మనం ఎంచుకున్న లక్ష్యానికి నిబద్ధత, శ్రమ, తపన తోడైతే దాని ఫలితం అద్భుతంగా ఉంటుందనే నమ్మకాన్ని ‘ఆయ్’ సినిమా దర్శకుడు అంజిబాబు కంచిపల్లి రుజువు చేశాడు. తొలి ప్రయత్నంలోనే సినీ దర్శకుడిగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణ శివారు కొంకాపల్లి అంజిబాబు స్వస్థలం. పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఒకరోజు...
‘నేను సినిమా డైరెక్టర్ కావాలనుకుంటున్నాను’ అని తండ్రి బూరయ్య, సోదరులకు చెప్పాడు. ఆ వయసులో పిల్లల నోటి నుంచి వినిపించే కలలకు పెద్దలు ‘అలాగే’ అంటారు తప్ప అంత సీరియస్‌గా తీసుకోరు. కానీ అంజిబాబు మాత్రం యమ సీరియస్‌గా తీసుకున్నాడు. ‘ముందు నువ్వు డిగ్రీ పూర్తి చేయి. తర్వాత ఆలోచిద్దాం’ అని తండ్రి చెప్పాడు. తన లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకున్నప్పటికీ చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. అమలాపురంలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఓ మంచి రోజు తన కలల దారిని వెదుక్కుంటూ హైదరాబాద్ బస్సెక్కేశాడు. ఎంతోమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు.
కోనసీమలో బాల్యం నుంచి స్నేహంగా చిగురించిన బంధాలు, అనుబంధాలు పెద్దయ్యాక కులాల కుంపటి రాజుకుని నాశనమవుతున్నాయి. కులాల బీటలతో స్నేహం, ప్రేమ విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే తన కథలో ప్రధానాంశంగా ఎంచుకుని సినిమా కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు.
తాను రాసుకున్న కథను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, భాగస్వామి బన్నీ వాసులకు వినిపించాడు. గీతా ఆర్ట్స్‌కు నచ్చడంతో అంజిబాబు కథా రచయితగా తొలి విజయం సాధించాడు. సినిమాని కోనసీమ నదీ పరీవాహక గ్రామాల్లో చిత్రీకరించడం రెండో విజయం. అమలాపురం వేదికగా రూపుదిద్దుకున్న ‘కోనసీమ ఫిలిమ్ అసోసియేషన్’కు చెందిన సినీ ఆర్టిస్ట్‌లతో కొంత మందికి అంజిబాబు ‘ఆయ్’ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చి వారి నుంచి మంచి నటనను రాబట్టాడు. తన తండ్రిపై ఉన్న అభిమానంతోనే ‘ఆయ్’ సినిమాలోని హీరో తండ్రి క్యారెక్టర్‌కు ‘బూరయ్య’ అని పేరు పెట్టాడు.
చిన్నతనం నుంచి తాను పుట్టి పెరిగిన కోనసీమలోని ప్రకృతి అందాలు, గ్రామీణ సౌందర్యాలను తాను తీసే తొలి చిత్రంలో తెరకెక్కించాలనే కలను నిజం చేసుకున్నాడు. కోనసీమ యాస, నేటివిటీకి హాస్యాన్ని జోడించి ‘ఆయ్’ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు అంజిబాబు. – పరసా సుబ్బారావు, సాక్షి, అమలాపురం టౌన్
"తొలి ప్రయత్నంలోనే సినీ దర్శకుడు కావాలన్న నా శ్రమ, కల ఇప్పుడు ’ఆయ్’ చిత్ర రూపంలో ఫలించినందుకు సంతోషంగా ఉంది. సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలన్న నా కోరిక కూడా ‘ఆయ్’ చిత్రం ద్వారా తీరింది. కోనసీమ అందాలు, అచ్చమైన పల్లె వాతావరణం, గోదారోళ్ల యాస మాటలు, సందర్భోచిత హాస్యంతో సినిమాను తీయాలనే ఆలోచనతో ‘ఆయ్’ చిత్రం కథను రాశాను. నా క«థను మెచ్చి చిత్రాన్ని తెరకెక్కించేలా చేసిన గీతా ఆర్ట్స్‌కు, అల్లు అరవింద్, బన్నీ వాసులకు నా ధన్యవాదాలు." – అంజిబాబు కంచిపల్లి, ఆయ్ చిత్ర దర్శకుడు
Comments
Please login to add a commentAdd a comment