నవ్వు ఎంత గొప్ప మందైనా.. కొన్ని పరిస్థితుల్లో అంతే నిషిద్ధమని పురాణాలు చెబుతున్నాయి. ‘నవ్వు నాలుగు విధాల చేటు’ అనేందుకు పెద్దలు కూడా పలు ఉదాహరణలు ఇస్తూంటారు. వాటిల్లో ముఖ్యమైనవి.. ద్రౌపది నవ్వు. మయసభలో దుర్యోధనుడు జారిపడినప్పుడు ద్రౌపది నవ్విన నవ్వు.. అతడి అహాన్ని దెబ్బతీసింది. అనంతరం మాయద్యూతానికి, చివరకు కురుపాండవ యుద్ధానికి దారితీసిందని చెబుతారు. లక్ష్మణుడి నవ్వు.. శ్రీరాముడి కొలువులో కల్లోల్లాన్నే సృష్టించింది. ఆ కథ తెలియాలంటే ‘లక్ష్మణదేవర నవ్వు’ అనే పురాణగాథ తెలుసుకోవాల్సిందే.
రావణవధ తర్వాత.. శ్రీరాముడు తన భార్య సీతమ్మతో పాటు అయోధ్యకు తిరిగి వచ్చాక జరిగిన కథ ఇది. ఆరుబయట బ్రహ్మాండమైన సభా వేదిక అతిరథులతో నిండిపోయింది. రాముడు రాజుగా కొలువుదీరున్న ఆ సభకు వేలాది వీరులు, సూరులు విచ్చేశారు. గద్దె మీద విభీషణుడు, లంకావాసులు, సుగ్రీవుడు, కిష్కింధాపురవాసులు, ఈశ్వరుడు, ఇంద్రాదులైన దేవతలు, అయోధ్యాపుర ప్రముఖులు కూర్చున్నారు.
సభ మొత్తం గంభీరంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా లక్ష్మణుడు కిలకిలా నవ్వాడు. ఆ నవ్వుకు అంతా విస్తుపోయారు. ఎవరికివారు తమకు తోచిన అర్థాలను తీసుకోవడం మొదలుపెట్టారు.
‘జాలరివాళ్ల పుత్రిక గంగను నెత్తిన పెట్టుకున్నందుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని తనలోని లోపాలను వెతుక్కుంటూ తల దించుకున్నాడు శివుడు. ‘శివుడి పెళ్లిలో కిందపడి నా నడము విరిగింది కదా.. ఆ గూనితో ఇక్కడికి వచ్చినందుకు నన్ను చూసి నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని అవమానంగా తల దించుకున్నాడు జాంబవంతుడు.
‘నా అన్న వాలిని రామునిచే చంపించి, అన్న భార్యను నా భార్యగా చేసుకుని కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నానని నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని తల దించుకున్నాడు సుగ్రీవుడు. ‘నా అన్న రావణాసురుడి ఆయువుపట్లను రహస్యంగా రాముడికి చెప్పి.. రావణవధకు ఓ రకంగా నేనే కారణం అయ్యాను.. ఇప్పుడు లంకారాజ్యానికి రాజునయ్యాను.. నా వెన్నుపోటు తీరుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు’ అని మథనపడుతూ తల దించుకుంటాడు విభీషణుడు.
‘ఇంత బలవంతుడినైన నేను చిన్న వాడైన ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి దొరికినందుకు నన్ను చూసే నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని అల్లాడుతూ తల దించుకుంటాడు హనుమంతుడు. ‘కారడవిలో రావణాసురుడి చేత చిక్కిన నన్ను రాముడు తొడమీద కూర్చోబెట్టుకున్నందుకు..
ఒక్క క్షణం కూడా నా భర్తను చూడకుండా ఉండలేను అని చెప్పిన నేను.. ఆరు నెలలు రాముడు లేకుండా రావణలంకలో ఎలా ఉండగలిగానని వెటకారంగా నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని సీతాదేవి తల దించుకుంటుంది. సీత ఇబ్బందిని మనోగతాన్ని ఎరిగిన రాముడు.. చిన్నబోతాడు.
మొత్తానికీ ఆ సభలోని ఒక్కొక్కరూ ఒక్కోలా.. తమ లోపాలను.. తప్పులను.. అసమతుల్యాలను.. అస్పష్టతలను తలచుకుని మరీ అవమానంగా భావిస్తుంటారు. అయితే సభలో నెలకొన్న గందరగోళం గుర్తించిన రాముడు.. ఆవేశంగా తమ్ముడు లక్ష్మణుడ్ని ‘ఎందుకు నవ్వావ్?’ అంటూ నిలదీస్తాడు అందరి ముందే.
దాంతో లక్ష్మణుడు తన నవ్వుకు అసలు కారణం చెబుతాడు. ‘మనం అరణ్యాలకు పోయినప్పుడు, ఆ పర్ణశాలలో నేను మీకు, వదినమ్మకు సేవ చేస్తూండగా, ఓ రాత్రి రెండు ఝాముల వేళలో నిద్రాదేవి ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది.
సతిరూపంలో వచ్చిన ఆమెను ‘ఎందుకు ఏడుస్తున్నావ్?’ అని అడిగాను. అప్పుడు ఆమె.. ‘నేను నిద్రాదేవిని.. నన్ను మనుషులెవ్వరూ గెలవలేరు. కానీ నువ్వు నన్ను దరి చేరనివ్వడం లేదు’ అంది. దాంతో ఆమెకు నేను ముమ్మార్లు ప్రదక్షిణం చేసి.. ‘నేను మా అన్న, వదినలకు ఈ పర్ణశాలలో కాపలా ఉండాలి. అక్కడ అయోధ్యలో నా భార్య ఊర్మిళ ఒక్కర్తే నాకోసం తపిస్తూ ఉంది. ఆమెను రాత్రింబవళ్లు లేవకుండా ఆవహించు.
మళ్లా నేను తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు నన్ను ఆవహిద్దువుగానీ’ అని చెప్పాను. ఆ మాట ప్రకారం.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిద్రాదేవి నన్ను ఈ సభలో ఆవహించినందుకు నాకు నవ్వొచ్చింది’’ అని సమాధానం ఇస్తాడు లక్ష్మణుడు నిద్ర మత్తులో తూలుతూ. పశ్చాత్తాపంతో తక్షణమే రాముడు... లక్ష్మణుడికి పక్క ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తాడట.
ఏదేమైనా లక్ష్మణుడు నవ్వింది అతడి వ్యక్తిగతం. కానీ నలుగురు గంభీరంగా ఉన్నప్పుడు.. మహా సభ సమక్షంలో అతడు నవ్వడంతో.. ఎవరికి వారు తమ వ్యక్తిగతాన్ని తడుముకుంటూ.. అవమానంగా భావించారు. ఆ నవ్వుకు అర్థం తెలియక అల్లాడారు. అందుకే సందర్భోచితంగా మాత్రమే నవ్వాలని పెద్దలు చెబుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment