
మానసిక సమస్యలతో కార్పొరేట్ ఉద్యోగులు సతమతం
2023తో పోలిస్తే 2024లో ఆత్మహత్యల ప్రమాదం 22 శాతం పెరుగుదల
ఎమోషనల్ వెల్‌బీయింగ్–2024 నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి : దేశంలో కార్పొరేట్ రంగంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల్లో మానసిక సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2023తో పోలిస్తే 2024లో 15 శాతం మేర మానసిక సమస్యలు పెరిగాయి. ఈ విషయం స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్‌బీయింగ్–2024 నివేదికలో వెల్లడైంది.
2024 జనవరి నుంచి నవంబర్ మధ్య ఉద్యోగులకు నిర్వహించిన 83 వేల కౌన్సెలింగ్ సెషన్స్, 12 వేల ఎలక్టివ్ స్క్రీనింగ్, 42 వేల అసెస్‌మెంట్ డేటాబేస్ ఆధారంగా పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య సవాళ్లపై చేపట్టిన అధ్యయనం ఆధారంగా నివేదికను విడుదల చేశారు.
కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న 25 ఏళ్లలోపు ఉద్యోగుల్లో 90 శాతం మంది ఆందోళన, 92 శాతం మంది నిరాశ సమస్యలతో సతమతమవుతున్నారు. 45 ఏళ్లు పైబడిన వారిలో నిరాశ 69 శాతం, ఆందోళన 67 శాతం మేర ఉంటోంది.
70 శాతం మందికి ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం
2023తో పోలిస్తే గతేడాది పురుష ఉద్యోగుల మానసిక సమస్యల్లో 7 శాతం మేర వృద్ధి నమోదైంది. గతేడాది కౌన్సెలింగ్ తీసుకున్న వారిలో 52 శాతం మహిళలు, 47 శాతం పురుష ఉద్యోగులున్నారు. కాగా, కౌన్సెలింగ్ పొందిన వారిలో 70 శాతం మందికి మానసిక సమస్యలకు ప్రధాన కారణంగా ఆర్థిక ఇబ్బందులే.
అదే మహిళల్లో 60 శాతం మందిలో రిలేషన్‌షిప్ సంబంధిత సమస్యలున్నట్టు వెల్లడైంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యల కారణంగా ఉద్యోగుల్లో ఆత్మహత్యల ఆలోచనలు పెరుగుతున్నట్టు గుర్తించారు. 2023తో పోలిస్తే 2024లో ఆత్మహత్యల ప్రమాదం 22 శాతం పెరిగింది.

Comments
Please login to add a commentAdd a comment