
8వ తరగతి బాలికకు గర్భం
బాలికకు తీవ్ర రక్త హీనత.. ఆస్పత్రికి తరలింపు
ప్రాణాపాయ స్థితిలో సిజేరియన్
బిడ్డకు జన్మనిచ్చి.. ప్రాణాలు విడిచిన బాలిక
చిత్తూరు జిల్లాలో ఘటన
కాణిపాకం/పలమనేరు : బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడేవాడు. చివరికి ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో ఆ బాలిక తీవ్ర రక్తహీనతకు గురైంది. చివరికి ప్రాణాల మీదికొచ్చింది. వైద్యులు సిజేరియన్ చేసి బాలికను బతికించేందుకు విఫలయత్నం చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన ఆ చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ.ఒడ్డూరు గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పెంగరగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.
రెండు నెలల కిందట బాలిక కడుపు పెరగడాన్ని గమనించి టీచర్.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బాలికను బడికి పంపడం మాన్పించారు. శనివారం ఉన్నట్టుండి ఆ బాలికకు ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు బంగారుపాళ్యం ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల గర్భిణీ అయిన ఆ బాలిక రక్తహీనతతో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు.
అక్కడి వైద్యులు పరీక్షించి రక్త హీనత కారణంగా బాలిక ఊపిరితిత్తులకు ఉమ్మనీరు చేరిందని, బిడ్డను బయటకు తీస్తే తప్ప తల్లిని బతికించలేమని తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి.. వారి ఆదేశాల మేరకు బాలికకు సిజేరియన్ చేశారు. మగబిడ్డను బయటకు తీశారు. తల్లి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు.
వెంటిలేటర్ మీద శనివారం రాత్రి 9.30 గంటలకు చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ఆదివారం ప్రాణాలు విడిచింది. బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతోంది. పలమనేరు సీఐ నరసింహరాజు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఓ మాయలేడిని నమ్మి..
ఇదిలా ఉండగా, పాఠశాలకు సెలవు వచ్చినప్పుడల్లా ఓ మాయలేడి ఆ బాలికను ఆవుల మేతకు తీసుకెళ్లేదని, అక్కడ ఓ కామాంధుడి చేతిలో పెట్టేదని తెలిసింది. పూర్తి వివరాలను రెండ్రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment