=మీడియాతో మాట్లాడేందుకు నిరాకరణ
=ఎమ్మెల్యే రాజయ్య కుమారుల వివాహ వేడుకలకు హాజరు
=టీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో భే టీ
=తాజా పరిస్థితులపై మాటామంతి
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) సోమవారం ఓరుగల్లుకు వచ్చారు. నాలుగు గంటలపాటు ఇక్కడే ఉన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రంలో హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతున్నప్పటికీ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తనను కలిసిన విలేకరులతో మరోసారి మాట్లాడుకుందామంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారు. ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనప్పటికీ తనను కలిసిన పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.
హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసీఆర్ 11గంటల సమయానికి కాజీపేటకు చేరుకున్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని కేథడ్రల్ చర్చిలో జరిగిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య ఇద్దరు కుమారులు డాక్టర్ క్రాంతిరాజ్, డాక్టర్ విరాజ్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. గంటపాటు అక్కడే గడిపారు.
ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయనను కలిశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హన్మకొండలోని టీఆర్‌ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి మధ్యాహ్నం 12-15 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఆయనను టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, రాజయ్యయాదవ్, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, మొలుగూరి బిక్షపతి, జిల్లా నేతలు గుడిమల్ల రవికుమార్, ఆరూరి రమేష్, నాగుర్ల వెంకటేశ్వర్లు, మార్నేని రవీందర్‌రావు, భరత్‌కుమార్, ఇండ్ల నాగేశ్వర్‌రావు, కిషన్‌రావు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యనాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. తదుపరి అక్కడి నుంచి వరంగల్‌లోని సీఎస్‌ఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం పార్టీ నాయకులు కె.కేశవరావు, ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు వినయ్, బిక్షపతి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కేటీఆర్‌తో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వడ్డేపల్లి రోడ్డులోని మాజీ డీజీపీ పేర్వారం రాములు ఇంటికి చేరుకున్నారు. అక్కడ గంటపాటు తనను కలిసి నేతలతో తాజా పరిస్థితులు, పార్టీ విలీన అంశాలపై తెలంగాణవాదులు, నేతల స్పందనను తెలుసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు.
కేసీఆర్.. బిజీబిజీ
Published Tue, Nov 19 2013 2:27 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement