ఇదంతా రవళి చేసిందని ఎలా తెలిసింది? | sakshi special a true story | Sakshi
Sakshi News home page

ఇదంతా రవళి చేసిందని ఎలా తెలిసింది?

Published Mon, Jun 13 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

ఇదంతా రవళి చేసిందని ఎలా తెలిసింది?

ఇదంతా రవళి చేసిందని ఎలా తెలిసింది?

 గజ్జెల గజ్జి!

మతాల గజ్జి... కులాల గజ్జి మనకు తెలిసినవే!
కానీ... ఈ గజ్జెల గజ్జి ఏంటి?
ఇది పెద్దవాళ్ల గొడవల గజ్జి...
దానిని పిల్లలకూ అంటించారు.
గజ్జెలకు తగిలిన ఆ అసూయ పిల్లలకూ పాకింది.
వికసించే మనసులలో లయతప్పిన ఈ ధ్వనులు
రాక్షస తాండవమాడాయి!

 
అది సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల. వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో మళ్లీ పాఠశాల ప్రారంభమైంది. ఆరవ తరగతికి కొత్త బ్యాచ్ విద్యార్థుల నమోదు జరుగుతోంది. పాత పిల్లలు ఇంకా అందరూ రాలేదు. వారాంతానికి అందరూ దిగుతారు. అప్పటికే వచ్చిన వాళ్లలో కొత్త క్లాసుకెళ్తున్న ఉత్సాహం కనిపిస్తోంది. ‘‘కొత్త పుస్తకాలు ఎప్పుడిస్తారు మేడమ్’’ అని టీచర్లను అడుగుతున్నారు. ‘‘ఈ శనివారానికంతా వచ్చేస్తాయి. సోమవారం మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అప్పటి వరకు రఫ్ నోట్‌బుక్‌లో రాసుకోండి. మీ పాతటెక్ట్స్‌బుక్స్ పారేయకండి. మధ్యలో ఎవరైనా పుస్తకాలు పోగొట్టుకుంటే పనికొస్తాయి’’ అని టీచరు చెప్పేలోపే ‘‘కొత్త యూనిఫామ్ కూడా ఆ రోజే ఇస్తారా’’ ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు.

 
సిక్త్స్ క్లాసు నుంచి సెవెన్త్ కెళ్తున్న రూపను వాళ్ల అమ్మానాన్నలు తీసుకొచ్చారు. రూప బుగ్గల మీద కన్నీళ్లు చారికలు కడుతున్నాయి. అలాగే రూప చేయి పట్టుకుని  ప్రిన్సిపల్ గదిలోకి తీసుకెళ్లారు. రిపోర్టు చేసి బయటకు వచ్చేశారు. రూప మాత్రం వాళ్ల అమ్మ కొంగు పట్టుకుని ఉంది. రూపకు కేటాయించిన గదికి వెళ్లడానికి ముందు ఓ పక్కగా నిలబడి ఉన్నారు ముగ్గురూ.


‘‘ఇక్కడ నేనుండనమ్మా’’ అని గునుస్తోంది రూప. ‘‘ఏం కాదమ్మా! చూడు అందరూ ఇక్కడ ఉండి చక్కగా చదువుకుంటున్నారు. మనూళ్లో పెద్ద బడి లేదు కద తల్లీ’’ అనునయిస్తోంది రూప తల్లి. ఇంటి నుంచి వచ్చినప్పుడు ఇదంతా మామూలే,  రెండు రోజుల్లో పిల్లలు మామూలైపోతారు... అన్నట్లు అక్కడి టీచర్లు తమ వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. ఓ అరగంట గడిచిందో లేదో... రూప ఏడుపు వినిపించింది. టీచర్లు పరుగున వచ్చారు. రూప వాళ్ల అమ్మ కొంగును తన చేతికి గట్టిగా చుట్టుకుంటోంది. వదిలితే ఎక్కడ వెళ్లిపోతారేమోనన్న భయం ఆ కళ్లలో.  ‘‘పిల్లలకు హోమ్‌సిక్‌నెస్ ఉంటుంది. మేము చూసుకుంటాం మీరు వెళ్లండి. దిగులు పడితే ఫోన్ చేయిస్తాం’’ అని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు టీచర్లు. అయినా వాళ్ల సంకోచం వదల్లేదు. రూప తల్లిని చుట్టేసుకుంది.


‘‘ఏమిటి ప్రాబ్లెమ్’’ అని ఓ టీచరు అడిగారు. తల్లి మెల్లగా నోరు విప్పింది... ‘‘మేడమ్! రాత్రిళ్లు పాపకు దెయ్యం కనిపిస్తోందట’’. టీచరు ఇబ్బందిగా చూసింది. ఇలాంటప్పుడు గద్దిస్తే పిల్లలు హడలిపోతారు. బుజ్జగించి నచ్చచెప్పాల్సిందే. రూపను దగ్గరకు పిలిచి... ‘‘దెయ్యం ఉందని నీకెలా తెలిసింది’’ అని అడిగారు.  ‘‘నిద్రపోతుంటే పక్కనే గజ్జెల శబ్దం వినిపిస్తోంది’’ ‘‘మరి మిగిలిన వాళ్లకు వినపడదా’’

 
‘‘ఉహూ... నాకు మాత్రమే మెలకువ వస్తోంది. ఎవరో కాలు మీద తట్టినట్లవుతోంది. లేచి చూస్తే ఎవరూ ఉండరు... గజ్జెల శబ్దం మాత్రం వినిపిస్తోంది’’. ఎలా నచ్చచెప్పాలా అని టీచర్ ఆలోచనలో పడ్డారు. తల్లి కొంగును గుంజుతూ ‘‘నేనుండనమ్మా’’... మళ్లీ మొదటికొచ్చింది రూప మారం. ఇంతలో మరో ఇద్దరు టీచర్లు చేరారు. ‘‘సరే, రూపా! వార్డెన్ మేడమ్ ఇక్కడే ఉంటారు. వాచ్‌మన్‌ను నీ బెడ్ దగ్గరే పడుకోమని చెప్తాను. నీకు గజ్జెల చప్పుడు వినిపించగానే అతడిని పిలువు’’ అని పాపకు ధైర్యం చెప్పి, తల్లితండ్రులకు నచ్చచెప్పి పంపించారు. అదే రోజు ఓ టీచరు అన్ని క్లాసులకెళ్లి ‘‘అందరూ కాలి పట్టీలు ఇచ్చేయండి’’ అని అడిగి తీసుకున్నారు.

 
మరుసటి రోజు ఉదయానికి...

రూప పుస్తకాలు చిందరవందరగా పడి ఉన్నాయి. కాగితాలను గట్టిగా లాగి చించినట్లున్నారెవరో. రూపకు ధైర్యం చెప్పి, ఏడుపు ఆపించి, స్కూలుకు పంపించేసరికి వార్డెన్‌కు చుక్కలు కనిపించాయి.  ఆ రాత్రి రూపను క్లాస్ లీడర్ దగ్గర పడుకోబెట్టారు టీచర్లు. క్లాస్ లీడర్ ధైర్యమైన అమ్మాయి. రూపకు ధైర్యం చెప్తోంది. ఆ తర్వాతి రోజు తెల్లవారే సరికి...


‘‘రాత్రి కూడా గజ్జెల శబ్దం చెవిలో వినిపించింది’’ అని ఏడుపు లంకించుకుంది రూప. పిల్లలందరూ చుట్టూ చేరారు. రూపలో ఏదో తేడా కనిపిస్తోంది. ఏమిటా అని చూస్తే... జుట్టు కత్తిరించేసి ఉంది. అప్పటి వరకు ఆందోళన పడుతున్న ప్రిన్సిపల్‌కూ, టీచర్లకూ మబ్బు వీడిపోయినట్లయింది. వీలయినంత త్వరగా చెక్ పెట్టేయాలి. లేకపోతే స్కూలుకు చెడ్డపేరు వస్తుంది... అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రహస్యంగా దర్యాప్తు మొదలైంది.  ఎంత గుంభనంగా ఉంచాలనుకున్నా విషయం బయటకు పొక్కింది. ‘హాస్టల్‌లో దెయ్యం తిరుగుతోందట’ అంటూ మొదలైన పుకారు రకరకాల అనుబంధ కథనాలతో చిక్కదనం సంతరించుకుంటోంది.

 
కొందరు తల్లిదండ్రులు పాఠశాలకొచ్చి ప్రిన్సిపల్‌తో గొడవ పడుతున్నారు. ‘ఇక ఆలస్యం కాకూడదు’ ప్రిన్సిపల్ నుంచి ఘాటుగా ఆదేశం. స్కూల్ స్టాఫ్ అంతా రంగంలోకి దిగింది. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వారి ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. రూప గ్రామంలో తెలిసిన వారి ద్వారా కొంత ఆధారభూతమైన సంగతి తెలిసింది. దాంతో హాస్టల్‌లో శోధనకు ఆధారం దొరికినట్లయింది. గజ్జెల గుట్టు బయటపడింది. అప్పటి వరకు రూప చెవుల్లో మోగిన గజ్జెల చప్పుడు, స్టాఫ్ గుండెల్లో పరుగెత్తిన రైళ్ల చప్పుడు రెండూ ఆగిపోయాయి.(గోప్యత కోసం పేర్లు మార్చాం)  - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 

 
ఇదంతా రవళి చేసిందని ఎలా తెలిసింది?
స్కూల్ స్టాఫ్ సేకరించిన సమాచారం ప్రకారం తర్జని రవళి వైపు చూపిస్తోంది. ఆ అమ్మాయి కదలికలను గమనించమని క్లాస్ లీడర్లకు చెప్పారు. రెండు రోజుల్లోనే ఆ అమ్మాయి కాలిపట్టీలు ఎక్కడ దాచిందో కనిపెట్టి తెచ్చి ఇచ్చారు. రోజూ వాటితో రూప చెవి దగ్గర, ఆమెకు మాత్రమే వినిపించేటట్లు శబ్దం చేసినట్లు రవళి ఒప్పుకుంది.

 

ఏం జరిగిందంటే!
రూప గ్రామానికి చెందిన మరొక అమ్మాయి రవళి కూడా అదే హాస్టల్‌లో ఉంటోంది. ఆ రెండు కుటుంబాలకు మధ్య మంచి సంబంధాలు లేవు. రవళి తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా కక్షలు పెరగడానికి కారకులయ్యారు. రూపను చదువుకోనివ్వకుండా హడలగొట్టి పంపేయాలనుకున్నారు. అందులో భాగంగానే రవళి తన కాలి పట్టీలతో రూప మంచం దగ్గర చప్పుడు చేయడం, పుస్తకాలు చించడం, జుట్టు కత్తిరించడం వంటివన్నీ చేసింది.

 

మరి దెయ్యం భయం?
పిల్లల్లో దెయ్యం భయం పోగొట్టడానికి కళాజాతాల సహకారం తీసుకున్నారు. వాళ్లు వర్క్‌షాప్ నిర్వహించి దెయ్యాలు, చేతబడులు ఉండవని కౌన్సెలింగ్ ఇచ్చారు. వెలుగుతున్న కర్పూరం నోట్లో వేసుకుని చూపించిన తర్వాత చాలా మంది అమ్మాయిలు తామూ చేస్తామని ముందుకొచ్చారు. ‘ఒక్కో బ్యాచ్‌కి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తుంటే, మరుసటి ఏడాదికి కొత్త బ్యాచ్ మూఢవిశ్వాసాలను మూటగట్టుకుని వస్తుంటుంది. వీటికి తోడు చీకటంటే పిల్లలకు స్వతహాగానే భయం ఉంటుంది. దాంతో కనీసం రెండేళ్లకోసారైనా ఇలాంటి సందర్భం ఒకటి ఎదురవడం, ఆ పరిస్థితిని సున్నితంగా అధిగమించడానికి కత్తిమీద సాము చేయడం మాకు అలవాటే’నంటుంటారు సంక్షేమ పాఠశాలల టీచర్లు.

 

ఏ చప్పుడు విన్నా భయపడతారు!
ఈ సంఘటన నేను పుడూరులో ఉన్నప్పుడు జరిగింది. ఇది చాలా సంకట స్థితి. సంక్షేమ హాస్టళ్లకు వచ్చే వారిలో ఎక్కువ మంది అల్పాదాయ వర్గాల వాళ్లే ఉంటారు. వెనుకబాటుతనంతోపాటు వారి జీవనశైలిలో మూఢవిశ్వాసాలు కూడా పాదుకుని ఉంటాయి. దెయ్యాలు, చేతబడులు... అనే పదాలను పిల్లలు తరచు వింటుంటారు. వారు గ్రామం వదిలి హాస్టల్‌కు వచ్చినా కూడా విశ్వాసాల ప్రభావం అంత త్వరగా వదలదు. హాస్టల్ అంటే కొత్త ప్రదేశం. అమ్మానాన్నలు, సొంతవాళ్లెవరూ ఉండరు. ఆ గుబులు మనసులో గూడు కట్టుకుని ఉంటుంది. ఏం జరిగినా, ఏది విన్నా తాము నమ్ముతున్న విశ్వాసాలతో అన్వయించుకుని భయపడిపోతుంటారు. ‘‘దెయ్యం లేదు, ఏమీ లేదు, వెళ్లి పడుకోండి’’ అని గట్టిగా అంటే ఇంకా భయపడిపోతారు. అందుకే  అనునయంగా చెబుతుంటాం.
- తన్నీరు శశికళ, పి. జి. టి, గణితం,  సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, నాయుడుపేట

 

సమన్వయం ఎలా!
ఇద్దరి తల్లిదండ్రులకూ విషయం చెప్పి... పిల్లల మధ్య కక్షలు, కార్పణ్యాలు పెంచకూడదని, వారి మెదళ్లను కలుషితం చేయకూడని హితవు చెప్పారు టీచర్లు. రవళి పేరు బయటకు వస్తే ఆమెని దోషిగా చూస్తారని బయట పెట్టలేదు. స్నేహంగా ఉండకపోతే స్కూలు నుంచి పంపేస్తామని టీచర్లు భయపెట్టడంతో కొన్నాళ్లలోనే ఆ పిల్లలు కలిసిపోయారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement