పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రం తారుమారు చేసి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.
తొర్రూరు(పాలకుర్తి): పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రం తారుమారు చేసి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగింది. టెన్త్ పరీక్షల్లో శుక్రవారం గణితశాస్త్రం రెండో పేపర్ జరిగిం ది. రోజు స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలను సంబంధిత పరీక్షా కేంద్రానికి అరగంట ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడి అధికారులు గణితం ప్రశ్నపత్రానికి బదులుగా.. సాంఘికశాస్త్ర పేపర్‌ను తీసుకెళ్లారు. పాఠశాలలో ప్రశ్నపత్రం కట్టలను పరిశీలిస్తూ సంతకాలు చేస్తున్న సమయంలో జరిగిన తప్పు గుర్తించారు.
వెంటనే ఆ ప్రశ్నపత్రాలను స్థానిక జెడ్పీ హైస్కూల్‌కు తీసుకెళ్లారు. అక్కడికి వచ్చిన జిల్లా ఇన్‌చార్జి డీఈవో శ్రీనివాసాచారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే జెడ్పీ హైస్కూల్‌లో అదనంగా ఉన్న గణితం ప్రశ్న పత్రాన్ని ఇచ్చి పంపించారు. అప్పటికే 10 నిమిషాలు ఆలస్యం కాగా, పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూశారు. కాగా, ప్రశ్నప్రతం తారుమారయ్యేందుకు నెల్లికుదురు మండలం మేతరాజుపల్లి జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రమేష్‌బాబు, మరిపెడ మండలం సీతారాంపూర్ స్కూల్ అసిస్టెంట్ రామ్మోహన్, తొర్రూరు జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం వేణుమాధవరెడ్డి, నర్సింహులపేట మండలం పెద్దనాగారం జిల్లా పరిషత్ హెచ్‌ఎం కె.రమేశ్‌లను బాధ్యులను చేస్తూ.. వారిని సస్పెండ్ చేశారు.