jobless
-
2.24 లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు
కోవిడ్ పరిణామాల్లో దాదాపు అన్ని రంగాల సంస్థలు, తమ కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేశాయి. ఈకామర్స్ కొనుగోళ్లు అధికంగా జరిగాయి. లాక్డౌన్ల కారణంగా, ఇళ్ల వద్ద ఖాళీగా ఉన్న వారు సామాజిక మాధ్యమాలను, యూట్యూబ్‌లో వీడియోలను ఎక్కువగా తిలకించారు. ఆన్లైన్లోనే పాఠ్యాంశాలు బోధించే ఎడ్యుటెక్ సంస్థలకూ అమిత డిమాండ్ ఏర్పడింది. దీంతో సాంకేతిక నిపుణులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇందువల్లే అంతర్జాతీయ సంస్థలైన మెటా, గూగుల్, అమెజాన్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి వాటితో పాటు దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలతో పాటు చాలా స్టార్టప్ కంపెనీలు తమకు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. 2023 ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి..ఎందుకు తొలగించాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ‘లేఆఫ్స్.ఫై’ డేటా ప్రకారం.. 2023లో సుమారు 100 ఇండియన్ స్టార్టప్ కంపెనీలు 15000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఈ ఏడాది 100 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసిన స్టార్టప్‌లలో ఓలా (200), కెప్టెన్ ఫ్రెష్ (120), షేర్‌చాట్ (500), స్విగ్గీ (380), మెడిబడ్డీ (200), డీల్‌షేర్ (100), మైగేట్ (200), బహుభుజి (100), సాప్ ల్యాబ్స్ (300), అప్‌గ్రేడ్ (120), ప్రిస్టిన్ కేర్ (300), 1k కిరానా (600), డంజో (500), జెస్ట్ మనీ (100), సింప్ల్ (150), స్కిల్ లింక్ (400), ఎక్స్ట్రామార్క్ (300), వాహ్ వాహ్! (150), మీషో (251), క్యూమత్ (100), హప్పే (160), గ్లామియో హెల్త్ (160), మోజోకేర్ (170), వేకూల్ (300), నవీ టెక్నాలజీస్ (200), మిల్క్‌బాస్కెట్ (400), టెకియోన్ (300), స్పిన్నీ (300), ఎంపీఎల్ (350) మొదలైనవి ఉన్నాయి. ఇదీ చదవండి: మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా.. ప్రపంచవ్యాప్తంగా 1160 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు ఈ ఏడాది ఏకంగా 2,24,508 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. 2022లో 1064 కంపెనీలు 1,64,969 మంది సిబ్బందిని తొలగించాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకోవడం, వ్యయ నిర్మాణాలను సరిచేయడం, కాస్ట్‌కటింగ్ వంటి వాటిలో భాగంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీలు స్పష్టం చేశాయి. -
ఈ కామర్స్‌లో కొలువుల పండుగ
హైదరాబాద్: నిరుద్యోగులకు కొలువుల పండుగ రానుంది. పండుగల విక్రయాలకు ముందు ఈ కామర్స్ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు చోటు చేసుకోనున్నాయి. ఏటా దసరా, దీపావళి సమయాల్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీ తగ్గింపులు, ఆఫర్లతో ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. దీంతో ఏడాది పండుగల సీజన్ సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు అందించేందుకు ఈ కామర్స్ సంస్థలు నెట్వర్క్ బలోపేతంపై దృష్టి సారించనున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ కామర్స్ రంగంలో తాత్కాలిక ఉద్యోగాలు పెద్ద ఎత్తున రానున్నాయని నియామక సేవలు అందించే టీమ్‌లీజ్ సరీ్వసెస్ సంస్థ తెలిపింది. పరిశ్రమలో నెలకొన్న ధోరణుల ఆధారంగా ఈ అంచనాకు వచి్చంది. కేవలం దక్షిణాదిలోనే 4 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 7,00,000 తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడతాయని తెలిపింది. హైదరాబాద్‌లో 30 శాతం, బెంగళూరులో 40 శాతం, చెన్నైలో 30 శాతం చొప్పున కొలువులు ఏర్పడతాయని తెలిపింది. పండుగల సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర టైర్–1 పట్టణాల్లో నియామకాలు పెద్ద ఎత్తున ఉంటాయని, కోయంబత్తూర్, కోచి, మైసూర్ తదితర ద్వితీయ శ్రేణి పట్టణాలకు సైతం నియామకాలు విస్తరించొచ్చని అంచనా వేసింది. వేర్‌హౌస్ కార్యకలాపాల్లో (గోదాములు) 30 శాతం, డెలివరీ విభాగంలో 60 శాతం, కాల్‌సెంటర్ కార్యకలాపాల కోసం 10 శాతం నియామకాలు ఉంటాయని పేర్కొంది. ‘‘గడిచిన త్రైమాసికం నుంచి ప్రముఖ ఈకామర్స్ సంస్థలు పండుగల సీజన్‌కు సంబంధించి ఆశావహ ప్రణాళికలను ప్రకటించాయి. వినియోగదారులు భారీగా ఉండడం, భారత్‌లో తయారీని కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తుండడం, ఎఫ్‌డీఐ, డిజిటైజేషన్ తదితర చర్యలు దేశంలో తాత్కాలిక కారి్మకుల పని వ్యవస్థను అధికంగా ప్రభావితం చేస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సరీ్వసెస్ బిజినెస్ హెడ్ బాలసుబ్రమణియన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తాత్కాలిక కారి్మకులు దేశవ్యాప్తంగా 25 శాతం మేర పెరుగుతారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దక్షిణాదిలో అయితే ఇది 30 శాతంగా ఉంటుందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష సీజనల్ ఉద్యోగాలు రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో, వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను అనుగుణంగా తాము సరఫరా వ్యవస్థలో లక్ష తాత్కాలిక (సీజనల్) ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ హబ్‌లలో ఈ నియామకాలు చేపట్టనుంది. స్థానిక కిరాణా డెలివరీ భాగస్వాములు, మహిళలు, వికలాంగులను సైతం నియమించుకోనున్నట్టు తెలిపింది. తద్వారా వైవిధ్యమైన సరఫరా చైన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ‘‘బిగ్ బిలియన్ డేస్ (డిస్కౌంట్ సేల్) నిజంగా భారీ స్థాయిలో జరుగుతుంది. ఈ కామర్స్‌లో ఉండే మంచి గురించి లక్షలాది మంది కస్టమర్లు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ మంది మొదటిసారి కస్టమర్లే ఉంటున్నారు’’అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రి తెలిపారు. బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లతో విక్రయాలు చేపడుతుంటుంది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఉండే సంక్లిష్టతలు, స్థాయికి అనుగుణంగా తాము సామర్థ్యాన్ని, నిల్వ స్థాయి, సారి్టంగ్, ప్యాకేజింగ్, మానవవనరులను, డెలివరీ భాగస్వాములను పెంచుకోవాల్సి ఉంటుందని బద్రి పేర్కొన్నారు. ఈ ఏడాది 40 శాతానికి పైగా షిప్మెంట్లను స్థానిక కిరాణా భాగస్వాములతో డెలివరీ చేసే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. -
బడ్ లైట్ వివాదం.. భారీగా ఉద్యోగుల తొలగింపు!
బడ్ లైట్ వివాదానికి ప్రభావితమైన 'గ్లాస్ బాట్లింగ్' (Glass Bottling) కంపెనీ ఎట్టకేలకు తన రెండు ప్లాంట్స్ మూసివేయనుంది. అమ్మకాల పరంగా అస్థిరమైన ఆర్ధిక నష్టాలను చవి చూస్తున్న కారణంగా ఈ ప్లాంట్స్‌లో ఏకంగా 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బాట్లింగ్ కంపెనీ మూసివేయడానికి కారణాన్ని వెల్లడించలేదు. అయితే రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బార్లు, కాంట్రాక్ట్ కంపెనీలు వివాదాస్పద బడ్‌పై దేశవ్యాప్త బహిష్కరణల ఆగ్రహాన్ని అనుభవిస్తున్నందున, బడ్ లైట్ అమ్మకాలను ట్యాంకింగ్ చేయడం వల్ల ప్లాంట్లు మూతపడుతున్నాయని భావిస్తున్నారు. గతంలో వెల్లడైన కొన్ని నివేదికల ప్రకారం, బాట్లింగ్ కంపెనీ ప్లాంట్లలోని కార్మికులు ఉత్పత్తి తగ్గినట్లు, డిమాండ్ తగ్గడం వల్ల లూసియానా అండ్ నార్త్ కరోలినా ప్లాంట్లు తమ మెషీన్లలో కొన్నింటిని ఆఫ్‌లైన్‌లో ఉంచవలసి వచ్చిందని సమాచారం. అయితే కంపెనీ పరిస్థితి రోజు రోజుకి క్షీణించడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి ఉంటుందనుకుంటున్నారు. కంపెనీ మూసి వేసిన ప్లాంట్లలో బడ్వైజర్ అండ్ బడ్ లైట్ కోసం బాటిళ్లను ఉత్పత్తి చేసేవారు. అయితే బడ్వైజర్ ఇకపై బాటిల్‌ను విక్రయించనందున, వారికి ఇకపై బాట్లింగ్ ఉత్పత్తి అవసరం లేదు. ఇది కూడా కంపెనీ మూసివేతకు ప్రధాన కారణం. ఇది మాత్రమే కాకుండా గత ఏప్రిల్ నెలలో బీర్మేకర్ ఒక బాలిక సెలబ్రేషన్ సమయంలో ప్రత్యేక డబ్బాలను బహుమతిగా ఇచ్చినప్పటి నుంచి బడ్ లైట్ అమ్మకాలు క్షీణించాయి. (ఇదీ చదవండి: ఈ ఒక్క వైన్ బాటిల్ కొనాలంటే రూ. కోట్లు పెట్టాల్సిందే! ప్రత్యేకతేంటంటే?) మార్కెట్ విలువలో ఇప్పటికే బిలియన్ల డాలర్లను కోల్పోయిన బ్రాండ్ కొత్త వేసవి ప్రకటన ప్రచారాన్ని ప్రారంభించింది. బీర్మేకర్ పంపిణీదారులకు సహాయం చేయడానికి చర్యలు తీసుకుంది, దాని మార్కెటింగ్ బడ్జెట్‌ను కూడా పెంచింది. కంపెనీలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీర్ అమ్మకాలు క్రమంగా తగ్గుతుండటం వల్ల బడ్ లైట్ బ్రాండ్‌కు ఎదురుదెబ్బ తగులుతోంది. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) 2023 జూన్ 3 వరకు అమ్మకాలు భారీగా తగ్గాయి. గత సంవత్సరం అమ్మకాలతో పోలిస్తే ఈ అమ్మకాలు సుమారు 24.4 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీకి ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్న కారణంగా రెండు కంపెనీ ప్లాంట్స్ మూసివేయవల్సి వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. -
అమెరికాలో నిరుద్యోగ భృతికి లక్షలాది దరఖాస్తులు
అమెరికాలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఆ దేశ ప్రభుత్వం అందించే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసినవారి సంఖ్య గత వారం 20 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. అది అలాగే స్థిరంగా కొనసాగుతోంది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. జూన్ 17తో ముగిసిన వారంలో కాలానుగుణంగా సర్దుబాటు ప్రాతిపదికన నిరుద్యోగ ప్రయోజనాల కోసం 2,64,000 కొత్త క్లెయిమ్‌లు దాఖలయ్యాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2021 అక్టోబర్ తర్వాత గతవారం నిరుద్యోగ భృతి దరఖాస్తులు మొదటి సారిగా అత్యధిక స్థాయికి చేరాయి. కాగా నిరుద్యోగ భృతికి కొత్త దరఖాస్తులు సగటున 2,60,000 ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగా ‘రాయిటర్స్’ పేర్కొంది. ఇదిలా ఉండగా మొదటి వారం దాటి ప్రయోజనాలను పొందుతున్న వారందరి ర్యాంక్‌లు జూన్ 10తో ముగిసిన వారంలో 17.6 లక్షలకు పడిపోయాయి. అంతకు ముందు వారం ఇది 17.72 మిలియన్లుగా ఉండేది. యూఎస్ కరెంట్ ఖాతా లోటు ఈ ఏడాది మొదటి మూడు నెలలలో స్థిరంగా విస్తరించి మూడు త్రైమాసికాల దిగువకు తగ్గిందని ఆ దేశ ప్రభుత్వం నివేదించింది. మరోవైపు 2022 నాలుగో త్రైమాసికంలో సవరించిన 216.2 బిలియన్ డాలర్ల నుంచి మొదటి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ గ్యాప్ 219.3 బిలియన్ డాలర్లకు పెరిగిందని వాణిజ్య శాఖ తెలిపింది. కాగా అది 217.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆర్థికవేత్తలు రాయిటర్స్ పోల్‌లో అంచనా వేశారు. -
కొలువులు కదల్లే..6 నెలల క్రితమే సర్కారు కసరత్తు
ఉద్యోగాల భర్తీపై ప్రకటనతో.. ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాం. వివిధ శాఖల్లో 50 వేల వరకు ఖాళీలున్నట్టు అంచనా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఖాళీ పోస్టులను గుర్తించి భర్తీకి చర్యలు చేపడతారు..’.. గత ఏడాది డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. కరోనా ఎఫెక్ట్, కొత్త జిల్లాల సమస్యతో.. పోస్టుల భర్తీ ప్రక్రియపై అధికారులు కసరత్తు మొదలుపెట్టినా.. కరోనా రెండో వేవ్‌తో సమస్య మొదలైంది. మరో రెండు కొత్త జిల్లాలతో తలెత్తిన జోనల్ సమస్య, ఉద్యోగుల పదోన్నతుల్లో న్యాయపరమైన చిక్కులతో ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఆరు నెలలు గడిచినా.. సీఎం ప్రకటన చేసి ఇప్పటికి సరిగ్గా ఆరు నెలలు గడిచాయి. ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. లక్షలాది మంది నిరుద్యోగులు పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రక్రియ పునఃప్రారంభమెప్పుడు? జోనల్ సమస్య తీరింది. కరోనా రెండో వేవ్ నియంత్రణలోకి వస్తోంది. పోస్టుల భర్తీ ప్రక్రియ పునఃప్రారంభం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ వస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరు నెలల కింద ప్రకటించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ముందుగా అన్ని శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, తద్వారా కింది స్థాయిలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, కింది స్థాయిలో అప్పటికే ఉన్న ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీ పోస్టుల గుర్తింపుపై అన్ని ప్రభుత్వ శాఖలు కసరత్తు మొదలుపెట్టాయి. దాదాపు మూడు వారాల పాటు సీరియస్‌గా ప్రక్రియ కొనసాగింది. పురోగతిని సమీక్షించేందుకు సీఎస్ సోమేశ్‌కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో రోజువారీ సమావేశాలు కూడా నిర్వహించారు. వివిధ శాఖల్లోని దాదాపు 18 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. కొందరు ఉద్యోగులకు పదోన్నతుల విషయంగా న్యాయపరమైన సమస్యలు, పలు ఇతర చిక్కులు తలెత్తడంతో జాప్యం జరిగింది. అప్పటికీ చాలా శాఖల నుంచి ఖాళీ పోస్టుల వివరాలు ఆర్థిక శాఖకు చేరాయి. పోస్టుల భర్తీ ప్రక్రియ ఆర్థిక శాఖ నుంచి సాధారణ పరిపాలన శాఖకు బదిలీ అయింది. అప్పటికే కరోనా రెండో వేవ్ విజృంభణతో పోస్టుల భర్తీ కసరత్తు నిలిచిపోయింది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులతో.. కరోనా ఎఫెక్ట్‌కు తోడు.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు మరో సమస్య కూడా తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మేరకు 2018 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్‌లో గెజిట్ జారీ చేసింది. ఈ కొత్త విధానంలోని 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీజోన్ల ప్రాతిపదికన మళ్లీ పోస్టుల విభజన ప్రక్రియ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పూర్తికావాలంటే కనీసం రెండు మూడు నెలలు సమయం పట్టవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. రెండు మూడు నెలల్లో, మొత్తంగా ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొంటున్నాయి. కాగా, ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో లక్షల మంది నిరుద్యోగులు పరీక్షల ప్రిపరేషన్లో మునిగిపోయారు. జాప్యం జరిగిన కొద్దీ వయసు పెరిగి.. ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్లు ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నాం. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రాతిపదికన పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి దాదాపు రెండు నెలల సమయం పట్టొచ్చు. ఈ మధ్య దాదాపు 18 వేల మంది ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో పదోన్నతులు కల్పించాం. అలా ఏర్పడిన ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. వాటిని కూడా కలిపి, పూర్తి డేటా సిద్ధంకాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. సీఎం కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు. అందువల్ల ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకుని, ఒకేసారి 50 వేల కొలువుల భర్తీ చేపడతాం. - సోమేశ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 1.91 లక్షల పోస్టులు ఖాళీనే.. రాష్ట్రంలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులు ఉండగా.. 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా విద్యా శాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య శాఖలో 30,570, రెవెన్యూశాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. -
లాక్‌డౌన్‌తో ఛాన్స్‌ల్లేక నటుడు ఆత్మహత్యాయత్నం
కలకత్తా: మహమ్మవారి కరోనా వైరస్ విజృంభణతో ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. వెండితెర, బుల్లితెర రంగానికి కోలుకోలేని దెబ్బ పడింది. కళామతల్లీని నమ్ముకున్నవారు కూటికి గతిలేని వారయ్యారు. అవకాశాల్లేక అవస్థలు పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఓ టీవీ నటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. లాక్‌డౌన్‌తో అవకాశాలు లేక మనోవేదన చెందుతున్నాడు. నిరాశనిస్పృహాలతో చివరకు ప్రాణం తీసుకోవాలకున్నాడు. అయితే పోలీసులు సమయానికి వచ్చి రక్షించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. సువో చక్రవర్తి (31) టీవీ నటుడు. గిటార్ ప్లేయర్ కూడా. తన తల్లి సోదరితో కలిసి నివసిస్తున్నాడు. అయితే గతేడాది కరోనా మొదటి దశ నుంచి అతడికి అవకాశాలు లేకుండా పోయాయి. నిరుద్యోగిగా మారి ఇంట్లో ఖాళీగా ఉండలేకపోతున్నాడు. మళ్లీ ఈ సంవత్సరం కూడా లాక్డౌన్ ఏర్పడడం సినీ, టీవీ రంగం మూతపడడంతో అతడికి గడ్డుకాలం వచ్చింది. తల్లి, చెల్లిని ఎలా పోషించాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఫేస్బుక్ లైవ్ ఆన్ చేసి నిద్రమాత్రలు ఒక్క స్ట్రిప్ స్ట్రిప్ మింగేశాడు. ‘ఐ క్విట్’ (నేను వెళ్లిపోతున్నా) అని పోస్టు చేశాడు. ఇది చూసిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సువో చక్రవర్తి నివాసానికి చేరుకుని రక్షించారు. అయితే గదిలో సువో చక్రవర్తి ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయం తల్లి, సోదరికి పోలీసులు వచ్చేవరకు తెలియదు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. సువో చక్రవర్తి ‘మంగల్ చాంది’, ‘మానస’ వంటి సీరియల్స్ చేశాడు. అనంతరం అతడికి, వారి కుటుంబసభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. చదవండి: ఇంజెక్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై -
ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య
సాక్షి, వేములవాడ: స్వరాష్ట్రం ఏర్పడినప్పటికీ తనకు ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి లో చోటు చేసుకుంది .గ్రామానికి చెందిన ముచ్చర్ల మహేందర్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ..ఉన్నత విద్యాభ్యాసం చేసిన తనకి ఉద్యోగం రాలేదని కొంత కాలంగా మనస్తాపంతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి సోమవారం సాయంత్రం బయటకు వెళ్లాడు. అయితే , హైదరాబాద్ కు వెళ్లకుండా గ్రామ శివారులోని ఓ బావిలో దూకాడు. ఇది గమనించిన కొందరు రైతులు వెంటనే మహేందర్‌ను బావిలో నుంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందాడు. కాగా మహేందర్ తెలంగాణ యాదవ స్టూడెంట్ ఫెడరేషన్‌కు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. ఉద్యోగం రాలేదనే కారణంతోనే మహేందర్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి సోదరుడు దేవరాజు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. ( చదవండి: డేంజర్ కీటకాలు.. వాహనాలపై ముప్పేట దాడి ) -
జాబ్‌లెస్ జీవితభాగస్వామిని ఎలా చూస్తున్నారు?
ఒక్కోసారి మన ప్రమేయం ఏమీ లేకుండానే ఉద్యోగం పోతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయినవారికి, వారి కుటుంబమే అండగా నిలవాలి. ముఖ్యంగా జీవితభాగస్వామి తమ పార్ట్నర్కు సపోర్ట్ ఇవ్వాలి. మీ జీవితభాగస్వామి ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారిపట్ల మీ ప్రవర్తన ఎలా ఉంది? 1. ఉద్యోగం పోయిన మీ జీవితభాగస్వామితో చాలా సమయాన్ని స్పెండ్ చేస్తారు. ఎ. అవును బి. కాదు 2. కోల్పోయిన ఉద్యోగం గురించి ఎక్కువగా ప్రస్తావించరు. కొత్త ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందని విసిగించరు. ఎ. అవును బి. కాదు 3. మీ పార్ట్నర్ స్కిల్స్ వారికై వారే తెలుసుకొనేలా చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 4. ఉద్యోగం లేదని మీ జీవితభాగస్వామిని ఇంటిపనులకే పరిమితం చేయాలనుకోరు. జాబ్ సెర్చ్ కోసం వారికి సమయం అవసరమని గుర్తిస్తారు. ఎ. అవును బి. కాదు 5. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మీ పార్ట్నర్కు ఆర్థికంగా చేయూత ఇస్తారు. అదే సమయంలో డబ్బు ఆదా గురించి ఆలోచిస్తారు. ఎ. అవును బి. కాదు 6. విమర్శలకు దూరంగా ఉంటారు. మాటలతో మీ పార్ట్నర్ను బాధపెట్టరు. ఎ. అవును బి. కాదు 7. మీ పరిధిలో జీవితభాగస్వామి కోసం ఉద్యోగాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 8. ఒత్తిడిలో ఉన్న మీ లైఫ్పార్ట్నర్ను వివిధరకాలుగా ఎంటర్టైన్ చేయటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 9. వారిపై సానుభూతి చూపించే ప్రయత్నం ఎప్పటికీ చేయరు. ఎ. అవును బి. కాదు 10. ఉద్యోగం పోయినందున కలిగే అభద్రతాభావం నుంచి మీ పార్ట్నర్కు సాంత్వన కలిగేలా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఆరు దాటితే మీ లైఫ్‌పార్ట్‌నర్‌కు అన్ని విధాలా సహాయాన్ని అందింస్తారు. వారు సంపాదించడంలేదని తేలిగ్గా చూడరు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే ఉద్యోగం లేని మీ పార్ట్నర్కు ఎలా సపోర్ట్ ఇవ్వాలో మీకు తెలియదు. ‘ఎ’ లు సూచనలుగా తీసుకొని పార్ట్నర్ జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయండి. -
సౌదీలో భారతీయుల బతుకు ఎంత కష్టం...ఎంత కష్టం..
రియాద్: ఆర్థిక వ్యవస్థ కునారిల్లినప్పుడు, మానవత్వం మరచిన ప్రభుత్వాలు అధికారం చెలాయిస్తున్నప్పుడు, లాభార్జనే పరమాపేక్షగా పనిచేసే కంపెనీ యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తీసేసినప్పుడు.....కార్మికులు రోడ్డు మీదకు వస్తారు. ఆకలి మంటలతో అలమటిస్తారు. సౌదీ అరేబియాలో భారతీయులకు ఇప్పుడు అదే జరుగుతోంది. గత మూడు రోజులుగా తిండీ తిప్పలులేకుండా అలమటిస్తున్న దాదాపు పదివేల మంది భారతీయ కార్మికులను ఆదుకునేందుకు రియాద్‌లో భారత్ అంబసీ ఆదివారం నాడు జోక్యం చేసుకొంది. భారత విదేశాంగ శాఖ ఆదేశాల మేరకు సౌదీ అరేబియాలో భారతీయ కార్మికులకు తాత్కాలికంగా షెల్టరును కల్పించేందుకు భారత ఎంబసీ ఐదు శిబిరాలను ఏర్పాటు చేసింది. వాటిల్లోని భారతీయులకు ఒక్క ఆదివారం నాడే 15,000 కిలోల బియ్యాన్ని వండి ఆహారాన్ని అందించామని ఎంబసీ అధికారులు తెలిపారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకునేందుకు అక్కడికి భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ను పంపిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా ప్రకటించారు. మరో జూనియర్ మంత్రి ఎంజే అక్బర్ కూడా సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతారని చెప్పారు. ఎవ రెన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ చిక్కుకుపోయిన భారతీయ కార్మికులకు ఎగ్జిట్ వీసాలను ఇప్పించి వెనక్కి తీసుకరావడం మినహా భారత ప్రభుత్వం ప్రస్తుతం చేయగలిగిందీ ఏమీ లేదు. విదేశీ కార్మికులను దోచుకు తినేందుకు సౌదీలో ఆటవిక చట్టాలు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయి. వాటిలో మార్పులు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వాలు ఎన్నడూ చిత్తశుద్ధితో కృషి చేయలేదు. సౌదీలోని చమురు కంపెనీలు ఊహించని లాభాలు గడిస్తుండడం, అక్కడి ప్రవాస భారతీయులు భారత్‌లో పెట్టుబడులు పెడుతుండడంతోనే ప్రభుత్వాలు సంతృప్తి చెందుతూ వచ్చాయి. అక్కడి కంపెనీల్లో పని ఒత్తిడి భరించలేకపోతే ఆత్మహత్య చేసుకోవాలే తప్ప భారత్‌కు పారిపోయి వచ్చే అవకాశమే అక్కడి చట్టాలు ఇవ్వడం లేదు. యాజమాన్యం అంగీకరించి భారతీయ కార్మికుడికి ఎగ్జిట్ వీసాను మంజూరు చేస్తే తప్ప సౌదీ అధికారులు భారతీయ కార్మికులను దేశం విడిచి వెళ్లనీయరు. ఇప్పుడు పలువురు చమురు కంపెనీలు మూతపడడం, కార్మికులకు లేఆఫ్‌లు ప్రకటించడం వల్ల ఇప్పుడు భారతీయ కార్మికులకు సులభంగానే ఎగ్జిట్ వీసాలు ఇస్తారు. కానీ కొన్ని నెలలుగా రావాల్సిన బకాయిలను తీసుకోకుండా ఏ మొఖం పెట్టుకొని ఖాళీ చేబులతో భారత్‌కు వెళుతామని వారు ప్రశ్నిస్తున్నారు. సౌదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారి బకాయిలను భారత ప్రభుత్వం ఇప్పించగలిగితే అంతకుమించి సాయం వారు ఆశించరు. సౌదీ, కువైట్, బయిరెన్, ఓమన్‌లలో దాదాపు 70 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారిలో 30 లక్షల మంది ఇప్పుడు రోడ్లపైకి వచ్చారు. సౌదీ శిబిరాల్లో తలదాచుకుంటున్న పదివేల మంది కార్మికలంత క్షుద్బాధను వారు అనుభవించక పోతుండకపోవచ్చుగానీ 30 లక్షల మంది భారతీయులు దుర్భర పరిస్థితుల్లోనే బతుకుతున్నారు. సౌదీలో రెండు లక్షల మంది ఉద్యోగులను కలిగిన అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ‘బిన్ లాడెన్ గ్రూప్’ ఇటీవల ఒకేసారి 50 వేల మందిని ఉద్యోగాలను తీసివేసింది. వారిలో భారతీయులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా వారు మక్కాకు శాంతి ప్రదర్శన జరిపారు. బిన్ లాడెన్ కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు. బస్సులను దగ్ధం చేశారు. అయినా సౌదీ ప్రభుత్వం వారి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారత ప్రభుత్వం కూడా స్పందించలేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పడిపోతుండడం వల్ల చమురు కంపెనీలపాటు అనుబంధ కంపెనీలు కూడా గల్ఫ్‌లో గత కొన్నేళ్లుగా మూతపడుతూ వస్తున్నాయి. మరో కొన్నేళ్లపాటు ఏటా 12 శాతం ద్రవ్యలోటు కొనసాగనుందని గల్ఫ్ దేశాలు అంచనావేశాయి. ఒక్క సౌదీ అరేబియాలోనే గతేడాది చమురు కంపెనీలు 9,800 కోట్ల డాలర్ల నష్టపోయాయని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. ఏటా 330 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెనక్కి పోతున్నాయి. -
సీఎం చంద్రబాబు హామీలు అమలుచేయాలి
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ గాంధీనగర్ : రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో సోమవారం ధర్నా జరిగింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తామని నమ్మబలికి, ఓట్లు వేయించుకుని నిరుద్యోగులకు మొండి చేయిచూపారని విమర్శించారు. ఏడాది కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1.38 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీకి నోచుకోవడం లేదన్నారు. నోటిఫికేషన్లు విడుదల కాక, వయోపరిమితి ముగుస్తుండటంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు. తక్షణమే నిరుద్యోగ భృతి అందజేయాలని, ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మంత్రుల ఇళ్లు ముట్టడి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయిం చినట్లు చెప్పారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఆకారపు రవిచంద్ర మాట్లాడుతూ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగుల వయోపరిమితి పెంచి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కొన్నేళ్లుగా నియామకాలు నిలిచిపోయాయన్నారు. ఎందరో నిరుద్యోగులు అర్హత ఉన్నా నోటిఫికేషన్లు రాకపోవడంతో వయోపరిమితి మించిపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి తానిచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. -
రెడి
ఎవరి కుర్చీ వాళ్లే తెచ్చుకుంటారు. కొందరు సొంతంగా.. ఇంకొందరు అద్దెకు..చెట్ల నీడన, లైబ్రరీ రీడింగ్ రూమ్‌లో తదేక దీక్షతో చదువు.. మధ్యలో డిస్కషన్స్.. మధ్యాహ్నం ‘ఐదు రూపాయలకే భోజనం’తో కడుపు నింపుకొంటారు. పొద్దుపోయే వరకు వాళ్ల చదువుసంధ్యలు అలా సాగిపోతూనే ఉంటాయి. పుస్తకాల్లోని విషయాన్ని మస్తిష్కం నిండా ఎక్కించుకుని.. చివరిగా ఎవరి కుర్చీలు, సరంజామా వాళ్లు తీసుకుని వెళ్లిపోతారు. మళ్లీ తెల్లవారగానే ఇక్కడి చెట్లపై ఉండే పక్షుల్లా పరుగు పరుగున వచ్చేస్తారు. ..:: భర్తేపూడి కృష్ణ, వివేక్‌నగర్ కొలువులకు ‘నెల’వైన ఈ సమయంలో నిరుద్యోగులు షికార్లు, టైంపాస్ టూర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు వీరి డైరీ నిండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ప్లాన్సే. ఉద్యోగమే లక్ష్యంగా చదువుకోవడానికో అనువైన ప్లేస్ చూసుకుని నేరుగా ‘సబ్జెక్ట్’లోకి వెళ్లిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రానున్న రోజుల్లో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు సన్నాహాలు చేస్తుండటంతో ఉద్యోగార్థులు ప్రిపరేషన్లో తలమునకలైపోతున్నారు. నగరంలోని ప్రముఖ గ్రంథాలయాలు వీరి చదువులకు వేదికలవుతున్నాయి. లైబ్రరీస్ అన్నీ ఫుల్ ప్యాక్.. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది నిరుద్యోగులు వివిధ జిల్లాల నుంచి నగరానికి వస్తున్నారు. స్టడీ మెటీరియల్ లభ్యత, ఇతర సౌకర్యాల రీత్యా చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌తో పాటు ఇతర ప్రధాన లైబ్రరీలలో చదువుకోవడానికో ప్లేస్ వెతుక్కుంటున్నారు. నగరంలో తాముండే చోట అసౌకర్యాలు, ఇరుకిరుకు గదుల్లో ప్రిపరేషన్ సరిగా సాగదని భావిస్తున్న ఉద్యోగార్థులు ప్రధానంగా చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయానికి పెద్దసంఖ్యలో క్యూ కడుతున్నారు. ‘నేనుండే గదిలో నాతో పాటు మరో ముగ్గురు ఉంటారు. చదువుకోవాలంటే గురి కుదరదు. పైగా స్టడీ మెటీరియల్ కొరత.. అదే కేంద్ర గ్రంథాలయంలోనైతే ఈ సమస్య ఉండదు. వాతావరణమూ ప్రశాంతంగా ఉంటుంది. సందేహాలు వస్తే డిస్కషన్స్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు’ అని వివరించారు వరంగల్ జిల్లాకు చెందిన వెంకట్. ఈ యువకుడు ప్రస్తుతం ఎస్ఐ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. మోటివేషన్ అండ్ కెరీర్ గెడైన్స్ నగర కేంద్ర గ్రంథాలయానికి నిత్యం చదువుకోవడానికి వచ్చే నిరుద్యోగుల సంఖ్య వెయ్యికి మించుతోంది. ఈ లైబ్రరీ చుట్టుపక్కల పెద్దసంఖ్యలో కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులు క్లాసులు ముగియగానే గ్రంథాలయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ తగినంత స్థలం ఉండటంతో పాటు భారీ చెట్ల నీడన చదువుకోవడానికి అనువుగా ఉంది. ఇక, ఉద్యోగార్థులను మధ్యలో ప్రోత్సహించడానికి, వారిలో ప్రేరణ కలిగించడానికి గ్రంథాలయం ఆడిటోరియంలో మధ్య మధ్యలో మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. నిపుణులు కెరీర్ గెడైన్స్ ఇస్తున్నారు. అభ్యర్థుల్లో ఇవి ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. ‘ఉద్యోగాలపై ఆశతో ఇక్కడకు వస్తున్న మాలాంటి నిరుద్యోగులకు ఇవెంతో ఉపకరిస్తున్నాయని’ సిటీకి చెందిన నవీన్ తెలిపాడు. కుర్చీ..చదువు.. అక్కడే భోజనం ఉదయాన్నే వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్ననిరుద్యోగులు, అది పూర్తి కాగానే నేరుగా సెంట్రల్ లైబ్రరీకి వచ్చేస్తున్నారు. కొందరు తమతో పాటే ఒక కుర్చీ తెచ్చుకుంటారు. అది అందుబాటులో లేనివారు సమీపంలో అద్దెకు కుర్చీలు ఇస్తున్న వివిధ దుకాణదారుల నుంచి సమకూర్చుకుంటున్నారు. ఇవి రోజుకు తక్కువ రేటుకే అద్దెకు లభిస్తున్నాయి. సొంతంగా తెచ్చుకుంటున్న వారు ఆ రోజు చదువు పూర్తి కాగానే కుర్చీని లైబ్రరీ ప్రాంగణంలోని కిటికీ ఊచలకు, చెట్లకు గొలుసు వేసి, చిన్న చీటీపై పేరు రాసి కట్టేస్తారు. చదువు మధ్యలో భోజనానికి వెళ్లాలంటే.. ఎంతోకొంత టైమ్ వేస్ట్ తప్పదు. ఉద్యోగార్థుల ఇబ్బందిని, వారి రద్దీని గుర్తించిన జీహెచ్ఎంసీ, హరేకృష్ణ మూవ్మెంట్.. రూ.5కే భోజన పథకాన్ని ఇక్కడా అమలు చేస్తున్నాయి. ఇది తక్కువ ఖర్చుతోనే కడుపు నింపడంతో పాటు వాళ్ల చదువుకునే సమయాన్నీ ఆదా చేస్తోంది. ‘జాబ్‌పై ఆశ ఉంది. కానీ జేబు నిండా డబ్బుల్లేవ్..మాలాంటి వాళ్లకు ఇది వరం. రోజూ ఇక్కడ దాదాపు 600 మందికి పైగా రూ.5 భోజనంతోనే కడుపు నింపుకొంటున్నారు’ అని చెప్పాడు ఆదిలాబాద్ జిల్లా నుంచి గ్రూప్స్ శిక్షణకు వచ్చిన రమేష్. లేడీస్‌కు ప్రత్యేక రీడింగ్ రూమ్ అమ్మాయిలు చదువుకోవడానికి వీలుగా సెంట్రల్ లైబ్రరీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకల్యంతో బాధపడే వారి కోసం గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే తగిన సౌకర్యాలు కల్పించారు. అలాగే, రూ.5 ఖర్చుతోనే ఇక్కడ కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను సమకూరుస్తున్నారు. ఇక, చదువులమ్మ చెట్టు నీడగా మారిన చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో గ్రూప్-1, 2, ఎస్.ఐ. బ్యాంక్ తదితర పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ విస్తృతంగా అందుబాటులో ఉండటం కూడా నిరుద్యోగులు ఇక్కడకు చేరుకోవడానికి కారణమవుతోంది. గ్రూప్స్ కోసం ప్రిపేరవుతున్నా.. నేను ఎంబీఏ (ఫైనాన్స్) చేశాను. గ్రూప్-1, 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. నోటిఫికేషన్ వచ్చే నాటికి పూర్తి సంసిద్ధంగా ఉండాలని ఇప్పటి నుంచే ఇక్కడ ప్రిపరేషన్ ప్రారంభించాను. ఆర్డీఓ కావాలనేది నా ఆశయం. - ఎస్.పారిజాత ఇక్కడైతే అన్నీ.. మేం ఉండే రూమ్ చాలా ఇరుకు. ఐదుగురుం ఉంటున్నాం. పుస్తకం తీస్తే ఏదో ఒక డిస్ట్రబెన్స్. ఏదైనా సందేహం వచ్చినా, స్టడీ మెటీరియల్ కావాల్సి వచ్చినా ఇక్కడ అందుబాటులో ఉండవు. అదే లైబ్రరీ వద్దనైతే అన్ని సౌకర్యాలు ఉంటాయి. నేను ఎస్ఐ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను. - అంజిగౌడ్, ఖమ్మం ఎంతో బాగుంది.. ఇంజనీరింగ్ చదివినా.. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో గ్రూప్ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. జీహెచ్ఎంసీ, హరేకృష్ణ మూవ్మెంట్ రూ.5కే అందిస్తున్న భోజనం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి రూముల్లో ఉంటున్న వారికి, హాస్టల్స్‌లో ఉంటున్న వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంది. చదువు మధ్యలో బయటకు వెళ్లకుండా గ్రంథాలయంలోనే భోజన సౌకర్యం లభిస్తుండటంతో సమయం కలిసి వస్తోంది. - సులోచన, కరీంనగర్ ఎవరికీ భారం కాకుండా.. మాది సైదాబాద్. నాకు కవల పిల్లలు. వచ్చే నోటిఫికేషన్లకు ఇప్పటి నుంచే సిద్ధం కావడం కోసం.. పిల్లల్ని అత్తయ్య వాళ్ల వద్ద ఉంచి, నేను చిక్కడపల్లిలోని ఫ్రెండ్ రూమ్‌కి మారాను. నిత్యం సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ప్రిపరేషన్ సాగిస్తున్నాను. పగలంతా ఇక్కడే ఉండి చదువుకోవడం, రూ.5కే ఇక్కడ భోజనం లభిస్తుండటం వంటి వాటి వల్ల నా ఫ్రెండ్‌కు నేను భారం కాకుండా ఉండగలుగుతున్నాను. - శ్రీలత కావలెను.. లైబ్రరీలో ఉద్యోగార్థులకు సంబంధించిన ప్రకటనలు భలే ఆకర్షిస్తున్నాయి. ‘లైబ్రరీకి దగ్గరలో రూమ్స్ ఖాళీ ఉంటే దయచేసి చెప్పండి’ అని ఒకరు.. ‘అర్థమెటిక్స్ శిక్షణ కోసం ఓ కోచింగ్ సెంటర్లో చేరాను. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల మధ్యలో మానేస్తున్నాను. కాబట్టి నా అడ్మిషన్‌ను తక్కువ ధరకే ఆఫర్ చేస్తున్నా..’ అని ఇంకొకరు.. ‘రూమ్మేట్స్ కావాలి’ అని కొందరు తెల్ల కాగితాలపై ఫోన్ నంబర్లతో సహా రాసి అతికిస్తున్న ప్రకటనలు పలువురికి ఉపయోగపడుతున్నాయి. ఇక, పుస్తకాలు, బస్‌పాస్‌లు పోగొట్టుకున్న వారు సైతం ఆ విషయం తెలుపుతూ వాటిని తిరిగి అందించాలంటూ ఇలాగే ప్రకటనల ద్వారా అభ్యర్థిస్తున్నారు.