కీవ్: రష్యాలోని కుర్స్క్ పరిధిలో గల సుడ్జా నగరంలోని ఒక బోర్డింగ్ స్కూల్‌పై దాడి జరిగింది. దీనిపై ఉక్రెయిన్, రష్యాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నగరం గత ఐదు నెలలుగా ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఈ దాడిలో నలుగురు మృతిచెందారని, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపారు. భవనం శిథిలాల నుంచి 84 మందిని ఉక్రెయిన్ దళాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయని ఉక్రెయిన్ తెలిపింది. పౌరులకు ఆశ్రయం కల్పించిన బోర్డింగ్ స్కూల్‌పై మాస్కో బాంబు దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు.
ఆదివారం తెల్లవారుజామున పాఠశాలపై ఉక్రెయిన్ సైన్యం క్షిపణి దాడి చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించారని పేర్కొంది. ఇదిలా ఉండగా, శనివారం ఉక్రెయిన్‌లోని పోల్టావా నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌పై రష్యా సాగించిన క్షిపణి దాడిలో మరణించిన వారి సంఖ్య 12కి పెరిగిందని, వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం తెలిపింది. ఐదు అంతస్తుల భవనంపై జరిగిన ఈ దాడిలో 17 మంది గాయపడ్డారని సమాచారం.
మాస్కో ఉక్రెయిన్‌పై 55 డ్రోన్‌లను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం రాత్రికి రాత్రే 40 డ్రోన్లు ధ్వంసమయ్యాయి. ఖార్కివ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ సిన్యుహుబోవ్ తెలిపారు. పశ్చిమ రష్యాలోని ఐదు ప్రాంతాలలో రాత్రిపూట ఐదు ఉక్రెయిన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కుర్స్క్ ప్రాంతంలో మూడు డ్రోన్లను, బెల్గోరోడ్, బ్రయాన్స్క్ ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించారని ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment