
రంగంలోకి ముగ్గురు సీఐలు
పోలీసుల అదుపులో 15 మంది యువకులు
నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం ఓ యువకుడు పరీక్ష రాస్తున్న ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ప్రశ్నపత్రం ఫొటో తీసి శాలిగౌరారం మండలంలోని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన విషయం విదితమే. ఈ లీకేజీ వ్యవహారాన్ని ఎస్పీ సీరియస్‌గా తీసుకుని ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించారు.
లీకేజీపై నకిరేకల్ ఎంఈవో మేకల నాగయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నకిరేకల్, శాలిగౌరారం సీఐలు రాజశేఖర్, కొండల్‌రెడ్డితో పాటు మరో సీఐ కూడా రంగంలోకి దిగారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో మకాంవేసి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ పోతుల గోపాల్, డిపార్ట్‌మెంటల్ అధికారి రామ్మోహన్‌రెడ్డిని విచారించి వారి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు.
సదరు విద్యార్థిని తండ్రిని పిలిపించి విచారించారు. ప్రశ్నపత్రం ఫొటో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వారి ఫోన్ నంబర్ల ఆధారంగా శాలిగౌరారం, నకిరేకల్ మండలాలకు చెందిన 15 మంది యవకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ రాజశేఖర్‌ను ప్రశ్నించగా కేసు పురోగతిలో ఉందని, ఇంకా విచారణ పూర్తి కాలేదని తెలిపారు.
పరీక్ష రాయకుండానే ఇంటికి..
నకిరేకల్ ఎస్సీ గురుకుల పాఠశాల సెంటర్‌లో రెండో రోజు హిందీ పరీక్ష రాసేందుకు వచ్చిన ఆ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఝాన్సీ పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. ఝాన్సీని శుక్రవారమే డిబార్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు ప్రకటించారు. శనివారం సెంటర్‌కు వచ్చిన ఆ విద్యార్థిని నుంచి డిబార్, పేపర్ లీకేజీకి సంబంధించి అధికారులు సంతకాలు తీసుకున్నారు. తర్వాత ఆమెను పోలీసుల సహకారంతో శాలిగౌరారం మండలం కేంద్రంలోని ఇంటి వద్ద కుటుంబ సభ్యులకు అప్పగించారు.
నా ప్రమేయం లేదు..: విద్యార్థిని ఝాన్సీ
‘నేను నర్సరీ నుంచి పదో తరగతి వరకు నకిరేకల్ కృష్ణవేణి స్కూల్‌లోనే చదివాను. చిన్నప్పటి నుంచి అన్ని క్లాసుల్లో కూడా 70కి పైగా మార్కులు సాధించి క్లాసు టాపర్‌గా ఉంటున్నాను. నేను పదో తరగతి పరీక్షలు రాస్తున్న క్రమంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కిటికీ దగ్గర పేపర్ చూపించమని ఒత్తిడి తెచ్చి ఫొటో తీసుకొని వెళ్లాడు. ఈ విషయంలో పోలీసులు ఏం చేస్తున్నారు. ఇన్విజిలేటర్‌కు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇందులో నా ప్రమేయం ఏముంది. నన్నెందుకు డిబార్ చేస్తారు.
శనివారం పరీక్ష రాసేందుకు వస్తే ప్రశ్నపత్రం ఫొటో తీసేందుకు సహకరించానని, నాతో బలవంతంగా సంతకం పెట్టించుకొని పరీక్ష రాయనివ్వకుండా చేసి.. డిబార్ చేశాం వెళ్లిపొమ్మని చెప్పారు. నాకు కాపీ కొట్టి రాయాల్సిన పరిస్థితి లేదు. నాకు పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలి. సప్లిమెంటరీ అనేది ఉండొద్దు. ఈ పరీక్షల్లోనే నాకు అవకాశం కల్పించి న్యాయం చేయాలి’. – ‘సాక్షి’తో విద్యార్థిని ఝాన్సీ
Comments
Please login to add a commentAdd a comment