
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని.. ప్రభుత్వం సరైన సమయంలో లాక్‌డౌన్ విధించడం, వైద్యారోగ్య శాఖను సకాలంలో అప్రమత్తం చేయడం ఫలితాన్నిచ్చిందని మంత్రివర్గ భేటీలో సీఎం కేసీఆర్ అన్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడిన సమయంలో ఒడిశాకు విమానాల ద్వారా ట్యాంకర్లను పంపడం, రెమిడిసివిర్, ఇతర ఔషధాల కొరతను తీర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంతో పరిస్థితి మెరుగైందని చెప్పారు. కోవిడ్ మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో గాంధీ, ఎంజీఎం ఆస్పత్రుల సందర్శనతో ప్రజల్లో ధైర్యం నింపగలిగామని కేసీఆర్ పేర్కొన్నారు. సుదీర్ఘకాలం లాక్‌డౌన్ కొనసాగితే చిన్నా, చితక వ్యాపారాలు, పనులు చేసుకునే వారు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందుల పాలవుతారన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసినా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా, కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
అన్ని జాగ్రత్తలు తీసుకోండి
‘‘వరుసగా రెండు విద్యా సంవత్సరాలు కోవిడ్ పరిస్థితుల్లోనే కొనసాగుతుండటం పిల్లల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జూలై ఒకటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభమైనా.. భౌతిక దూరంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా చూడండి. విద్యా సంస్థల పునః ప్రారంభానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి మార్గదర్శకాలు సిద్ధం చేయండి..’’ అని కేబినెట్ భేటీలో కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. వానాకాలంలో సాగు విస్తీర్ణం పెరుగుతుందనే అంచనాలు ఉన్నందున విత్తనాలు, ఎరువుల సమస్య తలెత్తకుండా మంత్రులు జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించినట్టు సమాచారం. ‘‘కరోనా సమయంలో ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నా రైతుబంధు మొత్తాన్ని ఇస్తున్నాం. ఈ విషయాన్ని మనం రైతులకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటే పాలన ఫలితాలు అందరికీ అందుతాయి. కరోనా నేపథ్యంలో వివిధ రంగాల్లో ఏర్పడిన స్తబ్దతను తొలగించి తిరిగి పట్టాలు ఎక్కించేందుకు అందరూ శ్రమించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment