‘బాపూ.. ఈసారి అచ్చేటప్పుడు టేప్‌రికార్డ్ (టేప్‌రికార్డర్) తేవే. ఊకే లక్ష్మయ్యబాపోళ్లింటికొచ్చి మాట్లాడుడు మంచిగనిపిస్తలేదు’
‘అగో.. మేమేం అన్నమావోయ్.. గట్ల జెప్తున్నవ్ మీ బాపుతోని?’
‘యే... గా పోరడు మాటలు వట్టించుకుంటావానోయ్? టేప్‌రికార్డ్ మీద షోకుతోని ఆల్ల బాపుకి గట్ల జెప్తుండు. నువ్వేందిరా పొల్లగా..సోల్ది వెడ్తున్నవ్ మెల్లగా?’ అంటూ వీపు మీద ఒక్కటి చరిచిన శబ్దం.
‘ఏ.. అమ్మ నువ్వూకో.. అన్నా.. నువ్వు పక్కకు జరుగు’
‘ఆ.. దా... మాట్లాడు.. ’ ఎక్కసెక్కం. ఇంతలోకే పక్కకు తోసేసి ముందుకు వచ్చి గొంతు సవరించుకున్న శబ్దం.. ‘బాపూ.. మంచిగున్నవానే! టైమ్‌కి తింటున్నవా? ఎండలెక్కువైనయంట కదా.. పేపర్ల చదివిన. బాపూ ఒకవేళ సద్ది ఖరాబైతే తినకే. పడేయ్. ఇంటున్నవా? పైలమే. ఇగో.. అన్న ఏమేమో జెప్తడు ఈసారి టేప్‌రికార్డ్ తీస్కరా.. వాచీ తీస్కరా అన్కుంట. గవ్వేం బట్టిచ్చుకోకు. నేను మంచిగనే సదువుకుంటున్న. మల్లా జెప్తున్నా.. ఖరాబైన సద్ది తినకే.. పడేయ్’
‘సాల్తియ్ చెప్పినకాడికి. పక్కకు జరుగు. ఇగో.. మీ షిన్నమ్మోల్ల అత్త షెప్పంపింది.. ఈ దీపావళికి మీ బామ్మర్దికి ఉంగురం వెట్టాల్నట. నువ్వు పంపిస్తెనే పెట్టుడు.. లేకపోతే నువ్వే ఆల్లకు సముదాయించుకో. మీ పెద్దమ్మి పెనిమిటికి ఏం బెట్టలేదు. గిప్పుడు షిన్నమ్మికి మొగడికి వెడితే పెద్దమ్మి ఊకుంటదా? నువ్వే ఇచారం జేస్కో ?’ అని ఇంకేదో చెప్పబోతుండగా..
‘అమ్మా.. గా జోలి ఎందుకిప్పుడు? బాపుకి లేనిపోని అల్లర వెడ్తవా ఏందీ?’
‘అగో..పెద్దోల్లనడుమ నువ్వెందే దీపా? షిన్నదాన్వి షిన్నదాన్‌లెక్కుండు’
‘ గాల్లింటి ముచ్చట నీకెందుకు మరి? బీడీల షాట పక్కకు వెట్టి అన్నం బెట్టుపో.. లెవ్.. ’
‘బాపూ. బా.......పు... ఎ....ప్పు.....డు... ’ అంటూ క్యాసెట్‌లో రీలు అరిగిపోయిన సంకేతం. కాసేపటికి అదీ ఆగిపోయింది.
ఆ సంభాషణంతా ఆత్రంగా వింటున్న పదిహేనేళ్ల సంహితకు ఆ డిస్టర్బెన్స్ చిరాకు పుట్టించింది. ఏం చేయాలో తెలీక స్టాప్ బటన్ నొక్కి దాని హ్యాండిల్ పట్టుకొని ‘అమ్మా.. ’అని గట్టిగా పిలుస్తూ హాల్లో ఉన్న తల్లి దగ్గరకు వెళ్లింది.
‘ఏంది నీ లొల్లి?’ అడిగింది అమ్మ.
‘టేప్‌రికార్డర్‌లో క్యాసెట్ స్ట్రక్ అయినట్టుంది?’ ఏడుపు మొహంతో సంహిత.
‘ఓయ్.. ఏంచేశావ్ దీన్ని? నాకోసం మస్కట్ నుంచి మా బాపు తెచ్చిన గిఫ్ట్ తెలుసు కదా?’ బెదిరించినట్టుగా అంటూ కూతురు చేతుల్లోంచి టేప్‌రికార్డర్‌ను తీసుకుంటూ తన గదిలోకి నడిచింది ఆమె.
తెలుసు అన్నట్టుగా తలూపుతూ తల్లి వెనకాలే వెళ్లింది.
మంచమ్మీద కూర్చుంటూ టేప్‌రికార్డర్‌లోని ఎజెక్ట్ బటన్ నొక్కింది ఆమె. రీల్ అంతా చుట్టుకుపోయి క్యాసెట్ బయటకు రాలేదు. కింద మోకాళ్ల మీద కూర్చోని తను చేస్తున్న పనినే కుతూహలంగా చూస్తున్న కూతురునుద్దేశించి ‘ఇది మంచిగైంతర్వాత వినొచ్చుగని.. అప్పటిదాకా చదువుకో.. పో’ అన్నది ఆమె.. ఆజ్ఞాపిస్తున్నట్టుగా . ‘ఊ...’ అంటూ విసురుగా లేచి అలిగినట్టుగా పాదాలను నేలకేసి కొడ్తూ తన గదిలోకి వెళ్లిపోయింది సంహిత.
నిట్టూరుస్తూ చేస్తున్న పనిమీదకు దృష్టి మరల్చింది మళ్లీ.
రీల్ తెగిపోకుండా మెల్లగా బయటకు తీసి.. పక్కనే రీడింగ్ టేబుల్ మీదున్న పెన్ ఫోల్డర్‌లోంచి ఓ పెన్ను తీసి క్యాసెట్ చక్రాల్లో పెట్టి తిప్పింది. రీల్ అంతా క్రమంగా చుట్టుకోవడం ప్రారంభించింది. ఆమె జ్ఞపకాలు కూడా.
ఆ ఇంట్లోంచే కాదు వాళ్లూరు నుంచే గల్ఫ్‌కు వెళ్లిన ఫస్ట్ పర్సన్ తన తాత . ఊర్నుంచి బస్‌లో బొంబైకి .. అక్కడ్నించి ఓడలో దుబాయ్‌కి పోయిండని. ‘ఎప్పుడో మూణ్ణెలకు ఒక్కపారి లెటర్ రాపిచ్చేటోడు బిడ్డా..’ అని నానమ్మ చెప్పిన మాట గుర్తుగురాగానే టేప్‌రికార్డర్ మంచం మీద పెట్టి.. మంచం కింద ఉన్న సందుగ బయటకు లాగి..ఆ పెట్టెను తెరిచింది. అందులోంచి రంగు మారిన రెండు మూడు ఉత్తరాలు, ఒక క్యాసెట్‌ను తీసుకుంది. అలాగే మంచం మీద కూర్చుని క్యాసెట్‌ను ఒళ్లో పెట్టుకొని.. ఒక ఉత్తరం మడత విప్పింది. ఆ మడతలోంచి మరో కాగితం మడత ఆమె ఒళ్లో పడింది. ముందు ఆ కాగితం తీసింది.
అది తన బాపమ్మ .. తాతకు రాయించి.. ఎవరిచేతనో దుబాయ్‌కు పంపించాలని పెట్టిన ఉత్తరం. వెళ్లేవాళ్లు లేక అది అలాగే ఉండిపోయింది. చిన్నత్తమ్మ పెద్దమనిషి అయినప్పుడు ఆ సంగతి తాతకు చెప్పేతందుకు రాపిచ్చింది. అప్పటికే పెద్దత్త పెద్దమనిషై మూడేండ్లయిందట.. ఆ పిల్లనే పెండ్లికాక ఇంటిమీదున్నది.. ఇక షిన్నపిల్ల కూడా అయిందని ఊర్లె తెలిస్తే ఇకారం అని ఆ సంగతి ఎవ్వరికీ తెల్వనియ్యద్దని.. ఇంట్లదింట్లనే ఫలహారాలు చేస్కుంటమని తాతకు జెప్తూ రాయించిన ఉత్తరం. అది చదువుకొని నవ్వుకుంది ఆమె. ఆ ఉత్తరం రాసిన మనిషి అప్పటి సర్పంచ్. ఇంటికి వొయ్యి ఆ సంగతి ఆయన తన భార్యకు చెప్తే. ఆమె ఊరంతా చెప్పిందట.. లాస్ట్‌కొస్తే చిన్నత్తమ్మ ఫంక్షన్‌కి రెండు యాటలు తెగినయట. ఇది చెప్పుకుంట బాపు మస్తు నవ్వెటోడు.
‘బాపు’ అనుకోగానే తన ఒళ్లో ఉన్న క్యాసెట్ గుర్తొచ్చింది. గబగబా దాన్ని టేప్‌రికార్డ్‌లో పెట్టి ‘ప్లే’ నొక్కింది.
గుర్ మంటూ సన్నగా శబ్దం చేస్తూ తిరగడం మొదలుపెట్టింది అది.
‘అయిదు అంతస్తుల మీద కెంచి వడ్డ. గట్లెట్లవడ్డనో అర్థమయితలేదు బిడ్డా... ఎప్పట్లెక్కనే మస్కున్నే వోయిన పనికాడికి. హుషార్గనే ఉన్నా.. పదకొండు గొట్టింటుంది బిడ్డా టైమ్.. ఎండ పాడైపోను.. మస్తుగెల్లింది’ నీరసంగా ఉంది ఆ గొంతు. ‘ఆ ఎండకో.. మరేంటికో తెల్వదు బిడ్డా.. ఒక్కపారిగా చెక్కరచ్చినట్టయింది.. గంతే ఏమైందో తెల్వదు.. తెల్వికొచ్చేపరికల్లా.. దవాఖాన్లున్న. నడుము బొక్క ఇర్గిందంట్రు బిడ్డా...నడ్సుడు బందేనట నేను. సచ్చేదాక గిట్ల మంచంలనే అంటున్రు..’ మూలుగుతూ సాగుతోంది ఆ స్వరం.
‘మల్ల మిమ్లను జూస్తనన్న ఆశైతే లేదు. నువ్వు మంచిగ సదువుకో బిడ్డా.. టీచర్ గావాలే. మీ తాత తర్వాత మనూర్లెకించి మళ్లా అవుటాఫ్‌కచ్చింది నేనే. గట్ల నువ్వు కూడా ఫస్టుండాలే బిడ్డా. మనూరి ఆడివిల్లల్లందరి కంటే బగ్గ సదుకోవాలే నువ్వు. టీచర్‌వి కావాల్రా బిడ్డా.. అమ్మను, అన్నను సూత నువ్వే జూసుకోవాల...’ ఇక వినలేక స్టాప్ బటన్ నొక్కేసింది. దుఃఖం ఆగట్లేదు. ఆ టేప్‌రికార్డ్‌ను హత్తుకొని ఏడుస్తోంది.
ఆ గది గుమ్మం దగ్గరుండి అంతా విన్న సంహిత.. తల్లి దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఆమెను వాటేసుకుంది.
‘తాత భయపడ్డట్టుగానే అమ్మవాళ్లను అతను చూడలేదు మళ్లీ. మస్కట్‌లోనే ప్రాణాలు వదిలాడు. తాత ఫైనల్ రిచ్యువల్స్ కూడా ఇండియాలో జరగలేదు. కాని అమ్మ.. గ్రేట్. తాత విష్‌ను ఫుల్‌ఫిల్ చేసింది. టీచర్ కాదు.. ప్రొఫెసర్ అయింది. వాళ్ల ఊరి నుంచి లండన్ వచ్చిన ఫస్ట్ పర్సన్... అమ్మ. మా అమ్మ’ అనుకుంటూ తల్లిని మరింతగా కరుచుకుపోయింది ఆ పిల్ల.
Comments
Please login to add a commentAdd a comment