ఈ దేశంలో నిజమైన పోరాట యోధుల చరిత్ర వెలుగులోకి రాకమునుపే, నకిలీ విజేతలు వెలిగిపోయారు. ఇప్పుడు ఆ మూసను బద్ధలుకొట్టడమే ఈ తరం చేయాల్సిన పని. ‘నా అన్వేషణలో కత్తి చంద్రయ్య’ అనే జీవితగాథ రాసిన కత్తి కళ్యాణ్ చేసింది ఇదే! ఈ పుస్తకాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్తే ఒక మహామనిషితో కరచాలనం చేస్తాం. తెలుగు నేల నుంచి ఆవిర్భవించిన తొలి దళిత కలెక్టర్ ‘పేదల కలెక్టర్’గా ఎట్లా ఎదిగి వచ్చాడో తెలుసుకుంటాం. ఆయన చేసిన సేవలకు ఆయనే గనుక ఉన్నతవర్గంలో పుట్టి ఉంటే ఈ పాటికి ఆయన పేరు నలుదిశలా మార్మోగేది.
1924లో నిరుపేద రైతుకూలీ కుటుంబంలో జన్మించిన కత్తి చంద్రయ్య చదువే లోకంగా ఎదిగి వచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీతో పాటు మద్రాసులో సైతం ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రకాశం జిల్లా ఏర్పడిన తరువాత మొదటి కలెక్టర్‌గా ఆయన పనిచేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సైతం ఆయన కలెక్టర్‌గా సేవలందించారు. ఏ జిల్లాలో ఉద్యోగం చేసినా తనదైన మార్క్ ఉండేది. సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలన్నా, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడి, పేదలకు పంచాలన్నా కత్తి చంద్రయ్యకే సాధ్యం అనేలా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.
ఆయనలో ఒక గొప్ప మేధావి ఉన్నాడు. పురాతన చరిత్రను తెలుసు కోవడం, పత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్యాసాలరూపంలో రాసి ప్రచారం చేయడం అభిరుచిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మంచి పాఠకుడిగా ఆయన అనేక పుస్తకాలు అధ్యయనం చేశారు. అలాగే తన పరిశోధనలో తెలుసుకున్న విషయాలను ఈ సమాజం ముందు పెట్టడానికి విలువైన రచనలు చేశారు. ‘దళిత్ ఎకానమీ’ అనే రచన అందులో ఒకటి. తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతో వేమన వంటి ప్రజా కవులను గురించి కూడా వ్యాసాలు రాశారు.
చదవండి: కలలూ కన్నీళ్ళ కలబోతలో పూలూ ముళ్ళూ!
ఈ పుస్తకంలో చంద్రయ్య కాలం నాటి దినపత్రికల కట్టింగ్‌లను పొందు పరిచాడు రచయిత. అది చాలా శ్రమతో కూడుకున్న పని. ఇవాళ పరాజిత జాతుల చరిత్రలన్నీ వెలికితీసే పని మరింతగా జరగాలి. నిజం చెప్పులేసు కునేలోపే, అబద్ధాలు ప్రపంచమంతా తిరిగి వస్తున్న యుగంలో మనం జీవి స్తున్నాం. నిజాలకు పట్టం కట్టాలి, నిజమైన ఆదర్శనీయుల చరిత్రను ఈ సమాజానికి అందించాలి. ఈ పుస్తకం విరివిగా ప్రజల్లోకి వెళ్లాలి. ముఖ్యంగా విద్యార్థులు చదవాలి. చంద్రయ్య పేరు మీద ఉత్తమ అధికారులకూ, పరిశోధ కులకూ, చరిత్ర రచయితలకూ అవార్డులివ్వాలి. ఇందుకోసం ప్రజలు, ప్రభు త్వాలు పూనుకోవాలి. ఆ దిశలో వ్యవహరించడానికి అవసరమైన చైతన్యం కలిగించడానికి ఈ పుస్తకం ఒక దారి చూపుతుంది.
– డాక్టర్ పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య అకాడెమి
యువ పురస్కార గ్రహీత
Comments
Please login to add a commentAdd a comment