సంచార సన్నాయి.. | Sanchara Sannai Funday Story As Written By Saripalli Nagaraju | Sakshi
Sakshi News home page

సంచార సన్నాయి..

Published Sun, Jun 30 2024 1:30 AM | Last Updated on Sun, Jun 30 2024 1:30 AM

Sanchara Sannai Funday Story As Written By Saripalli Nagaraju

చినపోలమ్మ జాతర.. కనులపండుగ్గా జరుగుతోంది. ఊక పోస్తే ఊక రాలనంత జనం. ఆడవాళ్ళంతా తల మీద ఘటాలతో ఊగిపోతున్నారు. మగవాళ్ళంతా కోళ్లు, గొర్రెలు పట్టుకొని ముందుకు సాగిపోతున్నారు. డప్పుల మోతలు.. యువకుల చిందులు.. కలగలుపుగా ధూళి రేగుతూ జాతర ఘనంగా జరుగుతోంది.

కిట్టడు మహా గొప్పగా, చాలా నేర్పుగా గాల్లోకి తారాజువ్వలు వదులుతున్నాడు. వాడు వదిలిన తారాజువ్వ సాయంత్రపు నీరెండలో ఇంద్రధనుస్సు రంగులను తలపిస్తోంది. ‘బాణసంచా కట్టాలంటే కిట్టడే కట్టాల! వాటిని మళ్ళీ వాడే వదలాల..’ జనం కిట్టడిని ప్రశంసలతో ముంచుతున్నారు. అందరి నోట కిట్టడే నానుతున్నాడు. రకరకాల బాణసంచా పేల్చి కిట్టడు తన ప్రతిభను చాటుకుంటున్నాడు.

ఊరంతా సంబరంగా పొలిమేరకు చేరుకుంది. కిట్టడు కట్టిన బాణసంచలో అసలైంది నాగుపాము మందుగుండు. వెదుర్లతో పెద్ద ఎత్తున పాము ఆకారంలో కట్టి దానికి మందుగుండు జతచేసి కాల్చడానికి సిద్ధంగా ఉంచాడు. జనాలంతా తమ మొక్కులు చెల్లించుకుని, కిట్టడు కట్టిన నాగుపాము బాణసంచా కోసం ఆత్రుతగా ఎదురు చూడసాగారు. కిట్టడు దానిని వెలిగించడానికి వెళ్ళాడు. వత్తి ఎంత ముట్టిస్తున్నా వెలగడం లేదని రెండు మూడుసార్లు వెలిగించే ప్రయత్నం చేసి దాన్ని వదిలేసి వేరే దగ్గర ముట్టిద్దామని మరొక వత్తిని వెతికే పనిలో పడ్డాడు.

ఇంతలోపు విధి వక్రించిట్టుగా ముందు ముట్టించిన వత్తి వేడికి నెమ్మదిగా రాజుకొని అంటుకుంది. అది గమనించి అక్కడ నుంచి కిట్టడు వెళ్ళేలోపే అందరూ ఊహించని ప్రమాదం జరిగింది. బాణసంచా వెలిగి నాగుపాము పగబట్టినట్లుగా కిట్టడి మీద విరుచుకు పడింది. నల్లగా బలంగా ఉన్న కిట్టడు.. శరీరం కాలిపోయి కమిలిపోయి నెత్తురోడి పడి ఉన్నాడు.

‘గంగిరెద్దోలమయ్య మేము.. గరీబోలమయ్యా.. ఊరు వాడ తిరిగేము మేము గూడు లేక ఉన్నాము’ అనే పాటని సన్నాయి రాగంతో వీధిలో ఇంటింటికీ వెళ్ళి వినిపిస్తున్నాడు బసవన్న. కొంతమంది బియ్యం వేశారు. అయినా చాలామంది ఇళ్లల్లో టివీలు చూసుకుంటూ ‘చెయ్యోటం కాదు..’, ‘మళ్ళీ రా..’,  ‘పనిలో ఉన్నాను..’ అనే మాటలే జోలిలో బియ్యం కన్నా ఎక్కువ వినిపించాయి. 

బసవన్న దిగులుగా ఊరు చివర బడి పక్కనున్న మర్రిచెట్టు నీడలో ఏర్పాటు చేసుకున్న గుడారం వైపు అడుగులు వేశాడు. చెట్టు దగ్గరకు చేరుకొని ఎద్దును చెట్టు మొదలకు కట్టి, దాని ముందు ఎండు గడ్డి పరకలు వేసి అక్కడే చతికిలపడ్డాడు. చెట్టు ఆకుల సందుల్ని చీల్చుకొని వస్తున్న ఎండ బసవన్న శరీరం మీద పడుతూ తన తాపాన్ని చూపించింది. ఒక్కసారిగా బసవన్నకు తన గతం గుర్తుకొచ్చింది.

.ఒకప్పుడు ఎద్దును పట్టుకొని బసవన్న వీధిలోకి వెళ్తే జోలి నిండిపోయేది. సంక్రాంతి సమయంలో మంచి గాత్రంతో బసవన్న పాడుతుంటే ప్రతివాళ్ళు తమ గురించి పాడించుకొని తమకు తోచింది తృణమో పణమో ఇచ్చేవారు. కాలం పగబట్టిన పాములా మారింది. మనుషులంతా ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలైపోయారు. ఎవరూ తమ జాతివారిని పట్టించుకోకపోగా అనుమానంగా, అవమానంగా చూడడం బసవన్నలో మరింత దిగులును పెంచింది.

‘మాలాంటి గంగిరెద్దులోళ్ళు ఈదిలోకి వస్తున్నారంటే సాలు సిన్న పిల్లల్ని, కొత్త కోడల్ని దాసిపెట్టేత్తనరు. మేమేదో సిల్లంగి పెట్టేత్తామేమోనని భయపడతన్రు.. ఊరు ఊరు తిరుగుతూ జనాలని పొగిడి వాళ్లిచ్చే బియ్యం, డబ్బులు పుచ్చుకొని బతకడమే తెలుసును గానీ వాళ్ళ దయాభిక్ష మీద బతుకుతూ వాళ్ళకి ఎలా హాని తలపెడతామనుకుంతున్నారో’ అనే ఆలోచన బసవన్నలో మరింత అభద్రతా భావాన్ని పెంచి గోరుచుట్టు మీద రోకలి పోటులా అనిపించింది.

ఎండ నడినెత్తికి ఎక్కింది. ఆలోచనల్లో నుంచి బసవన్న బయటికి వచ్చాడు. ఉదయాన్నే బొట్టుబిళ్లలు, కాటుకలు, పిన్నీసులు, తిలకాలు, అద్దాలు, పైన్లు (దువ్వెన్లు) అమ్ముకొద్దామని వెళ్లిన సోములమ్మ నిరుత్సాహంగా గుడారానికి చేరుకొంది. గబగబా గిన్నెలు కడిగి పొయ్యి మీద ఎసరు పెట్టింది. చెట్టుకానుకొని ఉన్న బడిలో మాస్టారు పిల్లలకి చెబుతున్న ‘రాకెట్‌ అంతరిక్ష ప్రయాణం’ అనే సై¯Œ ్స పాఠం బయటకి స్పష్టంగా వినిపిస్తోంది. బసవన్న ముగ్గురు పిల్లలు మర్రిచెట్టు దగ్గర మట్టిలో ఆడుకుంటున్నారు.

ఊర్లో ఇచ్చిన పిండివంటలు కిట్టడికి, ఆమాసకి, పిక్కురుదానికి ఇచ్చి సోములమ్మ నీళ్ళు తేవడానికి బడి బోరింగ్‌ కాడికి వెళ్ళింది. నిర్జీవంగా ఎద్దు పక్కన కూర్చున్న బసవన్న దీర్ఘంగా ఆలోచనల్లో కూరుకుపోయాడు. నీళ్ళకుండ పట్టుకొస్తున్న సోములమ్మ భర్తను చూసి కుండ దించి దిగాలుగా ఉన్న భర్త పక్కన కూర్చుని ‘ఏమయ్యా.. అలా వున్నావు, ఒంట్లో ఏమైనా నీరసంగా వుందా..?’ అని అడిగింది.

సోములమ్మ ప్రశ్నతో బసవన్న ఆలోచనలు చెరిగిపోయి ఈ లోకంలోకి వచ్చాడు.  ‘ఏమీలేదే, కానీ..!’            
‘ఏవయిందయ్యా..!’ రెట్టించి అడిగింది సోములమ్మ.
ఆమె వంక దిగులుగా చూస్తూ ఖాళీగా ఉన్న జోలిని చూపించి ‘పిల్లల్ని ఎలా పెంచాలో, మనం ఎలా బతకాలో తెల్డం లేదు. మా తాత, మా అయ్యల కడుపు నింపిన ఈ వుత్తి ఇప్పుడు మన కడుపులు నింపడం లేదే..’ అన్నాడు బసవన్న.

‘అవునయ్యా.. ఊరు మొత్తం తిరిగినా బొట్లు, పిన్నీసులు కూడా అమ్ముడుపోవడం లేదు’ అంది  సోములమ్మ. దూరంగా ఆడుకుంటున్న పిల్లలను చూసింది సోములమ్మ. బక్కచిక్కిన దేహాలతో, చింపిరి బుర్రలతో, కారుతున్న చీమిడి ముక్కులతో తమ తిరుగుడు బతుక్కి ప్రతీకలుగా ముగ్గురు పిల్లలు కనిపిపించారు.

భార్యవైపు చూస్తూ ‘ఒకప్పుడంటే రేడియో ఒకటే కాబట్టి మనం ఈదిలోకి ఎల్తే అందరూ అడిగిమరీ పాటలు పాడిచ్చుకుని తోచిందిచ్చేవోల్లు. రోజురోజుకీ పరిత్తితులు మారిపోతున్నాయి సినీమాలు, టీబీలు, సెల్లుపోనులు వొచ్చాక మన పాటలు ఎవరింతారు..? పెతీ ఇంట్లోనూ టీబీ పాటలు, సెల్లు మాటలు తప్ప మనల్నెవులు పట్టించుకుంతారు.. వొస్తువులు పెరిగేకొద్దీ మన అవసరం తగ్గిపోతందే..’ అన్నాడు ఆవేదనగా బసవన్న.

సోములమ్మ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె మదిలో కూడా అలాంటి బాధే సుడులు తిరుగుతోంది. కాసేపయ్యాక ‘సూడయ్యా.. గంగిరెద్దుల్నేసుకుని నువ్వు, బొట్టుబిళ్లలు, పిన్నీసులు, సవరాలు తీసుకుని నేనూ ఎన్నూర్లు తిరిగినా మన బతుకుల్లో శీకటి తప్ప ఎలుగు రాదు, మన పొట్టా నిండదు. కొత్తకొత్త పేషన్లు వచ్చిన తరువాత మన దగ్గర వస్తువులెవలు కొంతారు? ఇప్పుడింటికో కొట్టు, ఈదికో దుకాణం పెడతంటే పాతాటిని పట్టుకుని ఎవలు ఏలాడతారు’ అంది గుండెల్లో బాధను పంటి కింద నొక్కి పెట్టి పవిట కొంగున దాచిపెడుతూ.

ఊరూరూ తిరుగుతూ గడిపే బసవన్న కుటుంబానికి తిండి కరువైపోయింది. ప్రభుత్వ పథకాలు పొందడానికి కావలసిన ఆధారాలు కూడా వాళ్ల దగ్గర లేవు. అటు సమాజం నుంచీ, ఇటు ప్రభుత్వం నుంచీ సాయం పొందే అవకాశం లేకుండా బసవన్న బతుకు రెంటికీ చెడిన రేవడిలా తయారైంది.

ఇలాంటి ఒడిదుడుకులతోనే ఊరూరూ తిరుగుతూ తమ బతుకు బండిని నడిపించారు బసవన్న దంపతులు. తమ బతుకే ఇంత దీనావస్థ మధ్య సాగుతుంటే రానున్న కాలంలో తమ పిల్లలకి బతుకే ఉండదని భావించిన బసవన్న తన పదేళ్ళ పెద్దకొడుకు కిట్టడిని దగ్గర్లో ఉన్న పట్టణంలోని బాణసంచా దుకాణంలో పనికి కుదిర్చాడు. మిగిలిన ఇద్దరు చిన్న పిల్లల్ని తమ వెంటే తిప్పుతూ రోజుల్ని గడుపుతున్నారు. కిట్టడు ఐదు సంవత్సరాలపాటు బాణసంచా దుకాణంలో పని బాగా నేర్చుకొని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నాడు.

ఇక తమ వృత్తి కడుపు నింపదని బసవన్న సోములమ్మలు ఒక నిర్ణయానికి వచ్చి పెద్దపల్లిలో ఉండిపోయారు. ఎప్పుడూ వేసుకున్న గుడారం కంటే ఈసారి ఇల్లు కాస్త దుటంగా వేసుకున్నారు. వీధుల్లో గంగిరెద్దు తిప్పడం మానేసి బసవన్న పొలం పనులకు కుదురుకున్నాడు. ఇంకా ఆశ చావని సోములమ్మ ఊర్లు తిరుగుతూ పిన్నీసులు, బొట్లు అమ్మడానికి వెళ్తుంది కానీ తన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోగా నిరాశే మిగులుతోంది.

కిట్టడు ఊర్లో జరిగే పెళ్లిళ్లకు, జాతర్లకు, వారాల పండుగలకు మందుగుండు సామాన్లు కట్టే బేరాన్ని కుదుర్చుకొని తన గుడారం వద్దే సొంతంగా బాణసంచా కట్టడం మొదలుపెట్టాడు. ఆమాసగాడిని, పిక్కురుదానిని బసవన్న పెద్దపల్లిలో ఉన్న బడిలో చేర్చాడు. వాళ్ళిద్దరూ బడికి వెళ్తున్నారు కానీ వాళ్ళ ధ్యాసంతా ఇంటి దగ్గరే!

బడి అలవాటు లేని ఆమాసగాడు బడిలో చెప్పాపెట్టకుండా ప్రతిరోజూ బయటకు వచ్చి చింతచెట్ల కింద, తోటల వెంట రహస్యంగా తిరుగుతూ ఒకరోజు బసవన్న కంటిలో పడ్డాడు. తిరుగుతున్న తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని ‘ఒరే ఆమాస..! సదువొక్కటే మనకి ఆయుదం. అదే మన బతుకుల్ని మారుత్తుంది, మనకొక దైర్నాన్నిత్తంది. ఊరూరూ తిరగడం తప్ప అచ్చరం ముక్క రాదు మాకు. కనీసం మీరయినా సదువుకుంటే బతుకులు బాగుంటాయిరా. సుకంగా ఉంటారు. అమావాస్య రోజు పుట్టావని అందరూ నిన్ను ఆమాస అని పిలుత్తుంతే నాకెంత బాధగా వుందో ఆలోశించావా? నువ్వు సదువుకుని గొప్పోడివయితే నీ అసలు పేరుతోనే నిన్నందరూ పిలుత్తారు, గౌరవిత్తారు’ అని చెప్పాడు.

ఆమాస తండ్రివంక చూశాడు గానీ ఏమీ మాట్లాడలేదు. అతనికీ చదువుకోవాలనే ఉంది. అయినా స్థిరంలేని బతుకు కావడం వల్ల తిరగడం మీదే ధ్యాస తప్ప స్థిరంగా ఒకచోట కూర్చుని చదవాలంటే ఆమాసకి ఇబ్బందిగానే ఉంది. అయినా తండ్రి చెప్పిన మాట అతనిలో ఆలోచనలకు దారితీసింది.

బాణసంచా పేలుడులో నెత్తురోడి పడి ఉన్న కిట్టడిని గ్రామస్థులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయారు. కిట్టడి విషయం తెలిసిన సోములమ్మ గుండెలు బాదుకుంటూ ‘మా తిరంలేని బతుకులకి ఎక్కడికి పోయినా సుకం లేదు. మా పని పోయి ఏదొక పని చేసుకొని బతుకుదామని అనుకున్నా దినం దీరడం లేదని’ ఏడుస్తూ భర్తతో కలిసి ఆసుపత్రికి చేరుకుంది.

గాయాల మధ్య మూలుగుతూ బాగా కాలిపోయి ఉన్న కిట్టడిని చూసి నిశ్చేష్టులై భార్యాభర్తలిద్దరూ కూలబడిపోయారు. నర్సు వచ్చి ‘కిట్టడిని పెద్దాసుపత్రికి తీసుకువెళ్లాలి, ఆరోగ్యశ్రీ కార్డు, కోటా కార్డు, ఆధార్‌ కార్డు తీసుకురమ్మ’ని చెప్పింది. ఆ మాట విని ‘అవెక్కడ దొరుకుతాయ’ ని అమాయకంగా అడిగాడు బసవన్న.

‘మీకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులయ్యా’ అంది నర్సు. ‘అలాంటివేవీ మా దగ్గర లేవు తల్లీ.. మేము ఊరూరు తిరుగుతూ జీవనం సాగించేవాళ్ళం. మాకంటూ తిరమైన ఇల్లు, వూరు లేవు తల్లీ.. గంగిరెద్దుకు ముస్తాబు చేసి తిరుగుతూ పొట్టపోసుకునే వాళ్ళమ’ ని చెప్తున్న బసవన్న వంక జాలి నిండిన కళ్లతో చూస్తూ ‘కంప్యూటర్‌ యుగంలో కూడా స్థిరమైన నివాసాలకు, విద్య, ఉద్యోగాలకు దూరంగా బతుకుతున్నారా?’ అని ఆశ్చర్యంగా బసవన్న వైపు చూసి అతన్ని తీసుకుని పక్కనే ఉన్న మండలాఫీసు వైపు నడిచింది నర్సు. అతని పరిస్థితి చెప్పి సర్టిఫికెట్ల విషయంలో సహాయం చేసింది.

కొన్నాళ్ళకి కిట్టడి ఆరోగ్యం కుదుటపడింది. పూర్తిగా మానని గాయాల్ని తల్చుకునే కొద్దీ అతనిలో తెలియని వేదన మొదలయింది. తనను ఇంట్లో కూర్చోబెట్టి రోజూ కూలిపనులకెళ్ళి తిండి పెడ్తున్న తల్లిదండ్రుల కష్టం అతన్ని మరింతగా కుంగదీయసాగింది. ఇంతకాలం పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ శ్రమ అతన్ని ఒక రకమైన ఉద్వేగానికి గురిచేసింది. తన తర్వాత పుట్టిన తమ్ముడు, చెల్లెలి భవిష్యత్తు గురించి కిట్టడికి ఆలోచనతో పాటు ఆందోళన కలిగింది. ఒకరోజు తల్లి దగ్గరికెళ్లి ‘అమ్మా మరి నేను ఈ బాంబుల పని సెయ్యడం మానేసి పట్నంలో ఏదైనా పనిలో కుదురుకుంటానే’ అన్నాడు.

మొహానికి, చేతులకు గాయాలతో ఉన్న కొడుకు వైపు దిగులుగా చూసింది. ప్రమాదం తాలూకు ఙ్ఞాపకాలు ఆమెనింకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన కొడుకు మళ్ళీ ఊపిరి పోసుకుని తనముందు తిరగడం సంతోషంగానే ఉంది. అయినా మళ్ళీ ‘పని పేరుతో’ కొడుకు దూరమవుతానంటుంటే ఆమెలో ఏదో తెలియని ఆందోళన కలిగింది.

కొడుకు వైపు చూస్తూ ‘పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీలు తాగడం మేలు అయ్యా. బతకడం కోసం తలో దిక్కు అయిపోవడం కన్నా, అందరం ఒకే దిక్కులో ఉండి గెంజి తాగి బతకుదాం’ అంది సోములమ్మ. ఏమీ మాట్లాడని కిట్టడు తల్లివైపు చూస్తూ బయటికి నడిచాడు. అతనికంతా అయోమయంగా ఉంది. ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా, తల్లిదండ్రులకు భారంగా ఉండలేకపోతున్నాడు. ఆలోచనలతోనే గంగిరెద్దులకు గడ్డివేస్తూ వాటివైపు చూశాడు కిట్టడు.

ఒక్కసారిగా అతనికి బాలాజీ మాస్టారు గుర్తొచ్చారు.. ‘ఒరే కిట్టా..! మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలిరా..’ అని బాలాజీ మాస్టారు చెప్పిన మాటలు కిట్టడి చెవుల్లో మారుమోగుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా కిట్టడికి  మనసులో ఏదో స్ఫురించినట్లయింది. గబగబా గుడిసెలోకి నడిచి తండ్రి సన్నాయి వైపు చూశాడు, ఆప్యాయంగా దానిని తడిమాడు.

పోగొట్టుకున్న అపూర్వ వస్తువేదో తనను ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది. సన్నాయిని చేతుల్లోకి తీసుకోగానే కిట్టడిలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. పారేసుకున్న వారసత్వ సంపద పరిగెత్తుకుని వచ్చి తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా అనిపించింది. సన్నాయిని పెదవులకు ఆనించి ఊదడం మొదలుపెట్టాడు కిట్టడు. నాభి నుంచి గొంతువరకు ఏదో ఆత్మీయ సంగీతసాగరం ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. తెలియని కొత్త అనుభూతి అతన్ని నిలువెల్లా కుదిపేయసాగింది. సన్నాయి రాగంతో పాటు అతని కళ్లు కూడా గంగాప్రవాహంలా మారాయి.

గంగిరెద్దును తీసుకొని కిట్టడు వీధి బాట పట్టాడు. తనకొచ్చిన పాటల్ని అలవోకగా సన్నాయి మీద పలికిస్తున్న కిట్టడు అతి కొద్ది కాలంలోనే జనాల్ని ఆకర్షించాడు. కిట్టడి గొంతు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కసాగింది. జోలి నిండా బియ్యం, చేతి నిండా డబ్బులు రావడంతో అతనిలో ఉత్సాహం రెట్టింపయింది. రోజూ ఇలా కిట్టడు వీధిలో ప్రదర్శిస్తున్న దృశ్యాన్ని ఒకరోజు బాలాజీ మాస్టారు సెల్‌ ఫోనులో వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

ఇప్పుడు కిట్టడు పాత కిట్టడిలా లేడు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని తన తండ్రి నుంచి వచ్చిన ‘సన్నాయి కళ’కు కొత్త జీవం పోసే పనిలో నేర్పు సంపాదించాడు. ఖాళీ సమయాల్లో తన తండ్రి బసవన్న చేత గంగిరెద్దుని ఆడించడం, వాటికి శిక్షణ ఇచ్చే విధానం, సన్నాయితో పాటలు పలికించే పద్ధతుల్ని చిన్న చిన్న వీడియోలుగా తీసి వాటిని యూట్యూబ్‌లో నేరుగా కిట్టడే అప్‌లోడ్‌ చేయసాగాడు.

ఆ వీడియోలు చూసే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగి కిట్టడి గంగిరెద్దుల కళకి ప్రాచుర్యం లభించింది. పట్టణాల్లో పెద్దపెద్ద డబ్బున్నవాళ్ళ వివాహాల్లో కిట్టడి ప్రదర్శన కళ హుందాగా తయారైంది. కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కిట్టడి గంగిరెద్దుల కళ వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచింది.

‘ఈ కొత్తకొత్త పరికరాలు వొచ్చి మా వుత్తిని రూపుమాపి కడుపు కాల్చితే.. ఈ సాధనాల్నే వుపయోగించి మా కిట్టడు మళ్ళీ మా వుత్తికి జీవం పోశాడు. ఎన్నాళ్ళుగానో అనుకుంతున్న సొంతింటి కల నెరవేరబోతోంది..’ అనుకుంటూ ‘తన కలని, కళని బతికించిన’ కిట్టడి వైపు బసవన్న ఆప్యాయంగా చూశాడు. – సారిపల్లి నాగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement