కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా చిన్నపిల్లలకు అవయవాలు చాలా చిన్నగా ఉంటాయి. అందులోనూ ఆరు నెలల పిల్లలంటే అత్యంత సున్నితంగా ఉంటాయి. ఆ వయసులో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. అలాంటిది రెండు కిడ్నీల్లోనూ రెండేసి రాళ్లు, అవీ పెద్ద పరిమాణంలో ఏర్పడటంతో ఓ బాబుకు మూత్రవిసర్జన ఆగిపోయి, పొట్ట ఉబ్బిపోయింది.
ఆ బాబుకు ఎండోస్కోపిక్ విధానంలో మొత్తం నాలుగు రాళ్లను తొలగించి కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఊరట కలిగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆస్పత్రి యూరాలజిస్టు డాక్టర్ వై.మనోజ్‌కుమార్ తెలిపారు. ‘నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన ఆరు నెలల బాబు దక్షిత్‌కు మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బిపోవడంతో ఈ నెల 5వ తేదీన కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
అతనికి అన్ని పరీక్షలు నిర్వహించగా, రెండు కిడ్నీల్లో 11 మి.మీ, 9 మి.మీ, 9 మి.మీ, 7 మి.మీ. పరిమాణంలో నాలుగు రాళ్లు ఉన్నట్లు తేలింది. ముందుగా స్టెంట్లు అమర్చి కిడ్నీలను సాధారణ స్థితికి తెచ్చిన తర్వాత ఈ నెల 5వ తేదీన ఎండోస్కోపిక్ విధానంలో కుట్లు లేకుండా లేజర్ ద్వారా ఇతర అవయవాలకు ఎలాంటి హాని జరగకుండా కిడ్నీలో రాళ్లను తొలగించాం. అతను కోలుకోవడంతో 10వ తేదీన డిశ్చార్జ్ చేశాం. ఇంత చిన్న వయసులో రెండు కిడ్నీల్లో రెండేసి రాళ్లు ఏర్పడటం ఏపీలో ఇదే తొలిసారి. లక్ష మందిలో కేవలం పది మందికే ఇలాంటి సమస్య తలెత్తుతుంది.’ అని డాక్టర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment