కొత్త విధానం.. ఇక పరీక్షల్లో చూసి రాయడమే.. ఎలాంటి అనుమానలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఏడాదిపాటు పుస్తకాలు తిరగేయడం... ముఖ్యమైనవి బట్టీపట్టడం... ఆఖరులో పునశ్చరణతో హడావుడి చేయడం.. ఇదీ ఇప్పటివరకూ అందరికీ తెలిసిన పరీక్ష విధానం. ఇందులో పరీక్ష హాల్లోకి చిన్న చిట్టీని కూడా అనుమతించరు. కానీ, ఈ సంప్రదాయ విధానానికి భిన్నంగా రాష్ట్ర సాంకేతిక విద్యామండలి పరీక్షలు నిర్వహించింది. పుస్తకాలు చూసి మరీ పరీక్షలు రాసేందుకు అనుమతించింది.
గత నవంబర్‌లో జరిగిన పాలిటెక్నిక్ పరీక్షలో ఈ సరికొత్త పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అప్లైడ్ ఇంజనీరింగ్ మేథమెటిక్స్ పేపర్లో అకడమిక్ పుస్తకాన్ని చూసి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇందులో 59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పుస్తకాలు చూడకుండా 2021 ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సబ్జెక్టు పరీక్షలో కేవలం 35 శాతం మాత్రమే ఉత్తీర్ణత వచ్చింది. ఇక నుంచీ ఇదే తరహా పరీక్ష విధానాన్ని మరికొన్ని సబ్జెక్టులకు విస్తరించాలనే యోచనలో అధికారులున్నారు.
కాపీ కొట్టడం కాదు.. క్రియేటివిటీ పెంచడం
చూచి రాస్తే మార్కులు రావా? రిజల్ట్ పెరిగితే గొప్పా? ఇలాంటి అనుమానులొస్తే పొరపాటే అంటున్నారు అధికారులు. ఇంతకాలం బట్టీ పట్టే పద్ధతిని దూరం చేసి, విద్యార్థుల ఆలోచనాశక్తిని పెంచడమే దీని ఉద్దేశమని చెబుతున్నారు. పరీక్షకు మండలి సూచించిన అకడమిక్ పుస్తకాల్లో రెండింటిని మాత్రమే అనుమతిస్తారు. పరీక్షలో ప్రశ్నలు అడగడంలోనే అసలు కిటుకు ఉంటుంది.
ప్రశ్నలను నేరుగా కాకుండా, పరోక్ష విధానంలో అడుగుతారు. క్వశ్చన్ బ్యాంక్‌లో ఉన్నట్టు సమాధానాలు ఈ అకడమిక్ పుస్తకాల్లో నేరుగా దొరకవు. ఉదాహరణకు త్రికోణమితిని పాఠ్యాంశంలో పొందుపరిస్తే.. పరీక్షలో వచ్చే ప్రశ్న ఇదే మూస పద్ధతిలో ఉండదు. ఆ లెక్కను పూర్తిగా సాధన చేస్తే... సూత్రాల ప్రకారం అనుసరిస్తేనే సమాధానం దొరుకుతుంది. ఒక రకంగా ఇది విద్యార్థి మరింత ఆలోచించి సమాధానం ఇవ్వగలిగేలా ప్రోత్సహిస్తుందని నిపుణులు అంటున్నారు.
చాప్టర్ మొత్తం చదవడమే కాకుండా, ఏ కోణంలోనైనా సమాధానం రాయగల నేర్పును ముందు నుంచే విద్యార్థి అలవర్చుకోవాలి. అప్పుడే ఓపెన్ బుక్ విధానంలో సమాధానం రాసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో బట్టీ విధానంలో ట్విస్ట్ చేసి ప్రశ్న ఇస్తే ఆన్సర్ ఇచ్చే ఆలోచన దిశగా విద్యార్థి వెళ్లలేదని ఫలితాలను బట్టి తెలుస్తోందని అధికారులు అంటున్నారు. ఓపెన్ బుక్ విధానంపై ముందే అవగాహన కల్పించడం వల్ల వివిధ కోణాల్లో ఆలోచనాశక్తిని పెంచుకున్నారని చెబుతున్నారు.
పరీక్షల నాణ్యత పెరుగుతుంది
విద్యార్థి పట్టాతో బయటకు రావడం కన్నా... మంచి నైపుణ్యం, ఆలోచనాశక్తితో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి తరం మార్కెట్లో మంచి కేరీర్‌కు ఇదే దోహదపడుతుంది. ఓపెన్ బుక్ విధానంతో విద్యార్థి నైపుణ్యాన్ని కొలవడానికి వీలుంటుంది. ఈ దిశగానే కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం.
–డాక్టర్ సి.శ్రీనాథ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి
ఆలోచనకు పదును
క్లోజ్డ్ బుక్ విధానానికి, ఓపెన్ బుక్ విధానానికి చాలా తేడా ఉంది. పుస్తకం దగ్గరున్నా, ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవడానికి చాప్టర్ మొత్తం చదవాల్సి వచ్చింది. దీనిపై ముందే అవగాహన కల్పించడంతో సబ్జెక్ట్‌పై కమాండ్ తెచ్చుకున్నాం. బట్టీ పద్ధతి కాకుండా, మరింత ఆలోచించి సమాధానాలు రాశాం. మున్ముందు పోటీ పరీక్షల్లోనూ సులువుగా జవాబులు రాయొచ్చనే విశ్వాసం పెరిగింది.
– ఎన్.ప్రవీణ్ కుమార్, పాలిటెక్నిక్ విద్యార్థి, హైదరాబాద్