గణితం ప్రశ్నలు బయటకు.. | Questions from the maths paper are also circulating on social media | Sakshi

గణితం ప్రశ్నలు బయటకు..

Mar 27 2025 4:30 AM | Updated on Mar 27 2025 4:30 AM

Questions from the maths paper are also circulating on social media

జుక్కల్‌ ఉన్నత పాఠశాల టెన్త్‌ సెంటర్‌లో ఘటన  

పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురి సస్పెన్షన్‌  

నిజాంసాగర్‌/కామారెడ్డి టౌన్‌: పదో తరగతి గణితం పేపర్‌లోని ప్రశ్నలు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. పైగా ఓ సెంటర్‌లో మాస్‌ కాపీయింగ్‌ కూడా జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష కేంద్రం నుంచి బుధవారం గణితం ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. వాటికి సంబంధించిన సమాధానాల చిటీలు కూడా సెంటర్‌లోని విద్యార్థులకు అందజేసి మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. 

ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వచ్చిన నేపథ్యంలో బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, డీఈవో ఎస్‌ రాజు, తహసీల్దార్, పంచాయతీ అధికారి, ఎంఈవో, పోలీసులు విచారణ జరిపారు. వాస్తవమని తేలడంతో పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్‌ సూపరింటెండెంట్‌ సునీల్, డిపార్ట్‌మెంట్‌ ఆపీసర్‌ భీమ్, ఇన్విజిలేటర్‌ దీపికలను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ డీఈవో బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

తమ పాఠశాలలో వంద శాతం ఫలితాలు సాధించేందుకు కొందరు ఉపాధ్యాయులు కలిసి ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు బయటకు పంపి మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడేలా చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మాల్‌ ప్రాక్టీస్, పేపర్‌ లీకేజీలు చేయొద్దని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా, పలు కేంద్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 

ఏడుగురి అరెస్టు 
గణితం ప్రశ్నల లీకేజీ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశామని ఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. ‘ఓ తండ్రి తన కుమారుడి కోసం ఎగ్జామ్‌ సెంటర్‌లో తాత్కాలికంగా వాటర్‌ సప్లయ్‌ చేసే ఓ వ్యక్తితో కొన్ని ప్రశ్నలు బయటకు తెప్పించాడు. బయట సంజయ్‌ అనే మరో వ్యక్తి ఈ ప్రశ్నలను సేకరించాడు. కొంతమంది మీడియా ప్రతినిధులు అతడి నుంచి ప్రశ్నలు తీసుకొని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. 

విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో జాదవ్‌ సంజయ్, షేక్‌ ముబీన్‌(వాటర్‌మ్యాన్‌), కాండే మనోజ్‌ (జీపీ కారోబార్‌), విద్యార్థులు ఇబాత్‌వార్‌ ఫిలిప్స్, ఇబాత్‌వార్‌ వరప్రసాద్, మీడియా ప్రతినిధులు మెహరీ హనుమండ్లు, కొప్పుల గంగాధర్‌లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశాం’అని ఎస్పీ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement