గాజా శాంతి ఒప్పందం వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన ఫ్రేమ్‌వర్క్ లేకుండా ఒప్పందం ముందుకు సాగదని.. అవసరమైతే మళ్లీ యుద్ధానికి దిగుతామని సంచలన వ్యాఖ్యలు అన్నారాయన. కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అంతకంటే కొన్ని గంటల ముందు.. నెతన్యాహూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘‘సరైన ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒప్పందంలో ముందుకు వెళ్లలేం. తమ దగ్గర ఉన్న బంధీల జాబితాను హమాస్ విడుదల చేయాలి. వాళ్లలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వాలి. అప్పుడే మేం ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తాం. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. మేం సహించబోం. తదుపరి పరిణామాలకు హమాసే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) తెలియజేశారు.
హమాస్‌పై పూర్తిస్థాయి విజయం సాధిస్తేనే గాజా యుద్ధాన్ని(Gaza War) విరమిస్తామని.. అప్పటి వరకు పోరు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు.. తాజాగా బంధీల జాబితా ఇవ్వాలంటూ ఆయన మెలిక పెట్టారు. దీంతో ఇవాళ్టి నుంచి ఒప్పందం అమలు అవుతుందా? అనే అనుమానాలు నెలకొంటున్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉంది. ఇజ్రాయెల్ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్ అధికారులు విడిచిపెట్టనున్నారు. మరోవైపు 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్ విడిచి పెట్టాల్సి ఉంది. హమాస్ చెరలోని 460 రోజులకు పైగా బందీలుగా ఉన్నారన్నమాట!.
హమాస్ చెరలో ఉన్న 98 బంధీల్లో.. 33 మందిని విడిచి పెట్టడం
ప్రతిగా.. తమ జైళ్లలో మగ్గుతున్న 2000 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టడం
పదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో బాంబుల మోత.. క్షిపణుల విధ్వంసం.. తుపాకుల అలజడి ఈ శాంతి ఒప్పందంతో ఆగనుంది. దోహా వేదికగా.. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌హమాస్ మధ్య గత బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో గాజా ఊపిరి పీల్చుకుంది.
వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని ఎన్నడూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంతగా ఆసక్తి చూపలేదు. యుద్ధం కొనసాగించడానికి మొగ్గు చూపుతూ.. ఏదో కారణంతో చర్చల ప్రక్రియను పక్కదోవ పట్టించే ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. అయితే.. గతేడాది మే నెలలో బైడెన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటికి హమాస్ సానుకూలంగా స్పందించింది. దీంతో అప్పుడే గాజాలో శాంతి నెలకొంటుందని అంతా భావించారు. కానీ, నెతన్యాహు మాత్రం ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించడానికి అంగీకరించలేదు. కానీ,
ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోనూ రెండో దశలో గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ నిబంధన ఉంది. అందుకే ఒప్పందంలో తొలి దశ అమలైనా, రెండో దశకు ఇజ్రాయెల్ అంగీకారం తెలుపుతుందా? లేదా? అన్నది కీలకం కానుంది.
ఇదీ చదవండి: కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య
Comments
Please login to add a commentAdd a comment