Tenth class exam
-
కవలలకు కన్నీటి ‘పరీక్ష’
పెగడపల్లి(ధర్మపురి)/నిజామాబాద్ రూరల్: ఒకవైపు పదో తరగతి పరీక్ష.. మరో వైపు కన్నతండ్రి మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ కవల బిడ్డలు పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన గాజె చంద్రయ్య–లక్ష్మి దంపతులకు మొదటి సంతానంలో కూతురు జన్మించింది. రెండో సంతానంగా ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ జన్మించారు. వీరు స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరి తండ్రి చంద్రయ్య నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కాగా, మృతుని కుమారులు మంగళవారం పదో తరగతి హిందీ పరీక్షకు హాజరు కావలసి ఉంది. చదువుకు ఆటంకం కలగొద్దని బంధువులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి రామ్, లక్ష్మణ్‌లను పెగడపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పుట్టెడు దుఃఖంతోనే కవల సోదరులు పరీక్ష రాశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విషాదాన్ని దిగమింగి.. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం కేశాపూర్ గ్రామానికి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం బైక్ అదుపుతప్పి తాళ్ల కొత్తపేట్, మల్లారం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు ధనుష్ తీవ్ర దుఃఖంతోనే మంగళవారం శివాజీనగర్‌లోని శ్రీనూతన వైశ్య ఉన్నత పాఠశాలలో హిందీ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
Telangana: పదో తరగతి పరీక్షల షెడ్యూల్.. రేపే ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యా శాఖ అధికారుల బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి మార్చి రెండు లేదా మూడో వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోది. ఈ మేరకు పరీక్షలపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన.. ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు, సంబంధిత ఇతర అధికారులతో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వేంకటేశం సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ.. సమగ్ర శిక్ష అభియాన్‌పై విద్యా శాఖ అధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం పదో తరగతి పరీక్షల రీ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎంతో సమావేశం అనంతరం పరీక్షల షెడ్యూల్‌పై క్లారిటీ ఇస్తామని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమయాశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. అనంతరం అక్కడి నుంచి సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. పదో తరగతి పరిక్షల నిర్వహణ.. సమగ్ర శిక్ష అభియాన్‌పై విద్యా శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. సీఎంతో భేటీ అనంతరం పరీక్షల షెడ్యుల్‌పై క్లారిటీ ఇస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో నేడు లేదా రేపు(గురువారం) ఈ రోజు లేదా రేపు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు -
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి ప్రధాన పేపర్ల పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పరీక్షలను ఆరు పేపర్లతో నిర్వహించారు. ప్రథమ భాష (పేపర్–1), ద్వితీయ భాష, ఇంగ్లిష్, మేథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1, పేపర్–2, వొకేషనల్ కోర్సుల పేపర్లతో టెన్త్ పరీక్షలు పూర్తవుతాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి 26 వరకు జరుగుతుంది. ఇతర ప్రక్రియలను కూడా ముగించి ఫలితాలను మే 2వ వారంలో విడుదల చేయనున్నారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు లీకులు, ఫేక్‌లకు ఆస్కారం లేకుండా విద్యా శాఖ జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి ప్రశ్నపత్రంపైనా ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించింది. పరీక్ష కేంద్రాల వారీగా ప్రశ్నపత్రాలకు బార్ కోడింగ్ పెట్టింది. దీంతో ఎక్కడా అవకతవకలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కాపీయింగ్‌కు కూడా అడ్డుకట్ట పడింది. ఈ ఆరు రోజుల పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా 5 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది ‘నారాయణ’ అక్రమాలు గతేడాది కొన్ని కార్పొరేట్ యాజమాన్యాలు విద్యా వ్యాపారాన్ని పెంచుకొనేందుకు అత్యధిక పాస్ పర్సంటేజీ, మార్కుల కోసం ప్రశ్నపత్రాల లీకులకు తెగబడ్డాయి. టీడీపీ పెద్దలతో అనుబంధమున్న ‘నారాయణ’ విద్యా సంస్థ దీనికి తెరతీసింది. తమ సంస్థల్లోని పిల్లలతో కాపీయింగ్ చేయించేలా, అదే తరుణంలో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసేలా వ్యవహారాన్ని నడిపించింది. కొందరు ప్రభుత్వ టీచర్లనూ మభ్యపెట్టింది. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా దీనికి తోడయ్యారు. లీకులతో, సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రశ్నపత్రాల ప్రచారంతో విద్యార్థుల్లో గందరగోళం సృష్టించారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొని కఠిన చర్యలు తీసుకుంది. అక్రమాలతో సంబంధమున్న పలువురు నారాయణ విద్యా సంస్థల సిబ్బందిని, ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు, ఇతర వ్యక్తులపైనా కేసులు నమోదు చేసింది. 74 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమాలకు ప్రధాన కారణమైన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపైనా కేసులు నమోదు చేశారు. ఈసారి పకడ్బందీ చర్యలు ఈసారి పరీక్షల్లో చిన్న ఘటనలకు కూడా తావివ్వకూడదన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యా శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. పరీక్షల నిర్వహణలో పూర్తిగా ప్రభుత్వ సిబ్బందినే భాగస్వామ్యం చేసింది. గతంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇన్విజిలేటర్లు కాకుండా ఇతర సిబ్బంది ఆయా సంస్థల వారే ఉండేవారు. దీనివల్ల అక్రమాలకు ఎక్కువ ఆస్కారముండేది. ఈసారి దానికి అడ్డుకట్ట వేస్తూ ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లోనూ మొత్తం ప్రభుత్వ సిబ్బందినే నియమించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్ల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ తరలింపు, రూట్ ఆఫీసర్ల నియామకం, పరీక్ష కేంద్రాలకు మెటీరియల్ పంపిణీలో ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. లీక్, ఫేక్ లకు ఆస్కారం లేకుండా తీసుకున్న చర్యలివీ.. ♦ లీకులకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఎవరికీ పరీక్ష కేంద్రాల్లో ఫోన్లను అనుమతించలేదు. స్మార్ట్, డిజిటల్ వాచీలు, కెమెరాలు, బ్లూటూత్ వంటి ఎల్రక్టానిక్ పరికరాలనూ నిషేధించారు. ♦ ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలకు ఎంపికచేశారు. ♦ టీచర్లకు వారి స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాసే కేంద్రాల్లో కాకుండా ఇతర కేంద్రాల్లో విధులు కేటాయించారు. ♦ విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన ప్రశ్నపత్రాలను చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ సహా ఇద్దరు ఇన్విజిలేటర్ల సమక్షంలో సీల్ వేశారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేశారు. ♦ ప్రతి ప్రశ్నపత్రానికి బార్‌కోడింగ్ ఇవ్వడమే కాకుండా క్యూఆర్ కోడ్‌ను సూపర్ ఇంపోజ్ చేయించారు. దీనివల్ల ప్రశ్నపత్రం బయటకు వచ్చినా అది ఎక్కడి నుంచి వచ్చిందో వెంటనే తెలిసిపోతుంది. ♦ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలను అందించిన వెంటనే విద్యార్థులతో వాటిలోని అన్ని పేజీలపై రోల్ నంబర్, సెంటర్ నంబర్‌ను రాయించారు. ♦ విద్యార్థుల ఓఎమ్మార్ పత్రాలపైనా ఈసారి బార్ కోడింగ్ ఇచ్చారు ♦ సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ల సంఖ్యను రెట్టింపు చేశారు. రెవెన్యూ, పోలీసు సహా ఇతర విభాగాల సీనియర్ అధికారులను, ఇతర సిబ్బందిని కూడా పరీక్షల్లో భాగస్వాములను చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎస్పీల ఆధ్వర్యంలో పని చేశాయి. ♦ పరీక్ష కేంద్రాల్లోకి నిర్ణీత సమయంలో అనుమతించడమే కాకుండా పరీక్ష ముగిసిన తర్వాతే విద్యార్థులు, సిబ్బంది బయటకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. -
విద్యార్థులను గందరగోళానికి గురికానివ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల్లో భాగంగా సోమవారం సైన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఇదే కీలకం. గతంలో 11 పేపర్లతో టెన్త్ పరీక్ష జరిగేది. ఈసారి మొత్తం ఆరు పేపర్లకే పరిమితం చేశారు. ఇందులో భాగంగానే సైన్స్ రెండు (ఫిజికల్, బయలాజికల్ సైన్స్) పేపర్లను కలిపి ఒకేరోజు నిర్వహిస్తున్నారు. అయితే రెండు పేపర్లకు మధ్య 20 నిమిషాల గ్యాప్ ఇస్తున్నారు. కాగా సోమవారం పరీక్షపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్తగా చేపడుతున్న ఈ పరీక్ష విషయంలో విద్యార్థులు ఏమాత్రం గందరగోళానికి గురవ్వకుండా చూడాలని పేర్కొంటూ క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రెండు పేపర్లకు కలిపి 80 మార్కులుంటాయి. స్కూల్ అంతర్గత పరీక్షల ఆధారంగా 20 మార్కులు తీసుకుంటారు. మొత్తంగా 100 మార్కుల్లో విద్యార్థులు 35 సాధించాల్సి ఉంటుంది. పరీక్ష ఇలా... ♦ ముందుగా పార్ట్–1 (ఫిజికల్ సైన్స్) పరీక్ష ఉంటుంది. ఇది ఉదయం 9.30 గంటలకు మొదలై 11 గంటల వరకూ (1.30 గంటల వ్యవధి) ఉంటుంది. ఇందులోనే బిట్ పేపర్ (పార్ట్–బీ)ను 10.45 గంటలకు ఇస్తారు. 15 నిమిషాల్లో దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 20 నిమిషాలు బ్రేక్ ఇచ్చి బయలాజికల్ పేపర్ ఇస్తారు. ♦ బయలాజికల్ సైన్స్ పేపర్‌కు సంబంధించిన పరీక్ష 11.20 నుంచి 12.50 వరకూ (1.30 గంటలు) జరుగుతుంది. 12.35 గంటలకు బయలాజికల్ సైన్స్ పేపర్‌కు సంబంధించిన బిట్ పేపర్ (పార్ట్–బీ) ఇస్తారు. దీన్ని కూడా 15 నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. అధికారులకు ప్రత్యేక సూచనలు రెండు పేపర్లను విడివిడిగా ప్యాక్ చేసి, మూల్యాంకన కేంద్రాలకు పంపాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించింది. రెండు పేపర్లకు మధ్య 20 నిమిషాల బ్రేక్ సమయంలో విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపేందుకు అనుమతించవద్దని స్పష్టం చేసింది. -
పదో తరగతి పరీక్షల్లో పాసైన 43 ఏళ్ల వ్యక్తి.. కొడుకు ఫెయిల్
ముంబై: పిల్లలు పుట్టినప్పుడు కాదు వారు పెరిగి ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులకు అసలైన ఆనందం. కనిపెంచిన పిల్లలు కల్లెదుటే మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడితే ఎంతో గర్వంగా ఫీలవుతుంటారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైన.. పిల్లలను గొప్పగా చదివించేందుకే తాపత్రయపడుతుంటారు. చదువుకు మధ్యలోనే స్వస్తి పలికిన వారు కొకోల్లలు. ఆర్థిక సమస్యలు, పెళ్లి, కుటుంబ బాధ్యతలంటూ ఎన్నో బరువులను నెత్తిన పెట్టుకొని చదువును దూరం చేసుకుంటారు.తరువాత చదువుకోవాలని అనిపించిన వయసు గుర్తొచ్చి ఆగిపోతుంటారు. అయితే కొంతమంది మాత్రం వయసు సంబంధం లేకుండా విద్యను కొనసాగిస్తారు. మహారాష్ట్రకుచ ఎందిన భాస్కర్ వాఫ్‌మారే కూడా అలాంటి వ్యక్తే. మహారాష్ట్రలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో పుణెకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి ఉత్తీర్ణత సాధించాడు. విశేషమేంటంటే.. ఇదే ఫలితాల్లో తన సొంత కొడుకు ఫెయిల్‌అయ్యాడు. భాస్కర్ వాఘ్మారే తన ఏడో తరగతిలోనే విద్యను ఆపేశాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చిన్న పనిలో చేరి కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న భాస్కర్‌కు పెళ్లి అయి 15 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయితే 30 ఏళ్ల తరువాత తన చదువును కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాడు. కొడుకుతో కలిసి తండ్రి ఒకే ఏడాది పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో భాస్కర్ అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యారు. కానీ తన కొడుకు రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. చదవండి: స్పైస్ జెట్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం ‘నేనెప్పుడూ ఉన్నత చదువులు చదువుకోవాలని ఉండేది. కానీ కుటుంబ బాధ్యతల కారణంగా అది కుదరలేదు. ఎప్పటి నుంచి చదువును తిరిగి ప్రారంభించాలనుకుంటున్నా. అందుకే 10వ తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాను. నా కొడుకు కూడా ఈ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నాడు. వాడి చదువు నాకు సహాయపడింది. రోజు చదవుకునే వాడిని. ఉదయం పనిచేసి సాయంత్రం పరీక్షలకు సిద్ధమయ్యేవాడిని. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినందుకు సంతోషిస్తున్నా.. అయితే నా కొడుకు రెండు పేపర్లలో ఫెయిలవ్వడం బాధగా ఉంది. కానీ వాడిని సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రిపేర్ చేస్తాను.’ అని తన అనుభవాన్ని పంచుకున్నాడు. చదవండి: అగ్నిపథ్ అల్లర్లు: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్ -
అంబులెన్స్‌లోనే పరీక్ష
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి అంబులెన్స్‌లోనే పదో తరగతి పరీక్ష రాశాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బకల్‌వాడీ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన గౌతమ్.. మిర్యాలగూడలోని రవీంద్రభారతి పాఠశాలలో చదువుతున్నాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గౌతమ్ తీవ్రంగా గాయపడటంతో కాలుకు సర్జరీ జరిగింది. పరీక్షలు రాస్తానని గౌతమ్ పట్టుపట్టడంతో.. తల్లిదండ్రులు వైద్యుల పర్యవేక్షణలో అంబులెన్స్‌లో పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. అంబులెన్స్‌లోనే పరీక్ష రాసేం దుకు అధికారులు అనుమతి ఇచ్చారు. -
మాల్‌ప్రాక్టీస్ వ్యవహారం.. 22 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్
సాక్షి, నంద్యాల జిల్లా: కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో తెలుగు పరీక్ష రోజే మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన 22 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు. వీరిలో చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్, కస్టోడియన్, తొమ్మిది మంది ఇన్విజిలేటర్లతో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఉన్నారు. ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేయడంతో ఇద్దరు సీఆర్పీలు, పది మంది ఉపాధ్యాయులు, తొమ్మిది మంది ఇన్విజిలేటర్లు మొత్తం 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీరంతా సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనల ప్రకారం 48 గంటల పాటు రిమాండ్‌లో ఉంటే సస్పెండ్‌కు గురవుతారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ అయిన వారిలో చీఫ్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన సుధాకర్ గుప్త(పెట్నికోట), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, కస్టోడియన్ రాఘవయ్య (తిమ్మనాయినపేట), ఉపాధ్యాయులు నీలకంఠేశ్వరరెడ్డి (గొర్విమానుపల్లె), నాగరాజు (అబ్దులాపురం), మధుసూదన్‌రావు (చింతలాయిపల్లె), వెంకటేశ్వర్లు (అంకిరెడ్డిపల్లె), చిన్నదస్తగిరి (అంకిరెడ్డిపల్లె), వనజాక్షి (కనకాద్రిపల్లె), లక్ష్మీదుర్గ(రామకృష్ణ స్కూల్ తుమ్మలపెంట), ఆర్యభట్ట (అబ్దుల్లాపురం), పోతులూరు (గొర్విమానుపల్లె), రంగనాయకులు (క్రాఫ్ట్ టీచర్ అంకిరెడ్డిపల్లె), ఇన్విజిలేటర్లు హరినారాయణ (తుమ్మలపెంట), శివప్రసాద్ (అంకిరెడ్డిపల్లె), వీరేష్(తుమ్మలపెంట), శ్రీనివాసరెడ్డి (మదనంతపురం), మదన్మోహన్(తుమ్మలపెంట), విమల్‌తేజ (అంకిరెడ్డిపల్లె), రవీంద్రగుప్త (అంకిరెడ్డిపల్లె యుటీసీఎల్), రాజశేఖరరెడ్డి (అంకిరెడ్డిపల్లె), వెంకటసుబ్బారెడ్డి (తుమ్మలపెంట యుటీసీఎల్) ఉన్నారు. ఇద్దరు సీఆర్పీలు (ఔట్సోర్సింగ్) రాజేష్, మద్దిలేటిల సర్వీస్ రెన్యువల్ చేయక పోవడంతో వారిద్దరినీ విధుల నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: డ్రోన్ట్ వర్రీ!... మునిగిపోతున్నవారిని క్షణాల్లో కాపాడే డ్రోన్ -
పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వారి గ్రామం నుంచి పరీక్ష కేంద్రం వరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని ఆయా జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, జిల్లాల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్లకు ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) ఆదేశాలిచ్చారు. పరీక్ష అయిపోయాక ఇంటికి చేరుకునేందుకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అందులో సూచించారు. హాల్ టికెట్ ఆధారంగా బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాల వరకు రాకపోకలు సాగించొచ్చు. ఈ అవకాశం పదో తరగతి పరీక్షలు జరిగే ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో 3,780 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 6,22,746 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పది పరీక్షలపై మంత్రి బొత్స సమీక్ష విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గురువారం తొలిసారి సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలన్నింటినీ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర చర్యలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నతాధికారులతో కలసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, వైద్య సదుపాయం, ఫర్నిచర్ ఏర్పాట్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పది’పైనా పునరాలోచన!
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల తేదీలు మార్చాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనిపై వాస్తవ నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులను కోరినట్టు తెలిసింది. ఏప్రిల్‌లో పరీక్షలు పెడితే ఎలా ఉంటుందనే దానిపై ఆమె అధికారులను ఆరా తీసినట్టు సమాచారం. టెన్త్ పరీక్షలను మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్ తేదీల్లో మార్పు వల్ల ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పులు చేయడం అనివార్యమైంది. ఏప్రిల్‌కు బదులు మేలో టెన్త్ పరీక్షలను ఖరారు చేశారు. అయితే దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఆలస్యమైతే ఇదీ పరిస్థితి ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటో తేదీన టెన్త్ చివరి పరీక్ష ముగుస్తుంది. ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. గతంలో 11 పేపర్లు ఉన్నప్పుడు వాటి వాల్యుయేషన్ పూర్తి కావడానికి 15 రోజుల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం 6 పేపర్లు కాబట్టి కనీసం పది రోజుల సమయం తీసుకుంటుంది. ►ఒక విద్యార్థి రాసిన ఆరు సమాధాన పత్రాలు ఆరు వేర్వేరు జిల్లాలకు మూల్యాంకనం కోసం పంపుతారు. మూల్యాంకనం అనంతరం వేర్వేరు సబ్జెక్టుల్లో పొందిన మార్కుల వివరాలను అన్నింటినీ రాష్ట్రస్థాయిలో క్రోడీకరించి ఫలితాలను నిర్ణయిస్తారు. ఈ ఏడాది ఐదు లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసేవీలుంది.అంటే 30 లక్షల జవాబు పత్రాలకు సంబంధించిన మార్కుల (ఆరు సబ్జెక్ట్‌లు)వివరాలను క్రోడీకరించాలి. ఈ ప్రక్రియకు ఇరవై రోజుల సమయం పడుతుంది. ►ఇలా పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన ప త్రాల మూల్యాంకనానికి పది రోజులు, ఫలితాల వెల్లడికి 20 రోజులు మొత్తంగా 30 రోజుల కనీస సమయం తీసుకుంటుంది. అంటే జూలై మొదటి వారంలో పదవ తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ►ఫలితాల విడుదల తర్వాత ఎంత వేగంగా ప్రింటింగ్ ప్రక్రియ పూర్తి చేసినా, మెమోలను ప్రింట్ చేసి పాఠశాలలకు పంపించడానికి కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. దీంతో సాధారణం కంటే నెల ఆలస్యంగా జూలై చివరి వారంలోనే టెన్త్ విద్యార్థులు తదుపరి కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. సీబీఎస్ఈ విధానంలో చదివే విద్యార్థులకు ఏప్రిల్‌లో పరీక్షలు మొదలవుతాయి. ఫలితాలూ త్వరగా వస్తాయి. ప్రైవేటు కాలేజీలు కూడా మే నుంచే ఇంటర్ అడ్మిషన్లు మొదలు పెడతాయి. ఈ అంశాలన్నింటిపై విద్యాశాఖ మంత్రికి ఇప్పటికే అనేక వినతులు అందినట్టు సమాచారం. వాస్తవానికి కరోనా కారణంగా ఈ ఏడాది టెన్త్ సిలబస్‌ను 70 శాతానికి తగ్గించారు. అన్ని పాఠశాలల్లో సిలబస్ ప్రకారం బోధన పూర్తయింది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో రివిజన్ టెస్టులు పెడుతున్నారు. కాబట్టి ఏప్రిల్‌లో పరీక్షలు పెడితే విద్యార్థులు పరీక్షలు బాగా రాసే వీలుందని అంటున్నారు. అలాకాకుండా వేసవి మండిపోయే సమయంలో మూడు గంటల పాటు పరీక్ష రాయడం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23 పాఠశాలలకు చివరి పనిదినం. ఏప్రిల్‌లోనే నిర్వహించాలి పదవ తరగతి పరీక్షలను మే నెలకు బదులు ఏప్రిల్‌లో నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం.. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఆమెను ఆదివారం సంఘం ప్రతినిధులు రాజా భానుచంద్రప్రకాశ్, తుకారాం, కృష్ణ, గిరిధర్ తదితరులు కలిశారు. పరీక్షలు ఆలస్యమైతే వచ్చే విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడుతుందని, మండు వేసవిలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇబ్బందులు పడతారని తెలిపారు. -
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..
-
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
-
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
సాక్షి, హైదరాబాద్: కీలకమైన పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై ఉత్కంఠకు ప్రభుత్వం ముగింపు పలికింది. రాష్ట్రంలో మే 17వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మే 1వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలనూ ఇప్పుడు నిర్వహించే పరిస్థితి లేనందున రద్దు చేసి విద్యార్థులందరినీ ప్రమోట్ చేసింది. మే 2వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ద్వితీయ సంవత్సర పరీక్షల నిర్వహణకు సంబంధించి జూన్ మొదటి వారంలో కరోనా కేసుల పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని, 15 రోజుల ముందుగా పరీక్షల తేదీలను తెలియజేస్తామని వెల్లడించారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే జూన్ చివరి వారంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంటుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై గురువారం ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డితో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పరిస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదంతో తుది నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలు ఉంటాయా? ఉండవా? అనేది తెలియక కొద్దిరోజులుగా తీవ్ర అయోమయానికి గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎట్టకేలకు స్పష్టత రావడం ఊరటనిచ్చింది. కేంద్రం నిర్ణయం మేరకు రాష్ట్రంలోనూ.. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అదే విధంగా పదో తరగతి పరీక్షలను, ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చిత్రా రామచంద్రన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించారు. సెకండియర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఏమైనా బ్యాక్‌లాగ్స్ (ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టులు) ఉంటే వారికి ఆయా సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కులు ఇస్తామని పేర్కొన్నారు. టెన్త్‌లో ఎఫ్ఏ–1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు! ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు 5,21,000 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. అందులో రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. గతంలో ఫెయిల్ అయిన వారికి ఆయా సబ్జెక్టుల్లో కనీస మార్కులతో పాస్ చేయనున్నారు. ఇక రెగ్యులర్ విద్యార్థుల విషయంలో ఫార్మేటివ్ అసెస్మెంట్–1 (ఎఫ్ఏ) మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నాలుగు ఎఫ్‌ఏలకు బదులు రెండు ఎఫ్‌ఏలను నిర్వహించాలనుకున్నా ఒక ఎఫ్ఏ పరీక్షలే జరిగాయి. వాటిల్లో ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కులనే 100 శాతానికి లెక్కించి వచ్చే మార్కుల ఆధారంగా గ్రేడ్లను ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే కనీస మార్కులతో అందరినీ పాస్ చేసేలా చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే సీబీఎస్ఈ, ఇతర రాష్ట్రాల పదో తరగతి పరీక్షల విభాగాలు తీసుకునే నిర్ణయాలను పరిశీలించిన తరువాతే టెన్త్ విద్యార్థులకు మార్కులను కేటాయించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. గతేడాది కూడా టెన్త్ పరీక్షలు రద్దయ్యాయి. అయితే ఆ విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్ఏ పరీక్షలు జరిగాయి. వాటి ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయించడం సులభమైంది. అయితే ఈసారి ఎఫ్ఏ–1 మార్కులతోపాటు సీబీఎస్ఈ, ఇతర రాష్ట్రాల్లో విధానాలను అన్నింటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ నిర్ణయం మేరకు విద్యార్థులకు మార్కులను కేటాయించనున్నారు. ఇంటర్ విద్యార్థులు 11,31,994 మంది ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఎదురుచూసిన విద్యార్థులు 11,31,994 మంది ఉన్నారు. వారిలో ప్రథమ సంవత్సర రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులు 4,59,008 మంది ఉన్నారు. ఇప్పుడు వీరందరిని పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయనున్నారు. వారితోపాటు గతేడాది రెగ్యులర్, వొకేషనల్, ప్రైవేటు విద్యార్థులు 1,99,019 మంది ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయ్యారు. వారిని కూడా ఇప్పుడు ప్రమోట్ చేయనున్నారు. కరోనా కారణంగా గతేడాది ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. దీంతో ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకొని వెళ్లిపోయే దాదాపు 1.47 లక్షల మంది విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేసి పంపించారు. గతేడాది మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన 1,99,019 మందిని అప్పుడు పాస్ చేయలేదు. ఇపుడు ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసినందున వారిని కూడా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 4,73,967 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థుల పరీక్షలను వాయిదా వేసింది. జూన్ మొదటివారంలో పరిస్థితి సమీక్షించి వారికి పరీక్షలు నిర్వహించే తేదీలను ఖరారు చేయనుంది. స్వాగతించిన ఇంటర్ విద్యా జేఏసీ ప్రథమ సంవత్సర పరీక్షలు రద్దు చేసి, ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేయడాన్ని ఇంటర్ విద్యా జేఏసీ ఛైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ డాక్టర్ కళింగ కృష్ణ కుమార్ స్వాగతించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో గతేడాది ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన వారందరికి ఉపశమనమని, వారు ఇక ద్వితీయ సంవత్సర పరీక్షలు రాస్తే సరిపోతోందని వివరించారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. టెన్త్‌లో ‘ఎఫ్ఏ–1’ ఆధారంగా... పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్–1 (ఎఫ్ఏ) మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఇచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం ఒక ఎఫ్ఏ పరీక్షలే జరిగాయి. వాటిల్లో ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కులనే 100 శాతానికి లెక్కించి గ్రేడ్లను ఇచ్చే అవకాశం ఉంది. ఇంటర్ వెయిటేజీ ఉండదు.. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25% వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ కీలకం కానుంది. ఆ మార్కుల ఆధారంగా ఎంసెట్ కమిటీ ర్యాంకులను కేటాయించనుంది. ప్రమోట్ చేస్తున్నాం... కానీ ప్రథమ సంవత్సర విద్యార్థులను పరీక్షలు లేకుం డానే ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేయనున్నారు. ఫస్టియర్ విద్యార్థులు మరో సంవత్సరం పాటు ఉంటారు కనుక భవిష్యత్తులో సాధారణ పరిస్థితులు వస్తే పరీక్షలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి: CBSE పదో తరగతి పరీక్షలు రద్దు -
టెన్త్ పరీక్షలు జూన్ 8 నుంచి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ జూన్ 8 నుంచి పరీక్షలను నిర్వహించేలా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. ప్రధాన పరీక్షలు జూన్ 29తో ముగియ నుండగా ఓరియంటల్, వొకేషనల్ పరీక్షలు అన్నీ జూలై 5తో ముగియనున్నాయి. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధిని ఇస్తూ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. భౌతిక దూరం పాటించేలా పరీక్ష కేంద్రాలను పెంచడం, పాత కేంద్రాలకు అర కిలో మీటర్ దూరంలో కొత్త కేంద్రాలను ఏర్పా టు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా కేంద్రాలకు విద్యార్థులను పంపిం చేందుకు పాత కేంద్రాల వద్ద సహాయ కులను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం 9:30 గంటల నుంచి... పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసా గుతాయి. ఓరియంటల్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. వొకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. ప్రతి బెంచిపై ఒకరే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం ఉండేలా పరీక్ష కేంద్రాలను పెంచాం. ప్రస్తుతం 2,580 పరీక్షాకేంద్రాలు ఉండగా అదనంగా 2,005 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించు కోనున్నాం. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్ చేయడంతోపాటు విద్యార్థులకు మాస్కులను అందిస్తాం. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తాం. ప్రతి బెంచిపై ఒకరే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తాం. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడిపిస్తాం. పరీక్షలకు సంబంధించి హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. విద్యార్థులెవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని ప్రత్యేక గదుల్లో పరీక్ష రాయిస్తాం. ఎవరైనా ఇన్విజిలేటర్లకు దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని విధుల నుంచి తప్పించి రిజర్వులో ఉన్న వారిని నియమిస్తాం. సిబ్బంది మాస్కులు ధరించడంతోపాటు చేతులకు గ్లౌజ్‌లు ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి -
అప్పుడు 761.. ఇప్పుడు 1506!
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ మేరకు విద్యాశాఖ అధికారులు అదనపు పరీక్ష కేంద్రాల ఎంపికలో నిమగ్నమయ్యారు. పాత హాల్‌టికెట్‌తో.. కొంత మంది విద్యార్థులు కొత్త పరీక్ష కేంద్రంలో వార్షిక పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించాలనే కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ప్రస్తుత సెంటర్లకు అర కిలోమీటర్ దూరంలో కొత్తగా అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులకు జారీ చేసిన హాల్ టికెట్లపై పరీక్ష కేంద్రాలను కేటాయించారు. తాజా మార్గదర్శకాల మేరకు ప్రస్తుతం పరీక్ష కేంద్రాలు మారే అవకాశం ఉంది. విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు జారీ చేసే అవకాశం లేదు. వారంతా పాత హాల్‌టికెట్లపైనే పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే పరీక్ష కేంద్రం మారిన విషయాన్ని విద్యార్థులకు ఎలా చేరవేస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో 761 పరీక్ష కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం వీటి సంఖ్యను 1506కు పెంచారు. మొత్తం విద్యార్థులు 1,69,290 మార్చి 19 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలుగు, హిందీ లాంగ్వేజ్ పరీక్షలు మాత్రమే ముగిశాయి. ఆ తర్వాత జనతా కర్ఫ్యూ అమలు, ఆ వెంటనే లాక్డౌన్ ప్రకటన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. మిగితా సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించే అంశంపై నెలకొన్న సందిగ్ధానికి హైకోర్టు తెర దించింది. జూన్ 8 తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేయడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1,69,290 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గతంలో బెంచికి ఇద్దరు.. ప్రస్తుతం ఒక్కరే.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఒక్కో గదిలో పది నుంచి 12 మంది (గతంలో బెంచికి ఇద్దరు ఉండేవారు.. తాజా మార్గదర్శకాల మేరకు ఒకరినే కూర్చోబెడతారు) విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టాలని నిర్ణయించారు. పరీక్ష కేంద్రాల ఎదుట థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, శరీర ఉష్ణోగ్రతలను రికార్డు చేసిన తర్వాతే విద్యార్థులను లోనికి అనుమతించాలని భావిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు, ఇన్విజిలేటర్లకు మాస్క్ మస్ట్ అని స్పష్టం చేయడంతో పాటు పరీక్ష కేంద్రంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి శానిటైజర్ ఇవ్వనున్నారు. ‘పరీక్ష కేంద్రాల మార్పుపై విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ స్పష్టం చేశారు. అదనపు సెంటర్ల పేరుతో పాటు వాటిలో కేటాయించిన నంబర్లను మీడియా ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు చేరవేయనున్నట్లు తెలిపారు. సెంటర్ దగ్గర ఉన్న సిబ్బంది వారికి ఇదే విషయాన్ని సూచించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
'పదో తరగతి పరీక్షల వ్యాజ్యంపై విచారణ చేపట్టండి'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టును కోరారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని ప్రసాద్ పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు కరోనా నివారణకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు. అన్ని వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 19న పదో తరగతి వ్యాజ్యం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. -
ఆల్ ది బెస్ట్
సాక్షి, సిటీబ్యూరో: టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి మొత్తం 1,74,457 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 761 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈసారి నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తేశారు. నిర్దేశిత సమయం తర్వాత అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని సైతం పరీక్షకు అనుమతించనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు మాస్క్‌లు, చేతిరుమాళ్లు ధరించి వచ్చిన విద్యార్థులను అనుమతించనున్నారు. ఇంటి నుంచి తెచ్చుకునే మంచినీళ్ల బాటిల్‌ను కూడా అనుమతిస్తారు. విద్యార్థులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఆయా పరీక్ష కేంద్రాల్లో చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు, సబ్బులను అందుబాటులో ఉంచారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయ నుంది. ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు తక్షణ వైద్య సేవల కోసం ఆయా పరీక్ష కేంద్రాల్లో ఒక ఏఎఎన్‌ఎం సహా అవసరమైన మందులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. తల్లిదండ్రులు, పిల్లలంతా ఒకే సమయంలో రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.. పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికావొద్దు. వేళకు భోజనం చేయడం, నిద్రపోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం ద్వారా ఇప్పటి వరకు చదివిన అంశాలన్నీ గుర్తుంటాయి. జవాబులను సులభంగా రాయగలుగుతారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.– బి.వెంకటనర్సమ్మ,జిల్లా విద్యాధికారి, హైదరాబాద్ ప్రతిభా హైస్కూల్లో పరీక్ష రాయనున్న వీణావాణీలు రెండు తలలు అతుక్కుని జన్మించిన వీణావాణీలకు ఎస్ఎస్సీ బోర్డు మధురానగర్‌లోని ప్రతిభా హైస్కూల్లో సెంటర్ కేటాయించారు. జంబ్లింగ్ విధానం అమల్లో ఉన్నప్పటికీ.. వీరు ఒకే గదిలో పక్కపక్కనే కూర్చొని వేర్వేరుగా పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు వీరు స్క్రైబ్‌లను కోరలేదు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగా వీరి కోసం ఇద్దరు స్కైబ్‌లను సిద్ధంగా ఉంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి వెంకటనర్సమ్మ ప్రకటించారు. -
‘పరీక్షా’కాలం
సాక్షి, సిటీబ్యూరో: ‘పిల్లలకే కాదు..వారి భవిష్యత్తుపైగంపెడాశలు పెట్టుకున్న తల్లిదండ్రులకూ ఇది ఓ ‘పరీక్షా’ కాలం. పరీక్షలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిల్లల్లోనే కాదు తల్లిదండ్రుల్లోనూ ప్రిపరేషన్‌పై ఆందోళన మొదలవుతుంది. నిజానికి ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలిచి, ఆత్మ విశ్వాసాన్నిపెంపొందించాలి. అప్పుడే పిల్లలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా విజయవంతంగా పరీక్ష రాస్తారు. తద్వారా మంచి మార్కులు సాధిస్తారు’ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 4 నుంచి 23 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు, 19 నుంచి ఏప్రిల్ 6 వరకు టెన్త్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి 450 పరీక్షా కేంద్రాల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష రాయబోతున్నారు. ఇప్పటికే అధికారిక యంత్రాంగం అంతా పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నం కాగా... పిల్లల ప్రిపరేషన్ విషయంలో తల్లిదండ్రులు కుస్తీపడుతున్నారు. సాధారణంగా వార్షిక పరీక్షలు అనగానే పిల్లల్లో తీవ్రమైన మానసిక ఆందోళన మొదలవుతుంది. ఇది చదువు...అది చదువు... ఇలా చదవాలి... అలా చదవాలి... అంటూ తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తెస్తుంటారు. దీంతో పిల్లలు తీవ్రమైన ఒత్తిడికిలోనై ఇప్పటికే చదవిన అంశాలన్ని మర్చిపోతుంటారు. నిద్రాహారాలు మాని చదువుతుండటం వల్ల విద్యార్థుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో పిల్లలకు తల్లిదండ్రులు అండగా నిలవాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలి. ఇంట్లో చదువుకునే వాతావరణాన్ని కల్పించడంతో పాటు నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలపై కలెక్టర్ సమీక్ష వార్షిక పరీక్షల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎం.కృష్ణ సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ, విద్యుత్, ఆర్టీసీ, జలమండలి, తపాలా, ట్రాఫిక్, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. వార్షిక పరీక్షల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ తాగేందుకు మంచినీరు ఏర్పాటు చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, లైన్ల మరమ్మతు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి విద్యుత్ కోతలు లేకుండా చూడాలని సీపీడీసీఎల్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని పోలీసులకు, అస్వస్థతకు గురైన విద్యార్థులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ప్రతి సెంటర్లో ఒక ఏఎన్ఎం సహా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కోరారు.పరీక్షల కోసం ప్రత్యేక బస్సులను నడపాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష పూర్తైన తర్వాత పేపర్లను సకాలంలో ఆయా పరీక్ష కేంద్రాల నుంచి వాల్యూయేషన్ కేంద్రాలకు చేర్చాల్సిందిగా తపాలా శాఖకు సూచించారు. ఇంట్లో వాతావరణం కీలకం విద్యార్థులకు పునశ్ఛరణ సమయం చాలా ముఖ్యమైంది. ప్రణాళికాబద్ధంగా చదివితే అధిక మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. తోటి విద్యార్థులతో కలిసి అభ్యసనం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివేవారు తప్ప మిగిలిన విద్యార్థులు పాఠశాలల్లో గడిపేది రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు మాత్రమే. మిగిలిన సమయంలో ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి, వాళ్లు చదువులో రాణించేందుకు ఇంటి వాతావరణం ఎంతో ముఖ్యం. విద్యార్థులు ఇంటివద్ద చదివేటపుడు..వీలైనంతవరకూ వారిని టీవీ, కంప్యూటర్ వంటి ఉపకరణాలకు, వినోదాలకు దూరంగా ఉంచాలి. వారి ముందు సెల్‌ఫోన్ సంభాషణలు సరికాదు. పిల్లలకు ప్రత్యేక గది లేని ఇంట్లో పరీక్షల ముందు కేబుల్ కనెక్షన్ తొలగించడం అవసరం. పరీక్షల ముందు విందులు, వినోదాలు, శుభ కార్యాలకు విద్యార్థులను తీసుకెళ్లొద్దు. విద్యార్థికి సమయంతో పాటు ఏకాగ్రత కూడా చాలా ముఖ్యం. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి,మానసిక నిపుణుడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త బాగా రాయాలనే ఆలోచనతో చాలామంది రాత్రంతా నిద్రపోకుండా చదువుతుంటారు. దీంతో తలనొప్పి మొదలై చదివింది కూడా మర్చిపోయే అవకాశం ఉంది. కొంతమంది ఏమీ తినకుండా పరీక్షకు వెళ్తుంటారు. ఇలా చేస్తే కళ్లు తిరిగి, స్పృహ తప్పే ప్రమాదం ఉంది. పరీక్షల సమయంలో వేళకు పౌష్టికాహారం తీసుకోవడం, నిద్రపోవడం అవసరం. నగరంలో ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి ఓ గంట ముందే కేంద్రానికి చేరుకుంటే మంచిది. పరీక్షల సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా జవాబులు రాయొచ్చు. అంతేకాదు పిల్లల ఆత్మవిశ్వాసం పెంచేలా మాట్లాడాలి. ’చాలా తెలివైనవాడివి..అనుకుంటే ఏదైనా సాధిస్తావు..’ లాంటి పదాలను వాడుతూ ప్రోత్సహించాలి. ఏకాగ్రతను పెంచుకునేందుకు, ఒత్తిడిని అధిగమించేందుకు కొంత సమయం ఇంటి వద్ద యోగా, ధ్యానం చేయించాలి. – రాధిక, సైకాలజిస్ట్ వారం రోజుల్లో హాల్‌టికెట్లు అభ్యర్థుల హాల్ టికెట్లు మరో వారం రోజుల్లో ఆయా కాలేజీలకు అందనున్నాయి. ఫీజులు చెల్లించకపోవడంతో వారికి హాల్‌టికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు నిరాకరించే అవకాశం ఉండటంతో విద్యార్థులే నేరుగా హాల్ టికెట్‌ను పొందే అవకాశం కల్పించాం. ఆన్లైన్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే వీలుకల్పించాం.–బి.జయప్రద బాయి,హైదరాబాద్ జిల్లా ఇంటర్ బోర్డు ఆఫీసర్ -
అంతా పదిలమే..
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి ఘటనలు లేకుండా ఎగ్జామ్స్ ముగియడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పరీక్షలు ముగిసిన విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం జిల్లాలో తార్నాకలోని సెయింట్ ఆన్స్, సికింద్రాబాద్ వెస్లీ కేంద్రాలను ఎంపిక చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి పేపర్ వాల్యుయేషన్ ప్రారంభించి మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశమున్నట్టు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 70,009 మంది రెగ్యులర్, 960 ప్రైవేటు విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో చివరి రోజు బుధవారం నిర్వహించిన థర్డ్ లాంగ్వేజ్ పేపర్–2 పరీక్షకు 494 మంది రెగ్యులర్, 314 మంది ప్రైవేటు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 45,528 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, చివరిరోజు 181 మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. మేడ్చల్ జిల్లాలో 43,532 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 204 మంది చివరిరోజు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇదిలా ఉంటేవేసవి సెలవుల్లో ఇతర భాషలు, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందడం వల్ల భవిష్యత్‌లో సబ్జెక్టుపై మరింత పట్టు సాధించవచ్చని ఉపాధ్యాయ, అధ్యాపక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 12 నుంచి వేసవి సెలవులు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. వీరికి వార్షిక పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. మరో నాలుగైదు రోజుల్లో పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం రెండు మూడు రోజుల్లోనే ఫలితాలు కూడా వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఆయా తరగతుల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది. -
రేపటి ‘పది’ పరీక్ష వాయిదా
చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్రంలో పలుచోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో ఈ నెల 22న జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పేపర్–1 వాయిదా వేశారని డీఈఓ పాండురంగస్వామి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంగ్లిషు పేపర్–1 వాయిదా పడినందున విద్యార్థులు 23న జరిగే ఇంగ్లిషు పేపర్–2 కు సిద్ధం కావాలని సూచించారు. వాయిదా పడ్డ పేపర్ –1 పరీక్ష ఏప్రిల్ 3న జరుగుతుందని వివరించారు. విధుల నుంచి ఇద్దరు టీచర్ల తొలగింపు.. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహిం చి నందుకు ఇద్దరు ఉపాధ్యాయులను తొలగించినట్లు డీఈఓ పాండురంగస్వామి తెలిపారు. ఏర్పేడు జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ఒకరు, పిచ్చాటూరు జెడ్పీ హైస్కూల్లో ఒకరిని తొలగించినట్లు వెల్లడించారు. ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి బుధవారం నిమ్మనపల్లె మండలంలో 2, బి.కొత్తకోట మండలంలో 3 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని చెప్పారు. హిందీ పరీక్షకు 52,769 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 52,562 మంది హాజరయ్యారన్నారు. 207 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. -
తెలుగు విద్యార్థులతో చెలగాటం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పదో తరగతి తెలుగు విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. నిర్బంధ తమిళం చట్టం నుంచి తాత్కాలిక మినహాయింపు జీఓ జారీ చేయడంలో జరిగిన జాప్యం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేలా చేసింది. చివరి వరకు ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా వ్యవహరించి విద్యార్థులను, తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేసింది. తమిళనాడులో నివసించే లింగ్విస్టిక్ మైనార్టీ కుటుంబాలకు 2006లో అప్పటి డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్బంధ తమిళ చట్టం గుదిబండలా మారింది. 2015–16 విద్యాసంవత్సరంలో ఈ చట్టం కార్యరూపం దాల్చగా పదో తరగతి చదివే ఇతర భాషల వారు విధిగా తమిళం సబ్జెక్టు పరీక్ష తప్పనిసరిగా రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్బంధ తమిళం చట్టానికి అనుగుణంగా పాఠశాలల్లో తమిళ టీచర్ల సంఖ్య పెంచడం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి వాటిని పూర్తిగా విస్మరించి చట్టాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసింది. దీంతో వివిధ తెలుగు సంఘాల వారు ప్రభుత్వానికి విన్నవిస్తూ న్యాయస్తానాన్ని ఆశ్రయించారు. ఈ కారణంగా 2015–16 విద్యాసంవత్సరంలో తాత్కాలిక మినహాయింపు లభించింది. అయితే ఆ ఏడాది నుంచి ప్రతి విద్యాసంవత్సరంలోనూ తెలుగు విద్యార్థు ఇదే సమస్యను ఎదుర్కోవడం, మినహాయింపు తెచ్చుకోవడం తప్పలేదు. జీఓ విడుదలపై మరీ ఘోరం: అయితే ఈ ఏడాదికి సైతం మినహాయింపు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మరింత ఘోరంగా వ్యవహరించింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి సెంగోట్టయ్యన్ జీఓ జారీపై తీవ్రస్థాయిలో జాప్యం చేశారు. మరో 48 గంటల్లో పరీక్షలు ప్రారంభం కానుండగా ఈనెల 12న జీఓను విడుదల చేశారు. మాతృభాషలోనే పరీక్షలు రాసుకోవచ్చని మౌఖికంగా సమాచారం అందడంతో విద్యార్థులు ఆదిశగా పరీక్షకు సమాయత్తమయ్యారు. అయితే ఈ జీఓ రాష్ట్ర రాజధాని కేంద్రమైన చెన్నై మినహా అనేక జిల్లాలకు చేరలేదు. పది పరీక్షలు గురువారం ప్రారంభం కాగా మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకుసమయం కేటాయించారు. తొలిరోజే లాంగ్వేజ్ 1 కింద తమిళం, తెలుగు, హిందీ తదితర (విద్యార్థులు ముందుగా ఎన్నుకున్న) సబ్జెక్టులో పరీక్ష రాయాల్సి ఉంది. తిరువళ్లూరు జిల్లాలో 520 మంది, కృష్ణగిరి జిల్లా 1,500 మంది, వేలూరు జిల్లాలో 120 మంది తెలుగు విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యామంత్రి జారీచేసిన జీఓ తమకు అందలేదంటూ పరీక్షకేంద్రం నిర్వాహకులు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హతాశులయ్యారు. మరో రెండుమూడు గంటల్లో పరీక్ష రాయాల్సి ఉండగా ఇంతకూ తాము తెలుగు రాయాలా, తమిళం తప్పనిసరా తెలియక గందరగోళానికి గురయ్యారు. ముఖ్యంగా తిరువళ్లూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితి విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. 11 గంటల తరువాత నిర్వాహకులు విద్యార్థుల వద్దకు వచ్చి మీరు ఏ భాష పరీక్షను రాయదలుచుకున్నారో తెలుపుతూ దరఖాస్తు చేయాల్సిందిగా సూచించారు. దీంతో ఒకింత ఉపశమనం పొందిన విద్యార్థులు దరఖాస్తులు భర్తీ చేసి ఉసూరుమంటూ పరీక్షకు హాజరయ్యారు. పది పరీక్షలు ప్రారంభం: కాగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల్లో 3731 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్ష రాసే సమయం కేటాయించారు. కాపీయింగ్ జరక్కుండా 5,500 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటయ్యాయి. అలాగే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పరీక్షల నిర్వహణ బృందాలు ఏర్పాటయ్యాయి. పరీక్షలు రాసే ఖైదీల కోసం పుళల్ జైల్లో ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా 27 మంది పురుష ఖైదీలు, ఇద్దరు మహిళా ఖైదీలు పరీక్షలు రాశారు. అలాగే వేలూరు జైల్లో ఆరుగురు, ఒక మహిళా ఖైదీ, కడలూరు జైల్లో 15 మంది లెక్కన మొత్తం 51 మంది ఖైదీలు పరీక్షలు రాశారు. ఏప్రిల్ 12లోగా మూడో విడతకుగడువు: మూడో విడత కింద 6 నుంచి 9వ తరగతి పరీక్షలను ఏప్రిల్ 12వ తేదీలోగా ముగించాల్సిందిగా విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 10, 11, 12 తరగతుల పరీక్షలు ఈనెల 29వ తేదీతో ముగుస్తున్నాయి. మూడో విడత పరీక్షలను ఏప్రిల్ 1న ప్రారంభించి 12వ తేదీలోగా ముగించాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 18న పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరుగనుండగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
'టెన్'షన్ వద్దు
సాక్షి,సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షలకు గ్రేటర్లో సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు.. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే, ఈసారి ‘నిమిషం ఆలస్యం’ నిబంధనను ఈసారి తొలగించారు. నిర్దేశిత సమయం దాటిన తర్వాత మరో ఐదు నిమిషాల వరకు అనుమతించడం విద్యార్థులకు ఊరటనిచ్చే అంశం. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1,71,731 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు జలమండలి ఆయా కేంద్రాలకు ఉచితంగా తాగునీరు సరఫరా చేయనుంది. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఐడీకార్డు, హాల్‌టికెట్ చూపించి ఆయా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. రంగంలోకి 40 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ హైదరాబాద్ జిల్లాలో 81,785 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, వీరి కోసం 373 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 వేలకుపైగా ఇన్విజిలేటర్లను నియమించారు. 21 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాలో 45,503 మంది విద్యార్థుల కోసం 205 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. 2,480 మంది ఇన్విజిలేటర్లు సహా పది ప్లైయింగ్ స్క్వాడ్ బృందాలను సిద్ధం చేశారు. మేడ్చల్ జిల్లాలో 44,443 మంది పరీక్షకు హాజరువుతుండగా, వీరి కోసం 191 పరీక్ష కేంద్రాలు, 2,600 మంది ఇన్విజిలేటర్లు, ఎనిమిది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్ సహా ఏ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని, విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. అంతేకాదు ఆయా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా విద్యార్థులను ఉదయం 8.30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. 9.45 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబోమని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఒకరోజు ముందే తమ పరీక్ష కేంద్రానికి చేరుకుని, ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నేటి నుంచి ఒంటిపూట బడులు వేసవి ఎండలు ముదరడంతో శుక్రవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పదో తరగతి పరీక్ష కేంద్రం ఉన్న స్కూల్లో మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. సెంటర్ లేని చోట మాత్రం ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఉత్తీర్ణత పెంపునకు ప్రత్యేక కార్యాచరణ సాక్షి,మేడ్చల్ జిల్లా: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేసింది. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలతో పాటు పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు పారితోషకం, ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అదేవిధంగా జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా పదోతరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులకు బహుమతులను ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పదికి పది జీపీఏ సాధిస్తే రూ.25 వేలు బహుమతిగా అందజేస్తానని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. అలాగే వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేలు నగదుతో పాటు ఆ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఉత్తీర్ణత శాతం పుంపునకు ఉపాధ్యాయులు, విద్యార్థులోను పట్టుదల పెరిగింది. 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 85 కాగా, 2017–18లో 94 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది నూరు శాతం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. -
టెన్త్‌లో స్లో లెర్నర్స్‌పై ప్రత్యేక నజర్
విద్యారణ్యపురి: వచ్చే ఏడాది మార్చి 16 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు ప్రారంభించారు. టెన్త్ క్లాస్ విద్యార్థులందరితోపాటు స్లోలెర్నర్స్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు సిలబస్ పూర్తి అయింది. అక్కడక్కడ కొన్నింటిలో సిలబస్ పూర్తికాకుండా ఉంటే పూర్తిచేయాలని డీఈఓ నారాయణరెడ్డి ఆదేశించారు. సిలబస్ పూర్తి అయిన ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు రివిజన్ కూడా చేయాల్సింటుంది. జిల్లాలో 156 ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లాపరిషత్, కేజీవీలు, మోడల్ స్కూల్స్‌లో కలిపి మొత్తంగా 6వేలమంది వరకు పదోతరగతి విద్యార్థులున్నారు. అందులో స్లోలెర్నర్స్ ప్రతి హైస్కూల్లోను 10 నుంచి 20 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఏ–1పరీక్షల ఫలితాల ఆధారంగా గుర్తించి ఆయా విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. గత విద్యాసంవత్సరం ఉత్తీర్ణత 92 శాతం కాగా ఈ విద్యాసంత్సరంలో 100 శాతం ఫలితాల కోసం విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. స్లోలెర్నర్స్‌కు కీలకభావనల బుక్లెట్లు.. జిల్లాలోని పలు పాఠశాలల్లో చదవులో వెనుకబడిన టెన్త్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిçపుణులతో ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన కీలక భావనలతో కూడిన బుక్లెట్లు డీఈఓ తయారు చేయించారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, గణితం, సాంఘిక శాస్త్రాల బుక్లెట్స్ ఇటీవలనే అన్ని పాఠశాలలకు పంపించారు. సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థులు బోధిస్తూ సాధన చేయించాల్సి ఉంటుంది. నాలుగు దశలో స్లిప్ టెస్టులు నిర్వహించాలి. ఆ స్లిప్ టెస్టుల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులను డీఈఓకు ఆన్లైన్లో అప్లోడు చేయాల్సి ఉంటుంది. పరీక్షల నాటికి స్లోలెర్నర్స్‌ను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మొదటి దశ ఈనెల 18 నుంచి 29 వరకు, రెండో దశ డిసెంబర్ 31 నుంచి జనవరి 17 వరకు, మూడోదశ జనవరి 18 నుంచి 30 వరకు, నాల్గో దశ ఫిబ్రవరి 1 నుంచి 11 వరకు ఆయా విద్యార్థులకు స్లిప్ టెస్టులు నిర్వహిస్తారు. ఆయా ప్రధానోపాధ్యాయులతో డీఈఓ సమీక్ష నిర్వహించి విద్యార్థుల్లో మార్పుపై ఆరా తీస్తారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో సమీక్షలు చేపట్టారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక సాధన చేయిస్తున్నారా.. లేదా అనేది పరిశీలించేందుకు ముగ్గురు సెక్టోరియల్ ఆఫీసర్లు వేణు ఆనంద్, బి.మనోజ్‌కుమార్, డి.రమాదేవికి బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా రెండు మూడు మండలాలకు కలిపి అబ్జర్వర్లను నియమించారు. వారు విద్యార్థుల ప్రాక్టీస్‌ను పరిశీలించనున్నారు. స్లోలెర్నర్స్ విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎప్పటికప్పుడు వారి ప్రోగ్రెస్‌ను తెలియజేస్తారు. వేకప్ కాల్ కూడా చేసి వారిని చదువుకునేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది. మిగతా విద్యార్థులకు 50 రోజుల ప్రణాళిక జిల్లాలోని అన్ని హైస్కూళ్లు, కేజీబీవీలు, మోడల్‌స్కూల్స్‌లో పది విద్యార్థులందరికీ 50 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. పాఠశాల సమయానికి ఒకగంట ముందుగా, పాఠశాల సమయం ముగిశాక మరోగంట ప్రత్యేక తరగతులు ఉంటాయి. కొన్నిచోట్ల హైస్కూల్స్‌లో హెచ్ఎంలు ప్రత్యేక దృష్టితో వారికి స్నాక్స్ అందజేస్త్ననారు. గత ఏడాది వార్షిక పరీక్షల సందర్భంగా మిగిలిన రెండో సెట్ ప్రశ్నాపత్రాలను పోలీస్టేషన్ నుంచి హెచ్ఎంలు తీసుకెళ్లి ఆయా విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించాలని డీఈఓ ఆదేశించినట్లు సమాచారం. ఫిబ్రవరి 16 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు పదోతరగతి విద్యార్థులకు వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రి ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత మార్చి 16 నుంచి వార్షిక పరీక్షలు కొనసాగుతాయి. -
పది పాసవడం.. ఇక ఈజీ!
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదోతరగతి చదివే విద్యార్థులకు శుభవార్త. ఇక మీరంతా పదోతరగతి పాస్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే పాస్ మార్కులకు సంబంధించిన నిబంధనలను సవరించి, ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీబీఎస్ఈ) త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తంగా 33 శాతం వస్తే చాలు.. ప్రస్తుతం సీబీఎస్ఈ విద్యావిధానంలో పదో తరగతిలో ఓ విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలంటే ఇంటర్నల్స్‌లో 33 శాతం, థియరీ పరీక్షల్లో 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉంది. అయితే ఈ నిబంధనను సవరించి, ఇంటర్నల్స్, థియరీలో కలిపి 33 శాతం మార్కులు వస్తే చాలు. అంటే థియరీలో 33 శాతంకంటే తక్కువగా వచ్చి, ఇంటర్నల్స్‌లో 33 శాతం కంటే ఎక్కువ వచ్చినా.. మొత్తంగా 33 శాతం దాటితే ఉత్తీర్ణులైనట్లే. రెండింటిలో 33 శాతం మార్కులు రావాలనే నిబంధన నుంచి మినహాయింపును ఇవ్వాలని సీబీఎస్ఈ యోచిస్తున్నట్లు సమాచారం. మీ అభిప్రాయమేంటో చెప్పండి.. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ని అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలకు బోర్డు జారీచేసింది. 33 శాతం నిబంధనను సవరించడంపై అభిప్రాయమేంటో చెప్పాలని ఆయా పాఠశాలలను సీబీఎస్ఈ కోరింది. వాటి నుంచి సమాధానం వచ్చిన వెంటనే ఈ వారంలోనే సమావేశమై, దీనిపై అధికారిక ప్రకటన జారీ చేయాలని భావిస్తోంది. 2011 నుంచి సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలను ఆప్షన్ (ఐచ్చికం)గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ 7 ఏళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలను కచ్చితం చేశాయి. దీంట్లో భాగంగానే పరీక్ష విధానాల్లో ఈ మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 19 నుంచి పరీక్షలు... వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ సూచనప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన కార్యాచరణను బోర్డు అధికారులు వేగవంతం చేశారు. 10, 12 తరగతుల పరీక్షలకు ముందు జరిగే ‘స్టూడెంట్ యాక్టివిటీస్’ను వీలైనంత త్వరగా అందజేయాలని ఆయా విద్యా సంస్థలు, పాఠశాలలకు సీబీఎస్ఈ అధికారులు లేఖలు పంపారు. దీన్ని బట్టి ఏటా జరిగే తేదీలకంటే ముందుగానే బోర్డు పరీక్షలు ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. సీబీఎస్ఈ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివే 9, 10 తరగతుల విద్యార్థుల వివరాలు ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. సెకండరీ, సీనియర్ సెకండరీ పరీక్షల నిర్వహణ నిమిత్తం ఆయా వివరాలను cbse.nic.inలో నమోదు చేయాలని సూచించింది. -
పొడగరి.. పదో తరగతి పాసయ్యాడు!
రాజాం/సంతకవిటి : ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడిని గుర్తుపట్టారా? సంతకవిటి మండలం తలతంపర గ్రామానికి చెందిన ఇజ్జాడ షణ్ముఖరావు. వయసు 19 ఏళ్లు. హార్మోణుల ప్రభావం కారణంగా ఎనిమిది అడుగుల ఎత్తు పెరిగాడు. చిన్న వయసులో పాఠశాలకు వెళ్లి చదువుకునే విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో స్వస్తి చెప్పాడు. ఉపాధి అవకాశాలు లేక.. స్థానికంగా పనులు దొరక్క అగచాట్లు పడుతుండేవాడు. అయితే ఈ యువకుడి అసాధారణంగా పొడవు పెరగడంపై ఏడాదిన్నర క్రితం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు షణ్ముఖరావు వివరాలు సేకరించారు. పదో తరగతి పూర్తి చేస్తే ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పట్టువదలని విక్రమార్కుడిలా ఓపెన్ విద్య ద్వారా పదో తరగతి చదివాడు. రెండు నెలల క్రితం పాలకొండ కేంద్రంగా పరీక్షలు రాశాడు. ఇటీవల వచ్చిన ఫలితాల్లో పాసయ్యాడు. సంబంధిత సర్టిఫికెట్‌ను షణ్ముఖరావుకు సంతకవిటి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు యు.రవిశంకర్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా పొడగరి షణ్ముఖరావు మాట్లాడుతూ.. అధికారులు స్పందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. -
సీసీ కెమెరాల నిఘాలో స్పాట్ వాల్యుయేషన్
గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాలకు మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్) ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలోని స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖాధికారులు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు విధిగా గుర్తింపు కార్డును ధరించడంతో పాటు సెల్ఫోన్లు వెంట తీసుకురాకూడదని నిబంధనలు విధించారు. ఒక్కసారి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలోకి అడుగుపెట్టిన ఉపాధ్యాయులు సాయంత్రం మూల్యాంకనం ముగిసేవరకూ బయటకు వెళ్లేందుకు అవకాశం లేని విధంగా విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 2,100 మంది ఉపాధ్యాయుల నియామకం నగరంపాలెం స్టాల్ బాలికోన్నత పాఠశాలలోని స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో క్యాంప్ అధికారి, డీఈవో ఆర్.ఎస్ గంగా భవాని పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 2,100 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ నియమించింది. వీరిలో అసిస్టెంట్ క్యాంప్ అధికారులతో పాటు చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారు. సోమవారం ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ ఈనెల 15వ తేదీ వరకూ కొనసాగుతుంది. మూల్యాంకన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు తాగునీరు, క్యాంటిన్, టాయిలెట్లు వంటి మౌలిక వసతులను కల్పించారు. స్పాట్ వాల్యుయేషన్ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్లో నామమాత్రపు ధరకు ఆహారంతో పాటు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మినరల్ వాటర్ సదుపాయం కల్పిస్తున్నారు. గతేడాది వరకు నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటినే నేరుగా ఉపాధ్యాయులకు అందిస్తూ రాగా గుంటూరు నగరంలో ఇటీవల డయేరియా ప్రబలిన నేపథ్యంలో కూలింగ్ వాటర్ క్యాన్లు తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాకు చేరుకున్నఆరు లక్షల స్క్రిప్ట్‌లు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి ఆరు లక్షల స్క్రిప్ట్‌లు జిల్లాకు వచ్చాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు 40 స్క్రిప్ట్‌లకు మూల్యాంకనం నిర్వహించాల్సి ఉందని డీఈవో ఆర్.ఎస్ గంగా భవానీ చెప్పారు. స్పాట్ వాల్యుయేషన్ విధి నిర్వహణకు నియామకం పొందిన ఉపాధ్యాయులు సోమవారం ఉదయం 8.30 గంటలకు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సంబంధిత ఉపాధ్యాయులను రిలీవ్ చేసి పంపాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విధులకు గైర్హాజరైన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంతో శ్రమకోర్చి పరీక్షలు రాసిన ఏ ఒక్క విద్యార్థికీ నష్టం కలిగించని రీతిలో ప్రశ్నపత్రాలకు పకడ్బందీగా మూల్యాంకనం జరపడంతో పాటు వచ్చిన మార్కులను చీఫ్ ఎగ్జామినర్లు, కోడింగ్ అధికారులతో పాటు అసిస్టెంట్ క్యాంప్ అధికారులతో క్షుణ్ణంగా పరిశీలించే విధంగా చర్యలు చేçపడుతున్నట్టు చెప్పారు.