలకు అందరం పార్కులో కలుసుకొని చర్చిద్దాము. తప్పని సరిగా కలుద్దాము.’’ ‘‘హాలో ! ఇక్కడ’’ చప్పట్లు కొట్టి పిలిచాను వస్తున్న మా బైక్ బృందాన్ని చూసి. నేను కూర్చున్న చెట్టు కిందకే వచ్చి, అందరు బాసింపట్టులో కూర్చున్నారు. ‘‘చెప్పండి సార్, ఏం చేద్దాము. ?’’ ‘‘మనందరం కలిసి వెళ్లి, ఆ షాపుల వాళ్లకి మన ఇబ్బందులు చెప్దాం. వాళ్ళు పడేస్తున్న నిమ్మకాయల తీగలు గుచ్చుకొని మనం ఎన్ని ఇబ్బందులు పడ్తున్నామో వివరిద్దాము.’’ అన్నాన్నేను. ‘‘అబ్బే, లాభం లేదండి. వాళ్ళు వినరు.’’ అన్నాడు ఆనంద్. ‘‘వినేలా చేద్దాము’’ ఆవేశంగా కృష్ణ అన్నాడు. ‘‘మనలా ఇబ్బంది పడే మరో పది మందిని కలుపుకుందాం. జనబలం ఉంటే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి.’’ నా మాటలకు అందరం సరేనని...సాయంత్రం ఐదు గంటలకు పెద్ద అప్పన్న కొట్టు నుండి మా ప్రయత్నం ప్రారంభించాలని నిర్ణయించుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాము. ‘‘నమస్తే అప్పన్న గారు...’’ అంటూ షాపు లోనికి వచ్చిన మమ్మల్ని చూసి నవ్వు ముఖంతో ‘‘రండి..రండి’’ అంటూ పలకరించారు అప్పన్న. ‘‘ఏం కావాలి?’’ వ్యాపార ప్రశ్న వేస్తూనే పదిమంది గుంపుగా మేము వెళ్ళడం వలన కాస్తా అనుమానం కనబడింది ఆయన కళ్ళలో. ఏమైనా చందా కోసం వచ్చేవేమోనన్న అభిప్రాయం కూడా. ‘‘మరేమీ లేదు సార్...వారం వారం మీరు మీ షాపు దగ్గర నిమ్మకాయలు, మిరపకాయలు దిష్టి కోసం కడతారు కదా...’’ ‘‘ఆ! కడితే ?’’....కనుబొమ్మలు ముడి వేస్తూ అప్పన్న గారు ప్రశ్నించారు. ‘‘మీరు కొత్తవి పెట్టి పాతవి రోడ్డు మీదకు విసిరేస్తున్నారు. ఆ నిమ్మకాయలు గుచ్చిన ఇనుప తీగలు గుచ్చుకొని మా బైక్స్ పంక్చర్లు అవుతున్నాయి.’’ ‘‘ఏటి, మరి రోడ్డు మీదకు విసరకుండా ఇంట్లో దాచుకోవాలా ?’’ ‘‘మేము అలా అనడం లేదు అప్పన్న గారు, అలా రోడ్డు పై పడెయ్యకుండా చెత్తబుట్టలో వెయ్యమని చెప్పడానికి వచ్చాము.’’ ‘‘మా బాగుంది ఏపారం, దీపాలేట్టె ఏలకు ఒచ్చి తగులుకున్నారు. ఎల్లండెల్లండి’’ కాస్తా కటువుగా చెప్పేసరికి బయటకు వచ్చేసాము అవమానంతో. ‘‘నేను ముందే చెప్పా కదా వీరు వినరని’’ అన్నాడు ఆనంద్. ‘‘చివరి వరకు ప్రయత్నం చేద్దాం. ఎవరో ఒకరు మన మాటలు వినకపోరు, మెల్లగా అందరిలో మార్పు రాకపోదు’’ ఆశగా అన్నాన్నేను పక్క షాపులోనికి నడుస్తూ, ‘‘చూడండి, మీరు చెప్పేవన్నీ నిజాలే. కాని మా వ్యాపారాలు బాగుండాలంటే దిష్టి పోవాలి. అందుకే నిమ్మకాయలను రోడ్డు పైనే వెయ్యాలి. బళ్ల కింద పడి అవి చిదిగిపోవాలి. అప్పుడే మాకు మంచి జరుగుతుంది. మా నమ్మకం మాది’’ అన్నారు మా మాటలన్నీ విన్న పక్క షాపు సుబ్బయ్య గారు. ఇలా ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అందరి షాపు వాళ్ళ చేత చీదరించుకోవడం తోనే మాకు రాత్రి తొమ్మిది అయిపొయింది. అందరం నిరాశ నీడలో చేరాము. ‘‘ఛా..ఛా...ఏంటిరా. మన బాధను ఎవ్వరూ అర్ధం చేసుకోవడం లేదు. అయినా నిమ్మకాయలు కట్టడం మూఢాచారం అని తెలిసి కూడా, కట్టవద్దని చెప్పకుండా ‘కట్టండి, చెత్తకుండిలో వెయ్యండి’ అని చెప్పడం ఇంకా బాధాకరం రా’’ అన్నాడు కృష్ణ. ‘‘మనం కూడా వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. అయినా ఇపుడే కదా ప్రయత్నం మొదలుపెట్టాం. చూద్దాం వచ్చేవారం కూడా మన ప్రయత్నం కొనసాగిద్దాము.’’ అని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. గత వారం లానే ఈవారం కూడా అన్ని షాపులకు మరల వెళ్లి కలిసాము. కాని ప్రయోజనం లేకపోయింది. ఏ ఒక్క షాపు వాళ్ళు కూడా మాకు సహకరించడానికి ముందుకు రాలేదు. ‘‘ఇన్ని సంవత్సరాలు బట్టి లేదు, ఇప్పుడేటి కొత్త్తగా ఇబ్బంది అంటున్నారు.’’ అంటూ కొంతమంది వాదనకు కూడా దిగారు. ‘‘అసలు మీరేవిట్లు? హిందువులేనా? ఆచారాలు, పద్దతులు తెలియవా మీకు?’’ అని ఒకతను మమ్మల్ని నిలదీశాడు. ‘‘సార్, మేము ఏ కులం, మతం అన్నది కాదిక్కడ ముఖ్యం. మీ నమ్మకాల్ని, వాటి ఉనికిని మేము ప్రశ్నించడం లేదు. ఆచారాలు, నమ్మకాలు పేరిట మీరు చేస్తున్న పని వలన మేము పడుతున్న ఇబ్బంది మీకు చెప్పడానికి వచ్చాము. రోడ్డుపై పడెయ్యకుండా, చెత్తకుండిలో వెయ్యమని చెప్తున్నాము అంతే.’’ అని నచ్చచెప్పే మా ప్రయత్నం ఫలించలేదు. మా ప్రయత్నం చూసి కొంతమంది నవ్వుకున్నారు. అతి తక్కువ మంది మెచ్చుకున్నారు. కాని పరిస్థితిలో మార్పు రాలేదు. ‘‘సార్, ఏం చేద్దాము. మన ప్రయత్నాలు వృథా యేనా.’’ దీనంగా అడిగాడు ఆనంద్. ‘‘లేదు ఆనంద్....మార్పు మొదట వ్యతిరేకించబడుతుంది. తరువాత విమర్శింపబడుతుంది. ఆ తరువాత ఆలోచింప చేస్తుంది. చివరకది అంగీకరించబడుతుంది. ఇంకా మనం మొదటి దశ లోనే ఉన్నాము. చూస్తూ ఉండండి తప్పని సరిగా మనం విజయం సాధిస్తాము.’’ అన్న నా మాటలకు అందరి ముఖాలలో వెలుగువచ్చింది. ‘‘వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు? నిమ్మకాయలు రోడ్డుమీదనే వెయ్యాలి అనేది వాళ్ళ సెంటిమెంట్. ఆ పాయింటే ఇక్కడ ముఖ్య విషయం. అంటే రోడ్డు మీద నిమ్మకాయులు వేసినా, మన బైక్స్ పంక్చర్లు కాకపొతే మనకి కూడా ఇబ్బంది ఉండదు కదా.’’ ‘‘అవును సార్..ఐతే ఎలా?’’ నిమ్మకాయల ఇనుప చువ్వ గుచ్చుకున్న బైక్ పంక్చర్ కాకుండా ఎలా?’’ అన్న ఆనంద్ ప్రశ్నకు ‘‘ఇనుప తీగ బదులుగా నైలాన్ తాడు వాడమని చెప్దాము.’’ అన్నాడు కృష్ణ. ‘‘నైలాన్ తాడు వాడితే మన సమస్య తగ్గుతుంది, కాని పర్యావరణానికి హాని. నైలాన్ తాడు బదులుగా నూలుదారం వాడమని చెప్దాం. అందువలన వాళ్ళు రోడ్డుపై వేసిన ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు.’’ అన్నాన్నేను. పక్కనే నిలబడి మా మాటలు వింటున్న ఒకతను ‘‘మాతెలివోనోరు మీరు. నాను అదిగో ఆ కొట్టులో పనిసేస్తాను. తమరి ఆలోసన బాగున్నా ఎవిడికి పట్టిందండి సూది, దారమొట్టుకొని నిమ్మకాయలు, మిర్పకాయలు గుచ్చడానికి. ఇనుపరువ్వ వుచ్చుకుంటే పుసుక్కున గుచ్చేయడమే....సూదోట్టుక్కురా, దార్మోట్టుకురా అంటే కుదరని పని కాదు బావూ. వోలోప్పుకోరు’’ అన్నాడు. ఒక్కసారిగా గాలి తీసినట్లయింది మాకు. కాని అతని మాటలు మాలో కొత్త ఆలోచనను కలిగించాయి. పదిరోజుల కృషి తర్వాత మాలా ఇబ్బంది పడుతున్న ఒక వంద మంది జాబితా తయారుచేసాము. అందరు కలిసి ఎవరికి తోచింది వాళ్ళు చందా వేసి, ఒక నిధిని సిద్ధం చేసాము. నిమ్మకాయలు గుచ్చిన ఇనుప తీగలు వలన కలుగుతున్న నష్టాల గురించి, మా బాధల గురించి వివరంగా ఒక కరపత్రం తయారుజేసి, ప్రతి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒక కుర్రాడికి ఇచ్చి ప్రతి షాపులోను ఇచ్చే ఏర్పాటు చేసాము. కరపత్రంతో పాటుగా దారంతో గుచ్చిన మూడు నిమ్మకాయలు, మిరపకాయల దండ కూడా. అది కూడా ఉచితంగా. ఇలా ఒక నాలుగు వారాలు మేము దారపు దండలు ఇచ్చిన తర్వాత, కొంతమంది దారం గుచ్చిన దిష్టి దండలు అమ్మడం ప్రారంభించారు. షాపుల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా దారం గుచ్చిన నిమ్మకాయల దండలనే వాడసాగారు. రోడ్డు మీదవేసినా, ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉంది ముఖ్యంగా మా బళ్ళకి. ఇప్పుడు నాకు శుక్రవారం భయం లేదు. మాకు నమ్మకం ఉంది. మా ఊర్లో అతిత్వరలోనే మరొక మార్పు కూడా చూస్తామని, మా ఊరికి పట్టిన దిష్టి త్వరలో మాయం అవుతుందని. మరి మీ ఉళ్ళో? -∙జి.వి.శ్రీనివాస్ -
సామూహిక అత్యాచారం: అసలు ఆమె అమ్మాయేనా?
పొడవాటి జడ, పెద్ద పెద్ద ఝుంకీలు, ఆకట్టుకునే కళ్లు, ముట్టుకుంటే కందిపోయేంత తెలుపు. గులాబీ రంగు పొడవాటి కుర్తా మీద బంగారపు రంగు దుపట్టా గుండెల నిండుగా కప్పుకుని.. హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వచ్చింది ఆమె. ‘ఏంటమ్మా.. ఏం కావాలి?’ అడిగాడు గట్టిగా రాఘవయ్య ఆమెని చూసి. ‘రూమ్.. కావాలి’ అని గేట్‌కి ఉన్న టులెట్ బోర్డ్ చూపిస్తూ సైగ చేసింది. ‘ఓ.. మాటలు రావా? రూమ్ ఆ పక్కనే గోడ దాటి వెళ్లాలి.. చూస్తావా?’ అన్నాడు రాఘవయ్య అదే స్వరంతో. ‘ఊ..’ అన్నట్లుగా తల ఆడించింది ఆమె. వయసు 23 ఏళ్లు ఉండొచ్చు. ‘నాకు కొంచెం చెవుడుందిలేమ్మా.. అందుకే గట్టిగా అరుస్తున్నా.. పద చూపిస్తా’ అంటూ నెమ్మదిగా పైకి లేచి, అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలాడు. అతడి వెనుకే ఆమె నిదానంగా, పొందిగ్గా నడిచింది. ‘ఏం తాతా? అద్దెకా?’ అని రాఘవయ్యని పలకరిస్తూనే.. ‘ఏ ఊరమ్మాయ్?’ అంటూ మాట కలిపింది పక్కింటి రాధమ్మ. ‘ఆ.. అద్దెకే.. ఈ పిల్లకి మాటలు రావట’ అంటూ తలుపు తాళం తీసి లోపల లైట్ వేసి.. ‘రా అమ్మాయి లోపలికి..’ అన్నాడు రాఘవయ్య. చిరునవ్వు నవ్వుతూ లోపలికి వెళ్లింది. ‘అద్దె మూడువేలు.. ఈ దేవ్ నగర్ కాలనీలో ఇంతకంటే తక్కువకు రాదమ్మా. తెలిసే ఉంటుందిలే. ఎంతమంది ఉంటారు?’ అని అడిగాడు రాఘవయ్య. ‘నేను ఒక్కర్తినే’ అంటూ సైగ చేసింది మళ్లీ నవ్వుతూ.. ‘అవునా.. అయితే ఈ రూమ్ సరిగ్గా సరిపోతుంది. కాకపోతే బాత్ రూమ్ వెనుక వైపు ఉంది, ఈ తలుపు కాస్త గట్టిగా నొక్కి వేసుకోవాలి. సెక్యూరిటీ అంటావా? ఇక్కడ అన్ని ఇళ్లు దగ్గర దగ్గరగానే ఉంటాయి కదా.. అంత సాహసం ఎవ్వరూ చెయ్యరు. అడ్జెస్ట్ అవుతావా?’ అడిగాడు చిన్న స్వరం చేసుకుని. మళ్లీ తల ఆడించింది నవ్వుతూ.. ఆమె వినయానికి ముగ్ధుడైపోయాడు ఆ ముసలాయన. ‘ఇదిగో అమ్మాయ్.. చూస్తుంటే చాలా పద్ధతిగా కనిపిస్తున్నావ్. అందుకే చెబుతున్నా, నీళ్లు తక్కువగా వాడాలి. రెంట్ ఏ నెలకానెల ఇచ్చెయ్యాలి. ఇంతకీ ఈ ఊరిలో నీకు పనేంటీ?’ అడిగాడు ఆసక్తిగా. ఆమె సైగలు అర్థం చేసుకోలేక.. ‘సరే సరేలే.. ఒక నెల అడ్వాన్స్ ముందుగానే ఇవ్వాలి. రేపు వచ్చేస్తావా?’ అన్నాడు. సరే అంది ఆమె. ‘అవునమ్మాయ్ ఇంతకీ నీ పేరేంటీ?’ అడిగాడు రాఘవయ్య. చేతి మీద పచ్చబొట్టు చూపించింది ఆమె నవ్వుతూ.. తెల్లటి చేతి మీద ‘ఉద్భవి’ అని పెద్దపెద్దగా ఉన్న తెలుగు అక్షరాలు ఆమెలానే చాలా అందంగా ఉన్నాయి. ‘ఉద్భవీ.. ఉద్భవీ.. మీ బాబాయ్ చికెన్ కూర తెచ్చుకున్నారు. నీకు ఈ రోజు ఆదివారమే కదమ్మా.. వచ్చి కాస్త హెల్ప్ చేస్తావా?’ అడిగింది రాధమ్మ. ఇంటి పని, వంట పని అన్నింటిలోనూ సాయం చేసే ఉద్భవి.. అద్దెకు దిగి ఏడాదికాక మునుపే.. ఆ కాలనీలో అందరికీ చాలా దగ్గరైపోయింది. పండగొస్తే ఇంటి ముందు ముగ్గులు వేయడానికి, చుట్టాలొస్తే పిండి వంటలు చెయ్యడానికి ఉద్భవే గుర్తొస్తుంది ఆ చుట్టుపక్కల ఆడవాళ్లకి. ‘ఏం ఉద్భవీ.. పెళ్లెప్పుడు చేసుకుంటావ్? ముందు వెనుకా ఎవరూ లేరని చెప్పావ్.. అనాథాశ్రమంలో పెరిగానన్నావ్.. అయినా ఫర్వాలేదు. నువ్వు ‘ఊ’ అను. మా చుట్టాల్లో మంచి పిల్లోడ్నే చూస్తా. పిల్లవేమో అందగత్తెవి, చక్కగా ఆ డెఫ్ అండ్ డంబ్ స్కూల్లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావ్.. ఎవరికైనా అంతకన్నా ఏం కావాలి చెప్పు?’ అంది ఉద్భవితో వంట పనులకు సాయం తీసుకెళ్లిన పద్మక్క. ఎవరేమన్నా చిన్న నవ్వు నవ్వి ఊరుకునేది ఉద్భవి. పెళ్లి గురించి మరీ గట్టిగా అడిగితే.. ‘వివాహబంధం మీద నమ్మకం లేదు’ అంటూ సైగల్లో చెప్పేది. కానీ ఆ సైగలు ఎవరికి అర్థం కావాలి? ‘ఉద్భవిగారూ..! మన కాలనీ కుర్రాళ్లనీ తీసుకొచ్చాను. ఇవన్నీ ఆటోలో పెట్టించెయ్యాలా?’ అని అడిగాడు స్వరాజ్. ‘ఊ’ అన్నట్లుగా సైగ చేసింది ఉద్భవి. ‘రేయ్.. అవన్నీ అందులో వేసుకుని ఆశ్రమానికి వచ్చేయండి. జాగ్రత్త ఏవీ ఒలికిపోకూడదు. లాస్ట్ టైమ్ సాంబారు సగం జారేశారు. ఈసారి అలా జరగకూడదు సరేనా..’ అని గట్టిగా వార్నింగ్ ఇస్తూనే.. బైక్ స్టార్ట్ చేశాడు స్వరాజ్. వెనుక ఓ వైపుకి ఎక్కి కూర్చుంది ఉద్భవి. హీరోయిన్ ఎక్కిన తర్వాత హీరో గమ్మునుంటాడా? ఓ చెయ్యి కాలర్ ఎగరేస్తుంటే.. మరో చెయ్యి బైక్ ఎక్సలేటర్ రెయిజ్ చేస్తోంది. పరిచయం కాగానే ఉద్భవి.. స్వరాజ్‌కి ఓ క్లారిటీ ఇచ్చింది. ‘నా నుంచి స్నేహాన్ని తప్ప మరేం ఆశించినా దొరకదని’. ప్రేమించాడు కదా ఆ మాత్రం చాలనుకున్నాడు. అప్పుడే స్వరాజ్ కూడా ఉద్భవికి ఓ మాట ఇచ్చాడు. ‘బంధాన్ని బలపరిచే మాట చాలు. భావాన్ని బలపరిచే స్పర్శని అనుమతి లేకుండా నేను ఎప్పటికీ కోరను’ అని. దేవ్ నగర్ కాలనీ.. టౌన్‌కి కాస్త దూరం. కొన్నేళ్ల క్రితం ఉద్భవి ఇంటి ఓనర్ రాఘవయ్య, స్వరాజ్ తాత, మరికొందరు కలిసి ఊరికి దూరంగా ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు. కాలక్రమేణా అక్కడ జనాలు, ఇళ్లు పెరిగి అదో కాలనీగా మారిపోయింది. లేవగానే యోగా, ధ్యానం తప్పకుండా చేసేది ఉద్భవి. తనకి కుట్లు, అల్లికలు అంటే మహా ఇష్టం. సెలవు వస్తే.. అందరికీ జాకెట్ల మీద వర్క్ చేసి ఇవ్వడం, దారంతో అందంగా పేర్లు రాయడం.. ఇలా ఖాళీ దొరికిన ప్రతిసారీ ఏదొక చేతి పని చేస్తూనే ఉండేది. బాగా దగ్గరైన వాళ్లకు ఫ్రీగా, ఇతరులకు డబ్బులు తీసుకుని కుట్టేది. స్వరాజ్‌కి అది అమ్మమ్మ ఊరు. తల్లీదండ్రీ చనిపోతే.. తాత దగ్గరే పెరిగాడు. కొన్నాళ్లకు తాత కూడా చనిపోయాడు. ఆస్తి అయితే బాగానే ఉంది. టౌన్లో వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. చిన్న వయసులోనే అన్ని బంధాలకు దూరమైన స్వరాజ్.. మనసుతో ముడిపడే బంధాలకు చాలా విలువిచ్చేవాడు. అందుకే కాబోలు ఉద్భవి ‘కేవలం స్నేహమే’ అన్నా.. ఆమే ప్రాణంగా బతకడం మొదలుపెట్టాడు. ‘నా బంగారు తల్లి.. ప్రతివారం మా కోసం ఇలా అన్ని స్వయంగా వండి తీసుకొస్తావ్. నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి’ అంటూ ఆ ఆశ్రమంలో కొందరు ఆశీర్వదిస్తుంటే.. ‘పెళ్లి చేసుకో తల్లి’ అని సలహా ఇచ్చేవాళ్లు మరికొందరు. ‘స్వరాజ్‌నే పెళ్లి చేసుకో’మని ప్రేమగా చెప్పేవాళ్లు ఇంకొందరు. అందరికీ ఆమె చిరునవ్వే సమాధానం. రోజులు, నెలలూ గడుస్తున్నాయి. కాలనీ వాళ్లకే కాదు ఉద్భవి తెలిసిన వాళ్లందరికీ.. ఉద్భవితో మంచి స్నేహం కుదురుతోంది. స్వార్థం లేని ఆమె నవ్వు అందరినీ కట్టిపడేస్తోంది. ఉద్భవి సైగలను గమనించిన స్వరాజ్.. ‘అర్థమైందండీ.. పక్క ఊరిలో ఉండే.. కూరగాయల ముసలమ్మ దగ్గరకు తీసుకుని వెళ్లాలి.. అంతేగా?’ అన్నాడు. ‘అవును’ అన్నట్లుగా తల ఊపుతూ బైక్ ఎక్కబోయింది ఉద్భవి. ‘అవునూ.. ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను.. ఆమె మీకు ఎప్పటి నుంచి తెలుసు? ప్రతినెలా ఆమెని కలిసి నెలకు సరిపడా డబ్బులు ఇచ్చివస్తుంటారు ఎందుకు? వాళ్లేమో ముస్లింలనుకుంటా? మీకు ఎలా పరిచయం? ఆమెకు పిల్లలు లేరా?’ అంటూ ఆరా తీశాడు స్వరాజ్. ‘నేను అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఆమె మా ఆయా.. భర్త మంచానపడ్డాడు. ఆమెకి ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు చనిపోయాడు, మరో కొడుకు పెళ్లి చేసుకుని దూరంగా ఉంటున్నాడు’ అని సైగలతో చెప్పింది. ‘మరి.. ఎక్కడికైనా నన్ను వెంట తీసుకెళ్లే మీరు.. ఆమె దగ్గరకు ఎందుకు తీసుకుని వెళ్లరు? కాస్త దూరంలోనే బైక్ దిగి మీరు మాత్రమే వెళ్లి కలుస్తారెందుకు?’ అని అడిగాడు అనుమానంగా.. ‘ఆమెకు నీ వయసు మగపిల్లల్ని చూస్తే.. తన కొడుకులు గుర్తుకొచ్చి బాగా ఏడుస్తుంది. అందుకే నిన్ను తీసుకుని వెళ్లను’ చెప్పింది ఉద్భవి సైగలతో.. ‘ఏం ఉద్భవి.. నువ్వు రావట్లేదా పెళ్లికి? నీకు తెలుసో తెలియదో కానీ నైట్ పెళ్లిళ్లు చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. కాలనీ వాళ్లమంతా పోతున్నాం.. నువ్వు ఒక్కదానివే ఎట్లుంటావ్? పెళ్లి కొడుకు వాళ్లు బాగా సౌండ్ అట. అరవై రకాల ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారట, రెండు లగ్జరీ బస్సులు పెట్టారు. మన చెవిటి రాఘవయ్య కూడా వస్తున్నాడు. నువ్వు రావటానికేంటీ? ఈ విషయం అసలు పద్మక్కకి చెప్పావా? కూతురు పెళ్లికి నువ్వు రాలేదంటే అస్సలు ఊరుకోదు. మేకప్ అదీ నువ్వే చెయ్యాలిగా?’ అడిగింది రాధమ్మ. ‘చెప్పాను పిన్నీ.. మేకప్ కోసం ఓ పార్లర్ ఆమె వస్తుందట. పెళ్లి నుంచి తిరిగి వచ్చేసరికి తెల్లారిపోతుంది. మళ్లీ ఉదయాన్నే నేను స్కూల్‌కి వెళ్లడం కష్టం అవుతుంది. మీరు వెళ్లిరండి’ అంటూ సైగ చేసింది ఉద్భవి. మరునాడు ఉదయాన్నే పెళ్లినుంచి తిరిగి వచ్చిన వాళ్లంతా అలసిపోయి, మధ్యాహ్నం వరకూ మంచం దిగలేదు. ఉద్భవి స్కూల్‌కి వెళ్లి ఉంటుందిలే, సాయంత్రం వస్తుందిలే అనుకున్నారు కొందరు. కానీ ఉద్భవి ఆ రోజు రాత్రికి కూడా రాలేదు. పోలీసులు అందించిన సమాచారంతో ఆ మరునాడు ఉదయాన్నే.. ఉద్భవి హాస్పిటల్లో చావుబతుకుల మధ్య ఉందని తెలిసి కాలనీ వాళ్లంతా పరుగుతీశారు. ‘ఎవరో గ్యాంగ్ రేప్ చేసి పక్కూరు పైడితల్లి గుడివెనుక తుప్పల్లో పడేశారట. నిన్న పొద్దున్నే ఓ కూరగాయల ముసలమ్మ మన ఉద్భవినీ గుర్తుపట్టిందట’ చెప్పింది రాధమ్మ పక్కనే ఉన్నామెతో.. ‘అయ్యో నోరులేని పిల్ల.. పాపం.. చాలా అన్యాయం చేశారు. పిల్లకి న్యాయం జరిగేవరకూ ఇక్కడ నుంచి కదిలేదే లేదు’ అంటూ ఆ కాలనీ వాళ్లంతా అక్కడే నినాదాలు మొదలుపెట్టారు. అమ్మాయి అందంగా ఉండేసరికి.. మీడియా బ్రేకింగ్స్ కూడా వేయడం మొదలుపెట్టింది. ‘ఆడదానికి ఏదీ రక్షణా?’ అంటూ చర్చాగోష్టి, ర్యాలీలు ఊపందుకున్నాయి. రచ్చ మీడియాకి ఎక్కడంతో.. పోలీసులు హుటాహుటిన నేరస్తుల్ని పట్టుకునే పనిలో పడ్డారు. ఘడియ ఘడియకు సీసీ పుటేజ్‌లు, సీన్ టూ సీన్ లైవ్‌లతో మీడియా హోరెత్తిస్తుంటే.. రెండు రోజులకు మరో బ్రేకింగ్ పెద్ద దుమారమే రేపింది. ‘డాక్టర్స్ రిపోర్ట్‌లో బయటపడ్డ నిజం. ఉద్భవికి మాటలొచ్చా? కావాలనే మాట్లాడకుండా అందరినీ మోసం చేసిందా?’ నాలుగు రోజులకు ఇంకో బ్రేకింగ్. ‘ఉద్భవి ప్రాణాలకు ప్రమాదం లేదన్న వైద్యులు, అనుమానితుల అరెస్ట్..’ ఈ అన్యాయగాథలో బాధితురాలు మూగ దానిలా నటించిందనే సరికి జనాల్లో ఆసక్తి పెరిగింది. మరో 4 రోజులకు ‘మీడియా ముందుకు ఐదుగురు నిందితులు’. ‘అసలు ఉద్భవి అమ్మాయే కాదు.. తను ఓ హిజ్రా’ అంటూ ఆవేశంగా ప్రకటించాడు ఓ నిందితుడు. అది విన్న వాళ్లంతా షాక్ అయ్యారు. అమ్మాయి కాదంటే పోరాటం చేసేవాళ్లు లైట్ తీసుకుంటారని, దానితో.. న్యూస్‌లో పస పోతుందనే కారణంతో అప్పటిదాకా నిజాన్ని దాచిన మీడియా కూడా మరో బ్రేకింగ్ వేసింది. ‘ఉద్భవి అమ్మాయా? హిజ్రానా?’ అని. ‘నీకు ఈ లోకంతో పనా? ఈ లోకానికి నీతో పనా? అవసరాలతో పూట వెళ్లదీసే ఈ సమూహానికి నీ మనోగతంతో పనా?’ అంటూ తనలో తనే పాటలాంటి మాటలను వల్లెవేస్తూ.. వచ్చి పక్కనే కూర్చున్నాడో పెద్దాయన. ఎరుపెక్కిన కళ్లతో.. ముక్కు పుటాలను గట్టిగా తుడుచుకుంటూ తలపైకెత్తి అతడిని చూసింది తను. మెడలో రుద్రాక్షలు, నుదిటి మీద నిలువు విభూది బొట్లు.. చేతికి కాశీతాళ్లు, జైదుర్గా అనే నామస్మరణలు.. భలే విచిత్రంగా ఉన్నాడా మనిషి. 60 ఏళ్లు పైబడి ఉంటాయి. కూర్చోవడమే తనని చూస్తూ.. ‘ఏమైంది తల్లీ.. ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావ్?’ అంటూ ఆరా తీశాడు. ‘నీకు ఈ బతుకు అవసరమా చచ్చిపో? అంది మా అమ్మ. అందుకే చచ్చిపోదామని వచ్చేశానండీ. కానీ భయమేస్తోంది..’ గుండె లోతుల్లోని దు:ఖాన్ని అణచివేసుకుంటూ వణుకుతూ వచ్చిన మగ స్వరాన్ని విని విషయాన్ని అర్థం చేసుకున్నాడు అతడు. మోకాళ్ల కిందకి గౌను వేసుకుంది తను. ఒత్తైన, పొడవైన జుట్టులోని ముందరి వెంట్రుకలు గాలికి కళ్ల మీదుగా అటూ ఇటూ ఊగుతుంటే.. వెక్కి వెక్కి ఏడ్చిన తర్వాత వచ్చే అలసటతో నిట్టూరుస్తూ.. చూపుకు అడ్డుపడ్డ వెంట్రుకలను చెవులకు చుట్టింది. ఏడ్చిన తర్వాత వచ్చే దగ్గు మాత్రం మగపిల్లాడ్ని గుర్తుచేస్తుంది. ‘నాకు నీ సమస్య అర్థమైంది. నీ వయసెంత?’ అని అడిగాడు ముసలాయన. ‘పదేళ్లు..’ అంది తను ఆగని కన్నీళ్లను తుడుచుకుంటూ.. ‘నిన్ను నువ్వే అర్థం చేసుకోలేని వయసు నీది. కానీ ఈ సమాజం తనని అర్థం చేసుకోమంటోంది. నీ పుట్టుకలోని లోపం దేవుడి సృష్టి. నువ్వు దేవుడ్ని నమ్ముతావా?’ అడిగాడాయన. ‘ఊ’ అంది నిస్తేజంగా మారిన నిస్సహాయపు చూపులతో మరోసారి కళ్లు పైకెత్తి. ‘ఎందుకు నమ్ముతావ్?’ అని అడిగాడు. ‘ఏది కోరుకున్నా తీరుతుందని ఒకసారి మా అమ్మ చెప్పింది’ అంది తను. ‘దేవుడు మన కోరికలు తీర్చడమే కాదు.. అప్పుడప్పుడు మన శక్తిని పరీక్షిస్తూ ఉంటాడు. నీకు ఒక సమస్య వచ్చిందంటే.. నీ శక్తి మీద ఆ దేవుడికి అపారమైన నమ్మకం ఉందని అర్థం. నువ్వు ఎలాగైనా ఆ సమస్యని ఎదుర్కొని జీవిస్తావని దేవుడి నమ్మకం. నీ లోపాన్ని ఎత్తిచూపిస్తూ.. నీతో ఏ అవసరం లేదని ఈ సమాజం నిన్ను ఒంటరిదాన్ని చేసింది కదూ? కానీ.. నువ్వు బతకాలంటే ఈ సమాజం కచ్చితంగా కావాలి. నేను నీకు తోడుగా ఉండే ఓ సమూహాన్ని పరిచయం చేస్తాను. మరి నేను చెప్పినట్లే చేస్తావా?’ అడిగాడు ఆయన. ఏడ్చీ ఏడ్చీ బొంగుర పోయిన స్వరాన్ని సరిచేసుకుంటూ ‘ఊ’ అని అంగీకారంగా తల ఆడించింది తను. ‘పద నాతో..’ అంటూ చెయ్యి పట్టుకుని ఓ మధ్యవయస్కుడి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. చేతిలో ఉన్న చిట్టి చేతిని అతడికి చూపిస్తూ.. ‘ఇక్కడ ఉద్భవి అని అందమైన తెలుగు అక్షరాలను పచ్చబొట్టుగా వెయ్యి’ అన్నాడు ఆ ముసలాయన. ‘సరే బాబు’ అంటూ అంతా సిద్ధం చేస్తుంటాడు ఆ వ్యక్తి. ఇంతలో ఆ ముసలాయన తనను కాస్త దూరంగా తీసుకుని వెళ్లి.. ‘ఇప్పుడు ఆ మనిషికి నీ గురించి ఏమీ తెలియదు. నీకు నీ స్నేహితుల హేళనలు బాగా గుర్తున్నాయి కదా?’ అడిగాడు. అర్థమైనట్లే మౌనంగా ఉంది తను. పది నిమిషాల తర్వాత ‘ మీ మనవరాలు భలే అమ్మాయండీ. ఏడవకుండా, అరవకుండా భలే ఓపిగ్గా పచ్చబొట్టు వేయించుకుంది. ఇంత ధైర్యవంతమైన ఆడపిల్లని నేనింత వరకూ చూడలేదు’ అన్నాడు ఉద్భవిని చూసి నవ్వుతూ పచ్చబొట్టు వేసిన వ్యక్తి. ‘పేరు ఉద్భవి.. వయసు పదేళ్లు, నా అనే వాళ్లెవరూ లేరు, తనకి మాటలు రావు. దారిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే.. ఈ ఆడపిల్లల ఆశ్రమానికి తీసుకొచ్చాను’ అన్న ఆ ముసలాయన మాటలు వింటూ ఓ పక్కకు పొందిగ్గా నిలబడింది పదేళ్ల ఉద్భవి. అప్పటి నుంచీ తనకి ఆ ముసలాయన చెప్పిన మాటలు పదేపదే వినిపించేవి. ‘ఉద్భవీ.. ఇక నుంచి ప్రతిరోజూ ఒక సాధన చెయ్యి, ఎవరితోనూ నోరు తెరిచి మాట్లాడను అని. ఒక లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో లోపాన్ని అంటగడుతున్నాడేంటీ అనుకోకు. సమాజం పోకడ తెలిసినవాడిగా నీకీ సలహా ఇస్తున్నాను. ఇది నీకు ఎంత సహకరిస్తుందో.. పోనుపోనూ నీకే అర్థమవుతుంది. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే.. ఇక్కడున్న వాళ్లందరికీ నీ లోపం తెలుస్తుంది. దానితో హేళనలు, అవమానాలు వేటినీ నువ్వు ఆపలేవు. ఎందుకంటే సమూహానికి వ్యక్తి మనసుతో పని లేదు. తప్పించుకోలేవు. పైగా కొత్తగా నువ్వు ఏర్పరచుకున్న బంధాలు కూడా నీకు దూరమయ్యే ప్రమాదం ఉండొచ్చు. ఆ భయంతోనైనా నువ్వు నోరు తెరవలేవన్న నమ్మకం నాకుంది. ఒక్కటి మాత్రం నిజం. ఈ లోకానికి నీతో పని లేకపోయినా నీకు ఈ లోకంతో పని ఉంది. ఎందుకంటే.. ఏ మనిషికైనా బతకడానికి నలుగురు మనుషుల తోడుకావాలి. పొట్లాడటానికైనా, పోరు సాగించడానికైనా, తన మంచితనాన్ని పంచడానికైనా.. మనల్ని, మన విధానాలను సమ్మతించే నలుగురు మనుషులు తోడుగా ఉండాలి. నీ వయసుకి నేను ఇప్పుడేం చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చు. కాలం నీకు చాలా నేర్పిస్తుంది. జాగ్రత్త, చావు అనే పదాన్ని ఇంకెప్పుడూ నీ మనసులోకి రానివ్వకు. ఆ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడన్న విషయం మరిచిపోకు’ హాస్పిటల్ బెడ్ మీద నిసత్తువగా పడి ఉన్న ఉద్భవికి ఆ ముసలాయన చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. కాసేపు నిశ్శబ్దం. ‘రేయ్ ఇది అమ్మాయి కాదురా..?’, ‘ఏదైతే ఏంట్రా..’ అన్న కీచకుల మాటలు అస్పష్టంగా పదేపదే వినిపిస్తుంటే.. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఉద్భవి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది. కానీ బెడ్ మీద నుంచి పైకి లేవలేకపోయింది. అంతకు 2 నిమిషాల ముందే ఉద్భవి కోలుకోవాలని గుడికి వెళ్లి వచ్చిన స్వరాజ్.. ఉద్భవి నుదిట మీద బొట్టు పెట్టి వెళ్లాడు. ‘అమ్మా.. మీరు చెప్పండి. ఉద్భవి మీతో ఎలా ఉండేది? తను అమ్మాయి కాదనే విషయాన్ని మీరు కనిపెట్టలేక పోయారా?’ అనే రిపోర్టర్ ప్రశ్నకు.. ‘ఇదిగో బాబూ.. తన గురించి మమ్మల్ని అడగకండి, ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లకి పెళ్లిళ్లు కావాలి. తను మా ఇంటి ముందు ఉందన్న మాటే కానీ.. మాకు అంతగా తన గురించి తెలియనే తెలియదు. అయినా ఆడో, మగో కనిపెట్టడానికి ఏముందయ్యా? మాట రాదండి. బట్టలు ఊూూూ చూడలేం కదా’ అంది రాధమ్మ కోపంగా.. ఐదుగురు నిందితుల్లో నలుగురు కాలనీకి చెందిన కుర్రాళ్లే కావడంతో.. కాలనీ వాళ్లు వెనక్కి తగ్గారు. ‘తను అమ్మాయే కాదట. ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది. కావాలనే మా పిల్లల్ని రెచ్చగొట్టి ఉంటుంది. లేకపోతే వీళ్లెందుకు ఆ పని చేస్తారు?’ అనే నిందితుల తల్లిదండ్రుల వాదనను చాలామంది బలపరిచారు. ‘అసలు ఆమె అమ్మాయే కాదు. ఒకేసారి ఐదుగురిని చూసేసరికి ఆమెలో ఎలాంటి భావాలు కలిగాయో మనం చెప్పలేం.. నిందితులని ఆమే బాగా రెచ్చగొట్టింది. చూడటానికి అందంగా ఉండటం, అప్పటికే వీళ్లంతా తప్ప తాగి ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది’ అంటూ కేసు తీవ్రతని తగ్గించే ప్రయత్నం మొదలుపెట్టాడు నిందితుల తరఫు లాయర్. అతడి వాదనని చాలామంది సమర్థించారు. ‘నిజమే అయ్యుంటుంది.. లేకపోతే అమ్మాయిలే లేనట్లుగా హిజ్రాని ఎందుకు రేప్ చేస్తారు?’ అంటూ నోరు జారి మహిళా సంఘాలకు కోపం తెప్పించినవాళ్లు కొందరైతే.. ‘ఓరీడమ్మా బడవా.. ఇది నేను చూడ్లా.. ఇదేం గోలరా నాయనా?’ అంటూ కామెడీగా ఈ సమాజంలో మేము సైతం అన్నారు మరికొందరు. ఉద్భవి అమ్మాయి కాదని తెలిశాక చాలామంది న్యాయ పోరాటం నుంచి తప్పుకున్నారు. మెల్లగా మీడియా కూడా మరో బ్రేకింగ్ కోసం వెంపర్లాడటంతో.. ఉద్భవి కేసు మరుగున పడింది. కొన్ని వారాలకు ఆసుపత్రిలోనే పూర్తిగా కోలుకున్న ఉద్భవిని.. పోలీసుల పరిరక్షణలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆ సమయంలో స్వరాజ్ తనని కలవడానికి వచ్చినా ఉద్భవి అందుకు ఇష్టపడలేదు. చివరికి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఉద్భవికి ఇవ్వమన్నాడు స్వరాజ్. అందులో ఉద్భవికి సంబంధించిన సర్టిఫికెట్స్, కొన్ని బట్టలు, డైరీలు, పుస్తకాలు, సెల్ ఫోన్.. ఇలా అవసరమైనవి చాలానే ఉన్నాయి. ఒకరోజు సెల్ఫోన్లో తన మీద వచ్చిన కథనాల గురించి యూట్యూబ్స్, సోషల్ మీడియాల్లో వచ్చిన వీడియోలు, ట్రోల్స్ అన్నీ చూసి గుండెలవిసేలా రోదించింది. ఒంటరిగా భవనంపైకి వెళ్లి.. ఎన్నో ఏళ్లుగా మూగబోయిన ఆ గొంతు తెరిచి దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరుస్తూ.. ఏడ్చింది. కాస్త దూరంగా.. ‘అల్లా....’ అంటూ నమాజ్ స్పీకర్లో వినిపిస్తోంది. ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న డైరీలోని పేపర్స్ ముందుకు కదిలాయి. పైనుంచి కిందదాకా నల్లటి వస్త్రాన్ని వేసుకున్న ఉద్భవి.. డైరీ రాయడం మొదలుపెట్టింది. ‘నేను మనిషిని. సమాజం నన్ను మనిషిగా గుర్తించాలని కోరుకునే పిచ్చి మనిషిని. గౌరవంగా బతకడానికి సమాజాన్ని మోసం చేశాను. నిజానికి ఇది మోసం కాదు, సమాజం ముందు నేనో నిజాన్ని దాచాను. ఎవరికీ అపాయం కానీ, అవసరం లేని ఒకే ఒక్క నిజాన్ని దాచాను. నన్ను నన్నుగా ఎవరూ అంగీకరించడం లేదు కాబట్టి మూగదానినని అబద్ధమాడాను. ఈ అబద్ధంతో నేను ఎవరినీ బాధపెట్టలేదు. ఇప్పుడు ఎవరినీ తప్పు బట్టడం లేదు. ఎందుకంటే.. నాలానే ప్రతి మనిషి ఒంటరిగా బతకడానికి భయపడతాడు. సమాజం తోడు కావాలని కోరుకుంటాడు. అందుకే కుల, మత, ప్రాంత, లింగ భేదాలతో వర్గాలుగా విడిపోయి.. ఆయా సమూహాల్లో తనూ ఒకడిగా బతుకుతుంటాడు. ఏదో ఒక వర్గానికి పరిమితమై జీవనాన్ని గడపుకుంటాడు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ సమూహం నుంచి బయటపడితే.. ‘ఒంటరిగా బతకడం ఎలా? ప్రాణం మీదకి వస్తే పరిస్థితి ఏంటి? ప్రాణాలు పోయాక మోసేదెవరు?’’ అంటూ లెక్కలేసుకుంటాడు. అందుకే సాహసించి ఆ సమూహాన్ని దాటలేడు. తన సమూహంలోకి మరో వర్గానికి చెందిన మనిషిని ఏకపక్షంగా ఆహ్వానించనూలేడు. అందుకే.. నా తరఫున ఎవరూ నిలబడలేదని వేదన చెందను. నేను చేసేది తప్పేమోనని నాలో నేనే చాలాసార్లు మథనపడ్డాను. అలా మథనపడిన ్రçపతిసారీ నాకు తోచిన సమాధానం ఒక్కటే. ఇది నా వ్యక్తిగతం అని. ప్రతి మనిషికీ ఈ లోకంలో ‘సమాజంతో నేను, నాతో నేను’ అనే రెండు పాత్రలుంటాయి. వ్యక్తిగతంగా పెళ్లి, పిల్లలు అవసరం లేదనుకున్నప్పుడు.. ఈ సమాజానికి నేను తప్పుడు ఆదర్శం కానప్పుడు.. నా వ్యక్తిగతంతో ఈ సమాజానికి పనేముంది? అనుకున్నాను. ఇప్పటిదాకా నా స్వరాన్ని ఆ దేవుడు దాచుకునేలా చేస్తే.. ఇక నుంచి నా ముఖాన్ని ఈ సమాజం దాచుకునేలా చేసింది. ఇంకా ఆ దేవుడు నా శక్తిని పరీక్షిస్తూనే ఉన్నట్లున్నాడు. ఇప్పుడు కూడా చావు గురించి ఆలోచించాలనిపించడం లేదు. చావు దానంతట అదే వచ్చేదాకా చావు గురించి ఆలోచించాలని లేదు’ అని ముగించి పెన్ పక్కన పెట్టి, కుర్చీపైన ఉన్న నల్లటి దుపట్టాని ముఖానికి కట్టుకుంది. మనియార్డర్ పోస్ట్ మీద కూరగాయల ముసలమ్మ అడ్రస్ రాసి.. హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని, తను కొత్తగా పెట్టిన బ్యూటీ పార్లర్‌కి బయలుదేరింది. రెండేళ్లు గడిచాయి. ‘ఏమయ్యా స్వరాజ్? పక్కనే సొంత ఇళ్లు పెట్టుకుని.. ఎన్నాళ్లు ఆ ఉద్భవీ ఉన్న పిచ్చి అద్దె కొంపలో ఉంటావ్? మంచిగా ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా?’ అంటూ సలహా ఇచ్చింది రాధమ్మ కరెంట్ ఫ్యూజ్ మార్చి సాయం చెయ్యడానికి వెళ్లిన స్వరాజ్‌తో.. (అచ్చం అప్పట్లో ఉద్భవికి చెప్పినట్లే). స్వరాజ్ నవ్వి ఊరుకున్నాడు. కాసేపటికి ఇంటికి వెళ్లి పైనున్న ఓ సూట్‌కేస్ మెల్లగా దించి ఓపెన్ చేసి చూసుకున్నాడు. అందులో అన్నీ ఉద్భవి డ్రెస్‌లే. ఒక డైరీ కూడా ఉంది. అది ఉద్భవికి స్వరాజ్ పరిచయం అయిన తర్వాత రాసిన డైరీ. (అందులో చాలా విషయాలు ఉన్నాయి. కూరగాయల ముసలమ్మ ఆయా కాదని, తన కన్నతల్లి అని, ఆ విషయం ఆమెకు కూడా చెప్పలేదని, స్వరాజ్‌ని తను ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఇలా చాలానే ఉన్నాయి). సూట్‌కేస్‌లో.. బంగారు రంగు చున్నీ తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. దానికి ఓ చివర ఉన్న ‘స్వరాజ్’ అనే ఎర్రటి దారపు కుట్టుని చూసుకుని మురిసిపోతూ.. మరోసారి గుండెలకు హత్తుకున్నాడు. ‘ఒక మనిషి క్షేమాన్ని గుండెల నిండా కోరుకోవడమే కదా ప్రేమంటే.. అలాంటి ప్రేమే నాది కూడా. లవ్యూ స్వరాజ్..’ అని రాసి ఉన్న డైరీలోని మధ్యపేజీల్లో చివరి వాక్యాలను స్వరాజ్ ప్రేమగా నిమిరాడు 151వ సారి. - సంహిత నిమ్మన -
గుమస్తా మరణం
ఒక ప్రశస్తమైన రాత్రి, ఇవాన్ ద్మీత్రిచ్ చెర్‌వ్యకోవ్ అనే ప్రశస్తమైన గుమస్తా ఫన్ట్క్లాస్లో రెండవ వరసలో కూర్చొని, బైనాక్యులర్స్ సాయంతో ‘కొర్నెవీల్ గంటలు’ అనే నాటకాన్ని ఆనందిస్తూ వుండినాడు. అతను రంగస్థలాన్ని తిలకిస్తూ, తనకంటే అదృష్టవంతుడైన మానవుడు భూప్రపంచంలో లేడని అనుకుంటూ వుండగా, హఠాత్తుగా...‘‘హఠాతు గా’’ అనేది చౌకబారు నుడికారం అయింది. కానీ జీవితం నిండా హఠాత్ ఘటనలు వుండగా రచయితలు దానిని వాడకుండా ఎలా వుండగలరు? కనుక, హఠాత్తుగా అతని ముఖం ముడుచుకుపోయింది, కండ్లు ఆకాశం వైపు తేలిపోయాయి, ఊపిరి స్తంభించింది...బైనాక్యులర్ల నుండి ముఖం పక్కకు తిప్పుకొని, కుర్చీలో వంగి, అతను–అఛ్మూ! అనగా, అతను తుమ్మినాడు. మరి, ప్రతి ఒక్కరికి ఇష్టం వచ్చినచోట తుమ్మే హక్కు వుంది. రైతులూ, పోలిసు ఇన్స్పెక్టర్లూ, గవర్నర్లు కూడా తుమ్ముతారు. ప్రతి వొకరూ తుమ్ముతారు–ప్రతి వొకరూ. చెర్వ్యకోవ్కు మనస్సంకోచమీమేమి కలగలేదు. అతను చేతిగుడ్డతో ముక్కు తుడుచుకొని, సుసంస్కారి లాగా, తన తుమ్ము ఎవరికైనా ఇబ్బంది కలిగించిందేమో అని చుట్టూ చూసినాడు. అప్పుడు నిజంగా కలిగింది అతనికి మనస్సంకోచం. మొదటి వరసలో, సరిగ్గా అతనికి ముందర కూర్చొని, ఒక చిన్న వృద్ధుడు అతనికి కనిపించాడు, తన బట్టతలా, మెడా, తుడుచుకుంటూ, ఏదో గొణుక్కుంటూ. అతను రవాణా మంత్రిత్వశాఖకు చెందిన సివిల్ జనరల్ బ్రిజాలొవ్ అని చెక్వ్యకోవ్ గుర్తించినాడు. ‘‘ఆయన మీద నేను తుమ్మినానే!’’ అనుకున్నాడు చెర్వ్యకొవ్. ‘‘ఆయన మా అధికారి కాని మాట నిజమే, కానీ ఇది చాలా అనుచితమైన పని. నేను క్షమాపణ చెప్పుకోవాలి.’’ చెర్‌వ్యకోవ్ చిన్న పొడిదగ్గుతో ముందుకు వంగి, జనరల్ చెవిలో చెప్పినాడు: ‘‘క్షమించండి, సార్. నాకు తుమ్ము వచ్చింది...నేను ఉద్దేశించలేదు...’’ ‘‘పోనిలే.’’ ‘‘మీరు తప్పక క్షమించాలి. నేను...అది ముందుగా అనుకున్నది కాదు!’’ ‘‘ఇక వూరుకో, దయయుంచి! నాటకం విననీ!’’ చెర్‌వ్యకోవ్ కాస్త ఇబ్బంది పడి, వెర్రి చిరునవ్వు నవ్వి, రంగస్థలం మీదికి దృష్టి మళ్లించడానికి ప్రయత్నించినాడు. అతను నటులను చూస్తూ వుండినాడు, కానీ భూప్రపంచంలో కెల్ల అదృష్టవంతుణ్నని అతనికి ఇప్పుడు అనిపించలేదు. అతన్ని పశ్చాత్తాపం పీక్కు తినింది. విరామ సమయంలో అతను బ్రిజాలొవ్ వద్దకు వెళ్లి, కాసేపు తచ్చాడి, చివరకు ధైర్యం కూడగట్టుకొని, ఇలా గొణిగినాడు: ‘‘నేను మీ మీద తుమ్మినాను సార్...క్షమించండి...మరి...నేను అనుకోలేదు...’’ ‘‘ఓ, ఏమిటిది...నేను మరచిపోయినాను, నీవింకా దాన్నిపట్టుకోవాల్నా?’’ అన్నాడు జనరల్, చిరాకుతో అతని క్రింది పెదవి వణికింది. ‘‘మరిచిపోయినానని అనుకుంటున్నాడు. కానీ ఆయన కన్నులలోని ఆ చూపు నాకు తృప్తిగా లేదు,’’ అనుకున్నాడు చెర్‌వ్యకోవ్, జనరల్ వున్న వైపు అపనమ్మకంతో చూస్తూ. ‘‘నాతో మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. ఆయనకు నేను వివరించాలి, నాకా ఉద్దేశం లేదని...అది ప్రకృతి ధర్మమని, లేపోతే, నే నాయన మీద ఉమ్మెయ్యాలనుకున్నానని ఆయన అనుకోవచ్చు. ఇప్పుడలా అనుకోకపోయినా, తరువాత అనుకోవచ్చు!...’’ చెర్‌వ్యకోవ్ ఇంటికి పోయినప్పుడు, తన అసంస్కార ప్రవర్తనను భార్యకు చెప్పినాడు. తన కథను ఆమె మరీ తేలికగా తీసుకున్నట్లు అతనికి అనిపించింది. ఆమె క్షణం సేపు ఆందోళన చెందిన మాట నిజమే, కానీ బ్రిజాలొవ్ ‘‘మన’’ అధికారి కాదని తెలుసుకొని ఆమె నిబ్బరం కోలుకుంది. ‘‘అయినా, మీరు వెళ్లి క్షమాపణ చెప్పుకోవాలి. లేకపోతే, మీకు నలుగురిలో ప్రవర్తించడం తెలియదని ఆయన అనుకుంటాడు,’’ అని ఆమె చెప్పింది. ‘‘అదే మరి! నేను క్షమాపణ చెప్పుకోడానికి ప్రయత్నించినాను, కానీ ఆయన చిత్రంగా ప్రవర్తించినాడు. అర్థమున్న మాట మాట్లాడలేదు. పైగా, సంభాషణకు వ్యవధే లేదు.’’ మరుదినం చెర్‌వ్యకోవ్ తన కొత్త అధికారిక కోటు ధరించి, దారిలో క్రాపు చేయించుకొని, తన ప్రవర్తనను వివరించడానికి బ్రిజాలొవ్ వద్దకు వెళ్లినాడు. జనరల్ రిసెప్షన్ గది నిండా అర్జీదార్లు వుండినారు, జనరల్ కూడా వుండినాడు అక్కడ, అర్జీలు స్వీకరిస్తూ. కొద్దిమందితో మాట్లాడి, తర్వాత జనరల్ కన్ను లెత్తి చెర్వ్యకోవ్ను చూసినాడు. ‘‘సార్, రాత్రి, ‘ఆర్కేడియ’ నాటకశాలలో, మీకు జ్ఞాపక ముంటుంది’’ అని గుమస్తా ప్రారంభించినాడు. ‘‘నాకు–తుమ్ము వచ్చింది–మీకు క్షమాపణ–చెప్పుకున్నాను...’’ ‘‘అబ్బే, అదేముందిలే!’’ అంటూ జనరల్ పక్కనున్న అర్జీదారుని వైపు తిరిగి ‘‘యేమిటి మీ విషయం?’’ అన్నాడు. ‘‘నేను చెప్పేది వినిపించడం లేదు!’’ అనుకొని చెర్‌వ్యకోవ్ వివర్ణుడైనాడు. ‘‘ఆయన కోపంగా వున్నాడన్నమాట...దీన్ని ఇంతటితో వదలి పెట్టకూడదు...ఆయనకు వివరించాలి...’’ జనరల్ చివరి అర్జీదారుని చూసిన తర్వాత తన ప్రైవేటు గదిలోకి పోడానికి మళ్లినప్పుడు, చెర్‌వ్యకోవ్ అతని వెంటబడినాడు, ఇలా గొణుకుతూ: ‘‘క్షమించండి సార్, నా హృదయపూర్వకమైన పశ్చాత్తాపమే నాకు మిమ్మల్ని బాధించే సాహసం ఇస్తున్నది...’’ జనరల్ ఏడ్వబోయేవానిలా ముఖం పెట్టి, అతన్ని వెళ్లిపోమ్మన్నట్లు చేయి వూపినాడు. ‘‘అయ్యా, తమరు నన్ను పరిహాసం చేస్తున్నారు!’’ అంటూ అతను గుమస్తా ముఖం మీది గది తలుపు మూసేసుకున్నాడు. ‘‘పరిహాసమా! ఇందులో వినోదం నాకేమీ కనిపించదే. ఆయనకు అర్థం కాదా? జనరల్ కూడా ఆయన. సరే. నా క్షమాపణలతో ఇక ఆ పెద్దమనిషిని బాధించను. ఎక్కడైనా చావనీ! ఒక ఉత్తరం ముక్క రాసి పడేస్తాను, ఆయన వద్దకిక పోనేపోను! పోను–అంతే!’’ అనుకున్నాడు చెర్‌వ్యకోవ్. ఇంటికి పోతూ అలా అనుకున్నాడు అతను. కానీ ఉత్తరం రాయలేదు. ఎంత ఆలోచించినా అతనికి ఉత్తరం ఎలా రాయల్నో తోచలేదు. అందువలన అతను మరుదినం జనరల్ వద్దకు వెళ్లవలసి వచ్చింది, పరిష్కారం చేసుకోడానికి. జనరల్ అతనివైపు ప్రశ్నార్థకంగా చూసినప్పుడు అతను చెప్పసాగినాడు: ‘‘నిన్న మిమ్మల్ని బాధించింది, మీరు సూచించినట్లు, మిమ్మల్ని పరిహసించడానికి కాదు. తుమ్మి, మీకు ఇబ్బంది కలిగించినందుకు మీకు క్షమాపణలు చెప్పుకోడానికి వచ్చినాను...ఇక పరిహాసమంటే, అలాంటిది నా ఊహలోనే వుండదు. అంత సాహసమా నాకు! పరిహాసం చేయాలని మేము అనుకుంటే, ఇక గౌరవం అనేది వుండదు...పెద్ద వాళ్ల పట్ల గౌరవం అనేది వుండదు...’’ జనరల్‌కు ఆగ్రహంతో ముఖం కందగడ్డ అయింది. ఆవేశంతో వణకుతూ, ‘‘దాటు బయటికి!’’ అని గర్జించినాడు. చెర్‌వ్యకోవ్ భయంతో కొయ్యబారి, ‘‘యేమన్నారు?’’ అని మెల్లగా గొణిగినాడు. ‘‘దాటు బయటికి!’’ అని జనరల్ మళ్లీ అన్నాడు, కాలు నేలమీద తాడిస్తూ. చెర్వ్యకోవ్కు తన లోపల ఏదో పుటుక్కుమన్నట్టు అనిపించింది. అతను వాకిలి దాకా వెనక్కి అడుగులు వేసుకుంటూ పోయి, వీధిలోకి నడిచి, వీధుల్లో తిరిగినాడు. కానీ అతనికి యేమీ వినిపంచనూ లేదు, కనిపించనూ లేదు. అతను యాంత్రికంగా వచ్చి ఇంట్లో పడినాడు, అలాగే, అధికారిక కోటుతోనే, సోఫాలో పండుకొని ప్రాణం విడిచినాడు. మూలం : ఎ. చేహోవ్ అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి -
థూ... ఏం బతుకురా నీది?
‘ఏమైంది? అస్తున్నవా?’ ఆత్రంగా అడిగింది లక్ష్మి భర్తను. ‘ఏంగాలె.. ఏడున్నదో ఆడ్నే ఉన్నది. అచ్చుడు కాదే..’ బాధగా చెప్పాడు సత్యం. ‘ఎట్ల మరి?’ కంగారుగా లక్ష్మి. ‘ఏం జెయ్యాలే చెప్పు? ఏదో తిప్పలు వడి అచ్చెటట్టు చూస్తగని.. ఎట్లున్నడు బాపు?’ ఆందోళనతో సత్యం. ‘ఇయ్యాల్నో .. రేపో అన్నట్టున్నడు...’ నెమ్మదిగా లక్ష్మి. దీర్ఘంగా శ్వాస తీసుకొని ‘అవ్వ...?’అడిగాడు. ‘నిన్నే యాదిచేస్తుంది.. ఎప్పుడొస్తవని..’ పొడిపొడిగానే చప్పింది లక్ష్మి. ఏమీ మాట్లాడలేదు సత్యం.. ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. చావుబతుకుల్లో ఉన్న తండ్రిని కూడా చూసుకోలేకపోతున్నాడు.. ‘థూ... ఏం బతుకురా నీది? బాపు, అవ్వను ఎన్నడన్నా పట్టిచ్చుకున్నవా? ఒక్కడే కొడుకని.. చెల్లెండ్లను కూడా కాదని మంచి తిండి, మంచి బట్టలు.. కష్టం ఏందో తెల్వకుండా పెంచిండ్రు.. ఇంటికి పెద్దోడివై ఏం జేషినవ్రా? నీ బతుకుల మన్నువడ. చెల్లెండ్ల పెండ్లికి పైస ఇచ్చినవా? ఉన్న పొలమన్నా అమ్మి పెండ్లి జేద్దామని చూసినా.. ఆ పొలమెన్నడో అమ్ముకొని ఆ పైసలతో మట్క (జూదం లాంటిది) ఆడి.. ఉల్టా అప్పువెట్టినవ్. ఆనాడే బాపు గుండెపగిలి సావాలే.. అయినా ఒక్క మాట అనకుండా.. తనే చెల్లెండ్ల పెండ్లి జేసిండు. ఎప్పుడూ నువ్వెట్ల బతుకుతవనే రందివడ్డడు గాని ఆయన పానం గురించి ఆలోచించుకున్నడ? నీ పెండ్లాం, కొడుకుని సాకుడు కూడా చేతగాకపాయే. బాపుతోపాటు సమానంగా పెండ్లాం కష్టవడ్డది.. ఇంటి కోసం. కొడుకు వయసోడైనంక గప్పుడు బుద్ధి దెచ్చుకొని.. దుబాయ్ దారి వడ్తివి. దానికీ అప్పు పుట్టింది బాపు మొహం, మల్ల మాట్లాడ్తే పెండ్లాం మొహం జూసే కదరా? ఏం పుట్టుకరా? అవును గిట్లనే ఏం పుట్టుకరా.. రాజా పుట్టుక నీది అని అవ్వ, బాపు, దోస్తులు అనీ అనీ గిట్ల జేసిండ్రు లాస్ట్కొస్తే..’ మనసులో తిట్టుకున్నాడు. వేదన కన్నీటి రూపంలో కళ్లలోకి ఉప్పొంగుతుండగా.. ఫోన్ రింగ్ అయింది! చూశాడు.. నీళ్లూరిన కళ్లు చూపును మసకబారుస్తున్నా.. స్పష్టంగా కనిపించింది నంబర్.. తన భార్య చేసింది. వణుకుతున్న చేతులతోనే లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు మాట విని గోడకు చేరగిలపడ్డాడు. అయిపోయింది.. అంతా అయిపోయింది. ఇంకా తనను తన భుజమ్మీద నుంచి దింపని తండ్రి.. పోయాడు. ఆఖరి చూపు కూడా చూడని దౌర్భాగ్యానికి కుమిలిపోయాడు. ‘ఒరేయ్ ఏం బుట్టిందిరా నీకు? మంచిగ.. కంపెనీ వీసా దొరికింది.. కష్టమో నష్టమో పనిచేసుకుంటే అయిపోయేది కదరా? పనికి ఎక్కువైతుంది.. జీతం తక్కువైతుందని.. అచ్చిన ఆర్నెల్లకే కంపెనీ ఇడిసిపెట్టి పొయ్యి ఖలివెల్లి అయితివి. నీ యవ్వ.. నువ్వు జేస్తున్న పనికి జీతం తక్కువైందా? ఎన్నడు కష్టపడ్డవని పని ఇలువ తెలిసె నీకు? ఇప్పుడు ఏమాయే? బాపును చూసుకునే దిక్కు కూడా లేకపాయే. అదే కంపెన్లనే ఉంటే బతిమాలితెనో.. కాళ్లు వట్టుకుంటెనో.. అరబ్ సేuŠ‡ పంపుతుండే కావచ్చు.. ఏడు.. ఈడ్నే ఏడ్సుకుంట సావు’ తన దురదృష్టానికి తానే శాపనార్థాలు పెట్టుకున్నాడు సత్యం. ‘ఏందవ్వా... అస్తున్నడా సత్యం?’ వాడకట్టు పెద్ద అడిగాడు. రావట్లేదన్నట్టు తలూపింది లక్ష్మి. ‘మరి నీ కొడుకు అగ్గి వడ్తడా తాతకు?’ అడిగాడు లక్ష్మి ఆడపడచు మామ. ‘పొల్లగాడికి మస్కట్ వీసా అచ్చేటట్టున్నదట గీ రెండు మూడు దినాలల్లనే. అగ్గి వడితే ఊరు దాటొద్దు కదా.. దినాలు అయ్యేదాంక’ అన్నాడు సత్యం బావమరిది. ‘మరెట్లనయ్యా? కొడుకు రాకపోయే.. మనవడు వెట్టకపాయే.. ముసలోడి పానం ఇంటి సుట్టే తిరగాల్నా ఏందీ?’ గట్టిగా మాట్లాడాడు లక్ష్మి ఆడపడచు మామ. ‘లే.. నేను వడ్తా’ అన్నది లక్ష్మి స్థిరంగా. ఆ జవాబుతో అందరూ షాక్ తిన్నట్టుగా చూశారు. ‘అవ్.. షిన్నబాపు. మా మామకు అగ్గి నేను వడ్తా..’ మళ్లి అంతే స్థిరమైన స్వరంతో లక్ష్మి. ‘ఆ .. బాపూ... ఇప్పుడే అగ్గివెట్టింది అమ్మ’ ఫోన్లో చెప్పాడు సత్యం కొడుకు. ఆ మాట వినగానే తన రూమ్మేట్స్ని పట్టుకొని ఏడ్చేశాడు సత్యం. అతనిని ఆపడం అక్కడున్న ఆ నలుగురి తరమూ కాలేదు. ‘ఊకో.. సత్యం.. పోయినోడు రాడు కదా.. గిప్పుడు చేయాల్సినవి చేద్దాం..’ అని సముదాయించారు దోస్తులు. ‘గీడికి రా సత్యం.. ’అంటూ పిలిచాడు ఆ నలుగురిలో క్షురక వృత్తికి చెందిన ఒక దోస్తు. ఏడ్చుకుంటూనే వెళ్లి అతని ముందు కూర్చున్నాడు సత్యం. ఊర్లో తండ్రి చితి ఆరిపోయేలోపు సత్యం గుండు చేయించుకున్నాడు. తర్వాత చేయాల్సిన కార్యక్రమాలనూ తన గదిలోనే చేశాడు. సెల్ఫోన్లో ఉన్న తండ్రి ఫొటోను ప్రింట్ తీయించి.. గదిలో పెట్టి.. నివాళులర్పించాడు. పదోరోజు తండ్రికి ఇష్టమైన వంటకాలను వండాడు. అతని రూమ్మేట్స్ మందు తెచ్చి .. స్నేహితుడి ‘కడుపు చల్ల (తెలంగాణలో చావు విందులో ఈ ప్రక్రియ ఒక భాగం) చేశారు. ఆరోజు రాత్రి.. తండ్రి జ్ఞాపకాలతో జాగారమే అయింది సత్యానికి. ‘ఎంత పాపం చేశాడు? బతికున్నప్పుడు ఏనాడూ అతని కష్టం అర్థంచేసుకోలేదు. అర్థమయ్యే నాటికి మనిషే లేకుండావాయే! గిప్పుడు.. గీడ.. దేశం కాని దేశంలో ..గిదేం కర్మ? గుండు కొట్టించుకుంటే ఏమొస్తది? పిట్టకు పెడితే ఏమొస్తది? గివన్నీ సూడొస్తడా బాపు? అసలు తెలుస్తదా ఆయనకు? ఒరేయ్.. పోయినోల్లకు చేసుడు కాదురా.. గిప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఉన్న అవ్వనన్నా మంచిగ చూసుకో. తిన్నవా? పన్నవా? పానం బాగుందా ? అని అర్సుకో. సంపాదించిందాంట్లేకెంచి అవ్వకోసమని ఇంత పక్కన వెట్టు’ అని సత్యం సత్యానికి చెప్పుకుంటున్నాడు. అతని ప్రవర్తనకు విస్తుపోయిన దోస్తులు ‘సత్యం..’ అంటూ అతని భుజం తట్టారు ‘ఏమైందిరా’ అన్నట్టు. సత్యానికి వాళ్లు కనిపించట్లేదు.. వాళ్ల మాట వినిపించట్లేదు. తనకు తానే కనిపిస్తున్నాడు.. వినిపిస్తున్నాడు. - సరస్వతి రమ -
హిట్లర్ మీసాలున్నవారినెందరినో..
ఈరోజుల్లో హిట్లర్ మీసాలున్న వారిని చూడటం బహు అరుదు. కానీ నా చిన్న వయస్సులో హిట్లర్ మీసాలున్నవారినెందరినో చూశాను. అది ఓ స్టయిల్. అయినా హిట్లర్ మీసాలుంచుకున్న వారికి హిట్లర్ గురించి తెలుసా...ఏ మేరకు తెలుసుంటుంది....అరవై లక్షల యూదులను నాజీ సైన్యం నిర్దాక్షిణ్యంగా హతమార్చిన విషయం వారికి తెలుసా! నాకు తెలిసి ఇద్దరు హిట్లర్ మీసాలున్న వాళ్ళున్నారు. ఒకరు నా స్కూల్ రోజుల్లో క్రాఫ్ చేసే అతను. అతని పేరు దేశింగ్. మరొకరు రిక్షా తొక్కే పళని. ఈ ఇద్దరికీ హిట్లర్ మీసం అందంగానే ఉండేది. పళని దగ్గర ఓ కుక్క ఉంది. దానికో ప్రత్యేకత. దానిని పూర్తి శాకాహారిగా పెంచాడు పళని. కారణం పళని మాంసాహారం తినడు. ఎవరో నాటువైద్యుడు చెప్పిన సలహా మేరకు అతను తన కుక్కను పూర్తి శాకాహారిగా పెంచుతూ వచ్చాడు. ఆ కుక్క పేరు డాక్టర్. కుక్కకు ఎందుకు ఆ పేరు పెట్టాడో తెలీదు. ఆ కుక్క అతనితోపాటు రిక్షా స్టాండులోనే అటూ ఇటూ తిరుగుతుండేది. తన డాక్టర్ కుక్క ఎట్టి పరిస్థితిలోనూ ఎముక ముక్క కూడా చూడదని అతని ప్రగాఢమైన నమ్మకం. ఆ కుక్కతో ఒకే ఒక్క చిక్కుంది. అది దాని భయం. కాస్తంత మోటుగా ఎవరైనా కనిపిస్తే చాలు ఆ కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరికీ కనిపించని చోట దాక్కుంటుంది. ఎవరినీ చూసి అది మొరిగినట్లు చరిత్ర లేదు. అది ఒట్టి ఇడ్లీ తప్ప మరేదీ తినదు. దానికి ఇడ్లీ అంటే ఎంతో ఇష్టం. అది దాదాపుగా సాధువులాగే బతుకుతూ వచ్చింది. ఓసారి రైల్వే గేటు దాటుతుండగా ఎవరో ఓ ద్విచక్రవాహనదారుడు అడ్డంగా వచ్చి పళని రిక్షాను డీ కొన్నాడు. అనుకోని ఆ ప్రమాదంలో రిక్షా బోల్తాపడింది. పళనికి చేయి విరిగింది. ఆస్పత్రిలో చేరాడు. ఆ రోజుల్లో అతని డాక్టర్ కుక్కను స్టాండులోని ఇతర రిక్షా వాళ్ళు చూసుకోసాగారు. పది రోజుల తర్వాత పళని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తన డాక్టర్ కుక్కను చూసి అతను కంగుతిన్నాడు. కారణం, అది ఓ ఎముక ముక్కను నాకుతోంది. పది రోజుల్లో ఆ కుక్కను ఇతర రిక్షావాళ్ళు మాంసాహారిగా మార్చేశారు కదా అని పళని బాధపడ్డాడు. కోప్పడ్డాడు. తన కుక్క తనకెంతో ద్రోహం చేసిందనుకున్నాడు. ఇలా చేస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. కోపావేశంతో దాన్ని అక్కడి నుండి తరిమేశాడు. నిజానికి కుక్క మాంసం తినడం సహజమేగా. కానీ అతను దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. నమ్మకద్రోహి అని దాని మీద కారాలూ మిరియాలూ నూరుతూ వచ్చాడు. ఆ తర్వాత దాన్ని సరిగ్గా చూసుకునే వాళ్ళు లేక అది ఎక్కడపడితే అక్కడ తిరుగుతుండేది. పళని ఉండే రిక్షా స్టాండు దగ్గరకు వచ్చి తోక ఊపుతూ అతని వంక చూసేది. కానీ పళని దానిని పట్టించుకునే వాడు కాదు. అంతేకాదు, ఇంకోసారి ఇటొచ్చావంటే కొట్టి చంపేస్తానని తరిమేవాడు. కాలం గడిచింది.కొన్ని రోజులకు ఆ కుక్క ఓ లారీ కింద పడి చచ్చిపోయింది. పళనికి విషయం తెలియడంతోనే అతని మనసు ఆగలేదు. కన్నీరుమున్నీరయ్యాడు. డాక్టరయ్యా ఎంత పనైపోయింది అని ఏడుస్తూ దాన్ని ఎత్తుకుని రైలు బ్రిడ్జి పక్కన గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. ఆ రోజు డాక్టర్ కుక్క కోసం అతను మీసం తీసేశాడు. ఆ తర్వాత అతను మీసమే పెంచలేదు. ఇంతకూ అతను ఎందుకు హిట్లర్ మీసం పెట్టుకున్నాడో తెలీలేదు. పైగా తన కుక్క చనిపోయిందని ఆ మీసం తీసెయ్యడం మరీ ఆశ్చర్యం కలిగించింది. అయినా మనుషులు ఇలాగే రకరకాలుగా ఉంటారు. వారి అభిమానం అర్థం చేసుకోవడం కష్టం. ఎవరికి వారు ఏదో రూపంలో తమ అభిమానాన్ని ప్రేమనూ ఇలా చూపుతుంటారు. పైగా అతను కుక్కను శాకాహారిగా పెంచడం కూడా విడ్డూరంగానే అనిపించింది. – యామిజాల జగదీశ్ హైదరాబాద్ (తమిళంలో మిత్రుడు ఎస్.రామకృష్ణన్ చెప్పిన మాటలే దీనికి ఆధారం. ఆయనకు కృతజ్ఞతలు) -
ఆ సాళ్ళంటే సృజనాత్మక గీతాలు..
నాగేటి సాళ్ళంటే కేవలం నాగలి కర్రు గీసే గీతలు కావు. ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని పండించే సృజనాత్మక గీతాలు. నాగేటిసాలంటే సీత. సీతంటే రామునిలోని నైతిక బలం. రాముడంటే ఒకానొక భవ్యమైన నాగరికతను రమింపజేసేవాడు. పొలం దున్నుతూ ఆలోచిస్తున్నాడు పోతన. మన సంస్కృతిలో పేర్లంటే కేవలం పేర్లు మాత్రమే కావు. ప్రతి పేరు వెనుకా ఎన్నోఅర్థాలు–పరమార్థాలూ, కథలు– ఇతిహాసాలూ ఉంటాయి. వాటి వెనుక మనసులకి క్రమశిక్షణను అలవరచే నైతిక చలన సూత్రాలు ఉంటాయి. అవే మనుషుల్ని మనుషులతో ముడివేస్తూంటాయి. ఆ ముడులు వెయ్యడంలో ఒకోసారి చిక్కుముడులూ పీటముడులూ పడిపోతూంటాయి. అన్ని ముడులనీ కేవలం వేళ్ళతో మాత్రమే విడదీయలేము. కొన్నింటిని వివేకంతోనూ మరికొన్నింటిని విజ్ఞానంతోనూ విడదీయాల్సి వస్తుంది. జ్ఞానమనే క్షేత్రానికి ఆలోచనలే నాగలి కర్రులు. మెదడుతో ఆలోచిస్తే శాస్త్రం–మనసుతో ఆలోచిస్తే సృజన. తనముందున్న చిక్కుముడిని విడదీయడానికి కల్పన మాత్రమే సరిపోదు. దానికి తగిన విశ్వనీయతని కల్పించాలి. శాస్త్రీయతని జోడించాలి. అప్పుడే అది కాలానికి నిలబడగలదు. లేకపోతే కేవలం అభూత కల్పనలా మిగిలిపోతుందిగానీ సృజనాత్మకత అనిపించుకోదు. ఎలా? దున్నుతూనే చుట్టూ కలియజూశాడు. దూరంగా చెట్లు. తను ముందుకు వెళ్తుంటే అవి వెనక్కి నడుస్తున్నాయి. తను ముందుకు నడవడం నిజం. అవి వెనక్కి వెళ్ళడం అబద్ధం. అలాగని ఆ చెట్లు వెనక్కి నడుస్తున్నట్లు కనిపించడం కేవలం కనికట్టు కాదు. దానివెనక ఏదో శాస్త్రీయమైన భౌతిక సత్యం ఉంది. ఏమిటది? ∙∙ గుర్రం బండి వేగంగా పరిగెడుతోంది. అందులో వస్తున్న బొమ్మనాయకుడికి, ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా నడుస్తున్న పోతన కనిపించాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితుడు. స్నేహాన్ని స్వంతానికి ఉపయోగించుకోని సజ్జనుడు. బండిమీద రమ్మని బలవంత పెట్టినా చిరునవ్వుతో నిరాకరిస్తాడే తప్ప, కనీసం స్నేహధర్మంగా అయినా బండెక్కడు. ఆయన పాండిత్యం ఆయనకి నేర్పిన సంస్కారం అలాంటిది. అలాంటి స్నేహితుడు ఉండటం తనకి గర్వకారణం. పోతన దగ్గరకి రాగానే బొమ్మనాయకుడు బండి ఆపించి,‘‘రా మిత్రమా బండెక్కు’’ అన్నాడు. ఆ పిలుపుకోసమే ఎదురు చూస్తున్నవాడిలా బండెక్కి కూర్చున్నాడు పోతన. ఆయన్ని పిలవకపోతే బాగుండదనే ఉద్దేశంతో మాత్రమే ఆహ్వానించాడు. కానీ, ఆయన నిజంగానే తన బండెక్కడం అంటే, తన జన్మ తరింపజెయ్యడమే. అందుకే అబ్బురంగా పోతనవైపు చూస్తూ తన ఆనందాన్ని ప్రకటించబోయాడు. కానీ ఆయన దృష్టి తనమీదలేదు. తదేక చిత్తంతో బయటెక్కడో ఏదో వెతుక్కుంటున్నవాడిలా కనిపిస్తున్నారు. బహుశా ఏ పద్యం గురించో ఆలోచిస్తున్నట్లున్నారు. ఇలాంటప్పుడు ఆయన ఏకాగ్రతకి భంగం కలిగిస్తే సరస్వతీ మాత క్షమించదు. అందుకే బొమ్మనాయకుడు కూడా మౌనాన్నే ఆశ్రయించాడు. తదేకంగా బయటికి చూస్తున్నాడు పోతన. బండి వేగంగా పరుగులు తీస్తోంది. దగ్గరగా ఉన్న చెట్టుచేమలు కూడా ఆంతే వేగంగా వెనక్కి పరుగెడుతున్నాయి. కానీ, దూరంగా ఉన్న కొండగుట్టలు మాత్రం వెనక్కి కాకుండా ముందుకి నడుస్తున్నాయి. ఇవి వెనక్కీ అవి ముందుకీ ఎందుకు వెళుతున్నాయి? ఎక్కడికెళుతున్నాయి? వేగం ఇంకాస్త పెరిగితే మరింత వివరం తెలుస్తుందేమో చూడాలి. బండి వేగాన్ని పెంచమన్నాడు పోతన. దాని వేగం పెరుగుతున్నకొద్దీ ఇవతలివైపు చెట్లూ, అవతలివైపు కొండలూ మరింత వేగంగా పరిగెడుతున్నాయి. ఈసారి దృష్టిని ఒక తాడిచెట్టుమీద నిలిపి చూడటం మొదలుపెట్టాడు. అవి ముందుకీ ఇవి వెనక్కీ మాత్రమే పరుగులు తీయడం లేదు. ఇటువైపు చెట్టుచేమలూ–అటువైపు కొండకోనలూ కలిసి ఒక దీర్ఘవృత్తాన్ని ఏర్పరుస్తూ ఆ తాడిచెట్టు చుట్టూ పరుగులు తీస్తున్నట్లనిపిస్తోంది. చిన్నప్పుడు ఆడిన మట్టి బొంగరం గుర్తొచ్చింది. దానికి ముల్లుగా గుచ్చిన కొబ్బరి ఈను పుల్లలా కనిపిస్తోందా తాటి చెట్టు. వెంటనే బొమ్మనాయకుడిని అడిగి ఒక నాణెం తీసుకున్నాడు. ఏటవాలుగా చూస్తుంటే అది కూడా ఒక దీర్ఘవృత్తంలాగే కనిపించింది. కానీ దాన్ని చేతిలో పెట్టుకుని పైనుండి చూసినప్పుడు మాత్రం గుండ్రని వృత్తంలా కనిపిస్తోంది. అది వృత్తాకారమైతే దానికి కేంద్రం ఉండక తప్పదు. ఆ కేంద్రమే బిందువు. బిందువంటే పరబ్రహ్మం. ఆది మిథునం. అర్థనారీశ్వరం. రమారమణీయం. పూర్ణస్య పూర్ణమాదాయ అంటే ఇదేనేమో..ఈ లోకమే అతిపెద్ద శ్రీయంత్రమేమో..ఈ ఊహ రాగానే ఆ శ్రీచక్ర ప్రకృతే ప్రాణం పోసుకు వచ్చి తనని వాత్సల్యంతో గుండెల్లో పొదువుకున్నట్లుగా తోచింది. అమ్మ స్ఫురణకు వచ్చిన తరువాత చేతిలోని నాణెం కూడా శ్రీయంత్రంలా కనిపించింది. అంటే దాని కేంద్రకమైన బిందువు నుండీ కూడా అంతర్లోక జ్ఞాన వలయాలు విస్తరిస్తూ వెలుగులీనుతాయన్నమాట. కానీ, ఆ వెలుగుల్ని కేవలం నాణెం పరిధి వరకే పరిమితం చేస్తున్నారీ మనుషులు. అందుకే సంపదని దాటి ముందుకు ఆలోచించ లేకపోతున్నారు. ఈ ఊహ రాగానే నాణెం హఠాత్తుగా మొయ్యలేనంత బరువెక్కిపోయింది. తక్షణమే దాన్ని బొమ్మనాయకుడిచేతిలో పెట్టేసి బండి దిగి వెళ్ళిపోయాడు పోతన. ∙∙ పోతనని ఆవరించివున్న శ్రీచక్ర ప్రకృతిలోంచీ ఏదో దివ్యవాణి వినిపిస్తోంది. చూడాలి. ఇంకా లోతుగా చూడాలి. దాని ఆంతర్యాన్ని కనిపెట్టాలి. ఇంట్లోకి రాగానే తనకి ‘మహత్వ కవిత్వ పటుత్వ’ సంపదలిచ్చిన దుర్గమ్మతల్లి మెడలోని గాజులహారం కనిపించింది. ఆ గాజుల్ని చూస్తున్నకొద్దీ అమ్మవారు తనకేదో రహస్యాన్ని చెబుతున్నట్లనిపించింది. వెంటనే ఓ గాజుని తీసుకున్నాడు. దాన్ని నిలువునా వేళ్ళమధ్య పట్టుకుని నేలమీద గిరగిరా తిప్పాడు. అది గుండ్రంగా తిరుగుతూ ముందుకీ వెనక్కీ కదులుతోంది. ఆ కదలికల్లో ఒక లయబద్ధత. ఒక నాట్యం. ఒక శాస్త్రీయత. అవన్నీ ఎక్కడనించీ వచ్చాయా గాజుకి? మళ్ళీ తిప్పాడు. మళ్ళీ కొత్త కదలికలు. కొత్త లయలు. కొత్త హొయలు.అంతేనా, వాటిలో ఇంకేమైనా ఉందా? అప్పటికి అసుర సంధ్య దాటింది. చెరువునుండి నీళ్ళు తీసుకు వస్తోంది నరసమాంబ. చిన్నపిల్లాడిలా అమ్మవారి గాజులతో ఆడుకుంటున్న భర్తని చూసి మురిపెంగా నవ్వుకుంటూ లోపలకి వెళ్ళి పోయింది. ఆ నీటికడవని లోపల దింపింది. దీపం వెలిగించి గూట్లో పెట్టింది. ఆ వెలుగు కిరణాలు నీటి కడవని కేవలం తనవైపునుండి మాత్రమే చూపిస్తున్నాయి. రెండవ వైపున గుడ్డి వెలుగులో మసక మసగ్గా కనిపిస్తోంది కడవ. చూస్తూండగానే పోతన మనసులో కడవ భూమండలమైంది. దీపం సూర్యుడైంది. ఆ కడవనే చూస్తున్న తన కన్ను చంద్రుడైంది. ఆలోచన పదమైంది. పదం పాదమైంది. పాదం పద్యమైంది. ∙∙ ‘‘నీ ప్రశ్నకి సమాధానం దొరికింది. అది నువ్వన్నట్టు కల్పనా కాదు. నేనన్నట్టు భావనా కాదు. ఆ రెండింటినీ మించిన ‘అనుభవం‘ కూడా కాదు. అందులో ఉన్నది శాస్త్ర పరిజ్ఞానం’’ అన్నాడు మల్లన. ‘‘ఈ మాట చెప్పడానికేనా, హాయిగా నిద్రపోవడం మానేసి నా మొహంలోకి చూస్తూ కూర్చున్నది?’’ అంటూ భర్త ముఖాన్ని ముద్దులతో నింపేసింది శారద. ముదమారా ముద్దుల జడివానలో తడిసి ముద్దయ్యాడు మల్లన. తరువాత మెల్లగా భార్యని లేపి నిలబెట్టాడు. మంచానికి ఈ పక్క వేసిన ముక్కాలి పీటమీద కూర్చోబెట్టాడు. బుద్ధిమంతురాల్లా చేతులు కట్టుకుని భర్త ముఖంలోకి కొంటెగా చూస్తూ అడిగింది శారద, ‘‘చెప్పండి శ్రీశైలవాసా’’ మల్లన చిరునవ్వుతో, ‘‘శాస్త్రవిజ్ఞానమంటే చెప్పేది కాదనీ, సాక్ష్యాధారాలతో నిరూపించి చూపేదనీ తెలుసుకోండి భ్రమరాంబాదేవీ’’ అంటూ మంచం పట్టిమీద కూర్చుని అన్నాడు, ‘‘ముందా పద్యాన్ని గుర్తు చేసుకోండి’’ పద్యాన్ని భర్తకి అప్పగించింది శారదరవిబింబం బుపమింపఛి బాత్రమగు ఛత్రంబై, శిరో రత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పద పీఠమై వటుఛిడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్... అయినా ఈ అర్థరాత్రిపూట ఆకాశంలో రవిబింబాన్నెలా తీసుకొస్తారుగానీ నా మాట విని పడుకోండి సిరికొండ సామీ’’ ‘‘తొందరపడకు దేవీ, నీకు రవి బింబం కావాలి. అంతేగా? క్షణంలో రప్పిస్తానుగానీ ప్రస్తుతం నువ్వే మీ మామగారనుకో. అదిగో ఆ పున్నమి చంద్రుడే రవిబింబమనుకో’’ ‘‘మరి వామనుడెవరు?’’ ‘‘ఇంకెవరు? నేనే! ఇప్పుడు చెప్పండి. చందమామ ఎక్కడున్నాడు?’’ ‘‘తమరి తలకి నాలుగు మూరల పైనున్నాడు’’ కొంచెం పైకి లేస్తూ అడిగాడు,‘‘ఇప్పుడెక్కడున్నాడు? ఎలా ఉన్నాడు?’’ ‘‘అడుగు ఎత్తులో కర్రలేని గొడుగులా ఉన్నాడు.’’ మరికొంచెం పైకి లేస్తూ అడిగాడు ‘‘ఇప్పుడెక్కడున్నాడు?’’ ‘‘తలమీద కిరీటంలా ఉన్నాడు’’ తరువాత అతను కొద్ది కొద్దిగా పైకి లేస్తూంటే, అతను అడగక ముందే చంద్రుడు ఎక్కడున్నాడో ఎలా కనిపిస్తున్నాడో తన వ్యాఖ్యానంతో సహా చెప్పడం మొదలుపెట్టింది. ‘‘ఇప్పుడు చెవి దుద్దులా ఉన్నాడు. అబ్బో ఎంత పెద్ద దుద్దో. ఏమిటలా చూస్తున్నారు? నాక్కూడా అలాంటి దుద్దులు చేయిద్దామనా? వద్దులెండి. అంతంత దుద్దులు పెట్టుకుంటే చెవి తమ్మెలు చీలిపోతాయి. అదిగో మెడకి నిండైన కంఠాభరణం. అహా ఎంతందమైన భుజకీర్తో. అంత పెద్ద దండ కడియం పెట్టుకుంటే జబ్బలు పడిపోవా? అయినా నాలాంటి బక్కపీచులకి అంతలేసి కడియాలెందుకులెండి. అదిగో మొలతాడుకి కట్టిన బంగారు మువ్వ. కాళ్ళా గజ్జే కంకాళమ్మా..,పండువెన్నెల్లో వెండిగజ్జెల వైభవం మురిపిస్తోంది. మరి పాద పీఠం ఏదీ? అదిగో ఒంటి పాద పీఠం! ఏమండోయ్ వామన మూర్తిగారూ, పొరపాటున ఆ రెండో కాలు కూడా ఎత్తారనుకోండి. కింద పడతారు. మావయ్యగారు దర్శించిన దృశ్యం త్రివిక్రముడిని కళ్ళకు కట్టింది పండిత పుత్రా...అంటూ శారద నవ్వుతూంటే మల్లన కూడా శృతి కలిపాడు. ఇద్దరూ కాసేపు నవ్వుల్లో మునిగి తేలాక తనే ముందు తేరుకుంటూ అడిగింది శారద, ‘‘ఇప్పుడు మీరు చూపించింది నా కళ్ళకు కనిపించిన అనుభవం. బహుశా మామయ్యగారి అనుభం కూడా అదే అయ్యుంటుంది. ఇందులో శాస్త్రం విజ్ఞానం ఎక్కడున్నాయి?’’ ‘‘అది కూడా చూద్దుగాని’’ అంటూ మళ్ళీ మంచం పట్టెమీద నిలబడ్డాడు. శారద ఇంకా ముక్కాలి పీటమీదే కూర్చుని ఉంది. ఆమె దృష్టిని తనమీదే కేంద్రీకరించి పైకి లేవమన్నాడు. ఆమె మెల్లగా పైకి లేచింది. పూర్తిగా లేచి నిలుచున్న భార్యని,‘‘నువ్వు లేస్తున్నప్పుడు మీ మామకాని మామ ఏం చేశాడు?’’ అని అడిగాడు మల్లన. ‘‘ఏముంది తమరి భుజంమీంచీ మెల్లగా కిందికి జారాడు’’ ఈసారి ఎంత మెల్లగా లేచావో అంతే మెల్లగా కూర్చోమన్నాడు. శారద మళ్ళీ ముక్కాలిపీటమీద కూర్చున్నాక అడిగాడు ‘‘ఈసారేం చేశాడు మీ మామ?’’ ‘‘మళ్ళీ మీ చెయ్యి పట్టుకుని భుజం మీదకి పాకాడు. నేను ఇంకాస్త కిందకి దిగితే మీ నెత్తెక్కి కూర్చునేలా ఉన్నాడు’’ అంటూ నవ్వింది శారద. మళ్ళీ లేవమన్నాడు. మళ్ళీ కూర్చోమన్నాడు. తను పైకి లేస్తున్నప్పుడు చందమామ కిందికి దిగుతున్నాడు. తను కిందికి దిగుతున్నప్పుడు ఆయన పైకి లేస్తున్నాడు. అలా నాలుగైదుసార్లు లేచి కూర్చున్నాక ‘‘ఇంక ఈ గుంజీలు తియ్యడం నావల్ల కాదు బాబూ’’ అంటూ మంచం పట్టిమీద కూలబడింది. తను కూడా ఆమె పక్కనే కూర్చుంటూ చెప్పాడు మల్లన, ‘‘నువ్వు కిందికి దిగడం క్రియ అనుకో అప్పుడు చందమామ పైకి లేవడం ప్రతిక్రియ. ఒకవేళ చందమామే క్రియ అనుకో అప్పుడు నువ్వు కిందికి దిగడం ప్రతిక్రియ. అంటే ప్రతి ‘క్రియ’కీ ఓ ‘ప్రతిక్రియ’ ఉంటుంది. ఈ ‘క్రియ’, ‘ప్రతిక్రియ’ల సమ్యక్ సంయోజనమే సృష్టిలోని చలనశీలతకు మూలం. ఇది భౌతిక శాస్త్రం. ఇంక రసాయన శాస్త్రంలో నువ్వు చర్య అయితే నేను ప్రతిచర్య. మనిద్దరం కలవడమే ఒక రసాయనిక సంయోగం. ఆ యోగ ఫలంగా ప్రకృతికి ప్రతిరూపమైన నీలో చలనం కలుగుతుంది. దానివల్ల జరిగేదే ప్రతిసృష్టి.’’ అన్నాడు. ∙∙ మల్లన గుండెలమీద తల పెట్టుకుని ఆదమరచి నిద్రపోతోంది శారద. కానీ, ఆమె ఎప్పట్లా తన గుండెల్లోకి ఇంకడంలేదు. అందుక్కారణం ఆలోచనలు. వాటినుండి బయట పడాలంటే నాన్నగారినుండి ఒక ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి. రెండు వరస పద్యాలు. రెండూ వామనుడు త్రివిక్రముడయ్యే క్రమాన్ని వర్ణించేవే. మొదటి పద్యంలో ఇంతింతై వటుడింతయై అంటూ రాత్రివేళ కనపడే ఆకాశం, మేఘమండలం, పాలపుంత, చంద్రమండలం,ధ్రువ మండలం దాటి మహర్లోకాన్నీ సత్యలోకాన్నీ మించి బ్రహ్మాండాంతం వరకూ వృద్ధి చెందాడా వామనమూర్తి. తరువాతి పద్యంలో పగలు తప్ప రాత్రి కనపడని రవి బింబాన్ని ఉపమించారు. ఒకే సమయంలో పగలూ రాత్రీ కూడా ఎలా వస్తాయి? నాన్నగారిలాంటి సహజకవి రాసిన పద్యాలలోకి ఈ అసామంజస్యం ఎలా వచ్చింది? చూస్తే నాన్నగారింకా లేవలేదు. నిరంతరం భాగవత దర్శనంతోనే గడిపే ఆయనకి ఏ తెల్లవారుజామునో నిద్ర పడితే పట్టినట్టు. లేకపోతే లేనట్టు. కాబట్టి, ఆయన లేచేంతవరకూ ఎదురు చూడాలే తప్ప నిద్రాభంగం కలిగించకూడదు. అందుకే కాల్యాలు తీర్చుకుని వచ్చి స్నానాదికాలు పూర్తి చేసి గుడిముందు కూర్చున్న భక్తుడిలా గాయత్రిని జపిస్తూ కూర్చున్నాడు. ∙∙ తలుపు తెరిచిన పోతనకి ఎదురుగా జపం చేసుకుంటున్న మల్లన కనిపించాడు. అతని జపాన్ని భంగపరచడం ఇష్టంలేక తనుకూడా వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. మల్లన జపం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే లోపలికి వెళ్ళబోయాడు పోతన. కానీ మల్లన చేతులు ఆయన పాదాల్ని కదలనిస్తేగా? ‘‘నాన్నా. నిన్న రాత్రినించీ నన్నో అనుమానం తొలిచేస్తోంది. మొదటి పద్యంలో ఇంతింతై వటుడింతయై అంటూ రాత్రిని వర్ణించిన వెంటనే ఎటువంటి కాలావధీ లేకుండానే రవిబింబాన్నుపమించారు. మీ పద్యాల్లో ఇంతటి అనౌచిత్యాన్ని ఊహించలేకపోతున్నాను’’ కొడుకుని మెల్లగా లేవనెత్తాడు పోతన. లోపలకి తీసుకువెళ్ళాడు. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. అందుకే లోపల మసగ్గా ఉంది. నిన్న రాత్రి నరసమాంబ పెట్టిన నీటి కడవ ఇంకా అక్కడే ఉంది. గూట్లో దీపం కూడా వెలుగుతూనే ఉంది. దాన్ని చూపిస్తూ,‘‘ఆ దీపం సూర్యుడనుకో. మధ్యలో ఉన్న ఈ కుండే భూమండలం అనుకో. ఇప్పుడా కుండమీద సూర్యుడి వెలుగు పడినవైపంతా పగలు. ఆ కుండకి ఇవతలి వైపు నీడే గానీ వెలుగు పడదు. కాబట్టీ ఈవైపు రాత్రి. భూమండలాన్ని మించి ఎదిగిన త్రివిక్రముడికి ఇప్పుడు నీకు కనిపిస్తున్నట్టుగానే పగలూ రాత్రీ ఒకేసారి కనిపించడంలో ఆశ్చర్యంగానీ దాన్ని వర్ణించడంలో అనౌచిత్యంగానీ ఏముంది నాన్నా?’’ అన్నాడు.మల్లనకి నోట మాట పెగల్లేదు. అందుకే తండ్రివైపు అబ్బురంగా చూస్తూండిపోయాడు. పక్కనే ఉన్న నరసమాంబకి కూడా ఓ తుంటరి అనుమానం వచ్చింది,‘‘మనక్కాబట్టీ భూమి ఇక్కడ కుండలో ఉంది. సూర్యుడేమో ఈపక్కన గూట్లో ఉన్నాడు. ఆ చంద్రుడు చూస్తే కుండకి వెనకవైపున్నాడు. మరి మీ వామనుడూ, బలిచక్రవర్తీ నిలబడ్డానికి స్థలం ఎక్కడుంది స్వామీ?’’ అప్పుడప్పుడే తెల్లవారుతోంది. ఆ వేకువ కువకువల్లో పోతన పెదాలపై విరిసిందో చిరు దరహాసం. ‘‘మా వామనుడు ఆది మధ్యాంతరహితుడు. ఆ బలి చక్రవర్తేమో రాబోయే సావర్ణి మన్వంతరానికి కాబోయే దేవేంద్రుడు. వారి స్థల కాలాదుల్ని నిర్ధారించడం మనవంటి మానవమాత్రులవల్ల అయ్యేపనేనంటావా?‘ మల్లన తండ్రివైపు సంభ్రమంగా చూస్తూ మెచ్చుకోలుగా అన్నాడు,‘‘నాన్నగారూ, రాసేప్పుడు మీరెంత గొప్పకవో ఆలోచించేప్పుడు అంతకంటే ఎన్నో రెట్లు గొప్ప శాస్త్రవిజ్ఞాని. మీరు తలుచుకుంటే లోకానికి ఎంతో విజ్ఞానాన్ని పంచగలరు’’ మల్లన మాటలక్కూడా చిరునవ్వే సమాధానంగా ఇచ్చాడు పోతన. ‘‘ఈ చిద్విలాసానికి భావమేమి పతిదేవా?’’ అంటూ సాగదీసింది నరసమాంబ. దానికీ చిరునవ్వే సమాధానం. అంతలోనే అటుగా వచ్చిన శారద చెప్పింది,‘‘మామయ్యగారెంతటి ప్రాచీనులో అంతకు మించిన నవీనులు. తండ్రుల పద్యాలే తనయుల ప్రయోగాలకి ప్రేరణలు. అంటే ఈనాటి సృజనాత్మక కల్పనలే రేపటి వైజ్ఞానిక ప్రగతికి మూలాలు. అంతేనా మామయ్యగారూ’’ పోతన చిరునవ్వు ఇంకా పద్యమై పరిమళిస్తూనే ఉంది. (అంకితం: పోతన దర్శించిన చలన సూత్రాల్ని రెండుశతాబ్దాల తరువాత నిరూపించి చూపిన భౌతిక శాస్త్రవేత్త సర్ ఐజక్ న్యూటన్‌కి సభక్తికంగా) -జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి -
ఇదే మా ఇంటికి అటక
నలభైయో నంబరు జాతీయ రహదారి నుండి పదికిలోమీటర్లు కుడివైపు వెళ్ళినట్లయితే బ్రహ్మపూర్ కనబడుతుంది. ఆ మలుపు తిరగటానికి కొద్ది నిమిషాల ముందర నేను ఆదిత్యను అడిగాను– ‘‘మిత్రమా! నువ్వు నీ పుట్టిన వూరునీ స్థలాన్ని చూస్తావా? ఆ వూరు వదిలి వచ్చిన తరువాత మళ్ళీ వెళ్ళలేదనుకుంటాను’’ ‘‘ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం వూరు విడిచి వచ్చేశాను. ఈసరికి మా ఇల్లు శిథిలమైపోయి వుంటుంది. ఆ మాట కొస్తే నేను చదివిన బడి ఏమై వుంటుందో? అంచేత చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవాలని భావించి అక్కడికి వెళ్లినా నాకు నిరుత్సాహమే ఎదురు కావచ్చు. కాబట్టి నాగేన్‌బాబు గారి టీ దుకాణం వద్ద ఆగి ఒక కప్పు టీ తాగుదాం, అది కూడా ఇంకా అక్కడ వుంటే...’’ ఆదిత్య పూర్వీకులు అక్కడి స్థానిక జమీందార్లు. స్వతంత్రం వచ్చిన మరుసటి సంవత్సరం ఆదిత్య తండ్రి ఆ వూరిని శాశ్వతంగా వదలి కలకత్తా చేరి వ్యాపారంలో స్థిరపడ్డారు. బడి చదువు పూర్తయిన వరకు ఆదిత్య బ్రహ్మపూర్లోనే వున్నాడు. కలకత్తా యూనివర్శిటీలో నేను అతడి సహాధ్యాయిని. తండ్రి హఠాత్తుగా చనిపోయిన తరువాత వ్యాపార పగ్గాల్ని ఆదిత్య తీసుకున్నాడు. ఇప్పుడు నేను అతడి మిత్రుడ్నీ, భాగస్వామిని కూడా. మేము ప్రస్తుతం దేవ్దార్గంజ్లో కొత్త పరిశ్రమ స్థాపిస్తున్నాం. అక్కడి నుండే తిరిగి వస్తున్నాం. కొద్ది నిమిషాల్లో బ్రహ్మపూర్‌కు చేరుకుంటామనగా ఆదిత్య ‘ఆగు’ అన్నాడు. అక్కడ ఉన్న పాఠశాల భవనం ముఖద్వారం ఇనుపఫ్రేమ్ మీద ‘విక్టోరియా ఉన్నత పాఠశాల. స్థాపితం 1892’ అని చెక్కి వున్నది. ‘‘చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయా?’’ ఆదిత్యని అడిగాను. ‘‘ఏమీ రావడం లేదు. అప్పుడు ఇంత భవనం వుండేది కాదు. కుడివైపున ఇప్పుడు ఉన్న భవనం స్థానంలో విశాలమైన ఖాళీస్థలం ఉండేది. అందులో మేం కబడ్డీ ఆడేవాళ్ళం’’ మేము అక్కడ నిల్చుని ఒక నిమిషం పాటు బడినీ ఆ పరిసరాల్నీ పరికించాం. ఆ తరువాత కారుని చేరుకున్నాం. ‘‘నువ్వన్న టీ దుకాణం ఎక్కడుంది?’’ అని అడిగాను. ‘‘ఇక్కడి నుండి సుమారు మూడు ఫర్లాంగులు వెళ్ళాలి’’ అన్నాడు. ‘‘మీ ఇల్లు ఎక్కడుంది?’’ ‘‘ఈ పట్నానికి ఒక చివరన వుంటుంది. దాన్ని చూడాలని నాకు కోరిక ఏమీ లేదు. చూసినా ఒక విధమైన నైరాశ్యం ఆవహిస్తుంది’’ అన్నాడు ఆదిత్య. మేము తొందరగానే కూడలిని చేరుకున్నాం. ముందు టెర్రాకోట దేవాలయం కనబడింది. మేము అటు వెళ్తూ వుండగానే హఠాత్తుగా ఆదిత్య ఆశ్చర్యంగా చూశాడు. ‘నాగేన్స్ టీ కేబిన్’. అక్కడ కిరాణాదుకాణం కూడా వున్నది. ఆనాటి యజమాని కూడా సజీవంగానే ఉన్నాడు. ఇప్పుడతనికి అరవై ఏళ్ళు దాటి వుంటాయి. అతని ముఖంలో వార్థక్యపు లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ‘‘బాబూ! మీరు ఎక్కడ నుండి వస్తున్నారు?’’ మమ్మల్ని అడిగాడు. సహజంగానే అతడు ఆదిత్యను గుర్తించే ప్రశ్నే లేదు. ‘‘దేవ్దార్గంజ్ నుండి’’ అన్నాడు ఆదిత్య. ‘‘అలాగా...మరి ఇక్కడకు...’’ అన్నాడు షాపు యజామాని. ‘‘మీ దుకాణంలో ఒక కప్పు టీ తాగాలని ఆగాం’’ ‘‘చాలా సంతోషం. రండి. కూర్చోండి. మీకు మంచి బిస్కెట్లు కూడా ఇస్తాను’’ ఆ దుకాణంలో మాతో పాటు మరో వినియోగదారుడు మాత్రమే వున్నాడు. ఒక మూలగా వున్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతడు నిద్రపోతున్న భంగిమలో వున్నాడు. ‘‘ఓయ్ సన్యాల్! నాగేన్ అతడ్ని బిగ్గరగా పిలిచాడు. ‘‘ఇప్పుడు నాలుగ్గంటలు కావస్తున్నది. నువ్వు ఇంటికి వెళ్ళాల్సిన టైమయింది. ఇంకా కస్టమర్లు ఎక్కువ మందే వస్తారు’’ అంటూ మా వైపు తిరిగి కన్ను మెదిలించి ఇలా అన్నాడు: ‘‘అతడొక చెవిటి మాలోకం. కళ్ళూ సరిగ్గా కనపడవు. కాని కళ్ళద్దాలు చెయ్యించుకునే స్థోమత కూడా లేదు’’ నాగేన్‌బాబు మాటలకు సన్యాల్ ప్రతిస్పందిచిన విధానం కూడా అతని మనస్థితి పట్ల సందేహాల్ని రేపింది. అతడు కొన్ని క్షణాల పాటు మా వైపు చూసి, ఒక్కసారిగా చలించి ఏదో పాట పాడ్డం మొదలుపెట్టాడు. ‘దోచుకునే వాళ్ళొచ్చారు మరాఠా నుండి... యుద్ధానికి సిద్ధం కండి... అజ్మీరు రాజుని పిలవండి...’ బిగ్గరగా ఆ గీతాన్ని పాడుకుంటూ నమస్కారం చేసే భంగిమలో చేతులు జోడించి ఎవరివైపు చూడకుండానే షాపు బయటికి నడిచాడు. అదే రోడ్డు నుండి ముందుకెళ్ళి కూడలిని చేరుకున్నాడు. అక్కడ చాలామంది జనం వున్నారు. కానీ ఒక్కరు కూడా సన్యాల్ని పట్టించుకోవడం లేదు. కారణం ఊహాతీతమేమి కాదు. పిచ్చివాని ప్రేలాపననీ, ప్రవర్తననీ ఎవరూ పరిగణించరు. కాని ఆదిత్య ముఖంలోకి చూసి నేను నివ్వెరపోయాను. నాగేన్‌బాబు వైపు తిరిగి– ‘‘అతడెవరు? ఏం చేస్తుంటాడు’’ అని అడిగాడు. ‘‘అతడి పేరు శశాంక సన్యాల్. అతడొక శాపగ్రస్తుడు. గతంలో జరిగిన వాట్ని ఏవీ మరిచిపోడు. వాళ్ల నాన్న ఒక స్కూల్ టీచర్. ఆయనెప్పుడో చనిపోయాడు. కొద్దిపాటి పంటభూమి వుండేది. సన్యాల్ తన కుమార్తె పెళ్ళి కోసం ఆ భూమిలో ఎక్కువ భాగాన్ని అమ్మివేశాడు. అయిదేళ్ళ క్రితం అతని భార్య చనిపోయింది. ఉన్న ఒక్క కుమారుడు కలకత్తాలో పనిచేసుకుంటూ వుండేవాడు. గత సంవత్సరమే అతడొక బస్సు కింద పడి మరణించాడు. ఆ తరువాతే సన్యాల్ ఇలా తయారయ్యాడు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు’’ ‘‘అతడిప్పుడు ఎక్కడుంటాడు?’’ ఆదిత్య అడిగాడు. ‘‘జోగేష్ కవిరాజ్ సన్యాల్ తండ్రికి మిత్రులు. వారి ఇంట్లోనే సన్యాల్ ఒక చిన్నగదిలో వుంటున్నాడు. వాళ్ళే అతనికి తిండికూడా పెడుతున్నారు. కేవలం టీ బిస్కట్ల కోసమే నా షాపుకొస్తాడు. తిన్నదానికీ, తీసుకున్నదానికీ బిల్లు చెల్లించడం ఎప్పుడూ మరిచిపోడు. ఇప్పటికీ ఆత్మగౌరవంతోనే బతుకుతున్నాడు. ఇంకెంతకాలం బతగ్గలడో ఆ భగవంతుడికే తెలియాలి’’ ‘‘జోగేష్ కవిరాజ్ గారంటే...ప్రతి సంవత్సరం ఒక పెద్ద యాత్ర జరిగే విశాలమైన మైదానముంది కదా! దానికి పశ్చిమంగా వున్న ఇల్లేనా?’’ ఆదిత్య అడిగాడు. ‘‘అవును...మీకు తెలుసా? మరి మీరు?’’ ‘‘ఒకానొకప్పుడు నాకు ఈవూరితో బాగా పరిచయముండేది’’ ఈలోగా టీషాపులో రద్దీ పెరిగింది. నాగేన్‌బాబు మాకు దూరంగా వెళ్ళాడు. మేము బిల్లు చెల్లించి బయటకు వచ్చాం. ఈసారి డ్రైవింగ్ సీట్లో ఆదిత్య కూర్చున్నాడు. ‘‘మా ఇంటికి వెళ్లే రోడ్డు కొంచెం క్లిష్టంగా వుంటుంది. నేను డ్రైవ్ చేస్తేనే సులభం’’ అన్నాడు. ‘‘ఇప్పుడు తప్పనిసరైంది’’ అన్నాడు ఆదిత్య. అతడి వైఖరిని చూస్తే ‘ఎందుకు? ఏమైంది?’ అని నేనిప్పుడు ఆసక్తి కొద్దీ అడిగినా ఆదిత్య మాట్లాడే స్థితిలో లేడని అర్థమవుతుంది. ఆదిత్య ముఖకవళికల్లో ఒక గంభీరత, ఉద్విగ్నత నెలకొన్నాయి. కూడలి నుండి కొన్ని ములుపులు ఎడమ కూ, కొన్ని కుడికీ తిరిగి ముందుకు వెళ్ళిన తరువాత మేము ఒక ఇంటిని కనుగొన్నాం. దాని ప్రహారీగోడ చాలా ఎత్తుగానూ పెద్దదిగానూ వున్నది. మరోమలుపు తిరిగి పాతబడి పెచ్చులు ఊడిపోతున్న గోడ గల గేటుని చేరుకున్నాం. ఆ మూడంతస్తుల భవనం ఒకనాడు దేదీప్యమానంగా వుండేదని చూడగానే తెలుస్తుంది. అక్కడొక విరిగిన సైన్బోర్డున్నది. దాన్నిబట్టి ఆ ఇల్లు పట్టణాభివృద్ధి సంస్థకు కేంద్ర కార్యాలయంగా వుండేదని అర్థమవుతుంది. ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యంగా వున్నది. ఆదిత్య కారుని నేరుగా గేటు లోపలికి పోనిచ్చాడు. లోనికి దారి తీసే మార్గం పిచ్చి మొక్కలతో నిండి వున్నది. కారుని ముందరి ద్వారం వరకూ తీసుకెళ్ళి ఆపాడు. అక్కడ మరో మానవ ప్రాణి సంచారమే లేదు. గత దశాబ్ద కాలంలో ఆ ఇంటిలో ఎవరూ ప్రవేశించిన దాఖలాలు లేవు. ఇంటి ముందర ఒక విశాలమైన పూలతోట వుండేదని తెలుస్తున్నది. అదిప్పుడు అరణ్య సదృశంగా వున్నది. ‘‘లోనికి వెళ్లాలనుకొంటున్నావా?’’ అని అడిగాను. కారు దిగి ఆదిత్య సింహద్వారం వైపు నడుస్తున్నాడు. ‘‘అవును. లోనికి వెళ్లకుండా ఇంటి పై భాగాన్ని చేరడం సాధ్యం కాదు’’ ‘‘అంటే, ఇంటి పై కప్పా?’’ ‘‘అదే అటక’’ అన్నాడు ఆదిత్య. ఆ మాటలో ఏదో నిగూఢమైన ధ్వని నాకు వినబడింది. మరి నేనేమీ ప్రశ్నించలేదు. నేను కూడా అతడ్ని అనుసరించి నడిచాను. ఇంటి లోపలి భాగం ఇంకా ఘోరంగా వున్నది. పై కప్పుగా వున్న దూలాలు పడిపోవడానికి సిద్ధంగా వున్నాయి. ముందరి గది ఒకనాడు కేవలం సందర్శకుల కోసమే కచేరీ చావడిగా వినియోగపడినట్టున్నది. విరిగిన కుర్చీలూ బల్లలూ గదిలో ఒక మూలన పోగుపడి వున్నాయి. నేల మీద కొన్ని అంగుళాల మేర ధూళి పేరుకొని వున్నది. ఆ గది తరువాత ఒక వరండా వున్నది. దాని తరువాత సువిశాలమైన హాలు అవశేషాలున్నాయి. ఆ హాలు లోనే పూజలు, జాతరలూ, సంబరాలు, సంగీత కచేరీలూ...ఇతర వేడుకల్ని జరిపే వారని ఆదిత్య చెప్పాడు. ప్రస్తుతం ఆ హాలు గబ్బిలాలు, ఎలుకలూ, పావురాలు , బొద్దింకలూ... మొదలైన ప్రాణులకు ఆవాసంగా వున్నది. హాలుని దాటి మేము కుడివైపు వెళ్ళాం. కొద్ది అడుగుల దూరంలోనే అక్కడొక మెట్ల మార్గం పైకి దారి తీస్తున్నది. ఆదిత్య సాలెగూళ్ళను తొలగించుకొంటూ ఆ మెట్లు ఎక్కడం ప్రారంభించాడు. అతడి వెనకే నేనూ నడిచాను. నేరుగా పై కప్పు వరకూ చేరుకున్నాం. ‘‘ఇదే మా ఇంటికి అటక’’ అన్నాడు ఆదిత్య. ‘‘ఇదే నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. నా బాల్యం, విద్యాభ్యాసాలలో ఎక్కువ భాగం ఇక్కడే గడిచింది. నా తోటిపిల్లలు చాలా మంది ఇక్కడికే వచ్చి పోతూవుండేవారు. మొత్తం ఈ లంకంత కొంపలో పూర్తి స్వేచ్ఛని అనుభవించే ప్రత్యేకమైన ప్రదేశం ఇదొక్కటే. ఈ అటక గోడలో కొంతభాగం కూలి ఒక రంధ్రం ఏర్పడింది. దాంట్లోంచి నేను పైన ఆకాశమూ క్రింద ఆకుపచ్చని పొలాలూ, రైస్‌మిల్లులో కొంతభాగమూ, పద్దెనిమిదో శతాబ్ధపు టెర్రాకోట దేవాలయ శిఖరం చూడగలిగాను. క్రింది గదుల కంటే ఈ అటకగది చాలా దెబ్బల్ని ఎదుర్కొన్నట్టున్నది. బాగా ఛిద్రమైపోయి వున్నది. నేల మీద పక్షుల రెట్టలూ, గడ్డిపోచలు ఇతర చెత్తా పోగుపడి వున్నాయి. ఒక మూలన విరిగిన ఈజీ ఛైరున్నది. విరిగిన క్రికెట్ బ్యాట్ కూడా వున్నది. వంకర్లు పోయిన పేము చెత్తబుట్టా, మరో కర్రపేకేజీ పెట్టే వున్నాయి. ఆదిత్య ఆ పేకేజీ పెట్టెని ముందుకు తీసాడు. ఇలా అన్నాడు: ‘‘దీని మీద నేనిప్పుడు నిల్చోబోతున్నాను. ఇదిగాని విరిగిపోతే పడిపోకుండా నువ్వే పట్టుకోవాలి’’ సరిగ్గా గోడ పై భాగంలో ఒక గూడు వున్నది. ఆదిత్య ఆ పెట్టె పైన నిల్చుని గూడు పైకి చెయ్యి చాచాడు. దాన్లో చెయ్యి చొప్పించి కదిలించబోయాడు. కట్టుకున్న గూడు పాడై క్రింద పడగా రెండు పిచ్చుకలు ఎగిరి బయటికి వచ్చాయి. నేల మీద మరింత చెత్త పోగయింది. గూడు లోపల తడిమి చూసి ‘‘హమ్మయ్య’’ అన్నాడు ఆదిత్య. అంటే అతడు వెతుకుతున్నదేదో దొరికిందని నాకు స్ఫురించింది. అతడి చేతి వైపు చూశాను. ఒక కారమ్ స్ట్రయికర్లాంటి వస్తువు కనబడింది. అదెందుకు అక్కడున్నదో దాన్ని సుమారు మూడు దశాబ్దాల తరువాత ఎందుకు వెతికి వెలికి తియ్యవలసి వచ్చిందో నాకు అర్థం కాలేదు. దాన్ని చేత్తో పామి శుభ్రం చేశాడు. చేతి రుమాలుతో కూడా తుడిచి జేబులో పెట్టుకున్నాడు. ఆ వస్తువేమిటని నేను అడిగాను. ‘‘త్వరలోనే తెలుసుకుంటావు’’ అని మాత్రం జవాబిచ్చాడు. మేం మెట్లు దిగి క్రిందకు చేరుకున్నాం. మళ్ళీ కారెక్కి వచ్చిన దార్నే తిరిగి ప్రయాణించాం. ఒక దుకాణం ముందర ఆదిత్య కారుని ఆపాడు. ఒక గేటులోనికి ప్రవేశించాం. దానిపైన ‘క్రౌన్ జ్యూయెలర్స్’ అని రాసి వుంది. మేము షాపులోపలికి వెళ్ళి నగల వ్యాపారిని కలిసాం. ఆదిత్య అతని చేతికి ఇందాకటి వస్తువుని ఇచ్చాడు. ‘‘దీన్నొకసారి చూస్తారా?’’ షాపాయన బాగా పెద్దవాడు. మందమైన కళ్ళద్దాలతో వున్నాడు. ఆదిత్య ఇచ్చిన వస్తువుని క్రిందా మీదా వేసి చూశాడు. నాకూ అప్పుడది స్పష్టంగా కనబడింది. ‘‘ఇది చాలా పాతదిలా వుంది’’ అన్నాడతను. ‘‘అవును పాతదే!’’ అన్నాడు ఆదిత్య. ‘‘ ఇలాంటివి ఈరోజుల్లో సాధారణంగా వుండటం లేదు’’ ‘‘లేదు. దయచేసి దీన్ని మీరు తూచి ఎంత వెల చేస్తుందో చెప్పగలరా?’’ అడిగాడు ఆదిత్య. పెద్దాయన తన త్రాసుని ముందుకులాగి ఆ గు్రండని వస్తువుని దానిపైన వుంచాడు. ఏదో చెప్పాడు. అంతే! మేము అక్కడి నించి బయల్దేరి జోగేష్ కవిరాజ్ ఇంటి వద్ద ఆగాం. నాలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కాని ఆదిత్య ముఖం చూసి ఒక్క ప్రశ్న కూడా ఆడగలేకపోయాను. సుమారు పది సంవత్సరాల వయసు గల ఇద్దరు కుర్రాళ్ళు ఇంటి ముందర గోళీ కాయలు ఆడుకొంటున్నారు. కారుని చూడగానే ఒక్క గంతు వేసి ఆట ఆపి మా వైపు వచ్చారు. సన్యాల్ ఎక్కడుంటాడని ఆదిత్య వాళ్ళని అడిగాడు. ‘‘సన్యాల్ కావాలా? ఆ ముందరి ద్వారం గుండా వెళ్తే ఎడమ చేతి వైపున మొదటి గదిలో వుంటాడు. తలుపు తెరిచే వుంది. మా ఎడమ చేతి వైపు గదిలో ఎవరో మాట్లాడుతున్న ధ్వని వినబడింది. మేము దగ్గరకు వెళ్ళేసరికి సన్యాల్ ఇంకా తనలో తనే పాడుకొంటున్నాడని స్పష్టమైంది. అదికూడా టాగోర్ రాసిన ఒక పెద్ద పాట. మేము ద్వారం దగ్గరకు వెళ్ళినప్పటికీ అతడు పాటని ఆపలేదు. మమ్మల్ని గమనించినట్లుగానే తన పాటని చివరి చరణం వరకూ పాడాడు. ‘‘మేము లోపలికి రావచ్చా!’’ ఆదిత్య అడిగాడు. అప్పుడు సన్యాల్ నేరుగా మా వైపు చూశాడు. ‘‘ఇక్కడికి ఎవరూ రారు’’ బొంగురు గొంతుతో అన్నాడు. ‘‘మేము లోపలికి వస్తే మీకేమైనా అభ్యంతరమా?’’ ‘‘లేదు. రండి’’ మేము గది లోపలికి అడుగుపెట్టి ఆగిపోయాం. అక్కడ ఒక పరుపు తప్ప ఇంకేమి లేవు. సన్యాల్ ఆ పరుపు మీదనే కూర్చొని వున్నాడు. మేము అలాగే నిల్చున్నాం. సన్యాల్ మా వైపు చూస్తూనే వున్నాడు. ఆదిత్య అడిగాడు: ‘‘ఆదిత్య నారాయణ చౌధురీ నీకు గుర్తున్నాడా?’’ ‘‘వున్నాడు’’ సన్యాల్ జవాబిచ్చాడు. ‘‘ఒక సంపన్న కుటుంబంలో పుట్టి చెడిపోయిన కుర్రాడు. మంచి విద్యార్థే కాని ఎప్పుడూ నన్ను మించ లేకపోయేవాడు. నేనంటే అసూయ...చచ్చినంత అసూయ పడేవాడు. అంచేత అబద్ధాలు చెప్పేవాడు’’ ‘‘నాకు తెలుసు’’ ఆదిత్య అన్నాడు. తన జేబులోంచి చిన్న పాకెట్ వంటిది తీసి సన్యాల్‌కు అందచేస్తూ– ‘‘ఆదిత్య మీకిమ్మని పంపాడు’’ ‘‘అదేమిటి?’’ ‘‘డబ్బు’’ ‘‘డబ్బా! ఎంత?’’ ‘‘నూట యాభై రూపాయలు. వీట్ని మీరు తీసుకుంటే తను చాలా సంతోషిస్తానని చెప్పాడు’’ ‘‘నిజంగానా? నాకు నవ్వాలో ఏడవాలో తెలీడం లేదు. ఆదిత్య నాకు డబ్బు పంపాడా? ఎందుకు పంపాడు?’’ ‘‘మనుషులు కాలంతో పాటు మారుతూ వుంటారు. బహుశా మీకు తెలిసిన ఆదిత్య ఇంక వుండి వుండక పోవచ్చు’’ ‘‘అసంభవం. మాయమాటలు చెప్పొద్దు. ఆదిత్య ఎప్పటికీ మారడు. నాకు తెలుసు. ఒకరోజు నాకొక బహుమతి వచ్చింది. అది వెండిపతకం. దాన్ని లాయర్ రామతరణ్ బెనర్జీ ఇచ్చారు. ఆకాశమంత పొంగిపోయాను. అపురూపంగా దాచుకున్నాను. ఆనాటి గుర్తింపునీ సన్మానాన్నీ ఆదిత్య భరించలేపోయాడు. పతకాన్ని నా నుండి తీసుకొని తన తండ్రిగారికి చూపించి తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు. తీసుకెళ్ళాడు. అంతే, ఆ తరువాత ఆ పతకం మాయమైంది. తన జేబుకు ఒక రంధ్రం వున్నదనీ, అందులోంచి ఆ పతకం ఎక్కడో జారిపోయి వుండొచ్చనీ చెప్పాడు. ఏదైతేనేం ఆ మెడల్ శాశ్వతంగా నన్ను తిరిగి చేరలేదు’’ ‘‘ఆ పతకానికి ఖరీదే ఇది. దీన్ని తీసుకునే అర్హత నీకే వుంది’’ సన్యాల్ మావైపు ఆశ్చర్యకరంగా చూశాడు. ‘‘ఆ పతకమా? అది కేవలం వెండిది. దాని ఖరీదు మహా వుంటే అయిదు రూపాయలుండొచ్చు’’ ‘‘అవును. కాని వెండిధర బాగా పెరిగింది. ఆ మెడల్ నీకు వచ్చినప్పటి కంటే ఇప్పుడు దాని వెల ముఫ్ఫైరెట్లు అధికంగా వుంటుంది’’ ‘‘నిజంగానా? ఆ సంగతి నాకు తెలీదు...కానీ...’’ సన్యాల్ తన చేతిలో వున్న పదిహేను పదిరూపాయల నోట్ల వంకా చూశాడు. తల పైకెత్తి ఆదిత్య వైపు చూశాడు. ఇప్పుడతని ముఖకవళికలు మారిపోయాయి. ‘‘ఇది చాలా ఔదార్యమైన అంశం కదా! ఆదిత్యా!’’ అన్నాడు. మేము మౌనం వహించాం. సన్యాల్ ఆదిత్య వైపు అదేపనిగా చూశాడు. తల ఊపి చిరునవ్వు నవ్వాడు. ‘‘టీ షాపు వద్ద నిన్ను చూసిప్పుడే నీ చెక్కిలి మీద పుట్టుమచ్చతో వెంటనే గుర్తు పట్టాను. నువ్వు నన్ను పోల్చుకోలేక పోయావని భావించాను. కాబట్టి ఆ మెడల్ సంపాదించి పెట్టిన పాటనే మళ్లీ పాడాను. అది గతంలో నువ్వు చేసిన పనిని నీకు గుర్తు చేస్తుందని తలచాను. మీరు ఇక్కడికి వచ్చిన తరువాత ఆ మాటలు అనకుండా వుండలేకపోయాను. చాలా సంవత్సరాలు గడిచాయి. నువ్వు నాకు చేసిన దాన్ని నేను మరిచిపోలేదు’’ ‘‘నీకు నా పట్ల కలిగిన అభిప్రాయాలు పూర్తిగా న్యాయమైంది. నువ్వు నా కోసం అన్న ప్రతీ మాటా సరైనదే. అయినా ఇప్పుడు నువ్వు ఆ మొత్తాన్ని స్వీకరిస్తే నాకు చాలా సంతోషం’’ ‘‘వద్దు ఆదిత్యా!’’ సన్యాల్ తల అడ్డంగా తిప్పాడు. ‘‘ఈ డబ్బు శాశ్వతం కాదు. దాన్ని నేను ఏదో విధంగా ఖర్చు చేసేస్తాను. నాకు నీ డబ్బు అవసరం లేదు. నాకు కావలసింది ఆ మెడల్ మాత్రమే. దాని ఖరీదు కానే కాదు. ఆ పతకం దొరికితే అదే కావాలి. ఇప్పుడు కూడా దాన్ని ఎవరైనా తెచ్చి నాకిస్తే నా బాల్యాన్ని బాధ పెట్టిన ఆ ప్రియమైన సన్నివేశాన్ని మరిచిపోగలను. ఆ పతకాన్ని నా కొన ఊపిరి వరకూ పదిలపరుచుకుంటాను. అది నా ఉజ్వలమైన విద్యార్థి దశని గుర్తు చేస్తూ వుంటుంది. తరువాత నేను పశ్చాత్తాప పడవలసిన అవసరం అసలే వుండదు’’ ఒక అటక పైన ఒక గూటిలో సుమారు మూడు దశాబ్దాల క్రితం దాచిన మెడల్ చిట్ట చివరికి తన నిజమైన యజమాని దగ్గరకు చేరింది. తను న్యాయంగా శాశ్వతంగా వుండవలసిన చోటికే చేరింది. దాని పైన చెక్కి వున్న అక్షరాలు నాకు స్పష్టంగా కనబడుతున్నాయి. ‘చిరంజీవి శశాంక సన్యాల్, పద్య పఠనంలో ప్రత్యేక బహుమతి 1949’ మూలం : సత్యజిత్ రే అనువాదం: టి.షణ్ముఖరావు బెంగాలీ కథ -
పులుసురాయి
యుద్ధం అయిపోయింది. ఒక సిపాయి మళ్లీ ఇంటికి పోవాలని బయలుదేరి పోతున్నాడు. అలా పోతూ ఉండగా దారిలో ఒక చిన్న పల్లెటూరు దగ్గరికి వచ్చేసరికి, ఆకాశం నిండా కారు మేఘాలు కమ్ముకొచ్చినయి. చలిగాలి రివ్వు రివ్వున కొడుతూంది. వీటి అన్నిటికి తోడు కడుపులో ఆకలి దహించుకు పోతూంది. సిపాయి ఆ బాధ ఓర్చుకోలేకపోయాడు. ఆ పల్లెటూరు చిట్టచివర ఒక యిల్లు వుంది. ఆ ఇంటి దగ్గరకు వెళ్లి ఏదైనా తినటానికి పెట్టమని, ఆ ఇల్లాలిని అడిగాడు. ‘‘మేమే తిన తిండిలేకుండా తిప్పలు పడుతుంటే నీకేమి పెట్టగలం బాబూ!’’ అన్నది ఆ ఇల్లాలు. కొంత దూరం పోయాక, మళ్లీ ఇంకో ఇంటికి వెళ్లి, ‘‘నాకు చాలా ఆకలిగా వుంది, కాస్త ఏదైనా పెట్టండమ్మా’’ అని అడిగాడు. ఆ ఇంటామె కూడా ‘‘మాకే ఏమీ లేదు నాయనా, పోయిరా’’ అంది. వెంటనే సిపాయి, ‘‘పోనిలేండమ్మా, మీ వద్ద ఒక పెద్ద కుండ ఏదైనా ఉందా?’’అని అడిగాడు. ఇల్లాలు పెద్దకుండ తెచ్చి సిపాయి ముందు పెట్టింది. ‘‘మంచినీళ్లు ఉన్నయ్యా?’’ అన్నాడు. ‘‘నీళ్లకేమీ తక్కువ లేదు, బోలెడన్ని ఉన్నయి,’’ అంది ఆ ఇల్లాలు. ‘‘అయితే ఆ కుండ నిండా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టండి. నా దగ్గర ఒక అద్భుతమైన ‘‘పులుసురాయి’’ ఉంది అన్నాడు. ‘‘పులుసురాయి అంటే ఏమిటి నాయనా? మే మెప్పుడూ దాన్ని గురించి వినలేదే’’ అన్నారు ఆ యింట్లో వాళ్లు. ‘‘ఈ పులుసురాయి వేసి కాస్తే పులుసు అమృతంలాగ బలే రుచిగా తయారవుతుంది’’ అన్నాడు సిపాయి. ఆ చిత్రమైన పులుసురాయి చూడటానికి చుట్టుప్రక్కల వాళ్లందరూ సిపాయి చుట్టూ మూగారు.ఇంటి యజమానురాలు ఆ పెద్ద కుండ నిండా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టింది. సిపాయి తన జేబులోంచి ఒక రాయి(చూట్టానికి మామూలు గులకరాయిలాగే ఉంది) తీసి కుండలో పడేశాడు. ఇంక కుండలో నీళ్లు బాగా కాగనివ్వండి’’ అని చెప్పాడు సిపాయి. అందరూ ఆ కుండ చుట్టూ కూచున్నారు. నీళ్లు బాగా మరిగేంతవరకూ చూస్తూ కూచున్నాడు. ‘‘మీకు వీలుంటే కాస్త చింతపండు, ఉప్పు అందులో వెయ్యండి’’ అన్నాడు సిపాయి. చింతపండు బుట్ట, ఉప్పుతొట్టి తెచ్చి సిపాయి కిచ్చారు. కుండ పెద్దది కాబట్టి పట్టెడు చింతపండు, పిడికెడు ఉప్పు తీసుకొని ఆ కాగుతున్న నీటిలో వేశాడు. అందరూ సిపాయి ఇంకా ఏమిచేస్తాడో చూద్దామని చుట్టూ చేరారు. ‘‘కాసిని క్యారట్లు దానిలో వేస్తే బాగుంటుందేమో’’ అన్నాడు సిపాయి. ఆ ఇల్లాలు బల్లకింద దాచిన క్యారట్లు తెచ్చి తరిగి పులుసులో వేసింది. ఈ క్యారట్లు ఆ బల్ల కింద ఉండటం అంతకుముందే సిపాయి చూశాడు. క్యారట్లు బాగా ఉడికే లోపల తన చుట్టూ చేరిన వారికి ఎంతో తమాషాగా తాను యుద్ధంలో చేసిన వీర, సాహస కార్యాలను గురించిన కథలు చెప్పటం మొదలెట్టాడు. కొన్ని బంగాళదుంపలు కూడా వేస్తే, పులుసు ఇంకా చిక్కబడి బాగుంటుందని ఆ మాటల మధ్యలో సిపాయి మళ్లీ సలహా యిచ్చాడు. ఆ ఇంటివారి పెద్ద కూతురు, ‘‘కాసిని దుంపలు ఇంటిలో ఉన్నాయిలే’’ అంటూ అవి తెచ్చి పులుసులో వేసింది. పులుసు బాగా మరిగేదాకా అందరూ ఊరుకున్నారు. ‘‘ఇంకేమీలేదుగాని, నాలుగు ఉల్లిపాయలు కూడా అందులో పడేశామంటే మంచి కమ్మని వాసన వస్తుంది’’ అన్నాడు సిపాయి. ఇంటికాపు ఇది వినగానే చిన్న కొడుకుతో పక్కయింట్లోంచి కాసిని ఉల్లిపాయలు అడిగి తెమ్మన్నాడు. వాడు చెంగున పరిగెత్తుకు వెళ్లి దోసెడు ఉల్లిపాయలు పట్టుకొచ్చాడు. అవి కూడా పులుసులో పడేశారు. పులుసు తయారయ్యేలోగా అందరూ కథలు, కబుర్లు చెప్పుకుంటూ కూచున్నారు. నేను మా అమ్మనూ, ఇంటినీ వదిలి వచ్చింది మొదలు ఇంతవరకు మళ్లీ క్యాబేజీ ముఖం చూడలేదు’’ అని సిపాయి చెప్పేసరికి, ఆ ఇల్లాలు ‘‘త్వరగా వెళ్లి తోటలో క్యాబేజీ పువ్వొకటి కోసుకురావే?’’ అని చిన్న పిల్లను పంపించింది. అది కూడా తరిగి పులుసులో పడేశారు. ‘‘ఇంకా కాసేపటిలో పులుసు తయారవుతుంది లేండి. బాగా పక్వానికొచ్చింది’’ అని సిపాయి అనగానే ఇల్లాలు పొడుగాటి తెడ్డుతో పులుసు బాగా కలియబెట్టింది. సమయానికి సరీగ్గా ఆ ఇంటి పెద్దకొడుకు వేటకు వెళ్లి అప్పుడే రెండు కుందేళ్లను పట్టుకొచ్చాడు. ‘‘ఇదిగో చూడండి, పులుసు ఇంకా పసందుగా ఉండాలంటే, ఆ కుందేళ్లను కోసివేస్తే ఇంకా బాగా రుచి వస్తుందిలాగుందే’’ అన్నాడు సిపాయి. వెంటనే వాటిని కూడా కోసి పడేశారు. ‘‘ఆహా! ఘుమ ఘుమలాడుతూ ఎంత కమ్మని వాసన వస్తూందో చూశారా! నోరూరుతూందే’’ అన్నాడు సిపాయి. ‘‘అబ్బాయి! ఈ బాటసారి ఇవాళ ఒక పులుసురాయి తెచ్చాడు. దాంతో ఈ కుండలో మంచి పులుసు కాచాడు’’ అని కాపు తన పెద్దకొడుకుతో చెప్పాడు. చివరకి పులుసు కమ్మగా తయారైంది. పెద్దకుండతో చెయ్యబట్టి అందరికీ సరిపోయేంత వుంది కూడాను. సిపాయి, కాపు, కాపువాని భార్య, పెద్దపిల్ల, పెద్దకొడుకు, చిన్నపిల్ల, చిన్న కుర్రవాడు అందరూ కూచుని లొట్టలు వేసుకుంటూ తాగుతున్నారు పులుసు. ‘‘సెభాష్! ఇది నిజంగా చాలా అద్భుతమైన పులుసు’’ అని కాపు సంతోషించాడు.‘‘ఆ పులుసురాయి చాలా అద్భుతమైనది. అదే పులుసుకి అంత రుచి తెచ్చింది,’’ అన్నది కాపు భార్య.‘‘ఔను. ఆ పులుసురాయి చాలా గొప్పది. ఇవ్వాల నేను చేసినట్టు పులుసు కాస్తే, ఈ పులుసురాయి పులుసును అమితరుచిగా తయారుచేయటానికి ఎన్నాళ్లయినా పనికివస్తుంది’’ అని సిపాయి చెప్పాడు. అందరూ కలిసి సంతృప్తిగా పులుసు తాగారు. సిపాయి సెలవు తీసుకొని పోవటానికి ముందు, ఇంటి యజమానురాలు చూపిన ఆదరణకి మెచ్చుకొని, ఆ పులుసురాయి ఆ ఇల్లాలికి ఇచ్చాడు. ఆమె వద్దని చెప్పినా వినలేదు. ‘‘మరేమీ పరవాలేదమ్మా, తీసుకోండి. అదేమి పెద్ద ఘనమైన వస్తువుకాదు లేండి’’ అని సిపాయి పులుసురాయి పోయిందనే చింతావంతా లేకుండా మళ్లీ తన దారిని తాను పోయాడు. మరో గ్రామం చేరేముందు దారిలో సిపాయి మళ్లీ ఇంకొక గులకరాయి ఏరుకుని జేబులో వేసుకున్నాడు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల కోసం ఈ ‘పులుసు రాయి’ జానపద కథ ప్రత్యేకం. సౌజన్యం: 1958లో దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో అద్దేపల్లి అండ్ కో. ప్రచురించిన వేటగాడి కొడుకు: ఇతర విదేశీ కథలు. బాపు బొమ్మలతో వచ్చిన ఈ సంకలనాన్ని కనకదుర్గా రామచంద్రన్ అనువదించారు. దీనికి మూలం హెరాల్డ్ కూర్లెండర్ సంకలనం చేసిన ‘రైడ్ విత్ ద సన్’. అమెరికా రచయిత, ఆంత్రో పాలజిస్ట్ కూర్లెండర్ (1908–96) ప్రపంచ వ్యాప్తంగా భిన్న దేశాల్లోని వందల కొలదీ జానపద కథల్ని సంకలనాలుగా వెలువరించాడు. పులుసు రాయి, బెల్జియంకు చెందింది. పేదరికం, లౌక్యం, కుటుంబ జీవనాలను ఇది వినోదాత్మకంగా చిత్రిస్తుంది. ఇందులో వచ్చే క్యారట్లు అనే మాటకు అనువాదకురాలు ఎర్ర ముల్లంగి అని వివరణ ఇచ్చారు. అరవై ఏళ్ల కింద తెలుగు జనానికి క్యారట్లు అంతగా తెలిసివుండవు. కూర్లెండర్ రచనల్లో ‘ది ఆఫ్రికన్’ నవల పేరొందింది. దీన్నుంచే రూట్స్ (ఏడు తరాలు) నవలను కాపీ చేశాడని అలెక్స్ హేలీ మీద వచ్చిన ఆరోపణలు జగత్ప్రసిద్ధం. ఆ వివాదం కోర్టు బయట పరిష్కారం అయింది. -
ఆఖరి వేడ్కోలు
‘‘నన్ను చంపొద్దని చెప్పురా, జస్టినో. పో, పోయి చెప్పు. దేవుడి మీదొట్టు, దయచేసి నన్ను చంపొద్దని చెప్పు.’’ ‘‘నా వల్ల కాదు. అక్కడున్న హవల్దారు నీ గురించి వినడానికే సిద్ధంగాలేడు.’’ ‘‘ఏదోటి చేసి నా గోడు చెప్పురా. నీ తెలివి వాడు. దేవుడా, నన్ను భయపెట్టింది చాలు.’’ ‘‘నిన్ను భయపెట్టడానికని అనిపించట్లేదు. నిజంగానే నిన్ను చంపేటట్టున్నారు. నేను మళ్లీ పోయి అడగలేను.’’ ‘‘బాబ్బాబు ఒకే ఒక్కసారి పోరా. ఏం చేయగలవో చూడు.’’ ‘‘లేదు, నేను మళ్లీ మళ్లీ అడిగానంటే వాళ్లకు నేను నీ కొడుకునని తెలిసిపోతుంది. నన్ను కూడా కాల్చేసినా కాల్చేస్తారు.’’ ‘‘జస్టినో, కాస్త నా మీద కనికరం చూపించమని అడగరా.’’ జస్టినో పళ్లు కొరుకుతూ తల అడ్డంగా ఊపుతూనే ఉన్నాడు. ‘‘ఆ హవల్దారును అడుగు ఓసారి కల్నల్‌ను కలుస్తానని. నేనెంత ముసలోన్ని అయిపోయానో చెప్పు. నన్ను చంపితే వాళ్లకు ఏమొస్తుంది? ఆయన ఆత్మగలవాడే అయివుంటాడు. అలాంటివాడికి ముక్తి ఎట్లా వస్తుంది?’’ కూర్చున్న రాళ్ల కుప్ప మీదినుంచి లేచి, పశువుల దొడ్డి వైపు నడుస్తున్నవాడల్లా వెనక్కి తిరిగి, ‘‘సరే, వెళ్తాను. కానీ వాళ్లు నన్ను కూడా కాల్చేశారనుకో నా భార్యా పిల్లల గతేం కాను?’’ అన్నాడు జస్టినో. ‘‘దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు. ముందైతే నువ్వు పో, ఏం చేయగలవో చూడు.’’ మబ్బుల్నే తెచ్చారతణ్ని. తెల్లారిపోయింది, అయినా అక్కడే స్తంభానికి కట్టేసివున్నాడు, ఎదురుచూస్తూ. నిటారుగా ఉండలేకపోతున్నాడు. శాంతపడటానికి కాసేపు నిద్రకు ప్రయత్నించాడు గానీ పట్టలేదు. ఆకలిగా కూడా లేదు. అతడికి కావాల్సిందల్లా బతికివుండటం. ఎప్పుడైతే వాళ్లు చంపేస్తారని నిశ్చయంగా తెలిసిందో అప్పటినుంచీ అదే కోరిక ఉధృతం అవుతోంది. ఎప్పుడో ఎన్నో ఏళ్ల కింద కాలగర్భంలో కలిసిపోయిన సంగతి ఇలా మళ్లీ పైకి తేలుతుందని ఎవరు మాత్రం అనుకున్నారు? డాన్ లూప్‌ను చంపాల్సిన పరిస్థితి రావడం. కొందరు అనుకున్నట్టు ఎందుకూ కొరగాని విషయానికి. కానీ దానికి తనవైన కారణాలున్నాయి. అతడికి గుర్తే: ఆ ప్యూర్తా దె పియెద్రా యజమాని డాన్ లూప్ టెర్రెరోస్, అతడి సహచరుడు జువెన్సియో నావా, అంటే తనే, తన పశువుల్ని అతడు తన చేనులోకి రానివ్వకపోవడం. మొదట్లో ఇబ్బందేమీ లేదు. కానీ ఎప్పుడైతే కరువొచ్చిందో, గడ్డికి కడుపు మాడి జీవాలు ఒక్కోటీ వరుసగా చనిపోవడం మొదలైందో, అప్పుడు అతడు ఆ డొక్కలు పోయినవాటిని కంచె దాటించడం మొదలుపెట్టాడు. అది నచ్చని డాన్ లూప్ కంచెను బాగు చేయించాడు, కానీ జువెన్సియో నావా దాన్ని తిరిగి కత్తిరించాడు. పగలు ఆ కంచె బొక్క మూసుకుపోతుంది, రాత్రికేమో తెరుచుకుంటుంది. ఈ విషయం మీద డాన్ లూప్కూ తనకూ మాటా మాటా పెరిగింది. ఓసారి లూప్ గట్టిగానే హెచ్చరించాడు. ‘‘చూడు జువెన్సియో, ఇంకోసారి నీ మందలోంచి ఒక్కటి నా చెలకలోకి వచ్చినా దాన్ని చంపేస్తాను.’’ దానికి అతడు గట్టిగానే జవాబిచ్చాడు, ‘‘డాన్ లూప్, అవి నోరులేనివి, గడ్డికోసం వాటి దారి అవి వెతుక్కుంటున్నాయి, అది నా తప్పు కాదు. దేనికైనా ఏమన్నా అయితే మాత్రం నువ్వు తగిన ఖరీదు కట్టివ్వాలి.’’ అన్నట్టే అతడు రెండేళ్ల పశువును చంపేశాడు. ఇది ముప్పై ఐదేళ్ల క్రితం మార్చిలో జరిగింది, ఎందుకంటే ఏప్రిల్ కల్లా నేను కొండల్లోకి పారిపోయాను, నోటీసుల్ని తప్పించుకోవడానికి. న్యాయమూర్తికి ఇచ్చిన పది ఆవులూ, ఇంటిని వేలం వేసిన సొమ్మూ జైలుకు పోకుండా ఉండటానికి ఖర్చయింది. అయినా వాళ్లు మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉన్నారు. అప్పుడే నా కొడుకును తీసుకుని పాలో దె వెనాదో వైపు వచ్చాను. వాడు పెరిగాడు, ఇగ్నేసియాను పెళ్లి చేసుకున్నాడు, ఎనిమిది పిల్లలు కలిగారు వాళ్లకు. కాబట్టి ఆ సంగతి ఎప్పుడో పాతబడిపోయిందనుకున్నాను. వంద పెసోలతో అంతా చక్కబడుతుందనుకున్నాను. చచ్చిపోయిన లూప్‌కు భార్యా ఇద్దరు చిన్న పిల్లలూ ఉన్నారు. విధవరాలు వెంటనే చనిపోయింది, కొందరు బాధతో చనిపోయిందన్నారు. పిల్లల్ని దూరంగా వాళ్ల బంధువులెవరో తీసుకుపోయారు. ఇంక భయపడటానికి ఏమీలేదనుకున్నాను. కానీ మిగతా జనం ఉంటారుకదా, నన్ను ఇంకా దోచుకోవడానికి, ఎవరో కొత్తవాళ్లు నీకోసం అడిగారని చెబుతూనే ఉన్నారు. గుట్టల్లో దాక్కుంటూ, అక్కడ దొరికిందేదో తింటూ రోజులు గడపాల్సి వచ్చేది. ఏదో అర్ధరాత్రి కుక్కలు వెంటపడుతుండగా ఇల్లు చేరాల్సి వచ్చేది. జీవితమంతా ఇలాగే. ఒక ఏడాదీ రెండేళ్లూ కాదు, యావజ్జీవితం. కానీ మళ్లీ అతడికోసం వచ్చారు వాళ్లు, నిజంగానే అందరూ మరిచిపోయివుంటారని అతడికి నమ్మకం కుదిరాక. కనీసం చివరి రోజులైనా ప్రశాంతంగా బతుకుదామని అనుకున్నాడు. భార్య తనను వదిలిపెట్టినా ఆమెను వెతకడానికి కూడా ప్రయత్నించలేదు. ఆమె కోసం మళ్లీ వెతకాలన్న ఆలోచన కూడా రాలేదు. ఆమె ఎవరితో పోయిందో కూడా పట్టించుకోలేదు. అన్నీ వదిలేసినట్టే ఆమెనీ వదిలేశాడు. పరుగెత్తీ పరుగెత్తీ అలసిపోయాక, దేహం ఉడిగిపోయాక ఇప్పుడొచ్చి వీళ్లు ఈ ముసలితనంలో పట్టుకుంటారని మాత్రం అతడు కలలో కూడా అనుకోలేదు. కానీ పాలో దె వెనాదోకు వచ్చారు వాళ్లు. కట్టాల్సిన పని కూడా లేకపోయింది. మౌనంగా వాళ్లను అనుసరించాడు. అతడి కాళ్లు బరువుగా కదిలాయి, నోరు ఎండిపోయింది, కడుపులో సలపడం మొదలైంది, మృత్యువును తలుచుకోగానే అతడికి ఇన్నేళ్లనుంచీ అయినట్టు. అయినా వాళ్లు తనను చంపబోతున్నారనే ఆలోచనను అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. వాళ్లు తన కోసం కాకుండా ఇంకో జువెన్సియో నావా కోసం వెతుకుతున్నారు కావొచ్చు. నేనెవరినీ ఏమీ చేయలేదని తనను పట్టుకున్న మనుషులకు చెబుదామనుకున్నాడు. నోరు పెగల్లేదు. ఇంకొంత దూరం పోయాక చెబుదామనుకున్నాడు. వాళ్ల ముఖాలను అతడు చూడట్లేదు, వాళ్ల శరీరాలు కనబడుతున్నాయి. అతడు మాట్లాడటం మొదలుపెట్టాక వాళ్లు విన్నారో లేదో కూడా తెలీదు. వాళ్లు ఇతనివైపు చూడనేలేదు. ఆశ చాలించుకొని చేతులు వేలాడేసుకుని నడవటం మొదలుపెట్టాడు. ‘‘కల్నల్, ఆ మనిషిని తెచ్చాం.’’ ఒక ఇంటిముందు ఆగారు వాళ్లు. అందులోంచి వచ్చే మనిషి కోసం అతడు గౌరవంగా టోపీ తీసి నిలబడ్డాడు. మనిషి రాలేదు, గొంతు వినబడింది. ‘‘ఏ మనిషి?’’ ‘‘అదే, పాలో దె వెనాదో నుంచి కల్నల్.’’ ‘‘అతడు అలిమాలో ఎప్పుడైనా ఉన్నాడో అడగండి?’’ అడిగారు. చెప్పాడు. ‘‘అతడికి గ్వాడలూప్ టెర్రెరోస్ తెలుసేమో అడగండి.’’ ‘‘డాన్ లూప్? అవును, నాకు తెలుసు. అతడు చనిపోయాడు.’’ ఇంట్లోంచి గొంతు మారింది. ‘‘ఆయన చనిపోయాడని నాకు తెలుసు.’’ అవతలి ఒడ్డున ఉండి మాట్లాడుతున్నట్టుగా అతడు సంభాషిస్తున్నాడు. ‘‘గ్వాడలూప్ టెర్రెరోస్ మా నాన్న. నేను పెరిగి పెద్దయ్యాక నాన్న ఏడని అడిగితే చచ్చిపోయాడని చెప్పారు. మేము ఏ వేళ్లనుంచైతే ప్రాణం పోసుకోవాలో ఆ వేరే చనిపోయిందని తెలిసి బతకాల్సిరావడం దుర్భరం. కొన్నేళ్ల తర్వాత ఆయన్ని ముందు కత్తితో నరికి, అటుపై ముల్లుగర్రతో కడుపులో గుచ్చి చంపేశారని తెలిసింది. ఆయన రెండ్రోజుల పాటు వాగులో పడివున్నాడు, చివరగా ఆయన్ని చూసినవాళ్లతో తన కుటుంబాన్ని ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడ్డాడు. కాలం గడిచినకొద్దీ నువ్వు ఇది మరిచిపోయుంటావు. కానీ ఇదంతా చేసినవాడు ఇంకా బతికేవున్నాడనే విషయాన్ని నేను మరిచిపోలేను. ఆయనెవరో తెలియకపోయినా కూడా నేను క్షమించలేను. నువ్వు అసలు ఈ భూమ్మీదే పుట్టకుండా ఉండాల్సింది.’’ ఇదంతా చెప్పాక ముసలాయన్ని తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. ముసలయాన బతిమాలాడు. జీవితాంతం తను చేసిన తప్పుకు మూల్యం చెల్లిస్తునే ఉన్నాననీ, ఏ క్షణమైనా తనను చంపుతారనే భయంతోనే ఇన్నేళ్లూ బతికాననీ, ఇంత నికృష్టమైన చావుకు తాను అర్హుడిని కాననీ... లోపల్నుంచి ఒకటే మాట వచ్చింది, ‘‘అతణ్ని కట్టేయండి, కాల్పులు బాధించకుండా ఉండటానికి ఏమైనా తాగించండి.’’ ఎట్టకేలకు అతడు మూగబోయాడు. స్తంభం పాదాల దగ్గరికి వాలిపోయాడు. తండ్రి శవం రోడ్డు దగ్గరి గోతిలోకి జారకుండా పైకి లాగాడు జస్టినో. మరీ బాగుండదని ముఖాన్ని గోనెసంచిలో దాచాడు. గాడిద మీద శవాన్ని వేసుకుని పాలో దె వెనాదో వైపు దౌడు తీశాడు, మరీ చీకటిపడితే రాత్రి శవాన్ని కాపలా కాయడానికి మనిషెవరూ దొరకరు. ‘‘నీ కోడలు, నీ మనవలు నువ్వు లేవని తెలిస్తే ఏమంటారో. నీ ముఖాన్ని చూసి నువ్వని మాత్రం నమ్మరు వాళ్లు. నీ ముఖం మీద తగిలిన బుల్లెట్ రంధ్రాలను చూసి ఏదైనా అడవి కుక్క నీ ముఖాన్ని తినేసిందని అనుకుంటారు.’’ క్వాన్ రూసో (1917–86) స్పానిష్ కథ ‘టెల్ దెమ్ నాట్ టు కిల్ మి’కి సంక్షిప్త రూపం ఇది. అనువాదం: సాహిత్యం డెస్క్. రచనా కాలం: 1951. తక్కువ కథలు, ఒక నవలికతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న క్వాన్ రూసో మెక్సికోలో జన్మించాడు. ఆయన కథల్లో ఇది ప్రసిద్ధం. -
చట్టం ముందు..
చట్టం ముందు ఒక కాపలావాడు నిలబడి ఉంటాడు. ఒక పల్లెటూరి మనిషి కాపలావాడి దగ్గరకు వచ్చి చట్టం లోపలికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని బతిమాలతాడు. కాని కాపలావాడు అనుమతి ఇప్పుడు ఇవ్వలేనని అంటాడు. ఆ వచ్చిన మనిషి కాసేపు ఆలోచించి, అయితే తర్వాత ఎప్పుడైనా అనుమతి దొరికే అవకాశం ఉందా అని అడుగుతాడు. ‘అవకాశం ఉంది, కానీ ఇప్పుడు కాదు,’ అంటాడు కాపలావాడు. ఎప్పటిలాగే తెరుచుకొని ఉన్న చట్టం తలుపుల్లోంచి, కాపలావాడు పక్కకు జరగటంతో, ఆ మనిషి లోపలికి తొంగి చూస్తాడు. కాపలావాడు అది చూసి నవ్వి అంటాడు: ‘నీకు అంత ఆత్రంగా వుంటే, నా మాట కాదని లోపలకి వెళ్ళే ప్రయత్నం చేయి. కాని ఒకటి మటుకు గుర్తుంచుకో: నాకు చాలా బలముంది. అయినా నేనిక్కడ కాపలావాళ్ళలో చివరిస్థాయి వాడ్ని మాత్రమే. లోపలకి వెళ్ళేసరికి ఇలా గది నుండి గదికి ప్రతీ తలుపు దగ్గరా ఒక్కో కాపలావాడు నిలబడి ఉంటాడు, ప్రతీ ఒక్కడూ ముందువాడి కంటే బలవంతుడే. మూడో కాపలావాడికి ఎదురుగా నిలబడటానికి నాకే ధైర్యం చాలదు.’ పల్లెటూరి నుంచి వచ్చిన మనిషి ఇలాంటి కష్టాలను ఊహించ లేదు; చట్టం అందరికీ అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉండి తీరాలని అతని అభిప్రాయం, కాని ఇక్కడ ఈ కాపలావాడ్ని–– ఇలా ఉన్నికోటు వేసుకొని, మొనదేలిన పెద్ద ముక్కుతో, నిగనిగలాడే నల్లని తార్తారు గెడ్డంతో సన్నగా పొడవుగా ఉన్నవాడ్ని–– కాస్త దగ్గరగా పరిశీలించిన మీదట, అనుమతి వచ్చేంత వరకూ ఎదురుచూడటమే మంచిదన్న నిర్ణయానికి వస్తాడు. కాపలావాడు అతనికి ఒక పీట ఇచ్చి తలుపుకి వారన కూర్చోనిస్తాడు. ఆ మనిషి అక్కడే రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కూర్చుంటాడు. పదే పదే లోపలికి అనుమతి ఇవ్వమని అడుగుతూ అభ్యర్థనలతో కాపలావాడ్ని విసిగిస్తాడు. అప్పుడప్పుడూ కాపలావాడు ఆ మనిషిని ఆరాలు తీస్తాడు, ఇంటి గురించీ మిగతా విషయాల గురించీ అడుగుతాడు, కానీ అవన్నీ గొప్పవాళ్ళు తెలుసుకోవాలని లేకపోయినా అడిగే ప్రశ్నల్లా ఉంటాయి, ఎంతసేపు మాట్లాడినా చివరకు మాత్రం ఇంకా అనుమతి లేదనే ముక్తాయిస్తాడు. ఈ ప్రయాణం కోసం చాలా సరంజామా వెంటపెట్టుకొని వచ్చిన ఆ మనిషి, తెచ్చుకున్నదంతా, అదెంత విలువైనదైనా, కాపలావాడికి లంచాలు ఇవ్వటానికి వాడేస్తాడు. కాపలావాడు అన్నీ కాదనకుండా తీసుకుంటాడు, కాని తీసుకొనేటప్పుడు మాత్రం: ‘ఇంకా ఏదో ప్రయత్నించకుండా వదిలేశావని నువ్వనుకోకుండా ఉంటానికి మాత్రమే ఇది తీసుకుంటున్నాను,’ అనటం మానడు. అన్ని సంవత్సరాల సమయంలోను ఆ మనిషి నిరంతరాయంగా కాపలావాడ్ని గమనిస్తూనే ఉంటాడు. అందులో పడి మిగతా కాపలావాళ్ళ సంగతే మరిచిపోతాడు, ఈ కాపలావాడొక్కడే చట్టంలోపలికి వెళ్లటానికి ఏకైక అడ్డంకిగా కనిపిస్తాడు. ఈ దురదృష్టానికి తన్ను తానే తిట్టుకుంటాడు, వచ్చిన కొత్తల్లో పైకే తిట్టుకుంటాడు, కానీ తర్వాత, వయసు మళ్ళేకొద్దీ, తనలో తాను గొణుక్కోవటంతో సరిపుచ్చుకుంటాడు. అతనిలో పిల్లచేష్టలు మొదలవుతాయి, సంవత్సరాల తరబడి అదే పనిగా చూడటం వల్ల కాపలావాడి కాలరు మడతలోని నల్లులను కూడా గుర్తుపట్టి, వాటిని కూడా తన తరఫున కాపలావాడి మనసు మారేలా బతిమాలమని అడుగుతాడు. రాన్రానూ అతని చూపు మందగిస్తుంది, చుట్టూ ప్రపంచమే మసక బారుతోందో లేక తన కళ్ళే తనను మోసం చేస్తున్నాయో అర్థం కాదు. కానీ, అంత చీకటిలో కూడా, అతను చట్టపు ప్రవేశ ద్వారం నుంచి ఆగకుండా వెలువడుతున్న ఒక కాంతి పుంజాన్ని దర్శించగలుగుతాడు. ఇక అతని జీవితం చివరికొచ్చేసింది. చనిపోయేముందు, ఇన్ని సంవత్సరాల అనుభవాలూ మనసులో కూడుకొని, కాపలావాడ్ని ఇప్పటిదాకా అడగని ఒకే ఒక్క ప్రశ్నగా రూపుదిద్దుకుంటాయి. పట్టేసిన శరీరాన్ని నిటారుగా లేపలేక, కాపలావాడికి సైగ చేస్తాడు. వాళ్ళిద్దరి ఎత్తుల్లో పెరిగిన తేడా వల్ల ఇప్పుడు కాపలావాడు అతని వైపు వొంగాల్సి వస్తుంది. ‘ఇప్పుడేం తెలుసుకోవాలి, నీకు తృప్తి అన్నదే లేదు కదా!’ అంటాడు కాపలావాడు. ‘ప్రతి ఒక్కరూ చట్టంలోపలికి వెళ్ళాలని ఆరాటపడతారు కదా. మరి, ఇన్నేళ్ళలో, ఇక్కడ నేను తప్ప ఇంకెవరూ వచ్చి ప్రవేశానికి అనుమతి అడగలేదెందుకు?’ అని అడుగుతాడు ఆ మనిషి. అతను ఆఖరి క్షణాల్లో ఉన్నాడని కాపలావాడు గ్రహిస్తాడు, వినికిడి తగ్గుతున్న అతని చెవుల్లోకి చేరేట్టు, గట్టిగా ఇలా అరుస్తాడు: ‘ఇంకెవ్వరూ ఇక్కడ నుంచి లోపలకు వెళ్ళలేరు, ఎందుకంటే ఈ తలుపు ఉన్నది నీ ఒక్కడి కోసమే. ఇప్పుడిక దాన్ని మూసేస్తున్నాను.’ కలల్లాంటి కథలు కాఫ్కా రచనా ప్రక్రియ మన కలల నిర్మాణాన్ని ఫాలో అవుతుంది. మన కలల్లో ఒక ధోరణి ఉంటుంది. వాటిలో కనపడే దృశ్యాలకూ, వాటివల్ల మనకు కలిగే భావాలకూ పొంతన ఉండదు. కనపడే దృశ్యాలతో ఏ మాత్రం సంబంధంలేని భావాలేవో కలుగుతుంటాయి. కలలో మనం చందమామని చూసి కూడా భయపడవచ్చు. మరి మెలకువ జీవితంలో ఆహ్లాదకరమైన చందమామ కలలో భయకారకమెలా అయింది? అంటే, నిజానికి కాలేదు. కలలో మనకు భయం కలిగేది చందమామ ‘వల్ల’ కాదు, మనలో ఆల్రెడీ ఉన్న భయమే చందమామ మీదకూ ప్రసరించి దాన్ని కూడా భయావహం చేస్తుంది, అదే స్థానంలో మరే ఇతర అప్రమాదకర దృశ్యాలున్నా కూడా––సూర్యాస్తమయం, చెట్టు మీద కాకులు, దగ్గరగా ఎగిరే విమానం––అలాంటి భయమే కలగవచ్చు. అంటే, కల ఒక భావంతో మొదలవుతుంది, ఇక తర్వాత కలలో ఏ దృశ్యం వచ్చి పడినా, అది ఆ పూర్వనిశ్చిత భావాన్నే ప్రకటిస్తుంది. కాబట్టి, ఆ ‘చందమామ కల’కు సంబంధించినంత వరకూ దృశ్యం వల్ల భయం కాదు, భయం వల్ల దృశ్యం. ఇక్కడ భయం ప్రేరేపిత భావం కాదు, ప్రేరేపక భావం. దీన్ని ఒక్క భయం అనే భావానికే కాదు; ఆహ్లాదం, కామం, ఉద్వేగం, జుగుప్స ఇలా ఏ భావానికైనా వర్తింపజేయవచ్చు. కానీ కాఫ్కా జీవితాన్ని ప్రధానంగా నిర్దేశించిన ఏకైక భావం భయం: తండ్రి పట్ల భయం, ఆరోగ్యం పట్ల భయం, సెక్సువల్ ఇంటిమసీ పట్ల భయం, పెళ్ళి పట్ల భయం, చివరకు సాహిత్యం పట్ల కూడా భయమే. కాఫ్కా జీవితానుభవాల్ని యథాతథంగా తీసుకోలేదు, అవి తనలో కలిగించిన భావాల్ని మాత్రం తీసుకున్నాడు. ఆ భావాన్ని తనలో నింపుకుని, ఆ భావం పూనినవాడై, ఆ భావంతో మమేకమై– కలం కదిపాడు. ఇక అతను రాసింది ఏదైనా ఆ భావం మాత్రం ఆ సృజన అంతటా ఒక పారదర్శకపు పొరలా పరుచుకుని ఉంటుంది. పాఠకుని మనసు ఆ భావాన్ని అనుభూతి చెందుతుంది, కానీ బుద్ధికి మాత్రం ఆ భావానికీ, రచనలోని వివరాలకూ తార్కికమైన సంబంధమేమిటో అందదు. అచ్చంగా కలల్లోలాగానే. కానీ ఎంతైనా పుస్తకం అనేది ఒక కాంక్రీటు వాస్తవం. అందులో వ్యాకరణానుగుణమైన వాక్యాలూ, వర్ణితమైన సన్నివేశాలూ ఒక తార్కికమైన క్రమాన్నీ, మెటీరియల్ ఉనికినీ కలిగి ఉంటాయి. పైగా కాఫ్కా రియలిస్టు రచయితలతో పోటీపడేవిధంగా కాల్పనిక ప్రపంచాల్ని తీర్చిదిద్దుతాడు. దాంతో వాటి నిర్మాణం తార్కికంగా స్పష్టంగా ఉంటుంది, అర్థం మాత్రం కలలోలా అలికేసినట్టు ఉంటుంది. ఈ కాంబినేషన్ పాఠకుల్ని చిత్రమైన ఆకర్షణతో కట్టిపడేస్తుంది. వారికి కాఫ్కాను చదవడం మెలకువలో ఉండి కలగంటున్నట్టుగా తోస్తుంది. ఫ్రాంజ్ కాఫ్కా (1883–1924) ‘బిఫోర్ ద లా’కు ఇది అనువాదం. 1914–15 మధ్యలో ఆయన రాసిన ‘ద ట్రయల్’ నవలలో ఒక పాత్ర చెప్పే నీతి కథలాంటిది ఇది. తర్వాత విడిగా కూడా ప్రచురణ అయింది. అనువాదం, పరిచయం: మెహెర్. అనువాదకుడు కాఫ్కా కొన్ని కథల్ని ‘మెటమార్ఫసిస్’గా పుస్తకం తెచ్చారు. -
విజయమహల్ రిక్షా సెంటర్
నెల్లూరులో రైలు కట్టకు తూర్పు వైపున ఉన్న విజయమహల్ సెంటర్ ఊరికి నడిబొడ్డు. రైలు గేట్‌కి తూర్పు పక్కన విజయమహల్ సెంటర్లో నాలుగు రోడ్ల కూడలిలో తూర్పు, దక్షిణ మూలను అనుకొనే మా ఇల్లు ఉండేది. మా ఇంటిముందు చాల పెద్ద జాగా ఉండేది. ఆ జాగాలో చాలామంది రిక్షా వాళ్ళు రాత్రి పూట బాడుగలు అయిపోయాక వాళ్ళ రిక్షాలను పెట్టుకొని విశ్రాంతి తీసుకునేవాళ్ళు. రోజూ వాళ్ళు ఆ తావునే ఉండడంతో ఆ తావుకు ‘విజయమహల్ రిక్షా సెంటర్’ అనే పేరు వచ్చింది. దసరా వస్తే మా రిక్షా వాళ్ళు అందరూ నవరాత్రులలో బాడుగలు మానేసి దసరా వేషాలు కట్టి నాలుగు రాళ్లు సులభంగా సంపాదించుకునే వాళ్ళు. నెల్లూరులో మా విజయమహల్ సెంటర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో బాగా పాపులర్ అయిన దసరా వేషం ఏదంటే మా తాగుపోతూ రమణయ్య వేసే శవం వేషం అని అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ కాస్త తాగుబోతు రమణుడు గురించి మీకు చెప్పాలి.అతనికి ఇల్లు, వాకిలి, భార్య,పిల్లా జల్లా...ఈ బంధాలు ఏవి లేకపోవడంతో రిక్షా బాడుగలు లేనపుడు పగలు రాత్రి తేడా లేకుండా సారాయి తాగేసి రిక్షాలో పడి మత్తుగా నిద్రలో జోగుతుండేవాడు.అందుకే అతనికి తాగుబోతు రమణుడు అని పేరు మా సెంటర్లో. దసరా రోజులలో పొద్దుపొద్దునే తాగుబోతు రమణుడి చేత ఫుల్లుగా మందు తాగించేవాళ్ళు. బాగా తాగి మత్తులో వొళ్ళు తెలీకుండా ఉండే అతన్ని పాడె మీద పడుకోబెట్టి తాళ్లతో గట్టిగా కట్టసేవాళ్ళు. చెంచు రామయ్య ఆడమనిషి వేషం వేసుకొని జుట్టు విరబోసుకొని తాగుబోతు రమణయ్య భార్యలాగా నటించేవాడు. ఇక సుధాకర్, రంగయ్య, శీనయ్య పాడె మోసేవాళ్ళు. మూడో మనుషులు అనిపించుకున్న మస్తాను, కస్తూరి కూడా ఆడ వేషాలలో చెంచురామయ్య ఏడుపుతో జతకలిపేవాళ్లు. అందరూ కలసి ఇంటింటి ముందరకు వెళ్లి పాడె దింపి తాగుబోతు రమణయ్య చనిపోయినట్టు గుండెలు బాదుకుంటూ ఏడ్చేవాళ్ళు. ఇళ్లలోని ఆడవాళ్లు ఇదెక్కడి పాడు వేషం అని చీదరించుకుంటూనే డబ్బులు ఇచ్చేవాళ్ళు త్వరగా వాళ్ళను వదిలించుకోవచ్చు అని. అలాగే వాళ్ళు పాడెను అంగడి అంగడి ముందర దింపి ఏడుపు,పెడ బొబ్బలు మొదలెట్టేవారు. వాళ్ళ ఏడుపులకు కడ్డుపుబ్బా నవ్వుకొని పదో పరకో ఇచ్చేవాళ్ళు. నవరాత్రుల రోజులలో తాగుబోతు రమణయ్య శవం వేషం నెల్లూరు అంతా ప్రాచుర్యం పొందింది. ఆ వేషం చూడడానికి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎక్కడెక్కడనుంచో మా విజయమహల్ సెంటర్‌కి వచ్చేవాళ్ళు. అప్పుడు మేము పదోతరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా ఎప్పటిలాగే ఆ ఏడాది కూడా నవరాత్రులలో తాగుబోతు రమణయ్య చేత శవం వేషం వేయించారు. ఇంక విజయదశమి రెండు రోజులు ఉందనగా, దుర్గాష్టమి రోజు పొద్దున మత్తులో ఉన్న రమణయ్యను పాడె మీద వీధులలో తిప్పుతూ డబ్బులు దండుకోసాగారు. పండగ ఇక రెండు రోజులలో అయిపోతుంది. ఇక వేషాలేసి డబ్బులు సంపాదించే అవకాశం లేదని చెంచురామయ్య, సుధాకర్ , శీనయ్య వాళ్లంతా మధ్యాహ్నమైనా తిండి తినక పగలంతా ఎండలో తిరుగుతూ సాయంత్రం బాగా చీకటి పడేవేళకు మా ఇంటిదగ్గరకు వచ్చి పాడెను దించి అందరూ మున్సిపాలిటీ కొళాయి దగ్గరకు వెళ్లి కాళ్లు, చేతులు కడుగుకుంటున్నారు. చెంచు రాముడు ఆకలికి ఓర్వలేక రోడ్డు దాటి పరుగులాంటి నడకతో మా కిష్టమామ అంగడికి వచ్చి పులి బొంగరాలు పొట్లం కట్టించుకోసాగాడు. ఈలోగా మిగతా వాళ్ళు తాగుబోతు రమణయ్య కట్లు విప్పి అతని ముఖాన నీళ్లు చల్లారు. రమణయ్యలో ఎటువంటి చలనం లేదు. అందరూ కంగారుగా ‘ఒరే రవణా లేవరా పొద్దు పోయింది. తిని పడుకుందువుగాని, ఎల్లుండి నించి మనం రిక్షా బాడుగలకు పోదాం’ అంటూ అతన్ని తట్టి లేపసాగారు. రమణయ్యలో ఎటువంటి ఉలుకు,పలుకు లేదు. ఎందుకో వారిలో తెలియని భయం, నిస్తేజం ఆవహించింది. ‘రవణా, రవణా’ అంటూ అతన్ని కుదిపేస్తున్నారు. అంగడిలో నుంచి ఇదంతా చూస్తున్న మా కిష్టమామ గబగబా పక్క వీధిలోకి వెళ్లి మేము రూపాయి డాక్టర్ అని పిలుచుకునే ఆర్.ఎం.పి. డాక్టర్ పుల్లయ్యను తీసుకువచ్చాడు. అందరూ బెరుకు గుండెలతో దిగాలుగా రమణయ్యను చూస్తున్నారు. పుల్లయ్య డాక్టర్ రమణయ్యను పరీక్ష చేసి పెదవి విరిచాడు. రమణయ్య చనిపోయి అప్పటికే దాదాపు మూడు గంటలు గడిచాయట. అప్పుడే రోడ్డు దాటి పులిబొంగరాల పొట్లంతో వచ్చిన చెంచురామయ్య అక్కడి దృశ్యం చూశాడు. చేతిలో ఉన్న పొట్లం జారిపోయి పులిబొంగరాలన్నీ నేల మీద పడి చెల్లా చెదురు అయిపోయినాయి. శిలా ప్రతిమలా నిలబడిపోయాడు చెంచురామయ్య. పొద్దున లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి నిద్రపోయేవరకు తనతో కలసి మెలిసి ఉండే తాగుబోతు రమణయ్య ఇక లేడని తెలిసిన చెంచురాముడు కుప్పకూలి పోయాడు. పాడె మీద శవం వేషం వేసిన తాగుబోతు రమణుడు ఆ పాడె మీదనే శవం అవుతాడని ఊహించని వాళ్ళు అప్పుడు వేషం కోసం కాకుండా నిజంగానే తాగుబోతు రమణయ్య శవం మీద పడి ఎన్నవలు పెట్టి ఏడ్చారు. ఏ పాడె మీద ఐతే అతన్ని ఊరు అంతా తిప్పారో అదే పాడె మీద ఉన్న అతని శవాన్ని పూలతో కప్పేసి ఏడ్చుకుంటూ రిక్షా వాళ్ళు, అంగళ్ల వాళ్ళు అందరూ కలసి తప్పెటల మోతల నడుమ తాగుబోతు రమణయ్య శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్లారు. ఇదంతా మా కళ్ళ ముందే జరిగింది. మా సెంటర్లో ఆ రోజు పెద్దవాళ్ళతో పాటు మా పిల్లల మనసులు కూడా విషాదంతో నిండిపోయాయి. ప్రతి ఏడాది ఎన్నో సంతోషాలు నింపే దసరా పండుగ ఆ ఏడాది మా తాగుబోతు రమణయ్య మరణంతో మాకు విషాదాన్ని పంచింది. ఆ తర్వాత కాలంలో మా విజయమహల్ సెంటర్లో శవం వేషం వేసేవాళ్ళే లేరు. ఇక ఎప్పుడు దసరా పండుగ అన్నా మా నెల్లూరు విజయమహల్ సెంటర్లో ఉన్నవాళ్ళకి ఇప్పటికీ తాగుబోతు రమణయ్య శవం వేషం గుర్తుకు రాకమానదు. కళ్ళు చెమ్మగిల్లక మానవు. – రోహిణి వంజరి, హైదరాబాద్ -
ఖాళీ మనిషి
గుడిసె ముందు దిగాలుగా నిలబడ్డాడు సాంబయ్య. ఎందుకోగానీ...తాను లేని ఆ గుడిసె చీకటిగుహలా నోరు తెరుచుకొని అతడ్ని భయపెట్టసాగింది. నులకమంచం వేసుకొని తలపాగలో చెక్కిన సగం కాలిన బీడిముక్కను వెలిగించి ఆఖరిదమ్ము లాగి వదిలాడు, సాయమ్మ తాలూకు దట్టమైన జ్ఞాపకాల పొగ అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. తానెన్నో పనులు చేసి ఇల్లు చక్కబెట్టేది. మిరపచేన్లకు, పత్తిచేన్లకు కైకిలిపోయేది, వంచిన నడుం ఎత్తకుండా వరినాట్లు వేసేది. కలుపు తీసేది. కట్టెలు కొట్టేది. మామిడితోటంతా శుభ్రం చేసి పాదులు తవ్వి నీళ్లు మళ్లించేది. కోడిపెట్టెలను సాకేది. మొన్న చేన్లకి వెళ్లినప్పుడు తెచ్చిన మిరప్పండ్లతో కారం నూరి కమ్మటి పచ్చడి చేసింది. లేతమామిడి సక్కును ఉప్పు వేసి ఊరవేసింది. తానుంటే...దండెంపై ఉతికి ఆరేసిన బట్టలు, నీళ్లు నింపిన తొట్టెలు, నవనవలాడే మొక్కలు, కళ్లాపి జల్లిన వాకిలిలో తీర్చిదిద్దిన ముగ్గులతో గుడిసె పచ్చటి కళతో వెలిగిపోయేది. తానిక ఏంకావాలన్నా అన్నీ క్షణాల్లో అమర్చిపెట్టేది. మొన్న ఎప్పుడో ఉలిశెలపులుసు తినాలని ఉందన్న గొంతెమ్మ కోర్కె కోరినప్పుడు, చీరకొంగులో మడతపెట్టుకున్న డబ్బులతో ఉలిశెలు కొనలేకున్నా ఎండినరొయ్యలు, ఎర్రటి గడ్డలతో కమ్మటి పులుసు చేసి తన నోటికి విందు చేసింది. బహుశా ఆ డబ్బు తనకు తెలియదునుకొని ఏ కోమటోల్ల దుకాణంలోనో పప్పుల, ఉప్పుల బాకీకై దాచి ఉంచింది కావచ్చు. అయినా తననేనాడు పల్లెత్తు మాటనేది కాదు. పెండ్లీడు వచ్చిన బిడ్డకు పెళ్ళి చేసేదాకా ఇల్లు పట్టుకొని ఉందా? పెళ్ళి కాగానే తన బాధ్యత తిరిపోయిందని వెళ్లిపోయిందా? ఎక్కడికి వెళ్లినా...సాయంత్రం అయ్యేసరికి తనింట్లో సంధ్యాదీపమై వెలిగిపోయేది. ఏనాడైనా తను తిన్నదా? లేదా? అని పట్టించుకునేవాడు కాదు. తనకు మాత్రం ఏది ఉంటే అది ఊడ్చి పెట్టి కడుపు నింపేది. ఏ రోగమో, నొప్పో వచ్చినా కషాయాలు, పసరుమందులతో తగ్గించుకునేది. కరెంటుబిల్లు కట్టమని తాను ఇచ్చిన డబ్బులని బిల్లు కట్టకుండా ఎగ్గొట్టి, సారా పొట్లంతో ఇంటికి వచ్చినప్పుడు... ఏవేవో లోపల ఇంకిన అసంతృప్తులతో చూసిన చూపును అర్థం చేసుకోలేక పోయాడు. బహుశా సాయమ్మ తనను చూడటం అదే చివరిదా? అలజడికి లోనైన ఆలోచనలతో సరిగా గుర్తుతెచ్చుకోలేక పోయాడు. తడిక తలుపును తొలగించుకొని లోనకు అడుగుపెట్టగానే...తన గుడిసె తనకి కొత్తగా, వింతగా అనిపించిందతనికి. తడుముకోకుండా వెళ్లి ఎక్కా దీపాన్ని వెలిగించాడు. పొగచూరిన దీపం గుడ్డివెలుగులో అప్పటిదాకా సందడి చేసిన ఎలుకలేవో కలుగులోకి దూరాయి. తన బట్టలతో వేలాడుతున్న దండెం తననే వెక్కిరిస్తున్నట్టుగా...ఖాళీ సామాన్లతో నిండిన గుడిసెలో ఖాళీ మనిషిగా సాంబయ్య. వెల్లకిలా పడుకొని కంతలో నుండి కనిపిస్తున్న నక్షత్రాల వంక చూస్తూ ఉండిపోయాడు. దీపం...చమురున్నంత సేపే వెలుగుతూ... ఓ రాత్రి కాగానే ఆరిపోయింది. ∙∙ తెల్లారగట్ల...గుడిసె పైకి ఎక్కి సందడి చేస్తున్న కోళ్ల చప్పుడికి మెలకువ వచ్చింది సాంబయ్యకి. తడిక తొలగించుకొని బయటకు వచ్చాడు. రాత్రి గుల్ల కింద కమ్మడం మర్చిపోయిన కోడిపెట్టెలు ఎక్కడికి వెళ్లాయో ఏమోగానీ...సాయమ్మ టైముకు చల్లే నూకలకి అలవాటు పడి, అవి దొరకకపోగా పెరడంతా కెలుకుతూ మట్టి తవ్విపోయసాగాయి. తెల్లారగానే తనకి వేపపుల్ల అందించి ఉడుకునీళ్ల కొప్పెర వేసేది. పుల్ల విరుచుకొని పెరట్లో ఉన్న పొయ్యి వంక చూశాడు. పిల్లి...మెత్తని బూడిదలో హాయిగా ముడుచుకుంది. చాయ కొరకు నాలుక పీకసాగింది. పాత తువ్వాల దులుపుకొని ముఖం తుడుచుకొని టీకి డబ్బులున్నాయో లేదో చూసుకొని బయలుదేరాడు. దూరంగా... బుడ్డోడి టీకొట్టు! ఉడుకు చాయ గాజుగ్లాసుల్లో అటూ ఇటూ పోస్తూ కనపడ్డాడు. సాయమ్మ మీద అలిగి తానెన్నోసార్లు డాబుసరిగా వీడి దగ్గర చాయ బాకీ పెట్టి తాగాడు...అవన్నీ ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. వెళ్తే ఏమంటాడో? సాయమ్మ ఇంటి నుండి వెళ్లిపోయిన సంగతి వీళ్లకి తెల్సిపోయిందా? ఎంత నమోషి తనకి. వెళ్లిన తనకేం కాదు కానీ...ఊర్లో నలుగురి మధ్య తిరగాల్సిన తనను చూసి జనం నవ్వుకోరూ? సాయమ్మ ఉంటే తనకు ఎంత ధైర్యం...ఎంత ధీమా! తనకేం మొగోడ్ని అని తలెత్తుకొని పంచె వేసుకొని, పొన్నుకర్రతో దర్పంగా ఊర్లోకెళ్లి బలాదూర్‌గా అడ్డమైన పెత్తనాలన్నీ చేసుకొని తిరిగితిరిగి వచ్చేవాడు. తానే టైమ్‌కి ఇంటికెళ్లినా తినడానికి ఏదైనా వండి ఉండేది. ఇప్పుడు ఎవర్నైనా పలకరిద్దామన్నా ధైర్యం చాలటం లేదు. వాళ్లు పెదవి విప్పి ఒక్కమాట అనకపోయినా చూపులతో శల్యపరీక్ష చేస్తారు. ఏమైనా... తను ఇలా వెళ్లిపోవటం సాంబయ్యకు మింగుడుపడడం లేదు. ∙∙ సాయమ్మ అందరితో కలుపుగోలుగా ఉండేది. ఇరుగుపొరుగు కూలీలతో పంటచేలకు వెళ్లేది. వచ్చేటప్పుడు కాయగూరలు, దినుసులు తెచ్చుకునేది. ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లి ఏదో చెయ్యాడినప్పుడే సర్దుకొని చెయ్యాలని అనేది. ఇటు ఊర్లో తన అడ్డమైన బాకీలు వంతుల వారీగా తీర్చేది. తనలాగే తాగొచ్చి ఇల్లు పట్టించుకోకుండా గోల చేస్తూ పెళ్లాలను కొట్టి సాధించేవాళ్లు లేరా? ఇరుగుపొరుగున ఉన్న ఎల్లయ్య, కొమురయ్యల కంటే తానింకా నయమని సాంబయ్య నమ్మకం. మరి వాళ్ల భార్యలు ఇలా ఇల్లు వదిలేసి వెళ్లారా? కుటుంబజీవనంలో ఎలాంటి తర్కాలుండవనీ, కేవలం సర్దుకొని రాజీ పడిపోతూ ఎన్ని అసంతృప్తులున్నా... ఇద్దరొక చోట ఉంటేనే సమాజం మర్యాదగా చూస్తుందని తెలియకనా? తను వెళ్లిపోయింది. సాయమ్మ వస్తే ‘ఎందుకిలా చేశావ్?’ అని నిలదీసి అడిగి బావురుమనాలని ఉంది అతనికి. తాగిన టీకి డబ్బులిస్తూ లోనకు వెళుతున్న బూబమ్మను చూశాడు. బూబమ్మ భర్త దుబాయ్, మస్కట్ల లేబర్ పని చేస్తున్నడనీ, వస్తాడని చెప్తుంది కానీ... ఉన్నడో లేడో! తెలియదు. నల్గురూ ఆడపిల్లలే! ఊర్లో తెలిసినవాళ్ల బట్టలు కుట్టి కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. మనిషి ఎంత దిలాసాగా కనిపిస్తుంది. బూబమ్మ, బుడ్డోడి పెళ్లాం నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు లోపల. మధ్యమధ్యలో తనను చూస్తూ నవ్వుకుంటున్నారు. సాంబయ్యకు చిన్నతనమనిపించింది. ఇక అక్కడ ఉండలేనట్టుగా లేచాడు. ఏదో కూర అడిగి గిన్నెలో వేయించుకొని ధీమాగా వెళ్లిపోతున్న బూబమ్మను చూశాడు. తనకు భర్త లేకున్నా హాయిగా జరుగుబాటు అవుతుంది. భవిష్యత్తుపై ఏమాత్రం బెంగ లేకుండా పిల్లల్ని చదివిస్తూ, బతుకు ఎలా బతకనిస్తే అలా బతికేయాలి అన్నట్టు నిశ్చింతగా ఉంది. తనలాగా భయం, దిగులుతో రేపెలా? అన్న సందేహబతుకుచిత్రం కాదు తనది. ఇంట్లో ఎదిగిన పిల్ల ఉంది. ఆ తాగుడు స్నేహాలు మానేయమని, ఎవరైనా సంబంధాల వాళ్లు వస్తే పరువు పోతుందనీ, నలుగుర్లోకి అల్లరి అవుతామని ఎంతో ఇగురం చెప్పే సాయమ్మ...ఈరోజు తన మనసును ముక్కలు చేసి వెళ్లిపోతుందని అసలు ఊహించలేకపోయాడు. ∙∙ తానెన్నోసార్లు తాగివాగుతూ నులకమంచానికి అడ్డంగా పడిపోయి భళ్ళున వాంతులు చేసుకున్నా తెల్లారి ఏమీ ఎరుగనట్లుగా వాకిలంతా శుభ్రం చేసుకొని, లోటా నిండుగా నిమ్మరసం కలిపిన మజ్జిగనీళ్ళు తాగించేది. పిల్లకు పెళ్లి చేసి పంపేరోజు సాయమ్మ ముఖంలో తృప్తితో కూడిన వెలుగు. పెండ్లికని ఒక్కత్తే రెక్కలుముక్కలు చేసుకున్నది. కొత్తబట్టలు కుట్టించింది, తనకూ కొత్త పొడుగు చేతుల చొక్కా, కండువా, ధోవతులు కొన్నది. మామిడాకులు కట్టి పిండివంటలు చేసి, సారె పోసి, గుళ్లోని పంతులుగారితో మాట్లాడి బిడ్డ పెండ్లి చేయించింది, తన పని పూర్తి అయిపోగానే ఈ తాగుడుగాడ్ని భరించాల్సిన అవసరం లేదనుకొని వెళ్లిపోయిందా? ఈ ప్రపంచంలో చాలా ప్రశ్నలకు జవాబులు ఉండవని సాంబయ్యకు మొదటిసారిగా అర్థమయ్యింది. తానెన్నోసార్లు మాటలతో, చేతలతో హింసించినా నిశ్శబ్దంగా భరించింది. తెల్లారి ఏమిపట్టించుకోనట్లుగా తన పనులు తాను చేసుకొని సద్ది మూటతో చేనుకు వెళ్లిపోయేది. చీకటి పడగానే తిరిగొచ్చి తొట్టిలో నీళ్లు నింపి, ముఖం కడుక్కొని ఎర్రబొట్టు దిద్దుకున్న సందమామలా గుడిసెలో వెన్నెదీపం వెలిగించేది. కట్టెల పొయ్యి ముట్టించి, నూకల అన్నం వండి తనకై ఎదురు చూసేది. తాను ఏనాడైనా సాయమ్మ మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడా? ఏదైనా కోల్పోయిన తరువాతే విలువ తెలుస్తుంది. సాయమ్మ లేని ఇంటిబాట పట్టాడు. చావలేక బతికినట్లుగా ఉన్న గుమ్మడి తీగ గుడిసెపై వేలాడుతూ కనిపించింది. చీడ పట్టిన కరివేప చెట్టుకింద పురుగులను కోళ్లు కెలుకుతూ తినసాగాయి. గుడిసె దగ్గరవుతుంటే...పట్టుకున్న పొన్నుకర్ర వెయ్యి టన్నుల బరువు అనిపిస్తుంది! -బి.కళాగోపాల్ -
స్వర్ణ సదనం
ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అస్సాం కొండల మధ్యలోని ఆ పచ్చని పల్లె, చిక్కని పొగ మంచు చీకటిలో గాఢంగా నిద్రపోతున్నది. ఆకాశంలో తూర్పున ఇంకా ధ్రువనక్షత్రం కాంతి వంతంగా మెరుస్తున్నది. ఎటు చూసినా నిశ్శబ్దం, ప్రశాంతత రాజ్యమేలుతున్నాయి. దక్షిణ దిశ నుంచి సాధారణంగా వేకువను వీచే మంద్రమైన గాలి జాడ ఈ రోజు ఎందుకో లేదు. తొంభై సంవత్సరాల వడ్రంగి ధ్వజ ఒంటరిగా ఇంటి కంచె వద్ద నిల్చున్నాడు. కుడి చేత్తో ఒక కొయ్యను పట్టుకుని కొంచెం ముందుకు వంగాడు సంతృప్తి నిండిన కళ్లతో తన ఇంటి వైపు అదే పనిగా చూసుకుంటున్నాడు. వదులుగా ఉన్న కుర్తా పైన వేసుకున్న శాలువా, జంధ్యమూ ఏ మాత్రమూ చలించడం లేదు. అతడి జుత్తు, కనుబొమలు, గెడ్డం, మీసాలు పూర్తిగా నెరిసి పోయివున్నాయి. కళ్లకు వచ్చిన కాటరాక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నది. ఆ కలప ఇంటిలో దూలాలకూ స్తంభాలకూ అతడు స్వయంగా చేత్తో కొట్టిన మేకులు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ ఇంటిలో ప్రతి అంగుళంలోనూ ధ్వజ ఆత్మ జీవిస్తున్నది. కానీ ఈ రోజు ఆ పాత కలప ఇంటి స్థానంలో కొత్త సిమ్మెంట్ నిర్మాణాన్ని అతని కుమారులు ప్రతిపాదిస్తున్నారు. శంకుస్థాపన జరగవలసి ఉన్నది. అతడు వారిని నివారించనూ లేడు. పాత ఇంటిని పడగొట్టడం చూడనూ లేదు. అతనిది విచిత్రమైన స్థితి. వడ్రంగి ధ్వజ.. ఆ ఇంటిని తనూ, తన భార్యా చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. ఒకనాడు సొంత ఇంటి కోసం అహర్నిశలూ తపించాడు. అందులోనే సుదీర్ఘకాలం జీవించాలనే కలలుకన్నాడు. కలలు సాకారమై అతడింకా జీవించే ఉన్నాడు. కానీ ఆ ఇంటి ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. అందుకే చివరిసారిగా చూసుకొంటున్నాడు. ఆ క్రమంలోనే ఆ ఇంటికీ అతడి జీవితానికీ అనుబంధమైన ప్రతి చిన్న సన్నివేశం సూక్ష్మ వివరాలతో గుర్తు కొస్తున్నాయి. ధ్వజ చిన్న వయసులోనే తల్లిదండ్రులనీ, ఆత్మీయులనీ, బంధుమిత్రులనీ పోగొట్టుకుని అనాథలా మిగిలాడు. ఇంటిని కట్టుకోవడానికి సంక్రమించిన చిన్న స్థలాన్నీ అమ్ముకున్నాడు. అప్పటికి అతడి వయసు పదమూడు సంవత్సరాలు. బికారిగా తిరిగాడు. క్రమేణా ఒకనాటి నూనూగు మీసాలతో ధ్వజ మంచి కండపుష్టి గల యువకుడిగా ఎదిగాడు. స్వతంత్రమైన ఆలోచనలు వచ్చాయి. ఆ దశలో చిన్న చిన్న ఇంటి పనులు చేసుకొని మనుగడ సాగించలేక పోయాడు. ఒక గురువారం శుభముహూర్తాన అతడు ధాబాల్ అనే అత్యంత నేర్పరి అయిన ముసలి వడ్రంగి ముందర మోకరిల్లాడు. ధాబాల్ ఆ ఊరి ఆస్థాన వడ్రంగి. ధ్వజ తనని శిష్యుడిగా స్వీకరించమని అర్థించాడు. ఆచార పూర్వకంగా చిన్న వేడుక ద్వారా గురువు గారికి ఒక జత దుస్తుల్ని, ఒక అరటి పళ్ల గెల.. గురు దక్షిణగా ఒక పావలా నాణేన్నీ సమర్పించుకున్నాడు. తొమ్మిది సంవత్సరాల పాటు గురువుగారి వద్ద వడ్రంగి విద్యలోని మెలకువల్ని అభ్యసించాడు. గురువు ధాబాల్ కూడా అద్భుతమైన వృత్తి రహాస్యాలన్నీ శిష్యుడికి బోధించాడు. కలపతో భవనాల్నీ, మందిరాల్నీ, ఇళ్లనీ, చిన్న కుటీరాలనీ అతి సుందరంగా మలచడం నేర్చుకున్నాడు. ఇక ధ్వజను.. తనదైన జీవితాన్ని ప్రారంభించమని గురువుగారు అదేశించారు. శిష్యుడు ధ్వజని ఆశీర్వదించి కన్నీటి వీడ్కోలు పలికాడు. సొంతంగా వడ్రంగి వృత్తిని స్వీకరించాడు. బాగా శ్రమించి సంపాదించడంలో ఒక సంవత్సరం గడిచింది. ఒక అర భీగా నేలని కొనుక్కున్నాడు. ఒక పూరి పాకని నిర్మించుకుని సొంత గూటిలో నివాసం మొదలుపెట్టాడు. చేతి సంచి నిండా పరికరాలతో ఊరూరా తిరిగి నీతిగా, నిజాయితీగా కష్టపడి ఆర్జన సాగించాడు. మరో భీగా నేలని కూడా సంపాదించాడు. ఆ దశలోనే ప్రక్క ఊర్లో గంభీర్ సింగ్ అనే సంపన్నుడికి కలప ఇంటిని నిర్మించాడు. అతని కుమార్తె సాబీ, ధ్వజకు ఇష్టమైన మణిపురి వంటకాల్ని చేసి పెట్టేది. భోజనం తర్వాత తాంబూలం అందించేంది. ధ్వజ మరింత శ్రద్ధాసక్తులతో ఆ ఇంటి పనిని చేసేవాడు. ఇద్దరి మధ్యా అనురాగం అంకురించింది. వడ్డన సమయంలో వరోలికా పౌర్ణమి వర్ణాలు అద్దుకున్న ఆమె మైనపు చెక్కిళ్లని అతడు తదేకంగా చూసేవాడు. ధ్వజ కలప చెక్కల్ని రంపంతో కోస్తూ వాటిని నునుపుచేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో చెమట పట్టిన అతడి వీపు భాగంలో బలమైన కండరాలు నాట్యం చేస్తుండేవి. తాంబూలం అందివ్వడానికి వచ్చిన సాబీ అతడ్ని వెనుక నుంచి అచ్చెరువుతో సంతృప్తిగా చూస్తుండేది. ఆమె వెచ్చని నిశ్వాసాన్ని గుర్తించి అతడు వెనుకకు తిరిగేవాడు. ప్రేమ నిండిన చిరునవ్వుతో వణుకుతున్న ఆమె చేతుల్లోంచి తాంబూలాన్ని అందుకొని నమిలేవాడు. ఇద్దరి మధ్యా నిశ్శబ్ద ప్రణయం వికసించసాగింది. ఒక రోజున ధ్వజ ఇంటి పైకప్పుగా ఒక దూలాన్ని అడ్డంగా స్థాపించబోతున్నాడు. తన ఎడమ చేతికి ఒక నార ముక్కని చుట్టుకున్నాడు. రెండు నిటారు స్తంభాలపైన తన కాళ్లని తులనాత్మకంగా ఆనించాడు. పళ్లతో నారముక్కని తీశాడు. అలా తీయ్యడంలో ధ్వజకు అమోఘమైన నేర్పరితనం ఉంది. ఇదంతా గంభీర్ సింగ్ గమనించాడు. ఎంతగానో సంతృప్తి చెందాడు. ఈ యువకుడు నా కుమార్తె సాబీకి తగిన భర్త కాగలడు‘ అని యోచించాడు. ఆ వెంటనే పెళ్లి ప్రతిపాదన కూడా జరిగిపోయింది. ధ్వజ, సాబీల పెళ్లిబాజా మోగింది. కానీ ధ్వజ దృష్టిలో ఒక అందమైన భార్యా, శి«థిలావస్థకు చేరిన తన పూరి గుడిసె ఒక దానికొకటి జత కుదిరినట్లు అనిపించలేదు. ఏదో వెలితి చోటు చేసుకున్నది. దాంతో ఒక చక్కని ఇల్లు కట్టుకోవడానికి ప్రతిరూపాయినీ పొదుపు చెయ్యసాగాడు. ప్రతి రోజూ తన సంపాదనని సాబీ చేతికి అందజేస్తుండేవాడు. ఆ డబ్బులో కొంత భాగంతో ఇల్లు గడిపేది. మిగిలింది ఒక చోట చేర్చేది. తను కూడా దుస్తులు కుడుతూ మరికొంత సంపాదించేంది. లెక్కసరిగా ఖర్చుపెడుతూ సంతోషంగా జీవించేవారు. మిగిలించి కూడబెట్టిన డబ్బుని ఇంటిలో ఒక మూలగా నేలలో రహస్యంగా ఉంచిన మట్టి కుండలో దాచేది. కొంతకాలం తర్వాత ధ్వజ కొత్త కలప ఇంటిని నిర్మించుకున్నాడు. పైకప్పు వాటి దూలాలతో చేశాడు. కట్టెల్నీ గడ్డినీ పైకి చేర్చడానికి సాబీ సహాయపడేది. అలా ఇద్దరూ కలిసి ఆ ఇంటి పనిని పూర్తి చేశారు. దానిపైకి తమల పాకు తీగల్ని కూడా పాకించారు. గృహప్రవేశ ఉత్సవం పూర్తి అయ్యింది. అతిథులకు భోజనాలు పెట్టారు. గురువుగా ధాబాల్ మనస్పూర్తిగా ఆశీర్వదించాడు. ‘‘శిష్యా!ధ్వజా! నాకు చాలా సంతోషంగా ఉందయ్యా.. ఇంటి నిర్మాణం కొత్తగానూ, ప్రత్యేకంగానూ ఉంది. ఎంతో నేర్పుతోనూ, కళాత్మకంగానూ కట్టావు. ఈ ఇంటిలో నువ్వు పిల్లా పాపలతో కలకాలం ఆనందంగా వర్ధిల్లాలని దీవిస్తున్నాను.’’ ఆ ఇంటి రూపకల్పన చూడటానికి ఇరుగు పొరుగు వాళ్లే కాదు.. పక్క ఊర్ల నుండి కూడా జనం వచ్చేవారు. అతిథులందరినీ సత్కరించడానికి ప్రతిరోజూ రెండు మూడు కట్టల తమలపాకులు అదనంగా కొనవలసి వచ్చేది. చూపరులు ధ్వజ నైపుణ్యాన్నీ, ఊహాపటిమనీ ఎంతో మెచ్చుకునేవారు. ‘‘చాలా బావుంది ధ్వజా! కిటికీలు, ద్వారాలూ పెద్దవిగా పెట్టావు. నిజంగా ఇది సామాన్యుడు నిర్మించుకున్న రాజ భవనంలా ఉంది’’ అనేవారు. ఆ ఊరి విదూషకుడు దేవతా పూజలలోనూ, శుభకార్యాలలోనూ నాట్యం చేస్తూ పాడుతూ ఉంటాడు. ఆ పాటల్లో భాగంగా ఇలా చేరుస్తూ ఉంటాడు. నేను బృందావనం నుండి తిరిగి వస్తూ ఆగ్రాలో తాజ్‌మహల్ చూశాను. బరామునీలో ధ్వజగారి ‘శానామహల్’(బంగారు భవంతి) చూశాను’’ ఇలా సాగుతుంది పాట. ఆ తర్వాత ఆ ఇంటితో మొదటి పసి ఏడుపు వినపడింది. ధ్వజ మహదానందంతో గంతులు వేస్తూ వరండాలోనికి వచ్చాడు. ప్రధాన ద్వారం దాటబోతూ ఉండగా మంత్రసాని అరుపు వినపడింది. ‘‘మగ పిల్లావాడు.. మగ పిల్లాడు పుట్టాడు‘‘ అని. ఆ క్రమంలో ముగ్గురూ అబ్బాయిలే పుట్టారు. దంపతులు ఎంతో సంతోషించారు. వార్ని పెంచి పెద్దవాళ్లను చేశారు. విద్యాబుద్ధులు చెప్పించారు. పెద్దవాడు సుకుమార్ ఇంటి దేవతకు నమస్కారం చేసి సైన్యంలో చేరిపోయాడు. రెండో వాడు పరిమల్ కూడా అన్నబాటలోనే నడిచాడు. అందరికన్నా చిన్నవాడు బిమల్ కాలేజీకి వెళ్లడానికి సిద్ధపడుతున్నాడు. తర్వాత మార్పులు త్వరత్వరగా జరిగిపోయాయి. పెద్దకోడల్ని ‘నిరంతరే..’ శ్లోకంతో దీవిస్తూ పురోహితుడు ఆహ్వానించాడు. ధ్వజ, సాబీ నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు ‘దీర్ఘసుమంగళీభవ..’ అని. ధ్వజ గత జ్ఞాపకాల స్రవంతి కాకుల కరకు అరుపులతో ఆగింది. సూర్యోదయమైంది. అతడి గుండె మరింత తీవ్రంగా కొట్టుకుంది. ఇప్పుడతనికి అత్యంత ప్రీతిపాత్రురాలైన అర్ధాంగి సాబీ లేదు. కొద్ది సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఆనాడే అతడు ఒంటరి వాడైపోయాడు. అలనాటి తీయని కలలు రేపటి గురించి ఆశావహమైన ఊహలూ ఇప్పుడు లేవు. వయసుతో పాటూ అన్నీ ఆవిరైపోయాయి. ఒకనాడు స్వప్నాలే పునాదులుగా భార్య సహకారంతో నిర్మించుకున్న ఇల్లు కూడా మరికొద్ది క్షణాల్లో... ధ్వజ ఉప్పొంగుతున్న ఉద్వేగంతో శాలువా అంచుతో కళ్లుతుడుచుకున్నాడు. చేతులెత్తి స్వర్గంలో ఉన్న తన విద్యాదాత ధాబాల్ని ధ్యానించుకున్నాడు. ఎన్నో దశాబ్దాల తన సహచరి సాబీనీ స్మరించుకుని నెమ్మదిగా అక్కడి నుంచి ముందుకు నడిచాడు. ఈ మధ్యనే ఋతుపవనాలు ప్రవేశించాయి. వాటిని ధ్వజ తన ఇంటి గుమ్మంలోనికి స్వాగతించాడు.. కాని ఇంతలోనే... యువకుడైన తాపీ మేస్త్రీ వచ్చి.. ధ్వజకు నమస్కరించాడు. ధ్వజ అతడ్ని దీవించి.. ‘‘రా! నాయనా! ఇలా కూర్చో’’ అంటూ అతడి ముందరకు ఒక కర్ర బల్లని నెట్టాడు. తర్వాత తను నెమ్మదిగా ఇంటి వెనుకనున్న పశువుల శాలవైపు నడిచాడు. తాత్కాలిక నివాసంగా పశువుల శాలనే ఎంపిక చేశారు. అంతకు ముందురోజే ఇంటిలోని సరంజామాను తరలించారు. ధ్వజ కోడలు అతనికి కావలసిన ఉదయపు పొగాకుని అందిచ్చి తన పనుల్లో మునిగిపోయింది. ఒక నూతన గృహనిర్మాణాన్ని ప్రారంభించడం ఆ ఊర్లో ఒక పండగతో సమానం. గ్రామస్తులంతా పోగయ్యారు. ఇద్దరు ముల్తైదువలు అరటి ఆకులూ, తమలపాకులూ, పోక చెక్కలూ మొదలైన శంకుస్థాపన పూజా సామాగ్రిని ఏర్పాటు చేశారు. వరండాలో సుకుమార్, పరిమల్, బిమల్ పని వారితోనూ, ఇతర గ్రామస్తులతోనూ చర్చిస్తున్నారు. సుకుమార్ సూచనలు ఇస్తున్నాడు. పరిమల్ అందర్నీ పోగు చేస్తున్నాడు. బిమల్ చిన్నవాడు, దిక్కులు చూస్తున్నాడు. ధ్వజ ఆ ఇంటిలోనే ఒక మూలన ఒంటరిగా దిగులుగా కూర్చున్నాడు. నూతన భవనానికి సంబంధించి పనివారూ, కుమారులూ కలిసి వేసుకొంటున్న పథకాల్నీ రూపకల్పనల్నీ నిశబ్దంగా వినసాగాడు. అతడి చేతిలో పొగాకు గొట్టం నుంచి బూడిద నేల రాలుతోంది. ‘ఇంటి వైశాల్యం రెండు వందల చదరపు గజాలుండాలి. ముందు రెండు గదులూ చెరో వైపున ఉండాలి. వరండా పెద్దదిగా విశాలంగా ఉండాలి’ అని మిలటరీ సుకుమార్ తన హిందీ యాసలో చెప్పుకొనిపోతున్నాడు. పాత చెక్క నిర్మాణాన్ని పూర్తిగా తీసివేస్తాం. అయితే ఆ కలపని అమ్మినా కొనేవారెవరూ ఇప్పుడు లేరు. నాలుగు వైపులా ఆరంగుళాల గోడని కట్టాలి. మొత్తం పని కేవలం రెండు నెలల్లో పూర్తి కావాలి. నేను రెండు నెలల సెలవు మీదనే వచ్చాను. మరి కిటికీల మాటేమిటి? అవి ఇప్పుడున్న పరిమాణంలోనే ఉండాలా?’ ‘వద్దు వద్దు.. ఇవి పాత కాలం నాటివి. ఇప్పుడు నాలుగు భాగాల గాజు కిటికీలని నేల నుంచి రెండున్నర అడుగుల ఎత్తులో ఉంచుదాం’ అన్నాడు సుకుమార్. ‘అంత కిందుగానా?’ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ‘ఇదే ఇప్పటి ఫ్యాషన్. నేను జబల్పూర్లో చూస్తున్నవి ఇంకా కిందికి ఉంటాయి‘ అన్నాడు సుకుమార్. ‘మరి వంట గది మాటేమిటి?’ ’అది విడిగా ఉంటుంది. ఇంటి వెనుక వరండా తర్వాత ఒక పొయ్యి దానిపైన పొగ గొట్టం ఉంటాయి. ఏ విధంగానూ పొగ ఇంటిలోనికి రాకూడదు’ అన్నాడు సుకుమార్. ‘గతంలో ఉన్న సాంప్రదాయకమైన పొయ్యి మాటేమిటి? కొత్త ప్లాన్‌లో దానికి మరి అవకాశమే లేదు..?’ ‘ఖచ్చితంగా ఉండదు. ఉండకూడదు’ ఇంత సేపూ ధ్వజ నిశబ్దంగా వింటూ ఉన్నాడు. అతడు మాట్లాడలేదు. అతడి సూచనల్ని ఎవరూ అడగనూ లేదు. కానీ ఇప్పుడు అప్రయత్నంగా కలుగజేసుకున్నాడు. ‘పాత పొయ్యిని ప్రధానంగా విడిచి పెట్టేస్తే మంచిది. ఈ ఇంటికి అది స్మృతి లేఖనం వంటిది’ అన్నాడు. తండ్రి ప్రతిపాదనని సుకుమార్ తిరస్కరించాడు. ‘నీకు తెలియదు నాన్నా.. రోజంతా మండే పొయ్యి ఇంటిని పొగతో నింపుతుంది. గోడలు కూడా పాడవుతాయి’ అంటూ ఇలా వివరించ సాగాడు. ‘ఒక నాడు అగ్గిపెట్టెలు లేని కాలంలో నిరంతరం వెలిగే పొయ్యి అవసరమయ్యేది. ఇప్పుడా అవసరం లేదు. కావాలంటే స్టవ్ కొనుక్కుందాం’ అన్నాడు. ‘పెద్దవారనీ అనుభవజ్ఞులనీ మెచ్చుకుంటారే గానీ ఎవరూ వారి సూచనలని గ్రహించరు’ అనుకున్నాడు ధ్వజ. ఆ తర్వాత మౌనం వహించాడు. ఇది ఇప్పుడు పిల్లల ఇల్లు. వారి ఇష్టప్రకారమే కట్టాలి మనసులో తీర్మానించుకున్నాడు. ‘అబ్బాయీ! జీవిత చరమాంకంలో పొయ్యి ప్రాముఖ్యత తెలుస్తుంది. మాఘమాసపు వణికించే చలి వచ్చేస్తున్నది. నేను పొయ్యి వద్ద కూర్చుని చలి కాచుకోవడం ఎలా మరి?’ తనలో తనే గొణుకున్నాడు. పల్లె పూజారి నుదుటి మీద ముక్కు మీద చందనం పూసుకుని కొంచెం ఆలస్యంగా హడావిడిగా వచ్చాడు. సుకుమార్! ఏం చేస్తున్నారయ్యా ఇంకా! ముందుగా పాత ఇంటిని పడగొట్టాలి. ఆ తర్వాత మాత్రమే మనం కొత్త ఇంటికి శంకుస్థాపన చెయ్యాలి. ముహూర్తం మించిపోతుంది’ అన్నాడు. ‘పాత ఇంట్లో ఏం లేదు. బాగా పాడుపడిన నిర్మాణం. అది కూడా కేవలం కలప మాత్రమే. దాన్ని కూలదొయ్యడానికి ఎక్కువ సమయం పట్టనే పట్టదు’ అన్నాడు తంఫా. ఇతడు పక్క ఊరి నివాసి. చోద్యం చూడ్డానికే వచ్చాడు. ఈ మాటలు ధ్వజ చెవిలో పడ్డాయి. అతడి మనసు ఆక్రోశించింది. ‘అయ్యో ఇది మా భార్యభర్తల శ్రమ. ఎన్నో జన్మల కల..’ ‘భూమిపూజ మొదలు పెడదాం రండి.. ఆకులూ చెక్కలూ ఎక్కడ?’ పూజారి అసహనంతో తొందర చేశాడు. పల్లెజనం నడుం కట్టారు. సుకుమార్, పరిమల్ ఇతర గ్రామస్థులతో కలిసి గొడ్డళ్లూ, పలుగులూ పట్టుకుని ఇంటిపైకి ఎక్కారు. కొందరు గునపాలతో భూమి నుంచి పెకలించడం మొదలుపెట్టారు. తాపీ మేస్త్రీ అతని అనుయాయులూ మరోవైపున ఇసుకా సిమ్మెంటూ కలుపుతున్నారు. ఇదంతా చూస్తున్న ధ్వజ గుండెల్లో తీవ్రమైన పోటు మొదలైంది. ‘నేను ఈ ఇంటిని నా స్వహస్తాలతో చెమటోడ్చి నిర్మించాను. మీ అమ్మ కూడా తనవంతు సహాయం చేసింది’ ధ్వజలో ఉప్పొంగిన భావోద్వేగాలు మెదడులో ఒక సంక్షోభానికి తెరలేపాయి. అతడు వడ్రంగి వృత్తిలో మంచి ఉచ్ఛస్థితిలో ఉండగా గొప్పనైపుణ్యంతో ఈ పల్లెలో ఎన్నో ఇళ్లు కట్టాడు. నిజానికి అవి తరతరాలు నిలబడగలవు. కానీ రోజులు మారిపోయాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పడగొట్టబడుతున్నాయి. వాటి స్థానంలో నూతన సిమ్మెంటు, కట్టడాలు వెలుస్తున్నాయి. అతడి జీవితకాలంలోనే అతడి సమక్షంలోనే ఈ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ దృశ్యాలన్నీ చూడటానికే తనింకా బతికి ఉన్నాడా?’ ఈ ప్రశ్న అతడ్ని వేధిస్తున్నది. చివరికి గురువు ధాబాల్ ప్రసాదించిన నైపుణ్యరహస్యాల రూపకల్పనతో నిర్మించిన తన ‘సునా మహాల్’ ఒక్కటే మిగిలింది. దాన్ని కూడా తన రక్తం పంచుకొచి పుట్టిన బిడ్డలే కూలదోసేస్తున్నారు. ఆ ఇల్లే అతడి సర్వస్వం. అంతరాత్మ ఆవాసం.. అనుభూతుల కాణాచి. అదిపోతే అతనికి తనదిగా మిగిలిందేముంది? గతమంతా సమాధి అయినట్టేనా? పై కప్పు గడ్డిని తొలగిస్తున్నారు. ధ్వజ మనసు వికలమైంది. ‘ఒరే అబ్బాయిలూ! ఈపై కప్పు ఏర్పాటు చేసేటప్పుడు మీ తల్లి ఆ గడ్డిని పైకి విసిరి నాకు అందించేది. సుకుమార్! నువ్వు ఈ గడ్డి పైకప్పు కిందనే పుట్టావు. పరిమల్! నువ్వు ఈ చెక్క గోడ పక్కనే పసితనంలో ఆడుకునేవాడివి. బిమల్! నువ్వు ఈ నేల మీదనే నడవటం నేర్చుకున్నావు. ఈ ఇంటిలోనే మీ తల్లి తుదిశ్వాస విడిచింది. అటు వంటి ఇంటిని మధురస్మృతుల మందిరాన్నీ కూల్చడానికి మీ మనసు ఎలా అంగీకరిస్తుంది? అపరాధభావం కలగడం లేదా? ఇంత తొందరగా అన్నీ మరిచిపోయారా?’ కొడుతూ ఉన్న సుత్తులూ, గొడ్డళ్లు, గునపాల శబ్దం ధ్వజ మీద ప్రభావం చూపుతున్నాయి. ఆ ధ్వనులు అతడి చెవుల కన్నా హృదయానికే తగులుతున్నాయి. అతడు ఇంటిని పడగొట్టటాన్నే చూస్తున్నాడు. అంతరంగం నుండి పెల్లుబుకుతున్న వేడి కన్నీళ్లని చూసి అరిచింది. ‘నాన్నా! తాతయ్య ఏడుస్తున్నాడు’ ’లేదమ్మా! నేనెందుకు ఏడ్వాలి?’ అంటూ ధ్వజ కళ్లు తుడుచుకున్నాడు. చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించాడు. మనుమరాలికీ, అక్కడ పోగయివున్న ఇతర్లకీ కళ్లు కప్పబోయాడు. ఒక సిమ్మెంటు కట్టడంలో తను నివసించబోయే అవకాశం వస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు నటించసాగాడు. తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో ఒకదానికొకటి సంబంధం లేని ప్రేలాపన సాగించాడు. ‘ఒరేయ్ తంఫా! జాగ్రత్త! దూలం పడిపోవచ్చు. దూరంగా ఉండు. ఓయ్ పంతులూ! ప్రధాన స్తంభానికి స్థలం తరువాత ఎంపిక చేసుకోవచ్చు. పై కప్పు వదులైపోయింది. దుంగలు ఎవరి మీదైనా పడగలవు చూసుకోండి. ఆ.. ఆ కర్రస్తంభం వాలిపోతున్నది. పట్టుకోండి’ ఇలా అరవసాగాడు. ఇల్లు కట్టడానికి నెలలు పట్టింది. కానీ కూల్చడానికి గంటలు కూడా పట్టలేదు. ఇంతే జీవితం. నిర్మాణం కష్టం. నాశనం సులభం. ఇంటి ముందరి కట్టెగోడ పెద్ద శబ్దంతో కూలిపోయింది. చివరికి నాలుగువైపుల గోడలూ పడిపోయాయి. కలప నిర్మాణానికి ప్రారంభంలో వేసిన అస్థిపంజరం మాత్రం మిగిలి ఉంది. ఇప్పటికీ అది అద్భుతమైన కళ్లు చెదిరిపోయే నైపుణ్యానికి అనవాలుగా ఉంది. ముందరి ద్వారానికి ఇరువైపులా తిరిగిన నిలువెత్తు స్తంభాలు ఆ అస్థిపంజరానికి కాళ్లలాగా వికారంగా కనపడుతున్నాయి. ఆ జుగుప్సాకరమైన దృశ్యం ధ్వజ కళ్లకు మూలు కోల వలె తగిలింది. మనసు చెదిరింది. భార్య సాబీæ మధుర జ్ఞాపకాల నిలయం.. అనుబంధాల ఆలయం నేలమట్టమౌతుంది..! కుడి చేత్తో ఒక దూలాన్ని పట్టుకుని ఎడమ చేతిని పైకెత్తి ఉచ్ఛస్వరంలో ‘ఓరి భగవంతుడా?’ అని అరిచాడు. కానీ అతడి చివరి కేక ఫెళపెళా విరిగి పడుతున్న కలప శబ్దాలలో ఎవరికీ వినపడలేదు. కూలిపోతున్న ఇంటితో పాటే ధ్వజ కూడా కుప్పకూలిపోయాడు. బహుశా ఈ సరికే ఊర్ధ్వ లోకాల్లో ఉన్న గురువు ధాబాల్, భార్య సాబీ, అత్యంత ఆత్మీయులూ బంధువులూ అతడి పంచప్రాణాల్ని వారి చేరువకు తీసుకొనిపోయారు. మంగళతోరణాలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించిన నూతన పునాది ఇనుప చువ్వలపైన ధ్వజ నేత్రాలు స్థిరంగా నిర్జీవంగా నిలిచిపోయాయి. -మూలం : స్మృతికుమార్ సిన్హా -అనువాదం: టి. షణ్ముఖ రావు -
ఇష్క్‌కి... ఏమైంది?
పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉన్నాడు డాక్టర్ ప్రమోద్. ఎదురుగా సీఐ రవీంద్రనాథ్ కుర్చీలో వెనక్కి జారగిలబడి, కాళ్లు బార్లా చాపి కూర్చుని ఉన్నాడు. రవీంద్ర కాళ్లు ఊపుతున్నాడు. సీఐ బూట్లు ప్రమోద్‌కు తాకీతాకనట్లు తాకుతున్నాయి. తగలడానికి తగలకపోవడానికి మధ్య వెంట్రుక వాసి కంటే దూరం లేదు. తన కాళ్లు డాక్టర్‌కి తగులుతాయేమోననే స్పృహ సీఐలో ఏ కోశానా ఉన్నట్లు లేదు. తగిలితే పోయేదేముంది అనే నిర్లక్ష్యం కూడా ఉన్నట్లుంది అతడిలో. ఆ బూట్లు తనకు తగులుతాయేమోనని ప్రమోద్ మరింత కుంచించుకుపోయి కుర్చీలో ఒదుగుతున్నాడు. అతడు ఒదిగేకొద్దీ సీఐలో ఉత్సాహం రెట్టింపవుతోంది. ‘‘ఆ చెప్పు... ట్రీట్మెంట్ చేయాలని తెలీదా’’ సంబోధన లేదు, నేరుగా సూటిగా ఉందతడి ప్రశ్న. అతడి ప్రశ్నలో నువ్వు ట్రీట్మెంట్ చేయలేదు అనే ఆరోపణ కలగలిసిపోయి ఉంది. ‘... అంటే, తాను ట్రీట్మెంట్ చేయలేదనే అతడి అభిప్రాయమా’ ప్రమోద్ మెదడులో మరో ప్రశ్న ఉదయించింది. అదే మాట అనగలిగిన పరిస్థితి కాదు. ఆ సంగతి అతడికి తెలుసు. అందుకే గొంతు పెగల్లేదు. ‘అయినా... తాను ట్రీట్మెంట్ చేయలేదని అతడికై అతడే నిర్థారణకు వచ్చేశాక ఇక నేను చెప్పేదేముంటుంది. అతడు వినేదేముంటుంది. నిర్ధారణకు వచ్చిన విషయం మీద ఇక దర్యాప్తు ఎందుకు? తీసుకోవలసిన చర్యలేంటో తీసుకుంటే పోతుందిగా... ఎలాగూ చట్టం చేతుల్లోనే ఉందాయె’ ప్రమోద్ పెదవులు విడివడడం లేదు. కానీ, బుర్రలో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. ‘‘ఏం మాట్లాడకుండా కూర్చుంటే... మేము రిపోర్ట్ ఏం రాసుకోవాలి’’ గద్దించాడు సీఐ. ‘ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా’ ప్రమోద్ బుర్ర బదులిస్తూనే ఉంది కానీ మౌనం వీడడానికి మనసే అంగీకరించడం లేదు. ‘‘నీతోపాటు హాస్పిటల్లో ఇంకా ఎవరున్నారు? ఆ లేడీతో నీకు పనేంటి’’ సీఐ స్వరంలో బూతు పలుకుతోంది. ప్రమోద్ నిలువెల్లా కంపించిపోయాడు. ‘మై గాడ్! హాస్పిటల్లో నర్సింగ్ స్టాఫ్ లేడీస్ ఉంటారు కదా! అది కూడా తప్పేనా’ పెనుగులాడుతోంది అతడి మనసు. ‘‘డాక్టర్వని చూస్తున్నా. నోరు మెదపకపోతే మా పద్ధతులు మాకుంటాయ్’’ మా పద్ధతులు అనే మాటను ఒత్తి పలుకుతూ మళ్లీ గదిమాడు సీఐ. ‘‘మీరే పద్థతిలో విచారణ చేసుకున్నా సరే. నేను చెప్పేది మొదటి రోజే చెప్పేశాను. ఇక చెప్పడానికేమీ లేదు’’ అప్పటికి పెదవి విప్పాడతడు. ఆ గొంతులో ఆవేదనతోపాటు నిస్సహాయత. ‘‘ప్రాణం పోతుంటే చూస్తూ ఎలా ఉన్నావ్. ఏం డాక్టర్వి బే నువ్వు. నీకు డిగ్రీ ఇచ్చినోడెవడు? డాక్టర్ కోర్సు చదివి వచ్చావా, పట్టా కొనుక్కుని బోర్డు పెట్టావా’’ సీఐ మాటల్లో వెటకారం తెలుస్తూనే ఉంది ప్రమోద్‌కి. ఆవేశంతో బ్లడ్ ప్రెషర్ పెరగడమూ తెలుస్తోంది. అణచుకోవడం తప్ప చేయ గలిగిందేమీ లేదనే గ్రహింపు అతడిని అదుపు తప్పనివ్వకుండా ఆపుతోంది. వైద్యం చేయడంతోపాటు సహనంగా ఉండడం, సంయమనాన్ని కోల్పోకుండా ఉండడం కూడా కోర్సులో భాగమే. అయితే ఆ సంయమనాన్ని ఇలాంటి చోట పాటించాల్సి రావడం నిజంగా దురదృష్టం. సీఐ మొబైల్ ఫోన్ రింగయింది. పేరు చూడగానే విసుగ్గా ముఖం పెట్టి కానిస్టేబుల్ని పిలిచి ఫోన్ ఇచ్చాడు రవీంద్ర. ఫోన్‌తో పక్క గదిలోకి వెళ్లాడు కానిస్టేబుల్. ‘‘సర్... అలాగే సర్’’ ‘‘...........’’ ‘‘ఆ పని మీదే ఉన్నాం సర్’’ ‘‘.................’’ ‘‘ఎంతమాట సర్... ఇంతకంటే మాకు ముఖ్యమైన పనులేముంటాయ్ సర్. దొరవారు విచారిస్తున్నారు సర్. అందుకే ఫోన్ తియ్యలేకపోయారు సర్’’ సీఐ మీద ఈగ వాలనివ్వకుండా, అవతలి వ్యక్తి పట్ల వినయవిధేయతలతో బదులిస్తున్నాడు కానిస్టేబుల్. స్టేషన్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుండడంతో కానిస్టేబుల్ మాటలు సీఐ రవీంద్రకి, డాక్టర్ ప్రమోద్‌కి వినిపిస్తూనే ఉన్నాయి. కానిస్టేబుల్ వచ్చి ఫోన్ టేబుల్ మీద పెట్టి, సీఐ చెవిలో చెప్పాడు. ఏం చెప్పాడో ప్రమోద్‌కు అర్థం కాకుండా జాగ్రత్త పడ్డారు వాళ్లు. కానీ సీఐ ముఖం చెప్తోంది అది ఏదో అయిష్టమైన విషయమేనని. అసలే ప్రసన్నత లేని రవీంద్ర ముఖం మరింత అప్రసన్నంగా మారడం కనిపిస్తూనే ఉంది. ‘‘మినిస్టర్ ఇంటి నుంచి ఫోన్. మినిస్టర్ గారి కోడలు అన్నం తినడం లేదట’’ హూంకరించాడు సీఐ. ‘‘హాస్పిటల్లో మేం చేయగలిగింది చేశాం. మా దగ్గరకు వచ్చేటప్పటికే కొన ఊపిరితో ఉండడం వల్ల ట్రీట్మెంట్కి సహకరించలేదు. డెత్ సమ్మరీలో అదే రాశాను’’ అన్నాడు ప్రమోద్ అభావంగా. ∙∙ కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీసింది రజిత. ప్రమోద్ ఏమీ మాట్లాడకుండా రజితను తప్పించుకుంటూ లోపలికి వచ్చాడు. ఏదో అడగబోయిన రజిత కొంచెం తమాయించుకుంది. ఎప్పట్లా సోఫాలో కూర్చోకుండా నేరుగా బెడ్‌రూమ్‌లోకెళ్లి పోయాడు. అతడి వెనకే వెళ్లింది రజిత. ప్రమోద్ బాత్రూమ్లో కెళ్లడంతో రజిత తిరిగి హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుంది. ఏం చేయాలో తోచక రిమోట్ తీసుకుని చానెల్స్ మారుస్తోంది. ‘‘ప్రమోదుడొచ్చాడా’’ అంటూ తన గదిలో నుంచి బయటికొచ్చింది కాత్యాయిని. ‘వచ్చాడు మోదం లేకుండా’ అనాలనిపించింది రజితకు. తనకున్నంత బాధ ఆవిడకు కూడా ఉంటుంది కదా! ఫ్రస్టేషన్లో తను మాట తూలి పెద్దామెను బాధ పెట్టడం దేనికి అని సరిపెట్టుకుంది. ‘‘వచ్చారత్తయ్యా! స్నానానికెళ్లారు’’ ముక్తసరిగా బదులిచ్చింది. ‘‘పాప ట్యూషన్ నుంచి ఇంకా రాలేదా’’ అంది కాత్యాయిని కోడలి వైపు చూస్తూ. ‘‘వస్తుందిలెండి. టైమ్ ఉంది కదా’’ అన్నది రజిత. ఇంతలో ప్రమోద్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఏం జరిగిందో తనే చెప్తాడని ప్రమోద్ ముఖంలోకి చూస్తోంది రజిత. కాత్యాయిని గబగబా కిచెన్‌లోకి వెళ్లింది. ఒక కప్పులో సేమ్యా పాయసం, మరో కప్పులో దూద్పేడాతో వచ్చింది. ‘‘నీ బర్త్‌డే రోజు దేవుడికి పూజ చేసుకోకుండా, స్వీటు తినకుండా వెళ్లిపోయావురా నాన్నా! ఇన్నేళ్లలో ఏ పుట్టినరోజుకైనా నా చేత్తో చేసిన సేమ్యా పాయసం తినకుండా ఉన్నావా! అడిగి మరీ చేయించుకునే వాడివి. ఈ రోజు పొద్దున నేను పిలుస్తున్నా వినకుండా అంత పొద్దున్నే వెళ్లిపోయావు. ఇప్పుడైనా కొత్త బట్టలు వేసుకుని రా! నేను మధ్యాహ్నం బాబా మందిరానికెళ్లి నీ పేరుతో బాబాకి పేడా ప్రసాదం పెట్టాను. తిను’’ అని పక్కన కూర్చుని కొడుకు వీపు మీద చేయి వేసి నిమురుతోంది కాత్యాయిని. ‘‘వద్దమ్మా! ప్లీజ్!’’ ప్రమోద్‌కి మాట రావడం కష్టంగా ఉంది. ‘‘మీ తల్లి మనసు ఆరాటమే తప్ప, కొత్త బట్టలు వేసుకుని స్వీట్ తినే కండిషన్లో ఉన్నామా అత్తయ్యా’’ అన్నది రజిత తల్లీకొడుకును మార్చి మార్చి చూస్తూ. ‘‘ఏమైంది నాన్నా, పోలీసులు ఏమన్నారు’’ ఉండబట్టలేక అడిగింది కాత్యాయిని. ‘‘మంత్రి గారి కోడలు అన్నం తినడం లేదట’’ ప్రమోద్ మాటకు విచిత్రంగా చూశారు అత్తాకోడళ్లిద్దరూ. ‘‘ఆమెకి అంత ప్రేమ ఉన్నప్పుడు సిచ్యుయేషన్ క్రిటికల్ కాకముందే తీసుకురావాల్సింది’’ అన్నది రజిత రిమోట్ తీసుకుని టీవీని మ్యూట్‌లో పెడుతూ. ఆమెకు కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆ కోపం ఆమె మాటలో పలుకుతోంది. ‘‘ఎంత అధికారం ఉంటే మాత్రం ఇంత దురాగతమా’’ కాత్యాయిని గొంతు వణుకుతోంది. ప్రమోద్, రజిత... ఇద్దరూ మౌనాన్ని ఆశ్రయించారు. ‘‘ఒకరి జోలికెళ్లకుండా మన బతుకేదో మనం గుట్టుగా బతికే వాళ్లం. మన మీద ఈ నిందలేంటి నాన్నా!’’ కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ వాపోయింది కాత్యాయిని. బయట అడుగుల చప్పుడు... ఆ అలికిడికి ముగ్గురి చెవులూ రిక్కించుకున్నాయి. ‘‘హర్షిత వచ్చినట్లుంది’’ పరిస్థితిని శాంత పరచడానికి ప్రమోద్ మాట మార్చాడు. ‘‘పపా! మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే’’ లోపలికి వస్తూనే బ్యాగ్ పక్కన పడేసి, తండ్రికి షేక్ హ్యాండిచ్చి ప్రమోద్‌కు మరో పక్కన కూర్చుంది హర్షిత. కూతురు బర్త్‌డే గ్రీటింగ్స్ చెబితే థాంక్స్ చెప్పడానికి కూడా పెదవులు విడివడడం లేదు ప్రమోద్‌కి. ‘‘ఉదయం నేను నిద్రలేచేటప్పటికే వెళ్లి పోయావెందుకు? మిడ్ నైట్ ట్వల్వ్కి గ్రీటింగ్స్ చెప్తామనుకున్నాను. మమ్మీని నిద్రలేపమని చెప్పాను కూడా... నన్ను లేపలేదు. ఉదయం నేను లేచేసరికే నువ్వు వెళ్లి పోయావు’’ బుంగమూతి పెట్టి తండ్రి భుజం పట్టి గుంజుతోంది హర్షిత. ‘‘పప్పా! నీ పేరు వాట్సాప్‌లో వస్తోందట. మా ఫ్రెండ్ చెప్పింది. టీవీలో కూడా వచ్చిందట’’ అన్నది హర్షిత. ‘‘త్వరగా డ్రెస్ మార్చుకుని రా’’ కూతుర్ని గదిమింది రజిత. తల్లి మాటలు పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉంది హర్షిత. ‘‘పపా! యాక్చువల్లీ ఆ పెట్కేమైంది’’ ‘‘తిన్నదరక్క తిండి మానేసింది’’ ఈ సారి కటువుగా పలికింది కాత్యాయిని గొంతు. ‘‘అమ్మా! మూగజీవాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? అయినా ‘డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడంతటి వాడు’ అని చెప్పి చెప్పి నన్ను డాక్టర్ని చేశావు కదా’’ నిర్వేదంగా ఉంది ప్రమోద్ మాట. ‘‘కుక్క చనిపోయినందుకే ఇంత చేస్తున్నారు. మనిషి పోయి ఉంటే ఇంకెంత రాద్ధాంతం చేసేవాళ్లో’’ మాట బొంగురుపోతోంది రజితకి. ‘‘ప్రాణం దేనిదైనా ఒకటే... అలా తక్కువ చేసి మాట్లాడకు’’ అనునయంగా అన్నాడు ప్రమోద్. ‘‘అయినా వాళ్ల కుక్క రెండు రోజులు తిండి తినకపోతే వాళ్లకే పట్టలేదు. మూడో రోజు మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నప్పుడు నీ చేతుల్లో పెట్టి ఇప్పుడా మాటలేంటిరా కన్నా. ఇందుకా నిన్ను డాక్టర్ని చేసింది. నువ్వేమో యానిమల్ లవర్‌వి. ‘నోరు లేని జంతువుల బాధను మనసుతో గ్రహించాలమ్మా’ అని ఏవేవో చెప్పి చివరికి పెట్ డాక్టర్వయ్యావు. ఇప్పుడు ఆ మంత్రి గారింటి కుక్క చావడం మన చావుకొచ్చినట్లుంది. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ గడప తొక్కామా’’ దుఃఖంతో గొంతు పూడుకుపోవడంతో మాట ఆగిపోయింది కాత్యాయినికి. ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ కొడుకు తల నిమురుతోందామె. ‘‘పపా! అదిగో ఇష్క్’’ హర్షిత గట్టిగా అరిచింది. టీవీలో చనిపోయిన కుక్క ఫొటోను చూపిస్తున్నారు. కెమెరా ఆ ఫొటోను పట్టుకున్న చేతి నుంచి... ఆ వ్యక్తి ముఖం మీదకు ఫోకస్ అయింది. కళ్ల నీళ్ల పర్యంతం అవుతోంది ఒక యువతి. ‘‘అసలే అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. ఆరో నెల గర్భిణి. ఇష్క్ పోయిన రోజు నుంచి ఇంత వరకు అన్నమే తినలేదు’’ పక్కనే ఉన్న మరో మహిళ చెబుతోంది. ‘‘ఇది పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యమేనని మీరు భావిస్తున్నారా’’ మైక్ ఆమె ముఖం మీద పెడుతూ అడుగుతోంది న్యూస్ రిపోర్టర్. ఆ మహిళ ఏదో చెప్పబోయింది. ఇంతలో మళ్లీ రిపోర్టరే... ‘‘రోజూ మీరు ఇష్క్‌కి ఏం తినిపించేవారు’’ అని అడిగింది. ఆ మహిళ తనకేమీ తెలియదన్నట్లు అయోమయపడింది. క్షణంలోనే తేరుకుని ఇష్క్ పోయిన దుఃఖంలో అన్నం మానేసిన యువతి వైపు చూసిందామె. రిపోర్టర్ వెంటనే మైక్‌ను ఆ యువతి ముఖం మీదకు మార్చింది. కెమెరా కూడా యువతి వైపు ఫోకస్ అయింది. ‘‘యాక్చువల్లీ... ఇష్క్ అస్సలు ఏమీ తినదు. పెడిగ్రీ కూడా నేను పెడితే తప్ప తినదు. బిస్కట్లు కూడా సగం కొరికి, కాళ్లతో నలిపి ఇల్లంతా పోసేది. అల్లరెక్కువ’’ పక్కనే ఉన్న మహిళ అందించిన కర్చీఫ్‌తో కళ్లు తుడుచుకుంటూ చెప్పింది యువతి. రిపోర్టర్‌కి ఉత్సాహం ఎక్కువవుతోంది. ‘‘దట్ డే... అంటే... మీ ప్యార్ చనిపోక ముందు రోజు... సారీ మీ ఇష్క్ చనిపోక ముందురోజు తనకు మీరే తినిపించారా’’ చనిపోయిన ఇష్క్ మీద తన గొంతులో ప్రేమకు ఒలికించడానికి ప్రయత్నిస్తోంది రిపోర్టర్. ‘‘నేను తినిపించలేదు’’ అన్నదా యువతి ఇంకేం ప్రశ్నలడుగుతారోననే భయం ఆమె కళ్లలో. ‘‘ఎందుకు తినిపించలేదు? అప్పటికే ఇష్క్ తినడం మానేసిందా’’ గొప్ప సమయస్ఫూర్తితో సూటిగా ప్రశ్నలడుగుతున్నాననుకుంటోంది రిపోర్టర్. ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయం ఆ యువతిలో. ఆమె కళ్లు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. కెమెరా తన మీదనే ఫోకస్ అయి ఉండడంతో ఏదో ఒకటి చెప్పక తప్పదనుకుని ‘‘ఇష్క్‌కి మా పెట్ అటెండెంట్ టైమ్‌కి టైమ్‌కి ఫుడ్ పెడుతుంటాడు. ముందురోజు అతడేం పెట్టాడో తెలియదు’’ నసిగిందామె. ‘‘మరి మీరు పెట్టకపోతే మీ ఇష్క్ ఏమీ తినదు కదా! మీరు రోజూ ఇష్క్‌కి ఫుడ్ పెట్టరా’’ రిపోర్టర్ కళ్లలో ఆనందం తొణికిసలాడుతోంది. నవ్వకుండా పెదవులను బిగపట్టుకుంటోంది కానీ ఆమె కళ్లు నవ్వుతున్నాయి. ‘పోలీస్ ఇంటరాగేషన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అంతకంటే ఎక్కువగా మైండ్‌ని స్క్ర్యూ చేస్తోంది’∙అనుకుంటూ ఆందోళనను దాచుకుంటోందా యువతి. కెమెరా అక్కడ గుమిగూడిన అందరినీ కవర్ చేస్తోంది. వాళ్లలో పెట్ అటెండెంట్ కూడా ఉన్నాడేమోనని ఆసక్తిగా చూస్తున్నారు వీక్షకులు. సాధారణ వీక్షకులతోపాటు ప్రమోద్ ఇంట్లో వాళ్లు కూడా. అతడి జాడ దొరికినట్లు లేదు. రిపోర్టర్ ఫ్రేమ్‌లోకి వచ్చింది. ‘‘చూశారుగా! మంత్రిగారింటి కుక్క’’ కుక్క అన్నందుకు వెంటనే నాలుక్కరుచుకుని, విశాలంగా ఒక నవ్వు నవ్వి ‘‘మంత్రి గారింటి పెట్ ఇష్క్ గారి ప్రాణాలు పోయాయి. ఇష్క్ గారు లేకపోతే మంత్రి గారి కోడలు అన్నం తినరు. ఆమె అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఆరు నెలల గర్భిణి. ఆమె అన్నం తినకపోతే ఆమె కడుపులో ఉన్న మంత్రి గారింటి వారసుడు కూడా అన్నం మానేసినట్లే. ఇంతటి దయనీయమైన స్థితికి కారణం ఏమిటి? ఎవరు? సమయానికి వైద్యం చేయని డాక్టర్లా? ఇందుకు బాధ్యత ఎవరు వహిస్తారు? మంత్రి గారింటి పెట్కే ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల గతి ఏమిటి?’’ ఎటు నుంచి ఎటో సాగిపోతోంది టాపిక్. హటాత్తుగా సీన్ కట్ అయి న్యూస్ ప్రెజెంటర్ తెర మీదకొచ్చి మరో వార్తను అందుకుంది. ∙∙ ఉదయం ఏడు గంటలకే టీవీ ముందు కనిపించింది కాత్యాయిని. ‘‘ఏంటమ్మా! ఈ డిబేట్లు నీకు నచ్చవు కదా! ఎందుకు చూస్తున్నావ్’’ అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు ప్రమోద్. అతడి కళ్లు ఎర్రగా ఉన్నాయి. కాత్యాయిని మాట్లాడలేదు. టీవీ సౌండ్ పెంచింది. డాక్టర్ ప్రమోద్ నిర్లక్ష్యం వల్లనే మంత్రి గారింటి పెట్ చనిపోయిందా? లేక మరేదైనా కారణంతో చనిపోయిందా? అని సాగుతోంది డిబేట్. టీవీలో కనిపిస్తున్న ఐదుగురిలో ఒక్కరికి కూడా ప్రమోద్ తెలియదు. అయినా అతడి గురించి తమకు ఎంతో తెలిసినట్లు ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలో పెట్ అంటే అస్సలు లక్ష్యం ఉండడం లేదంటూ ఓ యానిమల్ యాక్టివిస్టు ఆవేశంగా మాట్లాడుతోంది. ‘‘ఒక మూగ జీవం ప్రాణం పోవడానికి కారణమైన వ్యక్తి డాక్టర్ అయినా సరే ఉరి తీయాల్సిందే. అంతటి కఠినమైన శిక్షలు ఉంటే తప్ప నోరు లేని ప్రాణుల ప్రాణాలను కాపాడడం సాధ్యం కాదు. ఒక చిన్న ప్రాణం, తన బాధేంటో చెప్పుకోలేక చనిపోయింది’’ దాదాపుగా కన్నీళ్లు పెట్టుకుంటోందా యాక్టివిస్టు. ఆశ్చర్యంగా... టీవీ స్క్రీన్ మీద ప్రమోద్ ఫొటో ప్రత్యక్షమైంది. అది కూడా ఓ రెండేళ్ల కిందట ప్రమోద్, రజిత, హర్షిత సమ్మర్ వెకేషన్లో టూర్‌కెళ్లినప్పుడు తీసుకున్న ఫొటో. అందులో హర్షిత జూలో ఒక కుందేలును తాకుతూ తీసుకున్న ఫొటో. ఒక్క క్షణం అదిరిపడ్డాడు ప్రమోద్. ఇది మీడియాకు ఎలా చేరింది. తనకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు. రజిత కూడా పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయదు. ఎలా సాధ్యమైంది... రజిత తన ఫ్రెండ్స్ ఎవరికైనా వాట్సాప్ చేసి ఉంటుందా? ఆలోచిస్తుంటే బుర్ర తిరిగిపోతోందతడికి. ∙∙ మంత్రి గారి పెట్ మరణం వార్త పాతదైపోయింది మీడియాకి. ప్రమోద్‌కి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఫోన్ రావడం లేదిప్పుడు. మీడియాలో వచ్చిన కవరేజ్ తెలిసి మంత్రి గారే ఇంట్లో వాళ్లను గట్టిగా చివాట్లేశారని, డాక్టర్ మీద కేసు కోర్టుకు వెళ్లకుండా ఆపేశారని అనధికార వార్తలు షికారు చేశాయి కొన్నాళ్లు. ప్రమోద్ ఎప్పటిలాగే హాస్పిటల్కెళ్తున్నాడు. ఓ రోజు ఉదయం... ‘‘పాపకు స్కూల్ వ్యాన్ రాలేదు. మీరు దించుతారా’’ హర్షిత లంచ్ బాక్స్ సర్దుతూ అడిగింది రజిత. ‘‘అలాగే’’ అని బైక్ తీశాడు ప్రమోద్. ∙∙ రాత్రి భోజనాలైన తర్వాత బెడ్రూమ్లో రజితతో ఒకే ఒక్క మాట చెప్పాడు ప్రమోద్. ‘‘రజితా! నువ్వు చెప్పినట్లే మనం ఫారిన్కెళ్దాం. అక్కడ ఉద్యోగాల కోసం రేపటి నుంచే ట్రై చేస్తాను. అమ్మ నన్ను చూడకుండా ఉండలేదు. మనతో వస్తానంటే తీసుకెళ్దాం. ఇక్కడే ఉంటానంటే అమ్మ కోసం ఏదో ఒక అరేంజ్మెంట్ చేయాలి. ఏం చేయాలనేది మళ్లీ ఆలోచిస్తాను’’ అని అటు తిరిగి పడుకున్నాడు. రజితకు ఏమీ అర్థం కాలేదు. కానీ గుచ్చి గుచ్చి ప్రశ్నించే పరిస్థితి కాదని మాత్రం అర్థమైంది. ఇష్క్ గొడవ జరిగినప్పుడు ఇక్కడ వద్దు, వేరే దేశం వెళ్లిపోదామని ఎంత చెప్పినా వినలేదు. పారిపోవడం నాకిష్టం లేదు. నా తప్పు లేకపోయినా సరే ముఖం చాటేస్తే ఏదో తప్పు చేశాడనే అనుకుంటారు. ఇక్కడే ఉండితీరుతానని మొండిగా వాదించాడు. ఇప్పుడేమో తర్కవితర్కాలేవీ లేకుండా నిర్ణయం చెప్పి ఊరుకున్నాడు. కారణం ఏమై ఉంటుంది... ఆలోచనలతో రజితకు నిద్రపట్టడం లేదు. అటు తిరిగి పడుకున్న ప్రమోద్‌కు కూడా నిద్రపట్టడం లేదు. మెదడు చెప్పిన మాటలను మనసు అడ్డుకుంటోంది. తానీ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది రజితకు ఎప్పటికీ చెప్పడు. ఈ రోజు స్కూల్లో విన్న మాటలను కూడా చెప్పడు. రజితకు చెప్తే అమ్మకు చెప్పేస్తుంది. ఆ మాటలు వింటే అమ్మ తట్టుకోలేదు. అమ్మకు గుండాగిపోతుంది. అందుకే తన నోరు పెగలదెప్పటికీ. ఎవరికీ చెప్పకూడదనుకున్నా సరే... ఆ మాటలు చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. పాపను దించి బైక్ రివర్స్ చేసుకుంటున్నప్పుడు తమ పిల్లల్ని దించడానికి వచ్చిన ఇద్దరు పేరెంట్స్ మాటలలి. ‘‘అదిగో అతడే ప్రమోద్. అదే... మంత్రి గారి పెట్‌ను చంపేసిన డాక్టర్. కేసు కూడా పెట్టారు. పోలీసులను బతిమాలుకుని, మంత్రి కాళ్లు పట్టుకుని ఎలాగో బయటపడ్డాడు. ఎవర్ని ఎవరికి తార్చి బయటపడ్డాడో. సొసైటీలో స్టయిల్‌గా తిరుగుతున్నాడు’’. దిండును చెవుల మీదకు లాక్కున్నాడు ప్రమోద్. మాటలు వినిపిస్తున్నది బయటి నుంచి కాదు. అతడి లోపల్నించి. లోపల్నుంచి వినిపించే మాటలను ఆపే దిండు ఉండదు. చికాగ్గా లేచి కూర్చున్నాడు. రజిత, పాప నిద్రపోతున్నారు. ‘ఇంత వరకు జీవించిన గౌరవప్రదమైన జీవితం ఒక్కరోజులో తుడిచిపెట్టుకుపోయింది. ఇష్క్ ప్రాణాలతోపాటు తన క్యారెక్టర్ కూడా గాల్లో కలిసిపోయింది. చివరకు మంత్రిగారింటి పెట్‌ను చంపిన డాక్టర్‌గా గుర్తిస్తోంది సమాజం’ అనుకుంటూ రెండు చేతుల్లో తలను పట్టుకున్నాడు ప్రమోద్. -వాకా మంజులారెడ్డి -
ఆరో యువకుడి కోరిక
అనగనగా ఓ రాజు. అతని దగ్గర ఓ మంత్రి. చుట్టుపక్కల ఆయన దయాదాక్షిణ్యాలతో నడిచే ప్రాంతాల నుంచి పన్నులు వసూలు చేయడానికి తన మంత్రిని పంపుతుంటాడు. మంత్రి ఓ నలుగురు భటులతో పన్నుల వసూలుకు పోతుంటాడు. తిరిగి వస్తున్నప్పుడు మంత్రి, అతని అంగరక్షకులు ఓ అడవి గుండా రావాల్సి ఉంటుంది. ఓసారి వీరిలా పన్నులు వసూలు చేసి వస్తుండగా అడవి మార్గంలో దోపిడీ దొంగలు మంత్రిని, భటులను బెదిరించి వారి నుంచి డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మంత్రి మనసులో దేవుడిని ప్రార్థిస్తాడు తమను కాపాడమని. ఆ ప్రార్థన భగవంతుడి చెవిన పడిందో ఏమోగానీ ఎక్కడి నుంచో ఆరుగురు యువకులు అక్కడికి వస్తారు. మంత్రిని, అతని అంగరక్షకులను కాపాడుతారు. మంత్రి ఆ ఆరుగురు యువకులను మెచ్చుకుని తమతో రాజు వద్దకు తీసుకుపోతారు. రాజుకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తాడు మంత్రి. రాజు వారిని కొనియాడుతూ, మీరేం కోరుకున్నా ఇస్తానని మాటిస్తాడు. మొదటి యువకుడు తనకు బోలెడంత డబ్బు కావాలని కోరుకుంటాడు. రెండో యువకుడు తానూ, తన కుటుంబసభ్యులు హాయిగా నివసించడానికి ఓ ఇల్లు కావాలని కోరుతాడు. మూడోవాడు తానుంటున్న గ్రామంలో రోడ్లను బాగు చేయాలని కోరుకుంటాడు. నాలుగో యువకుడు తాను ఇష్టపడుతున్న ఓ ధనికుడి కూతురితో తనకు వివాహం జరిపించాలని కోరుకుంటాడు. అయిదో యువకుడు తన తండ్రి చేసిన అప్పులన్నింటినీ తీర్చాలని కోరుతాడు. అయిదుగురు యువకులకూ వారు వారు కోరుకున్నది ఇస్తానని హామీ ఇస్తాడు రాజు. ఇక ఆరవ యువకుడి వంక చూసి ‘నీకేం కావాలి’ అని అడుగుతాడు రాజు. యువకుడు అడగడానికి ముందుగా కాస్తంత జంకుతాడు. అయితే రాజు ఎటువంటి జంకూ గొంకూ లేకుండా ఏది కావాలన్నా అడుగు ఇస్తానంటాడు. మాట తప్పనని అంటాడు. అప్పుడు ఆ యువకుడు తనకు నగానట్రా ఏవీ అక్కర్లేదంటాడు. ఏడాదికి ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి ఓ వారమో లేక పది రోజులో ఉండాలి. నాకు అంతకన్నా మరేమీ వద్దంటాడు. రాజు ఇంతేగా అంటూ అతని కోరికకు సరేనని ఒప్పుకుంటాడు. అయితే ఆ తర్వాతే ఆ యువకుడి కోరికలో దాగి ఉన్న ఉద్దేశం అర్థమైంది. అవును...ఆ నిజమేమిటంటే, రాజు అతనింటికొచ్చి ఉండాలంటే అతని ఇల్లు బాగుండాలి. ఆ ఊరికి వెళ్ళే రహదారులన్నీ బాగుపడతాయి. అలాగే అతనున్న సమయంలో అతనికోసం పనివాళ్ళు కావాలి. ఈ క్రమంలో అతనికీ ఓ అర్హత లభిస్తుంది. ఇలా ఉండగా, మొదటి ఐదుగురూ కోరుకున్నవన్నీ కలిపి ఈ ఆరవ యువకుడు ఒక్క మాటతో తీర్చుకోబోతున్నాడు తన కోరికను. అతని ఉద్దేశాన్ని గ్రహించిన రాజు ఆ యువకుడి తెలివితేటలను గ్రహించి అతనికే తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ వల్ల తెలుసుకోవలసిందేమిటంటే రాజే మన పరమాత్మ అనుకుందాం. సహజంగా అయితే అందరూ దేవుడిని కోరుకునేదేమిటంటే ఆ అయిదుగురి యువకుల్లా తమకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు. కానీ ఆరో యువకుడిలా దేవుడే మనతో ఉండాలని కోరుకుంటే మిగిలినవన్నీ తానుగా అమరుతాయి అని గ్రహించాలి. - యామిజాల జగదీశ్ -
ప్రయాణం
రైలు వేగంగా పరుగెడుతోంది, జనరల్ బోగీలో ఓ మూల కిటికీకి తల ఆన్చుకొని కూర్చొన్న నాలో అంతకన్నా వేగంగా సుడులు తిరుగుతున్నాయి జ్ఞాపకాలు. నాకు తెలీకుండానే కంటిలో నీరు ధారలు కడుతోంది. నా చేతిలో చీటీ గాలికి రెప రెప లాడుతోంది. ‘మదర్ ఎక్సపైర్డ్ . స్టార్ట్ ఇమ్మీడియేట్లీ’ ఇంటి దగ్గర నుండి చిన్ననాటి స్నేహితుడు వేణు ఇచ్చిన టెలిగ్రామ్ అది. ఆరోజు మధ్యాహ్నం అనాటమీ క్లాస్‌లో ఉండగా పోస్ట్‌మాన్ వెతుక్కొంటూ వచ్చి ఇచ్చి వెళ్ళాడు. ఆ క్షణం కాళ్ళకింద భూమి కదలి పోతున్న ఫీలింగ్. కళ్ళు బైర్లు కమ్మి కూలబడ్దను. చుట్టూ చేరిన నా బ్యాచ్‌మేట్స్ నన్ను ఓదార్చడానికి విఫల ప్రయత్నం చేశారు. ఎలా ఓదార్చగలరు? నాకు తగిలిన ఈ షాక్ నుండి కోలుకోవడం నాకు సాధ్యమేనా? అసలు నా అంత దురదృష్టవంతుడు ఎవరైనా వుంటారా? పుట్టిన ఐదేళ్లకే ఊహ తెలీని రోజుల్లోనే తండ్రిని పోగుట్టుకొన్నాను. రెక్కలు ముక్కలు చేసుకొని నన్ను, ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లి ఇప్పుడు దూరమైతే, అంతకన్నా దారుణం ఉంటుందా? ఏమిటి నా దారి? నా ఇద్దరు చిట్టి చెల్లెళ్ళ భవిష్యత్తు? ఊరిలో మాకు నా అన్న వాళ్ళు లేరు. అమ్మనాన్నలు ఇంట్లో వాళ్లను ఎదిరించి ప్రేమవివాహం చేసుకొని వాళ్ళ పెద్దలకు దూరం అయ్యారు. నాన్న అమ్మను తీసుకోని వేరే వూరు వచ్చి చిన్న ఉద్యోగం సంపాదించుకొని ఆనందంగా ఉన్న రోజులు నాకు లీలగా గుర్తు. మేము పుట్టిన సంతోష క్షణాలు కూడా అమ్మమ్మ,తాతయ్యల రాతి గుండెలను కరిగించలేకపొయాయి. ఆఖరికి రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోయిన విషాద సమయంలో కూడా వచ్చి వాళ్ళ బాధ్యతలు యాంత్రికంగా నిర్వహించి నిర్దయగా మమ్మల్ని అమ్మతో బాటు వదిలి వెళ్లిపోయారు. అమ్మ కళ్ళల్లో సుడులు తిరిగిన కన్నీళ్లు నాకు ఇంకా బాగా గుర్తు. ఆ క్షణంలోనే నేను పెరిగి పెద్దవాడనై అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ కసితోనే చదువుల్లో ముందుండేవాడిని. నన్ను డాక్టర్‌గా చూడాలని అమ్మ కోరిక. అదే నా లక్ష్యంగా మారింది. రేయింబవళ్లు కష్టపడి చదివా. అంగన్వాడి బడిలో పని చేస్తూ అమ్మ నేను వద్దు అంటున్న వినకుండా, తన వంటి మీద మిగిలిన నగలను అమ్మి మరీ కోచింగ్‌కి నెల్లూరు పంపించింది. క్రమం తప్పకుండ ప్రతి వారం వచ్చి చూసి వెళ్ళేది. ఎంత వద్దన్నా వినకుండా తినడానికి నాకు నా స్నేహితులకు పిండివంటలు స్వయంగా చేసుకొని వచ్చేది. చెల్లెళ్ళ చదువులకూ ఏమాత్రం లోపం జరగకుండా రాత్రనక పగలనక కష్టపడేది. మెడిసిన్‌లో ఖచ్చితంగా సీట్ వస్తుంది అని అమ్మకు నా మీద పూర్తి భరోసా. కానీ, అక్కడ కూడా విధి చిన్న చూపు చూసింది. ఒక్క మార్కులో నాకు మెడిసిన్‌లో సీట్ మిస్ అయ్యింది. నిరాశలో మునిగిపోయిన నన్ను అమ్మ వెన్ను తట్టి సముదాయించింది. నాకు వచ్చిన మార్కులకు వెటర్నరీ డాక్టర్ కోర్స్‌లో సీట్ వస్తుందని మా ఊరి మాస్టర్ ద్వారా తెలుసుకొని నన్ను ప్రోత్సహించింది. ‘‘మనుషుల కన్నా జంతువులకు సేవ చేసే అవకాశం రావడం చాలా అదృష్టంరా. నీకు ఆ అవకాశం ఆ భగవంతుడే ఇచ్చాడు. మారు మాట్లాడకుండా జాయినవ్వు’’ అని తనే స్వయంగా నన్ను కాలేజీలో దిగ బెట్టి వెళ్లి నెల రోజులు కూడా కాలేదు. ఇంతలో ఈ పిడుగులాంటి వార్త! ఇప్పుడు అమ్మ కోరిక తీర్చే అవకాశం కూడా నాకు లేనట్టే. చెల్లెళ్ళను చూసుకోవడానికి నేను తప్ప ఎవరున్నారు? కోర్స్ మానేసి ఊరిలో ఏదయినా చిన్న పని చూసుకోవాలి. ఎందుకు భగవంతుడు ఇంత త్వరగా అమ్మను నా నుండి లాగేసుకున్నాడు? అసలు అక్కడ ఏమి జరిగింది? నాకు తెలిసినంత వరకు అమ్మకు ఏ రకమైన అనారోగ్యము లేదు. విజయనగరం మారుమూల ఒక చిన్న గ్రామం మాది. ఊరిలో ఉన్న ఒకే ఒక్క పోస్ట్ఆఫీస్ ఫోన్‌కి మాత్రమే ట్రంక్ కాల్ సదుపాయం ఉంది. అది కూడా ఎప్పుడో గాని పని చేయదు. ఉంటే వేణుగాడే టెలిగ్రామ్‌కి బదులు ఫోన్ చేసేవాడు. విషయం తెలిసిన వెంటనే ఆఘమేఘాల మీద బయలు దేరా. అప్పటికి ట్రైన్ బయలుదేరడానికి ఒక గంట సమయం మాత్రమే ఉంది. ల్యాబ్ నుండి ఎలా బయట పడ్డానో తెలీదు. అప్పటికే బాగా సన్నిహితులైన మిత్రులు సమయానికి ఆపద్భాందవుల్లా ఆదుకున్నారు. నా రూమ్మెట్ చంద్రం వాడి సైకిల్ మీద ఎక్కించుకొని వేగంగా నన్ను స్టేషన్‌కి చేర్చాడు. తిరుపతి రైల్వే స్టేషన్లో ఎప్పటిలానే తిరునాళ్ల సందడి ఉంది. లోపలికి వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వచ్చిది. మరో ఫ్రెండ్ సాయి ఎప్పుడు దూరాడో జనరల్ కంపార్ట్మెంట్లోకి బాణంలా దూసుకెళ్లి కిటికీ పక్కన సీట్ సంపాదించాడు. జనరల్ టికెట్ ఎప్పుడు నా జేబులో వచ్చి చేరిందో తెలీలేదు, రాత్రి తినడానికి నాకు టిఫిన్ వాటర్ బాటిల్ సిద్ధం చేశారు. నన్ను ఒంటరిగా పంపడానికి వాళ్ళకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒకరిద్దరు నాతో బాటు రావడానికి రెడీ అయ్యారు. నేను బలవంతంగా వారించాను. గమ్యం చేరేసరికి తెల్లవారుతుంది. అప్పటి దాకా నరకయాతన తప్పదు. మధ్యలో ట్రైన్ ఆగిన ప్రతిసారి ఉలిక్కిపడి లేచే వాడిని. మా ఊరి స్టేషన్ వచ్చేసిందేమో అని ఆత్రంగా కిటికీలో నుంచి చూసేవాడిని. నా జీవితంలో అంత సుదీర్ఘ, నరకయాతన ప్రయాణం మరొకటి లేదు! మనసు స్థిమిత పడటానికి భగవంతుణ్ణి ఎన్నిసార్లు తలచుకున్నానో. ‘‘మనకు ఏ కష్టం వచ్చినా భగవంతుడి మీద భారం వేసి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి బాబు..’’ అని అమ్మ చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. అలా చెప్పిన అమ్మే దూరమైన ఈ కష్టం నుండి నన్ను ఏ దేవుడు బయట పడేస్తాడు? ‘‘భగవంతుడు కరుణామయుడు బాబు. నమ్మిన వాళ్లకు ఎప్పడూ ద్రోహం చెయ్యడు. స్వామి ఆశీస్సులు నీకు ఎప్పడూ ఉంటాయి’’ అంటూ ఒక ముసలి యాచకుడు నా నుదిటి మీద విభూది పెట్టి జేబులో నా ఇష్టదైవం అయిన చిన్న ఆంజనేయస్వామీ ఫోటో పెట్టి ఆశీర్వదించాడు. చిన్నప్పడు గుడికి తీసుకెళ్లి కుంకుమ పెడుతూ అమ్మ అచ్చం అలాగే చెప్పేది. ఉలిక్కిపడి పూర్తిగా కనులు తెరిచే లోపు ఆ ముసలాయన ముందుకు సాగిపొయ్యాడు. తడుముకుని చూస్తే జేబులో అంజనేయస్వామి ఫోటో! ఏడుస్తూ...ఎప్పుడు మగత నిద్ర లోకి జారుకున్నానో గుర్తు లేదు. గట్టి కుదుపుతో ట్రైన్ ఆగిన శబ్దానికి మెలకువ వచ్చింది. తెలవారింది. మా ఊరి రైల్వే స్టేషన్. అప్పటి దాకా ఉగ్గబట్టిన దుఃఖం మళ్ళీ కట్టలు తెంచుకునేలా ఉంది. కాళ్లల్లో సన్నని వణుకు మొదలైయింది. యాంత్రికంగా జనాలు నెట్టుతుంటే ట్రైన్ దిగాను. కళ్ళనిండా సుడులు తిరుగుతున్న కన్నీళ్లు, ముందు లీలగా అమ్మ రూపం...కదలి నా వైపే ఆత్రంగా వస్తూ ఉంది! కళ్ళు తుడుచుకొని చూశా...అమ్మ....కళ్ళు నులుముకుని మళ్లీ మళ్లీ చూశా. సందేహం లేదు. కచ్చితంగా అమ్మే! భగవంతుడా!! నా మొర ఆలకించావా. పరుగున వెళ్లి గట్టిగా హత్తుకున్నా కన్నీటి ప్రవాహం ఇంకా ఆగటం లేదు. కానీ ఇప్పుడు అవి ఆనంద భాష్పాలు! జరిగిన సంగతి అర్థం కావటానికి నాకు ఎంతో సేపు పట్టలేదు...చనిపోయింది నా స్నేహితుడు వేణు వాళ్ళ అమ్మ! ఇద్దరికీ ఉన్న చనువు వల్ల ‘మదర్ ఎక్సపైర్డ్’ అని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆరోజు ఆ క్షణం అమ్మను హత్తుకొని నేను అలా ఎంత సేపు ఏడ్చానో నాకే తెలీదు. ‘‘నెల రోజులకే ఇలా దిగులు పెట్టుకుంటే ఎలా రా పిచ్చి వెధవా.. వేణుకి మనం ఉన్నాము లేరా, ఆరోగ్యం బాగా లేక వాళ్ళ అమ్మ చనిపోయింది. వాడికి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఐపోతే ఎలా రా?’’ అని విషయం పూర్తిగా తెలియని అమ్మ ఓదారుస్తూనే వుంది. ఈ సంఘటన జరిగి ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయ్యింది! అమ్మ ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఆమె కోరికలన్నీ నెరవేరాయి. అమ్మ దూరమైందని నేను బాధ పడిన ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. ఎన్నో రాత్రులు నిద్రలో ఉలిక్కిపడి లేచేవాడిని. అది నిజం కాదని తెలిసి మనస్సు తేలిక అయ్యిది. అప్పటికప్పుడు వెళ్లి అమ్మ మొహం చూసి వస్తే కానీ మనస్సు స్థిమిత పడేది కాదు. ఆ రోజు ట్రైన్లో ముసలి యాచకుడు...కాదు, కాదు నా పాలిట దేవుడు. ఆయన ఇచ్చిన ఆంజనేయస్వామి ఫోటో ఇప్పటికీ నా జేబులో భద్రంగా ఉంది. మా పిల్లలకి ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పాను. కానీ ఇప్పటికీ అమ్మకు మాత్రం చెప్పలేదు! తథాస్తు దేవతలు ఉంటారేమో అని నా భయం. మరోసారి అమ్మను దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను మరి. (స్నేహితుని జీవితంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా) - డా. నగరం వినోద్ కుమార్ -
వేగోద్దీపన ఔషధం
చిన్న గుండుసూది కోసం వెతుకుతుంటే ఒక బంగారునాణెం దొరికినట్లు– నాకు మిత్రుడైపోయాడు ప్రొఫెసర్ గిబ్బర్న్. ఫోక్‌స్టోన్ పట్నంలో నా పొరుగున నివాసం ఉన్నాడతను. గిబ్బర్న్కు– మనిషి నాడీవ్యవస్థ మీద పరిశోధనలు చేసి మంచి ఫలితాలు రాబట్టిన శాస్త్రజ్ఞుడిగా– మంచి గుర్తింపు ఉంది. మత్తు కలిగించే స్పర్శ నాశకాలకు సంబంధించిన ఔషధాలు తయారుచేసే విషయంలో అతనికతనే సాటి. అతనొక సమర్థుడైన రసాయన శాస్త్రవేత్త. నరాల కణాలు ఒకచోట చేరటం వల్ల ఏర్పడే వాపు సమస్యలు– తదితర ప్రయోగాల గురించి అతను వివరణ ఇచ్చేదాకా ఎవరికీ అర్థమయ్యేవి కావు. ప్రస్తుతం అతను నూతనంగా ఆవిష్కరించనున్న ‘సహస్రగుణీకృత వేగోద్దీపన రసాయనం’ తయారు చేసేముందు కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు చేసి విజయం సాధించి ఉన్నాడు. అనేక వందలరెట్లు మానసిక శక్తినిచ్చే మందులు సృష్టించిన గిబ్బర్న్కు శాస్త్ర విజ్ఞానలోకం, మెడికల్ ప్రాక్టీషనర్ల సమూహం సదా కృతజ్ఞతగా ఉంటుంది. వివిధ కారణాలవల్ల విపరీతంగా అలసిపోయిన జనానికి అతడు కనిపెట్టిన గిబ్బర్న్స్ బీ సిరప్– సముద్రతీరాలలో, సిధ్ధంగా వుంచబడిన లైఫ్బోట్స్లా ఎంతోమంది ప్రాణాల్ని కాపాడింది. ‘కానీ అటువంటి చిన్న చిన్న ఆవిష్కరణలు నా మనసును తృప్తి పరచలేదు.’ అది– సంవత్సరం క్రితం అతని మనసులోంచి వెలువడిన అసంతృప్త భావనా వీచిక. అతను మళ్ళీ చెప్పసాగాడు. ‘అవి నరాల వ్యవస్థను ప్రభావితం చేయకుండా, శరీరంలోని కేంద్రక శక్తిని ఉద్దీపించలేకపోయాయి. లేదా నాడీవ్యవస్థ మీద పడే ఒత్తిడిని తగ్గిస్తూ, లభ్యనీయ కేంద్రకశక్తిని ప్రజ్వలింప చేయలేకపోయాయి. అవి ఒక నిర్దిష్టమైన అంతర్గత అవయవం మీద మాత్రమే ఉపయోగించవలసి వచ్చేది. ఉదాహరణకు ఒకడి గుండెతో పాటు శరీరంలోపలి ఇతర అవయవాలను కూడా చైతన్య పరచగలిగితే, అతని మెదడు ఉద్దీపనమౌతుంది. అతని శరీరం మొత్తం– ఇతరులకంటే కూడా అనేక రెట్లు ఉత్తేజపరచే విధంగా ఒక ద్రావణాన్ని అభివృధ్ధి చేశాను.’ ‘అది వ్యక్తిని నీరసపరుస్తుందేమో?’ అన్నాన్నేను. ‘అలాంటి అనుమానాలొద్దు. నేను చెప్పిన దాంట్లోని మర్మాన్ని అర్థం చేసుకో.’ అంటూ ఒక ఆకు పచ్చని గాజు సీసాని పైకెత్తిపట్టుకొని చూపెడుతూ ఒక నిర్ణీత కాలపరిమితి కన్నా రెండింతల వేగంతో ఆలోచించే మెదడు సామర్థ్యం, ద్విగుణీకృత వేగంతో చలించే శక్తి, రెట్టింపు వేగంతో పనిచేసే ప్రజ్ఞాపాటవాలను చేకూర్చి పెట్టే అద్భుత లక్షణముంది ఈ సీసాలోని ద్రావణానికి.’ ‘కానీ అది సాధ్యమేనా?’ ‘అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలా జరగకపోతే ఒక సంవత్సరం పాటు నేను చేసిన కఠోర శ్రమంతా వృథా అయినట్లే కదా? నేను సాధించిన ఫలితాలు– నా పరిశోధనలు అబద్ధం కాదని రుజువు చేస్తున్నాయి. అయితే, రెట్టింపు ప్రభావం చూపకపోయినా, కనీసం ఒకటిన్నర రెట్లు వేగాన్ని చూపుతాయని కచ్చితంగా చెప్పగలను. ఉదాహరణకు, నీవొక రాజకీయనాయకుడివని ఊహించుకో. అనివార్యంగా ఒక ముఖ్యమైన పని ముగించవలసిన విషమ పరిస్థితి నీ ముందుంది. కానీ సమయం చాలా పరిమితంగా వుంది. చాలా అర్జంటుగా పనిముగించాలి. అప్పుడు నువ్వేంచేస్తావ్?’ ‘నా పర్సనల్ సెక్రెటరీకి ఆ పని అప్పగిస్తాను.’ ‘పోనీ, ఒక రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడ్డానికి సమయం చాలని ఒక డాక్టరుకు రెట్టింపు వ్యవధి దొరికిందనుకో.. లేకపోతే, ఊపిరి సలపని పనిఒత్తిడితో సతమతమవుతున్న అడ్వొకేట్ కు గానీ, పరీక్షలకు ముందుగా తయారవ్వక దిక్కులు చూస్తున్న ఒక విధ్యార్థికి గానీ రెట్టింపు సమయం దొరికితే?... అప్పుడు ఈ సీసాలోని ఒకే ఒక్క చుక్క ద్రావణం, ఒక బంగారు నాణెంతో సమానమైన విలువ చేస్తుంది. కొన్ని చుక్కల ద్రావణాన్ని పుచ్చుకొంటే మెదడు రెండింతలు చురుగ్గా పనిచేసి ఉద్దీపనమౌతుంది. ద్వంద్వ యుద్ధంలో పిస్టల్ ట్రిగ్గర్ నొక్కే వేగం మీద విజయం ఆధార పడి ఉంటుంది.’ చెప్పుకొచ్చాడు గిబ్బర్న్. ‘సాముగరిడి విషయంలో?...’ అడిగాను. ‘అన్ని విషయాలలో కూడా. అది ఏమాత్రం ప్రమాదకరం కాదు. కాకపోతే... బహుశా అది నిన్ను వృద్ధాప్యానికి దగ్గరగా చేరుస్తుందేమో?... అంటే ఇతరులు ఒక సంవత్సరం జీవిస్తే నువ్వు రెండు సంవత్సరాలు జీవించిన అనుభూతి పొందినట్లుంటుంది.’ ‘అది నిజంగా సాధ్యపడుతుందా?’ ‘సాధ్యమే మైడియర్ ఫ్రెండ్!... నా పరిశోధన గురించి నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే– నేను కనుగొన్న సిరప్ – రెండురెట్లు కాదు. అంత కన్నా అధిక వేగంతో పని చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. తరువాత చాలాసార్లు ఆ రసాయనం గురించే చర్చించుకున్నాం. ఫలితంగా అతను రసాయనాన్ని– ఇంతకు ముందు పేర్కొన్న లోపాల్ని సంస్కరించి– అభివృధ్ధి చేయగలిగాడు. ‘‘అమృతతుల్యమైన ఒక అపూర్వ దివ్యౌషధాన్ని ఈ లోకానికి సమర్పిస్తున్నానని నా విశ్వాసం. నా ఆశయాలకూ, అంచనాలకు అనుగుణంగా ప్రజలు దీటుగా స్పందించి, న్యాయబధ్ధమైన ధరలకే అందుబాటులో వుండబోతున్న మందును కొనుగోలు చేస్తారని నమ్ముతున్నాను.’’... ‘‘విజ్ఞాన శాస్త్రమెప్పుడూ గౌరవింపబడుతూనే వుంటుంది. ఏదేమైనా నా మందుమీద కనీసం పదేళ్ళపాటు నేనే గుత్తాధిపత్యం కలిగి వుండాలని అభిలషిస్తున్నాను. ఎందుకంటే– చూస్తూ చూస్తూ– బొత్తిగా అనుభవం, ప్రావీణ్యం లేని, అత్యాశాపరులైన వ్యాపారస్తుల చేతుల్లో వుంచడానికి నా మనస్సంగీకరించడం లేదు.’’ అలా చెప్పుకుపోయాడు గిబ్బర్న్. కాలప్రవాహంలో– గిబ్బర్న్ తయారుచేయబోయే ఔషధం గురించిన ఆసక్తి నా మనసులో నుంచి కొట్టుకుపోలేదు. అతను కొత్తగా ఈ లోకానికి అందించబోవు ఔషధం– కచ్చితంగా మానవజీవితాన్ని– అవసరానికి తగ్గట్టు వేగవంతం చేస్తుందనే నేను నమ్ముతున్నాను. కానీ– సదరు ఔషధరాజాన్ని పదేపదే సేవించిన ఆ మానవుడు, నిత్య జీవచైతన్యంతో కళకళలాడినా– పదకొండేళ్ళకే వయోజనుడైపోతాడు. ఇరవైఐదేళ్ళకే మధ్యవయస్కుడై, ముప్పై ఏళ్ళకు వృధ్ధాప్యంలోనికి అడుగుపెట్టి, అంతరించిపోతాడు. యూదులు, తూర్పు ఆసియా సంతతి వారు–సహజంగా యవ్వనంలో వయోజనులై, యాభైయ్యవపడిలో వృధ్ధులుగా మారి, ఆలోచనలలో మనకంటే అమిత వేగాన్ని ప్రదర్శించేవారు. ఈ కాలపుమనిషి, ఈ ఉద్దీపనాకారక ఔషధాన్ని సేవిస్తే, వారి మాదిరిగానే తయారవుతారు. మనసుమీద ఆ ఔషధ ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అది మనిషిని పిచ్చివాణ్ణిగా చేయగలదు. అత్యంత బలశాలిగా మార్చగలదు. చేతనాచేతనావస్థలలోకి కొనిపోగలదు. గిబ్బర్న్ నూతనావిష్కరణ వైద్యుల ఆయుధాగారంలో మరొక అద్భుతమైన ఆయుధంగా చేరి, అలరించగలదని నా కనిపించింది. కొన్ని రోజుల తర్వాత ప్రొఫెసర్ నన్ను కలిశాడు. అతని ముఖం ఆనందాతిరేకంతో ఉప్పొంగిపోతూ వుంది. ‘‘నేను సాధించాను. నా కల ఫలించింది. నా మనసులోని ఆలోచనలు ఒక నిర్దిష్టరూపాన్ని సంతరించుకొని నా ఎదుట నిలిచాయి. ఈ ప్రపంచం కోసం– ఎటువంటి దుష్పరిణామాలకు ఆస్కారం లేని– అత్యంత శక్తిమంతమైన ఒక కొంగ్రొత్త ఉద్దీపన రసాయనం తయారు చేయగలిగాను.’’ అతను గట్టిగా కేకలు వేసినంత పనిచేశాడు. నా చెయ్యిపట్టుకొని విపరీతంగా ఊపేశాడు. ‘నిజంగానా?’ నేనడిగాను. ‘‘నిజంగానే! నాకే నమ్మ శక్యంగా లేదా? మా ఇంటికిరా పోదాం. నువ్వే చూద్దువు గానీ.‘ అన్నాడు ఉద్వేగంతో ఊగిపోతూ. ‘‘రెండింతల శక్తిమంతంగా పనిచేస్తుందా?’’ ‘‘రెండింతలు కాదు. వెయ్యింతలు! అంతకంటే ఎక్కువ!’’ తన ఆనందాతిరేకాన్ని దాచుకోలేకపోతున్నాడు. భావోద్వేగాన్ని అణచుకోలేకపోతున్నాడు. ‘‘అది మనిషి నాడీవ్యవస్థ మీద విపరీతమైన బలంతో పనిచేస్తుంది. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఆ ఔషధ ప్రభావాన్ని పరీక్షించడం..’’‘ ‘‘పరీక్షించడమా ?’’ అడిగాను– అతని ఉద్దేశాన్ని పసిగట్టి. ‘‘ఔను! ఆ ఆకుపచ్చని గాజుసీసాలో ఉంది చూడు దివ్యౌషధం. నువ్వు భయపడకూడదు.’’ నేను స్వతహాగా జాగ్రత్తపరుణ్ణి. సాహసకృత్యాలు చేయాలనే ఉత్సాహం నాలో పరవళ్లు తొక్కుతోంది. మనసులో అనుకోవడమే గానీ, ఏనాడూ అవకాశం రాలేదు. అదిప్పుడొచ్చింది. మొదటిసారి కాబట్టి, లోలోన ఒక పక్క నేను భయపడుతున్నా, మరోపక్క గర్వించాను– ఒక లోకోపకార ఔషధ తయారీలో నేనూ భాగస్వామినవుతున్నందుకు. ‘సరే‘ అన్నాను సంశయిస్తూనే. ‘‘ప్రొఫెసర్! నువ్వు ఈ మందును తాగి ముందస్తు పరీక్ష చేశావా?’’ అని అడిగాను. ‘‘ఔను! నాకేమీ ప్రమాదకరంగా అనిపించలేదు.’’ ‘‘సరే! ఆ కషాయం నా నోట్లో పొయ్యి. అన్నట్టు ఎలా తీసుకోవాలి?’’ అని అడిగాను. ‘‘నీళ్లలో కలుపుకొని.’’ అతడు డెస్క్ వెనుక నుంచి పైకి లేచి, నన్ను ఈజీ చెయిర్లో కూర్చోబెట్టాడు. ‘‘ఇది రమ్ములాగా వుంటుంది. ఈ కషాయం నీ గొంతులోకి దిగిన వెంటనే కళ్లు మూసుకోవాలి. ఒక నిమిషం తరువాత నెమ్మదిగా తెరవాలి. చూపులో స్వల్ప ప్రకంపనాలుండొచ్చు. కానీ ఆ స్థితి ఎక్కువసేపు ఉండకపోవచ్చు. వెంటనే కళ్లు తెరిస్తే, కనుపాప దెబ్బ తినొచ్చు. అందుకే కళ్లు తెరవకుండా గట్టిగా మూసుకోవాలి’’ జాగ్రత్తలు చెప్పాడు. అతను చెప్పినట్టుగానే కళ్లు మూసుకున్నాను. ఇంకో విషయం. నువ్వు కదలకుండా కూర్చోవాలి. అలా కదిలితే నీకే ప్రమాదం. జ్ఞాపకముంచుకో. నువ్వు ఇదివరకటి కంటే వెయ్యిరెట్లు వేగంగా కదులుతావు. నీ గుండె, ఊపిరితిత్తులు, కండరాలు, మెదడు– అన్నీ అదే వేగంతో పనిచేస్తాయి. ఆ విషయం నీవు తెలుసుకోలేవు. కానీ దానికి విరుధ్ధంగా, ప్రపంచం మొత్తం, ఇదివరకటి కంటే వెయ్యింతలు నెమ్మదిగా కదులుతుంది.. అంటే కళ్ల ముందు కదులుతూ కనిపించేవన్నీ దాదాపు చలనం లేకుండా ఉండిపోతాయి.’’అంటూ, కషాయం నింపి ఉన్న సీసా తెరిచాడు. అందులోని కషాయాన్ని గ్లాసుల్లోకి వొంపాడు– బార్లో వెయిటరు విస్కీని కొలతవేసి వొంపినట్లుగా. ‘‘రెండు నిముషాలపాటు కళ్లు గట్టిగా మూసుకొని కదలకుండా కూర్చో. తరువాత నా మాటలు నీకు వినిపిస్తాయి’’ అన్నాడు. ప్రొఫెసర్ రెండు గ్లాసుల్లోకి కొన్ని నీళ్లు కలిపాడు. ‘‘నీ గ్లాసును కిందపెట్టొద్దు. చేత్తోఅలాగే పట్టుకొని, చేతిని నీ మోకాలు మీదుంచు. అవును అలానే’’ అంటూ అతని చేతిలోని గ్లాసును పైకెత్తి పట్టుకొన్నాడు. అందులోని ద్రవాన్ని తాగాం ఇద్దరమూ. అదే క్షణంలోనే నేను కళ్లు మూసుకున్నాను. నేనేదో శూన్యంలోకి పడిపోయినట్లయింది. కొద్దిసేపటికి గిబ్బర్న్ నన్ను ‘ఇక లే’ అన్నట్టనిపించి కళ్లు తెరిచాను. నా ఎదురుగా గిబ్బర్న్ చేతిలో గ్లాసుతో నిలబడివున్నాడు. ఆ గ్లాసు ఖాళీగా వుంది. ‘ఇప్పుడెలా వుంది? ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా?’ అడిగాడు. ‘లేదు. మనసు ఉల్లాసంగా గాలిలో తేలిపోయినట్లయింది...’ . ‘ఏవైనా శబ్దాలు వినిపించాయా?’ ‘ఆహా! అద్భుతంగా! కర్ణపేయంగా వినిపించాయి. మెల్లగా చప్పుడు చేస్తూ, వేటి వేటి మీదనో చిరుజల్లు పడుతున్నట్టుగా శబ్దాలు వినిపించాయి.! ఏమిటవి?’ ‘అవి విశ్లేషణ ధ్వనులు..’ అని చెప్పాడో? మరేం చెప్పాడో? నేను సరిగ్గా వినలేదు. అతను కిటికీ వైపు చూపులు సారిస్తూ, ‘ఆ కిటికీతెర ఆ విధంగా కిటికీకి అతుక్కుపోయినట్టున్న దృశ్యం నువ్వెప్పుడైనా చూశావా?’ ‘లేదు. చూడలేదు. ఆ దృశ్యం చాలా వింతగా, కొత్తగా వుంది.’ అన్నాను. ‘అలానా? అయితే ఇటుచూడు మరి.’ అటు చూశాను. గిబ్బర్న్ చేత్తో పట్టుకొన్న గ్లాసును వదిలేశాడు. అలా వదలగానే అది కిందపడి భళ్లున పగిలి ముక్కలు కావాల్సిన ఆ గ్లాసు గాలిలో తేలియాడుతూ నిశ్చలంగా నిలిచివుంది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ప్రొఫెసర్ చెప్పుకుపోయాడు. ‘సాధారణంగా ఈ ఎత్తులో నుంచి, ఏ వస్తువైనా సరే, ఒక క్షణానికి పదహారు అడుగుల వేగంతో కింద పడిపోతుంది. చూడు ఈ గ్లాసు క్షణంలో నూరోవంతు వేగంతో కూడా కిందకు పడిపోకుండా గాల్లో తేలియాడుతూ వుంది. దీనివల్ల నీకు నేను కనిపెట్టిన మందు ప్రభావం గురించి కొంచెం కొంచెం అర్థమైవుంటుంది. తరువాత అతను ఆ గ్లాసు చుట్టూ, పైనా, కిందా తన చేతిని వలయాకారంగా తిప్పాడు. అది అతి నెమ్మదిగా అధోముఖంగా దిగసాగింది. దాని అడుగుభాగాన్ని అరచేత్తో జాగ్రత్తగా పట్టుకొని టేబుల్ మీదుంచి, నాకేసి చూసి నవ్వాడు. నేను జాగ్రత్తగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాను. నా మనసు గాల్లో తేలిపోతున్నట్లుంది. నాలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతూ వుంది. అమోఘమైన ఆత్మవిశ్వాసం నిండివుంది. నా మనసు చాలా వేగంగా ఆలోచిస్తూ వుంది. ఉదాహరణకు– నా గుండె ఒక్క క్షణంలో వెయ్యిసార్లు కొట్టుకొంది. కానీ నా కేమీ ఇబ్బందిగా అనిపించలేదు. కిటికీలోంచి బయటికి చూశాను. నిశ్చల చిత్రంలా– ఒక సైక్లిస్టు కనబడ్డాడు. అతను తల ముందుకు వంచి సైకిల్ తొక్కే భంగిమలో నిలబడి వున్నాడు. వెనుకచక్రం వెదజల్లే దుమ్ము బంకమట్టితెరలా స్తంభించి వుంది. వేగంగా వెళుతున్న ఒక మోటారు కారు ఎక్కడున్నది అక్కడేఆగి వుంది. నిజంగా నమ్మలేని ఆ దృశ్యాన్ని నేను నోరెళ్లబెట్టి చూశాను. ‘ప్రొఫెసర్ గిబ్బర్న్! దీని ప్రభావం ఎంతసేపుంటుంది?’ గొంతు పెంచి, అసహనంగా అరిచాను. దానికతడు ‘ఏమో! ఆ దేవుడికే తెలియాలి.’ అని చాలా తాపీగా బదులిచ్చాడు. ‘‘నిన్న రాత్రి ఈ మందు తాగాను. పరుపుమీద అసహనంగా దొర్లాను.కింద పడ్డాను. నాకు భయమేసింది. ఆ స్థితి కొన్ని నిముషాలపాటే వున్నా, కొన్ని గంటలు గడిచినట్టుగా అనిపించింది. అయితే, అకస్మాత్తుగా తగ్గిపోయినట్లయిందని అనుకుంటున్నా’’నంటూ బదులిచ్చాడు. నేను భయపడనందుకు నా ఛాతీ ఒకింత పొంగింది. ‘అలా బయటికెళ్దామా?’ అడిగాను. ‘తప్పకుండా’... ఆ స్వల్ప వ్యవధిలోనే గిబ్బర్న్ చేత సృష్టించబడిన ఔషధప్రభావం కారణంగా నేను పొందిన దివ్య చిత్రవిచిత్రానుభూతి, నా జీవితంలో ఎన్నడూ కనీవినీ ఎరుగనటువంటిది, మరచిపోలేనిది, అనూహ్యమైనదని కచ్చితంగా చెప్పగలను. గేటు గుండా బయటికొచ్చాము. రోడ్ మీద ట్రాఫిక్ ను ఒక నిముషం పాటు గమనించాము. గిర్రున తిరుగుతున్న గుర్రబ్బండి చక్రాల ఉపరిభాగం, గుర్రాల కాళ్లు వేగంగా కదలుతున్నాయి. చోదకుడు బధ్ధకంగా ఆవులిస్తూ, దవడ ఎముకను కదిలిస్తూ కొరడా ఝళిపిస్తున్నాడు. అక్కడ చుట్టుపట్ల వున్న మిగతా వాహనాలు మాత్రం నెమ్మదిగా కదలుతున్నాయి. ఎవరో మనిషి ఆర్తనాదంలాంటి చిన్న కేకతప్ప ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా వుంది. పదుకొండుమంది ఆసీనులైవున్న వాహనంలో– గుర్రబ్బగ్గీ చోదకుడు, బగ్గీ నిర్వాహకుడుతో సహా అందరూ నిశ్చలంగా ప్రతిమల్లాగా ఉండిపోయారు. వాళ్లు మాలాంటివాళ్లే కానీ, మాలాగా వాళ్లు లేరు. బిగుసుకొని పోయి గాల్లో వేల్లాడుతున్నారు. ఒక ఆడదీ, ఒక మగవాడూ ఒకరివంక ఒకరు చూసుకొంటూ నవ్వుకొంటున్నవారు నవ్వుకొంటూనే రాతిబొమ్మల్లా అచలంగా వుండిపోయారు. మీసాలను సవరించుకొంటున్న మగవాడు, జారిపోతున్న టోపీని– పూర్తి శక్తి ఉడిగిన వాడిలా– చేత్తో పట్టుకోడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలుడవుతున్నాడు. ఉన్నట్టుండి గిబ్బర్న్ గట్టిగా అరిచాడు. ఒక దృశ్యాన్ని చూపించాడు. నత్తనడిచే వేగం కన్న తక్కువ వేగంతో గాలిలో బలహీనంగా కిందకు దిగుతూ వుంది– ఒక తేనెటీగ. ఆ గడ్డిపెరిగిన నేలను వదలి బయటికొచ్చాము. ఇంతకు ముందుకన్నా ఎక్కువ పిచ్చెక్కించే సన్నివేశాలు కనబడ్డాయి. ఒక బ్యాండ్ సెట్ వాళ్లు ఎత్తయిన ప్రదేశంలో ఆసీనులై, సంగీతస్వరాలు వినిపిస్తున్నారు. ఆ స్వరాలు అత్యంత తగ్గుస్థాయిలో గుర్ గుర్‌మని పిల్లికూతల్లా వినబడుతున్నాయి. మనుషులు బొమ్మల్లా భయంకరమైన మౌనంతో గడ్డినేల మీద అతి నెమ్మదిగా అడుగులు కదిలిస్తున్నారు. పూడుల్ జాతికుక్క పైకెగిరి గాలిలోనే వేలాడుతూ, నెమ్మదిగా భూమి మీదకు దిగుతోంది. ఖరీదైన దుస్తులూ,తెల్లని షూస్, పనామా టోపీ ధరించి, గొప్పగా కనిపించే ఒకతను, వెనక్కి తిరిగి దారివెంబడి వెళ్లే ఆడవాళ్ల వంక అతివేగంగా అదేపనిగా కన్నుకొట్ట సాగాడు. ‘ఈ వేడి వాతావరణం– నరకాన్ని తలపిస్తోంది. నెమ్మదిగా నడుద్దాం’ అన్నాన్నేను. అక్కడ్నుంచి ముందుకు కదిలాం. దారి వెంబడి కొందరు దివ్యాంగులు చక్రాల కుర్చీలలో కూర్చొని వున్నారు. వారు కూర్చొన్న భంగిమలు సహజంగానే కనబడుతున్నాయి. ఆ బ్యాండ్ మేళం వాళ్ల ముఖాలు మాత్రం అశాంతితో నిండివున్నాయి. ఒక పొట్టి పెద్దమనిషి– విసురుగా వీస్తున్న గాలి ధాటికి రెపరెపలాడుతున్న వార్తాపత్రికను మడతపెట్టలేక విపరీతమైన హైరానా పడుతున్నాడు. అక్కడున్న వారందరూ చాలా మందకొడిగా మసలుతూ ఏదో పెనుగాలికి ఊగులాడుతున్నట్టు అగుపిస్తున్నారు. కానీ మాకేమో ఏ గాలీ వీస్తున్న అనుభూతే లేదు. ఆ గుంపు నుండి దూరంగా వచ్చేశాము. ఉద్దీపన ఔషధం నా నరాలలోనికి చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెప్పిన సంఘటనలు కన్నుమూసి తెరిచేలోపల జరిగిపోయాయి. ఇంతలో గిబ్బర్న్ నా ఆలోచనలకు అంతరాయం కలిగించాడు. ‘ఆ దరిద్రపు ముసల్ది వుందే...’ అన్నాడు. ‘ఏ ముసల్ది?’ ‘అదే. నా ఇంటి పక్కనుంది చూడు.దాని దగ్గరున్న ఒక పెంపుడు కుక్క బలే మొరుగుతుందనుకో..’ ఒక్కొక్కసారి, గిబ్బర్న్ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తుంటాడు. నేను వారించే లోపల, పాపం! ఆ అమాయక ప్రాణిని మెడ ఒడిసిపట్టుకొని కొండ చరియదాకా పరుగులు తీశాడు. అది కనీసం మొరగలేదు.మెలికలు తిరగలేదు. నిద్రావస్థలో వున్నట్టుండి పోయింది. అలా వెళుతున్న గిబ్బర్న్నుద్దేశించి గట్టిగా అరిచాను. ‘గిబ్బర్న్! దాన్ని కిందపడేయ్! కిందపడేయ్! నువ్వలా పరుగెత్తావంటే నీ బట్టలు వేడికి అంటుకొని కాలిపోతాయ్’ అని అరుస్తూ, నేను కూడా కొండ కేసి పరుగెత్తాను. గిబ్బర్న్ తొడకొట్టుతూ కొండ రాయిమీద నిల్చున్నాడు. నేను ఆందోళనతో మరొక్కసారి బిగ్గరగా అరిచాను. ‘గిబ్బర్న్! దాన్ని కిందకు పడేయ్! ఈ వేడి చాలా తీవ్రంగా వుంది. మనం ఒక్క క్షణానికి రెండుమూడు మైళ్లు పరుగెత్తుతున్నాము. గాలిలో ఘర్షణ విపరీతంగా వుంది...’ ‘ఏమిటీ?’ అని కుక్కపిల్లకేసి చూస్తూ అడిగాడు. ‘గాలిలో ఘర్షణ... ఉల్కాపాతంలాంటి చండప్రచండ వేగంతో వాయుఘర్షణ వల్ల మంటలు చెలరేగుతున్నట్లున్నాయి. ఉష్ణకిరణాలు నా శరీరానికి బాకుల్లా గుచ్చుకుంటున్నాయి. జనంలో కూడా కొద్దిగా చలనం వచ్చింది. మందు ప్రభావం పూర్తిగా క్షీణించినట్లుంది. వెంటనే ఆ కుక్కపిల్లను కిందకు వదిలేయ్!’ ‘ఆ!? ’ అన్నాడు. ‘మందు పనిచేయడం మానేసింది. చాలా వేడిగా వుంది. నా ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి.’ వెంటనే గిబ్బర్న్ చేయి విదిలించి కుక్కపిల్లను దూరంగా విసిరేశాడు. అది గిరగిరా తిరుగుతూ పైకెళ్ళి కదలకుండా గాల్లో నిలిచిపోయింది. అక్కడ గుమిగూడిన జనం, నీడ కోసం గొడుగులు ఏర్పరచుకొని, వాటి కింద పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ గొడుగులకు కొంచెం ఎత్తులో– మేకుకు తగిలించినట్టు వేలాడుతూ ఉండి పోయింది కుక్కపిల్ల. అప్పుడు గిబ్బర్న్ మాట్లాడాడు. ‘‘ఔనౌను. విపరీతమైన వేడిగా వుంది.ఇక్కడి నుంచి మనం తక్షణం బయటపడాలి.’’ కానీ అనుకున్నంత వేగంగా మేము పరుగెత్తలేకపోయామనుకుంటాను. అదే మాకు కలిసొచ్చిన అదృష్టమేమో! ఒకవేళ మేము అలా పరుగెత్తివుంటే, మంటల్లో మాడి మసైపోయేవాళ్లమేమో ఈపాటికి! అవును! నిజంగానే మంటల్లో భస్మీపటలమై వుండేవాళ్లం.మేము పరుగెత్తాలని నిర్ణయించుకోవడానికి– క్షణంలో వెయ్యోవంతు ముందుగా ఆ మందు ప్రభావం అంతరించడం కాకతాళీయంగా జరిగిపోయింది. చేత్తో మంత్రదండం తిప్పినట్లు దాని ప్రభావం పూర్తిగా ఆగిపోయింది. అంతలో గిబ్బర్న్ ‘కింద కూర్చో! కింద కూర్చో!’ అని హెచ్చరించాడు. నేను పచ్చగడ్డితో కూడిన మట్టిపెల్ల అంచు మీద కూర్చున్నాను. నేను ఏ పచ్చగడ్డి గడ్డ మీద కూర్చున్నానో, దానికి ఒకవైపు నుంచి మంటలు రాజుకుంటూ వస్తున్నాయి. చిత్తరువులా నిశ్చలస్థితిలో వున్న జగత్సర్వస్వం జాగృతమైంది. నిర్జీవములైన దృశ్యాలు ప్రాణం పోసుకున్నాయి. మూగవోయిన బ్యాండ్ వాయిద్యాలు ఒక్కసారిగా మ్రోగసాగాయి. పాదచారులు తమ అడుగులు భూమ్మీద మోపి వడివడిగా నడవసాగారు. కాగితాలూ, జెండాలు రెపెరెపలాడసాగాయి. చిరునవ్వులు మాటలుగా మారాయి. కన్నుకొట్టే శ్రీమంతుడు అది మానేసి తనదారిన తాను వెళ్ళిపోయాడు, సంతృప్తిగా. మౌనంగా కూర్చున్న వారందరిలోనూ చలనమొచ్చి, గలగలా మాట్లాడుకోసాగారు. మేము ఏ వేగంతో నడుస్తున్నామో, ప్రపంచం కూడా అదే వేగంతో నడుస్తూవుంది– ఎంతో వేగంతో పరుగులెత్తే రైలుబండి, స్టేషన్లోకి రాగానే స్పీడు తగ్గించుకొని నెమ్మదిగావచ్చినట్లు. గిబ్బర్న్ చేతిపట్టు విడిపోగానే, కుక్కపిల్ల ఒకే ఒక్క క్షణంపాటు గాలిలో వేలాడి, తరువాత అమిత వేగాన, కిందకు జారుతూ, గొడుగు నీడలో సేదతీరుతున్న ఒక మహిళ గొడుగుమీద ‘దబ్’ అని పడిపోయింది. ఆ ధాటికి గొడుగు గుడ్డను చీల్చుకొని– ఆ కుక్కపిల్ల ఆ మహిళ మీద పడింది. కొత్త మందుతో నేను పొందిన మొట్టమొదటి అనుభవమది. బ్యాండ్ సెట్ సంగీతాన్ని అర్ధగంటసేపు విన్నాను. కొత్తమందు ప్రభావాన్ని పరీక్షించాలనుకున్న మాకు, ప్రపంచమే సహకరిస్తున్నట్లు స్తంభించి వుంది. అతి తొందరపాటుతో బహిరంగ ప్రదేశంలో మేము నెరిపిన ప్రయోగం– అనుకున్నంత సంతృప్తికరంగా మాత్రంలేదు. అయినా గిబ్బర్న్ నేర్చుకోవాల్సింది ఇంకా చాలా వుంది. ఈ మందుప్రభావం నియంత్రణకు తెచ్చే ప్రక్రియలో– అణుమాత్రం దుష్పరిణామం సంభవించని రీతిగా– నేను చాలామార్లు అతని పర్యవేక్షణ కింద, తగిన మోతాదుల్లో మందు సేవించాను. ఈ మందు పుచ్చుకొన్న స్థితిలో, నేను ఈ ఉదంతాన్ని కేవలం ఒకే ఒక దఫా కూర్చొని ఎలాంటి అంతరాయం లేకుండా రాశాను.(మధ్యమధ్య చాక్లెట్ కొరుక్కు తినడం తప్ప). నేను ఈ వృత్తాంతాన్ని రాయడం 6.25 నిముషాలకు మొదలుపెట్టి, 6.56 నిముషాలకు ముగించాను. ఈ రచనను పూర్తిచేయడానికి సాధారణ పరిస్థితుల్లోనైతే కనీసం మూడుగంటలపైనే పట్టేది. కానీ ఇప్పుడు కేవలం ముప్పైఆరు నిముషాలలో రాసి పూర్తిచేశానన్నమాట! రోజువారీ కార్యక్రమాల ఒత్తిడి అధికమైనప్పుడు, చేయాల్సిన పెద్ద పెద్ద పనులు, నిరంతరాయంగా, అతి కొద్ది వ్యవధిలో పూర్తి కావలసినప్పుడు ఈ మందు ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు గిబ్బర్న్ వివిధ మోతాదుల్లో, విభిన్న దేహదారుఢ్యాలు గల వ్యక్తుల మీద ప్రభావం చూపే మందును భారీస్థాయిలో తయారుచేసే పనిలో నిమగ్నమై వున్నాడు. ఈ అనుభవం తరువాత, మందు మోతాదు ఎక్కువైనప్పుడు, జరగబోయే చెడు ప్రభావాన్ని నివారించే నిమిత్తం గిబ్బర్న్, ‘మందగామిని’ కనిపెట్టాలనుకున్నాడు ఇది ‘వేగోద్దీపన’కు పూర్తిగా విరుధ్ధమైనది. ఈ మందు ఒక డోసు తాగిన రోగికి, కొన్నిగంటలపాటు, మనసుకు పూర్తి విశ్రాంతి, నిశ్చింతభావం చేకూరుతుంది. చికాకుపరచే చుట్టుపక్కల నెలకొన్న రణగొణధ్వనుల మధ్యకూడా– నాలుగైదు గంటల పాటు మనోల్లాసాన్ని కలిగిస్తుంది. ప్రస్తుత నవనాగరిక సమాజంలో ప్రశాంత జీవనం గడపడానికి, ఈ మందగామిని ఉపకరిస్తుంది. భరింపరాని వేదన– మనసును కలచివేస్తున్నప్పుడు, జీవితంలో విరక్తిభావం శ్రుతిమించినప్పుడు అంతులేని ప్రశాంతతను అందిస్తుంది. అయితే– వేగోద్దీపనం– అవసరమైన ఏ సందర్భంలోనైనా– అనంతశక్తినీ, ఉత్తేజాన్నీప్రసాదిస్తుందని గట్టిగా చెప్పగలను. ప్రస్తుతం ‘మందగామిని’ తయారీ ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే వుంది. కాబట్టి అదెంతవరకు సత్ఫలితాలనిస్తుందో చెప్పలేను. అయితే వేగోద్దీపనం విషయంలో మాత్రం ఏవిధమైన సందేహం పెట్టుకోనవసరం లేదు. ప్రజలకు సౌకర్యవంతంగా, దుష్పరిణామాలు సంభవించని రీతిలో, సంక్లిష్టరహితంగా, ప్రజావిపణిలోనికి కొద్దినెలల్లోపల రానున్నది ఈ రసాయనం. అంత శక్తిమంతమైన ఔషధం చిన్నచిన్న సీసాలలో, సహేతుకమైన ధరల్లో, 200, 900, 2000 పొటెన్సీలలో ప్రతి మందుల షాపులలోనూ, లభ్యం కాగలదు. దీని ఉపయోగం ఎన్నో అసాధారణ లక్ష్యాల సాధనకు బాటలు పరుస్తుందనటంలో ఈషణ్మాత్రం సందేహం లేదు. బహుశా ఇది– నేరపరిశోధనల్లో కూడా– అతి స్వల్ప వ్యవధిలో, నేరమూలాల్లోకి ఆలోచనలు చొచ్చుకొనిపోయి, నిజమైన నేరస్తుల శిక్షణకు, నిరపరాధులరక్షణకు దోహదపడుతుందని నా నమ్మకం. కాకపోతే ఇలాంటి ఇతర అపార గుణసంపత్తి గల ఔషధాల్లాగే, ఇది కూడా విమర్శలకతీతం కాదు. ఈ విషయం పూర్తిగా వైద్యన్యాయ శాస్త్రపరిధిలోకి వచ్చే అంశం. ఈ మందును ఉత్పత్తిచేసి, అమ్మిన తరువాత చూద్దాం– దీని పర్యవసనాలెలా వుంటాయో! ఇంగ్లిష్ మూలం : హెచ్.జి.వెల్స్ అనువాదం: శొంఠి జయప్రకాష్ -
ఓడిపోయిన మనిషి
తెరచి ఉన్న కిటికీలోంచి వొంటి మీద జల్లుపడి చటుక్కున మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి కిటికీలోంచి చూశాను. సన్న చినుకులతో వాన. గాలి మాత్రం తీవ్రంగా వీస్తోంది. సగం నలుపూ, సగం తెలుపూ గల తెలవారగట్ల సన్నని చినుకుల ధారలు గాలిలో కదలిపోతున్నాయి. చెదిరిపోతున్నాయి. ప్రహారీ గోడ దగ్గర మందార చెట్టు పువ్వులు ఎర్రగా వానలో తడుస్తున్నాయి. చల్లని గాలికి వొళ్ళంతా ఏదో హాయిగా ఏంది. చల్లదనం మనస్సులోకి వెళ్ళి బాధ్యతల్నీ, సమస్యల్నీ, భయాల్నీ దాచుకున్న వేడి సెరిబెల్లానికి కూడా చల్లపరుస్తోన్నట్టు అనిపించింది. కళ్ళు మూసుకున్నాడు. ఎవరో మంచుకోండల మీద స్కేటింగ్ చేస్తోన్న దృశ్యం. విశాఖపట్నంలో డాల్ఫిన్స్ నోస్ దగ్గర తెల్లని ఓడ కదులుతూన్న దృశ్యం. మద్రాస్ కాలేజీ ఆవరణలో ఎవెన్యూలో నడుస్తూన్న దృశ్యం. ఈ మూడింటికి ఏదైనా సంబంధం ఉందా? హాయిలో హాయి అనే పరుపులో నన్ను నేను చుట్టబెట్టుకున్నట్లు ఏదో ఫీలింగ్. ఈ ఫీలింగ్‌ని పోనివ్వకూడదనుకుంటూనే వొళ్ళు ముడుచుకుంటూ, కళ్ళు మూసుకుంటూ చల్లని వానని మనసులో కురిపించుకుంటూ, చెయ్యి పక్కకి జాపాను. మెత్తగా ముదురుగా లావుపాటి పాత రబ్బరులాగ చేతికి తగిలింది. అంతవరకూ పక్క మీద నా పక్కనే సుభద్ర పడుకుని ఉందన్న మాట మరిచిపోయాను. పండ్రెండేళ్ల క్రితం తాకగానే కొత్త ఉద్రేకాలు, రహస్యాలు నాలో ప్రసరింపచేసిన ఈమె శరీరం, ఇన్నేళ్ళ పరిచయంలో, పిల్లల్ని కనడంలో వయస్సు పెరిగి ఈనాడు ఆకర్షణని కోల్పోయి ‘ఇల్లాలు’ అనే ఒక వ్యర్థ గౌరవప్రదమైపోయిన ఈమె శరీరం, నా చేతికి తగలగానే వానా, వేకువా, మందార చెట్టూ గబుక్కున మాయమైపోయాయి. వాటి స్థానే పెళ్ళికి ఎదుగుతున్న ఆడపిల్లో, ట్యాన్సిల్స్ ఆపరేషన్ చేయించవలసిన చిన్న కొడుకూ, బ్యాంకిలో తరిగిపోతున్న డబ్బూ, ఎప్పుడూ రిపెయిర్స్ కొచ్చే కారూ వచ్చి నిలుచున్నాయి. కాసేపు కూడా కల్పన సుఖాన్ని ఊహించుకోనివ్వని కఠిన వాస్తవికతలా కనబడింది భార్య. ఆమె వైపు తిరిగి చూశాను. వొంటి మీద సగం సగం బట్టతో, రేగిన జుట్టుతో గృహిణీ ధర్మాన్ని రోజంతా నిర్వహించిన అలసట కనిపించే కనురెప్పలతో జాలిగా కనిపించింది. ఏదో బాధ అనిపించింది. ఎవరో నన్ను దగా చేస్తున్నారనిపించింది. మాంచి ట్యూన్ వినిపించే రేడియా గొంతుని ఎవరో నొక్కేసి వికటంగా నవ్వినట్టనిపించింది. ప్రథమ యౌవన దినాలు లీలగా జ్ఞాపకం వచ్చాయి. సుతారపు అత్తరువాసనలాంటి జ్ఞాపకాలు–ఆరోజులు! మళ్ళీ అటు తిరిగి పడుకున్నాను. చల్లనిగాలి మొహానికి తగులుతోంది. వెనక్కి వెళ్ళిపోతున్నాను. ముదిరిన ఏళ్ళ పర్వతాల మీద నుంచి వెనక్కి వెనక్కి లోయల్లోకి, పచ్చిక బయళ్ళలోకి వెళ్ళబోతున్నాను. రొమాన్సూ, ఆదర్శాలు, అమాయకత్వం కలిసిన వేడి వేడి రక్తం. జేబునిండా డబ్బూ, సినిమాలు పైలా పచ్చీసుగా ఉండేది. భావకవిత్వం మీదా, సుభాస్‌బోస్ నాయకత్వం మీద మోజు. ఇంగ్లీషు వాళ్ళన్నా, ఉద్యోగస్తులన్నా చిరాకూ, ద్వేషమూ. ఈ వయస్సులోనే చిన్న చిన్న రొమాన్సులు ప్రారంభం. రెండు కలువ రేకులలాంటి కళ్ళుగాని, చివరికి–జవ్వాడే నడుం మీద నాట్యం చేసే వాల్జడగాని కవిత్వంలోకి పంపివేసేది. సామ్రాజ్యవాదాన్ని, సంప్రదాయాన్ని ఎదిరించాలనే సాహసం. కాని మరి కొంచెం ఎదిగేటప్పటికి నాకు తెలియకుండానే ఎన్నో జాగ్రత్తలు వచ్చి కూర్చున్నట్లు తెలుసుకున్నాను. లోపల–నా లోపల ఎవడో పెద్దమనిషీ బుద్ధిమంతుడూ అయిన వాడు పరివ్యాప్తమౌతున్నాడు, మెడ చుట్టూ కండువా వేసుకుని, కొంచెం వొంగి, కర్రనానుకుని జీవితాన్ని భద్రంగా ఇటూ అటూ చెదిరిపోకుండా తాళం వేసుకుంటున్నాడు. బాలని ప్రేమించాను. అలాగని చెప్పాను కూడా. అయినా చివరికి ఏమీ ఎరగనట్టుగా తప్పుకున్నాను. పెళ్ళిపందిట్లో ఆరాత్రి నేను తలనొప్పితో విడిది మేడగదిలోనే పడుకున్నాను. అందరూ పందిట్లో ఉన్నారు. పెట్రోమాక్సు లైటు ఆరిపోయింది. కిటికీలోంచి వెన్నెల పడుతోంది. మెట్ల మీద చప్పుడు వినపడింది. ఎవరా అని చూశాను. బాల! నల్లని కాటుకతో, బుగ్గ మీద చుక్కతో బాల నా దగ్గరకు వచ్చి తట్టి లేపింది. ఏమీ ఎరగనట్టుగా ‘‘ఎవరూ?’’ అన్నాను. ‘‘నేను బాలని’’ ఆమె గొంతులో బాధ, ఆవేశం. ‘‘రేపు ఉదయమే నాకు పెళ్లి అయిపోతోంది’’ నేను మాట్లాడలేకపోయాను. ‘‘ఏం నిద్రపోతున్నావా?’’ అంది. ‘‘లేదు’’ ‘‘ప్రేమించానని, పెళ్లి చేసుకుంటావనీ అన్నావు. పల్లెటూరి పిల్లననీ, ప్రతిమాట నమ్ముతాననీ, ఏంచేసినా ఊరుకుంటానని అనుకున్నావా?’’ ‘‘..... ...... ....’’ ‘‘ఏం మాట్లాడవేం?’’ ‘‘అది కాదు బాలా, ఇలా జరుగుతున్నందుకు నేనెంత బాధ పడుతున్నానో దేవుడికి తెలుసును’’ ‘‘మరి–?’’ ‘‘మా వాళ్లెవరికి ఇష్టం లేదు. మీ కుటుంబానికి మాకూ శత్రుత్వముందట. మీ చిన్నాన్న మా నాన్నని చంపడానికి కొచ్చాడట’’ ‘‘ఇదివరకు నీకు తెలియదా?’’ ‘‘తెలియదు’’ ‘‘అది జరిగి ఇరవై ఏళ్ళయింది. ఇప్పుడు దెబ్బలాటలు లేవుగా. ఒకిరిళ్ల కొకరు వస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు...’’ ‘‘అయినా మావాళ్లెవరికీ ఇష్టం లేదు’’ ‘‘మీ వాళ్ళంటే?’’ ‘‘మా నాన్న, అమ్మా, మా అక్కయ్య, అన్నయ్య, మా మేనత్త...ఆఖరికి మా పాలేరు కూడా.’’ ‘‘అయితే ఈ వశంగా ఎక్కడికేనా పారిపోదాం. నా వంటి మీద నాల్గువేల బంగారం ఉంది. నిన్ను వొదిలి ఉండలేను’’ ‘‘ఛ..ఛ..ఇప్పుడెలాగ, నలుగురూ ఏమనుకుంటారు?’’ ఆమె ఏడుస్తూ కూర్చుంది. బాల చాలా అందమైంది. అదొక విలక్షణమైన ఉజ్వలమైన అందం. అటువంటి అందం అన్నిచోట్లా కనిపించదు. నాకు బాధగా ఉంది. నిజమే కాని ఎంతమందిని ఎదిరించి, ఎన్ని అడ్డంకుల్ని దాటి, నా భవిష్యత్తుని ఏం చేసి ఈమెను నాదాన్ని చేసుకోగలను. కోపంతో మీరి ఎరుపెక్కిన జీరలు కల కళ్లుకల నాన్న మొహం, నిరసనతో చూసే అమ్మ మొహం, పద్దెనిమిది వేల కట్నంతో జడ్డిగారి సంబంధం, రాజకీయంగా నేను వేసుకున్న ప్లానులు... ఇవన్నీ ఏమౌతాయి? ‘‘కిందికి వెళ్లిపో బాలా. ఎవరైనా వొస్తారు’’ అన్నాను. బాల కోపంగా లేచి నుంచుంది. వెన్నెల రేకలో ఆమె పెదవి వణకడం కూడా కనబడింది. కోపమూ ఏడుపూ కలిసిన కంఠంతో ‘‘నూతిలో పడి చద్దామనుకున్నాను. కాని తప్పు నీది కాదు. నువ్వు మగాడివి కాదు. నీకన్న ఏ వెధవైనా వెయ్యిరెట్లు నయం’’ అని విసవిసా వెళ్లిపోయింది. స్తంభించిపోయిన నా లోపల్లోపల ఈ సమస్య ఇలా పరిష్కారమైనందుకు సంతోషించానో, ఆమె దూరమైపోతున్నందుకు బాధ పడ్డానో నాకు తెలియదు. నాలుగేళ్ళ అనంతరం ఆమె చాలా జబ్బుతో జనరల్ ఆస్పత్రిలో ఉందని తెలిసి మనసు పట్టలేక వెళ్ళాను. నర్సు వచ్చి ‘‘మిమ్మల్ని చూడడానికి వీల్లేదంది ఆమె. మిమ్మల్ని పంపించి వెయ్యమంది’’ అని చెప్పింది. నర్సుతో బతిమిలాడాను. ఆమె నావల్లనే, నా కోసమే ఇలా అయిపోయిందన్న బాధతో, పశ్చాత్తాపంతో కాలిపోతున్నాను. చివరికి ఆమె దగ్గరికి వెళ్లాను. వంద కేరట్ల రత్నాన్ని చెక్కి వేయగా చెక్కి వేయగా మిగిలిన అణువులా ఆమె కృశించిన శరీరమూ, మొహమూ మెరుస్తోంది. నన్ను చూసి ఆమె పక్కకు తిరిగి పడుకుంది. ‘‘బాలా’’ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. ‘‘నన్ను క్షమించు. ఒకటి చెబుతున్నాను. ఏనాడూ నా హృదయం నుండి నువ్వు తొలగిపోలేదు. నేను పిరికివాణ్ణి. కాని ఆజన్మాంతం నిన్ను మరిచిపోను. మనసా నేను నీ వాడిని’’ ఆమె చెయ్యి చేతిలోకి తీసుకున్నాను. నా మాటలు ఆమె నమ్మలేదు. అవిశ్వాసంతో, ఆశ్చర్యంతో పెద్దవైన కళ్ళతో నన్ను చూసింది. నాకు కన్నీరాగ లేదు. ‘‘వస్తాను బాలా’’ అని డగ్గుత్తికతో గబగబా ఆమెని విడిచి వచ్చేశాను. ఒక నెల్లాళ్ళ తర్వాత ఆమె చనిపోయినట్లు తెలిసింది. ఈ జ్ఞాపకాలతో నా వొళ్ళంతా వేడెక్కిపోయింది. ఊపిరాడనట్టనిపించింది. గది గోడలు దగ్గరిగా వచ్చి నన్ను నొక్కుతున్నట్లు అనిపించింది. లేచి, గొడుగు తీసుకొని వీధిలోకి వచ్చేశాను. వాన ఇంకా కురుస్తూనే ఉంది.స్వేచ్ఛగా, విశాలంగా తిరిగి వస్తేనే కాని ప్రాణం కుదుటపడుతుందనిపించలేదు. కాలవ వారనే బయలుదేరి వెళ్ళుతున్నాను. కాలువ అవతల మా పొలాలు ఉన్నాయి. తెల్లవారిపోతుంది. వాన నీటికి రాత్రి వొంటి రంగు కరిగి తెల్లబడుతున్నట్టుగా ఉంది. రేగటి మట్టి కాలి జోళ్ళకి అంటుకుని బరువుగా అడుగులు వేస్తున్నాను. చల్లనిగాలి రివ్వుమని తగులుతుంటే కొంత ఉత్సాహం కలిగింది. ఆకాశం మబ్బులతో నిండి వుంది. కాలవ వారనున్న చెట్ల ఆకుల మీద నుంచి జల్లుమని జడి పడుతోంది. కాకులు అరుస్తూ అటూ ఇటూ పోతున్నాయి. కాలవ అవతలి వైపున అరటి తోటలూ, వరి చేలూ పొడుగ్గా పరుచుకొని అందంగా ఉన్నాయి. కర్ర వంతెన వచ్చింది. వంతెన కింద కాలవ సుడి తిరుగుతుంటే కొంతసేపు చిత్రంగా చూశాను. వంతెన దాటి పొలం గట్టునే వెళుతుంటే ‘‘ఏవండోయ్’’ అన్న పిలుపు వినిపించింది. వీరన్న మామిడితోటలోంచి ఆ పిలుపు. తోటలో పైన గడ్డి కప్పిన ఇటికల ఇంటి ముందరుగు మీద ఎవరో ఆడ మనిషి నిలుచుంది. నన్నేనా అనుకున్నాను. తోటలోకి రెండడుగులు వేశాను. అరుగు మీద చామన చాయగా, బొద్దుగా, పొడి పొడిగా ఉన్న జుట్టు బుగ్గల మీద పడుతుంటే నవ్వుతూ సుబ్బులు. మంచి పొంకంగా, ఆరోగ్యంగా ఉన్న యవ్వనం అసూయని కలిగించేటట్లు ఉంది. సుబ్బుల్ని నేను చిన్నతనం నుంచి ఎరుగుదును. అయిదో క్లాసు వరకూ నాతో కలిసి బళ్ళో చదువుకుంది. అయినా ఆమె నాకన్నా చిన్నదిగా, చాలా చిన్నదిగా ఉంది. పాతికేళ్ళంటే నమ్ముతారు సుబ్బులు వయస్సు. ‘‘ఎప్పుడొచ్చావు సుబ్బులు...’’ అన్నాను నవ్వుతూ. ‘‘రావయ్యా లోనికి రా. వర్షంలో తడుస్తా ఎంతసేపుంటావు?’’ నేను తటపటాయించాను. ‘‘ఎవరూ సూడ్డం లేదులే. అబ్బో, మా పెద్దమనిషైపోయావు’’ కనుబొమ లెగరేసి చేతులూపుకుంటూ అంది. నేను లోనికి వెళ్ళాను. సుబ్బులు ఇంట్లోంచి ఒక కుర్చీ తీసుకు వచ్చి వేసింది. ‘‘సిన్నప్పుడు నువ్వీ దారిని యెల్తా వుంటే చెరుకుపాకం ఇచ్చేదాన్ని. గ్యాపకం ఉందా. ఎప్పుడేనా ముద్దెట్టుకుంటావేమో అనుకునేదాన్ని. అయ్యో రాత ఆ సరదాయే లేదు...’’ ఫక్కున నవ్వుతోంది. నాకు సిగ్గుగా బెదురుగా వుంది. ఆమె ముందు నేను ముడుచుకుపోతున్నాను. ‘‘అలా సిగ్గుపడుతూ కూర్చో. కొంచెం కాఫీ కాచి తీసుకువస్తాను’’ అంటూ లోపలికి వెళ్ళింది. సుబ్బులు యాసనీ, నాగరికాన్ని కలిపి మాట్లాడుతుంది. అలాగే ప్రవర్తిస్తుంది. పట్టణాల్లో చాలాకాలం ఉంది. సుబ్బులు మొహంలో విచారం తాలూకు నీడ కాని, వయస్సు తాలూకు నీరసం కాని లేదు. జీవింతలో ఎంతో సుఖాన్ని, స్వేచ్ఛని పొందినవాళ్ళు తప్ప అంత హాయిగా నవ్వలేరు. ఆమె నాకన్న మూడేళ్లు చిన్నదైనా పదిహేనేళ్ళు చిన్నదిలా కనబడుతోంది. వింతగా ఆలోచిస్తున్నాను ఆమెను గురించి. ఆమె కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ మంచి రుచిగా ఉంది. నా ఎదురుగా ముక్కాలిపీట మీద కూర్చుని జుట్టు విప్పుకుంది. కళ్ళల్లో ఆరోగ్యపు వెలుతురు. ఆందోళనలు లేని వెలుతురు. ‘‘ఏడెనిమిదేళ్ళయింది నిన్ను చూసి సుబ్బులూ. రంగడు కులాసాయేనా’’ అన్నాను ఆమె భర్త నుద్దేశించి. ఆమె మళ్ళీ విరగబడి నవ్వింది. ‘‘రంగడా! ఇంకా ఆడెక్కడ? బలేవాడివయ్యా తెలియనట్టు మాటాడుతావ్’’ అంది. ‘‘ఏం, రంగడు పోయాడా’’ ఆత్రుతగా అన్నాను. ‘‘ఛఛ దుక్కలా ఉన్నాడు. నేనే వాడిని వొగ్గేశాను’’ ‘‘ఏం?’’ ‘‘నా కిష్టం లేకపోయింది. భయమా?’’ ‘‘ఇన్నాళ్లూ మరి ఏంచేస్తున్నావు’’ ‘‘వీరస్వామితో గుంటూరు వెళ్ళిపోయాను. అతను పెద్ద మేస్త్రీ. మాంచి డబ్బున్నవాడు కూడా’’ ‘‘అతన్ని పెళ్ళి చేసుకున్నావా?’’ ‘‘ఆ...గుంటూరులో మా బలేగా వుందిలే. నగలూ, బట్టలూ, సినీమాలు–ఓ దర్జాగా ఉండేది. వీరస్వామి కూడా బాగుండే వాడు కాని...’’ ‘‘అతనితో కూడా చెడిందా’’ ‘‘అతను దేన్నో మరిగాడు. నాకు శానా కోపం వచ్చింది. నీకింటి దగ్గర దెబ్బలు తిని శాకిరీ సెయ్యడానికి నేనేం యెదవని కాదని చెప్పి నా నగలూ డబ్బూ తెచ్చుకుని వేరే వెళ్లిపోయాను’’ ‘‘ఇప్పుడు కలుసుకున్నారా, మళ్ళీ–’’ ‘‘ఆడినీ ఒగ్గేశాను’’ నేను తెల్లబోయి చూస్తున్నాను. ‘‘అదేంటలా చూస్తావు! ఇష్టం లేని వాడితో కాపురం చేసి ఏడుస్తా చావనా? నా దగ్గర అటువంటిది లేదయ్యోయ్. బతికిననన్నోళ్లు కులాసాగా బతుకు. నా కన్నాయం ఒహరు చేస్తే ఊరుకునేది లేదు’’ ‘‘మరి ఇప్పుడొకర్తివే ఉన్నావా?’’ ‘‘నువ్వున్నావు కదయ్యా. నీ కోసమే వచ్చినాను. అబ్బ, నువ్వంటే నేటికి మనసే నాకు. పాడు మనసు...’’ గమ్మత్తుగా చూస్తూ పమిట కొంగు నోటికి అడ్డం పెట్టుకు నవ్వుతోంది. ‘‘బాగుంది నీ హాస్యం’’ అన్నాను నేను సిగ్గుపడుతూ. ‘‘బెజవాడ రైల్వేలో పనిచేస్తున్నాడు రాఘవులు. అతనితో వుంటున్నా’’ అంది మళ్ళీ. ‘‘మనువా?’’ ‘‘మనువూ లేదు శ్రాద్దం లేదు. నాకంటే సిన్నోడు. అయినా మా అందగాడు. స్టోర్సులో పనిచేస్తున్నాడు. నేనంటే వల్లమాలిన ప్రేమ రాఘవులికి. నొక్కుల జుట్టుతో, చిన్న పెదాలతో బలే అందంగా వుంటాడు’’ అంది ఆప్యాయత కళ్ళలో కనపడేటట్టు. నేను లేచాను. కోర్టు పని ఉంది. ఇవాళ ఎన్నో కాగితాలు చూసుకోవాలి. ‘‘ఇంకా ఉంటావా సుబ్బులూ’’ ‘‘మా బాబుని చూసి పోదామని వచ్చాను. రేపో ఎల్లుండో వెళ్ళిపోతాను’’ ‘‘ ఓసారి మా ఇంటికిరా. మా ఆవిడకు కనిపించు’’ అంటూ అరుగు దిగాను. ‘‘నేనెందుకొచ్చి చూస్తానూ నా సయితీ! సర్లే. అందమైన వాడినని నీకు గర్వం లేవయ్యా’’ నవ్వుతూ చేతులూపుతూ అంది. వానలో తిరిగి ఇంటికి బయలుదేరాను. ఆమెలో ఆనందానికి, ఆరోగ్యానికి నవనవోన్మేషతకీ కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను. జీవితాన్ని తేలిగ్గా సహజంగా తీసుకోవడమా? కృత్రిమమైన నీతులూ భయాలు పెద్దరికాలు అడ్డురాక పోవడమా? ఇంత చదువూ డబ్బూ వుండి నాలో ఈ అసంతృప్తి దిగులు ఏమిటి? ఏదో చేయలేక పోయానన్న వేదన. కలలు కాగితపు పేలికల్లా రాలిపోయిన క్షోభ. చెంపల దగ్గర నెరిసిన జుట్టు క్రమంగా అంతటా తెల్లబడి ముసలివాణ్ని, మృత్యుపదాభిముఖుణ్ణి అయిపోతున్నానన్న బెదురూ...ఏమిటి ఇదంతా? ఎక్కడ నేను జీవితరహస్యాన్ని మరిచిపోయాను? ఏ సమయంలో జీవించడంలోని కీలకం జారిపోయింది? ఈమె–చదువూ, సంస్కారమూ లేని సుబ్బులు ముందు నేను చాతకానివాడిలా ఎందుకయిపోయాను? బరువుగా బాధగా అడుగులు వేసుకుంటూ కర్ర వంతెన దాటాను. కాలవ వారనే జనం బాగా తిరుగుతున్నారు. వర్షానికి కాకులు తడుస్తూ చెట్ల కొమ్మల మీద వణుకుతూ కూర్చున్నాయి. మనసులో ఆలోచన హెచ్చిన కొలదీ అడుగులు వేగంగా వేస్తున్నాను. జీవితపు పందెంలో ఓడిపోయిన వాడిని. - బాలగంగాధర తిలక్ -
గణపతి పండగ అంటే ఆమాత్రం ఉంటుంది మరి!
రెండో పీరియడ్ ఫైనలియర్ బీయస్సీ క్లాస్‌లోకి అడుగుపెట్టి ఆశ్చర్యపోయాను. సగం పైన బెంచీలు ఖాళీ. ‘‘ఏమయింది అందరికీ?’’ నా ప్రశ్నకు కోరస్లో సమాధానం... ‘‘మన్నాడు బెనకప్పపండగ్గద మేడమ్. అంతా టవునుకుపొయినారు.’’ ‘‘పండగ ఎల్లుండయితే ఇప్పుడే వినాయకుణ్ణి తెచ్చిపెడతారా?’’ నొసలు చిట్లించాను. ‘‘పెట్టేకి కాదు మేడమ్, అమ్మేకి బొమ్మలు తెచ్చుకుంటారు.’’ సమాధానం నన్ను ఆశ్చర్యపరచలేదు. విత్తనాలప్పుడు, కోతలప్పుడు ఎగవేతలు మామూలే. కరువు తీవ్రమయ్యాక గైర్హాజరీ మరీ పెరిగిపోయింది. బెంగుళూరులో పనుల కోసం పోయి పరీక్షలప్పుడు వస్తారు. మిగిలినకొద్దిమంది కూడా సందర్భానుసారం కుటుంబ ఆర్థికపరిస్థితిని కాస్త ఎగదోయడానికి ఇలా కాలేజీకి నామం పెడుతుంటారు. పిలవక పోయినా వచ్చి కూర్చునే అతిథిలాంటి కరువు అనంతపురం జిల్లా వాళ్ళకు, అందులోనూ ఇంకా వెనుకబడిన కళ్యాణదుర్గంలాంటి ప్రాంతాలకు ఇది మామూలే. వాళ్ళ గైర్హాజరీని ఏమీ అనలేని నిస్సహాయ పరిస్థితి నాలాంటి లెక్చరర్లది. ఓవైపు వీధుల్లో గణపతి విగ్రహాలప్రతిష్టాపన కోసం చందాలు వసూలు చేసి చిందులేసే కుర్రకారు, మరోవైపు బ్రతుకుపోరులో పండగలఆసరా పొందే యువతరం. మనసు పొరల్లోబాధను అలాగేఅదిమిపట్టి, ‘‘ఇంతకూ మీరు తెచ్చే గణపతిబొమ్మలు దేనితో చేస్తారు?’’ అడిగాను. ‘‘ఇదేం ప్రశ్న?’’ అన్నట్టు‘‘పీవోపీ మేడమ్’’ మూకుమ్మడిగా అరిచారు. ‘‘అది పర్యావరణానికిహాని చేస్తుంది తెలుసా? మన ఆరోగ్యానికి కూడా మంచిదికాదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా బంకమట్టి దొరకదా? మనం బంకమట్టితో గణపతి బొమ్మచేద్దాం.’’ ‘‘వానలే లేవుగదా మేడమ్, శరువులన్నీఎండిపొయినాయి, బంకమన్ను యాడదొరుకుతాది?’’ పిల్లలు ఎదురుప్రశ్న వేశారు. ‘‘చూడండ్రా నాయనా ఎక్కడన్నా దొరుకుతుందేమో! మనం ఎకో ఫ్రెండ్లీ వినాయకుణ్ని తయారుచేయాలి.’’ బెస్ట్ ప్రాక్టీసెస్‌లో భాగంగా మా కెమిస్ట్రీడిపార్టుమెంటు తరఫున మేం పెట్టుకున్న యాక్టివిటీ అది. ‘‘మా ఊరి కాడ ఉంటాదిలే మేడమ్. రేపేసకస్తాం’’ కంబదూరు నుంచి వచ్చే పిల్లలు హామీ ఇచ్చారు. ‘‘ఎట్లన్న గానీ ఒక గంపకు తీసుకురాండ్రా. తెచ్చినవాళ్ళకు మంచి బహుమతికూడా.’’ ఆశ పెట్టాను. నా మాట వృథాపోలేదు. మరుసటిదినం ఓ పెద్దగోనెసంచికి బంకమట్టి మోసుకొచ్చారు కంబదూరు పిల్లలు. వాళ్ళ ఉత్సాహాన్ని మెచ్చుకొని మంచి పెన్నులు బహుమతిగా ఇచ్చాను. ఆఖరి రెండు పీరియడ్లు బంకమన్నుతో గణపతి విగ్రహాలు చేసేపని పెట్టాము. మొదట రెండు వీడియోలు స్క్రీన్ పైన చూపించాము ఒక ఐడియా కోసం. పిల్లలు గ్రూపులుగా, జంటలుగా, ఒక్కొక్కరుగా ఎవరికీ తోచినట్లు వాళ్ళు ప్రతిమలు చేయడం మొదలు పెట్టారు. వీడియోలో చూపించినట్లు యథాతథంగా చేసేవాళ్ళు కొద్దిమంది, ఎక్కువ మంది వాళ్ళ స్వంత తెలివితో, నైపుణ్యంతో భిన్న రకాలుగా ప్రతిమలు చేశారు. భిన్న ఆకారాల్లో, వేర్వేరు పరిమాణాల్లో 30 ప్రతిమలు తయారయ్యాయి గంటలో. కొలువుతీరిన బొమ్మలు రంగుల్లేకపోయినా ముచ్చట గొలుపుతున్నాయి. ప్రిన్సిపాల్ మేడమ్, ఇతర స్టాఫ్ ఈ పర్యావరణ మిత్ర వినాయకుడి గొప్పతనాన్ని వివరిస్తూ మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన ప్రతిమలను నిమజ్జనం చేసినపుడు నీటి కాలుష్యానికి కారణమవుతాయని, రసాయన రంగులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని వివరించి చెప్పారు. ‘‘ఇప్పుడీ వినాయకులను ఏం చేద్దాం?’’ అడిగాను. ‘‘మేడమోళ్ళకు, సారోల్లకు ఇస్తాం మేడమ్.’’ అందరినీ పిలిచి తలో ప్రతిమను అందజేశారు. ‘‘మేడమ్, నా గణపతి బొమ్మను మీరే తీసుకోవల్ల.’’ ఫస్టియర్ దేవేంద్ర ఇచ్చాడు. అన్నిటి కంటే చిన్నగా ముద్దుగా ఉంది బొమ్మ. కాదనలేక తీసుకున్నాను గానీ ఏం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. చిన్నప్పట్నుంచీ ఎప్పుడూ వినాయక చవితికి ఇంట్లో విగ్రహం పెట్టిన ఆనవాయితీ లేదు. ‘‘దేవుడి పటాల్లో వినాయకుడి పటం కూడా ఉంది కదా, విగ్రహం అక్కర్లేద’’ నేది అమ్మ. బొద్దుగా ఉన్న మా తమ్ముణ్ణి చూసి, ‘‘వీడికే ఓ తొండం పెడితే సారి, అచ్చు వినాయకుడి లాగానే ఉంటాడు.’’ జోకేవాళ్ళు చుట్టుపక్కల జనం. పెరిగేకొద్దీ పెద్ద కోరికలేమీ లేకపోవటం మూలాన దేవుడితో పనిబడలేదు నాకు, కనుక ఏ దేవుడికీ ఇంట్లో అవకాశం లేకపోయింది. ‘‘ఇప్పుడీ బొమ్మను నేనేం చేసుకోవాలి?’’ నా గురించి తెలిసిన సీనియర్ లెక్చరర్ పార్వతి మేడమ్‌తో అన్నాను. ‘‘ఉండనివ్వమ్మా, పిల్లలంత ప్రేమగా ఇచ్చారు కదా, ఇంట్లో షోకేస్‌లో పెట్టుకో.’’ ఆమె మాటలతో ఖాళీ చాక్ పీస్ డబ్బాలో ప్రతిమ జాగ్రత్తగా పెట్టి, లంచ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను. ‘‘మీ ఇంట్లో కూచో బెట్టినాక ఫోటోలు తీసి వాట్సప్‌లో పెట్టండి మేడమ్.’’ దేవేంద్ర రిక్వెస్ట్‌గా అన్నాడో, కమాండింగా అన్నాడో అర్థం కాలేదు. పంటల్లేక పోయినా ప్రతివాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండుదో, చీప్‌గా దొరికే చైనాదో స్మార్ట్ ఫోన్ మాత్రం తప్పకుండా ఉంటుంది. ‘‘ఈ గణపతి విగ్రహాన్ని ఎలా కూర్చోబెడతారో ఏమీ తెలీదు మేడమ్ నాకు.’’ బస్సులో పక్కనే కూర్చున్న పార్వతి మేడమ్ నా ప్రశ్నతో నవ్వేశారు. ‘‘పద్ధతిగా కూర్చోబెట్టి పూజ చేసే భక్తులెవరూ లేరు. వాళ్ళకు తోచిన ఆకులు, పూవులేవో పెడతారు. నువ్వూ అలాగే నీకు తోచిన పద్ధతిలో డెకరేట్ చేయి. మరీ పర్ఫెక్ట్గా కావాలనుకుంటే క్లాక్ టవర్ దగ్గర దిగు, రకరకాల పత్రాలు, కాయలు, పూలు అమ్ముతుంటారు కొనుక్కెళ్ళు.’’ సలహా ఇచ్చారు. అనంతపురం బైపాస్ దగ్గరికి చేరేసరికి సాయంత్రం నాలుగున్నరయింది. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం రావడానికి గంటన్నర పడితే, బైపాస్ నుంచి టవున్లోకి వెళ్ళడానికి ట్రాఫిక్ పుణ్యమా అని గంట పట్టింది. క్లాక్ టవర్ చుట్టూ రోడ్ల మీద గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రి, పండ్లూ, పూలూ అమ్మే వాళ్ళతో మూడొంతులు రోడ్డు మూసుకుపోయింది. ‘‘పండగొచ్చిందంటే చాలు, జనమంతా రోడ్ల మీదే, కరువెక్కడికి పోతుందో నాకర్థం కాదు.’’ చిరాగ్గా అన్నాను. ‘‘కరువు రోడ్డు మీదికొచ్చింది. సరిగ్గా చూడు, ఆ పత్రీ, పూలూ అమ్మేవాళ్ళంతా పేద రైతులు. కొనేవాళ్ళు మనబోటి ఉద్యోగులు. ఎక్కడెక్కడో కొండల్లో, గుట్టల్లో పత్రీ, ఆకులు ఏరుకొచ్చి, కొనుక్కొచ్చి, అవేవీ దొరకని మన కాంక్రీట్ వనాల్లో భక్తాగ్రేసరులకు అమ్మి పుణ్యం సంపాదించి పెడతారు.’’ పార్వతి మేడమ్ మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి. ‘‘వీళ్ళు పాపం రోడ్డుకు పక్కగా కింద కూచునే అమ్ముతున్నారు. ఒక్కసారి డిసెంబరు 31 గుర్తు చేసుకో, ఈ క్లాక్ టవర్ చుట్టూ ఎలా ఉంటుందో...!’’ ఆవిడ మాటలు పూర్తికాకనే పెద్ద పెద్ద బేకరీలు, స్వీట్ షాపులు రోడ్డు మొత్తం ఆక్రమించి, షామియానా వేసి, టేబుళ్లు వేసి, రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణతో, ఆఫర్లతో హోరెత్తించే నా కళ్ళముందు దృశ్యం మెదిలింది. ‘‘ఆర్ట్స్ కాలేజ్ దిగండి.’’ కండక్టర్ అరుపుతో బస్సు దిగాము ఇద్దరమూ. మళ్ళీ వెనక్కి క్లాక్ టవర్ దగ్గరికొచ్చి అన్నీ చూస్తూ నెమ్మదిగా నడవసాగాము. ‘‘గరిక గావాల్నామ్మా?’’ ‘‘గరిక, పత్రి అన్ని రకాలూ ఉండాయి రామ్మా.’’ అంతా కేకలేసి పిలుస్తున్నారు. కార్పొరేట్ స్టైల్లో నీటుగా ప్యాక్ చేసి బిజినెస్ చేసే టెక్నిక్ తెలియక, నోటిని మాత్రమే నమ్ముకున్నవాళ్ళు పాపం. ఓ పెద్దావిడ దగ్గరికెళ్ళాము. ‘‘ఇదేమాకు? ఇదేంది? అదేంది?’’ నా ప్రశ్నలతో నా అజ్ఞానాన్ని కనిపెట్టేసింది ఆమె. ‘‘ఇది గరిక. ఇది ఉత్రేనాకు. అదేమో బిల్లిబిత్తిరాకు.’’ ‘‘బిల్లిబిత్తిరాకా? అదేంటి మేడమ్, తమాషాగా ఉంది పేరు.’’ నవ్వాను. ‘‘బిల్వపత్రం తల్లీ. అంటే మారేడు ఆకులు. ఇది బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకులు. ఇంకా గన్నేరు, తులసి నీకు తెలుసు కదా.’’ ‘‘ఇవి మా ఇంటి దగ్గర ఉన్నాయి మేడం. ఇది ఉమ్మెత్త కదా. ఇదేమో జిల్లేడు. అంతేనా?’’ నాక్కూడా తెలుసన్నట్లు గర్వంగా చూశా. ‘‘హమ్మయ్య బతికించావు. సరేలేమ్మా, ఇవన్నీ ఎంతకిస్తావు?’’ పెద్దావిడను అడిగారు. ‘‘అన్ని రకాలూ కలిపి నూట యాబై రూపాయలమ్మా.’’ ‘‘డెబ్భై ఇస్తాం, ఇస్తావా లేదా చెప్పు.’’ మేడమ్ బేరంతో దిమ్మ తిరిగింది నాకు. నేనయితే నూటా నలభై, నూటా ముప్పయి కి అడిగి ఉండేదాన్ని. ‘‘నూటా ఇరవై కిస్తా, ఇష్టమైతే కొనుక్కో లేకపోతే లేదు.’’ కరాఖండిగా చెప్పిందామె. ‘‘ఇంకో చోట చూద్దాం రా.’’ పార్వతి మేడమ్ పక్కకు లాక్కెళ్ళారు. ‘‘నూర్రూపాయలిస్తారా?’’ ఆమె మాట వినిపించుకోలేదు. ఇంతలోనే అక్కడేదో గలాటా. ఒకాయన గణపతి విగ్రహాలు చూస్తూ ఓ విగ్రహం జారవిడిచాడు. అది కాస్త పగిలిపోయిందని బండి మీది కుర్రాడి ఏడుపు. ‘‘డబ్బులియ్యి సార్. పడేసింది నువ్వే కదా.’’ అంటూ అతని చెయ్యి పట్టుకొని అరుస్తున్నాడు. ‘‘నువ్వే సరిగ్గా పెట్టుకోలేదు. నేనేంటికిస్తా.’’ బలవంతంగా చెయ్యి విడిపించుకొని పరుగులాంటి నడకతో పారిపోయాడు. కుర్రాడు పట్టుకోవాలని చూశాడు, కానీ వెంటపడదామంటే ఇక్కడ ఇన్ని విగ్రహాలనొదిలి పోలేక తిట్టుకుంటూ వెనక్కి వచ్చాడు. వాడి ముఖంలో మా కాలేజీ పిల్లలు కనిపించారు నాకు. ఇంటిముందు అలకడానికి పసుపుపచ్చ రంగుపొడి ప్యాకెట్లు, ముగ్గుల్లోకి రంగులు బండ్ల మీద అమ్ముతున్నారు. పేడ దొరకడం గగనమైపోవడంతో పాటు, వాసనంటూ కొందరు ముట్టుకోవడం మానేశారు. మంచిదే కదా, నవ్వుకున్నాను. ‘‘ఎలక్కాయలు... ఎలక్కాయలు.’’ మరోబండి మీద వెలగపండ్లు అమ్ముతున్నారు. ‘‘వెలగపండ్లంటే నాకు చాలా ఇష్టం. కొనుక్కుందామా మేడమ్?’’ ‘‘వినాయకుడి కోసమొద్దు నీకోసం కావాలన్నమాట.’’ ‘‘దేవుడి పేరు చెప్పినా, తినేది మనుషులే కదా మేడమ్, వెలగపండుకు చిన్నగా రంధ్రం చేసి బెల్లం కూర్చి కలిపి తింటే భలేగా ఉంటుంది.’’ నా నోట్లో అప్పుడే నీళ్లూరుతున్నాయి. ‘‘అబ్బో నీక్కూడా బాగానే తెలుసే. సరే పద, నీ సరదా ఎందుక్కాదనాలి?’’ అంటూ ‘‘ఎంత కిస్తావు బాబూ వెలగపండ్లు?’’ ‘‘జత ఎనవయ్యమ్మా.’’ ‘‘అయ్యబాబోయ్ ఎనభయ్యా? పదండి మేడమ్ వెళదాం.’’ ‘‘ఎంతిస్తారో సెప్పండమ్మా’’ ‘‘వద్దులే నాయనా, బేరమాడేటట్లు చెప్పావా?’’ అంటూ కదిలాం. ‘‘పండగరోజు ధరలు ఇలాగే ఉంటాయి. తినడం వరకే కావాలంటే రెండు రోజులాగి కొనుక్కో. ధరలు తగ్గిపోతాయి.’’ పార్వతిమేడమ్ సలహా ఇచ్చారు. ‘‘మేడమ్ అటు చూడండి, అక్కడ ఫైనలియర్ ఎమ్పీసి హనుమంతు కదూ, గరిక, పత్రి అమ్ముతున్నది.’’ ‘‘అవునమ్మా. పద చూద్దాం.’’ సెకండియర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు హనుమంతు. ఇటీవల తండ్రి అప్పుల బాధతో, పంటలు రాక ఆత్మహత్య చేసుకున్నాడు. చేనుకు పోవాలంటూ అడపాదడపా క్లాసులు ఎగరగొడుతుంటాడు. ‘‘హనుమంతూ!’’ మమ్మల్ని చూసి తడబడ్డాడు హనుమంతు. ‘‘మేడమ్మీరా? నమస్తే మేడమ్. మా అమ్మకు ప్యానం బాగాలేదు మేడమ్. అందుకే నేను పెట్టినాను.’’ సంజాయిషీ ఇస్తున్నట్లుగా చెప్పాడు. ‘‘పోనీలే హనుమంతూ, అమ్మకు సాయం చేస్తున్నావు. మంచిదేగా. ఎక్కడ్నుంచి తెచ్చావు ఈ సామగ్రంతా?’’ ‘‘మా ఊరవతల గుట్టల్లో పీక్కోనొచ్చినా మేడమ్. ఇంగరోన్ని మా చేని గట్ల మింద ఉండాయి.’’ దాదాపు 10–12 రకాల పత్రి, ఆకులతో పాటు మామిడాకులు, అరిటాకులు కూడా పెట్టుకొని అమ్ముతున్నాడు. ‘‘ఎలా సాగుతోంది వ్యాపారం?’’ పార్వతి మేడమ్ అడిగారు. ‘‘ఏం జరుగుతాది మేడమ్? ఇయ్యన్నీ ఏరుకోచ్చిండేయే గదాని ఉద్దరగ్గావాలంటారు. అయి పీక్కొచ్చేకి దినమంతా గుట్టల్లో తిరిగి, కంపలు గీసుకొని ఎన్నెన్ని తిప్పలు బడినామని. ఏందో పున్న్యానికి ఇచ్చిపోయినట్లు పదో పరకో చేతిలో పెడతారు. ఇంగ బజార్లో గనపతిని నిలబెట్టేకయితే దవుర్జన్నెంగా తీసకపోయే నాకొడుకులే.’’ బాధ, కోపం కలిపి చెప్పాడు. ‘‘మొత్తం అన్ని రకాలూ కలిపి ఎంతవుతుంది?’’ నా ప్రశ్నకు ఇబ్బంది పడుతూ, ‘‘మీకేం గావాల్నో తీసుకోండి మేడమ్.’’ చెప్పాడు. ‘‘నేను కొనటానికి కాదురా, వివరం కోసం అడుగుతున్నాను.’’ పార్వతి మేడమ్నవ్వుతూ, ‘‘మీ మేడమ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు లేరా, చెప్పు.’’ అన్నారు. ‘‘అరిటాకు, మామిడాకులు అన్నీ కలిసి యాబై రూపాయలు మేడమ్. అయినా ఎవరూ అన్నీ కొనక్క పోరు. ఏవో అగ్గవకు సిక్కేవి తీసక పోతారంతే.’’ ‘‘సరే, నాకు రకానికింత అన్నీ ఇవ్వు.’’ నా మాటలకు హనుమంతు ఆశ్చర్యంగా చూశాడు. ‘‘ఇవ్వు నాయనా, మీ మేడమ్ మొదటి సారి వినాయక చవితి చేసుకోబోతోంది.’’ పార్వతి మేడమ్ మాటలతో వాడు మరింత అయోమయంలో పడ్డాడు. ‘‘ఇవ్వు హనుమంతూ,’’ నా మాటలతో అన్నీ ఓ కవర్లో సర్ది అరిటాకు మాత్రం చుట్టి చేతికిచ్చాడు. ఐదొందల నోటు తీసి హనుమంతు చేతిలో పెట్టాను. ‘‘వొద్దు మేడమ్, మీ తాన తీసుకోరాదు.’’ తిరిగి కవర్లో పెట్టాడు. ‘‘గురువుల మాట కాదనరాదు, తీసుకో.’’ భయపెట్టి చేతిలో ఉంచి ఆటో పిలిచాను. ‘‘మేడమ్ చిల్లర.’’ ‘‘రేపు మీ వినాయకుడికి కుడుములు చేసి నైవేద్యంగా పెట్టు.’’ అంటూ వెనక్కి చూడకుండా ఆటో ఎక్కేశాము. - ఎం.ప్రగతి -
చివరికి మురికి కాలువలోని పాలు తాగారు
లండింగ్ రైల్వే జంక్షన్లో ప్లాట్‌ఫారమ్ మీద పేరుకున్న అర్ధరాత్రి చీకట్లని అక్కడి విద్యుత్ దీపాల కాంతి పూర్తిగా తరిమేయలేకపోతుంది. మూడో నంబర్ ప్లాట్‌ఫారమ్ మీద ఒక మూలంగా ఆ యువతి మెలకువ లాంటి నిద్రలో ఉంది. దోమ కుట్టిందేమో కళ్లు తెరవకుండానే చెంప మీద కొట్టుకుంది. దోమ చిక్కిందేమోనని రెండు వేళ్లతో తడుముకుంది. దోమ దొరక లేదు. కానీ చెక్కిలి మీద మురికి మాత్రం పోగయ్యింది. ఆమెకు ఇక నిద్ర పట్టలేదు. రెండేళ్ల పిల్లవాడు ఆమె పరుచుకున్న కొంగుపైనుంచి చల్లని నేల మీదకు జారిపోయాడు. వాడు పాలు చీకుతూ ఉండగానే ఇద్దరూ నిద్రపోయారు. గత రెండు రోజులుగా ఆమెకు ఒంట్లో బాగా లేదు. ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోతోంది. ప్లాట్‌ఫారమ్ మీదికి ఒక రైలు వచ్చి ఆగింది. టీవాలా ‘వేడిటీ.. వేడిటీ’ అంటూ ఒక్కసారిగా పెట్టెలోకి చొరబడ్డాడు. ఆ పెట్టెకున్న కిటికీల్లో ఎక్కువ భాగం మూసి ఉన్నాయి. అలసిన ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. రైలు రాగానే వెళ్లి అడుక్కునే శక్తి కూడా ఆమెకిప్పుడు లేదు. జ్వరం తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం నుండే తినడానికి ఏం దొరక్కపోవడం వల్ల సాయంత్రానికి పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఆమె వద్ద పాలు కూడా ఆర్చుకుపోయాయి. కానీ వాడు చీకటం మానలేదు. వాడ్ని ఆమె ఆపలేకపోతుంది. కానీ ఏమైనా దొరకొచ్చనే ఆశతో నిద్రలోనే దగ్గరకు తీసుకుని గుండె మీద చీరని తొలగించింది. పిల్లవాడు కూడా చీకి ఒక చుక్కా రాక విఫలమయ్యాడు. ఆకలితోనే నిద్రలోనికి జారిపోయాడు. ఆగిన రైలు కొద్దిసేపటిలోనే బయలుదేరుతుంది. ఆమె అతి కష్టం మీద ప్లాట్‌ఫారమ్ స్తంభాన్ని పట్టుకుని నిలుచుంది. ఎదురుగా ఉన్న రైలు పెట్టెలో తెరచి ఉన్న కిటికీ ఆమె కంట పడింది. ఎత్తి ఉన్న షట్టర్ లోంచి ఒక ప్రయాణికుడు తొంగి చూస్తున్నాడు. నిజానికి అతడు ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె యవ్వనంలో అందంగా ఉండేది. సూది ముక్కూ, పెద్ద కళ్లూ, బంగారు రంగు శరీరం. ఆ అందమే ఆమెకు వరమూ శాపమూ అయ్యింది. వయసు ఇప్పుడు పాతికా ముప్ఫై మధ్య ఉంటాయి. కాని యాభై పైబడిన స్త్రీలా తయారయ్యింది. ప్రయాణికుడు తన వైపు చూస్తున్నాడని ఆమె గమనించింది. అప్పటికే ఆమె గుండెల మీద చీర పక్కకు తొలగిపోయి ఉంది. దాన్ని సరిచేసుకోవాలని ప్రయత్నించి మళ్లీ ఆగిపోయింది. మగవాడి బలహీనతలు ఆమెకు తెలుసు. చూపుతో ఆనందించడానికి వయసుతోనూ, అందంతోనూ, అంతస్తుతోనూ మగవాడికి పనిలేదు. నెమ్మదిగా పిల్లవాడ్ని పక్కనపెట్టి కిటికీ వైపు కదిలింది. చేపని పట్టడానికి ఎర మాదిరిగా ఆమె తన ఎదభాగాన్ని సరిగా కప్పుకోకుండానే ముందుకు అడుగేసింది. కిటికీ ముందు నిల్చుని చొట్టలు పడిన సత్తు గిన్నెని తీసింది. వీలైనంత దీనంగా ముఖం పెట్టి అతడి ముందుంచింది. అతడు తడబడ్డాడు. లో నుంచి ఒక స్త్రీ గొంతు ఏదో అడుగుతున్నది. ‘నిద్రరావడం లేదు’ లాంటి మాట ఏదో గొణిగాడు. ఆమె పళ్లెంలో ఒక యాభైపైసల నాణెం పడింది. దాన్ని చీర కొంగున కట్టుకుని, కిటికీ నుంచి దూరంగా వచ్చేసింది. రైలు కదులుతున్న కూత వినపడింది. ఇదే ప్లాట్‌ఫారమ్ పైన ఆమె జీవితంలో రెండు సంవత్సరాలకు పైగా గడిచాయి. నిజానికి ఆమె శరణార్థుల కుటుంబానికి చెందింది. తండ్రితో పాటు ‘అస్లాం’ చేరుకున్నది. ఆమెకు పెళ్లి చేసిన తర్వాత తండ్రి కూడా చనిపోయాడు. భర్త ఏదో గొడవల్లో పోలీస్ కాల్పుల్లో మరణించాడు. దుండగుల చేతిలో ఇల్లు కూడా తగలబడిపోయింది. ఆమె నిండు చూలాలుగా పారిపోయి వచ్చింది. తననీ, తన కడుపులోని బిడ్డనీ కాపాడుకుంది. జీవన తరంగాల మీద పడుతూ లేస్తూ చివరికి చపర్ముఖ్ రైల్వే జంక్షన్ అనే తీరానికి చేరుకుంది. అక్కడ కొద్ది కాలమే ఉంది. ఆకలి బాధ తట్టుకోలేక బిక్షాటన మొదలుపెట్టింది. అక్కడ నుండి లండింగ్ జంక్షన్ వచ్చింది. ఇక్కడ మెజారిటీ జనాభా కోసం మతాన్ని మార్చుకుంది. పేరు మార్చుకున్నది. ఏది మార్చుకున్నా మార్పులేదు. ఈ రైల్వేయార్డులోనే ఒక పాడుబడి విడిచిపెట్టిన రైలు పెట్టెలో పిల్లవాడ్ని ప్రసవించింది. అప్పటి నుంచీ వాడే ప్రపంచంగా జీవిస్తోంది. ఈ జంక్షన్ మీదుగా కొద్ది ట్రైన్లు మాత్రమే వెళ్లాయి. ఆమెకు యాచన ఒక్కటే జీవనాధారంగా ఉంది. క్రమేణా ఇతర మార్గాలూ మొదలుపెట్టింది. రైల్వే ఆవరణలోనే విడిచిన రైలు పెట్టెల్లో విటులకు వేడుకనిచ్చేది. కొన్ని మంచి చీరలను కొనుక్కుంది. రైల్వే జంక్షన్‌కు దగ్గర్లో ఉన్న కాస్త మంచి హోటల్లో మెరుగైన భోజనం చేసేది. అప్పుడప్పుడూ సినిమాలు కూడా చూసేది. ఇన్నిచేస్తున్నా ఏదో అపరాధ భావం ఆమెని వేధిస్తుండేది. తనకు తనే పతనమైనట్లుగా భావించేది. కానీ అలవాటు పడిపోయింది. ఎప్పుడైనా అలవాటు అపరాధ భావాన్ని తొలగిస్తుంది. వరుసగా విటులు లభించకపోతే రాబడి ఉండేది కాదు. ఆహారమూ ఉండేది కాదు. కాలం గడుస్తున్న కొద్దీ ఆ వృత్తిని ఆమె శరీరం భరించలేకపోతోంది. సుస్తీగా ఉంటోంది. లోలోపల ఏదో పెనుభూతం తొలిచేస్తున్న భావం కలుగుతోంది. అంతేకాదు చాలాసార్లు తన రాబడిలో కొంత భాగం లాఠీపట్టుకుని రైల్వే ఆవరణలో తిరిగే పోలీసులకు చెల్లించవలసి వచ్చేది. లేదా విడిచిన రైలు పెట్టెల్లో విరిగిన బెర్తుల మీద వారికీ శరీరాన్ని సమర్పించుకోవాల్సి వచ్చేది. ఏదో అంతు తెలియని క్రిములు ఆమె శరీరంలో చొరబడుతున్నాయి. నిత్యం జ్వరంగా ఉంటోంది. కొన్నిసార్లు పక్కటెముకలు పగిలిపోయేటట్లు బిగ్గరగా దగ్గుతోంది. శరీరం మీద అక్కడక్కడా మొటిమలు వంటివి లేస్తున్నాయి. కదలటానికి మోకాళ్లు వణుకుతున్నాయి. రాత్రి సంపాదనలు ఇంచుమించు నిలిచిపోయాయి. చివరికి పసివాడ్ని చంకలో పెట్టుకుని రైలు పెట్టెల ముందు యాచించడం ఒక్కటే జీవనాధారంగా మారింది. ఆమెకు పిల్లవాడి గురించి భయం పట్టుకుంది. తనపాలు వాడికి ఇవ్వడం అంటే విషం ఇవ్వడమేనన్న భీతి పీడిస్తోంది. ప్రైవేటు వైద్యుడ్ని సంప్రదించే పరిస్థితి లేదు. ధర్మాసుపత్రులు దయనీయంగా ఉన్నాయి. గతరాత్రి ఆమె సంపాదన ఒక్క నాణెమే. కొంతసేపటి తర్వాత లేచి ఒక అరకప్పు పాలని కొని తెచ్చి పైపు నీటితో ఆ పాలని ఒక కప్పుగా చేసింది. పిల్లవాడు ఆ పాలని ఒక్క తృటిలో తాగేశాడు. తల్లి పైకి కాళ్లూ చేతులు విసురుతూ ఆడుకోవడం మొదలుపెట్టాడు. పాలపాత్రని పైకి ఎత్తి పట్టుకుని అందులో పిల్లవాడు మిగిల్చిన ఒకటి రెండు చుక్కల పాలని తాగింది. తర్వాత పైపు వద్దకు వెళ్లి దోసిలి పట్టి మరికొంచెం నీళ్లు తాగింది. సరిగ్గా అప్పుడే ఒక వార్త ఆమె చెవిని పడింది. దేవాలయంలో గణేష్ విగ్రహం పాలు తాగుతోంది అని!! ఆమె ముఖం మీద నీటిని చల్లుకుంది. చిరిగిన చీర కొంగుతో చేయి తుడుచుకుని పిల్లవాడ్ని దగ్గరపెట్టుకుని ప్లాట్‌ఫారమ్ మీద కూర్చుంది. బుక్ స్టాల్ కుర్రాడు పక్కనే ఉన్న స్వీట్ స్టాల్ యజమానితో అంటున్నాడు. ‘‘దాదూ! నువ్వీ సంగతి విన్నావా? మన ఊర్లో ఒక అద్భుతం జరుగుతోంది. మన దేవాలయంలో గణేష్ ప్రతిమ పాలు తాగుతున్నాడట. ఆ దృశ్యం చూడ్డానికి వెళ్దామా?’’ ‘‘తప్పకుండా వెళ్దాం పద!’’ ఈ వార్త ఆ రైల్వే జంక్షన్లో తృటిలోనే దావానలంలా వ్యాపించింది. అందరి నోటా అదే మాట. నమ్మిన వారు కొందరు. నమ్మని వారు కొందరు. ఇటూ అటూ కాక పెదవులు చప్పరించిన వారు కొందరు.. ఆ దృగ్విషయానికి శాస్త్రీయ కారణాలు చెప్పిన వారు మరికొందరు. వాటిని ఖండించిన వారు ఇంకొందరు. ఆ మధ్యాహ్నం ముందుగా ప్రకటించిన రైళ్లు ఏం లేవు. ప్లాట్‌ఫారమ్ మీద జనం సన్నగిల్లారు. చాలా మంది తమ దుకాణాల షట్టర్లు మూసి వేసి దేవాలయం వైపు పరుగులెత్తారు. రోజు గడుస్తోంది. స్టేషన్ ఖాళీగా ఎడారిలా ఉంది. దుకాణాలన్నీ మూతపడ్డాయి. డ్యూటీలో ఉన్న స్టేషన్ మాష్టార్ పదవీ విరమణకు చేరువలో ఉన్నాడు. ఆయనొక్కడే స్టేషన్లో మిగిలిపోయాడు. అతడు స్టేషన్ విడిచి వెళ్లే అవకాశం లేదు. కాబట్టి కూర్చీలో కూర్చుని బద్ధకంగా రెండు చేతుల్తో ముఖం కప్పుకున్నాడు. ఇక యాచించడానికి ఎవరూ లేరు. ఆమె ప్లాట్‌ఫారమ్ విడిచి వెళ్లకతప్పదు. బిడ్డని చంకన వేసుకుని, చేతిలో సత్తుపళ్లెంతో నెమ్మదిగా దేవాలయం వైపు అడుగులు వేసింది. వీధులు అసాధారణంగా జనాలతో నిండి ఉన్నాయి. స్కూటర్ ఆటో రిక్షల కూతలతో రణగొణధ్వనులతోనూ రోడ్లు కళకళలాడుతున్నాయి. గణేష్ దేవాలయం ముందర అప్పుడే స్నానాలు ముగించుకుని మంచి దుస్తులు వేసుకున్న కన్యలు, ఎర్రని అంచు తెల్ల చీరలు ధరించిన స్త్రీలు, పట్టుపంచెల మడి కట్టుకున్న పురుషులు క్యూ కట్టారు. స్త్రీలకూ పురుషులకూ వేరువేరు క్యూలైన్లు ఉన్నాయి. మధ్యాహ్న భోజన విరామం తర్వాత చాలా మంది రైల్వే ఉద్యోగులు పని ఎగ్గొట్టి భక్తుల వరుసలో చేరిపోయారు. చాలా పొడవాటి క్యూలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక చిన్న పాత్రతో గానీ, గ్లాసుతో గానీ పాలున్నాయి. పాల పాత్ర విగ్రహం తొండం అగ్రభాగాన్ని తాకగానే పాలు మాయమవుతున్నాయనీ, అంటే గణపతి తాగేస్తున్నాడనీ అందరూ పదే పదే విన్నారు. విన్నదే ప్రచారం చేశారు. ఇటువంటి పరిసరాల్లోకి ఆమె బిడ్డని ఎత్తుకుని ప్రవేశించింది. దేవాలయం వెలుపల ఉన్న జనం చాలా ఉత్సాహంగా ఉన్నారు. కళ్ల ఎదుటే జరుగుతున్న అద్భుతం వారిని చకితుల్ని చేస్తుంది. దేశవాప్తంగా అన్ని చోట్లా గణపతి విగ్రహాలు పాలను తాగుతున్నట్లు దేశం నలుమూలల నుంచి వార్తలు వచ్చి చేరుతున్నాయి. దేవాలయ ద్వారం వద్దనే పాల దుకాణాలు వెలిశాయి. పోటాపోటీగా అమ్ముతున్నారు. రెండు రూపాయలకు అర కప్పు పాలు దొరుకుతున్నాయి. నిమిషాల వ్యవధిలో పెద్ద గంగాళాలు ఖాళీ అయిపోతున్నాయి. పిల్లవాడు అందరిచేతుల్లోనూ పాలని చూశాడు. బిగ్గరగా ఏడుపు లంకించుకున్నాడు. ఈ పవిత్రమైన పరిసరాల్లో ఒక పసిపిల్లవాడి ఆకలి కేకలు అసందర్భంగా ఉన్నాయి. కొందరు భక్తులకు వాడి రోదన చికాకు కలిగిస్తోంది. ఆమె వాడ్ని సముదాయించడానికి ప్రయత్నించింది. ఊరడిస్తున్న కొద్దీ వాడి ఏడుపు స్థాయి పెరిగిపోతోంది. చాచి లెంపకాయలు కొట్టింది. పిల్లవాడు ఇంకా పెద్దగా ఏడ్చాడు. భక్తుల చిరాకు ఇంకా పెరిగిపోయింది. భక్తికి భంగం కలుగుతున్నందుకు కోపంగా చూస్తున్నారు. కొందరైతే పైకే రుసరుసలాడుతూ ‘పిల్లవాడ్ని సముదాయించవమ్మా!’ అని కసురుతున్నారు. అక్కడ చేరిన ప్రజలందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. అందుకు భంగం కలుగుతున్నందుకు సహించలేకపోతున్నారు. ‘‘ఫో.. పోవమ్మా!’’ అని ఒకరు.. ‘‘ఇలాంటి చోటికి నిన్నెవ్వరు రానిచ్చారు? బయటికి పో!’’ అని మరొకరు.. ఆమె మీద రగిలిపోయారు. క్రమశిక్షణ పర్యవేక్షిస్తున్న వలంటీర్లు పరుగుపరుగున ఆమె వద్దకు చేరుకున్నారు. మాటలతోనూ కర్రలతోనూ అదిలించి ఆమెను అక్కడి నుంచి తరిమేయడానికి ప్రయత్నించారు. అయితే ఎవరూ చేయి చేసుకోలేదు. బహుశా ఈ మురికి యువతిని తాకడం వారికి ఇష్టం లేక కావచ్చు. ఇక లాభం లేదని ఆమె గ్రహించింది. పిల్లవాడ్ని చంకనెత్తుకుని దేవాలయం ఆవరణ వెలుపలికి బయలుదేరింది. గణపతి విగ్రహం ముందు నాణేలు ఒక పెద్ద కుప్పగా పోగయ్యాయి. ఆ తెల్లని పాలరాతి విగ్రహం దక్షిణలూ పాలలో మునిగిపోయింది. ఇంతకీ ఆమెకు ఒక్క నాణెంగానీ పిల్లవాడికి ఒక్క చుక్క పాలు గానీ చిక్కలేదు. నిజానికి ఇంత మంది పుణ్యాత్ములున్న చోట ఆమె పళ్లెం నిండిపోవాలి. ఈ రోజు అందుకు భిన్నంగా జరిగింది. కుమ్ముకుంటూ, తోసుకుంటూ ఒక్కరినొకరు తిట్టుకుంటూ ఉన్న జనం మధ్య నుంచి కాస్త ఎడంగా వచ్చేసింది. చంకలో ఉన్న పిల్లవాడు ఆకలితో చుట్టుకు పోతున్నారు. నెమ్మదిగా స్టేషన్ వైపు అడుగులు వేసింది. ఆమె కడుపులో నుంచి ఒక పుల్లని ద్రవం గొంతులోనికి వచ్చి నోరంతా నిండిపోయింది. వాంతి వచ్చింది. తీవ్రమైన ఆకలి వల్ల ఉదరంలో విపరీతమైన నొప్పి వచ్చింది. కదిలే శక్తి లేదు. దేవాలయం ఆవరణలోనే జనానికి కొంచెందూరంలో ఒక చెట్టు నీడలో చతికల పడిపోయింది. పిల్లవాడు చెట్టు మొదలుకు చేరబడి ఏడవడం మొదలుపెట్టాడు. కళ్ల మీద చీకట్లు కమ్ముకుంటున్నట్లు అనిపించింది ఆమెకు. కళ్లు తెరుచుకుని ఉంచాలని గట్టిగా ప్రయత్నించింది. చెట్టు కాండాన్ని అలంబన చేసుకుని నిలదొక్కుకుంది. మరి ఏడ్చే శక్తి లేక పిల్లవాడూ సొమ్మసిల్లిపోయాడు. ఆమె కూడా చెట్టుకు చేరబడిపోయింది. అకస్మాత్తుగా ఆమె దృష్టిలో ఒక వింత దృశ్యం పడింది. గణేష్ విగ్రహానికి అభిషేకం చెయ్యగా వెలుపలికి నీరు వచ్చే చిన్న కాలువలో పాలు ప్రవహంలాగా వస్తున్నాయి. ఆ ప్రవాహం ఒక పెద్ద మురికి కాలువలోనికి చేరుతోంది. పిల్లవాడి కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. ఆమె గుండెకు పొట్టకూ మధ్య ఒక్కసారిగా నొప్పి వచ్చింది. మెలికలు తిరిగిపోయింది. మోకాళ్ల మీదనైనా ముందుకు వెళ్లడానికి శక్తినంతా కూడదీసుకుంది. చుట్టూ చూసింది. తన సత్తు పళ్లాన్ని కాలువలో పెట్టింది. చుట్టూ భక్తులెవరూ లేరని నిర్ధారించుకుంది. ఒక్క సెకెన్లో పళ్లెం నిండా పాలు చేరాయి. ఆమె ఆ పాలని తీసి పిల్లవాడి చేతికి అందించింది. వాడు ఆ పళ్లాన్ని ఆమె నుంచి గుంజుకుని తాగడం మొదలుపెట్టాడు. వాడి ఆకలి తీరింది. కాళ్లు చేతులు ఆనందంగా ఆడించసాగాడు. పాల ప్రవాహం ఆమె ఆకలిని మరింత ప్రేరేపించింది. నేల మీద పడి పొట్టను చేత్తో పట్టుకుంది. కాస్త శక్తి తెచ్చుకుని.. మురికి కాలువలోని పాలను దోసిట్లో తాగడం ప్రారంభించింది. ఎన్నాళ్లగానో ఉన్న ఆకలి విజృంభించింది. ఏదో ఆవహించినట్లుగా ఆ పాలని తాగేస్తోంది. పాలతోనూ బురదతోనూ ఆమె శరీరం నిండిపోయింది. ఇంకా తాగుతూనే ఉంది. అంతలో శరీరం వణకడం మొదలైంది. అయినా ఆమె పాలు తాగడం ఆపలేదు. శరీరం లోపలి ఉష్ణోగ్రత పెరిగి మరింతగా వణికింది. అత్యాశతో అమితంగా పాలని తాగడం వల్ల గుండె కింద భాగంలో భరించలేని నొప్పి వచ్చింది. కళ్లు బయటికి వచ్చినట్లు అనిపించింది. అయినా శక్తినంతా ఉపయోగించి ఇంకా తాగసాగింది. గుండె కింద నొప్పి మిగతా శరీరమంతా వ్యాపించి తిమ్మెరెక్కినట్లయింది. లేచి నిలబడబోయింది. సాధ్యం కాలేదు. పిల్లవాడు ఒక గులకరాయిని తీసి ఆడుకుంటున్నాడు. తల్లి బాధని తెలుసుకునే వయసు వాడికి లేదు. ఆమె వాడి వైపు తిరగడానికి ప్రయత్నించింది. శరీరం పట్టు తప్పి కాలువలోపడిపోయింది. తెల్లటి పాల ప్రవాహం నల్లగా మారిపోయింది. ఇంచు మించు ఆ మురికి కాలువలో కిందకు కొట్టుకుపోబోయింది. కాలువ ఒడ్డునున్న మట్టిని పట్టుకుని పైకి లేవడానికి ప్రయత్నించింది. ఆమె తల వంగిపోయింది. శరీరం నియంత్రణ లేకుండా వణకసాగింది. విపరీతమైన చలి ఆవహించింది. ఆ దశలో ‘‘బాబూ! నా తండ్రీ’’ అని అరవబోయింది. మాటపైకి రాలేదు. ఆమె శరీరం మరి కొద్దిసేపు వణికి ఆ తర్వాత శాశ్వతంగా.. పూర్తిగా చలన రహితంగా మారిపోయింది. బెంగాలీ మూలం : దీపేందు దాస్ అనువాదం: టి.షణ్ముఖరావు -
కాకమ్మ మిస్ట్రీ శేషమ్మ ఖెమిస్ట్రీ
ఠంచనుగా రోజూ మధ్యాహ్నం రెండింటికి ‘కావ్ కావ్ కావ్‘ అంటూ, సన్నగా నాజూకుగా ఉన్న ఓ కాకమ్మ వచ్చి మా బాల్కనీలో ఉన్న చెక్కబల్ల మీద లేండింగ్ చేసేది. అలార్మ్ మ్రోగినట్టుగా అలా ఎలా వచ్చేస్తుందబ్బా? మిలట్రీలో కానీ ప్రశిక్షణ తీసుకుందా? మా మామగారికి ఆ వేళప్పుడు భోజనం వడ్డించే సమయమని దానికి తెలుసో ఏమో? అయినా దానికెలా తెలుస్తుంది? తెలుస్తుందేమో? బహుశా ఆకలేస్తోందేమో? ఇట్స్ ఏ రియల్ మిస్ట్రీ! మా చిన్నప్పుడు కాకమ్మ కథలు ఎన్నో వినేవాళ్ళం. అవి తెలివైన లేజీ బర్డ్స్ అని మా మనసుల్లో ముద్ర పడిపోయింది. నిశ్చింతగా వెళ్ళి కోయిల గూట్లో వాటి గుడ్లు పెట్టడమే అందుకు నిదర్శనం. అసలు వాటి పెంపకం మీద వాటికి అనుమానమేమో? టైమ్స్ మారాయిగా, వాటికీ కొద్దిగా ఓర్పు అలవడుండొచ్చు...అనుకుంటూ తలుపు నెమ్మదిగా తెరిచి– ‘నిశబ్ధంగా, ప్రశాంతంగా ఉన్న ఇంట్లో నీ గోల ఏవిటి? ఆపమ్మా, దణ్ణం పెడతా’ అని ఓ సారి దానివైపు ఓ చూపుచూసాను. ‘అమ్మో! ఇదేదో మామూలు కాకి లా లేదు. అదీ నావైపే సీరియస్ గా చూస్తూ, కావ్ కావ్’ అంది. కోపంగా. ‘ఫీలింగ్ హంగ్రీ కాకమ్మా? అయినా ఢిల్లీలో బోలెడన్ని పార్కులూ, పళ్ళచెట్లూ ఉన్నాయి కదా! అక్కడి కెళ్ళకుండా రాంగ్ రూట్లో వచ్చావు. మీకు అడ్రస్ కోసం మాకు మల్లే జిపిఆర్ఎస్లు అఖ్కర్లేదు కూడాను. మీకు జ్ఞాపకశక్తి మహా ఎక్కువట. మాంసం ముక్కలూ, చేపలూ మీకు చాలా ప్రీతికరమైనవని మా అమ్మమ్మ నా చిన్నప్పుడు కాకమ్మ కథల్లో చెబుతూ ఉండేది, నిజమేనా?’ అని అడగంగానే ‘కావ్ కావ్’ అంది. ‘అయినా, మిస్ ఢిల్లీ కాకీ, ఇప్పుడంతా వెడ్డింగు సీజనూ కదా! తెలియక అడుగుతున్నా కానీ, ఘుమ ఘుమలాడే నాన్‌వెజ్ ముక్కలను వదులుకుని నేనొండిన ఉత్త పప్పన్నం, చప్పటి కేబేజి కూర తినడానికొచ్చావా!’ అనుకోగానే ఠక్కున మొహం తిప్పుకుంది. ‘నీ కర్మ’ అని మనసులో అనుకుంటూ, ‘జావ్ యహా సే, బహుత్ హోగయా తేరా నాటక్, ఉఢ్, ఉడ్’ అని హిందీలో దాన్ని గదిమాను. దేశ రాజధాని కాకి కదా! తెలుగులో దానికి తెగులేమో అనుకుని. అబ్బో ఖచ్చితంగా హిందీ కాకే! ఉలిక్కిపడి, అర్థంమైనట్టు ఒక్కసారి అది ఎగరినట్టే ఎగిరి మళ్ళీ అదే చోట వాలి ‘కాయ్ కాయ్ కాయ్’ అంటూ మొదలెట్టంది.అదేంటీ ఇందాక ‘కావ్ కావ్ కావ్’ కదూ అంది. ఇప్పుడు కాయ్ కాయ్ కాయ్’ అంటోంది. నాకేమైనా పొరపాటుగా వినిపిస్తోందా? ‘దాని కేసి తీక్షణంగా చూస్తూ, చెవులు నిక్కబరుచుకుని విన్దామని నిశ్చయించుకున్నా! ఏదో సుదీర్ఘ ఆలోచనలో పడ్డట్టుంది. లేక ఏదో నన్ను ఆటాడిస్తోంది. నోటికి తాళం వేసినట్టు కూర్చుంది. ఏంటీ ఉలుకూ పలుకూ లేదు. పలుకదే? నాతో పెట్టుకుంటోంది. అది గొంతు తెరుస్తే ఒట్టు. ‘క్యా హువా కవ్వా జీ? చుప్ క్యూం హో?’ అన్న వెంటనే, ఏదో తెలివొచ్చినట్టు మళ్ళీ రాగాలాపన మొదలెట్టింది. రైటే. ‘కాయ్ కాయ్ కాయ్ కాయ్’ అనే అంటోంది. ఈసారి కన్ఫరమ్డ్! ఏం కాయ్ కాయాలో, ఏం కావ్ కావాలో దీనికి? అని దానికేసే చూస్తూ నిలబడిన నన్ను. ‘ఎవరితో మాట్లాడుతున్నావూ?’ మా మమగారు వణుకుతున్న గొంతుతో సణిగినట్లు అడిగారు. ‘ఆ...కాకితో కబుర్లు చెప్పుకుంటున్నా లెండి. మీకు భోజనం వడ్డించి పెట్టాను’ అనేలోపు ‘ఎందుకూ, మీ అత్తగారు మిసెస్ శేషావతారంతో కబుర్లూ ? వచ్చి టి.విలో న్యూస్ చూసుకోవచ్చు కదా? అసలే మీ ఆయన పెద్ద ఆఫీసరు, ఇలా వచ్చి కాస్త టివి వాల్యూమ్ పెంచు.’ నెమ్మదిగా ఆ కట్టుడు పళ్ళతో ఫుడ్డింగు మొదలెడుతూ, ఓ అరగంట సేపు ఎక్స్పర్ట్ కామెంట్సు ఆయన ఇవ్వడం, నేను వినడం కొన్నేళ్లగా అలవాటై పోయింది. ‘ఇదిగో అమ్మా’ అంటూ, ‘పప్పులో ఉప్పు ఒకరవ్వ ఎక్కువైంది, ఆ కాబేజీ కూర ఆవ పెట్టి చేస్తే మా అబ్బాయి వాళ్ళమ్మని తలుచుకుని భోజనం చేస్తాడు కదా! ఏవిటో ఈ మధ్యన నువ్వు మనసు పెట్టి వంట చేయటంలేదు. పళ్ళు లేవుకదా, పాపం మామగారికి మామిడికాయ తురిమి,పచ్చడి చేసి పెడదామని లేదురా నీకు, పెరుగొక్కటే భేషుగ్గా ఉంది. కొన్న పెరుగు కామోసు! ఇంట్లో తోడెడితే నాలుగు రాళ్ళు మిగుల్చుకోవచ్చు కదా! అయినా ఎన్నాళ్ళుంటానో ఏమో! వయసైపోయినా జిహ్వచాపల్యం ఉందిగా. నేనూ వెళ్ళిపోతే ఇక నీ వంట ఏడాది కోసారి నా తద్దినానికే తినాల్సొస్తుంది. ముక్తి దొరికితే సరేసరి. ఆ పై లోకాల్లో పెద్ద క్యూట! శేషమ్మ నా కలలో వచ్చిన చెప్పిందిలే. సరే, ఏదైతేనేం? కాశీ అన్నపూర్ణలా రోజూ అన్నం పెడుతున్నావు. నీ దయా నా ప్రాప్తీ అనుకో!’ ఓ అరగంట తూనీగ చెవిలో దుర్రు దుర్రన్నట్టుగానే ఉంటుంది! ఇది రోజూ ఉన్న కార్యక్రమమే. కంచంలో చేతులు కడుక్కుని మంచం మీదకి ఉపక్రమించేందుకు సన్నద్ధమౌతున్నాయన్ని, ఆయన మాటలకర్థం ఏమిటో అడగాలి. ఈయనకి సాత్వికమైన ఆహారం పెడ్తుంటేనే వంక పెట్టకుండా భోజనం అయిందని పించుకోరు, ఇక కారాలూ మిరియాలు వేస్తే గూబ గుయ్యిమని అరవడం మొదలెడతారు. పెద్దాయన హెల్తే మఖ్యం మాకు. ఆయనతో పాటూ మేమూ నెమ్మదిగా కమ్మటి శాఖాహార రుచులకు అలవాటు పడ్డాం. ఆయన డైలాగులు పట్టించుకోకుండా ఏదో రేడియో ప్రోగ్రాం వస్తోందని అనుకుంటూవుంటాను! ఆ వయసులో మేము ఎలా ఉంటామో ఏమోనన్న ఆలోచన కూడా వస్తూ వుంటుంది. అయినా, ఈయనది మరీ విడ్డూరం! ఆ కాకి మా అత్తగారెలా అవుతుంది? ఈ ముసలాయన మాటలొక్కోసారి అర్థం కావు సుమీ! అదీకాక మా ఆయన ఆఫీసరత్వానికీ, నేను టి.విలో న్యూస్ చూడడానికి లింక్ ఏవిటో? అసలు ఈయన గోల ఏవిటో? మనసులో కాస్త చికాకు పడ్డాను. ‘ఏంటండీ మామయ్య గారూ? ఆ కాకిని పట్టుకుని మా అత్తగారంటారు? ఆవిడేమో తెల్లగా, ముద్దుగా, మల్లెపూవల్లే ఉండేవారు. ఎంతో చక్కగా ఇల్లు మేయింటేను చేసే వారు, పిల్లల్నిద్దరినీ కంటికి రెప్పలా కాపాడుకుని, సంస్కారవంతులుగా ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ధారు. ఆవిడ ఏదో తత్వాలూ కీర్తనలు, జిక్కీ బాలసరస్వతి గారి పాటలు ఎంతో కమనీయంగా పాడుకుంటూ హాపీగా ఉండేవారు. కాకికీ ఆవిడకీ లింక్ ఏమిటీ? నాకు మీ మాటలేమీ బోధపడట్లేదండి. గ్రహపాటున హార్ట్ఎటాక్ వచ్చి, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా, ఆవిడ కోరుకున్నట్టుగా డిగ్నిఫైడ్ గానే వెళ్ళి పోయారు...మీరలా అనడం ఏమీ భావ్యం కాదు. ఆ మహా ఇల్లాలిని ఈ కాకితో పోల్చడం ఏమీ బాగోలేదు. మరింకోటేదో కూడా అన్నారు. ఆ....గుర్తొచ్చింది. టివిలో నేను న్యూస్ చూడడానికి మీ అబ్బాయి ఆఫీసరత్వానికీ ఏమిటి మామయ్యగారూ కనెక్షను? ఏదోవొకటి మాట్లడకపోతే మీకు తోచదా?’ అని డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ– ఈయన గారి సోడియమ్ లెవెల్స్ పడిపోయి ఏదో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని గొణుక్కున్నా. ‘మజ్జిగలో లవణం రంగరించి ఇస్తే గానీ ఈయన తెలివిగా మాట్లాడరు’ అనుకున్నా! ఏదో నా మదిలోభావాలను ఎక్సరే కళ్ళతో చదివినట్టు. ‘ఇదిగో తల్లీ, నిన్ననేగా నా బ్లడ్ రిపోర్ట్‌లో ఎలక్ట్రలైట్ లెవెల్స్ బాగున్నాయని వచ్చింది. నా సోడియమ్, పొటాషియం లవణాలు బాగానే ఉన్నాయి కానీ.. ఆ ...ఏమీ లేదు. మీ అత్తగారి సంగీతానికేం, ఆవిడ పాటలు వీనుల విందుగా ఉండేవి. కానీ అమ్ములూ, ఆవిడ నన్ను ప్రశాంతంగా అడపాదడపా అయినా ఓ సిగరెట్టు కాల్చుకోనిచ్చేది కాదు, వారానికో విస్కీ పెగ్గెనా హెపీగా తాగనిచ్చేదికాదు. మీ ఢిల్లీ కాకి లా కాయ్ కాయ్ కాయ్ కాయ్ అంటుండేది. ఓ మైక్రోమేనేజమెంట్ చేసేది. ఇది చెయ్య కండీ, అది చెయ్యకండీ అని ఓ ఆడ హిట్లర్‌లా నామీద ఆర్డర్లూ! ఈ కాకి కనీసం మధ్యాహ్నం, ఓ సమయం చూసుకు వచ్చి కాయ్కాయ్ కాయ్ అని అరిచిపొతుంది. మీ అత్తగారు, ‘కాయ్ కాయ్’తో పాటూ ఖయ్ ఖయ్ ఖయ్ ఖయ్ లాడేది. అందుకనే అలా అన్నాను’ అని సమర్థించుకున్నారు, శూన్యం లోకి చూస్తూ. అయినా ‘నిన్ను మిస్స్ అవుతున్నా మై డియర్ శేషమ్మా, మనిద్దరి మధ్యలో అన్యోన్యమైన, ఆత్మీయమైన, అనూహ్యమైన ఖెమిస్ట్రీ ఉండేది’ అంటూ పంచె కొస పైకెట్టుకుని కంట తడి తుడుచుకున్నారు. ‘ఈయన ఆరోగ్యం కోసం ఎంత మదన పడిందో, ఈయన మర్చిపోయారా? ఆవిడకి తన డెభ్భై ఐదో బర్త్‌డే చేసుకోవాలని ఎంతో కోరికగానూ ఉండేది. ఈయనని కంటికి రెప్పలా ఆమె బ్రతికున్నంత కాలం కాపాడుకున్నందుకు, ఆయన మంచికోసం చెప్పిన మాటలు కాకి అరుపులా? అయ్యో ఈయన తీరే వేరనుకుని నేనే పొరపాటు పడ్డా! మామయ్య గారు ఆవిణ్ణి ఎంత మిస్ అవుతున్నారో! అయ్యో పాపం..అరవై మూడేళ్ళ వైవాహికబంధం మరి. ‘ఈ వయసులో ఓ పట్టాన నిద్ర రాదు, ఏదో భోజనం అవ్వగానే ఓ కునుకు తీద్దామంటే నీ యక్ష ప్రశ్నలతో నా నిద్ర కాస్తా పోగొడుతున్నావు తల్లీ’ రివర్స్ గేరులో నాకే క్లాసు పీకడం మొదలెట్టారు. ‘కానీ కోడలు పిల్లా నువ్వు నా అమ్మవురా! ఏదో మాట్లాడుతుంటా. మనసు కష్టపెట్టుకోమాకు. ఆ టీవిలో న్యూస్ రోజూ చూసి నిన్ను నువ్వు అప్డేట్ చేసుకో, బాబు ఇంటికి రాత్రి ఆలస్యంగా వచ్చినప్పుడు నేను అన్నం తినలేదని, రెండు సిగరెట్లు కాల్చానని, పనిమనిషిని అరిచానని, నేనొండిన వంటకి మీ నాన్న వంద వంకలు పెట్టకుండా భోంచేయరని వాడి తల తినక! నువ్వు చూసే టివి సీరియల్సా, రిపీట్ టెలికాస్ట్ ఇవ్వక! ఏ పార్టీకి ఎంత మద్దతొస్తుందో, వరల్డ్ న్యూస్ గురించో ముచ్చటించు, ఆంధ్రా, తెలంగాణా రాజకీయాలు చర్చించు లేకపోతే మాంచి పాట ఒకటి నా శేషమ్మలా పాడుతూ, అలసి పోయి వచ్చిన నా కొడుక్కి ప్రేమతో కాస్త పక్కనుండి అన్నం పెట్టు. ఏ టివి సీరియల్సో చూస్తుకూర్చోక!’ అనంటూ ఆవులించి గురక పెడుతూ, నిద్రలోకి హాయిగా అక్కడున్న సోఫాలో జారుకున్నారు. అమ్మో పెద్దాయన, జనరల్ హెల్తూ ఇవాళ బాగానే ఉన్నదనుకుని, అయ్యో, నా తండ్రి లాంటి ఆయన, నాతో మాట్లాడకపోతే పాపం ఆయన ఎవరితో మాట్లాడతారు? న్యూస్ పేపరు పట్టుకుని నా గదికి వెళ్ళాను నవ్వుకుంటూ, నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికీ, ఓ కునుకు తీయడానికీ. సత్యశ్రీ నండూరి -
బీసెంట్ రోడ్డు
పొద్దున్నంతా లోపలనే ఉంది. కాసేపు ఏడ్చింది. కాసేపు ఫోన్లో ఒకరిద్దరు ఫ్రెండ్స్‌తో మాట్టాడింది! ఇంకెవరైనా ఉంటే బాగుండు, చాలా దగ్గరగా, తన బాధ అర్ధం చేసుకునే, తన వయసుకితగ్గ తోడు. మొహం ఉబ్బిపోయింది. కోపం వస్తోంది. దుఃఖం తగ్గడం లేదు. ఏం చెయ్యాలి? సాయంత్రం నాలుగు దాటింది. మెల్లగా లేచి రెండు బక్కెట్ల నిండా నీళ్ళు పట్టుకుని గబా గబా తలస్నానం చేసింది. పైనించి కిందికి దిగి నేలమీదకి జారి పోయే నీళ్ళలో తన బాధకూడా కరిగిపోవచ్చుకదా. ఫ్యాన్ కింద నిలబడి తల ఆర పెట్టుకుంది. ఆ మాటలు గుర్తొస్తూనే ఉన్నాయి. ఫాన్ గాలికి నీళ్ళు ఆవిరి అయినట్టు, నచ్చని విషయాలు ఆరిపోతే ఎంత హాయో కదా. ఛీ. ఖర్మ. ఆ కాసేపు చెవులు పూడుకు పోగూడదా. పోనీ, కనీసం చెవులు మూసుకునే అవకాశం అయినా ఉండొచ్చు కదా. చెవులు మూసుకోవడం కాదు, చెత్తమత్తంగా కొట్టగలిగితే, కనీసం తిరిగి చెడా మడా తిట్టేస్తే అప్పుడు ఎంత బావుంటుందో. తిట్లు అంటే ఇంగ్లిష్ తిట్లు, నాజూకు తిట్లు కాదు. అచ్చ తెలుగు తిట్లు తిట్టేయాలి వాడిని. అప్పుడుగానీ కోపం శాంతించదు. అమావాస్య మర్నాడు వచ్చే సన్నని చందమామలా చిన్న నవ్వు విచ్చుకుంది. ప్చ్. కుదరదు. చేసే ఉద్యోగం వినడం, జవాబు చెప్పడం. అంతవరకే. ఏం మాట్లాడిన వినాలి. విసుక్కోకుండా, వినయంగా జవాబు చెప్పాలి. నిన్న వాడు వాగిన వాగుడికి లైన్ కట్ చేసి భోరుమని ఏడ్చేసింది. అందరూ ఓదార్చారు. అంతకన్నా వాళ్ళు చేయగలిగేదీ ఏమీ ఉండదు. ‘అలా సెన్సిటివ్ గా ఉండకూడదు శాంతీ. బోల్డ్ గా ఉండాలి. ఇదికాదు, ఇంకో చోటికి, ఇంకో పనికి వెళ్ళావనుకో, అక్కడా ఎదురు అవుతారు ఇలాంటి ఎదవలు’ పై అధికారి చెప్పే మాటల్లో, శాంతిలో ధైర్యం నింపే ఆలోచనకన్నా, ఆ పిల్ల ఎక్కడ ఉన్నపళాన ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతుందో అని భయం ఎక్కువ. సినిమా స్టార్ కావాలంటే అర్హతలు ఏమిటో తెలుసా? నున్నటి తోలు, చురుకైన కళ్ళు, సన్నటి ముక్కు, కొద్దిగా డాన్స్, ముద్దు ముద్దు మాటలు....ఇలాకొన్ని. చాలు. అవి మాత్రం చాలు. అసలు ఏమీ లేక పోయినా, గ్రాఫిక్స్ తో ఇవాళ లేని కళలు ఉన్నట్లు, ఉన్న అవకరాలు లేనట్టు చూబెట్టవచ్చునంట. కానీ, కాల్ సెంటర్ లో పని చెయ్యాలంటే ఆ మనిషికి ఏ లక్షణాలు ఉండాలో తెలుసా? చాలా గొప్ప ఓర్పు కావాలి. మానవ మాత్రుడికి సాధ్యం కాని, లేని అనంతమైన ఓర్పు. ఏ పురాణంలోనూ, ఇతిహాసం లోనూ ఏ పాత్రకూ కనబడని సహనం కావాలి. పైగా దానిని కృత్రిమంగా నటించి చూపడం కుదరదు. స్వంతంగా ఉండాల్సిందే. ఎక్కువమంది కోరుకోని, ఎక్కువరోజులు నిలబడలేని ఈ ఉద్యోగానికి అర్హతలు అతి కష్టమైనవి. ఫోన్ కాల్ అందుకుని జవాబులు చెప్పినందుకే పదిహేను వేలు ఇస్తారా అనుకుంది చేరక ముందు. కానీ, తొందరగానే తెలిసొచ్చింది, శాంతి తన మనఃశాంతిని అతి చవక రేటుకి తాకట్టు పెట్టిందని. శాంతి పేరు డిగ్రీ కాలేజీలో రెండవ సంవత్సరంలో హాజరు పట్టీలో ఉంది. కానీ, ఎప్పుడోకానీ తను హాజరు పలకదు. చాలా అవసరం, ఏదైనా అసైన్మెంట్ ఇవ్వాలి, ఫీజు కట్టాలి లేదా ఎవరినైనా కలవాలి అంటే పనికి శెలవు పెట్టి కాలేజీకి వెళుతుంది. గవర్నమెంటు కాలేజీల్లో నూటికి అరవై మంది పిల్లల దిగువ మధ్య తరగతి వాళ్ళు. బైట తప్పని సరిగా ఏదో ఒక పని చేసుకోకపోతే గడవని వాళ్ళు. అందుకే వాళ్ళ రోజువారీ హాజరుని అదే పనిగా పట్టించుకుని ఎవరూ ఇబ్బంది పెట్టరు. ‘బైటికి వెళుతున్నాను అక్కా. షాపింగ్‌కి’ పేయింగ్ గెస్ట్ హౌస్ ఓనరమ్మతో చెప్పింది. ఆవిడ సరే అని గానీ వద్దు అని గానీ అనకుండా ఒక రకమైన మొహం పెట్టింది. ఎప్పుడైనా అంతే. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళినా, హౌస్‌కి రావడంలో ఒక పదినిమిషాలు లేటు చేసినా, ఆదివారం షాపింగ్‌కి వెళ్ళినా, గురువారం గుడికి వెళ్ళినా, నోటితో ఏమీ అనదు కానీ ఒక లాగా చూస్తుంది. ‘హౌస్‌లో అందరి కన్యత్వానికీ, ప్రవర్తనకీ తనని తను కేర్ టేకర్ గా అనుకుంటది గావున లోపల’ శాంతికి అనుమానం. ఆ చూపు వెంటాడుతుంది. సందేహిస్తుంది. చాలా అవమానిస్తుంది. కానీ శాంతి ఈ హౌస్ వదిలి పోలేదు. కాలేజీకీ, ఆఫీస్ కీ బాగా దగ్గర. ఉన్నంతలో తక్కువ రేటు. శాంతి రంగు చామన ఛాయకి తక్కువే. ఐదడుగులకి కిందనే ఎత్తు. బహుశా కురచ మనిషి అనొచ్చు. ముక్కు మాత్రం ఉండవలసిన దానికన్నా కాస్త పొడవు. కింది పెదవి ముందుకు వచ్చి ఉంటుంది. పొట్టి గిరజాల జుట్టు. కోల ముఖం. ఫెయిర్ అండ్ లవ్లీ లెక్కలప్రకారం పెద్ద అందగత్తె కాదు. ఆయా లెక్కా పత్రాల జోలి లేకుండా మాట్టాడితే, కురూపి కూడా కాదు. సరైన తూకంలో చెప్పాలంటే, శాంతి ఒక వయసులో ఉన్న పిల్ల. కష్టపడి పని చేసుకునే పిల్ల. బ్యాక్ లాగ్స్ లేకుండా జాగ్రత్త పడే పిల్ల. ఎంతవరకో అంతవరకే సావాసాల జోలికి వెళ్ళే పిల్ల. లోపల్లోపల ఏవో ఆశలు ఉన్నాయి. అవి ఉన్నాయని, ఉండొచ్చనీ గమనించి, ఆలోచించే తీరికే లేని పిల్ల. మన జనాల జనాభా గణనలో కొత్త కొత్త మార్పులు చేర్చి మనుషుల స్వభావం, సమాజం, అంచనాలు అనే కాలమ్ ఒకటి చేర్చి రాస్తే, దాని పరంగా, శాంతి ప్రస్తుతానికి ఒక మంచి పిల్ల. మొహానికి పల్చగా పౌడెర్ రాసింది. ఎరుపు రంగు టాప్. నీలం రంగు లెగ్గింగ్. టాప్ కి కాలర్, కాలర్కి చిన్న చిన్న పూల పూల డిజైన్ ఉంది. జుట్టు పిన్నులు పెట్టి, బాండ్ తో పోనీకట్టింది. ఎత్తు మడమల చెప్పులు వేసుకుంది. రోడ్ మీదికి వచ్చి షేర్ ఆటో కోసం చూసింది. నిన్న జీతం వచ్చింది. ఇవాళ శెలవు పెట్టింది. శలవకు కారణం అనే కాలమ్ దగ్గర ‘అనారోగ్యం’ అని రాసింది. ‘ఏమైంది?’ అని ఒకరిద్దరు అడిగారు. నీరసంగా నవ్వింది. జ్వరం కాదు. జలుబు కూడా లేదు. ఒక సాఫ్ట్వేర్ కనిబెట్టాలి. మాటలు వడబోసే సాఫ్ట్వేర్. నచ్చని మాటలు చెవి తమ్మె దగ్గరే ఫిల్టర్ అయిపోవాలి. తప్పుగా ఎవరైనా మాట్లాడితే, వెంటనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ బ్లాక్ అయిపోవాలి. వాళ్ళు సరిగా మాట్లాడేదాకా, ఏ కంపెనీ కూడా వాళ్లకి ఫోన్ సౌకర్యం కలిగించకూడదు. శాంతికి నవ్వొచ్చింది. అసలు జరగని విషయాల గురించి తను ఆలోచిస్తోంది. అంతకన్నా ఉద్యోగం వదిలేసి, వేరే పని వెతుక్కోవడం సులభం కదా. ప్రస్తుతానికి ఆ ఉద్యోగంలోనే ఉంది కాబట్టి, వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేసి, చివరికి తప్పదని ఇచ్చిన ఈ ‘ఒకరోజు’ శెలవుతోనే తను తెప్పరిల్లాలి. పై వారికి తెలుసు. కానీ వాళ్ళు కూడా ఏమీ చెయ్యలేరు. శాంతి లాగానే, బతకడానికి ఉన్న అనేక మార్గాల్లో వాళ్లకి ఇప్పటికి వీలైనది ఇదే. షేర్ ఆటో ఎందుకు? ఇలాంటప్పుడు కాబ్ ఎక్కాలి. బుక్ చేసింది. ఫోన్ చూసుకుంటూ సెంటర్ లో నిలబడింది. ఇదిగో కాబ్ వచ్చేసింది అని ఫోన్ చూబిస్తోంది. కానీ రాలేదు. ‘నేను. బుక్ చేసి ఇక్కడే నిలబడి ఉన్నాను. ఐదు నిమిషాలు అన్నారు. ఇంకా రాలేదు’ మెల్లగానే అంది. ‘ఒక్క నిమిషం కూడా ఓపిక పట్టలేరు. ఇంత లోకి ఫోన్ చేసేస్తారు. పికప్ చేసుకోవడానికే కదా వచ్చేది. ట్రాఫిక్ అడ్డం వస్తే ఆగుతాం. వస్తాం కదా’ ఆటో డ్రైవర్ తన ఇంట్లో పెళ్ళాన్ని కసిరినట్లు కసురుతున్నాడు! ‘ఔను. చెప్పిన టైం కి రాలేదుకాబట్టి ఫోన్ చేశాను. నీతో కబుర్లు చెప్పడానికో, పనీ పాట లేకనో ఫోన్ చేస్తానా? ఏదంటే అది మాట్లాడుతున్నావేంటి?’గట్టిగా బదులు చెప్పింది. చాలా గట్టిగా. ఆటో అతను తగ్గాడు. శభాష్. ఇంతే ఇలానే చెప్పాలి ఎవరికైనా. శాంతి మాట్లాడితే నోరెత్తాలంటే ఎదటివాడు భయపడిపోవాలి! కానీ మళ్ళీ అదే ఆటో ఎక్కింది. కాన్సిల్ చేస్తే, డబ్బులు కట్ చేస్తాడు. అటో దిగినాక వీడి మీద నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రాసేస్తాను. తిక్క కుదిరిపోతుంది. ఆటోదిగిన తరవాత ఎడమ చేతివైపు సందులోకి తిరిగింది. అదొక లోకం. మహా వైభవం. ఒకప్పుడు ఇంకా ఉండేది. విదేశీ వ్యాపారాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రాకముందు ఏకచత్రాధిపత్యం ఏలిన రాజసపు ఛాయలు పూర్తిగా వెలిసిపోలేదు. రోడ్డుకి రెండుపక్కలా షాపులు. గోల్డు కవరింగ్ నగలు, వాచీలు, బట్టలు, తినుబండారాలు, చెప్పులు, కాఫీపొడి, టీపొడి, పచారీ సామాను, బేకరీలు, స్వీట్ మాజిక్, కాస్త పక్క సందులోకి వెళితే హాట్ డ్రింక్స్.........ఇంకా ఏవేవో. రోడ్డుకి మధ్యలో బారుగా సైకిళ్ళు మోటారు సైకిళ్ళు సెంట్రల్ పార్కింగ్ చేసి ఉన్నాయి. వాటిని ఆనుకుని, ఏఏ వస్తువులు పెద్ద పెద్ద షాపుల్లో పెద్ద పెద్ద రేట్లకి అమ్ముతారో, అవే వస్తువులు చిన్న చిన్న బళ్లమీద చిన్న చిన్న రేట్లకి అమ్ముతున్నారు. శాంతి పెద్ద బోర్డుల వంక చూడలేదు. చిన్న తోపుడు బండ్లసమీపానికి కూడా వెళ్ళలేదు. మధ్యలో నిలబడింది. అందర్నీ చూస్తోంది. ఎందుకు అలా నిలబడింది? ఏమిటి చూస్తోంది. ఏమిటి చూస్తోందో! ప్రతి మనిషి మనసులో ఏవుందో మనం అన్నీ తెలుసుకోగలమా? ఆ లోకాన్ని చూస్తోంది. ఏదో వెతుకుతోంది. ‘వెదకుడి దొరకును’. బైబిల్ వాక్యం గుర్తు చేసుకంది. నీకేం కావాలి? అక్కడ దొరకనిది ఉండదు. కానీ, ఆ దోవన వచ్చిపోతున్న జన సముదాయం కేవలం వస్తువులకోసమే వచ్చినట్టు కనబడటం లేదు! ఎత్తు కోణాకారం వెదురు గంపలో తీరిగ్గా సర్ది పెట్టిన మరమరాలూ మసాలాలూ చిన్న బట్టల షాపులో వెదజల్లి ఉన్నాయి. బక్క పలచటి ఆడ మనిషి కోపంగా ఊగిపోతోంది. ‘ఇస్తాను కదా. నెమ్మదిగా అడిగి తీసుకో. అరవడం ఎందుకు? ఇలా వెదజల్లడం ఎందుకు? ఇప్పుడు నష్టం ఎవరికి? నాకా? నీకా?’ షాప్ లో నేల పడిన వాటిని చిమ్మేస్తూ అతను కేకలు పెడుతున్నాడు. బైట నిలబడిన మరమరాల గంపగలామె ఏదేదో తిడుతోంది. ఆమె ఎందుకు కోపంగా ఉంది? అతను ఏమని ఉంటాడు? డబ్బులు ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పించాడా? లేక ఏదైనా అనకూడనిది మాట్టాడాడా? ఆమెకు కోపం తెప్పించాడా? వాడు ఏమైనా అననీ అనకపోనీ. ఆమెకి కోపం వచ్చింది. కోపం చూపాలనుకుంది. చూబెడుతోంది. ఎంత అదృష్టమో కదా. శాంతి ఆమె వంక ముచ్చటగా చూసింది. తల నుంచి పాదాల దాకా ఏ సింగారానికైనా వస్తువులు దొరికే ఒక చిన్న బండి. అది అతనిది. అతనెవరు? ఎవరో. శాంతికి లాగానే, ఎర్ర చొక్కా, నీలం ఫాంటు వేసుకొని ఉన్నాడు. బట్టల రంగు ఒకటే గానీ, మెటీరియల్ వేరు. కుట్టిన విధానం కూడా వేరు. చుట్టూ ఐదారుగురు ఆడపిల్లలు చేరారు. చమ్కీ గాజులు, బొట్టు బిళ్ళలు, రంగు రంగుల గోళ్ళ రంగులు చూస్తున్నారు. ఏ వస్తువైనా ఇరవై రూపాయలు. ‘పది రూపాయలకి ఇస్తావా? ‘రాదు’ ‘ఓ ముద్దు కూడా ఇస్తాను’ ఒకపిల్ల దూకుడుగా ఉంది. భయం లేదా? లేదా ఇక్కడ దేనికీ భయపడనక్కరలేదా? ఏదైనా అనేసేయోచ్చా? నిజానికి అతను ముద్దు వచ్చేంతవాడు కాదు. కానీ, అవసరానికి అందంతో పని లేదు. ఆ పిల్ల ఎంత లోటుపడిఉందో. వినీ విననట్టు వేరే వైపు సర్దుకుంటున్నాడు. అతనికి పెళ్లి అయిందో లేదో? ఎవరైనా ముద్దు పెట్టారో లేదో. నిజంగా వినలేదా? ఎన్నోసార్లు విని విసిగిపోయాడా? అబ్బా, వినకుండా ఉండొచ్చు, జవాబు చెప్పకుండా నిర్లక్ష్యం చేయొచ్చు. అతన్ని ఆ పిల్ల నిజంగా ముద్దు పెట్టుకుంటే ఏం చేస్తాడో? తెల్లబోతాడా? చిరాకు పడతాడా? షాక్ తింటాడా? శాంతి ఊహించుకుని నవ్వుకుంది. వూరంతటిలో బోలెడు బ్రాంచిలు ఉన్న స్వీట్ మంత్ర షాపులోకి వెళ్ళింది. పైకి మెట్లు ఉన్నాయి. మెట్లెక్కింది. ఊళ్ళో చాలా పెద్ద హోటళ్ళు ఉంటాయి. అక్కడ కాఫీ వంద రూపాయలు. కొందరు స్టేటస్ కోసం అక్కడికి వెళతారు. మిగిలినవాళ్ళంతా ఇక్కడికి వస్తారు. ఆ మిగిలిన వాళ్ళలో కూడా చాలా విభజనలు. చిన్న చిన్న వాళ్ళు రోడ్డు పక్కన బండి మీద అమ్మే స్వీట్లు కొంటారు. మరీ దరిద్రం, కనీసం ఇరవై కూడా లేదా? గులాబీ రంగు పీచు మిఠాయే గతి. అంటే, కొందరు కాస్త గొప్పోళ్ళు కూడా ఇష్టం మీద అలా చవకైనవి కొనుక్కుని తింటారు. అటు మరీ స్టార్ హోటల్ కి పోలేని, లేదా బొత్తిగా రోడ్డు పక్కన బండి మీదివి కొనడం సరికాదు అనిపించిందనుకో, ఇలా ఈ బజారులో, ఈ ఫలానా షాపులోకి నడిచి వచ్చేయొచ్చు. ఇలానే ఠీవిగా మెట్లు ఎక్కి పైకి వెళ్లి ఏం కావాలో ఆర్డర్ చెబుతారు. వెయిటర్లు, మిఠాయిలైతే కిందినుంచి, ఫాస్ట్ ఫుడ్స్ అయితే పైన ఉన్న కిచెన్ నుంచి తెచ్చి ఇస్తారు. పార్సిల్ ఆర్డర్ చెప్పింది. రాసుకున్నాడు. చుట్టూ నాలుగైదు టేబుల్స్. జనం కూడా పల్చగా ఉన్నారు. ఒక టేబుల్ దగ్గర ఒకబ్బాయి ఎదురగా కూచున్న అమ్మాయికి ఏవేవో గొప్పలు చెబుతున్నాడు. ఆపిల్ల, అవన్నీ నిశ్శబ్దంగా వింటూ మధ్య మధ్య ఆశ్చర్యపోతూ, పాతకాలం పిల్లలాగా అవసరం లేకపోయినా, అప్పుడప్పుడూ సిగ్గుపడుతోంది. ఇంకోబల్ల దగ్గర తల్లి ఇద్దరు పిల్లలు. వాళ్ళు పేచీలు పెడుతూనే జాలీగా తింటున్నారు. తల్లి సంతోషంగా, గర్వంగా ఉంది. పెద్ద బల్ల చుట్టూతా స్టూడెంట్స్ ఉన్నారు. అబ్బాయిలూ, అమ్మాయిలూ కలిసి వచ్చారు. చీకూ చింతా లేనట్టు, ఇక్కడ కూచోడం తప్ప ప్రస్తుతానికిగానీ, లేదా ఒక గంట తరవాత గానీ ముఖ్యమైన పనే లేనట్టున్నారు. పదినిమిషాలు గడిచాయి. ఇరవై నిమిషాలు గడిచాయి. ఆర్డర్ రాలేదు. వెయిటర్ని పిల్చింది. ‘చేస్తున్నారు మేడం’ మళ్ళీ పది ఇరవై నిమిషాలు గడిచాయి. ఇంతసేపటి తరవాత కూడా ఆర్డర్ రాలేదు. సహనం తగ్గింది. ‘మీరు చెప్పిన ఆర్డర్‌కి టైం పడుతుంది మేడం. ఇంకోటి ఉంది. తెమ్మంటారా?’ ‘ఎంత టైం పడుతుంది? ముందు చెప్పాలి కదా వెంటనే చెయ్యడం కుదరదని’ ‘అంటే, స్టాఫ్ ఇవాళ తక్కువ మంది ఉన్నారు. ఇంకో ఐటెం రెడీగా ఉంది. తెమ్మంటారా?’ ‘వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఇంత సేపు కూచోపెట్టి ఇప్పుడు అది లేదు, ఇది ఉంది అంటారేంటి? అసలు ఆర్డర్ కాన్సిల్ చేసేస్తున్నాను. నాకు ఏమీ వద్దు. నేను పే చేసిన మనీ తిరిగి ఇచ్చేయండి’ శాంతి ఇంగ్లీష్ లో మాట్టాడింది. ‘ఆన్లైన్ పేమెంట్ వెళ్ళిపోయింది మేడం. తిరిగి ఇవ్వడం కుదరదు. మీరు ఇంకేదైనా తీసుకోండి’ ఆతను ఆమె ఇంగ్లీష్‌కి స్పందించిన దాఖలా లేదు! ‘దిస్ ఇస్ టూ మచ్. ఐ జస్ట్ కాంట్ అండర్‌స్టాండ్ వాట్ యు మీన్. డబ్బులు ముందు ఇచ్చిన పాపానికి మాకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఏ చెత్త పెడితే ఆ చెత్త తినాలా?’ ‘మేడం, మీరు కూచోండి. నేను రెడీ చేయిస్తాను’ పైన జరుగుతున్న గోలకి కిందినుంచి వచ్చిన మేనేజెర్ శాంతిని కళ్ళతో అంచనా వేస్తూనే చెప్పాడు. ‘ఐ విల్ కంప్లైంట్ టూ యువర్ మెయిన్ ఆఫీస్. పరమ దరిద్రపు సర్వీసు. తెలీక వచ్చాను’ సుమారు పావుగంట తరవాత ఆర్డర్ వచ్చేదాకా శాంతి తిడుతూనే ఉంది. పక్క టేబుళ్ళ వాళ్ళు వింటూనే తింటూ ఉన్నారు. ‘ధాంక్ యు మేడం’ తాపీగా పార్సిల్ పాకెట్ శాంతి చేతికి ఇచ్చి మావూలుగా అన్నాడు. అతనివంక కోపంగా చూస్తూ శాంతి పాకెట్ విసురుగా లాక్కుంది. అతను అభావంగా ఉన్నాడు. అతని రెండు కళ్ళలో శాంతి ప్రతిబింబాలు ఉన్నాయి. బైటికి వచ్చి ఏదైనా నూట యాభై అని అట్టమీద పెన్నుతో రేటు వేసివున్న బండి మీద ఒక జీన్స్, సరిపడా టాప్ కొన్నది. సెంటర్లో వినాయకుడి గుడి దగ్గర దణ్ణం పెట్టుకుంది. గుడికి వెళితే ఒక్క నిమిషమైనా కూచోవాలి అంటారు. అది చాలా చిన్న గుడి. అయినా ఒక పక్కగా అరుగుమీద కూచుంది. ఫోన్ తీసింది. రెండు కంప్లైంట్స్ రాయాలి. ఒకటి ఆటో అతనిమీద. రెండోది స్వీట్ మంత్ర సర్వీస్ మీద. వరస్ట్ సర్వీస్.......ఆటో డ్రైవర్ గురించి రాసింది. మళ్ళీ ఎందుకనో తీసేసింది. వెరీబాడ్ సర్వీస్.......స్వీట్ మంత్ర పేజీలో రాసింది. అది కూడా డిలీట్ చేసింది. ఒక్క నిమిషం కళ్ళుమూసుకుంది. ప్రశాంతంగా ఉంది. లేచి దేవుడిని మళ్ళీ ఓసారి చూసి అలవాటు ప్రకారం రెండు చెంపలూ వేసుకొని వెనక్కి తిరిగింది. (కోటి సుల్తాన్ బజార్, జగదాంబ సెంటర్, సూపర్ మార్కెట్, లేకపోతే పాత రోజుల్లో సంత. బాధనీ, సంతోషాన్నీ సమాంతరంగా పంచుతూ, మార్కెట్లు నిరంతరాయంగా తెరవబడే ఉన్నాయి) ఎం.ఎస్.కె.కృష్ణజ్యోతి -
కుంతీదేవి ధర్మ నిరతి
అజ్ఞాతవాసం నిమిత్తం పాండవులు జింక చర్మాలు, నార చీరలు ధరించి బ్రాహ్మణ వేషాలలో ఏకచక్రపురం అనే అగ్రహారం చేరారు. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం ఏర్పరచుకుని, రోజూ భిక్ష స్వీకరించి తల్లికి తెచ్చి ఇచ్చేవారు. ఒకరోజు భీముడు ఇంట్లో ఉన్నాడు. మిగిలిన వారు భిక్ష స్వీకరించటానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆ ఇంటిలో రోదనలు వినపడ్డాయి. కుంతీదేవి భీమునితో ‘భీమసేనా! ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగినట్లుంది. నేను వారికి ఏమి కష్టం వచ్చిందో తెలుసుకుని వచ్చి నీకు చెబుతాను. వారికి చేయగలిగిన సాయం చేయడం పుణ్యప్రదం’ అంది. అందుకు భీముడు ‘అమ్మా! నీవు తెలుసుకుని నాకు చెప్పావంటే నేను వారికి ప్రత్యుపకారం చేస్తాను’ అన్నాడు. ఎందుకని విలపిస్తున్నారని అడిగిన కుంతీదేవితో ఆ ఇంటి యజమాని ‘అమ్మా జననం మరణం సంయోగం వియోగం సహజమే అయినా వేదోక్తంగా వివాహం చేకున్న భార్యను కాని, కన్యాదానం చేసి అత్త వారింటికి పంపవలసిన కూతురుని కాని, నాకూ నా పితరులకు పిండోదకాలు ఇవ్వవలసిన నా కుమారుని కానీ రాక్షసునికి ఆహారంగా పంపలేక నేనే ఆహారంగా వెళతానని చెప్పాను అందుకు వీరు సమ్మతించక విలపిస్తున్నారు’ అన్నాడు. ‘రాక్షసుడు ఎవరు? మీరు అతడికి ఆహారంగా ఎందుకు వెళ్ళాలి?’ ఆశ్చర్యంతో అడిగింది కుంతి. అందుకు సమాధానంగా బ్రాహ్మణుడు ‘అమ్మా! ఇక్కడకు ఆమడ దూరంలో యమునా నదీ తీరాన బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు గ్రామం మీద పడి అందరినీ తినసాగాడు. అందువలన మేమంతా అతడితో రోజూ ఒక బండి ఆహారం, రెండు దున్నపోతులు, ఒక మనిషి ఆతడికి ఆహారంగా పంపేలా ఒప్పందం కుదుర్చుకున్నాము. ఈ రోజు ఈ ఇంటి నుండి అతడికి ఆహారంగా వెళ్ళాల్సిన వంతు వచ్చింది’. అన్నాడు. అందుకు కుంతీదేవి ‘అయ్యా! చింతించవద్దు. మీకు ఒక్కడే కుమారుడు. నాకు ఐదుగురు ఉన్నారు. నా కుమారులలో ఒకడిని పంపుతాను’ అన్నది. ఆ బ్రాహ్మణుడు కుంతీదేవితో ‘అమ్మా! అతిథిని పంప తగదు. అందునా బ్రాహ్మణ హత్య మహాపాపం’ అన్నాడు. కుంతీదేవి ‘అయ్యా! ఆలోచించవద్దు. నా కుమారుడు మహా బలవంతుడు. తప్పక బకుని చంపి వస్తాడు’ అన్నది. ఆమె భీమునితో జరిగినదంతా చెప్పిం ది. అందుకు భీముడు సంతోషంగా అంగీకరించాడు. అంతలో ధర్మరాజాదులు అక్కడికి వచ్చారు. కుంతీదేవి జరిగినది ధర్మరాజుకు చెప్పింది. ధర్మరాజు కలత చెంది ‘అమ్మా! పరాయి వారికోసం నీ కన్నకొడుకును బలి ఇస్తావా?’ అన్నాడు. కుంతీదేవి ‘నాయనా ధర్మరాజా! కలత చెంద వలదు. భీముని బలం నీకు తెలియదు. అతడు వజ్రకాయుడు. అతడు పుట్టిన పదవరోజునే ఒక బండ రాయి మీద పడగా అది పొడి పొడి అయ్యింది. భీముడు రాక్షసుని చంపి ఈ ఆగ్రహారానికి రాక్షస పీడ వదిలిస్తాడు. ఆపదలో ఉన్నవారిని రక్షించడం క్షత్రియ ధర్మం. మనకు ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణుని రక్షించడం మనధర్మం’ అని చెప్పింది. తల్లి చెప్పిన మాటలకు సమాధాన పడ్డ ధర్మరాజాదులు అందుకు సమ్మతించారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, తమకు ఆశ్రయం ఇచ్చిన వారు రోదిస్తుంటే కుంతీదేవి చూస్తూ ఊరుకోలేదు. కారణం తెలుసుకుంది. బ్రాహ్మణునికి మారుగా తన కుమారుడిని రాక్షసునికి ఆహారంగా పంపేందుకు సిద్ధపడింది. అడ్డుపడబోయిన ధర్మరాజుకు కూడా ధర్మసూక్ష్మాలు చెప్పింది. అన్నింటినీ మించి తన కుమారుని బలం, శక్తి సామర్థ్యాల మీద సంపూర్ణమైన నమ్మకం పెట్టుకుంది ఆ తల్లి. పక్కవాడు ఏమైపోతున్నా పట్టించుకోని నేటి రోజులలో తమకు ఆశ్రయం ఇచ్చిన వారికోసం తన కొడుకు ప్రాణాలను కూడా ఫణంగా పెట్టింది ఆ తల్లి. అమ్మ మాటను ఆ కొడుకు కూడా జవదాటలేదు. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయలేదు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ప్లాట్‌ఫారమ్‌కు ప్రేమలేఖ
రెండు ప్లాట్‌ఫారమ్‌లు కలవవు.రెండు పట్టాలు కలవవు.రెండు గమ్యాలు ఒకటి కావు.సమాంతర జీవితాలను సమంగా వేధించే అనుభూతి ఇది.కలవని వారిని ప్రేమించే అనురాగం ఇది.ఈ ప్రేమ ఒక జీవితకాలం లేటు. నగరపు ఒంటరి జీవితం.. అదీ కోల్కత్తా లోన్లీనెస్.. స్క్రీన్ మీద ‘‘యువర్స్ ట్రూలీ’’గా కనిపించింది. ‘ఆనీ జైదీ’ రాసిన ‘‘ది వన్ దట్ వజ్ అనౌన్స్డ్’’ అనే షార్ట్ స్టోరీ ఆ సినిమాకు ఆధారం. జీ ఫైవ్ స్ట్రీమ్ అవుతోంది. కథ.. మీథీ కుమార్(సోనీ రాజ్దాన్).. ప్రభుత్వ ఉద్యోగిని. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న అవివాహిత. ఆమెకు ఓ చెల్లెలు ..లాలి (ఆహనా కుమారా) బెంగళూరులో ఉద్యోగం చేస్తూంటుంది. కోల్‌కత్తాలో తాత,తండ్రి వారసత్వంగా వచ్చిన.. ఇచ్చిన ఇంటిలో ఓ పోర్షన్ అద్దెకు ఇచ్చి.. మీథీ కుమార్ ఒంటరిగా ఉంటూంటుంది. తల్లీతండ్రి చనిపోవడం, వయసులో తన కన్నా చాలా చిన్నదవడంతో చెల్లెలికి అక్కలాగా కాకుండా ఓ తల్లిలా వ్యవహరిస్తుంది మీథీ. మితభాషి. ఒటరితనం వల్లో.. స్వభావమే అంతో తెలియదు కాని.. కలివిడిగా ఉండదు. ఆఫీస్‌లో ఆమెకు ఒకే ఒక మహిళా సహోద్యోగి. మిగిలిన వాళ్లంతా మగవాళ్లే. పురుషాహంకారులే. దాంతో ఆ ఫీమేల్ కొలీగ్‌తో తప్ప ఇంకెవరితోనూ మాట కలపదు ఆమె. ఆ సహోద్యోగి ప్రెగ్నెంట్. డెలివరీకి లీవ్ మీద వెళ్లబోతూ మీథీ గురించి ఆందోళన పడుతుంది. తనులేక ఆఫీస్‌లో కూడా ఒంటరి అయిపోతుందేమోనని. కానిమీథీకి ఒంటరితనంతోనే చెలిమి ఎక్కువ. బద్దకంగానే రోజు మొదలవుతుంది ఆమెకు. అద్దెకు ఇచ్చిన పోర్షన్లో పక్షి ప్రేమికుడైన విజయ్ (పంకజ్ త్రిపాఠి) కుటుంబం ఉంటుంది. అతను మీథీతో స్నేహం చేయడానికి ఆసక్తి చూపిస్తూంటాడు. పెంపుడు చిలుకను పలకరించే మిషతో మీథీ కంట్లో పడడానికి, ఆమెతో మాటలు కదపడానికీ ప్రయత్నిస్తుంటాడు. మీథీ సేద తీరేది ఒకే ఒక్క చోట.. ప్రయాణంలో.. కొన్నేళ్లుగా! కోల్కత్తా ఈ కొస నుంచి ఆఫీస్ ఉన్న ఆ కొస వరకు ఆమెది సుదీర్ఘ ప్రయాణమే. తోపుడు బండితో మొదలై.. రిక్షాలో సాగి.. లోకల్ ట్రైన్‌తో గమ్యం చేరుకుంటుంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచీ ఆ దారి సుపరిచితమే. అయినా ప్రతి రోజూ కొత్తగా చూస్తూంటుంది. సరికొత్త పరిచయం.. అలా ఒకసారి ఆ రైల్వేస్టేషన్.. ఆమెకు ఓ సరికొత్త కొంతును పరిచయం చేస్తుంది. రైల్వే మేల్ అనౌన్సర్ గొంతు (వినయ్ పాఠక్) అది. ఆ స్వరంతో స్నేహం చేస్తుంది. దగ్గరితనం పెంచుకుంటుంది. ఎంతలా అంటే... ఆ అనౌన్సర్ తనతోనే మాట్లాడుతున్నాడనే భ్రమను వాస్తవమని నమ్మేంతగా. ఆ స్టేషన్లో జనం రద్దీలో.. దారి దొరక్క ఇబ్బంది పడ్తూంటే.. తోటి ప్రయాణికులు తమ లగేజ్ చూడమనే పని అప్పగిస్తుంటే... వదిలించుకొని త్వరగా గమ్యాన్ని చేరుకో అంటూ ఆ అనౌన్సర్ గైడ్ చేసి.. తనకు తోవ చూపిస్తున్నట్టు.. కాస్త శ్రద్ధగా తయారైన రోజు.. ఆ అనౌన్సర్ తనకు కాంప్లిమెంట్ ఇస్తున్నట్టు.. మొత్తంగా ఆ స్వరం తనకోసం వేచి చూస్తున్నట్టు.. తనను ప్రేమిస్తున్నట్టూ ఊహించుకుంటుంది. ఆ గొంతుతో ప్రేమలో పడ్డప్పటి నుంచి ఆమెలో కొత్త ఉత్సాహం కనపడుతుంది. రోజూవారి ఆ సోలాంగ్ జర్నీ.. ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. రైల్లో తోటి ప్రయాణికులను కుతూహ లంగా చూడ్డం ప్రారంభిస్తుంది. తన చుట్టూ సానుకూల వాతావరణం ఉన్నట్టు తోస్తుంది. ఎదురైన చావు ఊరేగింపు... అప్పుడే పెళ్లి చేసుకుని ట్రైన్ ఎక్కిన కొత్త జంట.. ఆ కొత్త పెళ్లికొడుకు పట్ల కొత్త పెళ్లికూతురు అనాసక్తంగా ఉండడం.. అంతలోకే ఆ ట్రైన్‌లోకి వచ్చిన ఓ యువకుడిని చూసి కొత్త పెళ్లికూతురు మొహం విప్పారడం.. అతను ఆమెను తీసుకొని వెళ్లిపోవడం.. కొత్త పెళ్లికొడుకు ఖంగు తినడం.. వంటి తనకు ఎదురైన సంఘటనలను ఆ రైల్వే అనౌన్సర్కు ఉత్తరాలుగా రాస్తుంది. మొత్తానికి తనలోని భావోద్వేగాల ఉనికిని కనిపెడుతుంది. వాటన్నిటినీ లేఖల్లో ఆ అనౌన్సర్తో పంచుకుంటుంది. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. రిటైర్మెంట్ దగ్గర పడ్తుంది. రిటైర్ అయితే.. ప్రయాణం ఆగిపోతుంది. ఆ అనౌన్సర్ గొంతూ దూరమవుతుంది.. అన్న ఆలోచన రాగానే నెమ్మదిగా ఆమెలో దిగులు మొదలవుతుంది. ఇన్ని ఉత్తరాలు రాస్తున్నా.. ఒక్కదానికీ జవాబివ్వడేంటీ అన్న బాధ మనసును మెలిపెడుతూంటుంది. చూడాలి.. కలవాలి.. అడగాలి అసలు తన జాబులు అందుతున్నాయా? లేదా? చదువుతున్నాడా?చించేస్తున్నాడా? అనే సందేహం.. సంఘర్షణ, అంతర్మథనం ఆమెను నిద్రపోనివ్వవు. ఏది ఏమైనా అతనిని చూడాలి.. కలిసి మాట్లాడాలి.. తన ఉత్తరాల గురించి అడగాలి అని ఒకరోజు ఆ స్టేషన్‌లోని అనౌన్స్మెంట్ గదికి వెళ్తుంది. అక్కడ ఎవరూ ఉండరు. మళ్లీ తెల్లవారి.. అతను తనను కలవలేకపోయినందుకు నొచ్చుకున్నట్టు.. ‘‘ఇన్నేళ్లు ఎప్పుడూ నన్ను చూడాలనిపించలేదా? లేక లేక నేను లీవ్ పెట్టిన రోజే నన్ను కలవాలనిపించిందా’’ అని నిష్టూరమాడినట్టు.. సారీ చెప్పినట్టూ భ్రమ పడ్తుంది. అతనిని క్షమించేస్తుంది. కాని మనసులో మాత్రం ఇదేదో తేల్చుకోవాలనే నిశ్చయించుకుంటుంది. దీపావళి.. చెల్లెలు లాలి తీరు.. అక్క మీథీ మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం. గలగల మాట్లాడుతూ.. సరదాగా.. ఉంటుంది లాలీ. దీపావళి పండక్కి అక్కతో గడపడానికి ఊరొస్తుంది. అప్పుడు మీథీలోని అక్క బయటపడ్తుంది. చెల్లితో సరదాగా ఉంటుంది. మొదటిసారిగా అమ్మలా కాకుండా.. అక్కలాగా.. ఓ స్నేహితురాలిగా లాలీతో గడుపుతుంది. చెల్లెలి బాయ్‌ఫ్రెండ్ గురించి డిస్కస్ చేస్తుంది. అనౌన్సర్తో తన ప్రేమ వ్యవహారం చెప్తుంది. ఏదో ఒకటి తేల్చుకోమ్మని చెల్లెలూ సలహా ఇస్తుంది మీథీకి. కుదరకపోతే.. ఆ ఇల్లు అమ్మేసి.. తనతోపాటే బెంగళూరు వచ్చేయమని ఒత్తిడి తెస్తుంది. చెల్లెలు వెళ్లిపోయాక.. ఆ విషయాలన్నిటితో ఆ అనౌన్సర్కు ఉత్తరం రాస్తుంది. ఆ ఇంటికి, తనకు ఉన్న అనుబంధాన్ని, సెంటిమెంట్‌ను వివరిస్తుంది. ఇంటిని అమ్మలేని.. ఆ ఊరి వదిలి వెళ్లిపోలేని నిస్సహాయతను తెలుపుతుంది. అతని నుంచి జవాబు రాకపోతే చెల్లెలు ఇచ్చిన సలహానే పాటించాల్సి వస్తుందేమోననే భయాన్నీ వ్యక్తపరుస్తుంది. అయినా ఉత్తరం రాదు. చెల్లెలు వెళ్లిపోయాక ఒంటరితనం భరంగా అనిపించి.. ఓ కుక్కపిల్లను తెచ్చుకుంటుంది. తనతోపాటే దాన్ని ఆఫీస్‌కి తీసుకెళ్తుంది. ఆ రోజు.. స్టేషన్లో అనౌన్సర్ సంభాషణ వినిపించదు. అన్యమనస్కంగా ఉంటుంది మీథికి. కుక్కపిల్లను దువ్వుతూ ప్లాట్‌ఫారమ్ మీద కూర్చుంటుంది. అవతల ప్లాట్‌ఫారమ్ బెంచ్ మీద ఓ వ్యక్తి కనిపిస్తాడు. బ్యాగ్‌లోంచి ఏవో తీస్తూ. శ్రద్ధగా పరికిస్తుంది. ఎన్వలప్‌లు. ఉలిక్కిపడ్తుంది. అడ్రస్ కింద ఉన్న రంగురంగు పూల డిజైన్లను చూసి. తను వేసినవే.. ఒక్కసారిగా ఆనందం ఆమెలో. అంటే.. తన ఉత్తరాలందుతున్నాయి. చదువుకుంటున్నాడు. మనసు ఉప్పొంగుతుంది. వెళ్లి అతణ్ణి కలవాలని ఉద్యుక్తమవుతుండగానే.. ఇద్దరికీ మధ్య ఉన్న ట్రాక్ మీదకు ట్రైన్ వస్తుంది.. పోతుంది. అవతలి ప్లాట్‌ఫారమ్ మీద అతనుండడు. ఆ ట్రైన్లో వెళ్లిపోయాడని అనుకుంటుంది. తెల్లవారి కలవొచ్చు.. కలుస్తాడనే భరోసాతో మీథీ కుమారీ ఇంటికి బయలుదేరుతుంది. ప్లాట్‌ఫారమ్ మీద ఉత్తరాలు చదువుకుంటున్న వ్యక్తి పాత్రలో మహేష్ భట్ కనిపిస్తాడు. ఇదీ.. యువర్స్ ట్రూలీ కథ. దర్శకుడు సన్జోయ్ నాగ్. లంచ్‌బాక్స్, అపర్ణా సేన్ ‘36 చౌరంఘీ లేన్’ సినిమాలను పోలినట్టు కనిపించినా.. వాటికి భిన్నమైందే. మీథీ కుమార్ పాత్రలో సోనీ రాజ్దాన్ ఒదిగిపోయిందని చెప్పొచ్చు. – సరస్వతి రమ -
నూరు పదాల కథ
రచయిత జెఫ్రి ఆర్చర్‌ని న్యూయార్క్‌లోని ‘రీడర్స్ డైజెస్ట్’ సంపాదకుడు ఒక కథ రాయమని కోరాడు. రాయమని ఊరుకోలేదు. కథకు ఒక మొదలు, ఒక మధ్య భాగం, ఒక ముగింపు ఉండాలనీ; కథలోని పదాలు సరిగ్గా వంద ఉండాలి, 99 కానీ, 101 కానీ ఉండకూడదనీ షరతు విధించాడు. పైగా ఇరవై నాలుగు గంటల్లో ఇవ్వాలన్నాడు. జెఫ్రి ఆర్చర్ ఆ సవాల్‌ను స్వీకరించాడు. ఆ కథ ‘అపూర్వం’ (యూనిక్) దిగువ. దీన్ని సరిగ్గా నూరు పదాల్లోనే తెలుగులోకి అనువదించినవారు అనిల్ అట్లూరి. పారిస్, మార్చ్ 14, 1921 కేప్ ఆఫ్ గుడ్‌హోప్ తపాలా బిళ్ల అది. త్రికోణాకారంలో ఉంది. తపాలా బిళ్లల సేకరణ అతని సరదా వ్యాపకం. నోట్లో ఉన్న ఆరిపోయిన సీమపొగాకు చుట్టని మళ్ళీ అంటించుకుని, చేతిలోని భూతద్దంతో దాన్ని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించాడు. ‘నేను ఇదివరకే చెప్పాను. ఇవి రెండున్నాయని. కాబట్టి ఇదేమీ అపూర్వమైనది కాదు’ అన్నాడు డీలర్. అతను తపాలా బిళ్లలు కొని, అమ్ముతూ ఉంటాడు. ‘సరే. ఎంత?’ ‘పదివేల ఫ్రాంకులు.’ చెక్‌బుక్ తీసి పదివేలకి రాశాడు. నోట్లోని పొగాకు చుట్ట ఆరిపోయింది. బల్ల మీదున్న అగ్గిపెట్టెలోంచి, అగ్గిపుల్ల తీసి గీసాడు. ఎదురుగా ఉన్న ఆ తపాలా బిళ్లకి అంటించాడు. పొగలిడుతూ, మాడి మసైపోతున్న ఆ తపాలా బిళ్లని చూస్తూ, నిర్ఘాంతపోతూ నోరు వెళ్లబెట్టాడు డీలర్. చిరునవ్వు నవ్వుతూ, ‘మిత్రమా, చూడు. నువ్వు పొరబడ్డావు. ఇప్పుడు నా దగ్గిరున్నది అత్యంత అపూర్వమైనది,’ అన్నాడు అతను. -
ఆవు గర్సిందంట
ఆవు గర్సిందంట. ఏందీ..? ఆవు గర్సిందా? మందు దాగినోనికి ఆవేదో కుక్కేదో అర్తమైండదులే లేకంటే ఆవు గర్సేందేందీ... కలికాలం గాకంటే ఆవు గర్సుడేం ఏ పొద్దయినా సూచ్చిమా?... బెమ్మంగారాపొద్దే జెప్పినారు. గోవులు పూలులైతాయనీ... నక్కజిత్తులోడిని ఆవు గర్సిందంటా. (ఈ వ్యక్తి అసలు పేరేమిటో అందరూ మరిచిపోయారు.) మే ముఖం ఇటు దిప్పుకుని ఇంకొంచెం ముడుచుకో!... ఏమ్మా? అదో మళ్లీ వాడొచ్చినాడే ముందు ఒకరోజు వచ్చి అయ్యతో మాట్లాడ్నాడు. మనందర్ని సూసినాడు. ఆ మరుసట్నాడు గౌరినీ, రాణినీ తీసుకుని బోయినాడు. వాళ్లింతదనకరాలా మళ్లీ ఒక రోజొచ్చినాడు. శివనీ రాజునీ తీసుకుని బోయినాడు. వాళ్లింతదనకరాలా. మళ్లీ ఒక రోజొచ్చినాడు. రాజునీ, కృష్ణనీ తీసుకునిబోయినాడు. వాళ్లూ ఇంటికి ఇన్నిరోజులైనా రానేలేదు. చెప్పింది అమ్మ. అమ్మ మాటలకి భయం వేసి అమ్మకు మరింత దగ్గరగా ముడుచుకున్నది దేవి. తనూ కళ్లు మూసుకుని వాళ్లేం మాట్లాడుకుంటారా? అని చెవ్వు ఆ వైపేసి ఉంచింది లక్ష్మి. ‘‘పొద్దన్నే ఇట్లొచ్చినావ్’’ అని జిత్తులోడిని అడిగాడు కృష్ణయ్య ‘‘ఏం ల్యాన్నా మీరెట్టుండారో సూడాలనిపించె’’ అన్నాడు జిత్తులోడు. ‘‘నాయ్నా అమ్మ టీయాకు పొట్లం దెమ్మన్యాది రెండ్రూ పాయ్లు గావాల’’ తండ్రి దగ్గరికి కొచ్చి చెయ్యి చాస్తూ అన్నది గిరిజ. ‘‘మీ యమ్మనే బోయి దీస్కరమ్మను. ఆ సాపు కాడ పన్లేని ఎదవనాయాల్లంతా కూసోనుంటారు. ఆడబిడ్డవి నువ్వేంటికి పోతావు’’ అంటూ చొక్కా జేబు లోంచి రెండ్రూపాయలు దీసిచ్చాడు. ‘ఈ దొంగ నాయాలు కోసరమనుకుంట ఈనికి టీగానీ ఏంటికి’ అనుకున్నాడు మనసులో. ‘‘అమ్మకు జొరమొచ్చినట్లుండాదంట. నన్నే బొమ్మన్యాది’’ అంటూ పావడ కొంచెం పైకి పట్టుకుని పరిగెత్తింది గిరిజ వీధిలోకి. ‘‘ఏంది కిట్టన్నా నీ కూతురు గురించి ఏం బెంగ బెట్కోగాకు బంగారట్ట బిడ్డ. మాంచి కోయేటి సంవందం దీస్కస్తా నేను’’ అన్నాడు హామీ ఇస్తున్నట్లు జిత్తులోడు. ఇంతకీ ఏం పనిమీద అది జెపబ్బీ... నిలదీసినాడు క్రిష్ణయ్య. ‘‘అదేంల్యా నీకు ఈతూరి గానీ బోర్ల నీల్ల బన్నేలా అప పుట్టబెట్టినట్టు బెరుగుతాంది. మొన్న నువ్వంపిన ఆవులకు వొళ్లిచ్చిన దుడ్డు వొడ్డీకీ జరిపాయె. అక్కకేమో ఆరోగ్గెం బాల్యాకపాయె. సిటీ ఆస్పత్తిర్ల తట్టు బోయినావనుకో లచ్చెలకు లచ్చలు నువ్వ్యాడదట్కుంటావా అనుకుంటి. పాపం కిట్టయ్యన్నకు ఇన్ని కట్టాలు ఒకేతూరి జుట్కున్న్యే అని మనసులో బాదనిపించి పలకరించి పోదావని ఓతూరి.. ఇట్లోస్తిని’’ జాలి కురిపించాడు జిత్తులోడు. ‘‘ఆ యావు మా ఆడ్ది పుట్టింటి కాడ్నించి దోడ్కోని వొచ్చినాది. పానం కన్నా జాచ్చిగ జూస్కుంటాది. ఇంగెపుడూ నన్నాశె బెట్టేకి సూడగాకు. వోట్ని నీతో అంపీను’’ అన్నాడు కిట్టయ్య జిత్తులోడిని చదివినట్లు. ‘‘ఎంత మాటన్యావన్నా... నాకేంటికన్నా నీకట్టం నాదన్కోని ఏదో సాయపడ్డామనుకోని ఆ బేరం దీస్కచ్చి గాను గానీ నీకిట్టం లాకంటే నాకేంటికి ఇదంతా’’ అన్నాడు జిత్తులోడు. ‘‘నాకు ఆ పొద్దూ ఇట్టమయ్యి ఒప్కోలా. నా కన్నా నా బిడ్డకన్న ముందే నా సిన్నపుటాల్నించి ఆయావులున్నాయి మా ఇంట్లో. వాట్తో ఆడ్తా పాడ్తా పెరిగినా. అట్టాటి గోవులన్నిటిని పెద్దాయమ్మి పెండ్లి జేసేకి, రమేసుగాడు కోయేటు బోయేకని గొడ్లుగోసే వోల్లకి అమ్మితి. నా పాపం వుర్దా బోతాదా? అందుకే ఆ దేముడు నా ఇంటి దానికి పెద్దోల్లకొచ్చే యాదినిచ్చినాడు కిడ్డినీల జబ్బని. ఎంత దుడ్డుబోసినా తగ్గేది గాదంట’’ గొంతు వణుకుతోంది క్రిష్ణయ్యకు పశ్చాత్తాపం బాధ రెండూ కలిసిన గొంతు. ‘‘పశువులుగా పుట్నా మనం సాకి సంతరించిన దానికి అయిన వాటి రునం దీర్సుకున్యాయనుకోవాల గానీ ఇట్ల ఇచ్చారం బడ్తారా ఎపురైనా? సర్లె సర్లె సూడు ఈటిని కాపాడుకునే ఇదానం, నీ సిన్నబిడ్డకి పెళ్లి జేసే ఇదానం. వొస్తా’’ అంటూ లేచాడు. ఆ మాటల్లో ఏదో హెచ్చరిక వినిపించింది క్రిష్ణయ్యకు. ఎన్నో బతుకులు ఎన్నో విధాలుగా తెల్లార్తున్నట్లే భళ్లున తెల్లారింది. ‘‘ఒరేయ్ నీ... యమ్మ ఎన్ని సోట్ల సెయ్యి సాపితినిరా నిన్ను కోయేటు బంపేకి సోంబేర్నాయాలా ఇమానం సార్జీలు గుడముట్టకుండానే తిరక్కొచ్చివే ఏమన్నాయం జేస్నాం రా. నిన్ను కన్యందుకు మమ్మల ఇట్లుసురు బెడ్తండావూ’’ అంటూ కొడుకును అప్పటికే నాలుగేట్లు ఏస్తా ఆక్రోసిస్తున్న కృష్ణయ్యకు, కొడుకు రమేష్‌కు మధ్యన అడ్డుగా నిలబడింది మునెమ్మ. భర్తను ఆపే ప్రయత్నం చేస్తూ కన్నీళ్లు తుడుచుకోలేక పోతోంది. ‘‘య్యో రొంతుండుయ్యా ఏంటికొచ్చనాడని గానీ అడక్కండానే సెయ్యెత్తితే ఎట్లయ్యా? నిదానంగా అడగాల’’ అంటూ మొగుని వెనక్కి తోస్తోంది. రమేష్ కన్నీళ్లు జబ్బతో తుడుచుకుంటూ... ‘‘నాగ్గానీ పనీపాట లాకండా ఈడ తినేసి కూచోనేది ఇట్టవా? ఏం జేయ్యాల సూడిట్ల’’ అంటూ చకచక షర్టు గబగబ ఇప్పి ఈపు సూపించినాడు. తట్టులు తేలినట్లు వాతలు ఈపంతా.మునెమ్మ అమ్మ మనసు అవిసిపాయె.ఓర్నాయినా అంటూ కొడుకుని రెండు చేతల్తో సుట్టేస్కోని గుండెకత్తుకొని బావురుమన్నది. కృష్ణయ్య మనసు పిండినట్లనిపించినాది. ‘‘అనా అనా ఏమైనాడన్నా సెపనా’’ అంటూ గిరిజ రమేశ చెయ్యి పట్కోని ఊపి ఊపి అడుగుతుంది. ‘‘నన్ను దోడ్కోని బోయి ఓ సేటు కాడ పని సూపించి ఆ బుడాను ఎల్లబారిపోయినాడు. దీనార్లిస్తారు తిండి గిండీ బా.... బెట్తారు అని సెప్పి పాయె. ఆ సేటు సెప్పేదేందో నేనర్తం జేసుకోని పన్జేసే లోపట చాలకోలతో తోలూడగొడ్తాడు. కర్జూర సెట్లు నాటమంటాడు ఆ ఇసికలో తవ్వేకిగాదు. లేటయితే సావగొడ్తాడు. ఆడ నా మాదిరి పనేజేసేకి అరమోల్లు, కేర్లా ఓల్లు మనోల్లు ఓ ముప్ఫై మంది దనక ఉన్యారు. పని చానా కష్టమని చెప్పినారు. నిజంగా చానా కష్టంమ్మా... సెపలేస్కుంటే గబగబ నడ్సేకి గాదు వొదిలేస్నామా అరికాల్లు బొబ్బలెగర్తాయి. నన్నొదిలిపోయిన బుడాను అజా పజా లేదు. ఒకరోజు వొచ్చినాడు. ఆ పొద్దు నాకు దీనార్లిచ్చే దినమంట. నాకు దెల్దు బుడాన్ వచ్చి సగమెత్కోని సగం నాకిచ్చినాడు. అన్నా ఈ కష్టం పల్లేనని కాల్లబడి ఏడ్చినా. ఏం లాబంల్యా. రంజాను పండగొచ్చినా పొద్దు అడుగు వాల్లే ఛేంజి జేస్తారు. ఇంగేం చెయిలేం అని ఎల్లబారిపాయె. జొరమొచ్చినాది. ఆకలి సేత దుడ్డుల్యా. నా బాద సూల్లేక నాతో పనిజేసే తెలుగోల్లు వాల్లకి తెలిసిన దారిలో దుడ్లేస్కోని నన్ను ఊరికి అంపిచ్చిరి’’ ఏడుస్తా ఏడుస్తా తన బాదెల్లబోస్కోని దీనంగ నాయినతట్టు జూసినాడు రమేష్. కృష్ణయ్య కొడుకు బాదకు కరిగి ఓదారుస్తామని దగ్గరగా వస్తాంటే మల్లీ కొడ్తాడనుకోని చేతులడ్డం బెట్కోని ఎనక్కి వంగుతా బయం బయంగా సూస్తాన్య రమేష్‌ను జూసేతలికి కృష్ణయ్య కడుపు తరక్కపాయె. కొడుకు ఈపున చెయ్యేసి నిమిరి తలమీంద సెయ్యి పెట్కోని గుంజానుకుని కూలబడ్నాడు. రేయ్ నేనేం రాచ్చెసున్ని గాదురానీ అయ్యను. పానాల్తో నువ్ తిరుక్కోని వొచ్చిందే నాకు జాచ్చి. ఈడ్నే ఏ కాయో కసురో అమ్ముకుంటూ బతొకొచ్చు లేనాయ్నా’’ అన్నాడు రమేష్‌ను జూస్తూ.అందరూ తమను తాము ఓదార్చుకుంటూ కూలబడ్నారు. ఎవరి ఆలోచనలకూ అంతు దొరకడంల్యా. మునెమ్మ తేరుకోని లేసింది... ఉప్పిండి జేసి ఏడిగా తలారొంత బిడ్లకూ మొగునికీ పెట్దామనుకుంటూ. జిత్తులోడు ఆ ఊర్ల అన్ని యాపారాలకు, యవ్వారాలకు దలారి. పశువుల్ని సంతకి తోలిపీటం కబేలాలకంపించేకి రైతులను ఒప్పించటంలో అతనికి తిరుగులేదు. ఏ రైతుకి ఎంత అపలున్నాయో ఏ అప తీర్చుకునేకి పానాలైనా తాకట్టు బెడ్తారో కనిపెడ్తా ఉంటాడు. పొలాలైతే ఆ ఊరి సర్పంచుకే తాకట్టు బెట్టేలాగా ఆవుల గేదెలనైతే బెంగుళూరు కబేలాకే పంపించేలాగా ఏర్పాటు చేసేస్తాడు. ఈ మధ్యనే మరో అవతారం ఎత్తాడు. అరబ్బు షేకు పెళ్లి కొడుకులకి అమ్మాయిలను కుదిరించటం. రెండు చేతులా సంపాదన. పేరుకు బస్టాండులో ఓ టీ, సిగరెట్ల అంగిడి. అది అడ్డా అతనికి. ఊర్లో ఉండే తిరప్తి, రొంత దూరమున్న బెంగులూరు సిటీల్లో ఏదైనా ఆస్పత్రితో కలిసి రైతుల కిడ్నీలు అమ్మేదానికి కాంట్రాక్టు ఇప్పించుకుంటే లైఫ్ సెటిలైపోతాదనే దురమార్గపు ఆలోసెనలో ఉండాడు. తన వృత్తిలో బాగంగానే కృష్ణయ్య కొడుకును కోయేటు బోయేమాదిరి రెచ్చగొట్టినాడు ఆవుల్ని అమ్మించినాడు. ఇంగో సంవత్సరం అట్టుంటే గిరిజను ఏ సేటు నా ఇచ్చి పెల్లి జేపిస్తే కోట్లు వొస్తాయి అనుకుంటున్నాడు. ఆ పనిమీదే పనున్యా లేకున్యా కృష్ణయ్య ఇంటికి వొస్తా పోతా వాల్ల కష్టాలకు బాగా సాయపడేవోని మాదిరి నకరాలు బడ్తాండాడు. కృష్ణయ్యకు అతని తీరు అర్తమైపోయింది. ఐనా సెడ్డోనితో స్నేగితం, ఇరోదం రెండూ సెబ్బరే అనుకోని జాగర్తగా మసలు కుంటాన్నాడు. గిరిజ దొడ్లేకి పరిగిత్తాబోయి గడ్డి పరకలు రోన్ని తీస్కోనొచ్చి లచ్చి ముందట ఉంచి కొన్ని దేవి ముందట పడేసి దేవీ తిను లచ్చీ తిను. అన్నొచ్చినాడు అమ్మ ఉప్మాసేస్తాంది మేం అందరం తింటాం. మీరుగానీ దినండి అంటూ దేవి గంగడోలు నిమరసాగింది. ఇంగ రమేసన్న మనల ఇడ్సి యాడికీ బోడంట. పాపం ఆదేశంలో అన్నకు బువ్వగానీ బెట్లేదంట చాకోల దీస్కోని కొట్నారంట ఈపంతవాతలు దేల్నాయి లచ్మీ... పాపం జొరవంట. ఈడికొస్తే నాయిన గొట్నాడు మల్లీ దగ్గర దీశ్నాడు లే... అంటూ చెపుతున్న గిరిజన వంక పెద్ద కళ్లతో ప్రేమగా చూస్తూ ఆపాప చేతి ప్రేమ నిండిన స్పర్శను అనుభవిస్తూ ఆనందిస్తున్నట్లు రెండు చెవులూ వెడల్పు జేసి శ్రద్ధగా ఆలకిస్తున్నాయి దేవి, లక్ష్మిలు. నిష్కల్మషమ ఐన గోవులకు నిర్మలమైన ఆ పసిపిల్లకు అనుబంధం అపురూపమైనది మరి. గిరిజ చేతిద్వారా ప్రసరించే నిష్కల్మష ప్రేమ మరింత కావాలన్నట్లూ కళ్లు అరయోడ్పు చేసి మెడ సాచింది దేవి. ఇంతలో రమేష్ అక్కడికి వచ్చి ఏమ్మే బావున్నాయా నీ ప్రెండ్సు అంటు చెల్లి తలపై తట్టాడు. లచ్మిని, దేవిని గుడ పలకరించు అన్నది. గిరిజ యోరసాచి నిమరమన్నట్లు నిలుచున్న లక్ష్మిని మెడవద్ద నిమురుతూ ఒక్కుదుటన రెండు చేతుల దాన్ని కావలించుకుని నన్ను సెమించు లచ్చిమీ. ఆ పొద్దు గిరిగాని మాదిరి ఓయేటుబోయి దుడ్డు దీస్కచ్చుకోని పెద్దబండింగారు సైను ఏస్కోని ఊర్ల దిరగొచ్చుననుకోని గంగ శివ గౌరి రాజ అన్నిటి ఆ జిత్తులోడి పాలుజేసినా. వోట్ని బెంగులూరు దోడ్కబోయి కూరకు అమ్ముతారని నిజ్జంగ దెల్లా. ఆ ఉసురుదగిలి తిరక్కోనొచ్చినా అన్నాడు. ఏదో అర్థమైనట్లు మెళ్లో గంట గలగల్లాడేలా తల ఊపింది లచ్చ్మి. మే గిరిజా రమేశా రండి నాయినా అంటూ మునెమ్మ పిలుపుతో ఈలోకానికి వచ్చినట్లు ఇంటిలోకి నడిచారు ఆ అన్నా చెల్లెళ్లు. కొక్కరొక్కో.... కొక్కోరొక్కో.... అంటూ లోకాన్ని నిద్రలేపాయి పల్లె పుంజులు. యాపపుల్లతో పల్లు తోముతా ఏరా యాడన్నా మేచ్చిరి పనికిబోతావా మీ మామతో జెప్పేదా తుపుక్కున పక్కనే అరటి పాదులో ఉంచుతూ... అడిగాడు కృష్ణయ్య. బ్రెష్‌తో పళ్లు తోముతా బంతి చామంతి మొక్కల కాడ బండమీంద కూచోనున్న రమేష్‌ను ఆ నాయ్నా నా ప్రెండు రాంక్రిష్ణ టౌనుకు రమ్మన్యాడు. మన్నాడు ఆడ ఐటీఐ మాదిర ట్రైనింగు ఇచ్చి జాబిచ్చేటిది కంపెనీ ఉండాదంట. మన్నాడు మంచి రోజని ఆపొద్దు రమ్మన్యాడులే. రేపు ఓ తూరిబోయి మంచి చెడ్డా ఇచురించుకుంటూ అన్నాడు రమేష్.స్టీలు సెంబు సిల్లర గిరిజ చాతబెట్టి పో అన్నకి నాయినకీ టీ దీస్కరా పో అంటూన్న. మునెమ్మ వాల్ల మాటలిని ఫ్చ్ వోణ్ణి నాల్రోజులు రెట్టెత్కోనిచ్చే ఏం బోతాంది అని గట్టిగా అంటే మగడు బాద పడ్తాడని స్వగతంలో గొణుక్కోని సరిపెట్టింది. ఆ పొద్దే బుద్దిగా సదూకోని టీచిరు టేనింగుకు బోయింటే అన్నాడు కృష్ణయ్య. ‘‘లేల్లే నాయినా ఈతూరి ఈడ్నే మంచి పని జూసుకుంటూ నీకేం కట్టం రానీన్లే’’ అన్నాడు హామీ ఇస్తున్నట్లు ధీమాగా రమేష్. చెంబుపై కాగితం మూతబెట్కోని వేడి టీ దీస్కచ్చిన గిరిజ అనా టీ దాదూరా... అన్నది. అబ్బ అన్నంటే ఏం పానం బెడ్తావ్ మే అంటే కూతురి ఈపన తట్టి కృష్ణ లోనికి నడిచాడు. లోనికెల్లి అప్పటికే అమ్మ సిద్ధంగా బెట్న లోటాల్లో టీ బోసి అన్న కోకిటి నాయిన కోకిటి జాగర్తగా అందిచ్చినాది గిరిజ. తన టీలో రొంత ఇంగో లోటాలో ఒంపి చెల్లె కిచ్చినాడు రమేశ. తన టీలో రొంత ఒంపి భార్యకు అందించినాడు కృష్ణయ్య. మన్నాడు వొద్దూ పొద్దన్నే ఐదూ ఐదున్నర మద్దెన నిద్దర్లేసి బీడి ముట్టించుకోని సెంబు దీస్కోని మడి తట్టుబోదామని ఈదిలోకి వొచ్చిన కృష్ణయ్యకు అందరూ అడావుడిగా పరుగెత్తుతాండేది ఔపడ్నాది. రే.. బక్కోడా ఏమైందిరా.. జవాబు చెప్పకుండా పరిగెత్తాడు అతను. గుంపుగా వెళుతున్న కొందరిని ఆపి ఏందీ ఈరన్న ఏంటికంతా ఆడావడి పడుతున్నారు అని అడిగాడు. ఆ జిత్తులోడ్ని ఆవు కర్సినాదంటన్నా అని జవాబు చెప్పి వెళుతున్నారు. బుర్ర గోకున్నాడు కృష్ణయ్య. ఆవేమైనా కుక్కా? కన్సనేకి అనుకున్నాడు. టీకొట్టు రమణను చూసి ఏంది రమణ ఆవు కర్సిందంటన్నారు అన్నాడు సందేహంగా. ఔ మామ. ఆ జిత్తులోడు ఊళ్లో ఆవులన్నింటినీ కబేరాలంకి కోటీశ్పరుడౌదామనుకున్నాడా. గోమాతకు బాగా కోపమొచ్చెనో ఏమో. పెరిగిపెట్నాదంట జవాబు చెప్పాడు రమణ. అటు వెళ్తున్న ఒకడు ఔ యో కండలూడొచ్చేల పీకింది చూసొచ్చినా అన్నాడు. ఇంతకు జిత్తులోడు ఏమన్నాడు మళ్ళీ రమణను అడిగాడు కృష్ణయ్య. టౌనాస్పత్రికి తోడుకు పోను వ్యాను కోసం చూస్తాండారు బట్టాండుకాడ అని చెప్పి రమణ కూడా అనే వెళ్లాడు. కృష్ణయ్య కూడా అటు వెళ్ళే లోగా గిరిజ పరిగెత్తుకుంటూ వచ్చి నాయినా లచ్చిమొచ్చింది లోపలికి రా లోపలికి రా అంటూ కృష్ణయ్య లాగడానికి ప్రయత్నిస్తోంది. యాడ్నించొచ్చిందిమే నాకేమర్థంకావడం లే అన్నాడు కృష్ణయ్య. నానా కూతుళ్ళు ఇంట్లోకెళ్ళంగానే తలుపులు మూసి నాయన్ని గట్టుమీద కూచోమన్నట్టు చూపించింది గిరిజ. ఏందీమే అన్నాడు కృష్ణయ్య. నోటిదిగ్గర చేయిపెట్టుకుని రహస్యం చెబుతున్నట్లు నాయినా రేత్రి అమ్మ నువ్వు పడుకున్నాక నాకు ఒంటికొచ్చాంటే జల్దాట్లోకి పోదామని లేస్తి. కిటికిలోంచి సూస్తే ఆ జిత్తులోడు మన లచ్చిని, దేవిని ఈడ్చకపోతున్నాడు. మూతికి గుడ్డలు కట్టేస్నాడు. అరిసేకి చేతగాలా. పాపం లచ్చిమి, దేవి తనకలాడతండాయ్. అయినా లాక్కపోతున్నాడు. నేను అన్నని నిద్దర్లేపినా. ఇద్దురుమూ కాన్రాకుండా దాక్కుని ఆనెంట పోయినాం. ఆడ ఒక యానుండాది. దానుండుకూ ఆవులు, దూడలుండాయి. లచ్చిమిని, దేవిని కూడా సెక్కేసి దాంట్లోకెక్కిచ్చినాడు. ఆ డేవర్ని లేపినాడు. ఓడు తాగి పడుకున్నాడేమో మూడుగంట్లకు పోతా పోరా అని మల్లా పడుకున్నాడు. రెండు గంట్లకు లేప్తారో అని చెప్పి జిత్తులోడు పనుకున్నాడు. మేం రూంచేపటికి వాల్లు బాగా నిద్రపోనాక సపుడు రాకుండా యాను తలుపూడబెరికినాము. సెక్కేసి అన్నావులను దింపినాము. అన్నింటికి మూతులు కట్టేసుండాయ్. అర్సకుండా వాటిల్లకవి పరిగెత్తినాయ్. ఒక్క ఆవు మాత్రం పనుకోనున్న జిత్తులోడికాడికి పోయ్ కడుపు పట్కోని కరిసేసింది. అది మన లచ్చిమే. చిన్న రహస్యంగా అన్నది ఆ మాట! మన్నాడు వొద్దూ పొద్దన్నే ఐదూ ఐదున్నర మద్దెన నిద్దర్లేసి బీడి ముట్టించుకోని సెంబు దీస్కోని మడి తట్టుబోదామని ఈదిలోకి వొచ్చిన కృష్ణయ్యకు అందరూ అడావుడిగా పరుగెత్తుతాండేది ఔపడ్నాది. రే.. బక్కోడా ఏమైందిరా.. జవాబు చెప్పకుండా పరిగెత్తాడు అతను. -
రాక్షసనీడ
నాలుగు రోజులుగా పెరిగిన గడ్డాన్ని అద్దంలో చూసుకుంటూ ఓసారి చేత్తో సుతారంగా నిమురుకున్నాడు విశ్వం. చుబుకం దగ్గర రెండు వెంట్రుకలు తెల్లగా తళుక్కున మెరిసేసరికి ఉలిక్కిపడ్డట్టు చూసుకున్నాడు. ‘ముప్పయి నాలుగేళ్లు దాటకనే తన గెడ్డం నెరిసిపోతోంది! అంటే... నిరుద్యోగిగానే తన బతుకు పండిపోతోందన్నమాట!’... అలా అనుకోగానే అతని మొహంలో నిరాశ చీకట్లు ఆవరించాయి. చూపుల్లో దిగులు స్పష్టంగా కనబడి తనమీద తనకే ఎక్కడ లేని జాలీ పుట్టుకొచ్చింది.‘‘అన్నయ్యా... నీ షర్టు గుండీ కుట్టమన్నావ్... ఏదీ - ఇవ్వు మరి’’ అంది రాధ.‘‘అదిగో... కుర్చీమీద వేశాను చూడమ్మా- షర్టు జేబులోనే ఉంది గుండీ!’’ రెండు నిముషాల్లో షర్ట్‌కు గుండీ కుట్టేసింది రాధ. ‘‘నాన్న వెళ్లమన్నచోటికి తొందరగా వెళ్లిరా అన్నయ్యా. నిద్ర లేస్తూనే వెళ్లలేదేమని అడుగుతాడు. నువ్వింకా వెళ్లలేదని చెబితే బాధపడతాడు’’ అంది రాధ షర్టును విశ్వంకు అందిస్తూ. ‘‘సర్లే... వెళ్లక ఏంజేస్తాను!’’ కాస్త విసుగ్గానే అన్నాడు విశ్వం.‘‘ఎందుకురా అంత విసుగూ! ఆరు నెలలకో, సంవత్సరానికో ఓ పని చెబుతారు మీ నాన్న. అది కూడా చేయలేవా?’’ అంది జానకమ్మ - కిరోసిన్ స్టవ్‌ని శుభ్రపరుస్తూ. ‘‘ఊ... ఎందుకు చేయనూ. కాస్త మెల్లగా మాట్లాడండి. తల్లీ కూతుళ్లిద్దరివీ ఇంతింత లావు గొంతులు. మీ మాటలకి నాన్న లేచినా లేస్తాడు’’ అన్నాడు విశ్వం - పక్క గదిలో పడుకుని ఉన్న వాళ్ల నాన్న వేపు ఓసారి అనుమానంగా చూస్తూ. గాఢనిద్రలో వున్నాడు ఆయన. చిన్నప్పటినుంచి విశ్వానికి ఒక భయం ఉంది - దాన్ని భయం అనడం కన్నా ఆందోళన అనడం సబబేమో! నిద్రపోతూ ఉన్న తండ్రిని ఎందుకో ఒక్కోసారి జాగ్రత్తగా గమనించేవాడు విశ్వం. వాళ్ల నాన్న నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడేమోనని అనుమానం. అలా అతనికి ఎందుకనిపిస్తుందో తెలీదు. గాఢనిద్రలో ఉన్న మనిషికి ఒక్కోసారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తేలిగ్గా వుంటాయి. అప్పుడసలు ఊపిరాడుతోందా లేదా - అని ఎవరికైనా అనుమానం వస్తుంది. అదే సందేహం అతనికీనూ. అలా ఆందోళనపడి కాసేపు కంపించిపోతాడు. మరికాసేపు తదేకంగా గమనించి ఊపిరి ఆడుతున్నట్టు ఎద ఎగసిపడుతోంటే తన ఆందోళన పోగొట్టుకుంటాడు. తన తండ్రి పోతే ఇంకేమైనా వుందా... తన సంసారం నడి సముద్రంలో నావలా మునిగినట్టే అనిపించేదతనికి. ‘‘ఎందుకలా నాన్న వేపు చూస్తున్నావన్నయ్యా?’’ అంది రాధ. ‘‘ఏమీ లేదమ్మా. నాన్న మేలుకొని ఉన్నాడేమోనని’’ అంటూ గొణిగాడు విశ్వం. ‘‘ఒంట్లో బాగోలేదుగా. ట్యాబ్లెట్లు వేసుకుని పడుకున్నాడు. అప్పుడే ఎలా మేలుకుంటాడు?’’ అంది రాధ. విశ్వం అద్దంలో తన డ్రెస్‌నీ, మొహాన్నీ ఓసారి చూసుకొని వీధిలోకి వెళ్లిపోయాడు. అసహనంగా అడుగులు వేస్తున్నాడు విశ్వం. అతని అసహనానికి కారణం - ఆ రోజు ఉదయం వాళ్ల నాన్న... రాఘవయ్యగారి దగ్గర ఐదు వందలు అప్పు తీసుకురమ్మని చెప్పటమే. ఏ పని చేయడానికైనా మహదానందంగా ఒప్పుకుంటాడు గాని, అప్పు తీసుకురమ్మంటే మాత్రం ఎంత ఇబ్బందిపడి పోతాడో చెప్పలేం. ఇలా అప్పు అడగడానికి వెళ్లడం అతనికిదేం మొదటిసారి కాదు కానీ, వెళ్లిన ప్రతిసారి - ఆ అప్పిచ్చేవాళ్ల పోజులూ, మాటలూ అతనికిష్టం వుండేవి కావు. అప్పు ఇచ్చేవాళ్లు కావాలనే అలా మాట్లాడతారో లేక తనే ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌తో అలా ఊహించుకుంటాడో విశ్వానికి అర్థం అయ్యేది కాదు. ‘‘అప్పు చేయకుండా బతకడానికి వీలు కాదా?’’ అన్న ప్రశ్నకు జవాబు - నాన్నే... అవును... అప్పు చేయకుండా ఎలా వుండగలరు! సత్యకాలం మనిషిలా ఆఫీసుల్లో లంచాలు తీసుకోకుండా... ప్రమోషన్ లేకుండా... ఇరవై ఏడేళ్లుగా గుమాస్తాగా బతుకీడుస్తూ అయిదుగురు సంతానంతో ఎవరుంటారు అప్పు చేయకుండా! ఆఖరికి అక్కయ్య పెళ్లి కూడా అప్పుతోనే చేశాడు నాన్న. - ఇలా ఆలోచిస్తూనే రాఘవయ్య ఇంటి ముందుకొచ్చేశాడు విశ్వం. ‘‘మా నాన్న మిమ్మల్ని డబ్బడిగాడట గదండీ!’’ అంటూ గొణిగాడు విశ్వం గుమ్మం దగ్గరే నిలబడి.‘‘అవును - అడిగాడు... ఈ వేళకే వచ్చేశావా? నేనింకా బ్యాంక్‌కి వెళ్లందే? పరమేశ్వరయ్య పెద్దబ్బాయివి కదా నువ్వు. ఏ ఉద్యోగం చేస్తున్నావు?’’ గుమ్మంకవతలనే నిలబడి అన్నాడు రాఘవయ్య. ‘‘ఇంకా ఏం లేదండీ?’’ ‘‘ఈ వయసొచ్చినా నిన్ను కూచోబెట్టి సాకుతున్నాడన్నమాట మీ నాన్న. మావాడు నీకంటే పదేళ్లు చిన్నవాడేమో! అయినా చక్కగా వ్యాపారం చేసి నెలకు రెండు వేలు సంపాదిస్తున్నాడు. మనకూ కొంచెం పట్టుదల ఉండాలయ్యా. తండ్రి సంపాయించి పెడుతాడులే హాయిగా తినేద్దాం అనుకుంటే ఎలా?’’ ఒక్కసారి విశ్వానికి రోషం ముంచుకొచ్చింది. ‘‘డబ్బుంటే ఇవ్వండి. లేకపోతే లేదు. మా స్వంత విషయాల్లో మీ జోక్యం ఏమిటీ... ఉద్యోగం కోసం ఎన్ని తిప్పలు పడుతున్నానో మీకేం తెలుసు? ఊరికే నోటికొచ్చినట్టు వాగితే సరికాదు’’ అని నాలుగు దులిపేయాలనిపించింది. అలా దులిపేశాక అప్పు ఎలా ఇస్తాడు? తన కోపం నాన్నని ఇబ్బందుల్లో పడేస్తుంది. అందుకే కిమ్మనకుండా నిలుచున్నాడు విశ్వం. ‘‘ఏమిటయ్యా - అలా మాటాడకుండా నిలబడ్డావు. మీ అక్కయ్య పెళ్లికి ఇరవై వేలు అప్పు చేశాడటగా మీ నాన్న. నిన్న సాయంత్రం అన్నీ చెప్పాడులే! దానికి వడ్డీ కట్టేందుకేమో నా దగ్గర అప్పడిగాడు. నీకూ ఉద్యోగముంటే అతనికి కొంచెం భారం తగ్గి వుండేదని అన్నాడు. బీఏ చదివావటగా. ఈ కాలంలో ఎంఏలూ, పీహెచ్‌డీలూ చేసిన వాళ్లకే ఉద్యోగాలు రావటం లేదు. అదీ అదృష్టంలే. సరే కానీ... మరో గంట తర్వాత కనబడు. ఆలోగా బ్యాంక్‌కి వెళ్లి డబ్బు తీసుకుని వస్తాను’’ అంటూనే తలుపులేసుకున్నాడు రాఘవయ్య. గంగిరెద్దులా తల ఆడించేసి అలా వీధిలోకి మెల్లగా అడుగులేస్తూ బయల్దేరాడు విశ్వం. అడ్డమైన ప్రతివాడూ తనకి ఉద్యోగం లేదని ఏదో రకంగా అవమానిస్తూ మాట్లాడతాడు. ఏ మనిషికైనా నిరుద్యోగాన్ని మించిన శిక్ష ఉండదేమో! ‘‘ఒరేయ్ విశ్వం!’’ అన్న పిలుపు వినిపించే సరికి తల వంచుకుని నడుస్తున్నవాడల్లా తలెత్తి చూశాడు. ఎదురుగా శంకర్ నవ్వుతూ వున్నాడు బీఏలో విశ్వానికి క్లాస్మేట్ శంకర్. ‘‘ఏరా... ఏమిటంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్... ఎదురుగా వచ్చే మనుషుల్ని కూడా చూడకుండా’’ అన్నాడు శంకర్. ‘‘అబ్బే... ఏం ఆలోచించటం లేదురా!’’ అన్నాడు నవ్వుతూ విశ్వం. ‘‘నాకు వీడీవో ఉద్యోగం వచ్చిందోయ్. అంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసరు. మొన్న 86లో జరగలేదూ గ్రూప్ త్రీ ఎగ్జామ్. అది పాసయ్యాను’’... శంకర్ గొంతులో గొప్ప సంతోషంతో పాటు కాస్తంత గర్వం కూడా మిళితమై ఉంది.‘‘కంగ్రాచ్యులేషన్స్’’ అన్నాడు విశ్వం. నవ్వుతూ అనాలని అతని ఉద్దేశం. అయితే తనకు రాని ఆ ఉద్యోగం పెదాల మీదకు నవ్వుని రానివ్వలేదు. ‘‘థాంక్యూ! నువ్వూ నాతో పాటు రాశావుగా పరీక్ష. ఏమయ్యింది?’’ ‘‘ఏం కాలేదు. పాసైవుంటే నేనూ నీతో కంగ్రాచ్యులేషన్స్ చెప్పించుకునేవాణ్నిగా.’’ ‘‘అమ్మో... భలే జోకులేస్తావురోయ్. ఈ శుభ సందర్భంలో కాఫీ తాగుదాం పద.’’ మిత్రులిద్దరూ దగ్గర్లోని హోటల్లోకి వెళ్లి కూచున్నారు. ‘‘అసలు నాకీ ఉద్యోగం రాదనుకున్నారా! నీకో విషయం తెలుసా. వచ్చే నెలలో నాకు ముప్పయి నాలుగేళ్లు నిండిపోతాయి. అంటే గవర్నమెంటు ఉద్యోగాలకి వయసు దాటిపోయినట్టేగా. లక్కీగా ఈ ఉద్యోగం వచ్చింది.’’తనకూ ముప్పయి నాలుగేళ్లు మరో రెండు నెలల్లో నిండిపోతున్న విషయం గుర్తుకొచ్చి ఒళ్లంతా ఓసారి కంపించిపోయింది విశ్వంకు. కాఫీ తాగుతూ తను ప్రిలిమినరీ పరీక్ష ఎలా రాసిందీ... తర్వాతి పరీక్ష ఎలా రాసిందీ చెప్పుకుపోతున్నాడు శంకర్. విశ్వం ఎంతో ఇబ్బందిగా అతని వేపు చూస్తూ ‘‘ఊ’’ కొడుతున్నాడు యాంత్రికంగా. విశ్వానికి అతని మాటలు వినిపించినంత దూరంగా పారిపోవాలని వుంది. ‘‘ఈసారి పరీక్షలైనా బాగా రాయవోయ్. తల్లిదండ్రుల మీద ఇంకా ఆధారపడుతూ వుండటానికి మొహమాటంగా లేదూ?’’ తమాషాకి అన్నాడు శంకర్ విశ్వంతో తనకున్న చనువుతో.‘‘ఉద్యోగం వచ్చింది కదా అని నానా కూతలు కూయకురా శంకర్!’’ అన్నాడు విశ్వం కాస్త కోపంగానే. ‘‘అంత కోపం పనికిరాదు బ్రదర్! నేనేం నీకు జ్ఞానబోధ చేయడానికి రాలేదు. మీ నాన్న ఒక్కరేగా అర్నింగ్ మెంబరు. ఇంకా పెళ్లి కావాల్సిన చెల్లెళ్లున్నారు. అనకూడదు కానీ, మీ నాన్న కాస్తా ‘హరీ’మంటే మీ పరిస్థితెంత భయంకరమో ఆలోచించు’’ నింపాదిగా అన్నాడు శంకర్. ‘‘నోరు మూయరా వెధవా!’’ అంటూ గట్టిగా అరిచాడు విశ్వం. హోటల్లో అందరూ ఓసారి విశ్వం వేపు చూశారు. గభాల్న తలదించేసుకున్నాడు విశ్వం. విశ్వం ఎందుకంత గట్టిగా అరిచాడో అర్థం కాలేదు శంకర్‌కి. తన ‘సహజ ధోరణి’ విశ్వాన్ని నొప్పించిందని నమ్మలేకుండా వున్నాడు. ‘‘సారీరా విశ్వం!!’’ అంటూ కాఫీ బిల్లుని తీసుకుని లేచి నిలుచున్నాడు శంకర్.పొద్దు వాలిపోతోంది.వేప చెట్టుకు ఆనుకున్నవాడల్లా ఓసారి చుట్టూ కలయజూశాడు విశ్వం. చెట్టూ చేమలు తప్ప చుట్టుపక్కల ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. ఓ అరమైలు దూరంలో ఊరు కనిపిస్తోంది. ఉదయం నుంచి విశ్వంలో చెప్పలేనంత నిస్పృహ కలుగుతోంది. అతని మనసు ఏకాంతాన్ని కోరుకుంటోంది. అందువల్లే మిత్రుల్ని ఎవర్నీ కలవకుండా ఇలా ఊరి బయటకి వచ్చేశాడు. అతనికి అంత నిస్పృహ కలగడానికి కారణం - ఆ రోజు మార్చి ఎనిమిదో తేదీ అవడమే. అంటే ఆ రోజు తన పుట్టినరోజన్నమాట. తనకి ముప్పయి నాలుగేళ్లు నిండిపోతున్నాయి ఆ రోజుతో. తనిక ఏ గవర్నమెంటు ఉద్యోగానికీ దరఖాస్తు చేయడానికి పనికిరాడు. ఇన్నేళ్లు తనని పెంచి పెద్దచేసిన నాన్నకి - తన చెల్లెళ్లతో పాటు తనూ భారమైనాడే గాని ఉద్యోగం చేసి నాలుగురాళ్లు సంపాయించి కష్టాల ఊబిలో కూరుకుపోతున్న తండ్రిని ఆదుకోలేకపోయాడు. ఏదన్నా చిన్న ప్రైవేటు సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామా అంటే ప్రభుత్వ సంస్థల కంటే ఘోరంగా ఉన్నాయవి. అక్కడ మరీ పెద్ద పలుకుబడి వుండాలి. తనకు లేందల్లా అదీ, డబ్బే! ఏదయినా వ్యాపారం చేసుకుని బతకడం తనకి చేతకాదు. తను అవిటివాడు కాకున్నా - రిక్షా తొక్కో, కట్టెలు కొట్టో జీవించడానికి వీలుకాకుండా మానసికంగా అవిటితనాన్ని సంతరించిపెట్టింది మధ్యతరగతి మనస్తత్వం. తనమీద తనకే ఎనలేని జాలివేసి ఒక్కసారి బిగ్గరగా భోరున ఏడ్చేశాడు విశ్వం. తనకిక జీవితం లేదన్నది స్పష్టం! రెండు నిమిషాల తర్వాత సిగరెట్ తాగాలనిపించిందతనికి. సగం కాల్చి మళ్లీ తాగాలని వుంచుకున్న సిగరెట్టుని వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె కోసం వెదికాడు. అంతకు క్రితమే చివరి అగ్గిపుల్లని వెలిగించి ఖాళీ డొక్కును దూరంగా విసిరేసినట్టు గుర్తుకొచ్చి, నిరుత్సాహపడిపోయాడు. ఎద్దుల మెడలోని గంటల శబ్దం వినిపించినట్టయి లేచి చూశాడు విశ్వం. కొద్దిదూరంలో జోడెద్దుల బండి ఊరిలోంచి వస్తోంది. బండి తోలేవాడి దగ్గరయినా సిగరెట్టును వెలిగించుకోవచ్చు కదా అని సగం కాలిన సిగరెట్టుతో బండి వేపు కదిలాడు విశ్వం. ‘అగ్గిపెట్టె కావాలి’ అన్నట్టు సంజ్ఞ చేశాడు బండి మనిషికి దూరం నుంచే. బండి మనిషి ఎద్దుల్ని పగ్గాలతో బిగబట్టి బండి నిలిపేశాడు. దగ్గరకెళ్లాక బండి తోలుతున్న మనిషిని చూసి ఉలిక్కిపడ్డాడు విశ్వం. అతను ఎవరో కాదు - ప్రతిరోజూ వాళ్లింటికి పాలు తెచ్చే సుబ్బయ్యే! గోచి పంచె, ముతక రకం చొక్కా వేసుకొని వున్నాడు. అతని వెనకాల ఒక ఆడమనిషి కునికిపాట్లు పడుతోంది. ఆమె అతని భార్య కాబోలు అనుకున్నాడు విశ్వం.సుబ్బయ్య అగ్గిపెట్టె తీసి ఇస్తూనే అన్నాడు.‘‘ఇదేంది సామీ నువ్వీడున్నావు. నీకు తెలిసినట్టు లేదే అసలిసయం... ఆడ మీ నాయనకు..’’ అని చెబుతుండగానే... ‘‘ఏమయిందీ?’’ అన్నాడు అగ్గిపెట్టెని అందుకుంటూ. ‘‘మధ్యాహ్నం... పెద్దాసుపత్రిలో... మీ నాయనకి గుండెనొప్పి వచ్చిందని చేర్పించినారు. నేను పలకరించేలోపు కన్ను మూసినాడు. నువ్వు కొడుకువి కదా. చచ్చేటప్పుడయినా దగ్గరుండొద్దా. అగ్గిపెట్టె కోసరం నువ్వొచ్చిందే మంచిదయింది. లేకపోతే నీకిప్పుడే ఈ వార్త తెలిసేది కాదు కదా! తొందరగా ఎళ్లు సామీ!’’ అంటూనే అగ్గిపెట్టె కోసం ఎదురు చూడకుండా ఎద్దుల్ని అదిలించాడు. బండి ముందుకు సాగిపోయింది.చేష్టలుడిగి వింటున్నవాడల్లా ఒక్కసారి తల విదిలించుకున్నాడు. చేతిలో సగం కాలిన సిగరెట్టూ, అగ్గిపెట్టె ఎప్పుడు జారిపోయాయో. పరిగెత్తబోయి బోర్లాపడ్డాడు విశ్వం. మెల్లగా లేచి నడక సాగించాడు.నాన్న... తన నాన్న చనిపోయాడు.. తనని కన్న నాన్న, పెంచిన నాన్న, ప్రేమించిన నాన్న... చనిపోయాడు. ఒక్క అరగంట ఆలస్యంగా ఇంటికి పోతే తను ఏమై పోయాడోనని బెంగపెట్టుకునే నాన్న తనకిక లేడు. జీవన పోరాటంలో... ఎదిగిన కొడుకు కనీస సహాయం చేయలేకపోయినా ఒక్కడే పోరాడి పోరాడి అలసి సొలసిన నాన్న శాశ్వత నిద్రపోయాడు.‘‘నాన్నా!!!’’ అంటూ ఒక్కసారి వెర్రికేక పెట్టాడు విశ్వం. దిక్కులు సమాధానమివ్వడం మాని విశ్వంనే చూస్తూ ఉన్నాయి మౌనంగా. వడివడిగా ఊరివేపు నడుస్తున్నాడే కానీ అడుగులు సరిగా పడటం లేదు. ఇక నుంచీ అమ్మనూ, ముగ్గురు చెల్లెళ్లనీ తను పోషించాలన్నమాట. ఎలా? తనకి ఉద్యోగం ఎలా వస్తుంది? రెండు క్షణాల్లో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది విశ్వానికి. నాన్న గవర్నమెంటు ఉద్యోగి. చనిపోయిన ఉద్యోగి కొడుకుకు తప్పకుండా ఉద్యోగం ఇస్తుంది ప్రభుత్వం. అవును... తనకిక ఉద్యోగం. అతి తొందరలో తనకిక ఉద్యోగం. విశ్వం కళ్లలో ఆనంద రేఖ మెరిసి మాయమైంది. నాన్నకి రావాల్సిన ప్రావిడెంటు ఫండుతోనూ, గ్రూప్ ఇన్సూరెన్సు వాళ్లు ఇచ్చే డబ్బుతోనూ అక్కయ్య పెళ్లి బాకీ తీర్చేసి, ముగ్గురి చెల్లెళ్ల పెళ్లీ చేసేస్తాడు. ఏదేమైనా తనకిక ఉద్యోగం! అవును. తనకిక ఉద్యోగం! ఛీ! ఛీ!! ఛీ!!! తను మనిషా? రాక్షసుడా? తండ్రి చనిపోతే... ఇవేం ఆలోచనలు! తనకీ - రాక్షసుడికీ ఏం తేడా? తనమీద తనకే అసహ్యమేస్తోంది! అవును... తన ఆలోచనలన్నీ పాడువే! తొందరలో తనకిక ఉద్యో... ఛీ! ఛీ!! తన అక్కయ్య పెళ్లి బాకీ తన చెల్లెళ్ల పెళ్లి సమస్యలు - తక్కిన జీవిత సమస్యలు - అన్నీ పటాపంచలు... నాన్న బతికుండేప్పుడు తీరని సమస్యలు... ఆయన చనిపోయాక తీరేందుకు సిద్ధంగా వున్నాయి. ఎంత విచిత్రం! తనేనా ఇలా ఆలోచిస్తోంది? నిద్రపోతూ ఉన్న నాన్న చనిపోయాడేమోననే ఆలోచన వస్తే భరించలేక ఆందోళన పడిపోయిన తనేనా ఇలా ఆలోచిస్తోంది! తనసలు మనిషేనా? తనకి ముప్పయి నాలుగేళ్లు దాటితేనేం... తనకీ ఉద్యోగం వచ్చేస్తుంది. అసలు రాకేం చేస్తుంది! గంతులేద్దామనిపిస్తోంది అతనికి. నాన్న శవం జ్ఞాపకం వచ్చి విరమించుకున్నాడు. పాడు ఆలోచనల్ని కౌగలించుకుంటూనే విశ్వం అడుగులు ఇప్పుడు వడివడిగా పడుతున్నాయి ఇంటివేపు. -
భగదత్తుడు
భగదత్తుడు నరకాసురుడి కొడుకు; భూ దేవికి మనవడు. అసురుడి కడుపున పుట్టి అసురుల లక్షణాలు బాగానే పుణికి పుచ్చుకున్నాడు. భూదేవి శ్రీకృష్ణుణ్నించి తన కొడుకు రక్షణ కోసం, దేవతల చేతిలో గానీ దానవుల చేతిలో గానీ చనిపోకుండా ఉండడం కోసం వైష్ణవాస్త్రాన్ని అర్థించింది. నరకుడు పోయిన తరవాత ఆ అస్త్రం భగ దత్తుడికి చేరింది. వైష్ణవాస్త్రానికి ఎదురుండదు. ఇంద్రుడూ రుద్రుడూ కూడా దానికి లొంగాల్సిందే. ఈ అస్త్రానికి తోడు భగదత్తుడికి సుప్రతికమనే పొగరు మోతు ఏనుగుంది. అది ఇంద్రుడి ఏనుగైన ఐరావత వంశానికి చెందిన ప్రసిద్ధమైన ఏనుగు. భగదత్తుడూ సుప్రతీకమూ కలిసి యుద్ధం చేస్తే ఎదుటివాడికి గెలుపు ఆకాశ పుష్పమే. అటువంటి భగదత్తుడు దుర్యో దనుడి వైపు చేరాడు. ఆకతాయి అయిన తన తండ్రిని చంపిన శ్రీకృష్ణుడికి వ్యతి రేకంగా పోరాడుదామనే తప్ప ధర్మా ధర్మాలను చూసే తెలివి లేదతనికి. అది అతని అసుర లక్షణానికి గుర్తు. భగదత్తుని రాజధాని ప్రాగ్జ్యోతిష పురం. అందుకని ఇతన్ని ప్రాగ్జ్యోతిషుడని కూడా పిలుస్తూ ఉంటారు. ‘ప్రాక్’ అంటే మునుపు అని అర్థం. ప్రాగ్జ్యోతిషుడంటే మునుపు కాంతిలోనే ఉండేవాడని అర్థం. మనుషులందరూ ముందు కాంతిలోనే ఉండేవాళ్లు. శరీరాల్లో చేరి, శరీరాలకే పరిమితమై అహంకారంగా మారి పోవడంతో అందరూ ప్రాగ్జ్యోతిషు లైపోయారు. ప్రయత్నంతోనే తిరిగి ప్రకాశంలోకి, అంటే, జ్ఞాన పరిధి లోకి రాగలుగుతారు మనుషులు. మహాభారత యుద్ధ సమయానికి భగదత్తుడు వయసు మీరినవాడే. అయినా అతని పరాక్రమమేమీ బీరుపోలేదు. అతని వెంట్రుకలు తెల్లబడిపోయాయి; నొసలూ కళ్ల దగ్గరంతా ముడతలు పడ్డాయి. అతనికి కళ్లు కనిపించనంతగా రెప్పలు వాలిపోయి మూసుకు పోయాయి. కళ్లను తెరిచి ఉంచ డానికి రెప్పల్ని పైకి పట్టి ఉంచేలాగ ఒక దళసరి పట్టీతో నొసటి మీద కట్టుకొని ఉంటాడు. ఈ పట్టీ రహస్యం శ్రీకృష్ణుడెరుగును.ద్రోణుడు సేనాధిపతిగా ఉన్న రెండోరోజున దుర్యోధనుడు తన గజసేనతో భీముడి మీద దొమ్మీకి దిగాడు. భీముడేమీ తక్కువ తిన లేదు. ఏనుగుల గుంపుమీద విరుచుకుపడ్డాడు. అతని బాణాల వేటులకు ఆ ఏనుగులన్నీ దెబ్బతిని కుంగిపోడంతో వాటి మదం పూర్తిగా దిగిపోయింది. భీమసేనుడి చేతిలో దుర్యో ధనుడు బహుపీడితుడు కాడాన్ని చూసి, అతనికి సాయంగా మ్లేచ్ఛుడైన అంగరాజు తన నాగేంద్రం మీద, అంటే, పెద్ద ఏనుగు మీద కూర్చొని భీముడికి ఎదురయ్యాడు. భీముడు ఆ ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టడంతో అది, కుప్పకూలిపోయింది. అంగరాజు కిందకు ఉరుకుదామని ప్రయత్నిస్తూంటే భీముడు అతడి తలను తెగేశాడు. అంగరాజు పతనం కావడంతో గాభరా పుట్టి కౌరవ సైనికులందరూ కకావికలై అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. సేనావ్యూహం భంగం కావడాన్ని చూసి భగదత్తుడు తన సుప్రతీకంతో భీముడి మీద ఎదురుదాడికి దిగాడు.భగదత్తుడి గజరాజు తన ఉక్కు పాదాలతో తొక్కడానికీ తొండంతో చుట్ట బెట్టడానికీ భీమసేనుడి మీదకు ఉరికింది. అయితే, భీముడికి ఒక గజ యోగం తెలుసు. ఆ యోగాన్ని అంజలికావేధమని అంటారు. ఏనుగు కింద ఒకచోట రెండు చేతులతో థపథపా తాకడంతో దానికి చాలా హాయిగా ఉంటుంది. ఆ సుఖ సమ యంలో మావటీడు అంకుశంతో పొడిచినా అది పట్టించుకోదు. భీముడికది తెలుసు. అందుకే ఆ ఏనుగు తన చుట్టూరా తిరు గుతూ పట్టుకొందామని చూస్తూ ఉంటే, గభాలున దాని కింద నుంచి బయటికి వచ్చి దాని ముందు నిలుచున్నాడు. అది అతన్ని కిందపడేసి తొక్కేదామని ప్రయత్నించింది. దాన్ని భ్రమలో పడేసి, తొండం మెలిక నుంచి తప్పించుకొని మళ్లీ దాని కిందకి చేరాడు భీముడు. ఈసారి బయటికి వస్తూనే దూరంగా పారిపో యాడు. అక్కడివాళ్లందరూ భీముడు వెళ్లి పోవడం చూడక, దాని అట్టహాసం చూసి అతను దాని దాడికి చనిపోయాడన్న భ్రమలో పడి గాభరాపడ్డారు. ఆ తరవాత దశార్ణరాజు ఏనుగు, పక్క నుంచి భగదత్తుడి ఏనుగు మీద దాడిచేసింది. ఆ రెండు ఏనుగులూ రెండు కొండల్లాగ ఢీకొన్నాయి. సుప్రతీకం దశార్ణ రాజు ఏనుగును చంపేసింది. భగదత్తుడు దశార్ణరాజును ఏడు ఈటెలతో చంపేశాడు. తరవాత సాత్యకి రథాన్ని తొండంతో చుట్ట బెట్టడానికి ఊపుమీద వస్తూన్న సుప్రతీ కాన్ని చూసి రథాన్ని వదిలి వెళ్లిపోయాడు సాత్యకి. ఆ ఏనుగు మాత్రం తన ఉద్య మాన్ని ఆపకుండా ఆ ఖాళీ రథాన్నే వేగంగా ఎత్తి కుదేసింది. ఆ విధంగా చాలా రథాల్నీ రాజుల్నీ ఎత్తెత్తి ఎగరెయ్యడం మొదలెట్టింది. అందరూ ఆ ఒక్క ఏనుగునీ కొన్ని వందల ఏనుగుల పెట్టుగా భావిస్తూ భయంతో వణికిపోయారు. ఈవిధంగా, ఇంద్రుడు ఐరావతం మీద కూర్చొని దానవుల్ని పారిపోయేలాగ చేసినట్టు, భగదత్తుడు తన సుప్రతీకం మీద కూర్చొని పాండవ సైన్యాలను సంహరిస్తూ వీరవిహారం చేశాడు. తమ సైన్యానికి ధైర్యం చెబుదామని భీముడు కోపంతో భగదత్తుడి మీదకు దూసుకొని వచ్చాడు. అప్పుడు భీమసేనుడి గుర్రాల మీద సుప్రతీకం తన తొండంతో నీళ్లను కుమ్మరించింది. ఆ గుర్రాలు భయపడి భీముణ్ని తీసుకొని దూరంగా పారిపో యాయి. ఆ మీద అభిమన్యుడూ, ద్రౌపది కొడుకులూ, చేకితానుడూ ధృష్టకేతువూ యుయుత్సువూ కలిసి సుప్రతీకాన్ని చంపేద్దామని దాన్ని బాణధారలతో ముంచెత్తారు. సుప్రతీకం యుయుత్సుడి గుర్రాల్ని, అతని సారథిని చంపేసింది. ధృతరాష్ట్ర పుత్రుడైన యుయుత్సువు కంగారుగా రథం నుంచి తప్పుకొని వెళ్లి అభిమన్యుడి రథం మీద కూర్చున్నాడు. అభిమన్యుడూ యుయుత్సుడూ ద్రోపదేయులూ ఒక్కసారిగా ఆ ఏనుగు మీద చాలా బాణాలనే గుప్పించి దాన్ని దెబ్బతీశారు. అంత దెబ్బ తిన్నా కూడా అది తన కుడీ ఎడమా ఉన్న శత్రు పక్షీయుల్ని ఎగరేసి విసిరేస్తూనే ఉంది. దాని ఆగడాలకూ అంతులేకుండా పోయింది. భగదత్తుడు పాండవ సేనను మాటిమాటికీ ఆవరిస్తూ బాధించాడు. పాండవ యోద్ధలందరూ పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. దూరంగా సంశప్తకులతో యుద్ధం చేస్తూన్న అర్జు నుడికి వారి ఆర్తనాదాలు వినిపించాయి. ఏనుగు చేస్తూన్న వీర ఘీంకారాలనూ అక్కడ ఉవ్వెత్తుగా లేచిన దుమ్మూ ధూళీ చూసి శ్రీకృష్ణుడితో అర్జునుడు ‘ఇంద్రుడికి తీసిపోని యోద్ధ భగదత్తుడు. గొప్ప గజ యాన విశారదుడు; భూమ్మీద గజ యోద్ధల్లో ప్రప్రథముడు కూడాను. అతని ఏనుగూ ఎదురులేనిదే. అతను అన్ని శస్త్రాలకూ అతీతుడు. బహు పరాక్రమం చూపిస్తూ శ్రమను కూడా జయించాడు. అతనొక్కడూ సమస్త పాండవ సైన్యాన్నీ వినాశం చేయగలడు. మన ఇద్దర్నీ తప్పించి అక్కడ అతన్ని ఎదిరించగల మొనగాడు కనిపించటం లేదు. అంచేత నువ్వు ఆ భగదత్తుడున్న చోటుకు రథాన్ని నడిపించు. తన ఏనుగుకున్న బలంతో పొగరుగా ప్రవర్తిస్తూన్న అతని అహంకారాన్ని ఈ రోజునే అంతం చేస్తాను నడు’ అంటూ తొందరపెట్టాడు. తీరా రథాన్ని అటు మలిపేసరికల్లా పద్నాలుగు వేల సంశప్తకులు అర్జునుడి వెంటబడి కదలనివ్వలేదు: దానిలో పది వేల మంది త్రైగర్తులు; తతిమ్మా నాలుగు వేల మందీ నారాయణీ సేన తాలూకు వాళ్లు. ఇప్పుడు అటు వెళ్లాలా ఇటు వీళ్ల పీచమడచాలా అని తేల్చుకోలేక కొంత సేపు ద్వైధీ భావంతో కొట్టుమిట్టాడి చివరికి సంశప్తకుల వైపే తిరిగాడు. ఆ సంశప్తకులందరూ అర్జునుణ్ని ఒక్కపెట్టున లక్ష బాణాలతో ముంచెత్తేసరికి కృష్ణుడికే ముచ్చెమటలు పోశాయి. అది చూసి అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వేసి వాళ్లనందర్నీ చాలామటుకు నాశనం చేశాడు. రణ భూమంతా తలలూ మొండేలూ చేతులూ తొడలూ కాళ్లూ రక్తమ్మడుగులూ అయి కదలడానికి వీల్లేనంతగా తయారయింది. అదే అదను అని భగదత్తుడి వైపుకు నడి పించబోయాడు కృష్ణుడు పార్థ రథాన్ని. ఈసారి మళ్లీ సుశర్మ తన తమ్ముళ్లతో వెనకపడి వేధించడం మొదలుపెట్టాడు. అతన్ని అర్జునుడు తన బాణ సమూ హంతో వివశుడిగా చేశాడు. ఇక భగ దత్తుడి వైపు వెళ్లడానికి అర్జునుడికి అడ్డుపడే సాహసం ఎవడూ చేయలేదు. అర్జునుడు బాణవర్షం కురిపిస్తూ, పర్వతాన్ని ఢీకొన్న పడవకు పట్టే దుర్దశను కలిగించాడు మొత్తం కౌరవ సైన్యానికి. అది సహించలేక భగదత్తుడు తన ఏనుగుతో ధనంజయుడి మీదకు దూసుకొని వచ్చాడు. ఇద్దరూ తుములమైన యుద్ధం చేయడం ప్రారంభిం చారు. సుప్రతీకం అక్కడి ఏనుగుల్నీ రథాల్నీ రథికుల్నీ గుర్రాల్నీ ఆశ్వికుల్నీ యమలోకానికి పంపించే పని అవిచ్ఛి న్నంగా సాగిస్తూనే ఉంది. భగదత్తుడి పద్నాలుగు ఇనప గదల్ని ముక్కలు చేసేశాడు అర్జునుడు. ఏనుగు కవచాన్ని ఛేదించి, ఆ మీద బాణవర్షంతో దాన్ని ముంచెత్తాడు అర్జునుడు. అది వర్ష ధారలతో చిత్తడిసిన పర్వతంలా తయా రయింది. భగదత్తుడి రాజఛత్రాన్నీ ధ్వజాన్నీ ముక్కలు చేసి, వాడి అయిన బాణాలతో అతన్ని దెబ్బతీశాడు. కోపంతో భగదత్తుడు తన చేతిలో ఉన్న అంకుశాన్నే వైష్ణవాస్త్ర మంత్రంతో అభిమంత్రించి అర్జునుడి మీదకు విసిరాడు. వైష్ణవాస్త్రం అన్నిటినీ సర్వనాశనం చేస్తుందని తెలిసిన కృష్ణుడు అర్జునుడికి అడ్డుగా వచ్చి ఆ అస్త్రాన్ని తన వక్షస్సు మీద గ్రహించాడు. అది కృష్ణుడి మెడలో వైజయంతీమాలగా మారిపోయింది. అర్జునుడు నొచ్చుకుంటూ కృష్ణుడితో, ‘నువ్వు యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడేం చేశావు కృష్ణా! నేను నన్ను రక్షించుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ పని చేయడం సరేమో గాని ఇప్పుడది సరి కాదు గదా’ అని చాలా బాధపడ్డాడు. అప్పుడు కృష్ణుడు వైష్ణవాస్త్రం తాలూకు అమోఘత్వాన్ని వివరించి చెప్పాడు: ‘దాన్ని నేను తప్ప ఎవరూ నాశనం చెయ్య లేరు. ఇప్పుడది పోయింది గనక ఆలస్యం చేయకుండా, వాడి నాన్నను లోకహితం కోసం నేను చంపినట్టు, నువ్వు ధర్మం కోసం భగదత్తుణ్ని అంతం చెయ్యి. ముందస్తుగా అతని రెప్పలక్కట్టిన పట్టీని కొట్టి వాడి కళ్లు మూసుకొనిపోయేలాగ చెయ్యి’ అంటూ ఉపాయాన్ని ఉపదే శించాడు. కృష్ణుడి ఉపదేశాన్ని పార్థుడు అమలు చేశాడు. భగదత్తుణ్ని బాణాలతో ముంచెత్తి, అతని ఏనుగు కుంభస్థలాన్ని బాణంతో వేటు వేశాడు. ఏనుగు తటాలున కూలిపోయింది. అతని రెప్పల్ని కట్టిన పట్టీని అర్జునుడు భగదత్తుడికి లోకమంతా చీకటిమయమై పోయింది. అప్పుడు ఒక అర్ధచంద్ర బాణంతో భగదత్తుడి గుండెను చీల్చగానే అతను నేలకూలిపోయాడు. పొగరుతోనూ కండ కావరంతోనూ కన్నూ మిన్నూ కానకుండా పరుల్ని విచక్షణ లేకుండా విధ్వంసం చేసే నిర్దయనూ నిరంకుశత్వాన్నీ ఇలాగే ఉపాయంతో నాశనం చేయాలి. -
అన్నిటికన్నా ఆలూ ముఖ్యం!
ఆత్మబంధువు ‘ఆంటీ... ఆంటీ’ అంటూ ఇంట్లోకి వచ్చాడు చరణ్. ‘‘హాయ్ హీరో... ఏంటి సంగతి... పొద్దుటే ఆంటీ గుర్తొచ్చింది’’ అంటూ నవ్వుతూ పలకరించింది రేఖ. ‘‘మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చానాంటీ!’’ ‘‘థ్యాంక్సా... ఎందుకూ?’’ ‘‘మీరు చెప్పిన టైమ్ గ్రిడ్ బాగా పనిచేస్తుందాంటీ. ఇప్పుడు నా టైమ్ నేను బాగా మేనేజ్ చేసుకోగలుగుతున్నా.’’ ‘‘గుడ్... ‘ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చదివావా?’’ ‘‘చదివానాంటీ. వండర్ఫుల్ బుక్.’’ ‘‘గుడ్... ఇంకా!’’ ‘‘టైమ్ మేనేజ్ చేస్తున్నా కానీ...’’ అంటూ నసిగాడు చరణ్. ‘‘హా... కానీ? ఏంటో చెప్పు చిన్నూ!’’ అంది రేఖ. ‘‘టైమ్ మేనేజ్ చేస్తున్నా కానీ... ఎక్కడో ఏదో తేడా కొడుతోందాంటీ. అదేంటో అర్థం కావడంలేదు.’’ ‘‘తేడా కొట్టడమంటే?’’ ‘‘అంటే... అన్నీ టైమ్ ప్రకారమే చేస్తున్నా. కానీ ప్రయారిటీస్‌లో ఏదో తేడా కొడుతున్నట్లు అనిపిస్తుంది.’’ ‘‘ఔనా... సరే రా... వంట చేస్తూ మాట్లాడుకుందాం..’’ అంటూ వంట గదిలోకి వెళ్లింది. చరణ్ కూడా వెళ్లాడు. ‘‘నీకు వంట చేయడం వచ్చా?’’ అడిగింది రేఖ. ‘‘రాదాంటీ.’’ ‘‘తినడం?’’ నవ్వుతూ అంది. ‘‘బాగా వచ్చాంటీ’’ నవ్వుతూనే చెప్పాడు చరణ్. ‘‘తినడం వచ్చినప్పుడు... ఆ తినేది ఎలా వండాలో కూడా నేర్చుకోవాలోయ్.’’ ‘‘తప్పకుండా నేర్చుకుంటా. ఇప్పటికి ఆ అవసరం రాలేదుగా.’’ ‘‘అవసరం వచ్చినప్పుడు నేర్చుకోవడం కాదు. ఏదైనా ముందు నేర్చుకుంటే అవసరానికి ఉపయోగ పడుతుంది. సరే... ఆ జార్ ఇటు అందుకో.’’ గాజు జార్ తెచ్చిచ్చాడు చరణ్. దాని నిండుగా బంగాళా దుంపలు వేసి... ‘‘ఇప్పుడిది నిండినట్టేనా చరణ్?’’ అని అడిగింది. తల ఊపాడు చరణ్. రేఖ వెంటనే దాన్లో శనగలు పోసింది. బంగాళదుంపల మధ్యనున్న ఖాళీల్లోంచి కొన్ని శనగలు లోపలికి చేరాయి. ‘‘ఇప్పుడు నిండిందా?’’ ‘‘హా.. నిండింది ఆంటీ!’’ ‘‘అంటే దీన్లో మరేమీ పట్టవుగా?’’ ‘‘పట్టవు... ఫుల్‌గా నింపేశారుగా.’’ తలూపి దాన్లో చక్కెర పోసింది రేఖ. బంగాళాదుంపలు, సెనగల మధ్యగుండా కొంత చక్కెర లోపలికి చేరింది. ‘‘ఏమీ పట్టవన్నావుగా చిన్నూ... మరి చక్కెర పట్టిందిగా?’’ అంది రేఖ. ‘‘అంటే’’... నసిగాడు చరణ్. ‘‘సర్లే.. ఇప్పటికైనా నిండినట్లేనా?’’ ‘‘హా... ఇప్పుడైతే పూర్తిగా నిండినట్లే. జార్ అంచులవరకూ చక్కెర వచ్చిందిగా. ఇంకేం పట్టవు’’ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. అలాగా అంటూ జార్లో నీళ్లు పోసింది రేఖ. ఎందుకలా చేస్తుందో తెలియక ఆశ్చర్యంగా చూస్తున్నాడు చరణ్. అదే మాట అడిగాడు. ‘‘ఈ జార్ మన జీవితం లాంటిది. ఇందులో వేసిన దుంపలు అత్యంత ముఖ్యమైన అంశాల్లాంటివి. జీవితంలో అన్నీ కోల్పోయినా మనతోపాటే మిగిలి ఉండేవి. అంటే... విద్య, ఆరోగ్యం, కుటుంబం, స్నేహితులు, ప్యాషన్ వగైరా. శనగలు అవసరమైన విషయాలు. ఉద్యోగం, ఇల్లు, కారులాంటివి. మిగతా వన్నీ చక్కెరలాంటివి. అంత ప్రాముఖ్యత లేని సినిమాలు, షికార్లు, గాసిప్‌లు, ఫేస్బుక్ లాంటివి. నువ్వు జీవితాన్ని తియ్యగా కనిపించే చక్కెరతో నింపేస్తే... దానిలో సెనగలకూ, బంగాళా దుంపలకూ చోటుండదు. అలాక్కాకుండా ముందు బంగాళాదుంపలతో నింపేస్తే... మిగతా అన్నింటికీ చోటు ఉంటుంది.’’ అర్థమైందన్నట్లుగా తలాడించాడు చరణ్. ‘‘ఏం అర్థమైంది?’’ అంది రేఖ. ‘‘జీవితంలో ముఖ్యమైన వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనీ, వాటికే ఎక్కువ టైమ్ కేటాయించాలనీ.’’ ‘‘గుడ్... గుడ్.’’ ‘‘మరి మీరు చివర్లో పోసిన నీళ్లు ఏంటి ఆంటీ?’’ ‘‘జీవితంలో అన్నీ సాధించా మనుకున్నా... అన్నీ నిండాయనుకున్నా... ఇంకా ఎంతో కొంత చోటు మిగిలే ఉంటుందని.’’ ‘‘మీరు సూపర్ ఆంటీ! థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్.’’ అంటూ సంతృప్తిగా ఇంటికి వెళ్లిపోయాడు చరణ్. - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
ఎందుకిలా?
రాత్రి పదకొండు కావస్తోంది. స్టడీరూమ్‌లో లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చాడు శ్రీకర్. తన గదిలోకి వెళ్లబోతూ తమ్ముడు స్వరూప్ గదివైపు చూశాడు. ఇంకా లైటు వెలుగుతూనే ఉంది. అంటే ఇంకా పడుకోలేదన్నమాట. ‘‘ఈ స్వరూప్‌కి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. త్వరగా పడుకుని త్వరగా లేవరా అంటే వినడు. అర్ధరాత్రి వరకూ సినిమాలు చూడ్డం, పొద్దున్నే కాలేజీకి ఆలస్యమయ్యిందంటూ గంతులు వేయడం’’ అంటూ తమ్ముడి గదివైపు నడిచాడు శ్రీకర్. తలుపు కొంచెం తెరిచే ఉంది. నెట్టుకుని లోనికి వెళ్లాడు. ‘‘హాయ్ అన్నయ్యా... ఏంటి, ఇంకా పడుకోలేదా’’ అన్నాడు స్వరూప్ అన్నను చూస్తూనే. ‘‘నా సంగతి తర్వాత. నువ్వేం చేస్తున్నావ్? చదువుకుంటున్నావా?’’ అన్నాడు శ్రీకర్. ‘‘అవునన్నయ్యా’’... తడుముకోకుండా ఠక్కున అన్నాడు స్వరూప్. శ్రీకర్ నవ్వాడు. ‘‘చాల్లే అబద్ధాలు. నీ ఒళ్లో ల్యాప్‌లాప్ చూస్తేనే తెలుస్తోంది, మళ్లీ ఏదో సినిమా చూస్తున్నావని. ఈ సినిమాల పిచ్చేంట్రా నీకు?’’ అన్నాడు తమ్ముడి పక్కనే కూర్చుంటూ. ‘‘ఏమో అన్నయ్యా. రోజుకొక సినిమా అయినా చూడకపోతే మనసు లాగేస్తుంది నాకు. అయినా చదువులో వెనకబడటం లేదు కదా, ఇంకెందుకు నీకు భయం?’’ అన్నాడు బుంగమూతి పెడుతూ. ‘‘అలా అని కాదురా. అర్ధరాత్రిళ్ల వరకూ ఇలా సినిమాలు చూడ్డం, పొద్దున్న కాలేజీకి పరుగులు పెట్టడం ఎందుకింత టెన్షన్! నిద్ర సరిపోకపోతే ఆరోగ్యం పాడవదూ?’’ అవునన్నట్టు తలూపాడు స్వరూప్. ‘‘నిజమే అనుకో. కానీ ఏం చేయనన్నయ్యా? సినిమా నా వీక్నెస్. అందులోనూ హిచ్‌కాక్ సినిమాలంటే మరీను. నేను కూడా డెరైక్టర్నయ్యి అలాంటి సినిమాలే తీస్తా.’’ ‘‘గట్టిగా అనేవు. నాన్నగారు విన్నారంటే తాట తీస్తారు. నన్ను మెకానికల్ ఇంజినీర్ని చేశారు. నువ్వు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదవాలన్నది ఆయన కోరిక. సినిమా గినిమా అన్నావో... ఇక అంతే’’ అన్నాడు శ్రీకర్ నవ్వుతూ. ‘‘అబ్బో... నావల్ల కాదు. పట్టుబట్టి చదవమంటే చదివేస్తాను కానీ ఆ ఫీల్డ్‌లో మాత్రం సెటిలవ్వను. చక్కగా డెరైక్టర్నయిపోతా. హిచ్‌కాక్ తర్వాత అలాంటి సినిమాలు తీసింది నేనేనని అనిపించుకుంటా. ఏం డెరైక్టర్ అన్నయ్యా ఆయన. ఇదిగో చూడు. ‘ద బర్డ్స్’ సినిమా చూస్తున్నా. ఎంత బాగుందో. టెన్షన్ వచ్చేస్తోంది’’ అన్నాడు పెద్దవి చేసి. ‘‘అంతగా ఏముందా సినిమాలో?’’ ‘‘సినిమా అంతా పక్షుల మీదే తీశారు. అవి విచిత్రంగా ప్రవర్తించడం, మూకుమ్మడిగా దాడి చేయడం, అందరినీ భయపెట్టడం... టెన్షన్ పెట్టే థ్రిల్లర్ అనుకో’’... ఎంత థ్రిల్ ఫీలవుతున్నాడో స్వరూప్ ముఖంలోనే కనిపిస్తోంది. ‘‘అవునా. నువ్వు సినిమా చూసే మురిసిపోతున్నావ్. మన దేశంలో పక్షులకు సంబంధించిన ఓ పెద్ద మిస్టరీ ఉందని తెలుసా?’’అన్న అలా అన్నాడో లేదో, నిటారుగా అయ్యాడు స్వరూప్. ‘‘మిస్టరీనా? ఏమిటన్నయ్యా అది?’’ అంటూ ఆసక్తిగా అడిగాడు ల్యాప్‌టాప్ పక్కన పెట్టేస్తూ.‘‘అసోంలో జతింగా అనే ఓ ప్రాంతం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం చలికాలంలో కొన్ని వందల, వేల పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.’’ ఆశ్చర్యంగా చూశాడు స్వరూప్. ‘‘పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయా? అదేంటి? అలా ఎక్కడైనా జరుగుతుందా? అది నిజమేనా అసలు?’’... ప్రశ్నల వర్షం కురిపించాడు.‘‘నిజమేరా. చాలా సంవత్సరాలుగా అలా జరుగుతోందట. కారణమేంటో ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇప్పటికీ అది పెద్ద మిస్టరీగానే ఉంది.’’‘‘అవునా... అయితే మనం అక్కడికి వెళ్దామా అన్నయ్యా?’’... ఆసక్తిగా అడిగాడు స్వరూప్.‘‘నావల్ల కాదు బాబూ. నీకేమైనా సరదాగా ఉంటే వెళ్లిరా. నాకు నిద్రొస్తోంది పడుకుంటా’’ అంటూ వెళ్లిపోయాడు శ్రీకర్. స్వరూప్‌కి మాత్రం నిద్ర రాలేదు. అన్నయ్య చెప్పిన మిస్టీరియస్ ప్లేస్ గురించే ఆలోచిస్తున్నాడు. అప్పటి వరకూ చూసిన సినిమా మీద కూడా ఆసక్తి పోయింది. ల్యాప్‌టాప్ మూసి పక్కన పడేశాడు. జతింగా, అక్కడి పక్షులు, వాటి ఆత్మహత్య... ఇవే బుర్రలో తిరుగుతున్నాయి. ఎలాగైనా సరే... అక్కడికి వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నాడు.స్వరూప్ మాత్రమే కాదు... జతింగా గురించి విన్నవాళ్లెవరైనా కూడా అలానే ఆలోచిస్తారు. అక్కడికి వెళ్లాలనే ఆరాటపడతారు. అక్కడి మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతారు. అసలింతకీ అక్కడ ఏం జరుగుతోంది? పక్షుల ఆత్మహత్య అన్నమాటలో వాస్తవం ఎంత??? అసోం రాజధాని గౌహతికి దక్షిణాన... మూడు వందల ముప్ఫై కిలోమీటర్ల దూరంలో... హాఫ్లాంగ్ నగరానికి తొమ్మిది కిలోమీటర్ల చేరువలో ఉంది జతింగా. ఇక్కడి ప్రకృతి అందాలు చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. పచ్చని చెట్లు, నదీజలాలు, ఎత్తయిన పర్వతాలు... ఎటు చూసినా అందమే. అయితే అన్నిటి కంటే ఎక్కువ ఆకర్షించేది మాత్రం... ఇక్కడి పక్షులు. రకరకాల పక్షి జాతులకు ఆలవాలం జతింగా. స్థానికంగా ఉండే పక్షులే కాకుండా... ఎక్కడెక్కడి నుంచో వందలాది పక్షులు వలస వచ్చి ఇక్కడ వాలతాయి. దాంతో జతింగా... పక్షుల సందర్శనా కేంద్రంగా మారింది. అయితే అలాంటి జతింగాలో కొద్ది సంవత్సరాల క్రితం ఓ దారుణం జరిగింది. అది ఒక్కసారి జరిగి ఆగిపోలేదు. మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంది. ఆ యేడు... అప్పుడప్పుడే అసోంను చలి దుప్పటి కప్పుతోంది. జతింగా కూడా చిన్నగా చలికి వణుకుతోంది. ఆ సాయంత్రం పూట కొందరు సరదాగా చలి మంట వేసుకున్నారు. అందరూ దాని చుట్టూ కూర్చుని చలి కాచుకుంటున్నారు. ఉన్నట్టుండి ఏదో రొద. పక్షులన్నీ కీచు కీచుమంటూ అరుస్తున్నాయి. ఆ అరుపులు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. అందరూ ఆకాశం వైపు దృష్టి సారించారు. వందలాది పక్షులు ఆకాశంలో ఎగురు తున్నాయి. ఓ పద్ధతిలో కాదు. ఎలా పడితే అలా. ఎటు పడితే అటు. ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కో పక్షీ నేలవైపు దూసుకు రావడం మొదలైంది. పక్షులు కిందికి వస్తున్నాయి. కొన్ని నిర్జీవంగా నేలమీద పడిపోతున్నాయి. కొన్ని అడ్డదిడ్డంగా ఎగురుతూ ఇళ్లకు, చెట్లకు, స్తంభాలకు గుద్దుకుంటున్నాయి. గాయాలపాలై నేలరాలి మరణిస్తున్నాయి. అందరూ అవాక్కయిపోయారు. ఏం జరుగుతోందో వారికి అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఈ పక్షులకు ఏమయ్యింది? ఎందుకిలా చనిపోతున్నాయి? ఏమీ తెలియలేదు. అలా ఆ అమావాస్య రాత్రి కొన్ని వందల పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఉదయం లేచి చూస్తే ఊరి నిండా పక్షుల మృతదేహాలే. వాటన్నిటినీ గోతులు తీసి పూడ్చి పెట్టారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఆర్నిథాలజీ విభాగానికి తెలిసింది. వెంటనే శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. పక్షుల మరణానికి కారణం ఏమిటో అన్వేషించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లకు ఏమీ అర్థం కాలేదు. దాంతో విసుగుచెంది తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. అక్కడితో అంతా అయిపోయిందిలే అనుకున్నారు జతింగా గ్రామస్థులు. కానీ అయిపోలేదు. అప్పుడే మొదలైంది. మరుసటి సంవత్సరం... మళ్లీ చలికాలం... ఓ అమావాస్య రాత్రి... మరోసారి అదే ఘోరం. అదే దారుణం. పక్షులన్నీ పిచ్చి పట్టినట్టు అరిచాయి. ఇష్టం వచ్చినట్టు వాటినీ వీటినీ గుద్దుకున్నాయి. క్షణాల్లో ప్రాణాలు వదిలేశాయి. మళ్లీ అందరి మనసుల్లో వంద సందేహాలను రేకెత్తించాయి. అలా ప్రతి యేటా చలికాలంలో... సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఏదో ఒక అమావాస్య రాత్రి పక్షులన్నీ ప్రాణాలు విడుస్తూనే ఉన్నాయి. మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నాయి. అలా ఎందుకు జరుగుతోందో ఇప్పటికీ తెలియడం లేదు. ఎంతోమంది పక్షి శాస్త్రవేత్తలు దీనికి కారణాన్ని వెతకడంలో మునిగిపోయారు. స్వర్గీయ ఇ.పి.గీ (ప్రముఖ పర్యావరణవేత్త), ప్రముఖ ఆర్నిథాలజిస్టు సలీమ్ అలీ వంటి వారు కూడా ఈ విషయంపై పరిశోధనలు జరిపారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఈ మిస్టరీని ఛేదించ డానికి సుధీర్ సేన్ గుప్తా అనే శాస్త్రవేత్తను ప్రత్యేకంగా నియమించింది. వీరంతా పరిశోధనలు జరిపి, పక్షుల మరణాలకు కొన్ని కారణాలను వెల్లడించారు. అసోంలో వరదలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి. దానివల్ల పక్షులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా వలస వచ్చిన పక్షులు మరింత ఇబ్బంది పడతాయి. అవి తిరిగి వెళ్లే ప్రయత్నంలో వాతావరణంలోని అలజడిని తట్టుకోలేక అలసిపోయి, నీరసించి మరణిస్తున్నాయన్నది ఓ కారణం. చలికాలపు రాత్రుల్లో చిక్కటి చీకటి అలముకుంటుంది. దాంతో జతింగా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు చలి మంటలు వేస్తూ ఉంటారు. అవి రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఆ వెలుతురుకు ఆకర్షితమై పక్షులు కిందికి దిగే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ ప్రయత్నంలోనే వాటినీ వీటినీ గుద్దుకుని మరణిస్తున్నాయనీ మరో వాదన వినిపించారు నిపుణులు. కానీ ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదని అందరూ అన్నారు. ఇంకా వాతావరణంలో మార్పులు, గాలి విషపూరితం కావడం అంటూ పలు రకాల వాదనలు బయటకు వచ్చాయి కానీ ఏవీ నిజమని నమ్మే ఆధారాలు దొరకలేదు. అయితే జతింగా వాసులు మాత్రం ఈ పక్షుల మరణాలకు కారణం కొన్ని దుష్టశక్తులు అంటున్నారు. కొన్ని రకాల దుష్టశక్తులు ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయని, అవే పక్షులను ఇలా పొట్టన పెట్టుకుంటున్నాయని అంటున్నారు. దుష్టశక్తులను చల్లబరచడానికి కొన్ని రకాల పూజలు, హోమాలు కూడా చేయించారు. శాంతి కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఏం చేసినా ఫలితం లేకపోయింది. పక్షుల ఆత్మహత్యలకు ఫుల్స్టాప్ పెట్టడం ఎవరి వల్లా కాక పోయింది. దాంతో ఈ విషయం ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీగానే మిగిలి పోయింది. ఇలా పక్షులు విచిత్రంగా ప్రవర్తించడం, మూకుమ్మడిగా చనిపోవడం అన్నది కేవలం జతింగాలోనే కాదు, మరికొన్ని చోట్ల కూడా జరిగిందని అంటున్నారు శాస్త్రవేత్తలు. స్విట్జర్లాండ్, ఫిలిప్పైన్‌స, మలేషియా దేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయనడానికి ఆధారాలు చూపిస్తున్నారు. అయితే అలా జరిగితే జరిగి ఉండొచ్చు కానీ అక్కడ ఒక్కసారితో ఆగిపోయింది. కానీ జతింగాలో అలా కాదు కదా! యేటా ఇలా జరుగుతూనే ఉంది. మరణించే పక్షుల సంఖ్యలో తేడా ఉంటోంది తప్ప మరణాలు ఆగట్లేదు! -
పిచ్చి గంగి
‘టప్, టప్’ మంటూ, కారు మెల్లిమెల్లిగా నడుస్తూ దానంతటదే ఆగిపోయింది. మామయ్య కోపంగా ఎగిరి పడ్డారు - కారులోంచి కూడా.‘‘సరిపోయిందిలే. మధ్య దారిలోనే నిల్చిపోయిందే బండి. వెళ్లేది శుభకార్యం, శకునం బాగా లేదే!’’ అంది అత్తయ్య. ‘‘అదేమిటమ్మా... నాకు వళ్లు మండి పోతుంది, శకునాలేమిటి! నీ మూఢ నమ్మకాలు మార్చుకోవడం మంచిది ఇహనైనా, ఇది ఆధునిక యుగం’’ అంది విసుగ్గా శాంతి, కాలేజీ సెలవులకి ఇంటికి వచ్చిన అత్తయ్య కూతురు. ‘‘అసలు నువ్వు బండిలో పెట్రోలు ఉన్నదీ లేనిదీ చూసుకుని మరీ బయలు దేరవద్దా? నేను ఆఫీసు నించీ వచ్చేటప్ప టికి అన్నీ రెడీగా ఉంటాయనుకున్నాను. ఏమిటా నిర్లక్ష్యం?’’ కసిరారు, కారు డ్రైవరు రాజుని మామయ్య.‘‘ఏం చెయ్యమంటారు సార్. అమ్మాయిగారు తొందరపెట్టేసారు, వెంటనే బయలుదేరి పెళ్లికి అందుకోవాలి అంటా. ఆ గాభరాలో నేనూ బండి తీసేసాను’’ అన్నాడు రాజు దిగులుగా, తనూ బండి దిగుతూ. ‘‘అసలు అందుకనే ఈ అడ్డ తోవని పట్టిచ్చానండి కారు’’ అన్నాడు మళ్లీ. ‘‘అసలు పెట్రోలు ఉందో లేదో రాజు చూసుకోవద్దా ఏమిటి? అది అతని డ్యూటీ’’ అంది శాంతి గడసరితనంగా. ‘‘అదేమిటి, తెల్లవారు జాము ముహూర్తానికి ఇప్పుడే తొందరేమిటి అమ్మాయ్ నీకు?’’ అడిగింది అత్తయ్య. ‘‘పెళ్లి అంటే కాస్త తొందరగా వెళ్ల వద్దా మరి’’ అంది శాంతి.కానీ నాకు తెలుసు - ఆ పెళ్లికి వచ్చే బంధుమిత్ర బృందంలో, శాంతికి కావల సిన రమేశ్ వచ్చి ఉంటాడని. చేసేదేమీ లేక అందరమూ కారు దిగాం. ఎండ తీక్షణంగా ఉంది. మా నీడలు పొడుగ్గా మా ముందర పడు తున్నాయి. మా చుట్టూ భూదేవి కూడా వేడి ఆవిర్లు చిమ్ముతోంది. ఎక్కడో దూరాన ఎండి పోయిన పొలాల్లో, నలుగురు మనుష్యులు బెడ్డ తిరగ వేస్తున్నారు. ఇహ మరి మనిషి సంచారం లేదు ఎక్కడా. ఆ రోడ్డు పెద్ద రహదారి కూడా కానట్టుంది. రోడ్డుకి ఇంకో పక్క కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఒక మనిషి కూచుని ఉన్నాడు. ఆ చుట్టూ మాత్రం, కాస్త మేర పచ్చిక పచ్చగా ఉంది. అందరమూ చెట్టుకేసి నడిచాం. మమ్మల్ని చూసి ఆ వయో వృద్ధుడు లేచి నించుని, గడ్డం క్రింద చేతి కర్రని ఆనించుకొని, మాకేసి చూస్తున్నాడు. ‘‘నీ పేరేమిటయ్యా?’’ అడిగారు మామయ్య.‘‘మాదయ్యండి. మా మనుమడు వచ్చే దాగా ఈ గొడ్లని శూత్తా ఉండమన్నా డండి నన్ను’’అన్నాడు ఆ వృద్ధుడు.అంతలోనే మా కారు ప్రక్కనించీ మోటారు బైక్ మీద శరవేగంతో ఒక యువకుడు వెళ్లాడు.‘‘ఆ బండి ఏ ఊరు వెడుతోందో నీకు తెలుసా?’’ అడిగారు మామయ్య.‘‘మా లింగాలేనండి. పెద కామందులు శంకరం గారి బాబండి ఆయన’’ అన్నాడు అతను.‘‘మా కారులో పెట్రోలు అయిపో యింది. ఇది బొత్తిగా మారుమూల దారి. ఆయన్ని అడిగి ఎంతైనా ఇచ్చి కాస్త పెట్రోలు తెచ్చుకుందామా’’ అన్నారు చిన్న స్వరంతో మామయ్య. ‘‘మారాజులాగా ఎల్లండి బాబయ్యా. ఇట్టాంటి ఇక్కట్టు టయానికి సహాయం చేత్తారండి ఆరు’’ అంటూ, ఆ మోటారు బైక్ వెళ్లిన దారికేసి, చేత్తో చూపిస్తూ, ‘‘అదిగదిగో ఆపైన ఎగుర్తా ఆ కొంగలు కనిపిత్త ఉండాయే. అదేనండి మా లింగాల గ్రామం చెరువు. ఒక రొండడుగులు ఏత్తే గంగమ్మ గుడి. అది దాటంగానే చెరువు కెదూరుంగా మండువా ఇల్లండి ఆరిది. నాలుగడుగులండి ఇక్కడికి’’ అన్నాడు మాదయ్య, చేతిలో కర్రతో మేము వెళ్లబోయే దిక్కు చూపిస్తూ. మాకందరికీ ప్రాణాలు లేచి వచ్చినట్టయినాయి. ‘‘రాజూ, కారులో ఉన్న క్యాన్ తీసు కుని, ఈ తాత చెప్పిన దారినే వెళ్లి, ఎంత డబ్బు అయినా ఇచ్చి ఒక లీటరు పెట్రోలు తీసుకురా’’ అంది అత్తయ్య, తన పర్సు లోనించి డబ్బు తీసి ఇస్తూ. అందరమూ ఆ పెద్ద నేరేడు చెట్టు నీడని కూలబడ్డాం. కాస్త దూరంలో ఒక బావి కనిపించింది. అక్కడక్కడా, చింతలూ తుమ్మలూ మామిడి చెట్లూ ఉన్నాయి.మాదయ్య కూర్చున్న పక్కన రెండు పాత సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల మీద తామరాకులో రకరకాల పువ్వులు పెట్టి ఉన్నాయి, వాడిపోతూ - ఎవరో పూజ చేసినట్టూ. ‘‘అయ్యయ్యో! సమాధుల ప్రక్కనా కూచున్నాం!’’ అంది శాంతి కాస్త చీదరించుకుంటూ. తన చేతి రుమాలు గడ్డిమీద పరిచి ముళ్ల మీద కూచున్నట్టు కూచుంది.‘‘ఏం బయ్యం లేదండి అమ్మాయి గారూ, ఆ తల్లి పిచ్చి గంగి. మీయసు వంటి కన్నె పాపల్ని మా ఇదిగా కాపాడుద్దండి’’ అన్నాడు మాదయ్య. ‘‘ఎవరైనా పూజ చేస్తారా ఇక్కడ?’’ అడిగింది అత్తయ్య. ‘‘మరేనండమ్మా, రొండో కంటికి తెలువకుండా, కన్నె పడుసులు ఈ సుట్టు పట్లు గ్రామాల్నించి తెల్లారగట్ట, పొద్దు పొడవక ముందరే పువ్వులు పెట్టి ఏడు కుంటారండి. ఆళ్లందరికీ మనసుల్లో ఎవ్వుళ్లని కోరుకున్నారో ఆళ్లతో పెళ్లి అవుద్దండి. ఆయమ్మ నమ్మిన వాళ్లని ఇడవదు’’ అన్నాడు మాదయ్య. ‘‘ఎవరయ్యా ఆ పిచ్చి గంగి?’’ అడిగాడు మామయ్య. ‘‘అది ఒక పెద్ద కతలెండి బాబయ్య. నా శిన్నతనాల్లో జరిగిందండి.’’ ‘‘అంటే, ఈ మధ్యనే జరిగిందన్న మాట.’’ ‘‘రాజు వచ్చే వరకూ కాస్త ఊసు పోతుంది. ఆ కథ ఏదో కాస్త చెప్ప వయ్యా’’ అడిగింది శాంతి. ‘‘ఆ మాటకొత్తే ఈ సుట్లు పట్లు గ్రామాల్లో ఆయమ్మంటే తెలవనోళ్లే లేరండి. గురి పెట్టి రాయి ఇసిరిందంటే ఎక్కడ అనుకుంటే అక్కడ తగుల్తాది. బయపడి పోయేవాళ్లండి ఊరంతా. ఆ తల్లి ఈ ఊళ్లోనే పుట్టి పెరిగిందండి. బంగా రమ్మ తమ్ముడి కూతురండి. పురిట్లోనే సంది ఒచ్చి తల్లి పోయిందండి. ఆ తమ్ముడు కొన్నాళ్లయ్యాక, ఏరే కోస్తాకి పోయేశి రొండో ఇవాహం చేసేసుకున్నాడండి. ‘‘తల్లి పోయినప్పుటేల నించీ ఆ పాపని కన్నురెప్పలాగా కాపా డతా ఒచ్చిందండి బంగారమ్మ. ఇరుగు పొరుగు అమ్మలక్కల్ని బతిమాలి పాలి ప్పిచ్చి, పెంచి అమ్మోరి పేరే గంగమ్మ అని పెట్టిందండి. బంగారమ్మకి ఒక్కడే ఒక్క కొడుకు సంగ మయ్య. ఐదెకరాల పల్లం ఉండాదండి. కూలోళ్లతో పాటు ఆయమ్మ కూడా పని చేస్తా పొలం పండిచ్చుకుంటూ, కొడుకునీ గంగమ్మనీ పెంచుకుంటూ కాలం గడుపుతా ఒచ్చిందండి, బంగారమ్మ.’’ ‘‘ఇంక సూత్తే గంగమ్మ శెక్కిన బొమ్మెల్లే తయారయ్యిందండి. ఆ పాప ఒంటి సాయ సూస్తే, ఆ ఇళ్లల్లోనే ఎవ్వుళ్లకీ లేదండి అసువంటి రంగు. మేలిమి బంగారు రంగండి. అప్పుడు నేను శిన్నోణ్ణండి. గోశీలు పెట్టుకుని బర్రెల్ని మేపుతా ఉండేవాణ్ణి. నేను బర్రెల్ని కడు గుతా వుంటే, గంగమ్మ గుడ్డలు గుంజే దానికి చెరువు కాడికి ఒచ్చేది. ఆయమ్మ నీడ బర్రెల మీద దీపం శూపినట్టనిపిచ్చేది. కుచ్చ జడలతో, జడని పువ్వులతో, చేతి నిండా గాజులతో, కాటిక బొట్టు, పసుపు వుంటే, తిరిగి సూడనోళ్లు లేరండి. ఆడోళ్లయినా సరే మొగాళ్లయినా సరే.’’ ‘‘బంగారమ్మకేమో, గంగమ్మని తన కొడుక్కిచ్చి పెళ్లి చేసుకుని ఇంట్లోనే పెట్టు కుందామని, ఏనాడో తీర్మానంగా అను క్కున్న మాటేనండి. ఆ మాట ఈ ఊళ్లల్లో అందరికీ తెలుసండి. అందుకని గంగమ్మకి ఎక్కణ్ణించీ కూడా మనువులు రాలేదండి.’’ ‘‘ఈలోగా ఏవయిందంటేనండీ, గంగమ్మ గుడి ఎనకాల పాపాయమ్మ, ఆయమ్మ కొడుకు రూపులయ్య ఉండా రండి. ఆళ్లకి నాలుగు ఎకరాల మాగాణి, దిబ్బ గట్రా ఉండాదండి. ఆ అర ఎకరం దిబ్బ మీద కాయ కూరలు పండిచ్చోరండి, గడ్డి వాము అక్కడే ఉండేదండి. పువ్వులు గట్రా కూడా పెంచేవారు అమ్మోరి గుడికి. పాపాయమ్మ గారికి కళ్లు చెడ్డ మసక. ఇంట్లోనే నడవడానికి కాళ్లు తడబడేయి. రూపులియ్య మామంచోడండి. తల్లిని కనిపెట్టుకుని పొలం సూసుకుంటా కుటుంబం నడిపిస్తా ఉండాడండి. బయట పనులన్నీ శెయ్యటం, ఇంట్లోకి మంచినీళ్లు తేటం అంతా రూపులియ్యే చేసేవాడు. బియ్యం పొంగిచ్చి కొడుక్కి అన్నం పెట్ట టంతో, పాపాయమ్మగారి పని సరి. తల్లి అంటే రూపులియ్యకి పాణంతో సమానం.’’ ‘‘రూపులియ్యగారి దిబ్బమీదికి ఆవు గడ్డి కోసం గంగమ్మ ఎల్తా ఉండేది. రూపులియ్య కూడా దిబ్బ మీద పండే కాయ కూర కోసి ఇచ్చేవోడు. మోపు బరువుగా ఉంటే పిలవకుండానే, గంగమ్మ తలమీద ఎత్తిపేట్టేవోడు. అట్లా గంగమ్మకీ రూపులియ్యకీ స్నేహితం ఏర్పడ్డదండి. కాని ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకోరు. కాని ఎట్టాగో ఊళ్లో ఓళ్లకందరికీ రూపులియ్యకి, గంగమ్మ మనసు ఇచ్చింది అన్న మాట తెలిసిపోయిందండి. ఊరంతా ఉడికి పోయింది. బంగారమ్మకీ, కొడుక్కీ మట్టుకు ఈ సంగతి తెలువదు. గంగమ్మకంటారా అసువుంటి కొంటె పనులు తెలవ్వు. మొగోళ్లు నిల్చేశోట నిలవదు, అయితే ఎవ్వుళ్లకన్నా ఏదన్నా పని కావాలంటే శటుక్కున శేశిపెడద్ది. మా ఉపకార బుద్ధండి మొదట్నించీ.’’ ‘‘పొద్దు పొడిశేతలికి నీళ్లోసుకుని గంగమ్మ తల్లి గుడిసుట్టూ తిరిగి ఒక దణ్ణం పెట్టుకుని, ఆ పూజారమ్మ కనకమ్మ గారిచ్చిన కుంకుం కళ్లకి అద్దుకుని నొసట్లో పెట్టుకుని మరీ పనుల్లో జొరబడేదండి. గంగమ్మ గుళ్లో మంచికీ శెబ్బరికీ గంగమ్మ ముందుండేదండి. గుళ్లో నుంచీ కొబ్బిరి ముక్కలూ ప్రసాదాలు అంతా మా పిల్లలందరికీ ఆయమ్మే ఇచ్చేదండి. ఈ పనులు కాక రూపులియ్యగారి బియ్యం బాగుశెయ్యటం, కాయలు తరగటం శేశి పెట్టేది. గుడ్డలు గుంజుకోటానికి ఎల్తే, పాపాయమ్మగారి కోకలు కూడా జాడిచ్చి తెచ్చేది. పూజ సామాన్లు తోమి పెట్టేది. ఇంకా రూపులియ్య గంటే నుండి, గుడి సంబరాలకి గుంజలు పాతటం, పందిళ్లెయ్యటం, తోరణాలు కట్టటం గట్రా అన్ని పన్లూ ఆయన లేకుంటే నడవవండి. అయితే ఒక సంగతండి. రూపులియ్యనీ గంగమ్మనీ గుళ్లోగాని గుడి ముందరగాని, ఒకే పాలి శూశినోళ్లు లేరండి. రూపులియ్య మూగోడిలాగానే ఉండేవోడండి.’’ ‘‘ఆ యేడు కొడుక్కీ మేనకోడలికీ పెళ్లి శెయ్యాలని కంకణం కట్టుకుంది బంగా రమ్మ. ఒకనాడు ఏమయిందంటే... అది పొద్దుటేల. శద్దణ్ణం అయ్యాక గంగమ్మ కొడవలి సేత పట్టుకుని, ఆవుకి సందిడు గడ్డి తెద్దావని రూపులియ్యగారి దిబ్బ మీదకి ఎల్లిందండి. నడుం ఎత్తున పెరిగిన పచ్చిగడ్డిలో కింద పడుకుని ఉన్న తాసు పాముని గంగమ్మ సూడలేకపోయింది. పాము తలమీద కాలు ఏసింది. ఆ పాము శటుక్కున ఆయమ్మ కాలు సుట్టేసుకుంది. బయ్యంతో గంగమ్మ గట్టిగా ఒక్క కేక అరిసేసింది. గడ్డి వాము పక్కన వరి గడ్డి పీకుతూన్న రూపులియ్య ఒక్క అంగలో ఒచ్చాడు. శటుక్కున గంగమ్మ శేతిలో కొడవలి లాక్కొని, ‘‘నువ్వు కాలు గట్టిగా తొక్కి అట్టాగే ఉంచు, కదిల్తే కాటేత్తాది’’ అంటూనే ఆ పాముని మెడ దగ్గిరిగా నరికి పారేసాడు. ఎంటనే ఆమె పాదం కిందగా కొడవలి జరుపుతా ‘‘ఒక్క అంగలో దూరంగా దూకు’’ అన్నాడు. గంగమ్మ శటుక్కున దూకింది. రూపులియ్య అనుకున్నట్టుగా ఆ కొడవలి పాము తలలోకి ఎల్లలేదండి. గడ్డిలోకే ఎల్లింది. పాము తల అట్టాగే ఉండాది. ఆ తల ఎగిరి రూపులియ్య కాలు కాటేసి పడి పోయింది. ఇక బతకను అని రూపు లియ్యకి తెలిసిపోయింది. ‘‘నువ్వు వెంటనే పారిపో, ఇక్కడ ఉండొద్దు. మాయమ్మని ఎవ్వురు శూత్తారో దేవుడా!’’ అంటా పడిపోయాడు. ఇదంతా, పల్లంల గొడ్లని కాస్తాన్న నేను సూస్తానే ఉండానా, అట్టాగే కొయ్యబారిపోయానండి. ఎట్టాగో తెప్పరిల్లి, ఒక చణంలో కర్ర కింద పారేసి ఊళ్లోకి లగెత్తుకొచ్చానండి.’’ ‘‘గంగమ్మ ఒక్క పరుగులో ఒచ్చి గంగమ్మ తల్లి గుళ్లో అమ్మోరి కాళ్ల ముందర పడిపోయిందండి. అంతేనండి... ఆనాడు పోయిన మతి గంగమ్మకి. మళ్లీ తిరిగి మడుసుల్లోకి రాలేదండి. అమ్మోరి గుళ్లోనే పడి ఉండేది. జుట్టు ముడి కూడా ఏసుకు నేది కాదు. ఎంటికలన్నీ ఇరబోసుకునే ఉండేది. చెరువుల్లో నీల్లోసుకుని అమ్మోరికి సేవ చేసుకుంటా, పొలాలెంట ఒంటరిగా తిరుగుతూండేదండి. కొంతమంది రాలుగాయి పిల్లకుంకలు మాత్రం ఆయమ్మ ఆపడగానే పిచ్చి గంగి పిచ్చి గంగి అంటానే ఉండోళ్లండి. ఆయమ్మ పట్టిచ్చుకునేది కాదు. అసలేమీ అనేదే కాదు. ఆ తల్లికి అదే పేరైపోయిందండి.‘‘పాపాయమ్మగారి ఒక్క కొడుకూ పోనే పోయాడుగిందా. ఇంక ఈ బతుకు ఎందుకులే అనుకుంది. దూరపుకోస్తా నించీ, చెడి బతకటానికి ఈ ఊరొచ్చి బాగుపడ్డ కుటుంబం అది. అందుకని ఈ ఊళ్లల్లో ఎక్కడా బందుగులు లేకపో యారు. ఉండా ఆస్తిపాస్తులన్నీ గంగమ్మ తల్లి గుడికి రాసిచ్చేసి ఇంట్లోనే పడి ఉండే దండి. అంత పిచ్చిలో కూడా గంగమ్మ... పాపాయమ్మగారి ఇల్లూ వాకిళ్లూ తుడవటాలూ, గుడ్డలు గుంజటాలూ, జత పడుకోటాలూ చేత్తానే ఉండేది. ‘‘ఈ లోగా ఇంకొక సంగతి కూడా జరిగింది. ఒకనాడు రాత్రి శిద్దయ్య కూతురు చంద్రమ్మని, ఆయన రొండో భార్య - అదొక గయ్యాళిలెండి - ఆయమ్మ తమ్ముణ్ణి పెళ్లాడనందని ఆ పిల్లని పట్టి కొట్టి, వాతలేస్తానందంట. శిద్దయ్య ఇల్లూ వాకిలీ, కొండ్రా గట్రా అంతా ఆమె తమ్ముడికే దక్కాలని కంకనం కట్టుకుండాది. శిద్దయ్యకి ఏరే పిల్లలూ లేరు. బార్య మాటకి ఎదురు శెప్పనూ లేడండి. చంద్రమ్మ శేతులు రొండూ కట్టేసి, ఆ సవితి తల్లి పొయ్యి అద్దకి ఎల్లిందంట, అట్ల ముల్లు తేటానికి, వాతలేశాదానికి. అంతే, శిటుకలో చంద్రమ్మ బయటికి ఉరికి, ఆ చీకట్లో పరుగెడతా వుండాదంట పొలాల కడ్డంగా. చెరువు గట్టుమీద మర్రి చెట్టు కింద చెట్టు నీడన చీకట్లో కూశున్న పిచ్చి గంగి, ఒక్క అంగలో లేశి చంద్రమ్మ దారికడ్డంగా నిల్చిందంట, చేతిలో రాయి పట్టుకుని కొట్టేదానికి. చంద్రమ్మ గాభరాగా ‘అక్కా, నన్ను కాపాడమ్మా’ అని పెద్ద కేక పెట్టేసిందంట. గంగమ్మ శటుక్కున దగ్గిరికి ఒచ్చి, ‘యాంమయిం దమ్మా నీకు’ అని అడిగిందట. చంద్రమ్మ జరిగిందంతా శెప్పి, పక్క కాట్లపూడి గ్రామంలో తన మేనత్త ఉండాదని, ఆయమ్మ కొడుకునే పెళ్లాడాలని ఉండా దని, అక్కడికి పోతే సాలనీ శెప్పిందంట. అంతలోకే కర్ర చేతపట్టుకుని శిద్దయ్య బావమరిది చింతాలు వస్తా వుండాడంట. గంగమ్మ ఎంటనే గట్టు కింద చంద్రమ్మని కూసోబెట్టి, దారికి అడ్డం ఒచ్చి ‘ఎవడ్రా నువ్వు’ అని రాయి చేత్తో పట్టుకుందంట. ఇకంతే, చింతాలు ఎనక్కి తిరిగి పారి పోయాడంట. కాట్లపూడి దాకా చంద్రమ్మకి గంగమ్మ తోడుగా ఎల్లిందంట. ఆ నోటా ఈ నోటా, చంద్రమ్మ పెళ్లి మాట పొక్కింది. అప్పుటేలనించీ, పొద్దుటేల గుడికి వచ్చే ఆడపిల్లలు, గుడి ముందర కూసున్న గంగమ్మకి కూడా మొక్కి ఎల్లే ఓళ్లంట.’’ ‘‘అట్టా అట్టా, యాడాది తిరగేతలికి పాపాయమ్మగారు మంచం ఎక్కారండి. అంతే, ఆయమ్మ కళ్లు మూసేదాకా పిచ్చి గంగి పాపమ్మ పక్క ఒదల లేదు. నిద్రా లేదు వణ్ణమూ లేదు, నీల్లూ లేవు. పాపాయమ్మకి అన్ని సేవలూ శేశింది.‘‘ఇక అంతేనండి. గంగమ్మ అలిసి పోయి గుడి ముందరకొచ్చి పడిపోయిం దండి. మేనత్త వణ్ణం తెస్తే తినలే. కనకమ్మ గారు పళ్లూ గట్రా ఇస్తే తినలే. నీల్లిస్తే తాగలే. అట్టాగే పడి ఉండేది. గాలి పట్టిందన్నారు. వారం దాటింది. మేనత్త వణ్ణం తినమని బతిమాలితే, గంగమ్మ కళ్లల్లో నీళ్లు నిండినయి. కనకమ్మ భర్త గారు, వైద్యుణ్ణి తెస్తా, కొంచం మందు తినమన్నారండి. గంగమ్మ కళ్లల్లో నించి నీళ్లు ధారగా జారి పడ్డాయండి. పిచ్చి గంగి అప్పుడు మూసిన కళ్లే. ప్రాణం పోయేదాకా తిరిగి తెరవనే లేదండి. తెల్లారక ముందరే జీవుడు ఒదిలేసింది. ‘‘కనకమ్మగారు.. రూపులియ్య పక్కనే ఈయమ్మకి కూడా సమాధి కట్టించ్చిం దండి. అయ్యేనండి ఈ సమాధులు.’’ మాదయ్య ఒళ్లోనించీ పుగాకు తీస్తూ కాస్త ఆగి ‘‘కనకమ్మగారు శచ్చిపోయే టప్పుడు పెద్దల్ని పిల్చి, దణ్ణం పెట్టి శెప్పిందండి, అన్నేళ్లూ ఆయమ్మ కడుపులో పెట్టుకున్న ఆ రహస్యం.’’ అప్పటికి కాస్త తెప్పిరిల్లి, ‘‘ఏమిటా రహస్యం?’’ అడిగింది, అత్తయ్య. ‘‘అసలు, ఏనాడూ పిచ్చి గంగికి పిచ్చేలేదంటండి!’’ అన్నాడు మాదయ్య, పుగాకు చేత్తో ఊత ఇస్తూ. దూరాన్నించీ, వస్తున్న చెప్పుల శబ్దం తప్ప, అంతా నిశ్శబ్దం, పెట్రోలు బరువుతో రాజు వస్తున్నాడు. ఏ లోకం లోనించో భూలోకానికి వచ్చి పడ్డాం అందరమూ. అందరికంటే ముందర శాంతి లేచింది. ఎప్పుడూ కనిపించని గాంభీర్యం ఏదో కనిపించింది, శాంతి ముఖంలో. రెండడుగులు వేసి వంగి నమస్క రించింది... ఆ సమాధులకి. -
ఈజీ మనీ డీల్ క్యాన్సిల్
మనీ... మనీమనీ... మోర్ మనీ... ఈజీ మనీ... ఒక్కరోజు పనిచేసి ఏడాదికి సరిపడా సంపాదించడం ఎలా? ఒక్కరోజులోనే లక్షాధికారులు కావాలనే కోరిక... అందుకోసం తప్పుడు పనులు చేయడం... కొన్నిరోజులు దర్జాగా బతకడం... దొరికిపోతే జైలుపాలవ్వడం... ఇదీ నేటి సంపాదనా మార్గం... ‘కష్టపడకుండా ఏదీ రాదు... కష్టపడకుండా వచ్చిందేదీ ఉండదు...’ అంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన సదాశివ... డెరైక్టర్స్ వాయిస్: నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో బి.కామ్ చదువుతున్నాను. ఇంతకుముందు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని. ఒక సంవత్సరం పాటు మానేశాను. మళ్లీ చేరబోతున్నాను. ఇంతకుముందు ‘సూసైడ్’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశాను. ఈ సినిమాకి నేనేమీ ఖర్చు చేయలేదు. ఇది ఒక హాబీగా తీసుకుని తీస్తున్నాను. చాలామంది తక్కువ టైమ్‌లో ఎక్కువ సంపాదించాలనుకుంటారు. అలా సంపాదించినవారు ఆ తరవాత ఎన్నో ఇబ్బందుల పాలవుతారు. అటువంటివారిని ప్రేరణగా తీసుకుని తీసిన చిత్రమే ఇది. ఈ చిత్రం తీయడానికి మూడురోజుల సమయం పట్టింది. చార్మినార్ దగ్గర, మా ఇంటి దగ్గర తీశాను. చార్మినార్ దగ్గర తీసిన దృశ్యాలు ఉదయం ఆరు గంటలకే చిత్రీకరించాం. ప్రస్తుతం ‘అన్నోన్’ అనే లఘుచిత్రం తియ్యబోతున్నాను. షార్ట్‌స్టోరీ: ఇద్దరు స్నేహితులు ఉంటారు. అందులో ఒక సే్నిహ తుడికి... కష్టపడకుండా లక్షాధికారి కావాలనే కోరిక ఉంటుంది. గంట కష్టపడితే రెండు లక్షలు ఇస్తామని ఒక వ్యక్తి ప్రలోభపెట్టడంతో, డ్రగ్స్ సప్లై చేసేవారితో చేయి కలుపుతాడు. వారు చెప్పినచోట డ్రగ్స్ అందచేసి, డబ్బు తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి కొడతారు. అంతలో తేరుకుంటాడు. ఇంతకీ అది కల. ‘‘కలలోనే తప్పు ఇంత భయంకరంగా ఉంటే నిజంగా చేస్తే... ’’ అనుకుంటాడు. ‘డీల్ క్యాన్సిల్’ అనడంతో కథ ముగుస్తుంది. కామెంట్: మంచి అంశాన్ని ఎంచుకున్నందుకు సదాశివను ముందుగా అభినందించాలి. ఇందులోని కథ, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్, కెమెరా, బ్యాక్ స్కోర్ మ్యూజిక్... అన్నీ బావున్నాయి. ముఖ్యంగా డైలాగులు చాలా బావున్నాయి. ‘‘హైదరాబాద్... కోట్ల రూపాయలు సంపాదించాలనుకున్నవారికి ఎన్నో రూట్లు చూపించే సిటీ’’ ‘‘బస్ రూట్ల కన్నా డబ్బు సంపాదించడానికే రూట్లు ఎక్కువ’’ ‘‘చేతులు కాల్చుకున్నంత ఈజీ కాదు డబ్బు సంపాదించడం’’ వంటి సంభాషణలు చాలా బావున్నాయి. ఒక మంచి థ్రిల్లర్లాగ తీశాడు. యూట్యూబ్‌లో సినిమాలు పెట్టేటప్పుడు సిగరెట్ కాలుస్తున్న బిట్స్ చూపిస్తూ, స్మోకింగ్ ఈజ్ ఇన్జ్యూరియస్ టు హెల్త్ అనే అవసరం లేకుండా, అసలు బ్యాడ్ హ్యాబిట్స్‌ని చూపించకుండా అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా చూపించాల్సి వస్తే సింబాలిక్‌గా చూపే అవకాశాన్ని వినియోగించుకుంటే మంచిది. మంచి లఘుచిత్రాన్ని, మరింత అందంగా చిట్టితెరకెక్కించినందుకు సదాశివను అభినందించాల్సిందే. - డా.వైజయంతి