‘ఏమైంది? అస్తున్నవా?’ ఆత్రంగా అడిగింది లక్ష్మి భర్తను.
‘ఏంగాలె.. ఏడున్నదో ఆడ్నే ఉన్నది. అచ్చుడు కాదే..’ బాధగా చెప్పాడు సత్యం.
‘ఎట్ల మరి?’ కంగారుగా లక్ష్మి.
‘ఏం జెయ్యాలే చెప్పు? ఏదో తిప్పలు వడి అచ్చెటట్టు చూస్తగని.. ఎట్లున్నడు బాపు?’ ఆందోళనతో సత్యం.
‘ఇయ్యాల్నో .. రేపో అన్నట్టున్నడు...’ నెమ్మదిగా లక్ష్మి.
దీర్ఘంగా శ్వాస తీసుకొని ‘అవ్వ...?’అడిగాడు.
‘నిన్నే యాదిచేస్తుంది.. ఎప్పుడొస్తవని..’ పొడిపొడిగానే చప్పింది లక్ష్మి.
ఏమీ మాట్లాడలేదు సత్యం.. ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు.
చావుబతుకుల్లో ఉన్న తండ్రిని కూడా చూసుకోలేకపోతున్నాడు.. ‘థూ... ఏం బతుకురా నీది? బాపు, అవ్వను ఎన్నడన్నా పట్టిచ్చుకున్నవా? ఒక్కడే కొడుకని.. చెల్లెండ్లను కూడా కాదని మంచి తిండి, మంచి బట్టలు.. కష్టం ఏందో తెల్వకుండా పెంచిండ్రు.. ఇంటికి పెద్దోడివై ఏం జేషినవ్‌రా? నీ బతుకుల మన్నువడ. చెల్లెండ్ల పెండ్లికి పైస ఇచ్చినవా? ఉన్న పొలమన్నా అమ్మి పెండ్లి జేద్దామని చూసినా.. ఆ పొలమెన్నడో అమ్ముకొని ఆ పైసలతో మట్క (జూదం లాంటిది) ఆడి.. ఉల్టా అప్పువెట్టినవ్. ఆనాడే బాపు గుండెపగిలి సావాలే.. అయినా ఒక్క మాట అనకుండా.. తనే చెల్లెండ్ల పెండ్లి జేసిండు. ఎప్పుడూ నువ్వెట్ల బతుకుతవనే రందివడ్డడు గాని ఆయన పానం గురించి ఆలోచించుకున్నడ? నీ పెండ్లాం, కొడుకుని సాకుడు కూడా చేతగాకపాయే.
బాపుతోపాటు సమానంగా పెండ్లాం కష్టవడ్డది.. ఇంటి కోసం. కొడుకు వయసోడైనంక గప్పుడు బుద్ధి దెచ్చుకొని.. దుబాయ్ దారి వడ్తివి. దానికీ అప్పు పుట్టింది బాపు మొహం, మల్ల మాట్లాడ్తే పెండ్లాం మొహం జూసే కదరా? ఏం పుట్టుకరా? అవును గిట్లనే ఏం పుట్టుకరా.. రాజా పుట్టుక నీది అని అవ్వ, బాపు, దోస్తులు అనీ అనీ గిట్ల జేసిండ్రు లాస్ట్‌కొస్తే..’ మనసులో తిట్టుకున్నాడు. వేదన కన్నీటి రూపంలో కళ్లలోకి ఉప్పొంగుతుండగా.. ఫోన్ రింగ్ అయింది!
చూశాడు.. నీళ్లూరిన కళ్లు చూపును మసకబారుస్తున్నా.. స్పష్టంగా కనిపించింది నంబర్.. తన భార్య చేసింది. వణుకుతున్న చేతులతోనే లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు మాట విని గోడకు చేరగిలపడ్డాడు. అయిపోయింది.. అంతా అయిపోయింది. ఇంకా తనను తన భుజమ్మీద నుంచి దింపని తండ్రి.. పోయాడు.
ఆఖరి చూపు కూడా చూడని దౌర్భాగ్యానికి కుమిలిపోయాడు.
‘ఒరేయ్ ఏం బుట్టిందిరా నీకు? మంచిగ.. కంపెనీ వీసా దొరికింది.. కష్టమో నష్టమో పనిచేసుకుంటే అయిపోయేది కదరా? పనికి ఎక్కువైతుంది.. జీతం తక్కువైతుందని.. అచ్చిన ఆర్నెల్లకే కంపెనీ ఇడిసిపెట్టి పొయ్యి ఖలివెల్లి అయితివి. నీ యవ్వ.. నువ్వు జేస్తున్న పనికి జీతం తక్కువైందా? ఎన్నడు కష్టపడ్డవని పని ఇలువ తెలిసె నీకు? ఇప్పుడు ఏమాయే? బాపును చూసుకునే దిక్కు కూడా లేకపాయే. అదే కంపెన్లనే ఉంటే బతిమాలితెనో.. కాళ్లు వట్టుకుంటెనో.. అరబ్ సేuŠ‡ పంపుతుండే కావచ్చు.. ఏడు.. ఈడ్నే ఏడ్సుకుంట సావు’ తన దురదృష్టానికి తానే శాపనార్థాలు పెట్టుకున్నాడు సత్యం.
‘ఏందవ్వా... అస్తున్నడా సత్యం?’ వాడకట్టు పెద్ద అడిగాడు.
రావట్లేదన్నట్టు తలూపింది లక్ష్మి.
‘మరి నీ కొడుకు అగ్గి వడ్తడా తాతకు?’ అడిగాడు లక్ష్మి ఆడపడచు మామ.
‘పొల్లగాడికి మస్కట్ వీసా అచ్చేటట్టున్నదట గీ రెండు మూడు దినాలల్లనే. అగ్గి వడితే ఊరు దాటొద్దు కదా.. దినాలు అయ్యేదాంక’ అన్నాడు సత్యం బావమరిది.
‘మరెట్లనయ్యా? కొడుకు రాకపోయే.. మనవడు వెట్టకపాయే.. ముసలోడి పానం ఇంటి సుట్టే తిరగాల్నా ఏందీ?’ గట్టిగా మాట్లాడాడు లక్ష్మి ఆడపడచు మామ.
‘లే.. నేను వడ్తా’ అన్నది లక్ష్మి స్థిరంగా.
ఆ జవాబుతో అందరూ షాక్ తిన్నట్టుగా చూశారు.
‘అవ్.. షిన్నబాపు. మా మామకు అగ్గి నేను వడ్తా..’ మళ్లి అంతే స్థిరమైన స్వరంతో లక్ష్మి.
‘ఆ .. బాపూ... ఇప్పుడే అగ్గివెట్టింది అమ్మ’ ఫోన్‌లో చెప్పాడు సత్యం కొడుకు.
ఆ మాట వినగానే తన రూమ్మేట్స్‌ని పట్టుకొని ఏడ్చేశాడు సత్యం. అతనిని ఆపడం అక్కడున్న ఆ నలుగురి తరమూ కాలేదు.
‘ఊకో.. సత్యం.. పోయినోడు రాడు కదా.. గిప్పుడు చేయాల్సినవి చేద్దాం..’ అని సముదాయించారు దోస్తులు.
‘గీడికి రా సత్యం.. ’అంటూ పిలిచాడు ఆ నలుగురిలో క్షురక వృత్తికి చెందిన ఒక దోస్తు.
ఏడ్చుకుంటూనే వెళ్లి అతని ముందు కూర్చున్నాడు సత్యం. ఊర్లో తండ్రి చితి ఆరిపోయేలోపు సత్యం గుండు చేయించుకున్నాడు. తర్వాత చేయాల్సిన కార్యక్రమాలనూ తన గదిలోనే చేశాడు.
సెల్‌ఫోన్‌లో ఉన్న తండ్రి ఫొటోను ప్రింట్ తీయించి.. గదిలో పెట్టి.. నివాళులర్పించాడు. పదోరోజు తండ్రికి ఇష్టమైన వంటకాలను వండాడు. అతని రూమ్మేట్స్ మందు తెచ్చి .. స్నేహితుడి ‘కడుపు చల్ల (తెలంగాణలో చావు విందులో ఈ ప్రక్రియ ఒక భాగం) చేశారు. ఆరోజు రాత్రి.. తండ్రి జ్ఞాపకాలతో జాగారమే అయింది సత్యానికి.
‘ఎంత పాపం చేశాడు? బతికున్నప్పుడు ఏనాడూ అతని కష్టం అర్థంచేసుకోలేదు. అర్థమయ్యే నాటికి మనిషే లేకుండావాయే! గిప్పుడు.. గీడ.. దేశం కాని దేశంలో ..గిదేం కర్మ? గుండు కొట్టించుకుంటే ఏమొస్తది? పిట్టకు పెడితే ఏమొస్తది? గివన్నీ సూడొస్తడా బాపు? అసలు తెలుస్తదా ఆయనకు? ఒరేయ్.. పోయినోల్లకు చేసుడు కాదురా.. గిప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఉన్న అవ్వనన్నా మంచిగ చూసుకో. తిన్నవా? పన్నవా? పానం బాగుందా ? అని అర్సుకో. సంపాదించిందాంట్లేకెంచి అవ్వకోసమని ఇంత పక్కన వెట్టు’ అని సత్యం సత్యానికి చెప్పుకుంటున్నాడు.
అతని ప్రవర్తనకు విస్తుపోయిన దోస్తులు ‘సత్యం..’ అంటూ అతని భుజం తట్టారు ‘ఏమైందిరా’ అన్నట్టు.
సత్యానికి వాళ్లు కనిపించట్లేదు.. వాళ్ల మాట వినిపించట్లేదు. తనకు తానే కనిపిస్తున్నాడు.. వినిపిస్తున్నాడు.
- సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment