అందాలొలికే ఈ బొమ్మలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వీటిని పూర్తిగా పువ్వులు, ఆకులు, రెమ్మలతోనే రూపొందించినట్లు తెలుసుకుంటే, ‘సుందరం.. ‘సుమ’నోహరం’ అని ప్రశంసించక మానరు. కెనడాలో స్థిరపడిన జపానీస్ కళాకారుడు రాకు ఇనోయుయి రూపొందించిన ఈ ‘సుమ’నోహర కళాఖండాలు కొంతకాలంగా ‘ఆన్‌లైన్’లో హల్‌చల్ చేస్తున్నాయి. పూలు, ఆకులు, రెమ్మలను ఉపయోగించి, రాకు సృష్టిస్తున్న కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి.
కెనడాలోని మాంట్‌రియల్ నగరంలో ఉంటున్న రాకు ఈ పూల కళను 2017లో సరదా కాలక్షేపంగా మొదలుపెట్టాడు. తన ఇంటి పెరట్లో మొక్కల నుంచి రాలిపడిన గులాబీలు, ఇతర పూల రేకులు, వాటి ఆకులు వృథాగా పోతుండటంతో, వాటిని ఎలాగైనా సద్వినియోగం చేయాలని ఆలోచించాడు. తొలి ప్రయత్నంగా పూలరేకులు, కత్తిరించిన రెమ్మల ముక్కలను ఉపయోగించి కీచురాయి బొమ్మను తయారు చేశాడు. కీచురాయి బొమ్మ ఫొటోలను సోషల్ మీడియాలో పెడితే, విపరీతంగా స్పందన వచ్చింది. ఇక అప్పటి నుంచి రాకు వెనుదిరిగి చూసుకోలేదు. నిరంతర సాధనతో తన కళకు తానే మెరుగులు దిద్దుకుంటూ, పూల రేకులు, ఆకులు, రెమ్మలతో అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందే స్థాయికి ఎదిగాడు.
పూర్తిగా సహజమైన పూలు, పూల రేకులు, ఆకులు, పూలమొక్కల గింజలు, రెమ్మలు, కొమ్మలు మాత్రమే ఉపయోగించి, కార్టూన్ క్యారెక్టర్లు, చిలుకలు, కొంగలు, గుడ్లగూబలు వంటి పక్షులు, పులులు, సింహాలు, జింకలు వంటి జంతువులు, సీతాకోక చిలుకల వంటి కీటకాల బొమ్మలను జీవకళ ఉట్టిపడేలా తయారు చేయడంలో రాకు తన ఏడేళ్ల ప్రస్థానంలో అపార నైపుణ్యం సాధించాడు.
ఈ కళాఖండాలను రూపొందించడానికి గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ఒక్కోసారి రోజుల తరబడి ఓపికతో పని చేయాల్సి ఉంటుందని రాకు చెబుతున్నాడు. ఆన్‌లైన్‌లో రాకు పేరుప్రఖ్యాతులు పెరగడంతో ప్రముఖ కంపెనీలు ఆర్డర్లు ఇచ్చి మరీ అతడి చేత తమ కంపెనీల లోగోలను ప్రత్యేక సందర్భాల కోసం తయారు చేయించుకుంటున్నాయి. ఈ పూల కళాఖండాలు ఎక్కువకాలం ఉండవు. త్వరగానే వాడిపోయి, వన్నె కోల్పోతాయి. అందుకే రాకు వీటి సౌందర్యాన్ని తన ఫొటోల ద్వారా శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు. వృక్షశాస్త్రవేత్త అయిన రాకుకు చిన్నప్పటి నుంచి కళాభిరుచి కూడా ఉండటంతో అతడు ఈ కళలో అద్భుతంగా రాణిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment