‘పురుషసూక్తం’.. ‘టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ ఎ బ్రీఫ్’.. రెండు నాటకాలు. ఇవి పురుష భావజాలంపై నటి ఝాన్సీ రూపొందించిన సంవాదాలు. ఆలోచనావీచికలు... మార్పుకై నివేదనలు. ఝాన్సీ తన టీమ్‌తో రవీంద్రభారతిలో జనవరి 12న ప్రదర్శించనున్న సందర్భంగా...
‘తెలంగాణ థియేటర్ రీసెర్చ్ కౌన్సెల్ వాళ్లు 2019లో విమెన్స్ డేకి ‘విమెన్ డైరెక్టర్స్ ఫెస్టివల్’ను కండక్ట్ చేస్తూ నన్ను కూడా అడిగారు ఒక నాటకం ఇస్తాం.. డైరెక్ట్ చేయమని. వాళ్లిచ్చిన నాటకం కంటే నేను నా ఐడియాలజీని నాటకంగా ప్రెజెంట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దాన్నొక చాలెంజ్‌గా తీసుకున్నాను.
నేను చదివిన, చూసిన, నేర్చుకున్న, ఏర్పర్చుకున్న దృక్పథాన్ని పేపర్ మీద పెట్టాను. అదే నా ఫస్ట్ ప్లే.. ‘పురుషసూక్తం.’ జెండర్ కళ్లద్దాలతో మాస్క్యులినిటీని మనమెలా చూస్తున్నాం, దాన్నెలా పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల పురుషుడు తాను మనిషినన్న విషయాన్ని మరచిపోయి, అనవసరపు బరువు బాధ్యతలను ఎలా మోస్తున్నాడు, ఆ పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళ ఎలా కోటగోడగా మారిందనే అంశాల మీద సీరియస్ చర్చే ఆ నాటకం’ అన్నారు ఝాన్సీ.
రవీంద్రభారతిలో తన రెండు నాటకాలను ప్రదర్శించడానికి ఒకవైపు రిహార్సల్స్ చేస్తూ మరోవైపు సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ‘పురుషసూక్తం నాటకానికి 18 రోజు ల్లోనే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాను. డైరెక్ట్ చేయడమే కాక నటించాను కూడా. అంత సీరియస్ నాటకాన్ని రెండు పాత్రలతో ఎంతవరకు మెప్పించగలను అనుకున్నా! కానీ ఆశ్చర్యం.. కె. విశ్వనాథ్ లాంటి వారి మహామహుల ప్రశంసలు అందాయి. అది నాటక రచయితగా, దర్శకురాలిగా నా ప్రయాణాన్ని ఖరారు చేసుకునేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. థియేటరే నా మీడియమనీ అర్థమైంది’ అన్నారామె.
టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ బ్రీఫ్
‘కిందటేడు (2024) అక్టోబర్ 4న వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ డే సందర్భంగా స్త్రీల ఆరోగ్యం, పురుషుల బాధ్యత లాంటి విషయాలెన్నో చర్చకు వచ్చి.. అసలిలాంటి వాటి మీద మనమెందుకు అవసరమైనంతగా మాట్లాడట్లేదు, ఏదో ఒకటి చేయాలి అనిపించి ‘టిట్ ఫర్ టాట్.. ’ మొదలుపెట్టాను’ అన్నారు ఝాన్సీ. ఇది ‘పురుషసూక్తం’ తర్వాత ఆమె రాసి నటించి దర్శకత్వం వహించనున్న రెండోనాటకం.
‘రెండు రోజులకే ఏం రాయాలో తెలిసింది గాని మొదట సగం స్క్రిప్టే రాయగలిగాను. దానికే ఇంకొన్ని ఆలోచనలు జోడించి ఇంట్లో పిల్లలనే చేర్చి, క్లోజ్ సర్కిల్ ముందు వేసి చూపించాను. అలా వర్క్ చేసుకుంటూ నాటకం రాసుకుంటూ వచ్చాను. పార్ట్స్ పార్ట్స్‌గా రాస్తూ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రదర్శించి ఫ్రెండ్స్‌కు చూపించాను. అందరికీ నచ్చింది. మెయిన్ షో ఎప్పుడని అడగడం మొదలుపెట్టారు.
‘టిట్ ఫర్ టాట్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ బ్రా అండ్ బ్రీఫ్’కి కూడా మూలం పురుషాధిపత్య విషతుల్య భావజాలమే. కాకపోతే అప్రోచ్ వేరు. ఇదొక సోషల్ సెటైర్. దీనికి టార్గెట్ ఆడియన్స్ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వాళ్లు. వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అందుకే హ్యూమర్‌ని, వ్యంగ్యాన్ని ఎంచుకున్నాను. సీరియస్‌ను పండించడం తేలికే. వ్యంగ్యం చాలా కష్టం. భాష కూడా జెన్ జీ జార్గాన్స్‌తో ఉంటుంది. వాళ్ల తాలూకు మీమ్స్ ఉంటాయి. పురుషసూక్తం.. మగవాడు మీదేసుకున్న బాధ్యతల బరువు మీద ఫోకస్ చేసింది. ఇదేమో ఆ బాధ్యతలను ఇంకా వేసుకోని వాళ్లకు వేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతుంది’ అన్నారామె.
డిబేట్..
‘రవీంద్రభారతి ప్రదర్శనలో ఈ రెండూ నాటకాలు మరింత మార్పు చేర్పులతో వస్తున్నాయి. పురుషసూక్తంలో కోరస్ యాడ్ అవుతోంది. ‘టిట్ ఫర్ టాట్.. ’ లో ట్రాన్స్ ఉమన్, ట్రాన్స్ మన్ ఇలా అన్ని వర్గాల వాళ్లు నటిస్తున్నారు. ప్రతివాళ్లు వాళ్ల వాళ్ల శరీర ధర్మాలను రిప్రెజెంట్ చేస్తూ తమ సహజమైన పాత్రలనే పోషిస్తున్నారు. అంటే ప్రకృతిలో ఇంత వైవిధ్యం ఉంటుంది.. దాన్ని మనం గౌరవించాలి.. వాళ్ల వల్నరబులిటీని అర్థం చేసుకోవాలని తెలిపే ప్రయత్నం చేస్తున్నాం.. ప్రేక్షకులకే కాదు.. అందులో నటించిన నటీనటులకు కూడా! ఇందులో మా అమ్మాయి ధన్య పరిచయం అవుతోంది. నాటకాల ప్రదర్శన తర్వాత ఓపెన్ డిబేట్ ఉంటుంది’ అన్నారామె.
రంగయాత్ర..
సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంలో నాటకానిదే ప్రధాన పాత్ర మొదటి నుంచీ! ఆ బాధ్యతను కొనసాగించాలనుకుంటున్నాం.. ‘రంగయాత్ర.. థియేటర్ ఫర్ సోషల్ డిబేట్’ పేరుతో! అందులో భాగంగానే రవీంద్రభారతిలో ప్రదర్శన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని కాలేజెస్‌కి వెళ్లి అక్కడ ఈ నాటకాలను ప్రదర్శించబోతున్నాం స్ట్రీట్ ప్లే తరహాలో. ప్రదర్శన తర్వాత విద్యార్థులతో డిబేట్ పెడతాం. జెండర్ మీద అవగాహన కల్పించే ప్రయత్నమే ఇదంతా!’ అంటూ ముగించారామె.
– సరస్వతి రమ
కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది
‘పురుషసూక్తం నన్ను థియేటర్ ఆర్టిస్ట్‌ని చేసింది. ఈ నాటకాన్ని మగవాడిని అర్థంచేసుకునే ప్రయత్నంగా చెప్పొచ్చు. ఆ దిశగా .. పురుషాధిపత్య భావజాలంతో కండిషనింగ్ అయి ఉన్న మొత్తం సమాజాన్నే ఆత్మవిమర్శకు గురిచేస్తుంది ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది! రిహార్సల్స్‌లో ఎన్నిసార్లు నన్ను నేను తరచి చూసుకున్నానో! ఇది నాకొక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్!’
– వంశీ చాగంటి, హ్యాపీడేస్ ఫేమ్
Comments
Please login to add a commentAdd a comment