శిథిల, అద్దె భవనాలతో అవస్థలు... విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు, వానొస్తే గదుల్లోకి నీళ్లు
పరిసరాల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు.. పాములు, తేళ్లు, విష పురుగులు
కంపుకొడుతున్న బాత్రూమ్‌లు.. అక్కడే గడుపుతున్న విద్యార్థులు
వంట కోసం ఇంకా టెండర్లు పూర్తిగాక.. తిండి కోసం ఇబ్బందులు
డైట్ చార్జీలు సరిపోక పోషకాహారం అందని దుస్థితి
అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటున్న యజమానులు
నిధులు సరిగా రాకపోవడమే సమస్య అంటున్న సంక్షేమ శాఖ అధికారులు
వసతి గృహంకాదు.. ‘శిథిల’ గృహం
నల్లగొండ జిల్లా మునుగోడులోని ఎస్సీ బాలుర హాస్టల్ దుస్థితి ఇది. భవనం శిథిలావస్థకు చేరడంతో తరచూ స్లాబ్‌పై పెచ్చులు ఊడిపడుతున్నాయి. భారీ వర్షం వస్తే కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు అంటున్నారు. హాస్టల్ పరిస్థితి బాగోలేక విద్యార్థులసంఖ్య తగ్గిందని.. గతంలో 60 మందికిపైగా ఉంటే.. ఇప్పుడు 40 మందే ఉన్నారని పేర్కొంటున్నారు.
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో పాఠ శాలలు పునఃప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తోంది. చాలామంది విద్యార్థులు తిరిగిసంక్షేమ హాస్టళ్లకు చేరుతున్నారు. కానీ హాస్టళ్లు మాత్రం వసతుల లేమి, అపరిశుభ్రత, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. విరిగిన కిటికీలు, పగిలిన తలుపులు, చెత్తాచెదారం, పిచి్చమొక్కలతో నిండిన పరిసరాలు, పాములు, తేళ్లు, విషపురుగులు, అపరిశుభ్రంగా మారిన టాయిలెట్లతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నిజానికి వేసవి సెలవుల్లో దాదాపు నెలన్నర పాటు వసతి గృహాలన్నీ మూసి ఉన్నాయి. తిరిగి తెరిచే నాటికి వాటిని చక్కదిద్దాల్సిన సంక్షేమ శాఖలు ఏమాత్రం పట్టించుకోకపోవడం సమస్యగా మారింది. మరోవైపు హాస్టళ్లలో వంట కోసం టెండర్లు పూర్తిగాకపోవడం, డైట్ చార్జీలు సరిపోకపోవడంతో విద్యార్థులకు సరైన ఆహారం అందని దుస్థితి నెలకొంది.
విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 2,020 వసతిగృహాలు ఉన్నాయి. అందులో 497 పోస్టుమెట్రిక్, 1,523 ప్రీమెట్రిక్ హాస్టళ్లు. వీటిలో సుమారు 3.30 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో పదోతరగతి పూర్తయిన విద్యార్థులు వెళ్లిపోవడం, కింది తరగతుల్లో కొత్త చేరికలు నమోదవడం జరుగుతోంది. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో కూడా చేరికలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వృత్తి విద్యా కోర్సులైన పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజనీరింగ్ తదితర ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అడ్మిషన్లు కొనసాగనున్నాయి. ఇలా వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. వసతుల లేమి మాత్రం సమస్యగా మారింది.
పారిశుధ్యానికి బడ్జెట్ ఏదీ?
శాశ్వత భవనాలున్న సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల సమస్య తీవ్రంగా ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వసతిగృహాల్లో పారిశుధ్య పనులు, మరమ్మతుల కోసం కొంతమేర నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఆ నిధులు రాకపోవడంతో అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. కనీసం హాస్టళ్ల పరిసరాలను సైతం శుభ్రం చేయలేదు. చాలా వసతిగృహాల పరిసరాలు చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. వాటిలో పాములు, తేళ్లు, విష పురుగులు చేరుతున్నాయి. వానలు కురుస్తుండటంతో ఆవరణలోకి, గదుల్లోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. విరిగిన కిటికీలు, తలుపులతో వాన నీళ్లు గదుల్లోకి పడుతున్నాయి.
డైట్ చార్జీలు సరిపోక..
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు పదేళ్ల కిందటి డైట్ చార్జీలే కొనసాగుతున్నాయి. మూడో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు నెలకు రూ.950.. ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1,100, ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్థులకు రూ.1,500 చొప్పున ప్రభుత్వం డైట్ చార్జీల కింద చెల్లిస్తోంది. అడ్డగోలుగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఈ చార్జీలు ఏ మూలకూ సరిపోవడం లేదని వసతిగృహాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డైట్ చార్జీలను కనీసం 25శాతం పెంచాల్సిన అవసరం ఉందని గత ఏడాది మంత్రుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని.. కానీ ఇప్పటివరకు చార్జీలు పెంచలేదని గుర్తు చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. విద్యార్థులకు తగిన పోషకాహారం అందే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు.
అద్దె భవనాలతో మరింత గోస
రాష్ట్రంలో 858 సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేక, కొత్తవి నిర్మించక ఏళ్లకేళ్లు అలాగే కొనసాగుతున్నాయి. వాటికి చెల్లించాల్సిన అద్దె బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా సుమారు రూ.12 కోట్ల మేర బకాయిలున్నట్లు అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. కొన్ని హాస్టల్ భవనాలకు ఏడాదికిపైగా బిల్లులు రావడం లేదని అధికారులు అంటున్నారు. నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలంటూ యజమానులు ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు.
మరికొన్ని కేస్ స్టడీలు
పాములు, తేళ్ల సమస్యతో.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి మొల్లం శ్యాంకుమార్ గత వారం అనుమానాస్పదంగా మరణించాడు.టాయిలెట్ కోసం రాత్రిపూట బయటికి వెళ్లి, వచి్చన శ్యాంకుమార్.. వాంతులు చేసుకుని, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కాసేపటికే కన్నుమూశాడు. టాయిలెట్ సమీపంలోని పొదల్లో తరచూ పాములు, తేళ్లు కనిపించేవని.. అవి కుట్టడం వల్లే శ్యాం మరణించి ఉంటాడని విద్యార్థులు అంటున్నారు.
ఈ చిత్రంలో అపరిశుభ్ర వాతావరణంలో కనిపిస్తున్నది పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయకాలనీలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ వసతి గృహంలో 30మంది విద్యార్థులు ఉంటున్నారు. బాత్రూంలు, భవనాన్ని క్లీన్ చేయడానికి మనుషుల్లేక అంతా అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఇక్కడ వంటకు సంబంధించిన టెండర్లు ఇంకా పూర్తికాలేదని, వంట చేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి 10 నెలలుగా జీతం రాక కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతోందని.. దాంతో తామే రోజూ రూ.300 ఖర్చుపెట్టి కూరగాయలు తెప్పిస్తూ, వంట కూడా చేస్తూ.. విద్యార్థులకు తిండి పెడుతున్నామని హాస్టల్ వార్డెన్ డప్పు రవికుమార్ చెప్తున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తే విద్యార్థులకు సరైన భోజనం దొరుకుతుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment