పశ్చిమ గోదావరి: ఉండి మండలం యండగండి గ్రామంలో మృతదేహం పార్శిల్ కేసు మిస్టరీ దాదాపుగా వీడినట్లే కనిపిస్తోంది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అలాగే ఆస్తి తగాదాల కోణంలోనూ ఈ కేసును విచారణ జరుపుతున్నారు.
మృతదేహాన్ని కాళ్ల మండలం గాంధీనగర్‌కు బర్ల పర్లయ్యదిగా గుర్తించారు. అలాగే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిద్ధార్థ్ వర్మ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
సాగి తులసి అనే మహిళకు ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది.. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా.. పార్శిల్‌లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది.
పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్ పెట్టెలో సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. అందులో హత్య జరిగిందని తేలింది. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. విచారణలో కృష్ణాజిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన సిద్థార్థ వర్మపైకి అనుమానం మళ్లింది.
మూడు పేర్లు.. ముగ్గురు భార్యలు
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నవ్యక్తికి ఏకంగా మూడు పేర్లు.. ముగ్గురు భార్యలు ఉన్నట్టు తెలిసింది. కృష్ణాజిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన తిరుమాని సుధీర్ వర్మకు ముందుగా కాళ్ల మండలం ఎస్‌సీ బోస్ కాలనీ ఇస్కులంక గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. సుధీర్ వర్మ తన పేరును శ్రీధర్ వర్మగా మార్చుకుని యండగండికి చెందిన రేవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం సిద్ధార్థవర్మగా పేరు మార్చుకుని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేళ్ల వయసున్న కుమార్తె ఉంది.
ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న శ్రీధర్‌వర్మకి రెండో భార్య రేవతికి అక్క అయిన సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెకు మృతదేహాన్ని పంపించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. బర్ల పర్లయ్య ఎందుకు చంపాడు?.. ఎలా చంపాడు? ఆ మృతదేహాన్ని తులసికి ఎందుకు పంపాడనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment