రోండా హిన్సన్‌.. 'అమ్మా రోమ్‌! నీకు ఏమైంది తల్లీ'? | Rhonda Hinson Mystery Funday Story Written By Samhita Nimmana | Sakshi
Sakshi News home page

రోండా హిన్సన్‌.. 'అమ్మా రోమ్‌! నీకు ఏమైంది తల్లీ'?

Published Sun, Sep 15 2024 2:29 AM | Last Updated on Sun, Sep 15 2024 2:29 AM

Rhonda Hinson Mystery Funday Story Written By Samhita Nimmana

‘అమ్మా రోమ్‌! నీకు ఏమైంది తల్లీ?’ అంటూ పెద్దగా కలవరిస్తూ మంచం మీద నుంచి ఉలికిపడి లేచి కూర్చుంది జూడీ. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి ఒంటిగంటైంది. వేగంగా మంచం దిగి, పక్కనే ఉన్న గదికి వెళ్లి, లైట్‌ వేసి, రోండా(రోమ్‌) మంచం వైపు చూసింది. అక్కడ రోండా లేకపోవడంతో కంగారు కంగారుగా పరుగున వెనుకకు వచ్చి, తన మంచం మీద గాఢనిద్రలో ఉన్న భర్తను కుదిపి కుదిపి లేపింది. అతడు నిద్రమత్తులోంచి తేరుకోకముందే, ‘మన.. మన రో..మ్‌.. కనిపించడం లేదు బాబీ!.. మ..మంచం మీద లేదు.. నాకు చా..చాలా భయంగా ఉంది’ అంటూ తడబడుతూనే ఏడ్చేసింది జూడీ. బాబీకి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ‘ఏం మాట్లాడుతున్నావ్‌ జూడీ?’ అన్నాడు కంగారుగా.

‘మన.. మన రోమ్‌ చచ్చిపోయింది. ఉన్నట్టుండి లోయలో పడిపోయింది. తనకి ఊ.. ఊపిరి ఆడటం లేదు. నా కళ్లముందే.. నా కళ్లముందే పడిపోయింది’ వణుకుతున్న స్వరంతో చెప్పింది జూడీ. బాబీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. పరుగున లేచి వెళ్లి, లైట్‌ ఆన్‌ చేశాడు. గడియారం వైపు చూసి, టేబుల్‌ మీద వాటర్‌ బాటిల్‌ అందుకుని, జూడీకి తాగించాడు. పక్కనే కూర్చుని, ఓదార్పుగా ‘జూడీ! మన రోమ్‌ ఇంట్లో ఎందుకుంటుంది? క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌కి నిన్నే వెళ్లింది కదా, రేపు ఉదయాన్నే వస్తానంది కదా?’ అని నిదానంగా గుర్తు చేశాడు. దాంతో జూడీ పూర్తిగా తేరుకుంది.

అప్పటిదాకా బిడ్డ కోసం మెలితిరిగిన కన్నపేగు అదంతా పీడకల అని గుర్తించింది. అయినా తల్లి మనసు ఇంకా అల్లాడుతూనే ఉంది. ‘బా..బీ..! నాకు చాలా భయంగా ఉంది. నాకొచ్చింది కలే కాని, నా బిడ్డ(రోండా) ఏదో సమస్యలో ఉందని నా మనసు చెబుతోంది. అసలు తను ప్రాణాలతో ఉందా? ఇప్పుడే తనని చూడాలనుంది’ అంటూ ఏడ్చింది జూడీ. దాంతో బాబీ.. ‘పిచ్చిగా మాట్లాడకు. మన రోమ్‌కి ఏమీ కాదు. ఇప్పుడు టైమ్‌ చూడు, ఈ సమయంలో ఎక్కడికని వెళ్దాం? రేపు తనొస్తానన్న టైమ్‌కి రాకపోతే కచ్చితంగా మనమే వెళ్దాం సరేనా?’ అని నచ్చజెప్పాడు బాబీ.

జూడీ, బాబీలకు చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి రోండాకి పంతొమ్మిదేళ్లు. చదువు పూర్తిచేసుకుని, మూడు నెలల క్రితమే ఉద్యోగం సంపాదించుకుంది. ‘ఆఫీస్‌లో క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ ఉన్నాయి, అటు నుంచి రాత్రికి ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లి, రేపు మధ్యాహ్నానికి వస్తా’ అని చెప్పి వెళ్లింది.

ఉదయం 6 దాటేసరికి కాలింగ్‌ బెల్‌ మోగింది. జూడీ తలుపు తీసేసరికి ‘రోండా మీ అమ్మాయేనా?’ అడిగారు ఎదురుగా ఉన్న పోలీసులు. ‘అవును ఏమైంది?’ అంది జూడీ కంగారుగా. ‘మీ అమ్మాయి కారుకి యాక్సిడెంట్‌ అయ్యింది. ఆమె చనిపోయింది’ చెప్పాడు వారిలో ఒక అధికారి. జూడీకి గుండె ఆగినంత పనైపోయింది. ‘నో.. నో..!’ అంటూ అక్కడే ఉన్న వస్తువులన్నీ నేలకేసి కొట్టింది జూడీ. ‘నేను నమ్మను. నా బిడ్డకు ఏమీ కాదు. మీరు అబద్ధం చెబుతున్నారు. ఇది నా కల! నిజం కాదు’ అని అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. ఆ అరుపులకు లోపల నుంచి బాబీ పరుగున వచ్చి జూడీని పట్టుకున్నాడు. పోలీసులు మరోసారి అదే మాట చెప్పడంతో ఆ దంపతులు మార్చురీకి పరుగు తీశారు.

పోస్ట్‌మార్టమ్‌లో మాత్రం రోండా బాడీలో బుల్లెట్‌ దొరికింది. కేవలం వెనుక సీట్‌లో కూర్చున్న వాళ్లే అలా కాల్చగలరని తేలింది. దాంతో యాక్సిడెంట్‌ కేసు కాస్త హత్య కేసుగా మారిపోయింది. కారు రోడ్డు పక్కకు ఒరిగినట్లు, డ్రైవర్‌ సీట్‌ వైపు డోర్‌ ఓపెన్‌ చేసి ఉన్నట్లు, కారుకి కాస్త దూరంలో రోండా నేలమీద బోర్లా పడి ఉన్నట్లు ఆ రాత్రే రెండు గంటల సమయానికి గుర్తించారు పెట్రోలింగ్‌ పోలీసులు.

అపరిచితులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని రోండా, తెలియని వారికి లిఫ్ట్‌ ఇచ్చే చాన్సే లేదని జూడీ, బాబీ నమ్మకంగా చెప్పారు. దాంతో రోండా పరిచయస్థులంతా విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో క్రిస్మస్‌ వేడుకల నుంచి రోండా ఎక్కడికి వెళ్లింది? ఎవరెవరిని కలసింది? ఇలా ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి పన్నెండున్నరకు తన స్నేహితురాలిని డ్రాప్‌ చేసిన రోండా.. పది మైళ్ల దూరంలో ఉన్న తన ఇంటికే ఒంటరిగా కారులో బయలుదేరిందని తేలింది. కారు, మృతదేహం రెండూ ఇంటికి అరమైలు దూరంలోనే దొరికాయి.

అయితే ఆ రాత్రి అదే తోవలో వెళ్లిన ఒక సాక్షి ‘రోండా కారు దగ్గర ఒక నీలం కలర్‌ కారు చూశాను. అందులో ఇద్దరు యువకులు ఉన్నారు’ అని చెప్పాడు. మరో సాక్షి.. కారు ముందు వైపుకు.. రోండా వాలిపోవడం చూశానని, ఆమె పక్కనే ఓ యువకుడు ఉన్నాడని, అయితే అది క్రైమ్‌ సీన్‌ అనుకోలేదని, తాగిన మత్తులో ఉన్న ప్రేమజంటగా భావించి, ఆగకుండా వెళ్లిపోయానని చెప్పాడు. అంటే ఆ సమయానికే రోండా చనిపోయిందని, అప్పుడు కిల్లర్‌ రోండా పక్కనే ఉన్నాడని అధికారులకు అర్థమైంది. వెంటనే ఆ సాక్షుల అంగీకారంతో వారికి హిప్నాసిస్‌ టెస్ట్‌ చేసి, కిల్లర్స్‌లో ఒకడు ముదురు గోధుమరంగు జుట్టుతో, 5.10 అడుగుల ఎత్తు ఉంటాడని నిర్ధారించుకున్నారు. ఇక రోండా చిన్ననాటి స్నేహితుడు మైక్‌ని కూడా గట్టిగానే నిలదీశారు.

నిజానికి రోండా చదువుల్లోనే కాదు, ఆటల్లోనూ ఫస్టే! ప్రతిదానిలోనూ దూసుకునిపోయే రోండా, తన మరణానికి నెల్లాళ్ల ముందు నుంచి చాలా వింతగా ప్రవర్తించిందట! ప్రతిదానికి భయపడటం, పగటిపూట కూడా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, రాత్రి సమయాల్లో మెలకువగా ఉండటం, అర్ధరాత్రి వేళ స్నానం చేయడం లాంటివి చేసేదట! సాధారణంగా ౖలñ ంగిక వేధింపులకు గురైనవారి ప్రవర్తన అలానే ఉంటుందని కొందరు సైకాలజిస్ట్‌లు.. అధికారులకు చెప్పారు.

ఆ క్రిస్మస్‌ వేడుకలకు కూడా స్నేహితురాలు పట్టుబట్టడంతో రోండా బలవంతంగా వెళ్లిందని పేరెంట్స్‌ గుర్తు చేసుకున్నారు. ‘పెళ్లి అయిన వారిని ప్రేమించడం, వారితో రిలేష¯Œ షిప్‌లో ఉండటం తప్పా?’ అని రోండా తన తల్లిని పదేపదే అడిగేదట! స్నేహితులకు సలహా ఇవ్వడానికి అలా అడిగిందేమో అనుకుందట జూడీ. కానీ రోండా మరణం తర్వాత జూడీకి ‘రోండా జీవితంలో ఎవరైనా వివాహితుడు ఉన్నాడా? అతడే కిల్లరా?’ అనే అనుమానం మొదలైంది. ఇప్పటికీ జూడీ, బాబీ దంపతులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.

1981 డిసెంబర్‌ 22, నార్త్‌ కరోలినాలోని మౌంటైన్‌ రోడ్‌లో ఆమె ఇంటికి అర మైలు దూరంలోనే హత్యకు గురైంది. నేటికీ హంతకులు ఎవరో తేలక ఈ కేసు మిస్టరీగానే మిగిలింది. అయితే సరిగ్గా రోండా ప్రాణం పోయే సమయానికే.. నిద్రలో ఉన్న తల్లి జూడీకి ఎలా తెలిసింది? అనేది కూడా మిస్టరీనే! – సంహిత నిమ్మన

ఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement