గుట్టు విప్పిన సమాధి.. | Funday Story On Incident In Azizpur Uttar Pradesh | Sakshi
Sakshi News home page

గుట్టు విప్పిన సమాధి..

Published Sun, Sep 29 2024 6:08 AM | Last Updated on Sun, Sep 29 2024 6:08 AM

Funday Story On Incident In Azizpur Uttar Pradesh

క్లూ ఇచ్చిన వార్త

పట్టుకున్న ఉద్యోగిని

సగమే చిక్కిన సంపద

‘తండ్రి సమాధి దగ్గర అన్నదమ్ముల తన్నులాట. ఉత్తరప్రదేశ్‌లోని అజీజ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన ఊళ్లో వాళ్లందరినీ విస్మయానికి గురి చేసింది. శిథిలావస్థకు చేరిన తండ్రి సమాధికి మరమ్మతులు చేయాలని తమ్ముడు, అవసరంలేదు.. ఎలా ఉందో అలాగే ఉంచాలని అన్న పట్టుబట్టడంతో వాదన తగువుగా మారి, చేయి చేసుకోవడం వరకు వెళ్లింది. అన్న మొండిపట్టుపై అనుమానం వచ్చిన తమ్ముడు, అన్న మీద నిఘా పెట్టాడు. ఓ రాత్రివేళ అన్న.. తండ్రి సమాధి పక్కనున్న గుంతలోంచి ఒక కుండను తీసుకెళ్లడం తమ్ముడి కంటబడింది. అన్నకు ఎదురెళ్లి ఆ కుండను లాక్కొని చూశాడు. అందులో బంగారం ఉంది. హతాశుడయ్యాడు. అన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ’ అంటూ చదువుకుపోతున్నాడు ఐటీ ఆఫీస్‌లో.. ఓ ఉద్యోగి.

నవ్వుతూ ఆ వార్తను వింటున్న ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. వెంటనే తన  కొలీగ్‌  చేతుల్లోంచి ఆ పేపర్‌ లాక్కొని తమ ఆఫీసర్‌ క్యుబికల్‌ వైపు పరుగెత్తినట్టే వెళ్లింది. ఆమె చర్యకు ఆశ్చర్యపోయాడు అప్పటిదాకా వార్త చదివిన కొలీగ్‌. బాస్‌ దగ్గరకు వెళ్లిన ఆ మహిళా ఉద్యోగి ‘సర్‌.. మన లాస్ట్‌ రైడ్‌లో..’ అని ఏదో చెప్పబోతుండగా..
‘లీవిట్‌ .. ఒక రాంగ్‌ ఇన్‌ఫర్మేషన్‌ వల్ల ఓ పెద్ద వ్యక్తిని ఇన్‌సల్ట్‌ చేసినట్టయింది. డిపార్ట్‌మెంట్‌ పరువుపోయింది’ అన్నాడు బాస్‌ అసహనంగా!
‘సర్‌.. అతని సొంతూరులో.. ’ అని మళ్లీ ఆమె ఏదో చెప్పబోతుండగా.. 
‘ఆ విషయాన్ని వదిలేయండి అన్నాను కదా..’ అన్నాడు ఫైల్లోంచి ముఖం బయటపెట్టకుండానే!
‘అదికాదు సర్‌.. అతని సొంతూరు.. ’ అని తన మాటను పూర్తి చేయాలని ఆమె ప్రయత్నిస్తుండగా.. బాస్‌ మళ్లీ అడ్డుపడుతూ ‘సొంతిల్లు, బంధువుల ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదామ్‌లు అన్నీ సర్చ్‌ చేశాం. ఎక్కడా చిల్లి గవ్వ, చిరిగిన డాక్యుమెంట్‌ కూడా దొరకలేదు’ అన్నాడు కాస్త చిరాగ్గా. 

‘బట్‌ సర్‌ అతని తండ్రి సమాధి సర్చ్‌ చేయలేదు కదా’ స్థిరంగా అన్నది ఆ ఉద్యోగిని. 
అప్పుడు తలెత్తి ఆమె వంక చూశాడు అతను. ఆమె అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.. ‘సర్‌.. ఆ బడాబాబు, రీసెంట్‌గా తన తండ్రి పదిహేనో వర్ధంతి సందర్భంగా.. తన పొలంలో ఉన్న తండ్రి సమాధిని రెనోవేట్‌ చేశాడని మొన్ననే పేపర్‌లో చదివాను. దాన్నో విశ్రాంతి మందిరంలా తీర్చిదిద్దాడని పేపర్లు తెగ పొగిడాయి’ అంటూ ఆగింది. 
‘అయితే ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు. 
వెంటనే అతని చేతుల్లో తను లాక్కొచ్చిన పేపర్‌ పెట్టి, ఇందాక తన కొలీగ్‌ చదివిన వార్తను చూపించింది ఆమె. 
ఆ వార్త మీద దృష్టిసారించాడు ఆఫీసర్‌. 
రెండు నిమిషాల తర్వాత ‘యెస్‌.. ఎలా మిస్‌ అయ్యాం ఈ పాయింట్‌ని?’ అన్నాడు పేపర్‌ను మడిచేస్తూ!
‘సర్‌.. ఇప్పుడు ప్లాన్‌ చేసుకోవచ్చు!’ అంది ఆమె ఉత్సాహంగా!

నాలుగు రోజలకు.. 
బడాబాబు సొంతూరులోని పొలానికి చేరుకుంది ఐటీ టీమ్‌. పేపర్లు పొగిడినట్టే అది నిజంగానే సమాధిలా లేదు. వాచ్‌మన్‌ ఉన్నాడు. తామెవరో చెప్పి, ముందుకు మూవ్‌ అయ్యారు. ఆ సమాధిని పరిశీలిస్తుండగానే బడాబాబు తన పరివారంతో రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. కారు పార్క్‌ అవుతుండగానే హడావిడిగా కారు దిగి, పరుగెడుతున్నట్టుగా ఐటీ టీమ్‌ని చేరాడు. 
‘మా కుటుంబానికి మాత్రమే పర్మిషన్‌ ఉన్న ప్లేస్‌ ఇది’ అంటూ బడాబాబు.. ఐటీ ఆఫీసర్‌ మీదకు పళ్లునూరుతుండగానే ‘కూల్‌ సర్, మీకు సంబంధించిన అన్ని చోట్లా ఇన్‌క్లూడింగ్‌ ఈ సమాధి.. సర్చ్‌ చేసుకునే పర్మిషన్‌ మాకుంది’ అంటూ అనుమతుల పత్రం చూపించాడు ఐటీ ఆఫీసర్‌. 

ప్యాంట్‌ జేబులోంచి కర్చీఫ్‌ తీసుకుని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు బడాబాబు. 
పక్కనే ఉన్న అతని అíసిస్టెంట్‌తో ‘సర్‌కి మంచినీళ్లు’ అంటూ సైగ చేశాడు ఐటీ ఆఫీసర్‌. 
‘నో థాంక్స్‌’ అంటూ కోపంగా అక్కడే ఉన్న సిమెంట్‌ బెంచ్‌ మీద కూలబడ్డాడు బడాబాబు. 
సమాధి చుట్టూ పరిశీలించారు ఐటీ వాళ్లు. అనుమానం ఉన్న చోటల్లా తట్టారు. ఏమీ కనిపించలేదు. రహస్య అరలేవీ తెరుచుకోలేదు. 
ఇదీ వృథా ప్రయాసే కాదు కదా అనుకుంటూ బడాబాబు వైపు చూశాడు ఐటీ ఆఫీసర్‌. అతని ముఖంలో చాలా కంగారు కనపడుతోంది. అయితే అంతా కరెక్ట్‌గానే జరుగుతోంది అనే భరోసాకు వచ్చాడు ఐటీ ఆఫీసర్‌. అతను అలా అనుకుంటున్నాడో లేదో.. ‘సర్‌’ అంటూ పిలిచాడు ఉద్యోగి. ఒక్క అంగలో అక్కడికి వెళ్లాడు ఆఫీసర్‌. సరిగ్గా సమాధికి ముందు ఫ్లోరింగ్‌లోని నాలుగు మార్బుల్స్‌ డిజైన్‌లో ఏదో తేడాగా ఉంది. చూపించాడు ఉద్యోగి. చూశాడు ఆఫీసర్‌. ప్రత్యేక డిజైన్‌లా కనపడుతోంది కానీ.. సమ్‌థింగ్‌ ఫిషీ అనుకున్నాడు. బడాబాబు వైపు చూశాడు. అతనిలో కంగారు ఎక్కువైంది. కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లారిటీ వచ్చేసింది ఆఫీసర్‌కి.

‘సర్‌..’ పిలిచాడు ఆఫీసర్‌. 
‘ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు బడాబాబు. ‘కుడ్‌ యూ ప్లీజ్‌ ఓపెన్‌ ఇట్‌?’ అడిగాడు ఆఫీసర్‌. 
‘ఓపెన్‌ చేయడానికి అదేమన్నా తలుపా?’ బడాబాబు సమాధానం.
‘డోర్‌ అయితే మేమే ఓపెన్‌ చేసేవాళ్లం. ప్లీజ్‌ ఓపెన్‌ ఇట్‌..’ స్థిరంగా చెప్పాడు ఆఫీసర్‌. 
అట్టే బెట్టు చేయక జేబులోంచి రిమోట్‌ తీసి ఓపెన్‌ చేశాడు. టెన్‌ బై టెన్‌ సైజులోని నేలమాళిగ అది. అందులో అన్నీ లాకర్లే! డబ్బు, బంగారం, వెండి, బంగారు విగ్రహాలు, వజ్రాలు ఎట్‌సెట్రా చాలానే దొరికాయి. అయినా ఆ ఆఫీసర్‌ ముఖంలో విజయం తాలూకు ఆనవాళ్లు లేవు. ఎందుకంటే ఆయనకందిన లెక్కలో దొరికినవాటి లెక్క సగం కూడా లేదు. ఫార్మాలిటీస్‌ పూర్తిచేసుకొని, తిరుగు ప్రయాణమవుతూ ‘ఇంకేదో క్లూ మిస్‌ అయి ఉంటాం’ అనుకున్నాడు.

ఇవి చదవండి: ఈ కిక్కిరిసిన అపార్ట్‌మెంట్‌ ఎక్కడుందో తెలుసా!?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement