
బానపొట్ట ఉంటే ఎలాంటి ఫ్యాషన్ వేర్‌లను ధరించలేం. ఆడవాళ్లు అయితే సంప్రదాయ వస్త్రాలైన చీర వంటి వాటిని ధరించినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలవ్వుతారు. ఇక మగవాళ్లు జీన్స్, పంచె వంటి ట్రెడిషనల్ వేర్‌లను ధరించినప్పుడూ స్పష్టంగా పొట్ట ఎత్తుగా కనిపిస్తుంది. అబ్బా ఈ పొట్ట కరిగిపోయి చక్కగా ఫ్లాట్‌గా ఉంటే బాగుండును అని అనుకోని వారే లేరు. ఎందుకంటే పెద్దవాళ్లే కాదు చిన్నారులు, టీనేజర్లు కూడా ఈ సమస్యనే అధికంగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు సింపుల్‌గా ఇలా చెక్‌పెట్టేయండి అంటూ ప్రముఖ పోషకాహార నిపుణురాలు ప్రీతికా శ్రీనివాసన్ ఇన్‌స్టాగ్రాం వేదికగా చక్కటి సూచనలిచ్చారు. అవేంటో చూద్దామా..!.
ఫ్లాట్ స్టమక్ కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. జిమ్, వర్కౌట్లంటూ పలు వ్యాయామాలు చేసేస్తుంటారు. అయినా పొట్ట ఫ్లాట్‌గా అవ్వడం లేదని వాపోతుంటారు. అలాంటప్పుడే తీసుకునే ఆహారాలపై ఫోకస్ పెట్టాలంటున్నారు ప్రీతికా. ఎలాంటి ఆహారాలు ఏ సమయాల్లో తీసుకుంటే మంచిది అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఈ ఆహార స్ప్రుహ మిమ్మల్ని అనారోగ్య సమస్యల నుంచే గాక బానపొట్టను నివారిస్తుందని చెబుతున్నారామె. అదెలోగా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
రాత్రిపూట మనం తీసుకునే ఆహారాలే బానపొట్టకు ప్రధాన కారణమని చెబుతున్నారు. కొన్ని రకాల ఆహారాలు పగటిపూట తీసుకోవడమే మంచిదట. మరికొన్ని రాత్రి సమయాల్లో నివారిస్తే ఈ సమస్య తగ్గుముఖం పట్టడమే గాక పొట్ట వచ్చే అవకాశం ఉండదని నమ్మకంగా చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలంటే..
నివారించాల్సిన ఆహారాలు..
పొట్ట ఫ్లాట్‌గా ఉండాలనుకుంటే.. సాయంత్రం ఆరు తర్వాత ఆరు ఆహారాలను పూర్తిగా నివారించాలని చెప్పారు. అవేంటంటే..
చక్కెర కలిగిన ఆహారాలు కేకులు, కుకీలు, చాక్లెట్లు సాయంత్రం ఆరు తర్వాత పూర్తిగా నిషేధించండి. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బొడ్డు కొవ్వు నిల్వకు దారితీస్తాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. మొదట్లో కష్టంగా అనిపించినా.. రాను రాను అదొక అలవాటుగా మారుతుందట.
అలాగే భారీ ప్రోటీన్లు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ప్రోటీన్ అనేది ఆరోగ్యకరమైనప్పటికీ ఎర్రమాంసం, కూరలు వంటి భారీ ఆహారాలు రాత్రి సమయంలో జీర్ణం కావడం కాస్త కష్టం. ఫలితంగా నిద్ర లేమి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. బదులుగా చికెన్ బ్రెస్ట్, గుడ్లు, వంటి తేలికపాటి ప్రోటీన్లు తీసుకోండి.
కార్బోనేటెడ్ పానీయాలు అస్సలు ఆరోగ్యానికి మంచివి కావని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. పొట్ట ఫ్లాట్‌గా ఉండాలనుకుంటే సాయంత్రం ఆరు తర్వాత దీన్ని పూర్తిగా నివారించండి అని సూచిస్తున్నారు. ఆఖరికి సోడాలు, బీర్లు, బిస్లరీ వాటర్ తదితరాలను కూడా నిషేధించండి. ఇవి పొట్ట ఉబ్బరం,గ్యాస్, కొవ్వు పెరిగేందుకు కారణమవుతాయట.
ఇక సాయంత్రం ఆరు తర్వాత పాల ఉత్పత్తులను నివారించండి. ఇవి కడుపుపై చాలా భారాన్ని మోపుతాయట. ఇవి అరగడానికి సమయం ఎక్కువగా తీసుకోవడమే గాక జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందట. అందుకే సాధ్యమైనంత వరకు పాలు, చీజ్, పెరుగు, క్రీమ్‌లు వంటి వాటిని రాత్రిపూట నివారించండి. వాటిని హాయిగా పగటిపూట తినండి గానీ సాయంత్రం తీసుకోవద్దు.
తెల్లబియ్యం, శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లు, బ్రెడ్లు వంటివాటికి కూడా దూరంగా ఉండండి. వీటివల్ల ఇన్సులిన్ స్పైక్స్, బొడ్డు కొవ్వు పెరిగేందుకు దారితీస్తుంది.
చివరగా డీప్-ఫ్రైడ్ ఫుడ్స్.. ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, కచోరీలు, సమోసాలు వంటి డీప్-ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవద్దు. ఈ ఆహారాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. జీవక్రియను నెమ్మదిస్తాయి. పైగా శరీరంలో అధిక కొవ్వు నిల్వకు దారితీస్తాయి.
పైన చెప్పిన ఈ ఆరు ఆహారాలను డైట్‌లో నివారించడం ప్రారంభించిన తర్వాత ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు మొదలవుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. అంతేగాదు బానపొట్ట సమస్య తగ్గడమే గాక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందన్నారు.
(చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!)