Sunday Stories
-
సంచార సన్నాయి..
చినపోలమ్మ జాతర.. కనులపండుగ్గా జరుగుతోంది. ఊక పోస్తే ఊక రాలనంత జనం. ఆడవాళ్ళంతా తల మీద ఘటాలతో ఊగిపోతున్నారు. మగవాళ్ళంతా కోళ్లు, గొర్రెలు పట్టుకొని ముందుకు సాగిపోతున్నారు. డప్పుల మోతలు.. యువకుల చిందులు.. కలగలుపుగా ధూళి రేగుతూ జాతర ఘనంగా జరుగుతోంది.కిట్టడు మహా గొప్పగా, చాలా నేర్పుగా గాల్లోకి తారాజువ్వలు వదులుతున్నాడు. వాడు వదిలిన తారాజువ్వ సాయంత్రపు నీరెండలో ఇంద్రధనుస్సు రంగులను తలపిస్తోంది. ‘బాణసంచా కట్టాలంటే కిట్టడే కట్టాల! వాటిని మళ్ళీ వాడే వదలాల..’ జనం కిట్టడిని ప్రశంసలతో ముంచుతున్నారు. అందరి నోట కిట్టడే నానుతున్నాడు. రకరకాల బాణసంచా పేల్చి కిట్టడు తన ప్రతిభను చాటుకుంటున్నాడు.ఊరంతా సంబరంగా పొలిమేరకు చేరుకుంది. కిట్టడు కట్టిన బాణసంచలో అసలైంది నాగుపాము మందుగుండు. వెదుర్లతో పెద్ద ఎత్తున పాము ఆకారంలో కట్టి దానికి మందుగుండు జతచేసి కాల్చడానికి సిద్ధంగా ఉంచాడు. జనాలంతా తమ మొక్కులు చెల్లించుకుని, కిట్టడు కట్టిన నాగుపాము బాణసంచా కోసం ఆత్రుతగా ఎదురు చూడసాగారు. కిట్టడు దానిని వెలిగించడానికి వెళ్ళాడు. వత్తి ఎంత ముట్టిస్తున్నా వెలగడం లేదని రెండు మూడుసార్లు వెలిగించే ప్రయత్నం చేసి దాన్ని వదిలేసి వేరే దగ్గర ముట్టిద్దామని మరొక వత్తిని వెతికే పనిలో పడ్డాడు.ఇంతలోపు విధి వక్రించిట్టుగా ముందు ముట్టించిన వత్తి వేడికి నెమ్మదిగా రాజుకొని అంటుకుంది. అది గమనించి అక్కడ నుంచి కిట్టడు వెళ్ళేలోపే అందరూ ఊహించని ప్రమాదం జరిగింది. బాణసంచా వెలిగి నాగుపాము పగబట్టినట్లుగా కిట్టడి మీద విరుచుకు పడింది. నల్లగా బలంగా ఉన్న కిట్టడు.. శరీరం కాలిపోయి కమిలిపోయి నెత్తురోడి పడి ఉన్నాడు.‘గంగిరెద్దోలమయ్య మేము.. గరీబోలమయ్యా.. ఊరు వాడ తిరిగేము మేము గూడు లేక ఉన్నాము’ అనే పాటని సన్నాయి రాగంతో వీధిలో ఇంటింటికీ వెళ్ళి వినిపిస్తున్నాడు బసవన్న. కొంతమంది బియ్యం వేశారు. అయినా చాలామంది ఇళ్లల్లో టివీలు చూసుకుంటూ ‘చెయ్యోటం కాదు..’, ‘మళ్ళీ రా..’, ‘పనిలో ఉన్నాను..’ అనే మాటలే జోలిలో బియ్యం కన్నా ఎక్కువ వినిపించాయి. బసవన్న దిగులుగా ఊరు చివర బడి పక్కనున్న మర్రిచెట్టు నీడలో ఏర్పాటు చేసుకున్న గుడారం వైపు అడుగులు వేశాడు. చెట్టు దగ్గరకు చేరుకొని ఎద్దును చెట్టు మొదలకు కట్టి, దాని ముందు ఎండు గడ్డి పరకలు వేసి అక్కడే చతికిలపడ్డాడు. చెట్టు ఆకుల సందుల్ని చీల్చుకొని వస్తున్న ఎండ బసవన్న శరీరం మీద పడుతూ తన తాపాన్ని చూపించింది. ఒక్కసారిగా బసవన్నకు తన గతం గుర్తుకొచ్చింది..ఒకప్పుడు ఎద్దును పట్టుకొని బసవన్న వీధిలోకి వెళ్తే జోలి నిండిపోయేది. సంక్రాంతి సమయంలో మంచి గాత్రంతో బసవన్న పాడుతుంటే ప్రతివాళ్ళు తమ గురించి పాడించుకొని తమకు తోచింది తృణమో పణమో ఇచ్చేవారు. కాలం పగబట్టిన పాములా మారింది. మనుషులంతా ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలైపోయారు. ఎవరూ తమ జాతివారిని పట్టించుకోకపోగా అనుమానంగా, అవమానంగా చూడడం బసవన్నలో మరింత దిగులును పెంచింది.‘మాలాంటి గంగిరెద్దులోళ్ళు ఈదిలోకి వస్తున్నారంటే సాలు సిన్న పిల్లల్ని, కొత్త కోడల్ని దాసిపెట్టేత్తనరు. మేమేదో సిల్లంగి పెట్టేత్తామేమోనని భయపడతన్రు.. ఊరు ఊరు తిరుగుతూ జనాలని పొగిడి వాళ్లిచ్చే బియ్యం, డబ్బులు పుచ్చుకొని బతకడమే తెలుసును గానీ వాళ్ళ దయాభిక్ష మీద బతుకుతూ వాళ్ళకి ఎలా హాని తలపెడతామనుకుంతున్నారో’ అనే ఆలోచన బసవన్నలో మరింత అభద్రతా భావాన్ని పెంచి గోరుచుట్టు మీద రోకలి పోటులా అనిపించింది.ఎండ నడినెత్తికి ఎక్కింది. ఆలోచనల్లో నుంచి బసవన్న బయటికి వచ్చాడు. ఉదయాన్నే బొట్టుబిళ్లలు, కాటుకలు, పిన్నీసులు, తిలకాలు, అద్దాలు, పైన్లు (దువ్వెన్లు) అమ్ముకొద్దామని వెళ్లిన సోములమ్మ నిరుత్సాహంగా గుడారానికి చేరుకొంది. గబగబా గిన్నెలు కడిగి పొయ్యి మీద ఎసరు పెట్టింది. చెట్టుకానుకొని ఉన్న బడిలో మాస్టారు పిల్లలకి చెబుతున్న ‘రాకెట్ అంతరిక్ష ప్రయాణం’ అనే సై¯Œ ్స పాఠం బయటకి స్పష్టంగా వినిపిస్తోంది. బసవన్న ముగ్గురు పిల్లలు మర్రిచెట్టు దగ్గర మట్టిలో ఆడుకుంటున్నారు.ఊర్లో ఇచ్చిన పిండివంటలు కిట్టడికి, ఆమాసకి, పిక్కురుదానికి ఇచ్చి సోములమ్మ నీళ్ళు తేవడానికి బడి బోరింగ్ కాడికి వెళ్ళింది. నిర్జీవంగా ఎద్దు పక్కన కూర్చున్న బసవన్న దీర్ఘంగా ఆలోచనల్లో కూరుకుపోయాడు. నీళ్ళకుండ పట్టుకొస్తున్న సోములమ్మ భర్తను చూసి కుండ దించి దిగాలుగా ఉన్న భర్త పక్కన కూర్చుని ‘ఏమయ్యా.. అలా వున్నావు, ఒంట్లో ఏమైనా నీరసంగా వుందా..?’ అని అడిగింది.సోములమ్మ ప్రశ్నతో బసవన్న ఆలోచనలు చెరిగిపోయి ఈ లోకంలోకి వచ్చాడు. ‘ఏమీలేదే, కానీ..!’ ‘ఏవయిందయ్యా..!’ రెట్టించి అడిగింది సోములమ్మ.ఆమె వంక దిగులుగా చూస్తూ ఖాళీగా ఉన్న జోలిని చూపించి ‘పిల్లల్ని ఎలా పెంచాలో, మనం ఎలా బతకాలో తెల్డం లేదు. మా తాత, మా అయ్యల కడుపు నింపిన ఈ వుత్తి ఇప్పుడు మన కడుపులు నింపడం లేదే..’ అన్నాడు బసవన్న.‘అవునయ్యా.. ఊరు మొత్తం తిరిగినా బొట్లు, పిన్నీసులు కూడా అమ్ముడుపోవడం లేదు’ అంది సోములమ్మ. దూరంగా ఆడుకుంటున్న పిల్లలను చూసింది సోములమ్మ. బక్కచిక్కిన దేహాలతో, చింపిరి బుర్రలతో, కారుతున్న చీమిడి ముక్కులతో తమ తిరుగుడు బతుక్కి ప్రతీకలుగా ముగ్గురు పిల్లలు కనిపిపించారు.భార్యవైపు చూస్తూ ‘ఒకప్పుడంటే రేడియో ఒకటే కాబట్టి మనం ఈదిలోకి ఎల్తే అందరూ అడిగిమరీ పాటలు పాడిచ్చుకుని తోచిందిచ్చేవోల్లు. రోజురోజుకీ పరిత్తితులు మారిపోతున్నాయి సినీమాలు, టీబీలు, సెల్లుపోనులు వొచ్చాక మన పాటలు ఎవరింతారు..? పెతీ ఇంట్లోనూ టీబీ పాటలు, సెల్లు మాటలు తప్ప మనల్నెవులు పట్టించుకుంతారు.. వొస్తువులు పెరిగేకొద్దీ మన అవసరం తగ్గిపోతందే..’ అన్నాడు ఆవేదనగా బసవన్న.సోములమ్మ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె మదిలో కూడా అలాంటి బాధే సుడులు తిరుగుతోంది. కాసేపయ్యాక ‘సూడయ్యా.. గంగిరెద్దుల్నేసుకుని నువ్వు, బొట్టుబిళ్లలు, పిన్నీసులు, సవరాలు తీసుకుని నేనూ ఎన్నూర్లు తిరిగినా మన బతుకుల్లో శీకటి తప్ప ఎలుగు రాదు, మన పొట్టా నిండదు. కొత్తకొత్త పేషన్లు వచ్చిన తరువాత మన దగ్గర వస్తువులెవలు కొంతారు? ఇప్పుడింటికో కొట్టు, ఈదికో దుకాణం పెడతంటే పాతాటిని పట్టుకుని ఎవలు ఏలాడతారు’ అంది గుండెల్లో బాధను పంటి కింద నొక్కి పెట్టి పవిట కొంగున దాచిపెడుతూ.ఊరూరూ తిరుగుతూ గడిపే బసవన్న కుటుంబానికి తిండి కరువైపోయింది. ప్రభుత్వ పథకాలు పొందడానికి కావలసిన ఆధారాలు కూడా వాళ్ల దగ్గర లేవు. అటు సమాజం నుంచీ, ఇటు ప్రభుత్వం నుంచీ సాయం పొందే అవకాశం లేకుండా బసవన్న బతుకు రెంటికీ చెడిన రేవడిలా తయారైంది.ఇలాంటి ఒడిదుడుకులతోనే ఊరూరూ తిరుగుతూ తమ బతుకు బండిని నడిపించారు బసవన్న దంపతులు. తమ బతుకే ఇంత దీనావస్థ మధ్య సాగుతుంటే రానున్న కాలంలో తమ పిల్లలకి బతుకే ఉండదని భావించిన బసవన్న తన పదేళ్ళ పెద్దకొడుకు కిట్టడిని దగ్గర్లో ఉన్న పట్టణంలోని బాణసంచా దుకాణంలో పనికి కుదిర్చాడు. మిగిలిన ఇద్దరు చిన్న పిల్లల్ని తమ వెంటే తిప్పుతూ రోజుల్ని గడుపుతున్నారు. కిట్టడు ఐదు సంవత్సరాలపాటు బాణసంచా దుకాణంలో పని బాగా నేర్చుకొని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నాడు.ఇక తమ వృత్తి కడుపు నింపదని బసవన్న సోములమ్మలు ఒక నిర్ణయానికి వచ్చి పెద్దపల్లిలో ఉండిపోయారు. ఎప్పుడూ వేసుకున్న గుడారం కంటే ఈసారి ఇల్లు కాస్త దుటంగా వేసుకున్నారు. వీధుల్లో గంగిరెద్దు తిప్పడం మానేసి బసవన్న పొలం పనులకు కుదురుకున్నాడు. ఇంకా ఆశ చావని సోములమ్మ ఊర్లు తిరుగుతూ పిన్నీసులు, బొట్లు అమ్మడానికి వెళ్తుంది కానీ తన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోగా నిరాశే మిగులుతోంది.కిట్టడు ఊర్లో జరిగే పెళ్లిళ్లకు, జాతర్లకు, వారాల పండుగలకు మందుగుండు సామాన్లు కట్టే బేరాన్ని కుదుర్చుకొని తన గుడారం వద్దే సొంతంగా బాణసంచా కట్టడం మొదలుపెట్టాడు. ఆమాసగాడిని, పిక్కురుదానిని బసవన్న పెద్దపల్లిలో ఉన్న బడిలో చేర్చాడు. వాళ్ళిద్దరూ బడికి వెళ్తున్నారు కానీ వాళ్ళ ధ్యాసంతా ఇంటి దగ్గరే!బడి అలవాటు లేని ఆమాసగాడు బడిలో చెప్పాపెట్టకుండా ప్రతిరోజూ బయటకు వచ్చి చింతచెట్ల కింద, తోటల వెంట రహస్యంగా తిరుగుతూ ఒకరోజు బసవన్న కంటిలో పడ్డాడు. తిరుగుతున్న తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని ‘ఒరే ఆమాస..! సదువొక్కటే మనకి ఆయుదం. అదే మన బతుకుల్ని మారుత్తుంది, మనకొక దైర్నాన్నిత్తంది. ఊరూరూ తిరగడం తప్ప అచ్చరం ముక్క రాదు మాకు. కనీసం మీరయినా సదువుకుంటే బతుకులు బాగుంటాయిరా. సుకంగా ఉంటారు. అమావాస్య రోజు పుట్టావని అందరూ నిన్ను ఆమాస అని పిలుత్తుంతే నాకెంత బాధగా వుందో ఆలోశించావా? నువ్వు సదువుకుని గొప్పోడివయితే నీ అసలు పేరుతోనే నిన్నందరూ పిలుత్తారు, గౌరవిత్తారు’ అని చెప్పాడు.ఆమాస తండ్రివంక చూశాడు గానీ ఏమీ మాట్లాడలేదు. అతనికీ చదువుకోవాలనే ఉంది. అయినా స్థిరంలేని బతుకు కావడం వల్ల తిరగడం మీదే ధ్యాస తప్ప స్థిరంగా ఒకచోట కూర్చుని చదవాలంటే ఆమాసకి ఇబ్బందిగానే ఉంది. అయినా తండ్రి చెప్పిన మాట అతనిలో ఆలోచనలకు దారితీసింది.బాణసంచా పేలుడులో నెత్తురోడి పడి ఉన్న కిట్టడిని గ్రామస్థులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయారు. కిట్టడి విషయం తెలిసిన సోములమ్మ గుండెలు బాదుకుంటూ ‘మా తిరంలేని బతుకులకి ఎక్కడికి పోయినా సుకం లేదు. మా పని పోయి ఏదొక పని చేసుకొని బతుకుదామని అనుకున్నా దినం దీరడం లేదని’ ఏడుస్తూ భర్తతో కలిసి ఆసుపత్రికి చేరుకుంది.గాయాల మధ్య మూలుగుతూ బాగా కాలిపోయి ఉన్న కిట్టడిని చూసి నిశ్చేష్టులై భార్యాభర్తలిద్దరూ కూలబడిపోయారు. నర్సు వచ్చి ‘కిట్టడిని పెద్దాసుపత్రికి తీసుకువెళ్లాలి, ఆరోగ్యశ్రీ కార్డు, కోటా కార్డు, ఆధార్ కార్డు తీసుకురమ్మ’ని చెప్పింది. ఆ మాట విని ‘అవెక్కడ దొరుకుతాయ’ ని అమాయకంగా అడిగాడు బసవన్న.‘మీకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులయ్యా’ అంది నర్సు. ‘అలాంటివేవీ మా దగ్గర లేవు తల్లీ.. మేము ఊరూరు తిరుగుతూ జీవనం సాగించేవాళ్ళం. మాకంటూ తిరమైన ఇల్లు, వూరు లేవు తల్లీ.. గంగిరెద్దుకు ముస్తాబు చేసి తిరుగుతూ పొట్టపోసుకునే వాళ్ళమ’ ని చెప్తున్న బసవన్న వంక జాలి నిండిన కళ్లతో చూస్తూ ‘కంప్యూటర్ యుగంలో కూడా స్థిరమైన నివాసాలకు, విద్య, ఉద్యోగాలకు దూరంగా బతుకుతున్నారా?’ అని ఆశ్చర్యంగా బసవన్న వైపు చూసి అతన్ని తీసుకుని పక్కనే ఉన్న మండలాఫీసు వైపు నడిచింది నర్సు. అతని పరిస్థితి చెప్పి సర్టిఫికెట్ల విషయంలో సహాయం చేసింది.కొన్నాళ్ళకి కిట్టడి ఆరోగ్యం కుదుటపడింది. పూర్తిగా మానని గాయాల్ని తల్చుకునే కొద్దీ అతనిలో తెలియని వేదన మొదలయింది. తనను ఇంట్లో కూర్చోబెట్టి రోజూ కూలిపనులకెళ్ళి తిండి పెడ్తున్న తల్లిదండ్రుల కష్టం అతన్ని మరింతగా కుంగదీయసాగింది. ఇంతకాలం పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ శ్రమ అతన్ని ఒక రకమైన ఉద్వేగానికి గురిచేసింది. తన తర్వాత పుట్టిన తమ్ముడు, చెల్లెలి భవిష్యత్తు గురించి కిట్టడికి ఆలోచనతో పాటు ఆందోళన కలిగింది. ఒకరోజు తల్లి దగ్గరికెళ్లి ‘అమ్మా మరి నేను ఈ బాంబుల పని సెయ్యడం మానేసి పట్నంలో ఏదైనా పనిలో కుదురుకుంటానే’ అన్నాడు.మొహానికి, చేతులకు గాయాలతో ఉన్న కొడుకు వైపు దిగులుగా చూసింది. ప్రమాదం తాలూకు ఙ్ఞాపకాలు ఆమెనింకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన కొడుకు మళ్ళీ ఊపిరి పోసుకుని తనముందు తిరగడం సంతోషంగానే ఉంది. అయినా మళ్ళీ ‘పని పేరుతో’ కొడుకు దూరమవుతానంటుంటే ఆమెలో ఏదో తెలియని ఆందోళన కలిగింది.కొడుకు వైపు చూస్తూ ‘పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీలు తాగడం మేలు అయ్యా. బతకడం కోసం తలో దిక్కు అయిపోవడం కన్నా, అందరం ఒకే దిక్కులో ఉండి గెంజి తాగి బతకుదాం’ అంది సోములమ్మ. ఏమీ మాట్లాడని కిట్టడు తల్లివైపు చూస్తూ బయటికి నడిచాడు. అతనికంతా అయోమయంగా ఉంది. ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా, తల్లిదండ్రులకు భారంగా ఉండలేకపోతున్నాడు. ఆలోచనలతోనే గంగిరెద్దులకు గడ్డివేస్తూ వాటివైపు చూశాడు కిట్టడు.ఒక్కసారిగా అతనికి బాలాజీ మాస్టారు గుర్తొచ్చారు.. ‘ఒరే కిట్టా..! మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలిరా..’ అని బాలాజీ మాస్టారు చెప్పిన మాటలు కిట్టడి చెవుల్లో మారుమోగుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా కిట్టడికి మనసులో ఏదో స్ఫురించినట్లయింది. గబగబా గుడిసెలోకి నడిచి తండ్రి సన్నాయి వైపు చూశాడు, ఆప్యాయంగా దానిని తడిమాడు.పోగొట్టుకున్న అపూర్వ వస్తువేదో తనను ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది. సన్నాయిని చేతుల్లోకి తీసుకోగానే కిట్టడిలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. పారేసుకున్న వారసత్వ సంపద పరిగెత్తుకుని వచ్చి తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా అనిపించింది. సన్నాయిని పెదవులకు ఆనించి ఊదడం మొదలుపెట్టాడు కిట్టడు. నాభి నుంచి గొంతువరకు ఏదో ఆత్మీయ సంగీతసాగరం ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. తెలియని కొత్త అనుభూతి అతన్ని నిలువెల్లా కుదిపేయసాగింది. సన్నాయి రాగంతో పాటు అతని కళ్లు కూడా గంగాప్రవాహంలా మారాయి.గంగిరెద్దును తీసుకొని కిట్టడు వీధి బాట పట్టాడు. తనకొచ్చిన పాటల్ని అలవోకగా సన్నాయి మీద పలికిస్తున్న కిట్టడు అతి కొద్ది కాలంలోనే జనాల్ని ఆకర్షించాడు. కిట్టడి గొంతు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కసాగింది. జోలి నిండా బియ్యం, చేతి నిండా డబ్బులు రావడంతో అతనిలో ఉత్సాహం రెట్టింపయింది. రోజూ ఇలా కిట్టడు వీధిలో ప్రదర్శిస్తున్న దృశ్యాన్ని ఒకరోజు బాలాజీ మాస్టారు సెల్ ఫోనులో వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు.ఇప్పుడు కిట్టడు పాత కిట్టడిలా లేడు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని తన తండ్రి నుంచి వచ్చిన ‘సన్నాయి కళ’కు కొత్త జీవం పోసే పనిలో నేర్పు సంపాదించాడు. ఖాళీ సమయాల్లో తన తండ్రి బసవన్న చేత గంగిరెద్దుని ఆడించడం, వాటికి శిక్షణ ఇచ్చే విధానం, సన్నాయితో పాటలు పలికించే పద్ధతుల్ని చిన్న చిన్న వీడియోలుగా తీసి వాటిని యూట్యూబ్‌లో నేరుగా కిట్టడే అప్లోడ్ చేయసాగాడు.ఆ వీడియోలు చూసే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగి కిట్టడి గంగిరెద్దుల కళకి ప్రాచుర్యం లభించింది. పట్టణాల్లో పెద్దపెద్ద డబ్బున్నవాళ్ళ వివాహాల్లో కిట్టడి ప్రదర్శన కళ హుందాగా తయారైంది. కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కిట్టడి గంగిరెద్దుల కళ వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచింది.‘ఈ కొత్తకొత్త పరికరాలు వొచ్చి మా వుత్తిని రూపుమాపి కడుపు కాల్చితే.. ఈ సాధనాల్నే వుపయోగించి మా కిట్టడు మళ్ళీ మా వుత్తికి జీవం పోశాడు. ఎన్నాళ్ళుగానో అనుకుంతున్న సొంతింటి కల నెరవేరబోతోంది..’ అనుకుంటూ ‘తన కలని, కళని బతికించిన’ కిట్టడి వైపు బసవన్న ఆప్యాయంగా చూశాడు. – సారిపల్లి నాగరాజు -
ఫోటోగ్రాఫర్..!
చాలా ఏళ్ళ నా కల FRAMES ఫొటో స్టూడియో. ఆ రోజే ఓపెనింగ్. మా గురువుగారు విచ్చేసి స్టూడియోకి ఒక కాప్షన్‌ని కానుకగా ఇచ్చారు.‘There's more to life that meets the camera eye!’. ‘ఈ కాప్షన్కి అర్థమేంటి గురువు గారు?’ అడిగాను నేను.'You don't have to know everything. You'll know it when you see it' అన్నారాయన.ఆయన ఎందుకలా అన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎప్పటికైనా సరే, ఈ కాప్షన్ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలనిపించింది. స్టూడియో ఓపెనింగ్ రోజున గంగిరెద్దుల్ని ఆడించే ఆయనొచ్చాడు. నాకు శుభసూచకంగా అనిపించింది. చిన్నప్పటి నుండి సంక్రాంతి వచ్చిందంటే చాలు వారితో వీధులు కళకళలాడిపోయేవి. అందుకే వారిని చూసినప్పుడల్లా శుభానికి చిహ్నాలుగా నా స్మృతిపథంలో మిగిలిపోయారు. ఆ గంగిరెద్దులాయన నా ముందు తన కోరికను వెలిబుచ్చాడు.‘బాబయ్యా, మా బసవణ్ణతో ఒక్క ఫొటో తీసిపెట్టవా? బసవడితో ఒక్క ఫోటో దిగాలన్న కోరిక అలాగే మిగిలిపోయుండాది.’నేను సమాధానం ఇచ్చేలోపే మా గురువుగారు అడ్డుపడ్డారు. ‘ఫ్రేమ్ అప్పర్స్ అని ఫ్రేమ్ డౌనర్స్ అని ఉంటారు. ఫొటోగ్రాఫర్ మొదటి ఫ్రేమ్ అందంగా ఉండాలి. రోజూ చూసే మొహాల్ని ఏం తీస్తాం చెప్పు’అంటూ నవ్వాడు ఆయనొక్కడే.ఆ గంగిరెద్దులాయనే కాదు నేను కూడా ఎంతగానో నొచ్చుకున్న సందర్భం అది. కానీ గురువుగా ఆయననే ఆహ్వానించాను కాబట్టి, ఆ రోజున ఆయన మాటకు ఎదురు చెప్పలేకపోయాను. బాధతో నిష్క్రమించిన ఆ గంగిరెద్దులాయన మాత్రం నా మస్తిష్కం అనే ఫొటోస్టూడియోలో ఫ్రేమ్‌గా మిగిలిపోయాడు.నేనొక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌ని. పైగా నాస్తికుడిని కూడా. నాకు ఫొటోగ్రఫీ నేర్పించిన గురువుగారి ప్రభావం నాపై చాలా ఉండేది. ఆయన ఏం చేస్తే అది చేస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఎథీస్ట్ అని తెలిసింది ఒక రోజున. ఆ ఇంగ్లిష్ పదానికి అర్థం తెలియకపోయినా నేనూ అదేనంటూ ప్రగల్భాలు పలికా నా మిత్రుడితో. అతను పరమ భక్తుడు. వెంటనే నవ్వేశాడు.‘ఎందుకు నవ్వుతున్నావ్?’ ‘ఆ పదానికి అర్థం కూడా తెలీకుండా నేనూ అదే అంటూవుంటే నవ్వొచ్చిందిరా!’‘అయినా దేవుడు ఎక్కడున్నాడురా? క్లాస్‌లో మన సర్ చెప్పింది వినలేదా? ఆయన లాజిక్ నూటికి నూరు శాతం కరెక్ట్. కనిపించని వాటిని నమ్మకపోవటమే నయం.’ ‘ఒకటి లేదు అంటున్నావంటేనే దాని ఉనికిని నువ్వు అంగీకరిస్తున్నట్టే లెక్క కదరా..‘‘అర్థం కాలేదు!’ ‘ఒకప్పుడు ఉండటం అంటూ జరిగితేనే కదా ఇప్పుడు లేకపోవటం అంటూ జరిగేది. ఒక వస్తువు ఇక్కడ పెట్టావు. అదిప్పుడు లేదు. ఒక అరగంట క్రితం ఇక్కడే ఉంది. ఇప్పుడు నీ ముందు లేదంతే. ఎక్కడో ఉంది. అది నీకు కనబడట్లేదు.’‘అర్థం అవుతున్నట్టే ఉంది. కానీ నువ్వు భక్తుడివి కాబట్టి నేను కన్విన్స్ అవ్వట్లేదురా..’ ‘ఉంది అన్నా, లేదు అన్నా దాని ఉనికిని అంగీకరిస్తున్నట్టే అవుతుంది కదరా! అసలు ఆ బ్రహ్మ పదార్థం ఉందో లేదో అనుభవం ఉన్నవాళ్లు చెప్పాలి. దైవత్వం అనుభవంలోకి వస్తే ఇంకా మాటలెందుకు మిగులుతాయి చెప్పు..? కాబట్టి వ్యర్థమైన వాదనలతో కాలాన్ని వృథా చేసుకోకు. ఆయన గురువే కావొచ్చు. ఆయన చెప్పిన దాంట్లో నీకు పనికొచ్చే విషయాల్ని మాత్రమే తీసుకో! అనవసరం అయిన వాటి జోలికి వెళ్ళకు. మిత్రుడిగా నీ మంచి కోరి చెబుతున్నా. ఇక నీ ఇష్టం!’వాడి మాటల్లో ఏం మాయ ఉందో తెలీదు కానీ, కేవలం ఫొటోగ్రఫీ పైనే దృష్టి పెడుతూ మిగతా విషయాల్ని పక్కన పెట్టేశాను. అప్పటి నుండి మంచి ఫొటోగ్రాఫర్ అవ్వటమే లక్ష్యంగా పనిచేశాను. అలాంటి నేను ఇప్పుడు చేతిలో పనిలేకుండా అయిపోయాను. రోజూ స్టూడియోకి వెళుతున్నాను. పని ఉండట్లేదు. దానికి కారణం స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ అని నా ప్రగాఢ నమ్మకం.ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌ని నేనెప్పుడూ వాడలేదు. ఎందుకో ఆ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని చూస్తేనే చిరాకు. నాలాంటి ఎంతోమంది ఫొటోగ్రాఫర్లకు పనిలేకుండా చేస్తోంది. ఒకప్పుడు పాస్‌పోర్ట్ సైజు ఫొటో కోసం ఎగబడేవాళ్లు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తోనే తీసి అప్లోడ్ చేసి పంపించేస్తున్నారు చాలామంది. ఒకప్పుడు ఫ్రెండ్స్ కలిసి గుర్తుగా ఫొటోలు దిగేవాళ్ళు మా స్టూడియోలో. మా స్టూడియోకొచ్చిన వాళ్లతో ఎటువంటి సంబంధం లేని ఒక ఫొటోగ్రాఫర్ తన నిర్మలమైన దృష్టితో ఒక ఫొటో తీస్తాడు. అంటే ఆ కాలాన్ని తన కంటితో బంధిస్తున్నాడు. ఆ క్షణానికి సొంతమైన ఒక నిజాన్ని ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇది ఒక ఘనతే అనుకోవచ్చు. అలాంటి కళను మా నుండి దూరం చేసిన భావన కలిగింది ఈ స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ ఎక్కువైపోయాక! అందుకే నా జీవితంలో ఈ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని దరిజేరనివ్వను అని శపథం చేశాను. అలాంటి నేను ఆ స్మార్ట్‌ఫోన్ చేతిలోనే అంత ఘోరంగా ఓడిపోతానని కలలో కూడా ఊహించలేదు.నాకు పొద్దున్నే న్యూస్ పేపర్ చదవటం అలవాటు. న్యూస్‌లో కూడా క్రైమ్ సెక్షన్ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఒకరోజు పొద్దున్నే ఒక క్రైమ్ న్యూస్ కవరేజ్ నన్ను అమితంగా ఆకర్షించింది. పుణేలోని ఒక డెలివరీ బాయ్ దాదాపు 15 లక్షలు విలువ చేసే 18 స్మార్ట్‌ఫోన్స్ చోరీ చేశాడు అన్నది ఆ వార్త. ఇదంతా ఒక రెండు నెలల వ్యవధిలో జరిగిందట.కస్టమర్స్ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశాక రీప్లేస్మెంట్ పెట్టుకునే ఆప్షన్ ఒకటుంది. వాళ్లకి హ్యాండ్ సెట్ నచ్చని పక్షంలో! ఈ సదుపాయాన్ని ఆ డెలివరీ బాయ్ దుర్వినియోగం చేశాడు. ఆ డెలివరీ బాయ్ స్మార్ట్‌ఫోన్‌ని తనే దోచేసి, కస్టమర్ రీప్లేస్మెంట్ పెట్టినట్టుగా సృష్టించాడట! అలా హ్యాండ్ సెట్ రీప్లేస్మెంట్ ఉన్న కస్టమర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూపోయే సరికి ఈ అబ్బాయి మీద అనుమానం పెరిగి చివరికి అరెస్ట్ చేశారు.క్రైమ్ న్యూస్ ఇప్పటికి చాలాసార్లు చదివాను. కానీ ఎప్పుడూ కలగని ఓ ఆలోచన ఈసారి మాత్రమే కలిగింది. నాకు కూడా స్మార్ట్‌ఫోన్ చోరీ చేద్దాం అనిపించింది. నేను ఇంతవరకు స్మార్ట్‌ఫోన్ వాడలేదు. ఇంట్లో వాళ్ళని కూడా అడగలేదు. ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌కు, నాకూ మధ్యనున్న ఒక తెలియని దూరం శతృత్వంగా స్థిరపడిపోయింది నా మదిలో. నాకు పనిలేకుండా చేసిన ఆ స్మార్ట్‌ఫోన్‌ని ఇంకొకరికి దూరం చేసి దానిపై నాకుండిపోయిన పగ సాధిద్దాం అనిపించింది.నాకు తెలిసిన ఒక డెలివరీ బాయ్ ఒకరోజు తను డెలివరీ చెయ్యాల్సిన ఐటమ్స్‌లో ఆ ఖరీదైన ఒక స్మార్ట్‌ఫోన్‌ని తీసుకుని అదేదో నా కోసమే అన్నట్టుగా మా స్టూడియోకొచ్చాడు. ‘అన్నా, ఇవ్వాళ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. అన్ని ఆర్డర్లు డోర్ డెలివరీ చేయగలిగాను కానీ చివరిగా ఒక్క స్మార్ట్‌ఫోన్ మిగిలిపోయింది. ఇది మీరు ఇంటికెళ్ళే దారిలోనే ఉన్న అడ్రస్. చాలా సందులు, గొందులు తిరగాలి. దయచేసి ఈ ఒక్కసారికి ఇచ్చేస్తావా?’ అని అడిగాడు. ‘సరే.. అడ్రస్ ఎక్కడన్నావ్?’‘అదే అన్నా.. మీ ఇంటి దగ్గర నేతి గారెల షాప్ బాగా ఫేమస్ కదా! ఆ సందులోనే చివరి ఇల్లు. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారంట మరి!’‘శివుడి ఇల్లా? అది కైలాసం కదా..’ అన్నాను.‘ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడు అంటారు. వీళ్ళ ఇంటికి ఆ ఇబ్బందేం లేదనుకుంటా’ అంటూ నవ్వాడు వాడు.స్మార్ట్‌ఫోన్ కొట్టేద్దామనే నా ఆలోచన పసిగట్టినట్టే సామెత చెప్పాడేంటీ అని ముచ్చెమటలు పట్టాయి నాకు. దేవుడనే వాడుండి.. జరగబోయేదాన్ని ఇలా ముందుగానే పలికిస్తాడా ఏంటీ.. అనిపించింది. ‘శివుడు ఆయన పేరా?’ మళ్ళీ అడిగాను.‘అదే తెలియట్లేదన్నా.. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారని ఇందాక కస్టమరే చెప్పాడు ఫోన్లో అక్కడికెళ్ళాక డౌట్ వస్తే నాకు కాల్ చెయ్’ అన్నాడు.నేను ధైర్యం చేశాను. స్టూడియో కట్టేసి ఆ స్మార్ట్‌ఫోన్ తీసుకుని రోజూ నేను వెళ్లే దారిలోనే వెళుతున్నాను. కానీ, అవ్వాళ నా మనసు మనసులో లేదు. ధ్యాస అంతా దొంగతనంపైనే ఉంది. నేను వెళ్లే దారిలో శివుడి గుడి ఒకటుంటుంది. ప్రతిరోజూ, అక్కడి నుండి ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. ఆరోజు మొట్టమొదటిసారి చెవులు రిక్కించి వింటున్నానో.. మరేంటో తెలియదు కానీ గుడిలో జరుగుతున్న ప్రవచనంలో నుండి కొన్ని మాటలిలా వినబడ్డాయి.. ‘ఎదుటివాడికి మోసం చెయ్యాలనే బుద్ధి పుట్టినప్పుడే మనం మోసం చేసేసినట్టు.ఏ కర్మ చెయ్యాలన్నా అది మనసులో నుండి పుట్టాలి. అలాంటి కర్మ చెయ్యాలి అనే ప్రేరణను బుద్ధి మనకిస్తుంది. అది మంచి అయినా.. చెడు అయినా! ఆ బుద్ధికి ప్రేరణను దేవుడే కలిగిస్తున్నాడనుకుంటాడు మనిషి. అందుకే, చెడు కూడా ఆయనే చేయిస్తున్నాడన్న భ్రమలో బతుకుతాడు. నిజానికి నువ్వు చేసే మంచికి ఆయన కారణం కాదు. నువ్వు చేస్తున్న చెడుకి ఆయన కారణం కాదు. ఎవరి కర్మానుసారం వారు ప్రవర్తిస్తూంటారు. భగవంతుడు మనలో ఉండే ఆత్మ చైతన్య శక్తి మాత్రమే!’ఆగి ఒక్క నిమిషం అటు వైపుగా చూశాను. నాలో ఉదయించబోయే కాంతికి ఆయన వాక్యాలు సంకేతాలుగా కనబడ్డాయి. అనుకోకుండా ఆ ప్రవచనకర్త వైపు చూశాను. లిప్త కాలమైనా సరే ఏదో తెలియని అలౌకిక స్థితి నెలకొన్నది నాలో. ఆ భావాన్ని ఏమంటారో చెప్పలేని మనఃస్థితి నాది. ఇన్ని విషయాలు నా గుండెకేం తెలుస్తాయి.. కన్నీటి రూపంలో వెల్లడయ్యాయి.జ్ఞానం వచ్చే లోపే అహం అడ్డొస్తుంది. అహం దహనం అయితే తప్ప అజ్ఞానం తొలగదు. అజ్ఞానం పూర్తిగా తొలిగితే తప్ప జ్ఞానం రాదు. అప్పుడు నాకదే జరిగింది. కన్నీళ్లు తుడుచుకుని సరాసరి ఆ నేతి గారెల షాప్ వరకు వెళ్లాను.. ఏ ఆలోచనను రానివ్వకుండా! అక్కడ ఒకతను కనిపించాడు. ‘శివుడి గారిల్లు తెలుసా అండి?’ అడిగానో లేదో ‘నేను ఆయనింటికే వెళుతున్నానండీ.. ఇంతకీ మీరెవరు?’ తిరిగి ప్రశ్నించాడు. ‘ఆయనకో పార్సెల్ ఇవ్వటానికి వచ్చానండీ..’ అని చెప్పేసి ఆ వస్తువును అక్కడే పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను భయం భయంగా. ఆయన నన్ను పిలుస్తున్నా సరే వెనక్కి తిరిగి చూడలేదు. కొంత దూరం నడిచాక మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాను. నేతి గారెల షాప్‌లో చుట్టూ చూశాను. ఆయన కనబడలేదు. ఈసారి షాప్ ఓనర్ని శివుడి ఇల్లు చిరునామా అడిగాను. చెప్పాడు.ఆయన చెప్పిన వీధిలో వెళుతూంటే శివుడి ఇల్లు కనబడింది దూరం నుంచి. ఎవరో ఒకాయన ఒక వస్తువును ఆ ఇంటి ప్రహరీగోడపై ఉంచి మాట్లాడుతూన్నాడు. శివుడితోటే కాబోలు. ఆ వస్తువును గోడపై ఉంచిన విషయం మరిచిపోయి ఆయన, శివుడు ఇరువురూ ఇంట్లోకి కదిలారు. వెంటనే నేను నా ముఖం కనిపించకుండా చొక్కాని పైకి లాక్కుని.. మెల్లగా ఆ వస్తువును తీసుకుని అక్కడి నుండి పరిగెత్తాను. వెనక్కి తిరిగి చూడకుండా అలా చీకట్లో ఎంత సేపు పరిగెత్తానో తెలీదు. ఇంటికి చేరిపోయాను.శివుడి దగ్గరుండాల్సిన ఆ వస్తువు ఇప్పుడు నా దగ్గరుంది. తెరిచి చూశాను. స్మార్ట్‌ఫోన్.. నిజంగానే నా కంటికి భూతంలా కనిపించింది. చార్జింగ్ పెట్టి వాడదామనుకున్నాను. ఇప్పుడు దాన్ని చూస్తూంటే పరమశివుడి చేతిలో ఉండే డమరుకం గుర్తుకొస్తోంది. శివుడు అనే ఆ కస్టమర్ ఎలా ఉంటాడో తెలీదు. ఆయన దగ్గరుండాల్సిన వస్తువును నేను తస్కరించాను అనే భావనే నాకు నిద్రపట్టనివ్వట్లేదు. వెనక్కి తిరిగొచ్చి దొంగతనం చేసింది కేవలం స్మార్ట్‌ఫోన్ పై నాకున్న పగ, ద్వేషం వల్లనే. దొంగలించిన తర్వాత మాత్రం స్మార్ట్‌ఫోన్ మీదున్న నా పగ ఏమైందో నాకు అర్థం కాలేదు. దొంగతనం చేశానన్న భావన నన్ను కుంగదీయసాగింది.దేవుడిపై నమ్మకం లేకపోయినా ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అనుకున్నాను. అతికష్టం మీద నిద్రపట్టింది. నిద్రలో కల.. గంగిరెద్దులాయన నా ఫొటోస్టూడియోకొచ్చాడు. ‘బాబయ్యా, నా ఫొటో వచ్చినాది’ అన్నాడు.‘అవునా? ఎక్కడ? చూపించు..?’ అడిగాను. ‘ఇదిగో..’ అంటూ తన స్మార్ట్‌ఫోన్‌లో తను దిగిన సెల్ఫీని చూపిస్తూ ఆనందబాష్పాలతో నన్ను చూశాడు. ‘నేను, నా బసవడు’ అంటూ నా ముందే మరొక సెల్ఫీ దిగాడు. కెమెరా షట్టర్ సౌండ్ వచ్చింది. ‘రోజూ కనిపించే మేము ఎంత అందంగా వచ్చామో చూడయ్యా’ అన్నాడు నాతో.ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది నాకు. సమాధానం బలంగా తెలుస్తున్నట్టు అనిపించినా ‘నీ పేరేంటి?’ అడిగాను.‘శివుడు’ నిండుగా నవ్వాడు. ‘ఇదే నా సిత్రం’ అంటూ ఆ సెల్ఫీని చూపించాడు. ‘వెళ్ళొస్తాను’ అంటూ నవ్వుతూ తన బసవడితో వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి.. మా ఫొటోస్టూడియో బోర్డు చూసి ఆగిపోయాడు. నా దగ్గరికొచ్చి నాకు మాత్రమే వినబడేలా.. ‘There's more to life that meets the camera eye!’ అన్నాడు.మా గురువుగారు ఇచ్చిన ఆ కాప్షన్కి అర్థం ఇన్నాళ్లకి.. అది కలలో తెలిసింది. దిగ్గున లేచాను. మధ్యరాత్రని కూడా చూడకుండా నేతి గారెల షాప్ మీదుగా శివుడి ఇల్లున్న వీధికి చేరుకున్నాను. చీకటిగా ఉండటంతో శివుడి ఇల్లు అంత త్వరగా కనబడలేదు. నంబర్ 10 అన్న సంఖ్య గుర్తుండటంతో పదో నెంబర్ ఇల్లు కనబడే దాకా వెళ్లాను. అలా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళానో లేదో ఇంటి వరండా ముందరి జీరో బల్బ్ వెలిగింది. తలుపు తీస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక వ్యక్తి గేట్ వైపుగా వస్తున్నాడు. నేను భయపడుతూన్నాను. నా ముఖం కనిపించకుండా గుడ్డ అడ్డుపెట్టుకుని ఉన్నాను. ఆ వ్యక్తి సరిగ్గా గేట్ దగ్గరికి చేరగానే స్ట్రీట్ లైట్ వెలిగింది. గేట్‌కి అటువైపునున్న ఆయన.. చేయి చాచాడు. నా చేతిలోని స్మార్ట్ ఫోన్‌ని ఆయనకు అందించాను.‘ఎప్పటి నుండో పాడైన మా వీధి దీపం ఇప్పుడే వెలిగింది. పోయిన వస్తువు తిరిగి చేరాల్సిన చోటికే చేరింది. చీకటి పడింది. ఇక వెళ్ళిపో బాబయ్యా..’ అన్నాడు. ఆ గంగిరెద్దులాయనే ఈ శివుడన్న విషయం నిర్ధారణయ్యి వెనుదిరుగుతున్న నాకు అప్పుడే జ్ఞానోదయం అయ్యింది. – ఈశ్వరచంద్రఇవి చదవండి: ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!? -
Children's Story: సహన రెండవ తరగతి చదువుతోంది.. ఒకరోజూ..!
సహన రెండవ తరగతి చదువుతోంది. ఆమె అన్నింటికీ తొందరపడుతుంది. ఏదయినా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి. లేదంటే గొడవ చేసి అమ్మ నాన్నలను విసిగిస్తుంది.‘అమ్మా! నా జడకు రబ్బర్ బ్యాండ్ వదులుగా ఉంది, సరిగ్గా పెట్టు’ వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి అంది సహన. ‘పప్పు తాలింపు పెడుతున్నాను, ఐదు నిమిషాలు ఆగు’ అంది మానస. ‘అమ్మా! ప్లీజ్ అమ్మా, రామ్మా’ అంటూ నస పెట్టింది అమ్మాయి. దాంతో చేసే పని ఆపి సహన జడకి రబ్బర్ బ్యాండ్ సరిగ్గా పెట్టింది మానస.‘డాడీ! నాకు సాయంత్రం రంగు పెన్సిళ్లు తీసుకురండి’ ఆఫీసుకు వెళ్తున్న తండ్రితో చెప్పింది సహన.‘సరే అలాగే‘ అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం రంగు పెన్సిళ్లు మరచిపోయి వచ్చారు. అందుకు సహన మొండి పేచీ పెట్టింది. ఆ పేచీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకి వెళ్ళి తీసుకువచ్చారు. ‘సహనా! నీకసలు ఓపిక లేదు. ఏదైనా అడిగిన వెంటనే దొరకదు. సమయం పడుతుంది. దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి. ఇలా తొందరపడితే.. తొందరపెడితే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది’ బాధపడుతూ కూతురితో అన్నారాయన. ఆ మాటలను సహన పెద్దగా పట్టించుకోలేదు.ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో ‘స్కూల్ యాన్యువల్ డేకి నన్నో గ్రూప్ డాన్స్‌కి సెలెక్ట్ చేశారు టీచర్. గ్రూప్ డాన్స్ కాదు సోలో డాన్స్ చేస్తానని చెప్పాను’ అంది సహన.‘మంచిదే.. కానీ గ్రూప్ డాన్స్ అంటే నువ్వెలా చేసినా అందరిలో కలసిపోతుంది. సోలో డాన్స్ అయితే చాలా శ్రద్ధపెట్టి నేర్చుకోవాలి! ఒక్కసారి ప్రాక్టీస్‌కే నాకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు. రోజూ ఇంటి దగ్గర కూడా సాధన చేయాలి మరి!’ అంది మానస. ‘అలాగేలే అమ్మా’ అంటూ తల ఊపింది సహన నిర్లక్ష్యంగా! యాన్యువల్ డే కోసం స్కూల్లో డాన్స్ నేర్పించడం మొదలైంది. కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు. అది గమనించి కూతురితో అన్నది మానస ‘ఇంటి దగ్గర నువ్వు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదు. అలా అయితే స్టేజీ మీద బాగా చేయలేవు’ అని! ‘స్కూల్లోనే బాగా చేస్తున్నానమ్మా! అది చాల్లే’ అని జవాబిచ్చింది సహన ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా. ఇంక చెప్పినా వినేరకం కాదని వదిలేసింది మానస.సహన వాళ్ల స్కూల్ వార్షిక దినం రానే వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సహన వంతు వచ్చింది. పాట మొదలైంది. దానికి తగ్గ స్టెప్స్.. హావభావాలతో డాన్స్ చేయసాగింది సహన. అయితే హఠాత్తుగా తను వేయాల్సిన స్టెప్స్‌ని మరచిపోయి వేసిన స్టెప్స్‌నే మళ్లీ మళ్లీ వేయసాగింది. ‘అలా కాదు సహనా.. ఇలా చేయాలి’ అంటూ స్టేజీ పక్క నుంచి వాళ్ల డాన్స్ టీచర్ చిన్నగా హెచ్చరిస్తూ చేతులతో ఆ స్టెప్స్‌ని చూపించసాగింది. అర్థం చేసుకోలేక అయోమయానికి గురైంది సహన. దాంతో డాన్స్ ఆపేసి.. బిక్కమొహం వేసి నిలబడిపోయింది.స్టేజీ మీదకు వెళ్లి ఆమెను కిందకు తీసుకొచ్చేసింది టీచర్. ప్రేక్షకుల్లో ఉన్న మానస లేచి.. గబగబా సహన దగ్గరకు వెళ్లింది. కూతురిని హత్తుకుంది. దానితో అప్పటివరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది. ‘అమ్మా! నేను డా¯Œ ్స మధ్యలో స్టెప్స్ మరచిపోయాను’ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది సహన. ‘నీకు చాలాసార్లు చెప్పాను.. ఏదైనా పూర్తిగా నేర్చుకోనిదే రాదని! కొంచెం రాగానే అంతా వచ్చేసిందనుకుంటావు. ఇప్పుడు చూడు ఏమైందో! సాధన చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు. అదే చక్కగా ప్రాక్టీస్ చేసుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా! తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది’ అంది మానస.అమ్మ మాటలనే వింటూ ఉండిపోయింది సహన. ‘చదువులోనూ అంతే! జవాబులో కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు. ముక్కున పట్టి అప్పచెప్పి ఇక చదవడం ఆపేస్తావు. ముక్కున పట్టింది ఎంతసేపో గుర్తుండదు. అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. అప్పటికప్పుడు ఏదీ వచ్చేయదు. నిదానంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి అర్థం చేసుకోవాలి’ చెప్పింది మానస.అలా అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు చెప్పినా సహనకు అర్థం కాలేదు. కానీ ఈసారి బాగా అర్థమయింది. తన పొరబాటును గ్రహించింది. ‘అమ్మా.. ఇప్పటి నుంచి తొందరపడను. నిదానంగా ఆలోచిస్తాను. దేన్నయినా పూర్తిగా నేర్చుకుంటాను’ అన్నది సహన .. అమ్మను చుట్టేసు కుంటూ! ‘మా మంచి సహన.. ఇక నుంచి పేరును సార్థకం చేసుకుంటుంది’ అంటూ.. కూతురు తల నిమిరింది మానస. – కైకాల వెంకట సుమలతఇవి చదవండి: మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'? -
Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
‘ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న, నిన్నటి దాంక బిస్సగా ఉండ్య?’ అని పెద్దింటి మనిషిని అడిగాడు తగ్గుబజారు మనిషి. మాటలు వినపడేంత దూరంలోనే యేటి తగ్గున దొడ్డికి కూచ్చోని మాట్లాడుకుంటున్నారిద్దరూ. ప్రొక్లెయినర్‌తో ఏటి గట్టునున్న కంప ఉన్న కంపచెట్లను పీకించేసరికి వరిమళ్లు నున్నగా కనపడతున్నాయి. చింతట్టు మీంద నుంచి తెల్ల కొంగల గుంపొకటి వరిమళ్లల్లోకి దిగింది. గుడ్ల మాడి ఇంటి బరుగోళ్ళు యేట్లో సల్లగా పనుకొని నెమురేచ్చా ఉండాయి.బీడీ పొగ గాల్లోకి ఊత్తా ‘నిన్న పెత్తల్ల అమాస గదరా.. కేజీ మటన్, సీపు లిక్కర్ తెచ్చుకున్యాడంట, ఒక్కడే తిని తాగి సచ్చినాడు. ఉబ్బరం పట్టకల్యాక నిద్రలోనే గుండె పట్టుకుందంటా. మంచి సావు సచ్చినాడులే ముసిలోడు’ అన్యాడు పెద్దింటి మనిషి. ‘ఎంత సావొచ్చరా వానికి, డెబ్బై ఏళ్ళు వొచ్చినా మనిషి తుమ్మసెక్క ఉన్యట్టు ఉండ్య’ అనుకుంటా ఇద్దరూ ఒకేపారి లేసి యేట్లోకి పోయివచ్చినారు. ‘తొందర పోదాం పారా, ఎత్తేలోపే ఒకసారి సూసోద్దామ’ని ఊళ్ళోకి దావ పట్టినారు. ముసిలోల్లు, సావాసగాళ్లు అందరూ నాగన్నను సూన్నీకి పోతనారు. యాపసెట్టు కొమ్మల మద్దే నుంచి పడ్తన్య ఎండలో నాగన్నను రగ్గు మీంద పండుకోబెట్టినారు. తలాపున ఊదిగడ్లు పట్టుకుని కూచ్చోని ఉంది నడిపి కోడలు. వచ్చినోళ్లకు నీళ్ళు, కాపీ అందించా సేలాకీగా ఉంది సిన్న కోడలు. మొగుని కాళ్ళ కాడ కూచ్చోని ‘మటన్ కూరాకు, మటన్ కూరాకు అని కలవరిచ్చా ఉన్యాడు మూడు దినాల నుంచి. ఉన్నది అంత తిని సచ్చిపోయే గదరా’ అని ఏడుచ్చాంది నాగన్న పెళ్ళాం. నాగన్న మొఖం సచ్చిపోయినాంక గూడా కళతోనే ఉంది. వచ్చినోళ్ళు అందరూ దాని గురించే మాట్టాడుకుంటా పోతనారు. నాగన్న సిన్నకొడుకు మాటికి ఒకసారి ఇంట్లోకి పోయొచ్చా మూతి తుడుసుకుని వాళ్ళ నాయనను తలుసుకుని కుమిలిపోతనాడు. మిగిలిన ఇద్దరు కొడుకులు తలకాయ న్యాలకేసి నిలబన్యారు. మనువళ్లు మిగతా పనులు సూసుకుంటా ఉండారు. ఊరు సర్పంచు సెండుమల్లె దండ నాగన్న మీందేసి ఒక పక్కన నిలబడి ‘ఎట్టి మాలోళ్లకు సెప్పినారా?’ అని పెద్దరికం నిరూపించుకున్యాడు. నాగన్న పెద్దకొడుకు ముందుకొచ్చి ‘మా పిల్లోల్లు సెప్పనీకి పోయినారు సామీ’ అన్యాడు. ఇంతలోనే ఊరి నుంచి కూతురు ఏడ్సుకుంటా వచ్చి వాళ్ళ నాయన మీంద పడింది. పెద్దింటి మనిషి, తగ్గుబజారు మనిషి ఇద్దరూ గూడా నాగన్న మొఖం దిక్కు సూసి ఒక పక్కన నిలబన్యారు.కోపంగా ఇంటికాడ బగ్గి ఆపి దిగినారు నాగన్న మనువళ్లు. యాప సెట్టు మీందున్న కాకులు అరుసుకుంటా పైకి లేసినాయి. శాంచేపు నుంచి గాడిపాట్లో ఉండే బరుగోళ్ళు రెండు కొట్టుకుంటా ఉండాయి. వాళ్ళ నాయన కాడికి వచ్చి ‘ఈరన్న గుంత తియ్యనీకి రాడంట’ అన్యారు. ఆడ ఉన్య అందరూ వచ్చినోళ్ల దిక్కేమొఖం పెట్టినారు. ‘ఏంటికి?’ అని అడిగినాడు నాగన్న పెద్దకొడుకు.‘ఏమో నాయన! ఏం ఏంటికి గుంత తియ్యవు అని అడిగితే ఏం పలకల్యా.’ ‘ఏం వానికి పొగరు ఎక్కిందంటనా’ అన్యాడు పసిడెంట్. ‘లెక్క జాచ్చి ఇయ్యాలేమో లేరా’ అన్యాడు నిలబన్య పెద్దమనిషి. ‘ఆడికి అది గూడా సెప్పినాం మామా, నీ లెక్క నా పుల్లాతుకు సమానమని ఎచ్చులు పోయినాడు.’‘బలసినట్టు ఉందే.. ఎవరు అనుకోని మాట్టాడ్తానాడంట? కాళ్ళు ఇర్సాలేమో’ అని మీసం తిప్పినాడు నాగన్న నడిపి కొడుకు. ‘ఒర్యా నడిపే.. ఇది కొట్టాట టైమ్ కాదు.. వాని అవసరం మనది. నువ్వు మీయన్న పోయి మాట్టాడి రాపోరి’ అన్యారు రొంత మంది. కొడుకులు ఆలోచనలో పన్యారు. ‘ఇంగో ఇద్దరూ పెద్ద మనుషులు గూడా పోరి’ అన్యాడు పసిడెంట్. గుంత తీసే ఈరన్నను తిట్టుకుంటా పోయినారు నలుగురు.‘ఏం వచ్చి సచ్చింది గుంత తీనీకి పోయే.. లెక్కన్నా వచ్చాది. పెద్ద మాంసం తెచ్చుకుందాం’ అంది మంచంలో నెత్తి దూక్కుంటా ఈరన్న పెళ్ళాం. ఇంటి పక్కన ఉన్య కానుగ సెట్టు కింద కూచ్చోని హరిశ్చంద్ర పద్యం పాడుకుంటా తాడు పేన్తా ఉండాడు ఈరన్న. ‘వీళ్ళ బజార్లు బాగుంటాయి ప్పా.. నీట్‌గా ఉండాయి సూడు.. మన బజార్లు సచ్చినాయి ఎప్పుడూ సూసినా కుళాయి నీళ్ళు పార్త బురద బురద ఉంటాయి’ అన్యాడు నాగన్న కొడుకులతో పాటు వచ్చన్య మొదటి పెద్దమనిషి.ఆయన సెప్పినట్టే రోడ్డుకు రెండేపులా సెట్లు ఏపుగా పెరిగి ఉండాయి. ఎండ భూమి మీందకు దిగకుండా ఉంది. ఇంటి దిక్కే వచ్చన్య నలుగురును సూసి మంచం మీంద నుంచి దిగి నమస్కారం సేసింది ఈరన్న పెళ్ళాం. ఈరన్న ఏం పలకనట్టు కూచ్చున్యాడు. హరిశ్చంద్ర పద్దెం గొంతు పెంచి అందుకున్యాడు. జనం రొంత గుంపు అయినారు. ‘ఈరన్న.. ఓ ఈరన్న’ అని పిల్సినాడు నాగన్న పెద్దకొడుకు. ‘ఎవరోళ్ళు..’ అన్యాడు ఈరన్న. ‘బంద నాగన్న కొడుకులం’ అన్యాడు నాగన్న నడిపి కొడుకు. ‘సెప్పండి సామీ’ అని అరుగు దిగినాడు. ‘సెప్పనీకి ఏం ఉంది ఈరన్న.. నాగన్న సచ్చిపోయినాడు తెల్దా ఏందీ?’ అన్యాడు రెండో పెద్దమనిషి. ‘తెల్సు సామీ!’ ‘మరేందీ ఈరన్న.. పిల్లోల్లు వచ్చే గుంత తియ్యవనీ సెప్పినావంట?’‘అవును తియ్యను సామీ.’‘యేంది ఈరన్న.. ఏం కావాలా సెప్పు? ఐదు వేలు లెక్క.. రెండు కోటర్లు మందు ఇచ్చాం రా.. టైమ్ ఐపోతాందీ’ అన్యాడు నడిపి కొడుకు. ‘నాకు పదివేలు ఇచ్చినా గుంత తీయను’ అని తెగేసి సెప్పినాడు ఈరన్న. ‘ఏం ఎందుకు ఈరన్న.. మా తాత సచ్చిపోయినప్పుడు నువ్వే గదా తీసినావ్? మా పెద్దనాయన సచ్చిపోయినప్పుడు నువ్వే తీసినావ్? మా ఇల్లు నీకే కదా.’ ‘అవ్ వాళ్ళందరివి తీసిన. రేప్పొద్దున మీలో ఎవరు సచ్చినా గుంత తీచ్చా, కానీ ఈ గుంత తియ్యను.’భుజం మీందున్న టువాలా సర్దుకుంటూ ‘యేందిబీ.. మాటలు యాడికో పోతనాయి. రొంత సూసుకొని మాట్టాడు’ అన్యారు పెద్దమనుషులు. ‘సూడు అయ్యా.. నా మాటలు యాటికి పోలా. నేను గుంత తియ్యను. నన్ను యిడ్సిపెట్టండి.’‘ఏమైందో సెప్పమంటే ఇకారాలు పోతనాడు, ఈడు రాకపోతే వేరేవాళ్ళు రారా యేంది. వాళ్ళను పిల్సుకొని పోదాం’ అన్యాడు నడిపి కొడుకు. ‘ఆ... అట్నే పోండి సామీ’ అని తాడు పేనే పనిలో పడ్డాడు ఈరన్న. మెత్తగా ‘పెద్దోళ్ళు వచ్చినారు, పోకూడదా’ అంది ఈరన్న పెళ్ళాం.‘నీ యమ్మ నిన్ను నరికి, ఈన్నే గుంత తీసి పూడుచ్చా అతికేం మాట్టాన్యావంటే’ అని ఒంటి కాలు మీంద పెళ్ళాం పైకి లేసినాడు ఈరన్న. ‘నీ దినం కూడు కుక్కలు తినా. ఏమన్యానని నా మీందకు వచ్చనావు? పోయేకాలం వచ్చిందిలే నీకు. పెద్దోళ్ళతో పెట్టుకుంటనావు’ అని తిట్టుకుంటా మంచంలో మళ్ళా కూచ్చుంది.నలుగురు ఎదురుగా ఉన్య ఇంటి కాడికి పోయి నిలబన్యారు. ‘అయ్యా.. ఆ ఈరన్న గానీ ఇల్లుకు మేము పోయినామంటే.. వాడు తాగి అమ్మనక్కను తిడ్తాడు. వాన్తో మాకు కొట్టాట వొద్దు అయ్యా.. వానికి ఏం కావాలో ఇచ్చి వాణ్ణే పిల్సుకొని పోండి’ అన్యాడు ఈరన్న ఎదిరింటి మనిషి.రొంత దూరంలో నిలబన్య ఈరన్న అన్న కొడుకు కెళ్ళి సూసేసరికి వాడు సేసేది ఏంల్యాక తలకాయ దించుకున్యాడు. సెప్పనీకి సూసినా వాళ్ళ మనుషుల మీంద మాటలతో పెద్దపులి పడినట్టు పన్యాడు ఈరన్న. ఎవ్వరూ గూడా నోరెత్తల్యా. సెవులూ కొట్టుకుంటా వెనక్కి పోయినారు నలుగురూ. ఈరన్న పెళ్ళాం భయపడ్తా మొగుని దగ్గరకొచ్చాంటే సింత నిప్పుల మాదిరి ఉన్య ఈరన్న కళ్ళు సూసి దూరం నిలబడి జరగబోయేది తలుసుకొని బిత్తర సూపులు సూచ్చాందినాగన్న తలకాయ కాడ ఉన్య బియ్యం గ్లాసులో కొత్త ఊదిగడ్లు నుంచి పొగ దట్టంగా లేచ్చా అప్పుడే లేపిన షామియానాను తాకుతాంది. రెండు మూడు కొత్త పూల దండలతో నాగన్న మొఖం యింగా వెలిగిపోతాంది. గాడిపాడు ఖాళీ అయ్యింది. ‘వాడు రాడంట!’ అని నలుగురు తలకాయలు దించుకున్యారు. ‘ఆ నావట్టకు ఏం పోయేకాలం వచ్చిందో సూడు క్కా’ అని పక్కన కూచున్య బండకాడ కూరగాయాల ఆమెతో బంకామె కళ్ళు పెద్దవి సేసి సెప్పింది. ‘వాడు ల్యాకపోతే ఏంది? వేరే వాళ్లు లేరా’ అన్యాడు పసిడెంట్. ‘వాని దెబ్బకు ఎవరూ రాకుండా ఉండారు.’నాగన్న పెళ్ళాం ఏడుపు యాపసెట్టు అంతా అయింది. ఉన్య రెండు మూడు కాకులు గూడా ఎగిరిపోయినాయి. ‘ఎంత సేపు పెడ్తార్రా.. వాణ్ని పిల్సి ఈపు పగలగొట్టకుండా? ఇదే మా ఊర్లో అయ్యింటే బొడ్డాలు పగలగొట్టే వాళ్ళం. పెద్దమనుషులు ఉండారా? మా మామతో పాటు సచ్చినారా’ అన్యాడు సావు సూన్నీకి వచ్చిన సుట్టం.అది యిన్య పెద్ద మనుషుల మొఖంలో నెత్తుర సుక్క ల్యాకుండా పోయింది. దొంగకోళ్ళు పట్టే మాదిరి ఒకరి మొఖం ఒకరు సూసుకుని బెల్లం కొట్టిన రాయిలా నిలబన్యారు. పరువు మీందకు వచ్చేసరికి కోపంగా ఈరన్నను పిల్సుకొని రమ్మని పసిడెంట్ మనిషిని పంపినాడు. విషయం ఊరంతా పాకింది. ఊర్లో యాసావు అంత మంది జనాన్ని సూసిండదు. ఏం అయితాదని జనాలు పనులు పోకుండా కూచ్చున్యారు. తిన్నాల ఉన్నట్టు ఉంది సావు. ఏడ్సి ఏడ్సి నాగన్న పెళ్ళాం సోయి ల్యాకుండా పడిపోయింది.తప్పెటోల్లు రెండు పెగ్గులేసుకొని ఒక మూలకు కూచున్యారు. ఏం సెయ్యాలో తెలీక కొడుకులు గమ్మున నిలబడి ఉండారు. నాగన్నకు నలుగురు కొడుకులు అందరికి సమానంగా భూమి పంచి ఇచ్చి సోడమ్మ దేళంలో పూజారి పని సేచ్చా ఉండ్యా. దేళంకి చందాలు వసూలు చేయడం, దేళం బాగోగులు సూసుకుంటా సంతోషంగా బతుకుతుండ్యా. సోడమ్మ దేళంలో దీపం వెలగని రోజు లేదు.పనికోసం యా రోజు ఒకరికోసం సెయ్యి స్యాసింది ల్యా. అంత వయసులో కూడా ఎద్దులతో ఆరు ఎకరాల భూమి పండిచ్చా ఉన్యాడు. రోజుకు రెండు సెంబుల కాఫీ తాగుతా, నాలుగు కట్టలు వకీలా బీడీలు కాల్చేవోడు. పెళ్ళాంతో యారోజు మాట్టాడింది ల్యా ఎప్పుడూ కొట్టాడ్త ఉండేవాడు. ఊర్లో ఉన్నన్ని రోజులు ఉత్తపైనే ఉండేటోడు సంతకు పోవాల్సి వచ్చే కొత్తపెళ్ళికొడుకు మాదిరి పోయేటోడు నాగన్న.ఎండ ఎక్కువైంది. సేతీకి ఉన్య పారేన్ వాచ్ పదే పదే సూసుకుంటా ఉండాడు పసిడెంట్. ఈరన్న పేనే తాడు భుజానేసుకుని నిమ్మళంగా వచ్చి రోడ్డు మీందనే నిలబన్యాడు. ఈరన్న వొచ్చినాడని గందరగోళం అయింది. ఊరి పెద్దోళ్లనే మల్లెసినా మొగోడు ఎవడాని కొత్తగా వచ్చిన సుట్టాలు ఈరన్న దిక్కు నోరెళ్ళబెట్టి సూచ్చనారు. వొంటి మింద కేజీ కండ గూడా లేదు. తాగి తాగి ఎముకలు బయట పన్యాయి. మూతి మొత్తం తిప్పినా మీసాలే. కళ్ళు ఎండిపోయిన కుందు యేరు మాదిరి ఉండాయి.‘యేరా ఆన్నే రోడ్డు మీంద నిలబన్యావ్? రా ఇట్టా’ అన్యాడు పసిడెంట్. ఈరన్న పసిడెంట్ మాటకు ఎదురుసెప్పల్యాక నీళ్ళు నములుతా ఉండాడు. ‘యేందిరా?’ అని కళ్ళు పెద్దవి సేసినాడు పసిడెంట్. రోడ్డు మీందకు కళ్ళేసి ‘నేను ఆడికి రాను రెడ్డి’ అని సెప్పినాడు. కొత్త ఊరోళ్ళు పసిడెంట్ కెళ్ళి సూసినాడు. పసిడెంట్కు తలకాయ కొట్టేసినట్టు అయింది. పెద్దమనుషులు పసిడెంట్కు సర్ది సెప్పినారు. అందరూ రోడ్డు మీందకు వచ్చినారు. ‘సూచ్చనా సూచ్చనా శానా ఇకారాలు పోతనావ్? యేంది వాయ్ కథ’ అన్యాడు పసిడెంట్. అందరూ తల ఒకమాట ఏసుకున్యారు. ఈరన్న ఏం పలకకుండా నిలబన్యాడు. పీర్ల పండగ గుండం మాదిరి నిప్పులు కక్కుతా ఇద్దరు ముగ్గురు సెయ్యి పైకి లేపినారు.‘లాస్ట్ సారి మర్యాదగ సెప్తనా.. పోయి గుంత తీపో’ అన్యాడు పసిడెంట్. ‘నా గొంతు కోసినా.. నేను గుంత తియ్యను రెడ్డి’ అని పసిడెంట్ కళ్ళల్లోకి సూటిగా సూచ్చా సెప్పినాడు. ఈరన్న దొమ్మ పొగరు ఊరు మొత్తం సూసింది. ఇట్టా కాదని కోటోళ్ల తాత ముందుకు వచ్చి ‘ఒర్యా... నీకు, నాగన్నకు ఏమైనా తకరారు అయిందా?’ అని అడిగినాడు. ఈరన్న అందరి దిక్కు సూచ్చా తలకాయ ఊపినాడు.‘ఓర్నీ పాసుగూలా.. ఈ మాట ముందు సేప్తే పోయేది గదరా. ఏం కొట్టాట అయింది’ అని అడిగినారు. ఈరన్న ఏం మాట్టాడకుండా రోడ్డు వెంబడి నడ్సుకుంటా పోతాంటే జనం ఈరన్న దిక్కు సూచ్చా పోయినారు. పెద్దమనుషులు ఈరన్న పీక మీంద కాలేసి తొక్కేమాదిరి ఉండారు. గాడ్దెంకా దాటి సోడమ్మ దేళం ముందు రోడ్డు కాడ ఆగినాడు ఈరన్న. జనం గూడా ఏం సెప్తాడ అని కాసుకొని ఉండారు. ఈరన్న ఊరి మంది దిక్కు సూచ్చా పదేళ్ళ కింద మాట ఇదని మొదలుపెట్టినాడు.ఆ పొద్దు ఇంగా సరిగ్గా తెల్లవారాల్య. ఊర్లో సారాయి బాలన్నను పోలీసులు పట్టకపోయినాంక సారాయి కోసం జనం అందరూ పక్క ఊరికి పోతాండారు. రెండు రోజుల నుంచి సారాయి ల్యాక న్యాలుకా పీక్తాంటే నేను సోడమ్మ వెనక దావ గుండా సచ్చా బతుకుతా పక్క ఊరికి పోయినా. కాళ్ళకు సెప్పులు లేవు. అడ్డదావాలో ముల్లులు ఉండాయని సోడమ్మ ముందు దావ వెంబడి ఊళ్ళోకి వచ్చాంటే పొద్దున పూజ సేసుకొనికీ వచ్చిన నాగన్న దావన పోతన్య నన్ను సూసి ‘ఒర్యా ఈరన్న.. ఒర్యా’ అని క్యాకేసినాడు. ఎవరోబ్బా ఇంత పొద్దునా అని నేను ఆగి తలకాయ తిప్పి సూసినా. ‘మాల నాకొడాకా యా దావ నుంచి రా నువ్వు పొయ్యేది’ అన్యాడు.‘ఓ నాగన్న... మాటలు మర్యాదగా రానీ’ అన్య కైపు బిస్సన.‘తాగుబోతు నా కొడకా నీకు మార్యాద యేందిరా, మీకు వెనక దావ ఉంది గదరా.. పెద్దరెడ్డి మాదిరి ఎవరూ సూల్లేదని ముందు నుంచి పోతానావ్’ అన్యాడు. నాకు కైపు అంత యిడ్సిపోయి కోపం అరికాళ్ళల్లో నుంచి మెదుడులోకి పాకింది.. ‘నీ యబ్బా కట్టిచ్చినాడా రోడ్డు.. ఇది అందరికీ’ అని సెప్పినా. అంతే కోపంతో ఎగిచ్చి తన్యాడు కాల్‌తో. నా కొడకా.. మళ్ళా మాట్టాడ్తనావే.. మీ బతుకులెంత? మీరెంత? యాపొద్దు పోంది, ఈ పొద్దు ఇట్టా ఎందుకు పోతనావ్ వాయ్ అని కుతిక మీంద కాలేసినాడు. సాచ్చం ఆ సోడమ్మ తల్లే. ‘మీకు ఒక దావ.. మాకు ఒక దావ ఎందుకు?’ అని అడిగినా. ‘మీరు మేము ఒకటేనా వాయ్. మేము ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారావ్’ అన్యాడు.‘మేము గూడా ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారవ్.. మీ పీనుగ కూడా లేయ్యదు’అని సెప్పినా. ‘అంతా మొగోనివా?’ అన్యాడు. ‘సరే అయితే సెప్తండా సూసుకో.. ఇదే ఆకాశం, ఇదే నేల, ఇదే సోడమ్మ, ఎదురుగా ఉన్య మారెమ్మ మీంద ఒట్టేసి సెప్తనా.. రెండు దావలు పోయి ఒకే దావ వచ్చేగానీ నీ పీనుగకు నేను పికాసి ఎత్తను, పారా ముట్టను’ అని గట్టిగా అర్సి తొడ కొట్టి, మీసం తిప్పినా. ‘పో.. పో వాయ్ సూసినావ్, నీ మూడకాసు మాటలు’ అని నన్ను వెనక దావలోకి మెడకాయ పట్టుకొని గుంజకపోయినాడు’ అని జెప్పి.. సాచ్చం అద్దో ఆ మారెమ్మ తల్లే అని పోతురాజు మాదిరి మారెమ్మ దేళంకెళ్ళి సెయ్యి సూపిచ్చినాడు.జనాలు అందరూ కిక్కురుమనుకుండా సినిమా సూసినట్టు సూసినారు. సోడమ్మ కటాంజన్కు కట్టిన ఎర్ర గుడ్డ గాలికి ఊగుతా ఉంది. పొద్దున్నుంచి దీపం ల్యాక దిగులుగా ఉన్నట్టు ఉంది. సాచ్చం యాడ అడుగుతారో అని సోడమ్మ కళ్ళు మూసుకుని ఏం ఎరగనట్టు వింటా ఉంది. సోడమ్మ వెనక దావాలో నిలబన్య ఈరన్న మనుషులు దీనంగా మొఖం పెట్టినారు.‘మళ్ళా మీకు ఆ దావ ఉంది గదరా.. నువ్వు ఎందుకు ఈ దావలో నడ్సినావ్’ అన్యారు పెద్దమనుషులు. ‘మళ్ళా మీరు అదే పాట పాడ్తారు. నేల అంతా ఒకటే అయినప్పుడు మీకు ఒక దావేంది, మాకు ఒక దావేంది రెడ్డి’ అన్యాడు ఈరన్న ఊగిపోతా. ‘ఇప్పుడు ఏం అంటావ్ రా’ అని పళ్ళు నూరినారు పెద్దమనుషులు. ‘నేను సేప్పేది ఏం లేదు రెడ్డి.. నన్ను యిడ్సిపెడ్తే నా పని నేను సూసుకుంటా!’‘సూడు ఈరన్న అయిపోయిందేందో అయిపోయింది. రా వచ్చి గుంత తీయ్. మా నాయన తరుపున పెద్ద కొడుకుగా నేను నిన్ను క్షమాపన అడుగుతనా’ అన్యాడు నాగన్న పెద్దకొడుకు.‘ఎట్టా అయిపోతాది సామీ.. పది సంవత్సరాల నుంచి గుండెకాయ కాల్తానే ఉంది. ఉప్పు కారం మీకన్నా రొంత ఎక్కువే తిన్యా. కుందరాగు నర్సన్న పెద్దకొడుకు కుందరాగు ఈరన్నను నేను, మాట అంటే పానం లెక్క. మీరు సెప్పినట్టే మా బతుకులా? మీకేమో తారోడ్డులు, మాకేమో మట్టి దావలా? మారాల మారి తీరాల.’అందరూ అర్థంకానట్టు సూచ్చనారు. పసిడెంట్ ముందుకు వచ్చి ‘ఇప్పుడు ఏం కావాలి రా నీకు?’‘అందరికీ ఒకే దావా కావాలా!’ ‘తంతే నాకొడకా యేట్లో పడ్తావ్.. అందరికీ ఒకే దావ యేంది రా.. తలకాయ తిరుగుతుందా?’‘నాకు ఏం తిరగల్యా సామీ.. ఇప్పుడే సక్కగా పనిసేచ్చాంది. మేము గూడా ముందు దావలో నుంచే నడుచ్చాం.’ ‘నడసనియ్యక పోతే..’‘మీ గుంతలు మీరే తవ్వుకోండి.. మీ పీనుగులు మీరే బూర్సుకోండి!’ఈరన్న మనసు అందరికీ అర్థం అయింది. పెద్దమనుషులు అందరూ గుంపు అయి గుస గుసలాడ్త ఈరన్న దిక్కు సంపేమాదిరి సూచ్చాండారు. ఎండ నెత్తి మీందకు వచ్చింది. నాగన్న తలకాయ కాడ ఊదిగడ్లు మారుతానే ఉండాయి. బయట ఊరోళ్ళు పెద్దమనుషుల దిక్కు మనుషుల్లానే సూడకుండా ఉండారు. ఈరన్న దిక్కు వాళ్ళ మనుషులు వచ్చి బలంగా నిలబడి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్యారు. దమ్ములు ఇరిసి నిలబన్య ఈరన్న దిక్కు పెళ్ళాం కళ్ళు ఆర్పకుండా సూచ్చాంది. వాళ్ళళ్ళో వాళ్ళు కొట్టుకుంటా అర్సుకుంటా ఉంటే తాపకొకసారి మీసం తిప్పుతా బుసలు కొడ్తా ఉండాడు ఈరన్న.కొంతమంది ఈరన్న సంగతి సూజ్జామని పంచెలు ఎగ్గొట్టుకోని తిరిగి పోయినారు. సెసేది ఏం ల్యాక పెద్దమనుషులు సల్లు పోయినారు. సోడమ్మ వెనక దావకి కంపసెట్లు అడ్డంగా పెట్టినారు. ఈరన్నను ఎత్తుకుని క్యాకలేసినారు వాళ్ళ మనుషులు. అప్పుడే గుళ్ళో పెట్టిన దీపం వెలుగులో సోడమ్మ నవ్వుతా ఉన్యట్టు ఉంది. ఊళ్ళోదావ గురించి దండోరా యినపడ్తాంటే పికాసీ, పారా తీసుకొని యేటి పడమటి దిక్కు శ్మశానం కెళ్ళి ఈరన్న ఉదయిస్తా పోయినాడు. – సురేంద్ర శీలం -
చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?
పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన రెండరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టరుకాయలు తొక్కతీసి, మాగాయ, తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు.‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’ అడిగిందొకావిడ ఓ పండుముక్క నోట్లో వేసుకుంటూ. ఓ సారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి. ‘పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి’ సాగదీస్తూ వెక్కిరించింది మరొకావిడ. అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వేన్ ఆగింది. తండ్రి వేను దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి, చెంగుమని దూకింది చిన్న. ‘జాగ్రత్తే చిన్నా’ అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న రెండు జడలు, కోడి కత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ, చంటి మీద ఓ రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిపి, కళ్ళతోనే ఓ నవ్వు చిలికి, మిగిలినవాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చింది చిన్న.‘ఏవండీ,’ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. ‘రండి, కూర్చోండి’ అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి, చెయ్యి కడుక్కుని, పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. ‘నమస్తే. నిన్ననే మీ ఎదురింట్లో దిగాము. పాలు వాడకం పెట్టుకుందామని’ అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. ‘అలాగే, వీధంతా మా చుట్టాలే. నేనే పోస్తాను పాలు. మీరు నలుగురులా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవ్విడు చొప్పున పొయ్యమంటారా లేక సేరూ ఒకేపూట కావాలా?’‘ఉదయాన్నే సేరు పోసేయ్యండి. రేటు ఎక్కువైనా పరవాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి, మేము రావాలా?’ అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుంటూ. ‘ఈ వీధిలో అందరూ మా చుట్టాలే. అందుకని కాదు కానీ, మీరు అడిగినా నీళ్ళు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు. గిన్నె వెంటనే ఇచ్చెయ్యాలి. ఉండండి కొంచెం కాఫీ పెడతాను’ అంది లక్ష్మి ఆప్యాయంగా. ‘వద్దండీ, అలవాటు లేదు’ అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాంచెట్టుని చూస్తూ. ‘అన్నయ్యగారు ఏం చేస్తారు. పిల్లలు చదువుతున్నారా?’ అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ‘ఆయన ట్రెజరీలో చేస్తారు. అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పిల్ల ఎయిత్’ అని, ‘అన్నయ్యగారు ఊళ్ళో లేరా?’ అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ.‘లేరు, వీడి ఆరో ఏటే పోయారు. అప్పటినించి నాలుగు గేదెల్ని సాకుతూ పాలవ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళదీ ఇదే వీధి చివరిల్లు’ అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ నాలుగు దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, ‘సరే వస్తానండి, పాలు రేపటినించి పొయ్యండి’ అని వెళ్ళిపోయింది సరస్వతి.గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్ళు తగిలేలా పాల గిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి, గిన్నె ఖాళీ చేసి ఇచ్చేవరకూ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. ‘గిన్నేదిరా’ అడిగింది లక్ష్మి. ‘తర్వాత ఇస్తామన్నారమ్మా’ అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలు పెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. ‘పాలు’ అన్నాడు చంటి బెరుగ్గా. ‘తెలుసు’ అందామె కొంటెగా. ‘అమ్మ గిన్నె తెమ్మంది’. ‘తినెయ్యంలే నీ గిన్నె. లోపలికి రావొచ్చుగా!’ చంటి భయంగా అటూ ఇటూ చూసి, ‘మీ అన్నయ్య లేడా?’ అడిగాడు. ‘ఉంటే నిన్నేమీ కట్టెయ్యడులే!’ ‘ఆంటీ?’ అడిగాడు సిగ్గుపడుతూ.‘అమ్మ పెరట్లో ఉంది’ అంది అదే సొట్ట బుగ్గల నవ్వుతో. వెళ్లి రేక్కుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా. ‘మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు, వాడు నీకెలా నచ్చాడే’ అంటోంది మా ఫ్రెండ్ ఇందిర’ అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ.‘నేనేం నీ వెంట పడలేదు. నచ్చకపోతే మానెయ్’అన్నాడు ఉక్రోషంగా. ‘సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేననలేదు కదా, నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను’ అంది అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ‘కళ్ళు నచ్చటమేంటి?’ అడిగాడు చంటి ఉత్సాహంగా. ‘నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదులే. అది సరే, టె¯Œ ్త ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. కాసేపు ఆ పేకముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేనూ వస్తా కంబైండ్ స్టడీస్‌కి’ అంది.‘అక్కర్లేదు. నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపూ వీధంతా తిరుగుతావు అందరిళ్ళకీ!’ ‘బాబి వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్‌లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు.’‘నాకెందుకు కోపం. వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవునూ, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా?’ అడిగాడు అనుమానంగా. ‘ఆహా మరి పేకాడే వాళ్ళు మంచోళ్ళా?’ అని, ‘మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి’ అంది అల్లరిగా నవ్వుతూ. ‘చిత్రలహరికి వాణ్ణి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్ళాడుతూ చూడాలి’ అన్నాడు చంటి ఉక్రోషంగా. ‘బావుంది అతను మా అన్నయ్య ఫ్రెండ్. నిన్ను రమ్మంటే రావు దానికి నేనేం చేయను’ అంది జాలిగా. ‘బాబి వాళ్ళింట్లో ఉసిరి చెట్టున్నట్టుంది, కాయలు కోసావా’ అడిగాడు మాట మారుస్తూ ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. ‘నాకు ఉసిరికాయలు నచ్చవు. జాంకాయలంటేనే ఇష్టం’ అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థంకాలేదని తెలిసి కాస్త కోపంగా ‘రేప్పొద్దున్న పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరక్కొడతా?’అంది.‘ష్! మీ అమ్మగారు వింటారు..’‘మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను ‘మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు’ అన్నారు తెలుసా?’ ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని రెండు బుగ్గలూ గట్టిగా పట్టుకుని లాగింది చిన్న. ‘అమ్మా..’ అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ.‘చిన్నా ఎవరే?’ పెరట్లోంచి సరస్వతి కేకేసింది. ‘పిల్లి.. తరుముతున్నాను’ అంది చిన్నా చంటిని వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ.‘అమ్మా బాబిని నేను చేసుకోను. నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవర్నీ చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు’ అంది చిన్న విసురుగా. అప్పటికి రెండు గంటల్నించి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒక వైపు చిన్న ఒక్కర్తీ ఒకవైపు. ‘ఏంటే నువ్వొప్పుకునేది? అసలు నీకు ఎనిమిదో తరగతినించీ ఈ ప్రేమలేంటి. అప్పుడే ఓ నాలుగు తగిలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. వాడింకా బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మనం తొందరపడాలి’ కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళకేసి చూడ్డం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ‘గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప, చంటి తెలివైన వాడురా! పదమూడు ముక్కలూ పేర్చకుండా ఆడతాడు, కళ్ళతో ఓసారి చూసి కౌంట్ చెప్పేస్తాడు. వాడికీ మంచి ఉద్యోగమే వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే లేదంటే....’ అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న.అన్నయ్య కొంచెం తగ్గి, ‘ఏముందే వాళ్ళింట్లో? పేడ కంపు కొట్టే ఆ పాక, నాలుగు గేదెలు, వర్షమొస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు, ఓ రోజు గేదె తంతే నాలుగు రోజులు కూరలేకుండా గడుపుకోవాలి. నా మాట విను’ అన్నాడు. సరస్వతి కల్పించుకుని, ‘దానికి నేను నచ్చచెబుతా లేరా?’ అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. ‘చిన్నమ్మా, నీకు తెలుసుకదా నాన్నగారికి ఏం తెలీదు. మనింట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు, అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా. వాడి మాట విను’ అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ. ‘అమ్మా, అయిదేళ్ళ నించి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపు కొస్తుంది, జాంచెట్టు కాస్త ఆలస్యమౌతుంది’ అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి ‘చంటి మంచోడంటే బాబి చెడ్డోడని కాదు కదమ్మా’ అంది సరస్వతి.‘నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేఛ్చ గురించి. నేనో పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా. మంచో, చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా అంతే’ అని, ‘అమ్మా.. నాకింకా పద్దెనిమిదే కదా. ఒక్క రెండేళ్ళు చూడండి. ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను’ అంది చిన్న ఏడుస్తూ.అదే సమయంలో.. ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. నాలుగింటికిలేచి, పాలుపితికి, వీధంతా పొయ్యటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చెయ్యటం, మిల్లుకెళ్ళి చిట్టు, తౌడు, సంతకెళ్లి పచ్చగడ్డి, కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్ లాంతరు, చేపాటి కర్ర.. పట్టుకుని ఇంటి వెనకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవటం, ఇలా అన్ని పనులూ పంచుకునే ఆ తల్లీ, కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు.‘ఊరుకోరా.. ఏం చేస్తాం! నువ్వు మంచోడివని నీకూ, నాకూ తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం. వీధి వీధంతా ఏ అరుగుమీద చూసినా, ఐదేళ్ళ పిల్లాడి నించి ఎనభై ఏళ్ల ముసలాళ్ళ వరకూ, ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడినించి పోదాం అంటే సొంతిల్లు, పాడి వదులుకుని ఎక్కడకని పోతాం. ఇప్పుడు చూడు. పాపం వెర్రిది. నువ్వంటే పిచ్చి దానికి. ఇరవై ఏళ్లకి ఉద్యోగం లేదని ఎందుకూ పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బావుంటుందని ఆశపడ్డాను’ అంది చంటి తల్లి భారంగా.‘అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా. నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క రెండేళ్ళు టైము ఇమ్మనమ్మా. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నాకు చిన్న కావాలమ్మా’ అతనికి దుఖం ఆగటం లేదు. ‘ఊరుకోరా. రేపు వాళ్ళమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా. నువ్వు బెంగెట్టుకోకు’ అంది లక్ష్మి చంటిని దగ్గరకి తీసుకుని తల నిమురుతూ! ‘ఆ చెప్పు చిన్నమ్మా’ అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్బులా ఉంది పక్కనే అంతా గోలగోలగా ఉంది.‘చిన్నాడికి వొంట్లో బాగోలేదు. ఇంటికెప్పుడొస్తావు’ విసుగ్గా అడిగింది చిన్న. ‘వచ్చేస్తా బంగారం. ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చెయ్యకుండానే పక్కన పెట్టేశాడతను.ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు, బ్రెడ్డు పెట్టి టాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయల్దేరింది చిన్న. ‘నువ్వు చిన్నవి కదూ’ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామె.‘అవును. నువ్వు .. ఇందిర కదూ, నువ్వుండేది హైదరాబాద్ కదా!’ అడిగింది చిన్న. ‘అవునే. మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను. పూల దండల కోసం ఇలా వచ్చా. బావున్నావా చిన్నా’ అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. ‘హా, బావున్నాం. మా ఇల్లు ఇక్కడే శివాజీ పాలెం. రా ఇంటికి వెళదాం’ అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు.ఇందిర కేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసులతో, పుల్లలా ఉండేది. ఇప్పుడు దబ్బపండులా, ఎండమొహం ఎరుగనట్టు నిగ నిగ లాడుతూ, ఒతై ్తన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. ‘నువ్వేమిటే ఇలా అయిపోయావు చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి’ అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న.‘మీ ఆయనా పిల్లలు బావున్నారా?’ అడిగింది మాట మారుస్తూ. ‘హా’ అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫొటో వాట్సాప్‌లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫొటో కేసి చూస్తూ, ‘నిన్ను బాగా చూసుకుంటాడా?’ అడిగింది చిన్న.‘రాత్రి పొడవాటి కురులని పొగిడి, పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటూ రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు, సాయంత్రం ఆరుకల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకూ మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే, ఓ సారి మా ఇంటికి రా నీకే తెలుస్తుంది’ అంది ఇందిర మురిసిపోతూ. మనస్పూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక, జాకెట్ ముక్క, ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను ‘చిన్నమ్మా కార్తీకమాసం కదా, యమ ద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్షు వృద్ధి, నీ కాపురం బావుంటుందట ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు’ అంది.అంతే అప్పటివరకూ అణచిపెట్టిన దుఖం ఎగజిమ్మింది. ‘అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో, వయసు వ్యామోహం వల్లో ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతీ అమ్మాయికీ ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాణ్ణి ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్ పెళ్ళి.మా ఆయనెప్పుడూ ఏం చెబుతాడో తెలుసా, కౌంటు ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను, మళ్ళీ మీరు ఏరి కోరి మరీ చేసిన బాబి తాగి, ఇంటికొచ్చేటప్పటికి నేను ఫోన్ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు’ అందామనుకుని, గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి, పెదవులపై వసంతం పూయిస్తూ, ‘సర్లే, ఆరోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను’ అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫొటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది.అభయాంజనేయుడిలా భద్రత నిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు, అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్ళు. — ఉమా మహేష్ ఆచాళ్ళ -
'ఋతధ్వజుడు మదాలసల గాథ'
ఋతధ్వజుడి తండ్రి శత్రుజిత్తు మహారాజు. ఒకనాడు శత్రుజిత్తు కొలువుదీరి ఉండగా, గాలవుడు అనే బ్రాహ్మణుడు ఒక అశ్వాన్ని తీసుకుని వచ్చాడు. ‘‘మహారాజా! ఒక రాక్షసుడు నా ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నాడు. మాయావి అయిన ఆ రాక్షసుడు ఏనుగు, సింహం వంటి జంతువుల రూపాలు ధరించి, అడవినంతా అల్లకల్లోలం చేస్తున్నాడు. వాడిని శపించడానికి నా శక్తి చాలదు. ఒకవేళ శపించినా, నా తపస్సంతా వ్యర్థమైపోతుంది. వాడిని ఏమీ చేయలేకపోతున్నానే అనే నిస్సహాయతతో ఆకాశంవైపు చూసి నిట్టూర్చాను. అప్పుడు ఆకాశం నుంచి ఈ దివ్యాశ్వం భూమి మీదకు వచ్చింది. అదే సమయంలో అశరీరవాణి ఇలా పలికింది: ‘ఈ దివ్యాశ్వం భూమి మీదనే కాదు, ఆకాశ మార్గంలోను, పాతాళంలోనూ సంచరించగలడు. గిరులను, సాగరాలను అధిగమించగలదు. సమస్త భూమండలాన్నీ శరవేగంగా చుట్టేయగలదు. అందువల్ల దీనిపేరు కువలయం. శత్రుజిత్తు మహారాజు కొడుకు ఋతధ్వజుడు దీనిని అధిరోహించి, నీ తపస్సుకు ఆటంకం కలిగిస్తున్న అసురాధముణ్ణి సంహరించగలదు’ అని చెప్పింది’ అని పలికాడు. గాలవుడి మాటలు విన్న శత్రుజిత్తు తన కుమారుడు ఋతధ్వజుణ్ణి పిలిచి, ఆ అశ్వాన్ని అప్పగించి, గాలవుడి ఆశ్రమానికి రక్షణగా పంపాడు. ఋతధ్వజుడు గాలవుడి ఆశ్రమానికి వెళ్లి, ఆశ్రమవాసులందరికీ రక్షణగా ఉండసాగాడు. ఋతధ్వజుడు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలియని రాక్షసుడు యథాప్రకారం అడవిపంది రూపం ధరించి వచ్చి, నానా బీభత్సం మొదలుపెట్టాడు. ఆశ్రమంలోని గాలవుడి శిష్యులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీయసాగారు. ఋతధ్వజుడు వారి ఆర్తనాదాలు విని, కువలయాశ్వాన్ని అధిరోహించి, ఆగడం సాగిస్తున్న అడవిపంది వెంట పడ్డాడు. దాని మీదకు పదునైన బాణాలను సంధించి వదిలాడు. బాణాల దెబ్బలు తాళలేక అడవిపంది రూపంలో వచ్చిన రాక్షసుడు అడవిలోకి పరుగు తీశాడు. రాక్షసుడి అంతు చూద్దామనే పట్టుదలతో ఋతధ్వజుడు వెంటాడసాగాడు. అడవి నలువైపులా పరుగులు తీసి అలసిపోయిన రాక్షసుడు ఒక పెద్ద గోతిలోకి దూకి మాయమయ్యాడు. ఋతధ్వజుడు కూడా తన కువలయాశ్వంతో పాటు ఆ గోతిలోకి దూకాడు. ఆ గోతిలోంచి అతడు పాతాళలోకానికి చేరుకున్నాడు. పాతాళలోకం దేదీప్యమానంగా వెలిగి పోతోంది. ఎటు చూసినా బంగారు ప్రాకారాల ధగధగలు కనిపించాయి. ఇంద్రలోకంలాంటి పట్టణం కనిపించింది. ఋతధ్వజుడు ఆ పట్టణంలోకి వెళ్లాడు. వీథుల్లో ఎవరూ కనిపించలేదు. కాసేపటికి ఒక యువతి హడావుడిగా వెళుతూ కనిపించింది. ‘ఎవరు నువ్వు? ఎక్కడకు పోతున్నావు?’ అని ప్రశ్నించాడు. ఆమె బదులివ్వకుండా దగ్గర్లోనే ఉన్న ఒక మేడ మీదకు వెళ్లింది. ఋతధ్వజుడు ఆమెనే అనుసరిస్తూ మేడ మీదకు వెళ్లాడు. మేడపైన గదిలో ఒక సౌందర్యరాశి కనిపించింది. అపరిచితుడైన రాకుమారుడు అకస్మాత్తుగా తన గదిలోకి వచ్చేసరికి ఆమె చకితురాలైంది. వెంటనే మూర్ఛపోయింది. ఋతధ్వజుడు వెంటనే ఆమె దగ్గరకు చేరుకుని, భయపడవద్దంటూ సముదాయించాడు. ఇంతలోనే ఆమె చెలికత్తె వచ్చి ఆ సౌందర్యరాశికి పరిచర్యలు చేయసాగింది. ‘ఆమె ఎందుకిలా మూర్ఛపోయింది’ అని చెలికత్తెను ప్రశ్నించాడు ఋతధ్వజుడు. ‘ఈమె గంధర్వరాజు విశ్వావసుడి కుమార్తె మదాలస. నేను ఈమె చెలికత్తెను. నా పేరు కుండల. మదాలస వనంలో ఆటలాడుకుంటుండగా, పాతాళకేతువు అనే రాక్షసుడు ఆమెను అపహరించుకు వచ్చాడు. వచ్చే త్రయోదశినాడు ఈమెను వివాహం చేసుకోబోతున్నాడు. అధముడైన రాక్షసుణ్ణి పెళ్లిచేసుకోవడం ఇష్టంలేక ఈమె నిన్ననే ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడు ఒక గోమాత వచ్చి, భూలోకం నుంచి ఒక రాకుమారుడు వస్తాడని, రాక్షసుడిని చంపి మదాలసను వివాహమాడతాడని చెప్పింది. మిమ్మల్ని చూసిన మోహావేశంలో మా రాకుమారి మూర్ఛపోయింది. మీరు దైవాంశ సంభూతుల్లా ఉన్నారు. మామూలు మానవులు ఇక్కడ అడుగుపెట్టలేరు. మీ వృత్తాంతం చెప్పండి’ అంది కుండల. ఋతధ్వజుడు తనను తాను పరిచయం చేసుకుని, ఏ పరిస్థితుల్లో అక్కడకు వచ్చాడో వివరించాడు. ఇంతలో మూర్ఛనుంచి తేరుకున్న మదాలస తన ఎదుట ఉన్న రాకుమారుణ్ణి చూసి సిగ్గుపడింది. ‘రాకుమారా! ఈమె మీ మీద మనసుపడింది. గోమాత చెప్పిన రాకుమారుడు మీరే! గోవు అసత్యం చెప్పదు. అందువల్ల మీరు ఈమెను వివాహం చేసుకోండి’ అని కోరింది కుండల. ‘ఈమెను వివాహమాడటం నాకూ ఇష్టమే గాని, తండ్రి అనుమతి లేకుండా ఇప్పటికిప్పుడు ఎలా వివాహం చేసుకోగలను?’ అన్నాడు ఋతధ్వజుడు. ‘రాకుమారా! ఈమె దేవకన్య. ఇది ముందే జరిగిన దైవనిర్ణయం. మీరు అభ్యంతరం చెప్పకుండా ఈమెను వివాహం చేసుకోండి’ అంది కుండల. ‘సరే’నన్నాడు ఋతధ్వజుడు. కుండల వెంటనే తమ కులగురువైన తుంబురుణ్ణి స్మరించింది. తుంబురుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్కడికక్కడే అగ్నిహోత్రాన్ని వెలిగించి, మదాలసతో ఋతధ్వజుడికి శాస్త్రోక్తంగా వివాహం జరిపించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుండల కూడా సెలవు తీసుకుని, గంధర్వలోకానికి వెళ్లిపోయింది. ఋతధ్వజుడు మదాలసను తీసుకుని, అక్కడి నుంచి బయలుదేరడానికి కువలయాశ్వాన్ని అధిరోహించాడు. మదాలసతో అతడు అశ్వంపై వెళుతుండగా గమనించిన రాక్షసులు అతడి మీద దాడి చేశారు. వరుసగా ఆయుధాలను రువ్వారు. ఋతధ్వజుడు వారందరినీ ఎదుర్కొన్నాడు. తన బాణాలతో వారి ఆయుధాలను తుత్తునియలు చేశాడు. రాక్షసుల ద్వారా సంగతి తెలుసుకున్న పాతాళకేతువు స్వయంగా రంగప్రవేశం చేశాడు. ఋతధ్వజుడిపై అస్త్రాలను సంధించాడు. ఋతధ్వజుడు అతడి అస్త్రాలన్నింటినీ తన దివ్యాస్త్రాలతో నిర్వీర్యం చేశాడు. చివరగా త్వాష్ట్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం పాతాళకేతువు సహా రాక్షసులందరినీ మట్టుబెట్టింది. ఋతధ్వజుడు మదాలసతో కలసి క్షేమంగా తన రాజ్యానికి చేరుకున్నాడు. తండ్రికి జరిగినదంతా చెప్పాడు. శత్రుజిత్తు కుమారుణ్ణి ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. కోడలిని చూసి అభినందించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: వద్దమ్మా.. తప్పూ! -
పిల్లల కథ: దొంగ చెప్పిన తీర్పు!
పూర్వం అవంతీపురంలో రామగుప్తుడు, ధనగుప్తుడు అనే వర్తకులు ఉండేవారు. వ్యాపార నిమిత్తం డబ్బులు అవసరమై ధనగుప్తుడు రామగుప్తుని దగ్గరకు వెళ్ళి వెయ్యి వరహాలు అప్పుగా ఇవ్వమని అడిగాడు. తోటి వర్తకుని మాట కాదనలేక రామగుప్తుడు వెయ్యి వరహాలు ధనగుప్తుడికి అప్పుగా ఇచ్చాడు. చాలాకాలం గడిచింది. అయినా ధనగుప్తుడు రామగుప్తునికి ఇవ్వవలసిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఇక లాభం లేదు అనుకుని రామగుప్తుడు స్వయంగా ధనగుప్తుడిని కలసి తాను ఇచ్చిన వెయ్యి వరహాలు ఇవ్వమని అడిగాడు. రేపు, మాపు అంటూ మాట దాటవేశాడు తప్ప అప్పు తీర్చలేదు ధనగుప్తుడు. అటు తర్వాత ధనగుప్తుడు ఆ ప్రాంతంలో కనిపించనేలేదు. చేసేదేమీ లేక బాధపడ్డాడు రామగుప్తుడు. ఓసారి వ్యాపార నిమిత్తం చంద్రగిరికి వెళ్ళాడు రామగుప్తుడు. పనులన్నీ ముగించుకుని పూటకూళ్లవ్వ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తారసపడ్డాడు ధనగుప్తుడు. వెతకబోయిన తీగ కాళ్ళకి తగినట్లు సంబరపడ్డాడు రామగుప్తుడు. ‘మిత్రమా బాగున్నావా?’ అని పలకరించాడు. రామగుప్తుణ్ణి చూడగానే గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది ధనగుప్తుడికి. ‘ఏం బాగు? వ్యాపారం దివాళా తీసింది. దేశ దిమ్మరిలా తిరుగుతున్నాను’ అన్నాడు. ‘నీ మాటలు నేను నమ్మను. ఇప్పటికే చాలా కాలమైంది. నా వెయ్యి వరహాలు ఇస్తావా? ఇవ్వవా? స్నేహితుడివని వడ్డీ కూడా అడగలేదు. అసలు కూడా ఇవ్వకపోతివి’ అని గట్టిగా నిలదీశాడు రామగుప్తుడు. ‘ఏంటి మీ గొడవ?’ అంటూ పూటకూళ్ళవ్వ అడిగింది. జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రామగుప్తుడు. ‘సరే! ఏదో పని మీద మా మంత్రి గారు ఈ ఊరు వచ్చారు. మీరిద్దరూ మంత్రి సులోచనుడి దగ్గరికి వెళ్ళండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది’ అని సలహా ఇచ్చింది పూటకూళ్ళవ్వ. సరేనని ఇద్దరూ మంత్రి సులోచనుడి వద్దకు వెళ్ళారు. ‘అయ్యా మా ఇద్దరిదీ అవంతీపురం. చాలా కాలం క్రితం వ్యాపార నిమిత్తం నా దగ్గర వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నాడు ఈ ధనగుప్తుడు. నా అప్పు తీర్చమంటే తీర్చడం లేదు’ అని ఫిర్యాదు చేశాడు రామగుప్తుడు. ‘అదంతా వట్టి అబద్ధం. నేను ఇతని వద్ద అప్పు తీసుకోలేదు. తీసుకుంటే వడ్డీ ఎంత? పత్రం ఏదీ?’ అని బుకాయించాడు ధనగుప్తుడు. మంత్రి సులోచనుడు కాసేపు ఆలోచించి.. ‘రామగుప్తా నువ్వు అప్పు ఇచ్చినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా?’ అడిగాడు. ‘నా దగ్గర ఏ ఆధారాలు లేవు’ అని జవాబిచ్చాడు రామగుప్తుడు. ‘ఆధారాలు లేనప్పుడు ఎలా శిక్షించగలను? నువ్వు అప్పు ఇవ్వడం నిజమే అయినా నీ సొమ్ము ఎలా ఇప్పించగలను?’ అన్నాడు మంత్రి. చేసేదేమీ లేక దిగాలుగా రామగుప్తుడు, ‘నన్నేమీ చేయలేవు’ అనే అహంభావంతో ధనగుప్తుడు పూటకూళ్లవ్వ ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనాలయ్యాయి. అందరూ కబుర్లు చెప్పుకుని హాయిగా పడుకున్నారు. రెండో ఝాము అయ్యింది. ‘ధడేల్’మని చప్పుడు అయ్యింది. భయపడుతూ అందరూ ఒక్కసారి నిద్రలేచారు. ఏమయ్యిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ‘ఎవ్వరైనా కదిలారో చంపేస్తా’ అన్న మాటలు గట్టిగా వినిపించాయి. లాంతరు వెలుగులో అతని ఆకారాన్ని బట్టి గజదొంగ అని గుర్తించి భయం భయంగా కూర్చున్నారు అందరూ. ఆ గజదొంగ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ‘మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం మాట్లాడకుండా ఇచ్చేయండి లేదా పీక కోస్తా’ అని బెదిరించాడు. ‘బతికుంటే బలుసాకైనా తినవచ్చు’ అనుకుని ఒంటి మీద ఉన్న బంగారం, సంచిలో ఉన్న డబ్బులు ఒక్కొక్కరుగా ఇవ్వసాగారు. ఇది గమనించిన ధనగుప్తుడు.. తన దగ్గర ఉన్న వెయ్యి వరహాల సంచిని రామగుప్తుడి చేతిలో పెట్టి ‘నీ అప్పు తీరిపోయింది.. తీసుకో’ అన్నాడు. ఇప్పుడు తీసుకుంటే దొంగ పాలు అవుతుందని గ్రహించిన రామగుప్తుడు ఆ వరహాలను తీసుకోలేదు. ఆ గజదొంగ నేరుగా ధనగుప్తుడి దగ్గరికి వచ్చి ‘నీ దగ్గర ఉన్న డబ్బులు, బంగారం బయటకి తియ్’ అని గద్దించాడు. ‘ఈ వెయ్యి వరహాలు ఇతనికి అప్పు తీర్చవలసినవి. నా దగ్గర మరేమీ లేవు’ అన్నాడు ధనగుప్తుడు వణుకుతూ. ‘అయితే నీకు ఏ శిక్ష వెయ్యాలో నువ్వే చెప్పు’ అన్నాడు గజదొంగ. గజదొంగ వేషంలో ఉన్నది సులోచనుడని గ్రహించి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు ధనగుప్తుడు. ‘ఆధారం లేకపోతే అన్యాయం చేస్తావా? నీతిగా బతకడం నేర్చుకో’ అని మందలించి విడిచిపెట్టాడు సులోచనుడు. తన తప్పును మన్నించమని రామగుప్తుణ్ణి కోరాడు ధనగుప్తుడు. -కాశీ విశ్వనాథం పట్రాయుడు -
భక్తవిజయం: హనుమత్పురం
మేరుపర్వతానికి దక్షిణ దిశలో పది యోజనాల విస్తీర్ణం గల ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామ ప్రజలు ధార్మికులు. ఎవరి వృత్తులు వారు చేసుకుంటూ, పరస్పర సహకార ధోరణితో ప్రశాంతంగా జీవనం సాగించేవారు. ఆ గ్రామం జలసమృద్ధితో తులతూగేది. పొలాలు నిత్యహరితంగా అలరారేవి. గ్రామం శివార్లలోని వనాలలో ఫలవృక్షాలు పుష్కలంగా ఉండేవి. గోవృషభాది పశుసంపదకు లోటు లేకుండా ఉండేది. వీటన్నింటి వల్ల గ్రామం సుభిక్షంగా ఉండేది. ప్రజలు తీరికవేళల్లో భగవన్నామ సంకీర్తనతో కాలక్షేపం చేసేవారు. పర్వదినాలలో ఊరుమ్మడిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజపురస్కారాలను నిర్వహించేవారు. రావణ వధానంతరం రాముడు పట్టాభిషిక్తుడై అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగిస్తున్న రోజులవి. హనుమంతుడు రాముని కొలువులో ఉండేవాడు. నిత్యం సీతారాములను సేవించుకుంటూ తన ఆరాధ్య దైవమైన రాముని సమక్షంలోనే ఉండేవాడు. సుగ్రీవునితో మైత్రిని కలపడం సహా లంకలో బంధితురాలైన సీత జాడ కనుగొనడం మొదలుకొని యుద్ధంలో ఘనవిజయం వరకు రామునికి హనుమ చేసిన ఉపకారాలు అన్నీ ఇన్నీ కావు. తనకు ఇన్ని ఉపకారాలు చేసిన హనుమకు ప్రత్యుపకారం ఏదైనా చేయాలని తలచాడు రాముడు. ఒకనాడు హనుమను పిలిచాడు. ‘హనుమా! నువ్వు మాకెన్నో ఉపకారాలు చేశావు. నీ ఉపకారాలను మరువజాలను. నీకేదైనా వరమివ్వాలని ఉంది. నీకిష్టమైనదేదో కోరుకో, తప్పక ఇస్తాను’ అన్నాడు. ‘శ్రీరామా! నువ్వు పురుషోత్తముడవు, పరమపురుషుడవు. నీ సేవకు మించిన భాగ్యం ఇంకేదీ లేదు. నిత్యం నీ సన్నిధిలో నిన్ను సేవించుకుంటూ ఉండటమే నాకు పరమభాగ్యం’ అని బదులిచ్చాడు హనుమ. ‘అది కాదు గాని, నీకు ఒక గ్రామాన్ని బహూకరిస్తున్నాను. మేరుపర్వతానికి దక్షిణదిశలో సుఖశాంతులతో అలరారుతున్న ఆ గ్రామం ఇక నీదే! నా వరంగా ఆ గ్రామాన్ని స్వీకరించు. ఆ గ్రామానికి హనుమత్పురమని నామకరణం చేస్తున్నాను. నువ్వు అక్కడకు వెళ్లి, గ్రామ ప్రజల యోగక్షేమాలను గమనిస్తూ ఉండు. ఇకపై అక్కడి ప్రజలు హనుమద్భక్తులై విలసిల్లుతారు. ముల్లోకాలలో నీ పేరు ప్రతిష్ఠలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి’ అన్నాడు రాముడు. రాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు ఆ గ్రామానికి చేరుకున్నాడు. రాముడి ఆదేశం మేరకు హనుమంతుడు ఆ గ్రామానికి అధిపతి. అయితే, హనుమంతుడికి ఆధిపత్య కాంక్ష లేదు. ఆ ఊరి ప్రజలంతా శాంతికాముకులు, ధార్మికులు, భగవత్ చింతనా తత్పరులు. హనుమంతుడు ఆ గ్రామంలోని బ్రాహ్మణులందరినీ పిలిచి సమావేశపరచాడు. ‘మీరిక్కడ ఎన్నాళ్లుగానో ఉంటున్నారు. ఇకపై కూడా మీరంతా మీ మీ కుటుంబాలతో ఇక్కడే ఉంటూ సత్కార్యాలతో కాలక్షేపం చేస్తూ ఉండండి’ అని చెప్పి, రాముడు తనకు ఇచ్చిన ఆ గ్రామాన్ని అక్కడి ప్రజలకే దానమిచ్చేశాడు. అక్కడి నుంచి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. గ్రామ ప్రజలందరూ హనుమంతుడి ఔదార్యానికి ఆనందభరితులయ్యారు. కృతజ్ఞతగా గ్రామంలో అడుగడుగునా హనుమంతునికి మందిరాలను నిర్మించుకున్నారు. గ్రామస్థుల కృషి, ధార్మిక వర్తనల కారణంగా గ్రామం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లసాగింది. ఆ గ్రామ పరిసరాల్లోని అడవిలో దుర్ముఖుడనే రాక్షసుడు ఉండేవాడు. హనుమత్పురం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుండటం చూసి అతడికి కన్ను కుట్టింది. సుభిక్షమైన ఆ గ్రామాన్ని కైవసం చేసుకోవాలనుకున్నాడు. ఒకనాడు అకస్మాత్తుగా తన రాక్షసదండుతో గ్రామం మీదకు దండెత్తాడు. ‘ఈ గ్రామం నాది. మీరిక్కడ ఉండటానికి వీల్లేదు. వెంటనే గ్రామాన్ని వదిలి వెళ్లిపోండి’ అని గ్రామస్థులను హెచ్చరించాడు. రాక్షసదండును చూడటంతోనే గ్రామస్థులు భయపడ్డారు. దుర్ముఖుడు చేసిన హెచ్చరికతో వారు మరింతగా భీతిల్లారు. ఊరు విడిచి వెళ్లిపోవడానికి రెండురోజులు గడువివ్వమని గ్రామస్థులు దుర్ముఖుడిని వేడుకున్నారు. అతడు అందుకు సమ్మతించి అప్పటికి వెనుదిరిగాడు. దిక్కుతోచని గ్రామస్థులు హనుమంతుని మందిరాల్లో పూజలు చేస్తూ, తమను రక్షించమంటూ ప్రార్థనలు చేశారు. రెండోరోజు రాత్రి ఒక బ్రాహ్మణుడికి కలలో హనుమంతుడు కనిపించాడు. ‘ఈ భూమి ఎవరి రాజ్యమూ కాదు. మాంధాత వంటి చక్రవర్తులు ఈ భూమిని ఏలారు. వారెవరైనా తమ సామ్రాజ్యాలను తమతో పాటే తీసుకుపోయారా? మీ గ్రామంలోనే మీరు ఉండండి. ఇదే మాట దుర్ముఖుడితో చెప్పండి’ అని పలికి, దుర్ముఖుడి రాక్షససేన విడిచి చేసిన వైపుగా బయలుదేరాడు. మరునాటి ఉదయమే దుర్ముఖుడి సేనాని అతడి వద్దకు పరుగు పరుగున చేరుకున్నాడు. ‘నాయకా! తాటిచెట్టంత మహాకాయుడొకడు గ్రామానికి కావలి కాస్తున్నాడు. రాత్రివేళ మన సేన విడిచి చేసిన గుడారాల చుట్టూ తిరిగి కొండ మీదకు చేరుకున్నాడు. కొండ మీద కూర్చుని, బండరాళ్లను బంతుల్లా చేసి ఆడుకుంటున్నాడు. అతణ్ణి చూస్తేనే భయం వేస్తోంది. అతడు బండరాళ్లను మన దండు మీద విసిరితే అంతా నుజ్జు నుజ్జయిపోతాం’ అని చెప్పాడు. దుర్ముఖుడికి పరిస్థితి అర్థమైంది. తెగిస్తే ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించాడు. వెంటనే గ్రామానికి చేరుకుని, ‘గ్రామస్థులారా! మీరంతా సద్వర్తనులు. ఇక్కడ మీరు యథాప్రకారం ఉండండి’ అని చెప్పి వెనుదిరిగాడు. -సాంఖ్యాయన -
యాజ్ఞవల్క్యుడి స్వాభిమానం
అది ద్వాపరయుగం. వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజన చేశాడు. నాలుగు భాగాలనూ తన నలుగురు శిష్యులైన జైమిని, వైశంపాయనుడు, పైలుడు, సుమంతులకు అప్పగించాడు. లోకంలో వాటిని ప్రచారం చేయమని వారిని ఆదేశించాడు. వ్యాసుడి ద్వారా వైశంపాయనుడు యజుర్వేదాన్ని పొందాడు. గురువు ఆదేశం మేరకు యజుర్వేద ప్రచారం కోసం శిష్యులకు బోధించసాగాడు. వైశంపాయనుడి శిష్యులలో యాజ్ఞవల్క్యుడు మిగిలిన శిష్యులందరి కంటే చాలా తెలివైనవాడు. గురువుకు శ్రద్ధగా శుశ్రూష చేస్తూ, ఆయన వద్ద యజుర్వేదాన్ని కూలంకషంగా నేర్చుకున్నాడు. అదే కాలంలో ఒకనాడు మహర్షులందరూ మేరుపర్వతం మీద సభను ఏర్పాటు చేశారు. అన్ని రాజ్యాల్లో ఉన్న మహర్షులందరికీ వర్తమానం పంపారు. మహర్షులందరూ ఆ సభకు తప్పక రావాలని, ఎవరైనా సభకు రానట్లయితే వారికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని తీర్మానించారు. మహర్షుల సభకు రావలసినదిగా వైశంపాయనుడికి కూడా వర్తమానం అందింది. అయితే, కారణాంతరాల వల్ల ఆయన ఆ సభకు వెళ్లలేకపోయాడు. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం వైశంపాయనుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఈ పరిణామానికి వైశంపాయనుడు ఎంతగానో దిగులు చెందాడు. బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడే ఉపాయమేమిటని మహర్షులను అడిగాడు. ‘ఎవరైనా తపస్సు ధారపోస్తే బయటపడవచ్చు’ అని వారు తరుణోపాయం చెప్పారు. ఇదంతా జరిగినప్పుడు ఆశ్రమంలో యాజ్ఞవల్క్యుడు లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు. గురువుకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కల్పించడానికి వైశంపాయనుడి మిగిలిన శిష్యులంతా ఆశ్రమ ప్రాంగణంలో తపస్సు ప్రారంభించారు. అదే సమయానికి యాజ్ఞవల్క్యుడు వచ్చాడు. ఆశ్రమంలో తన సహాధ్యాయులందరూ తపోనిష్ఠలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు వారంతా తపోనిష్ఠలో ఉన్నారో అతడికి అర్థంకాలేదు. నేరుగా గురువు వైశంపాయనుడి వద్దకు వెళ్లాడు. ‘గురువర్యా! నా సహాధ్యాయులందరూ తపోనిష్ఠలో ఉన్నారేమిటి? నేను లేనప్పుడు వారికి ఏదైనా దీక్ష ఇచ్చారా? లేదా ఏదైనా బృహత్కార్యం కోసం వారంతా తపస్సు చేస్తున్నారా?’ అని ప్రశ్నించాడు. ‘నాయనా! మేరుపర్వతం మీద మహర్షుల సభ జరిగింది. అనివార్య కారణాల వల్ల నేను ఆ సభకు వెళ్లలేకపోయాను. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం నాకు బ్రహ్మహత్యాపాతకం సంప్రాప్తించింది. తరుణోపాయం కోసం నేను మహర్షులనే ఆశ్రయించాను. వారు చెప్పిన తరుణోపాయం ప్రకారం నాకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలగాలంటే ఎవరైనా తమ తపః ఫలాన్ని నాకు ధారపోయవలసి ఉంటుంది. తపః ఫలితాన్ని నాకు ధారపోయాలనే నా శిష్యులంతా తపస్సుకు పూనుకున్నారు’ అని చెప్పాడు వైశంపాయనుడు. ‘గురువర్యా! వీళ్లంతా అల్పజ్ఞులు. వీళ్ల తపస్సు వల్ల మీకు పాపవిమోచన కలగడానికి ఎన్నాళ్లు పడుతుందో! నాకు అనుజ్ఞ ఇవ్వండి. మీకోసం ఘోరమైన తపస్సు చేస్తాను’ అన్నాడు యాజ్ఞవల్క్యుడు. సహాధ్యాయులను అల్పజ్ఞులుగా సంబోధించిన యాజ్ఞవల్క్యుడిపై వైశంపాయనుడికి పట్టరాని కోపం వచ్చింది. ‘సాటివారిని అవమానించే నీలాంటి గర్వాంధుడితో నాకు పనిలేదు. నీలాంటి వాడికి నాకు శిష్యుడిగా ఉండే అర్హత కూడా లేదు. నేను చెప్పిన విద్యను ఇక్కడే వదిలేసి వెళ్లు’ హూంకరించాడు వైశంపాయనుడు. యాజ్ఞవల్క్యుడు స్వాభిమాని. గురువు మాటలు అతడికి అవమానంగా తోచాయి. గురువు వద్ద నేర్చుకున్న విద్యనంతా అక్కడే నల్లని నెత్తురుగా కక్కేశాడు. అతడు కక్కిన నెత్తురు కృష్ణ యజుర్వేదమైంది. ఆ నెత్తుటిని తిత్తిరి పక్షులు తిన్నాయి. తిత్తిరి పక్షులు తినేసిన నెత్తురు ఆ తర్వాత తైత్తరీయోపనిషత్తు అయింది. గురువు వద్ద నేర్చుకున్న వేదాన్నంతా కక్కేసిన యాజ్ఞవల్క్యుడు సూర్యుడి కోసం తపస్సు చేసి, ఆయనను ప్రసన్నుడిని చేసుకున్నాడు. సూర్యుడి వద్దనే నేరుగా వేదవిద్యను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. యాజ్ఞవల్క్యుడు సూర్యుడి వద్ద నేర్చుకున్నది శుక్లయజుర్వేదమైంది. ఈ వేదభాగాన్నే యాజ్ఞవల్క్యుడు తన శిష్యులైన కణ్వ, మధ్యందినాదులకు బోధించాడు. యాజ్ఞవల్క్యుడు బోధించిన శుక్లయజుర్వేదం ‘వాజసనేయ సంహిత’గా ప్రసిద్ధి పొందింది. వాజః అంటే అన్నం. సని అంటే దానం. యాజ్ఞవల్క్యుడి తండ్రి నిరతాన్నదానం చేసేవాడు. అందువల్ల ఆయనకు వాజసని అనే పేరు వచ్చింది. వాజసని కొడుకు కావడం వల్ల యాజ్ఞవల్క్యుడికి వాజసనేయుడు అనే నామాంతరం ఏర్పడింది. - సాంఖ్యాయన -
నవ్వు చేటా? లక్ష్మణదేవర నవ్వు
నవ్వు ఎంత గొప్ప మందైనా.. కొన్ని పరిస్థితుల్లో అంతే నిషిద్ధమని పురాణాలు చెబుతున్నాయి. ‘నవ్వు నాలుగు విధాల చేటు’ అనేందుకు పెద్దలు కూడా పలు ఉదాహరణలు ఇస్తూంటారు. వాటిల్లో ముఖ్యమైనవి.. ద్రౌపది నవ్వు. మయసభలో దుర్యోధనుడు జారిపడినప్పుడు ద్రౌపది నవ్విన నవ్వు.. అతడి అహాన్ని దెబ్బతీసింది. అనంతరం మాయద్యూతానికి, చివరకు కురుపాండవ యుద్ధానికి దారితీసిందని చెబుతారు. లక్ష్మణుడి నవ్వు.. శ్రీరాముడి కొలువులో కల్లోల్లాన్నే సృష్టించింది. ఆ కథ తెలియాలంటే ‘లక్ష్మణదేవర నవ్వు’ అనే పురాణగాథ తెలుసుకోవాల్సిందే. రావణవధ తర్వాత.. శ్రీరాముడు తన భార్య సీతమ్మతో పాటు అయోధ్యకు తిరిగి వచ్చాక జరిగిన కథ ఇది. ఆరుబయట బ్రహ్మాండమైన సభా వేదిక అతిరథులతో నిండిపోయింది. రాముడు రాజుగా కొలువుదీరున్న ఆ సభకు వేలాది వీరులు, సూరులు విచ్చేశారు. గద్దె మీద విభీషణుడు, లంకావాసులు, సుగ్రీవుడు, కిష్కింధాపురవాసులు, ఈశ్వరుడు, ఇంద్రాదులైన దేవతలు, అయోధ్యాపుర ప్రముఖులు కూర్చున్నారు. సభ మొత్తం గంభీరంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా లక్ష్మణుడు కిలకిలా నవ్వాడు. ఆ నవ్వుకు అంతా విస్తుపోయారు. ఎవరికివారు తమకు తోచిన అర్థాలను తీసుకోవడం మొదలుపెట్టారు. ‘జాలరివాళ్ల పుత్రిక గంగను నెత్తిన పెట్టుకున్నందుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని తనలోని లోపాలను వెతుక్కుంటూ తల దించుకున్నాడు శివుడు. ‘శివుడి పెళ్లిలో కిందపడి నా నడము విరిగింది కదా.. ఆ గూనితో ఇక్కడికి వచ్చినందుకు నన్ను చూసి నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని అవమానంగా తల దించుకున్నాడు జాంబవంతుడు. ‘నా అన్న వాలిని రామునిచే చంపించి, అన్న భార్యను నా భార్యగా చేసుకుని కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నానని నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని తల దించుకున్నాడు సుగ్రీవుడు. ‘నా అన్న రావణాసురుడి ఆయువుపట్లను రహస్యంగా రాముడికి చెప్పి.. రావణవధకు ఓ రకంగా నేనే కారణం అయ్యాను.. ఇప్పుడు లంకారాజ్యానికి రాజునయ్యాను.. నా వెన్నుపోటు తీరుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు’ అని మథనపడుతూ తల దించుకుంటాడు విభీషణుడు. ‘ఇంత బలవంతుడినైన నేను చిన్న వాడైన ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి దొరికినందుకు నన్ను చూసే నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని అల్లాడుతూ తల దించుకుంటాడు హనుమంతుడు. ‘కారడవిలో రావణాసురుడి చేత చిక్కిన నన్ను రాముడు తొడమీద కూర్చోబెట్టుకున్నందుకు.. ఒక్క క్షణం కూడా నా భర్తను చూడకుండా ఉండలేను అని చెప్పిన నేను.. ఆరు నెలలు రాముడు లేకుండా రావణలంకలో ఎలా ఉండగలిగానని వెటకారంగా నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని సీతాదేవి తల దించుకుంటుంది. సీత ఇబ్బందిని మనోగతాన్ని ఎరిగిన రాముడు.. చిన్నబోతాడు. మొత్తానికీ ఆ సభలోని ఒక్కొక్కరూ ఒక్కోలా.. తమ లోపాలను.. తప్పులను.. అసమతుల్యాలను.. అస్పష్టతలను తలచుకుని మరీ అవమానంగా భావిస్తుంటారు. అయితే సభలో నెలకొన్న గందరగోళం గుర్తించిన రాముడు.. ఆవేశంగా తమ్ముడు లక్ష్మణుడ్ని ‘ఎందుకు నవ్వావ్?’ అంటూ నిలదీస్తాడు అందరి ముందే. దాంతో లక్ష్మణుడు తన నవ్వుకు అసలు కారణం చెబుతాడు. ‘మనం అరణ్యాలకు పోయినప్పుడు, ఆ పర్ణశాలలో నేను మీకు, వదినమ్మకు సేవ చేస్తూండగా, ఓ రాత్రి రెండు ఝాముల వేళలో నిద్రాదేవి ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది. సతిరూపంలో వచ్చిన ఆమెను ‘ఎందుకు ఏడుస్తున్నావ్?’ అని అడిగాను. అప్పుడు ఆమె.. ‘నేను నిద్రాదేవిని.. నన్ను మనుషులెవ్వరూ గెలవలేరు. కానీ నువ్వు నన్ను దరి చేరనివ్వడం లేదు’ అంది. దాంతో ఆమెకు నేను ముమ్మార్లు ప్రదక్షిణం చేసి.. ‘నేను మా అన్న, వదినలకు ఈ పర్ణశాలలో కాపలా ఉండాలి. అక్కడ అయోధ్యలో నా భార్య ఊర్మిళ ఒక్కర్తే నాకోసం తపిస్తూ ఉంది. ఆమెను రాత్రింబవళ్లు లేవకుండా ఆవహించు. మళ్లా నేను తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు నన్ను ఆవహిద్దువుగానీ’ అని చెప్పాను. ఆ మాట ప్రకారం.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిద్రాదేవి నన్ను ఈ సభలో ఆవహించినందుకు నాకు నవ్వొచ్చింది’’ అని సమాధానం ఇస్తాడు లక్ష్మణుడు నిద్ర మత్తులో తూలుతూ. పశ్చాత్తాపంతో తక్షణమే రాముడు... లక్ష్మణుడికి పక్క ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తాడట. ఏదేమైనా లక్ష్మణుడు నవ్వింది అతడి వ్యక్తిగతం. కానీ నలుగురు గంభీరంగా ఉన్నప్పుడు.. మహా సభ సమక్షంలో అతడు నవ్వడంతో.. ఎవరికి వారు తమ వ్యక్తిగతాన్ని తడుముకుంటూ.. అవమానంగా భావించారు. ఆ నవ్వుకు అర్థం తెలియక అల్లాడారు. అందుకే సందర్భోచితంగా మాత్రమే నవ్వాలని పెద్దలు చెబుతుంటారు. -
మరో కాలాపానీ: అల్కట్రాజ్.. ఒకనాటి కారాగారం
బ్రిటిష్ హయాంలో అండమాన్‌లోని కాలాపానీ జైలు గురించి అందరికీ తెలుసు. ఇది అమెరికన్ ద్వీప కారాగారం. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో తీరానికి ఆవల ఉన్న చిన్న దీవి అల్కట్రాజ్. ఒకప్పుడు అమెరికన్ ప్రభుత్వం కరడుగట్టిన నేరగాళ్లను బంధించేందుకు ఇక్కడ కారాగారాన్ని నిర్మించింది. కేవలం 2.01 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ ఏకాంత దీవిలో కట్టుదిట్టమైన జైలును 1775లో నిర్మించారు. ఇది 1963 వరకు పనిచేసింది. పెలికాన్ పక్షులకు విడిది కేంద్రంగా ఉన్న ఈ దీవిలోని జైలు నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం. జైలు గోడలు దాటి బయటపడినా, చుట్టూ భీకరమైన సముద్రం. సముద్రంలో ఈతకొట్టాలని తెగించినా, ఇక్కడి సముద్ర జలాలు గడ్డకట్టించేంత చల్లగా ఉంటాయి. అవతలి తీరం చేరేంత వరకు ఈతకొడుతూ బతికి బట్టకట్టడం మానవమాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడి జైలు మూతబడిన తర్వాత ఇది కేవలం చారిత్రక కట్టడంగా మాత్రమే మిగిలింది. అప్పుడప్పుడు పర్యాటకులు ఇక్కడికి వచ్చి, ఈ జైలును చూసి పోతుంటారు. -
అలనాటి ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు మన దేశంలోనూ విరివిగా కనిపిస్తున్నాయి గాని, నిజానికి ఇవి వందేళ్లకు ముందు నుంచి కూడా వాడుకలో ఉన్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అలనాటి ఎలక్ట్రిక్ కారు. దీనిని అమెరికన్ కార్ల తయారీ కంపెనీ ‘కొలంబియా’ విడుదల చేసింది. ‘కొలంబియా ఎలక్ట్రిక్ ఫేటన్’ పేరుతో ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీని కొలంబియా కంపెనీ 1905లో ప్రారంభించింది. ఫొటోలో ఉన్న కారు 1908 నాటిది. అప్పట్లో దీని ధర 1600 డాలర్లు (రూ.1.33 లక్షలు) ఉండేది. ఇప్పటి లెక్కల ప్రకారం దీని ధర 44,00 డాలర్లు (రూ.36.65 లక్షలు) ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో ఈ మోడల్ కారుకు విపరీతమైన గిరాకీ ఉండేది. ఈ కారుకు 24 బ్యాటరీలు పెట్టుకోవాల్సి వచ్చేది. వాటిని రీచార్జ్ చేసుకోవడానికి వీలయ్యేది. ఈ కారు ముందుకు పోవడానికి మూడు గేర్లు, వెనక్కు మళ్లడానికి రెండు రివర్స్ గేర్లు ఉండటం విశేషం. దీనికి స్టీరింగ్‌వీల్, యాక్సిలేటర్ పెడల్ ఉండవు. కారుకు కుడి పక్కన తెడ్డులాంటి సాధనం అమర్చి ఉంటుంది. దిశను మార్చడానికి డ్రైవర్ దీనిని వాడాల్సి వచ్చేది. వేగాన్ని నియంత్రించడానికి ఎడమవైపు ఉండే కర్రలాంటి సాధనాన్ని వాడాల్సి వచ్చేది. ఇప్పటి తరానికి ఇది చాలా విచిత్రంగా కనిపించినా, ఈ కారు ఇంకా పనిచేసే పరిస్థితిలోనే ఉండటం విశేషం. -
భక్త విజయం - ‘సుషేణుడి తపస్సు’
వానర యోధుల్లో ముఖ్యులైన వారిలో సుషేణుడు ఒకడు. సుషేణుడు వానరరాజు సుగ్రీవుడికి మామ. వరుణుడి కొడుకైన సుషేణుడు వానర వైద్యుడు. అతడి ఔషధ పరిజ్ఞానం అనన్యసామాన్యం. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు నాగాస్త్రానికి రామలక్ష్మణులు బంధితులై కుప్పకూలిపోయినప్పుడు, రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధానికి లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సూచనల మేరకే హనుమంతుడు సంజీవని పర్వతానికి చేరుకున్నాడు. సుషేణుడు తనకు సూచించిన ఓషధులను హనుమంతుడు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్నే పెకలించుకుని వచ్చాడు. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తే, సుషేణుడు దానిపైనున్న మొక్కలలో సంజీవకరణి, విశల్యకరణి వంటి ఓషధీ మూలికలను గుర్తించి, వాటితో రామలక్ష్మణులను స్వస్థులను చేశాడు. యుద్ధంలో మరణించిన వానరయోధులను తిరిగి బతికించాడు. గాయపడిన వారి గాయాలను నయం చేశాడు. రామ రావణ యుద్ధంలో శ్రీరాముడి ఘన విజయానికి సుషేణుడు తనవంతు తోడ్పాటునందించాడు. రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. అయోధ్యలో జరగబోయే శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించడానికి సుగ్రీవ, అంగద, హనుమదాది వానర వీరులు, విభీషణుడు కూడా పుష్పక విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో సుమంచ పర్వతం మీద శ్రీరాముడు తన పరివారంతో విడిది చేశాడు. సుమంచ పర్వతం మీదనున్న వృక్షసంపదలో అంతులేని ఓషధీమూలికలను అందించే మొక్కలు, చెట్లు చూసి వానర వైద్యుడు సుషేణుడు అమితానంద భరితుడయ్యాడు. ఓషధీమూలికలతో నిండిన పర్వతం, చుట్టూ చక్కని మహారణ్యం ఉన్నా సుమంచ పర్వతప్రాంతంలోని ప్రజలు రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉండటం చూసి కలత చెందాడు. ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తనవంతుగా వైద్యసేవలు అందించాలని, తన శేషజీవితాన్ని ఈ పర్వతం మీదనే జపతపాదులతో గడపాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరాముడికి తన మనోగతాన్ని తెలిపాడు. ‘శ్రీరామా! యుద్ధం పరిసమాప్తమైంది. నీకు ఘనవిజయం సాధ్యమైంది. అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడవై, నీ ప్రజలను జనరంజకంగా పరిపాలించు. నేను ఇక్కడే ఉండి శేషజీవితాన్ని జపతపాదులతో గడపాలని, పరమశివుడు అనుగ్రహిస్తే, బొందితో కైలాసం పోవాలని భావిస్తున్నాను. అద్భుతమైన మూలికలతో నిండిన ఈ పర్వత పరిసర ప్రాంతాల్లోని ప్రజలు రోగపీడితులుగా ఉన్నారు. వారికి సేవలందిస్తాను. ఇందుకు అనుమతించు’ అని కోరాడు. ‘సరే, నీ మనోభీష్టం ప్రకారమే కానివ్వు’ అని పలికాడు రాముడు. సుషేణుడిని ఆశీర్వదించి పరివారంతో కలసి అయోధ్యకు పయనమయ్యాడు. సుషేణుడు సుమంత పర్వతంపైనే ఉంటూ శివుని గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి శ్రీరాముడికి సుషేణుడు గుర్తుకొచ్చాడు. సుషేణుడి యోగక్షేమాలను తెలుసుకుని రమ్మని హనుమంతుడికి చెప్పాడు. రాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు సుమంచ పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఏ అలికిడీ వినిపించలేదు. దట్టమైన చెట్ల మధ్య వెదుకులాడుతూ హనుమంతుడు కొంత దూరం ముందుకు సాగాడు. ఒకచోట చెట్టు కింద సుషేణుడి కళేబరం కనిపించింది. అప్పటికే అది పూర్తిగా అస్థిపంజరంగా మారింది. తపస్సులోనే సుషేణుడు శివసాయుజ్యం పొంది ఉంటాడని భావించిన హనుమంతుడు, అక్కడే ఒక గొయ్యి తవ్వి, సుషేణుడి కళేబరాన్ని అందులో పూడ్చిపెట్టాడు. అక్కడ దొరికిన మల్లెలను కోసి తెచ్చి, సుషేణుడిని పూడ్చిన చోట ఉంచి, గుర్తుగా దానిపై కృష్ణాజినాన్ని కప్పాడు. హనుమంతుడు అక్కడి నుంచి నేరుగా అయోధ్యకు చేరుకుని, రాముడికి సుషేణుడి నిర్యాణ వార్త చెప్పాడు. వెంటనే రాముడు సీతా లక్ష్మణ సమేతంగా హనుమంతుడితో కలసి సుమంచ పర్వతానికి బయలుదేరాడు. పర్వతం మీదకు చేరుకున్నాక, సుషేణుడిని తాను పూడ్చిపెట్టిన చోటుకు వారిని తీసుకువెళ్లాడు హనుమంతుడు. సుషేణుడి కళేబరాన్ని చూపించడానికి పైన తాను కప్పి ఉంచిన కృష్ణాజినాన్ని తొలగించాడు. ఆశ్చర్యకరంగా అక్కడ సుషేణుడి కళేబరం లేదు. దానికి బదులుగా ఒక శివలింగం కనిపించింది. శివలింగం మీద మల్లెపువ్వులు ఉన్నాయి. అభీష్టం మేరకు సుషేణుడు శివసాయుజ్యం పొందాడని వారికి అర్థమైంది. సమీపంలోని కొలనులో సీతా రామ లక్ష్మణ హనుమంతులు స్నానమాచరించి, శివలింగానికి పూజించడం ప్రారంభించాడు. పూజ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రచండ వేగంతో గాలులు వీచసాగాయి. ఔషధ మూలికల పరిమళాన్ని నింపుకున్న ఆ గాలులు సోకినంత మేర ఆ ప్రాంతంలోని రోగపీడితులకు ఆశ్చర్యకరంగా రోగాలు నయమయ్యాయి. పూజ కొనసాగిస్తుంటే, శివలింగం క్రమంగా పెరగసాగింది. అక్కడ శివాలయాన్ని నిర్మిద్దామని శ్రీరాముడు అనుకున్నా, శివలింగం పరిమాణం పెరుగుతూ ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు. సుషేణుడు నిర్యాణం చెందిన ప్రదేశంలో ఆవిర్భవించిన శివలింగంపై మల్లెపూలు, కృష్ణాజినం ఉండటంతో అక్కడ వెలసిన శివుడు మల్లికాజినస్వామిగా ప్రఖ్యాతి పొందాడు. మల్లికాజునస్వామి వెలసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లో టెక్కలి సమీపంలోని రావివలస గ్రామంలో ఉంది. - సాంఖ్యాయన