
చిన్నారుల నుంచి పెద్దల వరకు పెరిగిన సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వినియోగం
శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
వీటి వినియోగానికివిరామం ఇవ్వాలనిసూచిస్తున్న వైద్యులు
ఇలా విరామం ఇవ్వడమే డిజిటల్ డిటాక్స్ విధానం
ఈ విధానంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని వెల్లడి
సాక్షి, అమరావతి: ఇది డిజిటల్ యుగం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ సెల్ ఫోన్, ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తోనే పని. చదువులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వస్తువులు కొనడానికైనా అన్నిటికీ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లే ముఖ్య సాధనాలైపోయాయి. అయితే వీటి వినియోగం మితిమీరి వాటికి బానిసలుగా మారిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వీటి అతి వినియోగం మనిషి మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అతి వినియోగాన్ని నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలి.. సంతోషంగా జీవించాలి.. అని దేవుడిని ప్రార్థిస్తూ చాలా మంది ఉపవాసం పాటిస్తుంటారు. అదేవిధంగా శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగాన్ని కొన్ని గంటలు, రోజులు వదిలేసి డిజిటల్ డిటాక్స్ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
డిజిటల్ డిటాక్స్ విధానంతో మానసిక ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడుతుందని, శారీరక ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కెనడాలోని ఆల్బెర్టా విశ్వవిద్యాలయం డిజిటల్ డిటాక్స్‌పై అధ్యయనం చేయగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ను అతిగా వినియోగించే 467 మందిని ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరికి రెండు వారాల పాటు సెల్‌ఫోన్, ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా చేశారు.
డిజిటల్ డిటాక్స్కు ముందు, ఆ తర్వాత వారి మానసిక ఆరోగ్యం, శ్రద్ధ, సామర్థ్యాలను అంచనా వేశారు. 91 శాతం మందిలో డిటాక్స్ అనంతరం మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు, ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు తగ్గినట్టు వెల్లడైంది. మొబైల్, ఇంటర్నెట్ యాక్సెస్ లేని వ్యక్తులు ముఖాముఖి సంభాషణలు, వ్యాయామం, చదవడం వంటి బహిరంగ కార్యకలాపాలను ఆస్వాదించడంలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియలు మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మెదడుకు రీచార్జ్
భారతీయులు సగటున రోజుకు 7.3 గంటలు స్క్రీన్ చూడటానికి కేటాయిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. గంటల తరబడి స్క్రీన్‌కు సమయాన్ని కేటాయించడంతో నిద్ర లేమి, ఒత్తిడి, ఆందోళన, నిరాశ తలెత్తడంతో పాటు, ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ చక్రాన్ని డిజిటల్ డిటాక్స్ విచ్ఛిన్నం చేస్తుంది. మెదడుకు విశ్రాంతి లభించి, రీఛార్జ్ అవుతుంది.
స్క్రీన్‌ల నుంచి వచ్చే నీలి కాంతి (బ్లూ లైట్) దుష్ప్రభావాలు తగ్గిపోయి కంటికి మంచి నిద్ర దొరుకుతుంది. ఇంట్లో భార్యాభర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులతో ముఖాముఖి చర్చించుకొనే అవకాశం లభిస్తుంది. తద్వారా మనుషుల మధ్య బంధాలు బలపడి, మనస్పర్థలు తగ్గుతాయని మానసిక వైద్యులు వెల్లడిస్తున్నారు.
డీటాక్స్ సమయంలో రన్నింగ్, జాగింగ్, జిమ్‌లో వ్యాయామాలు చేయడం, ఇంటి, తోట పనులు వంటి శ్రమకు కేటాయించడంతో బీపీ, షుగర్ వంటి జీవన శైలి జబ్బుల ప్రమాదం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment