ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఓ ఖరీదైన కారు ఏడాదిగా మూలన పడి వాడకానికి పనికి రాకుండా పోతోంది. కారును సీజ్ చేసిన అధికారితో పాటు మరో ముగ్గురు కూడా బదిలీ అయి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్ కూడా అప్‌గ్రేడ్ అయ్యింది. అయినా కారు కథ కంచికి చేరడం లేదు.
దిక్కుమొక్కు లేక..
ఏడాది కిందట ఆత్మకూరు మండలం నల్లకాల్వ – బాపనంతాపురం మధ్య జంబులమ్మ ఆలయం వద్ద తెలుపు రంగు కియా కారు మూడు రోజులుగా ఉండడంతో అనుమానం కలిగిన స్థానికులు అప్పటి ఎస్‌ఐకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా కారుకు నంబర్ ప్లేట్ లేదు, విండో షీల్డ్స్ పగులగొట్టి ఉన్నాయి. ఛాసిస్ నంబరు ఆధారంగా కారు యజమానిని గుర్తించారు. కారు మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ కాగా యజమాని కర్ణాటక వ్యక్తిగా తేలింది. పోలీసులు అతనికి ఫోన్ చేసి కారును తీసుకెళ్లమని చెప్పగా ఇంతవరకు రాలేదు.
అసలు ఈ కియా కారు కథేంటి..
ఏడాది కిందట జాతీయ రహదారి – 44లో కారులో వెళుతున్న వ్యక్తులను కొందరు దుండగులు అటకాయించి బలవంతంగా అదే కారులో తీసుకెళ్లిపోయారు. ఓ చోట వారిని దింపేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితులు డోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగులు తీసుకెళ్లిన కారు ఆత్మకూరు ప్రాతంలో దొరికింది. అప్పటినుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌లోనే మగ్గుతోంది.
కారు హైజాక్ వెనుక హవాలా ముఠా?
పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము చేతులు మారే సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ కేసుపై ఎవరైనా అడిగితే.. డోన్‌లో కిడ్నాప్ కేసు నమోదై ఉన్నందున వారికి హ్యాండోవర్ చేయాల్సి ఉందని, అయితే వారు పట్టించుకోవడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment