మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. అంతలోనే విషాదం | One Man Ends Life Road Incdent At Kakinada | Sakshi
Sakshi News home page

మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. అంతలోనే విషాదం

Published Sat, Apr 5 2025 1:54 PM | Last Updated on Sat, Apr 5 2025 1:56 PM

One Man Ends Life Road Incdent At Kakinada

లారీ ఢీకొని వరుడి మృతి 

పెళ్లి, పుట్టిన రోజు దుస్తులు కొనుక్కుని వస్తుండగా ప్రమాదం

విలపిస్తున్న తల్లిదండ్రులు 

గండేపల్లి/జగ్గంపేట(కాకినాడ): మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. ఈ నేపథ్యంలో కొత్త దుస్తులు కొనుక్కుని.. ఎంతో ఆనందంగా తిరిగి వస్తున్న ఆ యువకుడిపై మృత్యువు కన్నెర్ర చేసింది. లారీ రూపంలో దూసుకువచ్చి, అతడి ఆయువు హరించేసింది. పెళ్లి చేసుకుని, కొడుకు, కోడలు చిలకాగోరింకల్లా తమ కళ్ల ముందు తిరుగుతూంటే చూసి మురిసిపోవాలనుకున్న కలలు కల్లలు కావడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతేలేకుండా పోయింది. ఈ విషాద ఘటన వివరాలివీ.. 

గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన చిక్కాల కాటమస్వామి, సావిత్రి దంపతులకు కుమార్తె, కుమారుడు చిక్కాల శ్రీను (28) ఉన్నారు. కుమార్తెకు గతంలోనే వివాహం చేశారు. శ్రీను ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తండ్రి కాటమ స్వామి వ్యవసాయం చేస్తున్నారు. శ్రీనుకు గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన అమ్మాయితో ఈ నెల 20న వివాహం చేయాలని నిశ్చయించారు. శనివారం శ్రీను పుట్టిన రోజు. 

ఈ నేపథ్యంలో పుట్టిన రోజు, పెళ్లి వేడుకలకు అవసరమైన దుస్తులు కొనుగోలు చేసేందుకు స్నేహితుడితో కలిసి, శ్రీను శుక్రవారం మోటార్‌ సైకిల్‌పై పెద్దాపురం వెళ్లాడు. అక్కడ మిత్రులిద్దరూ కొత్త దుస్తులు కొనుకున్నారు. సాయంత్రం ఆనందంగా ఇంటికి తిరిగి వస్తూండగా, వారి బైక్‌ను జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పెట్రోల్‌ బంకు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీను (28) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మోటార్‌ సైకిల్‌పై ఉన్న స్నేహితుడు స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై జగ్గంపేట ఎస్సై రఘునాథరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

పెళ్లింట పెను విషాదం 
శ్రీను పెళ్లి సమయం సమీపిస్తూండటంతో కుంటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే పెళ్లి దుస్తుల కోసం వెళ్లిన వరుడు శ్రీను రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే సమాచారంతో కుటుంబం తల్లడిల్లిపోయింది. పుట్టిన రోజు వేడుక, పెళ్లి సంబరాలతో ఆనందం నిండాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. పరిసరాల్లో విషాదం నెలకొంది. అందరితోనూ స్నేహభావంతో ఉండే శ్రీను మృతి అందరినీ కలచి వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement