KALVAKUNTLA Chandrasekhar Rao (KCR))
-
CM KCR: ‘ప్రగతి’ చూపకుంటే మారాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్య క్రమాల అమలు ఆశిం చిన రీతిలో లేకపోవ డంపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు చివరి హెచ్చ రిక జారీ చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 28న ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన సమా వేశం.. రెండు రోజులు ముందుకు జరిగి ఈ నెల 26వ తేదీకి మారింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా పంచాయతీ అధి కారి (డీపీఓ), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల (డీఆర్డీఓ)ను తమ వెంట తీసుకురావాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులందరూ తప్పకుండా హాజరుకావాలని చెప్పింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు సీఎం మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు. పది రోజుల సమయం ఇటీవల సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమాల అమలును ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. ఆశించిన రీతిలో పురోగతి లేదని ఆయన గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి పల్లె/పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలుపై తన ఆశయాలు, లక్ష్యాలను సవివరంగా చెప్పారు. అయినా క్షేత్రస్థాయిల్లో పరిస్థితులు మారట్లేదని తాజాగా నిర్వహించిన పర్యటనల్లో సీఎం ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంటనే మరోసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మూడు కార్యక్రమాల అమలు విషయంలో తన ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను చివరిసారిగా వారికి స్పష్టం చేయాలని కేసీఆర్ ఈ సమావేశానికి తలపెట్టినట్టు సమాచారం. ఈ కార్యక్రమాల అమలుతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్డీఓలకు ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేయనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు మరోసారి వారం పది రోజుల సమయం ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల్లో ఆకస్మిక తనిఖీలు వచ్చే నెల నుంచి ముఖ్యమంత్రి రెండో విడతగా జిల్లాల్లో పర్యటించి ఈ కార్యక్రమాల అమలుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కలెక్టర్లతో నిర్వహించనున్న సమావేశంలో వానా కాలం సాగు, రైతుబంధు పంపిణీ, ధరణి సమస్యల పరిష్కారం, పాఠశాలల పునఃప్రారంభం తదితర అంశాలపై సైతం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. -
వాసాలమర్రి బిడ్డ సుప్రజను డాక్టర్ చదివిస్తా..: సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: వాసాలమర్రి సభలో సీఎం కేసీఆర్ మరో హామీ ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన బాలికను ఎంబీబీఎస్ చదివిస్తానని ప్రకటించారు. వాసాలమర్రికి చెందిన నర్సింహులు, రాణి దంపతుల కూతురు సుప్రజను విషయమై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘సహపంక్తి భోజనం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఊరిలోని ప్రభుత్వ బడిలో పదో తరగతి పాసయ్యానని, డాక్టర్ కావాలని ఉందని చెప్పింది. అంత చదివించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. అమ్మాయి తండ్రి తమకు అర ఎకరం మాత్రమే పొలం ఉందని, తల్లి హైదరాబాద్‌లో సేల్స్ ఉమన్‌గా పనిచేస్తుందని చెప్పారు. చదువుకునేందుకు ప్రభుత్వ స్కీంలు ఉన్నాయి. కొందరికి తెలియదు. అయినా ఆమెను నేను చదివిస్తా. ఊర్లో ఇంకా ఇలాంటి వారు ఎందరున్నా వారందరినీ చదివించాలి’’ అని కేసీఆర్ సూచించారు. -
CM KCR: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్నా..
సాక్షి, యాదాద్రి: వాసాలమర్రి గ్రామసభలో సీఎం కేసీఆర్ తన చమత్కారాలతో నవ్వులు పూయించారు. కేసీఆర్ ప్రసంగం మొదలు పెడుతూ.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అనగానే గ్రామస్తులు ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. కొందరు ఈలలు వేశారు. ఇది చూసిన సీఎం.. ‘‘నేనేమైనా సినిమా యాక్టర్నా.. సీటీలు వేస్తున్నరు..’’ అన్నారు. దీంతో అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఇక ‘‘పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వచ్చిండంటే ఊరికి చాలా పనులు జరుగుతయి. పెద్ద మనిషికి చప్పట్లు కొట్టండి..’’ అని సీఎం అన్నప్పుడు అంతా ఒక్కసారిగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. తర్వాత ‘‘వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న పమేలా సత్పతిని యాదాద్రి జిల్లాకు కలెక్టర్‌గా వేశాం. ఆమె అక్కడ బాగా పనిచేశారు. దాంతో ఆమెను వరంగల్ నుంచి తీయవద్దని నాతో కొందరు గొడవపడ్డారు కూడా. ఇప్పుడు ఆమెను మీ గ్రామ ప్రత్యేకాధికారిగా నియ మిస్తున్నా.. ఇక నుంచి తల్లి అయినా.. తండ్రి అయినా ఆమెనే’’ అని కేసీఆర్ అన్నప్పుడు చప్పట్లు మారుమోగాయి. ఇది చూసిన కేసీఆర్.. ‘మీ కలెక్టర్‌కు చప్పట్లు బాగా కొడుతున్నరుగా..’’ అనడంతో అందరూ నవ్వారు. (చదవండి: ఈ సీఎం కేసీఆర్ మీ చేతిలో ఉన్నాడు) ఊరికే కాదు.. జిల్లా మొత్తానికి నిధులు సీఎం కేసీఆర్ వాసాలమర్రికి నిధులు మంజూరు చేస్తారని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తుండగా.. ఆయన యాదాద్రి జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీలకు ని«ధులు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఒక్కో పంచాయతీకి రూ.25 లక్షల చొప్పున.. మేజర్ మున్సిపాలిటీ భువనగిరికి రూ.కోటి, నూతన మున్సిపాలిటీలైన ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, మోత్కూరులకు రూ.50 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వాళ్లు లేకుంటే గుడ్డేలుగుల్లా ఉంటం గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు దళితవాడ, చాకలివాడ, రైతుల వాడలకు రోజూ వెళ్లి మాట్లాడాలని, వారి సమస్యలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.‘‘చాకలి, మంగలి వాళ్లు సమాజ సేవకులు. వారు చేసేది శుభ్రత. వారు పనిచేయకపోతే మనం గుడ్డేలుగుల్లా (ఎలుగు బంట్లలా) ఉంటం. వారు పొట్టకోసం చేసినా ప్రజలకు మంచి చేస్తున్నారు. వారిని గౌరవించాలి. వృద్ధిలోకి తీసుకురావాలి..’’ అని పిలుపునిచ్చారు. మహిళలతో సహపంక్తి.. సర్పంచ్‌పై ఆరా.. సీఎం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. ఆయన పక్కన గ్రామానికి చెందిన చెన్నూరి లక్ష్మి, ఆకుల ఆగమ్మ కూర్చున్నారు. కేసీఆర్ భోజనం చేస్తూ వారితో మాట్లాడారు. ‘మీ సర్పంచ్ ఎలాంటోడు, ఎంపీటీసీ మంచోడేనా’ అంటూ ఆరా తీశారు. ‘‘సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీ మంచోళ్లే సార్. మా ఊర్లో ఏ కష్టమున్నా ఇద్దరూ వస్తరు. మంచి చెడ్డ అర్సుకుంటరు..’’ అని వారు చెప్పారు. భోజనం చేశాక కేసీఆర్ కొందరు గ్రామస్తులకు స్వయంగా వడ్డించారు. ఒకరిద్దరు మహిళల దగ్గరికి వెళ్లి భోజనం ఎలా ఉంది? అంటూ పలకరించారు. తర్వాత తనతో కలిసి భోజనం చేసిన మహిళలను స్వయంగా వెంట తీసుకెళ్లి వేదిక మీద కూర్చోబెట్టారు. -
ఈ సీఎం కేసీఆర్ మీ చేతిలో ఉన్నాడు
వాసాలమర్రిలో ప్రతి కుటుంబానికి అవసరమైన లాభం ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు నుంచి ఊరుమొత్తం నా కుటుంబం. ఇల్లు లేనోళ్లకు ఇల్లు కడదాం. ఆటోలు, డీసీఎంలు, ట్రాక్టర్లు ఇప్పిద్దాం. ప్రతి ఇంటికి ఒక పాడి పశువును ఇప్పిద్దాం. కమ్యూనిటీ హాల్ నిర్మిద్దాం. రోడ్డు వేసుకుందాం. జబ్బుపడిన వారికి హైదరాబాద్‌లో వైద్యం అందిద్దాం. రేషన్ కార్డులు ఇప్పిద్దాం. గ్రామ నిధిని ఏర్పాటు చేద్దాం. సీఎం మీ చేతిలో ఉన్నడు.. గ్రామం అభివృద్ధి చేయడానికి నేనున్న. సీఎం మీ చేతిలో ఉంటే ఇంకేం బాధ. రాష్ట్రాధినేత, ప్రభుత్వం మీ ఊరి పట్టున ఉంది. నిశ్చింతగా ఉండొచ్చు. అయితే గ్రామం ఐకమత్యం, పట్టుదలతో ఉండాలి. అవుననిపించుకోవాలి. చుట్టూ 10 గ్రామాలు వాసాలమర్రికి వచ్చి నేర్చుకోవాలి. ప్రేమతో మెలగాలి. అంతా దోస్తులు కావాలి. పిల్లలు మంచిగ చదువుకోవాలె. చదువుకునేందుకు ఎన్నో పథకాలు ఉన్నాయి. కొందరికి తెలియదు. స్తోమత లేక ఊళ్లో ఎవరూ చదువుకు దూరం కావద్దు. అలాంటి వాళ్లందరినీ చదివించాలి. సాక్షి, యాదాద్రి: ‘‘ఇక్కడ (వాసాలమర్రిలో) ఏదో ప్రత్యేకమైనది జరగాలి. మాటలతో కాదు. గొప్ప పట్టుదలతో జరగాలి. ఇవాళే దానికి పునాది రాయి పడాలి. జట్టుగట్టి.. పట్టుబట్టి ఊరిని బాగు చేసుకుందాం.. ఏడాదితిరిగే సరికి బి.వాసాలమర్రి అంటే బంగారు వాసాలమర్రి కావాలె..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్.. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తర్వాత నిర్వహించిన గ్రామసభలో ప్రసంగించారు. ‘అంతా అంతే బాగానే ఉంది కదా’ అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం.. ఊరిని బాగుచేసుకోవడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. అందరూ కలసికట్టుగా పట్టుదలతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఇంకో 20 మాట్ల వస్తా.. గ్రామాన్ని బంగారు వాసాలమర్రి చేద్దాం. అందరూ కలిసికట్టుగా పట్టుదలతో ఉంటరు గదా.. అందరిలో ప్రేమభావం రావాలి. ఒకరిని చూస్తే ఒకరికి ప్రేమ రావాలి. ముఖంలో చిరునవ్వులు రావాలి. ఊర్లో పోలీస్ కేసులు ఉండకూడదు. పక్కింటోడితో మంచిగా ఉండాలె. అంతా దోస్తులు కావాలె. గ్రామంలో నాకు ఈ రోజు నలుగురు పరిచయమైండ్రు. ఇంకో 20 మాట్ల వస్త. వచ్చినప్పుడు మీతో గింత దూరంలో ఉండి సభ నడువదు. దగ్గరగా కూర్చొని మాట్లాడుకుందాం. తినేటప్పుడు ఆగమ్మ, లక్ష్మి, సర్పంచ్ అంజయ్య, ఎంపీటీసీ నవీన్ మాత్రమే పరిచయం అయ్యారు. మిగతా వారంతా దోస్తులు కావాలి. నేను వస్తున్నానని అన్ని చేసిండ్రు గ్రామానికి నేను వస్తున్నానని అధికారులు ఆగమేఘాల మీద ధనాధన్ అన్ని తయారు చేసిండ్రు. గ్రామంలో ట్రాక్టర్లు ఇవ్వాలంటే కేసీఆర్ వచ్చుడెందుకు? గివన్నెందుకు? అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చుడెందుకు? గిన్ని కార్లు వచ్చినయా? ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం జరగాలి. మీ అదృష్టం మంచిదని వేరే ఊర్ల వాళ్లు అంటున్నారు. మొదలుపెడితే వెనక్కి మర్రి చూడొద్దు కులమతాలకు అతీతంగా.. అందరికీ దండం పెట్టి చెప్తున్నా.. ఊరి అభివృద్ధి కోసం యజ్ఞంలాంటి పని పెట్టుకున్నం. ఇందులో కులం, మతం, ఆడ, మగ, రాజకీయ తేడా ఉండదు. అంతా ఊరు కోసం పనిచేయాలె. యశోద ఆస్పత్రివారు ఆరోగ్య శిబిరం పెట్టారు. జిల్లా కలెక్టర్ 270 మంది రైతులను అంకాపూర్‌కు తీసుకెళ్లి వచ్చారు. అక్కడ ఉన్నట్టే ఇక్కడా భూమి ఉంది. మనలాగే వడ్లు, కూరగాయలు పండిస్తరు. కానీ అక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ ఉంది. తప్పుచేస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లరు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులే ఫైన్ వేస్తరు. 45 ఏళ్లుగా అంకాపూర్‌కు పోలీస్ అధికారి రాలేదు. చిన్న సమస్య వచ్చినా అభివృద్ధి కమిటీనే చూసుకుంటది. గ్రామంలో మహిళలు, చదువుకున్న వారు భాగస్వాములు కావాలి. గట్టిగా ఆలోచించాలి. పట్టుబట్టి తప్పును తప్పని చెప్పాలి. గ్రామాభివృద్ధి కోసం కమిటీలు వాసాలమర్రి గ్రామాభివృద్ధికి ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ను నియమిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని కులాల వారితో గ్రామాభివృద్ధి కమిటీ వేయా లని సూచించారు. ‘‘వారానికి రెండు గంటలు గ్రామంలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు శ్రమదాన కమిటీ, పరిశుభ్రత కమిటీ, తాగునీటి కమిటీ, హరితహారం, వ్యవసాయ కమిటీలు వేసి అంకాపూర్ మాదిరిగా వాసాలమర్రి పనిచేయాలి. ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులను కమిటీల్లో నియమించాలి. నా నియోజకవర్గంలో ఎర్రవల్లిని చూడండి. అక్కడ ఇళ్లు కూలగొట్టాం. కొత్త ఇళ్లు కట్టాం. 24 గంటలు మిషన్ భగీరథ నీళ్లు వస్తాయి. ఇక్కడ కూడా రెండు మూడు రోజుల్లో కమిటీలు వేసుకుని చెరువులు, చెక్‌డ్యాంలు, కాలువలు బాగు చేసుకుందాం. సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, మంత్రి అందరూ ఉంటరు. వందకు వందశాతం బంగారు తెలంగాణ చేద్దాం’’ అని చెప్పారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మండలి మాజీ చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, లింగయ్య, బొల్లం మల్లయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్యమం నాటినుంచి చూస్తున్నా ఈ ఊరు మంచిగ లేదు. ఈ ఊరి మీదుగా చాలాసార్లు వెళ్లాను. బాగు చెయ్యొచ్చుగా అనుకున్నా. కొడకండ్ల రైతుబంధు భవనం ప్రారంభించి ఎర్రవల్లికి పోతుండగా ఊరిలో ఆగి కొందరితో మాట్లాడిన. ఎమ్మెల్యే గొంగిడి సునీత అప్పుడు అందుబాటులో లేదు. సర్పంచ్ అంజయ్య మరో 40మంది గ్రామస్తులు వచ్చి మాట్లాడారు. పట్టుబట్టి బాగు చేద్దాం అనుకున్నా. ఈలోపు కరోనా వచ్చింది. లాక్డౌన్ ఎత్తివేయగానే ఎమ్మెల్యే సునీతకు ఫోన్‌చేసి చెప్పిన. ఇప్పుడు మంచిగా కలుసుకున్నం. బాగు చేయించే బాధ్యత నాది వాసాలమర్రి బాగుపడితే చుట్టూ పది ఊర్లు నేర్చుకోవాలి. బాగు చేయించే బాధ్యత నాది. నెల రోజుల తర్వాత చెట్టు కింద, గుడికాడ కూర్చొని మాట్లాడుకుందాం. ఊర్లో మూడు దళితవాడలకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తా. గ్రామంలోని 1,500 మందికి చెందిన 3 వేల చేతులు కలిపితే ఊరి సమస్య బద్ధలై పోతుంది. వేలితో కొడితే దెబ్బతగలదు. పిడికిలి ఎత్తి సమష్టిగా గ్రామాభివృద్ధిని సాధిద్దాం. వ్యవసాయ, వృత్తిపనులు బాగు పడతాయి. మంచి పద్ధతిలో ముందుకుపోదాం. పెళ్లిళ్లు చేసే కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలి. మనోడు అనుకుంటే అన్నీ చేయవచ్చు. వాసాలమర్రి గ్రామస్తులతో కలిసి భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్, కలెక్టర్లు -
కడియం శ్రీహరి మస్తున్నయ్ మీ కూరలు
హన్మకొండ: సీఎం వరంగల్ పర్యటన సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా మటన్, తలకాయ కూర, చికెన్‌తోపాటు చేపలు, రొయ్యల ఫ్రై, నాటుకోడి పులుసు, చికెన్ దమ్ బిర్యానీ చేయించారు. శాకాహారంగా పెసరపప్పు టమాటా, బీరకాయ కూర, బెండకాయ ఫ్రై, టమాటా– పుదీనా పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి, రైతా, పెరుగు, ఫ్రూట్ సలాడ్, మరో స్వీట్ సిద్ధం చేశారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి భోజనానికి హాజరైన సీఎం కేసీఆర్.. అందులో పలు వంటలు రుచిచూసి చివరగా దానిమ్మ జ్యూస్ తాగారు. అన్ని వంటలు బాగున్నా యని, ఎప్పుడు వరంగల్ వచ్చినా భోజనానికి శ్రీహరి ఇంటికే రావాలని ఉందని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మనవరాలు అన్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా.. చిన్నారిని కేసీఆర్ ఆశీర్వదించారు. -
TPCC: అధ్యక్షుడిగా కోమటిరెడ్డా? రేవంతా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతన సారథి ఎంపిక వ్యవహారం తుది అంకానికి చేరుకుంది. టీపీసీసీ అధ్యక్షుడితోపాటు పలు కమి టీల జాబితా సోనియా గాంధీ చేతికి వెళ్లిందని, ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అనే సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్య క్షులు, ప్రధాన కార్యదర్శులతో సహా నాలుగైదు ఇతర కమిటీలను కూడా ప్రకటించనున్నారని సమా చారం. సుదీర్ఘ కసరత్తు తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్న ప్రకటనకు రంగం సిద్ధమైందని, ఏ క్షణమైనా అధికారిక ఉత్తర్వులు రావొచ్చని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఆ ఇద్దరేనా..! టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతల పేర్లు ప్రతిపాదనకు వచ్చినా తుది పరిశీలన కోసం ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి పేర్లనే అధిష్టానం పరిగణనలోకి తీసుకుంది. శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, మధుయాష్కీల పేర్లను చివరి వరకూ పరిశీలించినా పలు కారణాలతో వెనక్కు వెళ్లాయని, అనూహ్య పరిణామం జరిగితే తప్ప కోమటిరెడ్డి, రేవంత్‌లలో ఎవరో ఒకరు పీసీసీ అధ్యక్షుడు కావ డం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. 10 జన్‌పథ్ సమాచారం ప్రకారం.. అధ్యక్షుడితో పాటు ఆరు గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా అధిష్టానం నియమించనుంది. అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, ఇతర సామాజిక వర్గాలకు అవకాశం దక్కేలా ఆరుగురిని ఎంపిక చేయనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ల జాబితాలో దామోదర రాజ నర్సింహ, బలరాం నాయక్, కొండా సురేఖ, షబ్బీర్ అలీ, మధుయాష్కీ లేదా మహేశ్‌కుమార్ గౌడ్, జగ్గారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి తోడు మరో 30 మందికి పైగా నేతలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించనున్నారు. కొన్ని కమిటీలు కూడా.. టీపీసీసీ కమిటీతోపాటు మరికొన్ని కమిటీల ఎంపిక కసరత్తును కూడా కాంగ్రెస్ అధిష్టానం పూర్తి చేసింది. ఇందులో ప్రచార, మేనిఫెస్టో, స్ట్రాటజీ, ఎన్నికల కమిటీలు ఉండనున్నాయి. ఈ కమిటీల్లో ఏదో ఒక దానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారన్న దానిపై అధిష్టానం గోప్యతను పాటిస్తోంది. రేవంత్‌కు అధ్యక్ష పదవి ఇవ్వని నేపథ్యంలో ఆయన్ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించనున్నారు. రేవంత్‌కు అధ్యక్ష పదవి ఇస్తే కోమటిరెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ ఇస్తారా లేక మరో నేతను ఎంపిక చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మేనిఫెస్టో కమిటీకి కూడా సీనియర్ నేతలను నియమిస్తారని, ఇతర కమిటీలతో కలిపి పూర్తి స్థాయిలో సామాజిక కోణంలో కూర్పు జరుగుతుందని, సీనియర్లందరికీ తగిన ప్రాతినిధ్యం ఉండేలా జాబితాలు తయారైనట్టు తెలుస్తోంది. ఈ కమిటీలకు సంబంధించిన జాబితాను పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి కె.సి.వేణుగోపాల్ సోమవారం సోనియాకు అందజేశారని, ఒకట్రెండు రోజుల్లోనే ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన రానుందనే చర్చ జోరుగా సాగుతోంది. -
CM KCR: ‘టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్’గా ఆస్పత్రి
కెనడాను తలదన్నేలా.. ప్రపంచంలోనే అధునాతన వైద్య సదుపాయాలు కెనడాలో ఉన్నాయి. వైద్యాధికారులు కెనడాను విజిట్ చేసి.. అక్కడి ఆస్పత్రులను తలదన్నేలా వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీని నిర్మించాలి. ప్రపంచంలోని అన్ని విభాగాల వైద్య సేవలు ఒకేచోట రావాలి. ఇకపై హన్మకొండ, వరంగల్ జిల్లాలు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా మార్చుతాం. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అక్టోబర్ తర్వాతే థర్డ్ వేవ్.. లాక్డౌన్ మరిన్ని రోజులు పెడితే ప్రజలకు ఉపాధి పోతుంది. అన్ని అంశాలను పరిశీలించాకే ఎత్తేశాం. ప్రస్తుతం కేసులు పెరగట్లేదు. థర్డ్‌వేవ్ వస్తే గిస్తే అక్టోబర్ తర్వాతే వస్తుంది. ఈ మధ్య కాలంలో రాదు. తగిన జాగ్రత్తలు పాటిస్తే నియంత్రించొచ్చు. కడుపు నిండా పరిహారం.. యాదాద్రిలో రింగ్‌రోడ్డు భూ నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వడంతోపాటు నిర్మాణాల విలువను చెల్లిస్తాం. కడుపునిండా పరిహారం అందిస్తాం. ఆందోళన చెందే అవసరం లేదు. టెంపుల్ సిటీలో షాపులు కేటాయించడంలో ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. సాక్షి ప్రతినిధి, వరంగల్: హైదరాబాద్ కంటే వరంగల్ తక్కువేమీ కాదని.. వరంగల్ దేశంలోనే గొప్ప విద్యా కేంద్రం, వైద్య కేంద్రం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేర్‌రావు అన్నారు. తూర్పు తెలంగాణకు ఈ నగరం హెడ్ క్వార్టర్ కావాలని, అత్యంత అధునాతన వైద్య సేవలు ఇక్కడ అందాలని చెప్పారు. వరంగల్‌లో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్‌గా ఉండాలని.. ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీరియస్‌గా పనిచేయాలని ఆదేశించారు. తానే మళ్లీ వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆస్పత్రిని ప్రారంభిస్తానని చెప్పారు. సోమవారం వరంగల్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్.. తొలుత హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసి.. సమీకృత కలెక్టరేట్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాతా, శిశు సంరక్షణ కేంద్రం వరంగల్ ఎంజీఎం, ప్రాంతీయ కంటి వైద్యశాల, సెంట్రల్ జైలు, మెడికల్ కాలేజీ కలిపి చూస్తే 200 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లే. ప్రస్తుత ఎంజీఎం ఆస్పత్రి భవనాలు పాతబడినందున కూల్చివేసి భవనాలు నిర్మించాలి. దీనిని అత్యాధునికంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రంగా మారుస్తాం. దానికి రెండు మూడు వేల కోట్లు ఖర్చయినా వెనుకాడం. వైద్య విభాగంలో ఉన్న అన్ని రకాల సేవలు హబ్‌గా వరంగల్‌లో అందుబాటులో ఉండేలా చేస్తాం. తెలంగాణ మొత్తం ఇంకా నాగరికంగా మారాలి. ప్రతీ పాత తాలుకా సెంటర్లో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు రావాలి. ఒక మినీ నీలోఫర్ సెంటర్ రావాలి. ఇందుకోసం ఉన్నతాధికారులకు ఆదేశాలిస్తాం. పెట్టుబడులు రావాలి.. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతి పెద్దనగరం. ఇది గొప్ప విద్యా, వైద్య కేంద్రంగా మారాలి. వరంగల్‌కు డెంటల్ కాలేజీ, డెంటల్ హాస్పిటల్‌ను మంజూరు చేస్తున్నం. వరంగల్‌కు పెట్టుబడులు రావాలి. ఐటీ కంపెనీలను విస్తరించాలి. ఇందుకోసం పెట్టుబడులను ఆకర్షించేలా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. త్వరలోనే మామునూర్ ఎయిర్‌పోర్టు రాబోతోంది. చైనా లాంటి టెక్నాలజీ రావాలి చైనాలో 28 గంటల్లోనే 10 అంతస్తుల భవనం నిర్మించారు. ఆ తరహా నిర్మాణ పరిజ్ఞానం మనదగ్గర కూడా రావాలి. ప్రజల పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి సార్థకత. ప్రజలు పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొద్దు. మిగతా 30 కలెక్టరేట్లు కూడా త్వరగా పూర్తి కావాలి. కలెక్టర్ హోదా పేరు కూడా మారిస్తే బాగుంటుంది. ఒకప్పుడు భూమి శిస్తు వసూలు చేసేవారిని కలెక్టర్ అనేవారు. ఇప్పుడు కలెక్టర్లకు శిస్తు వసూలు చేసే అవసరం లే దు. అందువల్ల వారి పేరు మారిస్తే బాగుంటుంది. జిల్లాలు అభివృద్ధి చెందాలి హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుంది. జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌పై భారం తగ్గుతుం ది. అందుకే హైదరాబాద్ ఈర్ష్య పడేలా వరంగల్ ను వైద్య, విద్య, ఐటీ రంగాల్లో అభివృద్ధి చేస్తాం. జూలై 1 నుంచి పల్లె ప్రగతి రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలను బాగు చేసేందు కు యజ్ఞంలా పనిచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి కార్యక్రమం చేపడతాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కలిపి నిర్వహిస్తాం. స్థానిక సంస్థలకు ముందే నిధులు విడుదల చేస్తాం. ఈనెల 26న మంత్రులు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవో అధికారులతో సమావేశం ఉంటుంది. ఆ రోజు మొత్తం అజెండా ఫైనల్ చేస్తాం. ప్రతిష్టాత్మక దేవాదుల ప్రాజెక్టు నీరు వరంగల్‌కే అంకితం. ఉమ్మడి వరంగల్‌లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలి. మిగిలిన పనుల పూర్తికి రూ.100 కోట్లు కేటాయిస్తాం. కరోనాపై అతిగా ఆందోళన వద్దు కరోనాపై ఊహాగానాలతో ప్రజలను భయపెట్టేలా వార్తలు ఇవ్వొద్దు. ఇది మంచిది కాదు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిది. చాలా మంది భయాందోళనలతో మందులు, ఆక్సిజన్ సిలిండర్లు కొని పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సామర్థ్యానికి మించి వస్తున్నారు. వచ్చిన రోగులను తిరిగి పంపించకుండా వీలున్న చోట పడుకోబెట్టి చికిత్స అందించాల్సి వస్తది. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా. వారు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులపై దాడులు సరికాదు. సిబ్బంది కరోనా ఉధృతి ఉన్నా ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేశారు. కిట్లు అందించారు. -
లాక్‌డౌన్‌తోనే కేసులు తగ్గాయ్: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని.. ప్రభుత్వం సరైన సమయంలో లాక్డౌన్ విధించడం, వైద్యారోగ్య శాఖను సకాలంలో అప్రమత్తం చేయడం ఫలితాన్నిచ్చిందని మంత్రివర్గ భేటీలో సీఎం కేసీఆర్ అన్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడిన సమయంలో ఒడిశాకు విమానాల ద్వారా ట్యాంకర్లను పంపడం, రెమిడిసివిర్, ఇతర ఔషధాల కొరతను తీర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంతో పరిస్థితి మెరుగైందని చెప్పారు. కోవిడ్ మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో గాంధీ, ఎంజీఎం ఆస్పత్రుల సందర్శనతో ప్రజల్లో ధైర్యం నింపగలిగామని కేసీఆర్ పేర్కొన్నారు. సుదీర్ఘకాలం లాక్డౌన్ కొనసాగితే చిన్నా, చితక వ్యాపారాలు, పనులు చేసుకునే వారు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందుల పాలవుతారన్నారు. లాక్డౌన్ ఎత్తివేసినా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా, కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని జాగ్రత్తలు తీసుకోండి ‘‘వరుసగా రెండు విద్యా సంవత్సరాలు కోవిడ్ పరిస్థితుల్లోనే కొనసాగుతుండటం పిల్లల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జూలై ఒకటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభమైనా.. భౌతిక దూరంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా చూడండి. విద్యా సంస్థల పునః ప్రారంభానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి మార్గదర్శకాలు సిద్ధం చేయండి..’’ అని కేబినెట్ భేటీలో కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. వానాకాలంలో సాగు విస్తీర్ణం పెరుగుతుందనే అంచనాలు ఉన్నందున విత్తనాలు, ఎరువుల సమస్య తలెత్తకుండా మంత్రులు జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించినట్టు సమాచారం. ‘‘కరోనా సమయంలో ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నా రైతుబంధు మొత్తాన్ని ఇస్తున్నాం. ఈ విషయాన్ని మనం రైతులకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటే పాలన ఫలితాలు అందరికీ అందుతాయి. కరోనా నేపథ్యంలో వివిధ రంగాల్లో ఏర్పడిన స్తబ్దతను తొలగించి తిరిగి పట్టాలు ఎక్కించేందుకు అందరూ శ్రమించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించినట్టు తెలిసింది. -
సర్పంచూ.. 22న మీ ఊరొస్తున్నా : ఫోన్లో సీఎం కేసీఆర్
తుర్కపల్లి: సీఎం కేసీఆర్ తాను హామీ ఇచ్చిన మేరకు ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్తున్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్ పోగుల అంజయ్యకు శుక్రవారం సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం, గ్రామసభ ఏర్పాటు కోసం స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, సర్పంచ్ అంజయ్య మధ్య సంభాషణ సాగిందిలా.. సీఎం కేసీఆర్: హలో సర్పంచ్: సార్ నమస్తే సార్ సీఎం: నమస్తే అంజయ్య.. బాగున్నవా? సర్పంచ్: బాగున్న సార్.. బాగున్న సార్ సీఎం: అంజయ్యా.. ఇప్పుడేందంటే 22న వస్తున్న మీ ఊరికి. సర్పంచ్: 22 తారీఖా సార్. సీఎం: ఎందుకంటే ఈ మధ్య నాకు కరోనా వచ్చింది. దేశమంతా కరోనా వచ్చే. సూద్దమంటే కూడ రాలేకపోయిన. అప్పుడు నేను మాటిచ్చిన కాబట్టి 22న వచ్చి, ప్రాజెక్ట్ టేకాఫ్ చేద్దాం ఇగ. సర్పంచ్: ఓకే సార్. థాంక్యూ సార్. సీఎం: నువ్వు రెండు జాగలు జూడాలే. ఊరందరికీ భోజనం నేనే పెట్టాలే. ఎవరు పెట్టే అవసరం ఉండదు. ఎమ్మెల్యే గారికి కూడ చెప్పిన. నేనే పంపిస్తా. టీమ్ హైదరాబాద్ నుంచి వస్తారు. మొత్తం మీ ఊరి జనాభా ఎంతయ్యా? సర్పంచ్: 2,600 సార్. సీఎం: మూడు వేల మందికి వండితే సరిపోతదిగా మంచిగ? సర్పంచ్: మూడు వేలకు సరిపోతది సార్. సీఎం: నా వెంబడే వస్తది జిల్లా యంత్రాంగమంతా.. సర్పంచ్: అయితే ఎక్కువ గావలే సార్.. సీఎం: సరిపోతది.. నా వెంబడి 200 మంది వస్తే.. ఇంకో 200 మందికి ఎక్స్ట్రా అనుకుందాం. సర్పంచ్: సరిపోతది సార్. సీఎం: పోలీసోళ్లు, వాళ్లు, వీళ్లు ఉంటరు చూద్దాంలే. దానికి నువ్వెందుకు బాధ పడతవుగని. నేను జేపిస్తలే, టీమ్ వచ్చి సపరేట్ చేస్తరులే నువ్వేం గాబరా గావాల్సిన అవసరం ఉండది, కాకపోతే రెండు జాగాలు చూడాలే నువ్వు. మీ కలెక్టర్ కూడ వస్తది. సర్పంచ్: ఇప్పుడే వస్తదా సార్? సీఎం: ఆ.. కలెక్టర్ ఇప్పుడొస్తది. నీకు చెప్పే వస్తది, నీ పేరు కూడ చెప్పిన.. మధ్యాహ్నం వరకు వస్తదేమో. మొత్తం టీమ్, టీమ్ వస్తరిగ. మొత్తం రెండు జాగలు, ఒకటి ఊరి మొత్తం కులం, మతం, జాతి లేకుండా అందరికీ గలిసి సామూహిక భోజనం. ఒక్కతాననే తిందాం. నేను పదకొండున్నర, 12 మధ్యన చేరుకుంట. అందరితోపాటు కలిసి నేనుగూడ తింట. మందిల్నే కూర్చుని తింట. మీ మంత్రి గారొస్తరు. లోకమంత వస్తరు. దాని తర్వాత ఇంకో జాగల మీటింగ్ సర్పంచ్: సార్.. ఓకే సార్ సీఎం: దీనికి కూడ రెయిన్ ఫ్రూప్ టెంట్ ఏర్పాటు చేయాలే.. వానొచ్చినా ఇబ్బంది లేకుంట.. కలెక్టర్‌కు చెప్పిన. వాళ్లు చూసుకుంటరు. ఊరంత కూర్చొని తినడానికి. ఊరంత గూసోని మళ్లీ సభ జరుపుకోవడానికి రెండు జాగలు మంచివి నీట్‌గా ఉండేవి చూడాలె. అర్థమైందిగదా.. సర్పంచ్: ఊరు చిన్నది సార్. గ్రామ పంచాయతీ అంటే మరీ మధ్యన అయితది, అంతమంది కూర్చోవడానికి వీలు కాకపోవచ్చు సార్. మన రామాలయం అప్పుడు మీరు కారు ఆపిండ్రు చూడు సార్ టర్నింగ్‌ల, కొండాపూర్ రోడ్ల, అక్కడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంటడు. అక్కడ అయనది ఓ ముప్పై ఎకరాలుంటది. హాస్టల్ దగ్గర.. సీఎం: అక్కడనే పెట్టియ్యి. అదే జాగల పెట్టు. సర్పంచ్: అక్కన్నే పెడ్తసార్. మీరొచ్చే తొవ్వలనే.. మీరు రావడానికి ఈజీ ఉంటది సార్. ట్రాఫిక్ ఇబ్బంది ఉండది. సీఎం: నాది బస్సు వస్తది. అండ్లనే బాత్రూం గిట్ల అన్ని ఉంటయి. నేను ఎవరింటికి పోవాల్సిన అవసరం ఉండది. బస్సులకే పోత. సర్పంచ్: మా ఇంటికి రావాలే సార్, ఓ సారి.. సీఎం: మీ ఇల్లు ఎక్కడుంది? సర్పంచ్: మాది ఊరి లోపలుంటది సార్. చిన్నది పెంకల ఇల్లు సార్. సీఎం: ఆ.. ఏముంది మీ ఇంటికి వస్తా. సర్పంచ్: మా ఇంటికి వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి పోవాలే సార్. సీఎం: నో ప్రాబ్లం. ముందో, తరువాతనో పోచేలా ప్లాన్ చేసుకుందాం. సర్పంచ్: ఒకే సార్, సరే సార్. సీఎం: దీంట్ల చిల్లర రాజకీయాలు, పార్టీలుండవు. సర్పంచ్: నా దగ్గర అట్లాంటివి లేవు సార్. సీఎం: నీదిగాదు నేను చెప్పేది వేరే పార్టీలోళ్లు ఉంటే గూడ ఓపికతో కలుపుకొని పోవాలే. ప్రతి ఇంటిని బాగు చేయాలనే చూస్తున్నం. వీడు, వాడు అనేదేం ఉండదు మనకు, నువ్వు మంచిగ చేస్తే, ప్రాజెక్ట్ మంచిగ ఇంప్లిమెంట్ జేస్తే నీకు మంచి ఫలితాలు ఉంటాయి. సర్పంచ్: మీ దయ, బ్లెస్సింగ్స్ సార్. సీఎం: బాగ చెయ్యి ఊరును, నీకు మంచిగుంటది. సర్పంచ్: సరే సార్ సీఎం: అన్నం తినే జాగ, మీటింగ్ జాగ వేరే ఉండాలి. అర్థమైంది గద. సర్పంచ్: అర్థమైంది సార్. సీఎం: మీటింగ్ అయ్యే లోపున అన్నం తిని మీ ఇంటికి వస్తా, పబ్లిక్ తిని మీటింగ్ వచ్చే వరకల్ల మీ ఇంటికి పోయి వద్దాం. సర్పంచ్: మంచిది సార్. -
సీఎం వద్ద ఫైల్: ఎప్పుడైనా ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధ మైంది. ఇటీవల పోలీసుశాఖలో ఎస్సై నుంచి ఐపీఎస్‌ల వరకు అన్ని రకాల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ఆంక్షలు కూడా క్రమంగా సడలిస్తుండటంతో ఐపీఎస్ అధికారుల బదిలీలకు చకచకా అడు గులు పడుతున్నాయని సమాచారం. బదిలీల ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంది. దీనిపై ఏ క్షణంలోనైనా సీఎం ఆమోదముద్ర వేసే అవకాశముంది. మూడేళ్లగా రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు చోటుచేసుకోలేదు. గతేడాది వేసవిలో వారి బదిలీలు చేపడుదామనుకున్నా కరోనా తొలివేవ్ లాక్డౌన్, అనంతరం దుబ్బాక ఉప ఎన్నిక, హైదరాబాద్‌లో వరదలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. తరువాత నాగార్జునసాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట తదితర పురపాలిలకు ఎన్నికలు రావడంతో ఐపీఎస్‌ల బదిలీలకు బ్రేకులు పడుతూ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేనందున బదిలీలకు ఇదే సరైన సమయమని ప్రభుత్వం భావిస్తోంది. పైగా గతేడాది కేంద్రం 11 మంది కొత్త ఐపీఎస్‌లను కేటాయించింది. అదే సమయంలో ఇటీవల 33 మంది అడిషనల్ ఎస్పీలకు నాన్–కేడర్ ఐపీఎస్‌లుగా పదోన్నతులు కల్పించింది. ఆ జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీలు... ఈ బదిలీల్లో పూర్తిస్థాయి ఎస్పీలు లేని నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఈ కొరత తీరనుందని సమాచారం. ఒకే స్థానంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారిలో కొందరు బదిలీ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కొత్త కమిషనరేట్లయిన కరీంనగర్ (సీపీ కమలాసన్‌రెడ్డి), నిజామాబాద్ (సీపీ కార్తికేయ), రామగుండం (సీపీ సత్యనారాయణ)లకు ఆవిర్భావం నుంచి కమిషనర్లు మారలేదు. సిద్దిపేట కమిషనరేట్‌లోనూ సీపీ జోయల్ డేవిస్ బాధ్యతలు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇక ఇటీవల ఖమ్మంకు ఇక్బాల్ స్థానంలో విష్ణు వారియర్, వరంగల్‌లో సీపీగా రిటైరైన రవీందర్ స్థానంలో తరుణ్ జోషి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నల్లగొండ ఎస్పీ, డీఐజీ రంగనాథ్, సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హేగ్డే సహా ఒకరిద్దరు సెంట్రల్ సర్వీసులో ఉన్న సీనియర్ ఐపీఎస్‌లకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న సీనియర్లకు జీహెచ్ఎంసీ పరిధిలో, డీజీపీ కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలిసింది. పదోన్నతులు సాధించినా పాత స్థానంలోనే.. 2019 పార్లమెంటు ఎన్నికల తరువాత చాలా మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు వచ్చినా పాత స్థానాల్లోనే ఉండిపోయారు. వారిలో 1995, 1996, 2006 బ్యాచ్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌లు తమకు స్థానచలనం, పదోన్నతికి తగిన స్థానం రాలేదని అసంతృప్తిగానే ఉన్నారు. వారిలో 2006 బ్యాచ్‌కు చెందిన అధికారులు సీనియర్ ఎస్పీలుగా, డీఐజీలుగా రెండుసార్లు పదోన్నతులు సాధించడం గమనార్హం. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విమెన్‌సేఫ్టీ వింగ్ స్వాతి లక్రా, గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌లు ఐజీ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి సాధించారు. అయినా వారి పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. అలాగే 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన చారుసిన్హా, అనిల్‌కుమార్, వీసీ సజ్జనార్‌లు ఐజీ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) అధికారులుగా పదోన్నతి సాధించారు. వారిలో అనిల్ కుమార్ హైదరాబాద్ కమిషనరేట్‌లో అడిషనల్ సీపీ (ట్రాఫిక్)గా, వీసీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఇక 2006 బ్యాచ్‌లో విమెన్ సేఫ్టీ వింగ్ (సీఐడీ) డీఐజీ సుమతి, కార్తికేయ, శ్రీనివాసులు, పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ రమేశ్‌నాయుడు, శ్రీనివాసులు (సీఐడీ)తోపాటు వెంకటేశ్వర రావు కూడా పదోన్నతి సాధించారు. వారిలో వెంకటేశ్వరరావు రిటైరవగా మిగిలిన వారంతా అవే స్థానాల్లో పనిచేస్తున్నారు. -
21న భూమిపూజ: ఓరుగల్లు ఒడిలో అత్యాధునిక వైద్యం..
హైదరాబాద్ నుంచి కూడా రోగులు వైద్యం కోసం వరంగల్‌కు వెళ్లే పరిస్థితి ఉండేలా ఈ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయనున్నారు. సీజనల్ వ్యాధుల కాలంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, పక్క రాష్ట్రాల గిరిజన ప్రాంతాలు, ఇతరచోట్ల నుంచి ఎయిర్ అంబులెన్సుల్లో రోగులను ఇక్కడకు తరలించేలా హెలీప్యాడ్ ఏర్పాటు ఎలాంటి వైరస్లు వచ్చినా వాటికి దీటుగా చికిత్స అందించేలా, పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎయిమ్స్ ఆస్పత్రులను సైతం తలదన్నేలా.. వరంగల్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి భూమిపూజ చేయనున్నారు. దీనిని తన కలల ప్రాజెక్టుగా భావిస్తున్న సీఎం.. ఉత్తర తెలంగాణకే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. దీని కోసం ఏకంగా 24 అంతస్తుల భవనం నిర్మించాలని, చివరి అంతస్తు పైభాగంలో హెలీప్యాడ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇలాంటి ఆసుపత్రి దేశంలో ఎక్కడా లేదని, కెనడాలో ఉన్న ఒక ఆసుపత్రిని మోడల్‌గా తీసుకొని దీన్ని తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. కెనడా వెళ్లి ఆ ఆసుపత్రిని పరిశీలించి రావాలని సూచించారు. ముఖ్యమంత్రే వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు చూస్తున్నందున ఈ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటుందని అధికారులు అంటున్నారు. మొత్తం ఈ ఆసుపత్రి నిర్మాణానికి, అందులో అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు దాదాపు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు వరంగల్‌లోని సెంట్రల్ జైలు స్థానంలో, 59 ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తారు. రెండు వేల పడకల సామర్థ్యంతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో సుమారు 34 వరకు విభాగాలు ఉంటాయి. దాదాపు 500 మంది వరకు వైద్యులు, వెయ్యి మంది వరకు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పనిచేస్తారు. మొత్తం పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు రోగులకు సేవలందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రై నాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి మొత్తం పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు దాదాపు ఐదు అంతస్తుల్లో ప్రత్యేకంగా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాట్లు చేస్తారు. ఆక్సిజన్, వెంటిటేటర్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా విదేశాల నుంచి వైద్య పరికరాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తిగా పర్యావరణ హితంగా నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా, ప్రతి అంతస్తులోనూ బాగా గాలీ వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
కొలువులు కదల్లే..6 నెలల క్రితమే సర్కారు కసరత్తు
ఉద్యోగాల భర్తీపై ప్రకటనతో.. ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాం. వివిధ శాఖల్లో 50 వేల వరకు ఖాళీలున్నట్టు అంచనా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఖాళీ పోస్టులను గుర్తించి భర్తీకి చర్యలు చేపడతారు..’.. గత ఏడాది డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. కరోనా ఎఫెక్ట్, కొత్త జిల్లాల సమస్యతో.. పోస్టుల భర్తీ ప్రక్రియపై అధికారులు కసరత్తు మొదలుపెట్టినా.. కరోనా రెండో వేవ్‌తో సమస్య మొదలైంది. మరో రెండు కొత్త జిల్లాలతో తలెత్తిన జోనల్ సమస్య, ఉద్యోగుల పదోన్నతుల్లో న్యాయపరమైన చిక్కులతో ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఆరు నెలలు గడిచినా.. సీఎం ప్రకటన చేసి ఇప్పటికి సరిగ్గా ఆరు నెలలు గడిచాయి. ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. లక్షలాది మంది నిరుద్యోగులు పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రక్రియ పునఃప్రారంభమెప్పుడు? జోనల్ సమస్య తీరింది. కరోనా రెండో వేవ్ నియంత్రణలోకి వస్తోంది. పోస్టుల భర్తీ ప్రక్రియ పునఃప్రారంభం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ వస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరు నెలల కింద ప్రకటించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ముందుగా అన్ని శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, తద్వారా కింది స్థాయిలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, కింది స్థాయిలో అప్పటికే ఉన్న ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీ పోస్టుల గుర్తింపుపై అన్ని ప్రభుత్వ శాఖలు కసరత్తు మొదలుపెట్టాయి. దాదాపు మూడు వారాల పాటు సీరియస్‌గా ప్రక్రియ కొనసాగింది. పురోగతిని సమీక్షించేందుకు సీఎస్ సోమేశ్‌కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో రోజువారీ సమావేశాలు కూడా నిర్వహించారు. వివిధ శాఖల్లోని దాదాపు 18 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. కొందరు ఉద్యోగులకు పదోన్నతుల విషయంగా న్యాయపరమైన సమస్యలు, పలు ఇతర చిక్కులు తలెత్తడంతో జాప్యం జరిగింది. అప్పటికీ చాలా శాఖల నుంచి ఖాళీ పోస్టుల వివరాలు ఆర్థిక శాఖకు చేరాయి. పోస్టుల భర్తీ ప్రక్రియ ఆర్థిక శాఖ నుంచి సాధారణ పరిపాలన శాఖకు బదిలీ అయింది. అప్పటికే కరోనా రెండో వేవ్ విజృంభణతో పోస్టుల భర్తీ కసరత్తు నిలిచిపోయింది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులతో.. కరోనా ఎఫెక్ట్‌కు తోడు.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు మరో సమస్య కూడా తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మేరకు 2018 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్‌లో గెజిట్ జారీ చేసింది. ఈ కొత్త విధానంలోని 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీజోన్ల ప్రాతిపదికన మళ్లీ పోస్టుల విభజన ప్రక్రియ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పూర్తికావాలంటే కనీసం రెండు మూడు నెలలు సమయం పట్టవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. రెండు మూడు నెలల్లో, మొత్తంగా ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొంటున్నాయి. కాగా, ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో లక్షల మంది నిరుద్యోగులు పరీక్షల ప్రిపరేషన్లో మునిగిపోయారు. జాప్యం జరిగిన కొద్దీ వయసు పెరిగి.. ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్లు ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నాం. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రాతిపదికన పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి దాదాపు రెండు నెలల సమయం పట్టొచ్చు. ఈ మధ్య దాదాపు 18 వేల మంది ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో పదోన్నతులు కల్పించాం. అలా ఏర్పడిన ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. వాటిని కూడా కలిపి, పూర్తి డేటా సిద్ధంకాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. సీఎం కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు. అందువల్ల ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకుని, ఒకేసారి 50 వేల కొలువుల భర్తీ చేపడతాం. - సోమేశ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 1.91 లక్షల పోస్టులు ఖాళీనే.. రాష్ట్రంలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులు ఉండగా.. 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా విద్యా శాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య శాఖలో 30,570, రెవెన్యూశాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. -
లాక్డౌన్ కోసం లాఠీ పట్టారు
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: శనివారం ఉదయం 10.30 గంటలు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లోకి వచ్చీపోయే దారులన్నీ మూతపడ్డాయి.. ప్రధాన రహదారులన్నిటా చెక్‌పోస్టులు కట్టుదిట్టం అయ్యాయి.. రోడ్లపైకి వచ్చినవారిని వచ్చినట్టు పోలీసులు ఆపేశారు. అనవసరంగా వచ్చినట్టు కనిపించినవారిపై లాఠీలు ఝళిపించారు. ఎక్కడివారిని అక్కడ్నుంచే వెనక్కి పంపేశారు.. రాష్ట్రంలో పలుచోట్ల లాక్డౌన్ సరిగా అమలు కావడం లేదని, కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. పోలీసులు పకడ్బందీగా లాక్డౌన్ అమలుపై దృష్టిపెట్టారు. హైదరాబాద్‌లో డీజీపీ, జిల్లాల్లో ఎస్పీలు, కమిషనర్లు నేరుగా రంగంలోకి దిగి పర్యవేక్షించారు. అవసరం లేకున్నా రోడ్డు మీదికి వచ్చిన వాహనాలను సీజ్ చేసి, కేసులు పెట్టారు. పలుచోట్ల పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నిరోజులు సరిగా పట్టించుకోకుండా.. ఇప్పుడు అవసరంపై బయటికొచ్చిన వారిపైనా ప్రతాపం చూపడం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమైంది. సీఎం కేసీఆర్ ఆగ్రహంతో.. శుక్రవారం వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి, లాక్డౌన్ పరిస్థితులపై అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో లాక్డౌన్ సరిగా అమలుకావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. శనివారం 10 గంటల తర్వాత రోడ్డుపై కనిపించిన వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. అకారణంగా బయటికి వచ్చిన వారిపై లాఠీచార్జి చేసి, వేలాది వాహనాలు సీజ్ చేశారు. నల్లగొండ, వరంగల్, మరికొన్ని జిల్లాల్లో డ్రోన్ కెమెరాలతో లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించారు. మంచిర్యాల జిల్లాలో రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ స్వయంగా లాఠీ పట్టి రోడ్డుపైకి వచ్చిన వారిని కట్టడి చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో, ప్రధాన రహదారులపై మూడు రకాల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఫుడ్ డెలివరీ బాయ్స్‌పై ప్రతాపం! హైదరాబాద్‌లో వందల మంది ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను అడ్డుకుని, లాఠీచార్జి చేయడం, వాహనాలు సీజ్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఫుడ్ డెలివరీకి మినహాయింపు ఉందని.. ఆస్పత్రుల్లో, ఇళ్లలో ఉన్న వేల మంది కరోనా రోగులకు ఆహారం సరఫరా చేస్తున్నామని.. తమను అడ్డుకోవడం ఏమిటని వారు నిలదీశారు. ఫుడ్ డెలివరీ బాయ్స్‌పై లాఠీచార్జిని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పలువురు రాజకీయ నాయకులు తప్పుబట్టారు. అయితే తాము ఫుడ్ తీసుకెళ్తున్న వారిని ఏమీ అనలేదని, గుర్తింపు కార్డులు లేకుండా.. కేవలం స్విగ్గీ, జొమాటో టీషర్టులు వేసుకుని తిరుగుతున్నవారి వాహనాలనే సీజ్ చేశామని పోలీసులు అన్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో.. స్విగ్గీ, జొమాటో సంస్థలు శనివారం తమ ఫుడ్ డెలివరీ సర్వీసులను నిలిపివేశాయి. డెలివరీ బాయ్స్‌పై పోలీసుల లాఠీచార్జిని తప్పుపడుతూ.. న్యాయవాది కారం కొమిరెడ్డి మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జీవో నం 102 ప్రకారం.. ప్రభుత్వమే ఫుడ్ డెలివరీ సర్వీసులను అనుమతించినపుడు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అత్యవసరమైన వారినీ అడ్డుకోవడంపై.. పలుచోట్ల తలసేమియా రోగులు, వారికి రక్తదానం చేయడానికి వెళ్తున్న దాతలను సైతం పోలీసులు అడ్డుకోవడం కనిపించింది. దీనిపై తలసేమియా రోగుల తల్లిదండ్రులు డీజీపీకి మొరపెట్టుకున్నారు. తమను అనుమతించాలని, ప్రాణాలు ఆపదలో పడతాయని ప్రాధేయపడ్డారు. నల్లగొండలో విద్యుత్ సిబ్బంది, మీడియా, ఇతర శాఖల ఉద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. 6 నుంచి 10 మధ్య గందరగోళం! లాక్ డౌన్ సమయంలో పోలీసుల హడావుడి ఇకవైపు అయితే.. అంతకుముందు మినహాయింపు సమయం 6 నుంచి 10 గంటల మధ్య పరిస్థితి గందరగోళంగా మారింది. ఎక్కడ చూసినా జనం గుంపులు, గుంపులుగా బయటికివచ్చారు. వ్యాపార సంస్థలు, దుకాణాల వద్ద భౌతిక దూరం అనేది ఎక్కడా పాటించలేదు. ఈ నాలుగు గంటల్లో ఎక్కడా పోలీసులు కనిపించలేదు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకునే లేకుండా పోయారు. -
ఓరుగల్లుపై కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ!
సాక్షి ప్రతినిధి, వరంగల్ / సాక్షి నెట్వర్క్: చారిత్రక ప్రాంతం, తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన ఓరుగల్లుపై ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీ ఆర్కు ప్రత్యేక ప్రేమ ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఎడతెరపి లేని వర్షం కారణంగా వరంగల్ మహా నగరాన్ని ముంచెత్తిన వరదలపై సీఎం చలించారని, ఈ నేపథ్యంలో తానే స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని భావించినా కరోనా, ప్రొటోకాల్ సమస్యల కారణంగా తమను పంపారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో వరంగల్‌ను హైదరాబాద్ సరసన నిలబెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. వరుస వర్షాలతో ఓరుగల్లు వరదల్లో చిక్కుకోగా పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. జిల్లా మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు అధి కారులతో కలిసి మంగళవారం పర్యటించారు. నీట ముని గిన లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. హైదరాబాద్ నుంచి మరో మంత్రి ఈటలతో కలిసి హె లికాప్టర్‌లో వచ్చిన కేటీఆర్ తొలుత వరంగల్ నగరాన్ని ఏరి యల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో దిగారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన నయీంనగర్, కేయూ 100 ఫీట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల నుంచి పర్యటన ప్రారంభించారు. వర్షం కారణంగా నష్టపోయిన అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత చర్యలు చేపడుతామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నాలాల వెంట అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ఈ సమస్య వచ్చినందున అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగిస్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలోఒత్తిళ్లు ఉండవు ముంపు ప్రాంతాల్లో పర్యటన అనంతరం భోజన విరామం తర్వాత కాజీపేటలోని నిట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంలో ప్రజలందరూ నాలాలపై ఆక్రమణల వల్ల వరద బయటకు పోకపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చిందని, జనావాసాలు జలమయమయ్యాయని చెప్పారని తెలిపారు. ప్రజలు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమని, నగరంలో అనేక చోట్ల నాలాలపై ఆక్రమణలు ఉన్నందున తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని, అధికారులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవన్నారు. పెద్ద పెద్ద నిర్మాణాలు తొలగించడానికి భారీ యంత్రాలు తెప్పించాలని, దసరా నాటికి అక్రమ నిర్మాణాలను తొలగించాలని సూచింయారు. ఇప్పటికే గుర్తించినవి కాకుండా వేరేచోట కూడా నీటి ప్రవాహాలు వెళ్లే నాలాలకు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అనే విషయాలను పరిశీలించి, ఆక్రమణలు తొలగించాలన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తున్నామని, ఇందులో పోలీసు కమిషనర్ కో చైర్మన్‌గా, మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కమిషనర్ స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తారని, వీరిద్దరిలో ఒకరు వారంలో ఒక రోజు వరంగల్‌లో పర్యటిస్తారని, నెలలోగా మొత్తం ఆక్రమణలు తొలగించాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గోడు ఆలకిస్తూ...సహాయక చర్యలకు ఆదేశిస్తూ... కేటీఆర్ నాయకత్వంలోని మంత్రుల బృందం నయీంనగర్, సమ్మయ్యనగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ – యూనివర్సిటీ రోడ్డు, పోతననగర్, బొందివాగు రోడ్డు, రామన్నపేట, హంటర్ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, ఉర్సు, రంగశాయిపేట, శివనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. తొలుత నయీంనగర్ నాలాను సందర్శించిన సందర్భంగా స్థానికులతో మంత్రి కేటీఆర్ మాట్లాడి సమస్యలు ఆరా తీశారు. మిగతా ప్రాంతాల్లోనూ ముంపు బాధితులతో మాట్లాడి సాధక బాధకాలు తెలుసుకున్నారు. దెబ్బతిన్న డ్రెయినేజీలు, ఇండ్లు, రోడ్లను పరిశీలించడంతో పాటు ఫాతిమానగర్ – కేయూ వంద ఫీట్ల రోడ్డులో గోపాలపూర్, సమ్మయ్య నగర్ ప్రాంత వాసులతో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిస్థితి చక్కబడే వరకు నిత్యావసర సరుకులు అంద చేస్తామని హామీ ఇచ్చారు. ఇక హంటర్ రోడ్డులో కేటీఆర్ సహా ఇతర ప్రజా ప్రతినిధులు వరద నీటిలోనే నడుస్తూ పరిస్థితిని పరిశీలించారు. కరోనా బాధితులకు పరామర్శ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల బృందం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్ వార్డును సందర్శించింది. మంత్రులు కేటీఆర్, ఈటల రాజెందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు పీపీఈ కిట్లు ధరించి కోవిడ్ వార్డులోకి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. కావాల్సిన మందులు, పరికరాలు, వైద్యులు సిద్ధంగా ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. కరోనా సోకిన వారి దగ్గరికి రావడానికి సమీప బంధువులే జంకుతున్న సమయంలో కేటీఆర్ సహా మంత్రులంతా తెగువతో కోవిడ్ వార్డులోకి వచ్చి మాట్లాడడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, కలెక్టర్ రాజీవ్ హన్మంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేం గిట్లా జేస్తే కేసీఆర్ సీఎం అయ్యేటోడా..!
లింగాలఘణపురం : ‘రాష్ట్రంలో నేడు అప్రజాస్వామిక పాలన సాగుతోంది.. ప్రతిపక్షమే లేకుండా చేయాలనే తలంపుతో అడుగడుగునా అరెస్టులు చేస్తున్నారు.. ఇదేం ప్రజాస్వామ్యం’ అని మాజీ ఎంపీ హన్మంతరావు అన్నారు. వరంగల్ నగరం ఉర్సు ప్రాంతంలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేయగా.. సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు హన్మంతరావు మంగళవారం హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఈ క్రమంలో జనగామ –నెల్లుట్ల బైపాస్‌లోని నెల్లుట్ల శివారున ఆయనను పోలీసులు అరెస్టు చేసి లింగాలఘణపురం స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్లో హన్మంతరావు విలేకరులతో మాట్లాడుతూ.. జ్యోతీరావుఫూలే విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశారు.. ఎవరు చేశారు.. దుండగులా.. రాజకీయ పార్టీలా అనే విషయాన్ని తెలుసుకుని అదే ప్రాంతంలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాను వెళ్తుంటే అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రజాభిప్రాయం ఎప్పుడు తీసుకుంటావంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తమను మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయడంలేదని, అధికార పార్టీ నాయకులు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళుతున్నారని, వారికి ఏ ఆంక్షలు లేవన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డికి ఏమైనా రాజ్యసభ మెంబర్ ఇస్తానని అన్నాడా.. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. మేం గిట్లా జేస్తే కేసీఆర్ సీఎం అయ్యేటోడా..? తెలంగాణ ఉద్యమ సమయంలో రోడ్లపై వంటావార్పు, అనేక రకాల ఉద్యమాలు చేస్తే ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఆపలేదు.. గిట్ల చేస్తే కేసీఆర్ సీఎం అయ్యేటోడా అంటూ హన్మంతరావు ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దళితుడు చనిపోతే వెళ్లనీయరు ఇదెక్కడి న్యాయమని అన్నారు. తమను ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేస్తున్నారని, అలా కాకుండా ఇంట్లో నుంచి వెళ్లకుండా జైళ్లల్లో పెట్టండి.. అప్పుడు ఏ లొల్లీ ఉండదని చెప్పారు. ప్రతిపక్షాన్ని లెక్కచేయకుండా పాలన సాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని అన్నారు. హన్మంతరావుతో పాటు మరికొందరిపై కేసులు ఇదిలా ఉండగా మాజీ ఎంపీ హన్మంతరావును ఉదయం 10.30 గంటలకు జనగామ సీఐ మల్లేశ్‌యాదవ్, స్థానిక ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి సాయంత్రం నాలుగు గంటలకు సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఆయనతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్‌రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శివతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. హన్మంతారావు సుమారు నాలుగున్నర గంటలు పోలీసుస్టేషన్లోనే ఉండడంతో గీసుకొండ ఎంపీపీ భీమగాని సౌజన్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జమాల్ షరీఫ్, ధర్మపురి శ్రీనువాసు, నరేందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ విజయ్‌మనోహర్, ఎంపీటీసీ బిక్షపతి తదితరులు ఆయనను కలిసి మద్దతు తెలిపారు. -
సంగారెడ్డిలో పంచాయతీరాజ్ సమ్మేళనం!
సాక్షి, సంగారెడ్డి: గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రామాన్ని అమలు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో పంచాయతీ రాజ్ సమ్మేళానాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ: ఎక్కడ లేనివిధంగా.. పారిశుద్ధ్య సమస్య లేకుండా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వందే అన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం, డంప్ యార్డ్ నిర్మాణం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కాగా ప్రతి గ్రామం ఈ నెల 26 లోపు పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలన్నారు. 26వ తేదీ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సహా మంత్రులు, ఉన్నతాధికారులు గ్రామాల్లో పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పల్లె ప్రగతి లక్ష్యాలను ప్రతి గ్రామం చేరుకోవాలని... లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం గ్రామాల్లో చెత్త సేకరణ, వైకుంఠ ధామం, డంప్ యార్డ్, ఇంకుడు గుంతలు, నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. హరితహారం, నర్సరీ, ట్రాక్టర్ల ద్వార చెత్త సేకరణతో పాటు పూర్తిస్థాయిలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నారు. ఇక పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, రూ. 500 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, తాగునీటికి శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా త్వరలోనే నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పల్లె ప్రగతి అమలులో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవాలి తాను కోరుకుంటున్నానని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మది కార్యక్రమంలో మొక్కలు నాటిన మంత్రి... సీఎం కేసీఆర్ జన్మదినం వేడుకలో భాగంగా కంది మండలం కవలంపేట గ్రామంలో 2200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌రావు, కలెక్టర్ హనుమంతరావులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం అయిందని పేర్కొన్నారు. ఆయన చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ , ఆదర్శ తెలంగాణ రాష్ట్రంగా మారుతుందని పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుడి పుట్టినరోజును జరుపుతున్నట్లుగా రాష్ట్రమంతట సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. -
లక్ష్మీ బ్యారేజ్‌ను పరీశీలించిన సీఎం కేసీఆర్
-
కరీంనగర్లో సీఎం కేసీఆర్
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి కరీంనగర్‌కు విచ్చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 30న వేములవాడ రాజన్నను దర్శించుకొని మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు పూజలు చేసి ఇక్కడికి వచ్చిన కేసీఆర్ 40 రోజుల తరువాత బుధవారం రాత్రి మరోసారి తనకిష్టమైన కరీంనగర్‌కు వచ్చారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయంలో పూజలు, కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన లక్ష్మీ బ్యారేజీలను సీఎం సందర్శించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి రోడ్డు మార్గంలో బయలుదేరి కరీంనగర్ వచ్చిన ముఖ్యమంత్రి తీగలగుట్టపలి్లలోని నివాసానికి చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బస చేసిన సీఎం గురువారం ఉదయం కాళేశ్వరం బయలుదేరనున్నారు. ఇదీ షెడ్యూల్ కరీంనగర్ కలెక్టరేట్లోని హెలిప్యాడ్ నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఆకాశమార్గంలో కాళేశ్వరం బయలుదేరుతారు. ఉదయం 9.40 గంటలకు కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అక్కడే ఉన్న గోదావరి ఘాట్‌ను సందర్శిస్తారు. ముక్తేశ్వర స్వామి దర్శనం తరువాత లక్ష్మీ బ్యారేజ్(మేడిగడ్డ రిజర్వాయర్‌ను సందర్శించనున్నారు. అక్కడే మధ్యాహ్న భోజనం పూర్తిచేసి మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌కు హెలికాప్టర్ ద్వారా పయనం కానున్నారు. 2.40 గంటలకు తీగలగుట్టపల్లి నివాసానికి చేరుకొంటారు. కాళేశ్వరం మేడిగడ్డ రిజర్వాయర్ విశేషాలను తెలియజేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నట్లు సమాచారం. సాయంత్రంలోగా హెలికాప్టర్ ద్వారా గానీ రోడ్డు మార్గంలో గానీ తిరిగి హైదరాబాద్ ప్రగతిభవన్‌కు బయలుదేరనున్నారు. స్వాగతం పలికిన మంత్రి, అధికారులు కరీంనగర్‌కు చేరుకున్న కేసీఆర్‌కు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే రవిశంకర్, జెడ్పీ చైర్పర్సన్ విజయ, మేయర్ సునీల్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఇన్చార్జి పోలీసు కమిషనర్ సత్యనారాయణ తదితరులు స్వాగతం పలికారు. కాళేశ్వరం నుంచి కరీంనగర్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్‌కు చేరుకున్నారు. సీఎం టూర్‌కు సంబంధించిన ఏర్పాట్లపై అంతకుముందు కలెక్టర్ కె.శశాంక జిల్లా అధికారులతో సమీక్షించారు. కరీంనగర్ పట్టణ ప్రవేశం నుంచి తీగలగుట్టపల్లి వరకు రోడ్లు శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయితో డాక్టర్ల బృందాన్ని పంపించాలని సూచించారు. కాన్వాయిలో, కలెక్టరేట్ హెలిప్యాడ్‌లో, తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ వద్ద అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నగరంలో నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తీగలగుట్టపల్లిలోని ఉత్తరతెలంగాణ భవన్లో ఏర్పాట్ల పనులను మేయర్ సునీల్‌రావు పర్యవేక్షించారు. నగరంలోని పలు ప్రదేశాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. తీగలగుట్టపలి్లలోని ఉత్తర తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. -
కేసీఆర్.. బిజీబిజీ
=మీడియాతో మాట్లాడేందుకు నిరాకరణ =ఎమ్మెల్యే రాజయ్య కుమారుల వివాహ వేడుకలకు హాజరు =టీఆర్ఎస్ ముఖ్య నేతలతో భే టీ =తాజా పరిస్థితులపై మాటామంతి వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) సోమవారం ఓరుగల్లుకు వచ్చారు. నాలుగు గంటలపాటు ఇక్కడే ఉన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రంలో హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతున్నప్పటికీ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తనను కలిసిన విలేకరులతో మరోసారి మాట్లాడుకుందామంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారు. ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనప్పటికీ తనను కలిసిన పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసీఆర్ 11గంటల సమయానికి కాజీపేటకు చేరుకున్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని కేథడ్రల్ చర్చిలో జరిగిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య ఇద్దరు కుమారులు డాక్టర్ క్రాంతిరాజ్, డాక్టర్ విరాజ్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. గంటపాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయనను కలిశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హన్మకొండలోని టీఆర్ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి మధ్యాహ్నం 12-15 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఆయనను టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, రాజయ్యయాదవ్, పార్టీ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, మొలుగూరి బిక్షపతి, జిల్లా నేతలు గుడిమల్ల రవికుమార్, ఆరూరి రమేష్, నాగుర్ల వెంకటేశ్వర్లు, మార్నేని రవీందర్రావు, భరత్‌కుమార్, ఇండ్ల నాగేశ్వర్రావు, కిషన్‌రావు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యనాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. తదుపరి అక్కడి నుంచి వరంగల్‌లోని సీఎస్ఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పార్టీ నాయకులు కె.కేశవరావు, ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు వినయ్, బిక్షపతి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కేటీఆర్‌తో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వడ్డేపల్లి రోడ్డులోని మాజీ డీజీపీ పేర్వారం రాములు ఇంటికి చేరుకున్నారు. అక్కడ గంటపాటు తనను కలిసి నేతలతో తాజా పరిస్థితులు, పార్టీ విలీన అంశాలపై తెలంగాణవాదులు, నేతల స్పందనను తెలుసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు.