ఋతధ్వజుడి తండ్రి శత్రుజిత్తు మహారాజు. ఒకనాడు శత్రుజిత్తు కొలువుదీరి ఉండగా, గాలవుడు అనే బ్రాహ్మణుడు ఒక అశ్వాన్ని తీసుకుని వచ్చాడు. ‘‘మహారాజా! ఒక రాక్షసుడు నా ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నాడు. మాయావి అయిన ఆ రాక్షసుడు ఏనుగు, సింహం వంటి జంతువుల రూపాలు ధరించి, అడవినంతా అల్లకల్లోలం చేస్తున్నాడు. వాడిని శపించడానికి నా శక్తి చాలదు. ఒకవేళ శపించినా, నా తపస్సంతా వ్యర్థమైపోతుంది. వాడిని ఏమీ చేయలేకపోతున్నానే అనే నిస్సహాయతతో ఆకాశంవైపు చూసి నిట్టూర్చాను. అప్పుడు ఆకాశం నుంచి ఈ దివ్యాశ్వం భూమి మీదకు వచ్చింది. అదే సమయంలో అశరీరవాణి ఇలా పలికింది:
‘ఈ దివ్యాశ్వం భూమి మీదనే కాదు, ఆకాశ మార్గంలోను, పాతాళంలోనూ సంచరించగలడు. గిరులను, సాగరాలను అధిగమించగలదు. సమస్త భూమండలాన్నీ శరవేగంగా చుట్టేయగలదు. అందువల్ల దీనిపేరు కువలయం. శత్రుజిత్తు మహారాజు కొడుకు ఋతధ్వజుడు దీనిని అధిరోహించి, నీ తపస్సుకు ఆటంకం కలిగిస్తున్న అసురాధముణ్ణి సంహరించగలదు’ అని చెప్పింది’ అని పలికాడు.
గాలవుడి మాటలు విన్న శత్రుజిత్తు తన కుమారుడు ఋతధ్వజుణ్ణి పిలిచి, ఆ అశ్వాన్ని అప్పగించి, గాలవుడి ఆశ్రమానికి రక్షణగా పంపాడు. ఋతధ్వజుడు గాలవుడి ఆశ్రమానికి వెళ్లి, ఆశ్రమవాసులందరికీ రక్షణగా ఉండసాగాడు. ఋతధ్వజుడు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలియని రాక్షసుడు యథాప్రకారం అడవిపంది రూపం ధరించి వచ్చి, నానా బీభత్సం మొదలుపెట్టాడు. ఆశ్రమంలోని గాలవుడి శిష్యులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీయసాగారు. ఋతధ్వజుడు వారి ఆర్తనాదాలు విని, కువలయాశ్వాన్ని అధిరోహించి, ఆగడం సాగిస్తున్న అడవిపంది వెంట పడ్డాడు. దాని మీదకు పదునైన బాణాలను సంధించి వదిలాడు.
బాణాల దెబ్బలు తాళలేక అడవిపంది రూపంలో వచ్చిన రాక్షసుడు అడవిలోకి పరుగు తీశాడు. రాక్షసుడి అంతు చూద్దామనే పట్టుదలతో ఋతధ్వజుడు వెంటాడసాగాడు. అడవి నలువైపులా పరుగులు తీసి అలసిపోయిన రాక్షసుడు ఒక పెద్ద గోతిలోకి దూకి మాయమయ్యాడు. ఋతధ్వజుడు కూడా తన కువలయాశ్వంతో పాటు ఆ గోతిలోకి దూకాడు. ఆ గోతిలోంచి అతడు పాతాళలోకానికి చేరుకున్నాడు.
పాతాళలోకం దేదీప్యమానంగా వెలిగి పోతోంది. ఎటు చూసినా బంగారు ప్రాకారాల ధగధగలు కనిపించాయి. ఇంద్రలోకంలాంటి పట్టణం కనిపించింది. ఋతధ్వజుడు ఆ పట్టణంలోకి వెళ్లాడు. వీథుల్లో ఎవరూ కనిపించలేదు. కాసేపటికి ఒక యువతి హడావుడిగా వెళుతూ కనిపించింది. ‘ఎవరు నువ్వు? ఎక్కడకు పోతున్నావు?’ అని ప్రశ్నించాడు. ఆమె బదులివ్వకుండా దగ్గర్లోనే ఉన్న ఒక మేడ మీదకు వెళ్లింది. ఋతధ్వజుడు ఆమెనే అనుసరిస్తూ మేడ మీదకు వెళ్లాడు. మేడపైన గదిలో ఒక సౌందర్యరాశి కనిపించింది. అపరిచితుడైన రాకుమారుడు అకస్మాత్తుగా తన గదిలోకి వచ్చేసరికి ఆమె చకితురాలైంది. వెంటనే మూర్ఛపోయింది.
ఋతధ్వజుడు వెంటనే ఆమె దగ్గరకు చేరుకుని, భయపడవద్దంటూ సముదాయించాడు. ఇంతలోనే ఆమె చెలికత్తె వచ్చి ఆ సౌందర్యరాశికి పరిచర్యలు చేయసాగింది. ‘ఆమె ఎందుకిలా మూర్ఛపోయింది’ అని చెలికత్తెను ప్రశ్నించాడు ఋతధ్వజుడు.
‘ఈమె గంధర్వరాజు విశ్వావసుడి కుమార్తె మదాలస. నేను ఈమె చెలికత్తెను. నా పేరు కుండల. మదాలస వనంలో ఆటలాడుకుంటుండగా, పాతాళకేతువు అనే రాక్షసుడు ఆమెను అపహరించుకు వచ్చాడు. వచ్చే త్రయోదశినాడు ఈమెను వివాహం చేసుకోబోతున్నాడు. అధముడైన రాక్షసుణ్ణి పెళ్లిచేసుకోవడం ఇష్టంలేక ఈమె నిన్ననే ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడు ఒక గోమాత వచ్చి, భూలోకం నుంచి ఒక రాకుమారుడు వస్తాడని, రాక్షసుడిని చంపి మదాలసను వివాహమాడతాడని చెప్పింది. మిమ్మల్ని చూసిన మోహావేశంలో మా రాకుమారి మూర్ఛపోయింది. మీరు దైవాంశ సంభూతుల్లా ఉన్నారు. మామూలు మానవులు ఇక్కడ అడుగుపెట్టలేరు. మీ వృత్తాంతం చెప్పండి’ అంది కుండల.
ఋతధ్వజుడు తనను తాను పరిచయం చేసుకుని, ఏ పరిస్థితుల్లో అక్కడకు వచ్చాడో వివరించాడు. ఇంతలో మూర్ఛనుంచి తేరుకున్న మదాలస తన ఎదుట ఉన్న రాకుమారుణ్ణి చూసి సిగ్గుపడింది. ‘రాకుమారా! ఈమె మీ మీద మనసుపడింది. గోమాత చెప్పిన రాకుమారుడు మీరే! గోవు అసత్యం చెప్పదు. అందువల్ల మీరు ఈమెను వివాహం చేసుకోండి’ అని కోరింది కుండల.
‘ఈమెను వివాహమాడటం నాకూ ఇష్టమే గాని, తండ్రి అనుమతి లేకుండా ఇప్పటికిప్పుడు ఎలా వివాహం చేసుకోగలను?’ అన్నాడు ఋతధ్వజుడు.
‘రాకుమారా! ఈమె దేవకన్య. ఇది ముందే జరిగిన దైవనిర్ణయం. మీరు అభ్యంతరం చెప్పకుండా ఈమెను వివాహం చేసుకోండి’ అంది కుండల. ‘సరే’నన్నాడు ఋతధ్వజుడు. కుండల వెంటనే తమ కులగురువైన తుంబురుణ్ణి స్మరించింది. తుంబురుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్కడికక్కడే అగ్నిహోత్రాన్ని వెలిగించి, మదాలసతో ఋతధ్వజుడికి శాస్త్రోక్తంగా వివాహం జరిపించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుండల కూడా సెలవు తీసుకుని, గంధర్వలోకానికి వెళ్లిపోయింది.
ఋతధ్వజుడు మదాలసను తీసుకుని, అక్కడి నుంచి బయలుదేరడానికి కువలయాశ్వాన్ని అధిరోహించాడు. మదాలసతో అతడు అశ్వంపై వెళుతుండగా గమనించిన రాక్షసులు అతడి మీద దాడి చేశారు. వరుసగా ఆయుధాలను రువ్వారు. ఋతధ్వజుడు వారందరినీ ఎదుర్కొన్నాడు. తన బాణాలతో వారి ఆయుధాలను తుత్తునియలు చేశాడు. రాక్షసుల ద్వారా సంగతి తెలుసుకున్న పాతాళకేతువు స్వయంగా రంగప్రవేశం చేశాడు. ఋతధ్వజుడిపై అస్త్రాలను సంధించాడు.
ఋతధ్వజుడు అతడి అస్త్రాలన్నింటినీ తన దివ్యాస్త్రాలతో నిర్వీర్యం చేశాడు. చివరగా త్వాష్ట్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం పాతాళకేతువు సహా రాక్షసులందరినీ మట్టుబెట్టింది. ఋతధ్వజుడు మదాలసతో కలసి క్షేమంగా తన రాజ్యానికి చేరుకున్నాడు. తండ్రికి జరిగినదంతా చెప్పాడు. శత్రుజిత్తు కుమారుణ్ణి ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. కోడలిని చూసి అభినందించాడు. — సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment