ఉద్యోగాల భర్తీపై ప్రకటనతో..
‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాం. వివిధ శాఖల్లో 50 వేల వరకు ఖాళీలున్నట్టు అంచనా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఖాళీ పోస్టులను గుర్తించి భర్తీకి చర్యలు చేపడతారు..’.. గత ఏడాది డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది.
కరోనా ఎఫెక్ట్, కొత్త జిల్లాల సమస్యతో..
పోస్టుల భర్తీ ప్రక్రియపై అధికారులు కసరత్తు మొదలుపెట్టినా.. కరోనా రెండో వేవ్‌తో సమస్య మొదలైంది. మరో రెండు కొత్త జిల్లాలతో తలెత్తిన జోనల్ సమస్య, ఉద్యోగుల పదోన్నతుల్లో న్యాయపరమైన చిక్కులతో ఎక్కడికక్కడే ఆగిపోయింది.
ఆరు నెలలు గడిచినా..
సీఎం ప్రకటన చేసి ఇప్పటికి సరిగ్గా ఆరు నెలలు గడిచాయి. ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. లక్షలాది మంది నిరుద్యోగులు పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రక్రియ పునఃప్రారంభమెప్పుడు?
జోనల్ సమస్య తీరింది. కరోనా రెండో వేవ్ నియంత్రణలోకి వస్తోంది. పోస్టుల భర్తీ ప్రక్రియ పునఃప్రారంభం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని
నిరుద్యోగుల నుంచి డిమాండ్ వస్తోంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరు నెలల కింద ప్రకటించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ముందుగా అన్ని శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, తద్వారా కింది స్థాయిలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, కింది స్థాయిలో అప్పటికే ఉన్న ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీ పోస్టుల గుర్తింపుపై అన్ని ప్రభుత్వ శాఖలు కసరత్తు మొదలుపెట్టాయి. దాదాపు మూడు వారాల పాటు సీరియస్‌గా ప్రక్రియ కొనసాగింది. పురోగతిని సమీక్షించేందుకు సీఎస్ సోమేశ్‌కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో రోజువారీ సమావేశాలు కూడా నిర్వహించారు. వివిధ శాఖల్లోని దాదాపు 18 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. కొందరు ఉద్యోగులకు పదోన్నతుల విషయంగా న్యాయపరమైన సమస్యలు, పలు ఇతర చిక్కులు తలెత్తడంతో జాప్యం జరిగింది. అప్పటికీ చాలా శాఖల నుంచి ఖాళీ పోస్టుల వివరాలు ఆర్థిక శాఖకు చేరాయి. పోస్టుల భర్తీ ప్రక్రియ ఆర్థిక శాఖ నుంచి సాధారణ పరిపాలన శాఖకు బదిలీ అయింది. అప్పటికే కరోనా రెండో వేవ్ విజృంభణతో పోస్టుల భర్తీ కసరత్తు నిలిచిపోయింది.
రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులతో..
కరోనా ఎఫెక్ట్‌కు తోడు.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు మరో సమస్య కూడా తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మేరకు 2018 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్‌లో గెజిట్ జారీ చేసింది. ఈ కొత్త విధానంలోని 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీజోన్ల ప్రాతిపదికన మళ్లీ పోస్టుల విభజన ప్రక్రియ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పూర్తికావాలంటే కనీసం రెండు మూడు నెలలు సమయం పట్టవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. రెండు మూడు నెలల్లో, మొత్తంగా ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొంటున్నాయి. కాగా, ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో లక్షల మంది నిరుద్యోగులు పరీక్షల ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. జాప్యం జరిగిన కొద్దీ వయసు పెరిగి.. ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
50వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్లు
ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నాం. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రాతిపదికన పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి దాదాపు రెండు నెలల సమయం పట్టొచ్చు. ఈ మధ్య దాదాపు 18 వేల మంది ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో పదోన్నతులు కల్పించాం. అలా ఏర్పడిన ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. వాటిని కూడా కలిపి, పూర్తి డేటా సిద్ధంకాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. సీఎం కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు. అందువల్ల ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకుని, ఒకేసారి 50 వేల కొలువుల భర్తీ చేపడతాం.
- సోమేశ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
1.91 లక్షల పోస్టులు ఖాళీనే..
రాష్ట్రంలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులు ఉండగా.. 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా విద్యా శాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య శాఖలో 30,570, రెవెన్యూశాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment