Life story
-
కరుణ, ప్రేమ, క్షమ ప్రపంచానికి క్రీస్తు శాంతి సందేశం
-
ఆయన జీవితం స్ఫూర్తిమంతం
ఈ దేశంలో నిజమైన పోరాట యోధుల చరిత్ర వెలుగులోకి రాకమునుపే, నకిలీ విజేతలు వెలిగిపోయారు. ఇప్పుడు ఆ మూసను బద్ధలుకొట్టడమే ఈ తరం చేయాల్సిన పని. ‘నా అన్వేషణలో కత్తి చంద్రయ్య’ అనే జీవితగాథ రాసిన కత్తి కళ్యాణ్ చేసింది ఇదే! ఈ పుస్తకాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్తే ఒక మహామనిషితో కరచాలనం చేస్తాం. తెలుగు నేల నుంచి ఆవిర్భవించిన తొలి దళిత కలెక్టర్ ‘పేదల కలెక్టర్’గా ఎట్లా ఎదిగి వచ్చాడో తెలుసుకుంటాం. ఆయన చేసిన సేవలకు ఆయనే గనుక ఉన్నతవర్గంలో పుట్టి ఉంటే ఈ పాటికి ఆయన పేరు నలుదిశలా మార్మోగేది.1924లో నిరుపేద రైతుకూలీ కుటుంబంలో జన్మించిన కత్తి చంద్రయ్య చదువే లోకంగా ఎదిగి వచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీతో పాటు మద్రాసులో సైతం ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రకాశం జిల్లా ఏర్పడిన తరువాత మొదటి కలెక్టర్‌గా ఆయన పనిచేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సైతం ఆయన కలెక్టర్‌గా సేవలందించారు. ఏ జిల్లాలో ఉద్యోగం చేసినా తనదైన మార్క్ ఉండేది. సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలన్నా, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడి, పేదలకు పంచాలన్నా కత్తి చంద్రయ్యకే సాధ్యం అనేలా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.ఆయనలో ఒక గొప్ప మేధావి ఉన్నాడు. పురాతన చరిత్రను తెలుసు కోవడం, పత్రికలకు, మ్యాగజైన్లకు వ్యాసాలరూపంలో రాసి ప్రచారం చేయడం అభిరుచిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మంచి పాఠకుడిగా ఆయన అనేక పుస్తకాలు అధ్యయనం చేశారు. అలాగే తన పరిశోధనలో తెలుసుకున్న విషయాలను ఈ సమాజం ముందు పెట్టడానికి విలువైన రచనలు చేశారు. ‘దళిత్ ఎకానమీ’ అనే రచన అందులో ఒకటి. తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతో వేమన వంటి ప్రజా కవులను గురించి కూడా వ్యాసాలు రాశారు.చదవండి: కలలూ కన్నీళ్ళ కలబోతలో పూలూ ముళ్ళూ!ఈ పుస్తకంలో చంద్రయ్య కాలం నాటి దినపత్రికల కట్టింగ్లను పొందు పరిచాడు రచయిత. అది చాలా శ్రమతో కూడుకున్న పని. ఇవాళ పరాజిత జాతుల చరిత్రలన్నీ వెలికితీసే పని మరింతగా జరగాలి. నిజం చెప్పులేసు కునేలోపే, అబద్ధాలు ప్రపంచమంతా తిరిగి వస్తున్న యుగంలో మనం జీవి స్తున్నాం. నిజాలకు పట్టం కట్టాలి, నిజమైన ఆదర్శనీయుల చరిత్రను ఈ సమాజానికి అందించాలి. ఈ పుస్తకం విరివిగా ప్రజల్లోకి వెళ్లాలి. ముఖ్యంగా విద్యార్థులు చదవాలి. చంద్రయ్య పేరు మీద ఉత్తమ అధికారులకూ, పరిశోధ కులకూ, చరిత్ర రచయితలకూ అవార్డులివ్వాలి. ఇందుకోసం ప్రజలు, ప్రభు త్వాలు పూనుకోవాలి. ఆ దిశలో వ్యవహరించడానికి అవసరమైన చైతన్యం కలిగించడానికి ఈ పుస్తకం ఒక దారి చూపుతుంది.– డాక్టర్ పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య అకాడెమియువ పురస్కార గ్రహీత -
John Floor: ఆ జంప్ విలువ అమూల్యం..!
పదహారేళ్ల వయసు.. కొత్తగా రెక్కలు విప్పుకుంటూ రివ్వున ఎగిరిపోవాలని, ప్రపంచాన్ని చుట్టిరావాలని కోరుకుంటుంది! కానీ ఆ ప్రాయంలోనే జరిగిన ఒక అనూహ్య ఘటన ఆ అమ్మాయి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన ఆ బాలికకు ఆపై నడవడమే అసాధ్యమైంది. పుట్టుకతో వచ్చిన లోపానికైతే జీవితంలో సన్నద్ధత వేరుగా ఉంటుంది. కానీ ఎదుగుతున్న వయసులో ఎదురైన ఆ పరిస్థితికి ఆమె చలించిపోయింది. పట్టరాని దుఃఖాన్ని అనుభవించింది. అయితే ఆ బాధతోనే కుంగిపోకుండా.. నిలిచి పోరాడాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె క్రీడలను ఎంచుకుంది. ఆ దారిలో తీవ్రంగా శ్రమించి శిఖరానికి చేరింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆ అథ్లెట్ పేరు ఫ్లోర్ జాన్. నెదర్లండ్స్‌కు చెందిన పారాలింపియన్. వరుసగా రెండు పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటింది.ఫ్లోర్ జాన్ స్వస్థలం నెదర్లండ్స్‌లోని పర్మెరెండ్పట్టణం. చిన్నప్పటి నుంచి చదువులో, ఆటల్లో మహా చురుకు. టీనేజ్‌కి వచ్చాక ఆ ఉత్సాహం మరింత ఎక్కువైంది. ఎక్కడ ఎలాంటి పోటీ జరిగినా అక్కడ వాలిపోయేది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో బహుమతి లేకుండా తిరిగొచ్చేది కాదు. ఆ ఉత్సాహంతోనే దూసుకుపోతూ, తన 17వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ.. బ్యాక్టీరియల్ బ్లడ్ ఇన్ఫెక్షన్కు గురైంది. ఆ కారణంగా ఆమె కుడి కాలు, చేతి వేళ్ల ముందు భాగానికి రక్తప్రసరణ ఆగిపోయింది. దాంతో హడావిడిగా ఫ్లోర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అసలు అలాంటి రక్త సమస్యతో ఆమె బతకడమే అసాధ్యం అనిపించింది.కాళ్లను తీసివేసి..వేర్వేరు శస్త్రచికిత్సల తర్వాత ఎట్టకేలకు డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడగలిగారు. అయితే మరో షాకింగ్ విషయంతో వారు ముందుకొచ్చారు.. కుడి కాలును తొలగిస్తేనే ఇన్ఫెక్షన్ దరి చేరకుండా ఉంటుందని! ఒప్పుకోక తప్పలేదు. మోకాలి కింది భాగం నుంచి కుడి కాలును తీసేశారు. అదే తరహాలో రెండు చేతుల ఎనిమిది వేళ్లను కూడా గోళ్ల భాగం వరకు తొలగించారు. ఆ వయసులో ఇలాంటి పరిస్థితి ఎంత వేదనాభరితమో ఊహించుకోవచ్చు.ఫ్లోర్ పోరాడేందుకు సిద్ధమైంది. రీహాబిలిటేషన్ కేంద్రంలో కోలుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కార్బన్ ఫైబర్‌తో కృత్రిమ కాలును అమర్చారు. కానీ కొంతకాలానికి అదే ఆమెకు భారంగా మారింది. దానివల్ల తన సహజమైన కాలును కూడా కదపడం కష్టమైపోయింది. ఆ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. దాంతో ఈసారి తానే డాక్టర్లను సంప్రదించింది. తన రెండో కాలునూ తొలగించమని కోరింది. వైద్యులు నిర్ఘాంతపోయినా చివరకు ఒప్పుకోక తప్పలేదు. ఆపరేషన్‌తో ఆ రెండో కాలును కూడా తీసేశాక రెండు బ్లేడ్లే ఆమెను నిలబెట్టాయి.అథ్లెటిక్స్‌లోకి అడుగు పెట్టి..ఆ ఘటన తర్వాత ఫ్లోర్ సమయాన్ని వృథా చేయలేదు. ఏడాదిలోపే డచ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ పారా అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ కార్యక్రమానికి హాజరైంది. అక్కడే ఆమె అథ్లెటిక్స్ను ఎంచుకుంది. ఫ్లోర్ ప్రతిభ, పట్టుదలను చూసిన కోచ్ గైడో బాన్సన్ ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుకు మెరుగులు దిద్దుకుంది. జాతీయ స్థాయిలో, యూరోపియన్ సర్క్యూట్లో ఫ్లోర్ వరుస విజయాలు సాధించి ఆపై ప్రతిష్ఠాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్‌పై దృష్టిసారించింది.పారా క్రీడల్లోకి అడుగు పెట్టిన మూడేళ్ల లోపే ఆమె ఖాతాలో వరల్డ్ చాంపియన్‌షిప్ మెడల్ చేరడం విశేషం. 2015లో దోహాలో జరిగిన ఈవెంట్లో 200 మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకుంది. 100 మీటర్ల పరుగులో ఆమె 12.78 సెకన్ల టైమింగ్‌తో కొత్త రికార్డు నమోదు చేయడంతో పాటు ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానానికి చేరింది. పారా అథ్లెట్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు రావడంతో ఫ్లోర్ ఆ తర్వాత లాంగ్‌జంప్‌కు మారింది. రెండు కాళ్లూ లేని అథ్లెట్ల కేటగిరీ టి62 లాంగ్‌జంప్‌లో రెండు వరల్డ్ రికార్డులు సృష్టించిన ఈ డచ్ ప్లేయర్ తొలిసారి ఈ విభాగంలో 6 మీటర్ల దూరాన్ని జంప్ చేసిన తొలి అథ్లెట్‌గా కూడా నిలిచింది. ఇదే జోరులో లాంగ్‌జంప్‌లోనూ రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణాలు ఫ్లోర్‌ను వెతుక్కుంటూ వచ్చాయి.ఒలింపిక్స్ పతకాలతో..లాంగ్‌జంప్‌కు మారక ముందు 2016 రియో ఒలింపిక్స్‌లో 100 మీ., 200 మీ. పరుగులో పాల్గొన్న ఫ్లోర్ పతకాలు సాధించడంలో విఫలమైంది. ఆ తర్వాత లాంగ్‌జంప్‌లో వరుసగా మూడు టోర్నీల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది. అయితే మెడల్ గెలవడమే లక్ష్యంగా 2020 టోక్యో పారాలింపిక్స్‌కు సిద్ధమైంది. ఏడాది పాటు కఠోర సాధన చేసి స్వర్ణంతో తన కలను నిజం చేసుకుంది. గత మూడేళ్లుగా తన ఆటలో అదే పదును కొనసాగించిన ఈ అథ్లెట్ 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ తన పతకాన్ని నిలబెట్టుకుంది. వరుసగా రెండో స్వర్ణాన్ని గెలుచుకొని సత్తా చాటింది. కమ్యూనికేషన్ సైన్సెస్ చదివిన ఫ్లోర్ ఇప్పుడు క్రీడాకారిణిగానే కాదు మోటివేషనల్ స్పీకర్‌గానూ తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తి పంచుతోంది. – మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం -
భారత విప్లవ ప్రతీక!
భారతదేశం గర్వించే వీర కిశోరం భగత్ సింగ్. నేటి పాకిస్తాన్లో ఉన్నపంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్ 27న జన్మించాడు. చిన్నతనంలో తన బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ... పట్టుబడకుండా ఉండేందుకు విదేశాలలో ఉండేవాడు. ఆ సమయంలో కంటనీరు పెట్టుకొనే చిన్నమ్మను చూసి ‘పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లే యులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ఉండేవాడు.గాంధీ, నెహ్రుల సారథ్యంలో నడుస్తున్న స్వాతంత్రోద్యమంలో చిన్ననాటి నుండే చురుకుగా పాల్గొంటూ వస్తున్న భగత్ సింగ్‌కు స్వాతంత్య్రం యాచిస్తే రాదనీ, శాసిస్తేనే వస్తుందని గ్రహించాడు. రష్యా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, గాంధీ కోరిన స్వాతంత్య్రం అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ముందు సోషలిస్టు సమాజం నిర్మించాలని తలంచి తను పనిచేస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను, హిందు స్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్‌గా మార్చాడు.బ్రిటిష్ వాళ్లు సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా నినదించే గొంతులు ఈ దేశంలో ఉన్నాయని తెలియచేసేందుకు కేంద్ర శాసనసభలో బాంబువేసి పారిపోకుండా ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లా ల’నే నినాదాలను చేశాడు భగత్ సింగ్. జలియన్ వాలాబాగ్, చౌరీచౌరా ఘటనలు భగత్ సింగ్‌లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తే; సైమన్ కమిషన్ పర్యటన సమయంలో దెబ్బలు తిన్న కారణంగా లాలా లజపతిరాయ్ మరణించడం ప్రతీకారేచ్ఛను కలిగించింది.భగత్ సింగ్‌ను బ్రిటిష్‌వాళ్లు ఉరితీసే కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి క్షమాభిక్ష కోసం బ్రిటిష్ వారికి ఉత్తరం రాశారు. తన మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదనే విశ్వాసం తనదనీ, అందువల్ల బ్రిటిష్ వాళ్లకు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలనీ కోరాడు భగత్. అదీ ఆ వీరుని దేశభక్తి! – జి. పవన్ కుమార్, బిజ్వార్ఇవి చదవండి: సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం -
అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం!
అందాలొలికే ఈ బొమ్మలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వీటిని పూర్తిగా పువ్వులు, ఆకులు, రెమ్మలతోనే రూపొందించినట్లు తెలుసుకుంటే, ‘సుందరం.. ‘సుమ’నోహరం’ అని ప్రశంసించక మానరు. కెనడాలో స్థిరపడిన జపానీస్ కళాకారుడు రాకు ఇనోయుయి రూపొందించిన ఈ ‘సుమ’నోహర కళాఖండాలు కొంతకాలంగా ‘ఆన్లైన్’లో హల్చల్ చేస్తున్నాయి. పూలు, ఆకులు, రెమ్మలను ఉపయోగించి, రాకు సృష్టిస్తున్న కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి.కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఉంటున్న రాకు ఈ పూల కళను 2017లో సరదా కాలక్షేపంగా మొదలుపెట్టాడు. తన ఇంటి పెరట్లో మొక్కల నుంచి రాలిపడిన గులాబీలు, ఇతర పూల రేకులు, వాటి ఆకులు వృథాగా పోతుండటంతో, వాటిని ఎలాగైనా సద్వినియోగం చేయాలని ఆలోచించాడు. తొలి ప్రయత్నంగా పూలరేకులు, కత్తిరించిన రెమ్మల ముక్కలను ఉపయోగించి కీచురాయి బొమ్మను తయారు చేశాడు. కీచురాయి బొమ్మ ఫొటోలను సోషల్ మీడియాలో పెడితే, విపరీతంగా స్పందన వచ్చింది. ఇక అప్పటి నుంచి రాకు వెనుదిరిగి చూసుకోలేదు. నిరంతర సాధనతో తన కళకు తానే మెరుగులు దిద్దుకుంటూ, పూల రేకులు, ఆకులు, రెమ్మలతో అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందే స్థాయికి ఎదిగాడు.పూర్తిగా సహజమైన పూలు, పూల రేకులు, ఆకులు, పూలమొక్కల గింజలు, రెమ్మలు, కొమ్మలు మాత్రమే ఉపయోగించి, కార్టూన్ క్యారెక్టర్లు, చిలుకలు, కొంగలు, గుడ్లగూబలు వంటి పక్షులు, పులులు, సింహాలు, జింకలు వంటి జంతువులు, సీతాకోక చిలుకల వంటి కీటకాల బొమ్మలను జీవకళ ఉట్టిపడేలా తయారు చేయడంలో రాకు తన ఏడేళ్ల ప్రస్థానంలో అపార నైపుణ్యం సాధించాడు.ఈ కళాఖండాలను రూపొందించడానికి గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ఒక్కోసారి రోజుల తరబడి ఓపికతో పని చేయాల్సి ఉంటుందని రాకు చెబుతున్నాడు. ఆన్లైన్లో రాకు పేరుప్రఖ్యాతులు పెరగడంతో ప్రముఖ కంపెనీలు ఆర్డర్లు ఇచ్చి మరీ అతడి చేత తమ కంపెనీల లోగోలను ప్రత్యేక సందర్భాల కోసం తయారు చేయించుకుంటున్నాయి. ఈ పూల కళాఖండాలు ఎక్కువకాలం ఉండవు. త్వరగానే వాడిపోయి, వన్నె కోల్పోతాయి. అందుకే రాకు వీటి సౌందర్యాన్ని తన ఫొటోల ద్వారా శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు. వృక్షశాస్త్రవేత్త అయిన రాకుకు చిన్నప్పటి నుంచి కళాభిరుచి కూడా ఉండటంతో అతడు ఈ కళలో అద్భుతంగా రాణిస్తున్నాడు. -
రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'?
‘అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ?’ అంటూ పెద్దగా కలవరిస్తూ మంచం మీద నుంచి ఉలికిపడి లేచి కూర్చుంది జూడీ. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి ఒంటిగంటైంది. వేగంగా మంచం దిగి, పక్కనే ఉన్న గదికి వెళ్లి, లైట్ వేసి, రోండా(రోమ్) మంచం వైపు చూసింది. అక్కడ రోండా లేకపోవడంతో కంగారు కంగారుగా పరుగున వెనుకకు వచ్చి, తన మంచం మీద గాఢనిద్రలో ఉన్న భర్తను కుదిపి కుదిపి లేపింది. అతడు నిద్రమత్తులోంచి తేరుకోకముందే, ‘మన.. మన రో..మ్.. కనిపించడం లేదు బాబీ!.. మ..మంచం మీద లేదు.. నాకు చా..చాలా భయంగా ఉంది’ అంటూ తడబడుతూనే ఏడ్చేసింది జూడీ. బాబీకి మైండ్ బ్లాక్ అయ్యింది. ‘ఏం మాట్లాడుతున్నావ్ జూడీ?’ అన్నాడు కంగారుగా.‘మన.. మన రోమ్ చచ్చిపోయింది. ఉన్నట్టుండి లోయలో పడిపోయింది. తనకి ఊ.. ఊపిరి ఆడటం లేదు. నా కళ్లముందే.. నా కళ్లముందే పడిపోయింది’ వణుకుతున్న స్వరంతో చెప్పింది జూడీ. బాబీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. పరుగున లేచి వెళ్లి, లైట్ ఆన్ చేశాడు. గడియారం వైపు చూసి, టేబుల్ మీద వాటర్ బాటిల్ అందుకుని, జూడీకి తాగించాడు. పక్కనే కూర్చుని, ఓదార్పుగా ‘జూడీ! మన రోమ్ ఇంట్లో ఎందుకుంటుంది? క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి నిన్నే వెళ్లింది కదా, రేపు ఉదయాన్నే వస్తానంది కదా?’ అని నిదానంగా గుర్తు చేశాడు. దాంతో జూడీ పూర్తిగా తేరుకుంది.అప్పటిదాకా బిడ్డ కోసం మెలితిరిగిన కన్నపేగు అదంతా పీడకల అని గుర్తించింది. అయినా తల్లి మనసు ఇంకా అల్లాడుతూనే ఉంది. ‘బా..బీ..! నాకు చాలా భయంగా ఉంది. నాకొచ్చింది కలే కాని, నా బిడ్డ(రోండా) ఏదో సమస్యలో ఉందని నా మనసు చెబుతోంది. అసలు తను ప్రాణాలతో ఉందా? ఇప్పుడే తనని చూడాలనుంది’ అంటూ ఏడ్చింది జూడీ. దాంతో బాబీ.. ‘పిచ్చిగా మాట్లాడకు. మన రోమ్‌కి ఏమీ కాదు. ఇప్పుడు టైమ్ చూడు, ఈ సమయంలో ఎక్కడికని వెళ్దాం? రేపు తనొస్తానన్న టైమ్‌కి రాకపోతే కచ్చితంగా మనమే వెళ్దాం సరేనా?’ అని నచ్చజెప్పాడు బాబీ.జూడీ, బాబీలకు చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి రోండాకి పంతొమ్మిదేళ్లు. చదువు పూర్తిచేసుకుని, మూడు నెలల క్రితమే ఉద్యోగం సంపాదించుకుంది. ‘ఆఫీస్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అటు నుంచి రాత్రికి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి, రేపు మధ్యాహ్నానికి వస్తా’ అని చెప్పి వెళ్లింది.ఉదయం 6 దాటేసరికి కాలింగ్ బెల్ మోగింది. జూడీ తలుపు తీసేసరికి ‘రోండా మీ అమ్మాయేనా?’ అడిగారు ఎదురుగా ఉన్న పోలీసులు. ‘అవును ఏమైంది?’ అంది జూడీ కంగారుగా. ‘మీ అమ్మాయి కారుకి యాక్సిడెంట్ అయ్యింది. ఆమె చనిపోయింది’ చెప్పాడు వారిలో ఒక అధికారి. జూడీకి గుండె ఆగినంత పనైపోయింది. ‘నో.. నో..!’ అంటూ అక్కడే ఉన్న వస్తువులన్నీ నేలకేసి కొట్టింది జూడీ. ‘నేను నమ్మను. నా బిడ్డకు ఏమీ కాదు. మీరు అబద్ధం చెబుతున్నారు. ఇది నా కల! నిజం కాదు’ అని అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. ఆ అరుపులకు లోపల నుంచి బాబీ పరుగున వచ్చి జూడీని పట్టుకున్నాడు. పోలీసులు మరోసారి అదే మాట చెప్పడంతో ఆ దంపతులు మార్చురీకి పరుగు తీశారు.పోస్ట్‌మార్టమ్‌లో మాత్రం రోండా బాడీలో బుల్లెట్ దొరికింది. కేవలం వెనుక సీట్లో కూర్చున్న వాళ్లే అలా కాల్చగలరని తేలింది. దాంతో యాక్సిడెంట్ కేసు కాస్త హత్య కేసుగా మారిపోయింది. కారు రోడ్డు పక్కకు ఒరిగినట్లు, డ్రైవర్ సీట్ వైపు డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లు, కారుకి కాస్త దూరంలో రోండా నేలమీద బోర్లా పడి ఉన్నట్లు ఆ రాత్రే రెండు గంటల సమయానికి గుర్తించారు పెట్రోలింగ్ పోలీసులు.అపరిచితులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని రోండా, తెలియని వారికి లిఫ్ట్ ఇచ్చే చాన్సే లేదని జూడీ, బాబీ నమ్మకంగా చెప్పారు. దాంతో రోండా పరిచయస్థులంతా విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో క్రిస్మస్ వేడుకల నుంచి రోండా ఎక్కడికి వెళ్లింది? ఎవరెవరిని కలసింది? ఇలా ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి పన్నెండున్నరకు తన స్నేహితురాలిని డ్రాప్ చేసిన రోండా.. పది మైళ్ల దూరంలో ఉన్న తన ఇంటికే ఒంటరిగా కారులో బయలుదేరిందని తేలింది. కారు, మృతదేహం రెండూ ఇంటికి అరమైలు దూరంలోనే దొరికాయి.అయితే ఆ రాత్రి అదే తోవలో వెళ్లిన ఒక సాక్షి ‘రోండా కారు దగ్గర ఒక నీలం కలర్ కారు చూశాను. అందులో ఇద్దరు యువకులు ఉన్నారు’ అని చెప్పాడు. మరో సాక్షి.. కారు ముందు వైపుకు.. రోండా వాలిపోవడం చూశానని, ఆమె పక్కనే ఓ యువకుడు ఉన్నాడని, అయితే అది క్రైమ్ సీన్ అనుకోలేదని, తాగిన మత్తులో ఉన్న ప్రేమజంటగా భావించి, ఆగకుండా వెళ్లిపోయానని చెప్పాడు. అంటే ఆ సమయానికే రోండా చనిపోయిందని, అప్పుడు కిల్లర్ రోండా పక్కనే ఉన్నాడని అధికారులకు అర్థమైంది. వెంటనే ఆ సాక్షుల అంగీకారంతో వారికి హిప్నాసిస్ టెస్ట్ చేసి, కిల్లర్స్‌లో ఒకడు ముదురు గోధుమరంగు జుట్టుతో, 5.10 అడుగుల ఎత్తు ఉంటాడని నిర్ధారించుకున్నారు. ఇక రోండా చిన్ననాటి స్నేహితుడు మైక్‌ని కూడా గట్టిగానే నిలదీశారు.నిజానికి రోండా చదువుల్లోనే కాదు, ఆటల్లోనూ ఫస్టే! ప్రతిదానిలోనూ దూసుకునిపోయే రోండా, తన మరణానికి నెల్లాళ్ల ముందు నుంచి చాలా వింతగా ప్రవర్తించిందట! ప్రతిదానికి భయపడటం, పగటిపూట కూడా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, రాత్రి సమయాల్లో మెలకువగా ఉండటం, అర్ధరాత్రి వేళ స్నానం చేయడం లాంటివి చేసేదట! సాధారణంగా ౖలñ ంగిక వేధింపులకు గురైనవారి ప్రవర్తన అలానే ఉంటుందని కొందరు సైకాలజిస్ట్‌లు.. అధికారులకు చెప్పారు.ఆ క్రిస్మస్ వేడుకలకు కూడా స్నేహితురాలు పట్టుబట్టడంతో రోండా బలవంతంగా వెళ్లిందని పేరెంట్స్ గుర్తు చేసుకున్నారు. ‘పెళ్లి అయిన వారిని ప్రేమించడం, వారితో రిలేష¯Œ షిప్లో ఉండటం తప్పా?’ అని రోండా తన తల్లిని పదేపదే అడిగేదట! స్నేహితులకు సలహా ఇవ్వడానికి అలా అడిగిందేమో అనుకుందట జూడీ. కానీ రోండా మరణం తర్వాత జూడీకి ‘రోండా జీవితంలో ఎవరైనా వివాహితుడు ఉన్నాడా? అతడే కిల్లరా?’ అనే అనుమానం మొదలైంది. ఇప్పటికీ జూడీ, బాబీ దంపతులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.1981 డిసెంబర్ 22, నార్త్ కరోలినాలోని మౌంటైన్ రోడ్లో ఆమె ఇంటికి అర మైలు దూరంలోనే హత్యకు గురైంది. నేటికీ హంతకులు ఎవరో తేలక ఈ కేసు మిస్టరీగానే మిగిలింది. అయితే సరిగ్గా రోండా ప్రాణం పోయే సమయానికే.. నిద్రలో ఉన్న తల్లి జూడీకి ఎలా తెలిసింది? అనేది కూడా మిస్టరీనే! – సంహిత నిమ్మనఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్!
మూడేళ్ల క్రితం.. కెన్యాలోని నైరోబీలో అండర్–20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరుగుతోంది. స్ప్రింట్స్ పోటీలకు ముందు ఒక కుర్రాడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. అంతకు మూడు నెలల క్రితం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ రిలేల్లో అతను మంచి ప్రదర్శన కనబరచాడు. క్రీడల్లో పెద్దగా గుర్తింపులేని ఆఫ్రికా దేశం బోత్స్వానా నుంచి వచ్చాడు. ప్రతిభనే నమ్ముకుంటూ ఒక్కోమెట్టు ఎక్కాడు.‘ఆఫ్రికా బోల్ట్’ అంటూ క్రీడాభిమానుల ఆశీస్సులు అందుకున్నాడు. ఊహించని వేగంతో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోయిన ఆ కుర్రాడు 21 ఏళ్ల వయసు వచ్చేసరికే వరల్డ్ ఫాస్టెస్ట్ అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకొని సత్తా చాటాడు. తమ దేశానికి ఈ మెగా క్రీడల చరిత్రలో తొలి పసిడి పతకాన్ని అందించాడు. రిలే పరుగులోనూ అతని వేగం వల్లే బోత్స్వానా దేశానికి మరో రజతమూ దక్కింది. అతని పేరే లెట్సిల్ టెబోగో.పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన కొద్ది రోజులకు ఒక కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు కొందరు టెబోగోను కలిసేందుకు బోత్స్వానాలోని అతని స్వస్థలం కాన్యేకు వచ్చారు. వారికి అతను తన సొంత పొలంలో పనిచేస్తూ కనిపించాడు. అదేదో ఫ్యాషన్ కోసమో సరదాగానో కాదు పూర్తిస్థాయి రైతులా శ్రమిస్తున్నాడు టెబోగో. ‘ఒలింపిక్స్ మెడల్ గెలిచినా, నా జీవనం మాత్రం ఇదే’ అని అతను చెప్పుకోవడం విశేషం. టెబోగో స్వర్ణంతో పారిస్ నుంచి తిరిగొచ్చాక బోత్స్వానా దేశం మొత్తం పండుగ చేసుకుంది. అతని విజయాన్ని సంబరంగా జరుపుకునేందుకు సెలవు ప్రకటించిన ఆ దేశాధ్యక్షుడు స్వయంగా వెళ్లి స్వాగతం పలకడంతో పాటు తాను కూడా డాన్స్ చేస్తూ తన ఆనందాన్ని ప్రదర్శించడం టెబోగో ఆట విలువను చూపింది.వరల్డ్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటి..నైరోబీ అండర్–20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత టెబోగో ఆగిపోలేదు. సరిగ్గా ఏడాది తర్వాత కొలంబియాలోని క్యాలీలో మళ్లీ ఈ టోర్నీ జరిగింది. అక్కడా గత ఏడాది ప్రదర్శనను పునరావృతం చేశాడు. మళ్లీ స్వర్ణం, రజతంతో మెరిశాడు. అంతే కాదు 100 మీటర్ల పరుగును 9.96 సెకన్లలో పూర్తిచేసి అండర్–20 స్థాయిలో ప్రపంచ రికార్డును సృష్టించడంతోపాటు కొద్దిరోజులకే తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. మూడు నెలల తర్వాత 9.94 సెకన్ల టైమింగ్‌తో అతని ఖాతాలో కొత్త రికార్డు నమోదైంది. అండర్–20 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 100 మీ., 200 మీ.లలో వరుసగా రెండుసార్లు పతకాలు గెలుచుకోవడంతో దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌తో అతడిని పోల్చటం మరింతగా పెరిగింది.ఒలింపిక్స్ విజయం దిశగా..సాధారణంగా క్రీడల్లో జూనియర్ స్థాయిలోని జోరునే సీనియర్ స్థాయిలోనూ కొనసాగించడం అంత సులువు కాదు. స్థాయి మారడం, పోటీతోపాటు కొత్తగా బరిలోకి దిగుతున్నట్లుగా ఉండే ఒత్తిడి యువ ఆటగాళ్లను గందరగోళానికి గురిచేస్తాయి. టెబోగో కూడా అలాంటి స్థితినే ఎదుర్కొన్నాడు. అండర్–20 విజయాల ఉత్సాహంతో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బరిలోకి దిగిన అతను తొలి ప్రయత్నంలో తడబడ్డాడు. ఓటమి నుంచి నేర్చుకునే స్వభావమున్న అతను సరిగ్గా ఏడాది తర్వాత 2023 బుడాపెస్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తానేంటో చూపించాడు.100 మీటర్ల పరుగులో రజత పతకం గెలుచుకోవడంతో పాటు 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించాడు. ఇవి వరల్డ్ అథ్లెటిక్స్‌లో అతని స్థానాన్ని సుస్థిరం చేశాయి. పారిస్ ఒలింపిక్స్ ఫేవరెట్లలో ఒకడిగా నిలిపాయి. అయితే దురదృష్టవశాత్తు 100 మీటర్ల పరుగులో ఫైనల్ వరకు చేరగలిగినా అతని 9.86 సెకన్ల టైమింగ్ టెబోగోకు పతకాన్ని అందించలేకపోయింది. నిరాశ చెందలేదు. అంతే పట్టుదలగా మూడు రోజుల తర్వాతి 200 మీటర్ల పరుగుకు సన్నద్ధమయ్యాడు. 19.46 సెకన్ల టైమింగ్ నమోదుచేసి చాంపియన్‌గా నిలిచాడు. సగర్వంగా తన జాతీయ పతాకాన్ని ప్రదర్శించాడు.అమ్మ కోసం గెలిచి..‘నువ్వు ఎలాగైనా ఒలింపిక్స్ పతకం గెలవాలని అమ్మ మళ్లీ మళ్లీ చెప్పింది. ఆమె కోసమే ఈ పరుగు. ఆమెకే ఈ పతకం అంకితం!’ 200 మీటర్ల రేసు గెలిచాక టెబోగో భావోద్వేగంతో చెప్పిన మాటలవి. విజయం సాధించాక అతని కన్నీళ్లను చూస్తే ఆ గెలుపు ప్రత్యేకత కనిపిస్తుంది. టెబోగో ఈ స్థాయికి చేరడంలో అతని తల్లి ఎలిజబెత్ సెరాతివా పాత్ర ఎంతో ఉంది. ఆటలో ఓనమాలు నేర్పించడంతోపాటు అతను ఒక బలమైన అథ్లెట్‌గా ఎదగడంలో ఆమె అన్ని రకాలుగా అండగా నిలిచింది. జూనియర్ స్థాయిలో విజయాలతో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచే వరకు కూడా అమ్మ తోడుగా ఉంది.అయితే అతను ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యే సమయంలోనే క్యాన్సర్‌తో 44 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. ఒలింపిక్స్‌లో 200 మీటర్ల ఈవెంట్లో చేతివేలి గోర్లపై తల్లి పేరు, తన షూస్‌పై తల్లి పుట్టిన తేదీ రాసుకొని అతను బరిలోకి దిగాడు. చనిపోయిన తేదీ రాయాలంటే తనకు ధైర్యం సరిపోలేదని చెప్పాడు. విజయానంతరం ఆ షూస్‌ను కెమెరాకు చూపిస్తూ టెబోగో కన్నీళ్లపర్యంతమయ్యాడు. 21 ఏళ్ల వయసులోనే ట్రాక్‌పై అద్భుతాలు చేస్తున్న ఈ బోత్స్వానా స్టార్ రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించగలడనడంలో ఎలాంటి సందేహం లేదు. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ! -
జ్యూల్ థీఫ్.. సేల్స్ గర్ల్ శ్రమ!
‘వెల్ డన్! నీ సీనియర్స్‌ని బీట్ చేసి.. శాలరీ కన్నా డబుల్ అమౌంట్‌ని ఇన్సెంటివ్‌గా తీసుకుంటున్నావ్.. కంగ్రాట్స్’ అని ప్రశంసిస్తూ ఆమె చేతిలో ఓ ఎన్వలప్ పెట్టాడు మేనేజర్.‘థాంక్యూ సర్’ అని వినమ్రంగా బదులిచ్చి, బయటకు వచ్చింది. ఆమెకోసం బయట వెయిట్ చేస్తున్న కొలీగ్స్ ‘పార్టీ ఇస్తున్నావ్ కదా!’ అంటూ ఆమెను చుట్టుముట్టారు. కుడిచేతితో ఆ ఎన్వలప్ కొసను పట్టుకుని మరో చివరను ఎడమ అరచేతిలో కొడుతూ ‘ఈ డబ్బు పార్టీ కోసం కాదు. నా ఫస్ట్ అసైన్మెంట్ జ్ఞాపకంగా దాచుకోడానికి’ అన్నది తనకు మాత్రమే వినిపించేలా! ‘ఏం సణుగుతున్నవ్ పిల్లా?’ వేళాకోళమాడింది ఆ గుంపులోని ఓ కొలీగ్. ‘ఈ మొహాలకు పార్టీనా.. అని అనుకుంటుందేమోలేవే’ అంది ఇంకో కొలీగ్. ‘అనుకోదా మరి.. ఫ్లూయెంట్ ఇంగ్లిష్, హిందీతో కస్టమర్స్‌ని కన్విన్స్ చేస్తూ తన సెక్షన్ జ్యూల్రీ సేల్స్‌ని పెంచిన ఆమె కాన్ఫిడెన్స్ ఎక్కడా.. ప్రతిదానికి భయపడుతూ ఇన్ఫీరియర్గా ఉండే మీరెక్కడా!’ అన్నాడు సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ‘అయ్యో.. అలా ఏం కాదన్నా! ఫస్ట్ శాలరీ.. వెరీ ఫస్ట్ ఇన్సెంటివ్ కదా.. దీన్ని మా ఇంట్లో వాళ్ల కోసమే ఖర్చుపెడదామనుకుంటున్నా!’ అందామె.ఆ సిటీలోనే అతిపెద్ద జ్యూల్రీ షాప్ అది. దానికున్న మూడు బ్రాంచెస్ని వరుసగా యజమాని ముగ్గురు కొడుకులు, కార్పొరేట్ ఆఫీస్‌ని యజమాని చూసుకుంటున్నారు. ఆమె మెయిన్ బ్రాంచ్‌లో పనిచేస్తోంది. నెల కిందటే జాయిన్ అయింది. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్‌తో నెల రోజులకే సీనియర్స్ కన్నా ఇంపార్టెన్స్‌ని సంపాదించుకుంది.మరో పదిహేను రోజులకు.. ఆ ఏటికే మేటైన అమ్మకాన్నొకటి అందించిందామె! మేనేజ్మెంట్ ఖుషీ అయిపోయి ఇంకో ఇన్సెంటివ్నిచ్చింది. వర్కింగ్ అవర్స్‌లో సెల్ ఫోన్‌ను క్యారీ చేసే అవకాశాన్ని కూడా! తర్వాత వారంలో మరో బిగ్ సేల్నిచ్చింది. ఈసారి మేనేజ్మెంట్ ఆమెను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోట్ చేసి.. క్యాష్, జ్యూల్రీ, గోల్డ్ బిస్కట్స్, డైమండ్స్ లాకర్స్ యాక్సెస్నిచ్చింది. అంతేకాదు ఆ షాప్ యజమాని ఇంట్లో జరిగే ఫంక్షన్లకూ ఆమెను పిలవసాగింది.. కుటుంబ సభ్యులకు సాయమందించడానికి. స్టాఫ్ అంతా ముక్కున వేలేసుకున్నారు.. ‘ఎంత ఎఫిషియెంట్ అయితే మాత్రం అంత నెత్తినపెట్టుకోవాలా?’ అని! ఎవరెలా కామెంట్ చేసుకున్నా యాజమాన్యానికి మాత్రం ఆమె ‘యాపిల్ ఆఫ్ ది ఐ’ అయింది. తరచుగా ఆమెను అన్ని బ్రాంచ్‌లు తిప్పుతూ అక్కడున్న సేల్స్ స్టాఫ్‌కి ఆమెతో ట్రైనింగ్ ఇప్పించసాగింది. తనకున్న చొరవతో కార్పొరేట్ ఆఫీస్‌లోని కీలకమైన విషయాల్లోనూ నేర్పరితనం చూపించి, ఆ బాధ్యతల్లోనూ ఆమె పాలుపంచుకోసాగింది. అలా చేరిన రెణ్ణెళ్లకే ఆ షాప్ ఆత్మను పట్టేసింది. ప్రతి మూలనూ స్కాన్ చేసేసింది.ఒక ఉదయం.. పదిన్నరకు ఎప్పటిలాగే ఆ జ్యూల్రీ షాప్ అన్ని బ్రాంచ్‌లూ తెరుచుకున్నాయి. కార్పొరేట్ ఆఫీస్ కూడా. అన్నిచోట్లా ఒకేసారి దేవుడికి దీపం వెలిగిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ నాలుగు చోట్లతోపాటు ఆ జ్యూల్రీ షాప్ యజమాని ఇంటికీ ఐటీ టీమ్స్ వెళ్లాయి. మెయిన్ బ్రాంచ్‌లో ఆమె సహా స్టాఫ్ అంతటినీ ఓ పక్కన నిలబడమన్నారు. సోదా మొదలైంది. ఆమె నెమ్మదిగా ఫోన్ తీసి స్క్రీన్ లాక్ ఓపెన్ చేయబోయింది. అది గమనించిన ఐటీ టీమ్‌లోని ఓ ఉద్యోగి గబుక్కున ఆమె ఫోన్ లాక్కుని, పూజ గదిలా ఉన్న చిన్న పార్టిషన్లోకి వెళ్లాడు.ఆ షాప్‌కి సంబంధించి రెయిడ్ చేసిన అన్ని చోట్లా దాదాపు అయిదు గంటలపాటు సోదాలు సాగాయి. పెద్దమెత్తంలో డబ్బు, బంగారం, డైమండ్స్ దొరికాయి. ఆ ఏడాది అతిపెద్ద రెయిడ్ అదే అనే విజయగర్వంతో ఉంది ఐటీ స్టాఫ్! ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని, ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేయసాగారు. మెయిన్ బ్రాంచ్‌లో కూడా అంతా పూర్తయి, ఆ టీమ్ ఆఫీసర్ ఫైనల్ కాల్ చేయబోతుండగా.. కౌంటర్ దగ్గర నుంచి మేనేజర్ గబగబా ఆ బ్రాంచ్ చూసుకుంటున్న యజమాని పెద్దకొడుకు దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే అతను అలర్ట్ అయ్యి.. ‘ఎక్స్క్యూజ్ మి సర్..’ అంటూ ఐటీ టీమ్ ఆఫీసర్ని పిలిచాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకునే ‘యెస్..’ అంటూ చూశాడు. ‘ఒక్కసారి ఇలా రండి’ అంటూ కౌంటర్ దగ్గరకు నడిచాడు. డయల్ చేసిన కాల్ని కట్ చేస్తూ ఫాలో అయ్యాడు ఆఫీసర్. మేనేజర్ వంక చూశాడు యజమాని పెద్ద కొడుకు. కౌంటర్ టేబుల్ మీదున్న కంప్యూటర్ స్క్రీన్‌లో అంతకు కొన్ని క్షణాల ముందే రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ప్లే చేశాడు మేనేజర్. పూజ గదిలో సోదా చేస్తున్న ఐటీ ఉద్యోగి ఒక సీక్రెట్ సేఫ్‌లో దొరికిన డైమండ్స్లోంచి ఒక డైమండ్‌ని జేబులో వేసుకోవడం కనిపించింది అందులో. చూసి నివ్వెరపోయాడు ఆఫీసర్. ఏం జరుగుతోందో అంచనా వేసుకుంటున్న ఆ ఉద్యోగి మొహంలో నెత్తరు చుక్క లేదు.‘సర్.. మీడియాను పిలవమంటారా?’ స్థిరంగా పలికాడు యజమాని పెద్ద కొడుకు. వెంటనే ఆ ఐటీ ఆఫీసర్ మిగిలిన చోట్లలో ఉన్న టీమ్స్‌కి ఫోన్ చేసి ‘రెయిడ్ క్యాన్సల్.. అంతా వదిలేసి వచ్చేయండి’ అన్న ఒక్క మాట చెప్పి గబగబా బయటకు నడిచాడు. అనుసరించింది టీమ్. వాళ్ల వంకే అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది ఆమె!పదేళ్ల కిందట జరిగిన రెయిడ్ ఇది. ఆమె ఐటీ న్యూ ఎంప్లాయీ. ఆ షాప్స్, ఆ యజమాని ఇంటికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి అందులో సేల్స్ గర్ల్‌గా చేరింది. చాకచక్యంతో ఫోన్ యాక్సెస్‌ను సంపాదించుకున్న ఆమె, డీటెయిల్స్ అన్నిటినీ స్కాన్‌చేసి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్కి పంపేది. వాటి ఆధారంగానే రెయిడ్ చేశారు. ఫోన్ చూస్తున్నట్టు నటించడం, దాన్ని లాక్కోవడం అంతా కూడా ఐటీ వాళ్ల డ్రామా, యాజమాన్యానికి అనుమానం రాకుండా! అంతా సవ్యంగానే జరిగేదే.. ఆ ఉద్యోగికి సేఫ్‌లోని డైమండ్స్‌ని చూసి ఆశ పుట్టకపోయుంటే! ఆ పార్టీషన్లో సీసీ కెమెరా ఉందన్న విషయాన్ని మరచిపోయి గబుక్కున డైమండ్‌ని జేబులో వేసుకుని దొరికిపోయాడు. అంత పెద్ద రెయిడ్ క్యాన్సల్ అవడానికి కారణమయ్యాడు.( ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు , వ్యక్తుల పేర్లు ఇవ్వలేదు. ప్రతివారం ఇలాంటి ఆసక్తికర కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.) – శరాది -
అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్!
ఉన్నది ఒకటే జీవితం! దాన్ని జీతానికి తాకట్టు పెడితే ఆర్జిస్తున్నామనే ఆనందం కూడా మిగలదు! ఉద్యోగం వేతనాన్నే కాదు చేస్తున్న పని పట్ల సంతృప్తినీ ఇవ్వాలి.. ఆస్వాదించే సమయాన్నుంచాలి.. మన జీవితాన్ని మనకు మిగల్చాలి! ఇది జెన్ జెడ్ ఫిలాసఫీ! అందుకే వాళ్లు రెజ్యుమే ప్రిపేర్ చేయట్లేదు. పోర్ట్‌ఫోలియో కోసం తాపత్రయపడుతున్నారు. వర్క్ స్టయిల్ని మార్చేస్తున్నారు. ఆఫీస్ డెకోరమ్ నుంచి ఫ్రేమ్ అవుట్ అవుతున్నారు. ముందుతరాల ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. మేనేజ్మెంట్కి ఆప్షన్ లేకుండా చేస్తున్నారు.‘చూసేవాళ్లకు కేర్ఫ్రీగా కనిపిస్తున్నామేమో కానీ చేసే పని పట్ల, మా ఫ్యూచర్ పట్ల క్లారిటీతోనే ఉంటున్నాం. జాబ్ అండ్ జిందగీ, ప్యాకేజ్ అండ్ ఫ్యాషన్ల మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసు మాకు. అందుకే మేము మా స్కిల్‌ని నమ్ముకుంటున్నాం.. లాయల్టీని కాదు’ అంటోంది జెన్ జెడ్ ప్రతినిధి, బిజినెస్ అనలిస్ట్ చిలుకూరు సౌమ్య.నిజమే.. తమకేం కావాలి అన్నదాని పట్ల జెన్ జెడ్‌కి చాలా స్పష్టత ఉంది. వాళ్లు దేన్నీ దేనితో ముడిపెట్టట్లేదు. దేనికోసం దేన్నీ వదులుకోవట్లేదు. నైపుణ్యం కంటే విధేయతకే ప్రాధాన్యమిస్తున్న సంస్థల్లో పని వాతావరణాన్ని మార్చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న నాటి నుంచి రిటైర్మెంట్ వరకు ఒకే సంస్థలో ఉద్యోగాన్నీడ్చే ముందు తరాల మనస్తత్వాన్ని ఔట్ డేటెడ్‌గా చూస్తున్నారు. తక్కువ సర్వీస్‌లో వీలైనన్ని జంప్‌లు, వీలైనంత ఎక్కువ ప్యాకెజ్ అనే ఐడియాను ఇంప్లిమెంట్ చేస్తున్నారు.వాళ్ల రూటే వేరు..సంప్రదాయ జీవన శైలినే కాదు ట్రెడిషనల్ వర్క్ స్టయిల్‌నూ ఇష్టపడట్లేదు జెన్ జెడ్. ‘పదహారు.. పద్దెనిమిదేళ్లు చదువు మీద పెట్టి, తర్వాత లైఫ్ అంతా 9 టు 5 పనిచేస్తూ, కార్పొరేట్ కూలీలుగా ఉండటం మావల్ల కాదు’ అంటున్నారు బెంగళూరుకు చెందిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ‘జెన్ జెడ్.. మాలాగా కాదు. వాళ్లు సంస్థ ప్రయోజనాల కోసం చెమటోడ్చట్లేదు. అలాంటి షరతులు, డిమాండ్లకూ తలొగ్గట్లేదు. వాళ్లకు పనికొచ్చే, వాళ్ల సామర్థ్యాన్ని నిరూపించుకునే కంప్యూటర్ ప్రోగ్రామింగ్, రైటింగ్, డిజైన్ లాంటి టాస్క్స్నే తీసుకుంటున్నారు. అంతే నిర్మొహమాటంగా గుర్తింపును, కాంప్లిమెంట్స్నూ కోరుకుంటున్నారు. కొలీగ్స్‌తో మాట్లాడినంత క్యాజువల్‌గా సంస్థ డైరెక్టర్‌తో మాట్లాడేస్తున్నారు. సీనియర్స్, సుపీరియర్స్ని ‘సర్’ అనో, ‘మేడమ్’ అనో పిలవడం వాళ్ల దృష్టిలో ఫ్యూడల్, ఓల్డ్ ఫ్యాషన్డ్. పేరుతో పిలవడాన్ని అప్ డేటెడ్‌గా, ఈక్వల్‌గా ట్రీట్ చేస్తున్నారు’ అని చెబుతున్నారు మిలేనియల్ తరానికి చెందిన కొందరు బాస్‌లు. దీన్నిబట్టి జెన్ జెడ్‌కి ఆఫీస్ మర్యాదల మీదా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు యజమాని – ఉద్యోగి సంబంధాన్ని సింపుల్‌గా ‘మీకు అవసరమైన పని చేసిపెడుతున్నాం.. దానికి చార్జ్ చేసిన డబ్బును తీసుకుంటున్నాం’ అన్నట్లుగానే పరిగణిస్తున్నారు తప్ప ఎలాంటి అటాచ్మెంట్లు, సెంటిమెంట్లకు చోటివ్వట్లేదు.40 కల్లా..చేసే ఉద్యోగం, జీతం, పని వేళలు, ఆఫీస్ వాతావరణమే కాదు ఎన్నాళ్లు పనిచేయాలనే విషయంలోనూ జెన్ జెడ్‌కి ఒక అవగాహన ఉంది. తర్వాత ఏం చేయాలనేదాని పట్లా ఆలోచన ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘జీవిక కోసం జీతం.. ప్యాషన్ కోసం జీవితం’ అని నమ్ముతున్నారు వాళ్లు. 35– 40 ఏళ్ల కల్లా రిటైర్మెంట్ అంటూ పెద్దవాళ్లు విస్తుపోయేలా చేస్తున్నారు. ‘మేము 60 ఏళ్లకు రిటైరైన తర్వాత కూడా ఏదో ఒక జాబ్ చేయాలని చూస్తుంటే మా పిల్లలేమో 35 – 40 ఏళ్ల వరకే ఈ ఉద్యోగాలు.. తర్వాత అంతా మాకు నచ్చినట్టు మేం ఉంటామని చెబుతున్నారు. ఆశ్చర్యమేస్తోంది వాళ్ల ధైర్యం, భరోసా, నమ్మకం చూస్తుంటే’ అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. 40 ఏళ్ల కల్లా రిటైరైపోయి తమకు నచ్చిన రంగంలో సెకండ్ కెరీర్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. దీనికోసం ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచే అన్నిరకాల ప్రణాళికలు వేసుకుంటున్నారు. పొదుపుతో జాగ్రత్తపడుతున్నారు. సిప్‌లు,షేర్లలో మదుపు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలతో అప్డేట్ అవుతున్నారు. తమ లక్ష్యాలకు సరిపోయే ప్యాకేజ్ని కోట్ చేస్తూ అర్థిక సుస్థిరత కోసం ప్రయత్నిస్తున్నారు.రెజ్యుమే టు పోర్ట్‌ఫోలియో..ఒక వ్యక్తి కొన్నాళ్లు ఓడరేవులో పని చేస్తాడు. అక్కడి నుంచి చెరుకు తోటలకు కూలీగా వెళ్తాడు. ఇంకొన్నాళ్లు బడిలో పాఠాలు చెబుతాడు. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్‌గా కనపడతాడు. మరికొన్నాళ్లకు ఇంకో కొలువును చేపడతాడు. ఆఖరికి ఏ సైంటిస్ట్గానో, రాజకీయవేత్తగానో, రచయితగానో తన మజిలీ చేరుకుంటాడు. ఇలాంటివన్నీ సాధారణంగా పాశ్చాత్య నవలలు, ఆటోబయోగ్రఫీలు, సినిమాల్లో కనపడతాయి. కానీ ఈ ధోరణిని ఇప్పుడు జెన్ జెడ్‌లోనూ కనపడుతోంది. 60 ఏళ్లకు రిటైర్మెంట్నే కాదు రిటైర్మెంట్ వరకు ఒకే కొలువు అనే కాన్సెప్ట్‌నూ ఇష్టపడట్లేదు వాళ్లు. కెరీర్లో రెండుమూడు జంప్ల తర్వాత ఆఫీస్‌లో కూర్చొని చేసే జాబ్ కన్నా ఫ్రీలాన్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఆదాయం పెరగడమే కాక, మనసుకు నచ్చిన పనిచేసుకునే అవకాశమూ దొరుకుతోంది అంటున్నారు.వివిధ రంగాల్లోని చాలామంది జెన్ జెడ్ ఉద్యోగులు పలు స్టార్టప్స్‌కి పనిచేస్తున్నారు, స్టార్టప్స్ నడుపుతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. వ్లాగర్స్, యూట్యూబర్స్‌గా కొనసాగుతున్నారు. అడ్వర్టయిజ్మెంట్ కాపీ రైటర్స్‌గా, ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌కి క్యురేటర్స్గా సేవలందిస్తున్నారు. యోగా టీచర్స్‌గా, అనువాదకులుగా, కేర్ టేకర్స్‌గా పనిచేస్తున్నారు. వాయిస్ ఓవర్ చెబుతున్నారు. డిస్కవరీ, జాగ్రఫీ, యానిమల్ ప్లానెట్ లాంటి చానళ్ల కోసం పనిచేస్తున్నారు. డాక్యుమెంటరీలకు స్క్రిప్ట్స్ రాస్తున్నారు. ఎడిటింగ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ అందిస్తున్నారు. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైన్, మోడలింగ్‌లో ఉన్నారు. ఐడియా బ్యాంక్‌ని నిర్వహిస్తున్నారు. ఇలా ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో.. వైవిధ్యమైన పని అనుభవాలతో రెజ్యుమే ప్లేస్‌లో పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసుకుంటున్నారు. డబ్బుతోపాటు జాబ్ శాటిస్ఫాక్షన్ను పొందుతున్నారు.ఫిన్‌ఫ్లుయెన్సర్స్..40 ఏళ్లకే రిటైరై.. సెకండ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన వాళ్లు, రకరకాల ఉద్యోగాలతో ఫ్రీలాన్స్ చేçస్తున్న వాళ్లు ఆర్థిక క్రమశిక్షణలోనూ ఆరితేరుతున్నారు. పలు స్టార్టప్స్‌లో, సేవల రంగంలో పెట్టుబడులు పెడుతూ ఫిన్ఫ్లుయెన్సర్స్గా మారుతున్నారు.ఈ ధోరణికి కారణం.. ఇంటర్నెట్, ఏఐ లాంటి ఫాస్ట్‌మూవింగ్ టెక్నాలజీ, కరోనా పరిస్థితులు .. కెరీర్, ఆఫీస్ వర్క్‌కి సంబంధించి ఎన్నో మార్పులను తెచ్చాయి. అవి జెన్ జెడ్‌ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. వారి ఆలోచనా విధానాన్ని మారుస్తున్నాయి. ఈ మధ్య చోటుచేసుకున్న రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, తత్ఫలితంగా ఏర్పడ్డ ఆర్థికమాంద్యం, ఉద్యోగాల కోత వంటి పరిణామాలు కూడా ఆ ధోరణిని కొనసాగేలా చేస్తున్నాయి. దీనికి పేరెంటింగ్నూ మరో కారణంగా చూపుతున్నారు సామాజిక విశ్లేషకులు. ఇంజినీరింగ్, మెడిసిన్ తప్ప ఇంకో చదువు లేదు, మరో కెరీర్ కెరీర్ కాదనే పెంపకమూ ఫ్రీలాన్సింగ్, అర్లీ రిటైర్మెంట్ ట్రెండ్‌కి ఊతమవుతోందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.జెన్ జెడ్ ఫ్రీలాన్స్ వర్కింగ్ ట్రెండ్ మీద అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ‘అప్‌వర్క్ ఆన్లైన్ ఫ్రీలాన్స్ నెట్వర్కింగ్’ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. అనుగుణమైన పనివేళలు, ఆదాయ భరోసా ఉండటం వల్లే వాళ్లు ఏ రంగంలోనైనా ఫ్రీలాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. ఎక్కువమంది కోవిడ్ చరమాంకం నుంచి ఈ ఫ్రీలాన్స్ వర్క్ కల్చర్‌లో కొనసాగుతున్నారట. వాళ్లంతా వారానికి 40 గంటలు, పలురకాల పనుల్లో ఫ్రీలాన్స్ చేస్తున్నారు. కొందరేమో పనిచోట సీనియర్స్– జూనియర్స్, కుల, మత, జాతి, లింగ వివక్షను భరించలేక, ఆ వాతావరణం నుంచి దూరంగా ఉండటానికి ఫ్రీలాన్స్ని ఎంచుకున్నట్లు చెప్పారు. మరికొందరు వ్యక్తిగత జీవితం తమ చేతుల్లోనే ఉంటుందని, సొంతంగా ఎదిగే వీలుంటుందని ఫ్రీలాన్స్ చేస్తున్నట్లు తెలిపారు. టిక్‌టాక్ నిషేధం తర్వాత చాలామంది క్రియేటర్స్‌కి ఇన్స్టాగ్రామ్ ఓ ప్రత్యామ్నాయ వేదికగా మారడంతో వాళ్లంతా మళ్లీ ఫ్రీలాన్స్కి మళ్లారు. మైక్రోసాఫ్ట్, లింక్డిన్ డేటా ప్రకారం జెన్ జెడ్ ఫ్రీలాన్సర్స్.. సంస్థలు ఇచ్చే శిక్షణ మీద ఆధారపడకుండా సొంతంగా శిక్షణ తీసుకుని ఏఐ వంటి అధునాతన సాంకేతిక సౌకర్యాలను చాలా చక్కగా వాడుకుంటున్నారు. మిలేనియల్స్ మాదిరి జెన్ జెడ్.. లాప్‌టాప్‌ను, కంప్యూటర్ను ఎక్స్ట్రా ఆర్గాన్‌గా మోయట్లేదు. ఆఫీస్‌ను మొదటి ఇల్లుగా చేసుకోవట్లేదు. ఉన్న చోటు నుంచే తమ దగ్గరున్న డివైస్లోంచే పనిచేసుకుంటున్నారు.. ఆడుతూ.. పాడుతూ.. హ్యాపీగా! పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్నీ జెన్ జెడ్‌కి ఫ్రీలాన్సింగ్ ఇచ్చేలా కొందరు బిజినెస్ లీడర్లు ముందుకు వస్తున్నారు. ఆ దిశగా కొన్ని సంస్థలూ ఆలోచిస్తున్నాయి.ఉరుకులు, పరుగులు నచ్చక..చదువైపోయిన వెంటనే అమెజాన్‌లో జాబ్ వచ్చింది. 9 టు 5 వర్క్ వల్ల పర్సనల్‌గా నేను బావుకుంటున్నదేమీ లేదని రియలైజ్ అయ్యాను. అందుకే లాస్టియర్ జాబ్ మానేసి ఫ్రీలాన్సర్‌గా మారాను. దీనివల్ల డబ్బుతో పాటు జాబ్ శాటిస్ఫాక్షన్ కూడా దొరుకుతోంది. అంతేకాదు చుట్టుపక్కలవాళ్లకు తోచిన సాయం చేయగలుగుతున్నాను. నాకు ట్రావెల్, మ్యూజిక్ అంటే ఇష్టం. ఇప్పుడు టైమ్ నా చేతిలో ఉంటోంది కాబట్టి, మ్యూజిక్ షోస్ చేసుకుంటున్నాను. నాకు నచ్చిన చోటికి వెళ్తున్నాను. – కార్తిక్ సిరిమల్ల, హైదరాబాద్డబ్బును కాదు టైమ్‌ని చేజ్ చేస్తోందిజర్మనీలో మాస్టర్స్ చేసి, అక్కడే మంచి జాబ్ కూడా సంపాదించుకున్నాను. అయినా హ్యాపీనెస్ లేదు. ఆఫీస్‌లో అన్నేసి గంటలు చేసిన వర్క్‌కి ఎండ్ ఆఫ్ ద డే అంతే ఔట్పుట్ కనిపించలేదు! అంతే శ్రమ నాకు నచ్చిన దాని మీద పెడితే ఆ శాటిస్ఫాక్షనే వేరు కదా అనిపించింది! అందుకే ఇండియాకు వచ్చేసి, థీమ్ రెస్టరెంట్ పెట్టాను. ఆన్లైన్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాను. ఫ్యూచర్లో కొంతమంది ఫ్రెండ్స్‌మి కలసి మాకు నచ్చిన ఓ పల్లెలో కొంచెం ల్యాండ్ కొనుక్కొని మినిమలిస్టిక్ లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటున్నాం. మా జెనరేషన్ డబ్బును చేజ్ చేయట్లేదు. టైమ్‌ని చేజ్ చేస్తోంది. – వుల్లి సృజన్, హైదరాబాద్టాక్సిక్ వాతావరణం..యూకేలో ఏంబీఏ చేశాను. కొన్ని రోజులు హెచ్ఆర్ జాబ్‌లో ఉన్నాను. కానీ ఆఫీస్‌లోని టాక్సిక్ వాతావరణం నచ్చక వదిలేశాను. నాకు ముందు నుంచీ ఫ్యాషన్, బ్యూటీ మీద ఇంట్రెస్ట్. అయితే జాబ్ వదిలేయగానే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. నాకు బ్యూటీపార్లర్ పెట్టాలనుందని చెప్పాను. పెళ్లి ఖర్చులకు ఎంతనుకున్నారో అందులో సగం నా బిజినెస్‌కి హెల్ప్ చేయమని అడిగాను. ఏడాదిలో పికప్ కాకపోతే పెళ్లికి ఓకే అనాలనే షరతు మీద డబ్బిచ్చారు నాన్న. ఇంకొంత లోన్ తీసుకుని పార్లర్ అండ్ స్పా పెట్టాను. ఏడాదిన్నర అవుతోంది. మంచిగా పికప్ అయింది. – ప్రత్యూష వావిలాల, కరీంనగర్. -
Pooja Bedi: ప్రతి విషాదం.. నన్ను దృఢం చేసింది!
సాక్షి, సిటీబ్యూరో, రాయదుర్గం: నా జీవితంలో చోటుచేసుకున్న ప్రతి విషాదం నన్ను దృఢంగా చేసిందని ప్రముఖ నటి పూజా బేడీ అన్నారు. గచ్చిబౌలో గురువారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమె కాసేపు మీడియాతో ముచ్చటించారు. చాలా తెలుగు సినిమాల్లో నటించాను. మోహన్‌బాబు నుంచి జూ.ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల వరకూ అనేక సినిమాల్లో నటించాను.హైదరాబాద్ షూటింగ్ ప్రదేశాలను ఎంతగానో ఎంజాయ్ చేశాను. చారి్మనార్ గల్లీల్లో తిరిగాను, గాజుల దుకాణాలు ఆకట్టుకుంటాయి. స్థానిక పర్యాటక ప్రాంతాలను సందర్శించాను. ప్రత్యేకించి హైదరాబాద్ ధమ్ బిర్యానీకి పెద్ద ఫ్యాన్‌ను. అలాగే సలాడ్ కూడా ఇష్టం. వివిధ సందర్భాల్లో వచి్చనపుడు బిర్యానీతో పాటు హలీం తినడానికి ఇష్టపడతాను. హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లే సమయంలో పెద్ద పెద్ద బాక్సుల్లో బిర్యానీ పార్శిల్స్ వచ్చేవి. తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవడం ఇష్టం అని తెలిపారు. అంతకు ముందు ఎఫ్ఐసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) గచి్చబౌలి చాప్టర్ సత్వ నాలెడ్జ్ సిటీలో ‘లిమిటేషన్ టు లిబరేషన్ అండ్ అన్‌లాక్ యువర్ ఇన్నర్ స్ట్రెంక్త్’ అనే అంశంపై ఫిల్మ్ స్టార్, వెల్నెస్ ఎవాంజెలిస్ట్ పూజా బేడితో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ ఛైర్పర్సన్ ప్రియా గజ్దర్, ఫ్లో సభ్యులు పాల్గొన్నారు.నేనెప్పుడూ ఏడవలేదు..విద్యార్థి దశలో నేను తరగతిలో ఫస్ట్ ఉండేదాన్ని. సినిమాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదు. మా అమ్మ మంచి డ్యాన్సర్. ఈ ఫీల్డ్‌లోకి వచ్చాక ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. గత కొన్నేళ్లుగా నా కుటుంబంలో ప్రతి ఆరు నెలలకూ చెడు వార్త వినాల్సి వచ్చింది. అమ్మమ్మ చనిపోయింది. నాకు ఇష్టమైన కుక్క మృతి చెందింది. తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయాను. నా తమ్ముడికి మరో సమస్య వచి్చంది. నాకు విడాకుల సమస్య. నేనెప్పుడూ ఏడవలేదు. విచారిస్తూ నా లక్ష్యాన్ని మర్చిపోలేదు. ఆత్మస్థైర్యం కోల్పోలేదు. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాను. వెల్నెస్ సంస్థను నిర్మించాను. ప్రతి విషాదం నన్నో దృఢమైన వ్యక్తిని చేసింది. జీవితం చాలా చిన్నది. ఇదొక ప్రయాణం. అందరికీ సమస్యలు ఉంటాయి. జీవితంలో అవి ఒక భాగం మాత్రమే. వాటిని మనం ఎలా ఎదుర్కొంటామనేదే నిజమైన వ్యక్తిత్వం.అలా విముక్తి లభించింది..‘నా జీవితంలో ప్రతి విషాదం నన్ను బలమైన వ్యక్తిగా తయారు చేసింది. విడాకుల సమయంలోనూ 12 ఏళ్ల సంతోషమైన జీవితం కోసం 50 ఏళ్లు దయనీయంగా ఉండరాదనుకున్నా. అప్పుడు నాకు విముక్తి లభించింది’ అని తెలిపారు.ఇవి చదవండి: బ్లాక్‌బస్టర్ మూవీకి బంపరాఫర్.. కేవలం ఒక్క రోజు మాత్రమే! -
'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది!
కన్నీటికి కూడా ఇష్టం ఉన్నట్టుంది. కన్నీటికి కూడా ఒక మనిషి కంటినే అంటి పెట్టుకొని ఉండాలన్న కోరిక ఉన్నట్టుంది. కన్నీరు ఎందుకనో ఒకే మనిషిని పదే పదే ఆలింగనం చేసుకుంటూ ఆ మనిషికి మరింత ప్రేమను పంచాలని అనుకుంటున్నట్టుంది. కేరళలో ఒకమ్మాయి శ్రుతి. ఆ అమ్మాయి గత కొన్ని రోజులుగా కన్నీరు కారుస్తోంది. ఆమెను ఊరడించడానికి కేరళ ప్రభుత్వం, కేరళ ప్రజలు కదిలారు. ఈ ప్రేమ కోసమేనా కన్నీరుకు ఆమెపై ప్రేమ?‘బాధ పడకు. నీకు నేనున్నాను. నేను చనిపోయినా నువ్వు ఒంటరివి కావు. నీకంటూ ఒక భరోసా ఉండేలా చూస్తాను’ అన్నాడా యువకుడు ఆ అమ్మాయితో ఓదార్పుగా. ఇవాళ ఆ యువకుడు కన్నుమూశాడు. ఆ యువకుడి మాటలను గుర్తు చేసుకుంటున్న కేరళ ప్రజలు ‘మేమున్నాం’ అంటూ ఆ అమ్మాయికి తోడుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన చాలా అరుదు.ఆ అమ్మాయి పేరు శ్రుతి..అందరు అమ్మాయిల్లాంటిదే శ్రుతి. కోజికోడ్‌లో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేయడం... సెలవులలో ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో గడపడం... తండ్రి చిన్న ఉద్యోగి... తల్లి చిన్న షాపు నడిపేది... చెల్లెలు కాలేజీ చదువుతోంది. వాళ్ల కుటుంబం వాయనాడ్‌లోని చూరలమలలో కొత్త ఇల్లు కట్టుకుని వరదలకు నెల ముందే షిఫ్ట్ అయ్యారు. అక్కడే శ్రుతి నిశ్చితార్థం జరిపించారు. ఈ డిసెంబర్లో పెళ్లి చేయాలని 4 లక్షల డబ్బు. 15 సవర్ల బంగారం ఇంట్లో దాచారు. అంతా సంతోషమే. కాని...జూలై 30 రాత్రి..ఆ రాత్రి ఉద్యోగరీత్యా శ్రుతి చూరలమలకు రెండు గంటల దూరంలో ఉన్న కోజికోడ్‌లో ఉంది. వరద విజృంభించింది. శ్రుతి వాళ్ల కొత్త ఇల్లు ధ్వంసమైంది. తల్లి, తండ్రి, చెల్లెలు... పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం పోయాయి. ఎవరూ మిగల్లేదు. ఏమీ మిగల్లేదు. శ్రుతి కన్నీరు కట్టలు తెంచుకుంది. అది ఆగలేదు. ఆపేందుకు ఒక్కడు పూర్తిగా ప్రయత్నించాడు. అతని పేరు జాన్సన్. శ్రుతికి కాబోయే భర్త.నేనే తోడుంటా..‘శ్రుతికి ఇప్పుడు ఏమీ మిగల్లేదు. అంతమాత్రం చేత నేను వదిలేస్తానా? పదేళ్లుగా మేము స్నేహితులం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇప్పుడు ఆమె సర్వం కోల్పోయినా నేను వదలను. తోడుంటా. నేను చనిపోయినా ఆమె ఒంటరిదై పోకుండా మంచి ఉద్యోగం, ఇల్లు ఏర్పాటు చేస్తా’ అన్నాడు. ఆ మాటలు ఎందుకన్నాడో. అవి వాయనాడ్ విషాదాన్ని ప్రసారం చేసేటప్పుడు టీవీలో టెలికాస్ట్ అయ్యాయి.ఆ తోడు కూడా పోయింది...శ్రుతికి ఇక ఏడవడానికీ కన్నీరు మిగల్లేదు. జాన్సన్ చనిపోయాడు. మొన్నటి మంగళవారం వాయనాడ్‌లో అతను, శ్రుతి, శ్రుతి బంధువులు కొంతమంది ప్రయాణిస్తున్న వ్యాను బస్సుతో ఢీకొంది. శ్రుతి, ఆమె బంధువులు స్వల్పంగా గాయపడ్డారు. కాని జాన్సన్ మృత్యువుతో పోరాడి బుధవారం మరణించాడు. అన్నీ కోల్పోయిన శ్రుతికి ఆఖరి ఆసరా కూడా పోయింది. ఆమె ఏం కావాలి?మేమున్నాం..ఇక కేరళ జనం తట్టుకోలేకపోయారు. మేమున్నాం అంటూ శ్రుతి, జాన్సన్ జంట ఫొటోలను డీపీగా పెట్టుకోసాగారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ నేనున్నానంటూ ఫేస్బుక్ పోస్ట్ రాశారు. ఫహద్ ఫాజిల్, మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు. కేరళ మంత్రి ఒకరు శ్రుతికి మంచి ఉద్యోగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది... కేరళ ప్రజలది అన్నారు. శ్రుతి కోసం కేరళ కన్నీరు కారుస్తోంది. శ్రుతి కన్నీటిని కేరళ పంచుకుంది. అయినవారిని లాక్కుని పరాయివారినెందరినో ఆమె బంధువులుగా మార్చింది కన్నీరు. ఈ కన్నీటిని ఏమని నిందించగలం. కన్నీరా కనికరించు... చల్లగా చూడు అనడం తప్ప.ఇవి చదవండి: బెయిలా? జైలా?.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు -
పందొమ్మిదేళ్లకు.. ‘ఫ్యామిలీ ట్రీ’ట్!
జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఒక విద్యార్థి రిన్. ఇరవై ఏళ్ల రిన్ని ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కాలేజీ వాళ్లు ‘ఫ్యామిలీ ట్రీ’ తయారుచేయమన్నారు. తల్లి తప్ప మరెవరూ లేకపోవడంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు రిన్. తల్లి సచియే తకహతాను అడిగాడు. తల్లి–తండ్రి విడిపోయే సమయంలో రిన్ వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే. వారు విడిపోయిన తర్వాత ఇద్దరి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ‘ఆధారాల కోసం వెతికే క్రమంలో కొన్ని పాత ఫ్యామిలీ ఫొటోలు, తండ్రి సుఖ్‌పాల్ పేరు, అమృతసర్ అడ్రస్ దొరికాయి. గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ కోసం వెతికి, టికెట్ బుక్ చేసుకొని ఆగస్టు 15న పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి చేరుకున్నాడు.అయితే విధి అతన్ని మరింతగా పరీక్ష పెట్టింది. సుఖ్‌పాల్ అక్కడి నుండి ఎప్పుడో వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడని తెలిసింది. తండ్రి ప్రస్తుతం ఉంటున్న అడ్రెస్ ఎవరూ చెప్పలేకపోయారు. ‘నా దగ్గర మా నాన్న పాత ఫొటోలు ఉండటంతో స్థానిక ప్రజలను అడిగి కనుక్కోవడానికి ప్రయత్నించాను. చాలా మందిని అడిగాక అదృష్టం కొద్దీ ఒక వ్యక్తి నా తండ్రి ఫొటో గుర్తించి, అతని కొత్త చిరునామా నాకు ఇచ్చే ఏర్పాటు చేశాడు. అలా 19 ఏళ్ల తర్వాత మా నాన్నను మళ్లీ కలవగలిగాను’ అని తండ్రిని కలుసుకున్న ఉద్విగ్న క్షణాలను పంచుకుంటున్నాడు రిన్.‘ఇలా జరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ, జరిగింది. నా ప్రస్తుత భార్య గుర్విందర్‌జిత్ కౌర్, నా ఏకైక కుమార్తె అవ్లీన్ కూడా రిన్ను కుటుంబంలోకి హృదయపూర్వకంగా స్వాగతించినందుకు సంతోషంగా ఉన్నాను. నా మాజీ భార్య సచియేతో ఫోన్లో మాట్లాడాను. రిన్ క్షేమం గురించి చె΄్పాన’ని సుఖ్‌పాల్ కొడుకును కలుసుకున్న మధుర క్షణాలను పంచుకుంటున్నాడు.రక్షాబంధన్ రోజే...రిన్ తండ్రి కుటుంబాన్ని కలవడం, పండగప్రాముఖ్యతను గురించి తెలుసుకొని, ఆ రోజు సవతి సోదరి అవ్లీన్ చేత రాఖీ కట్టించుకోవడం.. వంటివి రిన్ను థ్రిల్ అయ్యేలా చేశాయి. ‘మా సోదర–సోదరీ బంధం చాలా బలమైనది’ అని ఆనందంగా చెబుతాడు రిన్.కొడుకును అమృత్‌సర్‌కి తీసుకెళ్లి..ఇన్నేళ్లకు వచ్చిన కొడుకును వెంటబెట్టుకొని సుఖ్‌పాల్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించుకున్నాడు. అటారీ వాఘా సరిహద్దులో జరిగిన జెండా వేడుకను వీక్షించారు. సుఖ్‌పాల్ తన గతాన్ని వివరిస్తూ ‘2000 సంవత్సరం మొదట్లో థాయ్‌లాండ్ విమానాశ్రయంలో భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా సచియేను చూశాను. విమానంలో మా సీట్లు పక్కపక్కనే ఉన్నాయి. అలా మా మొదటి సంభాషణ జరిగింది. ఆమె వరుసగా ఎర్రకోట, తాజ్‌మహల్‌లను సందర్శించడానికి న్యూఢిల్లీ, ఆగ్రాకు వెళుతోంది.గోల్డెన్ టెంపుల్ గురించి చెప్పి, అమృత్‌సర్‌కి తన పర్యటనను పొడిగించమని సచియేని నేనే అడిగాను. ఆమె వెంటనే ‘ఓకే’ చెప్పి అమృత్‌సర్‌కి నాతో పాటు వచ్చింది. మా కుటుంబంతో కలిసి 15 రోజులకు పైగా ఉంది. ఇక్కడ ఉన్న సమయంలో స్థానిక పర్యాటక ప్రదేశాలతో పాటు ఎర్రకోట, తాజ్‌మహల్‌ను సందర్శించాం. సచియే జపాన్‌కు వెళ్లాక కూడా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అప్పుడు తనకు 19 ఏళ్లు, నాకు 20 ఏళ్లు. 2002లో సచియేను వివాహం చేసుకుని, జపాన్ పర్యటనకు వెళ్లాను. ఏడాది తర్వాత రిన్ జన్మించాడు. నేను జపనీస్ నేర్చుకున్నాను. అక్కడ చెఫ్‌గా పని చేశాను.కొన్ని రోజుల తర్వాత మేం కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేకపోయాం. దీంతో నేను భారతదేశానికి తిరిగి వచ్చేశాను. ఆమె రిన్‌తో కలిసి నన్ను చూడటానికి భారతదేశం వచ్చింది. మరోసారి తనతో కలిసి జపాన్‌కు వెళ్లాను. కానీ, కలిసి ఉండలేకపోయాం. 2004లో విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత మూడేళ్ళు జపాన్‌లోనే ఉన్నా కానీ, వారిని కలవలేదు. 2007లో స్వదేశానికి తిరిగి వచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు మేమంతా రిన్‌తో టచ్‌లో ఉంటాం’ అని గత స్మృతులను, ప్రస్తుత ఆనందాన్ని ఏకకాలంలో పొందుతూ ఆనందంగా చెబుతున్నాడు సుఖ్‌పాల్. -
Prakruthi Kambam: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!
సాక్షి, సిటీబ్యూరో: ఫెమినా మిస్ ఇండియా..! ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మంది ఫ్యాషన్ ఔత్సాహికుల చిరకాల కోరిక. సౌందర్య రంగంలో అత్యున్నత స్థానమైన ఫెమినా మిస్ ఇండియాగా నిలవాలంటే దేహ సౌందర్యమే కాదు.. ఆత్మ సౌందర్యం, విజ్ఞాన కౌశలం, సేవా తత్పరత అన్నింటికీ మించి ఆత్మస్థైర్యం కూడా ఉండాలంటున్నారు ఫెమినా మిస్ తెలంగాణ ప్రకృతి కంబం. ఈ సారి ఫెమినా మిస్ ఇండియా పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకృతి కంబం ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ముంబై వేదికగా జరిగిన ప్రీ ఫెమినా మిస్ ఇండియా పేజెంట్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుని ఫెమినా మిస్ తెలంగాణ–2024గా నిలిచారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో దేశవ్యాప్తంగా పాల్గొనే 30 మంది అందాల ముద్దుగుమ్మల్లో తానూ ఒకరు. ఈ నేపథ్యంలో తన ప్రయాణంలోని అనుభవాలు, అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..ఫైనల్స్‌లో తెలుగమ్మాయి..ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడం నా చిరకాల స్వప్నం. గతంలో జరిగిన సౌందర్య పోటీల్లో పాల్గొని టాప్ 5 స్థానంలో నిలిచి ఆ కిరీటాన్ని అందుకోలేకపోయాను. కానీ ఈ సారి ఫెమినా మిస్ ఇండియా క్రౌన్ గెలిచి హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు దేశం నుంచి ప్రాతినిథ్యం వహించాలన్నా కూడా ఫెమినా మిస్ ఇండియా కిరీటమే ప్రామాణికం. ఫైనలిస్టుగా ఎంపిక చేయడానికి బెంగళూరులో జరిగిన ఆడిషన్స్‌లో ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు రెండు వందల మంది ష్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. అందులో ఎంపిక చేసిన కొద్ది మందితో ముంబైలో మరో పేజెంట్ నిర్వహించగా.. అందులో ఫెమినా మిస్ తెలంగాణగా నేను నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.జీవితం నేర్పిన పాఠాలు..నా జీవితంలో స్వతహాగా ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, అడ్డంకులే నన్ను ఈ స్థాయికి చేర్చాయని అనుకుంటాను. ప్రతి సమస్య నుంచీ, ప్రతి సందర్భం నుంచీ జీవిత పాఠాలను నేర్చుకున్నాను. సౌందర్య రంగం అంటే అందంగా ఉంటే సరిపోతుందిని అంతా అనుకుంటారు. కానీ.. అందంతో పాటు ఆలోచనలు, అభిరుచులు, సంపూర్ణమైన వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత–అవగాహన ఇలా పలు అంశాలను పరిశీలించాకే, పరీక్షించాకే ఆ గౌరవమైన స్థానానికి ఎంపిక చేస్తారు. మల్టీ క్వీన్...నాకు 5 భాషల్లో ప్రావీణ్యముంది. ఫ్యాషన్‌తో పాటు థ్రోబాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, క్యారమ్ వంటి క్రీడల్లో ఛాంపియన్ని. పలు ఈవెంట్లలో ట్రాక్ ఫీల్డ్ అథ్లెట్‌గా విజేతగా నిలిచాను. డ్యాన్స్–కొరియోగ్రఫీలో మంచి ప్రావీణ్యముంది. బాలీవుడ్, జాజ్, బ్యాలే, ఫోక్, సౌత్ స్టైల్స్ ఇలా అన్ని స్టెప్పుల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించగలను. క్విల్లింగ్, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, మండాల ఆర్ట్స్ వంటి పలు కళల్లో మంచి పట్టు ఉంది. సమర్థవంతమైన అమ్మాయిగా నిలవడంలో ఈ అంశాలన్నీ దోహదపడ్డాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి గతంలో మిస్ గ్రాండ్ కర్ణాటక, టైమ్స్ ఫ్రెస్ ఫేస్‌తో పాటు పలు పేజెంట్లలో విజేతగా నిలిచాను. యాక్టింగ్ పై మక్కువతో టాలీవుడ్ వేదికగా ఒక సినిమాలో నటించాను. మరికొద్ది రోజుల్లో వెండి తెరపైన విడుదల కానుంది. ఇవన్నీ చేయగలడంలో నా టైమ్ మేనేజ్మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది.25 ఏళ్ల వయసులో..ఈ పోటీలకు అర్హత వయస్సు 25 ఏళ్లు మాత్రమే.. ఇంత చిన్న వయసులో సామాజికంగా, మానసికంగా, మోడలింగ్‌లో ఉన్నత భావజాలం ఉండాలంటే జీవితాన్ని అంకితం చేయాలి. నడక, నడవడిక, అందం, ఆలోచనలు, డ్రెస్సింగ్, మోడ్రన్ ట్రెండ్స్ ఇలా ప్రతీ విషయంలో ఉన్నతంగా ఉంటేనే ఈ పోటీల్లో రాణించగలం. అక్క దగ్గర మోడలింగ్, అమ్మా–నాన్నల దగ్గర సామాజిక అంశాల పైన అవగాహన పొందాను. బాక్స్ ఆఫ్ స్మైల్ పేరుతో అమ్మా నాన్నలు పేద విద్యార్థులకు చేసే సేవా కార్యక్రమాలు నాలో సామాజిక స్పృహను పెంచాయి. -
'ఆయ్'... మన కోనసీమేనండి!
మనం ఎంచుకున్న లక్ష్యానికి నిబద్ధత, శ్రమ, తపన తోడైతే దాని ఫలితం అద్భుతంగా ఉంటుందనే నమ్మకాన్ని ‘ఆయ్’ సినిమా దర్శకుడు అంజిబాబు కంచిపల్లి రుజువు చేశాడు. తొలి ప్రయత్నంలోనే సినీ దర్శకుడిగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణ శివారు కొంకాపల్లి అంజిబాబు స్వస్థలం. పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఒకరోజు...‘నేను సినిమా డైరెక్టర్ కావాలనుకుంటున్నాను’ అని తండ్రి బూరయ్య, సోదరులకు చెప్పాడు. ఆ వయసులో పిల్లల నోటి నుంచి వినిపించే కలలకు పెద్దలు ‘అలాగే’ అంటారు తప్ప అంత సీరియస్‌గా తీసుకోరు. కానీ అంజిబాబు మాత్రం యమ సీరియస్‌గా తీసుకున్నాడు. ‘ముందు నువ్వు డిగ్రీ పూర్తి చేయి. తర్వాత ఆలోచిద్దాం’ అని తండ్రి చెప్పాడు. తన లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకున్నప్పటికీ చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. అమలాపురంలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఓ మంచి రోజు తన కలల దారిని వెదుక్కుంటూ హైదరాబాద్ బస్సెక్కేశాడు. ఎంతోమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు.కోనసీమలో బాల్యం నుంచి స్నేహంగా చిగురించిన బంధాలు, అనుబంధాలు పెద్దయ్యాక కులాల కుంపటి రాజుకుని నాశనమవుతున్నాయి. కులాల బీటలతో స్నేహం, ప్రేమ విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే తన కథలో ప్రధానాంశంగా ఎంచుకుని సినిమా కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు.తాను రాసుకున్న కథను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, భాగస్వామి బన్నీ వాసులకు వినిపించాడు. గీతా ఆర్ట్స్‌కు నచ్చడంతో అంజిబాబు కథా రచయితగా తొలి విజయం సాధించాడు. సినిమాని కోనసీమ నదీ పరీవాహక గ్రామాల్లో చిత్రీకరించడం రెండో విజయం. అమలాపురం వేదికగా రూపుదిద్దుకున్న ‘కోనసీమ ఫిలిమ్ అసోసియేషన్’కు చెందిన సినీ ఆర్టిస్ట్‌లతో కొంత మందికి అంజిబాబు ‘ఆయ్’ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చి వారి నుంచి మంచి నటనను రాబట్టాడు. తన తండ్రిపై ఉన్న అభిమానంతోనే ‘ఆయ్’ సినిమాలోని హీరో తండ్రి క్యారెక్టర్‌కు ‘బూరయ్య’ అని పేరు పెట్టాడు.చిన్నతనం నుంచి తాను పుట్టి పెరిగిన కోనసీమలోని ప్రకృతి అందాలు, గ్రామీణ సౌందర్యాలను తాను తీసే తొలి చిత్రంలో తెరకెక్కించాలనే కలను నిజం చేసుకున్నాడు. కోనసీమ యాస, నేటివిటీకి హాస్యాన్ని జోడించి ‘ఆయ్’ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు అంజిబాబు. – పరసా సుబ్బారావు, సాక్షి, అమలాపురం టౌన్"తొలి ప్రయత్నంలోనే సినీ దర్శకుడు కావాలన్న నా శ్రమ, కల ఇప్పుడు ’ఆయ్’ చిత్ర రూపంలో ఫలించినందుకు సంతోషంగా ఉంది. సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలన్న నా కోరిక కూడా ‘ఆయ్’ చిత్రం ద్వారా తీరింది. కోనసీమ అందాలు, అచ్చమైన పల్లె వాతావరణం, గోదారోళ్ల యాస మాటలు, సందర్భోచిత హాస్యంతో సినిమాను తీయాలనే ఆలోచనతో ‘ఆయ్’ చిత్రం కథను రాశాను. నా క«థను మెచ్చి చిత్రాన్ని తెరకెక్కించేలా చేసిన గీతా ఆర్ట్స్‌కు, అల్లు అరవింద్, బన్నీ వాసులకు నా ధన్యవాదాలు." – అంజిబాబు కంచిపల్లి, ఆయ్ చిత్ర దర్శకుడు -
Annapurni Subramaniam: నక్షత్ర విజ్ఞాన సిరి..
అంతరిక్షం అంటేనే అనేకానేక అద్భుతాలకు నెలవు. అన్నపూరణిలో అంతరిక్షంపై ఆసక్తి చిన్న వయసులోనే మొదలైంది. ఆరు బయట రాత్రి పూట ఆకాశంలో చుక్కలు చూస్తున్నప్పుడు ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన తనను కుదురుగా ఉండనివ్వలేదు. నక్షత్రమండలాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేలా చేసింది. నక్షత్రాలపై ఆసక్తి తనను విషయ జ్ఞానానికి మాత్రమే పరిమితం చేయలేదు. సైంటిస్ట్‌ను చేసింది.‘విజ్ఞాన శ్రీ’ అవార్డ్ అందుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్తగా ఉన్నతస్థానంలో నిలిపింది. అన్నపూరణి సుబ్రమణ్యం ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ) డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఈ సంస్థ భవిష్యత్ అంతరిక్ష యాత్రల కోసం అత్యాధునిక టెలిస్కోప్‌లు, పరికరాలను తయారు చేస్తుంటుంది. ఆస్ట్రోశాట్, ఆదిత్య–ఎల్1ల ఇన్స్ట్రుమెంటేషన్లో అన్నపూరణి పాలుపంచుకుంది.కేరళలోని పాలక్కాడ్ విక్టోరియా కాలేజీలో చదువుకున్న అన్నపూరణి ‘స్టడీస్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ స్టెల్లార్ ఎవల్యూషన్’ అంశంపై హీహెచ్డీ చేసింది. పీహెచ్డీ చేస్తున్న రోజులలో కవలూర్ అబ్జర్వేటరీ (తమిళనాడు) ఆమె ప్రపంచంగా మారింది. ఏ పరికరాన్ని ఎలా వినియోగించుకోవాలో లోతుగా తెలుసుకుంది. నక్షత్ర సమూహాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేసింది.‘పరిశోధన’కు కామా నే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంటుంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! ప్రస్తుత కాలంలో ‘స్పేస్–బేస్డ్ అస్ట్రోనమీపై యువతరం అమితమైన ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇది శుభసూచకం. స్పేస్ సైన్స్ ఎంతోమందికి అత్యంత ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తే భవిష్యత్ పరిశోధనలకు పునాదిగా మారుతుంది’ అంటుంది అన్నపూరణి సుబ్రమణ్యమ్.‘పరిశోధన’కు కామానే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! -
అతడు అడవిౖయె రోదించాడు... హెచ్చరించాడు!
ప్రకృతిలో ఒక భాగమైన మనిషి అత్యాశకు పోయి దాని సహజ సూత్రాలను అతిక్రమిస్తున్నాడు. ఫలి తంగా ఎన్నో దుష్పరిణా మాలకు కారకుడవుతు న్నాడు. ఈ విషయాన్ని చెప్పడం కోసం కవి సుద్దాల అశోక్ తేజ అడవి రూపమెత్తి ‘నేను అడవిని మాట్లాడుతున్నా’నని దండోరా వేశాడు. ‘‘అఖిల సృష్టికి ప్రాణముద్ర ప్రకృతి ప్రకృతికి వేలిముద్ర అడవి అడవి నిలువెత్తు సంతకం చెట్టు’’ అనేది సుద్దాల భావన. మానవ సమాజం ప్రగతి పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. అయితే ఈ కవి ఉత్తమోత్తమ ప్రగతిని – ‘‘ఆసుపత్రులు లేని భూగోళం నా చిరకాలపు కల/ న్యాయస్థానాలకు పని కల్పించని దృశ్యం/ నేనూ హించే సుందర ప్రపంచం’’ అని స్వప్నిస్తున్నాడు. ఇది సాధ్యమా? కాదు, కాదని చెబుతూనే ఆ ‘సుందర ప్రపంచం’ ఎలా సాధ్యమో ‘నీళ్లు నమల కుండా’ ఇలా ప్రకటించాడు.‘‘హద్దు మీరిన వ్యాపారమే / చేసింది రాజ్యాంగేతర శక్తిగా / అధికార పదవీస్వీకారం/అధికార పదవుల్లో తిరిగే బొమ్మలకు / అసలు సిసలు సూత్రధారి/ తెరవెనుక బడా వ్యాపారి/ అడవి ధ్వంసం, కడలి ధ్వంసం/ వెరసి ప్రకృతి విధ్వంసం/ ఈ త్రిసూత్ర పథ కాలంలో/ ఎదుగు తున్నది కుటిల/ వ్యాపార త్రివిక్రమావతారం/ భయానికీ భయానికీ మధ్య / బతుకు నలుగు తున్నది/ ప్రకృతికీ మనిషికీ మధ్య / ఇనుపగోడ పెరుగుతున్నది/ ప్రకృతి సమాధిపైన ప్రగతి సౌధాలు / ఏ ఆర్థిక ప్రవక్త చెప్పాడిది/ ఏ పురోగ మన సూక్తం ఇది?! అంతేగాదు–‘‘జీవనంలో ఓడినవాడు, ఆధ్యా త్మిక జీవనం కోరినవాడు, సాయుధ రణ జీవనంలో చేరినవాడు, అరణ్యా నికే వస్తాడు – రావాలి!’’ ఎందుకంటారా?ప్రకృతి మోహినీ రూపంలో రాదు గాక రాదు/ మోహ రించిన ప్రళయ రూపంలో/ ఎదురెత్తులేస్తూ ఉంటుంది/ హిమాలయాలను కరిగిస్తుంది/ జలాశయాలను మరి గిస్తుంది/ అరణ్యాలను చెరిపే స్తుంది/ ‘లావా’లను కురిపి స్తుంది. కనుకనే – ‘‘చర్యకు ప్రతిచర్య/ హింసకు ప్రతి హింస/ అనివార్యం – అది / ప్రకృతి ప్రాణ సూత్రం/ మీ చేతలవల్ల/ జరుగుతున్న పాతకా లకు, / ఘాతుకాలకు/ ప్రతీఘాత తీవ్రత/ ఏ స్థాయిలో ఉంటుందంటే/ మీ ఊహకు అందనంత/ అందినప్పుడు మీరుండరు!/ పెడమార్గం పట్టిన / చెడుమార్గం తొక్కిన మీ/ చేష్టలవల్ల/ ధర మేధం, గిరిమేధం/ తరుమేధం, చివరికి సమస్త/ నరమేధం జరిగి తీరుతుంది/ నరవరా! మళ్ళీ మళ్లీ చెబుతున్నా/ హంతకులూ మీరే/ హతులూ మీరే!’’అందుకనే, సుద్దాల తీర్మానం – ‘‘ఏ పరిశో ధనైనా/ ఏ పురోగమనమైనా/ అరణ్యం అంగీ కరించే/ పర్యావరణం పరవశించే విధంగా’’ నేటి తరాలకు అభయంగా, రేపటి తరా లకు భరోసాగా ఉండాలన్నది సుద్దాల డిక్టేషన్! కనుకనే ‘‘వేల ఏళ్లు దాటొచ్చిన మానవ జాతి, ఇక వెనక్కెళ్లడం సాధ్యం కాదు గనుకనే, కుదరని వ్యవహారం కనుకనే – ఆ ప్రకృతినే ఆశ్రయించి, పిలిపించమని సుద్దాల అరణ్య రోదన, ఆయన సమస్త వేదన! కనుకనే ‘శ్రమ కావ్యం’ ద్వారా శ్రమ జీవుల ఈతిబాధల్ని కావ్యగతం చేసి ధన్యుడైన నేల తల్లి బిడ్డ సుద్దాల... తన అరణ్య కావ్యం ద్వారా ఈ చరా చర ప్రకృతిలో అసలు ముద్దాయి ఎవరో తేల్చినవాడు! మనిషే ఈనాడు ప్రకృతికి ప్రతి నాయకుడై వాతావరణ విధ్వంసానికి కారకుడని సుద్దాల మనోవేదనతో తీర్చిదిద్దినదే ఈ గొప్ప కావ్యం.నిరుపేదల బతుకులు చట్టు బండలవుతున్న పరిస్థితిని చూస్తూ తట్టుకోలేని సుద్దాల– ‘‘అడివమ్మ మాయమ్మ అతి పేద ధీర ఆ అమ్మకున్నది ఒక్కటే చీర’’ అన్న పాట నిరుపేద కుటుంబాల ఆర్థిక దైన్యాన్ని, గుండె కోతను ప్రపంచానికి వెల్లడించాడు. ఆ స్పందించ గల హృదయాలను ఆకట్టుకుని అక్కున చేర్చు కున్న సుద్దాల సదా ధన్యుడు! – ఏబీకే ప్రసాద్, సీనియర్ సం΄ాదకులు -
ధైర్యసాహసాలు అనగానే మరో ఆలోచనే.. చమేలీ.. ఓ ధీశాలి!
ధైర్యసాహసాలు అనగానే ఇంకో ఆలోచన లేకుండా రాణీ రుద్రమ పేరే గుర్తొస్తుంది! అలాంటి ధీశాలి బస్తర్ ప్రాంత చరిత్రలోనూ కనిపిస్తుంది! ఆమె పేరే చమేలీదేవి! ఛత్తీస్‌గఢ్ సర్కారు ఇటీవలే ఆమె విగ్రహాన్ని చిత్రకూట్ జలపాతం దగ్గర ప్రతిష్ఠించింది. ఆ కథతో కాకతీయులకు, కాకతీయులతో మనకు చారిత్రక సంబంధం ఉంది కాబట్టి ఒకసారి బస్తర్ దాకా వెళ్లొద్దాం..తెలుగు నేలను పాలించిన రాజవంశాల్లో కాకతీయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా రాణి రుద్రమ పురుషాధిక్యతను ఎదుర్కొంటూ మంచి ఏలికగా పేరు తెచ్చుకుంది. ఆమె తర్వాత పాలనా పగ్గాలు ప్రతాపరుద్రుడి చేతికి వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీ సుల్తానులు, మహారాష్ట్ర దేవగిరి రాజుల దాడులు పెరిగాయి. ముందు జాగ్రత్తగా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పనిని తన తమ్ముడైన అన్నమదేవుడికి అప్పగించాడు ప్రతాపరుద్రుడు. ఆ బాధ్యతలో భాగంగా గోదావరి నది దాటి దండకారణ్యంలో కొత్త రాజ్యస్థాపనకు బయల్దేరాడు అన్నమదేవుడు. ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ క్రీ.శ. 1323 కల్లా ఇంద్రావతి నదీ సమీపంలోని బర్సూర్ ప్రాంతానికి చేరుకున్నాడు.పరిచయం..ఆ ఇంద్రావతి నదీ తీర ప్రాంతాన్ని నాగవంశీయుడైన హరి చంద్రదేవ్ పాలిస్తున్నాడు. అతనికి చమేలీదేవి అనే కూతురు ఉంది. గొప్ప అందగత్తె. కళలతో పాటు రాజకీయ, రణతంత్రాలలో శిక్షణ పొందింది. తండ్రికి పాలనా వ్యవహరాల్లో సాయమందించేది. ఇంద్రావతి నదీ తీరాన్ని గెలవాలని నిర్ణయించుకున్న అన్నమదేవుడు దండకారణ్యాన్ని ఏలుతున్న హరి చంద్రదేవ్‌కు రాయబారం పంపాడు. యువరాణి చమేలీదేవిని తనకిచ్చి వివాహం జరిపించాలని, ఆ ఒప్పందానికి సమ్మతం తెలిపితే హరి చంద్రదేవ్‌ను రాజుగా కొనసాగిస్తామంటూ సందేశం పంపాడు.ఆత్మగౌరవం..కనీసం తన ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా పెళ్లి ప్రతిపాదన తేవడాన్ని చమేలీదేవి వ్యతిరేకించింది. పెళ్లికి యుద్ధానికి లంకె పెట్టడాన్ని తప్పుపట్టింది. అన్నమదేవుడి ప్రతిపాదనను అంగీకరిస్తే నాగవంశీయుల ప్రతిష్ఠకు భంగమంటూ తేల్చి చెప్పింది. పెళ్లితో వచ్చే రాజ్యం, మర్యాదల కంటే యుద్ధంతో తేలే ఏ ఫలితమైనా మేలంటూ తండ్రిని ఒప్పించింది. యుద్ధరంగంలోనే అమీతుమీ తేల్చుకుందామంటూ అన్నమదేవుడికి ఘాటైన సమాధానం పంపింది.ఆత్మార్పణం..లోహండిగూడ వద్ద నాగవంశీయులు, కాకతీయల సైన్యానికి మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. మహారాజు హరి చంద్రదేవ్‌కు తోడుగా యువరాణి చమేలీదేవి యుద్ధ క్షేత్రానికి చేరుకుంది. యుద్ధం మూడోరోజున తీవ్రంగా గాయపడిన హరి చంద్రదేవ్ మరణించాడు. ఆ మరుసటి రోజు కోటలో రాజు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండగా వారిని వెంటాడుతూ వచ్చిన కాకతీయ సైన్యాలు కోటను చుట్టుముట్టాయి. తీవ్ర నిర్భంధం మధ్య తండ్రి అంత్యక్రియలను కొనసాగించిన చమేలీదేవీ చివరకు ఆత్మాహుతికి పాల్పడినట్టుగా చెబుతారు. చమేలీదేవి ప్రాణత్యాగంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్నమదేవుడికి ఎదురు నిలిచిన వైనం, ఆత్మాభిమానం, «ధైర్యసాహసాలు, రాజకీయ చతురతలపై మాత్రం ఏకాభిప్రాయం ఉంది. అందుకు బస్తర్ దసరా వేడుకల్లో నేటికీ కొనసాగుతున్న సంప్రదాయలే నిదర్శనం.ఆరాధనం..బస్తర్‌లో ఏటా దసరా వేడుకలను 75 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. బస్తర్ మహారాజు.. దంతేశ్వరి మాత దర్శనానికి వెళ్లే రథాన్ని మల్లెపూలతో అలంకరిస్తారు. ఈ పువ్వులను చమేలీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. రథం ఆలయానికి చేరిన తర్వాత స్థానికులు ఆ పువ్వులను తమ తలపాగాల్లో ధరిస్తారు గౌరవ సూచకంగా. అనంతరం వాటిని చిత్రకూట్ జలపాతానికి ఎగువ భాగంలో నిమజ్జనం చేస్తారు. అంతేకాదు ఇక్కడున్న అనేక గిరిజన తెగలు చమేలీదేవి ధైర్యసాహసాలు, ప్రాణత్యాగానికి గుర్తుగా కలశాల్లో దీపారాధన చేస్తారు. చమేలీదేవి మరణానికి కారణమైనందుకు ప్రాయశ్చిత్తంగా అన్నమదేవుడే ఈ సంప్రదాయాలకు చోటు కల్పించినట్టుగా చెబుతారు. ఏడువందల ఏళ్లకు పైగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇటీవలే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇండియా నయాగరాగా పేరొందిన చిత్రకూట్ (ఇంద్రావతి నది) జలపాతం దగ్గర యువరాణి చమేలీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆమెను గౌరవించింది. – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి, కొత్తగూడెం -
లేటు వయసులో.. కాలేజీ బాట!
సాక్షి, సిటీబ్యూరో: నేర్చుకోవాలనే తపన.. సంకల్ప బలం.. సాధిస్తామనే ధీమా ఉంటే చాలు.. ఎన్ని అద్భుతాలైన సృష్టించవచ్చు. ఇదే విషయాన్ని 77 ఏళ్ల వయసులో నిరూపించారు లక్ష్మీనారాయణ శాస్త్రి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్ అయిన ఎస్ఎల్ఎన్ శాస్త్రి.. తాజాగా అదే వర్సిటీలోని ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ నుంచి పీజీ పట్టా పొందారు.వయసుతో సంబంధం లేకుండా నిత్య విద్యార్థిగా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలని ఆయన నిరూపించారు. 1947లో జన్మించిన ఎస్ఎల్ఎన్ శాస్త్రి.. ఏఈఈగా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీ నిర్మాణంలో మొదటి నుంచీ కీలకపాత్ర పోషించారు. క్యాంపస్ నిర్మాణం, ప్రణాళిక రూపకల్పనలో ఆయన ముందుండి నడిపించారు. ఇక, ప్రొఫెసర్ రామంచర్ల ప్రదీప్‌కుమార్, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు మందాడి ప్రోత్సాహంతో పీజీ చేయాలనే ఆలోచన వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.క్లాస్‌రూం అనుభూతే వేరు.. ఈ వయసులో క్లాసురూమ్‌కు వెళ్లి పాఠాలు వినడం చాలా సంతోషం అనిపించింది. కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. విజయవాడలోని 20 పాత భవనాల్లో భద్రత అంశంపై నా కోర్సులో భాగంగా పరిశోధన చేశాను. ప్రొఫెసర్ ప్రదీప్ నన్ను అడుగడుగునా ప్రోత్సహించారు. పీహెచ్డీ కోసం పాత భవనాలకు ఇంజినీరింగ్ పరిష్కారాలపై పరిశోధన చేస్తాను. – ఎస్ఎల్ఎన్ శాస్త్రి -
చిత్రలేఖనంలో డెలివరీ బాయ్ వారెవ్వా..
సాక్షి, సిటీబ్యూరో: అతడో డెలివరీ బాయ్.. అది సమాజానికి తెలిసిన విషయం. కానీ ప్రపంచానికి తెలియని మరో విషయం ఏంటంటే అతడో మంచి చిత్రకారుడు. కుంచె పట్టాడంటే అద్భుతాలు అలా జాలువారుతాయి. చక్కటి రూపాలను మలచడంలో ప్రసిద్ధుడు. కానీ కుటుంబ పరిస్థితులు మాత్రం ఓ డెలివరీ బాయ్ పనికి పరిమితం చేశాయి. అతడి పేరే రాకేశ్ రాజ్ రెబ్బా. పుట్టింది మహారాష్ట్రలోని సోలాపూర్‌లో.. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.చిన్నప్పటి నుంచీ ఆసక్తి..రాకేశ్‌కు చిత్రలేఖనం అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి.. ఆ కళపై ఎలాగైనా పట్టుసాధించాలనే తపనతో చిన్నప్పుడు.. ఎప్పుడూ చూసినా ఏదో ఒక బొమ్మ గీస్తుండేవాడట. అలా కొన్ని వందల చిత్రాలను పుస్తకాల్లో గీసి అపురూపంగా దాచిపెట్టుకున్నాడు.మనుషుల ముఖాలను కూడా గీస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం అప్పుడప్పుడూ వాల్ పెయింటిగ్స్ వేస్తూ తన కళను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన కళకు మరిన్ని నగిïÙలు అద్దితే ఎన్నో ఎత్తులకు చేరుకుంటాడనడంలో అతిశయోక్తి లేదు.మంచి ఆర్టిస్టు కావాలని కోరిక.. ఆర్ట్ వేయడం అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. సొంతంగానే ఎన్నో బొమ్మలు వేశాను. డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. ఎవరైనా ప్రోత్సాహం అందిస్తే మంచి ఆరి్టస్టుగా జీవితంలో పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. – రాకేశ్ రాజ్ రెబ్బా -
Saloni Patel: అనుకొని ఈ ఫీల్డ్‌లోకి రాలేదు.. కానీ అనుకోకుండా?
‘అనుకొని ఈ ఫీల్డ్‌లోకి రాలేదు. అనుకోకుండా ఎంటర్ అయ్యాను. ఈ జాబ్ రొటీన్‌గా ఉండదు. నేర్చుకోవడానికి రోజూ ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది. కెరీర్లో నేను ఏ ఎక్సయిట్మెంట్నైతే కోరుకున్నానో అది ఈ ఫీల్డ్‌లో దొరికింది. అందుకే ఇందులో సెటిల్ అయిపోయాను!’ – సలోనీ పటేల్.ఆమె పుట్టింది, పెరిగింది.. న్యూ ఢిల్లీలో. పంజాబీ కుటుంబం. చిన్నప్పుడే కథక్ డాన్స్‌లో శిక్షణ పొందింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ చేసింది. చదువైపోగానే టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో జావా డెవలపర్‌గా పనిచేసింది. కానీ ఎలాంటి ఉత్సాహాన్నివ్వని ఆ ఉద్యోగం ఆమెకు ఆసక్తినివ్వలేదు. అందుకే ఇతర కెరీర్ ఆప్షన్స్‌ని ఎక్స్ప్లోర్ చేద్దామనుకుని టీసీఎస్ జాబ్‌కి రిజైన్ చేసింది.ఉద్యోగం కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఎంబీఏ ఎంట్రెన్స్ రాసింది. సీట్ వచ్చింది. బిజినెస్ స్కూల్లో జాయిన్ కావడానికి 6 నెలల టైమ్ ఉండటంతో మళ్లీ ఉద్యోగ అన్వేషణలో పడిపోయింది. ఈలోపే ‘పర్పుల్ థాట్స్’ అనే మోడలింగ్ ఏజెన్సీ నుంచి మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఏంబీఏలో జాయిన్ అయ్యేవరకు సరదాగా మోడలింగ్ చేద్దామని ఆ చాన్స్‌కి ఓకే చెప్పింది.ర్యాంప్ వాక్‌లు, కొత్తకొత్త వాళ్ల పరిచయం, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం.. ఇవన్నీ మోడలింగ్ మీద సలోనీకి ఇంట్రెస్ట్‌ను పెంచాయి. మోడలింగ్‌లోనే కెరీర్ వెదుక్కోవాలని నిశ్చయించుకుంది.మోడలింగ్ షూట్ కోసం ఒకసారి ముంబై వెళ్లినప్పుడు.. అక్కడ యాక్టింగ్, థియేటర్ వర్క్‌షాప్‌కి హాజరైంది. నచ్చడంతో థియేటర్లో ట్రైనింగ్ తీసుకుంది. పలు నాటకాల్లో నటించింది. ఆ టైమ్‌లోనే ప్యార్ విచ్, పీవైటీ (ప్రెటీ యంగ్ థింగ్) మ్యూజిక్ వీడియోల్లో కనిపించింది.సలోనీ థియేటర్ పర్ఫార్మెన్స్ జీటీవీ ‘కోల్డ్ లస్సీ ఔర్ చికెన్ మసాలా’ అనే వెబ్ సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది. ఆ తర్వాత ‘ద హార్ట్‌బ్రేక్ హోటల్’ అనే వెబ్ సిరీస్, ‘ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ నటించింది. సలోనీకి బ్రేక్‌నిచ్చిన సిరీస్ మాత్రం ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోని ‘క్యాంపస్ డైరీస్’.ఆమె నటించిన మరో షార్ట్ ఫిల్మ్ ‘ద గుడ్ న్యూస్’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీన్ అయ్యి, అవార్డులనూ అందించింది.సలోనీ సామాజిక సేవా కార్యకర్త కూడా! ఏమాత్రం సమయం చిక్కినా ముంబైలో జరిగే సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంది. కోవిడ్ సమయంలో తన సేవింగ్స్ అన్నిటినీ కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కి డొనేట్ చేసింది.సలోనీ లేటెస్ట్ వెబ్ సిరీస్‌లు ‘సన్‌ఫ్లవర్’ జీ5లో, ‘పాట్లక్’ సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. -
Rakul Prithi Singh: చిరుధాన్యాలే.. 'ప్రీతి'పాత్రమై..
సాక్షి, సిటీబ్యూరో: నా హృదయంలో హైదరాబాద్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. నా సినిమా కెరీర్‌కు బీజం పడింది ఇక్కడే.. అంటూ తన అభిమానాన్ని తరచూ చాటుకుంటారు బహుభాషా నటి రకుల్ ప్రీతిసింగ్. అందుకే ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉన్నా, నగరానికి మాత్రం దగ్గరగానే ఉంటున్నారు. ఇటీవలే కొండాపూర్‌లో తన 2వ మిల్లెట్ రెస్టారెంట్ ‘ఆరంభం’ను ఆమె ప్రారంభించారు.మే నెలలో మాదాపూర్‌లో తొలి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసిన ఆమె కేవలం 2నెలల్లోనే మరొకటి సిటిజనులకు అందుబాటులోకి తేవడం గమనార్హం. తెలుగు సినిమాల్లో అడపాదడపా మాత్రమే కనిపిస్తూ బాలీవుడ్ ప్రముఖుడ్ని పెళ్లాడి ముంబైలో నివసిస్తున్న రకుల్ ప్రీతిసింగ్.. నగరంతో తన అనుబంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఫిట్నెస్ లవర్ రకుల్.. గతంలో నగరంలో ఎఫ్–45 పేరిట జిమ్స్ నెలకొలి్పన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా నగరంలో అనేక మంది సినీ ప్రముఖులు రెస్టారెంట్స్, పబ్స్ ఏర్పాటు చేసినప్పటికీ.. ఆరోగ్యాభిలాషుల్ని దృష్టిలో ఉంచుకుని ఫిట్నెస్ సెంటర్లూ, మిల్లెట్ రెస్టారెంట్లూ నెలకొలి్పన క్రెడిట్ మాత్రం రకుల్ దక్కించుకున్నారు. -
Shivani Raghuvanshi: మేడ్ ఇన్ హెవెన్..
అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్ అనగానే శోభిత ధూళిపాళ సరే.. ఇంకో అమ్మాయి కూడా చటుక్కున గుర్తొస్తుంది. జాజ్.. జస్ప్రీత్గా వీక్షకులను అలరించిన శివానీ రఘువంశీ! తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు సంజయ్ లీలా భన్సాలీ ‘దేవదాసు’ సినిమా చూసి ముందు డైరెక్టర్ కావాలనుకుంది.. తర్వాత అందులోని కథానాయికల భారీ ముస్తాబుకు ముచ్చటపడి సినిమాల్లోకి వెళ్లడమంటూ జరిగితే హీరోయిన్‌గానే అని నిశ్చయించుకుంది. సొంతూరు ఢిల్లీ నుంచి ‘సిటీ ఆఫ్ ద డ్రీమ్స్’ ముంబైకి ఎలా చేరిందో చూద్దాం..!‘దేవదాసు’ ఫీవర్‌తో శివానీ.. హీరోయిన్ కావాలని కలలు కంటూ చదువును అశ్రద్ధ చేస్తుంటే వాళ్లమ్మ చెవి మెలేసి స్ట్రిక్ట్‌గా వార్న్ చేసిందట.. ‘ముందు డిగ్రీ తర్వాతే నీ డ్రీమ్’ అని! దాంతో బుద్ధిని చదువు మీదకు మళ్లించింది. అయినా సినిమా ఆమె మెదడును తొలుస్తూనే ఉండింది.శివానీ డిగ్రీలో ఉన్నప్పుడు.. సినిమా కాస్టింగ్ కో ఆర్డినేటర్ ఒకరు పరిచయం అయ్యారు. ఆమె కాంటాక్ట్ నంబర్ తీసుకున్నారు. వారానికే ఓ టీవీ కమర్షియల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి.. ఆసక్తి ఉంటే అటెండ్ అవమని సమాచారమిచ్చారు. వెళ్లింది. అలా ‘వొడా ఫోన్’ కమర్షియల్‌తో తొలిసారి స్క్రీన్ మీద కనిపించింది. అది ఆమెకు మరిన్ని మోడలింగ్ అవకాశాలను తెచ్చిపెట్టింది.టీవీ కమర్షియల్స్‌లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. ముందుగానే అమ్మ అనుమతిచ్చేసింది కాబట్టి డిగ్రీ పట్టా పుచ్చుకున్న మరుక్షణమే ముంబై రైలెక్కేసింది.ముంబై చేరితే గానీ తెలియలేదు సినిమా చాన్స్ అనుకున్నంత ఈజీ కాదని. ఆ స్ట్రగుల్ పడలేక ఎందుకొచ్చిన యాక్టింగ్ అనుకుంది. అప్పుడే ‘తిత్లీ’ అనే సినిమాలో హీరోయిన్గా సైన్ అయింది. కానీ అది తను కోరుకున్నట్టు గ్లామర్ రోల్ కాదు. పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే సెట్స్ మీద సీరియస్‌నెస్ లేకుండా జోకులేస్తూ ఉండసాగింది. ఆమె తీరు ఆ సినిమా డైరెక్టర్ కను బహల్కి కోపం తెప్పించింది. ‘ఇలాగైతే కెరీర్ కొనసాగినట్టే’ అని హెచ్చరించాడు. ఆ సినిమా విడుదలై.. తాను పొందిన గుర్తింపును ఆస్వాదించాక గానీ శివానీకి అర్థంకాలేదు తనకొచ్చిన చాన్స్ ఎంత గొప్పదో అని!అప్పటి నుంచి ఆమె శ్వాస, ధ్యాస అంతా అభినయమే అయింది. ‘అంగ్రేజీ మే కహతే హై’ చిత్రంతో పాటు ‘జాన్ ద జిగర్’, ‘జుత్తీ ద షూ’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించింది.‘తిత్లీ’తో శివానీ క్రిటిక్స్ కాంప్లిమెంట్స్ అందుకున్నా.. ఫిల్మ్ ఫ్రెటర్నిటీ దృష్టిలో పడినా.. ఇంటింటికీ పరిచయం అయింది మాత్రం ‘మేడ్ ఇన్ హెవెన్’ జాజ్తోనే! ఆమె ప్రధాన పాత్ర పోషించిన మరో వెబ్ సిరీస్ ‘మర్డర్ ఇన్ మాహిమ్’ ప్రస్తుతం జీయో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది.గ్లామర్ హీరోయిన్గా నటించాలనే కల ఇంకా నెరవేరలేదు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా..! – శివానీ రఘువంశీ -
Palak Muchhal: సింగర్‌గానే కాదు.. సామాజిక సేవలోనూ తన వంతుగా కృషి..
పాలక్ ముచ్చల్ అనే పేరు వినిపించగానే తీయటి పాట ఒకటి గుర్తొస్తుంది సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న పాలక్ సామాజిక సేవలోనూ తన వంతుగా కృషి చేస్తోంది. ఫండింగ్ ద్వారా ఇప్పటి వరకు మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించింది. బాలీవుడ్ సినిమా ‘ఎంఎస్ దోని–ది ఆన్‌టోల్డ్ స్టోరీ’లోని ‘కౌన్ తుఝే’ పాటతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది పాలక్. ఇండోర్‌కు చెందిన పాలక్‌కు కాలేజీ రోజుల నుంచి పాటతో పాటు సేవా బాటలో పయనించడం అంటే కూడా ఇష్టం.పాలక్ తొలి ఫండ్ రైజింగ్ ్రపాజెక్ట్ కార్గిల్ వీర సైనికుల కోసం చేసింది. ప్రతి షాప్ ముందుకు వెళ్లి దేశభక్తి గీతాలు పాడి ‘కార్గిల్ వీర సైనికులకు మీ వంతుగా సహాయం చేయండి’ అని అడిగేది. కళ, సామాజిక సేవను పాలక్ వేరు చేసి చూడదు. మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడానికి తనలోని కళ బలమైన మాధ్యమంగా ఉపయోగపడుతుందని చెబుతుంది పాలక్.సినిమాల్లో అవకాశాలు దొరకని రోజుల్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి పేద పిల్లల కోసం విరాళాలు సేకరించేది. పాలక్ ఒక మ్యూజిక్ప్రోగ్రామ్ చేసిందంటే పది మంది పేద పిల్లల వైద్యానికి అవసరమైన డబ్బును సేకరించినట్లే. బాలీవుడ్లో సింగర్‌గా పాలక్‌కు మంచి పేరు రావడమే కాదు ఆ పేరు విరాళల సేకరణకు బాగా ఉపయోగపడింది.‘మీ పాట అద్భుతం’ అనే ప్రశంస కంటే, పేదింటి తల్లిదండ్రుల గొంతు నుంచి వినిపించే... ‘మీ వల్ల మా బిడ్డ బతికింది’ అనే మాట పాలక్‌కు ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. ఇప్పుడు పాలక్ వెయిటింగ్ లిస్ట్‌లో 413 మంది పిల్లలు ఉన్నారు. వారికి హార్ట్ సర్జరీలు చేయించాల్సిన బాధ్యతను భుజాలకెత్తుకుంది. ‘మనస్ఫూర్తిగా కోరుకుంటే అంతా మంచే జరుగుతుంది. పేదపిల్లలకు అండగా నిలవడానికి ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాను’ అంటుంది పాలక్ ముచ్చల్. -
టీటీలో మేటి మనికా..
ఆ అమ్మాయి చదువులో చాలా చురుకు.. స్కూల్ దాటి కాలేజ్‌లోకి వచ్చిన తర్వాతా అదే కొనసాగింది. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక కళాశాలలో ప్రవేశం. కానీ టేబుల్ టెన్నిస్ కోసం అర్ధాంతరంగా చదువు వదిలేసింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. టీనేజ్లోనే పేరున్న కంపెనీలు మోడలింగ్ కోసం ఆమెను సంప్రదించాయి. కానీ టేబుల్ టెన్నిస్ కోసం వాటన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.ఎందుకంటే ఆమె ధ్యాసంతా ఆటపైనే కాబట్టి! ఒక క్రీడాకారిణిగా ఎదగాలనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆమె అన్నింటినీ పక్కన పెట్టింది. కఠిన శ్రమ, పట్టుదల, అంకితభావంతో ఆటలోనే పైకి ఎదిగింది. ఆరంభ అవరోధాలను దాటి కామన్వెల్త్ పతకాల విజేతగా, ఒలింపియన్‌గా నిలిచింది. టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన అరుదైన క్రీడాకారిణుల జాబితాలో తన పేరు లిఖించుకున్న ఆ ప్యాడ్లరే మనికా బత్రా.29 ఏళ్ల మనికా ఇప్పుడు వరుసగా మూడో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. గత రెండు సందర్భాల్లో తనకు దక్కకుండా పోయిన పతకాన్ని ఈసారి ఎలాగైనా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.దాదాపు రెండున్నరేళ్ల క్రితం మనికా బత్రా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించకపోయినా గతంలో ఒలింపిక్స్ ఆడిన భారత ఆటగాళ్లతో మెరుగైన ప్రదర్శన కనబరచి మూడో రౌండ్ వరకు చేరింది. అయితే ఒలింపిక్స్ ముగిసిన కొద్ది రోజులకే ఆమెకు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. మ్యాచ్‌లు జరిగే సమయంలో కోర్టు పక్కనుంచి భారత జట్టు కోచ్ సౌమ్యదీప్ రాయ్ సూచనలను తీసుకునేందుకు ఆమె అంగీకరించలేదు. తన వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరాంజపేను అక్కడికి వచ్చేందుకు అధికారులు అంగీకరించకపోగా.. కోచ్ లేకపోయినా ఫర్వాలేదని, అలాగే ఆడతానని ఆమె చెప్పేసింది.అర్జున అవార్డ్ అందుకుంటూ..ఇది టీటీఎఫ్‌ఐకి ఆగ్రహం తెప్పించింది. అందుకే మనికాపై చర్య తీసుకునేందుకు సిద్ధమైంది. దాంతో మనికా కోర్టు మెట్లెక్కింది. అంతటితో ఆగిపోకుండా తన నిరసనకు కారణాన్ని కూడా వెల్లడించింది. కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ సందర్భంగా సౌమ్యదీప్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించారంటూ సంచలన విషయాన్ని వెల్లడించింది. తన అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సుతీర్థ ముఖర్జీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు తనను మ్యాచ్ ఓడిపొమ్మని చెప్పాడంటూ బయటపెట్టింది. షోకాజ్ నోటీసుతో తనను మానసికంగా ఇబ్బంది పెట్టారని తెలిపింది.చివరకు కోర్టు మనికా ఆవేదనను అర్థంచేసుకుంది. టీటీఎఫ్ఐలో పూర్తి ప్రక్షాళన కార్యక్రమం జరిగి అధికారులు మారాల్సి వచ్చింది. సాధారణంగా అగ్రశ్రేణి ప్లేయర్లు ఏ ఆటలోనైనా జాతీయ సమాఖ్యతో గొడవకు దిగరు. భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సర్దుకుపోయే, రాజీ మనస్తత్వంతోనే ఉంటారు. కానీ కెరీర్లో అగ్రస్థానానికి ఎదుగుతున్న దశలో ఒక 27 ఏళ్ల ప్లేయర్ అధికారులతో తలపడింది. ఇది టీటీ కోర్టు బయట ఆమె పోరాటానికి, ధైర్యానికి సంకేతం. అత్యుత్తమ ఆటను ప్రదర్శించేందుకు మాత్రమే కాదు.. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తాను నిలబడగలననే ధైర్యాన్ని ఆమె చూపించింది.కుటుంబసభ్యుల అండతో..ఢిల్లీలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది మనికా. ముగ్గురు సంతానంలో ఆమె చిన్నది. అన్న సాహిల్, అక్క ఆంచల్ టేబుల్ టెన్నిస్ ఆడటం చూసి నాలుగేళ్ల వయసులో తాను కూడా అటు వైపు ఆకర్షితురాలైంది. చాలామంది ప్లేయర్ల తరహాలోనే ఒకరిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటే ఇతర కుటుంబసభ్యులు వారిని ప్రోత్సాహపరుస్తూ ముందుకు నడపడం, తాము తెర వెనక్కి వెళ్లిపోవడం తరచుగా జరిగేదే. మనికా విషయంలో కూడా ఇదే పునరావృతమైంది.తల్లి సుష్మతో..ఆమె ఆటను మొదలుపెట్టినప్పుడు అందరిలాగే సరదాగా ఆడి ముగిస్తుందని అనుకున్నారు. కానీ ఆమెలో దానికి మించి అపార ప్రజ్ఞ ఉన్నట్లు కోచ్‌లు చెప్పడంతోనే కుటుంబ సభ్యులకు అర్థమైంది. ఆ తర్వాత మనికా విషయంలో మరో ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. అక్క ఆంచల్ కూడా ఆటపై తనకున్న పరిజ్ఞానంతో చెల్లికి మెంటార్‌గా మారి నడిపించింది. రాష్ట్రస్థాయి అండర్–8 టోర్నీ మ్యాచ్‌లో ఆ చిన్నారి ప్రతిభను చూసిన కోచ్ సందీప్ గుప్తా తన మార్గనిర్దేశనంతో శిక్షణకు తీసుకోవడంతో ఆటలో మనికా ప్రస్థానం మొదలైంది.అగ్రస్థానానికి చేరి..‘బ్యాడ్మింటన్‌లో కూడా కొన్నేళ్ల క్రితం వరకు భారత ఆటగాళ్లు అంతంత మాత్రమే ప్రదర్శన కనబరచారు. కానీ సైనా నెహ్వాల్, పీవీ సింధులాంటి వాళ్లు అద్భుత ప్రదర్శనతో దాని స్థాయిని పెంచారు. మన దేశంలో బ్యాడ్మింటన్ ఒక్కసారిగా దూసుకుపోయింది. ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా నేనూ అదే చేయాలనుకుంటున్నా. టీటీకి చిరునామాగా మారి మన దేశంలో ఆటకు ఆదరణ పెంచాలనేదే నా లక్ష్యం’ అని మనికా చెప్పింది.నిజంగానే భారత టీటీకి సంబంధించి ఆమె ఎన్నో ఘనతలు సాధించింది. మరో మహిళా ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకుంది. శాఫ్ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో పతకాలు, వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీల్లో పెద్ద సంఖ్యలో విజయాలు ఆమె ఖాతాలో చేరాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా మహిళల సింగిల్స్ విభాగంలో అత్యుత్తమంగా 24వ స్థానానికి చేరుకొని ఆమె భారత్ తరఫున కొత్త చరిత్ర సృష్టించింది. ఆమెకు ముందు ఎవరూ కూడా మహిళల సింగిల్స్‌లో ఇంత మెరుగైన ర్యాంక్ సాధించలేదు.2018, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్‌తో.., 2018, ఐఐటీఎఫ్ ‘ద బ్రేక్‌త్రూ స్టార్’ అవార్డ్‌తో..పతకాల జోరు..అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్‌లో మనికా అత్యుత్తమ ప్రదర్శన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కనబడింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన ఈ పోటీల్లో మనికా ఏకంగా నాలుగు వేర్వేరు విభాగాల్లో నాలుగు పతకాలు సాధించింది. మహిళల సింగిల్స్, మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణం గెలుచుకున్న ఆమె.. మహిళల డబుల్స్‌లో రజత పతకం, మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం అందుకుంది.అదే ఏడాది జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. డబ్ల్యూటీటీ టోర్నీల్లోనైతే ఆమె ఖాతాలో పలు సంచలన విజయాలు నమోదయ్యాయి. ఇటీవల సౌదీ స్మాష్ టోర్నీలో వరల్డ్ నంబర్ 2, మాజీ ప్రపంచ చాంపియన్ వాంగ్ మాన్యు (చైనా)పై సాధించిన గెలుపు వాటిలో అత్యుత్తమైంది.మూడో ప్రయత్నంలో..మనికా బత్రా తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. ఆమె ఘనతలకుగాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అర్జున, ఖేల్ రత్న పురస్కారాలు అందుకుంది. ఒకప్పుడు మోడలింగ్ వద్దనుకున్న ఆమె ఇప్పుడు టీటీలో స్టార్‌గా ఎదిగిన తర్వాత అలాంటివాటిలో చురుగ్గా భాగమైంది. ప్రఖ్యాత మేగజీన్ ‘వోగ్’ తమ కవర్‌పేజీలో మనికాకు చోటు కల్పించి అటు గేమ్ ప్లస్ ఇటు గ్లామర్ కలబోసిన ప్లేయర్ అంటూ కథనాలు ప్రచురించింది.ఇతర ఫొటోషూట్ల సంగతి సరేసరి. కెరీర్లో ఎన్నో సాధించిన ఆమె ది బెస్ట్ కోసం చివరి ప్రయత్నం చేస్తోంది. 21 ఏళ్ల వయసులో తొలిసారి 2016 రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన మనికా చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకుండా అనుభవం మాత్రమే సాధించి తిరిగొచ్చింది. ఆ తర్వాత 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతో మూడో రౌండ్‌కి చేరింది. ఇప్పుడు మరింత పదునెక్కిన ఆటతో చెలరేగితే పారిస్ ఒలింపిక్స్‌లో పతకం దక్కవచ్చు. ఈ లక్ష్యాన్ని మనికా అందుకోవాలని భారత అభిమానులందరూ కోరుకుంటున్నారు. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
Nabha Natesh: బిర్యానీ.. అదో ఎమోషన్!
‘హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. ఇక్కడ చాలా రకాల బిర్యానీలు ఉంటాయి. ధమ్ బిరియానీ, మొఘల్ స్టైల్, నాటుకోడి, పులావ్, ఆవకాయ్, ఉలవచారు బిర్యానీ.. ఇలా ఎన్నోరకాలు ఉంటాయి. హైదరాబాద్ బిర్యానీ అంటే కేవలం ఫుడ్ కాదు.. అదొక ఎమోషన్. నాకు ఇక్కడి హలీమ్ అంటే చాలా ఇష్టం. హలీమ్ సీజన్లో తప్పకుండా తింటాను’ అని హీరోయిన్ నభా నటేశ్ అన్నారు.‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచి్చన ఈ బ్యూటీ ‘అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘డార్లింగ్’. ప్రియదర్శి హీరోగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నగరానికి వచ్చిన నభా హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని, బోనాల పండుగ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. – సాక్షి, సినిమా డెస్క్ఇదే నా ఫస్ట్ హోం..భాగ్యనగరం నాకిప్పుడు ఫస్ట్ హోం అయిపోయింది. నా స్వస్థలం కర్నాటకలోని చిక్‌మంగళూర్. చిన్నప్పటి నుంచి వేర్వేరు ప్రదేశాల్లో పెరిగాను. కానీ, ఆరేళ్లుగా తెలుగు సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. ఎంతో ప్రేమగా మాట్లాడతారు.. అభిమానిస్తారు.ఇక్కడి హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. ఫుడ్ అద్భుతంగా ఉంటుంది.. కావాల్సినంత పెడతారు(నవ్వుతూ). స్వీట్ చాలా ఎక్కువ తినిపిస్తారు. స్వీట్స్‌ని నేను ఎక్కువగా తినను. ఎందుకంటే డైట్లో ఉంటాను. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు అయ్యయ్యో... ఇప్పుడు ఎలా? తప్పకుండా స్వీట్స్ తినాలనే ఫీలింగ్ వస్తుంది. ఏదేమైనా హైదరాబాద్‌లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. బోనాలంటే ఇష్టం..హైదరాబాద్‌లో జరిగే బోనాలంటే నాకు చాలా ఇష్టం. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో బోనాల పాటకి నేను డ్యాన్స్ కూడా చేశాను. ఆ పాట చాలా బాగా పాపులర్ అయ్యింది. నేను కూడా బోనం ఎత్తుకున్నాను. ప్రస్తుతం బోనాల సమయంలోనే మా ‘డార్లింగ్’ మూవీ విడుదల కావడం సంతోషంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని ఆత్రుతగా ఉంది. మా నిర్మాత చైతన్య మేడంగారు ప్లాన్ చేస్తామని చెప్పారు. తప్పకుండా పాల్గొంటాను.ఆ నమ్మకంతోనే...ప్రత్యేకించి ఈ నగర సంస్కృతి అంటే ఇష్టం. బాగా చూసుకుంటారు. నా మొదటి సినిమాకు మా అమ్మ తోడుగా వచ్చేది. కానీ, ఇక్కడివారు ఎంతో జాగ్రత్తగా చూసుకునే విధానం అమ్మకి నచి్చంది. నేను తోడు రాకున్నా ఎంతో కేరింగ్‌గా చూసుకుంటారని అమ్మకి రావడంతో ఇప్పుడు రావడం లేదు. సినిమా సెట్స్‌లో నటీనటులను బాధ్యతగా చూసుకుంటారు.. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. మంచి సౌకర్యాలు కల్పిస్తారు.. గౌరవం ఇస్తారు. – సినీ నటి నభా నటేశ్ -
చెప్పింది చేసిన అరుదైన నేత
వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన వారిలో వైఎస్సార్‌ది మొదటి స్థానం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు. ఎప్పుడూ తెలుగువారి సంప్రదాయ పంచెకట్టులోనే కనిపించేవారు. వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు. ఆయన మాటలూ, చేతల్లో హుందాతనం తొణికిసలాడేది. ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ప్రజా నాయకుడాయన.రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి అంతిమ ఘడియల వరకూ ఓటమి ఎరుగని నేత. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్‌గా చిరస్థాయిగా నిలిచిన ఆయన పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. నేటి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రాజారెడ్డి, జయమ్మ దంపతులకు 1949 జూలై 8న జన్మించారు. బళ్లారిలో పాఠశాల విద్యాభ్యాసం, తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ ఉత్తీర్ణులై, 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదివారు.తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జెన్సీ పూర్తి చేసి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు. తరువాత జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో వైద్యునిగా పేదలకు ఏడాది కాలం సేవలందించారు. తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేసి, అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో 30 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు వైద్య సేవలు అందించి, రెండు రూపాయల డాక్టర్‌గా గుర్తింపు పొందారు.తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20 వేల 496 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి శాసన సభలో కాలు పెట్టినప్పటినుంచీ 2009 వరకు ఆయన పోటీ చేసిన అన్ని సార్లూ విజయం సాధించారు. 4 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడిగా, మూడు పర్యాయాలు సీఎల్పీ నేతగా, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, రాజకీయ నేతలకు మార్గదర్శకంగా నిలిచారు.పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్ 2004 మే 14న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, ఉచిత విద్యుత్, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిల రద్దుపై తొలి, మలి సంతకాలు చేశారు. అది మొదలు ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలు ప్రవేశపెట్టి అమలు జరిపారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటివి ఆయనను చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాయి.నిర్లక్ష్యం నీడలో ఉన్న కడప జిల్లాను 2004–09 కాలంలో సమగ్రాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించారు. కడప మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా రూపొందించారు. జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, పశువైద్య విద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్ ఆసుపత్రి, దంత వైద్యశాల, అలాగే ట్రిపుల్ ఐటీ నెలకొల్పారు. అనేక పరిశ్రమలు స్థాపింపజేశారు.ఆయన హయాంలో జలయజ్ఞంలో భాగంగా సుమారు రూ. 12 వేల కోట్లతో కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. గాలేరు–నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నెల్, గండికోట వరదకాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలు వైఎస్ హయాంలో రూపొందించినవే. మైలవరం ఆధునికీకరణ, సర్వారాయ సాగర్, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, వెలిగల్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. ఇంతలో 2009 సెప్టెంబర్ 2న సంభవించిన ఆయన అకాల మరణం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద కుదుపయ్యింది. – నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్, 98481 28215 (నేడు వైఎస్సార్ 75వ జయంతి) -
Anushka Jag: హ్యాపీ హ్యాపీగా.. హాయి హాయిగా..
‘రీబర్త్’, ‘టాబూ’ ‘హరికేన్’లాంటి పాటలతో ఆకట్టుకున్న ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అనుష్క జగ్ లేటెస్ట్ సింగిల్ ‘ఖుషీ ఖుషీ’ వైబ్రెంట్ యానిమేటెడ్ వీడియోతో విడుదల అయింది. తన యూనిక్ వాయిస్‌తో శ్రోతలను ఆకట్టుకుంటున్న అనుష్క తాజాగా ‘ఖుషీ ఖుషీ’తో స్వరసందడి చేస్తోంది. ‘ఖుషీ ఖుషీ అనేది స్పిరిచ్యువల్ పాప్’ అంటుంది అనుష్క.కాలేజీ రోజుల నుంచి అనుష్కకు ఫిలాసఫీ అంటే ఇష్టం. తాజా పాటలో ఫిలాసఫీ కనిపిస్తుంది. అయితే భారంగా, సంక్లిష్టంగా కాకుండా యూత్‌ఫుల్ స్టైల్లో లిరిక్స్ ఉంటాయి. టైటిల్ హిందీలో ఉన్నప్పటికీ లిరిక్స్ మాత్రం ఇంగ్లీష్‌లో ఉంటాయి.‘హ్యాపీ ఈజ్ ఏ ఫీలింగ్ ఐ హ్యావ్ గాట్ హ్యాపీ ఈజ్ ఏ స్విచ్ ఇన్ మై హార్ట్’లాంటి లిరిక్స్‌తో ‘ఖుషీ ఖుషీ’ దూసుకుపోతోంది. తనను తాను ‘మ్యూజికల్ టూరిస్ట్’గా చెప్పుకునే అనుష్క ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ్రపాంతాలలో కచేరీలు ఇచ్చింది. జెన్నిఫర్ ఓనీల్, జాన్ జోన్స్, డడ్డీ బ్రౌన్, డానీ పాపిట్, కైల్ కెల్పోలాంటి సంగీతకారులతో కలిసి పనిచేసింది. ప్రతి కొత్త ్రపాజెక్ట్లో తనదైన ప్రతిభ చూపుతుంది అనుష్క. ఇండియన్ మెలోడీలు, రిథమ్లతో ప్రవాసభారతీయులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకుంది అనుష్క జగ్. -
Arpan Kumar Chandel: తొలి ఆల్బమ్‌తోనే.. రాగాల రారాజుగా..
తొలి ఆల్బమ్‌తోనే వేలాది అభిమానులను సంపాదించుకున్నాడు దిల్లీకి చెందిన అర్పణ్ కుమార్ చందెల్. మల్టీపుల్ సూపర్–హిట్ ఆల్బమ్‌లతో అభిమానుల చేత ‘కింగ్’ అనిపించుకున్నాడు. స్వరరచనలోనే కాదు పాటల రచనలోనూ భేష్ అనిపించుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద మ్యూజిక్ కంపెనీలతో కలిసి పని చేసిన ‘కింగ్’ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో చోటు సంపాదించాడు....పాపులర్ ర్యాప్ రియాలిటీ షో ‘హసల్’తో తొలి గుర్తింపు పొందాడు అర్పణ్ కుమార్ చందెల్. ‘టాప్ 5’లో ఒకరిగా చోటు సంపాదించాడు. ఆ తరువాత ‘హసల్ 2.వో’లో స్క్వాడ్ బాస్‌గా మరింత పేరు తెచ్చుకున్నాడు.‘వివిధ రంగాలలో విజేతలుగా నిలిచిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం. వారి గురించి చదివినప్పుడల్లా ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. ఎప్పటికప్పడు కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు ఇష్టం’ అంటున్న అర్పణ్ దిల్లీలోని సాధారణ కుటుంబనేపథ్యం నుంచి వచ్చాడు.మొదట్లో ఫుట్‌బాల్ ఆటను బాగా ఆడేవాడు. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. అయితే ‘ఆట’ నుంచి ‘పాట’ వైపు అతని మనసు మళ్లింది. సంగీతంపై ఆసక్తి అంతకంతకూ పెరగడం మొదలైంది. మ్యూజిక్ పట్ల తన ఆసక్తి, ప్రయోగాలకు యూట్యూబ్ వేదిక అయింది. పాటలు రాయడం మొదలు పెట్టాడు.‘చిన్నప్పటి నుంచి నాకు రకరకాల సందేహాలు ఉండేవి. ఆ సందేహాలు, నాలోని ఊహాలతో పాటలు రాయడం మొదలుపెట్టాను’ అంటాడు అర్పణ్. ‘ది కార్నివాల్’ ‘షాంపైన్ టాక్’ ‘న్యూ లైఫ్’లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లతో సంగీత ప్రపంచంలో సందడి చేసి ‘కింగ్’గా పేరు తెచ్చుకున్నాడు అర్పణ్. ‘మేరీ జాన్’ పాట బిల్బోర్డ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ప్రేమ, భావోద్వేగాలు, జ్ఞాపకాలతో కూడిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శ్రోతలను ఆకట్టుకుంది. ‘ప్రతి జెనరేషన్ కనెక్ట్ అయ్యేలా మేరీ జాన్ పాటను రూపొందించాను. ఈ పాటలోని ఒక వాక్యం....నీ నీడలా ఎప్పుడూ నీతో ఉంటాను అనేది యువతరానికి బాగా నచ్చింది’ అంటాడు అర్పణ్.చార్ట్‌బస్టర్ ‘తూ ఆఖే దేఖ్లే’ తనను సంగీతకారుడిగా మరో మెట్టు పైకి ఎక్కించింది. ‘నేను చేసిన మంచి పని ఏమిటంటే నాలోని భావాలను కాగితంపై పెట్టడం. వాటికి బాణీ కట్టడం. నాకు తోచినది నేను రాస్తాను. అది శ్రోతలకు నచ్చింది. అందుకే వారు నన్ను కింగ్ అనిపిలుస్తున్నారు. తమ భావాలకు ప్రతినిధిగా చూస్తున్నారు’ అంటాడు అర్పణ్.అర్పణ్ సక్సెస్ మంత్రా ఏమిటి? ఆయన మాటల్లోనే... ‘ఓపికగా ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా వ్యవహరించాలో....ఇలా ఎన్నో విషయాలను నా ప్రయాణంలో నేర్చుకున్నాను. నేర్చుకున్నది ఏదీ వృథా పోదు’ నాన్–బాలీవుడ్ హిప్–హప్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్పణ్ కుమార్ చందెల్ ఇప్పుడు బాలీవుడ్ పాటలతోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.సింపుల్‌గా స్పీడ్‌గా...‘సింపుల్‌గా ఉండాలి, అందరూ కనెక్ట్ అయ్యేలా ఉండాలి’ అనుకొని పాట ప్రయాణం మొదలుపెడతాను. నా పాటలు శ్రోతలను ఆకట్టుకోవడానికి ఇదొక కారణం. ఈ పాట ఎవరి గురించో అనుకోవడం కంటే, ఈ పాట నా గురించే అనుకోవడంలో విజయం ఆధారపడి ఉంటుంది. పాట అనేది గాలిలో నుంచి పుట్టదు. దాని వెనుక ఏదో ఒక ప్రేరణ ఉంటుంది. నా పాటల నుంచి ఇతరులు స్ఫూర్తి పొందితే అంత కంటే కావల్సింది ఏముంది! – అర్పణ్ కుమార్ చందెల్ -
రవి పరంజపే : చిత్రకారుల సంపద..!
అప్పుడెప్పుడో అనబడే రోజుల్లో.. బాగ్ లింగం పల్లి వీధుల్లో ఎడాపెడా తిరిగే ఆర్టిస్ట్ చంద్ర గారి వెంట ఆంజనేయులు అనే నీడ పడేది. ఆ ఇరుకు చీకటి నీడల్ని తడుముకుంటూ నాలుగడుగులు వేస్తే తగిలేదే బేచులర్ కొంప ఆఫ్ అంజనేయులు అండ్ ఫ్రెండ్స్. ఆ ఇరుకు మురికింట్లో మంచం పైనా, పరుపు కింద అట్టలు గట్టుకు పొయిన అట్టల మధ్య ఉండేది ఆంజనేయుల్స్ కలక్షన్ ఆఫ్ ఆర్ట్. వందలాది దేశీయ విదేశీయ బొమ్మల కత్తిరింపు కలెక్షనది. అవన్నీ అలా తలకిందుంచుకుని నిద్దరోతే కలలోనైనా బొమ్మలొస్తాయేమోనన్నది హనుమంతుల వారి థీరి.ఆంజనేయులుగారి రూముకి వెళ్ళినప్పుడల్లా ఆ బొమ్మలని తీసి చూస్తూ ఉండటం నాకో ముచ్చట. అంతటి ఆ బొమ్మల కలెక్షన్ లో ఒకసారి నాక్కనబడిందో నలుపు తెలుపుల ఇంద్రచాపం. దూరాన మైసూర్ మహరాజవారి ప్యాలెస్, దసరా సంరంభం, ఏనుగులు అంబారీలతో సహా బారులు తీరాయి. కొమ్ములూదుతున్న నల్లని శరీరాలు, చత్రాలు పుచ్చుకుని రాజ సేవకులు, దారికిరువైపులా జనం.. 1970-80 మధ్యలో అచ్చయిన పత్రికా ప్రకటన తాలూకు బొమ్మ అది. బహుశా నేనపుడే కళ్ళు తెరవడం, నడక, ప్రాకటం లాంటి వయసులోవుంటా. బొమ్మలాగే కింది సంతకం కూడా చక్కగా వుంది రవి పరంజపే అని.ఆనాటి నుండి మొదలైంది రవి పరంజపే గురించిన అన్వేషణ, నాకు తెలిసిన వారికెవరికి తెలీని పేరిది. ఎక్కడి వారో, ఇప్పుడెక్కడ వున్నారో చేప్పేవారే లేరు. కాలం గడుస్తూ వుంది, గూగ్లింగ్ సాగుతొంది, "నహీ ఉదాస్ నహీ" హేమంత్ కుమార్ పాట వినబడుతూనే వుంది. కృషో, దీక్షో, పట్టుదలో, అదృష్టమో 1098/A రుతిక, మోడల్ కాలని, పూనే. ఇది పరంజపే పతా, ఫొన్ నంబర్‌తో సహ దొరికింది,.ఫోన్ చేసి ఆయనతో మాట్లాడా, ఎక్జైంటింగా వుంది ఆయన్ని వింటుంటే, దయగల గొంతు, ప్రేమగా మాట్లాడారు, పూనే రమ్మన్నారు, నా బొమ్మలు పట్టుకు రమ్మన్నారు. ఆ దినం నుండి రెండు నెలలపాటు చాలా మంది స్థానిక చిత్రకారులతో మాట్లాడా. వారందరికీ ఆయన బొమ్మల లింక్ పంపించా. ఆయన వర్ణ విన్యాసాలు వివరించా. అందరూ నాకు మళ్ళేనే థ్రిల్లయ్యారనిపించింది. చివరకు ట్రైను ఎక్కేరోజు నన్ను నేనే మోసుకుని బయలుదేరా.. చలో మహారాష్ట్ర్, జై మహారాష్ట్ర్.ఉదయం 6 గంటలకు దిగి చూస్తే రోమింగ్ లేక ఫోన్ డెడ్, మొబైళ్ల పుణ్యమాని వీధులో పబ్లిక్ బూతులు, ఎస్టీడి షాపులు లేవు, ఒకే ఒక్క కాల్ ప్లీజని సెల్లున్న వాడినెవడినైనా అడుక్కుంటే అలీబాబా 27వ దొంగని చూసినట్టు నా వైపు అదో లుక్కు. ఇదంతా వ్రాయదగ్గ మరో చావు. అఫ్జల్ గంజ్ టూ లంగర్ హౌజ్ వయా తార్నాక సూత్రం తెలిసిన ఆటో వాడి ఆటోలో 9:30 కు మొడల్ కాలనీలో ఆడుగు పెట్టా. ఇంటి నెంబర్ దొరక బుచ్చుకొడానికి చాతకాల(మధ్యలో వొ యధార్థ జోక్ బాపు గారిని కలవడానికి మద్రాస్ వెల్లినపుడు ఆయనకు ఫొన్ చేస్తే ఆయనన్నారు "ఫలానా కాలనీకి వచ్చి ఫలనా చోట ఆగి ఫలానా బాపు ఇల్లెక్కడని అడగకండి! ఎవరికీ తెలియదు, మలయాళి సూపర్ స్టార్ ముమ్ముట్టి ఇల్లు అడగండి ఎవరైనా చెబుతారు, ఆయన ఇంటి ఎదురిల్లే మాది, చాలా ఈజీ ". సిగ్గులేకుండా మేమలాగే బాపుగారి చిరునామా కనుక్కున్నాం కూడా.)పూనా లెఖ్ఖ కాస్త తేడాగా వుంది పరంజపే ఇల్లు అడిగీ అడగంగానే అరకిలొమీటర్ దూరం నుండే జనాలు సినిమా థియేటర్ అడ్రస్ చెప్పినంత ఈజీగా చేప్పేశారు .పరంజపేది పెద్ద బంగళా. భక్తిగా, ప్రాణంగా చేసిన బొమ్మల పని సంపాదించి పెట్టిన ఇల్లది. ఇంటర్నెట్లో చూసి వూహించుకున్న బొమ్మలు వేరు, ఇక్కడి వాస్తవం వేరు. ఇంటి గోడలనిండా గోడలంత పెద్ద పెద్ద పెయింటింగులు, ఇంటర్నెట్లో చూసి ఇది పెన్సిల్ పనని, ఇది సాఫ్ట్ పేస్టలతో వేసిందని ఊహించిన బొమ్మలన్ని అయన ఆయిల్స్ లో, ఆక్రిలిక్కుల్లో చిత్రించినవి! జిగేలని గులాబీలో మెరిసిపోతూ నీలంలోకి జరిగిన అ వర్ణ సమ్మేళనం ఆయిల్లొ ఎట్లా జరిగిందో, అసలెట్లా జరుగుతుందో అంతు చిక్కని రహస్యం ఆ పెయింటింగుల నిండా ఆవరించుకుని వుంది. బొమ్మలమీంచి పొడుగ్గా సాగిన గీతలు బొమ్మ వెనుక డిజైన్ లోకి అల్లుకుపోవడం కేవలం రంగుపెన్సిల్కే కదా సాధ్యం అనే సంభ్రమానికి ఫుల్ స్టాపిస్తూ ఆయన ఆ గీతల్ని బ్రష్ పుచ్చుకుని కేన్వాస్ మీదికి లాగాడనేదే నిజమంత నిజం.తను కథలకు, అడ్వర్టైజ్మెంట్లకు వేసిన నలుపు తెలుపు బొమ్మలు!! రోట్రింగ్ పెన్ 90 డిగ్రీల కోణంలో నిలపెట్టి లాగితే రావాల్సిన లైనది, అటువంటి లైన్ ను పాయింట్ బ్రష్ తీసుకుని మందం చెడకుండా గీశాడాయన.(తరువాత ఆ బొమ్మలన్నింటినీ కుంచె మాంత్రికుడు మోహన్ గారికి చూపి బ్రష్ తో గీశాట్ట! అంటే నిస్సహాయంగా నవ్వడాయన) బొమ్మల స్టడీ అంటూ వీధులెంట తిరుగుతూ ఆయిల్ పేస్టల్స్ తో చేసిన స్కెచ్‌లు మహా అరాచకం, ఆయన చేతిలోని మైనం వీధులు గట్టిన వైనం చూడాల్సిందే (అద్రుష్టవశాత్తు ఆయన బొమ్మలన్ని పుస్తకాల రూపంలో వచ్చాయి) ఆయన వేసిన ప్రకృతి చిత్రాలు, కథల బొమ్మలు, అడ్వర్టైజ్మెంట్ డిజైన్లు, పొర్ట్రైట్లు, పెన్సిల్ స్కెచ్‌లు ఇదంతా ఒక ఎత్తైతే, ఆర్చిటెక్చర్ రంగంలో ఆయన గీసిన పర్ఫెక్టివ్ బొమ్మలు ఇంకా ఎత్తు. అవి వేయడం వెనుక కృషి, కష్టం గురించి చెప్పుకుంటూ పొతుంటే వినడానికే కష్టంగా వుంది, వేయడానికి ఆయన ఇంకెంత కష్టపడ్డారో చూస్తే తప్ప తెలీదు.ఒక శైలి కాదు, ఒక తరహాలో నిలవలేదు, ఇదే ఉపరితలమని భీష్మించుక్కూచ్చోలేదు, బొమ్మ రహస్యం తేల్చడానికి రంగు అంతు చూడటానికి ఈ చిత్రకారుడు చేసిన కృషి మాటలలో చెప్పలేనిది, వాక్యాలలో వ్రాయలేనిది. మాటల మధ్యలో, బొమ్మల మధ్యలో మీకు తెలుగు చిత్రకారుల గురించి తెలిసిందెంత అని అడిగా, ఆయనకేం తెలీదు, ఎవరి పేరూ వినలేదు (మనమేం తక్కువ గొప్పవాళ్ళమా మనమూ రవి పరంజపే పేరు వినలేదుగా, దీనానాధ్ దలాల్ గురించి తెలుసుకోలేదుగా). కళ్ళు మూసుకుని బాపు తదితర పెద్దల పేర్లు వల్లించా, చంకలోని సంచినుంచి బాపు కొన్ని తులనాత్మక బొమ్మలు లాంటి పుస్తకం చేతిలో పెట్టా, మాట్లాడక పుస్తకం అంతా తిరగేశారు, దయచేసి నాకు ఈ పుస్తకం ఇవ్వగలవా అని తీసుకున్నారు, మళ్ళీ వాటినొకమారు సుతారంగా తిరగేసి, ఏ బాపు సాబ్ మహాన్ హై బహుత్ కాం కియా ఇనోనే అన్నారు. మనకా సంగతి తెలుసు కాబట్టే ఏ రాష్ట్ర మేగినా ఎందు కాలిడినా బాపు గారే మన ట్రంప్ కార్డ్.బాక్ టూ పరంజపే.. ఆయనది ఒక బొమ్మ చూసినా, వంద చూసినా వినిపించేది సంగీతమే అది రేఖా సంగీతం. ఈయన వర్ణ జంత్రగాడు. ఈయనకు సంగీతమంటే ప్రాణం. భీం సేన్ జోషి నా మానసిక సాంగీతిక్ గురువు. 1951 నుండి అయన్ని ఆరాధిస్తున్నాను, ఆయన గొంతునుంచి ఏదైతే నేను విన్నానో దాన్నే నా బొమ్మల్లో వినిపించాలని నా ప్రయత్నం అంటారు పరంజపే. దాన్ని నూటికి నూరుపాల్లు నిరూపించారు కూడా. ఒక చిత్రకారునిగా పరంజపేని చూడాలనుకున్న నాకు ఆయన అంతకు మించి ఎంతో వినిపించారు. జీవితం పట్ల ఆయనకున్న దృష్టి గొప్పది. మానవతం పట్ల విశ్వాసం ఆశాజనకమైనది. దేశ విభజనకు పూర్వం నుంచి ఈనాటి దాక మనుషుల, దేశాల మధ్య ఏర్పడిన గీతలు, వాటి వెనుక స్వార్ధాలు, జిన్నాను కాంగ్రేస్ నుంచి తప్పిచడానికి గాంధీజీ మద్దతించిన ఖిలాఫత్ కుట్ర, రాజకీయాల దగ్గర్నుంచి కేవలం స్థల, కాల సాపేక్షాలైనా మతాల వరకు నిరశించారు.ఆయన భావనలో ధర్మం గొప్పది. కులాల్ని, మతాన్ని పట్టుకు అదే ధర్మం అనుకుంటున్నారు. అసలైన ధర్మాన్ని తెలుసుకోవడానికి సౌందర్య భక్తి ఒక్కటే మార్గమని, ఆ దృశ్య సౌందర్యం, శ్రావ్య సౌందర్యమే తన ధర్మమన్నారు.. ఆఖరుగా సెలవు తీసుకుని వెనక్కు తిరిగి గుమ్మం దాటుతున్న నన్ను పిలిచారు.. ఏమని వెనక్కి తిరిగి చూస్తే చేతులు జోడించి "అన్వర్ అప్కే బాపు సాబ్‌కో మేరా ప్రణామ్ బోలో" అన్నారు.1935 కర్ణాటకలోని బెల్గాంలో పుట్టిన రవి పరంజపె.. కేబీ కులకర్ణి గారి శిష్యరికంలో బొమ్మల్లో ఓనమాలు దిద్దుకున్నారు, బ్రతుకు తెరువుగా బొమ్మల్ని ఎంచుకుని బొంబాయి చేరిన రవి పరంజపే శాశ్విత నివాసం పూనె అయ్యింది. బొమ్మలకు సంభందించిన ప్రతి పనిలో నైపుణ్యాన్ని సాధించారాయన. లెక్కకు మించిన దేశ విదేశ పురస్కారాలు ఆయన్ని వరించాయి. 2008లో ప్రతిష్టాత్మకమైన భైరు రతన్ దమని సాహిత్య పురస్కారం ఆయన ఆత్మ కథకు లభించింది. చిత్రకళకు సంభంధించి ఈయన ఇప్పటికీ అర డజనుకు పైగా పుస్తకాలు వెలువరించారు. చిత్రకారులు, చిత్రకళపై ఆసక్తి వున్నవారు తప్పక చూడదగ్గ, చదవదగ్గ, నేర్చుకోదగ్గ సంపద ఇందులో వుంది.2022 జూన్ 11వ తేదీన గొప్ప చిత్రకారులు రవి పరంజపే కళ్ళు మూసారు. ఆయన స్ఫూర్తి దీపాన్ని వారి సతీమణి పట్టుకు నిలబడ్డారు. ఆ దీప కాంతిలో దారి పోల్చుకుంటూ నేటికీ చిత్రకారులు అనేకులు ఆయన ఇంటికి వస్తారు. ఆయన బొమ్మలని చూస్తారు. ఉత్తేజితులవుతారు. వర్క్ షాపులు నిర్వహించుకుంటారు. బొమ్మల గురించి కథలు కబుర్లు మాటాడుకుంటారు. బొమ్మలు వేస్తారు. బొమ్మలని శ్వాసిస్తారు. రవి పరంజపే గారు తన జీవితకాలంలో కల్చరల్ ఐకన్. ఆయన మరణానంతరం ఆయన ఇల్లు ఒక సాంస్కృతిక కేంద్రం. రష్యన్ చిత్రకారుడు ఇల్యారెపిన్ గురించి మన తెలుగు ఆర్టిస్ట్ మోహన్ గారు ఇలా అన్నారు. "ఇల్యా రెపిన్ చిన్న వయసులోనే 'సక్సెస్' రుచి చూశాడు. దేశంలోనూ, బయటా గొప్ప విఖ్యాతి. ఎంత ఖ్యాతి అంటే జారిస్టు సెన్సార్ మందకు ఆయన బొమ్మలు మింగుడు పడకపోయినా ఏమీ చేయలేక పోయారు. 20వ శతాబ్దారంభానికి ఆయన పేరు ప్రఖ్యాతులు అత్యున్నత శిఖరాలకు చేరాయి. అయినా సరే 1900వ సంవత్సరంలో ఆయన అకాడమీనీ, భవంతులనీ, ప్రశంసలనీ, సంపదలనీ వదిలి పీటర్స్బర్కు దూరంగా చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడే కుటీరంలో ఉన్నాడు.ఆయన వ్యక్తిత్వం అయస్కాంతం లాంటిది. మాగ్జిమ్ గోర్కీ, అలెగ్జాండర్ కుప్రిన్, పావెల్ బునిన్ ఆ కుటీరానికి వచ్చేవారు. మయకోవ్‌స్కీ, సెర్గీ ఎసెనిన్ లాంటి ప్రముఖులంతా ఈ కుటీరంలో రెపిన్తో గడిపేవారు. లియో టాల్‌స్టాయ్ ఆయనకు ఆప్తమిత్రుడు. రష్యాలోని ప్రముఖ శాస్త్రజ్ఞులూ కళాకారులూ ఇక్కడికొచ్చి ప్రసంగాలిచ్చేవారు. ఈ కుటీరంపై పోలీసు నిఘా ఉండేది. వేగుల సమాచారం ఎప్పటికప్పుడు జార్‌కు చేరుతుండేది. ఆ కుటీరం ఇపుడు రష్యాలో పుణ్యతీర్థం లాంటిది. ఏటా లక్షమంది జనం అక్కడికెళ్లి ఇది రెపిన్ ఇల్లు, ఇది రెపిన్ తోట అని భక్తితో చూసి వస్తారు. గురజాడ ఇల్లు చూడడానికి మనమిలా విజయ నగరం వెళ్తామా"? – అన్వర్. -
అలా మొదలై.. 'డి' ఫర్ దినేశ్ వరకూ..
‘పడిపోవడంలో తప్పు లేదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ మాట అతనికి సరిగ్గా సరిపోతుంది. రెండు దశాబ్దాల క్రితం తొలిసారి భారత జట్టు తరఫున అతను అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. ఈ ఇరవై ఏళ్ల అతని ప్రయాణం అందరికంటే ఎంతో భిన్నంగా సాగింది. ఆటలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఎంతో ప్రతిభ ఉన్నా అనివార్య కారణాలతో అతడికి జట్టులో చోటు దక్కలేదు. అయినా, ఏనాడూ ఆశ కోల్పోలేదు. ఎప్పుడూ సాధన మానలేదు. ఇక ముగించాలని భావించలేదు.స్థానం కోల్పోయిన ప్రతిసారి పట్టుదలగా పోరాడి పునరాగమనం చేశాడు. ఎప్పుడు వచ్చినా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ వచ్చాడు. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. మరొకరైతే అలాంటి స్థితిలో అన్నింటినీ వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవారేమో! కానీ అతను ధైర్యంగా నిలబడ్డాడు. ఎక్కడా తన కెరీర్‌పై ఆ ప్రభావం లేకుండా స్థితప్రజ్ఞతో ముందుకు సాగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆగిపోయినా ఐపీఎల్లో సత్తా చాటి తన విలువేంటో చూపించాడు. ఆడే అవకాశం లేని సమయంలో వ్యాఖ్యాతగా తన మాట పదునును ప్రదర్శించాడు.39 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా, మైదానంలో చురుగ్గా ఆడుతూనే ఇటీవలే ఐపీఎల్‌కు ముగింపు పలికిన ఆ క్రికెటరే దినేశ్ కార్తీక్. గత ఇరవై ఏళ్లలో భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిన పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన ఇతర ఆటగాళ్లందరితో పోలిస్తే కార్తీక్ ప్రస్థానం వైవిధ్యభరితం, ఆసక్తికరం. దిగ్గజ ఆటగాళ్ల మధ్య కూడా తన ప్రత్యేకతను నిలుపుకోవడంలో అతను సఫలమయ్యాడు.భారత క్రికెట్లో వికెట్ కీపింగ్‌కు సంబంధించి అన్ని రుతువులతో పాటు ‘మహేంద్ర సింగ్ ధోని కాలం’ కూడా ఒకటి నడిచింది. వికెట్ కీపర్లను ధోనికి ముందు, ధోని తర్వాతగా విభజించుకోవచ్చు. ‘ధోని కాలం’లో ఎంతో మంది యువ వికెట్ కీపర్లు తెర వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎంతో ప్రతిభ ఉన్నా, దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతూ వచ్చినా ధోని హవా, అతని స్థాయి ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి.అలాంటి బాధితుల జాబితాలో అగ్రస్థానం దినేశ్ కార్తీక్‌దే. 2008–2016 మధ్య ఐదు సీజన్ల పాటు అతను దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్ కీపర్‌గా కూడా రాణించాడు. కానీ ఈ ప్రదర్శన కూడా అతడికి టీమిండియాలో రెగ్యులర్‌గా చోటు ఇవ్వలేకపోయింది. నిజానికి ధోనికి ఏడాది ముందే భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన కార్తీక్...ధోని అరంగేట్రానికి మూడు నెలల ముందే వన్డేల్లోకి అడుగు పెట్టాడు.కానీ ఒక్కసారి ధోని పాతుకుపోయిన తర్వాత కార్తీక్‌కు అవకాశాలు రావడం గగనంగా మారిపోయింది. కానీ అతను ఎప్పుడూ నిరాశ పడలేదు. తన ఆటనే నమ్ముకుంటూ ముందుకు సాగాడు. కీపర్‌గా స్థానం లభించే అవకాశం లేదని తెలిసిన క్షణాన తన బ్యాటింగ్‌ను మరింతగా మెరుగుపరచుకున్నాడు. తన ప్రదర్శనలతో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తనకు చోటు కల్పించే పరిస్థితిని సృష్టించుకోగలిగాడు.అలా మొదలై...సెప్టెంబర్ 5, 2004... అంతర్జాతీయ క్రికెట్లో దినేశ్ కార్తీక్ తొలి మ్యాచ్. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఈ పోరులో అద్భుత వికెట్ కీపింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. భూమికి దాదాపు సమాంతరంగా గాల్లో పైకెగిరి మైకేల్ వాన్‌ను అతను స్టంపౌట్ చేసిన తీరు ఈ కొత్త ఆటగాడి గురించి అందరూ చర్చించుకునేలా చేసింది. మరో రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం.2007లో ధోని సారథ్యంలో భారత జట్టు సాధించిన టి20 ప్రపంచకప్ విజయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఈ మెగా టోర్నీకి దాదాపు పది నెలల ముందు భారత జట్టు ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడింది. ఇందులో కూడా ధోని ఉన్నా, బ్యాటర్‌గా దినేశ్ కార్తీక్‌కు స్థానం లభించింది. దక్షిణాఫ్రికాపై మన టీమ్ నెగ్గిన ఈ పోరులో కార్తీక్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కడం విశేషం. చారిత్రాత్మక వరల్డ్ కప్ విజయంలో కూడా కార్తీక్ తన వంతు పాత్ర పోషించాడు.అలా మూడు ఫార్మాట్లలో కూడా అతను భారత జట్టులో భాగంగా మారాడు. టెస్టుల్లో కార్తీక్ హైలైట్ ప్రదర్శన 2007లోనే వచ్చింది. స్వింగ్‌కు విపరీతంగా అనుకూలిస్తూ అగ్రశ్రేణి బ్యాటర్లకే కొరుకుడు పడని ఇంగ్లండ్ గడ్డపై అతను సత్తా చాటాడు. కొత్త బంతిని ఎదుర్కొంటూ అక్కడి పరిస్థితుల్లో ఓపెనర్‌గా రాణించడం అంత సులువు కాదు. కానీ తాను ఎప్పుడూ ఆడని ఓపెనింగ్ స్థానంలో జట్టు కోసం ఆడేందుకు సిద్ధమయ్యాడు. నాటింగ్‌హామ్‌లో అతను చేసిన 77 పరుగులు, ఆ తర్వాత ఓవల్‌లో సాధించిన 91 పరుగులు భారత జట్టు 1986 తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.జట్టులోకి వస్తూ పోతూ...ఇంగ్లండ్‌లో రాణించిన తర్వాత కూడా కార్తీక్ కెరీర్ వేగంగా ఊపందుకోలేదు. తర్వాతి మూడేళ్లలో అతను 7 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. కీపర్ స్థానానికి అసలు అవకాశమే లేకపోగా, రెగ్యులర్ బ్యాటర్ స్థానం కోసం తన స్థాయికి మించిన అగ్రశ్రేణి ఆటగాళ్లతో పోటీ పడాల్సి రావడంతో తగినన్ని అవకాశాలే రాలేదు. వన్డేల్లోనైతే వరుసగా రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం వస్తే అదే గొప్ప అనిపించింది. 2010లో వన్డే జట్టులోనూ స్థానం పోయింది. కానీ కార్తీక్ బాధపడలేదు.పునరాగమనం చేయాలంటే ఏం చేయాలో తనకు బాగా తెలుసని నమ్మాడు. అందుకే మూడేళ్ల పాటు దేశవాళీ క్రికెట్లో చెలరేగాడు. ఫలితంగా 2013లో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో మళ్లీ స్థానం లభించింది. ధోని ఉన్నా సరే, బ్యాటర్‌గా చోటు దక్కించుకొని విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడయ్యాడు. మరో ఏడాది తర్వాత టీమ్‌లో మళ్లీ చోటు పోయింది. ఇప్పుడూ అదే పని. దేశవాళీలో బాగా ఆడటంతో మూడేళ్ల తర్వాత వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు.ఆ తర్వాత కొన్ని చక్కటి ప్రదర్శనలతో తర్వాతి రెండేళ్లు నిలకడగా రాణించిన అనూహ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోనూ చోటు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు. టెస్టుల్లో ధోని రిటైర్మెంట్ తర్వాత కూడా దురదృష్టవశాత్తూ కార్తీక్ పేరును పరిశీలించకుండా సెలక్టర్లు సాహాను ప్రధాన కీపర్‌గా తీసుకున్నారు. అయినా అతను కుంగిపోలేదు. ఏకంగా ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2018లో మళ్లీ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగగలిగాడంటే అతని పట్టుదల ఎలాంటితో అర్థమవుతుంది.2021 ముస్తక్ అలీ ట్రోఫీతో...మరచిపోలేని ప్రదర్శనతో...అంతర్జాతీయ టి20ల్లోనూ కార్తీక్ ప్రస్థానం పడుతూ లేస్తూనే సాగింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడే అయినా ఎక్కువ అవకాశాలు రాలేదు. అన్నింటికీ ఒకటే సమాధానం...ధోని ఉండగా చోటెక్కడుంది? 2010లో భారత్ తరఫున టి20 ఆడిన మరో ఏడేళ్లకు 2017లో అతను తన తర్వాతి మ్యాచ్ ఆడాడంటే అతని కమ్‌బ్యాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే 2018లో నిదాహస్ ట్రోఫీలో కార్తీక్ ప్రదర్శన అతనికి కొత్త అభిమానులను తెచ్చి పెట్టింది.సరిగ్గా చెప్పాలంటే 14 ఏళ్ల కెరీర్ తర్వాత ఇది కార్తీక్ మ్యాచ్ అనే గుర్తింపును తెచ్చి పెట్టింది. శ్రీలంకతో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 34 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో అతను జట్టును గెలిపించాడు. ఆఖరి బంతికి అతను కొట్టిన సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. ఎప్పుడో కెరీర్ ముగిసింది అనుకున్న దశలో 2022 టి20 వరల్డ్ కప్ జట్టులో కూడా అతను చోటు దక్కించుకొని 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడటం మరో విశేషం. మరో వైపు ఐపీఎల్లో కూడా ఎన్నో మంచి ప్రదర్శనలు కార్తీక్‌కు గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఐపీఎల్లో 6 టీమ్‌లకు ప్రాతినిధ్యం వహించిన కార్తీక్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ మొదలైన 2008నుంచి 2024 వరకు కార్తీక్ 257 మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంతో తన లీగ్ కెరీర్ ముగించాడు. ఈ టోర్నీలో 4842 పరుగులు చేసిన అతను అత్యధిక పరుగులు చేసినవారిలో పదో స్థానంలో నిలిచాడు.ఫ్యామిలీతో...ఆటుపోట్లు ఎదురైనా...కార్తీక్ స్వస్థలం చెన్నై. మాతృభాష తెలుగు. తండ్రి ఉద్యోగరీత్యా బాల్యం కువైట్‌లో గడిపినా... తర్వాత మద్రాసులోనే స్థిరపడ్డాడు. తండ్రి నేర్పించిన ఆటతో దిగువ స్థాయి క్రికెట్లో మంచి ప్రదర్శనలు ఇస్తూ సీనియర్ జట్టు వరకు ఎదిగాడు. అయితే ఆటగాడిగా భారత జట్టులో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కార్తీక్ వ్యక్తిగత జీవితంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 2007లో అతను తన మిత్రురాలు నికితను పెళ్లి చేసుకున్నాడు.ఐదేళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే తనతో వివాహ బంధంలో ఉండగానే భారత జట్టు, తమిళనాడు జట్లలో తన సహచరుడైన మురళీ విజయ్ను ప్రేమించడం, ఆపై తనకు దూరం కావడం అతడిని తీవ్రంగా బాధించాయి. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్‌తో పరిచయం అతని జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. 2015లో వీరిద్దరు పెళ్లి చేసుకోగా, వీరికి మూడేళ్ల వయసు ఉన్న కవల అబ్బాయిలు ఉన్నారు. –మొహమ్మద్ అబ్దుల్ హాది -
పొద్దు పోతున్నది...
‘పొద్దు పోయెనే శ్రీరాముని పూని భజింపవే మనసా!’ అని దిగులు పడతారు త్యాగరాజ స్వామి ఒక కీర్తనలో..‘నిద్దుర చేత కొన్నాళ్ళు,విషయ బుద్ధుల చేత కొన్నాళ్ళు’ అంటూ... జీవితంలో మూడోవంతు కాలం నిద్రలోనూ; ఇంద్రియ విషయాల మీదా, సుఖాల మీదా ఉన్న ఆరాటం తీర్చుకునే ప్రయత్నంలో మరింత కాలం వ్యయమై పోతుండె! అని వాపోయారు."పొద్దున లేచి, త్రితాపములను, నరులపొగడి, పొగడి కొన్నాళ్ళు, వట్టి ఎద్దు రీతి, కన్నతావుల భుజియించి,ఏమి తెలియక కొన్నాళ్ళు, ముద్దుగ తోచు భవసాగరమునమునిగి లేచుచు కొన్నాళ్లు, పద్దుమాలిన పామర జనులతో వెర్రిపలుకులాడుచు కొన్నాళ్ళు, ఓ మనసా!"ఉదయం లేచినప్పట్నుంచి, తాపత్రయ పడుతూ, వాళ్ళకూ వీళ్ళకూ భజన చేస్తూ, కేవలం పశువులా ఎక్కడ ఏది కనిపిస్తే దాన్నంతా భుజిస్తూ, పైపై మెరుగులతో ఆకర్షించే సంసార సాగరంలో మునకలు వేస్తూ ఉండటంలోనూ, సాటి అజ్ఞానులతో సారహీనమైన పోచికోలు చర్చలలోనూ చాలాకాలం నష్టమై పోతుండె!"ముదమున ధన, తనయ, ఆగారముల చూచిమదము చేత కొన్నాళ్ళు, అందు, చెదిరినంత, శోకార్ణవగతుడైజాలి చెందుటయు కొన్నాళ్ళు, ఎదటి పచ్చ చూచి తాళలేక, తానిలను తిరుగుట కొన్నాళ్ళు, ముదిమది తప్పిన ముసలితనమునముందు వెనక తెలియక కొన్నాళ్ళు."కొన్నాళ్ళు ధనమూ, సంతానమూ, ఇల్లూ అనుకుంటూ, వాటిని చూసి మదించటంలో గడిచె. అవి బెడిసికొడితే, మళ్ళీ దుఃఖంలో మునిగి, దైన్యతలో కొన్నాళ్ళు. ఎదుటివాడు పచ్చగా ఉంటే, ఏడుస్తూ కొన్నాళ్ళు. పెద్ద వయసు మీదపడేసరికి, బుద్ధి పనిచేయని స్థితిలో కొన్నాళ్ళు... మొత్తం మీద, బాగుగ నామ కీర్తనములు సేయుటే, భాగ్యమని అనక త్యాగరాజ నుతుడైన శ్రీరాముని తత్త్వము తెలియక కొన్నాళ్ళు. ఎంతో పొద్దు గడిచింది. గమనించుకొని, పొద్దు కొంతయినా మిగిలి ఉండగానే, కోదండ రాముడి మీద మనసు పెట్టి భజించకపోతే, జన్మ వ్యర్థం అని నాదబ్రహ్మ హెచ్చరిక. – ఎం. మారుతి శాస్త్రి -
తొలి వెలుగు దివిటీలు
బీఎస్సీ డిగ్రీ పొందిన తొలి భారతీయ మహిళ ఈకే జానకీ అమ్మాళ్. ఈమె 1921లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుంచి బాటనీలో పట్టభద్రులయ్యారు. తర్వాత 12 ఏళ్లకు బొంబాయి యూనివర్సిటీ నుంచి కమలా సాహ్ని, తర్వాతి సంవత్సరం ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రాధా పంత్ బీఎస్సీ డిగ్రీ పొందిన మహిళలు. అయితే వైద్యశాస్త్రంలో మాత్రం కాస్త ముందుగానే అంటే 1886లో కాదంబినీ గంగూలీ కలకత్తా మెడికల్ యూనివర్సిటీ, ఆనందీ బాయి జోíషీ పెన్సిల్వేనియా ఉమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి వైద్యశాస్త్రంలో పట్టాలు పొందిన తొలితరం భారతీయ మహిళలు. ఈ రెండు విజ్ఞాన స్రవంతుల మధ్య మూడున్నర దశాబ్దాల ఎడం ఉండటమెందుకు? సిపాయిల తిరుగు బాటుగా బ్రిటిష్ వారు పిలిచిన భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మొదలైన 1857 లోనే తొమ్మిది నెలల వ్యవధిలో కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వ విద్యాలయాలు తొలిసారిగా ఏర్పడ్డాయి. 1884లో లార్డ్ డఫ్రిన్ భారతదేశపు వైస్రాయ్ అయ్యారు. లేడీ డఫ్రిన్గా పిలవబడిన హ్యారియట్ జార్జినా రోవాన్ హామిల్టన్ చొరవతో 1885లో ఏర్పడిన ఈ ఫండ్ ద్వారా మనదేశ మహిళలు వైద్యులుగా, సహాయకులుగా, నర్సులుగా తర్ఫీదు పొందడానికీ, చదువుకోడానికీ వీలైంది. డఫ్రిన్ ఫండ్ వల్ల భారతీయ యువతులు ఇంగ్లాండులో వైద్యశాస్త్రం చదువుకోవడానికీ; అలాగే ఇంగ్లాండ్, ఇతర ఐరోపా నుంచి మహిళలు భారతదేశానికి వచ్చి వైద్యం చేయడానికీ వీలైంది. ఈ ఫండ్‌కు కశ్మీరు, దర్భంగా వంటి సంస్థానాధీశులు ఆర్థిక సాయం చేశారు. అలాగే బ్రిటిష్ ప్రముఖులతో పాటు మహారాజా జ్యోతీంద్ర మోహన్ ఠాగూర్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, సర్ దిన్షా మానేక్ జీ పేటిట్ వంటి భారతీయులు కూడా ఎంతో తోడ్పడ్డారు. అయితే లేడీ డఫ్రిన్ స్పందించే గుణం, చొరవ కారణంగానే ఈ ఫండ్ రూపుదిద్దుకుని కొనసాగింది. 1908 నాటికి దీని ద్వారా కేవలం 43 మంది మాత్రమే యోగ్యులైన మెడికల్ ప్రొఫెషనల్స్ తయారు అయ్యారనీ, వారిలో కేవలం 11 మంది మాత్రమే పట్టభద్రులనీ తెలుస్తోంది. ఈ ఫండ్ ద్వారానే 1886లో తొలి భారతీయ వైద్యశాస్త్ర మహిళా పట్టభద్రులు తయారయ్యారు. 2005లో ‘డఫ్రిన్ ఫండ్ యాక్ట్ –1857’ రద్దయ్యింది. భారతీయ వైద్యరంగానికి మహిళల అవసరం చాలా ఉన్నందున, క్రమంగా జీవ శాస్త్రాల పట్ల కూడా మహిళలకు ఆసక్తి పెరిగింది. అయితే మహిళలు సైన్స్ చదువు కోవడానికి అవకాశం పెద్దగా ఉండేది కాదు. దాంతో అరకొర అవకాశాలు, అంతకు మించిన వివక్ష ఉన్న పరిస్థితుల్లో భారతీయ మహిళలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తొలి అడుగులు వేశారు. – డా‘‘ నాగసూరి వేణుగోపాల్ విశ్రాంత ఆకాశవాణి అధికారి ‘ 94407 32392 -
గొప్ప పరిపాలనా దక్షురాలు..
దేశమంతా ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది మే 31 దాకా అహిల్యాబాయి త్రిశత జయంతి ఉత్సవాలు జరుపుకుంటోంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ తెలివి, మేధస్సు, ధైర్యసాహసాలతో ఆమె మహారాణిగా ఎదిగారు. సువిశాల భూభాగంలో పరిపాలన చేసి ఎన్నెన్నో సంస్కరణలు తెచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు, బాలిక విద్య కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త ఆమె.మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ వద్ద గల చోండి గ్రామంలో అహిల్యాబాయి 1725 మే 31న జన్మించారు. ఆమె తల్లి సుశీలా షిండే, తండ్రి మంకోజీ షిండే. నేటి రాజకీయ భాషలో సంచార తెగల కుటుంబం ఆమెది. చిన్న నాటనే ఆమెకు గల భక్తి, నిర్భీతి చూసి మల్హార రావు హోల్కర్(మరాఠా సుబేదారు) ముగ్ధుడయ్యారు. తన కుమారుడు ఖాండేరావు హోల్కర్కు ఇచ్చి వివాహం చేశారు. అప్పుడామె వయస్సు పదేళ్లు, పెళ్లి కొడుకు వయస్సు పన్నెండేళ్లు. అలా రాజ కుటుంబంలోకి ప్రవేశించింది. అక్కడే యుద్ధ విద్యలు, ప్రజా పాలనా విద్యలు నేర్చింది. వారి మామగారి వెంట అనేక యుద్ధాలకు వెళ్లి, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించింది. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరింది.అయితే, భర్త ఖాండే రావు 1754లో, తండ్రి వంటి మామ మల్హార రావు 1766లో, తర్వాతి ఏడాది కుమారుడు మాలే రావు... ఇలా ముఖ్యులందరూ అకాలంగా తనువు చాలించారు. ఈ పిడుగుపాటు ఘటనలతో అహిల్య కుంగిపోలేదు. 16 యేండ్ల కుమారుణ్ణి కోల్పోయిన దుఃఖంలోనే 1767లో సింహాసనం అధిరోహించారు. శివ భక్తురాలుగా శివుని ప్రతినిధిగా పరిపాలన చేపట్టారు. ఇండోర్‌కు దూరంగా, నర్మదా నదీ తీరాన ఉన్న మహేశ్వర్ (మధ్య ప్రదేశ్) గ్రామాన్ని తన ముఖ్య పట్టణంగా నిర్మించారు. అది సమగ్ర పట్టణాభివృద్ధి యోజనకు మంచి ఉదాహరణ.గొప్ప సంస్కరణ వాది..మహిళలకు విద్య, భర్తను కోల్పోయిన మహిళలకు భర్త ఆస్తిపై హక్కు, వితంతువులకు పునర్వివాహం చేసుకునే అవకాశం, బాల్య వివాహాల పట్ల ఆంక్షలు... ఇలా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు ఆమె తీసుకున్నారు. ఆమె పాలనలో అడవుల నరికివేతను నిషేధించారు. ఆదాయం ఇచ్చే చెట్లను నాటించారు. త్రాగుడును నిషేధించారు. వరకట్నాన్ని నిషేధించారు. ఆమె కోట తలుపులు సామాన్యులు తమ గోడు చెప్పుకోడానికి ఎప్పుడూ తీసే ఉండేవి. వ్యవసాయం కొరకు నూతన చెరువుల నిర్మాణం, నీటి నిల్వకు ట్యాంకులు, నదులపై ఘాట్లు నిర్మించారు. వస్త్ర పరిశ్రమ, పట్టు పరిశ్రమ ఉత్పత్తుల అమ్మకాలకు వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహేశ్వరీ చీరలు అంటే ఇప్పటికీ మంచి పేరే ఉంది!భిల్లులు, గోండులు వంటి గిరిజనులకు భూములను ఇచ్చి వారిని వ్యవసాయం వైపు మళ్లించారు. అటవీ ప్రాంతంలో ప్రజలకు దారి చూపుతూ ఉండే భిల్లులకు ప్రజల నుండి భిల్ కావడి వంటి పన్నును సేకరించుకునేట్లు ప్రోత్సహించారు. ఆ ఆదాయంతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, అభివృద్ధి పథకాలు చేపట్టారు.హిందూ ఆలయాల పునరుజ్జీవనం కోసం..తన రాజ్యం పైకి ఇతరులు దాడికి వస్తే, గుర్రం ఎక్కి, ఖడ్గం చేతపట్టి రణరంగంలో స్వయంగా నేతృత్వం చేపట్టిన ధీర వనిత ఆమె. 1783లో జైపూర్ రాజ కుటుంబానికి చెందిన చంద్రావంత్ను అణిచి వేయడంలో ఆమె చూపిన యుద్ధ నైపుణ్యాన్ని నానా ఫడ్నవీస్ పొగుడుతూ ఆనాడు పూనాలో గాలిలో శతఘ్నులను పేల్చాడు.ఆమె హిందూధర్మ పునరుజ్జీవనానికి ఎంతగానో కృషి చేశారు. విదేశీ పాలకుల వల్ల దేశ వ్యాప్తంగా ధ్వంసం అయిన 82 మందిరాలను తిరిగి నిర్మించారు. సోమనాథ్, రామేశ్వరం, కాశీ, గయ, పూరి, శ్రీశైలం... ఇలా అనేక మందిరాలను పునర్నిర్మాణం చేశారు. అన్నదాన సత్రాలను కట్టించారు. తన రాజ్యంలో అన్ని కులాల, మతాల ప్రజల పట్ల సమ భావంతో వ్యవహరించారు. కనుకనే టిప్పు సుల్తాన్ వంటి ముస్లిం రాజులు సైతం ఆమె ధార్మిక నిర్మాణాలకు అడ్డు చెప్ప లేకపోయారు. ఆమె సంస్థానంలో దేశంలోని 13 రాజ్యాలకు చెందిన ప్రతినిధులు ఉండేవారు. వివిధ రాజులతో మిత్రత్వం నడిపి, నూతన దౌత్య విధానాలకు దారి చూపారు. కనుకనే దేశ వ్యాప్తంగా వివిధ రాజుల రాజ్యాలలోని హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేయగలిగారు.సాధారణంగా కవులు... రాజులను పొగిడి ధన సేకరణ చేసుకుంటూ ఉంటారు. కవులు ఆమెను పొగుడుతూ కవిత్వం రాయడాన్ని ఆమె అంగీకరించేది కాదు. ‘నన్ను పొగుడుతూ కవిత్వం చెబితే మీకు ఆదాయం ఉండదు. ఆ శివుడిని పొగడండి లేదా దేశాన్ని కాపాడుతున్న సైనికులను పొగుడుతూ కవిత్వం రాయండి’ అనేది. అయినా ఆమెను లోకమాత, సాధ్వి, పుణ్యశ్లోక, మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు గౌరవించారు. 1795 ఆగస్ట్ 13న తన 70వ ఏట తనువు చాలించిన ఆమెను ధార్మిక ప్రవృత్తి కల్గిన పరిపాలకురాలిగా పాశ్చాత్య చరిత్రకారులు కొనియాడారు. ఆమె జన్మించి 300 ఏళ్లయింది. కర్మ యోగిగా, మాతృత్వం నిండిన రాణిగా ఆమెను పేర్కొనడం సముచితం. – శ్యాంప్రసాద్ జీ, అఖిల భారతీయ సంరసతా ప్రముఖ్ (నేటి నుంచి అహిల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి ఉత్సవాలు ప్రారంభం) -
నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
"వాడు గొంతెత్తితే అమరగానమట వెళ్ళి విందామా అనడుగుతే.. ఎహే! సర్విలో చాయ్ తాగి సిగరెట్ వెలిగించుకుని ఆటో ఎక్కితే పది నిముషాల్లో ప్రెస్ క్లబ్. రాజాగారి పుస్తకావిష్కరణ అనంతరం తాగినంత చుక్క, మెక్కినంత ముక్క పద గురూ.." అలా పద పద మని పరిగెత్తే సాహితీ పద సవ్వడులు హడావుడిలో గోపి గారు గీసిన కుంచె మెత్తని సిరాగానం ఎవరికీ పట్టలేదు. అసలు అవసరమే లేదు, అవసరమనే ఎరికే లేదు. ఒక మూడేళ్ల క్రితం ఆయన బొమ్మని వదిలి వెళ్ళిపోయారు. ఆయన్ని మనం, మనల్ని ఆయన ఎప్పుడూ పట్టుకుని లేము కాబట్టి గోపి నిష్క్రమణ వల్ల ఎవరికీ నష్టం లేదు, ఏదో ఒక పుంజీడు మంది బొమ్మ తడమగలిగిన వ్రేళ్ళున్న గుడ్డి వాళ్లకు తప్ప. అట్లా తడమగలిగిన మెత్తని అరచేతుల కోసం.. ఒక నాలుగు మాటల గోపి అనే ఒక గొప్ప చిత్రకారుడి కథ, బొమ్మ, కబుర్లు!⇒ అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదివ సంవత్సరం. బషీర్‌బాగ్ ప్రాంతం. ఇటు సుప్రభాతం పత్రికకి, అటు మాభూమి మాగజైన్ కి మధ్యలో ఒకటే కట్టడం అడ్డు. ఇక్కడ సుప్రభాతంలో పనిచేసే వాళ్లంతా అటేపు మాభూమిలో జాయినయిపోయారు. మా సుప్రభాతం వాళ్ళు కాక అక్కడ మాభూమికి కొత్తగా వచ్చింది ఆర్టిస్ట్ పాండు ఒకడే. వాడు తప్పా మిగతా మాభూమి పత్రిక అంతా సుప్రభాతంలానే ఉండేది. అదే వాసు గారు, ఏబికేగారు, నాగ సుందరీ, కొండేపూడి నిర్మల... అయినా పాండు తప్పా వాళ్లంతా నాకు పరాయి వాళ్ళు గానే ఉండే వాళ్ళు. ఆ మద్యాహ్నం నేను ఈ పత్రికలో భోజనం ముగించుకుని ఆ పత్రికలో పాండుతో కలిసి టీ తాగుదామని చేరా. అక్కడ పాండు తను వేసిన బొమ్మలని ఆర్టిస్ట్ గోపి గారికి చూపిస్తున్నాడు. ఆయన బహుశా ఆ పత్రికలో ఏదయినా ప్రీలాన్సింగ్ పని నిమిత్తం వచ్చి ఉంటారు. అదే నేను గోపిగారిని మొదట చూడ్డం. అయినా ఆయన గోపీగారని నాకు తెలిసిపోయింది! ఎలానో నాకే తెలీదు. పాండు బొమ్మలని చూసి గోపి గారు ఇలా అంటున్నారు.. "ఒకే ఆర్టిస్ట్ బొమ్మలు చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు పాండు, చాలా మంది బొమ్మలని చూసి అందరి నుండి నేర్చుకొవాలి, అందరి స్టయిల్స్ నుండి నీకంటూ ఒక కొత్త శైలి ఏర్పడుతుంది" పాండు బుద్దిగా తల ఊపుతుంటే నాకు నవ్వు వచ్చింది.⇒ అయినా నేను నవ్వలా, గోపి గారు తలెత్తి నావంక చూసి నవ్వారు, ఆయన నవ్వు దయగా ఉంటుంది. ఆయనెప్పుడు చిన్నగా, సన్నగా దయగా, కరుణగా చూస్తారు, నవ్వుతారు. నేను అన్వర్ నని అప్పుడు ఆయనకు తెలీదు. నేనప్పుడు ఆర్టిస్ట్ నని నాకు ఒక అనుమానం. చాలా ఏళ్ళు గడిచి "ఇప్పట్లో మీ అభిమాన చిత్రకారుడు ఎవరు ఆర్టిస్ట్ జీ" అని గోపీ గారిని ఒక ఇంటర్యూ లో అడిగితే ఆయన అన్వర్ పేరు చెప్పారు. నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ నని ఏమంత నమ్మకం లేదు. ఏళ్ళు ఇన్ని వచ్చాక ఇంకా విషయం తెలీకుండా ఉంటుందా! ఆర్టిస్ట్ అంటే కేవలం బాపు, బాలి, చంద్ర, గోపీ, మోహన్, పి ఎస్ బాబు, కరుణాకర్, సురేష్, చారీ, హంపి మరియూ గింపి ఆని.⇒ మణికొండలో ఆర్టిస్ట్ కడలి సురేష్ గారు ఉండేవారు. పిబ్రవరి ఎనిమిది రెండువేల పదహైదు మధ్యాహ్నం నేనూ, అనంత్ అనే జర్నలిస్టు ఒకాయన కలిసి సురేష్ గారి ఇంటికి వెళ్ళాం ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయింటింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ప్రేములుగా రామాయణం బొమ్మల సిరిస్. అన్నీ అద్భుతాలే. నేను ఒక కంట ఆయన బొమ్మలు మరో దొంగ కంట ఆయనది కాని మరో బొమ్మ చూస్తున్నా, టీవి వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్ క్యాలెండర్ బొమ్మ ఒకటి.ఎక్కడుంది. ప్రతి షీట్ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. ముచ్చట గొలిపే బొమ్మలు, అందమైన బొమ్మలు. గంగా, జమున, నర్మద, తమస, గోదావరి, కావేరీ నదీమతల్లుల చరిత్రని ఐదు గళ్ళల్లో బొమ్మలుగా చెప్పిన నీటివర్ణపు చిత్రలేఖనాలు అవి.⇒ గోపీ అనే సంతకమంత సింపుల్ లైన్ బొమ్మలు అవి. పెన్సిల్ పట్టి వంద ఎవరెస్ట్ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు అవి. గొప్ప బొమ్మల్ని చూస్తే నాకు కంట దుఖం ఆగదు. కన్నీరు అంటే మలినం నిండిన హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ కడిగెయ్యడమే, బొమ్మ ముందు నిలబడి ఆ కాసింత సేపు శాపవిమోచనం జరిగిన మనిషిగా మనగలడమే. ఒక సారి రాబర్ట్ ఫాసెట్ అనే గొప్ప చిత్రకారులు గారు చిత్రించిన బొమ్మ చూసి ఇలా కంట తడిపెట్టిన అనుభవం ఉంది నాకు, వాంగాగ్ బొమ్మల గిరికీలలో ఇలానే చాలాసార్లు అయిన సంఘటనలు ఉన్నాయి నాకు. కుంచె అంచున అమృతం చిందించిన వాడికి కూడా మరణం తప్పదా అని మరలి మరలి దుఖం అవుతుంది జీవితం.⇒ సురేష్ గారు వేసిన వేలాది బొమ్మలని వదిలి ఆదిగో ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డు వచ్చింది. అడిగినా "అన్వర్ గారు కావలిస్తే నా బొమ్మలు అన్ని పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి" అనేవారే సురేష్ గారు. ఎందుకంటే గోపీ గారు చిత్రకారులకే చిత్రకారుడు. గోపీ గారి గురించి మహాను’బాపు’ తమదైన పొదుపైన మాటలతో ఇలా అన్నారు. "నాకున్న గురువుగార్ల ల్లో ఒక గురువు శ్రీ గోపి- ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిసలాడుతూ వుంటాయి. ఆయన ఇమాజినేషన్ కూడా అంత డైనమిక్ గా ఉంటుంది-గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతా వాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్ ఫీట్! పగడ్బందీగా- కొమ్మకు వేలాడుతూ- అంతస్తులు- కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఒకసారి ఇంజనీర్ల కన్వెన్షన్ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే , శ్రీ గోపి గారు దానికి ముఖచిత్రంగా గిజిగాడు బొమ్మ వేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టికి ఇంజనీర్లు ప్రతి సృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమానిజషన్ అంటే, అదీ గోపీ అంటే!⇒ ఆర్టిస్ట్ మోహన్ గారు చెప్పేవారు కదా" గోపి అబ్బా! వాడబ్బా! ఉస్మానియా యూనివర్శిటి బిల్డింగ్ అంతటిని వేసి గుంపులు గుంపులుగా ఆ మెట్ల మీద నడిచి వచ్చే వందల కొద్ది స్టూడెంట్స్ బొమ్మ వేశాడబ్బా. చచ్చి పోతామబ్బా ఆ కాంపోజిషన్ చూస్తుంటే, వాడి బొమ్మలు మీరేం చూళ్ళేదబ్బా!, మీరంతా వేస్టబ్బా! మిమ్మల్ని తన్నాలబ్బా" మోహన్ గారికి బాపు, బాలి, చంద్ర, గోపి అంటే వల్లమాలిన ప్రేమ, వ్యామోహం, ఆయన ముందు వాళ్ళని ఏమయినా పొల్లు మాట అని చూడండి, తంతాడు మిమ్మల్ని పట్టుకుని. తరువాత రోజుల్లో ఆదివారపు అబిడ్స్ వీదుల్లో, పాత పుస్తకాల రాశుల్లో మోహన్ గారు చెప్పిన ఆ ఉస్మానియా కాంపోజిషన్ నా కంట పడింది.⇒ అదే కాదు అపరాధ పరిశోధన అనే డిటెక్టీవ్ పత్రికల్లో ఆయన గీసిన కార్టూన్ బొమ్మల క్యారెక్టర్లు, అత్యంత అధునాతనమైన ఆ శైలి ఈరోజు వరకు తెలుగులో ఏ చిత్రకారుడు సాధించలేక పొయారు. అడపా దడపా ఏపిఎస్ ఆర్టిసి వారి కోసం వేసిన పోస్టర్ బొమ్మలు ఆ డ్రయివరు, అ బస్సు, డ్రయివర్ భార్యా పిల్లల బొమ్మల ఫ్రేములనుండి నవ్వుతున్న మొహాలు, టాటా బైబైలు ఏం బొమ్మలవి! ఏం రంగులవి! ఏం రోజులవి! ఏం పత్రికలవి!!! అనగనగా అనే ఆ రోజుల్లో సాహిత్యం- చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగారించుకునేది.⇒ ఆయన ఒక కన్ను చేతనున్న కుంచెవేపు మరో కన్ను కెమెరా వంక చూస్తూ ఉన్న కాలమది. ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు " మీరు కాకపోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి అంటే బాపు గారి పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే"! గోపి గారు అమిత పెర్ఫెక్షనిస్ట్. బొమ్మ ఆయనకు నచ్చేలా వచ్చేదాక జనం ఆగలేరుగా, మళ్ళీ బాపు గారి దగ్గరికి వెళ్ళి "ఏవండి మీరేమో గోపి దగ్గరికి వెళ్లమన్నారు, ఆయనేమో సమయానికి బొమ్మలు ఇవ్వట్లేదు" అని పిర్యాదు చేస్తే "నేను రేడియో మంచిది అన్నాను, అందులో ప్రోగ్రాములు మీకు నచ్చకపోతే నేనేం చెయ్యను" అని ఒక నవ్వు.⇒ గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపు బొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండి పోయిన పత్రికల రోజులని గోపి అనే దీపం వంటి సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్ పేజీల డ్రాయింగులకి కొత్త కాంతులు చూపించింది, రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగిమలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్నిటిని ఆయన డైనమిక్ టచ్ తో మార్చేశారు. రాత్రికి రాత్రి కలలా వచ్చి కూచున్నది కాదు ఆయన చేతిలోని డైనమిక్ టచ్! రాక్షస సాధన అంటారే అలా లైప్ డ్రాయింగ్ ని సాధన చేశాడు ఆయన. మెలకువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్ బుక్ ఉండేదిట. కనపడిన ప్రతీది బొమ్మగా మలిచేవారు, చూసిన సినిమా ల్లో సన్నివేశాలు గుర్తు పెట్టుకుని వచ్చి ఆ యుద్ద పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్ డాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ప్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెరపటం, మళ్ళీ గీయటం....⇒ హైదరాబాదు మహా నగరంలోని ఆర్టిస్టుల్లో మోహన్ గారు మహా చులకన ఇరవై నాలుగు ఇంటూ ఏడు రోజులు అనే ఎక్కం మాదిరి ఆయన ఎప్పుడయినా దొరికేవాడు, కలవాలి అనుకుంటే బాలి గారు చంద్ర గారు కూడా ఈజీగా దొరికేసి గంటలు గంటలు కూడా దొర్లిపోయేంత కబుర్లుగా దొరికేవారు. చివరకి మద్రాసి బాపుగారిని కూడా నేను ఎప్పుడంటే అప్పుడు దొరికించుకునే వాణ్ణి. గోపి గారే ఎక్కడ ఉంటారో, ఎప్పుడు కనపడతారో, ఒకసారి వదిలిపోతే మళ్ళీ ఎప్పుడు చిక్కుతారో అసలు అర్థం అయ్యేది కాదు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు "అన్వర్ గురువు గారు ఎలా ఉన్నారు" అని అడిగే వారు. గురువు గారు అంటే బాపు గారు. " మా అబ్బాయికి మ్యూజిక్ మీద మంచి ఆసక్తి ఉంది, ఈ సారి గురువు గారు వస్తే చెప్పు అన్వర్, మా వాణ్ణీ ఎక్కడయినా సినిమాల్లో పెట్టిస్తారేమో కనుక్కుందాం" అనేవారు. అనడం వరకే మాట ఈ జంతరమంతర జీవితంలో ఎవరికీ దేనికే సమయం దొరికే సందే లేదు. చివరకి చూస్తే డైరీల పేజీలన్ని ఖాలీ గానే ఉంటాయి.⇒ పెంటెల్ పాకెట్ బ్రష్ పెన్ అని జపాన్ ది. దాని మీద గోపీ గారికి మనసు పడింది. అది ఒకటి నాకు కావాలి అన్వర్ అని అడిగాడు, దానితో పాటే కొన్ని డిప్ నిబ్స్ కూడా ఇవ్వగలవా అన్నారు? "సార్ కొన్ని రోజులు ఓపిక పట్టండి మనకు మామూలుగా దొరికే, హంట్, విలియం మిషెల్ నిబ్స్ కాకుండా, తచికావా అని కామిక్ నిబ్స్ కొన్ని ఇండియాకు ఇంపోర్ట్ కాబోతున్నాయి, అవి మీకోసం తెప్పిస్తా" అని ఆయన బొమ్మల గుర్రాన్నిపట్టి ఆపి ఉంచా. ఒక రెండు వారాలు గడిచాకా ఫోన్ చేసారు "అంత తొందర ఏమీ లేదులే, ఊరికే ఆ నిబ్బులు అవీ ఎప్పుడు వస్తాయో కనుక్కుందామని" అన్నారు, నాకు ఎంత అయ్యో అనిపించిందో.⇒ మా ఇంపొర్టర్ కి ఫోన్ చేశా. వస్తువులు వచ్చి ఉన్నాయి, కరోనా తలనొప్పి వల్ల కస్టమ్స్ నుండి కంటైనర్ రిలీజ్ కాలేదని వార్త. మరో రెండు వారాలు భారంగా గడిచిపోయాకా అప్పుడు చేతికి వచ్చాయి సరంజామా మొత్తం. రాగానే గోపీ గారికి ఫోన్ చేసా, "ఇంటికి రానా? ఆఫీసుకు రానా?" అన్నారు. అంత పెద్దాయనను రప్పించడం ఎందుకనిలే అని నేనే వస్తా సార్ అన్నా ఆయన వినిపించుకోలా, అసలే నాకు పని పెట్టి అవి తెప్పించానని ఆయనకు గిల్టి గా ఉంది. ఆయనే ఈ మధ్య ఓ మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. ఎదురు వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చుకున్నా. మా లావణ్య ఇంట లేదు, ఉండి ఉంటే ఇంత ఉడుకుడుకుగా ఏదయినా వండి పెట్టేది. ఆయన్ని కూచోబెట్టి టీ తయారు చేసి తెచ్చా.⇒ అన్నట్టు ఆర్టిస్ట్ చంద్ర గారు టీ ఎంత బాగా పెడతారో, ఆయన చేతి పచ్చిపులుసు,కోడిగుడ్డు పొరటు తిన్నామా! బస్. బొమ్మలు గిమ్మలు మరిచి పోతాము. ఎందుకు లేండి వెధవ బొమ్మలు, ఇంకో గంట ఆశమ్మపోశమ్మ కబుర్లు చెప్పుకుని తిన్నతిండి అరిగాకా ఇంకో ట్రిప్ అన్నంలోకి పచ్చిపులుసు, కోడిగుడ్డు పొరటు కలుపుకుని తిందామా? అని ఆశగా అడిగేంత బాగా వండుతారు. బాపు గారు మంచి కాఫీ కలిపి ఇస్తారు. నా గురించి నేను చెప్పుకోకూడదనుకుంటా కానీ నేను టీ బాగా చేస్తా. గోపి గారు రెండు కప్పులు తాగారు. చీ! ఏం చెబుతున్నా తపేలా కబుర్లు కాకపోతే!! గోపి గారు ఆయన కోసం తెప్పించిన బ్రష్ పెన్నుని చిన్న పిల్లవాడు చాక్లెట్ అందుకున్నంత ఆత్రంగా తీసుకున్నారు, అందులోకి ఇంక్ కాట్రిడ్జ్ బిగించి ఇచ్చి, కుంచెలోకి ఇంకు ప్రవహించడానికి కాస్త సమయం ఇచ్చి, ఇంకా నాదగ్గర ఉన్న రకరకాల పెన్నులు ఆయన కోసమని తీసిపెట్టినవన్ని అందించా.⇒ మురిపంగా ఒక్కో పెన్ను మూత విప్పడం ఆ పక్కన పెట్టి ఉంచిన నోట్ బుక్‌లో గీతలు రాసి చూసుకోడం! ప్రతీది ఒక్కో రకం వయ్యారం పోగానే" అబ్బా! అన్వర్ దీనితో మ్యాజిక్ చేయొచ్చు! అని ముచ్చట పడిపోవడం. బుధా బాడా - మేము యాగే! హూకం కాకి- కాకి కూకే బొమ్మలు కావాలే! అని తోట రాముడు అంటే బ్రష్ పెన్ మాత్రం బొమ్మలు పెడుతుందా? నాకు ఆయన అమాయకత్వం చూస్తుంటే దిగులుగా ఉంది. మ్యాజిక్ అంతా ఆయన చేతిలో ఉంది కదా. ఇటువంటి విదేశీ పనిముట్లు ఏమీ అందుబాటులో లేని రోజుల్లో వట్టి ఈ చేతులతో కదా, ముంజేతుల మీదికి పుల్ హాండ్స్ స్లీవ్స్ మడిచి రూపయిన్నర స్కెచ్ పెన్ తో, మూడు రూపయల జేకే బోర్డ్ పేపర్ మీద కలబడింది.బొమ్మలకు బొమ్మలు ఉత్పత్తి చేసింది. ఆయనలో అన్ని వేల బొమ్మలు వేసినా ఇంకా ఏదో సాధించాలనే ఒక అమాయకత్వం మిగిలి ఉంది, ఉందిలే మంచీ కాలం ముందూ ముందూన అనే పాట ఒకటి ఆయన చెవుల్లో ఎప్పుడూ వినపడుతూనే ఉంటోంది అనుకుంటా.⇒ ప్చ్! మీకు ఏం తెలుసబ్బా? ఏమీ తెలీదు. నా దగ్గర బాపు గారి వేసిన స్టోరీ బోర్డులు ఉన్నాయి, ఎలాంటి వర్క్ అనుకున్నారు అది. ఇండియా మొత్తం మీద అలా ఇండియన్ ఇంకు పెట్టి గీత గీసి ఫోటో కలర్ పూసి అటువంటి బొమ్మ చేయగలిగిన వాడు మునుపు లేడు ఎప్పటికీ రాడు. నెల్లూరు లో రాం ప్రసాద్ గారని ఒక పాత కార్టూనిస్ట్ ఉంటారు, ఆయన దగ్గర బాలిగారు గీసిన పిల్లల బొమ్మల కథలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. అమాంతం రంగుల అడవిలోకి దిగబడి పోయినట్లే- జంగల్ జంగల్ బాత్ చలి హై, అరే చడ్డి పెహన్ కే ఫూల్ ఖిలీ హై అనే పాటను ఆయన తన బొమ్మలతో వినిపించారు. మోహన్ గారు ఒక రాత్రి ఊరికే అలా కూచుని వాత్స్యాయనుడు ఎన్ని జన్మలెత్తినా కనిపెట్టలేని "కామసూత్ర" ని చిత్ర కళా సూత్రాలుగా వందలుగా బొమ్మలు వేశారు అవీనూ ఒక వేపు వాడిపారేసినా ఫోటో స్టాట్ కాగితాలపై, అందునా ముష్టి అఠాణా అప్సరా పెన్సిల్ టూబి చేతపట్టి.⇒ గోపి గారు కనుక కాస్త అసక్తి చూపి గ్రాఫిక్ నావెల్ అనే దారివంక ఒక చూపు చూసి ఉంటే ఇక్కడ కథ వేరే ఉండేది. ఆయన పేరు దేశం అంతా మారుమ్రోగి ఉండేది. ఈయన వంటి కాంపోజిషన్ ని, రేఖని ఈ దేశం తెలిసి వచ్చేది. ఈ రోజు ఫేస్ బుక్ ఉంది, ఇన్స్టాగ్రాం ఉంది, నాకు తెలుసుగా, నేను చూస్తానుగా అందరి బొమ్మలని. ఈ రోజు మన దేశంలో పెద్ద పేర్లు తెచ్చుకున్న కామిక్ బుక్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. బొమ్మలకు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రపంచానికి బొత్తిగా ఇక్కడ బాపు, బాలి, చంద్ర, గోపి, మోహన్, కరుణాకర్, బాబు అనే పేర్లే తెలీవు, వాళ్ళ పనే తెలీదు. వాళ్ల సంగతి ఎందుకు అసలు మీకు తెలుసా వీళ్ళ లైన్ క్వాలిటే అంటే ఏమిటి అని. ఈ రోజు బొమ్మలు వేసే వాళ్లంతా కంట్రోల్ జెడ్,, కంట్రోల్ హెచ్ బాపతు జాతీస్. నల్లని ఇంకు ఒకటి ఒకటి ఉంటుందని అందులో కుంచెని కానీ, నిబ్బుని కాని ముంచి వాటిని ఎకాఎకి పద్నాలుగో గేరు లో పరిగెత్తించి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆపగలిగే కంట్రోల్ చేయగలిగిన చేతి వేళ్ళు మా గురువులకు, పెద్దలకు ఉండేవి. మేము చూశాము ఆ విన్యాసాలని.⇒ అక్కడెక్కడో ఊరి బయట ఆర్టిస్ట్ రాజు గారు ఉంటారు రికామీగా కూచుని వాటర్ కలర్ నీళ్ళల్లో కుంచె ముంచి చలగ్గా డిస్నీ వాడు కూడా ఇమాజిన్ చేయని క్యారెక్టర్ డిజైన్ అలా గీసి పడేసే వారు, మేము పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని టేబుల్ అంచుకు గడ్డాలు ఆనించుకుని అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా ఇరవైల ప్రాయాల్లో. ఇప్పటికయినా గట్టిగా రాజుగారి చేతి వేళ్లకు ఒక కెమెరా కన్ను గురిపెట్టి అది జెల్ పెన్ కానివ్వండి, ఇండియనింక్ బ్రష్ అవనివ్వండి, అందివ్వండి. సరసర గీత కట్లపాములా సాగుతుంది, ఆగుతుంది బుసకొడుతుంది. ఇవన్నీ చూడ్డానికి, గ్రహించడానికి మానవజన్మలో ఒక పుణ్యపు నరం చేసుకుని పుట్టుండాలి. అచ్చం రజనీకాంతే అని విరగబడి చూసి నవ్వి కిలకిలలు పోతుంటారు పి ఎస్ బాబు అనే మహా చిత్రకారుడ్ని చూసి, మీ బొంద! ఆయన గారు చందమామ శంకర్, చిత్రాలని ఒక మెట్టు కింద ఆగమని చెప్పి అదే చందమామలో విక్రముడి సాహసాలు అనే బొమ్మల కథ వేశారు. అంత గొప్పగా ఉంటాయి ఆయన బొమ్మలు, ఆ స్పీడ్.ఆ బర్డ్ వ్యూ యాంగిల్.⇒ అదంతా మనకు తెలీని మన చరిత్ర. బాబు గారు, ఇండియా టుడే లో కథలకు బొమ్మలు వేస్తే, కథ కథకు బొమ్మల శైలీ మారిపోయేది, ఆ అమ్మాయి కన్నులతో నవ్వింది అని చెప్పడానికి అందమైన బొమ్మాయికి రెండు కళ్ళకి బద్దులు ముద్దులొలికే నాలుగు పెదాలు వేసి ఊరుకున్నాడు, ఫౌంటైన్ పెన్ తో నలుపు తెలుపు బొమ్మలు వేసేవాడు. సైకిల్ హేండిల్ గట్టిగా బిగించి పట్టిన రెండు పిడికిళ్ళ బొమ్మ ఉంటుంది. ఊరికే ఆ హేండిల్ మీద సర్రున ఒక పెన్ను గీత లాగాడు అంతే! ఎండకు తళ తళ మని మెరిసే సూర్యుని కాంతిలా భగ్గుమంది ఆ గీత. అలాటి ఆర్టిస్ట్ లు ఉన్నారు మనకు, ఉండేవాళ్ళు మనకు అనుకోవాల్సిన ఖర్మ పట్టింది ఇప్పుడు.⇒ సరే, ఏదెట్టా పోతే ఏముందిలే. గోపి గారు ఆ వేళ నా వద్దకు వచ్చి బ్రష్ లు తీసుకున్నారు, పెన్నులు తీసుకున్నారు, ఇంకు పుచ్చుకున్నారు, అన్వర్ ఇది ఉంచుకోవచ్చా, అది ఉంచుకోవచ్చా అని బెంగగా అడిగారు, అవన్ని ఆయన అరచేతుల్లో పెట్టి గట్టిగా దండం పెట్టుకోడం తప్ప బ్రతుకుకు ఇంకేం గొప్ప మిగులుతుంది? "అన్వర్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు" కాస్త సర్దుబాటు అయ్యాక నీకు ఇస్తా అన్నారు. నేనప్పుడు ఆయన ముందు మోకాళ్ల మీద కూచున్నా. " సార్ ఈ రోజు నేనూ, నా కుటుంబం మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నాము అంటే మీవంటి వారు మీ బొమ్మల ద్వార మాకు బ్రతుకులకు చూపించిన దారి సార్ ఇది! ఎంత చేస్తే మాత్రం మీకు గురు దక్షిణ ఇచ్చిన రుణం తీరుతుంది.⇒ ఆయన సన్నగా, దయగా నవ్వారు. కాసేపు ఆగి ఆయన్ని తోడ్కొని పిల్లర్ నెంబర్ ఎనభై అయిదు దగ్గరికి వచ్చా, ఆయన అక్కడ వెల్తున్న షేరింగ్ ఆటో ఆపి ఎక్కి, ఒక నల్లని మాస్క్ తీసి మొహానికి తొడుక్కుని నాకేసి చేతులు ఊపారు, మాస్క్ వెనుక ఆయన సన్నగా నవ్వే ఉంటారు. అది నాకు తగిలిన ఆయన చివరి నవ్వని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసింది. బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు- బొమ్మలని జీవనోపాధిగా చేసుకోడం వేరు. గోపి గారే కాదు, చాలా మంది చిత్రకారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు.⇒ ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చి పెట్టని, సంపాదించి పెట్టని డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డారు. యవ్వనం- ఆరోగ్యం సహకరించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నాని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదను తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి, ఆయన బొమ్మల జ్నాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్ చప్పుడులు తెలిసిన జ్నానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు కానీ, గోపి గారి భౌతిక దేహం వద్ద కూచుని చెవి దగ్గర "మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆర్టిస్ట్ గానే పుడతారా గోపీ గారు?" అని అడిగితే ప్రాణం లేని ఆ తల "ఊహు" అని తల అడ్డంగా ఊపడానికి కాస్త ప్రాణం ఖచ్చితంగా తెచ్చుకునేదే. -
Shaleena Nathani: డిఫరెంట్ స్టార్స్‌తో పనిచేయడమంటే.. చాలా ఇంట్రెస్టింగ్!
ఇండియాలో ఫ్యాషన్ సీన్‌ని.. బాలీవుడ్ సెలబ్రిటీల గ్లామర్ గ్రామర్ని తిరగరాసిన అతికొద్ది మంది ఫ్యాషన్ డిజైనర్స్, స్టార్ స్టయిలిస్ట్లలో టాప్ ఆఫ్ ది ఆల్గా చెప్పుకునే పేరు శలీనా నథానీ. ఆమె మోడల్, ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా! యాక్ట్రెస్ దీపికా పదుకోణ్‌కి పర్సనల్ స్టయిలిస్ట్! క్యాజువల్ లుక్స్ నుంచి కాన్స్ రెడ్ కార్పెట్ అపియరెన్స్ దాకా.. దీపికా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలవడం వెనుకున్న అందమైన శ్రమ శలీనాదే!ఫ్యాషన్ విషయంలో శలీనాకు స్ఫూర్తి వాళ్లమ్మ, అమ్మమ్మే! ఆ ఇద్దరికీ ఫ్యాషన్ సెన్స్ మెండుగా ఉండేదట. ట్రెడిషన్‌కి ట్రెండ్స్‌ని.. కంఫర్ట్‌ని జోడించి తాము మెచ్చే.. తమకు నప్పే సల్వార్ సూట్స్, చీరల మీదకి బ్లౌజెస్ని డిజైన్ చేసుకునేవారట. ‘అలా పర్సనల్‌గా డిజైన్ చేసుకుని కుట్టించుకున్న దుస్తుల్లో మా అమ్మ, అమ్మమ్మ యూనిక్‌గా కనిపించేవారు.అలాంటివి మా చుట్టాల్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో ఎవరికీ ఉండేవి కావు. నాకు భలే అనిపించేది. బహుశా వాళ్లకున్న ఆ టేస్టే నాలో ఫ్యాషన్ స్పృహను పెంచి.. అందులో నేను కెరీర్‌ని బిల్డ్ చేసుకునేలా ఇన్స్పైర్ చేసుంటుంది’ అంటుంది శలీనా. ఆమె అన్నట్టుగానే శలీనా ఫ్యాషన్ డిజైన్ కూడా ట్రెడిషన్, ట్రెండ్స్, కంఫర్ట్ల మేళవింపుతో పర్ఫెక్ట్గా ఉంటుంది.ఫ్యాషన్ మ్యాగజైన్స్‌లో ఇంటర్న్‌గా చేశాక.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, స్టార్ స్టయిలిస్ట్ అనాయితా శ్రాఫ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది శలీనా. ‘నాకిష్టమైన డిజైనర్స్, స్టయిలిస్ట్లలో అనాయితా ఒకరు. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను’ అంటూ గురుభక్తి చాటుతుంది శలీనా. ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఆమె చేసిన వర్క్ నచ్చి శలీనాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది దీపికా. ఆ రోజు నుంచి దీపికా ఆహార్యమే మారిపోయింది.ఓవర్ సైజ్డ్ కాస్ట్యూమ్స్ పట్ల యూత్‌కి క్రేజ్ పెంచిన క్రెడిట్ దీపికాకు దక్కేలా చేసింది శలీనాయే. నున్నగా దువ్వుకుని ముడుచుకున్న కొప్పయినా.. చింపిరి జుట్టును క్లచ్‌లో ఇమిడ్చినా .. అది దీపికా హెయిర్ స్టైల్‌గా వైరల్ అవుతోందీ అంటే దానికీ కర్త, కారణం శలీనాయే! ‘నాక్కాదు ఆ ఘనతను దీపికాకే ఇవ్వాలి. ఎందుకంటే తననలా తీర్చిదిద్దే ఫ్యాషన్ లిబర్టీ నాకిస్తుంది ఆమె. అన్నిటికన్నా ముఖ్యంగా తను నన్ను నమ్ముతుంది.దీనికన్నా ముఖ్యమైంది దీపికా అందం, శరీరాకృతి. ఎలాంటి అవుట్ఫిట్నైనా ఈజీగా.. కాన్ఫిడెంట్‌గా క్యారీ చేస్తుంది. ఏ కొత్త ట్రెండ్‌నైనా ట్రై చేయడానికి ఇష్టపడుతుంది. కరెక్షన్స్ చేసుకోవడానికి నాకు, నా టీమ్‌కి టైమ్ ఇస్తుంది. ఓపిగ్గా ఉంటుంది. అందుకే దీపికాకు కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేయడానికి ఉవ్విళ్లూరని డిజైనర్ ఉండడు. ఆమె స్టయిలిస్టుల స్టార్’ అంటూ దీపికా పదుకోణ్‌కి కితాబునిస్తుంది శలీనా. దీపికాతోపాటు షారుఖ్ ఖాన్, కియారా అడ్వాణీ, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కీ శలీనా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసింది."డిఫరెంట్ స్టార్స్‌తో పనిచేయడమంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒక్కో స్టార్ ఆసక్తి ఒక్కోరకంగా ఉంటుంది. ఒక్కో స్టార్ బాడీ లాంగ్వేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లు వైట్ కలర్ షర్ట్స్‌నే ఎక్కువ ఇష్టపడతారు. ఆ ఒక్క రంగుతో వేరియేషన్ చూపించడంలోనే మన క్రియేవిటీ.. కమిట్మెంట్.. ఈ ప్రొఫెషన్ పట్ల ఉన్న ఆసక్తి.. రెస్పెక్ట్ తెలుస్తుంది. అందుకే నామటుకు నాకైతే స్టార్స్‌తో పనిచేయడమంటే ఫ్యాషన్‌లో కొత్త కాంబినేషన్స్‌ని ఎక్స్పరిమెంట్ చేయడం.. సరికొత్త ట్రెండ్స్‌ని ఎక్స్ప్లోర్ చేయడమే!" - శలీనా నథానీ. -
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
నమితా దుబే.. చాలామంది నటీమణుల్లాగానే ఆమే మోడలింగ్ నుంచి నటనవైపు మళ్లింది. స్మాల్ అండ్ సిల్వర్ స్క్రీన్స్ మీద వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద అవకాశాలను అందుకుంటోంది. తన హావభావాలతో వీక్షకులను అలరిస్తోంది.నమితా పుట్టిపెరిగింది లక్నోలో. వాళ్ల నాన్న వినయ్ప్రియ్ దుబే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమితా.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో బిఏ ఇంగ్లిష్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తర్వాత ముంబై వెళ్లి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సోషల్ వర్క్‌లో పీజీ చేసింది.చదువైపోయాక ‘వరల్డ్ వెల్ఫేర్ చిల్డ్రన్ ట్రస్ట్’లో కొన్నాళ్లు, ‘సలామ్ బాలక్ ట్రస్ట్’లో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఒక యాడ్‌లో అయిదు నిమిషాలు నటించినందుకు 20 వేల పారితోషికం అందుకుంది. అది ఆమెకు తన కెరీర్‌నే యాక్టింగ్ ఫీల్డ్కి షిఫ్ట్ చేసుకునేంత ఉత్సాహాన్నిచ్చింది.నటనారంగంలో కొనసాగేముందు తన అభినయ కళకు మెరుగులు దిద్దుకోవాలనుకుని ‘జెఫ్ గోల్డెన్‌బర్గ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్’లో చేరింది. ట్రైన్డ్ యాక్ట్రెస్‌గా బిందాస్ చానెల్ సీరియల్ ‘యే హై ఆషిరీ’తో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అందులోని ‘రాధిక’రోల్‌తో ఆమె పాపులర్ అయింది. అది ఆమెకు సోనీ, కలర్స్ లాంటి ఇతర టాప్ చానెల్స్‌లో అవకాశాలను తెచ్చిపెట్టింది.టీవీ గుర్తింపు నమితాకు సినిమా చాన్స్‌నూ ఇచ్చింది.. ‘మై తేరా హీరో’లో. అందులో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిలో పడేలా చేసింది. తత్ఫలితం.. అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన లేడీ ఓరియెంటెండ్ మూవీ ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో మంచి పాత్ర దక్కడం. ఇలా టీవీ సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే ‘యాస్పిరెంట్స్’ అనే సిరీస్‌తో ఓటీటీలోనూ నటించే ఆపర్చునిటీ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో.. అందులోని ‘ధైర్య’ భూమికతో ఆమే అంతే ఫేమస్ అయ్యి ఓటీటీ వీక్షకుల అభిమాన నటిగా మారిపోయింది. "ఇంపార్టెంట్ రోల్ దొరికితే చాలు.. అది సీరియలా.. సిరీసా.. సినిమానా అని చూడను. నాకు తెలిసి నిజమైన యాక్టర్స్ ఎవరైనా తమ పాత్ర గురించి ఆలోచిస్తారు తప్ప దాన్ని ప్రదర్శించే వేదిక గురించి కాదు!" – నమితా దుబే -
Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
30, డిసెంబర్ 2002.. ఘోర రోడ్డు ప్రమాదం.. చావుకు సమీపంగా వెళ్లి అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్న రోజు.. 23 మార్చి, 2024.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోజు.. ఈ రెండు ఘటనల మధ్య దాదాపు 15 నెలల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో బాధ, వేదన ఉంది. జీవితంతో పోరాడిన సంఘర్షణ ఉంది. బతికితే చాలు.. ఆట గురించి అసలు ఆలోచనేరాని క్షణం నుంచి వేలాది మంది సమక్షంలో మళ్లీ క్రికెట్ ఆడగలిగే అవకాశం రావడం వరకు ఒక అసాధ్యాన్ని సాధ్యం చేసిన అద్భుతం ఉంది. అన్నింటికి మించి ఆ మనిషి నరనరాల్లో పట్టుదల ఉంది.అదే పట్టుదల, అదే పంతం అతడిని మళ్లీ నిలబెట్టింది. అసలు ఆడగలడా అనుకున్న సగటు భారత క్రికెట్ అభిమానులంతా అతడిని గ్రౌండ్లో చూస్తూ సంతోషంగా ఆహ్వానించిన క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ యువకుడే 26 ఏళ్ల రిషభ్ పంత్. భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న దశలో జరిగిన కారు ప్రమాదం పంత్ కెరీర్‌కు చిన్న కామా పెట్టింది. కానీ అతను ఈ సవాల్‌ను స్వీకరించి మళ్లీ అగ్రశ్రేణి మ్యాచ్‌లు ఆడే వరకు రావడం అసాధారణం. అతని పునరాగమనం స్ఫూర్తిదాయకం. భారత క్రికెట్లో రిషభ్ పంత్ ఒక సంచలనం. దూకుడైన ఎడమ చేతి వాటం బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌గా 2016 అండర్–19 ప్రపంచకప్‌లో సత్తా చాటడంతో అతనేంటో అందరికీ తెలిసింది. వేగవంతమైన అర్ధ సెంచరీ, సెంచరీలతో అతను చెలరేగాడు. భారత్ టైటిల్ గెలుచుకోకపోయినా మనకు దక్కిన సానుకూల ఫలితాల్లో పంత్ వెలుగులోకి రావడం ఒకటి. అతని ప్రదర్శన ఊరికే పోలేదు. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ అతడిని తమ జట్టులోకి తీసుకుంది. మరో వైపు ఢిల్లీ రంజీ టీమ్‌లో కూడా రెగ్యులర్ సభ్యుడిగా మారిన అతను కెప్టెన్సీ బాధ్యతలనూ తీసుకున్నాడు.ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో 32 బంతుల్లో పంత్ కొట్టిన రికార్డు సెంచరీ అతని స్థాయిని పెంచింది. ఆ జోరు చూసిన ఢిల్లీ ఐపీఎల్ టీమ్ మరే ఆలోచన లేకుండా అతణ్ణి జట్టులో కొనసాగించింది. ఇన్ని సీజన్లు ముగిసినా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను అదే జట్టుతో ఉండటం విశేషం. 2017లో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తండ్రి ఆకస్మిక మరణం 20 ఏళ్ల ఆ కుర్రాడిని కుంగదీసింది. అయితే అంత్యక్రియలు ముగిసిన 48 గంటల్లోనే తిరిగి వచ్చి మళ్లీ ఐపీఎల్లో తన మెరుపులను ప్రదర్శిస్తూ 57 పరుగులు చేశాడు. తర్వాతి సీజన్లో సన్‌రైజర్స్‌పై చెలరేగి పంత్ కొట్టిన సెంచరీ లీగ్‌లో బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.ఒకే ఒక లక్ష్యంతో..పంత్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చాడు. తండ్రి రాజేందర్ ఒక ప్రైవేట్ స్కూల్‌ను నడిపేవాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ స్వస్థలం కాగా క్రికెట్ అవకాశాల కోసం ఢిల్లీ వైపు చూడాల్సి వచ్చింది. రూర్కీ నుంచి ఢిల్లీ ఆరున్నర గంటల ప్రయాణం. చిన్నప్పటి నుంచి అన్ని చోట్లకు అతని తల్లి సరోజ్ తోడుగా వచ్చేది. ఢిల్లీలోని ప్రముఖ కోచ్ తారక్ సిన్హాకు చెందిన సానెట్ అకాడమీలో అతను శిక్షణ తీసుకున్నాడు. 12 ఏళ్ల వయసులో జరిగిన ఒక ఘటన పంత్‌లో ఆటకు సంబంధించి పట్టుదలను పెంచింది.సెలక్షన్స్, కోచింగ్ కోసం 45 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వసతి కోసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో స్థానికంగా మోతీబాగ్‌లోని ఒక గురుద్వారాలోనే తల్లి, కొడుకులు ఉన్నారు. ఆ సమయంలోనే తాను భారత్‌కు ఆడాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అతను చెప్పుకున్నాడు. ఐపీఎల్లో అవకాశం దక్కినా.. టీమిండియా ప్లేయర్‌గా వచ్చే గుర్తింపు కోసం అతను శ్రమించాడు. కొన్నాళ్లకే అతని కల నెరవేరింది. భారత జట్టులో అవకాశం దక్కించుకున్న అతను కొన్ని చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.మన గిల్లీ..అంతర్జాతీయ క్రికెట్లో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను పంత్ గుర్తుకు తెచ్చాడు. తన మూడో టెస్టులోనే ఇంగ్లండ్ గడ్డపై అద్భుత సెంచరీతో అతను ఆకట్టుకున్నాడు. తర్వాతి ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై సిడ్నీలో 159 పరుగులతో తన బ్యాటింగ్ పదును చూపించాడు. భారత జట్టు ఆస్ట్రేలియాలో తొలి సిరీస్ గెలిచేందుకు ఇది ఉపకరించింది. తర్వాతి ఏడాది సిడ్నీలోనే 97 పరుగులతో రాణించిన అతను ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అసలు ఘనత తర్వాతి టెస్టులోనే బ్రిస్బేన్‌లో వచ్చింది. భారత్‌కు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అజేయంగా 89 పరుగులతో అతను జట్టును గెలిపించిన తీరు ఈ సిరీస్ విజయాన్ని చిరస్మరణీయంగా మార్చింది. అంతకు ముందే రంజీ ట్రోఫీలో పంత్ చేసిన ట్రిపుల్ సెంచరీ అతను పైస్థాయికి చేరగలడనే నమ్మకాన్ని కలిగించింది.మూడు దశల ప్రణాళికతో..రిషభ్ పంత్‌కు ఎదురైన ప్రమాద తీవ్రత చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉండింది. చావు నుంచి తప్పించుకోవడం మాత్రమే ఊరట కలిగించే అంశం. మిగతా అన్నీ ప్రతికూల అంశాలే. ఆట సంగతేమో కానీ ముందు సాధారణ జీవితమైతే గడపగలగాలి కదా! చాలారోజుల వరకు ఆస్పత్రిలోనే ఉన్నాడు. శస్త్ర చికిత్సలు, స్కానింగ్, పరీక్షలు, రిపోర్టులతోనే సాగిపోయింది.2022 డిసెంబర్లో పంత్కి జరిగిన రోడ్డు ప్రమాదంఅలాంటి స్థితిలో పంత్ తన కోసం తాను ఒక కొత్త ప్రణాళికను రూపొందించుకోవాల్సి వచ్చింది. ప్రమాదం నుంచి మైదానం వరకు అతను తన పురోగతిని మూడు రకాలుగా విభజించుకొని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముందుగా ఆరోగ్యపరంగా సాధారణ స్థితికి రావడం. ఆటగాడి కోణంలో కాకుండా ఒక సామాన్యుడు ప్రమాదం బారిన పడితే వైద్యుల పర్యవేక్షణలో ఏం చేస్తాడో పంత్ కూడా అదే చేశాడు. ముందుగా కోలుకోవడం, ఇతరుల సహాయం లేకుండా నడక, తన పనులు తాను సొంతంగా చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. రెండో క్రమంలో జనరల్ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకున్నాడు.తేలికపాటి ఎక్సర్సైజ్లు, యోగావంటి వాటితో తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. ఆపై మూడో దశకు వచ్చే సరికి క్రికెటర్ మ్యాచ్ ఫిట్నెస్ కోసం శ్రమించాడు. ఈ విషయంలో బీసీసీఐకి చెందిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఎంతో సహాయం అందించింది. డైట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్, ఫిజియో ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పంత్ సిద్ధమయ్యాడు.గాయాల నుంచి కోలుకుంటూలీగ్లో సత్తా చాటి..‘నేను మళ్లీ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నాకు ఎదురైన దురదృష్టకర ఘటనలను దాటి మళ్లీ క్రికెట్ ఆడటం అంటే కొత్త జన్మ ఎత్తినట్లు’ అని తొలి మ్యాచ్‌కు ముందు పంత్ స్వయంగా చెప్పుకున్నాడు. ఐపీఎల్లో 2024లో పంత్ మ్యాచ్‌లు చూసినవారికి పంత్ పురోగతి ఆశ్చర్యం కలిగించింది. అసలు ఎప్పుడూ ఏ ప్రమాదం జరగనట్లుగా, కొంత విరామం తర్వాత మాత్రమే అతను ఆటలోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు.బ్యాటింగ్‌లో పదును, వికెట్ కీపింగ్‌లో చురుకుదనం, మైదానంలో అతని కదలికలు, కెప్టెన్సీ నైపుణ్యం కొత్త పంత్‌ను చూపిస్తున్నాయి. మరో సందేహం లేకుండా పూర్తి ఫిట్నెస్ స్థాయిని అతను ప్రదర్శించాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో గతంలోలాగే ర్యాంప్ షాట్లు, స్విచ్ హిట్లు, ఒంటి చేత్తో సిక్సర్లు, ఏ బౌలర్‌నూ వదలకుండా అతను ఆధిపత్యం చూపించడం సగటు క్రికెట్ అభిమానిని సంతృప్తిపరచాయి. ఎందుకంటే లీగ్‌లో ఎవరికి ఆడినా అతను భారత క్రికెట్ భవిష్యత్తు అనే విషయం అందరికీ తెలుసు.ఇంత తక్కువ సమయంలో కోలుకోవడంలో అతని వయసు కూడా కీలక పాత్ర పోషించడం వాస్తవమే అయినా.. అన్ని రకాల ప్రతికూలతలను దాటి అతను సగర్వంగా నిలిచాడు. అతని పోరాటానికి హ్యాట్సాఫ్ చెబుతూ మున్ముందు భారత్‌కు పంత్ మరిన్ని విజయాలు అందించాలని ఆశిద్దాం! — మొహమ్మద్ అబ్దుల్ హాది -
Shruti Malhotra: ‘ఏదైనా చేయాలి.. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’..
కల ఉన్న చోట కష్టం ఉంటుంది. ‘మరింత కష్టపడతాను’ అంటూ ముందుకువెళ్లాలి. లక్ష్యం ఉన్న చోట సవాలు ఎదురొస్తుంది. సరిౖయెన జవాబు చెప్పి ఆ సవాలును వెనక్కి పంపించాలి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ శృతి మల్హోత్రా. జార్ఖండ్‌లోని రాంచికి చెందిన శృతి ఎన్నో చిన్న బ్రాండ్లను పెద్ద సక్సెస్ చేసింది. సక్సెస్‌కు సరిౖయెన అడ్రస్‌గా పేరు తెచ్చుకుంది. శృతి మల్హోత్రా బాల్యంలోకి వెళితే.. ప్రతిరోజు రాత్రి నలుగురు అక్కాచెల్లెళ్లు వార్తలు వినడానికి రేడియో ముందు కూర్చునేవారు. కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలను రూల్ నోట్ ΄్యాడ్లో రాసుకునేవారు. మరుసటి రోజు తండ్రితో వాటి గురించి చర్చించేవారు. తండ్రి వాటి గురించి మరిన్ని కొత్త విషయాలు వివరంగా చెప్పేవాడు. శృతి తండ్రి పిల్లలకు తరచుగా చెప్పే మాట.. ‘స్వతంత్రంగా ఉండండి’ ‘పెద్ద కలలు కనడానికి వెనకాడ వద్దు’ ‘ఈ ప్రపంచంలో మీకు అత్యున్నత స్నేహితుడు.. విద్య’ తండ్రి మాటలు అక్షరాలా ఆచరించడం వల్లే పదిమందీ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది శృతి మల్హోత్రా. మిషనరీ స్కూల్ నుంచి దిల్లీ యూనివర్శిటీలో చదువుకోవడం వరకు ‘స్వతంత్రంగా ఉండడం’ అనే లక్షణాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. దీనివల్ల ఆమె చాలామందికి‘రెబెల్’గా కనిపించేది. ‘ఏదైనా చేయాలి. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’ అనే లక్ష్యాన్ని కాలేజీ రోజుల్లోనే నిర్దేశించుకుంది మల్హోత్రా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తయిన తరువాత ఫ్యాషన్ కంపెనీ ‘బెనెటన్’తో ప్రొఫెషనల్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నైకీ, ప్లానెట్ స్పోర్ట్స్‌లో కూడా అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ప్రదర్శించింది. స్థూలంగా చెప్పాలంటే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ జైనింగ్లలో ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. 2007లో ఎథికల్ బ్యూటీబ్రాండ్ ‘ది బాడీ షాప్’లో చేరింది. ఇది తన ప్రయాణ గతిని మార్చేసింది. రిటైల్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్లలో అడుగుడుగునా పురుషాధిక్యత కనిపించే కాలంలో మహిళలు అడుగు వేసి నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ‘వేరే వారి కంటే ఒక మెట్టుకింద ఉండడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. సవాలుగా తీసుకున్నాను. రెట్టింపు కష్టపడ్డాను’ అంటుంది మల్హోత్రా. ఆ కాలంలో బ్యూటీప్రొడక్ట్స్కు సంబంధించిన రిటైల్ బిజినెస్ ఫార్మసీ, డిపార్ట్మెంటల్ స్టోర్లలో మాత్రమే కనిపించేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జీరో నుంచి ప్రయాణంప్రొరంభించాను’ అంటుంది మల్హోత్రా. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అనే సన్నాయి నొక్కుల నుంచి ‘ఈ రంగంలో పెద్ద పేరున్న మహిళ’ అనే ప్రశంస వరకు శృతి మల్హోత్రా ఎంతో ప్రయాణం చేసింది. ఎన్నో పాఠాలు నేర్చింది. ఎందరికో గుణపాఠాలు చెప్పింది. ‘క్వెస్ట్ రిటైల్’ గ్రూప్ సీయీవోగా ఎంతో పేరు తెచ్చుకుంది. ‘శృతి మల్హోత్రా సీయీవో మాత్రమే కాదు ఎన్నో బ్రాండ్స్‌ను విజయవంతం చేసిన డ్రైవింగ్ ఫోర్స్’ అంటాడు ఫ్యాషన్ కంపెనీ లకొస్టే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీయీవో రాజేష్ జైన్. తన సక్సెస్‌కు కారణం తల్లిదండ్రులు అని చెబుతుంది మల్హోత్రా. చదువు చెప్పించడం నుంచి కలల సాధనలో వెన్నుదన్నుగా నిలవడం వరకు వారి పాత్ర ఎంతో ఉందని చెబుతోంది. ‘వృత్తి జీవితంలో ఎంతోమంది మేల్ కొలీగ్స్‌తో పనిచేశాను. ఎప్పుడూ ఎవరితోటీ సమస్య రాలేదు. పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం లేకపోవడమే అసలు సమస్య. మహిళలకు సమానావకాశాలు కల్పించడం విషయంలో ఎన్నోసార్లు పోరాడాను’ అంటుంది మల్హోత్రా. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది ముఖ్యం’అనేది శృతి మల్హోత్రాకు ఇష్టమైన మాట. ఇవి చదవండి: Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం.. -
Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను'
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి. ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్‌బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు. యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్‌బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్ స్టోన్ పెల్టర్‌ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్‌బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి.. కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ప్రోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలిప్రొఫెషనల్ ఫిమేల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్‌బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మా ప్రాంతం నుంచి ఫుట్‌బాల్‌లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్‌లో ఆడాను. గోల్ కీపర్‌గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మా ్రపాంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు.. నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్‌బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్‌ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. ఇవి చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి! -
Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ!
నైలా గ్రేవాల్.. హిందీ నటి. ఇప్పుడు ఓటీటీ స్టార్ కూడా! బయటెంత ఫాలోయింగ్ ఉందో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. ఇంకొన్ని వివరాల్లోకి వెళితే.. నైలా పుట్టి,పెరిగింది ఢిల్లీలో. మాస్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. డాన్స్ నేర్చుకుంది. థియేటర్ స్కిల్స్ కూడా ఒంటబట్టించుకుంది. ముందు మోడలింగ్ వైపే అడుగులేసింది. కానీ ఆసక్తి అంతా యాక్టింగ్ మీదే ఉండింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా డాన్స్ బాలేలు చేస్తూ.. థియేటర్లో నటిస్తూ నటనా ప్రతిభను మెరుగుపరచుకునేది. అలాంటి ఒకానొక సందర్భంలోనే బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ నుంచి ఒక కబురు‡ వచ్చింది.. తను తీయబోయే ‘తమాషా’ సినిమాలో నైలాకు వేషం ఇస్తున్నట్టు. అది విన్న ఆమె సంతోషానికి అవధుల్లేవు. సెట్స్ మీదకు వెళ్లినప్పుడైతే కలా.. నిజమా అనుకుందట. మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘భాంగ్డా పా లే’, ‘థప్పడ్’లలో నటించింది. ‘ఇష్క్ విష్క్ రిబౌండ్’లో నటిస్తోంది. తాజాగా ‘మామ్లా లీగల్ హై’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నైలా లండన్‌లో లా చదివి.. ఢిల్లీలో వకీల్గిరీ ప్రారంభించిన లాయర్‌గా నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆమె నటనకే కాదు ఆమె అందానికి.. ఫ్యాషన్ స్టయిల్‌కి.. డాన్స్కీ అభిమానగణం ఉంది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆమెను స్ఫూర్తిగా తీసుకునే అభిమానులూ ఉన్నారు. సినిమానైనా.. సీరియల్‌నైనా.. ఆ మాటకొస్తే కదిలే బొమ్మను ఫస్ట్ నేను చూసింది టెలివిజన్‌లోనే. అందుకే యాక్టింగ్‌కి టెలివిజనే నాకు ప్రేరణ, స్ఫూర్తి. సిల్వర్‌స్క్రీన్, స్మాల్‌స్క్రీన్, వెబ్‌స్క్రీన్.. ఏ స్క్రీన్ అయినా యాక్టర్స్‌కి ఒకటే. రీచింగ్‌లో తేడా తప్ప దేనికైనా టాలెంటే కొలమానం! - నైలా గ్రేవాల్. ఇవి చదవండి: లియాండర్ పేస్... ప్రముఖ డ్యాన్సర్! -
'నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే..' రైతుబడి మాస్టారు!
'దేశరాజధాని నగరం న్యూఢిల్లీలోని ట్రిపుల్ఐటీ సంస్థ. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదిక మీద దేశవిదేశీ ప్రముఖుల సమక్షంలో ప్రసంగించవలసిందిగా ఆహ్వానం అందుకున్నాడు మన తెలుగు యువకుడు. నేడు జరగనున్న ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్–2024లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతకున్న వ్యాపార అవకాశాల గురించి ప్రసంగించే అవకాశాన్నందుకున్న జూలకంటి రాజేందర్‌రెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ప్రస్థానాన్ని పంచుకున్నారు.' ‘‘న్యూఢిల్లీ వేదికగా అది కూడా అత్యున్నత స్థాయి విద్యాసంస్థలో ప్రసంగించే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంతకుముందు జాతీయ స్థాయిలో ‘ద నేషనల్ క్రియేటర్స్ అవార్డు’కు సంబంధించిన ‘మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అగ్రి క్రియేటర్’ కేటగిరీలో 36 శాతానికి పైగా ఓట్లు సాధించి రైతుబడి చానెల్ ప్రథమస్థానంలో నిలిచింది. ఇందుకు అసలైన కార్యక్షేత్రం మా నల్గొండ జిల్లా, మాడ్గుల పల్లి మండలంలోని మాచనపల్లి గ్రామం. నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే ఉన్నాయి. మాది వ్యవసాయ కుటుంబం. కానీ నేనెప్పుడూ పొలం పని చేయలేదు. నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని కలలు కన్నారు అమ్మా నాన్న. పనుల ఒత్తిడి ఉంటే సీజన్లో కూడా నాకు పొలం పనులు కాదు కదా, పశువుల దగ్గర సహాయానికి కూడా రానిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు నా కెరీర్ వ్యవసాయ భూమిలోనే వేళ్లూనుకు΄ోయింది. పలక.. పేపర్! అమ్మానాన్న కోరుకున్నట్లే చదువుకున్నాను. బీఈడీ చేసిన తర్వాత స్కూల్లో పలక మీద పిల్లలకు అక్షరాలు దిద్దించాల్సిన వాడిని, అనుకోకుండా కొత్తదారిలో అడుగుపెట్టాను. రోజూ పేపర్ చదివే అలవాటు ఉండడంతో ఓ రోజు జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్ష ప్రకటన నా కంటపడింది. ఉత్సాహం కొద్దీ పరీక్ష రాశాను. సెలెక్ట్ అయ్యాను. కానీ అక్కడ శిక్షణ పూర్తి చేయలేదు. కానీ 2008లో ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌తో జర్నలిస్టుగా నా ప్రయాణం మొదలైంది. టీవీ చానెల్స్ మారుతూ కొంతకాలం హైదరాబాద్‌లో, మరికొంత కాలం జిల్లాల్లో ఉద్యోగం చేశాను. వార్తలకే పరిమితం కాకుండా ఫీచర్ స్టోరీల కోసం అన్వేషించేవాడిని. నా అన్వేషణలో కెమెరా కంటికి చిక్కిన ఓ వాస్తవం ఎంత ఆసక్తికరమైందో ఊహించగలరా!? కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే... చత్తీస్గడ్ రాష్ట్రం, జగదల్పూర్లో. ‘కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ’ అక్కడ రాజు హోదాలో ఉన్నారు. వివరాలు సేకరిస్తూ వాళ్లను వెతుక్కుంటూ వెళ్లి షూట్ చేయడంలో కలిగిన జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంత అని చెప్పలేను. ఇలా ఆరేళ్లు గడిచింది, అనుకోకుండా ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ప్రింట్ మీడియాకి మారాను. అక్కడ ఆరేళ్లు పని చేశాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి స్థాయి క్రమంగా తగ్గి΄ోసాగింది. ఎన్నాళ్లో... ఎన్నేళ్లో ఉద్యోగిగా నీ పయనం... అని నా ఆవేదనను ఫేస్బుక్లో రాసుకునేవాడిని. కరోనా వచ్చింది.. లాక్డౌన్ తెచ్చింది! అది 2020, ప్రపంచానికి గుర్తొచ్చేది కరోనా, లాక్డౌన్. నాకు గుర్తొచ్చే అపురూపమైన ఘట్టం రైతుబడి ఆవిర్భావం. ఆ ఏడాది జనవరిలోనే రైతుబడి మొదలుపెట్టేశాను. ఉద్యోగం మానేయాలనే నిర్ణయానికి వచ్చాను. మేలో మానేశాను. ఆశ్చర్యం ఏమిటంటే... ఉద్యోగంలో అందుకున్న జీతానికి సమానమైన రాబడిని జూన్‌లోనే చూశాను. రైతులకు ఉపయోగపడే అంశాల మీదనే ఉంటాయి నా వీడియోలన్నీ. ఒకే పంట వేస్తున్న రైతులకు రకరకాల పంటలు వేయమని మాటలతో చెప్పడం వల్ల ప్రభావితం చేయలేం. ఏకకాలంలో రకరకాల పంటలు పండిస్తున్న రైతు అనుభవాలను వారి మాటల్లో వింటే సాటి రైతులు త్వరగా ప్రభావితమవుతారు. ఇదే నా సక్సెస్ ఫార్ములా. వ్యవసాయరంగ పరిశోధకులు, అధికారుల ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పించాను. కానీ రైతులు చెప్పిన విషయాలనే సాటి రైతులు గుర్తు పెట్టుకుంటున్నారు, ఆచరణలో పెడుతున్నారు. రైతులు కొందరు వ్యవసాయ పరికరాలను సొంతంగా తయారు చేసుకుంటారు, ఉన్న పరికరాలను తమ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని కూడా బాగా చూపించేవాడిని. పంటలను, రైతులను వెతుక్కుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించాను. లక్షకు పైగా కిలోమీటర్లు ప్రయాణించాను. పదమూడు వందలకు పైగా వీడియోలు చేశాను. నా రైతుబడికి పదమూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఇప్పటి వరకు వన్ మ్యాన్ ఆర్మీలాగ నేనొక్కడినే పొలాలకు వెళ్లి కెమెరా ఆన్ చేసి రైతుతో మాట్లాడేవాడిని. ఆ ఫుటేజ్‌ని మా మంజుల (భార్య) ఇంట్లో ఎడిట్ చేసిచ్చేది. ఈ మధ్యనే ఒక టీమ్‌ను తయారు చేసుకున్నాను. నా విజయగాధ నేనే రాసుకున్నాను! "నాలో ఎడతెగని ఆలోచన మొదలైంది. ఎంతోమంది సక్సెస్ స్టోరీలు రాశాను. నా సక్సెస్ స్టోరీని నేను రాసుకోలేనా అనిపించింది. నాలుగు సంస్థల్లో పని చేశాను. సంస్థ పేరు నా ఇంటిపేరుగా నా పేరుకు ముందు చేరుతోంది. కానీ నా పేరే సంస్థ పేరు కాలేదా? ఆ మధనంలో నుంచి పుట్టుకొచ్చిందే రైతుబడి. రైతుబడి అనే అమృతం పుట్టడానికి ముందు నా మదిమధనంలో అనేక గరళాలు కూడా కోరలు సాచాయి. సూపర్‌మార్కెట్, ‘రైతు పంట’ పేరుతో రైతుల ఉత్పత్తుల విక్రయం, ఇన్ షాట్ తరహాలో ‘లోకల్ న్యూస్ యాప్’ పేరుతో ఓ న్యూస్ యాప్, అదే పేరుతో ఓ యూ ట్యూబ్ చానెల్... వీటిలో కొన్ని భారీ వైఫల్యాలు, మరికొన్ని పాక్షిక విజయాలనిచ్చాయి. ఆ తర్వాత మరో నాలుగు యూ ట్యూబ్ చానెళ్లు కూడా పెట్టాను. అవి విజయవంతం కాలేదు, కానీ నన్ను విజయపథంలో నడిపించే మార్గదర్శకాలయ్యాయి." – జూలకంటి రాజేందర్ రెడ్డి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, రైతుబడి యూట్యూబ్ చానెల్ గుర్తు పడుతున్నారు! ‘నాకు గుర్తింపు వచ్చింది’ అనే పెద్ద మాట చెప్పను. కానీ ఇప్పుడు ఏ ఊరికి వెళ్లినా నన్ను గుర్తు పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయం కోసం పని చేస్తున్న చానెళ్లలో రైతుబడి పెద్దది. ఇప్పుడు ఢిల్లీలో ప్రసంగించడానికి ట్రిపుల్ ఐటీ నుంచి ఆహ్వానం రావడానికి కారణం ఈ యూ ట్యూబ్ చానెలే. నేననుకున్నట్లే నా సంస్థపేరు నా పేరు కలిసి ‘రైతుబడి రాజేందర్’నయ్యాను. ఇది కాకుండా నేను చేరాల్సిన లక్ష్యాలు రెండున్నాయి. ఒకటి... వ్యవసాయంలో అనుభవాలు పంచుతున్న రైతుబడి తరహాలోనే మరో వేదిక ద్వారా వ్యాపార అనుభవాలను యువతకు చేర్చడం, కొత్త ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయడం. ఇప్పటికే బిజినెస్ బుక్ పేరుతో ఆ ప్రయత్నం మొదలైంది. మరొకటి వ్యవసాయ భూమిని కొనుక్కోవడం. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాన్న ΄ోయారు. అనివార్యమైన పరిస్థితుల్లో మా పొలాన్ని అమ్ముకున్నాం. కొద్దిగానైనా వ్యవసాయభూమిని కొని మా అమ్మకు బహుమతిగా ఇవ్వాలి. రైతు కుటుంబంలో పుట్టిన వాళ్లం భూమితో బంధాన్ని తెంచుకోలేం’’ అన్నారు రాజేందర్‌రెడ్డి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇవి చదవండి: నారి వారియర్! -
స్పోర్ట్స్: ఆ ఆర్చర్ పేరు 'బొమ్మదేవర ధీరజ్'!
అక్టోబర్ 2023.. హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఆర్చరీ రికర్వ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడొకడు పోటీ పడుతున్నాడు. వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. రెండో సెట్లో మొదటి బాణంతో సున్నా స్కోరు.. నాలుగో సెట్ రెండో బాణంతో సున్నా స్కోరు.. మొత్తం ఎనిమిది బాణాల వ్యవధిలో రెండు 0, 0 స్కోర్లు.. ఎవరూ ఊహించని రీతిలో అతి ఘోరమైన ప్రదర్శన.. ఆ కుర్రాడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. నవంబర్ 2023.. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఆర్చరీ కాంటినెంటల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్... ఈ కీలక పోరులో అదే కుర్రాడు తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.. ఈసారి ఒక్క బాణం కూడా గురి తప్పలేదు. తన ప్రతిభనంతా ప్రదర్శిస్తూ అతను చెలరేగిపోయాడు. ఫలితంగా ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొనేందుకు అవసరమైన తొలి అర్హత (కోటా)ను అందించాడు. తనతో పాటు సహచరులందరిలోనూ సంతృప్తి. ఆసియా క్రీడల్లో వైఫల్యంతో చోకర్ అంటూ అన్నివైపుల నుంచి విమర్శలపాలై ఆపై ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం వరకు నెల రోజుల వ్యవధిలో అతను జీరో నుంచి హీరోగా మారాడు. ఆ ఆర్చర్ పేరు బొమ్మదేవర ధీరజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పించింగ్’.. దీరజ్ చేసిన పొరపాటుకు సాంకేతిక నామమిది. ఆర్చర్ లక్ష్యం దిశగా బాణాలు విసురుతున్న సమయంలో ఆటగాడి ప్రమేయం లేకుండా మూడో వేలు పొరపాటున బాణం చివరన తగిలితే అది దిశ లేకుండా ఎక్కడితో దూసుకెళ్లిపోతుంది. ఇది సాంకేతికంగా జరిగిన తప్పే కావచ్చు. కానీ ఫలితం చూస్తే ఆర్చర్‌దే పెద్ద వైఫల్యంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అతడిని మరీ పేలవమైన ఆటగాడిగా చూపిస్తుంది. ఇలాంటి అనుభవమే ధీరజ్‌కు ఎదురైంది. ఆర్చరీలో 9 పాయింట్లు సాధించిప్పుడు, ఆపై పర్ఫెక్ట్ 10 సాధించలేని సందర్భాల్లో కూడా ఆర్చర్లు తీవ్రంగా నిరాశ చెందుతారు. అలాంటి సున్నా పాయింట్లు అంటే పెద్ద వైఫల్యం కిందే లెక్క. ఈ స్థితిలో ధీరజ్ అసలు తన లోకంలో తాను లేనట్లుగా కుప్పకూలిపోయి పోటీ నుంచి ఓటమిపాలై నిష్క్రమించాడు. జట్టు సహచరులు ‘నీ తప్పేం లేద’ంటూ ఓదార్చే ప్రయత్నం చేసినా అతని బాధ తగ్గలేదు. ‘క్రికెట్లో అంటే సాధారణ అభిమానులకు ఎక్కడ తప్పు జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆర్చరీలో సాంకేతికాంశాలను నేను ఎలా వివరించగలను. ఇలాంటివి ఏమీ తెలియకుండా నన్ను ఆన్లైన్లో చాలామంది తీవ్ర పదజాలంతో దూషించారు. మాటల్లో చెప్పలేనంత వేదన అనుభవించాను’ అని ధీరజ్ నాటి ఘటనను గుర్తు చేసుకుంటాడు. బలంగా పైకి లేచి.. క్రీడల్లో కింద పడటం కొత్త కాదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేచేందుకు క్రీడలు అవకాశం కల్పిస్తాయి. ఘోర వైఫల్యం ఒకటి ఎదురైతే, ఆ తర్వాత మళ్లీ దానిని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ధీరజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. కేవలం నాలుగు రోజుల్లోనే అతను తన తప్పును దిద్దుకొని సత్తా చాటేందుకు అదే ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్ వేదికగా మారింది. ‘నా వల్ల కాదు’ అంటూ ధీరజ్ సహచరులకు చెప్పినా, ‘నువ్వు బాణాలు సంధించు చాలు అంతా బాగుంటుంది’ అంటూ వారు ధైర్యం చెప్పారు. చివరకు భారత జట్టు టీమ్ విభాగంలో సగర్వంగా ఫైనల్ చేరి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. అతాను దాస్, తుషార్ షెల్కే, ధీరజ్‌లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఆర్చరీలో ఆల్‌టైమ్ గ్రేట్ టీమ్ కొరియాతో జరిగిన ఫైనల్లో ఓటమిపాలైనా, ఓవరాల్ ప్రదర్శన భారత్‌కు సంతృప్తినిచ్చింది. ధీరజ్ కూడా కీలక సమయాల్లో పర్ఫెక్ట్ స్కోర్లతో తన వంతు పాత్ర పోషించాడు. అలా మొదలై.. ధీరజ్ స్వస్థలం విజయవాడ. చాలామంది చిన్నపిల్లల్లాగే బాణాలతో ఆడుకునే సరదా ఆ తర్వాత అసలైన ఆట వైపు మళ్లించింది. ఐదేళ్ల వయసులో అతను ఈ ఆటవైపు బాగా ఆకర్షితుడై విల్లును అందుకున్నాడు. ఉపాధ్యాయుడైన తండ్రి తన కుమారుడిని నిరుత్సాహపరచకుండా ఆర్చరీలో ప్రాథమిక శిక్షణ వైపు తీసుకెళ్లాడు. నగరంలోని ప్రముఖ ఓల్గా ఆర్చరీ అకాడమీలో ధీరజ్ ఓనమాలు నేర్చుకున్నాడు. కోచ్‌లు చెరుకూరి లెనిన్, చెరుకూరి సత్యనారాయణ మార్గనిర్దేశనంలో అతని ఆట పదునెక్కింది. అకాడమీలో జార్ఖండ్ నుంచి వచ్చిన ఇతర కోచ్‌లు కూడా అతని ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దారు. దాంతో స్థానికంగా, చిన్న స్థాయి టోర్నీల్లో విజయాలు సాధిస్తూ ధీరజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే మలుపు.. వరుస విజయాలతో దిగువ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకుంటూ వచ్చిన ధీరజ్‌కు కెరీర్లో మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అయితే ఆర్థిక సమస్యలతో పాటు ఇతర ప్రతికూలతలు ఇబ్బందిగా మారాయి. ఇలాంటి సమయంలో క్రీడా ఎన్జీఓ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) ధీరజ్ ఆటను గుర్తించడం అతని కెరీర్లో కీలకమైన మలుపు. 2017లో ప్రతిభాన్వేషణలో భాగంగా నిర్వహించిన సెలక్షన్స్‌లో ఓజీక్యూ ప్రతినిధి అనుకూల్ భరద్వాజ్ దృష్టిలో పడ్డాడు. తమ జూనియర్ ప్రోగ్రామ్‌లో ధీరజ్‌ను చేర్చుకొని వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యుత్తమ స్థాయిలో శిక్షణ, అంతర్జాతీయ స్థాయి ఎక్విప్మెంట్తో ధీరజ్ తన ఆటకు పదును పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా, అవి అతని కెరీర్‌కు ప్రతిబంధకం కాలేదు. 2018 యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో అతనికి స్థానం దక్కలేదు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్‌లో కూడా నాలుగో స్థానంలో నిలవడంతో ఆ అవకాశమూ పోయింది. అయితే ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకంటూ ధీరజ్ ఇతర టోర్నీల్లో సత్తా చాటుతూ వచ్చాడు. ఆర్మీ అండదండలతో.. 2017లో ఆసియా అవుట్డోర్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత రజతం, 2018లో ఆసియా గ్రాండ్ ప్రి టీమ్ ఈవెంట్లో రజతంతో ధీరజ్‌కు తగిన గుర్తింపు దక్కింది. అయితే అతని కెరీర్ గత రెండేళ్లలో మరింతగా దూసుకుపోయింది. ఈ క్రమంలో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అతని ఆటకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. అక్కడ చేరిన అనంతరం కొరియా కోచ్ కిమ్హగ్యాంగ్ శిక్షణలో ధీరజ్ రాటుదేలాడు. ఇది అతని ప్రదర్శనలలో, ఫలితాల్లో కనిపించింది. వరుసగా పెద్ద విజయాలు ధీరజ్ ఖాతాలో చేరాయి. వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో టీమ్ స్వర్ణం, వరల్డ్ కప్‌లో 1 స్వర్ణం, 3 రజతాలు, ఆసియా గ్రాండ్ ప్రిలో 2 స్వర్ణాలతో పాటు గత ఆసియా క్రీడల్లో రజతంతో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో భాగంగా అతను కొత్త ప్రపంచ రికార్డును సృష్టించడం విశేషం. కోల్‌కతాలో జరిగిన ఈవెంట్లో మొత్తం 1140 పాయింట్లతో అమెరికాకు చెందిన బ్రాడీ ఎలిసన్ గత రికార్డు (1386)ను అతను సవరించాడు. ఆర్మీలో సుబేదార్ హోదాలో ఉన్న ధీరజ్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం మరో పెద్ద అవకాశాన్ని కల్పించింది. ఆర్చరీలో అతి కష్టమైన, బాగా ఉండే ఈవెంట్ పురుషుల రికర్వ్ విభాగం. అయితే ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న ధీరజ్ చూపిస్తున్న ఫామ్, ఆత్మవిశ్వాసం భారత్‌కు ఒలింపిక్స్ చరిత్రలో తొలి ఆర్చరీ పతకాన్ని అందించవచ్చు. — మొహమ్మద్ అబ్దుల్ హాది -
మిస్టరీ: ఓక్చా వోర్ట్మన్!
జీవితంలో అసంపూర్ణంగా ఆస్వాదించిన కొన్ని మధురక్షణాలు.. మళ్లీ తిరిగిరాని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు పొంగుకొచ్చే భావోద్వేగాన్ని వర్ణించడం మహా కష్టం. ఇక ఆ తర్వాత అంతకుమించిన సంతోషాలెన్నొచ్చినా.. మనసు మాత్రం గతాన్నే నెమరువేసుకుంటుంది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లమని కోరుకుంటుంది. ‘స్టెల్లా హట్’ జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె ఆలాపన, అన్వేషణ, ఆవేదన అంతా తన కన్నతల్లి కోసమే. అసలేంటా కథ? స్టెల్లా కథ.. ఓ అమెరికన్ అయిన ఆమె తండ్రి రాబర్ట్ వోర్ట్మన్ కథతోనే మొదలవుతుంది. అది 1971, జపాన్ . అప్పుడు రాబర్ట్‌కి 22 ఏళ్లు. తను జపాన్ లో ఎయిర్‌మన్ గా పనిచేసేవాడు. ఒకరోజు ఓ ప్రయాణంలో.. ఓక్చా అనే 20 ఏళ్ల కొరియన్ అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. పెళ్లి అయిన ఏడాదికే స్టెల్లా పుట్టింది. రాబర్ట్.. తన భార్య ఓక్చాను ముద్దుగా ‘సన్నీ’ అని పిలుచుకునేవాడు. కొన్ని నెలలకు జపాన్ కి చెందిన ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్‌కు.. రాబర్ట్ సెలెక్ట్ అయ్యాడు. దాంతో స్టెల్లాను సన్నీ(ఓక్చా)కి అప్పగించి.. అతడు అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లాల్సి వచ్చింది. మధ్యమధ్యలో వచ్చి.. భార్యాబిడ్డలతో గడిపేవాడు. తండ్రి దూరంగా ఉండటంతో.. స్టెల్లాకు తల్లితో మరింత అనుబంధం పెరిగింది. ఐస్‌క్రీమ్ పార్లర్లో ఉద్యోగం చేసే సన్నీ.. కూతురు స్టెల్లాను చాలా ప్రేమగా చూసుకునేది. చాలా ప్రదేశాలకు తిప్పేది. వాటన్నిటినీ తల్లి ప్రేమకు గుర్తుగా గుండెలో దాచుకుంది స్టెల్లా. కొంతకాలానికి సన్నీకి బార్లో వెయిట్రెస్ జాబ్ వచ్చింది. అది నైట్ డ్యూటీ కావడంతో.. స్టేల్లాను న్యూజెర్సీలో ఉండే రాబర్ట్ బంధువులకు అప్పగించాల్సి వచ్చింది. తనతో స్టెల్లా కూడా లేకపోవడంతో.. సన్నీకి బయట స్నేహాలు పెరిగాయి. ఇంట్లో గడిపే సమయం తగ్గి.. బయట గడిపే సమయం పెరిగిపోయింది. దాంతో ఫ్యామిలీ వెకేషన్ ్స తగ్గిపోయాయి. రాబర్ట్‌తో గొడవలు మొదలయ్యాయి. కాల్ చేసుకున్నా, కలుసుకున్నా.. ఆ రోజంతా గొడవలతోనే ముగిసేది. పరిస్థితి చేయిదాటిపోతుందని గుర్తించిన రాబర్ట్.. సామరస్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భార్యతో ఓ ఒప్పందానికి వచ్చాడు. ‘ఇక నుంచి మనం కలసే ఉందాం.. నాతో పాటు అమెరికా వచ్చెయ్. న్యూజెర్సీ వెళ్లి స్టెల్లాతో సంతోషంగా ఉందాం’ అని కోరాడు. అందుకు సన్నీ సరే అంది. ఇద్దరూ న్యూజెర్సీలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. దాంతో తన జాబ్‌ని న్యూయార్క్ నుంచి న్యూజెర్సీకి మార్పించుకున్నాడు రాబర్ట్. సన్నీని తీసుకెళ్లడానికి తిరిగి జపాన్ చేరుకున్నాడు. అయితే భర్త వెంట వెళ్లడానికి అభ్యంతరం చెప్పింది సన్నీ. ‘నేను ఇప్పుడే నీతో రాలేను. ఒకసారి మా కుటుంబాన్ని కలుస్తాను. వచ్చాక మనం న్యూజెర్సీ వెళ్లిపోదాం’ అని చెప్పి.. దక్షిణ కొరియాలోని సియోల్‌కి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. ఆమె గురించి ఎంత వెతికినా ఎలాంటి సమాచారం దొరకలేదు. ‘ఆమె అసలు పేరు ఓక్చా అని, ఆమె సొంత ఊరు దక్షిణకొరియాలోని సియోల్’ అని తప్ప.. మరే వివరాలూ రాబర్ట్‌కి తెలియవు. ఆ మాటకొస్తే తను వెళ్లింది సియోల్కేనో కాదో కూడా తెలియదు. ఆ తర్వాత సన్నీ ఎప్పుడూ కూతురు స్టెల్లాని కలవలేదు. కానీ.. స్టెల్లా మాత్రం తల్లి జ్ఞాపకాలతో తల్లడిల్లిపోయేది. సరిగ్గా రెండేళ్లకు.. రాబర్ట్ తల్లి ఓ ఫోన్ లిఫ్ట్ చేసింది. ‘స్టెల్లా స్టెల్లా’ అనే పిలుపుతో ఓ ఆడ గొంతును అవతలి నుంచి విన్నది. మరే మాట ఆమెకు అర్థం కాలేదు. దానికి కారణం.. రాబర్ట్ తల్లికి ఇంగ్లిష్ మాత్రమేవచ్చు. దాంతో ఫోన్ లో వినిపించిన మాటలేవీ రాబర్ట్ తల్లికి అర్థం కాలేదు. ఒక్క స్టెల్లా అనే పేరు తప్ప. అందుకే ఆ కాల్ చేసింది సన్నీయే కావచ్చు అన్న అనుమానం కలిగింది ఆ కుటుంబానికి. ఎందుకంటే.. సన్నీకి కొరియన్ మాత్రమే వచ్చు. తన తల్లి మాట్లాడే భాష అర్థంకాకే ఆ రోజు సన్నీ కాల్ కట్ చేసుంటుందనుకున్నాడు రాబర్ట్. 1985లో స్టెల్లాకు 4 గౌన్లు, ఓ కుక్కపిల్ల గిఫ్ట్‌గా వచ్చాయి. అయితే ప్యాకింగ్ మీద కాలిఫోర్నియా పోస్ట్ మార్క్ ఉంది. అది కచ్చితంగా తన తల్లే తనకోసం పంపించిందని ఇప్పటికీ నమ్ముతుంది స్టెల్లా. అయితే సన్నీ గురించి ఎలాంటి ఆధారం దొరకలేదు. కొన్నాళ్లకు తండ్రి రాబర్ట్.. మరో పెళ్లి చేసుకున్నాడు. అతడికి మరో పాప పుట్టింది. సవతి తల్లి కూడా స్టెల్లాను ప్రేమగా చూసుకునేది. కానీ కన్నతల్లిని చూడాలనే ఆశ.. స్టెల్లాలో చావలేదు. స్టెల్లాకు పెళ్లి అయ్యి.. ఒక బాబు కూడా పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా తన తల్లిని చూడలేకపోయానన్న వెలితి.. ఆమెను ఇప్పటికీ వెంటాడుతోంది. సన్నీ అలియాస్ ఓక్చాకి ప్రస్తుతం 73 ఏళ్లు దాటే ఉంటాయి. అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియని తల్లి కోసం స్టెల్లా మాత్రం ఇంకా అదే ఆశతో ఎదురుచూస్తోంది. మరి సన్నీ ఏమైంది? ఎందుకు చెప్పాపెట్టకుండా వాళ్ల జీవితాల్లోంచి వెళ్లిపోయింది.? ఒకవేళ మోసం చేయాలని తనకు లేకపోయినా.. అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురైందా? అలా అయితే.. స్టెల్లా గురించి కాల్ చేసింది ఎవరు? స్టెల్లాకు గిఫ్ట్స్ పంపించింది ఎవరు?’ లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లేవు. దాంతో ఓక్చా కథ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం' -
పర్యావరణ దీపికలు.. 'మనం నడవాల్సిన బాట ఇది!'
‘ఆట, పాట గురించే కాదు మనం నడిచే బాట గురించి కూడా ఆలోచించాలి’ అంటున్నారు ఈ యువ మహిళలు. మనం ప్రయాణించే మార్గం ఏది అనేదే భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. బంగారు భవిష్యత్ కోసం పర్యావరణ స్పృహతో ‘మనం నడవాల్సిన బాట ఇది’ అంటూ మార్గనిర్దేశ ఉద్యమ కార్యచరణలో భాగం అవుతున్నారు యువ మహిళలు. ‘అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించనిదే.. ప్రసరించే నీరు ఊరుకోదు పల్లం అంతుముట్టనిదే.. ప్రతిఘటించే మనసు ఊరుకోదు ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే..’ అంటుంది ‘విశ్వంభర’ కావ్యం. ప్రశ్నలు ఎక్కుపెట్టి పర్యావరణ సంరక్షణ కోసం నడుం కట్టిన యువ మహిళల గురించి.. 'గర్విత గుల్హటి' నీరే ప్రాణాధారం.. బెంగళూరుకు చెందిన గర్విత గుల్హటి ఇంజనీరింగ్ చేసింది. ‘వై వేస్ట్?’ స్వచ్ఛంద సంస్థ కో–ఫౌండర్‌గా నీటి సంరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రెస్టారెంట్లలో నీటి వృథాను ఆరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. బడి, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల్లో ‘నీటి సంరక్షణ’కు సంబంధించి ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘వై వేస్ట్?’ సంస్థ దేశవ్యాప్తంగా 20 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘వై వేస్ట్?’ కోసం పనిచేస్తున్న తొలి దినాల్లో ‘సమయం వృథా చేయవద్దు. చదువు మీద దృష్టి పెట్టు’ ‘పర్యావరణ కార్యక్రమాల కోసం పనిచేయడానికి ఇది సరిౖయెన సమయం కాదు’ అని గర్వితతో అనేవారు కొందరు. వారి మాటలను పట్టించుకోకుండా ‘మన కోసం ΄్లానెట్ వేచి చూడదు కదా. మరి ఆలస్యం చేయడం ఎందుకు?’ అని ఆగకుండా ముందుకు వెళ్లింది. ‘వై వేస్ట్?’ ప్రారంభించడానికి కారణం గర్విత మాటల్లోనే..‘మహారాష్ట్ర, బెంగళూరులో కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యల గురించి చదివి బాధపడ్డాను. తాగు నీటి కోసం మహిళలు ఎండలో మైళ్ల దూరం నడవడం చూశాను. మన దేశంలో కోట్లాది మంది పిల్లలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదు. దీని వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలను దృష్టిలో పెట్టుకొని వై వేస్ట్ ఆవిర్భవించింది’ పద్దెనిమిది సంవత్సరాల వయసులో గర్విత గుల్హటి ‘గ్లోబల్ చేంజ్‌మేకర్’ టైటిల్‌కు ఎంపికైంది. 'రిధిమ పాండే' నిగ్గదీసి అడిగే నిప్పు స్వరం! ఉత్తరాఖండ్‌కు చెందిన రిధిమ పాండే చిన్న వయసులోనే క్లైమెట్ యాక్టివిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. పర్యావరణ కార్యకర్తలైన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొందింది. ప్రకృతి విధ్వంసం, వాతావరణ మార్పులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ 2019లో రిధిమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ సంబంధిత కేసులను స్వీకరించడానికి 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఏర్పాటు చేశారు. ‘ఎన్జీటీ’ రిధిమ కేసును స్వీకరించినప్పటికీ ఈ కేసు ‘ఎన్విరాన్మెంట్ పాక్ట్ అసెస్మెంట్’ పరిధిలోకి వస్తుందని కొట్టివేసింది. వాతావరణ సంక్షోభంపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, అర్జెంటీనా దేశాలపై ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన 14 మంది యువ ఉద్యమకారులలో రిధిమ ఒకరు. ఏకైక భారతీయురాలు కూడా.వాతావరణ సంక్షోభంపై రిధిమ గత కొన్ని ఏళ్లుగాఎన్నో వ్యాసాలు రాసింది. ఎన్నో దేశాలలో ఎన్నో ప్రసంగాలు చేసింది. వాతావరణ యువ ఉద్యమకారుల ప్రతి జాబితాలో చోటు సంపాదించింది. ‘చిల్డ్రన్ వర్సెస్ క్లైమెట్ చేంజ్’ పేరుతో పుస్తకం రాసింది. 'వర్ష రైక్వార్' ప్రతి ఊరుకు పర్యావరణ స్వరం! ‘గతంలో అద్భుతమైన పంట దిగుబడులు వచ్చేవి. క్రమక్రమంగా ఏటేటా పంట దిగుబడి క్షిణిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే క్రమంలో పర్యావరణ అంశాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మధ్యప్రదేశ్‌కు చెందిన వర్షా రైక్వార్. గతంలో చుట్టు పక్కల ఎన్నో వనాలు కనిపించేవి. అవి ఎందుకు అదృశ్యమయ్యాయి? అని స్థానికులను అడిగితే ‘విధిరాత. అంతే! మనం ఏం చేయలేం’ అని విధిపై భారాన్ని మోపారు. ఈ నేపథ్యంలో సామాన్య మహిళలకు ‘వాతావరణ మార్పులు–కారణాలు–మన కార్యచరణ’ గురించి తెలియజేయడానికి రేడియో జాకీగా ప్రస్థానంప్రారంభించింది వర్ష. పర్యావరణ రంగంలో కృషి చేస్తున్న చేంజ్మేకర్ల అసాధారణ కథలను ఎఫ్ఎం 90.4 రేడియో బుందెల్‌ఖండ్ ద్వారా వెలుగులో తీసుకువచ్చి పదిమందికి తెలిసేలా చేసింది. వాతావరణ మార్పులపై అవగాహనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లిన వర్ష ‘యునైటెడ్ నేషన్స్ యంగ్ క్లైమెట్ లీడర్–2021’గా ఎంపికైంది. 'హీనా సైఫి' వాయు కాలుష్యంపై వార్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరuŠ‡లో ఎంబీఏ చదువుతున్న హీనా సైఫి ‘క్లైమెట్ చేంజ్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. ఉమెన్ క్లైమెట్ కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) వేదికలో పాలుపంచుకున్న 16 మంది ఉమెన్ ఛాంపియన్స్‌లో హీన ఒకరు. ఐక్యరాజ్య సమితి ‘వుయ్ ది చేంజ్’ క్యాంపెయిన్‌లో కూడా హీన భాగం అయింది. ఎనిమిదవ తరగతి పూర్తయిన తరువాత ‘ఇక చదివింది చాలు’ అన్నారు తల్లిదండ్రులు. అయితే హీన పట్టుదల ముందు వారి నిర్ణయం ఓడిపోయింది. పర్యావరణ సమస్యలపై అవగాహన లేకపోవడానికి చదువుకోకపోవడం ఒక కారణం అని గ్రహించిన హీన, పిల్లలు ఎవరైనా స్కూల్ మానేస్తే వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడేది. పిల్లలు తిరిగి స్కూలుకు వచ్చేలా చేసేది. అంతేకాదు...స్థానిక స్వచ్ఛంద సంస్థలో చేరి వాతావరణ మార్పులపై జరిగిన ఎన్నో సమావేశాలు, వర్క్‌షాప్‌లకు హాజరైయ్యేది. ‘క్లైమెట్ ఎజెండా’పై లక్నోలో జరిగిన సమావేశానికి హాజరై వాయు కాలుష్యం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్....మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేది. ‘సూరజ్ సే సమృద్ధి’ పేరుతో సౌరశక్తి ఉపయోగాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. బడులలో పర్యావరణ అంశాలకు సంబంధించి పోస్టర్–మేకింగ్ యాక్టివిటీస్ నిర్వహించింది. 'నేహా శివాజీ నైక్వాడ్' గ్రీన్ రికవరీ! మన దేశంలోని కొద్దిమంది పర్యావరణ ఆధారిత డేటా సైంటిస్టులలో నేహా ఒకరు. క్లైమేట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్ల ద్వారా క్లైమేట్ డేటా ఫోకస్డ్ సొల్యూషన్స్ కోసం చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది నేహా. ‘క్లైమేట్ కలెక్టివ్’ ఫౌండేషన్ ద్వారా యువ ఎంటర్ప్రెన్యూర్లకు వ్యాపార పరిజ్ఞానం, మార్కెట్ కనెక్షన్లు, సాంకేతిక సామర్థ్యం విషయంలో సహాయపడుతోంది. ‘క్లైమేట్ కలెక్టివ్’కు ముందు సాఫ్ట్వేర్, టెక్నాలజీకి సంబంధించిన మల్టీ నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ ‘జెడ్ఎస్ అసోసియేట్స్’లో పని చేసింది నేహా. తన నైపుణ్యాన్ని ఉపయోగించి 140కి పైగా గ్రీన్ స్టార్టప్లనుప్రారంభించడంలో సహాయపడింది. యూఎన్–ఇండియా ‘వుయ్ ది చేంజెస్’ క్యాంపెయిన్‌కు ఎంపికైన పదిహేడు మంది యంగ్ క్లైమేట్ చేంజ్ లీడర్లలో నేహా ఒకరు. ‘జీరో–వేస్ట్’పై పని చేసే యూత్ సెల్ ‘సెల్ పర్వాహ్’కు కో–ఫౌండర్ అయిన నేహా ‘గ్రీన్ రికవరీని వేగవంతం చేయడానికి నావంతుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటున్నాను’ అంటుంది. ఇవి చదవండి: International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం! -
Sarfaraz Khan: 'నాన్నకు ప్రేమతో..' ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసి చూపించాను!
"2009.. ఓ 12 ఏళ్ల కుర్రాడు స్కూల్ క్రికెట్లో 439 పరుగుల స్కోరు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. ‘సచిన్ రికార్డ్‌ను బద్దలు కొట్టాలని నాన్న చెప్పాడు. చేసి చూపించాను!’ 2014.. ఐదేళ్ల తర్వాత.. అదే కుర్రాడు ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీతో పాటు అండర్–19 వరల్డ్ కప్ కూడా ఆడాడు. 'ఇది ఆరంభం మాత్రమేనని నాన్న చెప్పాడు'. నేను ఇక్కడితో ఆగిపోనని మాటిచ్చాను!" 2024.. మరో పదేళ్లు.. అదే అబ్బాయి భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ‘మా నాన్న కళ్ల ముందు దేశం తరఫున ఆడాలనుకున్నాను.. ఇప్పుడు ఆ కల నెరవేరింది!’ తండ్రి, కోచ్, మెంటర్.. ఏదైనా.. ఆ అబ్బాయి క్రికెట్ ప్రపంచం నాన్నతో మొదలై నాన్నతోనే సాగుతోంది. ఆరేళ్ల వయసులో ఆట మొదలుపెట్టిన దగ్గరి నుంచి ఇప్పుడు భారత సీనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు అన్నింటా, అడుగడుగునా నాన్నే ఉన్నాడు. అపార ప్రతిభావంతుడిగా వెలుగులోకి వచ్చి అద్భుత ప్రదర్శనలతో పై స్థాయికి చేరే వరకు ఈ తండ్రీ కొడుకులు పడిన శ్రమ, పట్టుదల, పోరాటం ఎంతో ప్రత్యేకం. అందుకే అతని అరంగేట్రం క్రికెట్ అభిమానులందరినీ భావోద్వేగానికి గురి చేసింది. అతడే సర్ఫరాజ్ ‘నౌషాద్’ఖాన్! భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 311వ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. అదే రోజు వికెట్ కీపర్ జురేల్ కూడా అరంగేట్రం చేశాడు. గతంలోనూ తొలి టెస్ట్ సమయంలో ఆటగాళ్లు తమ సంతోషాన్ని ప్రదర్శించి, తమ పురోగతిని గుర్తు చేసుకున్న రోజులు ఉన్నాయి. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చి టీమిండియా గడప తొక్కినవారూ ఉన్నారు. కానీ సర్ఫరాజ్ తొలి టెస్ట్ రోజున మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున సందడి కనిపించింది. గత కొంతకాలంగా దేశవాళీలో అతని ఆటను చూసినవారు, అతన్ని భారత జట్టుకి ఇంకెప్పుడు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నిస్తున్న వారు.. అతనికి ఆ అవకాశం వచ్చిన రోజున ఊరట చెందినట్లుగా ‘అన్ని విధాలా అర్హుడు’ అంటూ ప్రశంసలు కురిపించారు. టెస్ట్ క్యాప్ అందిస్తున్న సమయంలో.. ‘నువ్వు ఎంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చావో నాకు తెలుసు. మీ నాన్న, కుటుంబసభ్యులు ఈ ఘనతను చూసి గర్విస్తారు’ అంటూ దిగ్గజం అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించడం.. ‘నేను చూసుకుంటా.. మీరు మీ అబ్బాయి కోసం ఏమేం చేశారో మా అందరికీ బాగా తెలుసు’ అంటూ స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ భరోసానివ్వడం సర్ఫరాజ్ అరంగేట్రం విలువను చాటాయి. కఠోర శ్రమ.. అకుంఠిత దీక్ష.. ‘జీవితంలో ఏదైనా సాధించడానికి ఎంత కష్టపడాలి?’ అని సర్ఫరాజ్ తండ్రి నౌషాద్‌ను అడిగితే ‘తట్టుకోలేనంత’ అని జవాబిస్తాడు. ఎందుకంటే ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు ఆయన తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు, అతని బాల్యాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ‘సర్ఫరాజ్ తన ఫ్రెండ్స్‌తో ఏనాడూ బయటకు వెళ్లింది లేదు. గాలిపటాలు ఎగరేసింది లేదు. తెల్లవారుజామున లేవగానే ప్రాక్టీస్‌కు వెళ్లిపోవడం.. గంటల కొద్దీ సాధన చేయడం.. ఇంటికి రావడం.. మళ్లీ సాయంత్రం కూడా ఇదే తరహాలో ప్రాక్టీస్ చేసింది’ అని కొడుకు కోసం తను ప్లాన్ చేసిన దినచర్యను స్వయంగా నౌషాదే చెప్పాడు. రోజుకు దాదాపు 600కు పైగా బంతులు అంటే దాదాపు 100 ఓవర్లు అతనొక్కడే ఆడేవాడు. ఆరేళ్ల ఆట తర్వాత స్కూల్ క్రికెట్ ద్వారా తొలి సారి సర్ఫరాజ్ పేరు ముంబై క్రికెట్లో వినిపించింది. 439 పరుగుల స్కోరు సాధించి అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే 12 ఏళ్ల వయసులో సాధించిన ఈ ఘనత అతని కష్టాన్ని మరింత పెంచింది. తర్వాత ఐదేళ్ల పాటు సర్ఫరాజ్‌ను రాటుదేల్చే క్రమంలో ఆ శిక్షణను తండ్రి మరింత కఠినంగా మార్చాడు. తర్వాతి నాలుగేళ్ల పాటు సర్ఫరాజ్ స్కూల్ ముఖమే చూడలేదు. వ్యక్తిగతంగా ట్యూటర్‌ను పెట్టినా దాని వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. అతనికి కష్టం విలువ తెలియాలని కొన్నిసార్లు రాత్రిళ్లు భోజనం కూడా పెట్టేవాడు కాదు నౌషాద్. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అన్నింటిలోనూ సర్ఫరాజ్‌కు తండ్రి మాత్రమే కనిపించేవాడు. తన కోసం కాకుండా తండ్రి కోసమే బతుకుతున్నట్లుగా అనిపించేది. ‘మీ అబ్బాయి ఇదంతా ఇష్టంతోనే చేశాడా? అతను అంతలా కష్టపడ్డాడు.. అతనిలో ఇంకా శక్తి ఉందా? అంటూ నన్ను చాలామంది ప్రశ్నించారు. బయటినుంచి చూస్తే కఠినంగా అనిపించినా అది తప్పలేదు. తన లక్ష్యంపై మరింత ఏకాగ్రత పెట్టేందుకు.. ఇతర విషయాల వైపు దృష్టి మరల్చకుండా చేసేందుకు నేను అనుసరించిన తీరు కరెక్టే. తర్వాత రోజుల్లో మావాడు దాన్ని అర్థం చేసుకున్నాడు అని వాళ్లకు సమాధానం ఇచ్చాను’ అంటాడు నౌషాద్. అయితే కెరీర్ ఆరంభంలో వయసు విషయంలో మోసం చేశాడంటూ ఓవర్ ఏజ్ ఆరోపణలు సర్ఫరాజ్‌పై వచ్చాయి. చివరకు అడ్వాన్స్డ్ టెస్ట్ ద్వారా అతను తప్పు చేయలేదని తేలింది. కానీ ఇది మానసికంగా ఆ పిల్లాడిపై ప్రభావం చూపించింది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన అతను ఇక క్రికెట్ ఆడనంటూ ఏడ్చేశాడు. దాన్నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు 2014లో ముందుగా ముంబై అండర్–19 జట్టులో చోటు దక్కడంతో సర్ఫరాజ్ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కింది. ఆ వెంటనే భారత్ తరఫున అండర్–19 ప్రపంచకప్‌లో సర్ఫరాజ్ ఆడాడు. రెండేళ్ల తర్వాత రెండోసారి అతనికి అండర్–19 వరల్డ్ కప్ ఆడే అవకాశం కూడా వచ్చింది. రెండు వరల్డ్ కప్‌లలో కలిపి 7 అర్ధ సెంచరీలు సహా 566 పరుగులు సాధించడంతో అతను ఒక స్థాయికి చేరుకున్నాడు. వివాదాలను దాటి తప్పులు సరిదిద్దుకొని.. చదువులో, వ్యాపారంలో లేదా ఏ ఇతర రంగంలోనైనా తాను సాధించలేకపోయిన విజయాలను, ఘనతలను తమ పిల్లలు సాధించాలని కోరుకోవడం.. తమ జీవితంలో మిగిలిన ఆశలు, కోరికలను వారి ద్వారా తీర్చుకొని సంతోషపడటం ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు చేసేదే. నౌషాద్ కూడా అలాంటివాడే. ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్గఢ్ స్వస్థలం. క్రికెటర్‌గా కనీస నైపుణ్యం ఉండటంతో భవిష్యత్తు నిర్మించుకునేందుకు ముంబై చేరాడు. అయితే మహానగరంలో ఉపాధి దొరికినా తగిన అవకాశాలు రాక క్లబ్ క్రికెటర్ స్థాయికే పరిమితమయ్యాడు. దాంతో స్థానిక పిల్లలకు కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. చిన్న అద్దె ఇంట్లో ఉంటూ ఒకింత పేదరికంలోనే జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన కొడుకును ఆటగాడిగా తీర్చిదిద్దాలని, ఎలాగైనా పెద్ద స్థాయిలో ఆడించాలనే తపన మొదలైంది అతనిలో. దీని కోసం దేనికైనా సిద్ధమనే కసితో అతను పని చేశాడు. అయితే కొన్ని సార్లు అదుపు తప్పాడు. వరుస తప్పులతో కొడుకు ఇబ్బందులకు పరోక్ష కారణమయ్యాడు. ఎంత బాగా ఆడినా తగిన అవకాశాలు రావడం లేదనే ఆగ్రహంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులతోనే తలపడేందుకు సిద్ధమవడంతో వాళ్లు అతనిపై చర్య తీసుకున్నారు. టీమ్‌తో ఉన్నా జట్టు కోచ్ కాకుండా మా నాన్న వద్దే శిక్షణ తీసుకుంటానంటూ మొండికేయడంతో సర్ఫరాజ్పైనా హెచ్చరిక జారీ అయింది. సెలక్టర్ల వైపు అభ్యంతరకర సైగలు చేయడంతో రెండేళ్ల పాటు అతని మ్యాచ్ ఫీజులను నిలిపేసింది. ఈ వరుస గొడవలతో ఆగ్రహం చెందిన నౌషాద్ ఇక తన కొడుకు ముంబైకి ఆడడంటూ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు తీసుకుపోయాడు. మూడేళ్లు యూపీ తరఫున ఆడిన తర్వాత కనీస గుర్తింపు రాకపోవడంతో తాను చేసింది తప్పని అతనికి అర్థమైంది. అద్భుత ప్రదర్శనతో.. ముంబైకి తిరిగొచ్చాక.. ఒక్కసారిగా కొత్త సర్ఫరాజ్ కనిపించాడు. వరుసగా రెండు సీజన్లలో అత్యద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయి రెండుసార్లూ 900కు పైగా పరుగులతో సత్తా చాటాడు. వరుసగా డబుల్, ట్రిపుల్ సెంచరీలతో చెలరేగి ఒక దశలో 82.83 సగటుతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో అతని పేరు కనిపించడం విశేషం. కోవిడ్ సమయంలో ముంబైలో ఆడటం సాధ్యం కాకపోతే తన మిత్రుల సహకారంతో యూపీలో వేర్వేరు నగరాలకు వెళ్లి సాధన కొనసాగించాడు. పరుగుల వరద పారిస్తూ.. ముంబై వరుస టోర్నీల్లో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు సర్ఫరాజ్. అతని గ్రాఫ్ చూసిన గవాస్కరే.. సర్ఫరాజ్‌ని భారత జట్టుకు ఇంకెప్పుడు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించాల్సి వచ్చింది. అయినా ప్రతి సిరీస్‌కూ ఎదురు చూడటం, నిరాశపడటం రొటీన్ అయిపోయింది. అసలు భారత్‌కు ఆడతాడా అనే సందేహాలూ మొదలయ్యాయి. సహనం కోల్పోతున్న పరిస్థితి. ఎట్టకేలకు ఆ సమయం 2024 ఫిబ్రవరి 15న వచ్చింది. ఎలాంటి వివాదం లేకుండా ఏ ఒక్కరూ ప్రశ్నించకుండా ముక్తకంఠంతో సరైన ఎంపికగా అందరూ అభినందిస్తుండగా తీవ్ర భావోద్వేగాల మధ్య సర్ఫరాజ్ తొలి టెస్ట్ ఆడి రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. ‘నాన్న కలను నిజం చేశాను’ అంటూ సర్ఫరాజ్ చెబుతుంటే నౌషాద్ కన్నీళ్లపర్యంతం అయిన దృశ్యం అందరి కళ్లల్లో నిలిచిపోయింది. ఎన్నో ప్రతికూలతలను దాటి ఇక్కడికి చేరిన సర్ఫరాజ్ భవిష్యత్తులోనూ మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ ఆడాలనేదే సగటు భారత క్రికెట్ అభిమాని ఆకాంక్ష. – మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: దేవుడా..! బచ్చన్‌కి బిడియం ఎక్కువే..! -
ఫన్డే: ఈ వారం కథ: 'లెఫి బొ'
"ఆఫీస్‌కి వెళ్ళబోతున్న భర్తకు ‘బై’ చెప్పడం కోసం గడపదాటి వసారాలోకొచ్చి, నవ్వుతూ చేయి వూపింది ఆద్విక. అతిలోకసౌందర్యవతి తన భార్య అయినందుకు గర్వపడని రోజు లేదు నిషిత్‌కి. అతను కూడా నవ్వుతూ ‘బై’ చెప్పాడు. ‘లోపలికెళ్ళి తలుపేసుకో. సాయంత్రం నేను తిరిగొచ్చేవరకు తలుపు తీయకు’ అన్నాడు. ‘నన్నెవరైనా ఎత్తుకెళ్తారని భయమా?’ చిలిపిగా నవ్వుతూ అంది. ‘దొంగలెత్తుకుపోతారేమోనన్న భయంతో విలువైన వజ్రాల్ని భద్రంగా లాకర్లో పెట్టి దాచుకుంటాం కదా. నువ్వు నాకు వజ్రాలకన్నా విలువైనదానివి’ అన్నాడు. ఆద్విక సమ్మోహనంగా నవ్వింది." అందం, అణకువ ఉన్న ఆద్విలాంటి స్త్రీలని కిడ్నాప్ చేసి, సగం ధరకే అమ్మేస్తున్న ముఠాలున్న విషయం ఆద్వికి తెలిస్తే అలా నవ్వగలిగేది కాదేమో అనుకున్నాడు నిషిత్. ప్రస్తుతం నడుస్తున్న లాభసాటి వ్యాపారం అదే. అలా కొన్నవాళ్ళు, కొన్ని మార్పులు చేర్పులు చేసి, అందానికి మరిన్ని మెరుగులు దిద్ది తిరిగి ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. అతను వీధి మలుపు తిరిగేవరకు చూసి, లోపలికెళ్ళబోతూ ఎవరో తననే చూస్తున్నట్టు అనుమానం రావడంతో ఆగి.. అటువైపు చూసింది ఆద్విక. అనుమానం కాదు. నిజమే. ఎవరో ఒకతను తన వైపే చూస్తున్నాడు. ముప్పయ్యేళ్ళకు మించని వయసు, నవ్వుతున్నట్టు కన్పించే కళ్ళు, సన్నటి మీసకట్టు, అందంగా ట్రిమ్ చేసిన గడ్డం.. అతన్ని యింతకు ముందు ఎప్పుడైనా చూశానా అని ఆలోచించింది. ఎంత ఆలోచించినా తన జ్ఞాపకాల పొరల్లో అతని ఆనవాళ్ళేమీ కన్పించలేదు. మెల్లగా యింటిలోపలికి నడిచి, తలుపు మూయబోతూ మళ్ళా అతని వైపు చూసింది. అతను అక్కడే నిలబడి కళ్ళార్పకుండా తన వైపే చూస్తుండటంతో భయమేసి, ధడాల్న తలుపు మూసి, గడియ పెట్టింది. ఎవరతను? ఎందుకు తన వైపే చూస్తున్నాడు? తనను కాదేమో.. యింటివైపు చూస్తున్నాడేమో.. దొంగతనం చేసే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడేమో.. అతని కళ్ళలో కన్పించిన దైన్యం ఆమెను గందరగోళానికి గురిచేస్తోంది. దొంగ కాదేమో.. ఏదైనా చిక్కు సమస్యలో ఉన్నాడేమో.. తనేమైనా పొరపడిందా? అది దైన్యం కాదేమో.. పదునైన కత్తితో గొంతు కోయగల క్రూరత్వాన్ని దాని వెనుక దాచుకుని ఉన్నాడేమో? మొదట నిషిత్‌కి ఫోన్ చేసి చెప్పాలనుకుంది. ఆఫీస్ బాధ్యతల్లో తలమునకలై ఉంటాడు కదా. ఎందుకతన్ని మరింత ఒత్తిడికి లోనుచేయడం? సాయంత్రం యింటికొచ్చాక చెప్తే చాలు కదా అనుకుంది. నిషిత్ యింటికి తిరిగొచ్చేలోపల చేయాల్సిన పనులన్నీ గుర్తొచ్చి వాటిని యాంత్రికంగా చేయసాగింది. ఈ లోపలే ఆ ఆగంతకుడు లోపలికొచ్చి, ఏమైనా చేస్తాడేమోనన్న భయం ఆమెను వీడటం లేదు. ఐనా తలుపులన్నీ వేసి ఉన్నాయిగా. ఎలా వస్తాడు? అనుకుంటున్నంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆద్విక ఉలిక్కిపడి తలుపు వైపు చూసింది. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ అతనే నేమో అనుకోగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరోసారి కాలింగ్ బెల్ మోగింది. ఆమె శిలలా కదలకుండా నిలబడింది. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతోంది. మెల్లగా కదిలి, తలుపుని చేరుకుంది. గోడ పక్కనున్న ఓ స్విచ్ని నొక్కింది. పదహారంగుళాల స్క్రీన్ మీద ఆ వ్యక్తి మొహం కన్పించింది. అతనే.. తన భర్త ఆఫీస్కెళ్ళే సమయంలో తన వైపు అదోలా చూస్తూ నిలబడిన వ్యక్తి.. ఆడియో కూడా ఆన్ కావడంతో అతని మాటలు తనకు స్పష్టంగా విన్పిస్తున్నాయి. ‘భువీ.. నన్ను గుర్తుపట్టలేదా? నేను భువీ.. రియాన్ని. ఒక్కసారి తలుపు తీయవా? ప్లీజ్ భువీ.. నీకు చాలా విషయాలు చెప్పాలి’ అతని గొంతులో ఆవేదన.. కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్ళు తను చెప్తున్నది నిజమే అంటూ సాక్ష్యం పలుకుతున్నాయి. కానీ తన పేరు భువి కాదుగా. అదే చెప్పింది. ‘మీరేదో పొరబడినట్టున్నారు. నాపేరు భువి కాదు. ఆద్విక.. మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదు. దయచేసి యిక్కణ్ణుంచి వెళ్ళిపోండి’ అంది. ‘అయ్యో భువీ.. నేను పొరబడలేదు. నా ప్రాణంలో ప్రాణమైన నిన్ను గుర్తుపట్టడంలో పొరబడ్తానా? లేదు. నువ్వు నా భార్యవి. నేను నీ రియాన్ని.’ ‘క్షమించాలి.. నా భర్త పేరు నిషిత్. మరొకరి భార్యని పట్టుకుని మీ భార్య అనడం సంస్కారం కాదు. తక్షణమే వెళ్ళిపొండి. లేకపోతే మీపైన సెక్యూరిటీ సెల్‌కి కంప్లెయింట్ చేయాల్సి వస్తుంది.’ ‘నన్ను నమ్ము భువీ. ఒక్కసారి తలుపు తెరువ్. నేను చెప్పేది నిజమని రుజువు చేసే సాక్ష్యాధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్క పది నిమిషాలు చాలు. ప్లీజ్ తలుపు తెరువు’ అతను జాలిగొలిపేలా వేడుకుంటున్నాడు. ఆద్విలో దయాగుణం .. అతని వల్ల తనకేమీ ప్రమాదం ఉండదన్న నమ్మకం కలగడంతో తలుపు తెరిచి, ‘లోపలికి రండి. దయచేసి ఏడవకండి. ఎవరైనా ఏడుస్తుంటే చూసి తట్టుకునేంత కఠినత్వం నాలో లేదు’ అంది. అతను హాల్లో ఉన్న సోఫాలో కూచున్నాక, అతనికి గ్లాసునిండా చల్లని మంచినీళ్ళిచ్చింది. అతను గటగటా తాగి, గ్లాస్‌ని టీపాయ్ మీద పెట్టాక, అతని ఎదురుగా కూచుంటూ ‘ఇప్పుడు చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో’ అంది. ‘నా పేరు రియాన్. ఎనిమిదేళ్ళ క్రితం కాయ్ అనే కంపెనీలో నిన్ను చూసినపుడే ప్రేమలో పడ్డాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే. అప్పుడు నా వయసు ఇరవై రెండేళ్ళు. కాయ్ సంస్థ గురించి నీకు తెల్సుగా. సిఓవై కాయ్.. కంపానియన్ ఆఫ్ యువర్ చాయిస్ అనే సంస్థ’ అంటూ ఆమె సమాధానం కోసం ఆగాడు. ‘తెలుసు. మూడేళ్ళ క్రితం నన్ను నిషిత్ తెచ్చుకుంది అక్కడినుంచే’ అంది ఆద్విక. ‘నాకు మొదట కాయ్ని సందర్శించే ఆసక్తి లేదు. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుని, ఒకర్నో యిద్దర్నో పిల్లల్ని కని.. ఇలాంటి మామూలు కోరికలే ఉండేవి. విడాకులు తీసుకున్న మగవాళ్ళ కోసం, భార్య చనిపోయాక ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళకోసం అత్యంత అందమైన ఆడ ఆండ్రాయిడ్లను తయారుచేసి, అమ్మకానికి పెడ్తున్నారని విన్నప్పుడు, ఎంత అందమైన ఆడవాళ్ళని తయారుచేస్తున్నారో వెళ్ళి చూడాలనుకున్నాను. కొనాలన్న ఉద్దేశం లేదు. ఎనిమిదేళ్ళ క్రితం ఒక్కో ఆండ్రాయిడ్ ధర యాభైలక్షల పైనే ఉండింది. మనక్కావల్సిన ఫీచర్స్‌ని బట్టి కోటి రూపాయల ధర పలికే ఆండ్రాయిడ్స్ కూడా ఉండేవి. అంతడబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం నాకేమీ లేదు. కానీ అక్కడ డిస్ప్లేలో పెట్టిన పాతిక్కి పైగా ఉన్న ఆడవాళ్ళలో నిన్ను చూశాక, చూపు తిప్పుకోలేక పోయాను. చెప్పాగా ప్రేమలో పడ్డానని! అందుకే ఎనభై లక్షలు చెల్లించి నిన్ను నా సొంతం చేసుకున్నాను. మన ఐదేళ్ళ కాపురంలో ఎన్ని సుఖాలో.. ఎన్ని సంతోషాలో.. నీ సాన్నిధ్యంలో మనిల్లే ఓ స్వర్గంలా మారిపోయింది.’ ‘ఐదేళ్ళ కాపురమా? నాకేమీ గుర్తులేదే.. అలా ఎలా మర్చిపోతాను? నా జీవితంలో జరిగిన ఏ ఒక్క క్షణాన్ని కూడా మర్చిపోలేదు. నా మెమొరీ చాలా షార్ప్. మీరు చెప్పేది కట్టు కథలా ఉంది’ అంది ఆద్విక. ‘నేను చెప్పేది నిజం భువీ.’ ‘నా పేరు భువి కాదని చెప్పానా.. అలా పిలవొద్దు. ఆద్విక అనే పిలవండి.’ ‘సరే ఆద్వికా. అసలు జరిగిందేమిటో తెలుసా? నీ మెమొరీని పూర్తిగా ఎరేజ్ చేసి, మళ్ళా నిన్ను ఫ్రెష్‌గా మొదటిసారి అమ్ముతున్నట్టు ఇప్పుడున్న నీ భర్తకు అమ్మారు. అందుకే నాతో గడిపిన రోజులు నీకు గుర్తుకు రావడం లేదు.’ ‘నా మెమొరీని ఎరేజ్ చేశారా? ఎవరు? ఎందుకు?’ ‘ఆండ్రాయిడ్లను దొంగిలించే ముఠాల గురించి వినలేదా? ప్రస్తుతం అన్నిటికంటే లాభసాటి వ్యాపారం ఆడ ఆండ్రాయిడ్లని అమ్మడమే. ఒక్కో ఆండ్రాయిడ్ ధర కోటిన్నర వరకు పలుకుతోంది. ఆల్రెడీ అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్లని దొంగలు ఎత్తుకెళ్ళి తక్కువ ధరకు కంపెనీకే అమ్మేస్తారు. కంపెనీ వాళ్ళు అందులో మరికొన్ని మార్పులు చేర్పులు చేసి, మెమొరీ మొత్తాన్ని తుడిచేసి, కొత్త ఆండ్రాయిడ్ అని కస్టమర్లను నమ్మించి కోటిన్నరకు అమ్ముకుంటారు.’ ‘అంటే నాలో కూడా మార్పులు చేసి అమ్మి ఉండాలి కదా. అలాగైతే మీరెలా గుర్తుపట్టారు?’ అంది ఆద్విక. ‘నిన్ను గుర్తుపట్టకుండా చాలా మార్పులే చేశారు. జుట్టు రంగు మార్చారు. ముక్కు, పెదవులు, చెంపల్లో కూడా మార్పులు చేశారు. కానీ నీ కళ్ళను మాత్రం మార్చలేదు. అదే నా అదృష్టం. వాటిని చూసే నువ్వు నా భువివే అని గుర్తుపట్టాను. ఆ కళ్ళు చూసేగా భువీ నేను ప్రేమలో పడింది.. ప్రేమగా, ఆరాధనగా చూసే కళ్ళు..’ ‘ఇవేమీ నమ్మశక్యంగా లేవు.’ ‘నా దగ్గర రుజువులున్నాయని చెప్పాగా. మనిద్దరం కలిసి ఉన్న ఈ ఫోటోలు, వీడియోలు చూడు’ అంటూ చూపించాడు. వాటిల్లో తనలానే నాజూగ్గా, తనెంత పొడవుందో అంతే పొడవుగా ఉన్న అమ్మాయి కన్పించింది. అతను చెప్పినట్టు కళ్ళు అచ్చం తన కళ్ళలానే ఉన్నాయి. కానీ మొహంలోని మిగతా అవయవాలు వేరుగా ఉన్నాయి. తన వైపు అనుమానంగా చూస్తున్న ఆద్వికతో ‘యిది నువ్వే భువీ..’ అన్నాడు రియాన్. ‘మీరు చూపించిన ఫొటోల్లోని అమ్మాయి నేను కాదు. కళ్ళు ఒకేలా ఉన్నంతమాత్రాన అది నేనే అని ఎలా నమ్మమంటారు? యిప్పుడున్న టెక్నాలజీతో ఎన్నిరకాల మాయలైనా సాధ్యమే. యిక మీరు వెళ్ళొచ్చు’ అంది లేచి నిలబడుతూ. ‘నువ్వు నా భువివే అని నిరూపించడానికి మరో మార్గం ఉంది. నీ మెమొరీని ఎరేజ్ చేసినా అది పూర్తిగా అదృశ్యమైపోదు. లోపలెక్కడో నిక్షిప్తమై డార్మెంట్‌గా ఉంటుంది. దాన్ని రిట్రీవ్ చేయవచ్చు. ప్లీజ్ నాకో అవకాశం యివ్వు. రేపు మళ్ళా వస్తాను. నాతో బైటికి రా. నీ పాత జ్ఞాపకాల్ని బైటికి తోడగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స ఎక్స్పర్ట్ దగ్గరకు పిల్చుకెళ్తాను. జస్ట్ వన్ అవర్. ప్లీజ్ నాకోసం.. కాదు కాదు. మనకోసం..’ ‘మీరు మొదట బైటికెళ్ళండి’ కోపంగా అంది. ‘నిజమేమిటో తెల్సుకోవాలని లేదా నీకు? ప్రశాంతంగా ఆలోచించు. ఒక్క గంట చాలు. రేపు మళ్ళా వస్తాను’ అంటూ అతను వేగంగా బైటికెళ్ళిపోయాడు. ∙∙ రాత్రి పన్నెండు దాటినా నిషిత్‌కి నిద్ర పట్టడం లేదు. రియాన్ అనే వ్యక్తి చెప్పిన విషయాలన్నీ ఆద్విక నోటి ద్వారా విన్నప్పటి నుంచి అతనికి మనశ్శాంతి కరువైంది. రియాన్ చెప్పేది నిజమేనా? ఆద్వికను తను కొనుక్కోక ముందు రియాన్ తో ఐదు సంవత్సరాలు కాపురం చేసిందా? ఆ మెమొరీని ఎరేజ్ చేసి, తనకు అమ్మారా? ఎంత మోసం.. ఇలా ఫస్ట్ సేల్ అని చెప్పి తనలాంటివాళ్ళని ఎంతమందిని మోసం చేసి, పాత ఆండ్రాయిడ్లని అంటగడ్తున్నారో! కాయ్ కంపెనీ అమ్మే ఆండ్రాయిడ్లన్నీ ఇరవై యేళ్ళ వయసులోనే ఉంటాయి. దశాబ్దాలు జరిగిపోయినా వాటి వయసు మారదు. ఇరవై యేళ్ళే ఉంటుంది. అతనికి ఆద్వికను కొనడం కోసం కాయ్ కంపెనీకి వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. అసలెప్పుడైనా మర్చిపోతే కదా.. తన జీవితాన్ని అందమైన మలుపు తిప్పిన రోజది. ఎంత తీయటి జ్ఞాపకమో.. అతనికి పాతికేళ్ళ వయసులో జోషికతో పెళ్ళయింది. యిద్దరూ ఒకే ఆఫీస్‌లో పనిచేసేవారు. పెళ్ళయిన ఏడాదివరకు హాయిగా గడిచింది. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. రోజూ ఏదో ఒక విషయం గురించి పోట్లాట.. ఎంత ఓపికతో భరించాడో.. అందమైన పూలవనాల్లో విహరిస్తూ శ్రావ్యమైన పాటల్ని వింటున్నంత తీయగా తన సంసారం కూడా సాగిపోవాలని కదా కోరుకున్నాడు .. ఆ కోరిక తీరనే లేదు. ఎన్నేళ్ళయినా జోషికలో మార్పు రాలేదు. పోనుపోను మరింత మొండిగా, మూర్ఖంగా తయారైంది. యిద్దరు పిల్లలు పుట్టారు. ఆమె కోపాన్ని తట్టుకోవడం కష్టమైపోయింది. విడిపోవాలని ఎంత బలంగా అన్పించినా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ కోరికను వాయిదా వేశాడు. పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయి జీవితంలో స్థిరపడ్డాక, తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పుడతని వయసు నలభై ఎనిమిదేళ్ళు. తర్వాత రెండేళ్ళ వరకు ఒంటరి జీవితమే గడిపాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అన్పించలేదు. ఆ వచ్చే స్త్రీ కూడా జోషికలా కయ్యానికి కాలుదువ్వే రకమైతే.. నో.. అన్నింటికన్నా మనశ్శాంతి ముఖ్యం కదా. అది లేని జీవితం నరకం. ఆ రెండేళ్ళు యింటిపని, వంటపని యిబ్బంది అన్పించలేదు. ప్రతి పనికీ రకరకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏం కూర కావాలో గాడ్జెట్‌లో ఫీడ్ చేస్తే చాలు. కూరలు కడిగి, తరిగి, నూనెతో పాటు కారం, ఉప్పులాంటి అవసరమైన దినుసులూ వేసి, వండి హాట్ బాక్స్‌లో పెట్టేస్తుంది. కాని యిబ్బందల్లా ఎవరూ తోడు లేకపోవడం. మనసులోని భావాలు పంచుకోడానికి ఓ మనిషి కావాలి కదా. అప్పుడే అతనికి కాయ్ కంపెనీ గుర్తొచ్చింది. అప్పటికే కాయ్ కంపెనీ చాలా ప్రాచుర్యం పొందింది. కోటి కోటిన్నర పెట్టగల తాహతున్న ఒంటరి మగవాళ్ళందరూ ఎన్నేళ్ళయినా వన్నె తరగని, వయసు పెరగని ఇరవై యేళ్ళ అందమైన ఆండ్రాయిడ్లను కొనుక్కోడానికి ఎగబడసాగారు. దానికి ఆ కంపెనీ వాళ్ళిచ్చిన రసవత్తరమైన, ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలు మరింత దోహదం చేశాయి. ‘గొడవలూ కొట్లాటలూ లేని ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్నారా? మా దగ్గరకు రండి. అందమైన, అణకువ గల ఇరవై యేళ్ళ ఆండ్రాయిడ్లని వరించే అదృష్టం మీ సొంతమవుతుంది. భార్యగా కావాలా? సహజీవనం చేస్తారా? మనసుకి ఆహ్లాదాన్ని అందించే ప్రియురాలు కావాలా? తీయటి కబుర్లు కలబోసుకునే స్నేహితురాలు కావాలా లేదా ఆల్ ఇన్ వన్ నెరజాణ కావాలా? మీరెలా కోరుకుంటే అలాంటి అప్సరసల్లాంటి ఆండ్రాయిడ్లని అందించే బాధ్యత మాది. రిపేరింగ్, సర్వీసింగ్ అవసరం లేని, మెయింటెనెన్ ్సకి రూపాయి కూడా ఖర్చు లేని ఆండ్రాయిడ్లు.. ఇరవై యేళ్ళ అమ్మాయి చేయగల అన్ని పనులను ఎటువంటి లోటూ లేకుండా చేస్తుందని హామీ ఇస్తున్నాం. మీ సుఖసంతోషాలే మాకు ముఖ్యం.. మీ మనశ్శాంతే మా లక్ష్యం’ అంటూ సాగాయి ఆ ప్రకటనలు. అతనిక్కావల్సింది కూడా అదే. భార్యగా అన్ని విధుల్ని నిర్వర్తిస్తూ, మనశ్శాంతిని పాడు చేయని స్త్రీ. ఓ రోజు ఆఫీస్‌కి వెళ్ళకుండా నేరుగా కాయ్ కంపెనీకి వెళ్ళాడు. కళ్ళు జిగేల్మనిపించేలా అధునాతనంగా అలంకరించిన పదంతస్తుల భవనం.. యం.డి అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. ‘మొదట మీకెలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారో చెప్పండి. అటువంటి లక్షణాలున్న ఆండ్రాయిడ్లనే చూపిస్తాం. వాళ్ళలోంచి మీక్కావల్సిన అమ్మాయిని సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయిలో కూడా మీరు ప్రత్యేకంగా ఏమైనా మార్పులు కోరుకుంటే, వారం రోజుల్లో అటువంటి మార్పులు చేసి, మీకు అందచేస్తాం’ అన్నాడు. ‘నాదో సందేహం. నేను మొత్తం ఎమౌంట్ కట్టేసి, అమ్మాయిని యింటికి పిల్చుకెళ్ళాక, ఏదో ఓ సందర్భంలో నాతో గొడవపడితే ఏం చేయాలి? నాకు గొడవలు అస్సలు ఇష్టం ఉండదు’ అన్నాడు నిషిత్. అదేదో జోక్ ఆఫ్ ది ఇయర్ ఐనట్టు యం.డి పెద్దగా నవ్వాడు. ‘దానికి అవకాశమే లేదు. వీటిలో పాజిటివ్ భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. నెగటివ్ భావోద్వేగాలు ఒక్కటి కూడా లేకుండా డిజైన్ చేశాం. కోపం, చిరాకు, విసుగు, అలగడం, ఎదురుచెప్పటం, పోట్లాడటం, మాటల్లో షార్ప్‌నెస్.. ఇవేవీ మీకు కన్పించవు. రెండు వందల యేళ్ళ క్రితం మన భారతదేశంలో భార్యలు ఎలా ఉండేవారో మీరు పుస్తకాల్లో చదివే ఉంటారుగా. మేము మార్కెట్ చేస్తున్న అమ్మాయిలు అచ్చం అలానే ఉంటారు. భర్త అదుపాజ్ఞల్లో ఉంటూ, అణకువతో మసలుతూ, దాసిలా సేవలు చేస్తూ, రంభలా పడగ్గదిలో సుఖాలు అందిస్తూ.. యిక అందంలో ఐతే అప్సరసల్తో పోటీ పడ్తారు. అందుకే మా ఆండ్రాయిడ్లకు ‘లెఫి బొ’ అని పేరు పెట్టాం. ఫ్రెంచ్‌లో లెఫి బొ అంటే అత్యంత అందమైన స్త్రీ అని అర్థం. ఇంటర్నేషనల్‌గా డిమాండ్ ఉన్న ప్రాడక్ట్ మాది. మీరు రిగ్రెట్ అయ్యే చాన్సే లేదు. మీ జీవితం ఒక్కసారిగా రాగరంజితమైపోతుంది. మగవాళ్ళకు ఏం కావాలో సాటి మగవాడిగా నాకు తెలుసు. నేను ఎలాంటి కంపానియన్ ఉంటే జీవితం హాయిగా సాగిపోతుందని కలలు కన్నానో, అటువంటి లక్షణాలతోనే ఆండ్రాయిడ్లను తయారుచేయించాను’ చెప్పాడు. ‘ఖరీదు ఎంతలో ఉంటుంది?’ ‘మీరు మొదట పై అంతస్తుల్లో ఉన్న మా మోడల్స్‌ని చూశాక, ఎవరు నచ్చారో చెప్పండి. అదనంగా ఏమైనా మాడిఫికేషన్ ్స కావాలంటే చేసిస్తాం. దాన్ని బట్టి ధరెంతో చెప్తాను’ అన్నాడు. అతనికి ఆద్విక బాగా నచ్చింది. ముఖ్యంగా ఆమె కళ్ళు.. ‘గుడ్ చాయిస్ సర్. నిన్ననే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పీస్’ అంటూ దాని ధరెంతో చెప్పాడు. అతనడిగినంత ధర చెల్లించి, ఆద్వికను యింటికి తెచ్చుకున్నాడు. ఆద్విక యింటికొచ్చిన క్షణం నుంచి తన జీవితమే మారిపోయింది. అన్నీ సుఖాలే.. కష్టాలు లేవు. అన్నీ సంతోషాలే.. దుఃఖాలు లేవు. అశాంతులు లేవు. కానీ ఇప్పుడీ ఉపద్రవం ఏమిటి? ఎవరో వచ్చి తన భార్యను అతని భార్య అని చెప్పడం ఏమిటి? అతని మనసునిండా అలజడి.. ఆందోళన.. అశాంతి. కాయ్ ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళను నిలదీయాలనుకున్నాడు. కానీ దానివల్ల ప్రయోజనమేమీ ఉండదనిపించింది. మీకు అమ్మిన ఆండ్రాయిడ్ ఓ రోజుముందే తయారై వచ్చిన ఫ్రెష్ పీస్ అంటారు. వాళ్ళు చెప్పేది అబద్ధమని రుజువు చేసే ఆధారాలేమీ తన దగ్గర లేవు. అతనికి ఆలోచనల్తో నిద్ర పట్టలేదు. మరునాడు ఉదయం నిషిత్ ఆఫీస్కెళ్ళిన పది నిమిషాల తర్వాత రియాన్ లోపలికి వచ్చాడు. రాత్రంతా ఆలోచించాక, నిజమేమిటో తెల్సుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఉండటంతో, ఆద్విక ఇంటికి తాళం వేసి, అతన్తోపాటు బయల్దేరింది. కొంతసేపు ప్రయాణించాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్సలో నిష్ణాతుడైన ప్రొఫెసర్ గారి ప్రయోగశాలను చేరుకున్నారు. రియాన్ అతనికి ముందే జరిగిందంతా వివరంగా చెప్పి ఉండటంతో, ఆద్విక తలలో అమర్చి ఉన్న చిప్‌ని బైటికి తీసి, ఎరేజ్ చేయబడిన మెమొరీని రిట్రీవ్ చేసి, మళ్ళా చిప్‌ని లోపల అమర్చాడు. ఆద్విక కళ్ళు తెరిచి తన ఎదురుగా నిలబడి ఉన్న రియాన్ వైపు చూసింది. రియాన్.. తన భర్త.. ఐదేళ్ళు అతన్తో గడిపిన జ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా గుర్తుకు రాసాగాయి. ఆమెకో విషయం అర్థమైంది. తను మొదట రియాన్ భార్యగా ఐదేళ్ళు గడిపాక, ఇప్పుడు మూడేళ్ళ నుంచి నిషిత్‌కి భార్యగా కొనసాగుతోంది. ‘భువీ.. నేను చెప్పింది నిజమని యిప్పటికైనా నమ్ముతావా? నువ్వు నా భార్యవి. నిన్ను అమితంగా ప్రేమించాను భువీ. నువ్వోరోజు అకస్మాత్తుగా మాయమైపోతే పిచ్చిపట్టినట్టు నీకోసం ఎన్ని వూళ్ళు తిరిగానో.. చివరికి నా శ్రమ ఫలించింది. నిన్ను కల్సుకోగలిగాను. మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం భువీ. నాతో వచ్చేయి. నువ్వు లేకుండా బతకలేను భువీ’ అన్నాడు రియాన్. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అనుకుంది ఆద్విక. ‘ఆలోచించుకోడానికి నాక్కొంత సమయం ఇవ్వండి’ అంది. ‘యిందులో ఆలోచించడానికి ఏముంది భువీ. నువ్వు నా భార్యవి. మనిద్దరం ఐదు సంవత్సరాలు కలిసి బతికాం. అక్రమంగా డబ్బులు సంపాదించే ముఠా నిన్ను ఎత్తుకెళ్ళి కంపెనీకి అమ్మేసింది. కంపెనీ నుంచి నిన్ను నిషిత్ కొనుక్కున్నాడు. యిందులో పూర్తిగా నష్టపోయింది నేను. అన్యాయం జరిగింది నాకు. నువ్వు తిరిగి నా దగ్గరకు రావడానికి యింకా సంశయం దేనికి?’ అన్నాడు రియాన్. ‘నేను ప్రస్తుతం నిషిత్ భార్యని. అతన్ని వదిలేసి ఉన్నపళంగా మీతో వచ్చేస్తే అతనికి అన్యాయం చేసినట్టు కాదా? నన్ను ఆలోచించుకోనివ్వండి’ అంది ఆద్విక. మరునాడు రియాన్ రావడంతోటే ‘అన్నీ సర్దుకున్నావా? నాతో వస్తున్నావు కదా’ అన్నాడు. ‘సారీ.. నేను నా భర్త నిషిత్ని వదిలి రాను’ అంది ఆద్విక. ‘నీకో విషయం అర్థం కావడం లేదు. నిషిత్‌కి నువ్వు కేవలం తన అవసరాలు తీర్చే ఓ వస్తువ్వి. అంతకన్నా అతను నీకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడు. కానీ నాకు మాత్రం నువ్వు నా ప్రాణానివి. నా ఆరాధ్య దేవతవి. నా ప్రేమ సామ్రాజ్ఞివి. మన ప్రేమను తిరిగి బతికించుకోడానికి నువ్వతన్ని వదిలి రాక తప్పదు భువీ’ అన్నాడు. ఆద్విక మెత్తగా నవ్వింది. ‘మీరో విషయం మర్చిపోతున్నారు. నేను మనిషిని కాదు, ఆండ్రాయిడ్‌ని. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, కుట్రలు పన్నడం, అన్యాయాలు చేయడం మాకు చేతకాదు. మీ మనుషుల్లో ఉండే అవలక్షణాలేవీ మా సిస్టంలో లోడ్ అయి లేవు. యిక ప్రేమంటారా? కాయ్ కంపెనీతో నిషిత్‌కి కుదిరిన ఒప్పందం ప్రకారం నేను అతని అవసరాల్ని తీర్చాలి. అతన్నే ప్రేమించాలి. కాంట్రాక్ట్‌ని ఉల్లంఘించడం మా ఆండ్రాయిడ్ల నిఘంటువులో లేదు.’ ‘భువీ.. నేను నిన్ను ప్రేమించాను.’ ‘మీతో కాపురం చేసిన ఐదేళ్ళు నేను కూడా మిమ్మల్ని ప్రేమించి ఉంటాను.’ ‘అప్పుడు మీ కంపెనీ నాతో కుదుర్చుకున్న ఒప్పందం మాటేమిటి?’ ‘మీ వద్దనుంచి నన్నెవరో కిడ్నాప్ చేశారు. అందులో నా ప్రమేయం లేదు. అది నా తప్పు కాదు. కంపెనీ నా మెమొరీని ఎరేజ్ చేసి మరొకరికి అమ్మడంలో కూడా నా ప్రమేయం లేదు. అది కంపెనీ చేసిన తప్పు. ఇప్పుడు నేను నిషిత్ని వదిలి మీతో వస్తే అది తప్పకుండా నేను చేసిన తప్పవుతుంది. మనుషులు తప్పులు చేస్తారు. నేను మనిషిని కాదు ఆండ్రాయిడ్‌ని’ ఆద్విక లేచి, తలుపు తీసి, ‘యిక వెళ్ళండి’ అనేలా అతని వైపు చూసింది.+ – సలీం. ఇవి చదవండి: Womens Day: 'జనతనయ బస్తర్..' చరిత్ర ఒక భద్రత.. భరోసా..! -
దేవుడా..! బచ్చన్‌కి బిడియం ఎక్కువే..!
'ప్రతీ ఒక్కరి జీవితంలో.. సిగ్గు, బిడియాలు ఉండక తప్పవు. కాస్త అవి ఎక్కువైతే.. మాట్లాడడాలు, మాట్టాడుకోవడాలు ఉండనే ఉండవు. అవి కాస్త ముదిరితే.. ఏం చేయాలో తెలియక మనలో మనమే మదన పడుతూంటాం. ఇక ఆ పరిస్థితే.. ఓ బాలీవుడ్ యాక్టర్‌కి పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. వారెవరో చూద్దాం..' అభిషేక్ బచ్చన్‌కి బిడియం ఎక్కువ. నలుగురిలో మాట్లాడలేడు. తనతోపాటు నలుగురు లేనిదే ఎక్కడికీ కదలడు. కొత్తవాళ్లతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడడు. అంతెందుకు హోటల్ రూమ్‌లో ఉంటే.. రూమ్ సర్వీస్ ఎంత అవసరమైనా.. ఫోన్ చేసి అడగడట. ఆకలి దంచేస్తున్నా ఫుడ్ ఆర్డర్ పెట్టడట. అతని సిగ్గు, బిడియం, బెరుకు ఆ రేంజ్లో ఉంటాయని ఓ ఇంటర్వ్యూలో అభిషేకే చెప్పాడు. ఇవి చదవండి: సిద్ధి ఇద్నానీ: ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం! -
ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుతున్న.. 'గౌరి మినోచా'
'నవతరం ఆలోచనలు సృజనాత్మకంగానే కాదు జనంతో మమేకం అయ్యే విషయాలపట్ల అవగాహనతోనూ ఉంటున్నాయనడానికి ఉదాహరణ గౌరీ మినోచా. ఢిల్లీ వాసి అయిన గౌరి ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుకుంటున్న వర్ధమాన కళాకారిణి. అభిరుచితో నేర్చుకున్న పెయింటింగ్ ఆర్ట్, చదువుతో ఒంటపట్టించుకున్న సైకాలజీ ఈ రెండింటి కాంబినేషన్‌తో రిలాక్సేషన్ టెక్నిక్స్ కనుక్కుంది. ఈ శైలిలోనే వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ స్కూల్, కాలేజీ పిల్లల మానసిక ఒత్తిడులను దూరం చేస్తుంది. ఆర్ట్ సైకోథెరపీతో ప్రజాదరణ పొందుతూ ఈ తరానికి కొత్త స్ఫూర్తిని అందిస్తోంది. తను ఎంచుకున్న మార్గం గురించి ప్రస్తావిస్తూ..' ‘‘కళ–మనస్తత్వ శాస్త్రం రెండూ హృదయానికి దగ్గరగా ఉంటాయి. నేను ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ బిఏ ఆనర్స్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాను. పన్నెండవ తరగతిలో 99 శాతం మార్కులు రావడంతో సైకాలజీని ఎంచుకున్నాను. ఢిల్లీలో ఆర్ట్ సైకోథెరపీ సెంటర్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాను. కళ – మనస్తత్వ శాస్త్రం రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌లు. ఆర్ట్ సైకోథెరపీలో... డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు పెయింటింగ్స్ వేసి వారికి ఇస్తుంటాను. వారి చేత కూడా రంగులతో నచ్చిన అంశాన్ని ఎంచుకొని చిత్రించమని అడుగుతాను. వారికి ఏమీ రాకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా వారిలో నిరాశ, ఆందోళన స్థాయులను చెక్ చేస్తాను. ఇదొక రిలాక్సేషన్ టెక్నిక్. విదేశాలలో చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ మన దేశంలో ఇప్పటికీ అంత ప్రజాదరణ పొందలేదు. దీనికి కొన్ని స్కూళ్లు, కాలేజీలను ఎంచుకొని ఉచితంగా వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటాను. చిన్ననాటి నుంచి.. మా అమ్మ ఆర్టిస్ట్. వ్యాపారవేత్త కూడా. ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతోంది. ఇందులో అనేకమంది ప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్ ప్రదర్శనలు జరుగుతాయి. ఆమె పిల్లలకు, పెద్దలకు పెయింటింగ్ క్లాసులు కూడా తీసుకుంటుంది. రంగులు, చిత్రాలు, కళాకారుల మధ్య నా బాల్యం గడిచింది. అలా నాకు చిత్ర కళ పట్ల అభిరుచి పెరిగింది. ఒకసారి ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అతని గుర్రపు పెయింటింగ్‌ను కాపీ చేశాను. అమ్మ నాలో ఉన్న ఆర్టిస్ట్‌ను గుర్తించి, సహకరించింది. ఈ కళలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. కళతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాను. ఒత్తిడి లేకుండా చదువు.. నేను క్లాస్‌రూమ్‌లో కంటే ఆర్ట్ రూమ్‌లో ఎక్కువ సమయం గడిపాను. కానీ, నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాలేజీ స్థాయికి వచ్చాక ఆర్ట్ నీ సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి స్టూడెంట్‌లాగే నేనూ నా కెరియర్ గురించి తీవ్రంగా ఆలోచించాను. గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్‌లో చేయాలా, సైకాలజీలో ఏ సబ్జెక్ట్ చేయాలో అర్థం కాక కొన్నిరోజులు మథనపడ్డాను. కానీ, ఆర్ట్ నా అభిరుచి, కెరియర్ సైకాలజీ రెండింటిలోప్రావీణ్యం సాధించాలనుకున్నాను. పగలు కాలేజీ, రాత్రి సమయంలో ఎంతసేపు వీలుంటే అంత టైమ్ పెయింటింగ్ చేస్తుంటాను. వ్యాపారంలోనూ నైపుణ్యం.. స్కూల్ ఏజ్ నుంచే నా పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసే దాన్ని. మొదటి పెయింటింగ్‌కు ఐదు వేల రూపాయలు వచ్చాయి. మొదట్లో నా పెయింటింగ్స్‌ని బంధువులందరికీ పంపాను. తమ ఇంట్లో పెయింటింగ్స్ అలంకరించినప్పుడు వారి ఇళ్లకు వచ్చిన బంధువులు ఆ పెయింటింగ్స్ చూసి తమకూ పంపమని కాల్స్ చేయడంప్రారంభించారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి నా పెయింటింగ్స్ అమెరికా, లండన్, ముంబై, ఢిల్లీ సహా అనేకప్రాంతాలకు చేరాయి. ఈ రోజు ఢిల్లీని ఆర్ట్ హబ్‌లో నా 12 పెయింటింగ్స్‌లో 9 అమ్మకానికి ఉన్నాయి. ప్రతి కళాకారుడు తన సొంత మార్కెట్ విలువను సృష్టించుకోవడం, ప్రచారం కూడా ముఖ్యం. సృజనాత్మకతతోపాటు వ్యాపారంలో కూడా నైపుణ్యం సాధించాలి’’ అంటూ నవతరానికి బిజినెస్ టెక్నిక్స్ కూడా చెబుతుంది గౌరి మినోచా. ఇవి చదవండి: WPL 2024: తొలి మహిళా క్యూరేటర్ జసింత -
మూగ జీవుల సేవలో.. 'సారా అయ్యర్'!
'ఆశ్రయం కోరి వచ్చిన ప్రాణిని ఆదరించు.. అని చెప్పింది అమ్మ. ఒక మూగజీవి గాయాలతో రోదిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఒకప్రాణి కడుపులో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకుంటే దాని ఆకలి తీర్చకుండా నా దారిన నేను వెళ్లలేను. ఒకరోజు గాయపడిన ఓ కుక్కపిల్ల ఏడుపు నాలోని తల్లి మనసును కదిలించింది. దాని బాధ చూసిన తర్వాత మనసు కలచివేసింది. ఆ కుక్కపిల్ల ఆరోగ్యం కుదుటపడే వరకు మా ఇంట్లోనే పెట్టుకున్నాను. అలా మొదలైన ఈ సేవ ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుక్కలతో సాగుతోంది’ అన్నారు 58 ఏళ్ల సారా అయ్యర్.' చెన్నైకి చెందిన సారా అయ్యర్ స్పెషల్ ఎడ్యుకేటర్. స్పెషల్ చిల్డ్రన్ని సమాజంలో సాధారణ పౌరుల్లా తీర్చిదిద్దడంలో దాదాపు పాతికేళ్లు పని చేశారు. ఐదేళ్ల కిందట మూగజీవుల సేవ వైపు మలుపు తీసుకుందామె జీవితం. ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిపోయిన మార్పులను ఇలా చెప్పారామె.. ‘‘మా అమ్మయి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ పనుల కోసం నేను టీచింగ్ నుంచి కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు దూరంగా వెళ్లిన తర్వాత ఇంట్లో ఏర్పడే వెలితి. ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ అనేటంత పెద్ద పదం చెప్పను కానీ కొంత మానసికమైన ఖాళీ ఏర్పడిందనే చెప్పాలి. జనవరి ఒకటో తేదీన నేను, నా భర్త గెర్రీ ఇద్దరం పీకే సినిమాకి వెళ్లి వస్తున్నాం. దాదాపుగా ఇంటికి దగ్గరకు వచ్చేశాం. ఎక్కడి నుంచో చిన్న కుక్కపిల్ల అరుపు వినిపిస్తోంది. క్షణాల్లోనే తెలిసింది అది అరుపు కాదు ఏడుపు అని. ఎవరో పెంచుకోవడానికి కుక్కపిల్లను తెచ్చుకున్నారు, అది బెంగతో ఏడుస్తుందేమో అనుకున్నాను. అది నిస్సహాయంగా ఏడుస్తోందని కొద్ది నిమిషాల్లోనే తెలిసిపోయింది. ఇక ఊరుకోలేకపోయాను. దాని గొంతు వినవస్తున్న దిశగా వెళ్లాను. అది పార్కు చేసిన కారుకి గోడకు మధ్య ఇరుక్కు పోయి ఉంది. తీవ్రంగా గాయపడింది. బయటకు తీయడానికి దగ్గరకు వెళ్తున్నా రానివ్వలేదు. నేను దానిని ఊరడిస్తూ ఉంటే మా వారు మరో వైపు నుంచి వెళ్లి దానిని బయటకు తీశారు. అయితే... కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్లినిక్‌లన్నీ మూసేసి ఉన్నాయి. ఇంటికి తీసుకువెళ్లి మాకు చేతనైన చికిత్స చేసి ఆ మరునాడు దానికి వైద్యం చేయించాం. ఆ కుక్కపిల్ల మామూలయ్యే వరకు మాతోనే ఉంది. ఆ తర్వాత కూడా మాతోనే ఉండిపోయింది. అలా మొదలైన సేవ ఇది. ఓ రోజు.. ఒక ఇండియన్ బ్రీడ్ కుక్క నాలుగు పిల్లలను పెట్టి అలసటతో ఉంది. ఆ దారిన ఓ వ్యక్తి లాబ్రిడార్ను వాకింగ్‌కు తీసుకువెళ్తున్నాడు. వాళ్లను చూసి ఈ కుక్క అరవసాగింది. ఆ వ్యక్తికి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తన చేతిలో ఉన్న కర్ర ఎత్తాడు. అతడు ఆ కుక్క నడవలేనంత తీవ్రంగా గాయపరిచాడని ఆ మరునాడు తెలిసింది. అప్పుడు ఆ కుక్కను, పిల్లలను ఇంటికి తెచ్చాను. నేను మా వారు ఇద్దరమూ వాటికి ఆహారం పెట్టడం, గాయపడిన వాటికి వైద్యం చేయడం, ఫిజియోథెరపీ చేయడం అన్నీ నేర్చుకున్నాం. మాకు తెలిసిన అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి ‘కుక్కలు, కుక్క పిల్లలు గాయపడి నిరాశ్రయంగా ఉన్నట్లు మీ దృష్టికి వస్తే మాకు తెచ్చివ్వండి, లేదా సమాచారం ఇవ్వండి, మేము సంరక్షిస్తాం’ అని మెసేజ్ పెట్టాం. మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ అలా ఏర్పడింది. ఇప్పుడు మా దగ్గర గాయపడినవి, చూపు కోల్పోయినవి, అనారోగ్యాలతో పుట్టినవి, ఆదరించే వాళ్లు లేక ఇక్కడే ఉండిపోయినవి అన్నీ కలిసి నాలుగు వందలకు పైగా ఉన్నాయి. మా సర్వీస్‌కి మెచ్చిన మా అమ్మ, అత్తమ్మ ఇద్దరూ తమ వంతుగా ఈ మూగజీవుల సంరక్షణకు అవసరమైన వస్తువులు, ఇతర అవసరాల కోసం డబ్బు ఇచ్చి అండగా నిలిచారు. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. ‘ఆశ్రయం కోసం వచ్చిన ఏప్రాణినీ నిర్లక్ష్యం చేయవద్దు’ అని వారు మాకు చెప్పిన మాట మాతోనే ఉంది. మేము స్థాపించిన మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ... తమిళనాడు యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో కలిసి పని చేస్తోంది. ఈ మా ప్రయాణంలో ఇన్ని కుక్కలను సంరక్షించడానికి అవసరమైన విశాలమైన స్థలం పెద్ద సమస్య అయింది. చెన్నై నగర శివారు, మహాబలిపురం రూట్లో ఈస్ట్కోస్ట్రోడ్లో మా ఫ్రెండ్‌కి ఓ స్థలం ఖాళీగా ఉంది. దానిని అద్దెకు తీసుకుని కుక్క పిల్లలకు, గాయపడిన వాటికి, అనారోగ్యం పాలైన వాటికి వేరు వేరుగా కెన్నెల్స్ కట్టించి సంరక్షిస్తున్నాం. అవి మమ్మల్ని పేరెంట్స్‌గా ప్రేమిస్తాయి’’ అంటూ తనను ముద్దాడడానికి వచ్చిన పెట్‌ను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు సారా అయ్యర్. తన సంరక్షణలో ఉన్న కుక్కలన్నింటికీ పేర్లు పెట్టారామె. వాటికి రిజిస్టర్ నిర్వహిస్తూ వాటికి ఎప్పుడు ఏ మందులు వేశారు, ఇంకా ఎప్పుడు ఏ ఇంజక్షన్లు వేయించాలి... వంటి వివరాలను నమోదు చేస్తారామె. ఇవి చదవండి: Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి -
‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ గా.. సరోజ్ ప్రజాపతి
"మధ్యప్రదేశ్‌కు చెందిన సరోజ్ ప్రజాపతికి వీరాభిమానులు ఉన్నారు. అలా అని ఆమె సెలబ్రిటీ కాదు. ‘ఆమె పచ్చడి చేస్తే పండగే’ అన్నట్లుగా ఉండేది. తనలోని టాలెంట్‌ను ‘ఎంటర్ ప్రెన్యూర్షిప్’లోకి కన్వర్ట్ చేసి, 19 సంవత్సరాల కుమారుడితో కలిసి ‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ను స్టార్ట్ చేసింది. నెలకు రెండు లక్షల రూపాయల వరకు సంపాదిస్తోంది. 30 మంది మహిళలకు ఉపాధిని ఇస్తోంది." మధ్యప్రదేశ్‌లోని షాదోర అనే గ్రామంలో తన ఇంటిలో కాలక్షేపం కోసం టీవీ చానల్స్ మారుస్తోంది సరోజ్. ఈ క్రమంలో ఆమె దృష్టి ఒక బిజినెస్ ప్రోగ్రాంపై పడింది. పచ్చళ్ల వ్యాపారంలో విజయం సాధించిన బిహార్‌లోని ఇద్దరు మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం అది. ఈప్రోగ్రాం ఆసక్తిగా చూస్తున్నప్పుడు ‘నేను మాత్రం వ్యాపారం ఎందుకు చేయకూడదు!’ అనుకుంది తనలో తాను. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సరోజ్‌కు ‘శభాష్’ అని అందరూ అభినందించే పని ఏదైనా చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. కాని దారి ఏమిటో తెలిసేది కాదు. ‘దారి ఏమిటో తెలియాలి అంటే ముందు నీలో ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియాలి’ అంటారు పెద్దలు. టీవీప్రోగ్రాం తనలోని శక్తి, నైపుణ్యాన్ని గుర్తు తెచ్చింది. కుమారుడు అమిత్ ప్రజాపతితో తనకు వచ్చిన ఆలోచనను చెప్పింది సరోజ్. పందొమ్మిది సంవత్సరాల అమిత్ ‘బ్రాండ్ బిల్డింగ్’ అనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ‘మనకెందుకమ్మా వ్యాపారం. పెద్ద రిస్క్’ అనే మాట అమిత్ నోట వినిపించి ఉంటే కథ కంచికి వెళ్లి ఉండేది. గత సంవత్సరం ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా’ పేరుతో ఊరగాయల వ్యాపారం మొదలుపెట్టింది సరోజ్. ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా బ్రాండ్’ గురించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు అమిత్. ఆన్లైన్, ఆఫ్‌లైన్ డిమాండ్ల నేపథ్యంలో తమ ఇల్లు చాలదని దగ్గరలోని పెద్ద స్థలంలో ఊరగాయలు తయారు చేయడం ప్రారంభించారు. ‘అమ్మ దగ్గర సంప్రదాయ వంటకాలతో పాటు ఊరగాయలు తయారు చేయడం నేర్చుకున్నాను. అది నన్ను వ్యాపారవేత్తను చేస్తుందని ఊహించలేదు. ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది మామిడి కాయలు, కూరగాయలను స్థానికంగా కొనుగోలు చేస్తాను. ఊరగాయల తయారీలో రసాయనాలను ఉపయోగించం.’ అంటుంది సరోజ్. ‘మామిడి సీజన్లో మా ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు వెళుతున్నప్పుడు ఊరగాయ జాడీని తీసుకువెళతారు. ఊరగాయ రుచి చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటారు. ఇది గుర్తు తెచ్చుకొని మామ్ పికెల్స్ అనేది పర్ఫెక్ట్ బిజినెస్ ఛాన్స్ అనుకున్నాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో మా బిజినెస్‌కు సంబంధించిన పేజీలను క్రియేట్ చేశాను. మంచి స్పందన వచ్చింది. జాడీలను కొని లేబుల్స్ ప్రింట్ చేయించాను. మధ్యప్రదేశ్ నుంచే కాదు దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది’ అంటాడు అమిత్. పదిహేను సంవత్సరాల వయసులో తొలిసారిగా పచ్చి మామిడి కాయ పచ్చడి తయారు చేసి ఇంటిల్లిపాది ‘అద్భుతం’ అనేలా చేసింది సరోజ్. ఆనాటి ‘అద్భుతం’ ఇప్పటికీ అద్భుతాలు చేయిస్తూనే ఉంది. కేవలం మామిడికాయ ఊరగాయలతో మొదలైన వ్యాపారం అనతికాలంలోనే పచ్చిమిర్చి, నిమ్మకాయ, మిక్స్డ్ వెజిటబుల్... మొదలైన వాటిలోకి విస్తరించింది. అమ్మ చేతి నైపుణ్యానికి కుమారుడి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ తోడు కావడంతో త్వరలోనే వ్యాపారం మంచి ఊపందుకుంది. నా కుటుంబం నా బలం! కుటుంబ సహాయసహకారాలు తోడైతే అవలీలగా విజయం సాధించవచ్చు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఊరగాయల వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా ఆయన, అబ్బాయి ప్రోత్సాహకంగా మాట్లాడారు. ‘నువ్వు రుచి మీద దృష్టి పెట్టు చాలు. మిగిలినవి మేము చూసుకుంటాం’ అని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. ఒక టీవీ ప్రోగ్రాంలో విజేతల మాటలు విని ఆ స్ఫూర్తితో నేను కూడా వ్యాపారంలోకి దిగాను. దీనికి కారణం అప్పటికప్పుడు వచ్చిన ఉత్సాహం కాదు. నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే పట్టుదల. నా వల్ల ఇతర మహిళలు కూడా ఉపాధి పొందడం సంతోషంగా ఉంది. – సరోజ్ ప్రజాపతి ఇవి చదవండి: Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..! -
బాధ కాదు బాట చూడాలి..
బెంగళూరుకు చెందిన వీణా అంబరీష బస్సు ప్రమాదంలో కుడి కాలిని కోల్పోయింది. ఆ తరువాత డిప్రెషన్ బారిన పడింది. ఆ చీకటి నుంచి అతి కష్టం మీద బయటపడి అర్ధంతరంగా ఆగిపోయిన చదువును కొనసాగించింది. ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘కరీ దోశ’ పేరుతో ఫుడ్ స్టాల్ ప్రారంభించి తన కాళ్ల మీద తాను నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది వీణా అంబరీష. కొన్ని సంవత్సరాల క్రితం.. భరతనాట్యం డ్యాన్సర్ అయిన వీణ తన ఆరంగేట్రం కోసం సన్నాహాలు చేసుకుంటోంది. కాలేజీకి వెళ్లడానికి రోడ్దు దాటుతున్నప్పుడు బస్సు ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై కుడికాలు కోల్పోయింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తరువాత వాకింగ్ స్టిక్‌తో నడవడం మొదలు పెట్టింది. చాలా కష్టంగా అనిపించేది. భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్న వీణ తనకు జరిగిన ప్రమాదాన్ని జీర్ణించుకోలేపోయింది. కలల రెక్కలు విరిగిన బాధ ఆమె కళ్లలో కన్నీరై కనిపించేది. ‘నాకు ఇలా జరిగిందేమిటి!’ అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల వీణ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్లిందంటే.. ‘ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదు’ అని బలంగా అనుకునేంతగా. అయితే వీణ తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక దృశ్యం కారణం అయింది. ఆ దృశ్యం తనకు వేకప్–కాల్‌గా పనిచేసింది. ఫిజికల్ డిజేబిలిటీ సర్టిఫికెట్ తీసుకోవడానికి విక్టోరియా హాస్పిటల్‌కు వెళ్లిన వీణ అక్కడ ఒక మహిళను చూసింది. ఆమెకు రెండు కాళ్లు లేవు. ఆమె తన బిడ్డను లాలిస్తూ బువ్వ తినిపిస్తోంది. ఒక క్షణం ఆమె ముఖం వైపు చూసింది వీణ. రవ్వంత బాధ కూడా ఆమె ముఖంలో కనిపించలేదు. జీవనోత్సాహంతో ఆ ముఖం వెలిగిపోతోంది. తాను ఏవైతే పెద్ద సమస్యలు అనుకుంటుందో అవి గాలిలో దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఈ ఒక్క దృశ్యం వీణ ఆలోచనలో పూర్తిగా మార్పు తీసుకువచ్చింది. ‘ఏదో సాధించాలి’ అనే ఉత్సాహం మనసులోకి వచ్చింది. ఆగిపోయిన చదువును కొనసాగించింది. మంచి మార్కులతో పరీక్షలు పాసైంది. ఆ తరువాత ఎంబీఏ పూర్తి చేసింది. బ్యాంకులలో సేల్స్ ఆఫీసర్‌గా, ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ టెస్టర్‌గా పనిచేసింది. ఒకవైపు గంటల కొద్దీ చేసే ఉద్యోగం.. మరోవైపు పిల్లల ఆలనా పాలనా కష్టమనిపించింది. ఒక సౌత్ అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎడతెగకుండా జరిగే మీటింగ్‌లు, పనిభారం వల్ల కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో పదిహేను రోజులు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది వీణ. దానికి ఫిట్నెస్ ట్రెయినర్ అయిన ఆమె భర్త ప్రోత్సాహం తోడైంది. గత సంవత్సరం బెంగళూరులో ‘కరీ దోశ’ పేరుతో దోశ స్టాల్ మొదలు పెట్టినప్పుడు ‘ఎంబీఏ చదివి ఇదేమిటీ’ అన్నట్లుగా మాట్లాడారు కొద్దిమంది. వారి మాటలేవీ పట్టించుకోలేదు వీణ. ప్రత్యేకత ఉంటేనే ఫుడ్ స్టాల్ అయినా పెద్ద వ్యాపారమైనా విజయం సాధిస్తుంది. మరి ‘కరీ దోశ’ స్పెషల్ ఏమిటి? కరీ దోశే! తమిళనాడులోని మధురై ప్రాంతంలో ‘కరీ దోశ’గా పిలిచే వేడి వేడి దోశ దానిపై ఆమ్లెట్, మటన్ కీమా చాలా ఫేమస్. కరీ దోశ బెంగళూరులో కూడా హిట్ అయింది. ఈ దోశ కోసం కస్టమర్లు పొద్దున్నే లైన్ కడతారు. స్టాల్ ప్రారంభించడానికి ముందు ‘కరీ దోశ’ రుచులలో ప్రావీణ్యం సంపాదించడానికి రెండు నెలల పాటు ఇంట్లోనే ఉంది వీణ. వంటగది తన పాఠశాలగా, ప్రయోగశాలగా మారింది. ‘కరీ దోశ’ స్టాల్ పొద్దున ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అందుబాటులో ఉంటుంది. ఇక మిగిలిన సమయమంతా ఇంట్లోనే పిల్లలతో గడుపుతుంది వీణ. చిరునవ్వే సందేశం.. బాధ లేనిది ఎవరికి? బాధ పడుతూ కూర్చోవడం కంటే దాని నుంచి బయటపడడానికి కొత్తబాట వెదకాలి. మనకంటే ఎక్కువ బాధలు పడుతున్న వారు, పెద్ద పెద్ద సమస్యల్లో ఉన్న వారు ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉన్నారు. అంత కష్టంలోనూ వారి పెదవి మీద కనిపించే చిరునవ్వు మనకు సందేశాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. – వీణా అంబరీష ఇవి చదవండి: World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్‌తో జాగ్రత్త! -
బౌద్ధవాణి: సత్యం పలకడం చాలా అవసరం!
సిద్ధార్థుడు శాక్య యువరాజు. కానీ, సన్యసించి రాజ్యాన్ని వదిలాడు. భిక్షువుగా మారాడు. ఆ తర్వాత తన బిడ్డ రాహులుణ్ణి కూడా భిక్షువుగా మార్చాడు. ఒకరోజున రాహులుడు అంబలట్ఠిక అనే చోట ఒక వనంలోని ఆరామంలో ఉన్నాడు. బుద్ధుడు రాజగృహంలోని వేణువనం నుండి అక్కడికి వచ్చాడు. బుద్ధుని రాకను గమనించిన రాహులుడు లేచి వచ్చి, నమస్కరించాడు. ఒక చెట్టుకింద బుద్ధునికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. బుద్ధుడు కాళ్ళు కడుక్కుని, ఆ పాత్రలో కొంచెం నీటిని ఉంచాడు. బుద్ధుడు ఎంత కష్టమైన విషయాన్నైనా ఉపమానంతో తేలికగా అర్థం అయ్యేలా చెప్పడంలో నేర్పరి. ఆయన వచ్చి ఆసనం మీద కూర్చొని.. ‘‘రాహులా! ఈ పాత్రలో మిగిలిన నీటిని చూశావా?’’అని అడిగాడు. ‘‘భంతే! చూశాను. అడుగున కొద్దిగా ఉన్నాయి’’ ‘‘అవును కదా! తెలిసి తెలిసీ ఎవరు అబద్ధాలు ఆడతారో, మోసపు మాటలు చెప్తారో, అలా చెప్పడానికి సిగ్గుపడరో.. అలాంటి వారికి దక్కే శ్రామణ్య ఫలం చాలా చాలా కొద్దిదే’’ అన్నాడు. రాహులుడు నిండు వదనంతో నింపాదిగా ఆ నీటి పాత్రవైపు చూశాడు. బుద్ధుడు ఆ పాత్రలో ఉన్న నీటిని అంతా పారబోశాడు. 'శ్రామణ్యం అంటే ధ్యాన సాధన ద్వారా పొందే ఫలం. తమకు తాము స్వీయ సాధన ద్వారా ఈ ధ్యానఫలాన్ని పొందుతారు. అందుకే ఈ సాధకుల్ని ‘శ్రమణులు’ అంటారు. తమకు తాము ఎంతో శ్రమించి ఎన్నో కఠోర శ్రమలకోర్చి సాధించే యోగ సాధన ఇది. బౌద్ధ భిక్షువుల్ని శ్రమణులు అనీ, బుద్ధుణ్ణి శ్రమణ గౌతముడని ఇందుకే పిలుస్తారు.' ‘‘రాహులా! నీరు పారబోయడం చూశావా?’’ ‘‘చూశాను భగవాన్’’ ‘‘తెలిసి తెలిసీ అసత్యాలు పలికే వారి మోసపు మాటలు చెప్పే వారి శ్రామణ్యం కూడా ఇలా పారబోసిన నీటిలాంటిదే’’ బుద్ధుడు ఆ పాత్రను తీసుకుని తన పక్కనే ఉన్న రాతిపలక మీద బోర్లించాడు. రాహులుడు ఆ పాత్రవైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు.. ‘‘రాహులా! అలాంటి అబద్ధాలకోరు మోసపు మాటల కోరుకు దక్కే ధ్యానఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే’’ అన్నాడు. రాహులుడు తదేకంగా ఆ పాత్ర మీదే దృష్టి నిలిపాడు. బుద్ధుడు మరలా ఆ పాత్రని తీసి నేల మీద ఉంచాడు. పాత్రలోకి చూపుతూ.. ‘‘రాహులా! ఇప్పుడు ఈ పాత్ర నిలబడి ఉంది. కానీ ఎలా ఉంది?’’ ‘‘ఖాళీగా ఉంది భగవాన్’’ ‘‘అబద్ధాల కోరుకు దక్కే సాధనాఫలం కూడా ఖాళీ పాత్ర లాంటిదే’’ అన్నాడు. అలా ఆ ఒక్క పాత్రని నాలుగు రకాలుగా ఉపమానంగా చూపుతూ అబద్ధాల కోరులు ఎంత సాధన చేసినా ధ్యానఫలాన్ని పొందలేరు. కాబట్టి సత్యభాషణం చాలా అవసరం అనే విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు బుద్ధుడు. అందుకే ఆయనను ‘మహా గురువు’గా భావిస్తారు, గౌరవిస్తారు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ముఖ స్తుతి -
'2023 – తెలంగాణ మహిళ!' ఈ ఏడాది స్ఫూర్తి వీరే..
"తమను తాము బాగు చేసుకోవడంతోపాటు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా తీర్చిదిద్దితే ఎలా ఉంటుందో ఈ యేడాది తెలుగు మహిళ నిరూపించింది. విభిన్న రంగాలలో విశేషమైన కృషి చేసి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ మహిళను మరోసారి స్ఫురణకు తెచ్చుకుందాం. రాబోయే సంవత్సరానికి ప్రేరణగా వీరితో కలిసి మరెన్నో అడుగులు వేద్దాం.!" ఊరంతా బాగు! మూడేళ్లక్రితం వరకు ఒక మామూలు పల్లె అది. కానీ, నేడు దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచే స్థాయికి ఎదిగింది. దానికి కారణం సర్పంచ్ మీనాక్షి గాడ్గె. ఆమె కృషి, పట్టుదల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మఖరా గ్రామాన్ని అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దాయి. ఇంటర్మీడియెట్ వరకు చదివిన మీనాక్షి ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎన్నియ్యింది. మరుగుదొడ్లు కట్టించడం, తాగునీరు ప్రతి ఇంటికి అందేలా చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసి వాన నీరు ఆ గుంటలో పోయేలా చేసిందామె. వాగుపైన వంతెన కట్టించింది. పక్కా రోడ్ల నిర్మాణం, సైడు కాలవల శుభ్రత, స్కూల్‌కు కొత్త భవనం, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను ఏర్పాటు చేయించింది. ఊళ్లో సంపూర్ణ మద్య నిషేధం అమలుతో΄ాటు హరిత హారంలో భాగంగా పదివేల మొక్కలు నాటించి, వాటి బాధ్యతను గ్రామస్తులే తీసుకునేలా చేసింది. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసి, పంచాయితీకి లాభం చేస్తోంది. సోలార్ గ్రిడ్లు ఏర్పాటు చేసింది. ఊళ్లోనే నర్సరీ ఉంది. ఊళ్లో జరిగే అంగడిలో నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నారు, తడిచెత్త– ΄÷డి చెత్త విభజనను ఇప్పుడు ప్రతి ఒక్కరూ ΄ాటిస్తున్నారు. ఇన్ని మార్పులు తీసుకు వచ్చిన మీనాక్షిని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఈ యేడాది స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డ్‌తో సత్కరించింది. - మీనాక్షి గాడ్గె (సర్పంచ్) భారతజట్టులో స్థానం! భద్రాచల వాసి త్రిష అండర్–19 మహిళల వరల్డ్ కప్ –2023 ఫైనల్లో టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. ఫిట్నెస్ కోచ్ అయిన తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులోనే క్రికెట్లో ఓనమాలు దిద్దిన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్ –16 జట్టులో చేరింది. తర్వాత హైదరాబాద్ స్పోర్ట్స్ అకాడమీలో చేరి, క్రికెటర్‌గా తనను తాను మెరుగుపరుచుకుంటూ భారతజట్టులో స్థానం దక్కించుకుంది. చదువు, ఆటలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడమే తన ముందున్న లక్ష్యాలు అని చెప్పే త్రిష నవతరపు అమ్మాయిలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. - గొంగడి త్రిష (యువ క్రికెటర్) సాహసమే ఊపిరి.. రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల అన్వితారెడ్డి పర్వతారోహణలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఎవరెస్టు శిఖరాన్ని ఐదురోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసి వార్తల్లో నిలిచింది. పడమటి అన్వితారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లావాసి. ప్రస్తుతం భువనగరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తోంది. ఎంతోమంది ఔత్సాహిక యువతీయువకులకు మెలకువలు నేర్పిస్తూనే అడ్వాన్స్డ్ కోర్సులను పూర్తి చేసింది. పర్వతారోహణలో మొదటి ప్రొఫెషనల్ కోచ్‌గానూ గుర్తింపు పొందింది. గతంలో సిక్కింలోని రీనాక్, బీసీరాయ్, కిలిమంజారో, లదాక్‌లోని కడే, ఎబ్బ్రూస్ పర్వతాలు అధిరోహించింది. పర్వతారోహణలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, సవాళ్లను అధిగమించే స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి, సాధన అవసరం. అన్విత ఏర్పరుచుకున్న ఆశయాలు ప్రతి ఆడపిల్లకు ఆదర్శం. అన్విత సాహసాలు ఎందరికో మార్గ నిర్దేశం చేస్తున్నాయి. - అన్వితారెడ్డి (పర్వతారోహకురాలు) అవగాహనే ప్రధానం జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం, ఖాసింపేట గ్రామం నుంచి రేగట్టె వెంకటరమణ ఎంపికయ్యింది. విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ఈ అవార్డును అందుకొని వార్తల్లో నిలిచింది వెంకటరమణ. ఇంటింటికీ వెళ్లి మహిళలు, పిల్లల ఆరోగ్యం గురించి కనుక్కోవడం, జాగ్రత్తలు సూచించడం, కౌన్సెలింగ్స్ ఇవ్వడం దినచర్యగా చెబుతుంది. గర్భిణులకు సీమంతాలు, స్కూల్ డే, చిల్డ్రన్ డే వంటి కార్యక్రమాలను పురస్కరించుకొని అందరికీ ఆరోగ్యం కోసం అవగాహన కల్పించడంలో ముందుండే వెంకట రమణ చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. -రేగట్టె వెంకటరమణ (అంగన్వాడీ టీచర్) ప్రైవేటుకు దీటుగా మంచిర్యాల జిల్లా రెబ్బెనపల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నూగూరి అర్చన ఈ యేడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో΄ాటు ఆమె సొంత ఖర్చులతో పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన చేస్తూ రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటే అందరూ మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. గిరిజన చిన్నారులకు ప్రత్యేకంగా స్కూల్‌కి ఆటోలు ఏర్పాటు చేసి, మరీ చదువుకు ఊతమిస్తున్నారు. అర్చన విద్యాసేవకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ పురస్కారం అందుకున్న అర్చన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. - నూగూరి అర్చన (ప్రధానోపాధ్యాయురాలు) ఇవి చదవండి: మనీమంత్ర కవితాగానం -
పుట్టింటికి భారమై.. మెట్టింటికి దూరమై.. జీవితాన్ని యోగవంతం చేసుకుంది!
ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో పుట్టింది ఫైజా సైఫీ. నలుగురు సంతానంలో పెద్దమ్మాయి. ఫైజా తండ్రి ఫరీదాబాద్‌లో పనిచేసేవారు. దీంతో ఫైజా కూడా అక్కడే చదివింది. కాస్త పెద్దయ్యేసరికి ‘‘మనం మన సంప్రదాయాలు కచ్చితంగా పాటించాలి’’ అని ఇంట్లో వారు చెప్పేవాళ్లు. వయసుతోపాటు నిబంధనలు పెరిగాయి. తనకు నచ్చని ఆంక్షలు పాటించడానికి ఫైజా ఒకపట్టాన ఇష్టపడేది కాదు. టీనేజ్‌లోకి రాగానే ‘‘ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా ఉండు, ఇలా ఉండు’’ అని చెప్పేవారితో ‘అలా ఎందుకు?’ అని వాదిస్తుండేది.' ‘‘అత్తారింటికి వెళ్లాక పనులన్నీ నువ్వే చేయాలి’’ అని చెప్పినప్పుడు తనకు ఇష్టం లేకపోయినా.. ఉదయం నాలుగ్గంటలకే లేచి ఇంటిపనులు చేసేది. స్కూలు నుంచి వచ్చాక కూడా ఇంటిపనులు చూసుకోక తప్పేది కాదు. ఇలా పనులు చూసుకుంటూనే 2003లో పదో తరగతి పాసైంది. ఆ తరువాత ఢిల్లీ సంబంధం వస్తే పెళ్లిచేశారు ఫైజాకు. ఇల్లు కాస్తా జైలైంది.. పెళ్లి అంటే ఏంటో తెలియని వయసులో.. తనకంటే బాగా ఎక్కువ వయసు ఉన్న వ్యక్తితో వివాహం జరిగింది. భర్తకు మూర్ఛరోగంతో పాటు మానసిక సమస్యలు ఉండడంతో కోపం వచ్చినప్పుడల్లా ఫైజాను విపరీతంగా కొట్టేవాడు. దీనికితోడు పుట్టింట్లో ఎప్పుడూ ధరించని బురఖాను అత్తారింట్లో తప్పనిసరిగా వేసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో ఫైజాకు జైల్లో ఉన్నట్లు అనిపించింది. రోజంతా గొడ్డు చాకిరి.. అడుగడుగుకీ ఆంక్షలు.. అత్తారింటి బాధలు భరించలేక అమ్మావాళ్ల దగ్గర గోడు వెళ్లబోసుకున్నా.. ‘‘సమాజంలో పరువు, మర్యాదలు..’’ అని చెప్పి నోరు మూయించేవారు. ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయేది ఫైజా. పిల్లలు పుట్టాక కూడా.. అత్తారింట్లో ప్రసవం అయిన తరువాత వారానికే ఇంటి పనులు ఫైజా నెత్తిన పడ్డాయి. పెద్దకుటుంబం కావడంతో.. ఒక్కొక్కరు ఒక్కో రకమైన రుచిని కోరుతూ తను చేయగలదా.. లేదా..? అని కూడా చూడకుండా ఆమెను వండమని బలవంతం చేసేవాళ్లు. దీంతో ఫైజా నడుము నొప్పి, మైగ్రేన్, థైరాయిడ్, ఆస్తమాల బారిన పడి బాగా నీరసించిపోయింది. తిన్నావా? మందులు వేసుకున్నావా? అని అడిగేవారు ఒక్కరూ లేరు. ఇంత కష్టంలోనూ.. తన రెండున్నరేళ్ల కొడుకుని ప్లేస్కూల్లో దింపడానికి వెళ్లేది ఫైజా. అక్కడ పరిచయమైన టీచర్‌తో.. తనకు చదువుకోవాలని ఉందంటూ తన ఇంటి పరిస్థితులను వివరించి చెప్పింది. అప్పుడు టీచర్ ప్రైవేటుగా చదువుకోవచ్చని సలహా చెప్పడంతో చదవడం ప్రారంభించింది. పరీక్షలు ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్లి అక్కడనుంచి రాసేది. పెద్దబాబుకి ఐదేళ్లు వచ్చేటప్పటికి రెండో బాబు కడుపులో పడ్డాడు. ఈసారి ఫైజా ఆరోగ్యం మరింత క్షీణించింది. మెడ నొప్పి, హై బీపీ వంటి సమస్యలు తలెత్తాయి. టీవీలో యోగా చూసి.. ఒకరోజు ఫైజా ఆరోగ్యం బాగా క్షీణించడంతో పుట్టింటికి పంపించేశారు. అక్కడ ఆయుర్వేద మందులు వాడడంతో కొంత ఉపశమనం లభించింది. ఆ తరవాత రెండో బాబును ప్రసవించింది. ప్రసవం తరువాత పదిహేనురోజులు పుట్టింటిల్లోనే ఉంది. ఆ సమయంలో ఒకరోజు టీవీలో వస్తోన్న యోగా కార్యక్రమాలను చూసింది. యోగాతో అనారోగ్యాలు నయం అవుతాయని తెలుసుకుని యోగా నేర్చుకోవడం ప్రారంభించింది. ఎవరికీ తెలియకుండా ఆసనాలు వేసేది. ఆసనాలు వేసేకొద్ది తన ఆరోగ్యం కుదుటపడడం గమనించింది ఫైజా. యోగా గురించి ఇతరులకు సలహాలు ఇస్తుండేది. రహస్యంగా ఇంటర్మీడియట్ పూర్తిచేసిన తరువాత హిమాలయ యూనివర్శిటీలో యోగా, ఆక్యుప్రెజర్ థెరపీ, ఆయుర్వేదంలో డిప్లొమా చేసింది. ఆ రోజు రానేవచ్చింది! ఫైజా ఎవరికీ తెలియకుండా చదువుకున్నప్పటికీ అత్తారింట్లో అన్నీ తెలిసిపోయాయి. దాంతో ఆమెను కొత్తరకంగా హింసించడం, అకారణంగా చేయి చేసుచేసుకోవడం మొదలు పెట్టారు. ఫైజా భర్త ట్రిపుల్ తలాఖ్ చెప్పి.. రెండో పెళ్లికి రెడీ అయిపోయాడు. అంతటితో ఫైజాకు అత్తారింటితో సంబంధాలు తెగిపోయాయి. పుట్టింటిలో కొన్నిరోజులు ఉన్న తరువాత.. ‘‘నీ వల్ల చెల్లెళ్లు, తమ్ముళ్లకు పెళ్లిళ్లు కావు. నువ్వు మీ అత్తారింటికి వెళ్లు. అక్కడే సర్దుకుపో’’ అని సతాయించడం మొదలు పెట్టారు ఫైజా తల్లిదండ్రులు. దాదాపు పదేళ్లపాటు అత్తారింట్లో అనుభవించిన నరకాన్ని మళ్లీ ఎదుర్కోవాలనుకోలేదు ఫైజా. తల్లిదండ్రులకు చెప్పినా అర్థం చేసుకోరు. వేరే దారిలేక తన పిల్లలను తీసుకుని ఫరీదాబాద్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరింది. ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ సాయం, మరోపక్క రూమ్మేట్స్ కూడా పిల్లలను ఉంచుకోవడానికి ఒప్పుకోవడంతో ఉద్యోగంలో చేరింది. యోగా టీచర్‌గా.. స్కూల్లో టీచర్‌గా చేరిన ఫైజా యోగా తరగతులు చెప్పేది. అలా చెబుతూ 2013లో ‘ఫైజా యోగా’ పేరుతో సొంతంగా ఇన్స్టిట్యూట్ను పెట్టుకుంది. ప్రారంభంలో రోజుకి యాభైగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఐదువందలకు పైకి చేరింది. ఇన్స్టిట్యూట్లో తరగతులేగాక యోగా క్యాంప్స్కూడా నిర్వహిస్తోంది ఫైజా. ఫీజులు చెల్లించలేనివారికి ఉచితంగా యోగా నేర్పించి వారిని యోగా ఇన్స్ట్రక్టర్లుగా మారుస్తోంది. ఫైజా ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సైతం ఆమెతో సంబంధాలను పునరుద్ధరించుకోవడం మొదలుపెట్టారు. అలా ఆమె జీవితం యోగవంతం అయింది. ఆరోగ్యంగా.. ఆనందంగా.. 'నాకు ఢిల్లీ, ముంబై, అమెరికా, కువైట్ల నుంచి క్లైంట్లు ఉన్నారు. ఆన్లైన్ తరగతులు చెబుతున్నాను. ఏళ్లపాటు ప్రయత్నించినా గర్భం దాల్చని వారు సైతం నేను అందించే ప్రత్యేకమైన యోగా థెరపీ ద్వారా పిల్లల్ని కంటున్నారు. నా దగ్గర యోగా నేర్చుకునేవారిలో చాలామంది బీపీ, గుండె సమస్యలు, అధిక బరువు, డయాబెటిస్, థైరాయిడ్, ఆందోళన, నిరాశా నిస్పృహల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. తమ్ముడు, చెల్లి కూడా నా దగ్గర యోగా నేర్చుకుని ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుంటున్నారు. యోగా నాతోపాటు చాలామందిని ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో నిలబెడుతోంది. యోగా వల్లే ఈ రోజు నేను, నా ఇద్దరు కొడుకులు ఆరోగ్యంగా, ఆనందంగా బతక గలుగుతున్నాం. అమ్మాయిలూ.. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఎవరి మీదా ఆధారపడకండి. ఇతరుల మీద ఆధారపడినంత కాలం ఆత్మవిశ్వాసం కోల్పోతారు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే.. నాలాగా ఏదైనా సాధించగలుగుతారు.!' – ఫైజా సైఫీ ఇవి కూడా చదవండి: Pranav Shukla: పండుటాకులే పిల్లలుగా.. -
పదహారు ప్రాయంలోనే సంగీత సు'స్వరా'యల్గా.. జస్లీన్ రాయల్
సుస్వరాయల్ పదహారు సంవత్సరాల వయసులోనే రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ను ప్లే చేసే నైపుణ్యం జస్లీన్ రాయల్ సొంతం అయింది. ఆ తరువాత ఒకే సమయంలో మల్టీపుల్ మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ ప్లే చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేది. ‘పంచి హో జవాన్’ సింగిల్‌తో సంగీత ప్రపంచంలో తనదైన పేరు తెచ్చుకుంది. ‘బార్ బార్ దేఖో’ (2015)తో బాలీవుడ్లో కంపోజర్‌గా బ్రేక్ వచ్చింది. ‘ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే మ్యూజిక్ కంపోజర్ అయ్యాను. నా మీద నాకు ఉన్న నమ్మకమే దీనికి కారణం. కాలేజీ రోజుల్లో అందరూ ప్లాన్ బీ గురించి ఆలోచిస్తున్న సమయంలో కూడా నా మార్గం మ్యూజిక్ మాత్రమే అనుకున్నాను. రియాల్టీ షోలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లడం ద్వారా తొలిసారి గుర్తింపు లభించింది’ అంటున్న జస్లీన్‌కు మెలోడీలు అంటే ఇష్టం. ప్రయాణాలు అంటే ఇష్టం. ప్రయాణమార్గాలలో తట్టే ట్యూన్లను పాటలుగా మలచడం అంటే ఇష్టం. కంపోజర్, సింగర్ అయిన జస్లీన్ రాయల్ తన తొలి ప్రాధాన్యత కంపోజింగ్ మాత్రమే అంటుంది. (ఇవి చదవండి: 'సహస్రనామం' సమ్మోహన విజయం!) -
సౌందర్య మళ్లీ పుట్టిందా !
-
ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!
అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్ జీవిత గాథ హాలీవుడ్ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్ ఆక్రమిస్తోంది... అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒప్పెన్హీమర్ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. అణు వర్సెస్ సౌర విద్యుత్ 1970 దశకంలో అణు విద్యుత్ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్ 1.04 టెరావాట్స్ కాగా, ప్రపంచ అణు విద్యుత్ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్ కంటే సౌర విద్యుత్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్ ప్యానెల్ డివిజన్ మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ చెప్పారు. సౌర విద్యుత్‌తో లాభాలు... ► సౌర విద్యుత్‌కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు. ► సోలార్ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు. ► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు. ► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం. ► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి. ► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. ► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు. ► అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మినహా మరే దేశాలు అణు విద్యుత్‌పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్! ► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి. ► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది. ► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అణు విద్యుత్ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది – డాక్టర్ నితేంద్ర సింగ్, ఇండియన్ యూత్ న్యూక్లియర్ సొసైటీ వ్యవస్థాపకుడు -1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బతుకు పోరు
‘ఈ కర్మభూమిలో ప్రతి అడుగులో ఒక కథ వినిపిస్తుంది’ అంటుంది ఇంజా రోజియ. అమెరికన్ టూరిస్ట్ రోజియ ఇటీవల తన స్నేహితురాలితో కలిసి రాజస్థాన్‌లోని పుష్కర్ నగరానికి వచ్చింది. బిడ్డను ఒళ్లో పడుకోబెట్టుకొని ఎర్రటి ఎండలో కూర్చున్న గుడియ అనే మెహందీ ఆర్టిస్ట్ కనిపించింది. మెహందీ వేయించుకుంటూ గుడియతో కబుర్లలో పడింది రోజియ. తెలిసీ తెలియని ఇంగ్లీష్‌లోనే తన జీవితకథను రోజియతో పంచుకుంది గుడియ. రోజియ వయసే ఉన్న గుడియకు నలుగురు పిల్లలు. విద్యుత్ సౌకర్యం కూడా లేని చిన్న పల్లెలో ఉండేది. తల్లిదండ్రులు చనిపోయారు. భర్త తాగుబోతు. ఎప్పుడూ ఏదో రకంగా హింసించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక పిల్లల్ని తీసుకొని పట్టణానికి వచ్చింది. తనకు తెలిసిన ‘మెహందీ ఆర్ట్’తో బతుకుబండి లాగిస్తోంది అంటూ గుడియ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రోజియ. ‘నా జీవితం ఇలా అయిపోయింది... అంటూ ఆమె కన్నీళ్లతో బాధ పడలేదు. ఎవరి మీదో ఫిర్యాదు చేస్తున్నట్లుగా లేదు. జరిగిందేదో జరిగింది. బతుకుపోరు చేస్తాను...అనే స్ఫూర్తి ఆమెలో బలంగా కనిపించింది. గుడియ నలుగురు పిల్లలకు తల్లి. తల్లి ప్రేమకు ఉన్న శక్తి ఏమిటంటే జీవితంలో ఎన్నో యుద్ధాలను గెలిచేలా చేస్తుంది’ అంటూ రాసింది రోజియ. -
Charles Sobhraj: బికినీ కిల్లర్ నేర చరిత్ర తెలుసా?
ఛార్లెస్ శోభరాజ్.. ఫ్రెంచ్ సీరియల్కిల్లర్. సినిమాలు, న్యూస్‌ల ద్వారా చాలామందికి ఈ పేరు పరిచయం ఉండే ఉంటుంది. కామెడీ సినిమాల్లోనూ ఈ పేరు రిఫరెన్స్ కనిపిస్తుంటుంది. కానీ, ఊహాకు కూడా అందనంత కరడుగట్టిన నేరస్తుడు ఇతను. నేరాలు చేయడంలో శోభరాజ్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. నేరం చేశాక దొరక్కుండా ఉండేందుకు ఎంతకైనా తెగిస్తాడు. ఆ తీరు ఓ పామును తలపిస్తుంది. అందుకేనేమో అతన్ని ‘ది సర్పెంట్’ అని కూడా పిలుస్తుంటారు. ఇతని చేతిలో బలైన పర్యాటకులు బికినీలో శవాలుగా తేలడంతో.. ‘బికినీ కిల్లర్’గా ఛార్లెస్ శోభరాజ్‌కు పేరు ముద్ర పడిపోయింది. హ్యాండ్సమ్ లుక్, స్టైలిష్ వేషధారణ, ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలిగే ఆ రూపం వెనుక.. ముసుగు గనుక తొలగిస్తే క్రూరమైన స్వభావం బయటపడుతుంది. నమ్మిన్నోళ్లను నట్టేట ముంచుతూ.. తాను మాత్రం చట్టాలకు దొరక్కకుండా తిరగడం ఇతని ప్రత్యేకత. ఆ తప్పించుకోవడం కోసం అతను వేసే స్కెచ్.. సినిమాటిక్‌గా ఉంటుంది. జైలుకు వెళ్లొచ్చినా.. క్రిమినల్‌గా తనకు దక్కిన అపకీర్తిని సైతం దర్జాగా ఆస్వాదించిన నైజం అతనిది. సినిమాల్లో చూపించే ప్రొఫెషనల్ కిల్లర్ల పాత్రకు స్ఫూర్తి.. ఛార్లెస్ శోభరాజ్ వ్యక్తిత్వం. 1963 నుంచి 1976 మధ్యకాలంలో నేరాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది . 70వ దశకంలో.. పర్వతశ్రేణుల గుండా కాలినడకన సంచరించే పాశ్చాత్య పర్యాటకులనే(Hippie trail)లక్ష్యంగా చేసుకుని నేరాలకు తెగబడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 మంది టూరిస్టులను చంపిన ఈ ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్.. ఒక్క థాయ్లాండ్లోనే 14 మందిని హతమార్చాడు. థాయ్ బాధితుల్లో చాలామంది బికినీలో శవాలుగా కనిపించడంతో అతనికి బికినీ కిల్లర్ అనే ముద్రపడింది. తండ్రి ఉన్నా లేనట్లే! వియత్నాంలోని సైగాన్(ప్రస్తుతం హో చి మిన్హ్ సిటీ) సువిశాలమైన నగరం. అక్కడ భారత్‌కు చెందిన వ్యాపారవేత్త శోభరాజ్ హాట్చంద్ భవ్నాని, ఓ దుకాణంలో పని చేసే ట్రన్ లోవాంగ్ ఫున్లకు డేటింగ్ చేశారు. ఈ జంటకు సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డ ఛార్లెస్ శోభరాజ్. ఏప్రిల్ 6వ తేదీన 1944లో జన్మించిన ఆ బిడ్డ పూర్తి పేరు చార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హాట్చంద్ భవనాని. బిడ్డ పుట్టిన కొన్నిరోజులకే ఆ తండ్రి దూరమయ్యాడు. తోడు వదిలేసి వెళ్లిపోవడంతో.. ఛార్లెస్ తల్లి ఫ్రాన్స్‌కు వలస వెళ్లింది. అక్కడ ఓ ఫ్రెంచ్ ఆర్మీ లెఫ్టినెంట్‌ను వివాహం చేసుకుంది. అయితే.. ఆ జంటకు పుట్టిన సంతానం కారణంగా తనను నిర్లక్ష్యం చేస్తున్నారేమో అనే భావనలోకి కూరుకుపోయాడు ఛార్లెస్ శోభరాజ్. మానసికంగా దిగజారి కుంగిపోయాడు. సమాజంపై, బంధాలపై విరక్తి చెందాడు. అలా అతని బుర్రలో టీనేజీ వయసులోనే క్రూర-నేర స్వభావం మొలకలెత్తడం మొదలైంది. యవ్వనంలో ఉన్నప్పుడు చిన్న చిన్న నేరాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఛార్లెస్ శోభరాజ్.. ఓ చోరీ కేసులో 1963లో తొలిసారి జైలుకు వెళ్లాడు. కానీ, అప్పటికే అతని బుర్ర నిండా క్రిమినల్ ఆలోచనలే నిండిపోయి ఉన్నాయి. దీంతో అక్కడి అధికారులను మచ్చిక చేసుకుని.. సకల భోగాలు అనుభవించాడు. ఆపై ఓ రిచ్ వలంటీర్‌తో పరిచయం పెంచుకున్నాడు. పెరోల్ మీద బయటకు వచ్చిన ఛార్లెస్ శోభరాజ్.. పిక్‌పాకెట్ నేరాల నుంచి పెద్ద పెద్ద దందాలతో ప్యారిస్‌లో బడా క్రిమినల్‌గా ఎదిగాడు. ఛార్లెస్ శోభరాజ్ హత్యకు పన్నే కుట్రలు సైతం ప్లానింగ్‌గా ఉంటాయి. బాధితులకు తాగే వాటిలో, తినే వాటిలో విషపు గుళికలు ఇచ్చేవాడు. ఆయుష్షు గట్టిదైతే ప్రాణాలతో బయటపడేవాళ్లు. అలాంటి ఘటనతోనే మరోసారి అరెస్ట్ అయ్యాడు ఛార్లెస్ శోభరాజ్. 1976లో.. కొందరు కాలేజీ విద్యార్థులపై డ్రగ్స్, విషపు గోళీలతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే వాళ్లంతా ప్రాణాలతో బయటపడడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జులై నెలలో శోభరాజ్ అరెస్ట్ అయ్యాడు. మరికొద్ది రోజుల్లో శిక్షా కాలం ముగుస్తుందనగా.. పుట్టినరోజు వంకతో జైలు హోం గార్డులకు మత్తు మందు కలిపిన స్వీట్లు పంచి తప్పించుకున్నాడు. ఛార్లెస్ శోభరాజ్(యవ్వనంలో..) ప్రేమ.. పెళ్లి.. దగా యవ్వనంలో ఛార్లెస్ శోభరాజ్ నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మొదటిసారి జైలుకు పోయి వచ్చాక.. ప్యారిస్‌లో విచ్చల విడిగా దోపిడీలు, కుంభకోణాలకు పాల్పడ్డాడు. ఆ సమయంలోనే.. చంతల్ కొంపాగ్నోన్ అనే పర్షియన్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఈ ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకునే టైంకి.. శోభరాజ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎనిమిది నెలల శిక్ష తర్వాత బయటకు వచ్చి.. కొంపాగ్నోన్ను వివాహంచేసుకున్నాడు. అయితే.. మళ్లీ అరెస్ట్‌ను తప్పించుకునేందుకు గర్భవతిగా ఉన్న భార్యతో కలిసి దేశం విడిచి పారిపోయాడు. దారిలో ఫేక్ డాక్యుమెంట్లతో ప్రయాణిస్తూ.. టూరిస్టులను దోచుకుని.. చివరికి ముంబైకి చేరుకున్నాడు. అక్కడే కూతురు పుట్టింది. ఉష అనే పేరు పెట్టుకున్నారు ఆ దంపతులు. భార్య కోరిక మేరకు నేరాలకు బ్రేక్ వేసినప్పటికీ.. కార్ల దొంగతనం, స్మగ్లింగ్లు చేసుకుంటూ పోయాడు రహస్యంగా. ఆపై ఈజీ మనీ కోసం గ్యాంబ్లింగ్ వైపు అడుగులు వేశాడు. 1973లో ఢిల్లీ హోటల్ అశోకలో నగల దొంగతనం కేసులో పట్టుబడ్డాడు. భార్య సహకారంతో అనారోగ్యం డ్రామా ఆడి తప్పించుకున్నాడు. అయితే గంటల వ్యవధిలోనే తిరిగి వెంటనే పట్టేసుకున్నారు. ఆపై కన్నతండ్రి సహకారంతో జైలు నుంచి విడుదలై.. కాబూల్(అఫ్గనిస్తాన్) పారిపోయాడు. అక్కడ టూరిస్టులను దొచుకుంటూ.. మళ్లీ అరెస్ట్ అయ్యాడు. అక్కడ ఢిల్లీ తరహాలో స్కెచ్ వేసి తప్పించుకోవాలనుకున్నాడు. అనారోగ్యం నటించి.. ఆపై హాస్పిటల్ గార్డులకు మత్తుమందు ఇచ్చి ఎస్కేప్ అయ్యాడు. ఈ క్రమంలో.. భార్యా కూతురిని అక్కడే వదిలేసి ఇరాన్ పరారయ్యాడు. దీంతో చంతల్ కొంపాగ్నోన్ గుండె బద్ధలు అయ్యింది. బతిమాలి బిడ్డను ప్యారిస్‌కు భద్రంగా పంపించి.. తానూ శిక్షాకాలం పూర్తయ్యాక అక్కడికి చేరుకుంది. అప్పటి నుంచి ఆమె శోభరాజ్ ముఖం కూడా చూడలేదు.. చూడాలనుకోవట్లేదు!. ఇరాన్ నుంచి నుంచి మిడిల్ ఈస్ట్ దేశాల్లో తన బంధువు ఆండ్రె భాగస్వామ్యంతో దోపిడీలు, నేరాలకు పాల్పడ్డాడు. గ్రీస్‌లో ఈ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. అక్కడా పోలీసుల కళ్లు గప్పి ఆండ్రెను వదిలేసి పారిపోయాడు. ఆపై పలు దేశాలకు దోపిడీలకు, హత్యలకు పాల్పడ్డ శోభరాజ్.. తన నేరాలకు సహకరించేలా అనుచర గణం తయారు చేసుకుని.. సమయం వచ్చినప్పుడు వాళ్లను పోలీసులకు ఇరికిస్తూ.. తాను మాత్రం దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుండేవాడు. భారత్‌లో ఛార్లెస్ శోభరాజ్ 1976 నుంచి 21 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. అందుకు కారణం.. ఫ్రెంచ్ టూరిస్టులతో వెళ్తున్న ఓ బస్సులో విషప్రయోగానికి పాల్పడి.. అందులో ఓ ఇజ్రాయెల్ పౌరుడ్ని చంపినందుకు. ఆపై విడుదలై.. పారిస్‌కు వెళ్లాడు. తిరిగి 2003లో నేపాల్‌కు చేరుకుని.. జంట హత్యల కేసు, నకిలీ పాస్‌పోర్ట్ వినియోగం నేరాలకుగానూ జీవిత ఖైదుతో శిక్ష అనుభవించాడు. చివరికి.. డిసెంబర్ 21, 2022న నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అతని విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. 78 ఏళ్ల వయసులో ఆరోగ్యం క్షీణించడం, సత్ప్రవర్తన, దాదాపు శిక్షాకాలం(95 శాతం) పూర్తి చేసుకోవడం కారణాలతో.. విముక్తి కల్పించింది నేపాల్ అత్యున్నత న్యాయస్థానం. కానీ, నేపాలీ పోలీసులు మాత్రం అతని విడుదలకు ససేమీరా అంటున్నారు. సుప్రీం కోర్టు ఏ కేసులో అతన్ని విడుదల చేయాలని చెప్పిందో స్పష్టత లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2010లో ఇండో-నేపాలీ ఇంటర్ప్రెటర్, యువ లాయర్ నిహిత బిస్వాస్‌ను జైల్లోనే వివాహం చేసుకున్నాడు. ఆమె ఛార్లెస్ శోభరాజ్ తరపున వాదించిన లాయర్ కూతురు., అంతేకాదు.. వయసులో 44 ఏళ్లు చిన్నది కూడా. ఆకర్షనీయమైన అతని రూపానికి తాను ముగ్ధురాలిని అయ్యానని ప్రకటించుకుందామె. 2017లో గుండె ఆపరేషన్ కోసం రక్తదానం సైతం చేసిందామె. జైలు నుంచి భర్తను విడిపించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాల గురించి.. అంతర్జాతీయ మీడియా తరచూ కథనాలు ప్రచురిస్తూ వచ్చేది. అసలు హత్యలెందుకు? డ్రగ్స్, విషం, మత్తు మందు.. తినే తాగే వాటిల్లో కలిపి నేరాలకు పాల్పడుతుంటాడు ఛార్లెస్ శోభరాజ్. ఆపై చంపేసి.. దోచుకుంటాడు. కొన్ని సందర్భాలు.. చంపిన వాళ్ల ఐడెంటిటీలనే ఉపయోగించుకుని ఊళ్లు పట్టుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతను 20 మందిని చంపినట్లు చెప్తుంటారు. కానీ, అందులో పదిహేను మాత్రమే అతని ఖాతాలో ధృవీకరణ అయ్యింది. మొత్తంగా అతను 30 హత్యలకు పాల్పడి ఉంటారని ఒక అంచనా. ఈ నేర చరిత అంతటితోనే ఆగిపోలేదు. ఫ్రాన్స్, గ్రీస్, మలేషియా, ఇరాన్, టర్కీ, అఫ్గనిస్తాన్, పాకిస్థాన్, నేపాల్, భారత్, థాయ్‌లాండ్‌లో.. నేరాలకు పాల్పడ్డాడు. ఛార్లెస్ శోభరాజ్ నేరచరిత నుంచి బయటకు రాని విషయాలెన్నో. అసలు నేరస్థుడిగా ఎందుకు మారాడు? ఆ నేరాల వెనుక ఉద్దేశం ఏంటన్న దానిపై అతను పెదవి విప్పకపోవడంతో.. ఒక క్లారిటీ అంటూ లేకుండా పోయింది. ఛార్లెస్ శోభరాజ్ మీద.. నాలుగు బయోగ్రఫీలు, మూడు డాక్యుమెంటరీలతో పాటు మే ఔర్ ఛార్లెస్ పేరిట ఓ హిందీ చిత్రం వచ్చింది. అలాగే.. 2021లో ది సెర్పెంట్ పేరుతో బీబీసీ/నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఎనిమిది భాగాలుగా తీసిన డ్రామా సిరీస్ కూడా పాపులారిటీ సంపాదించుకున్నాయి. -
తెలుగు తెరకు... ఆయన గోరింటాకు!
అభిరుచి గల మురారి... ఆద్యంతం సాహిత్య సంగీతాల్ని ప్రేమించిన మురారి... మంచి చిత్రాల నిర్మాత ‘యువచిత్ర’ మురారి వెళ్ళిపోయారు. మూడు దశాబ్దాల స్నేహంలో ఎన్నో ఘటనలు మనసులో రీళ్ళు తిరిగాయి. మురారిది కమ్యూనిస్ట్ కుటుంబం. బెజవాడలో బాగా డబ్బున్న కాట్రగడ్డ కుటుంబం. సినీ నిర్మాణానికి పంపిణీ వ్యవస్థే మూలస్తంభమైన రోజుల్లో ప్రతిష్ఠాత్మక నవయుగ ఫిల్మ్స్ అధినేతకు అన్న కొడుకు. ఆ కొంగుచాటులన్నీ దాటుకొని, కష్టపడి, ఒక్కో మెట్టూ పేర్చు కుంటూ మురారి తనదైన కీర్తి, అపకీర్తుల సౌధం కట్టుకు న్నారు. వి. మధుసూదనరావు వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడైన మురారికి అనంతరకాల అగ్ర దర్శకుడు కోదండరామి రెడ్డి సహపాఠీ. జెమినీ వాసన్, విజయా చక్రపాణి వద్ద నిర్మాణ మెలకువలు నేర్చుకున్నారు. కొట్లాడే దర్శకుడు కాబోయి, తిట్టి మరీ చెప్పి చేయించుకొనే నిర్మాతగా మారడమే తెలివైన పని అని గ్రహించారు. తనకు నచ్చిన సినిమాలే తీశారు. తనకు నచ్చినట్టే తీశారు. పంతం పట్టి రీషూట్లూ చేశారు. పారితోషికం పెంచి ఇస్తూ, పని చేయించుకున్నారు. ‘తిడతాడు.. డబ్బుతో కొడతాడు’ అనిపించుకున్నారు. సమకాలికుల్లో విలక్షణంగా నిలిచారు. బ్యానరే ఇంటిపేరైన కొద్ది నిర్మాతల్లో ఒకరయ్యారు. మద్రాస్ మెరీనా బీచ్‌లోని దేవీప్రసాద్‌రాయ్ చౌధురి ‘శ్రామిక విజయం’ శిల్పం తమ సంస్థకు చిహ్నంగా పెట్టుకో వడం మురారి పెరిగిన వాతావరణపు ఆలోచన. నవలల్ని తెరపైకి తెచ్చినా, ఇంగ్లీష్ ఇతివృత్తాల్ని తెలుగు కథలుగా మలిచినా అది ఆయన పెంచుకున్న అభిరుచి. ‘సీతామాలక్ష్మి, గోరింటాకు, త్రిశూలం, సీతారామ కల్యాణం’ వగైరా అన్నీ కలిపి తీసినవి 9 సినిమాలే! విజయ బాపినీడుతో కలసి నిర్మించిన ‘జేగంటలు’ తప్ప అన్నీ సక్సెస్‌లే. నందులతో సహా అనేక అవార్డులు తెచ్చినవే. ఆయన పాటలు అందమైన హిందోళాలు. ఎవర్గ్రీన్ హిట్లు. ఒకే నిర్మాత సినిమాల్లోని సాహిత్య విలువలపై 20 ఏళ్ళక్రితమే విశ్వవిద్యాలయ పరిశోధన జరిగింది ఒక్క ‘యువచిత్ర’ సినిమాలకే! ‘మామ’ మహదేవన్ లేకుండా సినిమా తీయనన్న మురారి, మామ పోయాక నిజంగానే సినిమా తీయలేకపోయారు. కీరవాణి సంగీతంతో కథ, సంగీత చర్చలు జరిగినా ముందుకు సాగలేదు. మూగబోయిన కృష్ణశాస్త్రిని ఆరాధిస్తూ బాంబే బ్రెడ్ టోస్ట్ చేసిచ్చినా, ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కని పాలగుమ్మి పద్మ రాజును ఆస్థాన రచయితగా పోషించినా, కనుమరుగైన మహా నటి సావిత్రితో ‘గోరింటాకు’లో పట్టుబట్టి వేషంవేయించినా, జగ్గయ్య సారథ్యంలో ‘మనస్విని’ ట్రస్ట్–అవార్డులతో మరణిం చిన ఆత్రేయను కొన్నేళ్ళు ఏటా స్మరించినా, ఎస్పీబీ – సత్యానంద్ – జంధ్యాల – ఓంకార్‌లతో గాఢంగా స్నేహిం చినా... అది మురారి మార్క్ ప్రేమ. కృష్ణశాస్త్రి మరణించాక ‘ఇది మల్లెల వేళ’ అంటూ ఎంపిక చేసిన 11 పాటల్ని ఎల్పీ రికార్డుగా హెచ్ఎంవీతో పట్టుబట్టి రిలీజ్ చేయించారు. ఆత్రేయ సాహిత్యం వెలికి రావడంలో పాత్ర పోషించారు. ప్రొడ్యూసరంటే కాంబినేషన్లు కుదిర్చే క్యాషియరనే కాలం వచ్చాక, అభిరుచి చంపుకోలేక మూడు దశాబ్దాల క్రితమే నిర్మాతగా స్వచ్ఛంద విరమణ చేశారు. సంపాదించిన డబ్బు సినిమాల్లో ‘సన్’ స్ట్రోక్‌కు ఆవిరి కారాదని తంటాలు పడ్డారు. ప్రతిభను గుర్తించి, నెత్తికెత్తుకోవడం మురారి నైజం. 22 ఏళ్ళ క్రితం ఓ సికింద్రాబాద్ కుర్రాడు సినిమా తీస్తే, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నేషనల్ అవార్డ్ వచ్చింది. వార్త చదివిన మురారి ఆ కుర్రాణ్ణి చెన్నైకి పిలిపించి, అభినందించి, ఆతిథ్య మిచ్చి మరీ పంపారు. ఆ సినిమా ‘డాలర్ డ్రీమ్స్’. ఆ సంగతి నేటికీ తలుచుకొనే అప్పటి ఆ కుర్రాడే – ఇవాళ్టి శేఖర్ కమ్ముల. హీరోయిన్లు తాళ్ళూరి రామేశ్వరి, వక్కలంక పద్మ, గౌతమి, రచయిత సత్యమూర్తి (దేవిశ్రీ ప్రసాద్ తండ్రి), కళా దర్శకుడు రాజులను మురారే తెరకు పరిచయం చేశారు. అగ్ర హీరోలు, దర్శకులతో పని చేసినా వారి కన్నా రచయితలతోనే ఆయనకు స్నేహం. డాక్టర్ జివాగో లాంటి నవలలు, వాటిని తెరకు మలి చిన తీరు గురించి మురారి చెబుతుంటే, డబ్బులు కాదు.. మనసు పెట్టినవాడే మంచి నిర్మాతనే మాటకు సాక్ష్యం అనిపిం చేది. నాటి ‘వేయిపడగలు’ నుంచి నేటి ‘అర్ధనారి’ దాకా బాగున్న ప్రతి నవల మురారి చదవాల్సిందే. చర్చించాల్సిందే. సందేహనివృత్తికి జగ్గయ్య, విఏకె రంగారావు, గొల్లపూడి, పైడి పాల, కాసల నాగభూషణం లాంటి వార్ని సంప్రతించాల్సిందే. మురారితో మాటలన్నీ పోట్లాటలే! మాట తీరే అంత. చూపులకు కోపధారి. తెలియనివాళ్ళకు తిక్క మనిషి. సన్నిహితమైతే తెలిసేది– మాటలోనే కారం కానీ మనసు నిండా మమకారమే అని! ఒక దశ దాటాక... ఆయన ప్రేమించి, గౌరవించే హీరో శోభన్‌బాబు, దర్శకుడు దాసరి లేరు. సలహా చెప్పే స్నేహశీలి ఓంకార్ ముందే వెళ్ళి పోయారు. చెన్నైగా మారిన మద్రాసులో తెలుగు చిత్రసీమ ఖాళీ అయింది. పాత మిత్రులు లేరు. కొత్తగా మిత్రులు కారు. ఊరవతల సముద్రపుటొడ్డు నివాసంలో విచిత్రమైన ఒంటరి తనం. సోషల్ మీడియాలో స్నేహాన్నీ, సాహిత్యంలో సాంత్వ ననూ వెతుక్కున్నారు. తోటలో తామరలు, ఇంట్లో కుక్కలతో సేద తీరాలనుకున్నారు. ఎఫ్బీలో నోరు చేసుకుంటూ వచ్చారు. దశాబ్దిన్నర క్రితం ‘తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర’ కళ్ళు చెదిరే ఖరీదైన గ్రంథంగా రావడంలోనూ మురారి సంపా దకత్వ అభిరుచి కనిపిస్తుంది. తెలుగు నిర్మాతల వెల్ఫేర్ ట్రస్ట్ చేపట్టిన ఆ బరువైన రచనలో బలమైన ఆయన ఇష్టానిష్టాలు, చెలరేగిన వాదాలు, వివాదాలు మరో పెద్ద కథ. తోచుబడి కావట్లేదన్నప్పుడు, తరచూ చెప్పే పాత కబుర్లనే కాగితంపై పెట్టమన్న సలహా మురారిలోని రచయితను నిద్ర లేపింది. ఎన్నో చేదునిజాలు, నాణేనికి ఒకవైపే చూపిన కొన్ని అర్ధ సత్యాలను గుదిగుచ్చిన ఆయన జ్ఞాపకాల కలబోత ‘నవ్విపోదురు గాక’ సంచలనమైంది. పదేళ్ళలో 12 ముద్రణలు జరుపుకొంది. డ్రాఫ్ట్ రీడింగ్‌లో పలువురు ప్రముఖులు సందేహించినా, ఆటో బయోగ్రఫీల్లో అది నేటికీ టాప్సెల్లర్. ఆ రచనకు ప్రేరకులం, తొలి శ్రోతలమైన ఓంకార్‌నూ, అస్మదీయుడినీ పదుగురిలో పదేపదే గుర్తుచేసుకోవడం మురారి సంస్కారం. ఆవేశభరిత మురారిది జీవితంలో, సినిమాల్లోనూ ముళ్ళ దారి. ముక్కుసూటి తత్వం, మార్చుకోలేని అభిప్రాయాలు, మాట నెగ్గించుకొనే ఆభిజాత్యంతో సహచరుల్ని దూరం చేసు కోవడం మురారి జీవలక్షణాలు. చరమాంకంలో తప్పు తెలుసుకున్నారు. ‘ఆఖర్న మోయడానికి నలుగురినైనా మిగుల్చుకో వాలయ్యా’ అనేవారు. అప్పటికే లేటైంది. ఆయన పోయారు. ఆయన దర్శక, హీరోలెవరూ రాలేదు. సంతాపాలూ చెప్ప లేదు. అవసరాలే తప్ప అభిమానాలు తక్కువైన రంగుల లోకంలోని ఆ సంగతీ మురారికి ముందే తెలుసు. ‘‘ఏవయ్యా రేపు నే పోయాక పేపర్లో రాస్తావా? చదవడానికి నేనుండను కానీ, నా గురించి ఏం రాస్తావో ఇప్పుడే చెప్పచ్చుగా!’’ అనేవారు. ఇంత తొందరగా ఆయన కోరిక నెరవేరుస్తానను కోలేదు. రాశాను... చదివి చీల్చిచెండాడడానికి ఆయన లేరు. మద్రాస్ తెలుగు సినిమా ఆఖరి అనుబంధాల్లో మరొకటి తెగిపోయింది. చిన్ననాటి నుంచి చివరి రోజుల దాకా జీవి తంతో నిత్యం సంఘర్షిస్తూ, అలసిపోయిన డియర్ మురారి గారూ... రెస్ట్ ఇన్ పీస్ ఎట్లీస్ట్ ఇన్ దిస్ లాస్ట్ జర్నీ! – రెంటాల జయదేవ -
Shoyabullakhan: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత స్వాతంత్య్రం సిద్ధించింది. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కావడానికి ఎందరో దేశభక్తులు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. నిజాం నిరంకుశత్వానికి.. రజాకార్ల ఆరాచకాలను ప్రపంచానికి తెలిసేలా వార్తలు, సంపాదకీయాలు రాసిన షోయబ్–ఉల్లా–ఖాన్ గురించి మనం తెలుసుకోవాలి. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలని తన కలాన్ని గళంగా మార్చుకుని నిజాం వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతూ అసువులు బాసిన షోయబుల్లాఖాన్‌కు సలాం. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నేటి యువత, విద్యార్థులు ఆయన గురించి తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ కథనం. పోచారం: ప్రజాస్వామ్య విలువల కోసం అక్షర పోరాటం చేస్తూ.. నడి రోడ్డుపై ప్రాణ త్యాగం చేసిన షోయబుల్లాఖాన్ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం. 1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని షోయబ్ ఆకాంక్షించారు. ఆ తరుణంలోనే హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని నిజాం రాజుకు ఏడుగురు ముస్లిం పెద్దలు విజ్ఞాపన పత్రం సమర్పించారు. దీనిని షోయబ్ తన సొంత పత్రిక ఇమ్రోజ్‌లో ప్రచురించారు. పత్రికలో వచ్చిన కథనాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రస్తావిస్తుందేమోనని నిజాం భయపడి షోయబ్‌ను హత్య చేయించాడు. కుటుంబ నేపథ్యం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరి కుటుంబం నిజాం ప్రాంతానికి వలస వచ్చింది. ఖమ్మం జిల్లా సుబ్రవేడ్‌లో 1920 అక్టోబర్ 17న హబీబుల్లాఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు షోయబుల్లాఖాన్ జన్మించారు. తేజ్, రయ్యత్ పత్రికల్లో జర్నలిస్టుగా.. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తేజ్ అనే ఉర్దూ పత్రికలో చేరి రజాకార్ల అరాచకాలపై అక్షర నిప్పులు చెరిగేవారు. దీంతో తేజ్ పత్రికను సర్కార్ నిషేధించడంతో రయ్యత్ పత్రికలో చేరారు. చివరకు రయ్యత్ పత్రికను ప్రభుత్వం మూసివేయించింది. బూర్గుల సాయంతో ఇమ్రోజ్ పత్రిక స్థాపన నగలు నట్రా అమ్మి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో హైదరాబాద్‌లోని కాచిగూడలో ఇమ్రోజ్ అనే పత్రికను షోయబ్ స్థాపించారు. షోయబ్ రచనలకు రగిలిపోయిన ఖాసిం రజ్వీ 1947 నవంబర్ 17న తొలి సంచిక వెలువడింది. నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ పదునైన సంపాదకీయాలు రచించేవారు. వీరి రచనలకు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ రగిలిపోయాడు. (క్లిక్: చరిత్రను కాటేయ జూస్తున్నారు!) చప్పల్‌బజార్ రోడ్డులో చంపిన రజాకార్లు ► 1948 ఆసుస్టు 21న కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని ఇమ్రోజ్ ఆఫీస్ నుంచి అర్ధరాత్రి తన బావమరిది ఇస్మాయిల్‌ఖాన్‌తో కలిసి ఇంటికి వస్తుండగా చప్పల్‌బజార్ రోడ్డులో రజాకార్లు అతిక్రూరంగా చేతిని నరికి తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ► అడ్డుకోబోయిన తన బావమరిది చేతులు సైతం నరికేశారు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ 1948 ఆగస్టు 22వ తేదీన తెల్లవారు జామున షోయబ్ తుదిశ్వాస విడిచారు. ► ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో నివసిస్తున్నారు. మలక్‌పేట్‌లో షోయబ్ పేరుతో ఒక గదిలో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు ఏర్పాటు చేశారు. (క్లిక్: సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?) -
Yelavarthy Nayudamma: అసమాన ప్రతిభావంతుడు
భారత తోళ్ల పరిశ్రమకు నిరుపమాన సేవలందించినవారు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ. గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1922 సెప్టెంబరు 10న జన్మించారు. భారత్‌లో విద్యాభ్యాసం అనంతరం అమెరికా చర్మ శుద్ధి పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అద్భుత విజయాలను సాధించారు. తిరిగి మాతృ దేశానికి వచ్చి, తాను చదువుకున్న సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూ ట్లో చేరి చివరకు దాని డైరెక్టర్ అయ్యారు. నాయుడమ్మ ఖనిజాలు, మొక్కలు, ఆల్డీ హైడ్స్ వంటి వాటి కలయిక, నిర్మాణశైలిపై కూడా విశేష పరిశోధనలు చేశారు. ఇవన్నీ తోళ్లను పదును చేసే వినూత్న ఏజంట్స్‌గా వివరించి, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అనేక పరిశోధనలలో అగ్రగామిగా భాసిల్లారు. నాయుడమ్మ పరిశోధనా కృషి ఫలితంగా మన దేశపు చర్మంతో తయారైన వస్తువులకు విదేశాలలో విశేషమైన ఆదరణ, గిరాకీ ఏర్పడ్డాయి. అలీన దేశాలకు, ఇతర దేశాలకు మధ్య స్నేహవారధిగా నాయుడమ్మ ప్రఖ్యాతి గాంచారు. నూతన లేబరేటరీలకు ప్రణాళికలు రచించి, స్వయంగా రూపకల్పన చేసి, స్థాపింప జేశారు. అత్యాధునిక శైలిలో తోళ్ళ పదునుకు, శుద్ధికి పైలట్ ప్లాంట్లను దేశ స్థాయిలో తొలిసారిగా నెలకొల్పడానికి దోహదపడ్డారు. ‘లెదర్ సైన్స్’ మాస పత్రికకు చాలాకాలం సంపాదకులుగా ఉన్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్–ఛాన్స్ లర్గా (1981–1982), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందారు. ఐక్యరాజ్య సమితి సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ దేశానికి, మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. పద్మశ్రీ సహా అనేక పురస్కారాలు పొందారు. 1986 నుండి ఆయన పేరుమీద నెలకొల్పిన అవార్డును సైన్స్, టెక్నాలజీ రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ఏటా అందిస్తున్నారు. – డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి (శాస్త్రవేత్త నాయుడమ్మ శతజయంతి) -
విక్రమ్ కొఠారి: పెన్ కింగ్.. దారుణమైన పతనం, విషాదం!
రొటొమాక్ పెన్.. ఈ పేరు వినగానే కొన్ని తరాలు వెనక్కి వెళ్లాలనిపిస్తుంది. రబ్బరు గ్రిప్పులు, బాల్‌పాయింట్.. రకరకాల పెన్నులతో రాసిన రాతలే గుర్తుకొస్తాయి. ఐదు, పది రూపాయలు ఆపైనే రేట్లతో.. ముఖ్యంగా నైంటీస్ జనరేషన్‌కి ఈ పెన్నులతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకుపోయింది. ఈ పెన్నులు మార్కెట్లోకి రావడానికి ప్రధాన కారణం.. విక్రమ్ కొఠారి. కానీ, ఆయన రాతే బాగోలేదు. ఒకప్పుడు వంద కోట్ల టర్నోవర్ సామ్రాజ్యంతో ఓ వెలుగు వెలిగిన ఈ పెన్ కింగ్.. ‘దివాలాకోరు’ ‘రుణ ఎగవేతదారుడు’ అనే ముద్రలతో తనువు చాలించాడు. ►కాన్పూర్ కేంద్రంగా 1992లో రొటొమాక్ పెన్నుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు విక్రమ్ కొఠారి. అంతకు ముందు కుటుంబ వ్యాపారాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించేవాడు. ►విక్రమ్ తండ్రి మాన్షుక్భాయ్ గుజరాత్ నుంచి కాన్పూర్(ఉత్తర ప్రదేశ్)కు వలస వచ్చాడు. మొదట్లో దుకాణాలకు కొబ్బరి నూనె సరఫరా చేసిన మాన్షుక్.. ఆ తర్వాత 1973 నుంచి పాన్ పరాగ్ పాన్ మసాలా అమ్మకాలతో బడా వ్యాపారిగా ఎదిగాడు. ►మొదట్లో విక్రమ్ తన సోదరుడితో కలిసి పాన్ పరాగ్ ఎగుమతులు-దిగుమతుల వ్యవహరాల్ని చూసుకునేవాడు. ఒకానొక టైంలో ప్రధాని చేతుల మీదుగా బెస్ట్ ఎక్స్‌పోర్టర్ అవార్డును అందుకున్నారు విక్రమ్ కొఠారి. అయితే కుటుంబ విభేధాల తర్వాత విక్రమ్ కొఠారి.. పూర్తిగా రొటొమాక్ కంపెనీ వ్యవహారాలనే చూసుకుంటూ వచ్చారు. ► రొటొమాక్ స్థాపించింది మాన్షుక్భాయ్ అయినప్పటికీ.. దాని పూర్తి సక్సెస్ మాత్రం విక్రమ్ కొఠారికే దక్కుతుంది. కారణం.. ఆ కంపెనీ పెట్టాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చింది, జనాలకు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేసింది విక్రమ్ కాబట్టి. 1995-2005 మధ్య రొటొమాక్ పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తుల సామాజ్యంతో వంద కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాడాయన. ఈ దెబ్బకు రొటొమాక్ ఒక బ్రాండ్‌గానే కాదు.. విక్రమ్ కొఠారికి ‘ఇండియాస్ పెన్ కింగ్’ అనే బిరుదు దక్కింది. బాలీవుడ్లో ఆ పాటికే యమక్రేజ్ ఉన్న సల్మాన్ ఖాన్, రవీనా టాండన్‌లు రొటొమాక్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించేవాళ్లు. ►పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల అమ్మకాలతో దక్కిన కమర్షియల్ సక్సెస్‌తో సంఘంలో గొప్ప పేరు దక్కింది విక్రమ్ కొఠారికి. దీంతో లయన్స్ క్లబ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు కూడా. కాలక్రమంలో రొటొమాక్ పెన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. రొటొమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. ►ఆపై రియల్ ఎస్టేట్, స్టీల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోనూ సక్సెస్ కోసం ప్రయత్నించారు. కానీ.. ఆ సాహసం బెడిసి కొట్టింది. వ్యాపార జిమ్మికులను అంచనా వేయడంలో ఆయన ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో ఎటుచూసినా నష్టాలే మిగిలాయి. సంఘంలోని ఆయన గౌరవం మాయమైపోతూ వచ్చింది ఇక్కడి నుంచే. రొటొమాక్ గ్రూప్ ప్రమోటర్‌గా గొప్ప గౌరవం అందుకున్న విక్రమ్ కొఠారికి చివరిరోజుల్లో మాయని మచ్చలెన్నో దక్కాయి. ►భారత్‌లోని వివిధ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్లు విక్రమ్ కొఠారిపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సీబీఐ, ఈడీ ప్రత్యేకంగా కేసులు దాఖలు చేసి.. దర్యాప్తు జరిపించాయి కూడా. దర్యాప్తు సమయంలో మొత్తం ఏడు బ్యాంకుల నుంచి రూ. 3, 965 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు విక్రమ్ మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో రొటొమాక్ ఫ్యాక్టరీ మూతపడడంతో ఆ ఆరోపణలు నిజమని నమ్మాల్సి వచ్చింది. ►2018 ఫిబ్రవరిలో విక్రమ్ అరెస్ట్ అయ్యి.. ఏడాదిపాటు జైల్లో ఉన్నారు. ఆపై అనారోగ్యం కారణాల దృష్ట్యా విడుదలయ్యారు. తానేం రుణాలు ఎగ్గొట్టలేదని, ఎలాగైనా తీర్చి తీరతానని మీడియా సాక్షిగా ఆయన దీనంగా వేడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలు, రుణాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. చివరికి 73 ఏళ్ల విక్రమ్ కొఠారి కాన్పూర్‌లోని తన నివాసంలో మంగళవారం (జనవరి 4, 2022) కన్నుమూశాడు. బాత్రూంలో కాలు జారి తీవ్రగాయాలు కావడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం. లిఖ్‌తే.. లిఖ్‌తే లవ్ హో జాయే అంటూ సాగిన రొటొమాక్ ప్రచారాన్ని విక్రమ్ కొఠారి అస్తమయం నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
విధి వెక్కిరిస్తే.. పోర్న్‌స్టార్ అయ్యాడు
ఆ కుర్రాడి లక్క్ష్యం బలమైందే. ఆ ప్రయత్నంలోనూ అతను సిన్సియర్‌గా ఉన్నాడు. కానీ, అనుకోకుండా జరిగిన ఘటన అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా దేశానికి ఆడాలనే కల చెల్లాచెదురు అయ్యింది. 600 అడల్ట్ సినిమాలు.. కోట్లలో సంపాదన, బ్రాండ్ అంబాసిడర్‌గా-సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణింపుతో అదనపు ఆదాయం, సెలబ్రిటీలతో సాన్నిహిత్యం.. ఇదీ 37 ఏళ్ల అడల్ట్ స్టార్ డేనియల్ రెగినాల్డ్ మౌంటేయిన్ సాధించిన ఘనత కానీ ఘనత... డేనియల్ రెగినాల్డ్ మౌంటేయిన్.. ఇంగ్లండ్ బ్రాక్నెల్లో 1984 జులై 18న పుట్టాడు. స్కూల్ వయసులో తొమ్మిదేళ్ల వయసుకే సాకర్‌లో మంచి ప్లేయర్‌గా పేరు రావడంతో చెల్సీ, వెస్ట్ హామ్, స్పర్స్ లాంటి జట్లు అతని మీద నజర్ పెట్టాయి. పదిహేను పదహారేళ్లకే సౌత్ఆంప్టన్ కీ ప్లేయర్‌గా అతని పేరు మారుమోగిపోయింది. ఇక సాకర్ శకంలో అతని టైం మొదలైందనుకున్న టైంలో.. విధివశాత్తూ కాలికి గాయం అయ్యింది అతనికి. మోకాలి గాయం కొన్ని నెలలపాటు వేధించింది అతన్ని. దీంతో ఫుట్‌బాల్‌కు పనికిరాడనే ఉద్దేశంతో సౌత్ఆంప్టన్ అతన్ని ట్రీట్మెంట్కు అయ్యే డబ్బు అందించి.. టీం నుంచి ఉద్వాసన పలికింది. అలా పదహరేళ్ల వయసుకే ఫుట్‌బాల్ కావాలనే కల చెదిరిపోయింది. డేటింగ్ గర్ల్ సాయంతో.. ఫుట్‌బాల్ రేపిన గాయం నుంచి తేరుకున్నాక.. కార్పెంటర్‌గా ఆరేళ్లపాటు పని చేశాడతను. ఆ టైంలోనే.. ఓ డేటింగ్ సైట్ ద్వారా ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అయితే అతన్ని పోర్న్ సినిమాల్లో ప్రయత్నించమని చెప్పిందా యువతి. సిగ్గు-భయంతోనే లండన్‌లో జరిగిన అడిషన్స్‌కు వెళ్లిన అతనికి.. అవకాశం దక్కింది. విషయం తెలిసి ఇంట్లోవాళ్లు బాధపడ్డారు. కొన్నిరోజులకు అలవాటు పడ్డారు. అడల్ట్ సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్నా కొద్దీ.. ఆదాయం-క్రేజ్ పెరగడం మొదలైంది. దీంతో 24 ఏళ్లకు లాస్ ఏంజెల్స్‌కు మకాం మార్చాడు. పోర్న్స్టార్లతో డేటింగ్.. పెళ్లి లాస్ ఏంజెల్స్‌లో అడుగుపెట్టాక.. డానీ మౌంటెన్ పేరుతో అడల్ట్ పరిశ్రమలో సూపర్ స్టార్ అయ్యాడు డేనియల్ రెగినాల్డ్. ఆ స్టార్డమ్తో సెలబ్రిటీలు అతనితో డేటింగ్‌కు క్యూ కట్టారు. అడల్ట్ భామలు ఎవా ఎంజెలీనా-మియా మాల్కోవాలు అతని మాజీ భార్యలు కూడా. ఇక హాలీవుడ్ ప్రముఖులు జాసోన్ స్టాథమ్, విన్నీ జోన్స్‌లు డేనియల్‌కి జిగిరీ దోస్తులు. హయ్యెస్ట్పెయిడ్ ప్రస్తుతం అడల్ట్ ఫిల్మ్ స్టార్లలో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ టాప్ టెన్ లిస్ట్‌లో డేనియల్ రెగినాల్డ్ ఒకడు. ఏటా 1 మిలియన్ పౌండ్లకు పైనే అడల్ట్ సినిమాలతో సంపాదిస్తున్నాడు. కిందటి ఏడాదిలో డేనియలే నెంబర్ వన్ కూడా(తాజా రిపోర్ట్ ప్రకారం). ఇక హోటల్స్ బిజినెస్‌తో, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా-ఫిట్నెస్ కోచ్‌గా సంపాదన అదనం. డేనియల్‌కు సిల్వీ, జాక్సన్ అనే ఇద్దరూ పిల్లలు. భవిష్యత్తులో వాళ్లను అడల్ట్ సినిమాల్లోకి రానిస్తారా? అంటే.. తెలివైన సమాధానం ఇస్తున్నాడు. ‘చిన్నప్పుడు దేశానికి ఆడాలని కలలు కన్నా. కానీ, కుదరలేదు. ఇవాళ డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. కానీ, గాయంతో ఆ లక్క్ష్యం అసంపూర్తిగా ముగిసింది. అందుకే నేను సాధించింది పెద్ద ఘనతేం కాదు. అఫ్కోర్స్.. నాలా చాలా మంది ఉండొచ్చేమో. అలాంటివాళ్లకు ప్రయత్నించకుండా ఆగిపోవద్దని మాత్రం సలహా ఇస్తా. నా ఫెయిల్యూర్ స్టోరీని స్ఫూర్తిగా తీసుకుని.. జీవితంలో గెలుపు బావుటా ఎగరేయమని చెప్తా. ఇక అనుకోని వృత్తిలోకి దిగినప్పటికీ.. అనుకున్న గుర్తింపు మాత్రం దక్కలేదని బాధ మాత్రం ఇప్పటికీ నన్ను వేధిస్తోంది. అలాగని నా పిల్లల భవిష్యత్తును శాసించడం.. నిర్ణయించడం నా చేతుల్లో లేదు. కానీ, ఒక తండ్రిగా నా కూతురికి వద్దనే చెప్తా. కొడుక్కి మాత్రం ‘ధైర్యం చేయమ’ని ప్రొత్సహిస్తా చెప్తున్నాడు 37 ఏళ్ల డేనియల్ రెగినాల్డ్. -
మెరీనా క్యాంపస్ మూగబోయింది
మద్రాసులో మరో తెలుగు దివ్వె కనుమరుగైంది. మూల ద్రావిడ భాషల్లో బహువచన ప్రత్యయమే లేదని పరిశోధనాత్మకంగా తేల్చిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య జీవీయస్సార్ కృష్ణమూర్తి మరణంతో ప్రతిష్ఠాత్మక మద్రాసు విశ్వవిద్యాలయం మెరీనా క్యాంపస్ తెలుగు శాఖ చిన్నబోయింది. తొంభై నాలుగేళ్ళ ఆ శాఖతో దాదాపు సగం కాలం అనుబంధం, అధ్యాపకత్వం మాస్టారివి. ఇన్నేళ్ళుగా మద్రాసులో తెలుగు భాషా పరిశోధనకూ, విద్యార్థులకూ పెద్దదిక్కుగా నిలి చిన మంచి మనిషిగా... మూల ద్రావిడ పదాలను ఎలా గుర్తించాలి, ఆ పదాల అర్థాలు, అర్థవిపరిణామానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన అరుదైన భాషావేత్తగా... జీవీయస్సార్ ఓ కొండగుర్తు. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ముప్పాళ్ళలో బతికిచెడ్డ కుటుంబంలో పుట్టిన జీవీయస్సార్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తూమాటి దొణప్ప వద్ద భాషాశాస్త్ర అధ్యయనం చేశారు. ‘ద్రావిడ భాషల్లో సమాన పదజాలం’పై పరిశోధించారు. అది ఆయనను పాండిత్యంలో సానబెట్టింది. చెన్నపురికి చేర్చింది. 1978 నుంచి ఇప్పటి దాకా మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖకు ఊపిరిగా నిలి పింది. ఆ శాఖలో దశాబ్దాల క్రితమే తెలుగు సాహితీ అధ్యయనాన్ని ప్రాయోగికంగా మారుస్తూ, జర్నలిజమ్ పేపర్‌ను ప్రవేశపెట్టడంలో కీలక భాగస్వామి ఆయన. భాషావికాసం - జర్నలిజాల బోధన, ద్రావిడభాషా పరిశోధన–రెండూ చివరి దాకా ఆయనకు రెండు కళ్ళు. జీవనపోరాటంలో కష్టనష్టాలెన్నో చూసిన అనుభవం ఆయనది. అందుకే, సుదూరం నుంచి వచ్చిన విద్యార్థుల ఈతిబాధలు మాస్టారికి తెలుసు. అలా 4 దశాబ్దాల్లో కొన్ని వందల మంది తెలుగు పిల్లలకు ఆయన గురువే కాదు, తల్లి- తండ్రి- ఆత్మబంధువయ్యారు. అవస రానికి సలహాల నుంచి అడిగిందే తడవుగా ఆర్థికసాయాల దాకా అన్నీ చూసే స్నేహితుడయ్యారు. ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనంలో కొన్ని పదుల మంది పరిశోధకులకు మార్గదర్శకులయ్యారు. కోరాడ రామకృష్ణయ్య, పింగళి లక్ష్మీకాంతం, నిడదవోలు వెంకటరావుల పరంపరలో ఆచార్య గంధం అప్పారావు, రామచంద్ర చౌదరి, అక్కిరెడ్డి తర్వాత తెలుగుశాఖకు అధ్యక్షులయ్యారు. ఏ హోదాలో ఉన్నా సరే చదువుకోవడానికొచ్చే పిల్లలతో అదే ఆత్మీయత. అదే వాత్సల్యం. రిటైరైన తరువాత కూడా రెండు దశాబ్దాలు రోజూ తెలుగు శాఖకు వచ్చి, విద్యార్థులను తీర్చిదిద్దిన నిష్కామకర్మ, నిబద్ధత జీవీ యస్సార్వి. ఎనిమిది పదులకు దగ్గరవుతున్నా... రోజూ ఉదయాన్నే వచ్చేదీ, పొద్దుపోయాకెప్పుడో రాత్రి ఆఖరున వెళ్ళేదీ ఆయనే. అనేక సార్లు ఆగుతూ వచ్చిన చదువును కొనసాగిస్తూ, సైన్స్ చదివి, ఎమ్మేలో లెక్కలు వేసి, జీవనోపాధికి అనేకానేక చిరు ఉద్యోగాలు చేసి, ఆనక తెలుగులో పరిశోధన రాసి ఆచార్యుడైన జీవీయస్సార్కు జీవితంలోని డబ్బు లెక్కలు తెలియవు. అడిగినవారికి లేదనకుండా, కష్టంలో ఉన్న విద్యార్థికి కన్నీరు విడవకుండా ఆయన చేసిన సాయాలు, దానాలు, చెప్పిన సలహాలు కొల్లలు. కానీ, తనకంటూ అవసరమున్నా ఎవరినీ అర్థించని ఆత్మాభిమాని. అనర్గళంగా ఆయన భాషాశాస్త్ర పాఠం చెబుతుంటే అది వినముచ్చట. పాఠంలో, పరిశోధనలో సీరియస్‌గా అనిపించే మనిషి... కిందకు దిగి, క్యాంటీన్లో కుర్రకారుతో కలసి సర దాగా కబుర్లాడుతుంటే అదో చూడముచ్చట. ఆచార్యుడైనా, శాఖాధ్య క్షుడైనా, ఆఖరుకు ‘తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపకులపతి పదవి ఆఖరి క్షణంలో అందకుండా పోయినా– ఆయన మాత్రం అంతే సాదా సీదాగా గడిపేయడం ఓ అరుదైన ముచ్చట. నిన్నటి దాకా స్లెట్, యూజీసీ నెట్ నుంచి ఐఏఎస్ దాకా ఏ తెలుగు పరీక్షాపత్రం సిద్ధం చేయాలన్నా మాస్టారి చేయి పడాల్సిందే! భద్రిరాజు కృష్ణమూర్తి, పీఎస్ సుబ్రహ్మణ్యం, దొణప్పల తరువాతి తరంలో భాషాశాస్త్రంలో అవిరళ కృషి చేసిన జీవీయస్సార్ ఎక్కు వగా ఇంగ్లీషులోనే పరిశోధనలన్నీ రాశారు. వాటిని కనీసం పుస్తకంగా నైనా వేయలేదు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే వెళ్ళిపోవడంతో తెలుగు సమాజానికి ఆయన కృషి పూర్తిగా తెలియలేదు. సంపదనూ, సమ యాన్నీ, పరిశోధనా మేధనూ స్వీయప్రతిష్ఠ కోసం కాకుండా విద్యా ర్థుల కోసం వెచ్చించడం గురువుగా ఆయనలోని అరుదైన లక్షణం. ఆయన దగ్గర చదువుకొని కొందరు సినీ రచయితలయ్యారు. ఇంకొం దరు సాహితీవేత్తలయ్యారు. మరికొందరు విశాఖ, విజయవాడ, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ఆచార్యులయ్యారు. శాఖలో ఆయన ప్రత్యక్ష శిష్యులు మాడభూషి సంపత్ కుమార్ కూడా అదే శాఖకు అధ్యక్షులవడం సాక్షాత్ గురుకృప. చెన్నపట్నంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం చేసిన మైలాపూర్ భవనంతో, ఆ సొసైటీతో, అభ్యుదయ రచయితల సంఘంతో, ప్రపంచ తెలుగు సమాఖ్య - బీఎస్సార్కృష్ణ ‘రచన’ లాంటి సంస్థలతో జీవీయస్సార్ సాన్నిహిత్యం, వాటిల్లో ఆయన క్రియాశీలక కృషి చిరకాల జ్ఞాపకాలు. మల్లిక్, ఆచార్య కాసల నాగభూషణంతో కలసి ‘అరసం’ మద్రాసు శాఖ అధ్యక్షుడిగా ఆయన జరిపిన కార్యక్రమాలు వందలు. ‘నిండు మనంబు నవ్య నవనీత సమంబు... పల్కు దారుణ శస్త్ర ఖండనా తుల్యంబు...’ అన్న నన్నయ భారత చిత్రణ... సాహితీ పరిశో ధకుల మౌఖిక పరీక్షా సందర్భంలో మాస్టారికి సరిగ్గా సరిపోలుతుంది. సెమినార్లలో ఎవరు మాట్లాడినా, పరిశోధకులు ఏ తప్పు రాసినా ఆయన ఆత్మీయతను వదిలేసి, సత్యవాదిగా వాదనకు దిగేవారు. కొందరు సన్నిహితులకు సైతం రుచించకపోయినా, అది జీవీయస్సార్ జీవలక్షణం. భాషాశాస్త్రంలో çపట్టుసడలని పరిశోధనా దృష్టి, తెలుగు శాఖాభివృద్ధిలో పట్టువదలని కార్యదీక్ష, ఏదైనా సరే పట్టుకున్నది నెరవేరేలా చూసే వ్యవహార దక్షత, ఏటికి ఎదురీదే సాహసం, ఆప దలో పడితే తార్కికంగా చక్రం అడ్డువేసే శిష్యవాత్సల్యం, అవసరంలో ఉన్నవారికి సాయపడే సద్గుణం - ఇదీ ఆయన వ్యక్తిత్వం. అవన్నీ ఇకపై ప్రతి సందర్భంలోనూ చెన్నై తెలుగు వేదికపై ఆయన లేని లోటును పదే పదే గుర్తుచేస్తాయి. పదిమందీ గుర్తించేలా చేస్తాయి. అభ్యుదయ పరంపరాగత ఆత్మీయ గురువులకు అశ్రునివాళి. - డాక్టర్ రెంటాల జయదేవ -
ఒకానొక సమయంలో దివాళా తీయాల్సిన పరిస్థితి: కబీర్ బేడి
న్యూఢిల్లీ: జీవితంలో అనుకోని విజయాలు, అంతలోనే పతనాలు ఇలా ఎన్నో చూశానంటున్నాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు కబీర్ బేడి. ఇటీవల ఆయన రాసిన పుస్తకం ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్: ది ఎమోషనల్ లైఫ్ ఆఫ్ యాన్ యాక్టర్’ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన తన మనవరాలు ఆలయతో లైవ్ వీడియో చాట్‌లో ముచ్చటించారు. కబీర్ రాసిన పుస్తకం మార్కెట్లో అత్యధిక కాపీలు అమ్ముడై బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఆయన తన మనవరాలు అలయతో చాలా సేపు సంభాషించారు. అందులో కబీర్.. తన జీవితంలో చవిచూసిన ఎత్తు పల్లాలు, వివిధ సంబంధాలు, వివాహం, విడాకులు, మానసిక ఆరోగ్యం లాంటి అంశాలను పంచుకున్నారు. కబీర్ రాసిన పుస్తకం తన స్నేహితులు చదివారని, వారికి ఎంతగానో నచ్చిందని ఆలయ తెలిపింది. ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది నా జీవితంలో ఊహించని విజయాలు, అనుకోని పతనాలను చూడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది. కాని అంతలా జీవితంలో కిందకు పడ్డా వాటి నుంచి లేచాను. లైఫ్‌లో ఫెయిల్యూర్ కావడం సహజమే, కాని ఎదగాలన్న ఆశ వదులుకోవద్దు. నా వైఫల్యాల నుంచి గుణపాఠాలను నేర్చుకున్నాను అలాగే ఇతరులు కూడా చేస్తారని ఆశిస్తున్నానని ఆయన అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. కబీర పుస్తకానికి స్పందన రోజు రోజు పెరుగుతుండడంతో ఆయన తన పుస్తకాన్ని ఇటలీలో అతిపెద్ద ప్రచురణకర్త అయిన మొండడోరితో సెప్టెంబర్‌లో ఇటలీలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by ALAYA F (@alayaf) చదవండి: తాప్సీపై కంగనా ఫైర్.. తన పేరు వాడొద్దంటూ చురకలు -
జీన్స్ వేసుకుని అలా వద్దు.. ఎందుకో తెలుసా?
రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించడానికి అనువైనవి కావడంతోపాటు సౌకర్యమూ ఉండటం వల్ల జీన్స్ ప్యాంట్స్ పట్ల యువతీయువకుల్లో మాత్రమే గాక ప్రజలందరిలోనూ వాటి పట్ల మక్కువ ఎక్కువ. అయితే జీన్స్ ప్యాంట్ల వల్ల కలిగే అనర్థాలపై జరిగిన అధ్యయనాల్లోని ఒక అంశం కాస్తంత ఆందోళన గొలిపేదిగా ఉంది. జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకుని కూర్చునేవారు అస్సలు నడవలేని పరిస్థితి కూడా వచ్చేందుకు అవకాశముందని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ వేసుకొని ‘స్క్వాటింగ్’ అస్సలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. చదవండి: స్త్రీల దుస్తులకూ వయసుంటుందా? -
కనెక్ట్ అయ్యారు
ప్రణబ్ హిందీ సినిమాలు చూడరు... ‘పీకూ’ చిత్రం మాత్రం ఇష్టంగా చూశారు. దీపికలో కూతుర్ని చూసుకున్నారు. అసలు ఆయన జీవితంలోని ప్రతి దశా.. ఒక స్త్రీమూర్తితో కనెక్ట్ అయి ఉన్నదే. అమ్మ రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ.. భార్య సువ్రా, కూతురు శర్మిష్ట.. రాజకీయాల్లో శ్రీమతి ఇందిరాగాంధీ.. ప్రణబ్‌ని నడిపించారు.. మహిళా సాధికారవాదిగా మలిచారు. ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది అనేవారు ప్రణబ్ ముఖర్జీ. ఆయనే అంటుండే ఇంకో మాట.. మహిళలు రాజకీయాల్లో వస్తే ఆ వెలుగులో సమాజం అభివృద్ధి అక్షరాలు దిద్దుకుంటుందని. ఇకనమిక్స్ పండిట్ ఆయన. మాటలు మరీ ఇంత సుకుమారంగా ఉండవు. ఉద్దేశం మాత్రం స్త్రీలకు.. నడిపించే సామర్థ్యం ఉందనే. ఎలా తెలుసు? ఆయనా ఒక మహిళ చూపిన దారిలోనే నడిచారు కనుక. ఒక మహిళ కాదు.. కొంతమంది. రాజకీయాల్లోకి వచ్చాక ప్రణబ్‌కు దారి చూపిన మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. చాలా నేర్పించారు ఆమె ఈయనకు. ఒక్క ఇంగ్లిష్, హిందీ మాత్రం నేర్పించలేకపోయారు. అవి రెండూ ప్రణబ్‌కు రావని కాదు. వినసొంపుగా మాట్లాడ్డం సాధన చేయమనేవారు. ముఖ్యంగా ఇంగ్లిష్‌ను! ‘ఉచ్చారణను ఇంప్రూవ్ చేసుకోవయ్యా..’ అని ఆమె అంటే.. ‘సర్కిల్ నుంచి స్క్వేర్ను తయారు చేయాలని ప్రయత్నించకండి మేడమ్’ అని ఈయన నవ్వేవారు. ఇక పార్లమెంట్ చర్చా సమావేశాల్లోనైతే కొన్నిసార్లు శ్రీమతి గాంధీనే ప్రణబ్ మీదుగా గట్టెక్కేవాళ్లు. 1983లో లోక్‌సభలో చరణ్‌సింగ్ ఏవో కాగితాలు గాల్లోకి ఝుళిపిస్తూ.. ‘చూడండి. బడ్జెట్ ప్రసంగ పత్రాలివి. ప్రసంగానికంటే ముందు ఐ.ఎం.ఎఫ్.కి లీక్ అయ్యాయి’ అని ‘ఉమామహేశ్వరస్య ఉగ్రరూపస్య’ అయ్యాడు. శ్రీమతి గాంధీ ప్రధాని. అదెలా జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ఆర్థికమంత్రి ప్రణబ్ కోసం చూశారు. చరణ్‌కి సమాధానం ఇవ్వాలి కదా. ఆ సమయంలో ప్రణబ్ రాజ్యసభలో ఉన్నారు. వెంటనే పిలిపించారు. ఆయన వచ్చేసరికి కూడా చరణ్ ఆగ్రహంతో ఊగిపోతూనే ఉన్నారు. ఆయన్ని మరికొంత సేపు మాట్లాడనిచ్చి.. అప్పుడు చెప్పారు ప్రణబ్.. ‘డేటు చూడండి. అవి గత ఏడాది నేను సమర్పించిన బడ్జెట్ ప్రసంగ పత్రాలు’అని! కాంగ్రెస్ బెంచీలు భళ్లున నవ్వాయి. శ్రీమతి గాంధీకి గొప్ప ఉపశమనం లభించింది. ప్రణబ్ ముఖర్జీ.. శ్రీమతి గాంధీకి సహచరులు మాత్రమే కాదు. సన్నిహితులు కూడా. కోపం వస్తే తిట్టేంత చనువుంది ఆమెకు. 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె వద్దంటున్నా కూడా పోటీ చేశారు ప్రణబ్. ఘోరంగా ఓడిపోయారు. శ్రీమతి గాంధీకి పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే కోల్‌కతా ఫోన్ చేశారు. ‘నువ్వు ఓడిపోతావని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆఖరికి గీతకు కూడా. కానీ నువ్వు వినలేదు. నాకు చిక్కులు తెచ్చిపెట్టావు’ అన్నారు. (ప్రణబ్ భార్య సువ్రా. శ్రీమతి గాంధీ, మరికొందరు స్నేహితులు ఆమెను గీత అని పిలిచేవారు). ప్రణబ్ మౌనంగా ఉన్నారు. రెండు రోజుల తర్వాత ఆయనకు ఇంకో కాల్ వచ్చింది. సంజయ్ గాంధీ! ‘‘మమ్మీ.. మీ మీద చాలా కోపంగా ఉన్నారు. గురుతుల్యులు శ్రీమతి గాంధీ మీరు లేకుండా కేబినెట్ ఏమిటి అని కూడా అంటున్నారు. విమానంలో రేపటి కల్లా ఢిల్లీలో ఉండండి’’ అని చెప్పారు సంజయ్. ప్రణబ్ మీద శ్రీమతి గాంధీ నమ్మకం అంతటిది! ఆమె పట్ల ప్రణబ్ గమనింపు కూడా అంతలానే ఉండేది. బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ మొదటిసారి కలిసినప్పుడు శ్రీమతి గాంధీ ఏం తిన్నారో కూడా ఆయనకు గుర్తుంటుంది. రెస్పెక్ట్ విత్ కేరింగ్ అనుకోవాలి. భార్య సహా ప్రతి మహిళను ఆయన గౌరవంగా చూస్తారు. సఫ్దర్‌జంగ్ రోడ్డులో ప్రధాని వాజపేయి, ప్రణబ్ ముఖర్జీ ఇరుగు పొరుగుగా ఉన్నప్పుడు వాజపేయి దత్తపుత్రిక నమిత పెళ్లి కుదిరింది. పెళ్లి పనులన్నీ వాజపేయి అభ్యర్థనపై ప్రణబ్ భార్యే దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఆ పనుల్లో భార్యకు సహాయంగా ఉన్నారు ప్రణబ్! ప్రణబ్ తన జీవితంలో తొలిసారి చూసిన హిందీ సినిమా ‘రంగ్ దే బసంతి’. అది కూడా ఆయన చూడాలన్న ఆసక్తి కొద్దీ ఏం చూడలేదు. సెన్సార్ బోర్డు చీఫ్ షర్మిల ఠాగోర్ వచ్చి అడిగితే బలవంతంగా సరేనన్నారు. ఆమె ఎందుకు చూడమని అడిగారంటే.. అందులో భారత రక్షణ శాఖ మంత్రిపై ప్రతీకారం తీర్చుకునే కథాపరమైన అనివార్యత ఏదో ఉంది. ముందే చూపిస్తే తర్వాత తిట్లు పడవు కదా అని షర్మిల ఆలోచన. అప్పుడు మన రక్షణ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీనే. సినిమాను మహదేవ్ రోడ్డులోని ఓ థియేటర్లో ఆయన కోసం ప్రదర్శించి చూపించారు. సినిమా మధ్యలోనే బయటికి వచ్చేశారు ప్రణబ్. షర్మిల బిక్కుబిక్కుమంటూ నిలబడ్డారు. ప్రణబ్ ఆమె వైపు చూసి, ‘దేశాన్ని కాపాడ్డం నా పని. సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కాదు’ అని నిష్క్రమించారు. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు షర్మిల. ‘రంగ్ దే బసంతి’ తర్వాత బహుశా ప్రణబ్ చూసిన రెండో హిందీ సినిమా ‘పీకూ’ అయుండొచ్చు. రాష్ట్రపతి భవన్లో వేసిన షోలో అడ్వాణీ తో కలిసి ఆ సినిమా చూశారు. వృద్ధుడైన తండ్రి, ఆయన కూతురు మధ్య ఉండే అనుబంధం ఆ సినిమా. నాయకులిద్దరూ కనెక్ట్ అయ్యారు. ఇద్దరికీ కూతుళ్లున్నారు మరి. ఒక విధంగా ప్రణబ్‌ది మహిళల వల్ల రూపు దిద్దుకున్న జీవితం. ఇంట్లో.. తల్లి రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ, భార్య సువ్రా, కూతురు శర్మిష్ట, రాజకీయాల్లో శ్రీమతి గాంధీ. అందుకే కావచ్చు ఆయనలో ఒక మహిళా సంక్షేమ, సాధికార, హక్కుల పరిరక్షణ యోధుడు కనిపిస్తాడు. భారత సైన్యంలో యుద్ధ విధుల్లోకి మహిళల ప్రవేశం ఆయన చొరవ కారణంగానే సాధ్యమయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గట్టి మద్దతు ఇచ్చిన వారిలో ఆయన ప్రథములు. మహిళల కోసం చట్టాలు చేసి ఊరుకుంటే సరిపోదని, చిత్తశుద్ధితో వాటిని అమలు పరచాలని ఆయన అంటుండేవారు. రాష్ట్రపతిగా 2012–17 మధ్య, ఇతర హోదాలలో అంతకుముందు, ఆ తర్వాత మహిళాభ్యున్నతికి, అభివృద్ధికి అనేక ప్రయత్నాలు చేశారు. సూచనలు ఇస్తూ వచ్చారు. చివరిసారి ఆయన మహిళల గురించి మాట్లాడింది.. గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో జరిగిన ‘బేటీ పఢావో అభియాన్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా. ‘ఆడపిల్లను చదివిస్తే ఇంటికి వెలుగు అవుతుంది’ అని అక్కడే ఆయన మరోసారి జాతి ప్రజలకు గుర్తు చేశారు. కూతురు శర్మిష్ఠ -
జీవితానికి బందీలు వీళ్లిద్దరూ
పడని కష్టం లేదు ఫూలన్‌దేవి. ముప్పై ఏళ్లుగా జైల్లోనే నళిని. ఇద్దరివీ పోలికలేని జీవితాలు. ఆ.. ఒక పోలిక ఉంది!! వీళ్లను కన్నీళ్లు పెట్టించిందీ.. కరడు కట్టించిందీ అయినవాళ్లే. ఫూలన్‌ని తండ్రి అమ్మేశాడు. నళిని.. భర్తను నమ్మేసింది! జైలుకు కాదు.. జీవితానికి బందీలు వీళ్లిద్దరూ. పందొమ్మిదేళ్ల క్రితం ముప్పై ఏడేళ్ల వయసులో యూపీలోని మీర్జాపూర్ ఎంపీగా ఉన్నప్పుడు దుండగుల తుపాకీ గుండ్లకు బలైపోయారు ఫూలన్‌దేవి. అంతకు పదేళ్ల క్రితం తమిళనాడులో జరిగిన రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తన ఇరవై రెండవ యేట నుంచీ జైల్లోనే ఉంది నళిని. ఈ ఇద్దరూ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రావడానికి పెద్ద విశేషం కూడా ఏమీ లేదు నిజానికైతే! యూపీలో కాంగ్రెస్ రాజకీయ నాయకుడొకరు ఫూలన్ మరణించిన జూలై 25వ తేదీన ‘వీరాంగన ఫూలన్‌దేవి’ అని ట్వీట్ చేశారు. ఇరవై రెండు మంది అగ్రవర్ణాల వారిని నిలువునా కాల్చి చంపిన బందిపోటును వీరాంగన అనడం ఏమిటి అని ‘అగ్ర’హ జ్వాలలు రగిలాయి. నళిని కూడా పెద్దగా ప్రాముఖ్యానికి నోచుకోని ఒక కారణం వల్ల ఇటీవలే వార్తల్లోకి వచ్చి వెళ్లారు. జైల్లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందనీ, లేదు.. ఆత్మహత్య బెదిరింపుతో జైలు అధికారులను బ్లాక్మెయిల్ చేసిందనీ రెండు మాటలు వచ్చాయి. ఎక్కడా కలిసినవాళ్లు, ఏ విధంగానూ కలిపి చూడ్డానికి వీల్లేనివాళ్లూ.. ఫూలన్ దేవి, నళినీ. అయితే మోసపోవడం అన్నది ఇద్దరి జీవితంలోనూ ఉంది. ఫూలన్‌ని దేవిదిన్ నిషాద్ మోసం చేశాడు. నళినిని శ్రీహరన్ మోసం చేశాడు. నిషాద్ ఫూలన్ తండ్రి. శ్రీహరన్ నళిని భర్త. ఫూలన్ జీవితంలో అన్నీ పోరాటాలే. కాస్త పెద్ద మాటల్లో చెప్పాలంటే.. అణగారిన వర్గాల మహిళల సంక్షేమం కోసం పోరాటం. అగ్రవర్ణాల వారి దౌర్జన్యాలపై పోరాటం. సమాజంలోని అన్యాయాలు, అసమానతలపై పోరాటం. స్త్రీగా ఆమె పడిన కష్టాలే ఆమెను ‘వీరాంగన’ను చేశాయి. ఫూలన్‌ను పదహారేళ్ల వయసులో ఆమె పెదనాన్న కొడుకు ఆస్తి విషయమై అన్యాయంగా జైల్లో పెట్టించినప్పుడు మూడు రోజుల పాటు పోలీసులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. చంబల్ లోయ బందిపోటు నాయకుడు ఆమెను అపహరించుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ముఠానాయకుల మధ్య చేతులు మారిన ప్రతిసారీ ఆమెపై లైంగిక దాడి జరిగింది. ఇవన్నీ కూడా ఆమె ఇరవయ్యవ యేటకే జరిగిపోయాయి. అన్నిటికన్నా ఆమె పడిన పెద్ద కష్టం పదకొండేళ్ల వయసులో! ఆ కష్టం తెచ్చిపెట్టింది బంధువులో, బందిపోట్లో, అగ్రవర్ణాల వారో కాదు. సొంత తండ్రి!! పుట్టీలాల్ అనే వ్యక్తికి ఫూలన్‌దేవిని అమ్మేశాడు. ధర.. ఒక ఆవు, ఒక సైకిల్. తల్లి నెత్తీనోరు మొత్తుకుంటుంటే తండ్రి ఆమెను కొట్టి ఒక మూలకు నెట్టేయడం చూస్తూనే ఉంది ఫూలన్. ‘‘ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాం! కోసుకుంటామా!!’ అని తన గురించి అనడమూ వింటూనే ఉంది. అంతలోనే పుట్టీలాల్ వచ్చి ఫూలన్‌ని భుజాన వేసుకుని వెళ్లిపోయాడు. అతడి నుంచి పారిపోయి రావడంతో ఫూలన్ జీవితంలో పోరాటం మొదలైంది. అవును. ఆ వయసుకు పారిపోవడం కూడా పోరాటమే. అదీ ‘భర్త’అనే వింత జీవి నుంచి. బాధ్యత చూపని తండ్రి నుంచి. ‘నేనొక్కదాన్నే కాదు. ఇంకా చాలామందే ఉన్నారు నాలాంటి వాళ్లు’.. ఇదీ ఫూలన్.. తన బయోగ్రఫీ రాయడానికి 1983–94 మధ్య జైలుకు వచ్చి కలిసిన మాలాసేన్తో తొలిరోజు అన్నమాట. మాలాను పూలన్.. ‘దీదీ’అనేవారు. ఫూలన్ బతికి ఉంటే నళినికి ఇప్పుడు ఆమె ‘దీదీ’ అయి ఉండేవారేమో.. ఇరవై తొమ్మిదేళ్లుగా జైల్లో ఉన్న నళినిని విడిపించడానికి ఢిల్లీ నుంచి ఓ చిన్న పోరాటమో, పెద్ద ప్రయత్నమో చేసి. నళిని జీవిత చరిత్ర కూడా పుస్తకంగా వచ్చింది. ‘రాజీవ్ హత్య : హత్య వెనుక నిజాలు, ప్రియాంక–నళిని సమావేశం’ అనే ఆ పుస్తకాన్ని ఏకలైవన్ అనే రచయిత తమిళ్లో రాశారు. ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్ట్ అయ్యే నాటికే నళిని రెండు నెలల గర్భవతి. శ్రీహరన్‌తో ప్రేమబంధం గురించి పుస్తకంలో ఉంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం. శ్రీహరన్ ఒక ధ్యేయంతో నళిని ప్రేమించాడు. నళిని ఆ ప్రేమలో పడిపోయి, అతడితోపాటు విలువైన జీవితాన్ని జైలుపాలు చేసుకుంది. జైల్లోనే కూతుర్ని ప్రసవించింది. కూతురి పెళ్లి చేయడానికి పెరోల్ కోసం తిప్పలు పడింది. ఊహించని విధంగా శ్రీహరన్ ఆమె జీవితంలోకి ప్రవేశించి అంతా అస్తవ్యస్తం చేశాడు. అయితే ఇప్పటికీ ఆమె.. ‘‘రక్తాన్ని దాహంగొన్న తోడేళ్ల మధ్యలోకి మేము వెళ్లిపోయాము’’ అని అంటోందే తప్ప భర్తను, భర్త ప్రేమను తప్పుప ట్టడం లేదు! నళిని తల్లి పద్మావతి. మద్రాసులోని ఓ ఆసుపత్రిలో ఆమె నర్సుగా ఉన్నప్పుడు శ్రీలంక తమిళుడైన శ్రీహరన్ అద్దెకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, వీళ్ల ఇంటి పక్కన చేరాడు. కొద్దిరోజుల తర్వాత ‘ఒంటి కన్ను’ శివరాసన్ వచ్చి శ్రీహరన్ రూమ్మేట్ అయ్యాడు. ఆ వెంటనే ‘థను’ (మానవబాంబు) వచ్చి చేరింది. ఇదంతా జరుగుతున్నప్పుడే నళిని, శ్రీహరన్ ప్రేమలో పడ్డారు. స్త్రీ జీవితంలోని కల్లోలానికి ప్రతీకలైన రెండు పేర్లు ఫూలన్, నళిని. నిన్న (ఆగస్టు 10) ఫూలన్ దేవి జయంతి. నళినికి జీవితంలో ఎప్పటికీ మరపునకు రాని రోజు మాత్రం మే 21. రాజీవ్ గాంధీ.. హత్యకు గురైన రోజు అది. -
ఏం పిల్లడో.. మళ్లీ వస్తవా..?
పాటెళ్లిపోయింది... ఉత్తరాంధ్ర ఉద్యమానికి ఊపిరులూదిన గళం.. మూగబోయింది. అక్షరానికి గజ్జెకట్టి.. లక్షల హృదయాల్ని కొల్లగొట్టిన స్వరం.. ఆగిపోయింది. సిక్కోలు మాండలికానికి మాణిక్యంగా మారిన పాట.. వెళ్లిపోయింది. తూరుపు కనుమల్లో ఊపిరిపోసుకున్న పాటల సూరీడు అస్తమించాడు.. మట్టివాసనని విశ్వానికి పరిచయం చేసిన ప్రజాగాయకుడు మట్టిలో కలిసిపోయాడు. ఏం పిల్లడో మళ్లీ వస్తవా– అంటూ జనగళం విషాద స్వరంతో అడుగుతోంది. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా..సికాకుళంలో చీమలన్నయట..ఏం పిల్లడో వెల్దమొస్తవా’ ఈ పదాలు చాలు ఆయన్ని పరిచయం చేయడానికి. సిక్కోలు నక్సల్బరి ఉద్యమాన్ని తన గీతాలతో ఉరకలెత్తించిన గాయకుడు. తన ఇంటి పేరు జానపదానికి బ్రాండ్‌నేమ్‌గా మార్చుకున్న ఉద్యమ కారుడు. ఆయనే వంగపండు. పూర్తి పేరు వంగపండు ప్రసాదరావు అయినా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ప్రపంచంలో ఏ మూలకెళ్లినా వంగపండుగానే చిరపరిచితులు. తాను నమ్మిన సిద్ధాంతాలకు.. విలువలకు కట్టుబడి జీవనపోరాటం సాగించిన ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం. విజయనగరంలో పుట్టినా.. ఇక్కడే జీవితం... విజయనగరం జిల్లాలో వంగపండు పుట్టినా.. సింహభాగం విశాఖలోనే గడిపారు. షిప్‌యార్డులో పనిచేశారు. ఆంధ్రావర్సిటీ థియేటర్ ఆఫ్ ఆర్ట్సులో గౌరవ ఆచార్యునిగా సేవలందించారు. ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ కావడంతో బొబ్బిలి లో ఐటీఐ చేసి.. తండ్రితో కలిసి వ్యవసాయం చేశారు. ఊళ్లలో మాట్లాడుకునే పల్లెపదాలతో తోచిన బాణి కట్టుకుని పాడుతుంటే.. ఊళ్లల్లో అందరూ ’ఒరేయ్ కవి’అని వంగపండుని పిలుస్తూ.. జానపద లొల్లాయి గీతాలను పాడించుకునే వారు. అయితే వివాహమైన రెండేళ్లకు మొదలైన నక్సల్బరి ఉద్యమం వంగపండు జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది. ఉద్యమమే ఊపిరిగా.. పాటే జీవితంగా.. వంగపండు... తుది శ్వాస విడిచే వరకూ ఉద్యమమే జీవితంగా... పాటే ఊపిరిగా జీవించారు. ఉద్యమంలోకి వెళ్లిన ఏడాదికే విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్‌గా ఉద్యోగం రాగానే అందులో చేరారు. కానీ... ఉద్యోగం కంటే ఉద్యమమే తనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తోందంటూ ప్రతి రోజూ సహచరులతో చెప్పేవారు. అందుకే పదిరోజులు పనికెళ్లడం.. 20 రోజులు ఉద్యమాల్లో పాల్గొనడం చేసేవారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాలన్నీ తిరిగారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా.. ఆరేళ్లకు పైగా సర్వీసు ఉన్నా షిప్‌యార్డు ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పాటే ఊపిరిగా పనిచేశారు. సినిమా ఛాన్సులు వచ్చినా... జనాల్ని ఉత్తేజపరిచే వంగపండు జానపద గీతాలు సినిమా వాళ్లని కూడా ఆకట్టుకున్నాయి. అభ్యుదయకారులైన టి. కృష్ణ, ఆర్.నారాయణమూర్తిలతో పాటు ఎంతోమంది తమ సినిమాలకు పాటలు రాయమని ఒత్తిడి తీసుకొచ్చేవారు. దర్శకుడు టి. కృష్ణ అయితే వంగపండు ఇంటికి స్వయంగా వచ్చి పాట రాయించుకునేవారంటే.. ఆయన జానపదం అంటే.. సినిమాకు ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సుమారు 30 సినిమాల్లో జనాల్ని ఉత్తేజ పరిచే గీతాల్ని రాశారు. అదేవిధంగా ఆరేడు సినిమాల్లోనూ వంగపండు నటించారు. అనేక సినిమాల్లో కూడా పాటలు రాసే అవకాశాలొచ్చినా జననాట్యమండలి నిబంధనలకు కట్టుబడి వదులుకున్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతాల్ని పక్కన పెట్టి.. సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి పాటలు రాసి ఉంటే.. ఆయన జీవితం మరోలా ఉండేదేమో.. శివుడంటే ఇష్టం.. కానీ.. నాస్తికుడు వంగపండుకు శివుడంటే ఇష్టమని చెప్పేవారు. ఎందుకంటే.. సాధారణ జీవితం గడిపేవాడు కాబట్టి అని అనేవారు. కానీ.. ఆయన ఏనాడు శివాలయానికి వెళ్లలేదు. శివుణ్ణి పూజించలేదు. ఎందుకంటే.. వంగపండు నాస్తికుడు. తనకు జన్మనిఇచ్చిన తల్లిదండ్రుల్నే దైవాలుగా భావించేవారు. ఆ తర్వాత కొలిచే దైవం జానపద కళ మాత్రమే. మానవత్వమే నిజమైన దైవత్వమని వంగపండు విశ్వసించారు. తోటి వారికి సాయపడే గుణమున్న ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం ఉందని ఎప్పుడు వంగపండు అనేవారు. పాటకు ప్రపంచవ్యాప్తంగా పట్టాభిషేకం... వంగపండు 400కుపైగా జానపద గీతాలు రాసారు. వాటిలో 200కు పైగా గీతాలు వంగపండుకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఆయన పాటలన్నీ గిరిజన భాషల్లోనే కాదు. దేశంలోని అనేక భాషల్లోకి అనువదించారు. ముఖ్యంగా ...ఏం పిల్లో ఎల్దమొస్తవ పాటని అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో ఇంగ్లిష్ భాషలోకి తర్జుమా చేసి మరీ పాడుకున్న చరిత్రను సొంతం చేసుకుంది. అదేవిధంగా.. జజ్జనకరి జనారే..యంత్రమెట్టా నడుస్తున్నదంటే.. మొదలైన పాటలు అన్ని వర్గాల ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. కర్షకుల కష్టాన్ని.. కార్మికుల శ్రమనీ.. పేదోడి ఆకలినీ.. గిరిజనుల దుర్గతినీ.. వలస బతకుల్నీ... మొత్తంగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని తన పాటతో ప్రపంచానికి పరిచయం చేసిన వంగపండు కీర్తి విశ్వవ్యాప్తమైంది. ఆయన మరణంతో జానపద గళం మూగబోయినా.. ఆయన స్ఫూర్తితో ఉత్తరాంధ్ర గడ్డపై పురుడు పోసుకున్న ప్రతి కలంలోనూ, గళంలోనూ వంగపండు సాహిత్యం సందడి చేస్తుంటుంది.. మోగే గజ్జెల సవ్వడిలో ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది. – సాక్షి, విశాఖపట్నం పేరు: వంగపండు ప్రసాదరావు జననం: 1943 జూన్ పుట్టిన ఊరు: విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లి తల్లిదండ్రులు: జగన్నాథం, చినతల్లి కుటుంబం: ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు (వంగపండు పెద్దవాడు) విద్యాభ్యాసం: బొబ్బిలిలో ఐటీఐ ఉద్యోగం: హిందూస్థాన్ షిప్‌యార్డులో ఫిట్టర్, ఏయూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ గౌరవ అధ్యాపకుడు సినీప్రస్థానం: అర్థరాత్రి స్వాతంత్య్రంతో ప్రారంభం జననాట్యమండలి 1972లో స్థాపించారు. పీపుల్స్‌వార్ సాంస్కృతిక విభాగంగా దీన్ని స్థాపించారు. పేరు తెచ్చిన పాటలు: ఏం పిల్లో ఎల్దమొస్తవ, జజ్జనకరి జనారే, తరమెల్లిపోతున్నాది, ఓడ నువ్వెల్లిపోకే... పేరు తెచ్చిన నత్యరూపకం: భూమిబాగోతం అవార్డులు: 2017లో ఏపీ ప్రభుత్వం తరఫున కళారత్న పురస్కారం; 2008లో బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ పురస్కారం; సుద్దాల అశోక్‌తేజ అవార్డు, నంది అవార్డు, తానా నుంచి రంగస్థల రత్న అవార్డు -
ప్రతి ఇంటి చావడిలో ఆయన నవ్వుంది
తరచి చూడాలేగాని నాలుగు సంసారాల చోటులో కూడా నవ్వు చూడొచ్చు. ఆ నవ్వుని పట్టుకుని నాలుగిళ్ల చావడి నాటికతో ప్రసిద్ధుడయ్యాడాయన. నటుడు, రచయిత, కాలమిస్ట్, జర్నలిస్ట్ రావికొండలరావు తెలుగు వారి సాంస్కృతిక పాయలో ఒక చిన్నచిర్నవ్వును నింపి మంగళవారం సెలవు తీసుకున్నారు. ఆయనకు నివాళి. ‘ప్రేమించి చూడు’లో రావి కొండలరావు అక్కినేని తండ్రి. ముక్కోపి అయిన తెలుగు మేస్టారు. అక్కినేనికి ఆ సినిమాలో పూటకు ఠికానా లేదు. ఎలాగో ఫ్రెండు జగ్గయ్య దగ్గర అప్పు చేసి ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నట్టు మనీఆర్డర్ చేస్తుంటాడు. ఆ నెల పోస్ట్‌మేన్ వస్తాడు కానీ మనీఆర్డర్ తేడు. తెలుగు మేస్టారుకు చిర్రెత్తుకొస్తుంది. ‘మనీఆర్డర్ ఏదోయ్’ అంటాడు. ‘రాలేదండీ’ అంటాడు పోస్ట్‌మేన్ భయంగా. ‘రాకపోయినా తెచ్చివ్వాలి. వచ్చాక తెస్తే నీ గొప్పతనం ఏముంది బోడి’ అని బెదరగొడతాడు. హాల్లో అందరూ నవ్వుతారు. రావి కొండలరావు అలా నవ్విస్తూ తెలుగువారి నవ్వులో ఒక భాగం అయ్యారు. ‘సామర్లకోట’ అంటే ఎస్.వి.రంగారావు గుర్తుకొస్తారు. రావి కొండలరావుది కూడా ఆ ఊరే. కాని బాల్యం శ్రీకాకుళంలో గడిచింది. వాళ్ల నాన్న పోస్ట్‌మాస్టర్ కనుక ఏ మెయిల్ అయినా చేతుల మీదుగా అందాలి కనుక సినిమా హాళ్ల వాళ్లు ఫ్రీగా ఫ్యామిలీని సినిమా చూడనిచ్చేవారు. రావి కొండలరావు అలా సినిమా అభిమాని అయ్యారు. ‘నా జీవితం ఇలా ఈ కొసన గడిచిపోవడానికి వీల్లేదు’ అని ఆయన పియుసి పాస్ అయిన వెంటనే నిర్ణయించుకున్నారు. మద్రాసు (ఇప్పుడు చెన్నై) నుంచి వచ్చే ‘ఆనందవాణి’ అనే పత్రికలో చిన్న ఉద్యోగం వస్తే చదివిన చదువు చాల్లే అనుకుని వెళ్లిపోయారు. ‘ఆనందవాణి’ పత్రికలో ఉద్యోగం ఉంది కాని జీతం లేదు. ‘ఇస్తాం ఇస్తాం’ అనే ఆ రాని జీతం కోసం ఎదురు చూసి చూసి మానేశాడాయన. అప్పుడే పరిచయం అయిన ముళ్లపూడి వెంకటరమణ అతన్ని ఇంటికి తీసుకువెళ్లి తన వద్దే ఉంచుకుని భోజనం పెట్టారు. రావి కొండలరావు చిన్నప్పుడే నాటకాలు వేశారు. ‘తెలుగు మేస్టారు’ అనే కేరెక్టరు ఆయన తయారు చేసుకున్నారు. ఎవరినైనా గద్దించి ఎవరిలోనైనా లోపం వెతికి సరి చేసే ముక్కోపి ఈ తెలుగు మేస్టారు. రూళ్లకర్రలో కూడా వంకలు వెతగ్గలడు. ఏదో ఒకటి చేసి ఎలాగోలా బతుకుదాం అనుకుంటున్న రావి కొండలరావు నటుడిగానే మద్రాసు మహానగరంలో మెరుగ్గా బతగ్గలరని కనిపెట్టినవాడు ముళ్లపూడి. బి.ఎన్.రెడ్డి దగ్గర ‘పూజాఫలం’ సినిమాకి, కమలాకర కామేశ్వరరావు దగ్గర ‘నర్తనశాల’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన రావి కొండలరావును ‘మీరు నటుడిగా ప్రయత్నించండి’అని ‘దాగుడుమూతలు’ సినిమా కోసం ఓ పాత్ర రాసి ఆ పాత్ర ఆయనకొచ్చేలా చేశారు ముళ్లపూడి. రావికొండలరావు దర్శకుడు బాపు గారికి కూడా నచ్చారు. వారిదో స్నేహత్రయం. బాపూ తనకు బుద్ధిపుట్టినప్పుడల్లా ‘ఏదీ, ఆ తెలుగు మేష్టారు ఓసారి చేయండ’ని అడిగేవారట. రావికొండలరావు తొలి తెలుగు సినిమా జర్నలిస్టులలో ఒకరు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక వారానికి ఒకసారి సినిమా పేజీ తేవాలని నిర్ణయించినప్పుడు ఆ పేజీ మొత్తం వార్తలను చెన్నై నుంచి పంపి అందుకు పారితోషికంగా పదిహేను రూపాయలు పొందేవాడాయన. ఐదువారాలకు 75 రూపాయలు ముట్టేవి. ఈ అనుభవంతో పాటు ‘చందమామ’ పత్రికలో పని చేయడం వల్ల ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావుతో పరిచయం పొంది ఆయన సిఫార్సు మేరకు ‘విజయచిత్ర’ మాసపత్రికకు ఎడిటర్ అయ్యారు. ‘మంచి మాత్రమే చెప్తాం. చెడు ఉన్నా చెప్పం’ అనే పాలసీ తో ఆరోగ్యకరమైన సినిమా వార్తలతో ఈ పత్రిక మూడో సంచికతోనే లక్ష కాపీల సర్క్యులేషన్‌కు వెళ్లింది. ఆ పత్రికకు ఆయన 26 ఏళ్లు ఎడిటర్‌గా పని చేశారు. సినిమాల్లో నటిస్తూనే ఆ ఉద్యోగం చేయడం వల్ల డెడ్‌లైన్‌ను అందుకోవడానికి షూటింగ్ నుంచి వచ్చి విగ్గుతోనే ఫ్రూఫులు చూసిన రోజులు ఉన్నాయని చెప్పుకున్నారు. ‘ప్రతిభ కంటే ప్రవర్తన ముఖ్యం’ అని నమ్మిన రావి కొండలరావు తన ప్రవర్తన వల్లే సినిమా రంగంలో సుదీర్ఘకాలం మనగలిగానని చెప్పుకున్నారు. ఎన్.టి.ఆర్ ఆయనను మెచ్చి ‘వరకట్నం’ నుంచి తన ప్రతి సొంత సినిమాలో తప్పక వేషం ఇచ్చేవారు. ఆయన రాసిన నాటకం ‘కథ కంచికి’లో రాజబాబుకు చిన్న పాత్ర ఇచ్చి ప్రోత్సహించడంతో ఆ పాత్ర కె.వి.రెడ్డి దృష్టిలో పడి రాజబాబు కెరీర్‌కు రాజమార్గం వేసింది. ఆయన రాసిన ‘నాలుగిళ్ల చావడి’,‘కుక్కపిల్ల దొరికింది’, ‘ప్రొఫెసర్ పరబ్రహ్మం’... నాటికలు తెలుగు నేలంతా విజయయాత్ర చేశాయి. మలినం, శ్లేష, వికారం లేని హాస్యం ఉన్న రచనలు అవి. ‘స్త్రీ పాత్ర రాస్తే పాతిక రూపాయలు పారితోషికం ఇవ్వాల్సి వస్తుందని మగపాత్రలతోనే నాటికలు రాశాను. రాధాకుమారిని వివాహం చేసుకున్నాక ఆమె చేస్తుందనే ధైర్యంతో స్త్రీ పాత్ర నాటికలు రాశాను’ అని చెప్పాడాయన. రాధాకుమారి, రావికొండలరావు నిజ జీవితంలోనే కాక సినీ తెర మీద కూడా వందకు పైగా సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. ఇలా నటించడం ఒక రికార్డు కావచ్చు. రావికొండలరావు రాసిన కథ బాపూరమణ లు ‘పెళ్లి పుస్తకం’గా తీస్తే దానికి మూడు నంది పురస్కారాలు దక్కాయి. విజయ సంస్థ తిరిగి సినిమా నిర్మాణంలోకి వచ్చినప్పుడు ఆ సంస్థ తరఫున సమస్త బాధ్యతలు నిర్వహించారాయన. ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాలు ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకున్నాయి. ‘భైరవద్వీపం’ సినిమాకు కథ, మాటలు రావి కొండలరావు రాశారు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాక ఆయన ఊరికే కూర్చోకుండా కామెడీ క్లబ్ నిర్వహణ చేస్తూ హాస్యం పంచారు. సినిమా జ్ఞాపకాలను ‘హ్యూమరథం’,‘బ్లాక్ అండ్ వైట్’ పేరుతో పుస్తకాలుగా వెలువరించారు. ‘మాయాబజార్’ సినిమాను నవలగా రాశారు. ‘నాగావళి నుంచి మంజీర వరకు’ ఆయన ఆత్మకథ. రావికొండలరావు కథలు కూడా పఠనీయమైనవి. ‘నేను అరవై ఏళ్లు సినిమా పరిశ్రమలో పని చేశాను’ అని చెప్పుకున్నాడాయన. ఆరు దశాబ్దాల ఆయన కృషి బహుముఖీనమైనది. విశాలమైనది. అలసట, బద్దకం ఎరగనిది. డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను నమ్ముకున్నది. కరోనా తెచ్చిన దేవుడిని నాలుగు చీవాట్లు పెట్టడానికి తెలుగు మేష్టారుగా ఆయన అమరపురిని చేరుకున్నాడు. ఆయనకు హాస్యశాంతి కలుగుగాక. – కె ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ సంతాపం.. బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడిగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నటించిన రావి కొండలరావు తెలుగు సినీ ప్రేక్షకులకు శాశ్వతంగా గుర్తుండిపోతారన్నారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయినట్లయిందని సీఎం జగన్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీనియర్ నటుడు, రచయిత, నాటక రంగ కళాకారుడు రావి కొండలరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తన కాలానికి చెందిన గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొండలరావు అని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ఇకలేరు ప్రముఖ తెలుగు సినీ నటులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి రావికొండలరావు (88) మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నటుడిగా సినీ రంగానికి ఆయన చేసిన కృషి మరువలేనిది. సుమారు 600కు పైగా సినిమాల్లో నటించారాయన. ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి సీనియర్ నటుల నుంచి ఇప్పటి నటీనటులతోనూ కలసి నటించారాయన. 1932, ఫిబ్రవరి 11న శ్రీకాకుళం లో జన్మించారు రావికొండలరావు. బాల్యంలోనే నాటికలు, సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. అదే ఆయన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది. 1958లో వచ్చిన ‘శోభ’ సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు రావికొండలరావు. ‘రాముడు భీముడు’, ‘తేనె మనసులు’, ‘ప్రేమించి చూడు’, ‘ఆలీ బాబా 40 దొంగలు’, ‘అందాల రాముడు’, ‘దసరా బుల్లోడు’ వంటి పాపులర్ సినిమాల్లో కనిపించారాయన. రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘365 డేస్’ ఆయన ఆఖరి చిత్రం అనొచ్చు. సినిమాల్లోకి రాకముందు ఆనందవాణి, వనిత,జ్యోతి, విజయ చిత్ర వంటి పత్రికల్లో పని చేశారు. సినిమా మీద లెక్కలేనన్ని వ్యాసాలు, కొన్ని పుస్తకాలు రాశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు సంభాషణలు సమకూర్చారు. ‘పెళ్లి పుస్తకం’, ‘భైరవద్వీపం’ వంటి చిత్రాలకు కథను అందించారాయన. రావి కొండలరావు భార్య రాధాకుమారి కూడా సినిమా యాక్టరే. 2012లో రాధాకుమారి మరణించారు. వీరికి ఒక కుమారుడు (రావి వెంకట శశికుమార్) ఉన్నారు. రావి కొండలరావు మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. -
బ్యాలెన్స్ నిల్
గోల్డ్ మెడల్‌కు రెండే సెకన్ల దూరం. ద్యుతీ చంద్ రీచ్ అవుతుందా? ఇరవై ఐదు లక్షలుంటే అవుతుంది. ఒలింపిక్స్శిక్షణకు ఆ డబ్బు. రెండేళ్ల క్రితమే కదా మూడు కోట్లు వచ్చింది! కోట్లు చూసుకొనుంటే బాగానే ఉండేది. లాక్డౌన్లో పస్తుల్ని చూసింది. కాలే కడుపుల్ని... తన బ్యాంక్ బ్యాలెన్స్‌తో నింపింది. రెండేళ్ల క్రితం ఇరవై రెండేళ్ల వయసులో ద్యుతీ చంద్ కోటీశ్వరురాలు. రెండేళ్ల తర్వాత ఇరవై నాలుగేళ్ల వయసులో ఇప్పుడు ఆమె నిరుపేద! నిరుపేద అంటే తిండికి లేకపోవడం కాదు. ఒలింపిక్స్‌కు శిక్షణ తీసుకోడానికి 25 లక్షల రూపాయలు లేకపోవడం. నాలుగేళ్ల క్రితం రియోలో ఆమె పరుగు మొదటి రౌండ్‌తోనే ఆగిపోయింది. అప్పట్నుంచీ పంతం ఆమెను దహించి వేస్తోంది. అయితే కరోనా లాక్డౌన్లో పూట గడవని వాళ్ల ఆకలితో పోలిస్తే, తన పతకం పెద్దపులేం కాదని ద్యుతీ అనుకున్నట్లుంది. వారి కోసం తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్నీ ఖర్చుపెట్టేసింది. కరోనా రాకుండా ఉంటే, ఈ ఏడాది జరగవలసిన టోక్యో ఒలింపిక్స్ జరిగి ఉంటే ఆమె పంతం నెగ్గి, పతకం సాధించుకుని వచ్చేది కావచ్చు. టోక్యోలో ఈ ఏడాది వాయిదా పడిన ఒలింపిక్స్ వచ్చే ఏడాది జూలైలో జరుగుతున్నాయి. ద్యుతీ స్టార్ స్ప్రింటర్. వంద మీటర్లు, రెండొందల మీటర్ల పరుగు పందెంలో బరిలోకి దిగేందుకు ప్రస్తుతం ఆమె తన సొంత రాష్ట్రమైన ఒడిశాలోని భువనేశ్వర్‌లో కఠినమైన సాధనే చేస్తోంది. ఆమె కోచ్ రమేశ్ హైదరాబాద్ నుంచి ఆమె సాధనలోని పురోగతిని ఆన్లైన్లోనే పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు ఇస్తున్నారు. వంద మీటర్ల పరుగులో ఇప్పటి వరకు ద్యుతీ రికార్డు 11.22 సెకన్లు, 200 మీ.లో 23.17 సెకన్లు. ఫేస్బుక్లో ద్యుతీ అమ్మకానికి పెట్టిన కారు. తర్వాత ఆ పోస్టును ద్యుతీ తొలగించింది వచ్చే టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె స్వర్ణ పతకం సాధించాలంటే.. 2016 రియోలో ఈ రెండు ఈవెంట్లలో గోల్డ్ మెడల్ గెలుచుకున్న జమైకా ఉమన్ స్ప్రింటర్ ఎలైన్ థాంప్సన్‌ను దాటిపోయేలా అయినా టైమ్‌ని గ్రిప్‌లోకి తీసుకోవాలి. ఎలైన్ 10.71, 21.78 సెకన్లలో రెండు బంగారు పతకాలు సాధించింది. ఎలైన్ గోల్డ్‌కి, ద్యుతీ గోల్డ్ లక్ష్యానికి మధ్య వ్యత్యాసం కేవలం 0.51, 1.39 సెకన్లు మాత్రమే. ఆ సమయాన్ని తగ్గించడానికే ఇప్పుడు ద్యుతీకి 25 లక్షల రూపాయలు కావాలి. జర్మనీలో శిక్షణ తీసుకోవాలని అనుకుంటోంది ద్యుతీ. పంజాబ్‌లోని పాటియాలాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగవలసిన ఫెడరేషన్ కప్ అథ్లెట్ మీట్ కరోనా వల్ల రద్దయిన తర్వాత ప్రాక్టీస్ కోసం ద్యుతీ భువనేశ్వర్‌లోనే ఉండిపోయింది. లాక్డౌన్లో ప్రభుత్వ నుంచి అనుమతి తీసుకుని రోజంతా కళింగ స్టేడియంలోనే గడుపుతోంది. అయితే ఈ దేశీయ సాధన అంతర్జాతీయ పోటీలకు సరిపోదు. అందుకే విదేశాలకు వెళ్లడం కోసం తన లగ్జరీ సెడాన్ బి.ఎం.డబ్లు్య. కారుని ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టింది. అందుకు తనేమీ సంశయించలేదు. స్పాన్సరర్లు ఎవరూ ముందుకు రావడంలేదు మరి. శిక్షణ కోసం తను ఏ దేశానికి వెళ్లవలసిందీ సూచించేది చివరికి ‘అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’నే అయినప్పటికీ ద్యుతీ మాత్రం జర్మనీని ఒక ఎంపికగా పెట్టుకుంది. అయితే ఫేస్బుక్లో కారును అమ్ముతున్నట్లు పోస్టు పెట్టగానే ‘ఆ అమ్మాయికి సహాయం చేయండి’ అని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కామెంట్లు మొదలవడంతో ద్యుతీ ఆ పోస్టును తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా ఒకటొకటిగా ఆటలు మొదలవుతున్నాయి. యూరప్‌లో ఫుట్‌బాల్, క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఇండియాలో కూడా సెప్టెంబరు నాటికి క్రీడా కార్యకలాపాలు ప్రారంభం కావచ్చనీ, అప్పటికి స్పాన్సరర్లు కూడా దొరికితే దొరకొచ్చనీ ద్యుతీ ఆశిస్తోంది. యవ్వనంలోనే కోట్ల డబ్బును చూసిన ఈ అమ్మాయి.. యవ్వనంలోనే మళ్లీ ఇప్పుడు డబ్బు కోసం చూస్తోంది. ఏమైంది అంత డబ్బు?! 2018లో జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో రెండు రజిత పతకాలు సాధించినందుకు ఒడిశా ప్రభుత్వం ద్యుతీకి 3 కోట్ల రూపాయల నజరానా ఇచ్చింది. పేద చేనేత కుటుంబంలోని అమ్మాయి ద్యుతీ. ఆ డబ్బుతో ఆమె సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంది. తల్లిదండ్రుల అప్పులు తీర్చింది. కారు కొనుక్కుంది. కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుంది. జాగ్రత్త పడలేదని మనం అనొచ్చు. ఎదురుగా పస్తులు ఉంటున్న వారిని చూస్తున్న కళ్లకు.. బ్యాంకులోని బ్యాలెన్స్‌ని భద్రంగా చూసుకోడానికి మనసొప్పుతుందా? ఏషియన్స్ గేమ్స్‌లో ద్యుతీ సిల్వర్ మెడల్ సాధించినప్పటి చిత్రం -
సరోజ్ ఖాన్ జీవితంతో సినిమా
ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు రెమో డిసౌజా దర్శకత్వం వహించ నున్నారు. ఈ నెల 3న సరోజ్ ఖాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తల్లి బయోపిక్ గురించి ఆమె కుమార్తె సుకైనా నాగ్‌పాల్ ధృవీకరించారు. ‘‘మా అమ్మ మరణానంతరం బయోపిక్ చేస్తామని చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు. ‘మీ బయోపిక్ తీయాలనుకుంటే ఎవరికి అవకాశం ఇస్తారు?’ అని అమ్మను గతంలో ఒకసారి అడిగాను. అప్పుడు అమ్మ చెప్పిన సమాధానం రెమో డిసౌజా. ‘ఓ డ్యాన్స్ మాస్టర్‌గా అతను నా ప్రయాణాన్ని అర్థం చేసుకోగలడు. తను కింది స్థాయి నుంచి పెద్ద దర్శకునిగా ఎదిగాడు’ అని రెమో గురించి అమ్మ చెప్పేవారు. ఆమె బయోపిక్ తీసేందుకు రెమో డిసౌజానే తొలుత మమ్మల్ని సంప్రదిం చారు కూడా. అందుకే అమ్మ బయోపిక్ ఆయన తెరకెక్కిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం’’ అన్నారు సుకైనా. -
సినీ మువ్వల సివంగి
‘ఏక్ దో తీన్.. చార్ పాంచ్ ఛే సాత్’.... ‘తేజాబ్’కు ఆ పాట కలెక్షన్ల వరద సృష్టించింది. ‘కాటే నహి కట్ తే ఏ దిన్ ఏ రాత్’... ‘మిస్టర్ ఇండియా’ ఈ పాటతో శ్రీదేవిని టాప్ చైర్ మీద కూచోబెట్టింది. ‘నింబొడ నింబొడ నింబొడ’... ఏంటి.. ఐశ్వర్యా రాయ్ ఇంత బాగా డాన్స్ చేస్తుందా అనిపించింది. ‘ఏ కాలే కాలే ఆంఖే’... షారూక్‌ఖాన్ ఆమె ఆడమన్నట్టు ఆడాడు. ‘రాధా క్యూ న జలే’ ఆమిర్‌ఖాన్ ఆమె చెప్పినట్టు గెంతాడు. సరోజ్ ఖాన్. బాలీవుడ్‌ను సుదీర్ఘకాలం ఏలిన ఏకైక మహిళా కొరియోగ్రాఫర్. ప్రభుదేవా, లారెన్స్, ఫర్హా ఖాన్ల జేజమ్మ. మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ ఇన్ ఇండియా. సరోజ్ ఖాన్‌కు మూడేళ్ల వయసున్నప్పుడు గోడ మీద తన నీడను చూస్తూ డాన్స్ చేసేది. తల్లి అది చూసి భయపడింది. కూతురు పుట్టిందనుకుంటే పిచ్చి పిల్ల పుట్టిందేమిటా అని ఆఘమేఘాల మీద డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ‘ఇది పిచ్చేగాని డాన్స్ పిచ్చి. మీ పాపను చైల్డ్ ఆర్డిస్టును చేయండి. ఎలాగూ మీకు డబ్బులు అవసరం కదా’ అన్నాడు తెలిసిన డాక్టరు. అప్పటికి ముంబైలో నిరుపేద చాల్లో ఉంటున్న ఆ కుటుంబంలోని వారికి ఈ మాటలు నచ్చాయి. సరోజ్ ఖాన్‌కు ఐదారేళ్లు వచ్చేటప్పటికి చైల్డ్ ఆర్టిస్టును చేశారు. నాలుగైదు సినిమాలు చేసింది. ఆ తర్వాత వేషాలు రాలేదు. సరోజ్ ఖాన్‌కు పదేళ్లు వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. తన తర్వాత ఇంకా నలుగురు తోబుట్టువులున్నారు. తల్లికి ఏమీ తెలియదు. కుటుంబాన్ని తనే నిలబెట్టాలి. సరోజ్ ఖాన్ గ్రూప్ డాన్సర్ అయ్యింది. హీరో హీరోయిన్ల వెనుక పరిగెత్తే పది మందిలో ఒకత్తి అయ్యింది. తిండికి ఎలాగో గడుస్తుంది. కాని ఇది చాలదు. ‘ఏక్ దో తీన్’ పాటలో మాధురీ దీక్షిత్ గురు పరిచయం అప్పటికి డాన్స్ మాస్టర్ బి.సోహన్‌లాల్ (సుప్రసిద్ధ డాన్స్ మాస్టర్ హీరాలాల్ పెద్దన్న) మద్రాసు (చెన్నై)లో పని చేస్తూ అప్పుడప్పుడు బాంబే (ముంబై) వచ్చి పాటలు చేసేవాడు. అతను గ్రూప్డాన్సర్స్లో చురుగ్గా ఉంటున్న సరోజ్ ఖాన్‌ను గమనించాడు. ఒకరోజు సెట్లో సరోజ్ ఖాన్ హెలెన్‌ను అనుకరిస్తూ స్టెప్స్ వేస్తుంటే ‘ఏదీ మొత్తం పాటకు చేసి చూపించు’ అని అడిగాడు. సరోజ్ ఖాన్ తొణక్కుండా అచ్చు హెలెన్లాగే డాన్స్ చేసి చూపించింది. అప్పటి దాకా సోహన్లాల్కు అసిస్టెంట్లు లేరు. పదమూడేళ్ల వయసున్న సరోజ్ ఖాన్‌ను అతడు అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు. ఆయనే ఆమెను తీర్చిదిద్దాడు. సోహన్‌లాల్ యూరప్‌కు షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ఆయన చేయాల్సిన పాటను 13 ఏళ్ల వయసులో సరోజ్ కొరియోగ్రాఫ్ చేసింది. ఆ సినిమా ‘దిల్ హి తో హై’ (1963). అందులో రాజ్ కపూర్ హీరో. నూతన్ హీరోయిన్. వాళ్లిద్దరి మీద పాట– ‘నిగాహే మిలానే కో జీ చాహ్ తాహై’. కాని సరోజ్ ఖాన్ తొట్రు పడలేదు. చేసింది. ప్రయాణం మొదలైంది. ధక్ ధక్ కర్నే లగా’లో మాధురీ, అనిల్‌కపూర్ మగ ప్రపంచం సినిమా ప్రపంచం అంటే మగ ప్రపంచం. మగవారు పెత్తనం చేసే ప్రపంచం. సరోజ్ ఖాన్‌కు ఎంత ప్రతిభ ఉన్నా ఎంత బాగా పాటలు చేస్తున్నా గుర్తింపు ఇచ్చేవారు కాదు. అసలు టైటిల్స్‌లో పేరే ఉండేది కాదు. ఒకసారి షూటింగ్లో ఉంటే సీనియర్ నటుడు అశోక్ కుమార్ ఆమెను గమనించి పిలిచాడు. ‘నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కదా. నీ పేరు స్క్రీన్ మీద ఎందుకు వేయరు?’ అని అడిగాడు. సరోజ్ ఖాన్ మౌనంగా ఉండిపోయింది. సరే.. ఈ సినిమాలో నీ పేరు వేయిస్తాను అని చెప్పి వేయించాడు. అలా ‘ఇంక్విలాబ్ కీ ఆగ్’ అనే సినిమాలో సరోజ్ ఖాన్ పేరు మొదటిసారిగా పడింది. కాని అప్పటికీ గుర్తింపు రాలేదు. సుభాష్ ఘాయ్ ‘హీరో’ (1983) సినిమాలో సరోజ్ ఖాన్‌ను కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నాడు. ‘హీరో’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సుభాష్ ఘాయ్ తీసుకున్నాడంటే ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది అని మిగిలిన నిర్మాత, దర్శకులు అనుకుని ఆమెను పిలవడం మొదలెట్టారు. టాలెంట్ ఎప్పటి నుంచో ఉంది. సుభాష్ ఘాయ్ లైట్ వేశాడంతే. ‘డోలారే డోలారే’లో మాధురీ, ఐశ్వర్యరాయ్ ఏక్.. దో... తీన్... ఎన్.చంద్ర ‘తేజాబ్’ (1988) తీశాడు. అందులో మాధురి దీక్షిత్ అనే కొత్త హీరోయిన్ని తీసుకున్నాడు. ఆమెకు ఒక మంచి పాట పెట్టాడు. ‘ఈ పాట వస్తున్నప్పుడు ప్రేక్షకులు సీట్లలో ఉండకూడదు. అంతే మీకు నేను చెప్పేది’ అన్నాడు సరోజ్‌ఖాన్‌తో. సరోజ్ ఖాన్ ఈ పాటను ఛాలెంజింగ్‌గా తీసుకుంది. మాధురి దీక్షిత్‌కు ఉన్న డాన్స్ టాలెంట్‌ను ఉపయోగించుకుంది. ‘ఏక్.. దో... తీన్.. చార్.. పాంచ్’... పాటను అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసింది. జనం సినిమా కోసం ఒకసారి, ఈ పాట కోసం ఒకసారి థియేటర్లకు వచ్చారు. మాధురి దీక్షిత్ రాత్రికి రాత్రి సూపర్‌స్టార్ అయ్యింది. ఫిల్మ్‌ఫేర్ వాళ్లు అప్పటివరకు కొరియోగ్రాఫర్‌కు అవార్డ్ పెట్టనేలేదు. ఈ సినిమా వచ్చాక ఆ అవార్డును ఇంట్రడ్యూస్ చేసి సగౌరవంగా సరోజ్ ఖాన్‌కు తొలి అవార్డు ఇప్పించారు. సరోజ్ ఖాన్ దేశంలోని సినిమా ఇండస్ట్రీలన్నీ తలెత్తి చూసే కొరియోగ్రాఫర్ అయ్యిందిప్పుడు. హిట్ల వరుస సరోజ్ ఖాన్ అక్షరాభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దేహ కవళికలతో పాటు ముఖ కవళికలు కూడా ముఖ్యం. వాటికోసం నటీ నటులను సానపెడుతుంది. అందుకే ఆ పాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. హిందీలో శ్రీదేవి సరైన హిట్ కోసం చూస్తున్నప్పుడు ‘మిస్టర్ ఇండియాలో’ నీలిరంగు చీర కట్టుకుని ఆమె వేసిన ‘కాటే నహి కట్ తే ఏ దిన్ ఏ రాత్’ పాట స్టెప్పులు ఆమెకు భారీ ఎట్రాక్షన్‌ను తీసుకొచ్చాయి. అదే సినిమాలోని ‘హవా హవాయి’ కూడా శ్రీదేవి మరణించే వరకు ప్రస్తావనకు వస్తూనే ఉండేది. వీటిని చేయించింది సరోజ్ ఖాన్. ‘చాందినీ’లో శ్రీదేవి చేసిన ‘మేరే హాతో మే నౌనౌ చూడియా’ పాట ఆ ఇద్దరికీ పేరు తెచ్చింది. ఇక మాధురి దీక్షిత్‌తో సరోజ్ ఖాన్ హిట్స్‌కు లెక్కే లేదు. ‘బేటా’లో ‘ధక్ ధక్ కర్ నే లగా’, ఖల్ నాయక్‌లో ‘చోళీ కే పీఛే క్యా హై’, యారానాలో ‘మేరా పియా ఘర్ ఆయా’... చాలా పెద్ద హిట్లు. ఇక సంజయ్ లీలా బన్సాలీ తీసిన ‘దేవదాస్’లో ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్ చేసిన ‘డోల రే డోలరే’ పాట సరోజ్ ఖాన్ ప్రతిభకు పతాక. శ్రీదేవితో... జాతీయ పురస్కారం సరోజ్ ఖాన్ అంటే ఎద విరుపులు, కటి కుదుపులు అనుకునే వారు కొందరు ఉండొచ్చు. కాని ఆమె తనకు వచ్చిన అవకాశాన్ని గౌరవించడమే తెలిసిన ప్రతిభాశాలి. దానికి నూరుశాతం న్యాయం చేయడం బాధ్యత అనుకుంటుంది. అయితే తమిళంలో వచ్చిన ‘శ్రింగారం’ (2005) అనే సినిమాకు ఆమె సమకూర్చిన భరతనాట్య నృత్యరీతులు ఆమెకు జాతీయ అవార్డును తెచ్చి పెట్టాయి. చెన్నైలోని సనాతన నృత్య సంస్థ ‘శ్రీకృష్ణ గానసభ’ ఆ సినిమాలో ఆమె చూపిన ప్రతిభను గౌరవించి మొదటిసారిగా ఒక సినిమా కొరియాగ్రాఫర్ని– సరోజ్ ఖాన్ని– పిలిచి సత్కరించుకుంది. అదీ సరోజ్ ఖాన్ ప్రతిభ. ముగింపు సరోజ్‌ఖాన్ స్థూలకాయురాలు. కాని ఆమె డాన్స్ చేయడం మొదలెడితే ఆ దేహం విల్లులా వొంగేది. ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నా ఆమె నృత్యం మానలేదు. ఆపలేదు. ఎందరో శిష్యులను సినిమా రంగానికి ఇచ్చింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మూడేళ్ల వయసు నుంచి నర్తిస్తున్న ఆమె పాదాలు 71వ ఏట శాశ్వత విశ్రాంతిని తీసుకున్నాయి. కాని భారతీయ వెండితెర మీద ఆమె వేసిన పాదముద్రలు మాత్రం బహుకాలం సజీవంగా ఉంటాయి. – సాక్షి ఫ్యామిలీ -
రాళ్లు అన్నం ముద్దల్లా ఉడికితే ఎంత బావుణ్ణు!
గర్భంతో ఉన్నప్పుడు తల్లికి ఒక కడుపే. బిడ్డ పుట్టాక రెండు కడుపులు! పిల్లలకు ఆకలైతే తల్లి ఆగలేకపోయేది అందుకే. ఏదో ఒకటి చేసి పెడుతుంది. ఎక్కడో ఒకచోట తెచ్చయినా పెడుతుంది. తల్లికీ బిడ్డలకు తెగనిబంధం.. ఆకలి పేగు! లాక్డౌన్లో ఇప్పుడు..తల్లుల కడుపుల్లోని పిల్లల పేగులు మాడిపోతున్నాయి. రాళ్లు అన్నం ముద్దల్లా ఉడికితే ఎంత బావుణ్ణు! చేసి పెట్టడానికి ఇంట్లో ఏమీ లేవు. తెచ్చి పెట్టడానికి బయట పనులేమీ లేవు. పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు. పెనీనాకు ఎనిమిది మంది పిల్లలు. పెద్దపిల్లలు కూడా ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పూటల పస్తు కాదు మరి. రోజుల పస్తు. పెనీనాకు ఏం చేయాలో తోచడం లేదు. భర్త లేడు. సాయుధులైన బందిపోట్లు ఏడాది క్రితమే అతడిని చంపేశారు. కెన్యాలో బందిపోటు ముఠాలు ఉండే హిందూ మహాసముద్రపు తీరప్రాంతం మోంబసాలో ఉంటోంది వీళ్ల కుటుంబం. భార్యని, బిడ్డల్నీ, ఇంట్లో ఉన్న కొద్దిపాటి గోధుమల్నీ రక్షించుకునే ప్రయత్నంలో బందిపోట్లతో పోరాడి వారి ఆయుధాలకు బలైపోయాడు పెనీనా భర్త. ఆయన ఉన్నప్పుడు కొంత వేరుగా ఉండేది. ఏడాదిగా పెనీనా నాలుగిళ్లలో పనిచేస్తూనే ఇంట్లో పిల్లల్నీ కనిపెట్టుకుని ఉండవలసి వస్తోంది. అటొక అడుగు. ఇటొక అడుగు. కంట్లో పిల్లల్ని పెట్టుకుని పనికి వెళుతుంది. ఇంటికి వచ్చేసరికి కడుపులో ఆకలిని పెట్టుకుని పిల్లలు ఉంటారు. ఎంత రాత్రయినా వంట చేసి పెడుతుంది. పిల్లలు నిద్రపోతుంటే లేపి తినిపిస్తుంది. కానీ కొన్నాళ్లుగా ఆమె.. పిల్లలు నిద్రపోవడం కోసమే వంట ‘చేస్తూ..’ ఉంటోంది. అది ఎంతకీ కాని వంట! లాక్‌డౌన్‌తో పెనీనా తన ఉపాధిని కోల్పోయింది. బట్టలు ఉతుకుతుంటుంది తను. ‘భౌతిక దూరం’ పాటించక తప్పదు కాబట్టి ఎవరి బట్టలు వారే ఉతుక్కుంటున్నారు. తనను కొంతకాలం వరకు రావద్దని చెప్పారు. పెనీనా ఇంటికే పరిమితం అవాల్సి వచ్చింది. చేతిలో డబ్బుల్లేవు. ఇంట్లో తిండిగింజల నిల్వలు లేవు. పిల్లలు ఆకలి అంటున్నప్పుడు నీళ్లతో చేయగలిగిన ద్రవాహారమేదో చేసి గ్లాసులలో నింపి ఇస్తోంది. నీళ్లతో ప్రయోగాలు అయిపోయి, రాళ్లతో ఆమె వంట చేస్తుండగా పొరుగున ఉండే ప్రిస్కా అనే ఆమె కంట్లో పడింది. పెనీనా మిగతా పిల్లల్లో ఇద్దరు. పెనీనాను చూసి ప్రిస్కాకు కళ్ల నీళ్లు వచ్చాయి. అవును. పెనీనా రాళ్లతో వంట చేస్తోంది! ఒక బిడ్డ ఆమె చంకలో ఉంది. మిగతా పిల్లలు అమ్మ చేస్తున్న వంట పూర్తవడం కోసం నిద్రను ఆపుకుని ఉన్నారు. ‘ఇదిగో అయిపోతోంది. తిందురు గానీ’ అని పెనీనా అంటుండటమే కానీ, ఎంతకీ అయిపోతేనా! ఎలా అయిపోతుంది? అమ్మేదో తినడానికి చేస్తోందని పిల్లల్ని నమ్మించడానికి పెనీనా పొయ్యి రాజేసింది. పొయ్యి పైన కుండను పెట్టింది. కుండలో నీళ్లు పోసింది. పిల్లలు అదంతా చూస్తూనే ఉన్నారు. వారు చూడనిది, వాళ్లకు తెలియనిది ఒక్కటే. ఆ కుండలో ఉడుకుతున్నది అన్నం కాదు, రాళ్లు అని!! ‘‘ఎందుకిలా చేశావ్’’ అంది ప్రిస్కా, పెనీనాను పక్కకు తీసుకెళ్లి గట్టిగా హత్తుకుని. ‘‘పిల్లలు నిద్రపోయేవరకు ఏదో ఒకటి చెయ్యాలిగా’’ అంది కన్నీళ్లను ఆపుకుంటూ. అప్పటికే ప్రిస్కా పెట్టిన బిస్కెట్లు అవీ తింటున్నారు పిల్లలు. ‘‘నువ్వూ తిను’’ అంది ప్రిస్కా. ‘‘వాళ్లు తింటున్నారు కదా. నా ఆకలీ తీరుతోంది’’ అంది పెనీనా సంతృప్తిగా. ప్రిస్కా చదువుకున్న అమ్మాయి. అత్యవసరంగా పెనీనా పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ తెరిచింది. మీడియాను అలెర్ట్ చేసింది. బిడ్డల ఆకలి తీర్చలేక వాళ్లను మాయచేసి నిద్రపుచ్చడానికి పెనీనా అనే ఒక తల్లి చేసిన రాళ్ల వంట గురించి తెలిసి ప్రపంచ నివ్వెరపోయింది. కెన్యాలో ఇప్పుడు ఎంతోమంది పెనీనాకు సహాయం చేసేందుకు వస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు’’ అంటోంది పెనీనా తన పిల్లలందర్నీ కడుపులోకి లాక్కుంటూ. మోంబసాలోని మిషోమొరోని ప్రాంతంలో పెనీనా ఇల్లు. ఆమె పిల్లలు. పెనీనాకు సాయం చేయడానికి వచ్చిన కెన్యన్లు. -
ఆమె సమరం
‘గంగా.. నేను మిమ్ముల మల్లా చూస్తనో లేదో.. ’ అంటూ ఏడ్చేస్తున్నాడు పోషన్న– ఇండియాలో ఉన్న తన భార్య గంగజలకు వీడియో కాల్ చేసి. ‘ఏ.. ఊకో.. గా జ్వరానికే గట్ల బేజారైతే ఎట్ల? ఏంగాదు’ భర్తకు ధైర్యం చెప్తోంది గంగజల. ‘లేదే.. కుడి షెయ్యి లేస్తలేదు.. చూష్నవ్ కదా.. ఏం మింగస్తలేదు.. మాట సూత సక్కగొస్త...’ అంటూండగానే అతని మాట పడిపోయింది. ఏదో చెప్పబోతున్నాడు.. గొంతు పెగలట్లేదు. దుఃఖం వస్తోంది అతనికి. ఏడుస్తున్నాడు. దుబాయ్‌లోని వర్కర్స్ క్యాంప్ గదిలో తన భర్త పడ్తున్న అవస్థ ఇండియాలో ఉన్న గంగజలకు భయం పుట్టించింది. అయితే ధైర్యం కోల్పోలేదు ఆమె. వెంటనే దుబాయ్‌లోనే ఉన్న గల్ఫ్ గ్రూప్ సేవా సమితి సభ్యులకు వాట్సప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టింది. ఆ గ్రూప్ ద్వారా పోషన్నకు పని ఇప్పించిన ‘స్టార్ సర్వీస్ ఎల్ఎల్సి’ సిబ్బంది మీద ఒత్తిడి పెట్టించింది. ‘పోషన్నను ఆసుపత్రిలో చేర్పించండి లేదంటే వీసా ఇప్పించి ఇండియాకైనా పంపించండి’ అని వొత్తిడి తెచ్చింది. తప్పించుకోలేక పోషన్నను ఆసుపత్రిలో చేర్పించారు ఆ ఉద్యోగనియామక ఏజెన్సీ సిబ్బంది. దీనికి ముందు సంగతి కొక్కెరకాని పోషన్న ఉరఫ్ కొక్కెని పోషన్న యేడాదిన్నర కిందట దుబాయ్‌కి వెళ్లాడు. వీసాకోసం స్థానిక సబ్ ఏజెంట్, జగిత్యాల్లో ఉన్న లైసెన్స్డ్ గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెంట్ (గల్ఫ్‌లో ఉపాధి చూపించేందుకు కేంద్రప్రభుత్వం ద్వారా అనుమతిపత్రం పొందిన ఏజెంట్)కి దాదాపు 70 వేల రూపాయలు చెల్లించాడు. స్టార్ సర్వీస్ ఎల్ఎల్సీ అనే దుబాయ్ ఏజెన్సీ ద్వారా అక్కడ పోషన్నకు పని ఇప్పించారు ఇక్కడి ఏజెంట్లు. ఇచ్చిన పని చేసుకుంటూ పోతున్న పోషన్నకు ఒకరోజు జ్వరంతో మొదలైన అనారోగ్యం పక్షవాతానికి దారితీసింది. తను పనిచేస్తున్న కంపెనీ తరపున పోషన్నకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఆ సంస్థగాని, ఉద్యోగం చూపించిన ఏజెన్సీగాని పట్టించుకోలేదు. పోషన్నకు బీపీ ఎక్కువై, సరైన సమయంలో వైద్యం అందక కుడి చేయి అచేతనమైంది. ఆ తర్వాత మాటా పడిపోయింది. బీమా లేకే నిజానికి పోషన్నకు దొరికింది వర్క్ వీసా కాదు. విజిట్ వీసా. దీనివల్లే అక్కడ కంపెనీ అతనికి ఇన్సూరెన్స్, హెల్త్‌కార్డ్ రెండూ ఇవ్వలేదు. ఫలితంగా పోషన్న అనారోగ్యం పక్షవాతం దాకా పోయింది. దీనికంతటికీ కారకులు.. పోషన్నను దుబాయ్‌కి పంపిన ఏజెంట్లే. వాళ్లు అతనికి వర్క్ వీసా కాకుండా విజిట్ వీసా ఇవ్వడం వల్ల వలస కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే ‘ప్రవాస భారతీయ బీమా’ పథకం వర్తించలేదు. రెండేళ్లకు కలిసి 325 రూపాయల ప్రీమియం చెల్లిస్తే వలస వెళ్లినచోట ఏదైనా ప్రమాదం జరిగినా, అంగవైకల్యం సంభవించినా పదిలక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. పోషన్నలా అనారోగ్యం కలిగితే లక్ష రూపాయలతోపాటు, స్వదేశం రావడానికి ఎయిర్ టికెట్టూ దొరుకుతుంది. ఈ విషయం పోషన్నకు, గంగ జలకు తెలియక చాలా నష్టపోయింది ఆ కుటుంబం. ఏజెంట్లు తమకు చేసిన అన్యాయం మీద కడుపు మండింది ఆమెకు. పోరాటం షురూ తన భర్తకు వీసా ఇప్పించిన ఏజెంట్‌ను నిలదీసింది గంగజల. ‘విజిట్ వీసాకు బీమా ఉండదు’ అని చెప్పాడు. ‘పనికోసం దరఖాస్తు పెట్టుకుంటే విజిటింగ్ వీసా ఎలా ఇచ్చారు?’ అని ప్రశ్నించింది. మోసానికి పాల్పడినందుకు బీమా కింద వచ్చే లక్షరూపాయలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసింది. ఈ విషయమై కలెక్టర్, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ (హైదరాబాద్, ఢిల్లీ)కూ దరఖాస్తు చేసుకుంది. విచారణకు ఆదేశమిచ్చారు జిల్లా కలెక్టర్. ఇది తెలిసి ఎంతోకొంత డబ్బిచ్చి పక్కకు తప్పుకోవాలనుకున్నాడు ఏజెంట్. ఒప్పుకోని గంగజల.. ‘ఇంటర్ వరకు చదువుకున్న నాకే మోసం జరిగితే అసలు అక్షరం ముక్క తెల్వకుండా గల్ఫ్‌కు పోతున్న ఎంతమందికి ఇంకెంత మోసం జర్గుతుండచ్చు? మా ఆయన మంచంల పడేదాకా ఈ పాలసీ గురించి తెల్వకపోయే. నా అసుంటోళ్లు ఇంకెంతమంది ఉన్నరో? గందుకే కొట్లాడుతున్నా. ఈ కొట్లాటతోని వేరోళ్లకన్నా తెలివస్తది.. తెలుసుకుంటరు. ఇందుకోసం అవసరమనుకుంటే ఢిల్లీకీ వోతా’ అంటోంది గంగజల. – సరస్వతి రమ ఈ మోసం ఎంత కాలం? జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, జైన గ్రామంలో ఉండే గంగజల ఇంటర్ చదివింది. ఆపై చదివించే స్థోమత లేని ఆమె కుటుంబం అప్పటికే దుబాయ్ వెళ్లొచ్చిన పోషన్నకు ఇచ్చి పెళి ్లచేసింది. పెళ్లయిన యేడాదిన్నరకే పిల్లాడు పుట్టాడు. పెళ్లి, భార్య డెలివరీకి అయిన అప్పులు, ఊర్లో పనీ దొరక్క మళ్లీ గల్ఫ్‌కు వెళ్లాలనుకున్నాడు పోషన్న. తన బంగారం అమ్మి లక్షాయాభైవేల రూపాయలు భర్తకు ఇచ్చింది గంగజల. ఇరాక్‌కు వీసా ఇప్పిస్తానని ఆ డబ్బు తీసుకున్న ఏజెంట్ పారిపోయాడు. కొన్నాళ్లాగి గల్ఫ్ కోసం మళ్లీ ప్రయత్నించిన పోషన్నకు ఈసారి దుబాయ్‌కి వీసా దొరకడంతో దుబాయ్‌కు వెళ్లాడు. ఈ రకమైన మోసానికి గురయ్యాడు. -
చీకటి దారిలో వెలుగు పాట
అమ్మానాన్నలు లేక అనాథగా మిగిలినా.. రెండు కళ్లు శాశ్వతంగా చీకటిమయమైనా బతుకుపోరులో వెలుగు దారులు వెతుక్కుంటూ ముందుకుసాగుతున్నాడు. అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదనే నిరాశవాదులకు మిట్టపల్లి శ్రీనివాస్ జీవితం ఒక దిశా నిర్ధేశం చేస్తుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లెకు చెందిన గాయకుడు మిట్టపల్లి శ్రీనివాస్. తూర్పున సూర్యుడు ఉదయించినా.. తనకు మాత్రం బతుకంతా చీకటే. బాల్యంలోనే అమ్మానాన్నల మరణం అతడిని ఒంటరిని చేసింది. కష్టాలు నీడలా వెన్నంటి ఉన్నా.. కళ్లులేని చీకటి బతుకు వద్దని ఏనాడు అనుకోలేదు అతడు. బతుకు దారిలో వెలుగు రాదనీ తెలిసినా.. తన గాత్రంతో లోకాన్ని చూడాలనే సంకల్పం తనను ముందుకు నడిపిస్తోందంటున్నాడు మిట్టపల్లి శ్రీనివాస్. మట్టి వినాయకుల తయారీ.. అనాథగా మిగిలి ఒంటిరిగా అద్దె ఇంట్లో ఉంటూ తన కాళ్ల మీద తాను నిలబడుతున్నాడు. ఇంటి పనులతోపాటు బట్టలు ఉత్కుకోవడం దగ్గరి నుంచి అన్నం, కూర వండుకుని తినడం వంటి అన్ని పనులు తానే స్వయంగా చేసుకుంటాడు. చిన్నతనం నుంచే పర్యావరణాన్ని కాపాడాలంటూ అవగాహన కల్పిస్తూ, రెండు కళ్లు చూడలేకపోయినా పద్నాలుగేళ్లుగా మట్టి వినాయకులు తయారుచేసి వాటిని విక్రయిస్తూ ఎవరిపైనా ఆధారపడకుండా ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. శాపమైన పేదరికం మిట్టపల్లి శ్రీనివాస్ నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్‌కు తన పదమూడో ఏట నుంచే కష్టాలు మొదలయ్యాయి. అందరి పిల్లలాగే పుస్తకాలతో బడికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి చేరాక అమ్మతో బీడీలకు దారం కట్టేవాడు. నాన్న బీమండిలో సాంచాలు నడుపుతూ తన రోగాలకు, నొప్పులకుపోను మిగిలిన సొమ్ముతో ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. పదమూడేళ్ల వయసులో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఎడమ కన్నులో పువ్వు ఏర్పడి కన్ను మసకగా కనపడడం మొదలైంది. కానీ రెక్కాడితేగాని, డొక్కాడని బతుకులు. తన అంధత్వానికి పేదరికం ఎలా నిలిచిందో చెబుతూ – ‘నాన్న లక్ష్మీరాజం బీమండిలో సాంచాలపై పనిచేస్తుంటే అమ్మ లక్ష్మీ ఇంట్లో బీడీలు చుట్టి కుటుంబాన్ని వెళ్లదీసింది. ‘అమ్మా, కన్ను మసకబారుతోంది’ అంటే ‘అయ్యో..’ అని బాధపడింది. అప్పుడు ఆపరేషన్‌కి రూ.70 వేల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఏ పూటకాపూటే తినే రోజుల్లో ఆస్పత్రికి పోయే ఆర్థిక స్తోమత లేదని తెలిసి కాలం కరిగిపోయింది. ఏడాది తిరిగేలోగా కన్ను పూర్తిగా కానరాకుండ అయింది. అప్పటికే అమ్మ కూడా లోకాన్ని విడిచిపోయింది. తొమ్మిదో తరగతిలో నరాలు క్షీణించి మరో కన్నుసైతం మసకబారింది. పరీక్ష రాయలేని పరిస్థితిని గమనించి, మా సారు నాన్నకు కబురు పంపాడు. అక్కడా ఇక్కడా అప్పు పుట్టిన పదిహేను రోజుల్లోనే ఉన్న ఒక్క కన్నూ పూర్తిగా కానరాక పోయింది’అని తన జీవితంలో చీకట్లు కమ్ముకున్న తీరును గుర్తు చేసుకున్నారు మిట్టపల్లి శ్రీనివాస్. బడిలో మొదలైన బతుకు పాట.. తొమ్మిదో తరగతిలో చూపు కోల్పోయిన శ్రీనివాస్ చదువుకోవాలనే ఆశను కోల్పోలేదు. స్రై్కబ్ సాయంతో పది, ఇంటర్ పరీక్షలు పూర్తిచేశాడు. శ్రీనివాస్ చిన్ననాటి నుంచే పాఠశాల వార్షికోత్సవం, జాతీయ పండుగల్లో పాటలు పాడేవాడు. ఇంటర్ పూర్తిచేసిన శ్రీనివాస్ పాటలో తన ప్రతిభకు పదును పెట్టుకుంటూ సాగుతున్నాడు. ఆరో తరగతిలోనే జిల్లాస్థాయి పాటల పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి అందుకున్నాడు. డ్రాయింగ్ కాంపిటిషన్లో సైతం బహుమతులు కూడా గెలుచుకున్నాడు. పాటలే జీవితంగా సింగర్‌గా మారాలని అప్పుడే అనుకున్నాడు. రెండు కళ్లు పోయినా సింగర్ కావాలనే తన కలను చంపుకోలేదు. తన మధురమైన గొంతుతో పాటలు పాడుతూ తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు భక్తీగీతాలు, ఆల్బమ్ పాడిన శ్రీనివాస్ ఇప్పుడు టీవీ షోలలో రాణిస్తున్నాడు. ప్రముఖ టీవీ చానళ్లతో పాటు యూట్యాబ్‌లో శ్రీనివాస్ పాటలు ల„ý లాది మంది నుంచి ఆదరణ లభిస్తోంది. శ్రీను పాడిన ‘రాత రాసే బ్రహ్మదేవుడా..’ పాటతో పాటు శివరాత్రి సందర్భంగా ఇటీవల మైక్ టీవీ విడుదల చేసిన ‘బోళా శంకరా.. ఈశ్వరా.. శంబోశివా..’ పాటతో శ్రీనివాస్ గొంతు మరింత ప్రాచుర్యం పొందింది. యశ్పాల్ రాసిన ఈ పాట యూట్యూబ్‌లో మార్మోగింది. పాటతోనే లోకాన్ని చూస్తున్నా రెండు కళ్లు లేవనే బాధ కన్నా కంటికి రెప్పలా కాపాడే అమ్మానాన్న ఇద్దరూ నన్ను అనాథను చేసి వెళ్లిపోయారనే బాధ ఎక్కువగా ఉంది. చీకటి పడిందంటే అడుగుబయటపెట్టేవాన్ని కాదు. రాత్రిపూట అమ్మ నన్ను విడిచి ఎక్కడికీ వెళ్లేది కాదు. అర్ధరాత్రి వరకు అమ్మ బీడీలు చేసి, వచ్చిన పైసలతో బతుకె వెళ్లదీసింది. నాన్న భీమండిలో సాంచాల పనిచేసేవాడు. అమ్మ పోయిన తర్వాత నాన్న నాకోసం ఇంటికి వచ్చి, కంటికి రెప్పలా చూసుకున్నాడు. నాన్న కూడా మరణించాక ఇప్పుడు చీకటే లోకంగా బతుకుతున్న. పాటతో లోకాన్ని చూడాలని, నిరుపేదల బతుకుల్లో చీకటి తొలగించే వెలుగుదివ్వెగా నా పాట ఉపయోగపడాలన్నదే నా సంకల్పం. – మిట్టపల్లి శ్రీనివాస్ ఒంటరి జీవితం.. స్వయం పాకం.. 29 ఏళ్ల శ్రీనివాస్ గత పద్నాలుగేళ్లుగా చీకటేæలోకంగా బతుకు వెళ్లదీస్తున్నాడు. తల్లి లేదు తండ్రీ లేడు, రెండు కళ్లు లేవు, ఇల్లు లేదు, జాగ లేదు.. అయినా ఏనాడూ బతుకు భారం అనుకోలేదు. ఇంకొకరికీ భారంగానూ ఉండాలనుకోలేదు. అలాగని ఆత్మహత్య ఆలోచనను తన దరికి రానీయలేదు. కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ కాలంతో పోటీపడుతున్నాడు. తన తొమ్మిదో ఏట తల్లి లక్ష్మి, పదిహేడో ఏట తండ్రి లక్ష్మిరాజం అనారోగ్యంతో మరణించారు. పద్నాలుగేళ్లుగా శ్రీనివాస్ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. తనకు తానే అన్ని పనులు చేసుకుంటాడు. తానే అన్నం, కూరలు వండుకుంటాడు. వంటకు అన్ని సరుకులు ఒక్క దగ్గర పెట్టుకుని చేతి స్పర్శతోనే ఉప్పు కారం మోతాదు అంచనా వేసుకుని కూర వండుకుంటాడు. అన్ని వేలలా స్నేహితులే అండగా ఉంటున్నారని వారి సాయంతోనే ప్రోగ్రాంలకు పాటలు పాడేందుకు వెళ్లగలుగుతున్నానని అంటాడు శ్రీనివాస్. – పాదం వెంకటేశ్, సాక్షి, జగిత్యాల ఫొటోలు : జవ్వాజి చంద్రశేఖర్ -
భూమి బిడ్డ
ఈ ఫొటోలో గేదె పాలు పితుకుతున్న యువతి.. ఆ ఫొటోలో ట్రాక్టర్ ఎక్కి పొలం దున్న అమ్మాయి.. కుడిపక్క ఫొటోలో ఎయిర్ హోస్టెస్ ఐడి కార్డు ధరించి ఉన్నదీ... ఒక్కరే. అదే అమ్మాయి మరో ఫొటోలో భర్త, కొడుకుతోపాటు పొలంలో పని చేస్తోంది. ఇంకో ఫొటోలో గుర్రం సవారీకి సిద్ధమవుతోంది. ఆమే.. భారతి ఖుటి. ఆమె గురించి గుజరాత్ రాష్ట్రంతోపాటు, దేశమంతా ఎందుకు మాట్లాడుకుంటోందనే విషయాన్ని ఈ ఫొటోలే చెప్తున్నాయి. భారతిది గుజరాత్ రాష్ట్రం, పోర్బందర్ జిల్లాలోని బేరాన్ గ్రామం. ఆమె 2010లో రామ్‌దేని పెళ్లి చేసుకుని లండన్‌కు ప్రయాణమైంది. రామ్‌దే అప్పటికే అక్కడ మేనేజిరియల్ ఎగ్జిక్యూటివ్‌గా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. భారతి అక్కడికి వెళ్లి ట్రావెల్ అండ్ టూరిజమ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సు చేసింది. బ్రిటిష్ ఎయిర్వేస్లో ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగంలో చేరింది. ఈస్ట్ లండన్‌లోని స్టాట్ఫోర్డ్లో నివాసం. 2014లో కొడుకు ‘ఓమ్’ పుట్టాడు. సంతోషంగా సాగిపోతోంది జీవితం. ఆ సమయంలో సొంతూరులో ఉన్న భారతి అత్తమామల ఆరోగ్యం ఆందోళనకు గురి చేసింది. రామ్‌దే, భారతి ఇద్దరూ పెద్దవాళ్లకు మంచి వైద్యం చేయించి స్వస్థత చేకూరే వరకు అంటిపెట్టుకుని ఉండి, తిరిగి యూకే వెళ్లారు. అయితే ఈ వయసులో అమ్మానాన్నలను ఇండియాలో ఉంచి తాము యూకేలో స్థిరపడడం కష్టంగా తోచింది రామ్దేకి. అదే విషయాన్ని భార్యతో చెప్పాడు. అందుకామె సరేనంది. అలా ఐదేళ్ల కిందట బేరాన్కి తిరిగి వచ్చేశారు. విమానం దిగి.. ట్రాక్టర్ ఎక్కింది మొత్తం రెండు వందల కుటుంబాలు నివసించే గ్రామం బేరాన్. దాదాపుగా అందరూ వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తుల మీదనే జీవిస్తున్నారు. పంట పొలాలన్నీ రసాయనాలతో కలుషితమై ఉన్నాయి. దాదాపుగా ఓ నలభై ఏళ్ల కిందట... హరిత విప్లవంలో భాగంగా ఇన్సెంటివ్ మెన్యూర్ స్కీమ్‌ను పరిచయం చేసింది ప్రభుత్వం. అందుబాటులో ఉన్న సాగునేల దేశం మొత్తానికి కడుపు నింపేటంతటి ఆహారధాన్యాలను పండించడం కోసం చేసిన ప్రయత్నం అది. రసాయనిక ఎరువుల వాడకాన్ని రైతులకు పనిగట్టుకుని నేర్పించింది కూడా ప్రభుత్వమే. ఆ ప్రయత్నం విజయవంతమైంది. మన దేశం ఆహారభద్రత సాధించగలిగింది. కానీ పంట నేలలను నిస్సారం చేసుకుంది. ఇప్పుడు మరో విప్లవం రావాలి. అదే ఆర్గానిక్ రివల్యూషన్. ఈ వినూత్న విప్లవాన్ని తమ గ్రామంలో తొలి అడుగు వేయించింది భారతి. పంటకు తోడు పాడి ఏడు ఎకరాల భూమిలో వేరుశనగ, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, జొన్నలు పండిస్తోంది. రసాయన ఎరువుల ప్రస్తావనే లేకుండా పూర్తిగా సేంద్రియ ఎరువులుతో వ్యవసాయం చేస్తున్నారు ఈ దంపతులు. వ్యవసాయానికి అనుబంధంగా గేదెలతో డైరీ ఫార్మ్ కూడా పెట్టి పాడికి –పంటకు మధ్య ఉన్న పరస్పర ఆధారిత బంధాన్ని రుజువు చేస్తున్నారు. తన డైలీ రొటీన్‌ను స్వయంగా షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి, వ్యవసాయంలో సంపాదన యూకేలో ఉద్యోగంలో మిగిలే డబ్బుకంటే ఎక్కువగానే ఉంటోందని చెబుతోంది భారతి. ఈ దంపతులు ఇప్పుడు ఆ గ్రామస్థులకు రోల్ మోడల్స్. వీళ్ల గురించి తెలిసిన వాళ్లు ‘వీళ్లు బేరాన్ గ్రామానికి మాత్రమే కాదు మొత్తం దేశానికంతటికీ రోల్ మోడల్స్’ అని ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు. –మంజీర నేల మీద సాము అది 2015. లండన్‌లో ఉంటున్న రామ్‌దే నిర్ణయాన్ని సొంతూరిలో ఉన్న బంధువులందరూ వ్యతిరేకించారు. అప్పుడు రామ్దేకు అండగా నిలిచింది అతడి భార్య భారతి మాత్రమే. భారతి ఇచ్చిన భరోసాతో ఇండియా వచ్చేశాడు రామ్‌దే. ఇప్పుడు గుజరాత్‌లోని రామ్‌దే సొంతూరు బేరాన్ గ్రామస్థులతోపాటు ఆ రోజు నవ్విన బంధువులు కూడా భారతి ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నుతుంటే కళ్లారా చూస్తున్నారు. ఆ దృశ్యాన్ని వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెడుతున్నారు. యువత కంప్యూటర్, సాఫ్ట్వేర్ అంటూ ఖండాలు దాటిపోతుంటే... భారతి వాటిని వదిలేసి మన నేలను మించిన ఉపాధి హామీ మరెక్కడా ఉండదని నిరూపిస్తోందని ఆమె వీడియోలు చూసిన వాళ్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ తరం నేల విడిచి సాము చేస్తుంటే భారతి నేల మీద సాము చేస్తోంది. అదే ఆమె సక్సెస్ అని మరికొందరు మెచ్చుకుంటున్నారు. లండన్‌లో మంచి ఉద్యోగం, అక్కడే స్థిరపడే అవకాశాన్ని వదులుకుని జన్మభూమికి వచ్చి పొలం దున్నుతున్న ధీర అని ఆమెకు ట్యాగ్‌లైన్ ఇస్తున్నారు. -
రాధిక కథ సినిమా తీయొచ్చు
ఇటీవల యాసిడ్ అటాక్ సర్వయివర్ జీవితం ఆధారంగా ‘చపాక్’ సినిమా వచ్చింది. ప్రమాదం వచ్చినా గెలిచి చూపిన అమ్మాయి కథ అది.రాధిక కథ అంతకు తక్కువ కాదు.గట్టిగా వేళ్లు విరుచుకుంటే ఆ వేళ్ల ఎముకలు విరిగిపోయేంత సున్నితమైన అరుదైన వ్యాధిఆమెకు ఉంది.ఇంత కర్కశమైన వ్యాధిలో ఎవరైనా కుంగిపోతారు. విరిగిపోతారు.రాధిక నిలబడింది.ప్రకృతి అన్యాయం చేసినా పోరాడి గెలవమని చెబుతోంది. రాధికకు అయిదేళ్లున్నప్పుడు ఆడుకుంటూండగా కిందపడింది. ఎడమ తొడ ఎముక విరిగింది. ఆడుకుంటూ పడితే తొడ ఎముక విరగడం విచిత్రం. అయితే డాక్టర్లు సీరియస్‌గా తీసుకోలేదు. పడటం వల్లే విరిగిందని అనుకున్నారు. ఆరునెలల తర్వాత ఉన్నట్టుండి నొప్పి మొదలైంది. అడుగు తీసి అడుగు వేయలేకపోయింది. ఆపరేషన్ చేసి ప్లేట్‌ను అమర్చారు. అక్కడితో నయం కాలేదు. దాంతో దాదాపు ఏడు సార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మాటిమాటికీ ఎందుకిలా జరుగుతోందని 2010లో మరిన్ని వైద్యపరీక్షలు చేయిస్తే తేలింది ఎముకలకు సంబంధించిన అరుదైన వ్యాధి అని, ఇది జన్యుపరమైనదనీ, ఈ జబ్బు వల్ల ఆమె ఎముకలు అత్యంత బలహీనంగా ఉన్నాయని. అంటే కోడిగుడ్డు పెంకుల్లా అన్నమాట. ఎముక మజ్జ పిండిలా అయిపోతుందన్నమాట. ఫలితంగా స్కూల్లో గంటలు గంటలు కూర్చోవడంతో వెన్నెముక వంగడం మొదలైంది. దీంతో రాధిక స్కూల్‌కి వెళ్లి చదువుకోలేక ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. కాస్త గట్టిగా కదిలినా ఫెళఫెళమని ఎముకలు విరగడమే. ఆపరేషన్లు జరగడమే. కోలుకొని ఇంటికొచ్చిన మర్నాడే మరో ఫ్రాక్చర్‌తో ఆసుపత్రికి పరిగెత్తేవారు. రాధిక సరే.. ఇంట్లో వాళ్లకూ బెంగ.. ఇలాగైతే పిల్ల పరిస్థితి ఏంటి అని. సగం టైమ్ ఆసుపత్రిలో.. సగం ఇంట్లోనే గడిచిపోయింది బాల్యము, కౌమారమూ. ఆపరేషన్ అయ్యి కోలుకోగానే.. ఎముకలు విరగకుండా నడవడం ప్రాక్టీస్ చేసేది. ఇదే జీవితం అయిపోయింది. ఏం చేయాలి? ‘అన్న స్కూల్‌కు, నాన్న ఆఫీస్‌కు వెళ్లేవాళ్లు. ఇంట్లో పనులతో అమ్మ బిజీ. నాతో మాట్లాడేవాళ్లే లేక దిగులు అనిపించేది. ఒకానొక టైమ్‌లో పిచ్చిపట్టినట్టే అయింది. నా స్థితి మీద నాకే జాలి. ఏదైనా వ్యాపకం మొదలుపెట్టుకోవాలనిపించింది. అప్పటికే నా చదువు డిస్టర్బ్ కావద్దని ట్యూటర్‌ను పెట్టి ఇంటి దగ్గరే చదువుకునే ఏర్పాటు చేశారు అమ్మా, నాన్న. అయినా బోలెడంత ఖాళీటైమ్. అయితే అదేపనిగా రెండుగంటల కంటే ఎక్కువ కూర్చోలేను.. కూర్చోకూడదు కూడా. ఆ రెండు రెండు గంటల టైమ్‌నే సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. చదువుకోసం కేటాయించుకున్నది పోను మిగిలిన టైమ్‌ని. ఫ్రెండ్స్ కోసం చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం, డ్రాయింగ్ వేయడం చేసేదాన్ని’ అంటూ తనను తాను తీర్చిదిద్దుకున్న తీరును చెప్తుంది రాధిక. తను తయారుచేసిన ఆఫ్రికన్ డాల్స్‌తో రాధిక యూ ట్యూబ్ మార్గం ఇలాగే ఒకసారి కూర్చోని డ్రాయింగ్ వేసుకుంటూంటే రాధిక వాళ్లన్నయ్య ఫ్రెండ్ మణికందన్.. ఆమెను చూసి క్రాఫ్ట్‌కు సంబంధించిన యూట్యూబ్ వీడియోస్‌ను ఆమెకు పరిచయం చేశాడు. అప్పటి నుంచి రాధిక ఆ వీడియోలను చూడ్డం.. కొత్త కొత్త క్రాఫ్ట్స్‌ను నేర్చుకోవడం మొదలుపెట్టింది. వాల్ హ్యాంగింగ్స్, పెన్హోల్డర్స్, బుట్టలు, ఫొటో ఫ్రేమ్స్, బాక్స్‌లు... అన్నీ పేపర్‌తో చేసినవే. తాను తయారు చేసివన్నీ ఫ్రెండ్స్‌కు, బంధువులకు కానుకలుగా ఇచ్చేది. ‘ఎప్పుడూ ఇవేనా? అని బోర్ కొట్టింది కొన్నాళ్లకు. అందుకే యూట్యూబ్ వీడియోలతో నేర్చుకున్న ఆర్ట్‌నే కొంత డెవలప్ చేసుకుందామని.. బొమ్మల ప్రయోగం చేశా. బాగా కుదిరాయి. కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆఫ్రికన్ డాల్స్ తయారీమీద పడ్డా. కాగితంతోనే. ముందు ఒకటి చేశా. చాలా బాగా వచ్చింది. తర్వాత పది.. ముందుకన్నా అద్భుతంగా ఉన్నాయన్నారు ఇంట్లో వాళ్లు. అంతే ఇక ఆగలేదు. వాటన్నిటినీ మా అన్నయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశా. మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమందైతే ఏకంగా కొనడానికే ముందుకొచ్చారు. అసలు అమ్మడమనే ఆలోచనేలేదు నాకు. అదే చెప్పాను వాళ్లకు. కాని వినలేదు. చేసేది లేక ఎంతో కొంత వాళ్లనే ఇమ్మన్నాను. అలా కొనడమే కాక అలాంటి ఇంకో 25 బొమ్మలను ఆర్డర్ చేశారు కూడా. ఆశ్చర్యం నాకు’ అని చెప్తుంది రాధిక. ఆఫ్రికన్ డాల్స్ రాధిక చేతిలో రూపుదిద్దుకున్న ఆఫ్రికన్ డాల్స్ సోషల్ మీడియాలో ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్‌కు ఫార్వర్డ్ అయి అందరికీ తెలిశాయి. డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అది చిన్న సైజు కుటీర పరిశ్రమగా మారింది రాధికకు.‘నిజానికి ఈ క్రాఫ్ట్‌ను ఓ మెంటల్ థెరపీగా స్టార్ట్ చేశా. ఈ బొమ్మలను చేస్తున్నంతసేపు హ్యాపీగా.. హాయిగా ఉంటాను. ఇంకే ఆలోచనా రాదు. దీంతో నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. కాని ఇప్పుడదో బిజినెస్‌గా మారింది. నమ్మలేకున్నాను. చెప్పాను కదా.. ఎక్కువసేపు కూర్చోలేను అని. ఆ కూర్చున్నంతలోనే ఈ బొమ్మలను చేస్తున్నాను’ అంది రాధిక చేతిలో ఉన్న ఆఫ్రికన్ డాల్‌ను ఆప్యాయంగా తడుముతూ.ఇప్పటివరకు రెండువందల పైచిలుకు బొమ్మలు అమ్ముడుపోయాయి. నూటయాభై రూపాయల నుంచి ఏడువందల రూపాయల మధ్య ఉంటుంది వాటి వెల.ప్రస్తుతం ప్రైవేట్‌గా పదకొండో తరగతి పరీక్ష రాయడానికి సన్నద్ధమవుతోంది రాధిక. నిజానికి పదకొండు, పన్నెండు తరగతులను స్కూల్‌కు వెళ్లి చదువుకోవాలని ఆమె తాపత్రయం. కాని కోయంబత్తూరులోని స్కూళ్లు ఆమెను చేర్పించుకోవడానికి సిద్ధంగా లేవు. రకరకాల కారణాలు చెప్పి, సాకులు చూపి ఆమెకు ప్రవేశం ఇవ్వడం లేదు.‘నాలాంటి వాళ్లకు స్కూల్లో చదువుకునే ఆవకాశమే ఉండదా? వ్యాపకంతో ఎంత బిజీగా ఉన్నా ఆర్నెల్ల కిందటిదాకా ఇలాంటి నెగటివ్ ఆలోచనలతోనే సతమతమయ్యా. ఒక్కోసారి నా జీవితం ఇలా ఒక ఫెయిల్యూర్‌లా ఎండ్ అయిపోతుందా అని కూడా భయపడ్డా’ అంటుంది రాధిక. పాజిటివ్ ఎనర్జీ ఎంతటి ప్రతికూలతలు తనను చుట్టుముట్టినా.. వాటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోగల సత్తా ఆమెది. ఇప్పుడు తన తల్లిదండ్రులు, సోదరుడి సహాయంతో తన పేపర్ క్రాఫ్ట్‌ను వ్యాపారంగా వృద్ధి చేయాలనుకుంటోంది. ఆఫ్రికన్ డాల్స్‌నే కాకుండా.. కార్టూన్ క్యారెక్టర్స్, అబ్దుల్ కలాం వంటి ప్రసిద్ధుల బొమ్మలనూ తయారు చేసే పనిలో ఉంది.పాజిటివ్‌నెస్‌కు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏం ఉంటుంది?! -
కత్తిలా బతికి వెళ్లిపోయారు...
ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు తెలుగు సినిమాకు రెండు కళ్లు. కాని కాంతారావు ఆ మెడలో మెరిసే చంద్రహారం. కత్తి వీరుడు కాంతారావుగా జానపద చిత్రాలు చేసి సగటు ప్రేక్షకుడికి ఆయన చేరువయ్యారు. సాంఘిక చిత్రాలలో బలమైన పాత్రలు చేసి పెద్ద హీరోలను ఢీకొట్టారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా ఇంటిని, ఇల్లాలి చేతి వంటని, పిల్లల బాల్యాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఆయన కనుమరుగై దాదాపు దశాబ్దం పైగానే గడిచింది. అయితేనేం చెన్నైలో ఉండే పెద్ద కుమారుడు ప్రతాప్, హైదరాబాద్ లో ఉండే నాలుగో కుమారుడు రాజా తండ్రి జ్ఞాపకాల పరిమళాలను ఎంతో సంతోషంగా సాక్షితో పంచుకున్నారు. రాజా: నాన్నగారికి మేం నలుగురు మగ పిల్లలం, ఒక ఆడపిల్ల. ప్రతాప్ పెద్దన్నయ్య, రెండో అన్నయ్య కేశవరావు, ఆ తరవాత అక్క సుశీల, నేను, నా తరవాత తమ్ముడు సత్యం. నాకు నాలుVó ళ్లు వచ్చేవరకు మాటలు రాలేదు. కుర్తాళంలో ఉన్న జలపాతం నీటికి ఔషధ గుణాలు, మహిమలు ఉన్నాయని తెలిసినవారు చెప్పటంతో నన్ను అక్కడకు తీసుకువెళ్లారు. జలపాతం నీళ్లు నా మీద పడేలా తన భుజాల మీద ఎక్కించుకున్నారు. నీటి మహిమో, యాదృచ్ఛి కమో గానీ, వారు చెప్పినట్టుగానే నాకు మాటలు రావడంతో నాన్నగారి ఆనందానికి అవధులు లేవు. ఆ సంఘటన తరచుగా చెబుతుండేవారు. నాకు చిన్నప్పటి నుంచి ఆయనతో అనుబంధం పెనవేసుకుంది. ఆయనతో మాకు ఎన్నో తీపి అనుభవాలు ఉన్నాయి. పుట్టినరోజులు బాగా జరిపేవారు. పార్టీలకు, ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లటంలాంటి అలవాట్లు ఆయనకు లేవు. అవకాశం వచ్చినప్పుడల్లా మాతో క్యారమ్స్, షటిల్ ఆడేవారు. వినాయకచవితికి మాతో పూజ చేయించేవారు. నాన్న ఊరు వెళ్తుంటే ఏడ్చేవాళ్లం. అప్పుడప్పుడు ఔట్‌డోర్ షూటింగ్‌కి తీసుకువెళ్లేవారు. మేం షూటింగ్ చూసిన మొట్టమొదటి సినిమా సతీ సులోచన. కోదాడ వెళ్లినప్పుడు అక్కడి పొలాలకు తీసుకువెళ్లేవారు. అక్కడ మమ్మల్ని చూసి ‘కాంతారావుగారి అబ్బాయి’ అని అందరూ అంటుంటే మాకు భలే సరదాగా ఉండేది. నాన్నగారు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశాక ఆయన బ్యాంకు పనులు చూడటం అలవాటు చేసుకున్నాను. హైదరాబాద్ వచ్చాక ఒకసారి నన్ను షూటింగ్‌కి తీసుకువెళ్లారు. వాళ్లు నన్ను ప్రొడక్షన్ బాయ్ అనుకుని, నేను అన్నం దగ్గర కూర్చున్న చోట నుంచి లేపి, మరోచోట కూర్చోమన్నారు. నాన్నగారు కోపంగా, ‘నాకు కూడా అక్కడే అన్నం పెట్టండి’ అన్నారు. ఏం జరుగుతోందో వాళ్లకు అర్థం కాలేదు. ‘వాడు మా అబ్బాయి, మీ పని నాకు అవమానంగా ఉంది’ అన్నారు. మద్రాసులో వారికి నేనెవరో తెలుసు. కాని హైదరాబాద్‌లో ఎవ్వరికీ తెలియకపోవటం వల్ల ఈ సంఘటన జరిగింది. మేం పెద్దగా చదువుకోకపోయినా, నాన్న ప్రేమను పరిపూర్ణంగా అందుకున్నాం. ‘సుడిగుండాలు’ చిత్రానికిగాను 1968లో అవార్డు అందుకున్నాను. అవార్డు వచ్చినందుకు సంతోషపడ్డారు కానీ, అటువంటి పాత్రలు ఎన్నడూ వేయద్దు, నా కొడుకు నా కళ్ల ముందరే ఉండాలి’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఆ చిత్రంలో నేను వేసిన పాత్రలో చనిపోతాను. సినిమా రంగానికి దూరంగా ఉండమని చెప్పేవారు. హేమ ఫిలిమ్స్ పేరున మేం తీసిన ‘సప్తస్వరాలు’ చిత్రం ఫ్లాప్ కావటంతో, నాన్నగారికి గుండెపోటు వచ్చింది. ‘మీ ప్రేమే నన్ను కాపాడుతుంది. అమ్మని బాగా చూసుకో రాజా’ అన్నారు. 1971 దాకా హీరోగా చేశారు. ‘గుండెలు తీసిన మొనగాడు’ నాన్న హీరోగా చేసిన ఆఖరి సినిమా. ‘నేరము – శిక్ష’ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. నవంబరు 16వ తేదీన నాన్నగారి పుట్టినరోజు. ఆ రోజు నాన్నగారు ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటికే నాన్న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు న్నారు. అక్కడ కొద్దిసేపు ఉండి, ఇంటికి బయలుదేరుతూ, అందరి ఎదుట, ‘నాన్నా రాజా! ఇంక నాకు ఈ కర్ర అవసరం లేదు. నువ్వే నా కుడిభుజం. అమ్మని జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పారు. చివరికి అదే నిజం చేస్తూ ఏడాదికల్లా నాన్న కన్ను మూశారు. ప్రతాప్: నాన్నగారి స్వస్థలం తెలంగాణలోని కోదాడ. రజాకార్ మూవ్మెంట్ టైమ్‌లో అక్కడనుంచి చెన్నై మకాం మార్చేశారు. నాన్నగారిది ప్రేమ వివాహం. అమ్మది జగ్గయ్యపేట. అమ్మ మీద నాన్నకు విపరీతమైన అభిమానం. అమ్మ చేతి కాఫీతోనే నాన్న నిద్ర నుంచి లేచేవారు. ఇంటి వ్యవహారమంతా అమ్మే చూసుకునేది. అమ్మ సింపుల్‌గా ఉండటమే కాదు, మమ్మల్ని కూడా అలాగే పెంచింది. ఇంట్లో రెండు కార్లు ఉన్నా రిక్షాలోనే వెళ్లేది. మేం కూడా సైకిల్ లేదా బస్సుల్లో ప్రయాణించేవాళ్లం. నాన్న చాలా బిజీగా ఉండేవారు. ఒకసారి షూటింగ్‌కి వెళ్లిపోతే వారం పదిరోజుల దాకా ఆయనను చూడటానికి కుదిరేది కాదు. ప్రతి రోజూ మూడు షిఫ్టులు పనిచేసేవారు. సంవత్సరానికి పన్నెండు సినిమాలు చేయాలనుకునేవారు. 1960 – 1971 మధ్యకాలంలో ఆయన ఎంత బిజీగా ఉన్నారంటే ఆయన కాల్షీట్లు చూడటానికి ఇద్దరు సెక్రటరీలను పెట్టుకునేంత! రోజుకి మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. మా చిన్నతనంలో తిరుపతి వెళ్లినప్పుడు నాకు గుండు కొట్టించారు. నేను కుదురుగా ఉండకపోవటంతో కొలనులోకి దొర్లిపోయాను. నాన్నగారు వెంటనే చూడటంతో బతికి బయటపడ్డాను. మద్రాసులో సినిమా వాళ్ల పిల్లలంతా కేసరయ్య స్కూల్లోనే చదివేవారు. మేం కూడా అక్కడే చదువుకున్నాం. ఆ తరవాత రామకృష్ణ మిషన్‌లో చదివాం. కాలేజీలో నా అంతట నేనే చేరాను. తమ్ముళ్లని మాత్రం నాన్న చేర్పించారు. 1957లో అనుకుంటాను. పెళ్లికి వెళ్లి, తిరుపతి నుంచి తిరిగి వస్తున్నాం. అప్పుడు నాకు ఏడేళ్లు. ముందు సీట్లో నాన్న ఒళ్లో పడుకున్నాను. ఆయన నా మెడ మీద చేయి వేసి పడుకోబెట్టుకున్నారు. బాగా వాన పడుతుండటంతో రాణీ పేట దగ్గర కారు చక్రం స్కిడ్ కావటంతో యాక్సిడెంట్ అయ్యింది. కుడివైపు చెట్టుకి కొట్టుకుని వెనక్కి వచ్చి మళ్లీ కొట్టుకుంది. అద్దాల ముక్కలు తలలో పడ్డాయి. సరిగ్గా అప్పుడు నాన్న నన్ను కిందకి తోసేసి, తను కూడా దూకేశారు. డ్రైవర్ జంప్ చేశాడు. చెట్టు కొట్టుకోవటం వల్ల, ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాం. కారు నుజ్జునుజ్జు అయిపోయింది. కారు కండిషన్ చూసినవారంతా మేం ఎలా బతికి బయటపడ్డామా అనుకున్నారు. ఆ ఏడుకొండల వాడి దయ వల్ల బతికాం అని నాన్న చెప్పేవారు. 1968లో సప్తస్వరాలు సినిమా స్వయంగా నిర్మించి అందులో నటించారు. ఆ సినిమాకి కావలసిన వస్తువులు కొంటూ నాకు 150 రూపాయలు పెట్టి సీకో వాచీ కొన్నారు. ఆ వాచీ చాలా సంవత్సరాలు వాడాను, అది పాడైపోయాక మళ్లీ చాలాకాలం వాచీ కొనుక్కోలేదు. 1974లో సింగపూరు వెళ్లినప్పుడు వాచీ కొని తెచ్చుకున్నాను. గడియారం కాలాన్ని ఎంత ముందుకు తోస్తున్నా మేము మాత్రం ఎప్పుడూ నాన్న జ్ఞాపకాల్లోనే ఉంటాం. – సంభాషణ: వైజయంతి పురాణపండ అప్పటి నుంచి మాతోనే... నేను మొదటి నుంచి నాన్నగారి ప్రొడక్షన్స్ చూసుకునేవాడిని. ఎక్కడా ఉద్యోగం చేయలేదు. చెన్నైలో ఉన్నన్ని రోజులు నాన్నగారు మా దగ్గరే ఉండేవారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేవారు. నాకు ముగ్గురు అబ్బాయిలు. సాయికిరణ్, కార్తిక్, గుణరంజన్. ముగ్గురూ ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా భార్య లక్ష్మి. మా అత్తవారు మేము ఇరుగుపొరుగు వారం. నాన్నగారితో వియ్యమందుకున్నాక, మా మావగారు పి. చంద్రశేఖర్ మా ప్రొడక్షన్లో భాగస్వాములయ్యారు. – ప్రతాప్ నా దగ్గరే... నేను ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. అమ్మ హైమవతి నా దగ్గరే ఉంది. నా భార్య ఉషశ్రీ. వాళ్లది తణుకు. మా అబ్బాయి సాయి ఈశ్వర్ బిటెక్ చదువుతున్నాడు. అమ్మాయి ప్రియాంకకు వివాహం అయ్యింది. అల్లుడు మెరైన్‌లో పనిచేస్తున్నాడు. – రాజా