అక్కడ 100...ఇక్కడ 25
తేలిన ఆంధ్ర, తెలంగాణ వైద్యుల జాబితా
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న వారి లెక్క తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వైద్యులు 25 మంది వరకూ పనిచేస్తున్నారని జాబితాలో తేల్చారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వైద్యులు 100 మంది ఉన్నారని తేలింది. ఇప్పటికే ఆయా వైద్యుల ఆప్షన్లు కమల్‌నాథన్ కమిటీకి వెళ్లాయి. ఏపీలో ఉన్న తెలంగాణ వైద్యుల్లో ఎక్కువ మంది కర్నూలులోనే పనిచేస్తున్నారు. సుమారు 13 మంది వైద్యులు వివిధ హోదాల్లో కర్నూలు మెడికల్ కాలేజీలో పని చేస్తున్నారు. అనంతపురం, కాకినాడ, గుంటూరు, విజయవాడ, ఆంధ్రామెడికల్ కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున పని చేస్తున్నారు. ఇటీవల నెల్లూరులో నెలకొల్పిన మెడికల్ కళాశాలలోనూ 5 మంది తెలంగాణ వైద్యులు పనిచేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా వైద్యుల్లో 95 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. సుమారు 60 మంది వైద్యులు ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలల్లోనే ఉన్నారు. నీలోఫర్, సరోజిని, ఛాతీ ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, మానసిక వైద్యశాల వంటి స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మరో 30 వరకూ ఉన్నట్టు తేలింది. కమలనాథన్ కమిటీ ఉత్తర్వులు వెలువడగానే రెండు రాష్ట్రాల్లోని వైద్యులను రిలీవ్ చేసేందుకు రెండు రాష్ట్రాల వైద్య విద్యా సంచాలకులు సిద్ధంగా ఉన్నారు. అయితే, హైదరాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో ఏపీ వైద్యులు ఉన్నారు కాబట్టి, వీళ్లందరికీ ఏపీలో పోస్టింగ్‌లు ఎక్కడ ఇస్తారనే దానిపై సందిగ్ధం నెలకొంది.