
యాస్మిన్ భాను కేసులో వీడిన మిస్టరీ
కులాంతర వివాహం చేసుకోవడంతో కూతుర్ని చంపిన తండ్రి
గొంతుకు తాడువేసి హత్య.. తండ్రి, సోదరుని అరెస్ట్
చిత్తూరు అర్బన్: సంచలనం సృష్టించిన యాస్మిన్ భాను (26) అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమెది ఆత్మహత్య కాదని, పరువు హత్యేనని నిర్ధారణ అయ్యింది. కన్న కూతురు ఇతర మతస్తుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక కూతురిని హత్య చేసిన తండ్రి షౌకత్ అలీ (56), వరుసకు సోదరుడు అయిన మహ్మద్ బాషా అలియాస్ లాలా (29)ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు అబ్దుల్ కలామ్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటన వివరాలను చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య బుధవారం మీడియాకు వివరించారు.
పోలీసులను ఆశ్రయించినా లేని ఫలితం!
చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్ అలీ చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మింద గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కూతురు యాస్మిన్ భాను బీటెక్ చదివే సమయంలో సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భాను తన ప్రేమ విషయం పెద్దలకు చెబితే వారు అంగీకరించలేదు. పైగా తమ సమీప బంధువుతో ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన పెళ్లి చేయాలని నిశ్చయించి, అందరికీ శుభ లేఖలు కూడా పంచేశారు.
అయితే ఫిబ్రవరి 6వ తేదీన యాస్మిన్ భాను, సాయితేజ ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి ముప్పు ఉందంటూ చంద్రగిరి డీఎస్పీని కూడా ఆశ్రయించారు. దీనితో షౌకత్ అలీని చంద్రగిరికి పిలిపించి, వీళ్ల జోలికి వెళ్లొద్దంటూ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అటు తర్వాత సాయితేజ భార్యతో తన సొంత ఊరైన పూతలపట్టు మండలంలోని పోటుకనుమ గ్రామంలో కాపురం పెట్టాడు. కొద్ది రోజుల్లోనే తల్లి ముంతాజ్, ఇద్దరు అక్కలు యాస్మిన్ భానుతో ఫోన్‌లో మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు.
నమ్మించి గొంతు నులిమి..
ఆగిపోయిన వ్యక్తితోనే పెళ్లి చేసి, కూతురిని దుబాయ్ పంపాలనుకున్న షౌకత్ అలీ.. ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసి వెళ్లాలని తల్లి కోరడంతో, ఏప్రిల్ 13వ తేదీన భర్తతో కలిసి యాస్మిన్‌భాను చిత్తూరుకు కారులో వచి్చంది. అప్పటికే మరో కారులో వేచివున్న లాలా, వారి మరో సమీప బంధువు అబ్దుల్ కలాం.. భానును వారి కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి బయలు దేరారు. మధ్యలో తండ్రి షౌకత్ అలీ కూడా కారులో ఎక్కాడు.
మాపాక్షి గ్రామ సమీపంలోకి వెళ్లిన తర్వాత, సాయితేజను వదిలేసి తాను చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని యాస్మిన్‌ను తండ్రి షౌకత్ కోరాడు. ఆమె ఎంతకూ ఒప్పుకోలేదు. దీనితో కూతురి కాళ్లను తొక్కిపెట్టి, అప్పటికే తెచ్చుకున్న తాడుతో ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. ఆపై బాలాజీ కాలనీలోని తన ఇంటివద్దకు వెళ్లి మృతదేహాన్ని ఇంట్లో పడేసి వెళ్లిపోయాడు. తన కుమార్తె కొన ప్రాణాలతో ఉందేమోనని భావించిన తల్లి ముంతాజ్, స్థానికుల సాయంతో యాస్మిన్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది.
ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన భర్త తిట్టడంతోనే భాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ముంతాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతిగా ఈ కేసును తొలుత పోలీసులు నమోదు చేశారు. తన భార్యను కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు సాయితేజ పోలీసులకు చెప్పడం, యాస్మిన్ గొంతుకు రెండుసార్లు తాడు బిగించిన ఆనవాళ్లు ఉండటంతో కేసు దర్యాప్తు మరో దిశలో సాగింది.
పరారీలో ఉన్న షౌకత్ అలీతో పాటు లాలాను పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కారు, తాడును స్వా«దీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైతే మరికొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది.