భయాందోళన అవసరం లేదంటున్న వైద్య నిపుణులు
క్షేత్ర స్థాయిలో ప్రభావం అంతగా ఏమీ లేదని వివరణ.. కరోనా తరహాలో జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పులతో ఇబ్బంది
కొందరిలో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం
వైరస్ సోకిన తర్వాత మూడు నుంచి ఆరు రోజుల్లో లక్షణాలు బయటికి..
అయితే ఇది మహమ్మారిగా మారే ప్రమాదం లేదంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: ‘హ్యూమన్ మెటా నిమో వైరస్ (హెచ్‌ఎంపీవీ)’ విషయంలో జరుగుతున్న ప్రచారం హడలెత్తిస్తోందని... కానీ మరీ అతిగా భయాందోళన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 50, 60 ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని.. ఇది కరోనా తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటివి వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, తగిన అప్రమత్తతతో మసలుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
దేశంలో కేసుల నమోదుతో ఆందోళన
చైనాలో హెచ్‌ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం.. దానికితోడు మన దేశంలోనూ ఆరు కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరు, చెన్నైలలో రెండు చొప్పున, అహ్మదాబాద్, కోల్‌కతాలలో ఒక్కో హెచ్‌ఎంపీవీ కేసు మాత్రమే నమోదయ్యాయి. మన దేశానికి సంబంధించి వైరస్ వ్యాప్తి అధికంగా లేకపోయినా, పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా.. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.
శ్వాస మార్గంలో వృద్ధి చెందే లక్షణంతో..
కరోనా వైరస్ తరహాలోనే హెచ్‌ఎంపీవీ కూడా ‘ఆర్‌ఎన్‌ఏ’ రకం వైరస్. అందువల్ల దీనిలోనూ కరోనా తరహాలో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒంటి ఒప్పులు తదితర లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రధానంగా మనం శ్వాస తీసుకునే మార్గం (రెస్పిరేటరీ ట్రాక్ట్)లోనే వృద్ధి చెందుతుందని... అంటే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల తరహాలో కొన్నిరోజుల్లో దానంతట అదే తగ్గిపోతుందని వివరిస్తున్నారు. ఇది కలసి వచ్చే అంశమని పేర్కొంటున్నారు. వైరస్ ప్రధానంగా నోటి తుంపరలు, తుమ్ముల ద్వారా వెలువడే తుంపరల ద్వారా వ్యాపిస్తుందని... ఆ తుంపరలు పడిన చోట తాకడం, వైరస్ సోకినవారిని తాకడం ద్వారా ఇతరులకు విస్తరిస్తుందని స్పష్టం చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్ల వాడకం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వైరస్‌కు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు.
ఆందోళన వద్దు
కరోనాలా వ్యాప్తి చెందుతూ ఉత్పాతం సృష్టించే లక్షణం హెచ్‌ఎంపీవీకి చాలా తక్కువ. కరోనా సమయంలోలాగే తుమ్ములు, దగ్గు నుంచి వచ్చే తుంపర్లకు దూరంగా ఉంటూ, చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి పెంపొందించుకుంటే ఈ వైరస్ వల్ల ప్రమాదం దాదాపుగా ఉండదు. పైగా ఇప్పుడు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. ఆందోళన అవసరం లేదు.– డాక్టర్ గురవారెడ్డి, సన్‌షైన్ హాస్పిటల్స్
జాగ్రత్తలతో నివారణ సాధ్యమే
చిన్నపాటి ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలు హెచ్‌ఎంపీవీ వైరస్‌ను దాదాపుగా నివారించవచ్చు. మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రపర్చుకుంటూ ఉండాలి. వ్యాధిగ్రస్తుల నుంచి దూరంగా ఉండాలి. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి సమయానికి వ్యాక్సిన్లన్నీ ఇప్పించాలి. పెద్దలు, వృద్ధులు జలుబు వంటి లక్షణాలున్నవారి నుంచి దూరంగా ఉండాలి.– డాక్టర్ జయచంద్ర, క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్
చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్త
చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఈ ఆర్‌ఎన్‌ఏ వైరస్‌ను 2001లో గుర్తించారు. అప్పటి నుంచి ఇది ఏటా చలికాలంలో చిన్న పిల్లలు, వృద్ధుల్లో సీజనల్ వైరల్ అనారోగ్యంగా కొనసాగుతోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులకు మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. – జీసీ ఖిల్నానీ, ఢిల్లీ ఎయిమ్స్ పల్మనరీ విభాగం మాజీ హెడ్
అతిగా భయాందోళన అనవసరం
హెచ్‌ఎంపీవీ వైరస్ గురించి అతిగా భయాందోళనకు గురికావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అయితే బయటికి వెళ్లినప్పుడు, గుంపుల్లోకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటిదాకా వెల్లడైన అంశాల మేరకు ఈ వైరస్ చాలా స్వల్ప లక్షణాలు కలిగి ఉంటుంది. సాధారణ జలుబు మాదిరిగా ముక్కు కారడం, దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, గొంతునొప్పి, శ్వాస తీసుకునేప్పుడు ఈల వేసినట్టు శబ్దాలు రావడం, శరీరంపై దద్దుర్లు రావడం వంటి వాటి ద్వారా దీనిని గుర్తించవచ్చు. – డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రి
మహమ్మారిగా మారే ప్రమాదం లేదు
ఇది కోవిడ్ మాదిరిగా మహమ్మారిగా మారే ప్రమాదం అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 ఏళ్లకుపైగానే ఇది వ్యాప్తిలో ఉంది. దీనివల్ల కేసులు పెరగొచ్చునేమోగానీ తీవ్రత అంత ఉండకపోవచ్చు. మనుషుల్లో యాంటీబాడీస్‌తోపాటు తగిన మేర రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ కేసులు సీరియస్ కాకుండా రక్షణ ఉండవచ్చు. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ ఆస్పత్రి
హెచ్‌ఎంపీవీపై నిపుణుల కమిటీ
⇒ నియమించిన వైద్య, ఆరోగ్య శాఖ
⇒ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసూ లేదు
⇒ ఎలాంటి భయాందోళనలు వద్దు
సాక్షి, అమరావతి: చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్, బెంగళూరుల్లో వైరస్ నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం ప్రకటించింది. కేరళలోనూ వైరస్ కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మైక్రోబయాలజిస్ట్, పీడియాట్రిక్స్, పల్మనాలజిస్ట్, ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్లతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిపుణుల కమిటీని నియమించింది. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ అధికారులతో ఈ అంశంపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కేసులు నమోదు కాలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లు 10, వీఆర్‌డీఎల్ ల్యాబ్‌లు 9 సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి టెస్టులకు కావాల్సిన కిట్లు, యాంటీవైరల్ మందుల లభ్యతపై అంచనాలు తయారు చేయాలన్నారు. డీఎంఈ, డీహెచ్, సెకండరీ హెల్త్ ఇలా అన్ని విభాగాల అధిపతులు హెచ్‌ఎంపీవీ లక్షణాలకు సంబంధించిన కేసుల నమోదును క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకు సూచించారు. వైరస్ బారినపడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై మార్గదర్శకాలను జారీ చేస్తామన్నారు.
అప్రమత్తంగా ఉండండి: సీఎం
హెచ్‌ఎంపీవీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి, వెళ్లే వారిపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment