
కాకినాడ క్రైం: సెల్‌ఫోన్ మింగిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి (35) మానసిక అనారోగ్యంతో బాధ పడుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో శనివారం చేరింది.
అక్కడ తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కీ ప్యాడ్ ఫోన్ మింగేసింది. వెంటనే వైద్యులు చికిత్స చేసి ఫోన్ తొలగించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈసోఫాగస్ (అన్నవాహిక) పూర్తిగా దెబ్బ తింది. దీంతో అక్కడి వైద్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. రమ్య స్మృతిని శఽనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.
సెల్‌ఫోన్ తొలగింపు ప్రక్రియలో రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యులు చేసిన పొరపాటు వల్లే తమ కుమార్తె చనిపోయిందని తండ్రి విలపించాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడయ్యే వరకూ అక్కడే ఉంచాలని కోరినా రాజమహేంద్రవరం జీజీహెచ్ అధికారులు బలవంతంగా కాకినాడకు తరలించారని ఆరోపించాడు. అక్కడి నుంచి కాకినాడ చేరేందుకు రెండు గంటల సమయం పట్టిందని, ఆ వ్యవధిలో రమ్య ఆరోగ్య స్థితి మరింత క్షీణించి మరణానికి దారి తీసిందని వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment