బుధవారం మాస్క్‌లు ధరించి పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న బాగ్‌లింగంపల్లిలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినులు
సాక్షి, సిటీబ్యూరో: టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి మొత్తం 1,74,457 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 761 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈసారి నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తేశారు. నిర్దేశిత సమయం తర్వాత అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని సైతం పరీక్షకు అనుమతించనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు మాస్క్‌లు, చేతిరుమాళ్లు ధరించి వచ్చిన విద్యార్థులను అనుమతించనున్నారు. ఇంటి నుంచి తెచ్చుకునే మంచినీళ్ల బాటిల్‌ను కూడా అనుమతిస్తారు.
విద్యార్థులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఆయా పరీక్ష కేంద్రాల్లో చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు, సబ్బులను అందుబాటులో ఉంచారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయ నుంది. ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు తక్షణ వైద్య సేవల కోసం ఆయా పరీక్ష కేంద్రాల్లో ఒక ఏఎఎన్‌ఎం సహా అవసరమైన మందులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. తల్లిదండ్రులు, పిల్లలంతా ఒకే సమయంలో రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు.
8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి..
పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికావొద్దు. వేళకు భోజనం చేయడం, నిద్రపోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం ద్వారా ఇప్పటి వరకు చదివిన అంశాలన్నీ గుర్తుంటాయి. జవాబులను సులభంగా రాయగలుగుతారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.– బి.వెంకటనర్సమ్మ,జిల్లా విద్యాధికారి, హైదరాబాద్
ప్రతిభా హైస్కూల్‌లో పరీక్ష రాయనున్న వీణావాణీలు
రెండు తలలు అతుక్కుని జన్మించిన వీణావాణీలకు ఎస్‌ఎస్‌సీ బోర్డు మధురానగర్‌లోని ప్రతిభా హైస్కూల్లో సెంటర్ కేటాయించారు. జంబ్లింగ్ విధానం అమల్లో ఉన్నప్పటికీ.. వీరు ఒకే గదిలో పక్కపక్కనే కూర్చొని వేర్వేరుగా పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు వీరు స్క్రైబ్‌లను కోరలేదు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగా వీరి కోసం ఇద్దరు స్కైబ్‌లను సిద్ధంగా ఉంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి వెంకటనర్సమ్మ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment