నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష! | Newly Groom Ends His Life In Kakinada One Day Before Engagement, More Details Inside | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!

Published Mon, Apr 21 2025 6:51 AM | Last Updated on Mon, Apr 21 2025 10:08 AM

Newly Groom Ends Life In Kakinada

 రైలుకు ఎదురెళ్లి పురోహిత వరుడు బలవన్మరణం 

ఆశీర్వదించాల్సిన తండ్రే తలకొరివి పెట్టిన వైనం

తూర్పు గోదావరి(పిఠాపురం): తెల్లారితే కాబోయే ధర్మపత్నికి దండ వేసి, ఉంగరాలు మార్చుకోవాల్సిన ఆ యువకుడి బతుకు అంతలోనే తెల్లారిపోయింది. నిత్యం వేదం పలికే ఆ గొంతు మూగబోయింది. తాంబూలాలు అందుకోవాల్సిన తండ్రి తల కొరివి పెట్టాల్సి వచ్చింది. కొద్ది గంటల్లో ఓ యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. వింజమూరి వెంకటేష్‌ (30) పిఠాపురంలో పురోహితుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం అతని వివా­హ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. 

ఈ క్రమంలో శనివారం ఉదయమే కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెళ్లి, వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చాడు. నిశ్చితార్థంలో వధువుకు, తనకు కావాల్సిన ఉంగరాలను తమ వేలి ముద్రలు ఉండేలా ప్రత్యేకంగా ముంబయిలో ఆర్డరు ఇచ్చి మరీ తయారు చేయించుకున్నాడు. కొత్త దుస్తులు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకున్నాడు. స్నేహితులకు, తోటి పురోహితులకు ఆహా్వనం పలి­కాడు. సంప్రదాయం ప్రకారం ఇంట్లో వారు నిశి్చతార్థానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఊహించని విధంగా శనివారం అర్ధరాత్రి పిఠాపురం సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ విషయాన్ని స్థానికులు గమనించి, రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. సామర్లకోట రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్య చేసుకునేంత సమస్య­లేవీ లేవని చెబుతూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి శర్మ, తల్లి లక్ష్మి గుండెలవిసేలా రోదించారు. నిశి్చతార్థం కోసం తెచి్చన పూలను అంతిమ యాత్రకు వినియోగించాల్సి వచ్చింది. నిశ్చయ తాంబూలాలకు వచ్చిన పెద్దలు, బంధువులు బరువెక్కిన గుండెలతో అంతిమ యాత్రలో పాల్గొన్నారు.  ఏదో బలమైన ఒత్తిడి... ఎవరో బెదిరించడం వల్లే వెంకటేష్‌ ఇలా అఘాయిత్యానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement