
ప్రేమ వివాహం చేసుకుని మోసం చేశాడు
రెండో పెళ్లి చేసుకుంటున్నాడని పోలీసులకు చెప్పినా చర్యలు తీసుకోలేదు
కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారు
ఓ యువతి తండ్రి ఆవేదన
ఆదోని అర్బన్(కర్నూలు): డీఎస్పీ, సీఐ కారణంగా తన బిడ్డ జీవితం అన్యాయమైపోయిందని ఓ యువతి తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో నివాసముంటున్న యువతి, కౌతాళం మండలం కామవరానికి చెందిన యువకుడు వీరేష్ ప్రేమించుకున్నారు. గతేడాది డిసెంబర్ 1వ తేదీన పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ.. యువకుడు తన తల్లిదండ్రుల బలవంతంతో మరో యువతితో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి గత నెల 19న ఆదోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీరామ్ ఆ యువకుడిని పిలిపించి అడగగా, రెండో పెళ్లి చేసుకోవడం లేదని, ఒక నెల గడువు కోరి లలితను తీసుకెళ్తానని చెప్పాడు.
ఇంతలోనే ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిసి యువకుడిని నిలదీయడంతో యువతి కుటుంబీకులపై దాడి చేశారు. ఈ మేరకు బాధిత యువతి తండ్రి ఆదోని డీఎస్పీకి ఈనెల 21న ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగానే.. కామవరం వీరేష్ ఈనెల 25న రెండో పెళ్లి చేసుకున్నాడని, పోలీసులు డబ్బులు తీసుకుని తమ కేసును తారుమారు చేశారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై డీఎస్పీ హేమలతను వివరణ కోరగా.. యువకుడితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తులో ఉందన్నారు.