
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ దీనికి బానిసలే.. అదే నిత్యవ్యాపకంగా మారిన సెల్‌ఫోన్. ఈ మధ్యకాలంలో సెల్ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తిలేదు. లేచింది మొదలు పడుకునే వరకూ దాదాపు ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్న
వారు అధికం అవుతున్నారు. దీంతో వీరిని రకరకాల రుగ్మతలు వెంటాడుతున్నాయి. వాటిలో ఒకటే పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ అని పిలుస్తున్నారు.
అధిక శాతం మంది కనీసం రోజులో 4–6 గంటలు సగటున ఫోన్ వినియోగిస్తున్నారు. ఇక 13–18 మధ్య వయసు వారు 5–7 గంటలు, 18–30 మధ్య వయసు వారు 6–10 గంటలు, ఉద్యోగాలు చేసేవారు 3–5 గంటలు, సీనియర్ సిటిజన్స్ 1–3 గంటల పాటు ఫోన్ వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సోషల్ మీడియా రాకతో ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్ గేమ్స్, ఎడ్యుకేషన్, వీడియోలు, రీల్స్ ఇలా ఏ వయసు వారు ఆ స్థాయిలో ఫోన్ వినియోగిస్తున్నారు.
పెరుగుతున్న సమస్యలు..
అతిగా ఫోన్ వినియోగించడం వల్ల రక రకాల రుగ్మతులు వెంటాడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల వెంటాడుతోన్న రుగ్మతల్లో ఒకటి పింకీ ఫింగర్, పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ ఒకటి. ఈ పదాలు వినడానికి కొత్తగా అనిపించినా ప్రస్తుతం వేదిస్తోన్న ప్రధాన సమస్య. గంటల తరబడి చిటికెను వేలుపై ఫోన్ బ్యాలెన్స్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుల తరబడి ఫోన్ బరువు పడడంతో వేలుపై ఒత్తిడి పెరిగి తాత్కాలికంగా చిన్న డెంట్ ఏర్పడుతోంది.
ఒత్తిడి తగ్గించాలి
వేళ్లపై అధిక ఒత్తిడి పడడంతో ఆ ప్రభావం నరాలపైనా పడుతోంది. ఫలితంగా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే సమస్యకు దారితీస్తోంది. ఇదో గందరగోళ వైద్య సమస్య అని చెబుతున్నారు. అంతేకాకుండా బొటనవేలు సందుల మధ్య కండరాలు ప్రభావితం చెందడం వల్ల ‘టెక్ట్సింగ్ థంబ్’ సమస్య ఏర్పడుతోంది.
దీంతోపాటు ఎక్కువ సేపు తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి మెడనొప్పి సమస్యకు దారితీస్తోంది. వీటి నుంచి బయట పడటానికి రెండు చేతులూ వినియోగించడం, ఫోన్ స్టాండ్స్ వాడటం, చేతి వేళ్లకు విశ్రాంతి ఇవ్వడం, చేతుల వ్యాయామం చేయడం ఉత్తమం.
– డాక్టర్ బి.చంద్రశేఖర్, షోల్డర్ సర్జన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేట
(చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!)