‘‘ఉద్యోగాలిప్పిస్తామని యువతకు కుచ్చుటోపీ.. ఉద్యోగాల పేరిట టోకరా..!’’ ఈ తరహా కథనాలు చూసి చూసి బోర్ కొడుతోందా? అయితే జస్ట్ ఫర్ ఏ ఛేంజ్.. ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి సొంతవాళ్లను, బంధువులను, చివరకు తనను తానే మోసం చేసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా?. కానీ, ఇప్పుడది నయా ట్రెండ్‌గా అక్కడ ఓ ఊపు ఊపేస్తోంది.
సాధారణంగా.. ఎక్కడో సిటీలోనో, టౌన్‌లోనో ఉంటూ ఉద్యోగాల వేట పేరిట తల్లిదండ్రుల నుంచి డబ్బులు పిండుకునే జాతిరత్నాల గురించి వినే ఉంటారు. అయితే.. నిజంగానే ఉద్యోగాల వేటలో అలసిపోయిన నిరుద్యోగుల కోసం పుట్టుకొచ్చిందే ఈ Pretend To Work ట్రెండ్. అంటే.. పని చేస్తున్నట్లు నటించడమన్నమాట. ఈ జాబ్‌తో జేబులు గుళ్ల కావడం తప్పించి ఎలాంటి ప్రయోజనం ఉండదు!!.
ఈ జాబ్ కావాలంటే చేయాల్సిందల్లా.. రోజుకు ఫలానా డబ్బును మీ ఆ సర్వీస్ వాళ్లకు అందించాలి. అప్పుడు వాళ్లు మీకు ఆఫీస్ స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి అందులో మీకు కుర్చీ, టేబుల్, కంప్యూటర్ లాంటివివేసి ఉద్యోగి అనే గుర్తింపు ఇస్తారు. అంతేకాదు.. ఆ పనివేళలో మధ్యలో భోజనం, కాఫీ టిఫిన్లు, స్నాక్స్, జ్యూస్‌ల వగైరా లాంటివి కూడా అందిస్తారు. మీరు చెల్లించే డబ్బును బట్టి మీ పొజిషన్, ఇతర సేవలు అందిస్తారు. ఒకవేళ ఎక్కువ చెల్లిస్తే ఏకంగా ఆ కంపెనీకి బాస్(Boss) పొజిషన్‌లోనే కూర్చోబెడతారు. అలాగని మీకు అక్కడ పని అప్పజెప్తారనుకుంటే పొరపాటే!. ఇవి కేవలం ఉత్తుత్తి ఉద్యోగాలు మాత్రమే!!.
కేవలం మీలోని నిరుద్యోగి(Jobless)ని అనే భావనను దూరం చేయడానికి మాత్రమే వాళ్లు ఈ సేవల్ని అందిస్తోంది. అంటే.. మీరు మీ మీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఎప్పటిలాగే మునిగిపోవచ్చన్నమాట. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుందో.. అప్పుడు అక్కడికి వెళ్లి వాళ్లు అడిగినంత చెల్లిస్తే సరిపోతుంది. ఆశ్చర్యం కలిగించినా ఇది ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్. చైనా(China)లో ఈ తరహా సేవల గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. పైగా ఈ సర్వీసును అందించేందుకు పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి కూడా!.
‘‘మా ఆఫీస్‌కు విచ్చేయండి. మీరూ ఉద్యోగిగా మారిపోండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఇక్కడే గడపండి. మీకు భోజన, ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తాం. రోజూవారీగా.. అతితక్కువ ధరకే మీకు ఈ సేవల్ని అందిస్తాం’’ అనే ప్రకటనలు హెబెయి ప్రావిన్స్‌లో ఎటు చూసినా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు, యువత ఈ తరహా సేవల కోసం ఎగబడిపోతున్నారు. ఈ తరహా సేవలు కొనసాగుతున్న మాట వాస్తవమేనంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కూడా ఓ కథనంలో పేర్కొంది.
చైనాలో ఈ తరహా సర్వీసుల ప్రారంభ ధర 30 యువాన్‌లు(4 డాలర్లు.. మన కరెన్సీలో రూ.353)గా ఉంది. వాళ్లు అందించే సౌకర్యాలను బట్టి ఆ రేటు పెరుగుతూ పోతోందన్నమాట.ఈ క్రేజ్ గుర్తించిన కాఫీ షాపులు, లైబ్రరీలు కూడా ఈ తరహా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి.
చైనాలో ప్రస్తుతం లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు సైతం వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించుకుంటూ పోతున్నాయి. దీంతో.. చిన్న కంపెనీలు కొత్త రిక్రూట్లకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో నిరుద్యోగుల శాతం పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఊడిపోవడం.. జాబ్‌లెస్‌గా ఉండిపోవడంతో తీవ్ర ఒత్తిడి, మానసికంగా కుంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. కాస్త డబ్బు ఉన్న వాళ్లకు ఊరట కలిగించేందుకే ఈ సేవలు పుట్టుకొచ్చాయి. అయితే..
ఈ Pretend To Workపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. దీనివల్ల మోసాలు పెరిగిపోవచ్చని పలువురు అంటున్నారు. అయితే ఖాళీగా రోడ్ల వెంట తిరగడం, ఉద్యోగాల కోసం తిరిగి అలసిపోవడం, ఉద్యోగం దొరక్క ఇంటికి ఆలస్యంగా వెళ్లడం.. ఇలాంటి వాటికంటే ఈ ఉత్తుత్తి ఉద్యోగాలు చేసుకోవడం నయం అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సేవల ఉద్దేశం ఏదైనా.. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది అక్కడ.
ఇదీ చదవండి: అత్యంత అరుదు.. అందుకే రూ.5కోట్లు పలికింది!!
Comments
Please login to add a commentAdd a comment