
ఉరుకుల పరుగుల జీనవ విధానంలో అందరూ తమ కెరీర్ లక్ష్యాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే జీవిత పరమావధి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తలకు మించిన పనిభారానికి తోడు పోటీ వాతావరణానికి తగ్గట్లు దూసుకుపోవాలన్న ఒత్తడి కలగలసి శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసున్నాయి. కొందరూ నిద్రను కూడా త్యాగం చేస్తూ ఎక్కువ గంటల కంప్యూటర్ స్క్రీన్‌లపైనే పనిచేస్తుంటారు. పాపం ఇలానే చేసి ఓ సీఈవో ఎంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వుతారు. అంతేగాదు ఆరోగ్యం విషయంలో నాలాగా అంతా అయిపోయాక ఇప్పుడే తెల్లారిందన్నట్లుగా మేల్కోవద్దు అంటూ హితువు పలుకుతున్నారు.
బెంగళూరుకి చెందిన డేజీఇన్ఫో మీడియా అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్ మిశ్రా లింక్డ్‌ఇన్‌లో తాను ఎదుర్కొన్న విషాదకర ఆరోగ్య పరిస్థితిని గురించి షేర్ చేసుకున్నారు. అతను తన ల్యాప్‌టాప్‌లో పనిచేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఒక విధమైన ఆయాసంతో కూడిన వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైంది. ముందస్తుగా ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుంగా జరిగిన ఈ హఠాత్పరిణామం కారణంగా మిశ్రా ఆస్పత్రిపాలయ్యారు.
వైద్యులు అతడిని ఐసీయూకి తరలించి సత్వరమే చికిత్స అందించారు. అప్పుడే ఆయన రక్తపోటు అనుహ్యంగా 230కి పెరిగిపోయి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వైద్యులు సైతం అమిత్ మిశ్రా పరిస్థితిని చూసి షాకయ్యారు. ఇంతలా రక్తపోటు ఎందుకు పెరిగిపోయిందని తెలియక వైద్యులు కూడా కాస్త గందరగోళానికి గురయ్యారని పోస్ట్‌లో తెలిపారు మిశ్రా.
"అయితే దీనంతటికీ కారణం.. పనికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నా.. విషయాన్ని విస్మరించడమే. పనే ముఖ్యం అనుకుంటాం. కానీ అది చేయాలంటే ముందు మన ఆరోగ్యం అంతే ముఖ్యం అని అనుకోం. ఆఖరికి శరీరం ఇచ్చే సంకేతాలను కూడా పట్టించుకోం. బాగానే ఉన్నామనే ధీమాతో ఉండిపోతాం.
ప్లీజ్ మిత్రమా..ఈ పోస్ట్‌ని గనుక చదువుతుంటే మనం శరీరం చెప్పేది వినండి..దాని బాధను గుర్తించండి." అని పోస్ట్‌లో రాసుకొచ్చారు మిశ్రా. నెటిజన్లు ఆ పోస్ట్‌కి స్పందిస్తూ..వృత్తిపరమైన జీవితం కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ తమ అనుభవాలనే షేర్ చేయడమే గాక మిశ్రా త్వరితగతిన కోలుకోవాలని పోస్టులు పెట్టారు.
(చదవండి: 40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?)